అర్జున ఉవాచ :
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ॥ 21
యావదేతాన్నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ ।
కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే ॥ 22
సేనయోః, ఉభయోః, మధ్యే, రథమ్, స్థాపయ, మే, అచ్యుత
యావత్, ఏతాన్, నిరీక్షే, అహమ్, యోద్ధుకామాన్, అవస్థితాన్,
కైః, మయా, సహ, యోద్ధవ్యమ్, అస్మిన్, రణసముద్యమే.
అర్జునః = అర్జునుడు; ఉవాచ = పలికెను; అహమ్ = నేను; యోద్ధుకామాన్ = యుద్ధం చేయగోరి; అవస్థితాన్ = ఇక్కడకు వచ్చి ఉన్న; ఏతాన్ = వీరిని; యావత్ నిరీక్షే = చూస్తాను; అస్మిన్ = ఈ; రణసముద్య మే = మహాయుద్ధ భూమిలో; కైః సహ = ఎవరితో; మయా = నా చేత; యోద్ధవ్యమ్ = యుద్ధం చేయవలసి ఉందో; అత్ర = ఇక్కడ; యుద్ధే = యుద్ధంలో; దుర్బుద్ధేః = దుష్టబుద్ధియైన; ధార్తరాష్ట్రస్య = దుర్యోధనునికి; యుద్ధే = యుద్ధంలో; ప్రియచికీర్షవః = ప్రియాన్ని చేకూర్చ దలచినవారు; యే ఏతే = ఏ వీరులు; సమాగతాః = అరుదెంచిరో;
తా ॥ అర్జునుడు పలికెను: “ఓ కృష్ణా! యుద్ధం మొదలయ్యే ఈ సమయంలో, నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో, యుద్ధం చేయాలనే కోరికతో ఇక్కడ ఎవరెవరు నిలబడి ఉన్నారో నేను స్పష్టంగా చూడాలి. కాబట్టి, వారిని అందరినీ నేను బాగా చూడగలిగేలా, రెండు సైన్యాలకు మధ్యలో నా రథాన్ని తీసుకెళ్లి నిలుపు.”
వ్యాఖ్య:-
శత్రువులతో యుద్ధం చేయడానికి ముందు, శత్రు సైన్యంలో ఎందరు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరూ ఎలా ఉన్నారో—ఇవన్నీ స్పష్టంగా గమనించడం గొప్ప యోధుడి లక్షణం. కాబట్టి అర్జునుడు, వారిని బాగా చూడడానికి రథాన్ని రెండు సైన్యాల మధ్యకు తీసుకెళ్లమని శ్రీకృష్ణుడిని కోరాడు .
“అచ్యుత” అంటే ఎవరు?:
- ‘చ్యుతి లేనివాడు’ – నాశనం కాకుండా ఉండేవాడు, తన స్వరూపం నుండి మారనివాడు అని అర్థం.
- లేదా – తనపై ఆశ్రయించినవారిని సంసార సముద్రంలో మునిగిపోకుండా కాపాడేవాడు అని కూడా అర్థం చెప్పవచ్చు.
చ్యుతి లేకుండా (లోపాలు రాకుండా) తమ ఆధ్యాత్మిక సాధనలు చేసేవారు మాత్రమే అచ్యుతుని చేరుకోగలరు. కాబట్టి, అచ్యుతుని చేరాలనుకునే వారు తమ సాధనల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ లోపాలు, తప్పులు రాకుండా చూడాలి .