పృథక్త్వేన తు యద్జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ ।
వేత్తి సర్వేషు భూతేషు తద్జ్ఞానం విద్ధి రాజసమ్ ॥ 21
పృథక్త్వేన, తు, యత్, జ్ఞానమ్, నానా భావాన్, పృథగ్విధాన్,
వేత్తి, సర్వేషు, భూతేషు, తత్, జ్ఞానమ్, విద్ధి, రాజసమ్.
తు = కాని; యత్ = ఏ; జ్ఞానమ్ = జ్ఞానం; పృథక్త్వేన = వేరుగా; సర్వేషు భూతేషు = సమస్త భూతాలలో ఉండే; పృథక్ విధాన్ = విభిన్నమైన; నానాభావాన్ = పెక్కు ఆత్మలను; వేత్తి = గ్రహిస్తాడో; తత్ = ఆ; జ్ఞానమ్ = జ్ఞానం; రాజసమ్ = రాజసమని; విద్ధి = తెలుసుకో.
తా ॥ కాని, ఏ జ్ఞానం చేత సమస్త భూతాలలో వేరు వేరుగా ఉండే ఆత్మలను అనేకాలని గ్రహించబడుతుందో, ఆ జ్ఞానం రాజసికమని గ్రహించు.
వ్యాఖ్య:-
ఈ శ్లోకంలో ‘రాజస జ్ఞానం’ అంటే ఏమిటి? అది ఉన్నవారు ప్రపంచాన్ని ఎలా చూస్తారు? అనే విషయాన్ని వివరిస్తున్నారు.
1. భేదాన్ని చూడటమే రాజస జ్ఞానం: ప్రపంచంలోని ప్రాణులను చూసినప్పుడు.. “వీడు వేరు – వాడు వేరు” అని అందరినీ వేరువేరుగా (భిన్నంగా) చూడటం ఉత్తమమైన జ్ఞానం కాదు. దీన్నే ‘రాజస జ్ఞానం’ అంటారు.
2. గుణాలను చూస్తారు – ఆత్మను కాదు: ఈ రకమైన జ్ఞానం ఉన్నవారు, ఒక వ్యక్తిని చూసినప్పుడు అతని ప్రవర్తనను లేదా గుణాలను (మంచోడా? చెడ్డోడా?) మాత్రమే గమనిస్తారు తప్ప, అతని లోపల ఉన్న ఆత్మను (దైవాన్ని) చూడలేరు. అందుకే వారికి మనుషుల మధ్య తేడాలు కనిపిస్తాయి. దురదృష్టవశాత్తు, ఈ రోజుల్లో ప్రపంచంలో చాలామందికి ఈ రాజస జ్ఞానమే ఉంది.
3. మనం ఏం చేయాలి? కాబట్టి మనం ఈ భేద భావాన్ని (రాజస జ్ఞానాన్ని) వదిలేయాలి. అందరినీ సమానంగా చూసే ‘అద్వైత భావన’ను (అంతా ఒక్కటే అనే సమదృష్టిని) అలవర్చుకోవాలి.
4. చక్కని ఉదాహరణ: రకరకాల దిండ్లు ఉన్నప్పుడు, మనం పైన కనిపించే గలీబుల (Pillow covers) రంగులను, డిజైన్లను చూసి మోసపోకూడదు. ఆ అన్ని దిండ్ల లోపల ఉన్నది ఒకే రకమైన ‘దూది’ (Cotton) అని గ్రహించాలి. అలాగే, మనుషుల రూపాలు, గుణాలు వేరైనా.. అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అని చూడాలి.