యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ।
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ॥ 10
యాతయామమ్, గతరసమ్, పూతి, పర్యుషితమ్, చ, యత్,
ఉచ్ఛిష్టమ్, అపి, చ, అమేధ్యమ్, భోజనమ్, తామసప్రియమ్.
యత్ = ఏ; భోజనమ్ = ఆహారం; యాత–యామమ్ = జాముసేపు దాటినదో; గత–రసమ్ = శుష్కమో; పూతి = దుర్గంధమయమో; పర్యుషితమ్ చ = క్రిందటి దినముదో; ఉచ్ఛిష్టమ్ అపి చ = ఎంగిలిదో; అమేధ్యమ్ = అపవిత్రమో; (తత్ = అది;) తామసప్రియమ్ = తామసులకు ఇష్టం;
తా ॥ ఒక జాము నిలువ ఉండి చల్లపడిపోయినవీ, రసం లేక పిప్పిగా ఉండేవీ, పాసిపోయి దుర్గంధమయమైనవీ, దినాంతరపక్వములై చద్దిగా మారినవీ, ఇతరులు తినగా మిగిలినవీ, అపవిత్రమైనవీ అయిన ఆహారాలు తామసులకు ప్రియమైనవి.
వ్యాఖ్య:-
ఆధునిక ఆరోగ్య శాస్త్రం ప్రకారం కూడా ఇలాంటి తామస ఆహారం (పాచి, చెడిపోయినది) మరియు పైన చెప్పిన రాజస ఆహారం — రెండూ నిషిద్ధమే.
ఎందుకంటే సారం పోయి పాచిపోయిన పదార్థాలు తిన్నప్పుడు వాటి అణువులు శరీరంలోకి ప్రవేశించి రక్తాన్ని చెడగొడతాయి. అనారోగ్యం కలిగిస్తాయి. వాటి సూక్ష్మ భాగాలు మనస్సులోకి ప్రవేశించి మనస్సును కూడా మలినం చేస్తాయి. కాబట్టి మోక్షం కోరే సాధకుడు ఎప్పుడూ ఇలాంటి తామస ఆహారాలను తినకూడదు.