అనేకవక్త్రనయనం అనేకాద్భుతదర్శనమ్ ।
అనేకదివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ॥ 10
దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం ।
సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖమ్ ॥ 11
అనేక వక్త్ర నయనమ్, అనేక అద్భుత దర్శనమ్,
అనేక దివ్య ఆభరణమ్, దివ్య అనేక ఉద్యత ఆయుధమ్.
దివ్య మాల్య అంబర ధరమ్, దివ్య గంధ అనులేపనమ్,
సర్వ ఆశ్చర్య మయమ్, దేవమ్, అనంతమ్, విశ్వతోముఖమ్.
అనేక వక్త్ర నయనమ్ = అనేకమైన ముఖ నేత్రాలు గలదీ; అనేక అద్భుత దర్శనమ్ = బహువిధాలైన అద్భుతరూపాలతో కూడినదీ; అనేక దివ్య ఆభరణమ్ = వివిధమైన దివ్యాలంకారాలతో కూడినదీ; దివ్య అనేక ఉద్యత ఆయుధమ్ = వివిధమైన దివ్యాస్త్రాలను ధరించినదీ (అయిన విశ్వరూపాన్ని చూపెను).
దివ్య మాల్య అంబర ధరమ్ = దివ్య మాలలను వస్త్రాలను ధరించినదీ; దివ్య గంధ అనులేపనమ్ = దివ్యమగు గంధపు పూత కలదీ; సర్వ ఆశ్చర్య మయమ్ = సర్వాశ్చర్య మయమూ; దేవమ్ = దీప్తిమంతమూ; అనంతమ్ = అపరిచ్ఛిన్నమూ; విశ్వతోముఖం = సర్వత్ర ముఖాలుగలదీ (అయిన విశ్వరూపాన్ని ప్రదర్శించెను.)
తా ॥ ఆ విశ్వరూపం అసంఖ్యాలైన ముఖనేత్రాలతోనూ, అనేకమైన అద్భుతాకృతులతో, నానా విధమైన దివ్యాలంకారాలతో ఒప్పుతోంది; పలు విధాలైన దివ్యాయుధాలను ధరించి ఉంది.
తా ॥ ఆ విశ్వరూపం దివ్యమాలావస్త్ర విభూషితమై, దివ్యగంధానులిప్తమై, అత్యంతాశ్చర్యమయమై, దీప్తిమంతమై, అపరిచ్ఛిన్నమై, విశ్వతోముఖమై ఒప్పారుతూ ఉంది.