అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ ।
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ॥ 42
అథవా, యోగినామ్, ఏవ, కులే, భవతి, ధీమతామ్,
ఏతత్, హి, దుర్లభతరమ్, లోకే, జన్మ, యత్, ఈదృశమ్.
అథవా = లేక; ధీమతామ్ = జ్ఞానులును; యోగినామ్ = యోగులైన వారి; కులే ఏవ = వంశంలోనే; భవతి = జన్మిస్తాడు; ఈదృశమ్ = ఇట్టిది; యత్ జన్మ = ఏ జన్మమున్నదో; ఏతద్ హి = అది; లోకే = జగత్తులో; దుర్లభతరమ్ = అత్యంత దుర్లభం.
తా ॥ (కొద్దిగా అభ్యసించబడిన యోగం నుండి చ్యుతిచెందినవాని గతి చెప్పబడింది. ఇక చిరాభ్యస్తమైన యోగం నుండి భ్రష్టత పొందినవాని గతి చెప్పబడుతోంది.) లేక, యోగభ్రష్టుడైన పురుషుడు జ్ఞానవంతులైన యోగుల వంశంలోనే జన్మిస్తాడు. ఇటువంటి జన్మ ఈ జగత్తులో అత్యంత దుర్లభం.
వ్యాఖ్య:-
కిందటి శ్లోకంలో, కొంచెం సాధన చేసి చనిపోయిన వారి గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు, చాలా ఎక్కువ సాధన చేసి, చివరి దాకా వచ్చి, లక్ష్యాన్ని చేరకముందే చనిపోయిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ వివరిస్తున్నారు. అలాంటి వారు చనిపోయాక, గొప్ప జ్ఞానులైన యోగుల వంశంలో లేదా తపస్సంపన్నులైన మహాత్ముల ఇళ్లలో పుడతారు. (సింపుల్గా చెప్పాలంటే… కిందటి శ్లోకంలో చెప్పినవాళ్ళు 40 మార్కులు తెచ్చుకున్న వాళ్ళైతే, వీళ్ళు 80 మార్కులు తెచ్చుకున్న వాళ్ళన్నమాట). ఇలాంటి గొప్ప యోగుల ఇంట పుట్టడం ఈ లోకంలో చాలా అరుదు అని భగవంతుడు చెప్పాడు. ఎందుకంటే అక్కడి తల్లిదండ్రులు జ్ఞానులు, ఆత్మానుభవం ఉన్నవారు. కాబట్టి అక్కడ పుట్టే వారికి వంశపారంపర్యంగా వచ్చే సంస్కారం వల్ల, పుట్టుకతోనే శుకమహర్షిలాగా భక్తి, జ్ఞానం, వైరాగ్యం అబ్బే అవకాశం ఉంటుంది. చిన్నప్పటి నుంచే దైవ చింతన ఉన్న వాతావరణంలో పెరగడం మామూలు విషయం కాదు. అది ఎంతో తపస్సు, ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే దక్కుతుంది. అలాంటి ఇంట్లో పుట్టిన ఆ యోగభ్రష్టుడికి సాధనలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఎందుకంటే అక్కడ ఎప్పుడూ ఆధ్యాత్మిక చర్చలు, యోగసాధన, నియమ నిష్టలు, మంచి పుస్తకాలు చదవడం వంటివే ఉంటాయి. దానికి వ్యతిరేకమైన చెడు విషయాలు చెప్పేవారు గానీ, చేసేవారు గానీ అక్కడ ఉండరు. కాబట్టి, పోయిన జన్మలో మిగిలిపోయిన కొద్దిపాటి సాధనను చాలా త్వరగా పూర్తిచేసుకుని, కృతార్థుడయ్యే గొప్ప అవకాశం అతనికి అక్కడ దొరుకుతుంది.
ప్రపంచంలోని అన్ని జన్మల కంటే యోగుల వంశంలో పుట్టడమే అన్నిటికన్నా శ్రేష్టమని భగవంతుడు చెప్పడాన్ని బట్టి, ఆ జన్మ ఎంత గొప్పదో అర్థమవుతోంది. “ఈ లోకంలో ధనవంతులుగా పుట్టడం గొప్ప కాదు. మహారాజులుగా పుట్టడం గొప్ప కాదు. ఇంద్రుడిగానో, చంద్రుడిగానో పుట్టడం కూడా గొప్ప కాదు. కానీ జ్ఞానులైన యోగుల ఇంట పుట్టడమే నిజమైన గొప్పతనం” అని భగవంతుడు గట్టిగా చెప్తున్నారు. అందుకే అలాంటి జన్మ దొరకడం కష్టం అని చెప్పకుండా, ‘మరీ దుర్లభం’ (చాలా చాలా కష్టం) అని అన్నారు. కాబట్టి దైవభక్తి, యోగసాధన, ఆత్మానుభూతి… వీటిలో మాత్రమే నిజమైన గొప్పతనం ఉందని తెలుసుకోవాలి. బుద్ధిమంతులైన వారు ఈ జన్మలోనే వాటిని సాధించడానికి గట్టిగా ప్రయత్నించాలి. ఆధ్యాత్మిక సాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది. దానివల్ల మన జన్మ పవిత్రమవుతుంది, మోక్షం మరింత దగ్గరవుతుంది.
‘కులే ‘ అను పదమునకు వంశము లేక సంప్రదాయము అని అర్థము చెప్పవచ్చును.