చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః ।
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ ॥ 13
చాతుర్వర్ణ్యమ్, మయా, సృష్టమ్, గుణ కర్మ విభాగశః
తస్య, కర్తారమ్, అపి, మామ్, విద్ధి, అకర్తారమ్, అవ్యయమ్.
మయా = నాచేత; గుణ కర్మ విభాగశః = సత్త్వాదిగుణాల, శమాది కర్మల విభాగాన్ని అనుసరించి; చాతుర్వర్ణ్యమ్ = వర్ణచతుష్టయం; సృష్టమ్ = సృష్టించబడింది; తస్య = దీనికి; కర్తారమ్ అపి = కర్తను అయినా; మామ్ = నన్ను; అవ్యయమ్ = శ్రమరహితునిగా; అకర్తారమ్ = అకర్తగా; విద్ధి = తెలుసుకో.
తా ॥ (సకామ, నిష్కామ కర్మలకు భేదముంది; బ్రాహ్మణాది అధికార భేదాలను, ఉత్తమ-మధ్యమాది గుణాలను అనుసరించి కర్మవైచిత్ర్యం ఉంది. వీటికి కారకుడవైన నీకు పక్షపాతం లేకుండడం ఎలా? అంటావా-) సత్త్వాది గుణాలను, శమ దమాది కర్మలను అనుసరించి నాలుగు వర్ణాలను సృష్టించాను, (మాయా వ్యవహారాన్ని అనుసరించి నేను) కర్తనైనా కూడా (ఆసక్తి రహితుడనవడం చేత శ్రమవిహీనునిగా) అవ్యయునిగా, అకర్తగా నన్ను తెలుసుకో. (గీత: 18–41, 44 చూ:)
వ్యాఖ్య:-
మనుషుల స్వభావాలను (గుణాలను) బట్టి, ఆ స్వభావాలకు తగిన పనులను (కర్మలను) బట్టి… భగవంతుడు ప్రజలను నాలుగు వర్ణాలుగా (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా) విభజించాడు.
| గుణం (స్వభావం) | వర్ణం (విభాగం) | కర్మ (చేసే పనులు) |
| పూర్తిగా సత్వగుణం ఉన్నవారు. | బ్రాహ్మణులు | మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం (శమదమాదులు), తపస్సు చేయడం. |
| సత్వగుణం తక్కువగా ఉండి, రజోగుణం ఎక్కువగా ఉన్నవారు. | క్షత్రియులు | ధైర్యం, సాహసం, గాంభీర్యం కలిగి ఉండటం; యుద్ధం చేయడం, రాజ్యాన్ని పాలించడం. |
| కొద్దిగా సత్వగుణం ఉండి, రజోగుణం మరియు తమోగుణం కలిసిన వారు. | వైశ్యులు | వ్యవసాయం, పశువులను (ఆవులను) పెంచడం, వ్యాపారం చేయడం. |
| తమోగుణం ఎక్కువగా ఉండి, రజోగుణం తక్కువగా ఉన్నవారు. | శూద్రులు | ఇతరులకు సేవ చేయడం (పరిచర్యలు). |
ఈ విధంగా మనుషులను విభజించి సృష్టిని నడిపిస్తున్నది భగవంతుడే అయినప్పటికీ, ఆయనకు ‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం (కర్తృత్వ భావన) ఉండదు; ఆయనలో ఎలాంటి మార్పూ ఉండదు. పైకి కర్త లాగా కనిపిస్తున్నా, నిజానికి ఆయన అకర్తగానే (ఏమీ చేయని వానిగానే) ఉంటాడు. మహనీయులు కూడా ఇలాగే ఫలితంపై ఆసక్తి లేకుండా పనులు చేస్తుంటారు. ఇలా ‘నేను చేస్తున్నాను’ అనే భావన లేకపోవడం వల్ల, ఆ కర్మలు వారిని బంధించవు.