“మరణ పర్యంతం నేను అవిశ్రాంతంగా పాటుపడతాను.
ఆ తరువాత
నా శక్తి మీకు బాసటగా ఉంటుంది!”
“అశరీరవాణిగా ఉండాలనే అభిలషిస్తున్నాను!”
– స్వామి వివేకానంద
ప్రేమమయ స్వరం — ‘మీరు సింహ సదృశులు!’ — బలిష్ఠత సందేశం — మనిషి అక్కర — దివ్యత్వాన్ని అభివ్యక్తం చేయడం! — మొదటి పరిమాణం — ఋషులు కండి! — దివ్యత్వం : రెండవ పరిమాణం — నాలుగు యోగాలు — సందేశపు ఇరు పార్శ్వాలు — స్వామీజీ పథం — భారతదేశం కోసం — హిందూమతం కోసం — అంతర్జాతీయ రంగంలో — నూతన యుగ ఉషోదయం — ప్రయత్నించి పాటుపడదాం!
ప్రేమమయ స్వరం
“మరణానంతరం కూడా మీకు బాసటగా ఉంటాను!” అన్నారు స్వామి వివేకా నంద. ఈ విధంగా అతిశయించిన ఘనతతో ఆయన విరాజిల్లుతున్నారు! “నేను మృత్యుంజయుణ్ణి, అమరుణ్ణి” అని పరోక్షంగా తెలిపారు! దానినే కదా ఆయన సోదర శిష్యుడైన అఖండానంద, “ఆయన శాశ్వతంగా జీవిస్తున్నారు! మనకు సమీపంలో, అతి సమీపంలో పచార్లు చేస్తున్నారు!” అని స్పష్టంగా చెప్పారు.
ఎందుకు “పచార్లు చేస్తున్నారు?”
ఇదిగో స్వామీజీయే అందుకు కారణం చెబుతున్నారు –
“లోకంలోని ప్రజలందరికీ స్ఫూర్తి కలిగిస్తూనే ఉంటాను. వారందరూ తాము భగవంతునితో సమైక్యమైనట్లు గ్రహించే దాకా నేను పాటుపడుతూనే ఉంటాను!”
సామాన్యంగా మహాత్ములు ముక్తిని అభిలషిస్తారు. లోకంలోని సుఖ దుఃఖాలు, పాపపుణ్యాలు, మంచిచెడులు ఏవీ స్పృశించని స్థితిని కోరుకొన్నారు. కాని స్వామీజీ మరణానంతరం సైతం తమను ఈ లోకంతో పెనవేసుకొని మనకు మార్గదర్శ కత్వం వహించగోరారు.
ఎందుకు?
ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నారు కనుక!
“మీరందరూ దేవతల బిడ్డలు కాబట్టి, మహిమాన్వితులైన పితరుల సంతానం కాబట్టి మిమ్మల్ని ప్రేమిస్తాను.”*
అది ప్రేమమయ స్వరం!
ఎంత సాంత్వన వచనాలు! మన దుశ్చర్యలను క్షమించి, మన దౌర్బల్యాలను పట్టించుకోకుండా, మనల్ని స్వీకరించి ప్రేమించే వ్యక్తి ఒకరు ఉన్నారనే భావనే మనలో క్రొంగ్రొత్త చైతన్యాన్ని నింపుతుంది కదా!
అదే వివేకానంద!
మన దౌర్బల్యాలు, నేరాలు, లోటుపాట్లు, తప్పులనన్నీ ఎత్తి చూపి, మనపట్ల మనమే కనికరం పొంది వాడిపోయేటట్లు చేసే వ్యక్తి కాదు ఆయన. మన దివ్యత్వాన్ని ఎరుక పరిచి, మన పట్ల మనకే గౌరవం కలిగేటట్లు చేసే వ్యక్తి ఆయన!
ఇదిగో ఆయన వచనాలు –
“అమృత పుత్రులారా! ఆ, ఆ! ఎంత శ్రావ్యమైన, ఎంతటి నమ్మకాన్ని పాదుగొలిపే పేరు! అనుంగు బిడ్డల్లారా! ఆ శ్రావ్యమైన సంబోధనతో మిమ్మల్ని నేను సంబోధించడానికి అనుమతి ఇవ్వండి. అమరత్వానికి వారసులారా! అవును, మిమ్మల్ని పాపులని సంబోధించడానికి హైందవుడు నిరాకరిస్తాడు. మనం భగవంతుని సంతానం, అమరత్వపు భాగస్వాములం, పునీతులం, పరిపూర్ణులం. స్వర్గంలోని దేవతలారా! మీరు పాపులా? మనుషులను అలా సంబోధించడం పాపం; మానవ నైజానికే అది మాయని మచ్చ!”
మనం పాపులం కాము; మనం దేవతలం, భగవంతుని వారసులం, అమరత్వపు భాగస్వాములం – ఎంత నమ్మకాన్ని కలిగించే వచనాలు! ఇక్కడ స్వామీజీ ఒక కథ ద్వారా వివరిస్తున్నారు:
‘మీరు సింహ సదృశులు!’
“ఒక కథ చెబుతాను. ఆహారం కోసం అన్వేషిస్తున్న గర్భిణియైన ఒక ఆడ సింహం ఒకప్పుడు ఒక గొర్రెల మంద మీద పడింది. అది ఒక గొర్రె మీద దూకింది. ఆ మరుక్షణమే ఒక పిల్లను ఈని ఆడసింహం చచ్చిపోయింది. ఆ సింహపుపిల్ల గొర్రెలతో కలసిమెలసి తిరుగుతూ, గడ్డిమేస్తూ, గొర్రెలా అరుస్తూ పెరుగసాగింది. ఒకనాడు ఒక సింహం ఆ దారిన పోతూ ఈ గొర్రెల మందను చూసింది. మందలోని సింహపుపిల్ల గొర్రెలా గడ్డిమేస్తూ అరవడం గమనించి అది ఆశ్చర్యపోయింది. దానిని చూడగానే గొర్రెలు, వాటితోపాటే పెరిగిన గొర్రె–సింహం భయపడి పారిపోయాయి. పెద్ద సింహం తగిన అదను కోసం వేచి ఉండి ఒక రోజు గొర్రెలతో పెరిగిన గొర్రె–సింహం నిద్రిస్తూంటే సమీపించి లేపి, ‘నువ్వు సింహానివి’ అంది. అది నిద్ర లేచి ‘కాను’ అని గొర్రెలా అరవసాగింది. అప్పుడు సింహం దాన్నొక కొలను వద్దకు తీసుకువెళ్లి, ‘నీళ్లలో నీ రూపాన్ని చూసుకో. నీ రూపం నన్ను పోలి లేదా?’ అని అడిగింది. గొర్రె–సింహం నీటిలో తన స్వరూపాన్ని గుర్తించి, ఔనంది. పెద్ద సింహం గర్జిస్తూ ‘నువ్వు నాలా గర్జించు’ అంది గొర్రె–సింహంతో. కాసేపటి ప్రయత్నంతో గొర్రె–సింహం పెద్ద సింహంతో సమానంగా భీకర గర్జనలు చేయసాగింది. అది ఆ క్షణం నుంచి గొర్రె అలవాట్లను విడిచివేసింది.
“మిత్రులారా! మీరు సింహంలా విక్రములని తెలియజేయడమే నా అభిమతం.”*
స్వామీజీ స్వరం, అంటే ఆయన మనకు చెప్పవలసింది ఈ కథలో ఉంది.
“ఈ దీనజనులు, ఈ పీడిత సోదరులు, ఈ ఆజన్మ దరిద్రులు తమ యథార్థతత్త్వాన్ని తెలుసకోవలసి ఉంది. బలవంతులకూ, బలహీనులకూ అండయై ఉత్తములకు నీచులకు ఆధారమై ప్రతి వ్యక్తిలోనూ ఒకే అఖండాత్మ ప్రకాశిస్తోంది. యోగులు, మహర్షులు కావడానికి తగిన అనంతావకాశం అఖండశక్తి అందరిలో ఉంది. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడూ, ప్రతి బాలికా – ప్రతి బాలుడూ జాతి భేదం లేక, జన్మ భేదం లేక సబల దుర్బల తారతమ్య వివక్ష లేక విశ్వమానవకోటి అంతా దీనిని ఆలకించి యోచన చేస్తారుగాక! ‘ఉత్తిష్ఠత, జాగ్రత, ప్రాప్యవరాన్ని బోధత!’* ‘లేవండి, మేల్కొనండి! దుర్బలత నుంచి, సమ్మోహనం నుంచి తెప్ప రిల్లండి – నిజానికి ఎవడూ దుర్బలుడు కాడు! ఆత్మ అఖండం, సర్వశక్తిమంతం! సర్వజ్ఞం; లేచి నిలబడండి! మీ స్వస్వరూపాన్ని ప్రకటించండి; మీలో ఉన్న బ్రహ్మాన్ని ప్రకాశింపజేయండి. ఆయనను నిర్లక్ష్యం చేయకండి.”*
బలిష్ఠత సందేశం
చదువుతున్నప్పుడే మనలో ఒక విద్యుత్తరంగం ప్రసరిస్తుంది కదా! బలిష్ఠత పొంగిపొరులుతుంది కదా! ఎందుకంటే ఆయనది బలిష్ఠతా సందేశం! “మొదట మన యువకులు బలిష్ఠులు కావాలి! తరువాత మత నిష్ఠ దానంతట అదే చేకూరుతుంది. భగవద్గీత పారాయణ కన్నా ఫుట్‌బాల్ ఆట మిమ్మల్ని త్వరగా మోక్షమార్గానికి తీసుకుపోతుంది. ఇవి మహా సాహన వచనాలు! అయినా నేను వాటిని చెప్పే తీరాలి. ఎందుకంటే నాకు మీ పట్ల గాఢాభిమానం ఉంది కనుక. నా చెప్పు ఎక్కడ కరుస్తుందో నాకు తెలుసు. నేను కొంత అనుభవాన్ని గడించాను. మీ జబ్బలు, మీ కండరాలు ఇంకా కొంత బలపడినప్పుడు మీరు ఇంకా బాగా గీతను అర్థం చేసుకోగలుగుతారు. మీలో ఇంకా కొంత బలం ఉంటే, రక్తం ప్రవహిస్తే శ్రీకృష్ణుని మహాబలాన్నీ, ప్రతిభా విశేషాన్నీ చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. మీ పాదాల మీద మీ శరీరం దృఢంగా, సుస్థిరంగా నిలువజాలినప్పుడు మీరు నిజమైన పురుషులమని భావించ గలిగినప్పుడు ఉపనిషత్తులను, ఆత్మ మహిమను సమగ్రంగా గ్రహించగలరు”* అంటూ దీనిని స్వామీజీ వివరిస్తున్నారు.
మనిషి అక్కర
మనిషిలో అసంఖ్యాక ప్రతిభలు, అఖండ శక్తి దాగి ఉన్నాయి; వాటిని వెలు పలకు తేవడంలో ఆతడికి తోడ్పడాలి – ఇదే స్వామీజీ ప్రధాన సందేశం; దీనిలోనే ఆయన ఎక్కువ అక్కర వహించారు. ఈ చింతన భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప మలుపు. మూడు వేల ఏళ్లుగా భారతీయ సంస్కృతి ‘భగవంతుని’ కేంద్రంగా చేసుకొంటూ వచ్చింది. ‘భగవంతుడు’ అనే దృక్కును ‘మనిషి’ వైపుగా స్వామీజీ త్రిప్పారు.
అలా అయితే ఇన్ని రోజులుగా భారతీయ సమాజం భగవంతుని ఆదర్శంగా చేసుకొంటూ వచ్చింది; స్వామీజీ దానిని త్రిప్పి మనిషిని ఆదర్శంగా చేసుకో మన్నారా?
లేదు.
భగవంతుడు, మనిషి మధ్య ఉన్న ఎడబాటును ఆయన తొలగించారు.
భగవంతుడంటే ఎక్కడో కూర్చుని మనిషి విధిని తన ఇచ్ఛ మేరకు ఆడించే వ్యక్తి అని భావించడం కద్దు. కాని స్వామీజీ అలాంటి భగవంతుని గురించి చెప్ప లేదు; పరమసత్యాన్ని ఆయన భగవంతునిగా పరిగణించారు. అనంత చైతన్యం, అనంత జ్ఞానం, అనంత శక్తి, పరమానందం – వీటిని సహజంగా సంతరించుకొన్న పరమ సత్యపదార్థమే భగవంతుడు. ఈ అనంత చైతన్య పదార్థమైన భగవంతుడు సకల ప్రాణికోటిలోనూ ఆత్మగా విరాజిల్లుతున్నాడు. “ఆ ఆత్మే మీరు, అది గ్రహించండి” అన్నారు స్వామీజీ.
దివ్యత్వాన్ని అభివ్యక్తం చేయడం!
శరీరం, మనస్సు, ఆత్మ – ఈ మూడింటి కూర్పే మనిషి. అజ్ఞానం కారణంగా అతడు తనను మనశ్శరీరాల కూర్పుగానే చూస్తున్నాడు. తన నిజ నైజాన్ని, అంటే తన దివ్యత్వాన్ని, తానొక ఆత్మనని అతడు విస్మరించాడు. ఈ దివ్యత్వాన్ని అతడు గ్రహించాలి. ఆతడిలో అనంత శక్తి, అనంత జ్ఞానం, పరమానందం నెలకొని ఉన్నాయి; వాటిని అతడు జీవితంలో అభివ్యక్తం చేయాలి.
దీనినే స్వామీజీ, “సంక్షిప్తంగా నా ఆదర్శాన్ని కొన్ని మాటల్లో చెప్పవచ్చు. అదేమంటే మానవకోటికి తమ దివ్యత్వాన్ని బోధిస్తూ, ఆ దివ్యత్వాన్ని జీవితంలోని ప్రతి స్పందనలోనూ అభివ్యక్తీకరించడమే”* అని చెప్పారు.
ఇలా ఆత్మను గ్రహించడం వలన, దివ్యత్వాన్ని అభివ్యక్తం చేయడం వలన ఏం జరుగుతుంది?
మొదట, అది శ్రేష్ఠమైన జీవితాన్ని ఒసగుతుంది –
మొదటి పరిమాణం
“నిద్రాణమై ఉన్న జీవిని ఎలుగెత్తి పిలవండి! ఓహో! అతడెలా మేల్కొంటాడో మీరే చూస్తారు. ఆ సుప్తజీవి మేల్కొని స్వస్వరూప జ్ఞానంతో కార్యదీక్షా పరుడైనప్పుడు అతనికి శక్తి వస్తుంది, తేజస్సు వస్తుంది. శుభం కలుగుతుంది, పవిత్రత కలుగుతుంది. ఉత్కృష్టమైన దంతా అతణ్ణి వరిస్తుంది”* అన్నారాయన.
మనల్ని మనం ఎవరని గ్రహించడం వలన విజయవంతమైన జీవితం గడపవచ్చునంటున్నారు స్వామీజీ. ఎలా?
ఒక యువరాజు విధివశాత్తూ పేదవాడిగా జీవించసాగాడు. ఒకరోజు అతడు, తాను యువరాజుననే నిజాన్ని గ్రహించాడు. రాజు, మంత్రి, సేనలు అతడికి ఎదురేగి ఆహ్వానించి తోడ్కొని వెళ్లారు. యువరాజుకు ఉండవలసిన పరపతి, ఘనత అతడిలో సహజంగానే అభివ్యక్తమైనాయి. అదే విధంగా మనల్ని మనం ఆత్మగా గ్రహించినప్పుడు, మనలో నిద్రాణమైన శక్తులూ, ప్రతిభలూ సహజంగానే అభివ్యక్తమై కార్యాచరణకు ఉపక్రమిస్తాయి. ఇది విజయవంతమైన జీవితానికి మార్గం కల్పిస్తుంది.
స్వామీజీ ఈ భావనను చక్కగా వివరిస్తున్నారు:
“బెస్తవాడు సైతం తాను ఆత్మ స్వరూపినని భావిస్తే తన బెస్తవృత్తిలో ఆరి తేరతాడు. విద్యార్థి తాను ఆత్మరూపినని భావిస్తే చాలా శ్రేష్ఠుడైన విద్యార్థి అవుతాడు. న్యాయవాది తాను ఆత్మనని భావిస్తే శ్రేష్ఠతముడైన న్యాయవాది అవుతాడు. ఇలాగే ఇతరులు కూడా.”* కనుక ఒక వ్యక్తి తనను ఆత్మగా భావించుకొన్నప్పుడు, ఆతడి ఆత్మ జాగృతి చెందినప్పుడు ఆతడు జీవితాన్ని ఉత్కృష్టంగా గడపడానికి అవసరమైన శక్తి పొందుతాడు; విజయవంతమైన జీవితం గడుపుతాడు.
ఇక్కడ ఆత్మ జాగృతి చెందడాన్ని లోకంలో చక్కగా జీవించడానికి మార్గంగా స్వామీజీ చూపుతున్నారు. స్వామీజీకి ముందు ఆత్మ జాగృతి, ఆత్మజ్ఞానంలాంటివి ఆంతరంగిక జీవితం కోసమూ, భగవదన్వేషులకూ మాత్రమే కేటాయింపబడ్డాయి. స్వామీజీ ప్రప్రథమంగా అంతరంగంలోని ఆత్మ మేల్కొనడం వలన శక్తులూ, ప్రతిభలూ అభివ్యక్తమవుతాయన్నారు; అందువలన చక్కని సంసార జీవితం పొంద వచ్చునని చెప్పారు. ఇలా శక్తులనూ, ప్రతిభలనూ అభివ్యక్తం చేయడమే ‘ఆత్మ అభివ్యక్తీకరణ’ (self-actualization).
దీనికి మార్గం చూపించే విద్య గరపాలని స్వామీజీ అభిలషించారు. దీనినే ఆయన, “మనిషిని రూపొందించే విద్య”, “సొంత కాళ్ల మీద నిలబడజేసే విద్య” అంటూ పేర్కొన్నారు. “మనిషిలో నిక్షిప్తమై ఉన్న పరిపూర్ణతను అభివ్యక్తపరచడమే విద్య”* అనే వివరణ ద్వారా ఆయన దీనినే ఎత్తి చూపుతున్నారు.
అంతేగాక ప్రతి ఒక్కరిలోనూ సృజనాత్మకశక్తి ఉంటుంది. నూతన ఆవిష్కరణను కల్పించే శక్తి అది. ప్రతి ఒక్కరూ దీనిని ప్రేరేపించి కార్యాచరణలోకి తేవచ్చు. తద్ద్వారా వ్యక్తిగత జీవితాన్నీ, ఇతరుల జీవితాల్నీ మెరుగుపరచవచ్చు.
ఋషులు కండి!
కొందరిలో ఈ సృజనాత్మకశక్తి చక్కగా అభివ్యక్తమవుతుంది. వారు తమలో నిక్షిప్తమైన శక్తులనూ, ప్రతిభలనూ అధిక పరిమాణంలో అభివ్యక్తం చేస్తున్నారు. మానవాళి పురోగతీ, సాధనలూ అలాంటి వారి వల్లనే జరుగుతున్నాయి. విద్యుద్దీపం, కెమేరా, ట్రాన్సిస్టర్, బాల్‌పాయింట్ కలం, ఎక్స్‌రే, పెన్సిలిన్, ఇన్సులిన్ – ఇలాంటి ఆవిష్కరణలు లోకం యావత్తూ కోట్లమందికి మేలు చేస్తున్నాయి. అదేవిధంగా న్యూటన్, డార్విన్, మార్క్స్, ఐన్‌స్టీన్, ఫ్లాంక్ లాంటి చింతనాశీలురు ఆవిష్కరించిన సిద్ధాంతాలు మానవాళి జీవితం లోనూ, చింతనలలోనూ ఎంతో ప్రాబల్యం వహిస్తున్నాయి.
ఇలా నూతన సత్యాలను ఆవిష్కరించిన వారు ప్రాచీన భారతదేశంలో ఋషులుగా పేర్కొనబడ్డారు. గాయత్రీ మంత్రం విశ్వామిత్ర ఆవిష్కరణ. భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్నాడనే, లోకాతీతుడనే సత్యాన్ని యాజ్ఞవల్క్యుడు ఆవిష్కరించాడు. పాణిని సంస్కృత వ్యాకరణ నియమాలు; శుశ్రుతుడూ, చరకుడూ వైద్య శస్త్రచికిత్సలు; భాస్కరుడు, లీలావతి గణితశాస్త్రం; వరాహమిహిరుడు జ్యోతిషం; చాణక్యుడు రాజనీతిశాస్త్రం; ఆర్యభట్టు, భాస్కరుడు ఖగోళశాస్త్రం – ఇలాంటి జీవితావసరాలైన అనేక సత్యాలను మన ప్రాచీనులు ఆవిష్కరించారు. ఈ మేధావులందరూ ఋషులని పేర్కొనబడ్డారు.
ఈ కోణంలో చూసినప్పుడు మానవాళికి మేలు ఒనగూర్చే సత్యాలను ఆవిష్కరించే నేటి విజ్ఞానవేత్తలూ ఋషులే! ఇలాంటి ఋషులూ, ద్రష్టలూ మన దేశం నలుమూలల్లో జీవించే భవిష్యత్కాలాన్ని స్వామీజీ కలగన్నారు. “మీరు, నేను, ప్రతివ్యక్తీ – అందరం ఋషులం కావలసి ఉన్నాం. మనకు నేడు ఆత్మ విశ్వాసం అత్యావశ్యకం. మనం లోక సంస్కర్తలం కావాలి! అందుకు కావలసిన దంతా మనలో అజ్ఞాతంగా ఉంది…. ఇక్కడున్న మనలోని ప్రతి వ్యక్తీ ఋషిత్వాన్ని పొంది ఇతరుల ముక్తిని, మన ముక్తిని సాధించుకొనగలిగేలా భగవంతుడు మనల్ని అనుగ్రహించుగాక!”* అంటూ ఆయన ప్రార్థించారు.
దివ్యత్వం : రెండవ పరిమాణం
కాని విజయవంతమైన జీవితమూ, లోకంలోని ఐశ్వర్యాలన్నీ మనిషి తక్షణ లక్ష్యాలు (proximate goals). కాని స్వామీజీ పదేపదే ఎత్తి చూపించే మనిషి పరమావధి (ultimate goal) ఒకటి ఉంది: మనిషి ఆత్మ ఏ పరమాత్మతో సమైక్యమయిందో ఆ పరమాత్మను, ఆ ఆత్మ నైజాన్ని ప్రత్యక్షంగా గ్రహించడం. దివ్యత్వాన్ని అభివ్యక్తం చేయడంలోని రెండవ పరిమాణం అది. ఇదే ‘ఆత్మ సాక్షా త్కారం’ (self-realization). స్వామీజీ అభిలషించింది కేవలం ఆర్థిక పురోభివృద్ధిని మాత్రమే కాదు; విజయవంతమైన జీవితం గడపడం మాత్రమే కాదు; గుణగణాలలో, ఆధ్యాత్మికతలో, జ్ఞానంలో, చైతన్యంలో – వీటి అన్నింటిలో వికాసాన్ని, అంటే వ్యక్తిత్వ సమగ్ర వికాసాన్నే ఆయన బోధించారు. రవీంద్రనాథ్ టాగూర్ వచించినట్లు, “అన్ని పరిమాణాలలోనూ మనిషి సమగ్ర వికాసమే వివేకానంద సందేశం.” ఒకడు తనను అవగతం చేసుకోవాలి, తనను గ్రహించుకోవాలని వివేకానంద వచించినప్పుడు ఆయన వ్యక్తి సమగ్ర వికాసాన్నే ఎత్తి చూపించారు. దీనినే ఆయన ‘మత’ ఉద్దేశంగా అభివర్ణించారు.
మతానికి ఆయన ఇచ్చే ముఖ్యమైన నిర్వచనాలలో ఒకటి చూద్దాం: “మనిషిలో నిక్షిప్తమై ఉన్న దివ్యత్వాన్ని అభివ్యక్తపరచడమే మతం.”* ఇందుకు ఆయన చూపించిన మార్గమే “నాలుగు యోగాలు.”
నాలుగు యోగాలు
“అనేక మార్గాల ద్వారా ఒకే గమ్యాన్నే చేరగలమనేది వేదాంత మతంలోని మహోదాత్తాశయం; కర్మ, భక్తి, యోగం, జ్ఞానం అని వీటిని నేను స్థూలంగా నాలుగని నిర్దేశించాను”* అంటున్నారు స్వామీజీ. యోగాలు అనేకం. మన శాస్త్రాలలో జ్ఞానయోగం, భక్తియోగం, మంత్రయోగం, లయయోగం, హఠయోగం అంటూ అనేక మార్గా లున్నాయి. స్వామీజీ కాలం నాటి నైజానికీ, మానవుల మానసిక స్థితికీ అను గుణంగా ఈ మార్గాలను నాలుగు పెద్ద విభాగాలలో ఇమిడ్చారు.
చురుకుగా పనిచేసేవారనీ, ఉద్వేగభరితులనీ, అంతర్ముఖులయ్యేవారనీ, విచారణలో అభిలాషగలవారనీ మనుషులను సామాన్యంగా నాలుగు రకాలలో ఇమడ్చవచ్చు. వీరిని పరిగణనలోకి తీసుకొని స్వామీజీ నాలుగు మార్గాలను రూపొందించారు. అవే కర్మయోగం, భక్తియోగం, రాజయోగం, జ్ఞానయోగం.
ప్రతి ఒక్కరూ తమ మనఃస్థితికి అనుగుణంగా ఒక మార్గాన్నో, అనేక మార్గాలనో అనుసరించి ఆత్మను గ్రహించాలన్నదే స్వామీజీ ఉద్దేశం. “ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది. బాహ్యాంతర ప్రకృతినంతా నిరోధించి, అంతర్గతమైన ఈ దివ్యత్వాన్ని అభివ్యక్తం చేయడమే జీవితానికి పరమావధి. దీని కోసం కర్మ – ఉపాసన – యోగ – జ్ఞాన మార్గాల్లో ఒక్కటిగానీ, కొన్నింటినిగానీ లేదా అన్నింటినిగానీ అవలంబించి ముక్తులు కండి. మతానికంతా ఇదే సారాంశం. వాదాలూ, సిద్ధాంతాలూ, కర్మకలాపాలూ, గ్రంథాలూ, దేవాలయాలూ, విధులు – అన్నీ అప్రధానాంశాలు”* అంటూ ఆయన దీనిని స్పష్టం చేస్తున్నారు.
శక్తులనూ, ప్రతిభలనూ అభివ్యక్తీకరించి, ‘ఆత్మ అభివ్యక్తీకరణ’ చేసి, ఉదాత్త జీవితం గడపడం, ఆత్మ సాక్షాత్కారం (self-realization) పొందడం మనిషి వికాసంలో రెండు పరిమాణాలు. ఆత్మ అభివ్యక్తీకరణ చేయడం మనిషి తక్షణ లక్ష్యం, ఆత్మ సాక్షాత్కారం చరమ లక్ష్యం. ఈ రెండూ జరుగుతున్నప్పుడు ‘మనిషి’ రూపొందుతాడు. ఈ విధంగా వ్యక్తిగతంగా మనిషి పురోగమించాలి, తద్ద్వారా సమాజం అభివృద్ధి గాంచాలన్నది స్వామీజీ ఉద్దేశం.
సందేశపు ఇరు పార్శ్వాలు
కాని మనుషులు దేశాలపరంగానూ, జాతిపరంగాను భిన్నులు. వారి మనః స్థితులు విభిన్నం. కనుక సందేశం మానవాళికి సమగ్రంగా ఉన్నప్పటికీ వాటిని అందించడంలో స్వామీజీ మార్పులు చేశారు. “మనిషి ఎక్కడున్నా, ఎలాంటి దశలో ఉన్నా కూడా, ఆతడికి ఉపకరించని మతం, అంతగా ప్రయోజనకారి కాదు. ప్రత్యేకంగా కొందరికి మాత్రమే ఉపకరించే మతం సిద్ధాంత రూపంలోనే నిలిచి ఉంటుంది. మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నా, స్వతంత్రుడైనా, దాస్యంలో ఉన్నా కూడా చేయూతనీయ సమర్థమై సంసిద్ధమై ఉండే మతమే మానవకోటికి ఉపకరించగలదు”* అంటు న్నారు స్వామీజీ. ఈ దృక్పథంలో ఆయన భారతీయులకూ, పాశ్చాత్యులకూ తమ సందేశాన్ని రెండు విధాలుగా అందించారు.
మౌలిక అవసరాలైన అన్నవస్త్రాలకు భారతీయులు సతమతమయ్యారు. పాశ్చాత్య దేశాలలో ప్రజలు జీవిత అవసరాల (existential needs) కోసం పోరాడారు. వారు దైవవిశ్వాస రాహిత్యం, జీవిత నిరర్థకత, సన్మార్గ జీవితంలో అపనమ్మకం, ప్రశాంతతా రాహిత్యం లాంటి సమస్యలతో విలవిలలాడుతున్నారు.
ప్రతిభలను అభివ్యక్తం చేసి, ఒక వ్యక్తి బాహ్య జీవితంలో పురోగమించే విద్యను, సేవ–ధర్మ భావనను భారతీయులకు స్వామీజీ సందేశంగా అందించారు. ప్రతిభలను అభివ్యక్తం చేసి, జీవితంలో విజయం పొందిన ఒక వ్యక్తి ఆంతరిక జీవితాన్ని అభిలషించి ఆత్మను సాక్షాత్కరించుకోవడం పాశ్చాత్యులకు సందేశంగా అందించారు. కాని ఇదొక సాధారణమైన వ్యత్యాసం మాత్రమే. భారతదేశంలో ఆంతరిక జీవితానికి అర్హులైనవారు లేనేలేరనో, పాశ్చాత్యంలో బాహ్య జీవితంలో యావన్మందీ విజయులయ్యారనో కాదు ఇందుకు అర్థం. భారతీయులు జీవిత పోరాటంలోనే ఈడేరలేదు; ఆకలి, పస్తుల నుంచి విడివడలేదు. వారికి ఆత్మను గురించి బోధించడం వారిని అవమానించడం అవుతుంది. కనుక వారు మంచి విద్యను అభ్యసించి, ప్రతిభలను అభివ్యక్తం చేసి, జీవితంలో పురోగమించాలి. అలా కొందరు పురోగమించడానికి సేవ లందించాలి. లౌకిక జీవితంలో ఈడేరి విజయ వంతులైన పాశ్చాత్యులు ఆత్మానుభూతిని అభిలషించాలి.
స్వామీజీ పథం
ఈ విధంగా ‘సత్యయుగ’ మనిషికి పథాన్ని ఏర్పరచి ఇచ్చారు యుగ నాయకులైన స్వామీజీ. మనిషి ఆంతరిక జీవితాన్ని అభిలషించాలి, ఆత్మను జాగృతి గావించాలి, శక్తులను ప్రతిభలను అభివ్యక్తీకరించి ఉతాత్త జీవితం గడపాలి; ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించి ఆత్మానుభూతి పొందాలి. అలా అనుభూతి పొందిన వ్యక్తి తన జీవిత పరమావధిని పొందిన వాడవుతాడు.
స్వామీజీ సందేశాన్ని, అంటే మనం ఏం చేయాలని ఆయన అభిలషించారో చూశాం.
ఆయన మన కోసం ఏం చేశారు?
ఆయన మన కోసం ఏం చేయలేదు?
“మనుషుల్లారా రండి! మీ కొక మాట చెబుతున్నాను; పండు కోసి మీరు తినడానికి సిద్ధంగా ఉంచాను. మీరు వచ్చి తింటే చాలు. అది కూడా చేయరా?” అని నాయన్మార్లలో మహాత్ముడైన అప్పర్ ప్రశ్నించాడు. ఆ స్థితిలో మన కోసం ప్రతి ఒక్కటీ స్వామీజీ సిద్ధం చేసి ఇచ్చారు.
క్షణం యోచిద్దాం.
భారతదేశం కోసం
భారతదేశానికి చెందినంత వరకు ఒక ఆధునిక భారతదేశ దృశ్యాన్ని చూపిం చిన ఆద్యులలో స్వామీజీ అద్వితీయులు. స్వతంత్రమైన, నూతన ఉత్తేజం పొందిన, ప్రకాశవంతమైన, ప్రాచీన వైభవం తిరిగి పొందిన భారతదేశ దృశ్యాన్ని ఆయన మనకు వదలిపెట్టి వెళ్లారు. ఆయన తాము తిలకించిన దృశ్యాన్ని ఇలా ఉద్వేగపు వెల్లువతో విశదపరుస్తున్నారు:
“భావిభారత భూమి ప్రకాశించనుంది. ఆ దివ్య ప్రకాశ చిహ్నాలు ఇప్పుడే కనిపిస్తున్నాయని నా నమ్మకం. అది ప్రాచీన భారతం కన్నా ఉజ్జ్వలమై ప్రకా శిస్తుంది. పూర్వపు ఋషులందరికన్నా గొప్పవారైన ఋషులు పుట్టనున్నారు. మీ పితృదేవతలు సంతృప్తులు కావడమే కాకుండా, తమ లోకాల నుంచి క్రిందికి చూసి వారెంతో సగర్వంగా ఆనందిస్తారని నా నిశ్చయం… ఇప్పుడు భారతమాత సంసిద్ధంగా ఉంది. ఆమె కాస్త కునుకుతూంటే ఏమి? లేవండి, మేల్కొనండి. అదిగో సనాతన ధర్మ సింహాసం మీద నవయౌవనంతో పూర్వం కన్నా దేదీప్య మానంగా ప్రకాశిస్తూ మన దేశమాత ఆసీనురాలై ఉంది. కళ్లు తెరిచి చూడండి.”*
ఇలాంటి ఒక పారవశ్య దృశ్యంతో స్వామీజీ ఆగిపోయారా? ఆ దృశ్యాన్ని యథార్థం చేయడానికి ఏమేం చేయాలో అంతా చేసిపెట్టారు.
స్వామి వివేకానంద ఏం చేశారు?
- బానిసత్వంలోనూ, సోమరితనంలోనూ మునిగి ఉన్న భారతీయులకు పురుషోచితాన్నీ, వీరాన్నీ అందించి వారిని మేల్కొలిపారు. ప్రజలకూ రాజులకూ వారి కర్తవ్యాలను ఎత్తి చెప్పారు.
- మూఢనమ్మకాల నుంచి, నిరర్థక ఆచార సంప్రదాయాల నుంచి విడి వడిన నిజమైన మతాన్ని బోధించారు; మతసామరస్యాన్ని ఉపదేశించారు.
- “స్వీయ ముక్తి – లోక హితం” అనే ఆదర్శంతో మఠాలను స్థాపించారు. తద్ద్వారా ఉన్నత జీవితం అభిలషించేవారు సన్న్యాసం పుచ్చుకొని, తమ జీవితాలను మెరుగుపరచుకోవడానికీ, అదే సమయంలో సమాజానికి మంచి కలిగే విధంగా తమ జీవితాలను మలచుకోవడానికీ సాధ్యమయింది.
- సేవ – ధర్మం అనే ఆదర్శాన్ని బోధించడం ద్వారా జనసామాన్యం ఆధ్యాత్మిక జీవితంలో పాలుపంచుకోవడానికి ఆయన అవకాశం కల్పించారు. జపం, ధ్యానం, తపస్సులా ఇతరులకు సేవ లందించడమూ ఒక ఆధ్యాత్మిక సాధనే అన్న విషయం అనేకులలో ఆధ్యాత్మిక జీవితం గడపడానికి ప్రేరణ నిచ్చింది.
- శాస్త్రాలను అందరి పరం చేశారు స్వామీజీ. ఆయనకు ముందు ఉపనిషత్తుల లాంటి శాస్త్రాలలోని ఉన్నత భావనలు సామాన్యులకు అందుబాటులో లేవు. సామాన్యులు కూడా వాటిని చదివి అర్థం చేసుకొనేటట్లు వాటిని సరళంగా తీర్చిదిద్దారు.
- పాశ్చాత్య దేశాలకు వెళ్లి భారతదేశ ఘనతను, భారతీయ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఎత్తి చూపడం ద్వారా భారతదేశాన్ని అంతర్జాతీయ రంగంలో తల ఎత్తి నిలబెట్టారు.
హిందూమతం కోసం
హిందూత్వానికి చెందినంత వరకు, నేటి హిందూమతం స్వామీజీ సృష్టి. శాఖోపశాఖలుగా విడిపోయినప్పటికీ, పరస్పర విరుద్ధంగా ఉన్నప్పటికీ వాటిని సమైక్యపరచి నేటి హిందూమతాన్ని ఆయన అందించారు. ప్రాచీన శాస్త్రాలనూ, భావనలనూ నేటి చింతనా ధోరణిలోకి వాటిని పోతపోసి మనకు అందించారు. హిందూమత ఆధ్యాత్మిక పెన్నిధికి, యోగ సంపత్తికి నూతన చైతన్యాన్ని అందించి అందరికీ ప్రాప్తింపచేశారు. సన్న్యాసులను సమాజ సేవలో పాల్గొనేటట్లు చేసి ఈ హిందూ సన్న్యాస మర్గానికి ఒక నూతన, ఆధునిక పరిమాణాన్ని కల్పించి ఇచ్చారు.
ప్రాచీన ద్రష్టలలో అనేకులలో లేని ఒక ప్రత్యేక వైశిష్ట్యం స్వామీజీలో ఉంది. పేదల కోసం విలపించిన ప్రప్రథమ ఋషిపుంగవుడు ఆయన. “దేశం గుడిసెలలో జీవిస్తున్నదని మరువవద్దు. అయ్యో! వారికి ఎవరూ ఏ సాయం చేయలేదే!” అంటూ ఆయన రోదించారు.
భారతదేశాన్ని పురోగమింప జేయడానికి సంఘ సంస్కరణలు అవసరమని సమాజ నేతలు అనేకులు నొక్కివక్కాణించిన సమయంలో, భారతదేశ పతనానికి ఉన్నత వర్గం వారు పేదలను బహిష్కరించడమూ, దోపిడీకి గురిచేయడమూ మొదటి కారణమని ఘోషించిన మొదటి నేత ఆయన. భారతదేశం అంతా పర్యటించడం వలన ఆయన పేదల వెనుకబడ్డ స్థితిని కళ్లారా చూశారు. వారికి జాగృతి కలిగించడానికీ, వారిని ఉద్ధరించడానికీ ఒక విస్తృత విద్యాప్రణాళికను ఆయన రూపొందించారు. ఇందుకు నిధులు సేకరించడం ఆయన పాశ్చాత్య ప్రయాణ ఉద్దేశాలలో ఒకటి. పాశ్చాత్యం నుంచి తిరిగి వచ్చి రామకృష్ణ మిషన్‌ను ఆయన స్థాపించినప్పుడు, పేదలకూ, వెనుకబడ్డ వారికీ సేవ చేయడం దాని ప్రధానోద్దేశాలలో ఒకటిగా నొక్కి వక్కాణించారు.
సేవ – ధర్మం ద్వారా పేదలను, పామరులను ఉద్ధరించమని చెప్పడం ద్వారా దేశ జాగృతికీ, వికాసానికీ ఆయన మార్గం చూపించారు. ఈ విధంగా ఆర్థికాభివృద్ధిని మతంలోని ఒక అంశంగా చేసి, హిందూమతానికి ఒక కొత్త పరిమాణాన్ని కల్పించారు.
మరో విషయంలోనూ స్వామీజీ ప్రత్యేక వైశిష్ట్యంతో విరాజిల్లుతున్నారు. సముద్రం దాటితే కులం పోతుంది, తాకితే మైల అంటూ జీవించిన భారతం “కళ్లు తెరిచి తక్కిన దేశాలు చూడు”, “నీ సంకుచితమైన కలుగు నుంచి బయటకు వచ్చి లోకంలోని తక్కిన దేశాలకు వెళ్లు. అక్కడ అంతర్జాతీయ సంస్కృతీ, ఆర్థిక వ్యవస్థా, వాణిజ్యం, విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం లాంటి రంగాలు ఎలా అభివృద్ధి గాంచుతున్నాయో చూడు. వాటితో కలసి పురోగమించు” అని ఎలుగెత్తి కేకపెట్టిన మొదటి నేత ఆయన.
ఇక మనం అంతర్జాతీయ రంగాన్ని పరికిద్దాం –
భారతీయ ఆధ్యాత్మిక ఘనతను ప్రప్రథమంగా అంతర్జాతీయ రంగంలో చాటి చెప్పి లోకమంతటా వ్యాపింపజేసిన వారు స్వామీజీ. అక్కడా ఆయన సాటిలేని విశిష్టత సంతరించుకొన్న నేతగా విరాజిల్లారు.
అంతర్జాతీయ రంగంలో
మానవ చరిత్రలో మహోన్నత మలుపులు చవిచూసింది 19 వ శతాబ్దం. మధ్యయుగంలో నెలకొన్న నమ్మకాలు, గుణగణాలు, ఆదర్శాల వంటివి తిరస్క రింపబడ్డాయి. విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక రాజకీయ రంగాలలో మహోన్నత అభివృద్ధులతో 20 వ శతాబ్దం ఉదయింపనున్నది. ఆ సమయంలో స్వామీజీ ఉద్భ వించారు. ఆయన పాదాలు ప్రాచ్య పాశ్చాత్యాలలో ప్రతిష్ఠితాలై నిలిచాయి. ఆయన మానసం యుగయుగాలకు అతీతమైన ఒక మహోన్నత దృశ్యాన్ని తిలకించింది. ఆయన హృదయం మానవాళినంతటినీ ఆలింగనం చేసుకొంది. అంతటి మహోన్నత చిత్రం ఆయనది.
లోక చింతనా రంగానికి ఆయన ఏం అందించారు?
- మనిషిని గూర్చి ఒక క్రొత్త దృక్పథం. “ప్రతి జీవిలోనూ దివ్యత్వం గర్భితమై ఉంది” (Each soul is potentially divine) అంటున్నారు ఆయన. పరిణామ శిఖరాగ్రాన నిలిచేవాడు, దైవాంశ సంభూతుడు, తన విధిని తానే రూపొందించుకొనే సమర్థుడు మనిషి.
- భగవంతుని గురించిన సరిక్రొత్త దృక్పథం. ఆధునిక విజ్ఞాన ఆవిష్కరణ లకు ప్రతికూలం లేని భగవంతుడు ఆయన. ఎక్కడో గగనమండలంలో కూర్చుని మనుషులను ఆడించే భగవంతుడు కాడు ఆయన. మనుషులలోనే ఆత్మగా కొలువైనవారు ఆయన.
- జీవితం గురించి ఒక నూతన దృక్పథం. మనిషి ఆత్మలో నిక్షిప్తమైన శక్తుల అభివ్యక్తీకరణమే జీవితమనే క్రొత్త భావన. కనుక ఆత్మను అనుభూతం చేసుకోవడానికి, భగవంతుని పొందడానికి ఒక వ్యక్తి ఎక్కడో అరణ్యంలోకి వెళ్లాలనే భావన మారింది. ఆతడు ఇక్కడే జీవించవచ్చు, తన దృక్పథాన్ని మార్చుకొంటే ఆతడు మామూలు జీవితాన్నే ఆధ్యాత్మిక సాధనగా మార్చుకోవచ్చు. ఇదే సోదరి నివేదిత అద్భుతంగా ఎత్తి చూపిస్తున్నది:
- “మన గురుదేవులైన వివేకానంద జీవితానికి అత్యంత మహత్త్వాన్ని కలుగ జేసే విషయం ఈ సిద్ధాంత ప్రచారమే… అన్ని విధాల ఆరాధనా పద్ధతులు మాత్రమే కాక, సర్వవిధ కర్మలు, వివిధ రీతుల ప్రయత్నాలు, అన్ని రీతుల సృజనాత్మక కార్యాలు సత్యసాక్షాత్కారానికి మార్గాలవుతాయి. ఇక మీదట ఇది లౌకికం, ఇది ఆధ్యాత్మికం అనే భేదానికి తావుండదు. పరిశ్రమే ప్రార్థన అవుతుంది, విజయమే త్యాగమవుతుంది, జీవించడమే ఆధ్యాత్మిక మహాసాధన అవుతుంది. అన్నింటినీ త్యాగం చేసి, ఉదాసీనంగా ఉండడం ఎంత కఠోరమో యోగ్యంగా పొందడం, పొందిన దానిని రక్షించడం కూడా అంతే కఠోరమైన సాధనగా మారుతుంది. ఈ అనుభూతియే వివేకానందను… మహాప్రవక్తను చేసింది. ఆయన అభిప్రాయంలో యోగీంద్రుని గుహ, దేవాలయపు వాకిలి నరనారాయణుల సమాగమానికి ఎంతో ఉపయుక్తమైన స్థానాలే. అలాగే యంత్రాగారం, పఠనాగారం, కృషి, పారిశ్రామిక క్షేత్రాలు కూడా సమానంగా ఉపయుక్త స్థానాలే. ఆయన దృష్టిలో మానవసేవకు మాధవ పూజకు మధ్య, పురుషకారమూ విశ్వాసాలకూ మధ్య, నిజమైన ధార్మిక ప్రవర్తనకూ, ఆధ్యాత్మిక సాధనకూ మధ్య ఇసుమంతైనా వ్యత్యాసం లేదు. ఒకనొక దృష్టికోణం నుంచి స్వామీజీ పలుకులన్నీ కళ, విజ్ఞాన శాస్త్రం, మతం – ఇవి సత్యం యొక్క మూడు అభివ్యక్తీకరణలు.”*
- సన్మార్గం, సత్ప్రవర్తన వాటి గురించి ఒక నూతన దృక్పథం. భయం వలనో, బలవంతం వలనో, ఏదో ఒక బాహ్యశక్తికి విధేయత చూపడం వలనో వచ్చేది కాదు సత్ప్రవర్తన. తాను యథార్థంగా ఎవరో అలా ఉండడం; తన ఆత్మ నిజమైన ప్రకాశాన్ని అన్ని దిశలలోనూ, అన్ని పరిస్థితులలోనూ సదా ప్రసరింప జేయడం – అదే సన్మార్గం, అదే సత్ప్రవర్తన. భయం కారణంగా సజ్జనుడుగా ఉండాలనే స్థితిని మార్చి ఆత్మ దివ్యత్వం చూపి, “మనం దివ్యులం” కనుక మనం సజ్జనులుగా మెలగాలనే భావనను వ్యక్తం చేయడం వలన వివేకానంద మానవాళికి గొప్ప కానుక నిచ్చారు. ఈ భావన ప్రాతిపదికపై సత్ప్రవర్తనా జీవితం శక్తిని ఇచ్చేదిగా, ఆనందం పంచి ఇచ్చేదిగా, మనిషిలో నిక్షిప్తమై ఉన్న ప్రతిభలను అభివ్యక్తం చేసేదిగా రూపొందుతుంది.
- నూతన సమాజం. పేదల మీద నియంత్రణలు, దోపిడీ విధానరహిత సమాజం. కుల, మత భేదాలు లేని, అందరూ జీవితంలో పురోగమించడానికి అవకాశం ఇచ్చే సమాజం. స్వాతంత్ర్య సమత, స్త్రీ గౌరవం గల సమాజం.
- మతం గురించి ఒక నూతన దృక్పథం. మూఢనమ్మకాలు, సైద్ధాంతిక మౌఢ్యం చోటుచేసుకోని మతం. సామాన్యంగా మనం పరిగణించే మతానికీ, స్వామీజీ భావనలోని మతానికీ ఎంతో వ్యత్యాసం ఉంది. స్వామీజీ ఆధ్యాత్మికతను, ఆధ్యాత్మిక అనుభూతిని మతంగా పరిగణించారు. కొన్ని సిద్ధాంతాలను నమ్మడం, కొన్ని సంప్రదాయాలను పాటించడం లాంటి వాటినే మతంగా మనం భావిస్తు న్నార్. కాని స్వామీజీ వచించినది ఒక వ్యక్తి తనను తాను అవగతం చేసుకొనే మతం, భగవంతుని అభిలషించే మతం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే మతం. తద్ద్వారా జీవితంలోని అత్యున్నత ఆశయం నెరవేరడానికి దారి కల్పించే మతం.
నేటి ఆధ్యాత్మిక నేతలు అనేకులు కులరహిత, మతమౌఢ్యం లేని, జాతులు భాషలు మృగ్యమైన, మూఢనమ్మకాల నుంచి విడివడ్డ మతం గురించి మాట్లాడడం స్వామీజీ చలువే. ఆయన భావనలు భవిష్యత్కాలాలలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకొంటాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
నూతన యుగ ఉషోదయం
ఇంతటి మహోన్నత దృశ్యాన్ని చూపించి స్వామీజీ వెళ్లారు. ఈ దృశ్యం ఈడేరడాన్ని ‘సత్యయుగ’ మని ఆయన పేర్కొన్నారు. భగవాన్ శ్రీరామకృష్ణుల జననాన్ని దాని ప్రారంభంగా గాంచారు. “భగవాన్ శ్రీరామ కృష్ణుల జననంతో సత్యయుగం ప్రారంభమయింది…. శ్రీరామకృష్ణులు జన్మించడం నుంచి తూర్పు దిగతం (horizon) ప్రకాశించసాగింది; ఉదయిస్తున్న సూర్యుని నూతన కిరణాలు ప్రసరించసాగాయి. కాలక్రమాన ఆ మహాప్రకాశం, మధ్యాహ్న మార్తాండునిలా లోకాన్నే కాంతి వెల్లువలో ముంచెత్తబోతున్నది” ఆన్నారాయన. కాని ఆ నూతన యుగపు మహోన్నత కాంతి సమాజమంతటా ప్రసరించాలంటే, నూతన సమాజం వికసించాలంటే అది మన ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉంది. భగవాన్ శ్రీరామకృష్ణుల సందేశాన్ని చేగొని, స్వామి వివేకానంద మార్గంలో మనం అడుగిడితే ఆ నూతన యుగ ఉషోదయాన్ని మనం చూడడం తథ్యం!
ప్రయత్నించి పాటుపడదాం!
స్వామి వివేకానంద అనే మహోన్నత వ్యక్తిని సింహవలోకనం చేసుకొన్నాం. దీని వలన, ఆయన సమగ్ర పరిమాణాన్ని అవగతం చేసుకొన్నామని అర్థం కాదు. ఎందుకంటే, ఈ గ్రంథ ప్రారంభంలో చూసినట్లు, ఆయన గురించి రోజుల పర్యంతం మాట్లాడవచ్చు. కాని ఆయన సదా క్రొత్త వ్యక్తిగా, మాట్లాడుకోబడని వ్యక్తిగానే ఉంటారు; అదే సమయంలో ఆయన గురించి చేయబోయే చింతనలకూ, విచారణలకూ అంతం ఉండదు. దీనినే నేటి జ్ఞానులూ, పరిశోధకులూ చేస్తున్నారు. సాహిత్యం, సంగీతం, మతం, తత్త్వశాస్త్రం, ఆధ్యాత్మికతా, ఆర్థికశాస్త్రం, విద్యారంగం, సామాజికశాస్త్రం, చరిత్ర, విజ్ఞానశాస్త్రం లాంటి అనేక రంగాలలో స్వామీజీ ప్రభావం, భాగస్వామ్యం గురించి పుస్తకాలు వెలువడ్డాయి, వెలువడుతున్నాయి. ఇంకా ఎన్నో రంగాలలో పుస్తకాలు రానున్నాయి. ఎందరెందరో మేధావులూ, చింతనాశీలురూ ఆయన జీవితంలో మునిగిపోయి, మైమరచిపోయి, “ఇలాంటి వ్యక్తి ఈ ఇలలో సంచరించారా?” అంటూ ఆశ్చర్యచకితులవడం తథ్యం!
కాని మనం ఆ మేరకు పోలేం. ఆయన జీవిత చరిత్ర చదివాం; మన కోసం, మనలోని ప్రతి ఒక్కరి కోసం, మన దేశం కోసం, లోకాని కోసం ఏతెంచిన ఆ దేవర్షి జీవితాన్ని ఒకసారి చింతన చేశాం, జీవిత సంఘటనలను ఒకసారి ధ్యానించాం, అంతే. ఆయన సమగ్ర పరిమాణాన్ని అవగతం చేసుకోగోరితే, అందుకు ఆయనే దారి చూపాలి! కాని దానికన్నా ముఖ్యం ఆయన అనుగ్రహం పొందడం, ఆయన మహా అనుగ్రహం వలన మన జీవితాన్ని చక్కగా అర్థం చేసుకోవడం, దానిని ఆనందమయ జీవితంగా మార్చుకోవడం, అంతటి జీవితాన్ని ఇతరులు పొందడానికి తోడ్పడడం. “మరణ పర్యంతం అవిశ్రాంతంగా పాటుపడతాను. ఆ తరువాత నా శక్తి మీకు బాసటగా నిలుస్తుంది” అని కదా స్వామీజీ వచించారు! ఆ శక్తిని అభిలషిద్దాం! అందుకోసం ప్రార్థిద్దాం! ప్రయత్నించి పాటుపడదాం!