“నాయనా! ఈ దేహం పుట్టింది, గిట్టక తప్పదు. నా భావనలు కొన్నింటినైనా మీకు అందించగలిగానంటే నా జీవితం వ్యర్థం
కాలేదనుకొంటాను.”
– స్వామి వివేకానంద
శ్రీరామకృష్ణుల జయంతి — బ్రహ్మచర్య శక్తి — దేహం రాలిపోనీ! — ‘ఆ స్త్రీ కనిపించడం లేదు!’ — లెక్కగట్టి ఇచ్చేశాను! — దారి ఇచ్చే తీరాలి — తాము వైదొలగుతున్నారు — ‘నన్ను నేను తెలుసుకొన్నాను!’ — నివేదిత ఇంట్లో — చివరి సమస్య కూడా పరిష్కృతమయింది — అక్కడ… — ‘ఇంకొక వివేకానంద ఉంటే… — సుషుమ్నా గుండా… — ‘బాగా ఉన్నాను!’ — నిష్క్రమిస్తున్నారు! — వచ్చింది కరిగిపోయింది! — జీవిస్తున్నారు
శ్రీరామకృష్ణుల జయంతి
కాశీ నుంచి తిరిగి వచ్చినప్పుడే స్వామీజీ ఆరోగ్యం బాగా దిగజారి ఉంది. కలకత్తా వచ్చాక ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా పరిణమించింది. తన పనుల నిమిత్తం చందాలు వసూలు చేయడానికి పాశ్చాత్య దేశాలకు వెళ్లిన నివేదిత కూడా ఈ రోజుల్లో కలకత్తాకు తిరిగి వచ్చింది. 1902 వ సంవత్సరం శ్రీరామకృష్ణ జయంతి మార్చ్ 16వ తేదీ వచ్చింది. స్వామీజీ లేవలేని పరిస్థితిలో పడకబెట్టారు. ఆయన కాళ్లు వాచి ఉన్నాయి, నిద్ర దూరమయింది. వేలమంది నాడు మఠానికి వచ్చారు. స్వామీజీని ఒకసారి దర్శించుకోవాలని వారందరూ అభిలషించారు. కాని స్వామీజీ ఒకరిద్దరిని చూడడంతోనే బాగా అలసిపోయారు. కనుక దర్శనార్థం ఎవరికీ అనుమతి లభించలేదు. ఎవరినీ లోపలకు పంపవద్దని నిరంజనానందతో స్వామీజీ చెప్పారు. స్వామీజీకి సేవలందించిన శరశ్చంద్ర ఆయన అస్వస్థత చూసి ఎంతో బాధపడ్డాడు. ఆతడి బాధ చూసి స్వామీజీ మృదుస్వరంలో ఇలా అన్నారు: “ఎందుకు కలత చెందుతావు, నాయనా! ఈ దేహం పుట్టింది, గిట్టక తప్పదు. నా భావనలు కొన్నింటినైనా మీకు అందించగలిగానంటే నా జీవితం వ్యర్థం కాలేదనుకొంటాను. త్యాగమే ప్రాతిపదిక. త్యాగరహితులు, బ్రహ్మ మొదలైన దేవతలైనప్పటికీ ముక్తి పొందలేరు.”
స్వామీజీ కాసేపు మౌనం వహించారు. ప్రగాఢ చింతనామగ్నులై ఉన్నట్లు కని పించారు. తరువాత ఆయన ఇలా అన్నారు : “ఇక మీదట ఈ జయంత్యుత్సవాలను కాస్త భిన్నంగా జరిపించాలని అనిపిస్తోంది. ఒక రోజుకు మారుగా నాలుగైదు రోజులు ఉత్సవం కొనసాగాలి. మొదటి రోజు శాస్త్రాధ్యయనమూ, తద్వివరణా చోటు చేసుకోవాలి. రెండవ రోజు వేదవేదాంతాల చర్చ. మూడవ రోజు ప్రశ్నోత్త రాల కార్యక్రమం. నాలుగవ రోజు ప్రసంగాలు, అయిదవ రోజు ప్రస్తుతం జరుగుతున్న ధోరణిలో కార్యక్రమాలు సాగుతాయి.”
భక్తులు తండోపతండాలుగా వచ్చారు. పాట బృందాల వారు పాట కచ్చేరీ చేసి వెళ్లారు. స్వామీజీ ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఎంతో అభిలషించారు. కాని ఆయన నడవడానికి, అంతెందుకు నిలబడడానికి కూడా సాధ్యం కాలేదు. అయినప్పటికీ తమ గది దక్షిణ కిటికీ ప్రక్కన నిలబడి దాని చువ్వలు ఊతంగా పట్టుకొని భక్తజన సందోహాన్ని తిలకించారు. కాసేపటికల్లా బాగా అలసిపోవడంతో వెంటనే వెళ్లి కూర్చుండిపోయారు. అవతారపురుషుల పట్ల భక్తిప్రపత్తులు చెల్లించడం మూలంగా ఆత్మజ్ఞానం పొందవచ్చుననీ, లక్షలమందికి ముక్తి అను గ్రహించగల అవతారపురుషుల మహత్త్వం గురించే – స్వామీజీ ప్రసంగించారు. భగవదనుగ్రహం గురించి అద్భుతమైన ఒక వివరణ నిచ్చారు:
“అనుభవపూర్వకంగా ఆత్మను గ్రహించిన వ్యక్తి అనంత శక్తికి ఆలవాల మవుతాడు. ఆతని నుండి ఆధ్యాత్మిక తరంగాలు పొంగిపొరలుతుంటాయి. ఆ పరిధిలోకి వచ్చేవారు ఆ శక్తితో ఆకర్షితులవుతారు; ఆతడి భావనలతో ఆకర్షితు లవుతారు. ఈ విధంగా ఎక్కువగా ప్రయత్నించకుండానే వారు ఆతడి ఆధ్యాత్మిక శక్తి పర్యవసానాలను పొందుతారు. ఇదే భగవదనుగ్రహం.
“శ్రీరామకృష్ణులను దర్శించిన వారు భాగ్యశాలురు. మీకూ ఆయన దర్శనం కలుగుతుంది. ఎప్పుడైతే ఇక్కడకు వచ్చేశారో అప్పుడిక మీరు ఆయన సాన్నిధ్యంలో ఉన్నట్లే! ఈ ఇలలో శ్రీరామకృష్ణులుగా ఏతెంచిన వారు ఎవరో ఎవరికీ అంతు బట్టలేదు. ఆయన అతి సన్నిహిత భక్తులు కూడా ఆ సత్యాన్ని గ్రహించలేదు. ఏదో కొందరు కొన్ని ఆనవాళ్లు గుర్తించగలిగారు. కాని కాలక్రమాన అందరూ అర్థం చేసుకొంటారు.”
బ్రహ్మచర్య శక్తి
ఆహార నియమం, నిద్రలేమి, చికిత్స నియమాలు పాటించినప్పటికీ స్వామీజీ అన్నింటికీ అతీతంగానే విరాజిల్లారు. ఇవేవీ ఆయనను బాధించలేదు. ఆయన నుంచి ఉద్భవించిన ఆధ్యాత్మిక కాంతిపుంజాలూ, ఆయన కన్నులలో వెల్లివిరిసిన కారుణ్యపూరిత దృక్కులూ కించిత్తు కూడా ప్రకాశాన్ని కోల్పోలేదు. ఆయన నుంచి పొంగిపొరలిన ఆధ్యాత్మిక శక్తి కించిత్తూ శుష్కించలేదు. ఈ రోజుల్లో స్వామీజీ ఆంగ్ల విజ్ఞాన సర్వస్వం (Encyclopaedia Britannica) సరికొత్త ప్రచురణను చదువనారంభించారు. ఒకరోజు ఆయన గదిలో ఆ పెద్ద సంపుటాలను చూసిన శరశ్చంద్ర, “బాబోయ్! ఇన్ని సంపుటాలను చదవడానికి ఒక ఆయుష్కాలం సరిపోదు” అన్నాడు. కాని స్వామీజీ అప్పటికే 10 సంపుటాలు చదివి, 11వ సంపుటం చదువుతున్నారని శరశ్చంద్రకు తెలియదు. ఆతడు ఆశ్చర్యపోవడం చూసి స్వామీజీ, “నువ్వేమంటు న్నావు! ఈ 10 సంపుటాల నుంచి నువ్వు ఏదన్నా ప్రశ్నించు. నేను జవాబు చెబుతాను” అన్నారు. శిష్యుడు వదలిపెట్టలేదు. ప్రతి సంపుటం నుంచి అనేక ప్రశ్నలు అడిగాడు. స్వామీజీ వెంట వెంటనే జవాబులు చెప్పడమే కాదు; అనేకచోట్ల ఆ సంపుటంలోని అవే వాక్యాలను తు.చ. తప్పక చెప్పారు. “ఓ, ఇది మానవాతీత శక్తి” అన్నాడు ఆశ్చర్యపోతూ శరశ్చంద్ర. అప్పుడు స్వామీజీ ఇలా అన్నారు:
“దీన్లో ఆశ్చర్యం ఏముంది! దీన్లో ఎలాంటి అద్భుతమూ లేదు, ఇది మానవాతీత శక్తి కూడా కాదు. కఠోర బ్రహ్మచర్యం పాటించే వ్యక్తి ఏకసంథాగ్రహి అవడం తథ్యం. ఎన్ని ఏళ్లు గడచిపోయినా మరచిపోవడమంటూ ఉండదు. ఈ బ్రహ్మచర్య శక్తిని కోల్పోవడం వల్లనే మన దేశం నానాటికీ శక్తిలోనూ, జ్ఞానం లోనూ దుర్బలత్వం సంతరించుకొంటున్నది; మనం పురుషోచిత లక్షణాన్ని కోల్పోతున్నాం.”
దేహం రాలిపోనీ!
ఇలా అనేక విషయాల గురించి సంభాషణ సాగుతున్నది. అస్సాం తీర్థ యాత్ర తరువాత స్వామీజీలో సదా దివ్యసాన్నిధ్యం విరాజిల్లడం ఆయన సోదర సన్న్యాసులు గుర్తించారు. ఆయన మనస్సును అధో భూమికకు తేవడానికి మామూలు విషయాలు ఎన్నో మాట్లాడి ఎంతో ప్రయత్నించారు. కాని సాధ్యం కాలేదు. క్షణంలో ఆయన మనస్సు అంతర్ముఖమయ్యేది. “నీరు కావాలి,” “పొగ త్రాగాలి” అనేవారు. కాని వాటిని తెచ్చే లోపే ఆయన ప్రగాఢ సమాధిమగ్నులై ఉండేవారు.
ఈ సమయంలో శరశ్చంద్ర ప్రగాఢ, సూక్ష్మ విషయాలను మాట్లాడు తుండడం చూసిన బ్రహ్మానంద లోపలకు వచ్చి అతడితో, “ఏం మనిషివయ్యా నువ్వు! స్వామీజీకి ఒంట్లో బాగాలేదు. మామూలు విషయాలు మాట్లాడి ఆయన మనస్సును సహజంగా ఉంచకుండా, ఇలా తాత్త్విక విషయాలు మాట్లాడి ఆయనకు అలసట కలిగిస్తున్నావే!” అంటూ చీవాట్లు పెట్టారు. శరశ్చంద్ర తను చేసిన పనికి విచారపడ్డాడు. కాని స్వామీజీ, “ఎవరికి కావాలి మీ మందులూ, చికిత్స! వీరు నా బిడ్డలు. వారితో మాట్లాడడం వలన నా దేహం రాలిపోతే పోనీ!” అన్నారు.
ఈ రోజుల్లో స్వామీజీ తమ మిత్రులను కలుసుకోవడంలోనూ, శిష్యులకు శిక్షణనివ్వడంలోనూ నిమగ్నులయ్యారు, ఆయన సోదర సన్న్యాసులు ఆయనకు విశ్రాంతి కలిగించడంలో అప్రమత్తంగా ఉన్నారు. ఆయన వద్దకు పంపించడానికి ఎవరినైనా వారు తిరస్కరిస్తే, “ఇదిగో చూడండి, ఈ దేహం ఏం గొప్ప విషయం! ఇతరులకు సహాయపడడంలో ఇది రాలిపోనీ! తుది శ్వాస దాకా గురుదేవులు ఉపదేశాలు చేయలేదా? నేనూ అట్లే చేయకూడదా? శరీరం రాలిపోవడం గురించి నేను కించిత్తు కూడా కలత చెందడం లేదు. లోకాతీతమైన సత్యం ఒకటి ఉంది, ఆ సత్యాన్ని గ్రహించాలనే తపనతో వచ్చేవారిని చూసినప్పుడు నేనెంత సంతోషిస్తానో మీరు ఊహించనైనా ఊహించలేరు. ఇతరులలో నిద్రాణమై ఉన్న ఆత్మను జాగృతి చెందింపజేసే పని చేయడానికి నేను ఆనందంగా పదే పదే జన్మించి మరణింప సిద్ధంగా ఉన్నాను!” అన్నారు.
‘ఆ స్త్రీ కనిపించడం లేదు!’
కాసేపు విశ్రమించమని ఎవరో చెప్పారు. అందుకు స్వామీజీ, “శ్రీరామ కృష్ణులు మహాసమాధి చెందడానికి ఒకటి రెండు రోజుల ముందు, ఆయన ఎవరిని ‘కాళీ’ అని ప్రార్థించారో ఆమె నా శరీరంలో ప్రవేశించింది. నేను విశ్రమించడానికి ఆమె అనుమతించదు” అన్నారు. కాని ఈ రోజుల్లో ‘ఆమె’ తమ నుంచి వైదొలగినట్లు ఆయనకు అనిపించింది. “ఓ శరత్! ఆ స్త్రీని (కాళీ) ఇప్పుడు చూడలేకపోతున్నాను. పట్టుకొన్న నా చేతిని ఆమె వదలిపెట్టింది” అని ఒకరోజు శారదానందతో చెప్పారు. “అదెలా? అలా జరగడం సాధ్యమా? కాళీ మీ చేతిని సదా పుచ్చుకొనే ఉంది” అన్నారు శారదానంద.
స్వామీజీకి జవాబివ్వాలని అలా చెప్పినప్పటికీ శారదానందకు ఏదో స్ఫురించి నట్లయింది. కాలాంతరంలో ఆయన ఇలా చెప్పారు: “ఆ రోజు నుంచి ఒక విషయం నాకు స్పష్టమయింది: ‘తమ దేహం ద్వారా కాళీమాత ఏయే పనులు చేయగోరిందో అవన్నీ పూర్తయ్యాయి’ అన్న విషయాన్ని స్వామీజీ అలా సూచించారు.”
లెక్కగట్టి ఇచ్చేశాను!
ఏప్రిల్ నెలలో ఒకరోజు స్వామీజీ మెక్లౌడ్తో ఇలా చెప్పారు: “ఈ లోకంలో నాకంటూ ఏదీ లేదు. దమ్మిడీ కూడా నా వద్ద లేదు. నాకు ఇచ్చినదంతా లెక్కగట్టి తిరిగి ఇచ్చేశాను.”
మెక్లౌడ్ : స్వామీజీ! మీ జీవిత పర్యంతమూ నెలకు 50 డాలర్ల చొప్పున నేను ఇస్తాను.
స్వామీజీ (కాస్త యోచించి) : దానితో నేను జీవించగలనా?
మెక్లౌడ్ : జీవించగలరు, తప్పకుండా…. కాని ఐస్క్రీమ్ తినలేరు.
స్వామీజీ చిన్నగా నవ్వారు. స్వామీజీకి 200 డాలర్లు మెక్లౌడ్ ఇచ్చింది.
దారి ఇచ్చే తీరాలి
ఒక రోజు మఠంలో కొందరు క్రీడాకారులకు నివేదిత బహుమతి ప్రదానం చేస్తున్నది. స్వామీజీ గదిలో నుంచి కిటికీ గుండా ఆ తతంగం మెక్లౌడ్ చూస్తూన్నది. అప్పుడు స్వామీజీ, “నేను 40 వ ఏటిని చూడను” అన్నారు.
మెక్లౌడ్ : ఎందుకు స్వామీజీ? బుద్ధుడు తన మహత్కార్యాన్ని 40 నుంచి 80 ఏళ్ల మధ్యలోనేగా చేశారు!
స్వామీజీ : కాని నేను అందించవలసిన సందేశం ఇంతకు ముందే అందించివేశాను. ఇక నేను వెళ్లిపోవాలి.
మెక్లౌడ్ : ఎందుకు వెళ్లిపోవాలి స్వామీజీ?
స్వామీజీ : మహావృక్షం నీడన చిన్న మొక్కలు ఎదగవు. చిన్నమొక్కలు ఎదగడానికి నేను దారి ఇచ్చే తీరాలి.
తాము వైదొలగుతున్నారు
ఈ విధంగా చివరి కొన్ని నెలల్లో జరిగిన అనేక సంఘటనలు స్వామీజీ తమను మరుగుపరుచుకోవడానికి నిశ్చయించుకొన్నట్లు సూచించాయి. కాని ఈ సంఘటనలను నేడు ఇలా గుర్తించగలుగుతున్నామేగాని నాడు ఆయనతో ఉన్నవారు ఈ దృక్కోణంలో యోచించి ఉండరు. కాశీ నుంచి తిరిగి రాగానే స్వామీజీ తమ సన్న్యాస శిష్యుల నందరినీ చూడగోరారు; స్వల్పవ్యవధికైనా వచ్చిపొమ్మని వారిని పిలిచారు. పాశ్చాత్య దేశాలలో ఉన్న ఆయన శిష్యులకూ కబురు పంపించారు. కొందరు వచ్చారు, అనేకులు పనుల ఒత్తిడి వలన రాలేకపోయారు. కాని స్వామీజీ ఉద్దేశాన్ని గ్రహించి ఉంటే ఇదే ఆయనను దర్శించడానికి చివరి అవకాశమని అవగతం చేసుకొని రాకుండా ఉంటారా? “లోకం అన్ని మూలలా నివసిస్తూన్న ఆయన శిష్యులలో ఎక్కువ మంది వచ్చి ఆయనను దర్శించారు. శుష్కించిన ఆయన రూపం చూశాక, ఆయన అవసానం ఎక్కువ దూరంలో లేదని ఊహించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు” అంటూ నివేదిత వ్రాస్తున్నది.
రోజులు గడిచేకొద్దీ స్వామీజీ మఠ విధుల నుంచి వైదొలగసాగారు. “శిష్యులతో నిర్విరామంగా జీవించడం వలన వారి జీవితం పాడవుతుంది! శిష్యులు శిక్షణ పొందితే గురువు వారికి సెలవిప్పించాలి. ఆయన వైదొలగకుండా వారు పురోగ మించరు” అన్నారు స్వామీజీ. ఆయన ఇలా చెబుతున్నప్పుడు ప్రక్కన ఉన్నవారి మనస్సు వర్ణనాతీతమైన వేదనకు లోనయింది. ఆయన తమతో లేని ఒక రోజును, ఆయన లేకుండా భవిష్యత్ కార్యాలను వారు ఊహించను కూడా ఊహించలేక పోయారు; ఊహించడానికి సుతరామూ ఇష్టపడలేదు.
కాని స్వామీజీ, “నా పని అయిపోయింది. ఇక అంతా మీరే చూసుకోండి, నాకు సెలవు ఇప్పించండి” అని తమ సోదర సన్న్యాసులతో చెప్పనే చెప్పారు; చాలాసేపు ధ్యానమగ్నులైనారు. మరొకసారి ఆయన ఇలా చెప్పారు:
“మరణం నా ముందు నిలబడి నా ముఖాన్ని తదేకంగా చూస్తున్నది. అవసరమైనంత మేరకు నేను పనిచేశాను, క్రీడించాను. నేను అందించిన దానిని ముందు లోకం స్వీకరించనీ. దానిని అర్థం చేసుకోవడానికి సుదీర్ఘకాలం పడుతుంది. అంతం లేకుండా నేను క్రీడించనా? చాలు. అవసరమైనంత దాకా క్రీడించాను!”
స్వామీజీ క్రీడను ఆపివేయాలని నిశ్చయించారు.
పనులూ తక్కిన బంధాలూ ఆయన నుంచి విడివడసాగాయి. ధ్యానం ఆయన ముఖ్యమైన పని అయింది. గురుదేవులు, కాళీమాత ఇద్దరూ ఆయన మనస్సును నిరంతరంగా ఆక్రమించారు. చివరి రోజులు సమీపించేకొద్దీ ఆయన పెదవులు సదా భగవన్నామాన్ని ఉచ్చరించసాగాయి. “జై ప్రభో, జై ప్రభో”, “అమ్మా, అమ్మా, అమ్మా” లేదా “శివ, శివ, శివ” అనే నామాలు సదా ఆయన ముఖతః వెలువడసాగాయి. అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో ఆయన నెలకొన్నారు – దేహం నుంచి ఆయన విడివడడానికి సిద్ధమయ్యారు!
‘నన్ను నేను తెలుసుకొన్నాను!’
అన్నింటినుంచి వైదొలగి స్వామీజీ ఏకాంతంలో ధ్యానమగ్నులవడం ఆయన సోదర సన్న్యాసులు భరించలేకపోయారు. “తాను చేయవలసింది పూర్తిచేసిన తరువాత నరేన్ నిర్పికల్ప సమాధిలో లయించిపోతాడు. తాను ఎవరని గ్రహించిన తరువాత ఆతడు దేహంలో జీవించడు” అన్న గురుదేవులు వచనాలు జ్ఞాపకానికి వచ్చి వారికి మనశ్శాంతి లేకుండా చేశాయి. ఒకరోజు హఠాత్తుగా ఒక వ్యక్తి స్వామీజీతో, “మీరు ఎవరై ఉండేవారని తెలుసుకొన్నారా?” అని, ఎవరూ అడగకూడదని నిశ్చయించుకొన్న ఆ ప్రశ్నను అడిగాడు. “అవును, ఇప్పుడు తెలుసుకొన్నాను” అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్వామీజీ జవాబిచ్చారు. అక్కడ అప్పుడు ప్రగాఢ నిశ్శబ్దం రాజ్యం చేసింది. ఇంకా ప్రశ్నలు వేసి ఆ నిశ్శబ్దానికి భంగం కలిగించ డానికి ఎవరూ సాహసించలేదు!
నివేదిత ఇంట్లో
మాయావతిలో మిసెస్ సేవియర్ను కలుసుకొని 1902 జూన్ మాసాంతాన నివేదిత కలకత్తా రాగానే ఆమెకు బాగ్బజార్లో ఒక ఇల్లు అద్దెకు ఏర్పాటుచేశారు. బాలికల పాఠశాల పనులను ఆమె తక్షణమే ప్రారంభించాలను కొంది. ఒకరోజు స్వామీజీని కలుసుకోవాలని బేలూర్ మఠానికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన నుంచి ఒక చీటీ వచ్చింది. దానిలో, తామే ఆ రోజు కలకత్తాకు వస్తున్నట్లూ, నివేదితను ఇంట్లోనే కలుసుకొంటాననీ ఆయన వ్రాశారు. ఆ రోజు సాయంత్రం స్వామీజీ ఆమె ఇంటికి వచ్చి ఇంటిని పూర్తిగా తిరిగి చూశారు. పాఠశాల కోసం నివేదిత కొనుగోలు చేసిన సూక్ష్మదర్శిని, కెమేరా లాంటి పరికరాలను చూసి సంతోషించారు. సూక్ష్మదర్శినిని మర్నాడు మఠానికి తెమ్మన్నారు. తరువాత నివేదితను పాఠశాల ప్రణాళికలను అడిగి తెలుసుకొన్నారు. పాఠశాల కన్నా స్త్రీల కోసం ఒక విశ్వవిద్యాలయం స్థాపించడమే తన అభిలాష అని నివేదిత చెప్పింది. “మంచిది” అన్నారు స్వామీజీ. ఆయన అక్కణ్ణుంచి బయలుదేరుతున్నప్పుడు నివేదిత, “స్వామీజీ! మీరు వచ్చి పనులను ఆశీర్వదించాలి” అని వేడుకొంది. అందుకు స్వామీజీ, “నేను సదా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాను” అని జవాబిచ్చారు.
చివరి సమస్య కూడా పరిష్కృతమయింది
స్వామీజీ పనుల మధ్య తీరని సమస్యగా ఆయన వెన్నంటి వచ్చింది ఆయన తల్లి ఇంటిని గురించిన వ్యాజ్యెం. అది ఇప్పుడు పూర్తయింది. మూడేళ్లుగా జరుగుతున్న చివరి వ్యాజ్యెం కూడా స్వామీజీకి సాను కూలంగానే పరిణమించింది. చివరి సమస్య కూడా పరిష్కృత మయింది. నివేదిత ఇంటికి వెళ్లిన అదే రోజు స్వామీజీ మఠం నుంచి పలువురితో కలసి తమ సోదరి ఇంటికి వెళ్లారు. అక్కడ వ్యాజ్యెం పరిష్కృతమైన వైనం గురించి ఆయనకు తెలిసింది. స్వామీజీ హాయిగా ఊపిరి పీల్చుకొన్నారు.
జూన్ మాసాంతాన ఒకరోజు స్వామీజీ శుద్ధానందను పిలిచి పంచాంగం తెమ్మన్నారు. దేనికో ముహూర్తం చూస్తున్నట్లు ఆయన పంచాంగాన్ని తిరగేశారు. దేని కోసం చూస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఆయన నిర్ణయించిన రోజు – జూలై 4 వ తేదీ, జగజ్జననికి శుభమైన శుక్రవారం! యోగులు సామాన్యంగా ఉత్తరాయణ కాలంలో దేహత్యాగం చేస్తారు. జూలై రెండవ వారం నుంచి దక్షిణాయనం రావడం వలన దానికి ముందుగా ఒకరోజు నిర్ణయించారో ఏమో?
అక్కడ…
1902 జూలై 1వ తేదీ. స్వామీజీ గంగాతీరంలో ప్రేమానందతో పచార్లు చేస్తున్నారు. హఠాత్తుగా ప్రేమానందకు గంగాతీరంలో ఒక స్థలాన్ని చూపించారు. తరువాత నెమ్మదిగా ఇలా అన్నారు: “నేను దేహం త్యజించాక నన్ను అక్కడ దహనం చేయండి!”
జూలై 2వ తేదీ. ఏకాదశి. ఆ రోజు స్వామీజీ ఉపవాసం చేశారు. కాని ఆ రోజు ఉదయం అక్కడకు వచ్చిన నివేదితకు భోజనంలో అన్ని వంటకాలూ తామే స్వయంగా వడ్డించారు. ఆమె తింటున్నప్పుడు ప్రక్కనే కూర్చుని తమాషాగా మాట్లాడారు. భోజనం తిన్న తరువాత ఆమె చేతులు కడుగుకోవడానికి ఆయనే నీళ్లు పోశారు, తుండుగుడ్డతో ఆమె చేతులు తుడిచారు. “స్వామీజీ! ఇవన్నీ నేను కదా మీకు చేయాలి! మీరు నాకు చేయడమా?” అని నివేదిత అడిగింది.
“ఎందుకు! ఏసుక్రీస్తు తమ శిష్యుల కాళ్లను కడిగారు కదా!” అని మృదు స్వరంలో అయినప్పటికీ దృఢంగా చెప్పారు స్వామీజీ. “కాని… అది… ఆయన చివరి రోజు!” అనే మాటలు నివేదిత నోటి దాకా వచ్చి ఆగిపోయాయి.
ఈ రోజుల్లో స్వామీజీ ఆహ్లాదంగానే ఉన్నారు. తమ అనుంగు ప్రాణుల తోనూ, తోటలోనూ సమయం వెచ్చించారు.
‘ఇంకొక వివేకానంద ఉంటే…
జూలై 4వ తేదీ, శుక్రవారం. అన్ని రోజుల్లా ఆ రోజూ ఉదయించింది. కాని దాని గర్భంలో ఎంత శోకం దాగి ఉందో ఎవరికీ తెలియదు! అలవాటు ప్రకారం వేకువజామున 3 గంటలకు స్వామీజీ లేచారు. తరువాత టీ త్రాగే సమయంలో తమ సోదర సన్న్యాసులతో పాత రోజుల గురించి ముచ్చటించారు. మర్నాడు శనివారం, అమావాస్య. కనుక ఆ రోజు కాళీపూజ చేయాలనే తమ అభిలాషను వ్యక్తం చేశారు. ఇంతలో రామకృష్ణానంద తండ్రిగారైన ఈశ్వరచంద్ర వచ్చారు. ఆయన గొప్ప సాధకుడు, కాళీ ఆరాధనలో నిష్ణాతుడు. మఠంలో కాళీపూజ చేయాలనే తమ అభిలాషను ఆయనతో స్వామీజీ వ్యక్తం చేశారు. బోధానందతోనూ, శుద్ధానందతోనూ అందుకైన ఏర్పాట్లు చేయమని చెప్పారు.
ఉదయం 8:30 గంటలు. స్వామీజీ పూజామందిరంలోని వెళ్లి అక్కడ ధ్యానమగ్నులైనారు. 9:30 గంటల సమయంలో ప్రేమానంద నిత్యపూజ నిమిత్తం అక్కడకు వచ్చారు. స్వామీజీ ఆయనతో తమ ఆసనాన్ని గురుదేవుల పడక గదిలో పరిచి, ఆ గది తలుపులు, కిటికీలు మూసివేయమని చెప్పారు. తక్కిన రోజుల్లో కూడా ఆయన ఆ వేళలో ధ్యానం చేయడం కద్దు, కాని తలుపులూ కిటికీలూ తెరిచే ఉండేవి. 11 గంటల దాకా మూసివున్న గదిలో స్వామీజీ ధ్యానంలో మగ్నులై ఉండిపోయారు! అక్కడ ఏం జరిగిందో ఎవరి కెరుక! “తాము నాకు అప్పగించిన పని పూర్తయింది, తమ పాదపద్మాల వద్దకు చేరుకొంటాను” అని గురుదేవులకు విన్నవించి ఉంటారా? ఏ కాళీమాత శక్తి తమను ఇన్ని పనులలో నిమగ్నం చేసిందో ఆ కాళీతో తమ మహాసమాధి సమయాన్ని చెప్పి ఉంటారా?
తలుపు తెరచుకొని బయటకు వచ్చిన స్వామీజీ ఆనందంగా కనిపించారు. కాళీమాత మీద ఒక అందమైన పాట పాడుకొంటూ మెట్ల గుండా క్రిందికి దిగారు.
ఏదో సుదీర ప్రాంతాన సంచరిస్తున్నట్లుగా ఆయన కానవచ్చారు. క్రిందికి వచ్చిన ఆయన అలవాటు ప్రకారం కూర్చునే మామిడి చెట్టు క్రింది పచార్లు చేశారు. ప్రక్కనే ప్రేమానంద ఉన్నారనే స్పృహే లేకుండా ఇలా అన్నారు:
“ఈ వివేకానంద ఏం చేశాడో ఎవరికి తెలుసు? బహుశా మరో వివేకానంద ఉండివుంటే ఆతడు అర్థం చేసుకోగలడు. అయితే ఏమిటి! కాలక్రమంలో ఎంద రెందరో వివేకానందలు ఉద్భవించనున్నారు!”
ప్రేమానంద ఆశ్చర్యచకితుడయ్యారు.
సుషుమ్నా గుండా…
ఆ తరువాత స్వామీజీ శుద్ధానందను గ్రంథాలయం నుంచి శుక్లయజుర్వేద సంహిత తెమ్మన్నారు. ఆయన తెచ్చి ఇవ్వగానే దాన్లో నుంచి ‘సుషుమ్నః సూర్య రస్మి’ అని ప్రారంభమయ్యే విభాగాన్ని చదవమన్నారు. పిదప ఆ మంత్రానికి మహీధరుని వ్యాఖ్యను చదవమన్నారు. దానిని చదివినప్పుడు స్వామీజీ, “ఈ వ్యాఖ్యను నేను ఆమోదించను. ‘సుషుమ్నః’ మాటకు ఈ వ్యాఖ్యాత ఏ వివరణనైనా చెప్పనీ! నాకేమో, తదనంతర కాలంలో తంత్రశాస్త్రాలు వచించే ‘సుషుమ్నా నాడి’ అనే భావన బీజం ఇక్కడున్నట్లు అనిపిస్తోంది. మీరూ, నా శిష్యులూ శాస్త్రాలకు నూతన వివరణలు ఇవ్వాలి” అన్నారు.
స్వామీజీ పఠించిన మంత్రం ఇది:
సుషుమ్నః సూర్య రస్మిః చంద్రమా గంధర్వతస్య నక్షత్రాణి అప్సరసో భేగురయో నామ । స న ఇదం బ్రహ్మ క్షత్రం పాదు తస్మై స్వాహా వట్ తాభ్యః స్వాహా ॥ – “గంధర్వ రూపంలోని చంద్రుడే సుషుమ్నా. యజ్ఞాలు చేసేవారికి ఆతడే సుఖాన్నిస్తున్నాడు. ఆతడి కిరణాలు సూర్యకిరణాల్లా ఉన్నాయి. ఆ చంద్రుడు బ్రాహ్మణులూ క్షత్రియులూ అయిన మిమ్మల్ని పరిరక్షిస్తాడు గాక! మేం మా ఆహు తులను ఆయనకు అర్పిస్తున్నాం. ఆయన అప్సరసలు నక్షత్రాలను ప్రకాశింపచేసే వారికీ మా ఆహుతులు అర్పిస్తున్నాం.”
మహీధరుని వివరణ ఏమిటో! స్వామీజీ గ్రహించింది ఏమిటో! కాని ఆయన సుషుమ్నా అని వచించడంలో ఒక్క విషయం స్పష్టం – ఆయన యోగమార్గంలో ఆ సుషుమ్నా గుండా తమ ప్రాణం వదలిపెట్టడానికి సిద్ధమయ్యారు!
సామాన్యంగా మధ్యాహ్న భోజనంలో స్వామీజీ తమ గదిలోనే తినేవారు. కాని ఆ రోజు అందరితో కలసి భుజించారు. భుజిస్తున్నప్పుడు తమాషాగా మాట్లాడి అందరినీ ఆనందంలో ముంచెత్తారు. “నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్నందున నేడు ఆకలి ఎక్కువయింది. వంట పాత్రలను వదలిపెడితే చాలు అనిపిస్తోంది” అన్నారు. భోజనానంతరం కాసేపు విశ్రమించి, అలవాటుకు దాదాపు అరగంట ముందే సంస్కృత తరగతి నిర్వహించసాగారు. తామే బ్రహ్మచారుల గదులకు వెళ్లి వారిని పిలుచుకొని వచ్చారు. నిర్విరామంగా వరదరాజు రచించిన “లఘు సిద్ధాన్త కౌముది” అనే సంస్కృత వ్యాకరణ గ్రంథం నేర్పించారు. అందులో కూడా మధ్య మధ్యలో తమాషా కథలు జోడించి నేర్పించి, బ్రహ్మచారు లెవరూ అలసిపోకుండా చూసుకొన్నారు. ఇలా వినోదం జోడించి, తమ మిత్రుడైన దాశరథీ సన్న్యాల్కు తాము ఒకే రోజులో ఆంగ్ల చరిత్రను నేర్పించిన వైనం గురించి చెప్పారు.
‘బాగా ఉన్నాను!’
సాయంత్రం దాదాపు 4 గంటలప్పుడు కాస్త వేడిగా ఉన్న పాలు, నీళ్లు త్రాగారు. పిదప ప్రేమానందతో దాదాపు మైలు దూరం బేలూర్ బజారు వీథి ఉన్న దిశలో నడిచారు. దారిలో ఒక తోట ఆలనాపాలనా లేకుండా ఉంది. దానిని చూసి అమెరికాలో రిడ్జ్లీ మేనర్లోని తోటను ఎంత బాగా, అందంగా చూసు కొనేవారో చెప్పారు. యంత్రాలు ఎక్కువగా ఉండడం వలన మనుషులు ఎక్కువ అవసరం లేదని ఎత్తి చూపించారు. తరువాత ఒక వేదపాఠశాలను స్థాపించాలనే తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడు ప్రేమానంద, “వేదాధ్యయనం వలన ప్రయోజనమేమిటి?” అని అడిగారు. “మూఢనమ్మకాలు నిర్మూలమవుతాయి” అని స్వామీజీ జవా బిచ్చారు. వేదగ్రంథాలు కొనుగోలు చేయడానికి క్రితం రోజే ఆయన బొంబాయికీ, పుణేకీ లేఖలు వ్రాశారు. తరువాత మానవ నాగరకతల వికాసం గురించి మాట్లాడుతూ అన్ని దేశాల చరిత్రల నుంచి ఉదాహరణలు చూపించారు.
సాయంత్రం 5:30 గంటలు అయింది. ఇద్దరూ మఠానికి తిరిగి వచ్చారు. తరువాత స్వామీజీ ఐరోపా నాగరకత గురించి మాట్లాడారు. ఆ సమయంలో సాయంత్ర హారతి గంటలు మ్రోగాయి. ప్రేమానంద పూజ చేయడానికి వెళ్లారు. స్వామీజీ కాసేపు ఈశ్వరచంద్రతో మాట్లాడారు. తూర్పు వంగదేశం నుంచి వచ్చిన విరజేంద్ర అనే యువకుడు అప్పుడు స్వామీజీకి సేవలందిస్తున్నాడు. ఆతడితో స్వామీజీ, “ఈ రోజు నా ఒళ్లు తేలికగా ఉంది. నేను బాగా ఉన్నాను” అన్నారు. తిన్నగా మేడ మీది తమ గదికి వెళ్లి తమ జపమాల తెమ్మన్నారు విరజేంద్రతో. తరువాత ఆతడితో బయట కూర్చుని ధ్యానం చేయమని చెప్పి తామూ ధ్యానంలో మగ్నులయ్యారు. అలవాటుకు మారుగా ఆ రోజు ఆయన వాయవ్యముఖంగా కూర్చున్నారు.
నిష్క్రమిస్తున్నారు!
దాదాపు 6:30 గంటలు అయింది. శిష్యుణ్ణి పిలిచి, వేడిగా ఉందనీ గది కిటికీ తలుపులన్నీ తెరచి ఉంచమన్నారు. అప్పుడు ఆయన చేతిలో జపమాల ఉంది. తరువాత ఆయన తమ తలకు కాస్త విసరమన్నారు. కాసేపు విసిరిన తరువాత, “చాలు, ఇక విసరనక్కర్లేదు. నా కాళ్లు కాస్త ఒత్తు” అన్నారు. శిష్యుడు కాళ్లు ఒత్తుతున్నప్పుడు స్వామీజీకి కాస్త నిద్రపట్టినట్లుంది.
స్వామీజీ ఎడమవైపుగా పడుకొన్నారు. సమయం గడవసాగింది. ఒకే ఒకసారి తిరిగి కుడివైపు పడుకొన్నారు. హఠాత్తుగా ఆయన చేతులు ఒకసారి వణికాయి, కలగన్న పిల్లవాడు మెల్లని స్వరంలో ఏడ్చినట్లుగా స్వామీజీ నుంచి శబ్దం వినవచ్చింది. కాసేపట్లో దీర్ఘంగా శ్వాసించారు. ఆయన తలగడ మీద తల వాలింది. మళ్లీ ఒకసారి అదేవిధంగా దీర్ఘంగా శ్వాసించారు. తరువాత అంతా నిశ్శబ్దం! సమయం దాదాపు 9 గంటలు.
స్వామీజీ సమాధిలో మగ్నులైనారని విరజేంద్ర భావించాడు. అయినప్పటికీ కాస్త ఆందోళనతో క్రిందికి పరుగెత్తి అద్వైతానందను తోడ్కొని వచ్చాడు. ఆ సమయంలో రాత్రి భోజనానికి గంట మ్రోగింది. అందరూ వచ్చి స్వామీజీని చూశారు. అద్వైతానంద స్వామీజీ నాడిని పరీక్షించారు. ఆయనకు ఏమీ అర్థం కాలేదు. ప్రేమానందను పరీక్షించమన్నారు. నాడీ స్పందన ఆగివుంది!
ఆయన సమాధిమగ్నులైనట్లుగా భావించి అందరూ శ్రీరామకృష్ణుల దివ్య నామాన్ని బిగ్గరగా ఆయన చెవుల వద్ద ఉచ్చరించారు. ఫలితం శూన్యం. తరువాత నాడీ స్పందనను చూడమని అద్వైతానంద బోధానందతో చెప్పారు. నాడీ స్పంద నను పరీక్షించిన బోధానంద ఓ అంటూ ఏడ్వసాగాడు. నిర్భయానందతో, “అయ్యో! ఏం చేస్తున్నావు? పరుగెత్తి డాక్టర్ మహేంద్రను తోడ్కొనిరా” అని చెప్పాడు. ఆయన వెళ్లగానే మరొకరు బలరాం బోస్ ఇంట్లో ఉన్న బ్రహ్మానందను, శారదానందను తోడ్కొని రావడానికి వెళ్లారు. వారిద్దరూ రాత్రి 10:30 గంటలకు వచ్చారు.
బ్రహ్మానంద రాగానే జరిగింది గ్రహించారు. స్వామీజీ ఛాతీ మీద పడి “మహోన్నత హిమాలయం దృష్టి నుంచి కనుమరగయింది” అంటూ విలపించారు.
డాక్టర్ వచ్చి పరీక్షించి, కృత్రిమంగా శ్వాసను మళ్లీ తెప్పించడానికి ప్రయత్నించాడు. ప్రయోజనం లేకపోయింది. స్వామీజీ నిష్క్రమించినట్లు ఆతడు ప్రకటించాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి 12 గంటలు.
స్వామీజీ మరణానికి కారణం గుండెపోటు అని డాక్టర్ మహేంద్రనాథ్ తెలియజేశాడు. మర్నాడు ఉదయం వచ్చిన బిపిన్ చంద్రఘోష్ మెదడులో రక్తస్రావం (apoplexy) కారణంగా ఆయన మరణించినట్లు చెప్పాడు. ఆయన నాసికా పుటాలలోనూ, నోట్లోనూ కాస్త రక్తం స్రవించి ఉంది. మెదడులో ఏవో రక్తనాళాలు చిట్లినందు వలన ఇది సంభవించి ఉండవచ్చునని మరొక డాక్టర్ అభిప్రాయపడ్డాడు.
ఇవి భౌతిక కారణాలు. నిజానికి ఆయనది ఇచ్ఛా మరణం. అమరనాథ్ శివుణ్ణి దర్శించి అందుకోసం వరం పొందిన వ్యక్తి కదా ఆయన! తమ నిష్క్రమణ గురించి ఆయన అనేక విషయాలు చూచాయగా తెలిపే ఉన్నారు! “ఆయన సమాధి స్థితిలోనే తమ దేహాన్ని త్యజించారు. అది సాధారణ మరణం కాదు, ఎరుకతోనే ఆయన దేహం నుంచి వెలుపలకు వెళ్లిపోయారు” అని తురీయానంద వ్రాశారు!
మొత్తానికి స్వామీజీ నిష్క్రమించారు!
అప్పుడు స్వామీజీ వయస్సు 39 సంవత్సరాల 5 నెలల 24 రోజులు! ఆయన 40వ ఏటిని చూడలేదు.
వచ్చింది కరిగిపోయింది!
స్వామీజీ పావన దేహంలో మరణానంతరం మార్పులు పెద్దగా లేవు. ఏదో వ్యాధి మూలంగా మరణించినట్లుగా ఆయన దేహం కనిపించలేదు. “ఆ ముఖంలో ఎంత ప్రకాశం తేజరిల్లేది! ఆ విశాల నేత్రాలు ఎలాంటి దివ్య జ్యోతుల్లా భాసిల్లాయి! కౌపీనం మాత్రమే ధరించిన ఆయన పావన దేహం అనుగ్రహమనే పవిత్రరూపంగా విరాజిల్లింది. మర్నాడు కూడా ప్రకాశం తగ్గలేదు. సాక్షాత్తూ పరమేశ్వరుడు శయనించినట్లుగా ఆ దృశ్యం కానవచ్చింది!” అంటూ వ్రాస్తున్నారు ప్రేమానంద. స్వామీజీ కళ్లు ఊర్ధ్వముఖంగా ఉన్నాయి. వాటి నుంచి దివ్యకాంతి ప్రసరిస్తునట్లు అనిపించింది. ఉదయం కళ్లు మందారంలా ఎర్రబారి కనిపించాయి.
ఉదయం వచ్చిన నివేదిత మధ్యాహ్నం స్వామీజీ పావన దేహాన్ని తీసుకువెళ్లే వరకు ప్రక్కనే కూర్చుని విసురుతూ ఉంది. భువనేశ్వరీ దేవికి కబురు పంపించారు. ఆమె తమ తల్లితోనూ, భూపేంద్రతోనూ జీవిస్తూన్నది. సమాచారం ముందుగా భూపేంద్ర విన్నాడు. తల్లితో చెప్పగానే ఆమె, “ఎలా జరిగింది?” అని అడిగారు. అందుకు భూపేంద్ర, “నాన్న మరణించినట్లే” అని జవాబిచ్చాడు. భువనేశ్వరీదేవి బేలూర్ మఠానికి వచ్చారు. ఆమె శోకం వర్ణనాతీతం. ఆమె శోకాన్ని భరించలేని సన్న్యాసులు ఆమెను బలవంతంగా ఇంటికి పంపించారు.
గిరీష్చంద్ర ఘోష్ వచ్చాడు. నిరంజనానంద ఆతడితో, “నరేన్ వెళ్లి పోయాడు” అన్నారు. అందుకు గిరీష్, “లేదు, ఆతడు వెళ్లిపోలేదు; దేహాన్ని త్యజించాడు” అన్నాడు.
మర్నాడు పత్రికలలో ఈ వార్త వెలువడింది. పాశ్చాత్యదేశాలకూ తంతి వార్తలు వెళ్లాయి. ప్రజలు తండోపతండాలుగా బేలూర్ మఠానికి రాసాగారు.
మధ్యాహ్నం స్వామీజీ పావన దేహానికి గంగాజలంతో స్నానం చేయించారు. నూతన కాషాయాంబరాలు ధరింపజేశారు. పువ్వుల మాలలతో అలంకరించారు. తరువాత ఆయన పావన దేహాన్ని క్రిందికి తీసుకువచ్చారు. పాదాలకు ముదురు ఎరుపు వర్ణ ద్రవ్యం అలది, మస్లిన్ వస్త్రాలలో పాదాల ముద్రలు తీసుకోబడ్డాయి.
మంత్రఘోష మిన్నుముట్టింది, శంఖ ధ్వానం వినిపించింది, గంటలు మ్రోగాయి, సాంబ్రాణీ పొగ లేచింది, హారతి జరిగింది.
స్వామి వివేకానంద అనే మహోన్నత వ్యక్తి జీవించిన ఆలయమయిన ఆయన పావన దేహానికి చివరిసారిగా అందరూ ఒకసారి నమస్కరించారు.
తరువాత “అదిగో, అక్కడ దహనం చేయాలి” అంటూ స్వామీజీయే గతంలో చూపించిన బిల్వవృక్షం క్రిందికి ఆయన పావన దేహాన్ని తీసుకువెళ్లారు.
సమస్తాన్నీ పవిత్రీకరించే అగ్ని నాడు ఆ దేవర్షి జీవించిన పావన దేహాన్ని స్వీకరించి తననే పవిత్రీకరించుకొన్నది!
జై శ్రీ గురుమహరాజ్జీకీ జై!
జై శ్రీ స్వామీజీ మహరాజ్జీకీ జై!
అన్న నినాదాలు మిన్నుముట్టాయి.
“నిజంగానే స్వామీజీ నిష్క్రమించారా?”
అదెలా సాధ్యం?
జీవిస్తున్నారు
“చిరిగిన వస్త్రాన్ని తీసి విసిరివేసేటట్లు నా దేహాన్ని విసిరివేయడం మంచిదని ఒకరోజు నాకు అనిపించవచ్చు. కాని నేను పనిచేయడం ఆపను. లోకంలోని మనుషులకు ప్రేరణనిస్తూనే ఉంటాను. వారందరూ తాము భగవంతునితో సమైక్యమైనట్లు గ్రహించే దాకా నేను శ్రమి స్తూనే ఉంటాను!” అన్న వ్యక్తి నిష్క్రమిస్తారా?
స్వామీజీ మహాసమాధి చెందిన రాత్రి నివేదిత నిద్రిస్తూన్నది. ఆమెకు ఒక కల వచ్చింది – శ్రీరామకృష్ణులు మళ్లీ ఒకసారి మహాసమాధి పొందుతున్నారు! ఇదేమిటో అర్థంకాక దిగ్భ్రమతో లేచి నిలబడ్డ నివేదితకు మర్నాడు ఉదయం స్వామీజీ మరణ వార్త అందింది!
స్వామీజీ తనకు కాషాయాంబరాలు ఇవ్వలేదన్న వ్యథ నివేదితకు లేక పోలేదు. స్వామీజీ పావనదేహం చితిలో దహింపబడుతున్నప్పుడు హఠాత్తుగా స్వామీజీ కాషాయాంబరాల నుంచి ఒక ముక్క గాలిలో తేలుతూ వచ్చి నివేదిత ఒడిలో పడింది.
స్వామీజీ మహాసమాధి పొందిన దాదాపు అదే సమయంలో ఆయనకు ప్రీతిపాత్రుడైన రామకృష్ణానంద చెన్నై శ్రీరామకృష్ణ మఠంలో ధ్యానం చేస్తున్నారు. అప్పుడు స్వామీజీ వాణి ఆయనకు స్పష్టంగా వినిపించింది – “శశీ! నేను దేహాన్ని త్యజించాను” అని!! మర్నాడు ఉదయం స్వామీజీ మరణ వార్త తెలుపుతూ తంతి అందింది!
ఒక సంఘటనా, రెండు సంఘటనలా? ఆయన జీవిస్తూ ఉండడాన్ని నిరూపించే ఎన్నెన్నో సంఘటనలు, ఎందరెందరో ఆప్తుల జీవితాలలో నాడూ నేడూ జరుగుతూనే ఉన్నాయి!
అందుకే కదా అఖండానంద ఇలా చెప్పారు: “శ్రీరామకృష్ణులూ, స్వామీజీ ఈ యుగ ప్రత్యక్ష దైవాలు! శ్రీరామకృష్ణులు సాక్షాత్తూ భగవంతుడు, దాన్లో కించిత్తు కూడా సందేహం లేదు. ఆయనను దర్శించడం సులభం కాదు. కాని స్వామీజీని దర్శించడం సులభం, అందుకోసం ఆయన సదా సర్వవేళలా తయారుగా ఉన్నారు! తమ గదిలో సూక్ష్మరూపంలో ఆయన సదా జీవిస్తూనే ఉన్నారు! మనకు సమీపంలో, అతి సమీపంలో పచార్లు చేస్తున్నారు!”