నా శిష్యులు వేయిసార్లు నరకానికి వెళ్లినా, ప్రతిసారీ నేను వారిని అక్కణ్ణుంచి ఉద్ధరిస్తాను.
– స్వామి వివేకానంద
సమస్తాన్నీ దాచారు — ‘మాయతో క్రీడిస్తున్నాను’ — అన్ని మనస్సులలో నెలకొన్న వ్యక్తి — మంత్ర దీక్ష — ధ్యాన విధానం! — రెండు పడవల్లో ప్రయాణం — భవిష్యత్తు అంచనాలు — ముక్తీ బంధమూ — నరకానికి వెళ్లినా….
సమస్తాన్నీ దాచారు
“స్వామీజీ అందరిచే ఆరాధింపబడవలసిన వ్యక్తి. వాక్ శక్తి గలవారు. మహా త్ముడు, దేశభక్తితో యావన్మంది హృదయాలనూ దోచుకొన్నవారు. ఇంతటి మహాశక్తిమంతుడైన ఒకరిని చూడగలమో లేమో తెలియదు. ఆయన చిన్న తమ్ముడైన భూపేంద్రనాథ్ దత్తా దేశభక్తిని ఆయన ప్రధాన లక్షణంగా కొనియాడారు. పెద్ద తమ్ముడైన మహేంద్రనాథ్ దత్తా ఆయన ఆధ్యాత్మిక శక్తికే ప్రాధాన్యమిచ్చారు. మహేంద్రుని పుస్తకాల్లో ఇది తేటతెల్లంగా కనిపిస్తుంది. స్వామీజీ సాన్నిధ్య భాగ్యం పొందిన ప్రతి ఒక్కరూ ఆయన ప్రతి పరిమాణంలోనూ మునిగిపోయారు. ప్రతిదీ పరిపూర్ణ తను సంతరించుకొన్నది, అదే పూర్తిగా ఆయనలా ఇతరులకు అనిపించింది. కాని ఆయన ఈ పరిమాణాలన్నింటినీ అతిక్రమించిన వ్యక్తిలా ఊరేగి వచ్చారు. ఆయన సోదర సన్న్యాసి ఒకరు నాతో, “ ‘మీ స్వామీజీ ఏం చేశారని తెలుసుకోవడానికి వేయి సంవత్సరాలు పడుతుంది’ అన్నారు” అని వ్రాస్తున్నారు స్వామీజీ గృహస్థ శిష్యులలో ఒకరైన మన్మథనాథ్ గంగోపాధ్యాయ్.
కాని పాశ్చాత్య దేశాల నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత స్వామీజీ తమను పూర్తిగా మరుగుపరచుకొన్నారనే చెప్పాలి. తమ ప్రపంచ పరి మాణం, భారత పరిమాణం యావత్తూ గోప్యపరచి ఒక సామాన్యునిలా చివరి రోజులు ఆయన గడిపారు.
స్వామీజీకి సన్న్యాస శిష్యులు ఉన్నట్లే పలువురు గృహస్థ శిష్యులూ ఉన్నారు. వారికీ మంత్రదీక్ష ప్రసాదించి వారినీ ఆధ్యాత్మిక జీవితంలో పురోగమింపజేశారు. వారిలో కొందరి గురించిన సమాచారం మాత్రమే లభించింది. స్వామీజీ గృహస్థ శిష్యులలో అగ్రగణ్యుడు అలసింగ. ఆయనను గురించి ఇంతకు క్రితమే చూశాం. స్వామీజీ అద్భుతమైన అనేక పరిమాణాలను, తాము ఆయనతో జరిపిన సంభాష ణల ద్వారా బయటి ప్రపంచానికి అందించిన వ్యక్తి శరశ్చంద్ర చక్రవర్తి. ఈయనను గురించి ఇంతకు ముందే కొన్ని అధ్యాయాలలో చూశాం. తక్కిన గృహస్థ శిష్యులలో కొందరి స్మృతులను క్లుప్తంగా చూద్దాం.
మన్మథనాథ్ గంగోపాధ్యాయ్
ఒకరోజు స్వామీజీ నాతో, “నువ్వు ఏం అడగాలనుకొన్నావో అడుగు” అన్నారు.
నేను : మీరు ఇంగ్లండ్‌లో మాయ గురించి ప్రసంగించారు. దానిని నేను పలుమార్లు చదివాను. కాని మాయ అంటే ఏమిటో మాత్రం అర్థం కాలేదు.
స్వామీజీ : దేనిలో చదివావు?
నేను : ఇండియన్ మిర్రర్లో చదివాను.
స్వామీజీ : ఇదిగో చూడు, మాయ ఏమిటన్నది అర్థం చేసుకోవడం ఒకటి, మాయను అనుభవించడం మరొకటి.
నేను : మీ వద్ద మాయ రహస్యాన్ని తెలుసుకోగోరుతున్నాను.
స్వామీజీ కాసేపు మౌనం వహించారు. తరువాత “ఆ అంశం అలా ఉంచు. మరేదన్నా తెలుసుకోగోరితే అడుగు” అన్నారు.
నేను : మీ లాంటి బ్రహ్మజ్ఞానులు వివరించినప్పటికీ నేను అర్థం చేసుకోలేక పోయానంటే ఈ జన్మలో నేను మాయ రహస్యాన్ని తెలుసుకోకుండానే పోతాను.
ఆ తరువాత స్వామీజీ మాయ గురించి విపులీకరించారు. ఆయన వివరణ తరువాత అంతా మాయే అని నాకు అవగతమయింది. స్వామీజీ, మఠం, నేను అన్నీ ఆ మాయలోని ఒక అంశమని అనిపించింది.
నేను : స్వామీజీ! అలా అయితే మీరు కూడా మాయలోనే ఉన్నారు. మీ మఠం, పాఠశాల, పేదల సేవ లాంటి సమస్తమూ మాయే కదా! వీటినన్నీ మీరెందుకు చేయాలి?
‘మాయతో క్రీడిస్తున్నాను’
స్వామీజీ (నవ్వుతూ) : నిజమే, నువ్వు సరిగ్గానే చెప్పావు. నేనూ మాయా ధీనుణ్ణే. కాని ఒక విషయం, నేను మాయతో క్రీడిస్తున్నాను. అనుకొన్న మరుక్షణంలో ఈ క్రీడకు స్వస్తి చెప్పగలను. నీకూ మాయతో క్రీడించాలని ఉందా? అలా అయితే కొండ ప్రాంతా లకు వెళ్లి అక్కడ ఏదో గుహలో తపస్సు చేయి.
స్వామీజీ కొనసాగించారు: “భగవంతుణ్ణి అనుభూతం చేసుకొన్న తరువాత కార్యాచరణలో నిమగ్నమైతే అది లీల, క్రీడ. అది ఆనందమయమైన జీవితం. పరమార్థాన్ని అనుభూతం చేసుకోనంత దాకా తపస్సు, త్యాగం లాంటి వాటి తోడ్పాటుతో పదే పదే ప్రయత్నించాలి, ధ్యానం అనుష్ఠించాలి.”
అన్ని మనస్సులలో నెలకొన్న వ్యక్తి
మధ్యాహ్న భోజన వేళ సమీపించింది. స్వామీజీ కోసం అందరూ వేచివు న్నారు. ఆయన రాగానే వడ్డించసాగారు. స్వామీజీ వంటశాలలోకి వెళ్లి ఒక ఆపిల్ పండు, కత్తి తెచ్చి వసారాలో నడుస్తూ దాని చెక్కు తీయ సాగారు. తరువాత పండును ముక్కలు చేసి ఒకటి రెండు ముక్కలు నోట్లో వేసుకొన్నారు. నాకూ ఒకటి రెండు ముక్కలు ఇచ్చారు. స్వామీజీ ప్రసాదం పుచ్చుకోవడం ఆనందంగా ఉంది.
స్వామీజీ చేతుల మీదుగా అన్నప్రసాదం స్వీకరించాలనే ఆకాంక్ష నాలో తీవ్రంగా ఉంది. తరువాత అందరం భోజనానికి కూర్చున్నాం. స్వామీజీ కూడా కూర్చున్నారు. కాస్త దూరంలో భక్తుల పంక్తిలో నేను కూడా కూర్చున్నాను. వడ్డిస్తున్న బ్రహ్మచారిని హఠాత్తుగా స్వామీజీ పిలిచి, తమ కంచం నుంచి ఒక కబళం అన్నం ముద్దను అతడికి ఇచ్చి, “ఇది మన్మథ్‌కు ఇచ్చిరా” అన్నారు. నా కళ్లు ఆర్ద్రమైనాయి. సకల మనస్సులలో నెలకొని ఉన్నవారు కదా స్వామీజీ! నేను నోరు విప్పి అడగకుండానే నా ఆకాంక్ష తీర్చారు ఆయన.
మంత్ర దీక్ష
ఆ రోజు రాత్రి మఠంలోనే బస చేశాను. ఉదయం స్వామీజీ నాతో, “గంగలో స్నానం చేసి చప్పున రా” అన్నారు. నేను చప్పున స్నానం చేసి వచ్చి ఆయన గదిలోకి వెళ్లాను. అప్పుడు స్వామీజీ సోఫాలో పడు కొని ఉన్నారు. తమ కుడిచేతిని చాచి, “నన్ను పట్టుకో, నా చేయి పుచ్చుకో” అన్నారు. నా కుడి చేత్తో ఆయన చేయి పుచ్చుకొని నేల మీద కూర్చున్నాను. కాసేపు కళ్ళు మూసుకొని స్వామీజీ పడుకొన్నారు. నేను అంత ర్ముఖుణ్ణి కాసాగాను.
కాసేపటి తరువాత స్వామీజీ లేచి నేల మీద పరిచి ఉంచిన తివాచీ మీద కూర్చున్నారు. తమకు ముందున్న ఆసనంలో నన్ను కూర్చోమన్నారు. నేను కూర్చోగానే, “కలలో నువ్వు జగజ్జననిని బాలికగా దర్శించావు. ఆ తరువాత జగజ్జననిని రాజరాజేశ్వరిగా ధ్యానిస్తున్నావు” అన్నారు. ఈ విషయాలు నేను ఎవరితోనూ చెప్పింది లేదు. స్వామీజీ కొనసాగించారు. “ఆ తరువాత నువ్వు కలలో త్రిశూలధారియైన పరమేశ్వరుణ్ణి దర్శించావు. ఆయన నీకు ఈ ఫలానా మంత్రం అనుగ్రహించాడు. నువ్వు దానిని జపం చేస్తున్నావు” అన్నారు. ఒకటి వెంట ఒకటిగా అంతా స్వామీజీ వెల్లడించినప్పుడు నేను ఆశ్చర్యచకితుణ్ణయ్యాను! నేను చెప్పకుండానే నా జీవితం ఆయనకు కరతలామలకమయింది!
ధ్యాన విధానం!
ఆ తరువాత స్వామీజీ, “ఇకపై నీ మంత్రం ఇది. ఈయన నీ ఇష్టదేవత” అంటూ నాకు యుక్తమైన మంత్రం ఉపదేశించి దీక్ష ఒసగారు. ఎలా సాధనలు అనుష్ఠించాలో వివరించి చెప్పారు: “ముందుగా గురువుకు మానసికంగా ప్రణమిల్లాలి. పిదప గురువును ధ్యానించాలి. అందుకు తగిన స్థలం సహస్రారం. తరువాత దీక్షా మంత్రాన్ని జపించాలి, దానితోబాటు ఆయన పావన ఆకృతిని ధ్యానించాలి. ఆయన పాద పద్మాల నుంచి భావింప నారంభించాలి, క్రమక్రమంగా ఆయన పావన దేహాన్ని ఒక్కొక్క అంగంగా ధ్యానిస్తూ ముఖం దాకా వెళ్లాలి. ధ్యానం తీవ్రమైనప్పుడు కాళ్లు చేతులు అంటూ ఏవీ కనిపించవు. ఇష్టదేవత పావనరూపం ఉన్నంత దాకా నిర్వికల్ప సమాధి కలుగదు. కాని ఒకటి వెంట ఒకటిగా క్రమక్రమంగా వెళ్లాలి. లేకపోతే దీర్ఘకాలం పడుతుంది.”
దీక్ష ముగియగానే, “నా ప్రక్కన కాసేపు కూర్చుని జపధ్యానాలు అనుష్ఠించు. ఒక విషయం మాత్రం విస్మరించకు. పనులలో నువ్వు ఎంత ముమ్మరంగా ఉన్నప్పటికీ నిత్యం జపధ్యానాలు అనుష్ఠించకుండా ఉండవద్దు” అన్నారు.
రెండు పడవల్లో ప్రయాణం
ఒకరోజు స్వామీజీ నాతో, “ఇదిగో చూడు! రెండు పడవల్లో కాళ్లు ఉంచకు. ఏదో ఒకటి ఎంచుకో” అన్నారు. అంటే వివాహం చేసుకొని సంసార జీవితం గడపాలి, లేదంటే సన్న్యాసం పుచ్చుకోవాలి. రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకొని జీవించాలి. అటూ ఇటూ ఊగిసలాడడం స్వామీజీకి సుతరామూ నచ్చదు. నేను అట్లే ఇక్కడో అక్కడో స్థిరంగా ఉండకుండా జీవిస్తున్నాను. అది గ్రహించి, “తొందరపడవద్దు. బాగా ఆలోచించుకో. కాని ఏదో ఒకదాన్లో మనస్సును ఏకాగ్రం చేయి” అన్నారు. ఈ సంఘటన జరిగిన ఏడాది తరువాత నాకు వివాహం జరిగింది.
భవిష్యత్తు అంచనాలు
ఒకరోజు స్వామీజీ ఇలా అన్నారు: “పని చేయడానికి ఇక మీదట ఈ శరీరం నిష్ప్రయోజనం. దీనిని త్యజించి నూతన దేహాన్ని ధరించి రావాలి. ఇంకా అనేక పనులు మిగిలి ఉన్నాయి.” మరో రోజు, “నేను ముక్తిని కోరడం లేదు. సమస్త ప్రాణికోటికీ ముక్తి లభించే వరకు నేనే మళ్లీ వస్తూనే ఉండాలి” అన్నారు.
చైనా ఆంతరంగిక సమస్యలతో తల్లడిల్లిపోతున్న సమయం అది. పాశ్చాత్య దేశాలు చైనాను ఖండఖండాలు చేసి మ్రింగేట్లు కానవచ్చింది. జపాన్ కూడా ఆ దేశాలతో జతకట్టింది. ఒక రోజు నేను స్వామీజీతో, “ఇంతటి ప్రాచీన పారంపర్యత గల ఈ దేశం ఏమవుతుందో తెలియడం లేదు” అన్నారు. స్వామీజీ కాసేపు మౌనం వహించిన తరువాత ఇలా అన్నారు: “నాకొక దృశ్యం కనిపించింది – ఒక పెద్ద ఏనుగు పిల్లను ఈనింది. ఆ పిల్ల నేల మీద పడింది. చూస్తే అదొక సింహపు పిల్ల. అది పెరుగుతుంది, అంటే ఒక క్రొత్త చైనా దాన్లో నుంచి రూపొందుతుంది.”
భారతదేశం గురించి స్వామీజీ ఇలా చెప్పారు: “ఇంకా యాభై ఏళ్లలో భారతదేశం స్వాతంత్ర్యం పొందుతుంది. కాని సామాన్యంగా దేశాలు ఎలా స్వాతంత్ర్యం పొందుతున్నాయో ఆ రీతిలో కాదు. ఇంకా ఇరవై ఏళ్లలో గొప్ప యుద్ధం సంభవిస్తుంది. వస్తుసంపత్తిని పెంపొందించుకోవడమనే లక్ష్యం నుంచి (materialism) పాశ్చాత్య దేశాలు వైదొలగక పోతే యుద్ధం అనివార్యం. స్వాతంత్ర్యం పొందిన తరువాత భారతదేశం పాశ్చాత్య దేశాల పై లక్ష్యాన్ని అనుసరిస్తుంది. ప్రాచీన పారంపర్య ఘనతను ఈ ఆధునిక భారతం పాడుచేస్తుంది. అదే సమ యంలో అమెరికా ప్రభృత దేశాలు క్రమక్రమంగా ఆధ్యాత్మికమయమవుతాయి. భౌతిక సంపత్తిని బాగా సంచితం చేసుకొని వారు సుఖభోగాల పరాకాష్ఠకు చేరు కొన్నారు. ‘బాహ్య వస్తువులతో మానసిక ప్రశాంతత లభించదు’ అనే విషయం వాటిని అనుభవించిన తరువాతనే వారు గ్రహిస్తారు.”
ముక్తీ బంధమూ
ఒక రోజు నేను “స్వామీజీ! ముక్తిని గురువు ప్రసాదిస్తాడా లేదా మనిషి తన సాధనానుష్ఠానాలతో పొందుతాడా?” అని స్వామీజీని అడిగాను. అందుకు స్వామీజీ ఇలా అన్నారు : “మనిషి తన ఇచ్ఛ మేరకే బద్ధుడవుతున్నాడు. బద్ధుడయి నందు వల్లనే ఆతడు మనిషిగా ఉన్నాడు! నిజానికి అతడు అనంతుడైన పరమాత్మను ఆధారం చేసుకొన్నవాడు. అతడే తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని కల్పించుకొని తనను పరమాత్మ నుంచి భిన్నునిగా చూసుకొంటున్నాడు. ఎందుకిలా జరుగుతున్నది? ఇందుకు జవాబు లేదు. ఇది మనిషి ఇష్ట ప్రకారం జరగడం లేదు, మరేదో శక్తి వల్ల జరుగుతున్నదంటే, ఆ శక్తే మాయ. మాయ శక్తి వలననే మనిషి తనను పరమాత్మ నుంచి భిన్నునిగా చూసుకొంటున్నాడు. ఈ మాయ శక్తి ఎన్నో విధాలుగా పని చేస్తున్నది. మనిషి అల్పశక్తి ఒక బిందువు లాంటిది. అతడు ఒంటరిగా ఏం చేయగలడు? అందుకే మాయ క్రీడలో మైమరచి తాను ఎక్కణ్ణుంచి వచ్చాడో మరచిపోతున్నాడు…
“పిల్లలను చూసివున్నావా? స్తంభాన్ని పట్టుకొని గిరగిరా తిరుగుతారు. తిరుగుతూ, ‘నన్ను విడిపించండి’ అంటూ కేకపెడతారు. పెద్దలు ఏం చేస్తారు? నవ్వుకొంటూ ఆ ఆటను చూసి ఆనందిస్తారు. అదే విధంగా మనిషి – తన కాంక్షల ఉద్వేగంలో మునిగి ఉన్నాడు; పైగా ‘కాపాడండి, కాపాడండి’ అంటూ ఆర్తనాదం చేస్తాడు. మాయ శక్తిని పట్టుకొనే అన్ని సుఖాలనూ మనిషి అనుభవిస్తు న్నాడు. అదే మాయతో, ‘నన్ను వదలి పారిపో’ అని కూడా చెబుతున్నాడు. అతణ్ణి రక్షించడానికి భగవంతుడు పరుగెత్తుకొంటూ వస్తాడా లేక క్రీడను చూసి ఆనంది స్తాడా? పిల్లవాణ్ణి స్తంభం నుంచి విడిపిస్తే చాలు, చుట్టడం దానంతట అదే ఆగిపోతుంది. అదే రీతిలో కోర్కెలను వదలించుకొంటే చాలు, ముక్తి దానంతట అదే లభిస్తుంది. కోర్కెలు వదలించుకోవాలనే ఆలోచన వచ్చిన తరువాతనే కదా ముక్తి గురించిన మాట! త్యాగం జనిస్తే చాలు ముక్తి లభించినట్లే!”
నేను : అలా అయితే గురువు ఏం చేస్తున్నాడు? అనుగ్రహాన్ని ఎందుకు అభిలషించాలి?
స్వామీజీ : ఏ మార్గం గుండా విమోచనం లభిస్తుందో మనిషి తనంతట తాను తెలుసుకోలేడు. అప్పుడు మార్గం తెలిసిన ఒకరిని ఆశ్రయిస్తాడు. ఆయన అతడికి మార్గం చూపుతాడు. ఆ మార్గంలో సాధనలు అనుష్ఠిస్తే ముక్తి బాటను చేరుకోగలడు. ఇది గురువు అనుగ్రహం కాక మరేమిటి?
నేను : మీ మాటల్లో సాధనలు అనుష్ఠించాలన్న ఒత్తిడి కనిపిస్తోంది. కాని భక్తి మార్గంలో భగవదనుగ్రహమే ఏకైక ఆలంబన.
స్వామీజీ : అసలు సంగతి ఏమిటో తెలుసా? మార్గాలు కోకొల్లలు. ఒక్కో మార్గంలో ఒక్కో భావన. పరిపూర్ణ భక్తి విశ్వాసాలు గల వ్యక్తికి, తాను ఏదీ చేయలేదు, అంతా గురువే చేస్తున్నాడని తోస్తుంది. కాని ఈ స్థితికి చేరుకోవడం చాలా కష్టం. ‘నేను, నేను’ అనే భావన ఉన్నంత దాకా సాధనలు ఉంటాయి, దాని పర్యవసానాలూ ఉంటాయి. సాధనలు పరిపక్వత చెందినప్పుడు ఇష్టదేవత దర్శనం కలుగుతుంది. భగవంతుణ్ణి అవగతం చేసుకొన్నప్పుడు గురువు యథార్థ నైజమూ అర్థమవుతుంది.
నేను : బ్రహ్మచర్యం పాటించకుండా భగవదనుభూతి దక్కదని విన్నాను. కాని ఈ కాలంలో అది సాధ్యమేనా? అలా అయితే మా లాంటి సామాన్యుల గతి ఏమిటి?
స్వామీజీ : బ్రహ్మచర్యం ఒక మార్గం. దాన్లోనే అనేక మార్గాలున్నాయి. మనశ్శరీరాలు పరిపూర్ణ పావనత్వం సంతరించుకొంటేనే భగవంతుణ్ణి అవగతం చేసుకోగలం. సన్న్యాసులు పరిపూర్ణ బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి. అది తక్కిన వారికి ఆదర్శంగా విరాజిల్లుతుంది. గృహస్థులూ శక్తి మేరకు నియమ బద్ధంగా జీవించాలి. నియమబద్ధమైన జీవితం నుంచి జాగృతి జనిస్తుంది. కేవలం విచారణ చేయడం వలనా, గ్రంథాలు అధ్యయనం చేయడం వలనా భగవంతణ్ణి అవగతం చేసుకోగలమా ఏమిటి?
నేను : బ్రహ్మచర్యమే ఆదర్శమైతే వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది కదా!
స్వామీజీ : మనిషి సంస్కారాలు శక్తిమంతమైనవి. వాటి ఉద్ధృతి కారణంగా మనిషి వివాహం చేసుకోవడానికి ప్రేరణ పొందుతున్నాడు. ఆ సంస్కారాల నుంచి కించిత్తు అయినా విడివడితే సన్న్యాసానికి అర్హుడవుతాడు. సంస్కారమూ ఉండి, దానితో గురువు శక్తీ సాధనల తోడూ ఉంటే మనిషి పురోగమిస్తాడు. కాని అత్యధిక సంఖ్యాకులకు పరిపూర్ణ బ్రహ్మచర్యం సాధ్యం కాదు. అందువలన వివాహం అవసరమై ఉంది. వివాహం చేసుకొన్నందు వలన బ్రహ్మచర్యం పాటించలేరని అనుకోవద్దు. ఎందుకు, శ్రీరామకృష్ణుల ఉదాహరణ ఉంది కదా! ఇంకా అనేకులు ఆ విధంగా జీవిస్తున్నారు. వారి గురించి బయటి ప్రపంచానికి తెలియదు.
నరకానికి వెళ్లినా….
అలహాబాద్‌లో జీవించిన సాధువు అమూల్యుడు స్వామీజీ కళాశాల సహా ధ్యాయి. సేవ, త్యాగాలతో పావన జీవితం గడిపిన ఆయన కాలాంతరంలో సన్న్యాస మార్గం నుంచి వైదొలగారు. దానిని గురించి విన్నప్పటికీ స్వామీజీ ఆయనను విమర్శించలేదు. “ఆహా! గొప్ప మహాత్ముడు! గొప్ప మహాత్ముడు కాని ఈ జన్మ వృథా అయిపోయింది. పోనీ, మరుజన్మలో ముక్తుడవుతాడు” అన్నా రాయన. పిదప ఇలా కొనసాగించారు: “ఆయనకు గురువు లేడు. అందుకే ఇలా జరిగింది. సాధకుడు అధోముఖంగా పోసాగినప్పుడు, గురువు అంటూ ఉంటే, ఆయన ఆతణ్ణి ఆ విధంగా సమతౌల్యం తప్పనివ్వడు. ఆతణ్ణి రక్షిస్తాడు.”
అప్పుడు నేను ఆయనతో, “స్వామీజీ! అలా అయితే నేను ఈ విధంగా మార్గం తప్పడం సంభవిస్తే నన్ను మీరు రక్షిస్తారా?” అని అడిగాను. అందుకు స్వామీజీ, “తప్పకుండా రక్షిస్తాను. నువ్వు నరకానికి వెళ్లినా నీ పిలక పుచ్చుకొని ఎత్తి తీసుకువస్తాను” అన్నారు.
శాంతి రామ్
స్వామీజీ దక్షిణేశ్వర రోజుల్లోనే నేను ఆయనను కలుసుకొన్నాను.* కాలాంత రంలో ఒకసారి మా అమ్మ యోగీన్ మహరాజ్‌తో నా భార్యకు దీక్ష ఇప్పించమని కోరింది. అందుకు ఆయన “అదేమిటి, స్వామీజీనే అడగవచ్చు కదా!” అన్నారు స్వామీజీని అడిగినప్పుడు వారి ఆకాంక్షను నెరవేరుస్తానని వాగ్దానం చేశారు. దీక్షకు ముందు రోజు మళ్లీ యోగీన్ మహారాజు నన్ను “నీ భార్యకు దీక్ష ఇవ్వబోతున్నారు. నువ్వు కూడా పుచ్చుకోవచ్చు కదా?” అని అడిగారు. ఈ విధంగా నేనూ, నా భార్య స్వామీజీ వద్ద దీక్ష పుచ్చుకోవడానికి తీర్మానమైంది.
దీక్ష బలరాం బోస్ మేడ మీద ఒక గదిలో జరిగింది. స్వామీజీ పూజ లాంటిది ఏమీ చేయలేదు. ధూపదీపాలూ, చందనమూ, బిల్వాలూ ఏవీ లేవు. ఆయన ఒక ఆసనంలో కూర్చున్నారు. నన్ను మరో ఆసనంలో కూర్చోమన్నారు. తరువాత, “నీ ఇష్టదేవత ఎవరు?” అని అడిగారు. “నేనెలా చెప్పగలను? మనస్సును అర్థం చేసుకోలేకపోతున్నాను. దీన్లో మనస్సుకు ఏం నచ్చుతుందని ఎలా చెప్పగలను?” అన్నాను. స్వామీజీ నాకు యుక్తమైన ఇష్టదేవతను, మంత్రాన్ని ఇచ్చారు.
నా దీక్ష ముగిసింది. ఇక నా భార్య వస్తుందని నేను బయటకు వెళ్లడానికి సిద్ధపడ్డాను. కాని స్వామీజీ నన్ను ఆపి, “నువ్వు కూర్చో” అన్నారు. స్వామీజీ నా భార్యకు కూడా దీక్ష ప్రసాదించి, “నువ్వు ధ్యానం చేయలేవు. కనుక జపం మాత్రమే చేయి” అన్నారు.
తారక్ నాథ్ రాయ్*
స్వామీజీ పాశ్చాత్యం నుంచి తిరిగి వచ్చినప్పుడు జరిగిన స్వాగతోత్సవంలో ఆయనను చూసే భాగ్యం పొందినప్పటికీ 1899 లో ఆయన దేవ్‌ఘర్‌లో బస చేసి ఉన్నప్పుడే ఆయనతో సన్నిహితంగా మెలగే అవకాశం లభించింది. నేను వెళ్లినప్పుడు స్వామీజీ మేడ మీద కూర్చుని బిగ్గరగా గీతా పారాయణ చేస్తున్నారు. క్రింద వేచివున్నాను. కాసేపటికి పాదుకల సవ్వడి వినిపించింది. స్వామీజీ వాటిని ధరించి వస్తున్నారు. పాశ్చాత్య ఆహారాన్ని తిన్నందువల్లా, సముద్రం దాటి వెళ్లి నందువల్లా ఆయన హైందవుడు కాడని వంగవాసి పత్రిక వ్రాసింది. నాలోనూ సందేహం లేకపోలేదు. కాని పాదుకలు ధరించి ఎదురుగుండా వస్తున్న స్వామీజీని చూసినప్పుడు మూర్తీభవించిన హైందవ సంస్కృతీ సంప్రదాయాల ప్రతిరూపం వస్తున్నట్లు అనిపించింది. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాను. ఆయన కూర్చుని నన్ను కూర్చోమన్నారు.
స్వామీజీ : ఎందుకోసం వచ్చావు?
నేను : మీ దర్శనార్థం.
స్వామీజీ (నవ్వుతూ) : మరేమీ లేదా?
నేను : మీ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకొన్నాను. స్వామీజీ! పాశ్చాత్య తాత్త్విక మేధావుల్లో అద్వితీయునిగా మీరెవరిని పరిగణిస్తారు?
అప్పుడు హెగల్ భావనలు మన దేశంలో ప్రాబల్యం వహించి ఉన్నాయి. స్వామీజీ కూడా ఆయననే పేర్కొంటారనుకొన్నాను. కాని స్వామీజీ ‘స్పినోజా’ అన్నారు. స్పినోజా అద్వైతాన్ని అంగీకరించాడు. కాని మాయను నిరాకరించాడు. “లోకం మాయ కాదు, సత్యం” అన్నాడు స్పినోజా. స్వామీజీ కూడా “లోకం అశాశ్వతం” అన్నారే తప్ప “లోకం అసత్యం” అని చెప్పలేదు.
మరో ప్రశ్న అడిగాను. అడిగిన తరువాతనే ఆ ప్రశ్న అడిగి ఉండకూడదని పించింది. నా ప్రశ్న వినగానే స్వామీజీ ముఖాన అనిష్టం కానవచ్చింది. “పరమ హంస దేవులను అవతారమని మీరు విశ్వసిస్తున్నారా?” అన్నదే నా ప్రశ్న.
స్వామీజీ (కించిత్తు అనిష్టంగా) : ఎందుకు విశ్వసించకూడదు? కృష్ణుని గురించి కూడా ఏవేవో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయినప్పటికీ ఆయన అవ తారమని దృఢంగా నమ్ముతున్నాం. పరమహంస దేవులు పరిపూర్ణమైన నిష్కళంక జీవితం గడిపారు. ఆయన పావన బ్రహ్మచారిగా విరాజిల్లారు. నిరక్షరాస్యులై నప్పటికీ అన్ని శాస్త్రాలలోని సత్యసారాన్ని గ్రహించిన వారిగా భాసిల్లారు. మూర్తీ భవించిన కరుణకు ప్రతిరూపంగా విలసిల్లారు. అంతటి వ్యక్తిని అవతారమని ఎందుకు విశ్వసించకూడదు?
తరువాత స్వామీజీ సంభాషణను మరో దిశలోకి త్రిప్పారు. పాశ్చాత్య దేశాలను శ్లాఘించారు. భారతదేశపు అప్పటి న్యూనతను ఎత్తి చూపారు.
స్వామీజీ : తక్కిన దేశాల నుంచి మనం కొన్ని పొందాం. కాని పొందిన దాని కన్నా ఎక్కువే లోకానికి అందించాం. అదే భారతదేశ వైశిష్ట్యం. ఇంకా దీర్ఘకాలం భారతం బానిస దేశంగా ఉండబోదు; దాని వైఖరి అది కాదు. ప్రాచీన వైభవం మళ్లీ సంతరించుకొంటుంది. ఆంగ్లేయుడు తన నాగరకతను మన మీద రుద్దాడు. కాని మన వైభవమూ, సంస్కృతీ చాలాకాలం అణగి ఉండదు. ఆంగ్లం చాలాకాలం మన జాతీయ భాషగా ఉండబోదు. మన భాష సంస్కృతం. అదే మన జాతీయ భాషగా, అనుసంధాన భాషగా విరాజిల్లుతుంది. సంస్కృత భాష కఠినమైనదని ఎవరన్నారు? సంస్కృత భాష ప్రాథమిక పుస్తకం ఒకటి రచించాలనే ఆసక్తి నాకు ఉంది. ఆ భాషను ఎంత సులభంగా నేర్చుకోవచ్చో నేను ఆ పుస్తకంలో చూపిస్తాను.
యతీంద్ర మోహన దాస్
1901లో స్వామీజీ ఢాకా వచ్చిన సందర్భంలో ఆయనను కలుసుకొన్నాను. అనేక చోట్ల ఆయన ప్రసంగించారు. స్త్రీ – పురుషులు, విద్యావంతులు – పామరులు, యువకులు – వృద్ధులు అనే తారతమ్యం లేకుండా యావన్మందీ మంత్రముగ్ధులై ఆయన ప్రసంగాలు విన్నారు. ఒకరోజు స్వామీజీ నవ్వుతూ, “ప్రసంగాలు ముగి శాయి. పాటలు మాత్రం ఎందుకు వదలిపెట్టాలి? ఒకరోజు తాళ విద్వాంసులను పిలవండి, పాడతాను” అన్నారు. కాని ఆ నాడు స్వామీజీ పాడలేకపోయారు. వాంతుల కారణంగా అవస్థపడ్డారు. మరో రోజు పాడారు.
ఢాకాకు వచ్చినప్పుడు నా కుమారునికి అస్వస్థతగా ఉందని విని స్వామీజీ ఇలా అన్నారు : “నేను గృహస్థుడనై నా కుమారునికి అస్వస్థతగా ఉందనుకో. ఆ సమయంలో ఎవరైనా సన్న్యాసి నా ఇంటికి రావడం సంభవిస్తే ఆయనతో, ‘ఇప్పుడు దయచేసి వెళ్లిరండి. మీరు వెళ్లిపోయినా నేను మళ్లీ మిమ్మల్ని చూసే ఆస్కారం ఉంది. కాని కుమారుణ్ణి కోల్పోతే మళ్లీ చూడలేను. ఇప్పుడు శ్రద్ధగా అతణ్ణి చూసుకోవాలి. తక్కిన విషయాల్లో నేను దృష్టి సారించలేను’ అని నిష్కర్షగా చెబుతాను.” స్వామీజీ ఇతరుల క్లేశాన్ని తమ క్లేశంగా పరిగణించేవారు.
నా కుమారుడు అతడి మామ ఇంట్లో ఉన్నాడు. అక్కడకు వెళ్లి ఆతణ్ణి ఆశీర్వదించమని స్వామీజీని వేడుకొన్నాను. అందుకు ఆయన “నాలో ఏం శక్తి ఉంది. నా ఆశీర్వాదంతో ఏం జరుగుతుంది?” అన్నారు. కాని ఒకరోజు వెళ్లి పడకబెట్టిన నా కుమారుని ప్రక్కన కూర్చుని ఆతడి తలను, ఛాతీని నిమిరారు. క్రమక్రమంగా ఆతడి ఆరోగ్యం కుదుటబడింది.
ప్రబోధ్ చంద్ర బోస్
బేలూర్ మఠం. గురుదేవుల జయంత్యుత్సవం. పొగ త్రాగే హుక్కాలోని నిప్పు ఉంచే భాగం కాలిబాటలో పడి ఉంది. అది చూసి స్వామీజీ, “దానిని ప్రక్కకు త్రోసివేయి” అన్నారు. అలా త్రోసివేయడానికి వెళ్లినప్పుడు ఆయన మళ్లీ, “జాగ్రత్తగా త్రోసివేయి. చేతులు కాల్చుకోవద్దు” అన్నారు. ఆయన చెప్పేలోపే నా చేతిలోని పరికరం క్రిందపడి నిప్పురవ్వలు చెదరిపడ్డాయి. అది చూసిన ఒక సన్న్యాసి నన్ను తిట్టసాగాడు. అందుకు స్వామీజీ “అది అతడి తప్పు కాదు. అతడు సరిగానే పట్టుకొన్నాడు. నేను మాట్లాడడం వల్లనే అతడు తడబడ్డాడు. అది క్రింద పడిపోయింది” అన్నారు.
———-
ఒక వర్షాకాలం రోజు మిత్రులు కొందరం మఠానికి వెళ్లాం. అప్పుడు మఠం నీలాంబర బాబు గృహంలో ఉంది. తిరిగి వచ్చేటప్పుడు కుంభవృష్టి కురిసే సూచనలు కనిపించాయి. ఆకాశం నల్లని మేఘాలతో క్రమ్ముకొంది. స్వామీజీ మాతో పడవ దాకా నడిచివచ్చి ప్రతి ఒక్కరినీ పడవలో ఎక్కించారు. తరువాత పడవ నడిపే వ్యక్తితో, “నాయనా! ఆకాశం మేఘావృతమై చీకటిపడింది. జాగ్రత్తగా వీరిని చేర్చు” అన్నారు. మమ్మల్ని అంతగా ఆయన అభిమానించారు!
———-
స్వామీజీ ఒకసారి బలరాం బోస్ ఇంటికి వచ్చారు. ఆయన అక్కడ పాడనున్నారు. “ఎవరు నాయనా అక్కడ? ప్రక్కనున్న సర్కార్ ఇంటి వీథిలో జగన్నాథ టాగూర్ అనే నా చిన్ననాటి నేస్తం ఉన్నాడు. అతడు బాగా పఖ్వాజ్ వాయిస్తాడు. ‘నరేన్ పిలుస్తున్నాడు’ అని చెప్పి అతణ్ణి తోడ్కొని రండి. అతడు వాయిస్తే పాట రక్తి కడుతుంది” అన్నారు స్వామీజీ. జగన్నాథ్‌తో విషయం చెప్పగానే అతడు శరవేగంగా వచ్చాడు. ఆతడితో స్వామీజీ ఒక పిల్లవాని మాదిరే ప్రవర్తించారు. ఆతడితో, “ప్రసంగాలు అనేకం చేయడంతో కంఠస్వరం పాడ యింది. మునుపటిలా లేదు” అన్నారు. ‘పాడయిన స్వరం’ అని స్వామీజీ చెప్పి నప్పటికీ ఆ రోజు విన్న ఆ పాట సాటి లేనిది. ఆ తరువాత శివానంద పాడారు, స్వామీజీ పఖ్వాజ్ వాయించారు.
———-
విద్యాసాగర్ కళాశాలలో అప్పుడు ఎఫ్.ఏ. చదువుతున్నాను. ఒక మిత్రుణ్ణి స్వామీజీకి పరిచయం చేయడానికి బలరాం ఇంటికి తోడ్కొని వెళ్లాను. వెళ్లినప్పుడు రాజా మహరాజ్, “ఈ రోజు స్వామీజీ ఒంట్లో బాగాలేదు. మాట్లాడకూడదని డాక్టర్లు చెప్పారు” అన్నారు. నిరాశా నిస్పృహలతో బయటకు వచ్చి వీథి అవతలి వైపు కూలబడ్డాం. ‘ఇప్పుడు మేడ మీద తలుపు తెరచుకొని బయటకు వచ్చి స్వామీజీ అటూ ఇటూ పచార్లు చేయరా, మేం ఆయన దృష్టిలో పడమా’ అంటూ మనస్సు పరితపించింది. ఏం ఆశ్చర్యం! అట్లే జరిగింది. స్వామీజీ గది తలుపు తెరచుకొంది. ఆయన బయటకు వచ్చారు. మమ్మల్ని చూసి, “ఏం నాయనా! అక్కడే కూలబడ్డారేమిటి? పైకి రండి” అన్నారు బిగ్గరగా.
అంతకన్నా ఆనందం మరొకటి ఉంటుందా? మేం మేడ మీదికి వెళ్లాం. మమ్మల్ని ఆప్యాయంగా చూసి, “మరొక రోజు రండి. ఈ రోజు ఒంట్లో బాగాలేదు” అన్నారు. ఈ మాటలతోనే నా మిత్రుని మనస్సు ఆనందంతో పొంగిపొరలింది.
శైలేశ్వర్ బోస్
ఆలంబజార్ మఠం. నాడు కృష్ణ జయంతి. స్వామీజీ “గుడ్విన్ ఎక్కడ?” అని అడుగుతూ ఆతణ్ణి వెతుకుతున్నారు. గుడ్విన్ కాస్త తమాషా మనిషి. వంగ భాషను కాస్త నేర్చుకొన్నాడు. స్వామీజీ కన్నా పొట్టి. ఆయన ఎదుటకు వచ్చి గరుడ పక్షి రెక్కలు విప్పినట్లుగా రెండు చేతులూ త్రిప్పి నమస్కరించాడు. స్వామీజీ ఆతడితో, “నువ్వు ఉపవాసం ఉండబోతున్నావట! ఉపవాసం ఉండమని ఎవరు చెప్పారు? మీరందరూ నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు నువ్వు ఇంత కష్టపడాలి?” అని అడిగారు. ఒకసారి గుడ్విన్కు కడుపు నొప్పి వచ్చినప్పుడు స్వామీజీ, “పాలు, సోడా తప్ప మరేమీ పుచ్చుకోవద్దు” అన్నారు. తరువాత తక్కిన వారిని పిలిచి, “ఈయనను జాగ్రత్తగా చూసుకోండి. విదేశాల నుంచి వచ్చారు. జాగ్రత్తగా చూసుకోవాలి” అన్నారు.
———-
ఒక రోజు స్వామీజీ బలరాం బోస్ ఇంట్లో ఉన్నారు. సాయంత్రం ఆయన తినడానికి ఏమీ లేదు. వండడానికి కూడా స్త్రీలు ఎవరూ లేరు. వెంటనే నాతో, “ఛునీలాల్ ఇంటికి వెళ్లి తినడానికి ఏదైనా తెచ్చి ఇవ్వగలవా?” అని అడిగారు. నేను శరవేగంగా వెళ్లి ఛునీలాల్ భార్య ఇచ్చిన చపాతీ, కూర తెచ్చాను. దానిని పళ్ళెంలో పెట్టినప్పుడు ఒక చపాతీ క్రింద పడింది. అది చూసి స్వామీజీ, “పోతే పోయిందిలే” అన్నారు. తరువాత, “లేనివాడు ఎక్కడకు వెళ్లినా లేనితనం అతడి వెంటే వెళుతుంది” అన్న అర్థం వచ్చే సంస్కృత శ్లోకం వల్లించారు.
———-
బలరాం బాబు ఇంట్లో ఒకరు స్వామీజీతో, “కొన్ని పనులు చేస్తున్నప్పుడు అవి తప్పని తెలుసు. ఇక మీదట చేయకూడదని నిశ్చయించుకొంటాం. కాని అలా చేయలేకపోతున్నాం. ఆ పనినే హఠాత్తుగా చేస్తాం. అది ఎందుకు?” అని అడిగారు. అందుకు స్వామీజీ ఇలా జవాబిచ్చారు:
“ఇంజన్ చూసివున్నావా? కాస్త తోస్తే చాలు, పరుగెత్తుతుంది; అంతా ఠక్కున ఆగిపోతుంది. కాని ఇంజన్ ఆగిపోయినా బండి ఆగదు, ఇంకా కాస్త దూరం పోతుంది. బ్రేక్ వేసినప్పుడు కూడా అంతే, కాస్త దూరం వెళ్లే ఆగుతుంది. మనమూ ఎన్నో జన్మలలో సేకరించుకొన్న సంస్కారాలను మోస్తూ జీవిస్తున్నాం. కనుక ఏదీ ఠక్కున ఆపలేం. ‘ఇక చెయ్యను, చెయ్యను’ అంటూ పదే పదే సంకల్పించుకో. విజయం లభిస్తుంది. నిరంతర ప్రయత్నంతో మళ్లీ ఆ భావన సమసిపోతుంది.”
———-
ఒక రోజు మరణం గురించిన ప్రస్తావన వచ్చింది. అప్పుడు స్వామీజీ నాతో, “నువ్వు అనునిత్యం మరణిస్తున్నావు, తెలుసా నీకు?” అని అడిగారు. “తెలియదు” అన్నాను. అప్పుడు స్వామీజీ ఇలా అన్నారు: “ఐదేళ్ల పిల్లవానిగా తల్లి ఒడిలో ఉన్న నువ్వా ఇప్పుడు ఉన్నావు? కణజాలం (tissues) నశించిపోతున్నాయి. ప్రతిక్షణం ఒంట్లోని కణజాలం నశించడమూ మార్పు చెందడమూ కొనసాగుతూనే ఉంది.”
———-
ఒకరోజు రేవులో పడవ మీద నుంచి దిగుతున్నప్పుడు మరొకరి భుజం మీద చేతులు ఉంచి ఆతణ్ణి ఆసరాగా చేసుకొని స్వామీజీ దిగారు. అప్పుడు ఇలా చెప్పారు: “ఎన్నో పర్వతాలనూ, సముద్రాలనూ గమించి వచ్చాను. నేడు నా పరిస్థితి ఇలా ఉంది!”
తులసీ రామ్ ఘోష్
మొదటిసారి పాశ్చాత్యానికి వెళ్లే ముందు ఒక రోజు స్వామీజీ పచార్లు చేస్తున్నారు. మరేదో లోకంలో సంచరిస్తున్నట్లుగా కనిపించారు ఆయన. అప్పుడు తమలో తామే ఇలా అన్నారు: “ఈ గుర్తు చూపడమూ ఆనవాలు చెప్పడమూ నాకు అక్కర్లేదు. నన్ను చేతులు పుచ్చుకొని తోడ్కొని వెళ్లండి.”
———-
“నా చేతులు పుచ్చుకొని తోడ్కొని వెళ్లండి” అని స్వామీజీ శ్రీరామకృష్ణులను ప్రార్థించారు. ఆయన చేతులు పుచ్చుకొని మార్గదర్శకత్వం వహించారు శ్రీరామ కృష్ణులు. మరి స్వామీజీ? ఆయన ఒక మహోన్నత కారుణ్యమూర్తియైన గురువుగా, స్త్రీలు – పురుషులు, గృహస్థులు – సన్న్యాసులు అంటూ అసంఖ్యాకుల చేతులు పుచ్చుకొని తోడ్కొని వెళ్లారు. ఆయన సదా శ్రీరామకృష్ణుల అనుగ్రహ సహ కారంతోనే దీక్ష ఒసగారు, శిష్యులకు మార్గదర్శకత్వం వహించారు. ఒకసారి సురేంద్రనాథ్ సేన్ అనే వ్యక్తికి స్వామీజీ దీక్ష ఇవ్వడానికి నిరాకరించారు. కారణం అడిగినప్పుడు, ఆతడికి తమకన్నా ఆధ్యాత్మికతలో ఉన్నతులు దీక్ష ఇస్తారని తెలిపారు.*
ఈ విధంగా శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో అసంఖ్యాకుల జీవితాల్లో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించిన కారుణ్యమూర్తియైన గురువుగా స్వామీజీ విరా జిల్లారు.