గగన చంద్రుని ప్రతిబింబంతో చేపలు ఆనందంగా ఆడుకొంటాయి. ఉదయమవుతుంది. చంద్రుడు అస్తమిస్తాడు, ప్రతిబింబం కానరాదు. అప్పుడే, “చంద్రుడు అందుకోలేని దూరంలో ఉన్నాడు. ఆతడి ప్రతిబింబంతోనే మనం ఆనందించా” మని చేపలు గ్రహిస్తాయి. స్వామీజీ విషయంలో మేం కూడా ఇలాగే అనుకొన్నాం.
– స్వామి తురీయానంద
‘నాకు ఆశాభంగం కలిగించరు!’ — బ్రహ్మానంద అనుభవం — ప్రేమానంద అనుభవం — విజ్ఞానానంద యుక్తి — స్వామీజీ హృదయం — పవిత్ర గడియారం — స్వామీజీ దేశభక్తి — విద్యుదాఘాతం — దైవాంశ సంభూతుడు — శ్రీరామకృష్ణులతో అభిన్నంగా — భైరవుల పహారాలో — స్వామీజీ సాక్షాత్తూ పరమేశ్వరుడే! — మాతృదేవి దృష్టిలో
‘నాకు ఆశాభంగం కలిగించరు!’
ఒక రోజు బేలూర్ మఠంలో స్వామీజీ అలవాటు ప్రకారం మామిడి చెట్టు క్రింద కూర్చుని ఉన్నారు. ఆయన ముందు శారదానంద నిలబడి ఉన్నారు. ఏదో కారణంగా స్వామీజీ ఆయనను చీవాట్లు పెడుతున్నారు. శారదానంద మూర్తీభవించిన శాంతం. ఎవరి కోపానికీ ఆయన స్పందించరు. అందునా స్వామీజీ హృదయ ప్రేమ ఆయనకు బాగా తెలుసు. కనుక అంతా వింటూ ప్రశాంతంగా నిలబడి ఉన్నారు. అప్పుడు కలకత్తా నుంచి శ్రీరామకృష్ణుల భక్తుడొకరు వచ్చారు. ఆయనను చూడగానే స్వామీజీ ముఖవైఖరి మారింది – కోపం జాడ మాత్రంగా కూడా లేదు. వచ్చిన భక్తునితో కాసేపు ముచ్చటించారు. మధ్యలో హాస్యోక్తులూ, పరిహాసమూ చోటుచేసుకొన్నాయి. దాన్లో శారదానంద కూడా పాల్గొన్నారు. ముగ్గురూ నవ్వు కొంటూ మాట్లాడుకోవడంలో కొంతసేపు గడిచింది. పిదప ఆ భక్తుడు సెలవు పుచ్చుకొన్నాడు. ఆతడు వెళ్లిపోగానే స్వామీజీ ముఖవైఖరి మళ్లీ మారిపోయింది. అంతకుముందు ఆపిన దగ్గర నుంచి మళ్లీ చీవాట్లు పెట్టసాగారు. శారదానంద ఇంతకు ముందున్నట్లే ప్రశాంతంగా నిలబడే ఉన్నారు!
సామాన్యంగా స్వామీజీ తమ శిష్యులను చీవాట్లు పెట్టరు! కోపం, నిందించడం, చీవాట్లు – అన్నీ సోదర సన్న్యాసులకు మాత్రమే! తమ కాఠిన్యాన్ని వారు మాత్రమే భరించగలరనేవారు ఆయన. అదే సమయంలో, “బహుశా నా శిష్యులు నాకు ఆశాభంగం కలిగించవచ్చు; కాని నా సోదర సన్న్యాసులు ఎన్నటికీ ఆశాభంగం కలిగించరు” అనేవారాయన! అంతటి ప్రగాఢ నమ్మకం వారి పట్ల ఆయనకు ఉంది. ఒకటి రెండు సంఘటనలు చూద్దాం.
బ్రహ్మానంద అనుభవం
ఒకసారి బేలూర్ మఠ ప్రాంగణంలో గంగకు గట్టు నిర్మించే పని జరిగింది. ఇంజనీరైన విజ్ఞానానంద అంచనా ఒకటి తయారు చేశారు. దాని ప్రకారం ఆ పనికి పెద్దగా ఖర్చు ఉండదని స్వామీజీతో బ్రహ్మానంద చెప్పి నప్పుడు, వెంటనే పని ప్రారంభించమన్నారు స్వామీజీ. కాని పోగాపోగా అంచనా దాటి ఖర్చు కాసాగింది. ఒక రోజు ఖర్చు లెక్కను పరికించిన స్వామీజీ కోపంతో కేకలుపెట్టసాగారు. స్వామీజీ కోపమూ, చీవాట్లూ బ్రహ్మానందకు క్రొత్త ఏమీ కాదు. కాని నాటి స్వామీజీ కోపం తారస్థాయిని చేరింది. అయినప్పటికీ బ్రహ్మానంద బయటకు ఏదీ వ్యక్తం చేయ కుండా మౌనంగా అక్కణ్ణుంచి వెళ్లిపోయారు.
బ్రహ్మానంద వెళ్లిపోయాక స్వామీజీ మామూలు స్థితికి వచ్చారు. తాము అవధులు దాటి కోపగించుకొన్నానని గ్రహించిన ఆయన వెంటనే విజ్ఞానానందను రావించి, “పో, వెళ్లి రాజా ఏంచేస్తున్నాడో చూసి రా” అన్నారు. విజ్ఞానానంద వెళ్లినప్పుడు బ్రహ్మానంద గది కిటికీ, తలుపులు అన్నీ మూసివున్నాయి. ఆ విషయం స్వామీజీతో ఆయన చెప్పారు. ఇక చీవాట్లు తినడం విజ్ఞానానంద వంతు అయింది. “రాజా ఏం చేస్తున్నాడనేగా చూసి రమ్మన్నాను! నువ్వు వచ్చి ఆతడి గది కిటికీలు, తలుపులు మూసివున్నాయని చెబుతున్నావు. నువ్వు వడగట్టిన మూర్ఖుడివి. పరుగెత్తు, ఆతడు ఏం చేస్తున్నాడో వెళ్లి చూసి రా” అంటూ ఆయన మీద స్వామీజీ విరుచుకుపడ్డారు. విజ్ఞానానంద పరుగుపెట్టాడు.
బ్రహ్మానంద గదికి వెళ్లిన విజ్ఞానానంద తలుపు తెరచి చూసినప్పుడు ఆయన బోర్లాపడుకొని వెక్కివెక్కి ఏడుస్తున్నారు. ఆయన శరీరం క్రిందికీ పైకీ కంపిస్తున్నది. ఈ సంగతి స్వామీజీకి తెలియజేశారు విజ్ఞానానంద.
స్వామీజీ ఉద్వేగాలను అణచుకోలేకపోయారు. ఏడుస్తూ బ్రహ్మానంద గదికి పరుగుదీశారు. ఆయనను మంచం మీద నుంచి లాగి అక్కున చేర్చుకొని, “రాజా! ఓ రాజా! నన్ను క్షమించు. నేను నిన్ను తిట్టి ఎంత తప్పుచేశాను!” అంటూ వెక్కివెక్కి ఏడ్వసాగారు. ఇప్పుడు స్వామీజీని బ్రహ్మానంద సాంత్వన పరచవలసి వచ్చింది. ఆయన స్వామీజీ కన్నీటిని తుడిచి, “ఫరవాలేదు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు, కనుక కోపగించుకొంటున్నారు. దాన్లో తప్పేమీ లేదు” అన్నారు.
మరొక రోజు ఇదేవిధంగా బ్రహ్మానందను స్వామీజీ బాగా చీవాట్లు పెట్టారు. యథాప్రకారం బ్రహ్మానంద ఓపిగ్గా అంతా భరించారు. అంతేకాక అప్పుడు స్వామీజీ ఆరోగ్యం కాస్త కూడా బాగాలేదు. ఈ సమయంలో ఆయనను మరింత ఆగ్రహానికి గురిచేయరాదనే ఉద్దేశంతో బ్రహ్మానంద మారుమాట్లాడలేదు. ఆ రోజు సాయంత్రం ఏదో పని కారణంగా కలకత్తా వెళ్లిన బ్రహ్మానంద, బలరాం బోస్ ఇంట్లో ఒకటి రెండు రోజులు బస చేయవలసి వచ్చింది. తన మీద కోపగించుకొని ఆయన వెళ్లిపోయాడనుకొన్న స్వామీజీ మనశ్శాంతి కోల్పోయారు. ఒక రోజు వేచివుండి ఆయన రాకపోవడంతో బోలెడన్ని మధుర భక్ష్యాలు పుచ్చుకొని తిన్నగా బలరాం ఇంటికి వెళ్లారు. అక్కడ బ్రహ్మానందను చూడగానే, “రాజా! ఈ మధుర భక్ష్యాలను నీ కోసమే తెచ్చాను” అంటూ ఆనందంగా ఆయనతో మాట్లాడారు.
ప్రేమానంద అనుభవం
ఒకరోజు స్వామీజీ వేదాంత తరగతి నిర్వహిస్తున్నారు. సాయంత్రం హారతి వేళ సమీపించింది. పూజారియైన ప్రేమానంద అక్కడకు వచ్చి, హారతిలో తనకు తోడ్పడడానికి ఒకరిద్దరు బ్రహ్మచారులను పిలిచారు. తరగతి గదిలోకి వచ్చి ఆయన అంతరాయం కలిగించడం స్వామీజీకి కోపం తెప్పించింది. “శ్రీరామకృష్ణుల చిత్రపటాన్ని ఉంచి దాని ముందు జ్యోతిని చూపించడమే నీ పని! ఇక్కడ జరుగుతున్నది, అంటే వేదాంత అధ్యయనం, నీ పని కాదు – ఇదే నీ ఉద్దేశమా? మీరందరూ సంకుచిత మనస్కులు” అంటూ ప్రారంభించి అలవాటు ప్రకారం చడామడా తిట్టసాగారు. తరగతి సగంలో ఆగిపోయింది. ప్రేమానంద ఒక్క పరుగులో ఆలయానికి వెళ్లి హారతి ముగించారు. ఆ తరువాత ప్రేమానంద ఎక్కడా కనిపించలేదు.
స్వామీజీ ఆందోళన చెందారు, ఒక్కొక్కరిని ఒక్కో వైపు పంపి వెతకమన్నారు. ఎక్కడా ఆయన జాడ లేదు! బహుశా గంగలో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడేమో ననే సందేహం స్వామీజీకి కలుగకపోలేదు. చివరికి ప్రేమానంద మేడ మీద ఒక మూల ఒంటరిగా కూర్చుని ఉండడం కంటబడింది. స్వామీజీ ఒక్క పరుగులో అక్కడకు వెళ్లారు. ప్రక్కన కూర్చుని చాలాసేపు ప్రసన్నంగా మాట్లాడి, ఆయనను సాంత్వనపరిచి తీసుకువచ్చారు.
విజ్ఞానానంద యుక్తి
విజ్ఞానానంద విధానం కాస్త విభిన్నమైనది. అప్పుడప్పుడు ఆయనకూ చీవాట్లు తప్పేవి కావు. కాని ఆయన సమర్థుడు! స్వామీజీ మనఃస్థితిని అర్థం చేసు కొని అప్రమత్తంగా ఉండేవారు. స్వామీజీకి కోపం వచ్చే సూచనలు కనిపిస్తే ఆ పరిధిలోనే విజ్ఞానానంద కనిపించరు! స్వామీజీ మనిషిని పంపి ఆయనను తోడ్కొని రమ్మంటే, “ఓ, అత్యవరమైన పని ఉంది, నేను కలకత్తా పోతున్నాను. వచ్చాక చూస్తాను” అంటూ అక్కణ్ణుంచి జారుకొనేవాడు! “స్వామీజీ మఠంలో ఉన్నారంటే ద్వారం వద్దే తెలిసిపోతుంది. అన్ని చోట్లా అంతటి ప్రశాంతత నెలకొని ఉంటుంది” అనేవారు విజ్ఞానానంద.
స్వామీజీ హృదయం
తమ కోపమూ, చీవాట్లూ సోదర సన్న్యాసులకు ఏ మేరకు బాధ కలిగిస్తు న్నాయో స్వామీజీకి తెలియకపోలేదు. వారిని చీవాట్లు పెట్టి, అంతకన్నా పలురెట్లు మానసిక వ్యథను తాము కూడా అనుభవించేవారు ఆయన. తమకు రోజులు దగ్గర పడడం, అనేక పనులు అనుకొన్నంత వేగంగా జరగకపోవడం స్వామీజీ మనస్సును క్షోభింప జేశాయి. కనుక చిన్న విషయాలలో పొరపాట్లు కనిపించినప్పుడు ఆయన కోపంతో విరుచుకుపడేవారు. “పని చేస్తే చూడాలని ఉంది. నేను మరణించే లోగా నా యావజ్జీవ కష్టసాధ్యమైన దానిని నిరంతరాయంగా కొనసాగే స్థితిలో ఉన్నట్లు చూడగోరుతున్నాను”* అంటూ తమ కోప కారణాన్ని వారికి స్వామీజీ వ్యక్తం చేశారు. “అన్ని దీవెనలూ నిన్ను వెన్నంటు గాక! నా కాఠిన్యాన్ని గురించి పట్టించు కోకు. మాట లెలావున్నా నా మనస్సు నీకు తెలుసు”* అంటూ తమ పరిస్థితిని ఆయన స్పష్టం చేశారు.
స్వామీజీకీ సోదర సన్న్యాసులకూ మధ్యనున్న సంబంధం అనుపమానమైనది! వారందరూ స్వామీజీని గురువుగానే పరిగణించారు. ఆయన దివ్యత్వమూ, పావనతా సదా వారి మనస్సులలో ప్రగాఢ ఉద్వేగాలను కలిగించాయనడం నిర్వివా దాంశం. ఆయన పావన హస్తాలు తాకిన వస్తువులను వారు పవిత్ర చిహ్నంగా ఎంచి, ఆరాధించే మేరకు ఆయనను సోదర సన్న్యాసులు పూజనీయునిగా పరిగణించారు. బ్రహ్మానంద జీవితంలో జరిగిన ఒక సంఘటన పరికిద్దాం.
పవిత్ర గడియారం
ఒక రోజు స్వామీజీ కలకత్తా వెళ్లారు. నాటి రాత్రి ఆయన బస బలరాం ఇంట్లో ఏర్పాటు చేశారు. ఆయనతో బ్రహ్మానంద కూడా ఉన్నారు. ఇద్దరూ గుర్రబ్బండిలో వెళుతున్నారు. స్వామీజీ తమ చొక్కా జేబులో ఒక బంగారు గడియారం వ్రేలాడదీసుకొన్నారు. స్వామీజీకి ఒక ఆప్తుడు కానుకగా ఇచ్చిన గడియారం ఇది. స్వామీజీ బండి ఎక్కినప్పుడు, గుర్రబ్బండి వ్యక్తి ఆ బంగారు గడియారాన్ని గమనించాడు. ఆ గడియారం విలువైనదే కాక, చాలా అందమైనది కూడా! ఆ బండివాడికి దాని మీద కోర్కె కలిగింది. కనుక అతడు బండి నడుపుతూ తరచూ వెనుకకు తిరిగి ఆ బంగారు గడియారాన్ని మక్కువతో చూడసాగాడు.
బ్రహ్మానందతో స్వామీజీ ఏదో ముఖ్యమైన విషయం చర్చిస్తున్నారు. అయిన ప్పటికీ బండివాడి అభిలాష ఆయన గ్రహించకపోలేదు. వెంటనే తమ మాటలు ఆపి, బండివాణ్ణి పిలిచి, “ఏమయ్యా, ఈ గడియారం నీకు కావాలా?” అని ప్రేమగా అడిగారు.
బండివాడు దిగ్భ్రమచెందాడు! తన సమ్మతిని ఎలా చెప్పాలోనని అతడు యోచించే లోపుగానే స్వామీజీ, “ఇదిగో పుచ్చుకో!” అంటూ గడియారాన్ని అతడి చేతిలో పెట్టారు. తరువాత ఏమీ జరగనట్లు సావధానంగా బ్రహ్మానందతో మాటల్లో పడ్డారు.
బ్రహ్మానంద జరిగినదంతా ప్రశాంతంగా చూస్తూనే ఉన్నారు. ‘ఇంత విలువైన వస్తువును ఆ సామాన్యమైన బండివాడికి ఇవ్వడమా? దాని నిజమైన విలువ అతడు గ్రహించగలడా? ఎవరికైనా ఈ గడియారాన్ని బండివాడు విక్రయించకపోడు. అది జరగకూడదు. స్వామీజీ చేతులు తాకిన గడియారం చేతులు మారకూడదు’ అనుకొన్నారు. బ్రహ్మానంద విచారపడింది అది విలువైన వస్తువని కాదు; స్వామీజీ చేతులు తాకిన గడియారం అది. కనుక అది ఇప్పుడు పవిత్రమయింది!
కాని తమ మనస్సులో తలెత్తిన ఆలోచనలు స్వామీజీకి చెప్పలేదు. ఆయన గడియారాన్ని బండివాడికి ఇచ్చినప్పుడు కూడా అభ్యంతరం చెప్పలేదు.
వారు దిగవలసిన చోటు రాగానే స్వామీజీ బండి దిగారు. బ్రహ్మానంద వెంటనే దిగకుండా స్వామీజీతో, “మీరు లోపలికి వెళ్లండి, నేను వెనుకనే వస్తాను” అన్నారు. స్వామీజీ లోపలికి వెళ్లారు. తరువాత బ్రహ్మానంద బండివాడితో, “ఇలా చూడవయ్యా! ఆ స్వామీజీ నీకు ఇచ్చిన గడియారం విలువకు తగ్గ డబ్బు చెల్లిస్తాను. దానిని నాకు ఇచ్చివేయి” అన్నారు. బండివాడు క్షణం కూడా యోచించకుండా డబ్బు పుచ్చుకొని గడియారం ఇచ్చేశాడు.
ఈ విధంగా సోదర సన్న్యాసులు స్వామీజీని కొనియాడారు. వారిలో కొందరు స్వామీజీని గురించి చేసిన వ్యాఖ్యానాలను, కొన్ని సంఘటనల్లో చూద్దాం.
స్వామి బ్రహ్మానంద (రాఖాల్)
పాశ్చాత్య దేశాల దృష్టిలో భారతదేశాన్ని ఆయన ఏ మేరకు పెంపొందించారో కాలమే నిర్ణయిస్తుంది. మన దేశాన్నీ, ప్రజలనూ ప్రగతి పథంలో తీసుకుపోవా లంటే మనం ఆయన మహోన్నత జీవితాన్ని ప్రాతిపదికగా గైకొని సమైక్యంగా ప్రయత్నించాలి.
స్వామి ప్రేమానంద (బాబూరాం)
సప్తర్షి మండలంలో తపస్సు చేసుకొంటున్న ఋషులలో ఒకరైన నర నారాయణ ఋషియే స్వామీజీ. లోకహితార్థం పరమేశ్వరుడు ఆయన రూపంలో ఏతెంచాడు. అనేకుల హితం కోసమూ, సంతోషం కోసమూ ఆయన అవతరించారు. అతి తక్కువ కాలంలో ఆయన లోకంలో ఎంత గొప్ప ఉద్వేగ తరంగాలను ఉద్భవింపజేశారు! ఆయన బోధించినదంతా ముమ్మాటికీ సత్యమేనని కాలక్రమంలో తెలియవస్తుంది. ఆయన బీజాలు నాటారు. అవి మొలకెత్తి పెరిగి మహావృక్షాలుగా పరిణమించడం తథ్యం. ఆ మహావృక్షాల నీడన లోకం సాంత్వన పొందుతుంది. ఆయన మాకు ఎంత పరమానందాన్ని కలిగించారో కదా! ఆయనను తలిస్తేనే చాలు మాకు రోమాంచితమవుతుంది, పారవశ్య అనుభూతి కలుగుతుంది. శివావతారులైన స్వామీజీకి జై!
స్వామి శివానంద (తారక్)
ఈ యుగ సందేశాన్ని సర్వత్రా వ్యాపింపజేసే కార్యాన్ని శ్రీరామకృష్ణులు స్వామీజీకి అప్పగించారు. ఆ శక్తితో పరిపుష్టిని సంతరించుకొన్న స్వామీజీ లోకహితం కోసం పాటుపడ్డారు. ఆయన భావనలు అనేక మార్గాలలో, అనేకుల ముఖతః కార్యరూపం దాల్చాయి. పర్యవసానంగా అన్ని దేశాలలో బహుముఖ ప్రగతి కలుగుతుంది.
స్వామి తురీయానంద (హరి)
శ్రీకృష్ణ నిర్యాణ వార్త ఉద్ధవుడు విదురునికి తెలిపి తన విచారాన్ని వ్యక్తం చేశాడు: “ఏం వింత! ఆయన యదుకులంలో జన్మించారు. కాని యదువంశంలో ఎవరూ ఆయనను అవగాహన చేసుకోలేదు. రేయింబవళ్లు వారు శ్రీకృష్ణునితోనే సహజీవనం చేశారు, ఆడుకొన్నారు, తిన్నారు. కాని ఆ కృష్ణుడే లోకాన్ని సృజించి, పరిరక్షించి లీలలు జరిపే సాక్షాత్తూ భగవంతుడని వారు గ్రహించలేకపోయారు.” యదుకులం మాత్రమేనా, యావత్తు లోకం తంతు ఇదే! అవతార పురుషులను ఎవరూ గుర్తించలేరు. ఉద్ధవుడు సరిగ్గానే చెప్పాడు. మేమూ స్వామీజీతో సహజీవనం చేశాం, తిన్నాం, నిద్రించాం, ఆడుకొన్నాం, కథలు ఆలకించాం, అధ్యయనం చేశాం. ఇలా ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు; ఏళ్ల పర్యంతం జీవించాం. కాని స్వామీజీని మేం అవగాహన చేసుకోగలిగామా? లేదు! ఆయన నిజ నైజాన్ని కించిత్తు కూడా మేం అవగతం చేసుకోలేదు.
ఉద్ధవ వచనాలు జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా ఆయన వచనాలు ముమ్మాటికీ నిజమని అనిపిస్తుంది. స్వామీజీతో మేం ఎలా వ్యవహరించాం! కాని ఆయనను అవగాహన చేసుకోలేకపోయాం. ఆయన కూడా మాలాంటి వ్యక్తే, కాని మా కన్నా ఉన్నతుడు, ప్రతిభాశాలి – ఇంతవరకే అర్థం చేసుకొన్నాం. ఇన్ని పరిమాణాలతో ఒక వ్యక్తి ఇంతదాకా జన్మించి ఉంటారని నేను భావించను.
————-
స్వామీజీ నిజంగానే ఇతరులకు సహాయం చేయగలిగారు. ఆయనలో గోప్యత కించిత్తు కూడా లేదు. తమ వద్దగలదంతా ఆయన ఇతరులకు తెరచి చూపించారు! మన సమస్యే అది కదా! ఎక్కడ ప్రక్క వ్యక్తి మనకన్నా గొప్పవాడై పోతాడేమోననే భయం మనలో నిండి ఉంది. కాని ఆయన ఆ భయం సమీపించ లేని అగ్రంలో ఉన్నారు. ఆయనలో ద్వేషం లేదు. “ఎవరు ఏ చోట ఉన్నారో ఆతడికి ఆ చోట సహాయం అందించు. ఎవరికి ఏది కొరతో ఆతడికి అది ఇవ్వు. సాధ్యం కాదా? అందు కోసం ఆతడి కాళ్లను క్రిందికి లాగి నీ స్థితికి ఈడ్చుకు రావడానికి ప్రయత్నించకు” అనేవారు ఆయన.
————-
యావత్తు ప్రపంచాన్నీ పర్యటించి వచ్చాక స్వామీజీ ఇలా అన్నారు: “ప్రజాస్వామ్యం అన్నది తలా తోకా లేని ఒక వ్యవస్థ. నిజానికి నలుగురైదుగురు మాత్రమే దేశాన్ని పరిపాలిస్తున్నారు. దేశానికి మార్గదర్శకత్వం వహించగల వ్యక్తులను రూపొందించలేనప్పుడు దేశం పతనం చెందుతుంది. మన దేశం ఆధ్యాత్మికమైనది. యుగాల పర్యంతం అది మహాత్ములను రూపొందిస్తున్నది. మహాత్ములు రూపొందని కాలఘట్టం మన చరిత్రలో లేదు. ఒక వ్యక్తి రూపొందు తున్నాడు; అతడు శతాబ్దాలుగా ఎందరికో మార్గదర్శకత్వం వహిస్తాడు. చూడు! నానక్, కబీర్, తులసీదాసు! ఎన్నెన్నో సంవత్సరాలుగా వారు ఈ దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నారు!”
————-
“హరీ! ఇప్పుడు నేనొక కొత్తమార్గం ఆవిష్కరించాను. ధ్యానం, జపం, ఆత్మవిచారణ లాంటి వాటి ద్వారా మాత్రమే ముక్తి లభిస్తుందని ఇంతదాకా జనం విశ్వసించారు. ఇప్పుడు స్త్రీలూ పురుషులూ భగవత్కార్యం నిర్వర్తించి జీవన్ముక్తు లవుతారు” అంటూ స్వామీజీ ఒకసారి నాతో చెప్పారు. ఆయన వచనాలు అక్షరసత్యాలు, దాన్లో నాకు ఎలాంటి సందేహమూ లేదు.
————-
“ముందు నన్ను అర్థం చేసుకోండి. ఆ తరువాత ఆయనను (శ్రీరామ కృష్ణులను) అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి” అనేవారు ఆయన. స్వామీజీ ఎవరో, ఏమిటో నాకు తెలియదు; కాని ఆయన పరిపూర్ణులు. పరిపూర్ణుణ్ణి మొదట అర్థం చేసుకోకుండా భగవంతుణ్ణి ఎలా అర్థం చేసుకోగలం? అందుకే స్వామీజీ అలా చెప్పారు.
————-
స్వామీజీ హాస్యచతురత అద్వితీయం. ఒక రోజు నేను ఒక కత్తితో పనిచేస్తు న్నప్పుడు దాని పిడి విరిగిపోయింది. విచారంగా నేను కూర్చున్నాను. అప్పుడు స్వామీజీ వచ్చి, “హరీ! దాని ఆయుర్దాయం అలాగే తీరుతుంది. దానికి జలుబు, జ్వరం, సన్నిపాతం లాంటివి వాటిల్లి ఆయుర్దాయం తీరదు కదా?” అన్నారు నవ్వుతూ! నేనూ నవ్వేశాను.
————-
“మరెవరూ ఏదీ చెప్పడానికి నేను ఏదీ వదలిపెట్టలేదు” అన్నారొకసారి స్వామీజీ. ఆయన అంతా చెప్పేశారు. ఆయన భావనల ప్రకారమే అంతా ఇప్పుడు జరుగుతున్నది.
————-
“రాబోయే 200 ఏళ్లకు ఎవరూ ఏదీ చేయనక్కర్లేదు, ఊరకే తోక పుచ్చుకొని వెళితే చాలు, అంతటి ఉద్వేగాన్ని అందించాను” అని స్వామీజీ వచించడం కద్దు!
————-
అన్ని రకాల వ్యక్తులతోనూ కలసిమెలసి వ్యవహరించే ప్రతిభాసంపన్నులు స్వామీజీ. పరివ్రాజక రోజుల్లో ఒకసారి ఆయనతో రైలులో వెళ్లాను. ఆ పెట్టెలో అశ్వశిక్షకులు కొందరు ఉన్నారు. స్వామీజీ వారితో మాట్లాడనారంభించారు. చాలాసేపు వారితో సంభాషించారు. తిరిగి వచ్చాక ఆయనను, “మీరు ఏం మాట్లాడారు?” అని కుతూహలంగా అడిగాను. అందుకు ఆయన, “ఓ, వారికి అనేక విషయాలు తెలుసు. పందెపు గుర్రాలను ఎలా సంరక్షించాలి, వాటి వేగాన్ని పెంపొందించడానికి ఏమేం చేయాలి లాంటి విషయాలు తెలుసుకొన్నాను, బాగా ఉంది. నేర్చుకోవడానికి ప్రతి వ్యక్తి వద్దా ఏదో ఉండనే ఉంటుంది” అన్నారు.
————-
ఒకరోజు సోదర సన్న్యాసుల మధ్య ఏదో కారణంగా వాదోపవాదాలు తలెత్తాయి. అది చూసి స్వామీజీ, “మీ రందరూ కేవలం అల్పబుద్ధులు. వంకాయ, పొట్లకాయ, ఆకుకూర లాంటి వాటి గురించే పోట్లాడుకుంటారు. మీతో ఎవరన్నా జీవిస్తారా?” అంటూ కోపంగా చెప్పి వెళ్లిపోయారు. చివరికి ఏం జరిగింది? “అల్పబుద్ధులు” అంటూ ఎవరిని పేర్కొన్నారో వారికే యావత్తూ వదలిపెట్టి వెళ్లారు! బేలూరు మఠానికంటూ పాలక సంఘాన్ని నియమించినప్పుడు సోదర సన్న్యాసు లను మాత్రమే పాలకసంఘ సభ్యులను చేశారు. తమకంటూ ఎలాంటి పదవినీ ఆయన ఉంచుకోలేదు. తమ శిష్యులకూ ఏమీ ఇవ్వలేదు. ఎంతటి అద్భుత త్యాగం ఆయనది! సోదర సన్న్యాసుల పట్ల ఆయనకు ఎంతటి అనురాగం!
————-
ఒకరోజు స్వామీజీ ఆగ్రహోదగ్రులై, “ఒంటరిగా ప్రయాణం చేయవలసి వచ్చింది. పాటలు పాడడం, తాళం వేయడం అంతా నేను ఒక్కణ్ణే చేయవలసి వచ్చింది. మరెవరూ ఏదీ చేయలేదు” అన్నారు. మమ్మల్ని యథాప్రకారం చీవాట్లు పెడతారు. అదేం క్రొత్త కాదు. కాని ఆ రోజు గురుదేవుల పట్ల కూడా కోపంగానే ఉన్నారు. “ఆ పిచ్చి బ్రాహ్మణుని చేతుల్లో చిక్కుకొని నా జీవితం వృథా అయి పోయింది” అన్నారు. కాసేపయ్యాక, “కాని ఒక విషయం. ఏది ఇచ్చామో దానిని తిరిగి పొందలేం. అనంత జన్మలలో ఏదో ఒక్క దానినే ఆ పిచ్చి వ్యక్తి చేతుల్లో వృథా చేసుకోవలసి వచ్చింది!” అన్నారు.
————-
మాలో ప్రతి ఒక్కరమూ మా సొంత కాళ్ల మీద నిలబడాలి, అన్ని రంగాలలోనూ దీప్తించాలని స్వామీజీ అభిలషించారు. చెప్పులు కుట్టడం నుంచి చండీ పారాయణం వరకూ సమస్తం ఆయన మాకు నేర్పించారు. ఒక వైపు వేదాంతం, ఉపనిషత్తులు, సంస్కృత నాటకం మొదలైనవి వివరించారు. మరో వైపు వంట కూడా నేర్పించారు. మరే ఇతర మార్గాల్లో ఆయన మమ్మల్ని సిద్ధం చేశారన్నది మీకెలా చెప్పగలను!
————-
స్వామీజీ ప్రేమ అందరి మీదా ప్రసరించింది. గురుదేవులు జీవించిన కాలంలో జరిగింది ఈ సంఘటన: లాటూ మహరాజ్ (అద్భుతానంద) అప్పు డప్పుడు నిద్రపోయేవాడు. గురుదేవులకు ఇది నచ్చలేదు. ఆయనను పంపించివేద్దా మనుకొన్నారు. ఇది తెలియగానే స్వామీజీ గురుదేవుల వద్దకు వెళ్లి ప్రార్థించి అలా జరుగకుండా చూశారు. అందుకే కాలాంతరంలో లాటూ మహరాజ్, “సోదరుడంటే అది ‘లొరేన్’* మాత్రమే” అనేవారు.
స్వామీజీ ఎవరిలోనైనా కించిత్తు మంచితనం చూస్తే చాలు. దానిని ఆకాశ మంత విస్తృతించి శ్లాఘిస్తారు. ఆయన ఎంత శక్తిమంతులు! అందరి కోసం ఎంత ఉద్వేగం చెందేవారు! అందరినీ ఎంతగా అభిమానించారు! ఆయనలోని ప్రేమ లాంటిది ఎక్కడా కనిపించదు, భవిష్యత్తులో కానరాదు కూడా!
————-
స్వామి శారదానంద (శరత్)
కాశీపూర్ ఉద్యాన గృహంలో శ్రీరామకృష్ణులు ఉన్నప్పుడు స్వామీజీకి అనేక ఉపదేశాలు చేసి, భక్తిమార్గం తదితర మార్గాల్లో అనేక సాధనలు అనుష్ఠింప జేశారు. ఈ విధంగా ఈ విభిన్న సాధనలు అనుష్ఠించి అనుభవాలు పొందిన తరువాత ఆయన ప్రసంగాల ద్వారా లోకానికి బోధించారు. స్వీయ తెలివి, గురుదేవుల ఉపదేశాల తోడ్పాటుతో మాత్రమే ఆయన లోకానికి బోధించలేదు. ప్రతిదానినీ స్వయంగా తనూ, తన జీవితమూ పరీక్షించిన తరువాత ఉపదేశం చేశారు.
స్వామి అఖండానంద (గంగాధర్)
స్వామీజీ కోపానికి అతీతులు. “అక్రోధ పరమానంద” రూపులు ఆయన. రాజపుఠాణాలో ఒక క్షురకుడు నాకు క్షౌరం చేస్తూ ఇలా అన్నాడు : “మహరాజ్! మీ స్వామీజీ సాటిలేనివారు. మేం అజ్ఞానులం. ఆయన పాండిత్యం గురించి మాకేం తెలుసు? కాని ఒక్క విషయం. ఆయన లాంటి కోపాన్ని నిర్జించిన వ్యక్తిని నేను చూడలేదు. ఆయనతో వాదించి గెలవడానికి పండితులు వచ్చారు, ఆయనను అవమానపరిచే ప్రశ్నలు అడిగారు. కాని ఆయనకు కోపం రాలేదు. నవ్వుతూ వారి ప్రశ్నలకు జవాబు లిచ్చారు. ఆయనను గెలవడానికి వచ్చిన వారు పరాజితులై ఆయనకు ప్రణమిల్లి తిరుగుముఖం పట్టారు.”
————-
మనస్సు ఏకాగ్రతను సంతరించుకొన్నప్పుడు బాహ్యచైతన్యం నిష్క్రమిస్తుంది. స్వామీజీకి ఈ స్థితి కలగడం కద్దు. ఒకసారి రాజేంద్ర మిత్రా రచించిన బౌద్ధకాల చరిత్రను చదువుతున్నారు. కాసేపటికల్లా పుస్తకం చేతుల్లో నుంచి జారి క్రింద పడిపోయింది. ఆయన మనస్సు ఏదో తెలియని లోకంలో సంచరిస్తూన్నది. “ఇల్లు, వాకిలి, పుస్తకం, కుర్చీ, బల్ల – అన్నీ అదృశ్యమయ్యాయి, ఏమీ లేదు. ఏదో ఒక అనంత లోకంలో నా చైతన్యం లయించిపోతుంది” అంటూ ఈ స్థితిని గురించి స్వామీజీ చెప్పేవారు. శంకరుడు, బుద్ధుడు లాంటి వారికి ఈ స్థితి కలిగింది.
ఒక రోజు వేకువజాము సమయం. లేవగానే స్వామీజీని చూడాలని పించింది. తిన్నగా ఆయన గది వద్దకు వెళ్లి మెల్లగా తలుపు తట్టాను. ఆయన లేవకపోయి ఉంటే ఇబ్బంది పెట్టకూడదనుకొన్నాను. కాని ఒకసారి మెల్లగా తట్టగానే ఆయన ఒక ఆంగ్ల కవిత ద్వారా జవాబిచ్చారు.
తడుతూ తడుతూ ఉన్నది ఎవరు?
వేచివున్నా వేచివున్నా, నా ప్రియ సోదరా!
శాశ్వతంగా ఓ సోదరా నన్ను స్వీకరించు!
శాశ్వతంగా ఓ, పాపీ నన్ను విశ్వసించు!
నీ భారాన్నంతా శిలువ మీద సమర్పించు;
శాశ్వతంగా – ఓ, శాశ్వతంగా!*
————-
భారతదేశం పట్ల స్వామీజీకి ఎంత ప్రేమ! దాన్లో ఒక్క శాతం మాకు ఉందా? ఆయన సోదరులుగా ఉండీ మాలో ఆ ఉద్వేగం లుప్తమైనప్పుడు తక్కిన వారి గురించి ఏం వ్యాఖ్యానించగలం? దేశ కష్టాలన్నీ ఏకరవుపెట్టి ఆయన ఎంతగా కలత చెందేవారో కదా! అలా ఒక రోజు ఆయన కలత చెందినప్పుడు నేను ఆయనను, “ఎందుకు మన దేశం జాగృతి చెందలేదు?” అని అడిగాను. అందుకు ఆయన, “సోదరా! బానిసలుగా చేయబడిన జాతి, ఇలాగే ఉంటుంది” అన్నారు. ఆహా, స్వామీజీకి సాటిలేదు.
స్వామీజీ దేశభక్తి
భారతదేశం పట్ల స్వామీజీకి గల ప్రేమ అనన్య సామాన్యమైనది. అది దేశభక్తి కాదు, అది ‘దేశాత్మ బోధం’. సాధారణమైన వ్యక్తులకు ఉండేది ‘దేహాత్మ బోధం’, అంటే దేహాన్ని తానుగా భావించడం. స్వామీజీకి ఉన్నది ‘దేశాత్మ బోధం’, అంటే దేశాన్ని తానుగా భావించడం. దేశప్రజల సుఖదుఃఖాలు, వారి గతకాలం, భవిష్యత్తు, వర్త మానం మాత్రమే ఆయన చింతనలో చోటుచేసుకొన్నాయి. దేశాత్మ బోధంతోనే ఆయన ఉద్వేగం ఆగిపోలేదు. అది ‘విశ్వాత్మ బోధం’ గా విస్తృతించింది – భారతీయులకు మాత్రమే కాదు; లోకంలోని ప్రాణికోటితో మమేకమై వారి కోసం ఆయన కలత చెందారు. అందుకే లోకంలోని యావన్మందికీ ముక్తి కలుగకుండా ఆయనకు ముక్తి లేదు.
స్వామి విజ్ఞానానంద (హరిప్రసన్న)
ఒకరోజు ఉదయం స్వామీజీ ఆలయం నుంచి క్రిందికి దిగి వస్తున్నారు. నా ప్రక్కకు వచ్చి వికసిత వదనంతో, “శ్రీకృష్ణుణ్ణి చూడగలుగుతున్నావా? ఇదిగో, ఇదిగో, ఇక్కడే నిలబడి ఉన్నాడు” అన్నారు. మా కళ్లకు ఎవరూ కనిపించలేదు.
————-
“ఒక రోజు స్వామీజీ తమ గదిలో ధ్యానమగ్నులై ఉన్నారు. అప్పుడు ఆయన దేహం నుంచి ఒక అద్భుత ప్రకాశం కనిపించింది. ఆ ప్రకాశంతో ఆ గది అంతా జ్యోతిర్మయపు వెల్లువలో మునిగిపోయింది. నేను దిగ్భ్రమతో దానిని చూస్తూ నిలబడి ఉన్నాను. ఆయన సామాన్యమైన మనిషా!”
స్వామీజీ ఒక సజీవ విజ్ఞాన సర్వస్వంగా విరాజిల్లారు. ఒకరోజు భారత దేశం, తక్కిన దేశాల భవన నిర్మాణం గురించి చెప్పారు. దాని ప్రాతిపదిక, వికాసం మొదలైన ప్రతి అంశాన్నీ ఆయన వివరించడం చూసి నేను విస్తు పోయాను.*
————-
బేలూర్ మఠంలో ఒక రోజు రాత్రి “అమ్మా! నువ్వే నా రక్షకురాలివి” అనే పాట పాడుతూ తమ గది వసారాలో స్వామీజీ పచార్లు చేస్తున్నారు. హఠాత్తుగా పారవశ్య స్థితిలో అట్లే నిలిచిపోయారు. ఆయన కళ్ల నుంచి ఆనందబాష్పాలు చెంపలమీదుగా స్రవిస్తున్నాయి. మళ్లీ పచార్లు చేయసాగారు. ఇలాగే రాత్రంతా గడిచింది!
నీలాంబర మఠంలో ఒకరోజు స్వామీజీ తమ గది నుంచి బయటకు వస్తున్నారు. నేను ఆయన పాదపద్మాలను తాకి ప్రణమిల్లడానికి వంగాను. ఆయన పాదాలను స్పృశించానో లేదో చేతులకు విద్యుదాఘాతమైనట్లు అనిపించింది! వెంటనే చటుక్కున చేతులను విదిలించుకొన్నాను.
విద్యుదాఘాతం
అది చూడగానే స్వామీజీ, “ఏమిటి పేసన్* ఏమైంది?” అని అడిగారు. నేను ప్రశాంతంగా, “ఏమీలేదు స్వామీజీ! మీ పాదాలు తాకగానే నాకు ఏదో ఆఘాతం అయినట్లు అనిపించింది” అన్నాను. అందుకు స్వామీజీ మృదు స్వరంలో, “అమెరికాలో నా ఆధ్యాత్మిక శక్తిని ఎక్కువగా వెచ్చించాను. నేను అక్కడ ఉన్నప్పుడు నా ఆధ్యాత్మికశక్తి ఇంకా తీవ్రంగా ఉండేది!” అన్నారు.
ఆయన అమెరికన్ శిష్యులు పలువురు, “మాట, దృష్టి, స్పర్శలతో కూడా స్వామీజీ మాకు ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలు కలిగించారు” అని చెప్పారు!
స్వామి అద్భుతానంద (లాటూ)
ఓ! స్వామీజీకి రామకృష్ణుల పట్ల గల భక్తి ప్రపత్తులు ఎంత ఉన్నతమైనవి! ఒకసారి శ్రీరామకృష్ణులు ఒక జత పాదరక్షలను ఆయనకు ఇచ్చారు. కాని గురుదేవులు ఇచ్చారనే భావనతో ఆయన వాటిని ధరించలేదు! భక్తి అంటే ఏమిటో ఇతరులు ఆయన నుంచి నేర్చుకోవాలి.
————-
స్వామీజీ అమెరికా నుంచి వచ్చారు. ఆయన కీర్తినీ, ఆయనను పరివేష్టించి ఉన్న జనసమూహాలనూ చూసి నేను ఆయన ప్రక్కకు వెళ్లడానికి సంకోచించాను. కాని స్వామీజీ వచ్చి నా చేతులు పుచ్చుకొని, “ఎందుకు ఈ సంకోచం! నేను అదే పాత ‘లొరేన్’ నే, నువ్వు పాత ‘లెట్టో’ వే. నువ్వు ఇప్పుడు చూస్తున్న వైభవమంతా భగవంతుని మహత్త్వం” అన్నారు. ఎన్నో జన్మలలో పుణ్యం చేసుకొని ఉంటేనే ఒక వ్యక్తి వివేకానందను సోదర సన్న్యాసిగా పొందగలడు. మమ్మల్నందరినీ చూసుకోమని గురుదేవులు ఆయనతో చెప్పారు. ఆహా! స్వామీజీ మా కోసం ఏం చేయలేదు కనుక! అవును, నేను వివేకానందను అర్చిస్తున్నాను.
స్వామి అభేదానంద (కాళీప్రసాద్)
మూడు మహోన్నత దేశాలలో అత్యున్నతమైన ప్రశంసలు స్వామీజీ అందుకొన్నారు. అయినప్పటికీ ఆయన మనస్సు గర్వించలేదు, ఆత్మస్తుతికి లోను కాలేదు. గురుదేవుల పాపపద్మాల నుండి అరక్షణం కూడా వైదొలగలేదు. అమెరికా వెళ్లడానికి ముందు విరాజిల్లిన బాలుని వంటి నిష్కాపట్యం, వినమ్రత, పరిత్యాగం అమెరికా దిగ్విజయం తరువాత కూడా ఆయనలో చెక్కుచెదరక అట్లే ఉన్నాయి. తమ మీద కురిపించిన కీర్తి, ప్రతిష్ఠల లాంటివన్నీ అశాశ్వతమని ఆయనకు తెలియనిది కాదు. ఒక తాత్త్వికుని స్థితిలో ఆయన ప్రాచ్య పాశ్చాత్య తాత్త్వికు లందరిలో అద్వితీయునిగా విరాజిల్లారు. వేదాంత విభాగాలన్నింటికీ సజీవ దృష్టాంతంగా ఆయన భాసిల్లారు.
————-
దైవాంశ సంభూతుడు
స్వామీజీ సోదర సన్న్యాసులలో కొందరు ఆయనను గురించి చేసిన వ్యాఖ్యానాలు కొన్నింటిని చూశాం. అందరూ ఆయనను కొనియాడారు. ఎందుకు? స్వామీజీలా వారు శ్రీరామకృష్ణుల శిష్యులే కదా! వారిలో కొందరు స్వామీజీ కన్నా వయస్సులో పెద్దవారు కూడా! అయినప్పటికీ వారందరూ ఆయనను నేతగా, గురువుగా గౌరవించారు. ఎందుకు? శ్రీరామకృష్ణులు స్వామీజీ గురించి ఉన్నతంగా చెప్పినవి మాత్రమే ఇందుకు కారణం కాదు. శ్రీరామకృష్ణుల శిష్యులు పలువురు స్వామీజీ దివ్య త్వాన్ని నిర్దుష్టంగా గ్రహించారు. ఆయన దైవాంశ సంభూతుడని వారు నిదర్శన పూర్వకంగా గాంచారు. అలాంటి సంఘటనలు ఒకటి రెండింటిని చూద్దాం.
శ్రీరామకృష్ణులతో అభిన్నంగా
స్వామీజీని సాక్షాత్తూ శ్రీరామకృష్ణులుగానే గాంచారు ప్రేమానంద. ఆ సంఘటన ఇది: ఒకసారి స్వామీజీ శిష్యుడైన శరశ్చంద్రకు స్వామీజీని పూజించి ఆరాధించాలనే అభిలాష కలిగింది. ఆతడు ఇందుకోసం స్వామీజీ వద్ద అనుమతి కోరాడు. మొదట్లో నిరాకరించిన స్వామీజీ, శరశ్చంద్ర మొండిపట్టుదలనూ, ప్రాధేయపడడాన్నీ చూసి చివరకు సమ్మతించారు. శరశ్చంద్ర ఆలయానికి వెళ్లి శ్రీరామకృష్ణుల పూజకు వినియోగించే పాత్రలు మొదలైనవి తెచ్చి స్వామీజీని పూజించి ఆరాధించాడు. ఆతడి అభిలాష ఈడేరింది.
పూజ ముగియగానే స్వామీజీ శరశ్చంద్రతో, “సరి, నీ పూజ ముగిసింది. కాని గురుదేవుల ఆరాధనకు వినియోగించే పాత్రలు మొదలైనవి ఉపయోగించావు. ఇది దైవదూషణ కాదా? ఇది తెలిస్తే బాబూరాం ఆగ్రహోదగ్రుడవుతాడు” అన్నారు. స్వామీజీ మాటలు పూర్తిచేసే లోపునే ప్రేమానంద అక్కడకు వచ్చారు. వెంటనే స్వామీజీ ఆయనతో, “బాబూరాం! ఎంతటి దైవదూషణ జరిగిపోయిందో చూశావా? గురుదేవుల పూజా సామగ్రిని ఇతడు ఇక్కడ ఉపయోగించాడు” అన్నారు. ప్రేమానంద ఇది విని ఆనంద దరహాసం ముఖాన వెల్లివిరియగా, “మంచిపని చేశాడు. మీరూ శ్రీరామకృష్ణులూ అభిన్నులు!” అన్నాడు.
భైరవుల పహారాలో
తరువాతి సంఘటన శివానంద జీవితంలో జరిగింది. వరాహ నగర మఠంలో ఒక రోజు స్వామీజీ, శివానంద ఒకే దోమ తెరలో నిద్రిస్తున్నారు. హఠాత్తుగా సర్వత్రా కాంతి వెల్లువ వ్యాపించింది. శివానందకు నిద్రాభంగమయింది. కళ్లు తెరచి చూస్తే దోమతెర బయట పరమేశ్వరుని లాంటి ఆకృతిలో చిన్నరూపంలో పలువురు ధ్యానమగ్నులై ఉన్నారు. వారి చేతుల్లో త్రిశూలాలున్నాయి. వారి దేహం నుంచీ, త్రిశూలాల నుంచీ కాంతి వెల్లువ వ్యాపించింది. ఏదో భ్రాంతి అనుకొని శివానంద కళ్లు నులుముకొని మళ్లీ చూశారు. లేదు, భ్రాంతి కాదు, వారు నిజంగానే కూర్చుని ఉన్నారు. ఏమీ పాలుబోక ఆయన స్వామీజీని లేపారు. వారిని చూపించారు. కాని స్వామీజీ ఆ సంఘటనను పెద్దగా పట్టించుకోలేదు. ఏ జవాబూ చెప్పకుండా శివానందను కూడా పడుకోమని తామూ పడుకొన్నారు. ఈ రీతిలో రాత్రి గడిచింది. శివానంద వదలిపెట్టలేదు. ఉదయం మళ్లీ స్వామీజీని దానిని గురించి ప్రశ్నించారు. స్వామీజీ అప్పుడు కూడా దానిని పెద్దగా పట్టించుకోకుండా, “వారు పడక భైరవులు.* నా చిన్నతనం నుంచే వారు నన్ను ఇలా పరిరక్షిస్తున్నారు” అంటూ అంటీ అంటనట్లు చెప్పి వెళ్లిపోయారు.
ఇక బ్రహ్మానంద జీవితంలో జరిగింది చూద్దాం. స్వామీజీ ఉన్న స్థలంలో ఆధ్యాత్మిక తరంగాలు ఉత్పన్నమవుతాయని బ్రహ్మానంద వచించడం కద్దు. “నరేన్తో ధ్యానానికి కూర్చుంటే వెంటనే మనస్సు ధ్యానంలో లయించిపోతుంది. నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు అలా జరగదు” అనేవారు ఆయన. కాని ఒకసారి స్వామీజీని సాక్షాత్తూ పరమేశ్వరునిగా ఆయన అభివర్ణించారు:
స్వామీజీ సాక్షాత్తూ పరమేశ్వరుడే!
ఒకరోజు మధ్యాహ్న సమయంలో స్వామీజీ పడుకొని ఉన్నారు. అప్పుడు తమ శిష్యుడైన శరశ్చంద్రను పిలిచి, “ఇదిగో చూడు నాయనా! నా కాళ్లు కాస్త ఒత్తు” అన్నారు. అతడు కొన్ని నిమిషాలు ఒత్తగానే, “చాలు, ఇది నీకు తగిన పని కాదు. వెళ్లి రాజాను రమ్మను” అన్నారు. అప్పుడు బ్రహ్మానంద నిద్రిస్తున్నారు. స్వామీజీ పిలుపును వినగానే తక్షణమే వచ్చి ఆయన పాదాల చెంత కూర్చుని కాళ్లు ఒత్తసాగారు. దాదాపు రెండు గంటలసేపు గడిచింది. స్వామీజీ నిద్రలోకి జారుకొన్నారు. ఆ తరువాత బ్రహ్మానంద లేచి తమ గదికి వెళ్లిపోయారు. అదంతా విస్తుబోయి చూస్తూ నిలబడ్డ శరశ్చంద్ర, బ్రహ్మానందతో, “మహరాజ్! మీరు శ్రీరామకృష్ణుల మానస పుత్రులు, స్వామీజీ సోదర శిష్యులు. స్వామీజీ మీ పట్ల అమిత గౌరవం పాటిస్తారు. కాని ఈ రోజు తమ కాళ్లు ఒత్తమని మీకే పురమాయించారు. అది ఎందుకో నాకు అర్థం కాలేదు” అన్నాడు. ఈ ప్రశ్న బ్రహ్మానందను ఆశ్చర్యపోయేలా చేసింది. ఏదో అపచారం జరిగిపోయినట్లు, “ఏయ్, ఏమంటున్నావు! ఆయన సాక్షాత్తూ పరమేశ్వరుడు! నీకేం తెలుసు?” అని ప్రకోపించిన ఉద్వేగంతో అడిగారు.
కాని స్వామీజీ మాత్రం ఇవి ఏవీ ప్రదర్శించకుండా, వీరి పట్ల ప్రేమాను రాగాలు కురిపిస్తూ, వారి నరేన్గానే జీవించారు.
మాతృదేవి దృష్టిలో
మాతృదేవి, స్వామీజీ పరస్పరం ఎలా చూసుకొన్నారో చూద్దాం. మాతృమూర్తి శ్రీశారదాదేవిని సాక్షాత్తూ జగజ్జననిగానే స్వామీజీ గాంచారు. శ్రీరాముని వైభవాలను అభివర్ణించే గ్రంథమైనప్పటికీ దాని నిజమైన మహత్త్వాన్ని సీతాదేవికి ఆపాదించే రీతిలో తమ గ్రంథాన్ని ‘సీతాచరితమ్’ అని వాల్మీకి పేర్కొన్నారు.* అదేవిధంగా స్వామీజీ కూడా తమ పాశ్చాత్య దిగ్విజయమూ, తమ విజయాలూ మాతృదేవి అనుగ్రహం వల్లనే సిద్ధించాయని చెప్పేవారు. ప్రారంభ రోజుల్లో ఆయన శ్రీరామకృష్ణుల దివ్యత్వాన్ని సందేహించడం కద్దు. కాని మాతృదేవి అనుగ్రహశక్తి పట్ల ఆయన ఎన్నడూ సంశయించి ఎరుగరు. మాతృదేవి పట్ల ఆయన చెల్లించిన భక్తిప్రపత్తులు సాటిలేనివి. ఒక రోజు స్వామీజీ తమ శిష్యుడైన శుద్ధానందతో కలసి మాతృదేవి దర్శనార్థం వెళ్లారు. వెళ్లగానే ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశారు. మాతృదేవికి ప్రణమిల్లమని శుద్ధానందతో చెప్పారు. సుధీర్ తన చేతులతో మాతృదేవి పాదాలు స్పృశించి మాత్రమే ప్రణమిల్లాడు. స్వామీజీ అది భరించలేకపోయారు. “ఏం చేస్తున్నావు! మాతృదేవికి ఎలా ప్రణమిల్లాలో ఇంతదాకా నేర్చుకోలేదా? ఎలా ప్రణమిల్లాలో చూడు” అంటూ మళ్లీ మరొకసారి ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తరువాత శుద్ధానంద అట్లే నమస్కరించాడు. శుద్ధానందను దీవించాల్సిందిగా మాతృదేవిని స్వామీజీ అర్థించారు.
ఒకసారి మాతృదేవి బేలూర్ మఠానికి వచ్చి తిరిగి వెళుతున్నప్పుడు, ఆమె పయనించ వలసిన పడవ బురదలో కూరుకుపోయింది. అది తమ గది నుంచి చూసిన స్వామీజీ వెంటనే ఒక్క పరుగున అక్కడకు వెళ్లి, నడుం బిగించి, స్వయంగా తానే పడవను త్రోయసాగారు. ఆయనకు మాతృదేవి పట్ల గల భక్తి అద్వితీయం!
స్వామీజీ మాతృదేవిని ప్రారంభం నుంచే పూర్తిగా స్వీకరించారు. “అమ్మా! మీ గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. ఒక్కటి మాత్రం చెప్పగలను – మీ అనుగ్రహంతో వందలకొద్దీ వివేకానందలు ఉద్భవించగలరు. కాని మీ లాంటి మాతృదేవి మరొకరు ఉండరు. మాతృదేవి మీరు మాత్రమే” అని ఒకసారి ఆమెతోనే చెప్పారు.
మాతృదేవి స్వామీజీని ఎలా పరికించారు? సామాన్యంగా ఆమె స్వామీజీని ‘నా నరేన్’, ‘అనుంగు నరేన్’ అని పేర్కొనడం కద్దు. మాతృదేవి ఉదాహరణతో ఈ అధ్యాయాన్ని ముగిద్దాం:
“నరేన్ దివ్యత్వం నుంచి జన్మించాడు. శిశుప్రాయం నుంచే పావనతా, పవిత్రతా పొంగిపొరలిన వ్యక్తి. ఆతడు ఒక ఋషి అని గురుదేవులే వచించారు. తమ ఉన్నత ఆదర్శాలను ప్రచారం చేయడానికీ, పామరుల ఉద్ధరణకూ, మానవాళి హితం కోసమూ శ్రీరామకృష్ణులచే సప్తర్షి మండలం నుంచి ప్రత్యేకించి తోడ్కొని రాబడిన వ్యక్తి అతడు. సప్తర్షులలో అగ్రగణ్యుడతడు. వందలమంది ఋషులలో అతడు అద్వితీయుడని గురుదేవులు చెప్పి ఉండవచ్చు, కాని ఆయన ప్రత్యేకించి ఏడుగురు ఋషులను ప్రస్తావించి, వారిలో ఇతడు అతి గొప్పవాడని తెలిపారు.
“సన్న్యాసం ఆతడి అంతరాంతరాళాల్లో ఊరిపోయి ఉంది; వివక్ష లేకుండా సమస్తాన్నీ అక్కున చేర్చుకొనే ప్రేమ ఆతడి సొంతం; అనంతమైన పరమాత్మతో అవిచ్ఛిన్నంగా సంబంధం కలిగి సదా ఆ పరమానందంలో లయించి ఉండేవాడు – అంతటి వాడు ఇతరుల హితం కోసం యాతనలు స్వీకరించాడు, ఇతరుల సేవకై తన జీవితాన్ని సమర్పించాడు.
“నరేన్ చేసిన కార్యం కాలాల పర్యంతం నిలచి ఉంటుంది. ఆతడు ఈ మహత్కార్యార్థమే జన్మించాడు. లోకానికి వెలుగు అందించే ఆచార్యునిగా, జగద్గురువుగా ఆతణ్ణి వేలమంది ప్రశంసిస్తారు!”