విశాలమైన మీ ఉదారాశయాలు ఏదో ఒక రోజు సర్వజనాంగీకారాన్ని పొందుతాయని నా దృఢ విశ్వాసం. కారణం ఆ భావనలు సర్వతో ముఖాలు, ప్రతి కార్యరంగంలోనూ, ప్రతి ఆలోచనా విధానంలోనూ ఉత్తేజాన్ని కలిగించేవి కాబట్టి.
– శరశ్చంద్ర (స్వామీజీతో)
ఇదిగో భగవంతుడు ఉన్నాడు! — ‘ఇదిగో ప్రత్యక్షమైన భగవంతుడు!’ — తీర్థం — దైవంగా — ‘సూర్య చంద్రులను నిరోధిస్తాను!’ — గాయత్రీదేవి ధ్యాసలో — దుర్గా పూజ — ప్రార్థించి తెచ్చుకొన్న జ్వరం
కాళీ పూజ — మొక్కు నెరవేర్చడం — జపాన్ నుంచి ఆహ్వానం — స్వాతంత్ర్యాన్ని యాచించవద్దు
రామకృష్ణానంద సానుభూతి — గయలో — కేదారేశ్వర ఆలయంలో — సహస్ర శివాలయాలు — సేవాశ్రమం — ‘అనంత సాగరం’ ఆయన — తిరిగి బేలూరు మఠానికి
ఇదిగో భగవంతుడు ఉన్నాడు!
గగనతలంలో జీవించే ఒక ఋషివరేణ్యుడే స్వామీజీగా అవతరించారని శ్రీరామ కృష్ణులు పేర్కొన్నారు. కాని స్వామీజీ మాత్రం సాధారణమైన వ్యక్తిగానే తనను వ్యక్తం చేసుకొన్నారు. ఆయన జీవన విధానం అందుకు అద్దం పట్టింది. అదే సమయంలో దివ్యశక్తి కొన్ని సమయాలలో ఆయనను సైతం అతిక్రమించి అభివ్యక్తమవడమూ కద్దు. ఆ సమయాలలోనూ ఆ ఘనతను తనకు ఆపాదించుకోకుండా గురుదేవుల అనుగ్రహం వల్లనే జరిగిందని ఆయన వినమ్రంగా చెప్పేవారు. అటువంటి కొన్ని సంఘటనలు పరికిద్దాం.
ఒక రోజు శరశ్చంద్ర మఠానికి వచ్చాడు. స్వామీజీ దేశభవిష్యత్తు గురించిన ఆలోచనల్లో మునిగి ఉన్నారు. తమను అవగాహన చేసుకొని తమ ఉద్వేగానికి దీటుగా కార్యాచరణ నిర్వహించే వారెవరూ కానరాలేదు, తమకు అలాంటి శిష్యుడు ఎవరూ లభించలేదనే ధోరణిలో ఆయన మాటలు సాగాయి.
స్వామీజీ : నా ఉద్యమంలో తోడ్పడడానికి మీ రెవరూ ముందుకు రావడం లేదు. ఒంటరిగా నేనేం చేయగలను?…. నచికేతుని లాంటి శ్రద్ధ గల పది మంది నాకు దొరికితే ఈ దేశ ప్రజల ఆలోచనల్నీ, విధానాల్నీ క్రొత్త పుంతలు త్రొక్కించగలను…. గురుదేవుల అనుగ్రహం వలన ఈ యువకుల్లో నుంచే సకాలంలో కార్యధురీణులు, పారమార్థిక బలసంపన్నులైనవారు నా ఆదర్శాలను ఆచరణలో పెట్టడానికి వస్తారేమో!
శరత్ : విశాలమైన మీ ఉదారాశయాలు ఏదో ఒక రోజు సర్వజనాంగీ కారాన్ని పొందుతాయని నా దృఢ విశ్వాసం. కారణం ఆ భావనలు సర్వతో ముఖాలు, ప్రతి కార్యరంగంలోనూ ప్రతి ఆలోచనా విధానంలోనూ ఉత్తేజాన్ని కలిగించేవి కాబట్టి. ఈ దేశ ప్రజలు మీ భావాలను బహిరంగంగా గాని, రహస్యంగా గాని ఆమోదించి వాటిని ప్రజలకు బోధిస్తున్నారు.
స్వామీజీ : వారు ఆ భావనలు నావి అని చెబితే ఏమి? చెప్పకపోతే ఏమిటి? నా భావనలను వారు అంగీకరిస్తే చాలు…. ప్రజలు మనలను మంచివాళ్లనవచ్చు లేదా చెడ్డవాళ్లనవచ్చు. కాని ఆదర్శాన్ని ముందు ఉంచుకొని నీతి నిపుణులు భూషించినా, దూషించినా లెక్కచేయకుండా సింహాల్లా మనం పనిచేయాలి.
శరత్ : ఇప్పుడు మనం ఏ ఆదర్శాన్ని అనుసరించాలి?
స్వామీజీ : హనుమన్మహావీరుడే మన కిప్పుడు ఆదర్శ పురుషుడు…. ఎదురు చెప్పకుండా గుర్వాజ్ఞను పాలించడం, కఠోర బ్రహ్మచర్య పాలన – ఇవే జయం పొందడానికి కీలకాలు. హనుమంతుడు ఒక వైపు దాస్యభావానికి ఆదర్శమూర్తి. మరో వైపు లోకాన్ని హాహాకారాలెత్తించే సింహసదృశ బలాన్వితుడు. రామ కార్యార్థమై తన జీవితాన్ని త్యాగం చేయడానికి ఏ మాత్రం వెనుకాడడు….
‘ఖోల్’ వాయిస్తూ ‘కరతాళ’ ధ్వనులు చేస్తూ సంకీర్తన పిచ్చిలో గంతులు వేయడంతో జాతి మొత్తం నీరుగారిపోయింది. ప్రప్రథమంగా వారు అజీర్ణ వ్యాధిగ్రస్థమైన జాతికి చెందిన వారు. దానికి తోడు ఈ విధంగా గంతులు వేస్తూ ఎగురుతుంటే శ్రమను ఎలా భరించగలరు? పరిపూర్ణమైన పారిశుద్ధ్యం ఉత్తమ సాధనకు ఎంతో అవసరం. కాని ఆ ఉత్తమ సాధనను అనుకరించడానికి ప్రయత్నించడంలో వారు గాఢ తమస్సులో కూరుకుపోయారు. నువ్వు ఏ జిల్లాకు వెళ్లినా, ఏ గ్రామానికి పోయినా ఈ ‘ఖోల్’, ‘కరతాళ’ ధ్వనులే వినిపిస్తాయి. ఈ దేశంలో భేరీలు తయారుచేయడం లేదా? బాకాలూ, ఢంకాలూ ఈ దేశంలో దొరకడం లేదా? ఈ వాద్యాల నుంచి వచ్చే గంభీర శబ్దాలను మన పిల్లలను విన నీయండి, చిన్నప్పటి నుంచి ఈ ఆడంగి సంగీతాలు, సంకీర్తనలు విని విని దేశం దాదాపు స్త్రీమయమైపోయింది. అంటే పురుషుల్లో పురుషత్వం చచ్చిపోయిందన్న మాట! అంగాంగ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ పతనం కాకుండా ఏమవుతారు? ఈ చిత్రాన్ని రూపుకట్టడానికి కవి హృదయం కూడా చాలదు.
డమరుకాలు వాయించాలి, కొమ్ములు ఊదాలి, భేరీలు మ్రోగించాలి. గంభీర యుద్ధ నినాదాలు చెలరేగి ‘మహావీర! మహావీర’ అంటూ ‘హరహర! వ్యోం వ్యోం!’ అనే అరుపులతో దిక్కులు పిక్కటిల్లాలి. మనిషిలో సున్నిత భావాలను రేకెత్తించే సంగీతం ఇప్పుడు కొంతకాలం ఆపివేయాలి. ‘ఖేయల్’, ‘టప్పా’ మొదలైన లలిత స్వరాలను కొంతకాలం ఆపివేసి, ప్రజలు ‘ద్రుపద’ సంగీతం వినేట్లు అలవాటు చేయాలి. గంభీరమైన వేదఋక్కుల మేఘగర్జనతో దేశానికి ప్రాణం పోయాలి. ప్రతి విషయంలోనూ వీరోచితమైన పురుషత్వాన్ని పునరుజ్జీవింపజేయాలి. అటు వంటి ఆదర్శంతో మీ శీలాన్ని నిర్మించుకోగలిగితే తరువాత వేయిమంది మిమ్మల్ని అనుకరిస్తారు. కాని ఆ ఆదర్శం నుంచి ఒక్క అంగుళమైనా వైదొలగకుండా జాగ్రత్త వహించు, అధైర్యపడవద్దు. ఆహార వ్యవహారాల్లో గాని, దుస్తుల విషయంలో గాని, నిద్రించడంలో గాని, ఆటల్లో గాని, పాటల్లో గాని, భోగంలో గాని, రోగంలో గాని సదా ఉత్తమమైన నైతిక బలాన్ని ప్రదర్శించు. అప్పుడే జగజ్జనని మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది.
శరత్ : ఒక్కోసారి నాకు నిరుత్సాహం కలుగుతుంది.
స్వామీజీ : అలా నిరుత్సాహం కలిగినప్పుడు ఈ విధంగా తలచుకో: ‘నే నెవరి శిష్యుణ్ణి? అలాంటి వారి సాహచర్యంలో ఉన్న నాకు ఇలాంటి మనోదౌర్బల్యం, హృదయ దౌర్బల్యం కలగడమా?’ అలాంటి మానసిక హృదయ దౌర్బల్యాన్ని అణగద్రొక్కి ఈ విధంగా చెబుతూ లేచి నిలబడు. ‘నేను ధీరుణ్ణి, మేధావంతుణ్ణి. నేను బ్రహ్మజ్ఞానిని, ప్రజ్ఞావంతుణ్ణి, కామినీ కాంచనాలను జయించిన శ్రీరామకృష్ణుల జీవిత సహచరుడైన ఫలానా వారి శిష్యుణ్ణి’ అనే విషయం జ్ఞాపకముంచుకొని నీ గొప్పతనాన్ని పూర్తిగా గుర్తుంచుకో. ఇది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి భావన లేని వ్యక్తిలో బ్రహ్మం జాగృతి చెందదు…. అప్పుడు మనోదౌర్బల్యం, హృదయ దౌర్బల్యం నీ దరి చేరలేవు. నీ మనస్సును సదా దౌర్బల్యానికి వశం కానివ్వవద్దు. మహావీరుడైన హనుమంతుని జ్ఞప్తికి తెచ్చుకో! జగజ్జననిని గుర్తుంచుకో! బలహీనత, పిరికితనం తక్షణమే పూర్తిగా మటుమాయమవుతాయి.
‘ఇదిగో ప్రత్యక్షమైన భగవంతుడు!’
ఈ విధంగా చెబుతూ స్వామీజీ క్రింది అంతస్తుకు వచ్చి మామూలుగా కూర్చుండే ప్రాంగణంలో ఉన్న మంచం మీద కూర్చున్నారు. అక్కడ సమావిష్టులై ఉన్న బ్రహచారులనూ, సన్న్యాసులనూ ఉద్దేశించి ఇలా అన్నారు: “ఇదిగో బ్రహ్మం ఇక్కడ ప్రత్యక్ష రూపంలో ఉంది. దీనిని అశ్రద్ధ చేసి ఇతర విషయాల మీద మనస్సు నిలిపే వాళ్లు తుచ్ఛులు! ఆహా! కరతలామలకంలా ఇక్కడ బ్రహ్మం ప్రత్యక్షంగా ఎదుట ఉంది. మీకు కనిపించడం లేదా? ఇదిగో ఇక్కడే!”
మనస్సుకు హత్తుకునేటట్లుగా మాట్లాడిన ఈ మాటల వలన ప్రతి ఒక్కరూ గుడ్డ మీద చిత్రింపబడిన బొమ్మల్లా నిశ్చేష్టులై నిలబడ్డారు. అకస్మాత్తుగా గాఢ ధ్యానంలో మునిగిపోయినట్లు అనుభూతి చెందారు. అప్పుడు ప్రేమానంద గంగలో స్నానమాచరించి, చేత గంగాజలం ఉన్న కమండలం పుచ్చుకొని పూజా మంది రానికి వెళుతున్నారు. ఆయనను చూడగానే స్వామీజీ మళ్లీ “ఇదిగో – ప్రత్యక్ష దైవం” అన్నారు. ఈ మాటలు వినగానే ప్రేమానంద అట్లే శిలలా నిలబడి పోయారు. ఆయన మనస్సు సమాధిమగ్నమయింది. ఇలా దాదాపు 15 నిమిషాలు అందరూ పరమానంద భావనలో లయించిపోయి నిశ్చలంగా తామున్న స్థితిలోనే అట్లే ఉండిపోయారు. ఆ తరువాత స్వామీజీ, “ఇక పూజ చేయడానికి వెళ్లు” అన్నారు. వెంటనే ప్రేమానందకు బాహ్యస్మృతి కలిగింది. ఆయన మెల్లగా పూజా మందిరానికి వెళ్లారు. తక్కినవారు క్రమక్రమంగా మామూలు స్థితిలోకి వచ్చారు.
తరువాత వాహ్యాళికి వెళ్లినప్పుడు శిష్యునితో స్వామీజీ ఇలా అన్నారు: “ఈ రోజు ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఏకాగ్రచిత్తులైనారో చూశావా? వీరంతా శ్రీరామకృష్ణుల బిడ్డలు కదా! కాబట్టి చెప్పగానే సత్యానుభూతి కలిగింది.”
శరత్ : స్వామీజీ! వారి విషయం దాకా ఎందుకండి! నా హృదయమే దివ్యానందంతో పొర్లిపోయింది. ఇప్పుడది కరిగిపోయిన కలలా కనిపిస్తున్నది.
స్వామీజీ : సకాలంలో సర్వమూ సమకూరుతుంది. ఇప్పుడు పనిచేస్తూ ఉండు. అజ్ఞాన భ్రాంతిలో మునిగిపోయిన వారి హితం కోసం కొంత పనిచేయడానికి పూనుకో! అప్పుడు అటువంటి అనుభవాలు వాటంతట అవే నీకు ఒనగూరుతాయి.
తమ శక్తితో ఏదీ జరగలేదంటూ, “శ్రీరామకృష్ణుల బిడ్డల” వలన జరిగిందని వినమ్రంగా చెప్పి తనను నేపథ్యంలో ఉంచుకొన్న మహనీయులు స్వామీజీ.
తీర్థం
ఒక రోజు స్వామీజీ శిష్యుడైన నిర్భయానందకు 107⚬F దాకా జ్వరం వచ్చి సన్నిపాతం వాటిల్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. జ్వరం తగ్గే సూచనలు కనిపించకపోవడంతో స్వామీజీ అమిత ఆందోళనకు గురియైనారు. హఠాత్తుగా దివ్యోద్వేగానికి లోనైనట్లు దేవాలయానికి వెళ్లి శ్రీరామకృష్ణులను అర్చించారు. ఆయన పావన అస్థికల పెట్టెను నీటితో కడిగి, ఆ తీర్థాన్ని తెచ్చి నిర్భయానందను త్రాగమన్నారు. ఆతడు త్రాగగానే జ్వరం కాస్త ప్రకోపించి తరువాత పూర్తిగా తగ్గిపోయింది. “శ్రీరామకృష్ణుల శక్తిని చూడండి. ఏ అద్భుతాన్ని ఆయన నిర్వర్తించలేరు!” అన్నారు స్వామీజీ. తమ శక్తిగా ఆయన దేనినీ ప్రకటించుకొన్నది లేదు.
దైవంగా
కాని కొన్ని సమయాలలో తమ ఎరుక లేకుండా ఆయన దివ్యత్వాన్ని అభివ్యక్తం చేయడం కద్దు. కొన్ని సంఘటనలు పరికిద్దాం. ఒకసారి ఒక పాశ్చాత్య విద్యార్థిని స్వామీజీతో, “ఆహా! నేను కొంతకాలం క్రితమే జన్మించి ఉంటే శ్రీరామకృష్ణులను దర్శించి ఉండవచ్చు” అన్నది. స్వామీజీ ఆమె వైపు తిరిగి ప్రశాంతంగా, “ఎందుకు, నన్ను చూస్తున్నా వుగా!” అన్నారు.
మిసెస్ హాన్స్బరో ఒకసారి, “స్వామీజీ! మీ పని గురించి మీరు ఏమను కొంటున్నారు?” అని స్వామీజీని అడిగింది. అందుకు స్వామీజీ ప్రశాంతంగా, “నేను మరణించిన పదేళ్ల లోపుగానే నన్ను దైవంగా ఆరాధిస్తారు” అని జవాబిచ్చారు.
ఒకరోజు స్వామీజీ మృదుస్వరంలో, “ 200 ఏళ్లు గడిచిన తరువాత, ఈ వివేకానంద ఒక్క శిరోజం కోసం ప్రజలు వ్యాకులత చెందుతారు” అన్నారు.
ఇక ఇతరులు ఆయనలో గాంచిన కొన్ని దివ్యత్వ అభివ్యక్తీకరణలను చూద్దాం.
‘సూర్య చంద్రులను నిరోధిస్తాను!’
చిన్నతనం నుంచీ ఆంజనేయుడు స్వామీజీకి ఆదర్శ పురుషుడు. యువకులు ఆయననే ఆదర్శంగా తీసుకోవాలని స్వామీజీ తరచూ నొక్కివక్కాణించేవారు. ఒకసారి ఆయనే ఆంజనేయమయమైపోయారు! ఒకరోజు వేకువజామున శ్రీరామకృష్ణుల ఆలయం సమీపంలో స్వామీజీ పచార్లు చేస్తున్నారు. ఆంజనేయ శ్లోకంలోని “గర్జంతం రామ రామేతి, భ్రువంతం రామ రామేతి” * అనే చరణాన్ని మృదుస్వరంలో ఉచ్చరిస్తూ నడుస్తున్నారు. అప్పుడు ఆయనే ఆంజనేయుడైనట్లుగా తోచింది. శ్రీరాముడు, సీత నివసిస్తున్న రాజప్రాసాద ద్వారం వద్ద కాపలా కాస్తున్న ఆంజనేయునిలా ఆయన నడిచారు. కాసేపటికల్లా ఆయన నడక వేగం అందుకొంది. శ్వాస భారమయింది. చేతులు కట్టుకొని ఆయన అదే వేగంతో నడిచి మఠం సింహద్వారం దాకా వెళ్లారు. అక్కడ నిలబడి తల పైకెత్తి ఆకాశాన్ని చూశారు. హఠాత్తుగా రెండు చేతులూ పైకెత్తి, “నేను సూర్యచంద్రుల భ్రమణాన్ని నిరోధించగలను” అన్నారు బిగ్గరగా. ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన మన్మథనాథ్ గంగూలీ తమ స్మృతులలో వ్రాస్తున్నాడు: “అదొక అద్భుతమైన దృశ్యం! శ్రీరామకృష్ణ కార్యార్థం స్వామీజీ కూడా మళ్లీ ఒకసారి ఆ విధంగా చేయడానికి సిద్ధపడినట్లుగా అనిపించింది ఆ దృశ్యం. ఆయనకు అది అసాధ్యం కాదు! ఆయన ఏం చేయలేరు! సూర్యచంద్రుల భ్రమణాన్ని ఆయన నిరోధించ గలరనడంలో వింతేముంది!”
గాయత్రీదేవి ధ్యాసలో
ఒక రోజు సాయంత్రం స్వామీజీ గంగాతీరాన నిలబడి, “ఆయాహి వరదే దేవి” అన్న గాయత్రీ ఆవాహన శ్లోకాన్ని ఉచ్చరిస్తూ మఠం వైపుగా నడిచారు. ఆయన మధుర గంభీర స్వరం విన్నవారిని మైమరపింప చేస్తుంది. స్వామీజీ శ్లోకాన్ని ఉచ్చరిస్తూ ప్రాంగణంలోని మామిడిచెట్టు వద్దకు వచ్చారు. అక్కడకు రాగానే పారవశ్య స్థితిలో అట్లే ఆగిపోయారు. కళ్లు మందారపువ్వుల్లా ఎర్రబారాయి. మధువు త్రాగిన వ్యక్తిలా తూలిపోసాగారు. కాసేపట్లో ఆ స్థితి భగ్నమయింది. ఆయన అక్కడే నడవ నారంభించారు. మధ్య మధ్యలో “హూం, హూం” అంటూ హూంకారం చేశారు. ప్రేమానంద ప్రభృతులు దిగ్భ్రమతో ఇదంతా చూస్తున్నారు. కాసేపటికల్లా స్వామీజీ శాంతించారు. ఆ సమయంలో ఆయనలో ఒక అసాధారణ దివ్యత్వం ప్రకా శించింది. మనుషులు, అంతెందుకు పక్షులు, జంతువులు కూడా ఆ సమయంలో ఆయన వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తాయి. వర్ణనాతీతమైన ఆకర్షణ అప్పుడు స్వామీజీలో అభివ్యక్తమయింది.
స్వామీజీకి వేదమంత్రాల పట్ల, ముఖ్యంగా గాయత్రీ మంత్రం పట్ల ఎంతో మక్కువ. దీనిని గురించి ఆయన ఒక అద్భుత దృశ్యాన్ని కూడా చూడడం తటస్థించింది. ఒకసారి ఆయన వేదకాల ఋషి ఒకరిని దివ్యదర్శనంలో తిలకించారు. ఆ ఋషి సింధునదీ తీరంలో నిలబడి గాయత్రీ ఆవాహన మంత్రాన్ని ఉద్వేగ వెల్లువతో ఉచ్చరించడం స్వామీజీకి స్పష్టంగా వినిపించింది:
ఆయాహి వరదే దేవి త్రయక్షరే బ్రహ్మవాదిని ।
గాయత్రీ ఛందసాం మాతర్ బ్రహ్మయోని నమోఽస్తుతే ॥*
వేద ఉపనిషత్తు మంత్రాలన్నీ ఇలాంటి ఋషుల అనుభూతుల సంపత్తి అని స్వామీజీ అవగతం చేసుకొన్నారు. స్వామీజీ తమ అనుభవాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు: “అదొక సాయంత్రం: ఆర్యులు సింధునదీ తీరాన్ని చేరుకొన్న కాలం. ఆ మహానదీ తీరంలో ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. చీకటి తరంగాలు ఒకటి వెంట ఒకటిగా ఆయన మీదుగా వెళ్లసాగాయి. ఆయన ఋగ్వేదం పారాయణ చేస్తున్నారు. నేను మేల్కొన్నప్పుడు ఆ స్వరం నా జ్ఞాపకంలో అట్లే ఉండిపోయింది. ఎంతో కాలం క్రితం మనం ఉపయోగించిన రాగం అది.” ప్రస్తుతం మనం వేదాలను పారాయణ చేయడానికి ఉపయోగించే రాగానికి ఆ రాగం కించిత్తు భిన్నంగా ఉందని స్వామీజీ తెలిపారు.*
దుర్గా పూజ
వంగదేశంలో అతి ముఖ్యమైన ఉత్సవం దుర్గాపూజ. దక్షిణ దేశంలో నవరాత్రిగా ఉత్సవం జరుపుకొనే రోజుల్లోని చివరి నాలుగు రోజులు వంగదేశంలో దుర్గాపూజగా ఉత్సవం జరుపుకొంటారు. హైందవుల పూజ అనే సరిహద్దును అతిక్రమించి ఒక జాతీయ పండుగగా ఉత్సవం జరుపుకొనే మేరకు వంగదేశంలో దుర్గాపూజ మహోత్సవం ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ పూజను మఠంలో జరుపుకో వాలనే ఉద్దేశం కొన్ని నెలల క్రితం స్వామీజీకి కలిగింది. మఠంలో ఆ పూజ జరుగుతున్నట్లూ, దుర్గాదేవి విగ్రహంలో ఆరాధింపబడుతున్నట్లూ స్వామీజీకి ఒక దృశ్యం కానవచ్చింది. అందుకే ఆయన దుర్గాపూజ ఉత్సవం జరుపుకోవాలని నిశ్చయించారు. అందుకోసం రఘునందన్ రచించిన అష్టావింశతి తత్త్వ మనే పుస్తకం తెప్పించి దుర్గాపూజ వివరాలు తెలుసుకొన్నారు.
తమ నిశ్చయాన్ని బ్రహ్మానందకు తెలిపారు ఆయన. అప్పుడు బ్రహ్మానంద, “నాకూ అలాంటి కల వచ్చింది. దశహస్తురాలైన దుర్గాదేవి దక్షిణేశ్వరం నెలకొన్న దిశ నుంచి గంగను దాటి మఠం వైపుగా వస్తున్నట్లుగా నాకు కనిపించింది” అన్నారు.
ఏ పూజనైనా ‘సంకల్పం’ లేకుండా చేయలేం. “నేను ఈ ఫలాన్ని పొంద డానికి, ఈ రోజున, ఈ సమయంలో, ఈ దైవాన్ని ఆరాధించబోతున్నాను” అని పూజారి చేసే ప్రతిజ్ఞనే సంకల్పం అంటారు. దీనిని సన్న్యాసులు చేయలేరు. ఎందుకంటే వారు ఫలితాన్ని ఆశించి పనిచేయాలనే ఉద్దేశం వదలిపెట్టినవారు. కనుక మఠంలో పూజ చేస్తే ఎవరి పేరిట సంకల్పం చేయాలనే ప్రశ్న తలెత్తింది. మాతృమూర్తి శ్రీశారదాదేవి పేరిట అది చేయవచ్చునని నిర్ణయించి, ఆ పూజను నిర్విఘ్నంగా జరిపించారు.
స్వామీజీ దుర్గాపూజ జరిపించడానికి మరో కారణం కూడా ఉంది. రామకృష్ణ సన్న్యాసుల గురించి ప్రారంభ దశలో ప్రజల మనస్సులలో కొన్ని సందేహాలు లేకపోలేదు. వారి అన్నవస్త్రాలు, ఆచారాల లాంటివి పారంపర్య సన్న్యాసుల విధానం నుంచి భిన్నమైనవి. కనుక వారు హిందువులేనా అన్న ప్రశ్న ప్రజల మనస్సులలో తలెత్తింది. ప్రారంభంలో స్వామీజీ దీనిని పట్టించుకోక పోయినా, తరువాత తాము పారంపర్యం నుంచి వైదొలగని సన్న్యాసులమని నిరూపించాలనుకొన్నారు. అందుకోసం కూడా ఈ పూజ జరిపించారు.
బేలూర్ మఠం ప్రక్కన ఉన్న నీలాంబర బాబు ఉద్యానగృహం మాతృదేవి శ్రీశారదాదేవి కోసం ఒక నెలకు అద్దెకు పుచ్చుకొన్నారు. మాతృదేవి తమ బంధువులతో అక్కడ బస చేశారు. పూజ వైభవోపేతంగా జరిగింది. పలువురు బ్రాహ్మణులు, పండితులు పూజలో పాల్గొన్నారు. పేదలకు అన్నదానం చేశారు.
ఆచారబద్ధంగానూ, శాస్త్రోక్తంగానూ నిర్వర్తించ వలసిన పూజ ఇది. దానిలో ‘సంధి పూజ’ ముఖ్యమైన సమయం. అష్టమి, నవమి తిథులు కలుసుకొనే వేళ అది. దుర్గాదేవి మహిషాసురుణ్ణి ఆ సమయంలో వధించినట్లు పురాణాలు వచిస్తున్నాయి. ఆ సమయంలో చేసేటటువంటి ప్రార్థనలు కచ్చితంగా ఫలిస్తాయని నమ్మకం. స్వామీజీ కూడా ఆ పూజలో పాల్గొని జగజ్జనని పాదారవిందాలకు మూడుసార్లు పుష్పాలు అర్పించి ఆరాధించారు.
ప్రార్థించి తెచ్చుకొన్న జ్వరం
దుర్గాపూజ సమయంలో జరిగిన ఒక సంఘటన చూద్దాం. పూజలో పాల్గొనడానికి మాతృదేవి విచ్చేశారు. అప్పుడు స్వామీజీ ఆమె వద్దకు వెళ్లి ఆమెకు ప్రణమిల్లి, “అమ్మా! నాకు జ్వరం రావాలని ఆశీర్వదించండి” అని అడిగారు. మాతృదేవి విస్తుబోయారు. ఇలాంటి ప్రార్థనను ఆమె ఇంతవరకు కనీవినీ ఎరుగరు. స్వామీజీ కొనసా గించారు: “ఈ పూజను వైభవోపేతంగా జరపడానికి మఠంలో అందరూ అవిశ్రాంతంగా పాటుపడుతున్నారు. అయినప్పటికీ ఏదైనా పొరపాటు నా కళ్లబడితే వెంటనే వారి మీద కోపగించుకొంటున్నాను. వారి మనస్సూ, అదే విధంగా నా మనస్సూ చెప్పనలవిగాని వేదనకు లోనవుతున్నాయి. నేను పడకబెడితే దానిని తప్పించవచ్చు కదా!”
మాతృదేవి అనుగ్రహమో, స్వామీజీ సంకల్పమో తెలియదుగాని ఆయన జ్వరంతో పడకబెట్టారు. పూజ ముగియగానే లేచారు.
కాళీ పూజ
దుర్గాపూజ చేసే వారు తరువాత వచ్చే లక్ష్మీపూజ, కాళీపూజ, జగద్ధాత్రీ పూజ, సరస్వతీ పూజలను కూడా చేయడం పరిపాటి. తదనుసారం ఆ పూజలు కూడా మఠంలో జరిపించారు. కాళీపూజ రోజున స్వామీజీ అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో లయించారు. రాత్రంతా జరిగే పూజ అది. పూజను ప్రారంభించడానికి ముందే ఆ చోటికి వచ్చిన స్వామీజీ జగజ్జనని ముందు కూర్చుని ధ్యానించారు. అట్లే సమాధిమగ్నులయ్యారు. చాలాసేపటి దాకా అదే స్థితిలో ఉండిపోయారు. ప్రేమానంద ఆయన ప్రక్కకు వెళ్లి చెవిలో గురుదేవుల పావన నామాన్ని చాలాసేపు పెద్దగా ఉచ్చరించారు. ఆ తరువాతనే స్వామీజీ బాహ్యచైతన్యంలోకి వచ్చారు.
కాళీపూజ తరువాత వచ్చే ముఖ్యమైన పూజ జగద్ధాత్రీపూజ. సింహవాహనం మీద కాలు మీద కాలు వేసుకొని ఆసీనురాలైనట్లు జగద్ధాత్రి అభివర్ణింపబడు తున్నది. ఈ పూజను స్వామీజీ తమ తల్లిగారి ఇంట్లో జరిపారు. అన్ని ఏర్పాట్లూ ముందుండి స్వయంగా స్వామీజీ చూసుకొన్నారు. మఠం సన్న్యాసులు ఆ పూజలో పాల్గొన్నారు.
మొక్కు నెరవేర్చడం
స్వామీజీ చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు ఒకసారి తీవ్రంగా అస్వస్థులయ్యారు. అప్పుడు భువనేశ్వరీ దేవి, “నరేన్‌కు నయమయితే కాళీమాతకు విశిష్ట పూజ నిర్వర్తిస్తాను” అని మొక్కుకున్నారు. తరువాత ఆ మాట పూర్తిగా మరచిపోయారు. ఇప్పుడు స్వామీజీ అనేక రుగ్మతలతో బాధపడుతూ ఉండడం చూసి ఆమె, మొక్కు నెరవేర్చనందు ననే జగజ్జనని ఇలా శిక్షిస్తున్నదేమోనని భయపడింది. కనుక ఆ మొక్కు తీర్చాలను కొన్నది. ఆ సంగతి స్వామీజీతో భువనేశ్వరీ దేవి చెప్పినప్పుడు, అందుకు ఆయన అంగీకరించారు. కాళీపూజ జరిగిన కొన్ని రోజుల తరువాత ఒకరోజు తమ తల్లితో కాళీఘాట్‌లోని కాళికాలయానికి వెళ్లారు. ఆ రోజుల్లో ఆయన తీవ్రంగా అస్వస్థులై ఉన్నారు. అయినప్పటికీ తల్లి కోర్కె ప్రకారం, ప్రక్కనే ప్రవహిస్తున్న ఆదిగంగలో స్నానం చేశారు; తడి బట్టలతోనే ఆలయానికి వెళ్లి జగజ్జననికి మూడుసార్లు అంగప్రదక్షణ చేశారు. ఆలయ మండపానికి వచ్చి స్వయంగా తామే హోమం చేశారు. తరువాత మఠానికి బయలుదేరిన ఆయన ఆలయ అధికారుల ఉదారతను శ్లాఘించారు. తాము సముద్రం దాటి తిరిగి వచ్చిన వ్యక్తినని ఎరిగీ ఆలయంలో హోమం చేయడానికి వారు అనుమతించడం ఆయన ఎత్తి చూపారు. రెండవసారి పాశ్చాత్య ప్రయాణానికి ముందు ఆయన వెళ్లినప్పుడు కూడా ఆలయం లోకి తిన్నగా వెళ్లి ఆయన జగజ్జననిని ఆరాధించారు. అంతేగాక, నివేదిత ఒక విదేశీయురాలని తెలిసినప్పటికీ ఆమెను ఆలయంలోకి అనుమతించడమేగాక, ఆలయంలోనే ఆమెను ‘కాళీ ఆరాధన’ అనే అంశం మీద ప్రసంగించమని కూడా ఆలయ నిర్వాహకులు అడిగారు. కనుక స్వామీజీ వారిని ప్రశంసించడంలో ఆశ్చర్యం లేదు. అదే సమయంలో దక్షిణేశ్వరంలో తమ ప్రవేశాన్ని కొందరు నిరోధించడం ఆయనకు గుర్తుండకపోదు.
జపాన్ నుంచి ఆహ్వానం
ఈలోపు 1901 జూన్/జూలై నెలలో మెక్లౌడ్ మిత్రుడైన కాకుజో ఒకాకుర అనే వ్యక్తి స్వామీజీని జపానుకు ఆహ్వానించడంతోపాటు ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ. 300/– పంపించారు కూడా. తమ అస్వస్థత కారణంగా తాను ఆ ఆహ్వానాన్ని మన్నించలేకపోతున్నానని స్వామీజీ జవాబు వ్రాశారు. కాని ఎలాగైనాసరే స్వామీజీని ఆహ్వానించా లనే ఉద్దేశంతో మెక్లౌడ్, ఒకాకుర, జపాన్‌లోని ఒక బౌద్ధమఠాలయాధిపతి ఓడా నవంబర్‌లో బేలూర్ మఠానికి వచ్చారు. జపాన్‌లో ఒక సర్వమత మహాసభ నిర్వహించడమే వారి ఉద్దేశం. “మీ లాంటి మహానుభావులు సభలో పాల్గొంటే మా ఉద్దేశం సఫలమవుతుంది, మా ప్రయత్నం విజయవంతమవుతుంది. జపాన్‌లో మత జాగృతి అవసరం. మీరు తప్ప మరెవరూ ఆ జాగృతి కలిగించలేరు” అన్నాడు ఓడా. హృదయపూర్వకమైన ఆ ఆహ్వానంతో చలించిపోయిన స్వామీజీ తమ శక్తి మేరకు ప్రయత్నిస్తానని వాగ్దానం చేశారు.
ఇంతలో స్వామీజీని జపాన్ తీసుకుపోవడానికి మరో ప్రయత్నం కూడా జరిగింది. స్వామీజీని ఇంతకుమునుపే కలుసుకొన్న కొందరు ఆయనను జపాన్‌కు ఆహ్వానించారు. చెప్పుకోదగ్గ పైకం అందజేస్తామని చెప్పారు. తాము చెప్పిన రీతిలో వ్యవహరిస్తే జపాన్ ప్రభుత్వం నుంచి పైకం పొందడానికి కూడా మార్గం చూస్తామని వారు చెప్పారు. తమను పైకంతో పెనవేసి వారు పరిగణించడం స్వామీజీకి సుతరామూ నచ్చలేదు. కనుక తమ శిష్యుడైన నిశ్చయానందతో, “వారి డబ్బు పెట్టెను సముద్రంలో విసిరిపారవెయ్యి. నేను వెళ్లను! డబ్బు ఇచ్చి కొనుగోలు చేయగల ఒక వస్తువు కాదు వివేకానంద” అన్నారు కోపంతో. కాని ఒకాకుర హృదయపూర్వకమైన ఆహానాన్ని మన్నించి ఆయన జపాన్ వెళ్లగోరారు.
ఒకాకుర ఒక చిత్రకారుడు. జపాన్‌లో ఒక చిత్రకళా పాఠశాలను నిర్వహిస్తు న్నాడు. జపానీయ చిత్రకళలో అన్య సంస్కృతుల ప్రాబల్యాన్ని తొలగించి స్వచ్ఛమైన జపానీయ చిత్రకళను పెంపొందించాలన్నది ఆతడి తపన. కనుక స్వామీజీతో ఒరిస్సా మొదలైన ప్రాంతాలకు వెళ్లి ఆసియా చిత్రకళలోని విభిన్న పరిమాణాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకోగోరాడు ఒకాకుర. స్వామీజీ అందుకు వ్రాసిన జవాబులో తాము మ్లేచ్ఛుల ఆహారం తిన్నందున ఆ ఆలయాలలో తమను ప్రవే శింపనిస్తారా అన్న సందేహం లేపి, అయినప్పటికీ తమ శక్తి మేరకు తోడ్పడతానని వాగ్దానం చేశారు. ఆయనను కలుసుకోవడంలో స్వామీజీ ఎంతో ఆనందించారు. “మే మిద్దరమూ సోదరులం; లోకంలో రెండు మూలల్లో ఉన్నవారం. ఇప్పుడు మళ్లీ కలుసుకొంటున్నాం” అని ఆతణ్ణి గురించి స్వామీజీ వ్యాఖ్యానించారు. బుద్ధగయలో జపానీయుల కోసం ఒక విడిది నిర్మించడానికి కొంత స్థలం కొనుగోలు చేయడం, అందు నిమిత్తం స్వామీజీ సహాయం కోరడం కూడా ఆతడి ఉద్దేశంలో లేకపోలేదు.
స్వాతంత్ర్యాన్ని యాచించవద్దు
1901 డిసెంబర్ 28 నుంచి 31 వ తేదీ దాకా కలకత్తాలో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ వార్షిక సమావేశం జరిగింది. స్వామీజీ రాజకీయ తత్సం బంధిత ఉద్యమాల నుంచి వైదొలగే ఉన్నారు. “మా దేశాన్ని మాకు ఇచ్చివేయండి” అని భిక్షమెత్తే రీతిలో రూపొందిన కాంగ్రెస్ సిద్ధాంతం ఆయనకు సుతరమూ నచ్చలేదు. “క్షామాలు, వరదలు, జబ్బులు, అంటువ్యాధులు చెలరేగుతున్న రోజుల్లో మీ కాంగ్రెసువారు ఎక్కడున్నారో చెప్పు. ‘మా దేశ పరిపాలన మా అధీనంలో ఉంచండి’ అంటూ కేకలు వేస్తే సరిపోతుందా? ఈ మాటలు వివేవారు ఎక్కడున్నారు? పనిచేస్తే నోరు తెరిచి అడగాలా? నీ లాంటి వారు రెండు వేల మంది నడుం బిగించి పనిచేస్తూంటే, ఆంగ్లేయులు తమంత తామే వచ్చి రాజకీయోద్యమ విషయాల్లో మీతో సంప్ర తించరా?”* అంటూ 1900 ఫిబ్రవరిలో అఖండానందకు స్వామీజీ లేఖ వ్రాశారు. ఆయన వైఖరి పురుషోచితమైనది, ఆచరణాత్మకమైనది. స్వామీజీ వైఖరి కాంగ్రెసు వారికి ఏమాత్రం నచ్చలేదు. అదే సమయంలో, కాంగ్రెసు నాయకులలో తిలక్ లాంటి కొందరు స్వామీజీ భావనలను ఆహ్వానించకపోలేదు.
గొప్ప దేశభక్తునిగా స్వామీజీ పరిగణింపబడ్డారు. ఆయన భావనలను చదివిన పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఆ రోజుల్లో బేలూర్ మఠానికి వచ్చి స్వామీజీని కలుసుకోవడం తటస్థించింది. తిలక్, స్వామీజీలు విభిన్న భావనలను చర్చించుకొంటూ గంగాతీరంలో పచార్లు చేసిన రోజులు కూడా లేకపోలేదు.
1901 మహాసభలోనే మహాత్మాగాంధీ ప్రప్రథమంగా పాల్గొన్నారు. మహాసభ ముగిసిన తరువాత నెల రోజులు గోఖలే ఇంట్లో ఆయన అతిథిగా బస చేశారు. ఆయన స్వామీజీని కలుసుకోగోరారు. కాని గాంధీజీ వెళ్లినప్పుడు స్వామీజీ మఠంలో లేకపోవడంతో వారిద్దరి మధ్య సమావేశం జరగలేదు.
రామకృష్ణానంద సానుభూతి
స్వామీజీ ఆరోగ్యం రోజు రోజుకీ దిగజారసాగింది. ఆయన అనుగ్రహపూరిత ఆదేశానుసారం చెన్నైలో మఠం స్థాపించి కార్యకలాపాలు సాగిస్తూ వచ్చిన రామకృష్ణానంద ఈ రోజుల్లో ఒకసారి స్వామీజీ దర్శనార్థం బేలూర్ మఠానికి వచ్చారు. అప్పుడు హృదయాన్ని స్పృశించే ఒక సంఘటన జరిగింది. సంఘటన పెద్దదేమీ కాదు – రూ. 400/– ఆయన స్వామీజీకి ఇచ్చారు, అంతే! చెన్నైలో ఎంతో ప్రయాసతో ఆయన రోజులు గడుపుతూ వస్తున్నారు. ఆ స్థితిలోనూ ఆయన తమ కోసం డబ్బు తీసుకురావడం స్వామీజీ హృదయాన్ని ద్రవింపజేసింది. ఉద్వేగపు వెల్లువ పొంగగా నివేదితకు ఆయన ఇలా వ్రాశారు:
“నేను రావడానికి కొన్ని వారాల ముందు రామకృష్ణానంద వచ్చి ఆయన మొదట చేసింది, తాను ఎన్నో సంవత్సరాలు కష్టపడి వసూలు చేసిన రూ. 400/– నా పాదాల మ్రోల ఉంచాడు. నా జీవితంలో అలాంటిది జరగడం ఇదే మొదటిసారి! ఓ జగజ్జననీ! తల్లీ! కృతజ్ఞత అంతా పోయింది. ప్రేమ లేదు. ధీరత్వం మరణించింది. అంతేగాక ప్రియమైన బిడ్డా – లోకంలో తిరిగి అరణ్యం మొలిపించడానికి ఒక్క బీజం చాలు.
“ఆ డబ్బు ఇప్పుడు మఠంలో పదిలంగా ఉంది. దాన్లో ఒక్క పైసా కూడా నేను తాకను. ఆ డబ్బు తన వారికి ఇవ్వమని నేను రామకృష్ణానందతో చెప్పినప్పుడు, నాకు తప్ప దానిని మరెవ్వరికీ ఇవ్వనని, నాలుగు సంవత్సరాల్లో ఆ స్వల్పమే తాను పోగుచేయగలిగినందుకు చింతిస్తున్నానని చెప్పాడు. మంచిది, నేను చనిపోతే ఆ రూ. 400/– లో ప్రతి రూపాయి రామకృష్ణానందకు తిరిగి ఇచ్చేట్లు చూడు. నిన్నూ, రామకృష్ణానందనూ భగవంతుడు ఆశీర్వదించుగాక!”*
గయలో
జపాన్ వెళ్లడం తనకు అసాధ్యమని గ్రహించినందు వలననేమో స్వామీజీ ఒకాకురతో కాశీ, గయ లాంటి స్థలాలకు జనవరి మొదటి వారంలో వెళ్లారు. తమ 39 వ జన్మదినమైన జనవరి 12 వ తేదీన ఆయన బుద్ధ గయలో ఉన్నారు. స్వామీజీతో ఒకాకుర కాకుండా మెక్లౌడ్, నిర్భయానంద, బోధానంద, ఇద్దరు బాలురు, మరి కొందరు కూడా ఉన్నారు. నిరంజనానంద, శివానందలు అప్పటికే కాశీలో మకాం చేసివున్నారు. వారు కూడా స్వామీజీ బృందంలో కలిశారు.
ముందుగా గయకు వెళ్లిన స్వామీజీ మహావిష్ణు శ్రీపాద ఆలయానికి వెళ్లి అర్చించారు. పిదప బుద్ధగయకు వెళ్లి, బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలంలో ఆరాధించారు. తరువాత అందరూ కాశీ వెళ్లారు. అక్కడ స్వామీజీ దాదాపు 45 రోజులు బస చేశారు.
కేదారేశ్వర ఆలయంలో
కాశీలో స్వామీజీ ఆరోగ్యం కాస్త మెరుగయింది. అనేక రోజులు ఆయన గంగలో దశాశ్వమేధఘట్టం వద్ద స్నానమాచరించి విశ్వనాథుణ్ణీ, అన్నపూర్ణనూ అర్చించారు. సాయంత్రాలలో గంగానదిలో పడవ ప్రయాణం చేశారు. కాశీలో కూడా పలువురు ప్రముఖులు వచ్చి స్వామీజీని కలుసుకొన్నారు. కాశీలోని కేదారేశ్వర ఆలయ నిర్వాహకుడు స్వామీజీ వద్దకు వచ్చి, స్వామీజీ ఆయన బృందంలోని వారూ తమ కుమారస్వామి మఠంలో ఒక రోజు భోజనం చేయాల్సిందని విన్నవించాడు. ఆయన ఎనభై ఏళ్ళు పైబడ్డ సన్న్యాసి. స్వామీజీ రామేశ్వరం వెళ్లినప్పుడు, అక్కడ ఉన్న కుమారస్వామి మఠానికి ఆయనను తోడ్కొని రావడానికి పల్లకీ కూడా పంపించారు. కాని అనివార్య కారణాల వలన స్వామీజీ వెళ్లలేకపోయారు. ఆ సంఘటనను ఆ వృద్ధ సన్న్యాసి ఇప్పుడు జ్ఞాపకం చేశారు. తమ విన్నపాన్ని వ్యక్తం చేయడానికి ముందు ఒక సంస్కృత శ్లోకం గానం చేసి తరువాత తమిళంలో తమ విన్నపాన్ని తెలిపారు. దానిని ఆంగ్లంలో తర్జుమా చేసి స్వామీజీకి చెప్పారు.
“స్వామీజీ! మీరు సాక్షాత్తూ పరమేశ్వరావతారం. మానవకోటిని ఉద్ధరించ డానికే మీరు విచ్చేశారు” అని ఆ వృద్ధ సన్న్యాసి చెప్పినప్పుడు ఉద్వేగపు వెల్లువతో చలించిపోయారు. తరువాత గద్గద స్వరంలో వినమ్రంగా ఇలా అన్నారు: “మహరాజ్! భగవంతుని సంకల్పం వలనా, అనుగ్రహం వలనా నేను ఏదో కాస్త చేశాను. నేను కేవలం పరికరమాత్రుణ్ణి, మీరు మహాత్ములు. మీలాంటి వారి దీవెనలు నాకు ఉంటే ఇంకా అనేక పనులు చేయవచ్చు. అంతేగాక మీరు కేదారనాథుని పూజారి. మీరే పరమేశ్వరావతారం. నేను సామాన్యమానవుణ్ణి.”
మర్నాడు స్వామీజీ, శివానంద ప్రభృతులు కుమారస్వామి మఠానికి వెళ్లి నప్పుడు అక్కడ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. స్వామీజీని ఆసీనులను చేసి హారతి ఇచ్చారు. తరువాత షడ్రసోపేతంగా విందు చేశారు. పిదప స్వామీజీ కాస్త విశ్రాంతి తీసుకొంటూ అనేక విషయాల గురించి ముచ్చటించారు. మధ్యాహ్నం కేదారనాథ్ ఆలయానికి వెళ్లారు. అప్పుడు హారతి సమయం కానప్పటికీ స్వామీజీ కోసం ప్రత్యేకంగా హారతి జరిపించారు. ఆలయంలోకి ప్రవేశించగానే స్వామీజీ సమాధిమగ్నులై శిలలా నిలబడిపోయారు. హారతి ముగిసిన తరువాత కూడా ఆయన అదే స్థితిలో ఉండిపోయారు. ఒక రకమైన పారవశ్య స్థితిలో ఉండగానే ఆయనను తోడ్కొని వచ్చి బండిలో ఆసీనులను చేశారు. బండి కాస్త దూరం వెళ్లగానే ఆయన మామూలు స్థితిలోకి వచ్చారు. బండి నాట్టుకోట్టై చెట్టియార్ సత్రం మీదుగా వెళుతున్నప్పుడు స్వామీజీ బాలునిలా, “నాట్–కోట్–చెట్టి” అంటూ తమిళ పదాలను చెబుతూ ఆనందించారు.
సహస్ర శివాలయాలు
ఉదయ ప్రతాప్ సింగ్ అనే జమీందార్ కాశీలోని దుర్గా దేవాలయానికి సమీపంలోని తన భవంతిలో నివసిస్తూ వచ్చాడు. ఆయనకు ఆంగ్లంలోనూ సంస్కృతంలోనూ చక్కని పాండిత్యం ఉంది. స్వామీజీని గురించి విని ఆయనను చూడాలని ఆరాటపడ్డారు. భవంతి వీడి బయటకు ఎక్కడకీ వెళ్లకూడదనే నియమం పాటిస్తు న్నాడు. కాని స్వామీజీని చూడడానికి ఆ నియమాన్ని ఉల్లంఘించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపి స్వామీజీని ఎప్పుడు దర్శించుకోవచ్చునని కబురు పంపారు. ఇది వినగానే స్వామీజీ, తమను కలుసుకోవడానికి ఆయన నియమ ఉల్లంఘన చేయనక్కర్లేదనీ, స్వయంగా తామే ఆయన వద్దకు వస్తామనీ తెలియజేశారు. ఆ ప్రకారమే ఒకరోజు వెళ్లి ఆయనను కలుసుకొన్నారు. స్వామీజీని చూడగానే ఉదయ ప్రతాప్ సింగ్ చేతులు జోడించి, “మీరు బుద్ధుని, శంకరుని లాంటి మహాత్ములు” అంటూ ప్రణమిల్లాడు. తరువాత, “కాశీలో ఒక సేవాసంస్థను ప్రారంభించండి. అందుకైన యావత్తు ఖర్చునూ నేను భరిస్తాను” అంటూ వేడుకొన్నాడు. అందుకు స్వామీజీ, “నేను ఇప్పుడు బేలూర్ మఠానికి తిరిగిపోతున్నాను. నా ఆరోగ్యం కుదుటపడగానే ఈ విషయం గురించి యోచిస్తాను” అంటూ సెలవు పుచ్చు కొన్నారు. మర్నాడు ఉదయ ప్రతాప్ సింగ్ అధికారి ఒకరు స్వామీజీ వద్దకు వచ్చి ఆయన తరఫున రూ. 500/– చెక్కు అందించాడు. స్వామీజీ వెంటనే దానిని శివానంద చేతికిచ్చి, “వేదాంత భావనల ప్రచార నిమిత్తం ఈ పైకాన్ని వినియో గించి ఇక్కడ మఠం ప్రారంభించండి” అన్నారు.
కలకత్తాలోని సుసంపన్నులలో ఒకరైన కాళీకృష్ణ టాగూర్ ఒకసారి నిరంజనా నందతో, “దిక్కులేని వారి కోసం శరణాలయం ఒకటి కాశీలో స్థాపించే పక్షంలో దానికయ్యే మొత్తం ఖర్చును నేను భరిస్తాను” అన్నారు. అది విన్న స్వామీజీ, “దిక్కులేని వారి శరణాలయం కోసం కాళీకృష్ణ టాగూర్ సహాయం చేసే పక్షంలో అది సహస్ర శివాలయాలు నిర్మించడానికి సమానం” అని వ్రాశారు.
సేవాశ్రమం
శ్రీరామకృష్ణుల భావనలతోను, స్వామీజీ సేవ–ధర్మ భావనతో ఆకర్షితులైన కొందరు యువకులు కాశీలో ‘పేదల నివారణ సంఘం’ పేరిట ఒక సంఘాన్ని 1900 జూన్ నెల నుంచి నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు స్వామీజీని దర్శించడంతో వారి ఆనందం అవధులు దాటింది. వారి సేవాకార్యం చూసి స్వామీజీ కూడా అమితానందం పొందారు. స్వామీజీ సేవ–ధర్మ భావనను స్వీకరించడానికి హైందవ సమాజంలో అనేకులు సిద్ధంగా లేరు. జ్ఞానమూ, భక్తీ మాత్రమే భగవన్మార్గాలు. అవి మాత్రమే మనిషిని భగ వంతుని వద్దకు తీసుకొని వెళతాయనే భావనే నాడు ప్రాబల్యం వహించింది. కాని సేవ–ధర్మంతో కూడా అంటే మనుషులకు తక్కిన ప్రాణులకు సేవ చేయడం వలన కూడా భగవంతుని పొందవచ్చుననే భావనను ఆయన బోధించినప్పుడు దానిని కొందరు ప్రతిఘటించారు కూడా. పారంపర్య సన్న్యాసులు సేవ–ధర్మ భావనను దోషంగానే పరిగణించారు. కాని క్రమక్రమంగా పరిస్థితి మారింది. సేవ–ధర్మ భావన స్వీకరింపబడింది. అధిక సంఖ్యాకుల మార్గం అదేనని గ్రహించి ఆ మార్గంలో అనేకులు వెళ్లనారంభించారు.
సేవ–ధర్మ భావనను అనేకులు ప్రతిఘటించిన కాలఘట్టంలో వంగ సమాజం కూడా ఇందుకు మినహాయింపు కాలేదు. వంగ యువకులలో అమిత నమ్మకం ఉంచుకొన్న స్వామీజీ, వారు సేవ–ధర్మాన్ని స్వీకరించడానికి, ఆశించినంత మేరకు ముందుకు రాకపోవడంతో విచారించారు. ఆ సమయంలో కాశీలో కొందరు యువకులు తమ భావనలను స్వీకరించి తదనుగుణంగా కార్యాచరణలో పాల్గొనడం ఆయనకు పరమానందం కలిగించింది. ఆ పరమా నందంలో ఒక రోజు స్వామీజీ కరుణామయులయ్యారు; “గృహస్థులు, బ్రహ్మ చారులంటూ ఎవరైతే ఈ పనిలో పాల్గొన్నారో వారినందరినీ నా వద్దకు తోడ్కొని రండి. అందరికీ నేను దీక్ష ఇస్తాను” అన్నారు. అక్కడున్న పనివారికి కూడా నాడు ఆయన దీక్ష ప్రసాదించారు. ఆ రోజు స్వామీజీ వారితో సేవ–ధర్మం గురించి వివరించారు:
“గతిలేని వారిని భగవంతునిగా గాంచి, వారిలో నెలకొని ఉన్న భగవంతు నికి సేవలందించడం మనిషి జీవితపు చరమ లక్ష్యం. వారికి ‘నివారణం’ (ఆ యువకులు స్థాపించిన సంఘం పేరు ‘పేదల నివారణ సంఘం’) కల్పించడానికి మనం ఎవరం? సేవ కన్నా మేలైనది ఏదీ వారికి చేయలేం. సమస్త అహంకారాన్నీ వదలిపెట్టి, అన్ని కోర్కెలనూ త్యజించి, సత్యపథంలో, ప్రేమ పథంలో వెళ్లండి. మనిషిని దైవంగా భావించి సేవలందించండి. మీ అనుష్ఠానంలో కరుణకు ముఖ్యస్థానం ఇవ్వండి. కాని ఒక విషయం. ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల కరుణ చూపించగలడని గర్వించడం తగదు. సమస్త ప్రాణికోటికీ ప్రాణంగా విరాజిల్లే భగవంతుడు ఒక్కడే కారుణ్యం చూపడానికి సమర్థుడు. కారుణ్యమంటే ఉన్నత స్థితి నుంచి నిమ్నస్థితికి పోవడం. ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఎలా నిమ్నస్థితిలోని వ్యక్తిగా, తనకన్నా తక్కువగా పరిగణించగలడు! అది అహంకారం కాదా! కారుణ్యం కాదు సేవ, భగవత్స్వరూపుడైన మనిషికి సేవ అన్నది మీకు మార్గదర్శక భావనగా ఉండాలి. పని చేయడమే మతం, మతమే పనిచేయడం. పని ఒక వ్యక్తిని భగవం తుని వద్దకు తీసుకొనిపోతుంది. భగవంతుడు తప్ప ఎవరూ ఎవరికీ నివారణ అందించలేడు. నా బిడ్డల్లారా! మీ సంస్థ పేరును ‘సేవాగృహం’ గా మార్చుకోండి.* పేదల కోసం మీరు వసూలు చేసే ప్రతి పైసాను మీ ప్రాణంగా భావించండి. సర్వసంగ పరిత్యాగం చేసినవారు మాత్రమే ఇంతటి అత్యుత్తమ కార్యాలను సవ్యంగాను, నిరంతరంగాను నిర్వర్తించగలరు.”
స్వామీజీ జీవిత కాలంలోనే హరిద్వార్‌లో, కాశీలో ఆయన సేవ–ధర్మ భావనలు స్వీకరింపబడి, విజయవంతంగా కార్యాచరణలో ప్రతిఫలించాయి. ఇది స్వామీజీకి అమిత సంతృప్తి కలిగించింది.
‘అనంత సాగరం’ ఆయన
పండిత శివానంద భట్టాచార్య అనే వ్యక్తి స్వామీజీ గురించి విని కాశీలో ఆయనను పలుమార్లు కలుసుకొన్నాడు. ఆతడు సేవాగృహ పనులలోనూ పాల్గొ న్నాడు. ఆతడు స్వామీజీ గురించి సంస్కృతంలో ఒక కవిత రచించాడు. కాని స్వామీజీని కలుసుకోబోతున్నప్పుడల్లా ఉద్వేగపు వెల్లువలో దానిని మరిచిపోయి వెళ్లేవాడు. చివరికి ఒక రోజు స్వామీజీ ఉదయ ప్రతాప్ సింగ్‌ను కలుసుకోవడానికి వెళుతున్నప్పుడు దారిలో రెండు బండ్లూ కలుసుకొన్నాయి. ఆ అవకాశాన్ని జారవిడుచుకోని పండితుడు అక్కడే ఆ కవితను సంకోచిస్తూ స్వామీజీకి ఇచ్చాడు. దానిని చదివి స్వామీజీ వినమ్రంగా, “పండితోత్తమా! ఏం పని చేశారు! నేనొక సామాన్యుణ్ణి. ఇంతటి ప్రశంసావాక్యాలు నాకు తగవు. నేను ఏమీ చేయలేదు. జరిగినదంతా భగవంతుని సంకల్పం మేరకే జరిగింది. ఆయన తమ సంకల్ప మాత్రానే సామాన్యునితో కూడా అరుదైన ఘనకార్యాలు చేయిస్తాడు” అన్నారు.
ఆ తరువాత సేవాగృహ యువకులు ఆ పండితుణ్ణి, “పండితోత్తమా! స్వామీజీ గురించి మీరు ఏమనుకొంటున్నారు?” అని అడిగారు. అందుకు ఆయన ఇలా అన్నాడు:
“స్వామి వివేకానంద ఒక నిజమైన యోగిపుంగవుడు. అందుకే నేను నిత్యం ఆయన దర్శనార్థం వెళుతున్నాను. ఆయన ప్రసంగాలూ, ఉపదేశాలూ గొప్పగా చెప్పుకోబడుతున్నాయి. వాటి కారణంగానే ప్రజలు ఆయనను ఇంతగా కీర్తిస్తు న్నారు. కాని నాకు సంబంధించినంత వరకు అవి ద్వితీయమైనవి. ఇతరులకు ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగించే, ఆత్మ పురోగతి కలిగించే ఆయన శక్తి ఉందే, దాని ముందు ఇవన్నీ దిగదుడుపే. ఆయనలో దివ్యశక్తి తాండవిస్తోంది. దానిలోని కించిత్తు మాత్రమే అభివ్యక్తమవుతున్నది. ఆయన మహత్త్వాన్నీ, శక్తినీ అంచనా వేయడం అసాధ్యం. అనంతమైన సాగరంగా ఆయన నాకు కనిపిస్తున్నారు.”
తిరిగి బేలూరు మఠానికి
కాశీకి వెళ్లినప్పుడు కాస్త మెరుగుపడిన స్వామీజీ ఆరోగ్యం కొద్ది రోజుల్లోనే మళ్లీ యథాప్రకారం క్షీణించసాగింది. ఒకాకుర స్వామీజీతోనే బస చేశాడు. ఎలాగైనా స్వామీజీని జపాన్‌కు తోడ్కొని వెళ్లవచ్చుననుకొన్నాడు అతడు. శ్రీకృష్ణుణ్ణి బృందావనం నుంచి మధురకు తోడ్కొని వెళ్లడానికి అక్రూరుడు వచ్చి నిరీక్షించినట్లు, ఒకాకుర వేచివుండడంతో ఆతణ్ణి సన్న్యాసులు ‘అక్రూర మామా’ అని పేర్కొనసాగారు. ఫిబ్రవరి ప్రారంభంలో నిరంజనానందతో ఉత్తర భారతదేశంలోని తక్కిన ప్రదేశాలు సందర్శించడం కోసం ఒకాకుర వెళ్లాడు.
స్వామీజీ 1902 మార్చ్ 8వ తేదీన బేలూర్ మఠానికి తిరిగి వచ్చారు.