నేను వేదాంతిని కాను,
తాత్త్వికుణ్ణీ కాను, మహాత్ముణ్ణీ కాను;
నేనొక పేదను! పేదలను ప్రేమిస్తున్నాను.
– స్వామి వివేకానంద
బేలూర్ మఠంలో — స్వామీజీ గది — చికిత్సలు — ‘శుక్రాచార్యులు’ — బాల్య నేస్తాలతో — ‘భాగ్’ కుక్క — పారిశుద్ధ్యం – స్వచ్ఛత — జపధ్యానాలు — నియమమూ, హృదయకారుణ్యమూ — జప ధ్యానాలు ఎప్పుడు చేయాలి? — సోదర సన్న్యాసులతో — కారమంటే మహా ఇష్టం — దరిద్రనారాయణ సేవ — పేదల కోసం ద్రవించిపోయారు — బంగారు గడియారం — ఈయనే వివేకానంద
బేలూర్ మఠంలో
తూర్పు వంగదేశ యాత్ర ముగించుకొని, 1901 మే నెలలో బేలూర్ మఠానికి తిరిగి రాగానే స్వామీజీ ప్రజా జీవితం పరిసమాప్తమయింది. ఆ తరువాత ఒకసారి కాశీకి వెళ్లి వచ్చారు. అప్పుడప్పుడు కలకత్తా వెళ్లిరావడం తప్ప దాదాపు ఆయన బేలూర్ మఠంలోనే ఉండిపోయారు. బ్రహ్మచారులకు, సన్న్యాసులకు తరగతులు నిర్వహించడంలో, పాటల్లో, ధ్యానంలో ఆయన రోజులు గడపసాగారు. విశ్రాంతి, చికిత్స అమితంగా అవసరమైన ఈ సమయంలో తమ సోదర సన్న్యాసులూ, శిష్యులూ చెప్పింది తు.చ. తప్పక పాటించారు. ఈ రోజుల్లోనూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అనేకులను స్వామీజీ కలుసుకొన్నారు.
మఠం పనులలో ఆయన సదా తమ దృష్టిని కేంద్రీకరించడంలో పాలుమార లేదు. ఆయన మఠ జీవనం నిరాడంబరంగా సాగింది. కొన్ని సమయాల్లో కౌపీనధారియై మఠంలో పచార్లు చేసేవారు. కొన్ని సందర్భాలలో వంటశాలకు వెళ్లి వంటలో తోడ్పడేవారు. కొన్ని సమయాల్లో తమ గదిలో గంటల పర్యంతం పుస్తకాల్లో మునిగి ఉండేవారు. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు, అక్కడే కూర్చుని ధ్యాన మగ్నులయ్యేవారు – అది గంగాతీరం కావచ్చు, చెట్టు క్రింద కావచ్చు. ఆయన ఎక్కడున్నా, ఏం చేసినా అవి మఠంలో ఆధ్యాత్మిక తరంగాలను సృష్టించేవిగా భాసిల్లాయి. బిల్వవృక్షం క్రింద, తమ గదికి క్రింద ఉన్న మామిడి చెట్టు క్రింద ధ్యానం చేయడం ఆయనకు చాలా ఇష్టం. ఆయన ధ్యానమగ్నులైనప్పుడు బాహ్య చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయేవారు. ఉదయం వేళ సామాన్యంగా ఆ మామిడి చెట్టు క్రింద మంచం వేసుకొని అక్కడ చదవడమో, వ్రాసుకోవడమే ఆయనకు పరిపాటి. కొన్ని సమయాలలో పరివ్రాజక రోజుల్లో మాదిరి పొడవైన అంగీ ధరించి, చింతనల్లో మునిగిపోయి సమీప గ్రామ బాటల్లో పచార్లు చేసేవారు.
గంగాతీరంలోని తమ గదికి బయట ఉన్న వసారాలో కూర్చుని ఆవలి తీరంలోని దక్షిణేశ్వర కాళికాలయ గోపురాలను తిలకిస్తూ ఆ తలపులలో లీనమైపోయేవారు. ఆయన ముఖంలో చెప్పలేని విచారం కానవచ్చేది, మరుక్షణం లోనే ఆనందమూ, ప్రకాశమూ దేదీప్యమానంగా కనిపించేవి. బాహ్య ప్రపంచానికి ఆయన జగద్గురువు, దేశభక్తుడు, ఆచార్యుడు, విశ్వవిజేత, యతిరాజు; సోదర సన్న్యాసులకు ఆయన “మా నరేన్”, నాయకుడు, మిత్రుడు, పావనమూర్తి; భగవాన్ శ్రీరామకృష్ణులకు, మాతృమూర్తి శారదాదేవికి ఆయన అనుంగు పుత్రుడు; శిష్యులకు ఆయన సర్వస్వంగా విరాజిల్లారు.
స్వామీజీ గది
మఠానికి ఆగ్నేయ మూలలో మేడ మీద ఉన్న స్వామీజీ గదికి మూడు తలుపులు, నాలుగు కిటికీలు ఉన్నాయి. పాశ్చాత్య శిష్యులు కానుకగా ఇచ్చిన ఇనుప మంచం గది మధ్యలో ఉంది. స్వామీజీ దానిని అంతగా ఉపయోగించలేదు. నేల మీద చాప పరచుకొని పడుకోవడమే ఆయనకు ఇష్టం. పరుపు, బల్ల, వ్రాత పలక, కుర్చీ, కలం, సిరా, కాగితాలు, గంట, పువ్వుల జాడీ, గురుదేవుల చిత్రం, బుద్ధుని విగ్రహం, కృష్ణాజినం మొదలైనవి గదిలో చోటుచేసుకొన్నాయి. చిన్న బల్ల మీద గ్లాసు, దుస్తులు పదిలపరచుకొనే బీరువా, ఐదు అడుగుల అద్దం, స్వామీజీ పరివ్రాజక రోజుల్లో ఉపయోగించిన చేతికర్ర కూడా ఆ గదిలో ఉన్నాయి. అనేక సమయాలలో స్వామీజీ గురుదేవుల చిత్రాన్ని తదేకంగా చూస్తూ ఉండేవారు.
చికిత్సలు
స్వామీజీ ఆరోగ్యం నానాటికీ క్షీణించసాగింది. ఈ రోజుల్లో తీసిన ఛాయా చిత్రం దానిని స్పష్టంగా తెలుపుతుంది. కాళ్లు వాచి ఉండడంతో ఆయన నడవ డానికి ఎంతో ఇబ్బంది పడ్డారు. శరీరం కూడా వాచి ఉండడం వలన చర్మం అతి కోమలం కావడంతో ఎవరైనా తాకినా ఆయనకు ఎంతో బాధ కలిగేది. నిద్ర దాదాపుగా దూరమైంది. స్వామీజీ పాశ్చాత్య వైద్యవిధానంలో శిక్షణ పొందిన డాక్టర్ల చికిత్సకే ప్రాధాన్యం ఇచ్చారు. అయినప్పటికీ నిరంజనానంద వినతి మేరకు ఒక ఆయుర్వేద వైద్యుని వద్ద చికిత్స పొందడానికి సమ్మతించారు. ఆ వైద్యుడు ఔషధ నిర్ణయంచేసి, “మూడు నాలుగు వారాలపాటు నీరు త్రాగరాదు, ఆహారంలో ఉప్పు చేర్చకూడదు” అన్నాడు కచ్చితంగా.
ఒకరోజు వేకువజామున శరశ్చంద్ర మఠానికి వచ్చాడు. స్వామీజీ అతణ్ణి చూడగానే, “నువ్వు వచ్చేశావా? మంచిది. నీ గురించే అనుకొంటున్నాను” అన్నారు ఆప్యాయంగా.
శరత్ : మీరు ఆరేడు రోజుల నుండి పాలు మాత్రమే తీసుకొంటున్నట్లు విన్నాను.
స్వామీజీ : అవును. నిరంజన్ వేడుకోలు ప్రకారం నేను ఔషధం సేవిస్తున్నాను. వారి విన్నపాన్ని తిరస్కరించకూడదు కదా!
శరత్ : గంటలో ఐదారుసార్లు మీరు నీరు త్రాగుతారు కదా! అదెలా పూర్తిగా విడిచిపెట్టగలిగారు?
స్వామీజీ : ఈ ఔషధం సేవిస్తే నీరు త్రాగరాదని వినగానే ‘నీరు త్రాగను’ అని దృఢంగా సంకల్పించుకొన్నాను. ఆ తరువాత నీటి గురించిన ఆలోచన మనస్సులో మెదలితే ఒట్టు!
శరత్ : ఈ చికిత్స మీకు మేలు చేస్తుందని ఆశిస్తాను.
స్వామీజీ : మేలు చేస్తుందో లేదో నాకు తెలియదు. నేను సోదరుల ఆదేశాన్ని శిరసా వహిస్తాను.
ఈ చికిత్స వలన కాస్త మేలు జరిగింది. స్వామీజీ ఆరోగ్యం కాస్త తేరుకొంది. అయినప్పటికీ ఆయన బలహీనంగానే ఉన్నారు. “ఈసారి ఆరోగ్యం కుదుటపడ్డాక నేను నా హృదయ రక్తంతో కాళీమాతను ఆరాధిస్తాను. అప్పుడు మాత్రమే ఆమెకు తృప్తి కలుగుతుంది” అన్నారు శరత్‌తో.
‘శుక్రాచార్యులు’
కాని కొన్ని రోజుల్లోగానే మళ్లీ యథాప్రకారం ఆరోగ్యం క్షీణించింది. ఉన్న రోగాలతో ఒక కన్నులోని రక్తనాళం దెబ్బతిని ఆయన చూపు కొద్దిగా మంద గించింది. ఒక కంటి చూపు కాస్త మందగించడంతో స్వామీజీ తమను తాము రాక్షస గురువైన శుక్రాచార్యులుగా పేర్కొ న్నారు. రాక్షస గురువు ఏకాక్షి. తాము కూడా ఒక కంటి చూపు కోల్పోయి మ్లేచ్ఛులుగా పరిగణింపబడిన పాశ్చాత్యులకు గురువుగా ఉన్నందువలన తమను ఆ విధంగా పేర్కొన్నారు స్వామీజీ. దీనిని గురించి ఒకసారి శివానందను, “మహాపురుష్!* నన్ను అసుర గురువైన శుక్రాచార్యునితో పోల్చుకోవడం ఎలా ఉంది?” అని తమాషాగా అడిగారు.
బాల్య నేస్తాలతో
యౌవన కోర్కెలు, యౌవన ఉల్లాసాలు, యౌవన ఊహలు అన్నీ అంతిమ కాలంలో మళ్లీ పునరావృతం అవుతాయంటారు. స్వామీజీ బాతు, జింక, మేక ఇత్యాది యౌవనకాల నేస్తాలను మళ్లీ పెంచుకోసాగారు. ఆయన ‘కుటుంబంలో’ మొదటి సభ్యుడు మేక. దానికి ‘హంస’ అని స్వామీజీ పేరుపెట్టారు. దాని పాలు ఆయన టీలో ఉపయోగించేవారు. దాని పిల్ల ‘మాతృ’. అదంటే స్వామీజీకి మహా ముద్దు. అది సామాన్యంగా ఎప్పుడూ స్వామీజీతో పాటు అన్ని చోట్లకూ తిరుగుతూ ఉంటుంది, ఆయన గదిలోకి స్వేచ్ఛగా వెళ్లి వస్తుంది. దాని మెడలో ఒక గంటల వలయం స్వామీజీ వేశారు. ‘మాతృ’ అటూ ఇటూ పరుగెత్తుతూ ఉంటే వినిపించే ఘల్‌ఘల్ సవ్వడి ఆయన కెంతో ఇష్టం. కాశీకి వెళ్లినప్పుడు అక్కణ్ణుంచి బ్రహ్మా నందకు వ్రాసిన లేఖలో కూడా ‘మాతృ’ ను ప్రస్తావించి, జాగ్రత్తగా చూసుకో మన్నారు. “గత జన్మలోనే నాతో దానికి సంబంధం ఉంది” అనేవారాయన. దురదృష్టవశాత్తూ ‘మాతృ’ ఆయన ఒడిలో తల వాల్చి మరణించింది. అప్పుడు స్వామీజీ అమిత దుఃఖంతో, “ఏం విచిత్రం! నేను ఎవరిని ప్రేమిస్తానో వారందరూ సత్వరమే మరణిస్తున్నారు!” అన్నారు. వీటితో భాగ్, లయన్* అనే రెండు కుక్కలు, కొన్ని బాతులు, జింకలు, కొంగలు ఆయన ‘కుటుంబ’ సభ్యులు.
స్వామీజీ హాస్యం జోడించి వాటి గురించి ఇలా వ్రాస్తున్నారు: “నా పెద్ద కొంగ ఆనందంగా ఉంది. అదే విధంగా బాతులు కూడా సంతోషంగా ఉన్నాయి. సాధువైన నా జింక పిల్ల మఠం నుంచి పారిపోయింది; వెతకి కనుగొనే వరకు కొన్ని రోజులు మా అందరినీ ఆవేదనలో ముంచివేసింది. దురదృష్టవశాత్తూ నిన్న నా బాతుల్లో ఒకటి చనిపోయింది. అది ఒక వారంగా శ్వాసించడానికి ఎంతో యాతనపడింది. మాలో తమాషాగా సంభాషించే ఒక వృద్ధ సాధువు, ‘స్వామీజీ! తడిలోనూ, వానలోనూ బాతులు జలుబుతో పీడింపబడతాయి, కప్పలు తుమ్ము తుంటాయి. ఇలాంటి కలియుగంలో జీవించడంలో ఎలాంటి ప్రయోజనమూ లేదు’ అని వ్యాఖ్యానించారు. బాతులలో ఒకటి తన రెక్కలను విదిలించ నారంభించింది. మరో దారి లేక చనిపోతే చనిపోనీ, బ్రతికితే బ్రతకనీ అని దానిని సజల కార్బాలిక్ ఆమ్లం కలసిన నీరు నింపబడిన ఒక తొట్టెలో కొన్ని నిమిషాలు ఉంచాను. ఇప్పుడు అది బాగానే ఉంది.” ఉదయం తమ పనులు మగిసిన తరువాత మఠంలోని ఆవులను పర్యవేక్షించడానికి స్వామీజీ వెళ్లేవారు.
పువ్వుల తోట, కాయగూరల తోట స్వామి బ్రహ్మానంద చూసుకొనేవారు. అవి స్వామీజీ ముద్దు జీవాలు మేత మేసే పచ్చిక బయలుకు ప్రక్కన ఉన్నాయి. స్వామీజీ జీవాల వలన పువ్వుల తోటకో, కాయగూరల తోటకో ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు ఇద్దరూ తమ ప్రక్క న్యాయం ఉందంటూ కలహించుకోవడం యువ సన్న్యాసులకు తమాషాగా ఉండేది.
‘భాగ్’ కుక్క
స్వామీజీ ముద్దు జీవాలలో భాగ్ గురించి చెప్పుకోవాలి. స్వామీజీ ముద్దు జీవం కావడం వలన అది మఠం అంతా తనకు సొంతమన్నట్లు ప్రవర్తించేది. ఒక రోజు పూజ కోసం ఉంచిన నీటిని త్రాగింది. అశ్రద్ధతో నీటిని అక్కడ ఉంచిన సన్న్యాసిని స్వామీజీ చీవాట్లు పెట్టారు. కాని కుక్కకు కూడా ఏదో శిక్ష విధించాలనుకొన్న సన్న్యాసులు నాడు దానిని తీసుకువెళ్లి గంగానది ఆవలి తీరంలో వదలిపెట్టి వచ్చారు. పగలంతా ఎక్కడో తిరిగి సాయంత్రానికి ఈ ఒడ్డుకు వచ్చే ఒక పడవలో ‘భాగ్’ ఎక్కింది. దానిని క్రిందికి దింపడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రక్కకు వెళితేనే కరిచి చీల్చిచెండాడేటట్లు మొరుగుతున్న ఆ కుక్క వద్దకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. చివరికి ఆ పడవలో మఠానికి వచ్చి రాత్రి దాకా ఎవరి కంటా పడకుండా ఎక్కడో ఉండిపోయింది. అందరూ నిద్రించాక తిన్నగా స్వామీజీ గదిలోకి వెళ్లి, ద్వారం వద్ద పడుకొన్నది. వేకువజామున నాలుగు గంటలకు అలవాటు ప్రకారం నిద్ర లేచిన స్వామీజీ స్నానాలగదికి వెళుతున్నప్పుడు దారిలో ‘భాగ్’ మీద పొరపాటున కాలు వేశారు. వెంటనే ‘భాగ్’ లేచి తోక ఆడిస్తూ ఆయన కాళ్లను చుట్టివచ్చింది – క్షమాపణ కోరుతున్నట్లుంది దాని చేతలు. స్వామీజీ దానిని లాలించారు. ‘భాగ్’ ఏ తప్పు చేసినా ఇకపై దానిని బయటకు తరిమివేయకూడదని అందరికీ నిష్కర్షగా చెప్పారు.
‘భాగ్’ ఒక సామాన్యమైన కుక్క కాదు. పరిపక్వత చెందిన జీవి ఏదో పొర పాటుగా కుక్కగా జన్మించినట్లు అందరూ భావించేట్లుగా దాని చేతలు ఉన్నాయి. గ్రహణ వేళల్లో తక్కినవారితో పాటు గంగలో స్నానం చేయడం తక్కిన కుక్కల నుంచి దానిని విలక్షణంగా చూపింది. స్వామీజీ కాలం చేసిన తరువాతనే అది చనిపోయింది. దాని దేహాన్ని గంగలో నిమజ్జనం చేశారు. కాని చాలాసేపటి తరువాత గంగలో పోటు* ఏర్పడి, దాని దేహం మళ్లీ మఠం తీరంలోకే కొట్టుకు వచ్చింది. ఆ తరువాత మఠంలోనే దానిని ఖననం చేశారు.
పారిశుద్ధ్యం – స్వచ్ఛత
పారిశుద్ధ్యానికి స్వామీజీ అగ్రతాంబూలం ఇచ్చారు. “పారిశుద్ధ్యం దివ్య త్వానికి మొదటి మెట్టు” అనేవారాయన. మఠ భవనాలను, గదులను స్వామీజీ తరచూ వెళ్లి చూసేవారు. మాలిన్యం కంటబడితే స్వయంగా ఆయనే శుభ్రం చేసేవారు. ఒక రోజు ఎక్కడో ఒక చోట శుభ్రం చేయకుండా మాలిన్యం ఉండడం ఆయన చూశారు. వెంటనే ఆయన బ్రహ్మానందను పిలిచి, “రాజా!* ఎందుకు ఇక్కడ ఇంత అపరి శుద్ధంగా ఉంది? మఠాన్ని శుభ్రంగా ఉంచుకోలేకపోతే చెట్ల క్రింద జీవించడం మంచిది కదా! మఠం అంటూ ఒకటి ఏర్పడింది, దానిని శుభ్రంగా ఉంచుకోవాలి” అన్నారు కాస్త బాధపడుతూ. తక్కిన సన్న్యాసుల గదులు, పరుపులు మొదలైనవి కూడా ఆయన వెళ్లి చూడడం కద్దు. వస్తువులు సముచిత స్థానాలలో ఉండాలి, పరుపు శుభ్రంగా ఉండాలి, పరుపును రోజూ ఎండలో పరచి, మడిచి పెట్టుకోవా లనే విషయాలలో స్వామీజీ ఎంతో కచ్చితంగా ఉండేవారు. తమ శిష్యుడైన ఆత్మానంద గది ఆయనకు బాగా నచ్చింది. ఆ శిష్యుని గది, పరుపు అన్నీ ఎప్పుడూ మెరుస్తూ శుభ్రంగా ఉండేవి. ఇందువలన ఎప్పుడైనా అక్కడకు వచ్చే పక్షంలో ఆ పరుపు మీద కాసేపు పడుకొని మరీ వెళ్లేవారాయన.
గోళ్లు కత్తిరించుకోకుండా ఉండే వారి చేతుల మీదుగా స్వామీజీ మంచినీరు కూడా పుచ్చుకోరు. చేతులు కడుగుకొని ధరించిన వస్త్రంతో తుడుచుకోవడం ఆయనకు సుతరామూ నచ్చదు. “ఈ విధంగా చేస్తూవుంటే నా ప్రక్కన కూడా చేర్చను” అనేవారాయన. “మూత్రవిసర్జనానంతరం చేతులు కడుక్కోవాలి. గురుదేవులు దీన్లోనూ ఎంతో శ్రద్ధ వహించారు. ఎవరైనా చేతులు కడుగుకోకుండా వస్తే కోపగించుకొనేవారు” అనేవారు స్వామీజీ.
అపరిశుద్ధత, అపరిశుద్ధ ఆహారపుటలవాట్లు అనేక రుగ్మతలకు కారణం కావడం వల్ల వాటిని పరిహరించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. వర్షా కాలాలలో గంగ నీరు బురదమయమై ప్రవహిస్తుంది. కనుక ఆ రోజుల నిమిత్తం ఒక లోతైన బావిని త్రవ్వించారు.
మధుమేహం కారణంగా ఆయనకు దాహం ఎక్కువగా ఉండేది, వంటగది వేడిలో నిలబడితే దాహం మరీ ఎక్కువ అయ్యేది. దానిని కూడా పట్టించుకోకుండా వంటగదిని తరచూ పరిశీలించేవారు.
ఒక రోజు స్వామీజీకి భోజనం వడ్డించారు. పాదరక్షలు ధరించి అక్కడికి వచ్చిన ఒక వ్యక్తితో స్వామీజీ, “ఎవరైనా భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడకు పాదరక్షలు ధరించి రావడం సభ్యత కాదు. అంతేకాక అది ఆహార పావనత్వానికి భంగం కలిగించడమే కాక ఆహారంలో దుమ్ము, ధూళి పడి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది” అన్నారు.
జపధ్యానాలు
ధ్యానానికి స్వామీజీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. తద్ద్వారా ఆంతరిక శక్తిని చక్కగా అభివ్యక్తం చేయవచ్చు అనేవారు ఆయన. కనుక ఆధ్యాత్మిక జీవితంలో ధ్యానానికి ఎంతో ముఖ్యత్వం ఇచ్చారు. ఎవరైనా ఏకాంతంలో ధ్యానం చేస్తూన్నప్పుడు చూస్తే ఆయన ఎంతో సంతోషించేవారు. మఠంలోని సన్న్యాసులు తమ విధులను చక్కగా నిర్వర్తించాలంటే ధ్యాన జీవితం తప్పనిసరి అని ఆయన వారితో చెప్పడం కద్దు. ఈ విషయంలో ఆయన చీవాట్లు పెట్టడానికి సైతం సంకోచించేవారు కారు.
వేకువజామున నాలుగింటికి ఆలయ గంట మ్రోగుతుంది. ఐదు నిమిషాల లోపుగా అందరూ ఆలయానికి వెళ్లాలి; అలా వెళ్లని వారికి మఠంలో భోజనం పెట్టరు; భిక్షమెత్తుకొని తినాలనే నియమాన్ని స్వామీజీ అమలుచేశారు. సోదర సన్న్యాసులకు సైతం మినహాయింపు లేదు. స్వామీజీ తప్పకుండా ఆలయానికి వెళ్లేవారు. ఎవరు వచ్చారో, ఎవరు రాలేదో ఆయన గమనించేవారు. రాని వ్యక్తుల గదికి ప్రారంభ రోజుల్లో, స్వయంగా ఆయనే వెళ్లి, “ఓ సన్న్యాసి బాబూ! ఇంకా ఎంతసేపు నిద్రిస్తావు?” అంటూ వారిని నిద్రలేపేవారు.
ఒక రోజు వేకువన కొందరు మాత్రమే ఆలయానికి రావడం తటస్థించింది. అది చూసి స్వామీజీ ఎంతో అసంతృప్తి చెందారు. వంటగది నిర్వాహకుడైన స్వామిని పిలిచి, “వంటగది తాళంచెవిని నా చేతికివ్వు. నేడు ఎవరికీ భోజనం లేదని తెలియజెయ్యి. చూస్తాను” అని చెప్పి తాళంచెవి పుచ్చుకొన్నారు. ఆ రోజు విజ్ఞానానంద ఆలయానికి వెళ్లాడు. ఆతడికి తాళంచెవి ఇచ్చి, కలకత్తా వెళ్లిపో యారు. తరువాత తిరిగి వచ్చి ఎవరెవరు ఏం చేశారో అడిగి తెలుసుకొన్నారు. నాడు ధ్యానానికి వెళ్లని వారు భిక్షమెత్తుకొని తిన్నారు.
స్వామీజీ అతివేకువనే నిద్ర లేచేవారు. కొన్ని సమయాలలో రాత్రంతా నిద్రించరు. అయినప్పటికీ ఉదయం ఆలయానికి వెళ్లి ధ్యానం చేయడం మానరు. ఒకసారి త్రిగుణాతీతానంద నాలుగు రోజులుగా జ్వరంతో పడకబెట్టారు. ద్రవ ఆహారం మాత్రమే స్వీకరించారు. ఉదయం ఆలయానికి వెళ్లిన స్వామీజీ ఆతణ్ణి కూడా రమ్మన్నారు; “సోదరా! రావడం లేదా? జ్వరం – అదేం పెద్ద విషయం? రా, వచ్చి ధ్యానం చేయి. మీరంతా జ్వరం వచ్చిందని ధ్యానం చేయడం మానుకొంటే మీ నుంచి జనం ఏం నేర్చుకొంటారు?” అని అడిగారు. ఆతణ్ణి తోడ్కొని ఆలయానికి వెళ్లారు.
మరొక రోజు, మరుజన్మ గురించీ, మనిషిగా జన్మించిన తరువాత మళ్లీ నిమ్న జన్మలు ఎత్తడం సాధ్యమా అన్న విషయం గురించీ సంభాషణ జరిగింది. అందరూ ఎంతో ఆసక్తిగా దానిలో పాల్గొన్నారు. స్వామీజీ మౌనంగా అంతా వింటూ ఉన్నారు. ఏ వైపునకు భావనలు అవసరమో ఆ వైపునకు వాటిని అందిస్తూ రెండు పక్షాల వారినీ ఉత్సాహపరిచారు. రాత్రి ప్రారంభమైన సంభాషణ అర్ధరాత్రి దాటి రెండు గంటల దాకా సాగింది. ఆ తరువాత అందరూ నిద్రకు ఉపక్ర మించారు. వేకువజామున నాలుగు గంటలకు స్వామీజీ అలవాటు ప్రకారం నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకొని ఆలయానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. మృదుర వంలో పాడుకొంటూ నడవసాగారు. తక్కిన సన్న్యాసులు లేవలేదు. స్వామీజీ, అఖండానందను లేపి, “ఏమిటి గంగా! ఇంకా పడుకొనేవున్నావు? లేచి గంట మ్రోగించు. అందరూ లేవాలి. ఇలా ఉదయాన సన్న్యాసులు నిద్రిస్తూ ఉండడం సహించరాని దృశ్యం” అన్నారు. అందుకు అఖండానంద, “రెండింటి దాకా మేలుకొని ఉన్నారు కదా! కాసేపు పడుకొంటే ఏం” అన్నారు. “ఏమిటి! రెండింటికి పడుకొన్నారనే కారణంగా ఆరింటికి లేవాలా? ఆ గంటను నా చేతికివ్వు, నేను మ్రోగిస్తాను; నేను అందుకే ఉన్నాను. మఠం ఉంటున్నది నిద్రించడానికా?” అన్నారు బిగ్గరగా. వెంటనే అఖండానంద అందరి వద్దకూ వెళ్లి గట్టిగా గంట మ్రోగించారు. “విసుగిస్తున్న దెవరు?” అంటూ కోపంగా అడుగుతూ అందరూ ఆదరాబాదరాగా లేచారు. కోపంతో ఆతణ్ణి ముక్కలు ముక్కలుగా నరికివేసేలా ఉన్నారు. కాని ఆతడి వెనుక స్వామీజీ మౌనంగా నిలబడి నవ్వుతూండడం చూసి అందరూ నిశ్శబ్దంగా లేచారు.
మరొక రోజు బ్రహ్మానంద స్వామినే ఈ రకంగా స్వామీజీ గాభరాపడేలా చేశారు. స్వామీజీ గృహస్థ శిష్యుడైన శరశ్చంద్ర నాడు మఠంలో బస చేసి ఉన్నాడు. మర్నాడు వేకువజామున నాలుగింటికి స్వామీజీ ఆతణ్ణి నిద్రలేపి, “నువ్వు ఈ గంట మ్రోగించి సాధువులనూ, బ్రహ్మచారులనూ లేపు” అన్నారు. సాధువులు ఉండే చోటికి శరత్ వెళ్లి గంట మ్రోగించాడు. వారు లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, ధ్యానం చేయడానికి ఆలయానికి పరుగెత్తారు.
స్వామీజీ ఆదేశం మేరకు శరశ్చంద్ర బ్రహ్మానంద పడక ప్రక్కకు వెళ్లి గట్టిగా గంట మ్రోగించాడు. ఉలిక్కిపడి లేచిన ఆయన, “ఓరి భగవంతుడా! ఇతడు మమ్మల్ని మఠంలో ఉండనివ్వనట్లుంది!” అన్నారు. ఈ మాట శరత్, స్వామీజీతో చెప్పినప్పుడు ఆయన నవ్వుతూ, “మంచిపని చేశావు!” అన్నారు. పిదప ముఖం కడుగుకొని శరత్‌తో ఆలయానికి వెళ్లారు.
ఒక రోజు శివానంద ధ్యానానికి సకాలంలో ఆలయానికి వెళ్లలేకపోయారు. స్వామీజీ తక్కిన వారి ముందు ఆయనతో, “సోదరా! మీరు మహాపురుషులు. అయినప్పటికీ ఇతరులు నేర్చుకోవడానికి మీరు ఆలయానికి వెళ్లడం మంచిది” అన్నారు.
నియమమూ, హృదయకారుణ్యమూ
మరొక రోజు శివానంద భిక్షమెత్తడానికి వెళ్లవలసి వచ్చింది. నాడు ఆయన ఆలయానికి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. తరువాత స్వామీజీ ఆయనతో, “సోదరా! మనమే నియమం విధించాం. మనమే దానిని ఉల్లఘించ కూడదు, కనుక ఈ రోజు మీరు భిక్షమెత్తడానికి వెళ్లడం మంచిది” అన్నారు. శివానంద మారుమాట్లాడకుండా బయలుదేరారు. మఠంలో మధ్యాహ్న భోజనానికి గంట మ్రోగినప్పుడు అందరూ వెళ్లారు. కాని స్వామీజీ వెళ్లలేదు. పశ్చిమ వసారాలో కూర్చుని శివానంద కోసం నిరీక్షిస్తున్నారు. కాసేపటికి శివానంద రాగానే ఆనందంగా, “సోదరా! ఏం తెచ్చావు, చూద్దాం! భిక్షాన్నం తిని చాలా రోజులయింది. ఇవాళ నువ్వు తెచ్చింది మనిద్దరం పంచుకొని తిందాం” అన్నారు. తరువాత ఇద్దరూ పరమానందంగా ఆ భిక్షాన్నం తిన్నారు. నియమం పాటించిన అదే సమయంలో స్వామీజీ హృదయకారుణ్యం ఈ సంఘటనలో వ్యక్తమయింది.
ఒక రోజు బోధానంద, మరికొందరు ఉదయం సకాలంలో ఆలయానికి వెళ్లలేదు. “ఈ రోజు వారికి మఠంలో భోజనం లేదు. వారిని కలకత్తా వెళ్లి భిక్ష మెత్తుకొని తినమను” అన్నారు స్వామీజీ. బోధానందతో, “నీ బంధువుల ఇంటికి మాత్రం వెళ్లవద్దు” అన్నారు. బోధానంద రోజంతా తిరుగాడడంతో బాగా అలసి పోయారు. దారిలో ఆయనను చూసిన త్రిగుణాతీత డబ్బు ఇవ్వబోయినప్పుడు తిరస్కరించారు. సాయంత్రం అలసిసొలసి పడవలో మఠానికి వచ్చారు. పడవ తీరాన్ని తాకినప్పుడు చూస్తే అక్కడ స్వామీజీ ఆయన కోసం ఎదురుచూస్తూ నిలబడ్డారు. చలించిపోయారు బోధానంద. ఆయన అనుభవాలు విని ఆయనను తోడ్కొని మఠానికి వెనుదిరిగారు స్వామీజీ! బోధానంద అలసట స్వామీజీ సాంత్వన దృక్కులతో క్షణంలో తీరిపోయింది!
ఒకరోజు ప్రేమానంద ఉదయం ఆలస్యంగా వెళ్లారు. ఆయన తిన్నగా స్వామీజీ వద్దకు వెళ్లి తనకు శిక్ష ఏమిటని అడిగారు. స్వామీజీ కళ్లు ఆర్ధ్రమ య్యాయి: “నిన్ను నేను శిక్షించడమా? ఆ ఆలోచన నీ కెలా వచ్చింది బాబూరాం?” అన్నారు స్వామీజీ ఉద్వేగభరితులై. ఆయన ప్రక్కన కూర్చున్న బ్రహ్మానంద వెంటనే, “దీన్లో శిక్ష అనే మాటకే తావు లేదు. ఉదయం సకాలంలో ఆలయానికి వెళ్లని వారు భిక్షమెత్తడానికి వెళ్లాలన్నది నియమం, అంతే” అన్నారు. ప్రేమానంద మౌనంగా భిక్షమెత్తడానికి వెళ్లారు.
ఈ విషయంలో ఒకసారి స్వామీజీ ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన వలసివచ్చింది. ఒక రోజు హఠాత్తుగా అద్భుతానంద తమ సంచీ చేతపుచ్చుకొని మఠం నుంచి వెళ్లిపోతున్నట్లు చెప్పి బయలుదేరారు. ఆ సంగతి విన్న స్వామీజీ అయన వద్దకు వచ్చి కారణం ఏమిటని అడిగారు. అందుకు అద్భుతానంద, “పాశ్చాత్యులను అనుసరించి నువ్వు అనేక నియమనిబంధనలు మఠంలో అమలు పరచావు. వాటినన్నీ పాటించడం నాకు సాధ్యం కాదు. గంట మ్రోగగానే ధ్యానంలో మగ్నమయ్యే మేరకు నా మనస్సు ఇంకా పరిపక్వత చెందలేదు” అని చెప్పి నడవసాగారు. స్వామీజీకి ఏం చేయాలో పాలుబోలేదు. “సరి, నువ్వు వెళ్లవచ్చు” అన్నారు. అద్భుతానంద మఠ ద్వారం సమీపించగానే, ఇక స్వామీజీ ఊరక ఉండలేకపోయారు. ఒక్క పరుగులో అక్కడకు వెళ్లి ఆయనతో, “ఈ నియమాలు నీకు వర్తించవు. అది క్రొత్తగా వచ్చేవారికి మాత్రమే, నీకు కాదు” అని చెప్పి, ఆయనను మఠంలోకి తోడ్కొని వచ్చారు.
జప ధ్యానాలు ఎప్పుడు చేయాలి?
సూర్యగ్రహణం తదితర రోజుల్లో ఎక్కువసేపు జపధ్యానాలు చేయమని స్వామీజీ నొక్కివక్కాణించేవారు. చివరి రోజు దాకా ఆయన జపధ్యానాలు చేయ కుండా ఉండినది లేదు. ఒంట్లో ఎంత నలతగా ఉన్నప్పటికీ ఆయన ఆలయానికి తప్పకుండా వెళ్లేవారు. “రెండు వేళలా జపధ్యానాలు చేయడం ఎంతో ముఖ్యం. తక్కిన సమయాలలో పనులలో నిమగ్నులవండి” అంటూ సన్న్యాసులతో ఆయన చెప్పడం కద్దు.
జప ధ్యానాలూ, కర్తవ్య విధులూ కలసికట్టుగా సాగాలనేవారు స్వామీజీ. “ఎడతెగకుండా ధ్యానం చేయడం మీకు సాధ్యం కాదు. కనుక జప ధ్యానాలు చేసిన తరువాత తక్కిన సమయంలో చక్కగా మీ విధులు నిర్వహించండి. అది మనస్సును పవిత్రీకరిస్తుంది” అనేవారు ఆయన. వీటి రెండింటిలో పాల్గొనకుండా ఉబుసుపోక మాటల్లో సమయాన్ని వృథా చేసేవారంటే ఆయనకు సుతరామూ నచ్చదు. సోమరితనమంటే ఆయనకు గిట్టదు. ఏ పనీ లేకపోతే ఏదైనా క్రొత్త పనిని కల్పించి, దానిలో సన్న్యాసులను పాల్గొనేలా చేసేవారు.
సోదర సన్న్యాసులతో
ఈ రోజుల్లో స్వామీజీ ఎక్కువ సమయం తమ సోదర సన్న్యాసులతో గురు దేవుల గురించీ, దక్షిణేశ్వర రోజుల గురించీ ముచ్చటిస్తూ గడిపారు. అదేవిధంగా మఠం గురించీ, దాని భవిష్యత్తు గురించీ, యువసన్న్యాసుల గురించీ దీర్ఘంగా చర్చించారు. కొన్ని సాయంత్ర వేళల్లో వారిలో ఒకరిద్దరిని తోడ్కొని బయట పచార్లు చేస్తూ అనేక విషయాలు ముచ్చటించేవారు. పచార్లు చేస్తున్నప్పుడు చేతికర్ర ఉంచుకొనేవారు; చెవులను కూడా కప్పే టోపీ ధరించేవారు. తమ శిష్యులతో సోదర సన్న్యాసుల సుగుణాలను ప్రస్తావించి, వారికి సేవలు చేయమనీ, వారి ఆదేశానుసారం ప్రవర్తించమనీ నొక్కివక్కాణించేవారు.
కొన్ని సమయాలలో స్వామీజీ హాస్యంగా మాట్లాడి అందరికీ ఆనందం కలిగించేవారు. ఒకనాడు అద్వైతానందతో, “ఒక విషయం నీకు తెలుసా? ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే సోమవారం వచ్చింది” అన్నారు. సరళ మనస్కుడైన అద్వైతానంద దానిని యథాతథంగా నమ్మి, “ఓ, అలాగా! ఆశ్చర్యంగా ఉందే!” అన్నారు. అందరూ నవ్వారు. కొన్ని సమయాలలో స్వయంగా తామే వంటచేసి సోదర సన్న్యాసులకూ, శిష్యులకూ వడ్డించి ఆనందించేవారు.
ఒక రోజు సేమ్యాతో ఒక వంటకం తయారుచేశారు. నాడు మఠానికి వచ్చిన శరశ్చంద్ర దానిని ఇష్టంగా తిన్నాడు. అతడు అంతకు ముందు సేమ్యా చూసింది లేదు. కనుక స్వామీజీని “అది ఏమిటి?” అని అడిగాడు. అందుకు స్వామీజీ, “అవి పాశ్చాత్య వానపాములు, నేను లండన్ నుంచి వస్తున్నప్పుడు వాటిని ఎండబెట్టి నీ కోసం తెచ్చాను” అన్నారు!
కారమంటే మహా ఇష్టం
తాలించిన ఆహారాన్ని స్వామీజీ ఇష్టపడి తింటారు. దానితోపాటు కారం అంటే మహా ఇష్టం. తక్కిన వారు తిని భరించలేని కారాన్ని ఆయన ఇష్టపడి తినేవారు. ఒకసారి అలహాబాద్‌లో డాక్టర్ గోవింద చంద్ర బోస్ అనే వ్యక్తి ఇంట్లో ఆయన బస చేశారు. అప్పుడు అక్కడ అమూల్య గురూజీ అనే వ్యక్తి కూడా ఉన్నారు. వీరిద్దరూ యువప్రాయంలోనే పరిచయస్థులు. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. స్వామీజీ ఒక మిరపకాయ అడిగి తిన్నారు. వెంటనే అమూల్య గురూజీ కూడా ఒకటి తిన్నాడు. ఈ విధంగా ఇద్దరూ పోటీపడి తిన్నారు. చివరికి అమూల్య గురూజీ తన ఓటమిని అంగీకరించవలసి వచ్చింది.
పాశ్చాత్యంలోనూ స్వామీజీని విందుకు ఆహ్వానించిన వ్యక్తులు ఆయన తినే కారం చూసి దిగ్భ్రాంతి చెందారు. మిసెస్ లియాన్ ఇంట్లో బస చేసినప్పుడు ఒక రోజు భోజన సమయంలో ఆమె స్వామీజీకి మిరపకాయ పులుసు (chilly sauce) చిన్న సీసా ఒకటి ఇచ్చి, “స్వామీజీ! ఆహారం మీద ఒకటి రెండు చుక్కలు వేసు కోండి” అంది. కాని స్వామీజీ ఆ సీసాలోని మొత్తం పులుసును ఆహారం మీద వేసుకొన్నారు. భోజనానికి కూర్చున్న అందరూ దీనిని ఊపిరి బిగపట్టి చూశారు. భయపడ్డ లియాన్, “స్వామీజీ! భరించలేరు. అది అమిత కారంగా ఉంటుంది” అన్నాడు. స్వామీజీ నవ్వుకొంటూ అంతా తినివేశారు. ఆ తరువాత భోజన సమయంలో ఆయన కోసం మిరపకాయ పులుసు విడిగా ఉంచేవారు.
ఒకసారి స్వామీజీ తమ శిష్యుడు ఒకరితో, “ఎక్కడి ఆహారాన్నీ, నీటిని అయినా నేను భయపడకుండా స్వీకరించగలను. ఎందుకంటే నేను తినే మిరప కాయ కారం ఏ బ్యాక్టీరియానైనా, వ్యాధికారక క్రిములనైనా నశింపజేస్తుంది” అన్నారు తమాషాగా.
దరిద్రనారాయణ సేవ
మఠ స్థలాన్ని చదును చేయడానికీ, తక్కిన పనులకీ పలువురు సంథాల్లు నియమింపబడ్డారు. సంథాల్లు గిరిజనులు. బీహార్ ప్రాంతంలో అత్యధికంగా జీవించే వారికి పశువుల, మేకల పెంపకం, వ్యవసాయం లాంటివి ముఖ్యవృత్తులు. కరవు సమయాలలో తక్కిన నగరాలకు వలస వెళ్లి కూలీ పనులు చేసుకొనేవారు. నగరాలలోను, పట్టణాలలోను జీవించినప్పటికీ వాటి పైపై మెరుగులకు లోనుకాక నిష్కాపట్యంగా, నిరాడంబరంగా వారు జీవిస్తూ వచ్చారు. వారి నిరాడంబరత వల్ల స్వామీజీ వారిని అభిమానించారు. వారితో చాలాసేపు ముచ్చటించేవారు; వారి కష్టనష్టాలను సానుభూతితో వినేవారు. స్వామీజీతో వారు మాట్లాడుతూండడం వలన పని ఆలస్యమవుతూందని అద్వైతానంద కోపగించుకొనే వారు. కనుక వారు స్వామీజీతో మాట్లాడడానికి సంశయించేవారు. అందుకు స్వామీజీ, “ఫరవాలేదు, ఆయన మిమ్మల్ని తిట్టకుండా నేను చూసుకొంటాను” అంటూ, వారితోపాటు కూర్చుని మాట్లాడేవారు. వారితో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ప్రముఖ వ్యక్తులు వచ్చినప్పటికీ వారిని కూర్చోమని చెప్పి, సంథాల్లతో మాట్లాడడం పూర్తిచేసిన తరువాతనే ఆ వ్యక్తులను కలుసుకొనేవారు.
సంథాల్లలో ఒక వృద్ధుడు కెష్టా (కృష్ణుడు) కఠిన పరిశ్రమకు, నిరాడం బరతకు చక్కని ఉదాహరణ. అనేక రోజులు అతడు తన శోకమయ గాథలను చెబుతున్నప్పుడు స్వామీజీ కన్నీరు మున్నీరయ్యేవారు. ఒక రోజు అతడు, “బాబా, ఇక వెళ్లండి. మేం మా కష్టాలు చెబుతున్నప్పుడు మీరు విలపిస్తున్నారు” అన్నాడు. వారికి ఒక రోజు స్వామీజీ షడ్రసోపేతమైన విందు ఇవ్వగోరారు.
కనుక ఒకరోజు స్వామీజీ కెష్టాతో, “మంచిది, ఒక రోజు నువ్వు ఇక్కడ భుజిస్తావా?” అని అడిగారు. అందుకు కెష్టా, “మీరు తాకిన భోజనం మేం తినం; ఎందుకంటే మీరు పెట్టే భోజనంలో ఉప్పు వేయడం వలన, దానిని తినే మేము కులాన్ని కోల్పోతాం” అన్నాడు. అందుకు స్వామీజీ, “మీరు ఉప్పు చేర్చుకోకండి. ఉప్పు లేకుండా వంట చేస్తాం, అప్పుడు తింటారా?” అని అడిగారు. కెష్టా సమ్మ తించాడు. ఆ విధంగా స్వామీజీ ఇష్టప్రకారం చపాతీ, పులుసు, మధుర భక్ష్యాలు, పెరుగు మొదలైన వంటకాలు సిద్ధం చేశారు. తమతో కలసి సంథాల్లు భోజనం చేసేటట్లు స్వామీజీ ఏర్పాటు చేశారు. తింటున్నప్పుడు కెష్టా ఆయనతో, “ఇంత అద్భుతమైన భోజనం ఎక్కడ నుంచి వచ్చింది? ఇలాంటి భోజనం మేం ఇంత దాకా తిన్నది లేదు” అన్నాడు. స్వామీజీ వారికి తృప్తిగా భోజనం పెట్టించి, “మీరందరూ నారాయణులు; భగవత్స్వరూపులు. ఈ రోజు నేను నారాయణునికి భోజనం అర్పించాను” అన్నారు. తాను తరచూ వచించే ‘దరిద్ర నారాయణ’ సేవను స్వయంగా తానే ఒక రోజు నిర్వర్తించారు. తరువాత దరిద్ర నారాయణ సేవను విశదీకరిస్తున్నట్లుగా వారితో, “మీరు నారాయణులు, భగవత్స్వరూపులు. మీకు భోజనం సమర్పించడం ద్వారా నేడు నారాయణునికే సమర్పించాను” అన్నారు.
సంథాల్లు వెళ్లిపోయాక శరశ్చంద్రతో స్వామీజీ ఇలా అన్నారు: “వారిని సాక్షాత్తూ నారాయణునిగానే గాంచాను. ఇలాంటి నిష్కాపట్య హృదయాలను, కల్లా కపటంలేని ప్రేమను, నిరాడంబరతను నేనెక్కడా చూడలేదు.” తరువాత సన్న్యాసుల వైపు తిరిగి ఇలా చెప్పారు:
పేదల కోసం ద్రవించిపోయారు
“వీరు ఎంతటి నిష్కళంకులు; వీరి దుఃఖాన్ని కాస్త తగ్గించవచ్చా? అది చేయకుండా కాషాయాంబరాలు ధరించి ఏం ప్రయోజనం? ఇతరుల సంక్షేమానికై సమస్తం పరిత్యజించడమే నిజమైన సన్న్యాసం. వీరు తమ జీవితంలో మంచిదన్న దేనినీ అనుభవించలేదు. ఈ మఠాన్నీ తక్కినవీ విక్రయించి సమస్తాన్నీ పేదలకు, దిక్కులేని వారికి ధారపోద్దామని కొన్ని సమయాలలో నాకు అనిపిస్తోంది.
“మన దేశంలోని పేదలు ఆహారం లేకుండా పస్తులుండడం చూసినప్పుడు మీ పూజా పునస్కారాలనూ, మీ విద్య పటాటోపాలనూ, మీ స్వీయముక్తి ప్రయత్నా లనూ దూరంగా విసిరివేసి, సాధనలతో జితేంద్రియత్వంతో సంతరించుకొన్న శక్తితో సంపన్నుల మనస్సులను మార్చి, ధనం సేకరించి, ఊరూరా తిరిగి పేదలకు సేవ చేయడంలో యావజ్జీవితాన్ని గడపాలనే భావన నాలో అప్పుడప్పుడు తలెత్తు తున్నది.
“అయ్యో! ఈ దేశంలోని పేదల గురించి ఆలోచించడానికి ఎవరూ లేరే! వారే దేశపు వెన్నెముక! వారి పరిశ్రమ వలననే ఆహారం లభిస్తున్నది. వీథులను పరిశుద్ధం చేసేవారు, కూలీ మనుషులు ఒక రోజు పని ఆపివేస్తే నగరం అల్లాడి పోతుంది. కాని వీరి కోసం దిగివచ్చేవారు లేరు! దుఃఖంలో సాంత్వన పరచేవారు ఎవరూ లేరు.
“హిందువుల సానుభూతి లేనందున, చెన్నై పరగణాలోని వేలమంది నిమ్న కులస్థులు క్రైస్తవులయిపోయారు. ఇందుకు ఆకలి కర్కశం మాత్రమే కారణం కాదు, మన సానుభూతిరాహిత్యమూ ఒక కారణమే. మనం రేయింబవళ్లు వారితో, ‘మమ్మల్ని తాకకండి! తాకకండి!’ అంటూ నినాదం చేస్తూనే ఉన్నాం. ఈ దేశంలో సానుభూతి ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది? కేవలం అస్పృశ్యతా సమూహాలు! ఈ సంప్రదాయాలను తన్ని తగలేయండి. ఈ బంధనాలను తెంపి బయటపడి, ‘పేదలారా, దుఃఖీతులారా, పీడితులారా, అందరూ రండి!’ అంటూ, శ్రీరామకృష్ణుల పేరిట యావన్మందినీ సమైక్యపరచాలనే ఉద్దేశం అప్పుడప్పుడు మనస్సులో తలెత్తుతున్నది. వీరు జాగృతి చెందకుండా భారతమాత నిద్ర మేల్కొనదు. వీరి అన్న వస్త్రాలకు ఏర్పాటు చేయకుండా ఉన్నాం.
“మనం వీరికి ఏం చేశాం? అయ్యో! లోక వ్యవహారాల గురించి వీరికి ఏమీ తెలియదు. కనుక రేయింబవళ్లు పని చేసినప్పటికీ అన్న వస్త్రాలకు నోచుకోక కష్టపడుతున్నారు. అందరూ కలసి వీరికి కనువిప్పు కలిగిద్దాం! నాలోనూ వీరిలోనూ ఒకే భగవంతుడు కొలువై ఉన్నాడు, ఒకే మహాశక్తి ఉంది; ఆకృతిలోనే వ్యత్యాసమని నేను నా జ్ఞాననేత్రాలతో స్పష్టంగా చూస్తున్నాను. ప్రతి అంగంలోనూ రక్తం పూర్తిగా ప్రసరించకుండా ఏ దేశమైనా ఎప్పుడైనా అభివృద్ధి చెందిందా? ఒక అంగం పనిచేయకపోతే, తక్కిన అంగాలు సవ్యంగా ఉన్నప్పటికీ ఆ దేహం ద్వారా ఎక్కువ పనులు సాధ్యం కావు. ఇది నిశ్చయమని గ్రహించండి.”
అప్పుడు శరశ్చంద్ర జోక్యం చేసుకొని, “స్వామీజీ! ఈ దేశ ప్రజలలో విభిన్న మత సిద్ధాంతాలూ, భావనలూ వ్యాపించి ఉన్నాయి; వారిలో సామరస్యం జనింపజేయడం చాలా కష్టం” అన్నాడు. ఆతడి మాటలు విన్న స్వామీజీకి కోపం వచ్చి ఇలా అన్నారు:
“ఏ పనినైనా కష్టమని భావిస్తే ఇక్కడకు రావద్దు. భగవదనుగ్రహంతో అంతా సులభమవుతుంది. పేదలకూ, దిక్కులేనివారికీ కులమతాల వివక్ష లేకుండా సేవ చేయడమే నీ కర్తవ్యం. ఫలితం ఏమిటని అనుకోవడానికి అవసరం ఏముంది? పని చేసుకొంటూ పోవడమే నీ కర్తవ్యం; తక్కినవి తమంతట తామే చేరుకొంటాయి. సృష్టించడం తప్ప నశింపజేయడం నా పని తీరు కాదు. ప్రపంచ చరిత్ర చదివి చూడు. ప్రతి దేశంలోనూ ప్రత్యేక కాలఘట్టంలో ఒక మహాత్ముడు విశిష్టంగా ఉండడం చూడవచ్చు. ఆయన భావనలతో ఆకట్టుకోబడి వందలమంది ప్రజలు లోకానికి మంచి చేస్తారు. మీరందరూ బుద్ధిశాలురైన యువకులు, చాలాకాలం నుంచి ఇక్కడకు వస్తున్నారు. ఇంతదాకా ఏం చేశారు? చెప్పండి. ఈ జన్మనైనా ఇతరుల సేవ కోసం ఉపయోగించకూడదా? ఇక రాబోయే జన్మలలో వేదాంతాదు లన్నింటినీ అధ్యయనం చేయవచ్చు. ఈ జన్మను ఇతరుల సేవ కోసం వెచ్చిస్తే నువ్వు ఇక్కడకు రావడం వృథా కాలేదని నేను భావిస్తాను.”
ఈ విధంగా చెప్పి, స్వామీజీ ప్రగాఢ చింతనలో లయించిపోయారు. కాసేపయ్యాక ఇలా అన్నారు: “ఎంతో తపస్సు చేసిన తరువాత నేను ఈ సత్యాన్ని గ్రహించాను – ప్రతి పాణిలోనూ భగవంతుడు కొలువై ఉన్నాడు! అది తప్ప మరో భగవంతుడు ఎవరూ లేరు. జీవరాశులకు సేవ చేసే వ్యక్తి జగన్నాయకునికి సేవ చేసిన వాడవుతాడు.”
కాసేపయ్యాక మళ్లీ, “నేను ఈ రోజు చెప్పిన విషయాలు హృదయంలో మలచుకో, విస్మరించవద్దు!” అన్నారు.
బంగారు గడియారం
ఒకరోజు స్వామీజీని చూడడానికి పది పన్నెండు మంది యువకులు వచ్చారు. వారు వసారాలో నిరీక్షించారు. స్వామీజీ గదిలో నుంచి బయటకు రాగానే వారు ఆయనను పరివేష్టించారు. స్వామీజీ కూడా వారితో సహజరీతిలో మెలగారు. కొందరి భుజాల మీద చేతులు వేసి, కొందరి వీపు మీద తడుతూ సహజంగా మాట్లాడారు. ఒక ఆప్తుడు ఇచ్చిన బంగారు గొలుసు గల ఒక గడియారం ఆయన మెడలో ఉంది. ఇలాంటి గడియారాన్ని ధరించడం ఆ రోజుల నాగరకత. స్వామీజీ దానిని ధరించగా ఎవరూ చూసింది లేదు. ఆ రోజు ఆయన దానిని ధరించారు. ఆయన ఒంటి ఛాయకు బంగారు రంగు అమిత అందాన్ని కల్పించింది. ఒక యువకుడు ఆ గొలుసు మీద చేయి ఉంచి, “ఆహా! చాలా అందంగా ఉంది” అన్నాడు. స్వామీజీ ఒకసారి ఆతణ్ణి తేరిపార చూశారు. మరుక్షణమే ఆ గొలుసు తీసి ఆతడి చేతికిచ్చి, “ఇదిగో, తీసుకో! ఇది నీకు బాగా నచ్చింది. నువ్వే ఉంచుకో” అన్నారు. ఆ యువకుడు దిగ్భ్రమ చెందాడు. స్వామీజీ కొనసాగించారు: “ఇది నీకు ఇచ్చాను. కాని ఒక విషయం. దీనిని విక్రయించకు, నీ కోసమే ఉంచుకో.”
ఈయనే వివేకానంద
ఒక రోజు స్వామీజీకి బాగా అస్వస్థతగా ఉంది. ప్రధానంగా మధుమేహం ప్రకోపించి ఇబ్బంది పెట్టింది. ఆ రోజుల్లో ఇందుకు సముచితమైన చికిత్స మృగ్యం. అప్పుడు ఆయనకు మేక పాలు ఇచ్చేవారు. స్వయంగా పాలు పితకాలనే కోర్కె స్వామీజీకి ఒకరోజు కలిగింది. పాల గిన్నె పుచ్చుకొని, పాలు పితికేవారు ధరించేలా వస్త్రధారణ చేసు కొని, వారిలా కూర్చుని రెండు మోకాళ్ల మధ్య పాల గిన్నె ఉంచుకొని రెండు చేతులతో పాలు పితుక నారంభించారు. ఆ దృశ్యం చూస్తే ఆయన సుదీర్ఘ కాలంగా పాలు పితికే వృత్తిలో ఉన్నారని అనిపించక తప్పదు. అప్పుడు ఒక యువకుడు తన మిత్రులు కొందరితో, ‘లోక ప్రసిద్ధులైన’ స్వామి వివేకానందను దర్శించుకోవడానికి అక్కడకు వచ్చాడు. ఆయన పాలు పిదుకుతుండడం చూసి నప్పుడు ఆశ్చర్యంతో అతడికి నోట మాట పెగల్లేదు. కాసేపటికి స్వామీజీ పాలు పిదుకడం ముగించి, పాల గిన్నెతో లోపలికి వెళ్లారు. ఆ యువకుడు తన మిత్రులతో, “ఈయనే వివేకానంద!” అన్నాడు.