నిత్యం నేను శ్రీరామకృష్ణుల ఆలయంలో పూజ చేస్తున్నప్పుడు స్వామీజీ పాశ్చాత్య శిష్యుల జ్ఞాపకార్థం కూడా పువ్వులను సమర్పిస్తూన్నాను. వారికి విధేయుడనైన సేవకునిగా నన్ను నేను పరిగణించుకొంటాను.
– స్వామి ప్రేమానంద
వ్యక్తిగత మార్గదర్శకత్వం — మిత్రులు — శిష్యులు — అందరూ బ్రాహ్మణులే! — జగద్గురువు — సన్నిహిత బంధువు — దేశభక్తి — బాలుని లాంటి స్వామీజీ! — అద్దంలో చూస్తున్నారు! — వ్రాత పని — తప్పు దారి పట్టినవారి పట్లా అచంచల ప్రేమ — కారుణ్యమూర్తియైన గురువు
వ్యక్తిగత మార్గదర్శకత్వం
తుపానులా పరిభ్రమిస్తూ ప్రసంగాలు చేసి ప్రజలలో ఆధ్యాత్మిక జాగృతిని కలిగించడం ఒక వైపు, వారిలో తత్త్వవిషయాలను కాస్త లోతుగా నేర్చుకోవాలనే ఉత్సుకత ఉన్న వారికి తరగతి ప్రసంగాల లాంటివి మరొక వైపు. వీటితో స్వామీజీ మరొక ముఖ్యమైన పనిగా విరాజిల్లింది వ్యక్తిగత మార్గదర్శకత్వం. ఇది ఆయన కార్యకలాపాలలోని ఐదవ అంశం. యతి రాజూ, భగవదనుభూతి పొందిన వ్యక్తీ అయిన స్వామీజీ అనుగ్రహ పరిధిలోకి వచ్చే వారందరూ ఆధ్యాత్మిక జాగృతి పొందుతారనడంలో సందేహం లేదు. కాని వారిలో అతి కొద్దిమంది మాత్రమే ఆధ్యాత్మిక జీవితంలో పాల్గొని, భగవదనుభూతి అనే ఉన్నతాశయాన్ని చేగొని జీవించనారంభించారు. అర్హులైన ఆ కొద్దిమందికి ఆధ్యాత్మిక ఉన్నతోన్నత ద్వారాలను స్వామీజీ తెరిచారు. వారికి మార్గదర్శకత్వం వహించడం ఒక ముఖ్య కార్యకలాపంగా స్వామీజీ పరిగణించారు.
మిత్రులు
స్వామీజీ వేలమందిని కలుసుకొని ఉంటారు, వారిలో అనేకులు ఆయన జీవితం పట్ల ఆకర్షితులై ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. కాని శిష్యుడన్నప్పుడు స్వామీజీ అందుకోసం ప్రత్యేకంగా కొన్ని నియమాలు పాటించారు. “నేను మీ శిష్యుణ్ణవాలి” అని ఒకరు స్పష్టంగా ఆయనతో చెప్పే దాకా, ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జీవితం గడపడానికి సిద్ధంగా ఉన్నాడని గ్రహించే వరకు స్వామీజీ ఎవరి జీవితంలోనూ జోక్యం చేసుకోరు. వారి జీవితాలను ఆయన స్పృశించరు. “క్రొత్తవారిని మాకు పరిచయం చేస్తున్నప్పుడు కూడా ‘ఇతడు శిష్యుడు కాదు, మిత్రుడు మాత్రమే’ అని మాతో స్పష్టంగా చెప్పేవారు” అంటూ క్రిస్టైన్ వ్రాస్తున్నది. తమతో సన్నిహితంగా మెలగేవారితో మాత్రమే స్వామీజీ ఇలాంటి వ్యత్యాసం చూపారు.
క్రిస్టైన్ కొనసాగిస్తున్నది: “మిత్రులతో ఆయన సంబంధం పూర్తిగా విభిన్నంగా ఉండేది. వారి తప్పుల, సిద్ధాంతాల, సంకుచిత వైఖరుల గురించి సామాన్యంగా ఆయన కలత చెందేవారు కారు. వాటిని గురించి ఒక్క మాట చెప్పినా కూడా అదెక్కడ వారి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడమవుతుందో నని ఆయన భావించినట్లు ద్యోతకమయ్యేది.
శిష్యులు
“కాని ఆయనను గురువుగా స్వీకరించిన వారి పట్ల ఆయన మెలగే తీరు భిన్నంగా ఉండేది. వారి జీవితాలకు తాము బాధ్యులమని గ్రహించే రీతిలో ఆయన మసలుకొనేవారు. వారి తప్పులను, బలహీనతలను ఆయన సరిదిద్దారు, అవసరమైతే గర్హించారు. వారి జీవితం రూపుదిద్దు కోవడానికి ఏవి అవసరమో వాటిని సంకోచించకుండా చేశారు.” వారిలో కొందరికి మంత్రదీక్ష ప్రసాదించారు, కొందరికి మరో రకమైన దీక్షలు అను గ్రహించారు, మరికొందరిలో తమ వీక్షణతోనే ఆధ్యాత్మిక జాగృతి జనింప జేశారు.
ఈ విధంగా ఆయన శిష్యులుగా స్వీకరించిన పాశ్చాత్యులు అతి కొద్దిమంది గురించి మాత్రమే మనకు తెలుసు. సహస్రద్వీప వనంలో ఆయన లాన్స్బర్గ్, మేరీ లూయీలకు సన్న్యాస దీక్ష ప్రసాదించి వారికి కృపానంద, అభయానంద అనే పేర్లు ఇచ్చారు. క్రిస్టైన్కు బ్రహ్మచర్య దీక్ష నిచ్చారు. సహస్రద్వీప వనంలో బస చేసిన తక్కినవారూ స్వామీజీ ‘శిష్యులు’ అనే పేర్కొనబడుతున్నారు. 1896 ఫిబ్రవరిలో ఆయన డాక్టర్ స్ట్రీట్ అనే వ్యక్తికి సన్న్యాస దీక్ష ఒసగారు. ఆ తదుపరి వారంలో పలువురు యువకులూ, స్త్రీలూ ఆయన నుంచి మంత్రదీక్ష పుచ్చు కొన్నారు. అదే నెలలో ఆయన గుడ్విన్కూ బ్రహ్మచర్య దీక్ష ఇచ్చారు. సేవియర్ దంపతులు ఆయన శిష్యులే. నివేదిత ఆయన పాశ్చాత్య శిష్యులలో అగ్రగణ్యు రాలైనప్పటికీ ఆమె భారతదేశంలోనే దీక్షలు స్వీకరించింది. వీరిలా మరో ఒకరిద్దరు బాహ్య ప్రపంచానికి తెలిసి ఉంటారు.
అందరూ బ్రాహ్మణులే!
“జగజ్జనని నన్ను ఈ అద్భుత ప్రపంచంలోకి తెచ్చి పడవేసింది. వీరూ నన్ను అర్థం చేసుకోలేదు, నేనూ వీరిని అర్థం చేసుకోలేదు. కాని చాలా రోజులు ఇక్కడ నివసించిన తరువాత ఒక విషయం నాకు తెలుస్తోంది: పాశ్చాత్యంలోనూ నేను కలుసుకొన్న కొందరు నా సొంత మనుషులు, నా కార్యకలాపాలలో నాకు సహాయం చేయ డానికే అక్కడ ఉన్నారు” అని ఒకసారి స్వామీజీ తమతో మెలగిన పాశ్చాత్యుల గురించి చెప్పారు.
వీరిలో నిజంగా స్వామీజీ ‘శిష్యులు’ ఎందరు?
ఒకసారి కలకత్తాలో ఆయన శిష్యుడైన ప్రియనాథ్, “స్వామీజీ! మీకు పాశ్చాత్యంలో ఎందరు శిష్యులు? రెండు మూడు వేలమంది ఉంటారా?” అని స్వామీజీని అడిగాడు.
స్వామీజీ : బహుశా అంతకన్నా ఎక్కువే ఉండవచ్చు.
ప్రియనాథ్ : వారందరికీ మీరు మంత్రదీక్ష ఇచ్చారా?
స్వామీజీ : అవును.
ప్రియనాథ్ : ప్రణవ మంత్రం జపించడానికి వారికి అనుమతి ఇచ్చారా?
స్వామీజీ : అవును.
ప్రియనాథ్ : అదెలా స్వామీజీ? ప్రణవ మంత్రం జపించడానికి శూద్రులకు హక్కు లేదు, బ్రాహ్మణులు తప్ప మరెవరికీ ఆ హక్కు లేదని చెబుతున్నారే! పాశ్చాత్యులు శూద్రులు కూడా కారు, వారు మ్లేచ్ఛులు.
స్వామీజీ : నా శిష్యులందరూ బ్రాహ్మణులే!
జగద్గురువు
నియమాలు పాటించి ఆయన దీక్ష ఒసగినవారిని శిష్యులుగా పరిగణిస్తే 100 మంది పేర్లు కూడా మనకు తెలియరాదు. కాని స్వామీజీ తమ శిష్యులు మూడు వేలమంది పైబడే అని చెప్పారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? దీక్ష అంటే కేవలం ఒక మంత్రం చెప్పి ఇవ్వడం మాత్రమే కాదు; శిష్యునిలో ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేయడమే నిజమైన దీక్ష. స్వామీజీ జీవితంలో ఎంతో పాలుపంచుకొని ఆయనకు అనేక సహాయాలందించిన కొందరు ఉన్నారు. వారికి ఆయన విధివిహితంగా ఎలాంటి దీక్షనూ ఒసగినట్లు తెలియరావడం లేదు. ఉదాహరణకు ప్రొఫెసర్ రైట్, హేల్ సోదరీమణులు, మిసెస్ బాగ్లీ, కర్న్సీ దంపతులు, లెగ్గట్ దంపతులు, డాక్టర్ లూయీ జి. జేమ్స్, మీడ్ సోదరీమణులు. వీరందరినీ ఆయన అనుగ్రహించలేదా? వారిని ఆయన తమ సొంతంగా స్వీకరించలేదా? స్వీకరించారనే ఇందుకు జవాబు.
దీనిని గురించి ఒకసారి స్వామీజీ, “సాధారణ గురువులు ఆధ్యాత్మిక శక్తిని మంత్రం ద్వారా ఒసగుతారు. కాని జగద్గురువులు మంత్రాన్ని ఉపయోగించరు” అన్నారు.
దీనిని విశదీకరిస్తున్నది మేరీ లూయీ బర్గ్ : “నియమనిష్ఠలు లేని ఒక వ్యక్తిలో తమ ఆధ్యాత్మిక శక్తిని స్వామీజీ ప్రసరింపజేయలేరా? ఆయన తమ ఆశీస్సులు ఒసగారు. బహుశా, కొన్ని ఉపదేశాలు చేసివుంటారు. కాని తమ వద్దకు వచ్చిన వారి భారాలన్నీ ఆయన స్వీకరించారు. వారి నుంచి ఆయన ఏదీ ఆశించ లేదు. వారు తమ పట్ల వినమ్రంగా ఉండాలి, తమ బోధనలు స్వీకరించాలని కూడా ఆయన ఎదురు చూడలేదు. అందించేది మాత్రం అందించి ఆయన తన ధోరణిలో తాను వెళ్లిపోయారు. బహుశా ఆయన ఒక మంత్రాన్ని కూడా ఒసగి ఉండరు. ఒకరిని గురించి తాము తెలుసుకోవలసింది ఒక చూపులోనే గ్రహించ గల సమర్థులు ఆయన. ఒక చూపు, ఒక స్పర్శ – వీటిలోనే ఆయన ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేశారు. ఆ శక్తి వారిలో అద్భుతాలు జనింపజేసింది; ముక్తి మార్గంలో వారిని తోడ్కొని వెళ్లింది.”
మంత్రదీక్ష ఒసగి కొందరిని స్వీకరించారు, ఒసగకుండా సైతం అనేకులను స్వీకరించారు. ఆయన శిష్యులు ఎన్ని వేలమందో ఆయనకే ఎరుక. వారిలో కొందరిని, ప్రత్యేకించి కాలాంతరంలోనూ ఆయన కార్యకలాపాలలో పాలుపంచు కొన్న కొందరిని గురించి చూద్దాం.*
సన్నిహిత బంధువు
జోసయా జాన్ గుడ్విన్
ఈయన గురించి అనేక చోట్ల చూశాం. స్వామీజీ ప్రసంగాలు వ్రాయడం వలన ‘స్వామీజీ గణపతి’* అని ఈయనను ప్రేమానంద స్వామి పేర్కొంటున్నారు. హఠాత్తుగా ఆకాశంలో మెరసి మాయమయ్యే ఉల్కలా స్వామీజీ జీవితంలో హఠాత్తుగా ప్రవేశించి నిష్కమించాడు ఈయన. 1895 డిసెంబర్లో స్వామీజీ ప్రసంగాలను సంక్షిప్త లేఖనంలో వ్రాసే వ్యక్తి కావాలనే ప్రకటన చేశారు. ఆ ప్రకటన ద్వారా స్వామీజీ జీవితంలో గుడ్విన్ ప్రవేశించాడు.
1896 ఫిబ్రవరిలో గుడ్విన్కు స్వామీజీ బ్రహ్మచర్య దీక్ష ఒసగారు. ఆతడి జీవితం స్వామీజీ జీవితాన్ని అనుసరించే రీతిలో భాసించింది. స్వామీజీ ఎక్కువగా శ్రమించినప్పుడు గుడ్విన్ కూడా ఎక్కువగా శ్రమించవలసి వచ్చింది. ప్రసంగాలను సంక్షిప్త లేఖనంలో వ్రాసుకోవడానికి ఆతడు ఏడు నోటు పుస్తకాలను ఉపయో గించాడు.
దేశభక్తి
స్వామీజీ శిష్యునిగా, సేవకునిగా విరాజిల్లిన గుడ్విన్లో దేశభక్తి పొంగి పొరలింది. ఆంగ్లేయులనో, ఆంగ్ల ప్రభుత్వాన్నో స్వామీజీ విమర్శించడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. ఒక రోజు ఇంగ్లడ్ చక్రవర్తియైన ఏడవ ఎడ్వర్డ్ గుర్రం ఒక పందెంలో గెలవడం గురించిన ప్రస్తావన వచ్చింది. గుడ్విన్ దానిని గురించి గొప్పగా స్వామీజీ సోదరుడైన మహేంద్రునితో మాట్లాడుతున్నాడు. స్వామీజీ అటూ ఇటూ పచార్లు చేస్తూ గుర్రాన్ని గుడ్విన్ ప్రశంసిస్తున్నప్పుడల్లా ముఖాన్ని వికృతంగా పెట్టి ఎగతాళి చేస్తూవున్నారు. స్వామీజీ వైఖరి గ్రహించిన గుడ్విన్ లేచి స్వామీజీ ముందు మోకరిల్లి, చేతులు జోడించి, “స్వామీజీ! మీరు ఏవేం విమర్శించాలో, ఎగతాళి చేయాలో అంతా ఈ పేద గుడ్విన్ మీద చూపండి. గుడ్విన్ మీ శిష్యుడు, మీ సేవకుడు. కాని దయచేసి రాజకుటుంబాన్ని గురించి ఏదీ వ్యాఖ్యానించకండి. దానిని ఈ దేశంలో ఎవరూ భరించలేరు. దయవుంచి నన్ను కరుణించండి” అన్నాడు వినమ్రంగా. గుడ్విన్ రాజభక్తి అందరినీ స్తంభింపజేసింది.
మరొక సంఘటనలో కూడా గుడ్విన్ రాజ విశ్వాసాన్ని చూడవచ్చు. ఇంగ్లండ్‌కూ చీనాకూ మధ్య జరిగిన యుద్ధం గురించిన ప్రస్తావన ఒక రోజు వచ్చింది. “ఆంగ్లేయుల వీరత్వంతోనే బ్రిటిషు ప్రభుత్వం స్థాపితమయింది; కనుక దానిని వారు సంరక్షిస్తారు” అన్నాడు గుడ్విన్. స్వామీజీకి ఇది నచ్చలేదు. ఎందు కంటే నిజమైన చరిత్ర అది కాదు కనుక. నిజంగా జరిగింది స్వామీజీ చెప్ప నారంభించారు: “చైనా యుద్ధంలో కాని, లేదా మరే ఇతర యుద్ధంలో కాని, ఆంగ్లేయులు గొప్పగా ఏం చేశారు? మా భారతీయ వీరులే సర్వత్రా వెళ్లి యుద్ధం చేశారు, గెలిచారు, బ్రిటిషు ప్రభుత్వం రూపొందించడానికి రక్తం చిందించారు, ఆంగ్లేయులకు విజయం సాధించిపెట్టారు. భారతీయ రక్తంతోనూ, భారతీయ సంపత్తితోనూ ఈ బ్రిటిషు సామ్రాజ్యం రూపొందింది. మీ ఆంగ్లేయులు ఏం చేశారు? భారతీయులు సంపాదించారు, మీరు అనుభవిస్తున్నారు.”
“లేదు స్వామీజీ! ఎలా యుద్ధం చేయాలో మీ వారికి తెలియదు” అన్నాడు గుడ్విన్. అంతే, స్వామీజీ అదేపనిగా కుంభవృష్టి కురిపించారు: “మా భారతీయు లకా యుద్ధం చేయడం తెలియదు? గ్రీసు దేశస్థుడైన అలెగ్జాండర్ పర్షియాను జయించి, అహంకారంతో భారతదేశం మీద దండెత్తి వచ్చినప్పుడు ఆతణ్ణి ప్రతిఘటించింది ఎవరు? పోరస్ అనే హైందవ రాజే కదా! అర్బేలా యుద్ధంలో పారసీక చక్రవర్తి డారియస్ కొడోమనసూక్కు సహాయం చేసింది భారతీయ సైన్యం! ఆ కారణంగానే అలెగ్జాండర్ భారతీయులతో యుద్ధం చేయాలని నిశ్చయించాడు. నువ్వేమో భారతీయులకు యుద్ధం చేయడం తెలియదు అంటున్నావు! కాని ఒక విషయం; ఆంగ్లేయుల నమ్మకద్రోహమూ, కృతఘ్నతా భారతీయులకు తెలియదు! వీరత్వం నింపుకొన్న వారు భారతీయులు. ఘనత వహించినది, గొప్పదీ అంటూ మీరు గర్వించే మీ జాతి భారతదేశాన్ని వంచన ద్వారానే కైవసం చేసుకొన్నది! భారతదేశాన్ని అణగద్రొక్కి పొందిన భారతీయ సంపదతోనే మీ జాతి వృద్ధి పొందింది. భారతీయులు తమ స్తబ్ధతను విదలించుకొని, నిద్ర నుంచి మేల్కొన్న ప్పుడు మిమ్మల్ని ఒక నిమ్మపండులా పిండివేస్తారు.”
గుడ్విన్ వదల్లేదు. “మీరు ఉన్నతమైనవారే. సందేహం లేదు. కాని మీ ప్రజలు తమను పరిపాలించుకోలేని వారు. భారతదేశాన్ని పరిపాలించడానికి ఉత్కృష్టులు మా ఆంగ్లేయులే” అన్నాడు. స్వామీజీ మరింత కోపోద్రిక్తులై ఇలా కొనసాగించారు:
“చంద్రగుప్తుని కాలంలో భారతదేశానికి వచ్చిన మెగస్తనీస్ నాడు నెలకొన్న ఉత్కృష్టమైన పంచాయతీ పాలన విధానం గురించి వ్రాశాడు. నాడు దొంగతనం లేదు, ప్రజలు సత్యాన్ని గౌరవించారు. నేటికీ ఆంగ్లేయ ఆధిపత్యం ప్రవేశించక జాతీయ పాలన జరుగుతున్న ప్రాంతాలలో జనం సంతోషంగా జీవిస్తున్నారు; సమస్యలూ తక్కువే. తమ స్వదేశాన్ని సుసంపన్నం చేసుకోవడం ఒక్కటే లక్ష్యంగా ఉంచుకొని ఆంగ్లేయులు వ్యవహరిస్తున్నారు. ఇందులో మీ పాలన గొప్పదనాన్ని చెప్పుకొంటున్నావు!”
స్వామీజీ, గుడ్విన్ల ఈ సంభాషణ గురించి మహేంద్రుడు ఇలా వ్రాస్తు న్నాడు: “భారతదేశ చరిత్రనో, బ్రిటిష్ చరిత్రనో క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వ్యక్తి కాడు గుడ్విన్. వార్తాపత్రికల విషయ జ్ఞానంతోనే సరి. కనుక స్వామీజీ నిజమైన చరిత్రను తెలిపినప్పుడు ఆతడు విస్తుబోయాడు. స్వామీజీని ప్రతిఘటించి అతడు అనేక విషయాలు చెప్పినప్పటికీ రోజురోజుకూ స్వామీజీ పట్ల ఆతడికి ఉన్న నమ్మకం అధికమయింది.”
బాలుని లాంటి స్వామీజీ!
కొన్ని సమయాలలో తమ ప్రసంగాల గురించి గుడ్విన్ ముచ్చటించినప్పుడు స్వామీజీ బాలునిలా సంతోషించేవారు. ఒక రోజు గుడ్విన్, “డెట్రాయిట్‌లోనే శ్రోతలు అధికంగా వచ్చారు! దాదాపు 6000 మంది వచ్చారు! నాటి మీ ప్రసంగం అద్భుతం! మానవాతీతమైన ఏదో ఒక శక్తి నుంచి మాటలు వెలువడినట్లు అనిపించింది. ఆనందంతో నాకు పిచ్చిపట్టేట్లయింది” అన్నాడు. గుడ్విన్ ఆనందం చూసి స్వామీజీ కూడా సంతోషించారు.
కొన్ని సమయాలలో స్వామీజీ అత్యున్నత భావభూముల నుంచి ప్రసం గించడం కద్దు. ఇందువలన ప్రసంగం ముగిసిన తరువాత, ప్రసంగంలో తాము ఏం మాట్లాడిందీ, శ్రోతలు దానిని ఎలా స్వీకరించిందీ ఆయనకు తెసిసేది కాదు. ఈ సందర్భాలలో గుడ్విన్, “స్వామీజీ! ఈ రోజు మీరు అద్భుతంగా ప్రసం గించారు” అని చెప్పేవాడు. స్వామీజీ కూడా బాలునిలా, “ఓ, అలాగా! నేను ఏం ప్రసంగించాను? ఏం ప్రసంగించాను?” అని ప్రశ్నించేవారు. గుడ్విన్ ఆనాటి ప్రసంగాన్ని క్లుప్తంగా చెప్పేవాడు. స్వామీజీ చాలా సంతోషపడేవారు; “వీటి నన్నింటినీ వ్రాసి ఉంచుకో. నా కెంతో నచ్చింది” అనేవారు.
స్వామీజీ పాశ్చాత్య దేశాల నుంచి భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు గుడ్విన్ కూడా వచ్చాడు. తరువాత బ్రహ్మవాదిన్ పనుల కోసం 1897 జూలైలో చెన్నైకు వచ్చాడు. 1898 మార్చ్‌లో, బహుశా వేసవి తాపం నుంచి తప్పించు కోవడానికి, అతడు ఊటీ వెళ్లాడు. ఒక రోజు వానను కూడా పట్టించుకోకుండా బాగా తడుస్తూ అతడికి మహా ఇష్టమైన క్రికెట్ ఆటను చూశాడు. దాని పర్య వసానంగా వచ్చిన జ్వరం చివరికి ఆతడి ప్రాణాన్ని హరించివేసింది. అప్పుడు గుడ్విన్ వయస్సు 28 ఏళ్లు మాత్రమే.
హేల్ కుటుంబం
హేల్ కుటుంబం, ప్రత్యేకించి నలుగురు సోదరీమణులు స్వామీజీకి అమెరికాలో లభించిన ఒక పెన్నిధి అని పేర్కొనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. “మీ నలుగురు సోదరీమణులకూ నేను శాశ్వతంగా ఋణపడి ఉన్నాను. అమెరికాలో నాకు లభించినవన్నీ మీ మూలంగానే దక్కాయి” అని స్వయంగా స్వామీజీ వ్రాసే మేరకు వారు ఆయన జీవితంలో చోటుచేసుకొన్నారు.
హేల్ కుటుంబ యజమాని జార్జ్ హేల్. స్వామీజీని కలుసుకొన్నప్పుడు ఆయన 64 ఏళ్ల వయస్కుడు. ఒక ఉక్కు కంపెనీలో ఆయన వాటాదారునిగా ఉన్నాడు. ఆయనను స్వామీజీ, “ఫాదర్ పోప్” అని సంబోధించేవారు. స్వామీజీ పనులలో ఇతర కుటుంబ సభ్యులతో బాటు ఈయన కూడా పాలుపంచుకొన్నాడు.
తరువాతి వ్యక్తి కుటుంబ యజమానురాలైన మిసెస్ ఎలన్ హేల్. అప్పుడా మెకు 56 ఏళ్లు. సామాజికపరంగా ఉన్నత స్థాయి స్త్రీలలో ఒకరైన ఈమెకు అనేక సేవా సంస్థలతో సంబంధం ఉంది. క్రైస్తవ ప్రెస్బటేరియన్ మతశాఖతోనూ, క్రైస్తవ విజ్ఞాన శాఖతోనూ ఆమెకు సన్నిహిత సంబంధం ఉంది. సహనానికి ఆమె ఒక ఉదాహరణగా విరాజిల్లింది. స్వామీజీ అమెరికా కార్యకలాపాలకు తొలినాళ్లలో ఒక కేంద్రంగా హేల్ కుటుంబం వెలసింది. అందునా మిసెస్ హేల్ ఒక తల్లిగా స్వామీజీ అవసరాలనన్నింటినీ చూసుకొంది. స్వామీజీ ఈమెను ‘మదర్ చర్చ్’ అని సంబోధించేవారు.
తరువాతి వారు హేల్ సోదరీమణులు – మేరీ హేల్, హారియెట్ హేల్, హారియెట్ మెకండ్లీ, ఇసబెల్ మెకండ్లీ. స్వామీజీని కలుసుకొన్నప్పుడు మేరీకి 28 ఏళ్లు, హారియెట్కు 23 ఏళ్లు. సంపన్నులైన స్త్రీలు జీతం పుచ్చుకొని ఉద్యోగం చేసే కాలం కాదది. కనుక ఇద్దరూ ఉద్యోగం చేయలేదు. ఇద్దరూ చక్కగా పియానో వాయిస్తారు; “పియానో సోదరీమణులు” అని పేరు పొందారు. ఇద్దరి వైవాహిక జీవితమూ సాఫల్యం పొందలేదనే చెప్పుకోవాలి. స్వామీజీ కాలంలోనే హారియెట్ వివాహం చేసుకొన్నది; కాని వైవాహిక జీవితం కొనసాగలేదు. స్వామీజీ మరణానంతరం 1902 లో 72 ఏళ్ల ఇటలీ దేశస్థుడైన ఒక సుసంపన్నుణ్ణి మేరీ వివాహం చేసుకొన్నది. 95 ఏళ్ల వయస్సులో మరణించే దాకా భర్తను ఆమె చూసుకొన్నది. సోదరీమణు లిద్దరూ స్వామీజీని అన్నగారిగా పరిగణించారు. ఆయన ఆధ్యాత్మిక ఔన్నత్యం, ఆయన సందేశం గురించి వారు అంతగా కలత చెందినట్లు తెలియడం లేదు. స్వామీజీ కూడా సోదర భావంతోనే వారితో మెలగారు.
హారియెట్ మెకండ్లీ, ఇసబెల్ మెకండ్లీలు హేల్ కుటుంబంతోనే జీవించారు. జార్జ్ హేల్ సోదరి కుమార్తెలు వీరు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయారు. వాటాల మార్కెట్ పతనంతో డబ్బు కోల్పోయిన తండ్రి మరణానంతరం వీరు హేల్ కుటుంబంలో కలిసిపోయారు. వీరికంటూ విడిగా డబ్బు లేకపోవడంతో ఉద్యోగం చేసి సంపాదించుకొనే స్థితిలో ఉన్నారు. అందుకోసం ఒక శిశుపాఠశాలను నిర్వహిస్తూ వచ్చారు. స్వామీజీని కలుసుకొన్నప్పుడు హారియెట్ 32 ఏళ్లు వయస్కురాలు, ఇసబెల్ ఇంకా చిన్నది. వీరిద్దరూ అవివాహితలు.
హేల్ కుటుంబ సభ్యులలో మరొకరు హేల్ కుమారుడైన సామ్. స్వామీజీ ఆతణ్ణి “బ్రదర్ సామ్” అని పేర్కొనేవారు. ఇతడు మేరీ హేల్ కన్నా నాలుగేళ్లు చిన్నవాడు. జార్జ్ హేల్ మరొక సోదరి మిసెస్ జేమ్స్ మ్యాథ్యూస్. ఈమెను స్వామీజీ “మదర్ టెంపుల్” అని సంబోధించేవారు.
వీరందరూ స్వామీజీతో బాగా సన్నిహితంగా ఉండేవారు. కాని ఎవరూ స్వామీజీని గురువుగా పరిగణించలేదు. వారిలో స్వామీజీకి అత్యంత సన్నిహితంగా మెలగిన మేరీ హేల్, స్వామీజీ తక్కిన వారు గురువుగా కొనియాడడాన్ని అంగీ కరించలేదు. ఈ విషయంగా ఆమెకూ నివేదితకూ మధ్య అభిప్రాయభేదం చోటు చేసుకోవడం గురించి ఇంతకు క్రితమే చూశాం.
హేల్ కుటుంబానికి చెందినంత వరకు, వారు స్వామీజీకి సహాయకులుగా ఉండడంలో తృప్తి చెందారు. ఆయన పట్ల వారు ఎలాంటి ప్రత్యేక హక్కునూ చలాయించలేదు. ప్రసంగాలతో, ప్రయాణాలతో డస్సిపోయి వచ్చిన స్వామీజీకి అవసరమైన విశ్రాంతికి ఏర్పాట్లు వారు చేసేవారు.
అక్కడ బస చేసి ఉన్నప్పుడు రోలర్ స్కేట్ (చక్రాలున్న చెప్పుల వంటివి) ధరించి దూసుకుపోవడం స్వామీజీ నేర్చుకొన్నారు. ధ్వని గ్రాహక యంత్రం (Phonograph) అప్పుడే కనుగొనబడింది. హేల్ వద్ద అది ఉంది. దానిలో అనేకసార్లు తమ కంఠస్వరం నమోదు చేసుకొని స్వామీజీ ఆనందించారు. ఆయన హేల్ సోదరీమణులతో దుకాణాలకు వెళ్లారు, నాటకాలు తిలకించడానికి వెళ్లారు. ‘చార్లీ అత్త’ అనే నాటకం తిలకించి, “నవ్వి నవ్వి నా ప్రాణం పోతుందేమో ననిపించింది” అంటూ ఆయన వ్రాస్తున్నారు.
“స్వామీజీ అవసరాలను చూసుకొని ఆయనను హేల్ కుటుంబం సంరక్షించకపోతే బహుశా ఆయన నేడు మనతో ఉండివుండరేమో” అని మెక్లౌడ్ చెప్పడం కద్దు.
హేల్ కుటుంబంలో మేరీ హేల్ మాత్రమే చివరిదాకా స్వామీజీ శిష్యులతో సంబంధం ఉంచుకొన్నది; నివేదిత, మెక్లౌడ్లతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపింది. అంతిమ కాలంలో రూ. 48, 500/– బేలూర్ మఠం పేరిట వ్రాసి ఆమె మరణించింది.
మిస్ జోసఫైన్ మెక్లౌడ్
స్వామీజీ జీవితంలో ఆయన మిత్రురాలిగా శాశ్వతమైన స్థానం పొందిన వ్యక్తి మిస్ మెక్లౌడ్. స్వామీజీ కన్నా ఈమె ఐదేళ్లు పెద్దది. స్వామీజీని కలుసుకోవ డానికి మునుపే ఈమెకు హైందవ భావనలతో పరిచయం ఉంది; ఆమె భగవద్గీతను చదివింది. కాని స్వామీజీని కలుసుకొన్న రోజు నుండి మాత్రమే ఈమె తన వయస్సు లెక్కించేది. అంటే స్వామీజీని కలుసుకొన్న రోజు తన నిజమైన జన్మదినమని ఆమె చెప్పడం కద్దు. స్వామీజీ కూడా ఈమెను తమ మిత్రురాలిగానే ప్రస్తావించారు.
“స్వామీజీలో నన్ను ఆకర్షించింది ఏమిటో తెలుసా? అది ఆయన అపరిమిత ప్రవృత్తి. ఆయన అనంత స్వరూపిగా భాసిల్లారు. పైన, క్రింద, ఏ వైపునైనా కూడా నేను ఆయనను సమీపించలేకపోయాను. అంతటి అనంతమైన ప్రవృత్తి ఆయన సంతరించుకొన్నారు…. నాకు ముక్తి ప్రసాదించడానికే స్వామీజీ అవతరించారు” అంటూ దృఢ నమ్మకంతో ఆమె చెప్పడం కద్దు.
స్వామీజీ జీవిత కాలంలో మాత్రమే కాక, కాలాంతరంలోనూ బేలూర్ మఠ పనులకు మెక్లౌడ్ ఆలంబనగా ఉంటూ వచ్చింది. గొప్ప ధనవంతురాలైనప్పటికీ అద్దె కార్లలో ప్రయాణం చేయకుండా ప్రభుత్వ బస్సులలో ఆమె పయనించేది. “ఎందుకో తెలుసా? ఈ రకంగా డబ్బు పొదుపు చేస్తే స్వామీజీ పనులకు సహాయం చేయవచ్చు కదా!” అనేది ఆమె.
గ్రీకు రచయితయైన నికోస్, మెక్లౌడ్కు పరిచయస్థుడు. మెక్లౌడ్ అందించిన 1500 డాలర్లతో ప్రచురించిన పుస్తకం మూలంగా నికోస్ను 20 వ శతాబ్దపు అగ్రగణ్య రచయితలలో ఒకరిగా లోకం గుర్తించింది. ఒక రోజు మెక్లౌడ్ నికోస్ను ఇలా అడిగింది:
మెక్లౌడ్ : మీరు ప్రార్థన చేస్తారా? అమిత ఆనందంలో తేలియాడుతు న్నప్పుడో, విపరీతమైన దుఃఖంలో మునిగి ఉన్నప్పుడో మీరు ప్రార్థన చేశారా?
నికోస్ : లేదు. నేను ప్రార్థించను.
మెక్లౌడ్ : మరేం చేస్తారు?
నికోస్ : వ్రాస్తాను. రచనా వ్యాపకం నాకు ఎంతో విశ్రాంతినీ, ప్రశాంత తనూ చేకూరుస్తుంది.
మెక్లౌడ్ : నేనూ ప్రార్థించను. కష్టాలు మనస్సును పీడించినప్పుడు పచార్లు చేయడానికి బయటికి వెళతాను – మామూలు చోట్లకు కాదు, రద్దీ ఉన్న నగరా నికి! అక్కడ ఆదరాబాదరాగా వెళుతూన్న ప్రజల ముఖాలను చూసి, జీవితార్థాన్ని వెతకడానికి ప్రయత్నిస్తాను. లేకపోతే, నాకు తోచిన మంచిపని చేస్తాను. లేకుంటే స్వామీజీ వ్రాసిన ఆ అద్భుతమైన లేఖ చదువుతాను!* నా మానసిక బాధ ఏది అయినప్పటికీ తొలగిపోతుంది.
మెక్లౌడ్కూ ఆమె స్నేహితురాలైన డోరాకూ స్వామీజీ ప్రణవమంత్ర దీక్ష ఇచ్చారు. “ఎలా ధ్యానం చేయాలి?” అని వారు స్వామీజీని అడిగినప్పుడు, “ఓమ్ అనే మంత్రాన్ని ఒక వారం ధ్యానించండి. తరువాత నా వద్దకు రండి” అన్నారాయన. ఒక వారం గడిచాక వారు తిరిగి వచ్చారు. “నేను ఒక జ్యోతి చూస్తున్నాను” అంది డోరా. “మంచిది. కొనసాగించండి” అన్నారు స్వామీజీ. “హృదయంలో ప్రకాశాన్ని చూస్తున్నాను” అంది మెక్లౌడ్. ఆమెతో కూడా, “మంచిది. కొనసాగించండి” అన్నారు స్వామీజీ. “ఆయన నాకు చేసిన ఉపదేశం ఇంతే” అంది కాలాంతరంలో మెక్లౌడ్.
మిసెస్ సారా బుల్
ఒక రోజు చర్చా కార్యక్రమం జరుగుతోంది. దానిలో ఒకరు, “పునీతుడు (Saint) అంటే ఎవరు?” అని అడిగారు. జవాబుకై అందరూ స్వామీజీ ముఖం వైపు చూశారు. ఆయన ఏం చెప్పబోతున్నారో వినాలనే కుతూహలంతో అందరూ కూర్చున్నారు. అక్కడ మౌనం రాజ్యమేలింది. దానిని భంగపరుస్తూ స్వామీజీ ఇలా చెప్పారు: “మిసెస్ సారా బుల్.” ఈ విధంగా స్వామీజీచే పునీతురాలిగా పరిగణింపబడిన వ్యక్తి మిసెస్ సారా. ఆ తరువాత ఆమె “పునీతురాలు సారా” అంటూ పేర్కొనబడింది. స్వామీజీ ఆమెను “ధీర మాతా” అంటూ కూడా సంబోధించేవారు.
స్వామీజీని కలుసుకోవడానికి మునుపే భారతీయ తత్త్వాలతో సారాకు పరిచయం ఉంది. మోహినీ మోహన్ ఛటర్జీ అనే వ్యక్తి నుంచి భగవద్గీతను ఆమె సముచితంగా నేర్చుకొంది. స్వామీజీని కలుసుకొన్నప్పుడు సారా వయస్సు నలభై దాటివుంటుంది. స్వామీజీ ఆమెను తల్లిగా పరిగణించారు. సారా కూడా స్వామీజీని కుమారునిగా భావించింది. డబ్బు సాయం, సంస్థాగతమైన సహాయం అంటూ అన్ని రకాలుగా స్వామీజీకి సహాయకారిగా సారా నిలబడింది. స్వామీజీని కుమారుని రీతిలో అవసరమైనప్పుడు చీవాట్లు పెట్టడానికి కూడా ఆమె సంశయించలేదు. స్వామీజీకీ, బేలూర్ మఠానికీ మాత్రమే కాదు; అభయానంద, కృపానంద, గుడ్విన్, నివేదిత ప్రభృతులకు అనేక సమయాల్లో ఆమె ధన సహాయం చేసింది.
సోదరి క్రిస్టైన్
స్వామీజీ కన్నా ఈమె మూడేళ్లు చిన్నది. జర్మనీ దేశస్థురాలైన ఈమె చిన్నతనం నుండే తలిదండ్రులతో అమెరికాలోనే పెరిగింది. ఈమె 17 వ ఏట తండ్రి మరణించాడు. అప్పటి నుంచి తల్లి, ఐదుగురు చెల్లెళ్ల బాధ్యత ఈమె మీద పడింది. పేదరికంలోనే జీవించిన ఈమెకు క్రైస్తవ విజ్ఞానం పట్ల ఎంతో ఆసక్తి ఉంది. అయినప్పటికీ దాన్లో తృప్తి కలుగక ఉన్నత విషయానికై అభిలషించి హృదయం తపించిపోయినప్పుడే స్వామీజీని కలుసుకొనే అదృష్టం ఈమెను వరించింది. మేరీ ఫంకేతో స్వామీజీ ప్రసంగాలు వినడానికి వెళ్లింది. “ఐదు నిమిషాలు మాత్రమే విని ఉంటాం. జీవితమంతా అన్వేషిస్తున్న పరుసవేదిని తాకినట్లుగా మాకు అనిపించింది” అంటూ వ్రాస్తున్నది క్రిస్టైన్.
సహస్రద్వీప వనంలో స్వామీజీతో సహజీవనం చేసిన భాగ్యశాలి ఈమె. అక్కడ కొందరికి మంత్రదీక్ష ఒసగాలని స్వామీజీ అప్పటికే నిశ్చయించుకొన్నారు. దానికి ముందు రోజు క్రిస్టైన్తో, “నీకూ దీక్ష ఇవ్వాలనుకొంటున్నాను. కాని నిన్ను గురించి నాకు అంతగా తెలియదు. కనుక దీక్షకు నువ్వు తయారుగా ఉన్నావా లేదా అని అర్థం కావడం లేదు” అన్నారు. పిదప కాస్త సంకోచంతో, “ఇతరుల మనస్సులను చదవగలిగే శక్తి నాలో ఉంది. దానిని ఎంతో అరుదుగా ఉపయోగి స్తాను. నీకూ దీక్ష ఇవ్వాలనుకోవడం వలన, నువ్వు అనుమతిస్తే నీ మనస్సును చదువగోరుతున్నాను” అన్నారు. అందుకు క్రిస్టైన్, “నిరభ్యంతరంగా చదవండి” అన్నది. “పూర్తిగా చదువవచ్చునా?” అని స్వామీజీ అడిగారు. “చదువవచ్చు” అంది దృఢ నిశ్చయంతో క్రిస్టైన్. “ధైర్యశాలివి నువ్వు” అని ప్రశంసించిన స్వామీజీ ఆమె మనస్సును చదివారు. తరువాత ఆమెతో, “నీకు ఇంకా మూడు తెరలు మాత్రమే ఉన్నాయి. ఈ జన్మలోనే నీ మూడవ నేత్రం తెరచుకొంటుంది” అన్నారు. మర్నాడు ఆమెకు దీక్ష ఒసగారు. తరువాత ఈమెకు బ్రహ్మచర్యం కూడా ప్రసాదించారు.
కాని స్వామీజీ చెప్పిన దాన్లోని అర్థం ఏమిటో క్రిస్టైన్ అడగలేదు. కాలాంతరంలో దీనిని గురించి ఇలా చెప్పింది: “నేను ఒక మూర్ఖురాలిని. ఆయనను ఏ ప్రశ్నా అడగలేదు. అందరూ ప్రశ్నలు అడిగారు, ఆయన నుంచి ఏదైనా పొందాలని ప్రయత్నించారు. ఆయన మా కోసం ఎంతో శ్రమిస్తున్నారనే విచారమే నాలో ఉంది. కాని ఆయన జ్యోతిర్మయమైన సన్నిధానంలో నాలోని సందేహాలన్నీ అదృశ్య మయ్యాయి.”
భారతీయ స్త్రీల కోసం చేయబోయే పని గురించి సహస్రద్వీప వన రోజుల్లో స్వామీజీ క్రిస్టెన్‌తో చర్చించారు. దాని ప్రకారం భారతదేశానికి వచ్చిన క్రిస్టైన్, నివేదితతో కలసి ఆ పనిలో పాలుపంచుకొంది. ఇద్దరూ నివసించిన ఇల్లు ‘సోదరీ మణుల గృహం’ గా పేర్కొనబడింది. గోపాలకృష్ణ గోఖలే, రవీంద్రనాథ్ టాగూర్, సర్ జగదీశ్ చంద్రబోస్, సరోజినీ నాయుడు లాంటి వారికి ఆ గృహం ఒక పుణ్యతీర్థంగా విరాజిల్లింది.
మృదులమైన దివ్యత్వ ఆకృతి సంతరించుకొన్న వ్యక్తి క్రిస్టైన్. ఈమె అనేక ఆధ్యాత్మిక ప్రసంగాలు కూడా చేసింది. భారతదేశాన్నీ, భారతీయులనూ ఎంతగానో ఈమె అభిమానించింది. స్వామీజీ ఆమె కోసమే “అకాలంలో వికసించిన నీలి పుష్పానికి”* అనే కవిత వ్రాశారు. అమెరికాలో వసంత కాలంలో వికసించే పువ్వు నీలిపుష్పం. అది వసంతకాలానికి ముందే శీతకాలంలో వికసించినట్టయితే తీవ్రమైన చలిగాలిని ప్రతిఘటించి పోరాడవలసి వస్తుంది. క్రిస్టైన్ బాధామయమైన అనేక పరిస్థితులను ప్రతిఘటిస్తూ జీవితం గడపవలసివచ్చింది. అంతటి పరి స్థితులలోనూ మనస్సు చలించకుండా ఉండాలనే స్ఫూర్తినిస్తూ స్వామీజీ వ్రాసిన కవిత ఇది. సోదరి క్రిస్టైన్ జీవితమూ కోమలమైన ఒక పువ్వు జీవితంలా విరాజిల్లింది. భారతదేశాన్ని అభిమానించిన ముఖ్యులలో ఒకరిగా ఆమె భాసిల్లింది.
మిస్ సారా ఎలెన్ వాల్డో
ఉత్కృష్ట అమెరికన్ చింతనాశీలురలో ఒకరైన రాల్ఫ్ వాల్డో ఎమర్సన్‌కు దూరపు బంధువు సారా ఎలెన్ వాల్డో. స్వామీజీని కలుసుకొన్నప్పుడు ఈమె 51 ఏళ్ల వయస్కురాలు. అంతకు మునుపే మాక్స్ ముల్లర్ రచనలు చదవడంతో భారతీయ తత్త్వశాస్త్రం పట్ల ఈమెకు ఎంతో ఆసక్తి జనించింది. 1894 లో బ్రూక్లిన్‌లో స్వామీజీ ప్రసంగించినప్పుడు ప్రప్రథమంగా ఆయనను చూసింది అప్పటి నుంచి ఆయన సన్నిహిత శిష్యురాండ్రలో ఒకరైపోయింది. ప్రారంభంలో న్యూయార్క్‌లో స్వామీజీ ప్రసంగాల ఏర్పాట్లు మిస్ హేమ్లిన్ అనే వ్యక్తీ, తరువాత రూత్ ఎలీస్ చేశారు. వారి తరువాత వాల్డో ఆ బాధ్యత స్వీకరించింది. గుడ్విన్ స్వామీజీ వద్దకు రాక మునుపు ఆయన ప్రసంగాల సంక్షిప్త లేఖనం ఈమె చేసింది. స్వామీజీ సహస్రద్వీపవన ప్రసంగాలు ఈమె సంక్షిప్త లేఖనం ద్వారానే మనకు లభించాయి.
వాల్డో ఇలా వ్రాస్తున్నది:
“స్వామీజీతో చాలాకాలం సహజీవనం చేసినప్పటికీ నాలో సన్న్యాస భావన తలెత్తలేదు. ఆయన పాశ్చాత్య శిష్యులు పలువురు భారతదేశానికి వెళ్లి ఆయన పనిలో సహాయం చేసినప్పుడు కూడా నాకు భారతదేశానికి వెళ్లాలని తోచలేదు. నేనొక అమెరికన్ స్త్రీని, అమెరికాలోనే జీవించాలనే సంకల్పంతో ఉన్నాను. కాని స్వామీజీ పట్ల నాకున్న ఆదరాభిమానాలు వర్ణనాతీతం. ఆయన కోసం ఈ లోకంలో నేను ఏది చేయడానికైనా సంకోచించను.
“మొదటిసారి స్వామీజీ న్యూయార్క్ వచ్చినప్పుడు సదా కాషాయాంబరాలు ధరించడంలో మొండి పట్టుదల వహించారు. కాషాయాంబరాలు ధరించిన ఆయనతో కలసి బయటకు వెళ్లడానికి ప్రత్యేకించి ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఉదయంపూట వెళుతున్న అందరి చూపూ మా మీదే ఉంటుంది కనుక. స్వామీజీ కాషాయాంబరాలు ధరించి లోకాన్ని అసలు పట్టించుకోనట్లు గంభీరంగా రాచఠీవితో నడుస్తూ ముందు వెళ్లేటప్పుడు సామాన్యంగా ఆయన చూపు ఊర్ధ్వ ముఖంగా ఉంటుంది; ఎన్నడూ అధోముఖంగా ఉండదు. తంతి స్తంభాల ఎత్తుకు తక్కువలో ఉన్నదేదీ ఆయన చూపులో పడదు. ఆయనతో కలసి నడవడం ఎంతో కష్టం; పరుగు లాంటి నడకతో నేను కాస్త వెనుకగా వెళ్లగలుగుతాను. మా ఇద్దరినీ చూసేవారిలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్లు కనిపించేది. మమ్మల్ని చూసి, ‘ఇవి ఏమిటి?’ అంటూ వారు ప్రశ్నిస్తూన్నట్లు అనిపించేది. కొన్ని రోజులు గడిచాక స్వామీజీ తక్కిన రకాల దుస్తులు కూడ ధరించసాగారు.”
అద్దంలో చూస్తున్నారు!
అనేక మంది ఉపాధ్యాయుల నుంచి అనేక విషయాలు వాల్డో నేర్చుకొన్నది. ప్రారంభంలో ఆమెకు స్వామీజీ పట్ల పూర్తిగా నమ్మకం లేదు; ఆయనలో ఏదైనా దుర్బలతో, కొరతో కనబడుతుందేమోనని గమనించేది. స్వామీజీ బస చేసిన గదిలో ఒక పెద్ద అద్దం ఉంది. ఒక రోజు స్వామీజీ చాలాసేపు దాని ముందు నిలబడి చూసుకొంటున్నారు, ఒకసారి కాదు అనేకసార్లు. కాసేపు నిలబడి తమ రూపాన్ని అద్దంలో తదేకం చూసేవారు. తరువాత అక్కణ్ణుంచి వైదొలగి, మళ్లీ వచ్చి అద్దం ముందు నిలబడేవారు. ఈ విధంగా చాలాసేపు జరగడం వాల్డో గమనించింది.
స్వామీజీలో దుర్బలతను అన్వేషిస్తున్న వాల్డోకి ఇదొక అవకాశం. స్వామీజీ తనను చూసి తానే ఆనందిస్తున్నట్లు ఆమెకు అనిపించింది. దీనిని గురించి ఆయనే చెబుతారని ఆమె వేచివుంది.
అప్పుడు స్వామీజీ వాల్డో వైపుగా తిరిగారు. “వాల్డో! ఈ విచిత్రం చూడు. చూడడానికి నే నెలా ఉంటానో మరచిపోయాను. అందుకే అద్దంలో నన్ను సునిశితంగా చూసుకొంటున్నాను. కాని అద్దం ముందు నుంచి వైదొలగగానే మునుపటిలా నా రూపాన్ని నేను మరచిపోతున్నాను” అన్నారు. అది విని వాల్డో విస్తుబోయింది. స్వామీజీలో దుర్బలతను ఎదురుచూసిన వాల్డో, ఆయన దేహ ధ్యాసను సైతం అతిక్రమించి ఆధ్యాత్మికతలో సదా మునిగివున్న మహాత్ముడని నిదర్శనపూర్వకంగా నాడు గ్రహించింది.
వ్రాత పని
“నా చింతనా స్రవంతినీ, మాటలనూ ఎలా నువ్వు ఈ మేరకు గ్రహించ గలిగావు? నువ్వు వ్రాసుకొన్న నోట్సు* చదువుతున్నప్పుడు నేనే ప్రసంగిస్తున్నట్లుగా ఉంది” అని స్వయంగా స్వామీజీయే వచించే మేరకు ఆయన చింతనా ధోరణిలో మమైకమయింది వాల్డో. స్వామీజీ పాతం జల యోగ సూత్రాలకు వ్యాఖ్యానం వ్రాస్తున్నప్పుడు ఆయన చెబుతూండగా వ్రాసు కొన్న వ్యక్తి ఈమే. తమ అనుభవాన్ని వాల్డో ఇలా వ్యక్తం చేస్తున్నది: “ఒక సూత్రం చదవగానే స్వామీజీ ధ్యానంలో మగ్నులయ్యేవారు. కలాన్ని సిరాలో ముంచి నేను నిరీక్షిస్తూ ఉంటాను. కొన్ని సమయాల్లో చాలా సమయం గడచిపోయేది. హఠాత్తుగా ఆయన మౌనం భగ్నమై మాటలు ప్రవాహంలా వెలువడేవి. మళ్లీ ఆయన ధ్యానంలో మగ్నులయ్యేవారు…”
న్యూయార్క్ వేదాంత సంఘ ప్రచురణ కార్యంలో వాల్డో కీలకపాత్ర వహించింది. వాల్డో వ్రాత పనులను, గుడ్విన్ ముద్రణ పనులను, వాల్టర్ గుడ్–ఇయర్ దంపతులు అమ్మకాలు, జమాఖర్చులు వ్రాసుకొనే పనులు చూసుకొన్నారు. ఈ రీతిలోనే స్వామీజీ పుస్తకాలు ఒక్కొక్కటిగా వెలువడ్డాయి.
వ్రాత పనులతోబాటు అవసరమైనప్పుడు స్వామీజీ కోసం వంట పనులను కూడా ఈమే చూసుకొన్నది. ‘హరిదాసి’ నామధేయం ఈమెకు స్వామీజీ ఇచ్చారు. పేరుకు తగ్గట్లు సేవామయంగా జీవించి వాల్డో తన 81 వ ఏట మృతి చెందింది.
సేవియర్ దంపతులు
1896లో స్వామీజీ లండన్‌లో ‘జ్ఞానయోగం’ గురించి చేసిన ఒక ప్రసంగంలో సేవియర్ దంపతులు ప్రప్రథమంగా ఆయనను కలుసుకొన్న విషయం ఇంతకు క్రితమే చూశాం. స్విట్జర్లాండ్‌లో ఆల్ప్స్ పర్వతాలను చూసి, హిమాలయా లలో అలాంటి స్థలంలో ఒక అద్వైత ఆశ్రమం నెలకొల్పాలని ఒకసారి స్వామీజీ తమ అభిలాషను వ్యక్తం చేశారు. దానినే సేవియర్ దంపతులు ఆదేశంగా పరిగ ణించారు. స్వామీజీతో భారతదేశానికి వచ్చి మాయావతిలో అలాంటి ఆశ్రమాన్ని ప్రారంభించారు.
పునీతమూ, దివ్యత్వమూ నిండిన జీవితం సేవియర్ గడిపాడు. మిసెస్ సేవియర్, తక్కినవారు ఆయనను ‘పితాజీ’ అని సంబోధించారు. 1900 అక్టోబర్‌లో సేవియర్ కాలధర్మం చెందాడు. హైందవ సంప్రదాయం ప్రకారం ఆయనకు అంత్యక్రియలు జరిపారు. మాయావతిలో నివసించిన సన్న్యాసులకు సొంత తల్లిగా మిసెస్ సేవియర్ విరాజిల్లింది. ఆమెను అందరూ ‘అమ్మా’ అనే సంబోధించేవారు. జగదీశ్ చంద్రబోస్ దంపతులు, నివేదిత, క్రిస్టైన్, ఆనంద మోహన్ బోస్, చిత్తరంజన్ దాస్ ప్రభృతులు ఆమెను కలుసుకొని ఆమె జీవన సరళితో ఎంతో ఆకట్టుకోబడ్డారు. 1916లో ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోయింది. అక్కడే 1930 అక్టోబర్‌లో మిసెస్ సేవియర్ తుదిశ్వాస విడిచింది.
తమ లేఖలో ప్రేమానంద ఇలా వ్రాస్తున్నారు: “మిసెస్ సేవియర్ మూర్తీ భవించిన సన్న్యాసం. ఆమె భర్త కూడా అంతే! స్వామీజీ గణపతియైన గుడ్విన్, నివేదిత గురించి యోచిస్తున్నాను. త్యాగం యొక్క అత్యున్నత ఆదర్శాన్ని పాటించి జీవించారు. నేను నిత్యం శ్రీరామకృష్ణుల ఆలయంలో పూజ చేస్తున్నప్పుడు స్వామీజీ పాశ్చాత్య శిష్యుల జ్ఞాపకార్థం కూడా పువ్వులను సమర్పిస్తున్నాను. వారికి విధేయుడ నైన సేవకునిగా నన్ను నేను పరిగణించుకొంటాను.”
తప్పు దారి పట్టినవారి పట్లా అచంచల ప్రేమ
“నువ్వు దాన్లో అపజయం పొందినా, విసుగు పుట్టినా, భారతదేశం కోసం నువ్వు పని చేసినా, చేయకపోయినా, వేదాంతాన్ని అవలంబించినా లేక దాన్ని విడనాడినా సరే మరణించే దాకా నీకు అండగా నిలబడి ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. ‘ఏనుగు దంతాలు బయటికి వస్తాయేగాని, లోనికిపోవు’. అదే విధంగా మనిషి మాటలు వెనుకకు తీసుకోబడవు. అది నీకు నేను వాగ్దానం చేస్తు న్నాను”* అంటూ ఒకసారి స్వామీజీ నివేదితకు వ్రాశారు. ఏనాడూ ఆయన ప్రేమ ఎవరి నుండీ వైదొలగింది లేదు. తమను అర్థం చేసుకోని వారి పట్ల కూడా, తప్పుగా అర్థం చేసుకొన్న వారి పట్ల కూడా ఆయన సరళంగానే వ్యవహరించారు.
స్వామీజీ ప్రసంగాలను అందరూ అర్థం చేసుకొన్నారని గాని, అందరూ స్వీకరించారని గాని చెప్పలేం. ప్రత్యేకించి ఆయన రాజయోగ ప్రసంగాలు కొందరిపై అనుచిత ప్రభావాన్ని కల్పించాయి. రాజయోగం అందాన్ని ద్విగుణీకృతం చేయగల ఒక మార్గమనీ, గారడీ విద్యలు ప్రదర్శింపజేయగల ఒక మార్గమనీ అనేకులు భావించారు. ఒక స్త్రీ స్వామీజీ పేరును ఉపయోగించి, ఆ రీతిలో ప్రసంగించడం కూడా మొదలుపెట్టింది. తన తరగతులు స్వామీజీ తరగతులకు ఉపోద్ఘాతంగా ఉంటాయి; తన ప్రసంగాలు ఒకటి రెండు విన్న తరువాత స్వామీజీ ప్రసంగాలు వింటే బాగా అర్థమవుతాయని ఆమె ప్రకటనలు చేసింది.
ఒక రోజు స్వామీజీతో క్రిస్టైన్ ఈ విషయం చెప్పింది. అందుకు స్వామీజీ, “పాపం, ఆమె ఏం చేస్తుంది! భర్తను కూడా ఆమె సంరక్షించవలసి ఉంది. ఆమెకూ ఈ ప్రసంగాల ద్వారా కొంత డబ్బు లభిస్తే మంచిది” అన్నారు. వెంటనే క్రిస్టైన్, “కాని స్వామీజీ! ఆమె మీ పేరును తప్పుగా ఉపయోగిస్తున్నది. మొదటి రోజు కొన్ని వ్యాయామ భంగిమలను నేర్పిస్తున్నది. రెండవ రోజు ఎక్కడో నేర్చు కొన్న గారడీ విద్యల గురించి ఉదాహరణ చూపి ప్రసంగిస్తున్నది. ఇదంతా తప్పు కాదా? మీ పేరును ఉపయోగించి, ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి, వారిని తప్పుడు మార్గంలో తీసుకువెళ్లడం సరి కాదు కదా!” అంది. అంతా ప్రశాంతంగా విన్న స్వామీజీ ఆ స్త్రీ పట్లా కారుణ్యం వహించారు. క్రిస్టైన్ను ఆప్యాయంగా చూస్తూ, “పాపం, అభాగ్యురాలు! శివ శివా” అని మాత్రమే వ్యాఖ్యానించారు.
ఇతరులు చేసే నేరాలను క్షమించడమనే మహోన్నత గుణం స్వామీజీలో పరిపూర్ణంగా ఉంది. స్వామీజీ శిష్యుడొకడు, ఒక సందర్భంలో స్వామీజీ పేరుకు కళంకం ఏర్పడే రీతిలో ప్రవర్తించాడు. దానిని గురించి స్వామీజీతో ప్రస్తావించి నప్పుడు ఆయన, “ఆహా, అలాగా? పాపం అతడు. శివ, శివా” అని మాత్రమే అన్నారు. తనకు ఎవరు కష్టం వాటిల్లజేసినా స్వామీజీ అంత వరకే స్పందించేవారు.
అరుదైన స్వామీజీ ఈ గుణం గురించి సోదరి క్రిస్టైన్ ఇలా చెబుతున్నది: “ఏ విషయమైనా స్వామీజీని ఇబ్బంది పెడితే ఒక్క క్షణం మాత్రమే దానిని గురించి యోచిస్తారు. పిదప, ‘శివ శివా’ అనేవారు ఉద్వేగభరితులై. అంతే. దాంతో ఆయనకు సంబంధించినంత వరకు ఆ సమస్య సమసిపోతుంది. ఆయన ‘శివ శివా’ అంటునప్పుడు తమ నిజమైన నైజాన్ని జ్ఞాపకం చేసుకొంటున్నారని మేం గ్రహించాము.”
కారుణ్యమూర్తియైన గురువు
స్వామీజీ విభిన్న తరగతుల ప్రజలను కలుసుకొన్నారు. అందరినీ సమానంగా అభిమానించారు. ఆయన బోధనాపద్ధతిని గురించి మిసెస్ హాన్స్బరో ఇలా అంటున్నది: “ఆయనలో ద్వేషం మృగ్యం. అందరినీ ఆయన అభిమానిస్తున్నట్లుగానే అనిపిస్తోంది. ఆయన అందరినీ కారుణ్యమయ దృక్కులతోనే చూశారు.”
ఈ విధంగా తమ మహోన్నత కారుణ్యంతోనూ, క్షమాగుణంతోనూ ఎందరికో ఆధ్యాత్మిక ద్వారాలు తెరిచారు స్వామీజీ. పాశ్చాత్యులను ‘మ్లేచ్ఛులు’ అంటూ బహిష్కరించిన ఆ రోజుల్లో వారినీ ‘బ్రాహ్మణులు’ అని స్వీకరించి, వారినీ ఋషులను గావించి, అనేకులు ఆరాధించే స్థితి వారికి కల్పించారు!
సూర్యుడు నిత్యం ఉదయిస్తాడు, వేల కిరణాలను ప్రసరిస్తూ లోకాన్ని ఆక్రమిస్తూ పశ్చిమం వైపుగా పయనిస్తున్నాడు. ఆయన సన్నిధానంలో లోక కృత్యాలు వాటంతట అవే జరిగిపోతున్నాయి – వికసించేవి వికసిస్తున్నాయి, పండబోయేవి పండుతున్నాయి, పండి రాలిపోయేవి రాలిపోతున్నాయి, రాలి మళ్లీ మొక్కగా మొలచేవి మొలుస్తున్నాయి. వీటి అన్నింటికీ అవసరమైన శక్తిని సూర్యుడు అందిస్తూ, అదే సమయంలో దేనితోనూ అనురక్తి పొందకుండా పయనం సాగిస్తున్నాడు.
స్వామీజీ జీవితమూ అదే రీతిలో సాగింది. ఆయనతో మెలగిన ప్రతి ఒక్కరూ ఆయన అనంత ప్రేమను చవిచూశారు; తమ మానసిక స్థితికి, మానసిక పరిపక్వతకు తగినట్లు ఉన్నతమైన జీవితాన్ని అభిలషించారు. వారిలో ప్రతి ఒక్కరి జీవితమూ ఒక విడి మార్గంలో భగవంతుని వైపుగా సాగింది. అందరి మీదా ప్రేమను వెదజల్లుతూ వారిని అక్కున చేర్చుకొంటూ వెళ్లారాయన.