మనం అసత్యం నుంచి సత్యానికి పోవడం లేదు. అందుకు మారుగా సత్యం నుంచి సత్యానికి పోతున్నాం. ఫలానా పని ఇలా చేస్తున్నా రంటూ ఎవరినీ తప్పుపట్టకూడదు. ఎందుకంటే ఆ సమయంలో వారు తమ శక్తి మేరకు మంచినే చేస్తున్నారు కనుక.
– స్వామి వివేకానంద
మారుతున్న మానసిక తరంగాలు — స్వామీజీ గాంచిన దృశ్యం — నచ్చని వారు — అంతరంగమే ప్రధానం — ఆధ్యాత్మికతా? కడుపు నొప్పా? — చీవాట్లు! — హాన్స్బరో విచిత్ర అనుభవం — ట్రామ్ పయనం — ‘వృద్ధుని’ లా! — ‘బాంబు విసురుతాను!’ — మళ్లీ బాంబులు! — విద్యుదాఘాతం — వేదాంతం ఎందుకు బోధించారు? — డబ్బు కోసం ప్రసంగం
మారుతున్న మానసిక తరంగాలు
శాన్ఫ్రాన్సిస్కో జీవితం స్వామీజీకి చక్కని మానసిక ప్రశాంతతను కల్పించింది. ఆయన మనస్సు అనేక మార్పులకూ, అనేక నిమ్నోన్నతాలకూ గురియై వ్యవహ రించిందని ఆయన లేఖల నుండి అవగతమవుతుంది. లాస్ ఏంజెల్స్ నుండి ఆయన వ్రాసిన లేఖలలో ఒక రకమైన నిరాశా నిస్పృహలను చూడవచ్చు. శాన్ఫ్రాన్సిస్కో నుంచి వ్రాసిన లేఖలు ఆయన మానసిక ప్రశాంతతను ప్రతిఫలింపజేస్తున్నాయి. అక్కణ్ణుంచి ఆల్మేడా వెళ్లి అక్కడ నుంచి వ్రాసిన లేఖలు ఆయన ఒక రకమైన ఆనంద పారవశ్యంలో లయించినట్లు స్పష్టంచేస్తున్నాయి.
లాస్ ఏంజెల్స్ లేఖల నుంచి:
“ఎప్పుడూ నా స్వకీయ బాధలనే తలపోస్తూ ఇతరులను లక్ష్యపెట్టడం లేదు. నా కోసం ప్రార్థించు. బాధపడడానికి నాకు శక్తి కలగాలని దృఢమైన సంకల్పాలను పంపించు.”* “నేను నిజంగా మృగప్రాయుడిగా ఉన్నాను. కాని నాలోని మార్దవ లక్షణమా! – అది నా లోపం. అది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. అయ్యో అది నా బలహీనత. నా కష్టాలన్నీ దాని మూలంగా ఏర్పడినవే.”*
శాన్ఫ్రాన్సిస్కో లేఖల నుంచి:
“గడచిన రెండు సంవత్సరాల నుంచి వాటిల్లిన యాతనలు నాకు అనేక విధాల గుణపాఠాలైనాయి. మనం అనుభవిస్తున్నప్పుడు ఇక తరణోపాయం లేనట్లు తోచినా, పర్యవసానంలో వ్యాధి, దురదృష్టం అనేవి మనకు మంచినే కలిగిస్తాయి. నేను అనంతమైన వినీలాకాశాన్ని, మేఘాలు నా మీద గుమిగూడ వస్తాయి. కాని నేను అఖండ వినీలాకాశాన్నే. ప్రశాంతత నాకూ, ప్రతి వ్యక్తికీ స్వభావసిద్ధమని నాకు తెలుసు. ఆ ప్రశాంతతను చవిచూడ సుఖదుఃఖాలతో కూడుకొన్న మాయా స్వప్నాలు – వీటి వలన ఏం ప్రయోజనం? నా స్వప్నాలు అంతరిస్తున్నాయి. ఓం తత్సత్!”*
“ఊహాతీతమైన ప్రశాంతతను పొందుతున్నాను. ఆ శాంతి సుఖం కాదు, దుఃఖమూ కాదు. అది సుఖదుఃఖాలకు అతీతం… గత రెండేళ్లుగా నేను శారీరకంగాను, మానసికంగాను మృత్యులోయలో పయనించడం, దీనికి సాయ పడింది. నే నిప్పుడు విషయాలను వాటి యథార్థ స్థితిలో, ప్రతిదాన్ని ఆ ప్రశాంతతలో, వాటి పరిపూర్ణ స్థితిలో చూడగోరుతున్నాను… అనేక జన్మల, స్వర్గాల, నరకాల పరంపరల నుండి మనం ఇక్కడ ఉండి నేర్చుకోవలసిన మహోత్తమమైన గుణపాఠం ఇదే – తన ఆత్మ తప్ప కోరదగింది, వాఛించదగింది మరొకటి లేదు… నే నిప్పుడు దాన్ని నిత్యం సాక్షాత్కరించుకొంటున్నాను. అవును, నేను ‘ముక్తుణ్ణి’, ముక్తుణ్ణై ఉన్నాను. నేను ఏకమేవ (ఒక్కణ్ణే)! నేను అద్వితీయుణ్ణి (రెండవది లేని వాణ్ణిగా ఉన్నాను).*
ఈ లేఖ మలిమాటగా స్వామీజీ వ్రాసింది ఆయన అత్యున్నత స్థితికి అద్భుతంగా అద్దం పడుతుంది:
“నే నిప్పుడు యథార్థంగా ‘వివేకానందుణ్ణి’ కాబోతున్నాను. నువ్వు కీడును ఎన్నడైనా అనుభవించావా? హా! హా! పిచ్చిపిల్లా, సర్వం మంచిదే. అర్థం లేని ప్రసంగం. కొంత మంచి, కొంత చెడు. నేను మంచిని అనుభవిస్తాను; కీడునూ అనుభవిస్తాను, నేను ఏసుక్రీస్తుగా ఉన్నాను, ‘జూడాస్ ఇస్కారియట్’* గా ఉన్నాను. రెండూ నా క్రీడే, నా వినోదమే… మంచి రానీ, చెడు రానీ రెంటికీ స్వాగతమే. ఈ విశ్వం నా చెవుల వద్ద దొర్లిపోతే నాకేం? ఉహాతీతమైన శాంతిని నేను. అర్థం చేసుకోవడం మనకు మంచి లేక కీడును మాత్రమే ఇస్తుంది. నేను అతీతుణ్ణి. నేను ప్రశాంతిని.* ”
శాన్ఫ్రాన్సిస్కోలో స్వామీజీ చేసిన ప్రసంగాలు ఇంతటి అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో నుంచి చేసినవని ఆ ప్రసంగాలను చదివినప్పుడు మనకు స్పష్టంగా అవగత మవుతుంది.
కాని మారుతున్న మానసిక స్థితులకు అతీతంగా, ఆయన ఎప్పుడైనా సరే సమాధిస్థితిలో మగ్నమయ్యే అత్యున్నత స్థితిలోనే సదా ఉంటూ వచ్చారని, ఆయనతో సహజీవనం చేసిన పలువురి స్మృతులు తెలుపుతున్నాయి. ఆయన ఎంతసేపు నిద్రిస్తారని సామాన్యంగా ఎవరికీ తెలియదు. కాని ఆయన చాలా తక్కువసేపు మాత్రమే నిద్రించేవారు. అర్ధరాత్రి, అతి వేకువజామున చాలాసేపు ధ్యానం చేసే వారు. ఆయన గాంచిన దృశ్యాలేమిటి, పొందిన అనుభూతులేమిటి? ఆయన ఎన్నడూ వ్యక్తం చేసింది లేదు.
స్వామీజీ గాంచిన దృశ్యం
ఈ విధంగా సదా అంతర్ముఖ స్థితిలోనే ఉన్నప్పటికీ స్వామీజీ ఎవరినీ ఉపేక్షించలేదు. అన్ని రకాల వారినీ కలుసుకొన్నారు. అందరితో మైత్రీభావంతో మెలగారు. ఎడిత్ ఇలా వ్రాస్తున్నది: “ఆయన సర్వులనూ అభిమానించారు. ఆయన మూర్తీభవించిన కారుణ్యం. మనుషులలో ఎలాంటి వ్యత్యాసాన్నీ ఆయన చూడలేదు. అంతెందుకు, మనుషులకూ తక్కిన ప్రాణులకూ మధ్య కూడా ఆయన ఎలాంటి తారతమ్యాన్ని గాంచలేదు. ఆయనకు సంబంధించినంత వరకు మనిషీ, బాతూ ఒక్కటే. ఆయనకు అన్నింట్లోనూ భగవంతుడే కనిపించాడు. ఆయన జీవితమూ, కార్యాచరణా ఆ దృశ్యానికి అద్దం పడతాయి. తద్ద్వారా ఆయన ఒక మహోన్నత బోధననిచ్చారు. అది – ఎవరినీ ద్వేషించకుండడం.”
స్వామీజీ తరచూ ఇలా చెప్పేవారు: “మనం అసత్యం నుంచి సత్యానికి పోవడం లేదు. అందుకు మారుగా సత్యం నుంచి సత్యానికి పోతున్నాం. మన దృశ్యం ఇలా ఉండాలి. ఫలానా పని ఇలా చేస్తున్నారంటూ ఎవరినీ తప్పు పట్ట కూడదు. ఎందుకంటే ఆ సమయంలో వారు తమ శక్తి మేరకు మంచినే చేస్తున్నారు కనుక. పదునైన కత్తి పసివాడి చేతికి అందితే దానిని అతడి నుంచి లాక్కోవడానికి ప్రయత్నించకండి. అతడి చేతికి ఒక ఆపిల్ లేదా ఒక బొమ్మ ఇవ్వండి. కత్తి క్రింద పడేస్తాడు. నిప్పును తాకితే కాలుతుంది. మనం అనుభవాల నుంచి నేర్చుకొంటున్నాం.”
నచ్చని వారు
ఎడిత్ స్మృతులు కొనసాగాయి: “స్వామీజీకి నచ్చనివారు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. ఆయన మనుషులను విభేదంతో చూశారు. ఒక వ్యక్తి నిజాయతీపరుడు, సజ్జనుడు, కాని కొన్ని పరిధుల్లో తనను నియంత్రించుకొని పురోగమించడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయడు. మరొకడు పాపి, దుర్మార్గుడు, కాని తన పాపాల మూలంగానూ, దుర్మార్గం మూలంగానూ జీవిత పాఠాలను నేర్చుకొని పురోగమించే వాడు. ఈ ఇద్దరిలో స్వామీజీకి రెండవ వ్యక్తి నచ్చాడు. ‘స్వామీజీకి నచ్చని వారు ఎవరైనా ఉన్నారంటే, వారు అతి కోమల హృదయులు! వారి వలన ఎలాంటి ప్రయోజనమూ ఉండదని ఆయన పరిగణించారు. ‘ఏదైనా చేయండి, దుష్టకార్యమైనా ఫరవాలేదు. కాని ఏదైనా చేయండి!’ ‘సజ్జనుడిగా ఉండు, సజ్జనుడిగా ఉండు’ అంటూ అందరూ నినాదం చేస్తున్నారు. కాని నే నెందుకు సజ్జనుడిగా ఉండాలి? అని స్వామీజీ ప్రశ్నించే వారు.”
అంతరంగమే ప్రధానం
బాహ్య ఆకృతి, బాహ్య సౌందర్యం, బాహ్య కార్యాచరణ లాంటి బాహ్య విషయాలకే పాశ్చాత్యదేశాలలో ప్రాధాన్యం. కాని స్వామీజీ బాహ్య విషయాలను అప్రధానంగా పరిగణించేవారు. ఇది కొన్ని సమయాలలో వారిని ఆశ్చర్యంలో ముంచెత్తడమూ, స్వామీజీని ఆనందింప జేయడమూ కద్దు. అదే సమయంలో అందరికీ ఒక గుణ పాఠమూ నేర్పుతుంది. ఒక రోజు స్వామీజీ, ఎడిత్ ఊరగాయ కొనడానికి ఒక దుకాణానికి వెళ్లారు. అక్కడ ఉప్పునీటి తొట్టెలో ఊరగాయ నిల్వ ఉంచారు. దానిలో నుంచి ఊరగాయను చెక్క గరిటెతో తీసి, సన్నని కాగితపు పళ్లాలలో వేసి ఖాతాదారులకు ఇస్తారు. స్వామీజీ దానిని చేతిలో ఉంచుకొన్నారు. తిరిగి వస్తున్న ప్పుడు ఉప్పునీరు ఆయన చేతుల మీదుగా కారింది. కించిత్తు కూడా సంకోచించ కుండా సంతోషంగా దానిని నాకారు. ‘ఓ’ అంటూ ఎడిత్ కేకపెట్టింది. బహిరంగ స్థలంలో స్వామీజీ ఇలా అనాగరకంగా ప్రవర్తించడం ఆమెను దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. కాని స్వామీజీ కొంచెం కూడా చలించలేదు. ప్రశాంతంగా, “మేడమ్! మీ సమస్యే ఇది. బయట సొగసుగా ఉన్నట్లు ప్రవర్తించాలని మీరు ఆరాటప్డతారు. మీదృష్టిలో అంతరంగం ఎలా ఉన్నదో ప్రధానం కాదు, బాహ్యమే ప్రధానం” అన్నారు.
ఆధ్యాత్మికతా? కడుపు నొప్పా?
స్వామీజీతో సహజీవనం చేసే ప్రతి క్షణమూ నేర్చుకోవడానికి ఏదో ఉంటూనే ఉంటుంది. హాస్యానికీ కొరత ఉండదు. దిగాలుపడి ఎవరైనా శోకంతో ఉంటే, “ఆతడిలో ఆధ్యాత్మికత మృగ్యం; బహుశా కడుపు నొప్పి ఉండవచ్చు” అనేవారాయన. ఒకరోజు ఎడిత్తో, “మేడమ్! విశాల హృదయం అవసరం. ఎప్పుడూ రెండు మార్గాలను ఉంచుకోండి. అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులలో నెలకొని ఉన్నప్పుడు నేను, ‘శివోఽహం, శివోఽహం; నేనే శివుణ్ణి, నేనే శివుణ్ణి’ అంటూ ఉంటాను. కడుపునొప్పితో బాధపడుతున్నప్పుడు, ‘అమ్మా, నన్ను దయదలచు’ అంటూ ఉంటాను” అన్నారు!
స్వామీజీ కాస్త స్థూలకాయులు. ఒకరోజు స్థూలకాయులైన సన్న్యాసుల చిత్తరువును చూసి, “చూడండి, ఆధ్యాత్మికవాదులు ఎప్పుడు లావుగానే ఉంటారు, నేను అంతే కదా!” అంటూ వ్యాఖ్యానించి నవ్వారు.
చీవాట్లు!
తమతో సహజీవనం చేసే వారి జీవితాలూ, వారి సమస్యలూ అన్నింటినీ సునిశితంగా గమనించడమే కాక అనేక విషయాలను వారిని అడిగికూడా స్వామీజీ తెలుసుకొనేవారు. పిదప భారతదేశంలో గృహస్థ జీవితం గురించి వారికి తెలిపేవారు. సంభాషణలు, భేటీలు జరుగుతు న్నప్పుడు అమిత మృదువుగా మాట్లాడేవారు. సాధారణంగా ఆయన మృదు స్వరంలోనే మాట్లాడతారు – ఒక్క సమయంలో తప్ప – అది ఎవరినైనా చీవాట్లు పెట్టేటప్పుడు!
చీవాట్లంటే పెద్దగా ఊహించుకోనక్కర్లేదు. “నాతో కలసి పనిచేయడానికి జగజ్జనని మూర్ఖులనే ఎంపిక చేసింది”, “మూర్ఖులతో కదా నేను జీవించవలసి వచ్చింది!” – ఇవే ఆయన పెట్టే చీవాట్లు! చేయవలసిన వాటిని ఎవరైనా చేయ నప్పుడు, “నువ్వు మంచి చేయాలనే అనుకొన్నావు, కాని చేస్తున్నప్పుడు మూర్ఖుడ వవుతున్నావు” అనేవారు. స్వామీజీ నుంచి చీవాట్లు తినడంలో అగ్రతాంబూలం మీడ్ సోదరీమణులది, వారిలోనూ మిసెస్ హాన్స్బరోది ప్రథమ స్థానం! ఒక రోజు ఆమెకు విందు లభించింది; “నువ్వొక వడగట్టిన మూర్ఖురాలివి, నిన్ను గురించి ఏదైనా చెప్పవలసివస్తే మెదడులేని మూర్ఖురాలివని చెప్పాలి” అంటూ కొనసాగింది. ఆ సమయంలో మిసెస్ ఆస్పినాల్ లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే స్వామీజీ చీవాట్లు ఆపారు. వెంటనే హాన్స్బరో, “స్వామీజీ! ఆమె రాకను మీరు పట్టించుకోవద్దు. మీ కోపం తీరకపోతే ఇంకా తిట్టి ముగించండి” అంది.
స్వామీజీ కోపం గురించి హాన్స్బరో ఏం అనుకొంది? “ఏనాడూ ఆయన కోపం నన్ను బాధించలేదు. కొన్ని సమయాలలో నాకూ కోపం వచ్చేది, నేను గది నుండి బయటకు వెళ్లిపోయేదాన్ని. ఆయన చీవాట్లు కొనసాగేవి” అనేది హాన్స్బరో.
తాము చీవాట్లు పెట్టడం గురించి స్వామీజీ ఏం అనుకొనేవారు? “నేను ఎవరిని ఎక్కువగా అభిమానిస్తానో వారిని ఎక్కువగా చీవాట్లు పెడతాను, అందుకే చీవాట్లు పెట్టిన తరువాత క్షమించమని అడగను” అనేవారు స్వామీజీ. క్షమించమని అడగకపోయినా మరుక్షణమే తమకు వారిపట్లగల ప్రేమను వ్యక్తం చేసే రీతిలో ప్రవర్తించేవారు.
అదే సమయంలో, ప్రతి ఒక్కరూ చేసే పనులను ఎంతో శ్లాఘించేవారు. చిన్న పనులను కూడా అమితంగా ప్రశంసించేవారు. ఈ విషయంలో ఆయన ఎన్నడూ వైదొలగింది లేదు. “ఆ ముగ్గురు సోదరీమణులలో రెండవదైన శ్రీమతి హాన్స్బరో ఇక్కడ ఉంది నాకు సాయం చేయడానికి. ఆమె పని చేస్తూ, చేస్తూ, చేస్తూనే ఉంది. భగవంతుడు వారిని ఆశీర్వదించు గాక! ఆ ముగ్గురు సోదరీ మణులు, ముగ్గురు దేవతలు. కాదా మరి? అలాంటి వారిని అక్కడక్కడ దర్శించ డమే ఈ అనర్థ జీవితానికి ప్రయోజనం”* అంటూ మీడ్ సోదరీమణులను గురించి స్వామీజీ వ్రాస్తున్నారు.
హాన్స్బరో విచిత్ర అనుభవం
తన కుమార్తెయైన డోరథీ పట్ల హాన్స్బరోకు ఎంతో ప్రేమ. స్వామీజీ కొన్ని సమయాలలో దీనిని గురించి హాన్స్బరోను హెచ్చరించడం కద్దు. స్వామీజీతో శాన్ఫ్రాన్సిస్కోలో బస చేసి ఆయనకు అవసరమైన సహాయాలు చేసిన రోజుల్లో అనేకసార్లు హాన్స్బరో పాసడేనాలోని తన ఇంటికి వెళ్లి కుమార్తెను చూసి రావాలనుకొంది. ఒక రోజు పెట్టేబేడా సర్దుకొని బయలుదేరింది. హఠాత్తుగా ఒక కంఠస్వరం, “నువ్వు వెళ్లవద్దు, అందుకు ప్రయత్నించకు” అని వినవచ్చింది. వెంటనే ఎక్కణ్ణుంచో హాన్స్బరోకు విపరీతమైన అలసట కలిగింది! ఒక్క అడుగు కూడా వేయలేని స్థితిలో పెట్టేబేడాను అక్కడే ఉంచి కూలబడిపోయింది! దీన్లో విచిత్రం ఏమిటంటే ఆమెను ఆపింది స్వామీజీ కంఠస్వరం కాదు, ఆయన ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగానే నిలబడి ఉన్నారు. “ఆ స్వరం ఎవరిదో నాకు తెలియదు” అని కాలాంతరంలో హాన్స్బరో తెలిపింది.
ట్రామ్ పయనం
ఉదయం పూట తరగతులు లేని రోజుల్లో స్వామీజీ హాన్స్బరోతో బయటకు వెళ్లేవారు. దుకాణాలు, సంతలు, బహిరంగ స్థలాల లాంటి అన్ని చోట్లకు వెళ్ల డంలో ఆయన ఉత్సుకత చూపారు. ట్రామ్లలో వెళుతున్నప్పుడు తిన్నగా కూర్చునేవారు. చేతికర్రను ముందు నిలబెట్టి, దాని మీద రెండు అరచేతులను ఒకదానిపై ఒకటిగా ఉంచే వారు. ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని సమయాలలో కూనిరాగంలో పాడేవారు. ఉద్యానం, ప్రదర్శన, పక్షుల శరణాలయం లాంటి అన్ని చోట్లూ తిలకించి, ఆనందించారు. కాని కొన్ని దృశ్యాల కన్నా మనిషీ, ఆతడి హస్తకౌశలమే ఆయనను అమితంగా ఆకట్టుకొన్నాయి. “అనేక చోట్లకు వెళ్లి ఆయన చూసినప్పటికీ, ఫలానా చోటును చూసే తీరాలనే ఆకాంక్షతో ఆయన ఏ చోటికీ వెళ్లలేదు. అన్ని చోట్లకూ వెళ్లారు. కాని ఏ చోటూ ఆయనకు సొంతం కాదు, ఎవరూ ఆయనకు అన్యులుకారు. ఏ చోటు అయినా వెళ్లి చూసినప్పుడు, ఈ చోటు, ఆ చోటు, ఈ వస్తువు, ఆ వస్తువంటూ విడివిడిగా చూడడంలో ఆయనకు ఉత్సుకత లేదు. మొత్తం మీద ఆ చోట్ల గుండా ఒకసారి వెళ్లివస్తారు. ప్రక్కనున్న దేనిని గురించీ కలత చెందకుండా ఒక పక్షి ఎగిరిపోతున్నట్లుగా ఉంటుందది” అంటూ హాన్స్బరో వ్రాస్తున్నది.
‘వృద్ధుని’ లా!
హాన్స్బరో టిప్పణులు (notes) తెలిపే మరొక సమాచారం ఇక్కడ చూద్దాం. అది స్వామీజీ అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి. ఆధ్యాత్మిక జీవితంలో ఆహార ప్రాధాన్యం గురించి స్వామీజీ అనేక ప్రసంగాలలో ప్రస్తావించి ఉన్నారు. పావన జీవితం గడపనివారు తాకిన ఆహారాన్ని శ్రీరామ కృష్ణులు తిరస్కరించడం గూర్చి ఇంతకు క్రితమే చూశాం. స్వామీజీ అంతటి స్థితిలోనే ఉన్నారని హాన్స్బరో టిప్పణులు తెలుపుతున్నాయి.
ఒకసారి స్వామీజీకి ఛార్లస్ పి. నీల్సన్ అనే వ్యక్తి ఒక హోటల్లో విందు ఇచ్చాడు. మిసెస్ హాన్స్బరో, మరో ఒకరిద్దరు కూడా వెళ్లారు. అందరూ భోజనానికి కూర్చున్నారు. సేవకుడు వచ్చి అందరికీ అభివాదం చేసి వడ్డించ నారంభించాడు. ఆతణ్ణి చూడగానే స్వామీజీకి ఆతడు తాకిన దేదీ తినలేనని పించింది. దాంతో ఆయన ఏమీ తినలేకపోయారు. విందు ఇచ్చిన నీల్సన్‌కు నిరాశ కలిగింది. ఎవరికీ ఏదీ అర్థం కాలేదు. ఆ సేవకుడు అపవిత్రుడు, అందుకే తాను భోజనం చేయలేకపోయానని కాలాంతరంలో స్వామీజీ తెలిపారు.
మరొకసారి కూడా ఈ విధంగానే జరిగింది. స్వామీజీ, హాన్స్బరో ఒక ఫ్రెంచ్ హోటల్‌కు వెళ్లారు. రొయ్యల వేపుడు వడ్డించారు. అక్కడ కూడా స్వామీజీ తినడానికి సంకోచించారు. ఆ తరువాత జరిగింది ఏమిటో హాన్స్బరో ఇలా చెప్పింది: “మొత్తం మీద ఏదో రకంగా స్వామీజీ భోజనం ముగించారు. కాని ఇంటికి తిరిగి వచ్చాక వాంతి చేసుకొన్నారు. వెంటనే నేను ‘ఆ వేపుడు అంతే, సులభంగా జీర్ణం కాదు’ అన్నాను. అందుకు స్వామీజీ, ‘అది కాదు. వండిన వ్యక్తి అపవిత్రుడు. నేను రానురానూ ఆ వృద్ధునిలా అయిపోతున్నాను. ఇలాగే సాగితే నేను అద్దాల గూటిలోనే జీవించవలసి వస్తుంది కాబోలు’ అన్నారు.” “ఆయన ‘వృద్ధు’ డని పేర్కొన్నది శ్రీరామకృష్ణులనే. అపవిత్రులు తాకిన దేనినీ ఆయన స్వీకరించలేరు. ఆయన శరీరం దానిని తిరస్కరిస్తుంది” అంటూ వివరిస్తున్నది మేరీ లూయీ బర్గ్.
‘బాంబు విసురుతాను!’
మార్చ్ నెల నుంచి స్వామీజీ శాన్ఫ్రాన్సిస్కోలో మనస్సు, మనస్తత్త్వ సంబంధ మైన, రాజయోగానికి సంబంధించిన ప్రసంగాలు చేశారు. “ముక్తి మార్గం” అనే విషయాంశం మీద ఒక రోజు ప్రసంగించారు. ఆ ప్రసంగం ముగిసే సమయంలో, “రేపు నేను ‘మనస్సు : దాని శక్తులు, అవకాశాలు’ అనే విషయాంశం మీద ప్రసంగించబోతున్నాను. వచ్చి వినండి. దానిలో విశేషమైన ఒక వార్త మీకు చెబుతాను. అవును, ఒక బాంబు విసురుతాను” అన్నారు. ఇలా చెప్పి ముఖారవిందాన చిరునవ్వు వికసించగా శ్రోతలను ఒకసారి పరికించారు. తరువాత చేతులను ఆడిస్తూ, “రండి, అది మీకు మంచి చేస్తుంది” అన్నారు.
మర్నాడు సభామండపం జనంతో క్రిక్కిరిసిపోయింది.. “స్వామీజీ బాంబు విసరనే విసిరారు. జనం మనస్సులో పడి, ఒక గొప్ప ప్రభావం చూపే రీతిలో మాటల – బాంబును ఎలా విసరడమో ఆయనకు కరతలామలకం” అంటున్నాడు రోడీమల్. అలా ఆయన విసరిన బాంబు ఏమిటి? పావనత్వం, పవిత్రత, శీలం, సత్ప్రవర్తన లాంటి భావనలను నొక్కివక్కాణించడమే ఆ బాంబు! ఇవి పాశ్చాత్య దేశస్థులకు తెలిసిన విషయాలే. కాని వారికి వాటి పూర్తి పరిమాణం, భారతీయ వైఖరి లాంటివి క్రొత్త. కామాన్ని ఆమూలాగ్రం నియంత్రించవచ్చు అనడంలో పాశ్చాత్య విజ్ఞానం ఆసక్తి చూపడం లేదు; క్యాథలిక్ తత్త్వం, స్వీకరించినప్పటికీ అంతగా నిర్బంధించడం లేదు. స్వామీజీ యథార్థాన్నే మాట్లాడారు:
“ఆ రోజు ఒక హైందవ యువకుడు నన్ను చూడడానికి వచ్చాడు. అతడి ఆరోగ్య స్థితి బాగాలేదు. మాటల్లో అతడు, ‘బ్రహ్మచర్యం తదితరాలన్నీ అసత్యం. అది అసాధ్యం, అది ప్రకృతి నియమానికే వ్యతిరేకమని దేశంలోని వైద్యులు అభిప్రాయపడుతున్నారు’ అన్నాడు. నేను అతడితో, ‘పో, భారతదేశానికి తిరిగి వెళ్లు. నీ పూర్వీకుల ఉపదేశాలు చదువు. అది సాధ్యమని వేలాది సంవత్సరాలు వారు బోధించడమే కాక, జీవించే చూపారు’ అన్నాను.”
ఈ సమయంలో స్వామీజీ వర్ణనాతీతమైన విసుగుతో శ్రోతలను ఒకసారి పరికించారు. ఆ తరువాత ఉరుములా గర్జించారు:
“ఈ దేశపు వైద్యులారా! కామాన్ని నియంత్రించడం ప్రకృతి నియమానికి విరుద్ధమని మీరు చెబుతున్నారు. పాపం, ఏం చెబుతున్నారో మీకు తెలియడం లేదు. శీలం అంటే ఏమిటో మీకు అర్థం కాదు. మీరు పశుప్రాయులు! పశు ప్రాయులు! పశువులలా జీవించే మీరు ఇంతకన్నా ఏం చెప్పగలరు?”
తాము చెప్పడానికి ఏదైనా వ్యతిరిక్త అభిప్రాయాలు ఉన్నట్లయితే చెప్పవచ్చు నని సవాలు చేస్తున్న వైఖరిలో శ్రోతలను స్వామీజీ ఒకసారి తేరిపార చూశారు. అంతా నిశ్శబ్దం ! ఎవరూ నోరు విప్పడానికి సాహసించలేదు. ఆ సభలో కొందరు వైద్యులు కూడా ఉన్నారని చెప్పడం గమనార్హం. అంతేగాక ఆ 19 వ శతాబ్దంలో కామం, శీలం, శారీరక సంబంధం లాంటి మాటలను బట్టబయలు చేసి మాట్లాడ డానికి జనం సంకోచించారు. “ఈ విషయాంశం మీద బాహ్య ప్రసంగాలను ఈ దేశంలో ఆదరించరు” అని స్వయంగా స్వామీజీ వచించడం కద్దు. అది తెలిసీ ఆయన వాటి గురించి ప్రసంగించారు. స్వామీజీ ప్రసంగం విని అనేకులు ముఖం చిట్లించారు. ఆ తరువాత అనేకులు ఆయన ప్రసంగాలకు రావడం మానుకొన్నారు. కొందరు, స్వామీజీ ఈ మేరకు మాట్లాడి ఉండకూడదని ఆయనకు సలహాలిచ్చారు.
మళ్లీ బాంబులు!
కాని స్వామీజీ దేనినీ ఖాతరు చేయలేదు. అంతేగాక; అవసరమైన చోట్ల ఆయన అదే రీతిలో ప్రసంగాలు కొనసాగించారు. ఒకసారి ‘మనః సమైక్యత’ అనే అంశం మీద ప్రసంగిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి ఆయనతో తాత్త్విక ప్రసంగాలు కావాలని అడిగాడు. అప్పుడు కూడా స్వామీజీ, “మీకు తాత్త్వికత కావాలా? అలా అయితే బాంబులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి” అన్నారు. అదే విధంగా ఆయన కొనసాగించిన ‘ప్రకృతి – మనిషి,’ ‘ఆత్మ – భగవంతుడు’, ‘గమ్యం’ లాంటి ప్రసంగాలు పాశ్చాత్య తాత్త్విక భావనలను కూకటివ్రేళ్లతో కదలించి వేసేవిగా భాసిల్లాయి. తమ మత సిద్ధాంతాలు కూకటి వ్రేళ్లతో కదలిపోవడం చూసి శ్రోతలు విస్మయులవడం స్వామీజీకి నవ్వు తెప్పించింది. కొన్ని సమయాల్లో పళ్ళు బిగించి నవ్వును ఆపుకోవలసి వచ్చేది!
“నేను అనంతమైన ఆత్మను; ప్రకృతికి నాథుడను కాని బానిసను కానని నాకు తెలుసు. భేదాభేదాలకూ, దేశకాల కారణాలకూ అతీతుడనైన నేను, నేనే ‘సోఽహం’.!”*
“శాస్త్రాలు లేవు. నేర్పించేవారు లేరు, దేవతలు లేరు, దేవాలయాలు, పూజారులు, దేవతలు, అవతారాలు, అంతెందుకు భగవంతుణ్ణే వదలిపెట్టండి. ఇంతవరకు ఉన్న సమస్త దేవతలూ నేనే!”
– స్వామీజీ ఇలా ప్రసంగిస్తున్నప్పుడు సభాసదులు స్తంభించిపోయి కూర్చుని ఉంటారు. “నేను పాపిని”, “నేను అజ్ఞానిని” అంటూ చెప్పబడిన భావనలనే విన డానికి అలవాటుపడిన వారికి ఈ భావనలు విభ్రాంతిని కలిగించి ఉంటాయన డంలో సందేహం లేదు. ఇలాంటి ఒక ప్రసంగంలో ముందు వరుసలో కూర్చుని ఉన్న వృద్ధుడొకరు లేచి నిలబడి, “అయ్యో! ఎంత తొందరగా పూర్తవుతుందో అంత తొందరగా ఇక్కణ్ణుంచి తప్పించుకోవాలి” అంటూ తన చేతికర్రను వేగంగా ఊనుస్తూ నడచి బయటకు వెళ్లిపోయాడు. స్వామీజీ చిరునవ్వుతో ఇదంతా చూస్తూవున్నారు.
తమ ప్రసంగాలలోని కొన్ని భావనలు విని, నేడు వారు కోపగించు కొన్నప్పటికీ మర్నాడు వారు దీనివలన గొప్పలాభం పొందుతారని స్వామీజీకి తెలియకపోలేదు. “సత్యాన్ని నేను దేనితో పోలుస్తానో తెలుసా? అతి గాఢమైన ఆమ్లంతో! ఎక్కడ పడినా ఆ స్థలాన్ని అది దగ్ధం చేస్తుంది – మృదువైన వస్తువులను తక్షణమే నాశనం చేస్తుంది, కఠినమైన రాళ్లవంటి వాటిని కొంత ఆలస్యంగా నశింపజేస్తుంది. కాని ఏదో ఒక రోజు నాశనం చేసే తీరుతుంది…. నేనూ అందజేయడానికి ఒక సందేశం ఉంది. దానిని మృదుమధుర భాషలో మాట్లాడి అందరికీ అందించడానికి నాకు సమయం లేదు. అంతేకాదు, మృదుమధురంగా మార్చడానికి చేసే ప్రయత్నాలు ఒకరిని మోసగాణ్ణిగానే మారుస్తాయి” అని ఒకసారి స్వామీజీ చెప్పారు.
విద్యుదాఘాతం
స్వామీజీని ‘తుపాను సన్న్యాసి’ అని పేర్కొనడం కద్దు. కాని ఇప్పుడు ఆయన ఆ మేరకు ప్రసంగాలు చేయడంలేదు. కాని చేసినవి అంతటి శక్తిమంతమైనవి. “శాన్ఫ్రాన్సిస్కోలోనే ఆయన తమ విశిష్ట ఆధ్యాత్మికశక్తిని అభివ్యక్తం చేశారు” అని వ్రాస్తున్నది హాన్స్బరో. ఒకే వాక్యంతో సభామండపంలో ఆసీనులైవున్న అందరికీ విద్యుదాఘాతం లాంటి అనుభవాన్ని ఆయన ఇచ్చిన సంఘటన కూడా జరిగింది. “ఒకసారి అందరినీ పరికించారు. తరువాత హఠాత్తుగా ‘లేవండి, మేల్కొనండి, గమ్యం చేరేదాకా ఆగకండి’ అన్నారు. అక్కడున్న యావన్మందీ తమ శరీరాల్లో విద్యుత్ లాంటి శక్తి ప్రసరించడం గుర్తించారు” అంటున్నది మిసెస్ ఎడిత్ ఆలెన్!
స్వామీజీ తమ ప్రసంగాలకు ముందు ఏదీ తినరు. “అది చింతనాశక్తిని మందగిస్తుంది” అనేవారు స్వామీజీ. ప్రసంగానంతరం తినేవారు. సాధారణంగా ఎవరో ఒకరు ఆయనకు విందు ఏర్పాటు చేసివుంటారు. కొన్ని సమయాలలో ఆయన కూడా కొందరికి విందు ఇవ్వడం పరిపాటి.
వేదాంతం ఎందుకు బోధించారు?
“నేడు నాకిష్టమైన విషయాన్ని బోధిస్తున్నాను. ద్వైత భావాన్ని పురస్కరించు కొని ఏర్పడ్డ మూఢవిశ్వాసాలేవీ లేని వాతావరణంలోనే నేను పెరిగి ఉంటే బాగుండే దని నా కోరిక”* అని తమ “భవిష్యన్మతం వేదాంతమా?” అనే ప్రసంగంలో స్వామీజీ వచించారు. ఆయన ఇష్టపడ్డారు, బోధించారని కాదు దీని తాత్పర్యం. కాలావశ్యకతను గ్రహించ డం వలన ఆయన ఇది చేశారు.
ఇదే ప్రసంగంలో స్వామీజీ తెలిపే మరో భావన ఎంతో ఆలోచింపదగ్గది. ప్రపంచంలోనే అతి ప్రాచీన గ్రంథాలు వేదాలు. ఆ గ్రంథాలు తెలిపే చరమ తత్త్వంగా వేదాంతం పరిగణించబడుతున్నది. కాని అది జీవన మార్గంగా ఇంత వరకు పరిగణింపబడలేదని స్వామీజీ అనుభవపూర్వకమైన అభిప్రాయం:
“నేను గతించిన ఒక మహనీయుని సేవకుణ్ణి. నేను ఆయన దూతను మాత్రమే. ప్రయోగం చేయాలని నా కోరిక. నేను మీకు చెప్పిన వేదాంత బోధనలు నిజానికి ఇదివరలో ఆచరణలో పరీక్షింపబడినవి కావు. వేదాంతం ప్రపంచంలోని తత్త్వశాస్త్రాలలో ఎంతో ప్రాచీనమైనదే అయినా అది సర్వత్రా గ్రుడ్డి నమ్మకాలతోను, సర్వేతరాలతోను కలిసిపోయింది.
“నేను నా తండ్రీ ఒక్కరమే!” అని ఏసుక్రీస్తు వచించాడు. మీరు ఆ మాటను వల్లిస్తారు. అయినా అది మానవాళికి ఉపకరించలేదు. పందొమ్మిది వందల ఏళ్లు గడచినా జనం ఆ మాటను అర్థం చేసుకోలేదు. ఏసుక్రీస్తును మానవాళికి రక్షకుణ్ణి చేశారు. ఆయన దేవుడు. మనం క్రిములం! భారతదేశంలో కూడా అంతే. ప్రతి దేశంలోనూ ప్రతి శాఖకూ ఇలాంటి నమ్మకమే వెన్నెముక. వేల సంవత్సరాలుగా లోకం అంతటా కోట్లమంది జనులకు జగదీశ్వరుని పూజ, అవతారాల పూజ, రక్షకుల పూజ, ప్రవక్తల పూజ ఏర్పడింది. ‘మీరు అసహాయులమనుకోండి, దుఃఖ భాగులమనుకోండి; మోక్షం పొందాలంటే మీకు ఫలానా వ్యక్తి అనుగ్రహమో, కొందరి అనుగ్రహమో ఆధారమని భావించండి’ అని వారికి నేర్పబడింది. ఇలాంటనమ్మకాలలో అనేక అద్భుత విషయాలు ఉన్నాయనడంలో సందేహం లేదు. కాని ఎంతయినా మత రంగంలో ఇవి కేవలం శిశుపాఠాలు. వాటి వలన కలిగే మేలు స్వల్పమే. నేటికీ జనం మత్తిల్లి అధఃపతనం చెందుతున్నారు. అయినా ఇలాంటి భ్రాంతిని అతిక్రమించే ధీరాత్ములు కొందరున్నారు. మహాత్ములు ఉద్భవించి, మతంలో ఈ శిశుపాఠాలు తొలగించి, ఆత్మ ఆత్మను ఆనారాధించే యథార్థ మతాన్ని స్పష్టంగా, శక్తిమంతంగా నిరూపించే కాలం సమీపిస్తుంది.”*
స్వామీజీ ఎందుకు వేదాంతం బోధించారో ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు. “నేను దూతను మాత్రమే” అనడంలో ఇది శ్రీరామకృష్ణుల ఆదేశం ప్రకారం జరుగుతున్నదని ఆయన స్పష్టం చేస్తున్నారు. ‘ఆత్మ ఆత్మను ఆరాధించే’ ఆ కాలం ఎప్పుడు ఆసన్నమవుతుంది?
“ఉన్నదంతా ఆత్మ ఒక్కటే అనే వేదాంతం వ్యాప్తి చెందితే మానవాళి సమస్తం ఆధ్యాత్మికపరమవుతుంది. మరి, అది సాధ్యమా? ఏమో, నాకు తెలియదు. కొన్ని వేల సంవత్సరాల్లో అయ్యే పని కాదు. ప్రాచీన మూఢవిశ్వాసాలన్నీ తొలగిపోవాలి. మూఢవిశ్వాసాలను నిలపడంలోనే మీరంతా ఆసక్తులై ఉన్నారు. అంతమాత్రమే కాదు. ‘కుటుంబ సోదరుడు’, ‘వర్ణ సోదరుడు’, ‘దేశ సోదరుడు’ అనే చుట్టరికాలు ఉన్నాయి. వేదాంత సాక్షాత్కారానికి ఇవన్నీ ప్రతిబంధకాలే. మతం మతంగా ఉండేది ఎంతో కొద్దిమందికే. ప్రపంచమంతటా మత రంగంలో కృషి చేసిన వారిలో అధిక సంఖ్యాకులు రాజకీయోద్యోగులే…. ఇక్కడ నేను ఈ సిద్ధాంతాలను బోధించగలను. కాని మీలో ఎందరు శ్రద్ధతో అంగీకరిస్తారు? కాని సత్యమంతా ఇందులో ఉంది. నేను మీకు సత్యాన్ని చెప్పితీరాలి.”*
డబ్బు కోసం ప్రసంగం
పైన పేర్కొన్న ప్రసంగమే శాన్ఫ్రాన్సిస్కోలో చేసిన చివరి ప్రసంగం. “డబ్బు కోసం ప్రసంగించే ఈ స్థితి నుంచి నేను విముక్తుణ్ణి అవుతానా?” అంటూ స్వామీజీ వ్యాకులత చెందడం కద్దు. కాని మఠం కోసమూ, పనుల కోసమూ ఆయన ఆర్జించవలసిన అగత్యం ఉంది. ఆయనకు లెక్కలు అసలు తెలియవు. అయినప్పటికీ ఏదో ఒక లెక్క పెట్టుకొంటారు. ఆయన ఆదాయ వ్యయాల లెక్కలన్నీ హాన్స్బరో చూసుకొంది. ఆయనకు సహాయం చేసిన హాన్స్బరో ఈ విషయంలో అంతటి నిష్ణాతురాలు కాదు. ఆమె హండీల లాంటి చిన్నకుండలను ఉంచుకొనేది. డబ్బు వచ్చేకొద్దీ వాటిలో వేసి ఉంచేది. చివరికి తీసి లెక్కించేది. ఇంత మొత్తమని స్వామీజీకి తెలిపేది. అది చాలదనిపిస్తే స్వామీజీ మళ్లీ ప్రసంగాలు చేయనారంభించేవారు. ఇలా సాగింది ఆయన జీవితం.
ఈ రోజుల్లో స్వామీజీకి ఖేత్రీ మహారాజు పంపుతూ వచ్చిన పైకం ఆగిపోయింది. అనేక మార్గాలలో స్వామీజీకి మాత్రమే కాక ఆయన కుటుంబానికీ ఖేత్రీ మహారాజు సహాయం అందించారు. స్వామీజీ సొంత ఖర్చుల కోసమూ, ఆయన తల్లి కోసమూ ఖేత్రీ మహారాజు ప్రతి నెలా విడివిడిగా పైకం పంపించారు. ఇప్పుడు హఠాత్తుగా స్వామీజీకి పంపుతూ వచ్చిన పైకం మాత్రం నిలిపివేశారు. బహుశా స్వామీజీకి సంపన్నులైన అమెరికన్ శిష్యులు ఉన్నారు, కనుక తను పంపనక్కరలేదని మహారాజు భావించి ఉండవచ్చు. ఈ కారణంగానే స్వామీజీ అలమెడా వెళ్లాక కూడా ఒకటి రెండుసార్లు శాన్ఫ్రాన్సిస్కో వచ్చి ప్రసంగించ వలసి వచ్చింది.
శాన్ఫ్రాన్సిస్కో నుండి బయలుదేరే ముందు స్వామీజీ అక్కడ కార్యాచరణకు ఒక ‘వేదాంత సొసైటీ’ ని ప్రారంభించారు.