నీకు మానసిక సమస్యలో మరో రకమైన సమస్యలో తలెత్తితే నన్ను పిలువు, ఎక్కడున్నా నేను నీ కంఠస్వరం వింటాను.
– స్వామి వివేకానంద
ఓక్లాండ్ మత సదస్సు — మొసళ్లకు వేయడం: తమాషా — ‘నేను సమ్మె చేస్తాను!’ — కాలానికి అతీతంగా… — ప్రసంగాలు — భారతదేశం గురించి ఒక భేటీ — కాలం నా చేతుల్లో! — జగజ్జనని అనుగ్రహిస్తుంది — ధ్యాన అనుభవం — ధ్యానం గురించిన యథార్థం — నీ కోసం ధ్యానం చేస్తాను — ఆయన సాక్షాత్తూ దేవుడే! — కొన్ని మధుర ఘటనలు — మౌన గురువు — లోకం పాచికలాట — ‘మళ్లీ వస్తాను’
ఓక్లాండ్ మత సదస్సు
లాస్ ఏంజెల్స్ నుంచి 1900 ఫిబ్రవరి 22 వ తేదీన ఉత్తర క్యాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో చేరుకొన్నారు స్వామీజీ. హాన్స్బరో వారం ముందే అక్కడకు వెళ్లి స్వామీజీ ప్రసంగాలకు ఏర్పాట్లు చేయాలని నిశ్చయించారు. కాని ఈ పని తాను సమర్థంగా చేయగలనా అనే సంశయం ఆమెకు లేకపోలేదు; ఆమె సోదరీమణులకు కూడా ఆ సందేహం కలుగకపోలేదు. స్వామీజీకి ఎలాంటి సంకోచమూ లేదు.
ఒక రోజు స్వామీజీ హఠాత్తుగా హాన్స్బరోతో, “నువ్వెప్పుడు శాన్ఫ్రాన్సిస్కో వెళుతున్నావు?” అని అడిగారు. “మీరు వెళ్లమంటే ఇప్పుడే వెళతాను” అంది హాన్స్బరో. అందుకు స్వామీజీ చిన్నగా నవ్వి, “ఒక పని చేయాలని నువ్వు అనుకొంటే దాన్నుండి నిన్ను ఏదీ వైదొలగనివ్వకూడదు. ఇతరులను సలహా అడగవద్దు, నీ మనస్సుతో సంప్రతించి తదనుగుణంగా వ్వవహరించు” అన్నారు. ఆ తరువాత హాన్స్బరో ఎలాంటి సంశయమూ లేకుండా వెంటనే బయలుదేరింది.
ఇంతలో, ఉత్తర క్యాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జరుగనున్న మత సదస్సులో ప్రసంగించమని స్వామీజీని ఆహ్వానించాడు మిల్స్ అనే ఫాదరీ. కనుక స్వయంగా తను వెళ్లి ప్రసంగాలకు ఏర్పాట్లు చేయనక్కరలేదని ఆమె భావించింది. కాని స్వామీజీ, “ఆ ఏర్పాట్లు అలా జరుగనీ, నువ్వు వెళ్లి నీ పథకం ప్రకారం ఏర్పాట్లు చేయి. వారు ఆహ్వానించినప్పటికీ మనం మన కాళ్ల మీద నిలబడడం మంచిది. వారి ఆహ్వానం ఒక ప్రక్క ఉండనివ్వు, అక్కడ నా మొదటి ప్రసంగాన్ని స్వతంత్రంగా చేయగోరుతున్నాను. ఒక అమెరికా దేశీయురాలిని నేను నమ్మడానికిసిద్ధంగా ఉన్నాను. అమెరికా దేశ పురుషుణ్ణి కొన్ని సమయాల్లో నమ్మవచ్చు. కాని అమెరికా దేశ ఫాదరీని ఎన్నడూ నమ్మలేం” అన్నారు. ఈ విధంగా స్వామీజీ ఉత్తర క్యాలిఫోర్నియా కార్యాలు ప్రారంభమైనాయి.
అనుకొన్నట్లే మొదటి ప్రసంగం స్వామీజీ స్వతంత్రంగా చేశారు. ఆ తరువాత మత సదస్సులో పాల్గొన్నారు. స్వామీజీని ఆహ్వానించిన మిల్స్, చికాగో మత మహాసభలో ప్రసంగించిన వక్తలలో ఒకరు. ఆ తరువాత ఆయన మానసిక స్థితిలో గొప్ప మార్పు వచ్చింది. అంతకు క్రితం క్రైస్తవమత మౌఢ్యునిగా ఉన్న ఆయన, పిదప విశాలహృదయునిగా మార్పు చెందాడు. “అనేక దేశాల మత గ్రంథాలు అధ్యయనం చేసిన తరువాత, బైబిల్ ఒక్కటే భగవద్వాణి అని పరిగణించడం మానుకొన్నాను. జీవితపు సమగ్ర వికాసానికి బైబిల్ ఒక ఆటంకంగా ఉంది…. ఈ వ్యక్తి (స్వామీజీ) నా జీవితాన్నే మార్చివేశాడు” అని వ్యక్తం చేసే మేరకు ఆయనలో మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఆయన క్రైస్తవ మత బోధకునిగానే కొనసాగాడు. ఆయన బోధకునిగా ఉంటున్న యూనిటేరియన్ చర్చ్‌లో జరిగిన ఈ సదస్సులో స్వామీజీ వేదాంతం మీద ప్రసంగించారు. ఆ ప్రసంగ కార్యక్రమంలో పాల్గొన్న మిస్ సారా ఫాక్స్ ఇలా వ్రాస్తున్నది:
“కాషాయాంబరాలు, తలపాగా ధరించిన ఆ అద్భుత వ్యక్తి నెమ్మదిగా, అడుగులో అడుగు వేసుకొంటూ వేదిక మీదకు వచ్చారు. దేనికీ భయపడని వ్యక్తిగా, దేనినీ ఖాతరు చేయని వ్యక్తిగా ఆయన కనిపించారు. ఒక మహాతరంగం ప్రాకుతూ పోతున్నట్లు మహాశక్తిమంతుడై ఆయన నడచి వెళ్లారు. ఆయన వీపు కడ్డీలా తిన్నగా ఉంది. ఆయన వేదిక మీదకు వెళ్లి, అక్కడ నిలబడి చాలాసేపు శ్రోతలను పరికించారు. పిదప ప్రసంగించ నారంభించారు… ఆ తరువాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. తిన్నని ప్రశ్నకు తిన్నని జవాబు, పరిహాసపూర్వకమైన ప్రశ్నకు అదే రకంగా జవాబు ఠక్కున ఆయన నుంచి వెలువడ్డాయి.”
మొసళ్లకు వేయడం: తమాషా
“స్వామీ! మీ దేశంలో శిశువులను మొసళ్లకు వేస్తారట కదా, నిజమా?” అని ఒక స్త్రీ అదే పాత ప్రశ్న అడిగింది. స్వామీజీ ఠక్కున, “మేడమ్ మీ కృతజ్ఞతా నివేదన* కార్యక్రమాల్లో శిశువులను వడ్డిస్తారట, నిజమా?” అంటూ బదులు ప్రశ్న వేశారు. స్వామీజీని అనేకమార్లు ఇదే ప్రశ్న అడిగివున్నారు. అందుకు ఆయన విభిన్న స్థలాలలో విభిన్న జవాబులు ఇచ్చివున్నారు. ఆ జవాబులు వినోదభరితమైనవి, ఆహ్లాదంగా నవ్వుకోగలవి. వాటిలో కొన్నింటిని చూద్దాం:
“నిజమే మేడమ్! నేను మాత్రం ఎలాగో తప్పించుకొని వచ్చాను.” – లాస్ ఏంజెల్స్‌లో
“నన్నూ విసిరివేయడానికి నా తల్లి తీసుకువెళ్లింది. నేను లావుగా ఉండడంతో మొసళ్లు నన్ను మ్రింగడానికి నిరాకరించాయి.” – ది ట్రిబ్యూన్‌లో
“అవును, నన్నూ విసిరివేశారు. నేను లావుగా ఉండడం వలన మొసళ్లు మ్రింగలేకపోయాయి. ఇప్పుడు, నేను లావుగా ఉన్నానన్న ఆలోచన తలెత్తినప్పుడల్లా ఆ మొసలి సంఘటనను స్మరించుకొని సాంత్వన చెందుతాను.” – డెట్రాయిట్లో
“నిజమే. నన్నూ విసిరివేశారు. కాని మీ జోనాలాగా నేను బయటికి వచ్చేశాను.” – మిన్నాపోలీస్లో
కొన్ని సమయాల్లో సామాన్యంగా పిల్లలని చెప్పకుండా ప్రత్యేకించి స్త్రీ శిశువులను విసిరివేయడం గురించి ప్రశ్నించారు. అందుకూ స్వామీజీ జవాబులు ప్రశ్నలడిగినవారిని నవ్వించేలా ఉన్నాయి:
“అవును, బహుశాస్త్రీ శిశువులు మృదువుగా ఉంటారు, మొసళ్లు కొరుక్కొని తినడానికి సులభంగా ఉంటుందని కాబోలు స్త్రీ శిశువులను విసిరివేసేవారు.” – డెట్రాయిట్లో
“స్త్రీ శిశువుల నందరినీ విసిరివేయడం వలన ఇప్పుడు భారతదేశంలో స్త్రీలు కరవయ్యారు. బిడ్డలను కనడం కూడా పురుషులే.”
ప్రశ్న లడిగే వ్యక్తితో సహా అందరూ కడుపుబ్బ నవ్వారని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
కొన్ని సమయాల్లో మూర్ఖపు ప్రశ్నలు వేస్తున్నప్పుడు స్వామీజీ ఆ మూర్ఖత్వాన్ని ఎత్తిచూపి వారిని పరిహసించడంతో వారు సిగ్గుపడి తల దించుకోవడం కద్దు. ఒకసారి ఒక స్త్రీ అలా సిగ్గుపడి కుర్చీ వెనుక దాక్కొంది. వెంటనే స్వామీజీ, “అది మీ తప్పు కాదు, మేడమ్! ఇలాంటి ప్రశ్న అడిగివుంటే నేనూ అట్లే దాక్కొని ఉండేవాణ్ణి” అన్నారు.
‘నేను సమ్మె చేస్తాను!’
కాని ఉత్తర క్యాలిఫోర్నియాలో కూడా ప్రసంగాల ద్వారా పెద్దగా డబ్బు లభించలేదు. అవసరమైనంత ప్రచారం లేకపోవడమే అందుకు కారణం. రెండు వారాలు కొన్ని ప్రసంగాలు చేసిన తరువాత కూడా అవసరమై నంత డబ్బు లభించలేదు. “కాని ఉత్తర క్యాలిఫోర్నియాలో ఆర్థికంగా భంగపాటు కలిగింది. లాస్ ఏంజెల్స్‌లో కన్నా ఇక్కడ మరీ అధ్వాన్నంగా ఉంది. ఉపన్యాసం ఉచితమైతే గుంపులు చేరుతారు. డబ్బు ఇవ్వవలసివస్తే పలచబడతారు… ఉపన్యాస వేదిక లెక్కడం దాదాపు అంతరించి నట్లే! బలవంతంగా ఉపన్యసించడం మృత్యువును దగ్గరకు తెచ్చుకోవడమే! నా ప్రయాణ ఖర్చులు లభిస్తే ఇక్కణ్ణుంచి త్వరలో వెళ్లిపోతాను. ఇక్కడ వచ్చే వారం ప్రసంగించి అంతటితో ముగిస్తాను. మఠ విషయం నుండి, డబ్బు విషయం నుండి ఎంత త్వరగా భారవిముక్తుడనైతే అంత మంచిది”* అని స్వామీజీ వ్రాస్తున్నారు.
స్వామీజీకి డబ్బు కొరత తీవ్రంగా ఏర్పడిన కాలఘట్టం ఇది. బేలూర్ మఠానికి డబ్బు అవసరం ఉంది – అది ఎప్పుడూ ఉండనే ఉంది! తమ తల్లికి ఇల్లు కొనుగోలు చేయడానికి స్వామీజీ బేలూర్ మఠం నుంచి రూ. 5000/– అప్పుగా పుచ్చుకొన్నారు. అది తిరిగి చెల్లించాలి. ఇంటి విషయంగా మోసగించిన అత్త మీద వ్యాజ్యెం వేయడానికి డబ్బు కావాలి. ఆయన న్యూయార్క్‌లో 1000 డాలర్లు లెగ్గెట్ వద్ద పొదుపు చేసి ఉంచారు. ఇది ఆయన రాజయోగ పుస్తకం అమ్మకాలలో లభించిన డబ్బు, ఖేత్రీ మహారాజు ఆయనకు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బు కూడా. తల్లి, అమ్మమ్మ, సోదరుల కోసం ఆయన కేటాయించిన పైకం ఇది.
ఇంతకు క్రితమే అనేకచోట్ల ప్రస్తావించినట్లు, తమ తల్లికి ఏదైనా చేయాలనే ఉద్వేగం స్వామీజీ మనస్సులో సదా నెలకొనే ఉంది. “పాపం మా తల్లి విషయంలో నా జీవితమంతా ఆమెకు చిత్రవధ కల్పించాను. ఆమె జీవితమంతా నిర్విరామంగా దుఃఖభాజనమైంది. వీలుంటే ఆమెకు కొంత సుఖం చేకూర్చడమే నా తుది ప్రయత్నం. ఆ విషయమంతా పూర్తిగా ఆలోచించి పెట్టుకొన్నాను. నా జీవితమంతా జగజ్జననిని సేవించాను. ఆ పని ముగిసింది. ఇక ఆమె పని చేయడానికి నిరాకరిస్తాను. తన కార్యకర్తలను ఆమే చూసుకోనివ్వు. నేను సమ్మె చేస్తాను”* అంటూ స్వామీజీ వ్రాస్తున్నారు.
కాని స్వామీజీ ‘సమ్మె’ జరగలేదు. చివరిదాకా కనీసం ఒక్క రోజూ కూడా ఆయన ఈ పని నుండి వైదొలగలేకపోయారు!
కాలానికి అతీతంగా…
కొంతకాలం ఆలెన్ అనే వ్యక్తి స్వామీజీ ప్రసంగాలకు సహాయకునిగా వెళ్లివచ్చేవాడు. ఒక రోజు ప్రసంగానికి వెళుతున్నప్పుడు స్వామీజీ ఆతడితో, “నేడు భారతదేశం గురించి ప్రసంగించనున్నాను. ఇది నాకు చాలా ఇష్టమైన విషయాంశమని మీకు తెలుసు. ఈ అంశం మీద నేను ప్రసంగించ నారంభిస్తే ఎక్కడ, ఎప్పుడు ఆపుతానో నాకు తెలియదు. కనుక నేను చాలాసేపు ప్రసంగిస్తుంటే ఏదో సైగతో తెలియజేయి” అన్నారు. సరిగా 8 గంటలకు ప్రసంగం ప్రారంభమైంది. 10 గంటలు దాటి నప్పుడు స్వామీజీకి సైగ చేయాలనుకొన్నాడు ఆలెన్. కనుక హాలులో చివరి వరుసలో నిలబడి, తమ చేతిగడియారాన్ని విప్పి, స్వామీజీ చూసేలా చేయి పైకెత్తి గడియారాన్ని ఆడించాడు. స్వామీజీ వెంటనే ఆ సైగను గుర్తించారు. కాని ఆపడానికి మారుగా, “అదిగో, గడియారం ఆడించి ఇక ఆపమని జ్ఞాపకం చేస్తున్నారు. నేను ఇప్పుడే కదా ప్రారంభించాను” అంటూ తమ ప్రసంగం కొనసాగించారు. చాలాసేపు ప్రసంగించిన తరువాతే స్వామీజీ ఆపారు.
ప్రసంగాలు
ప్రత్యేకించి ఒక కాలఘట్టంలో స్వామీజీ ఎక్కడెక్కడ బస చేశారు, ఎన్ని ప్రసంగాలు చేశారన్న విషయాలు కచ్చితంగా తెలియరావడం లేదు. కాలం గడిచేకొద్దీ నూతన ఆవిష్కరణలు క్రొత్త సమాచారాన్ని అందిస్తున్నాయి. శాన్ఫ్రాన్సిస్కోలో ఈ రోజుల్లో కనీసం 61 ప్రసంగాలు చేసినట్లు తెలియవస్తోంది. కాని మిస్ ఈడా ఆన్సెల్ నోట్సు తీసుకొన్న 16 ప్రసంగాలు తప్ప మరేవీ మనకు లభించలేదు.
మార్చ్ 18 వ తేదీన స్వామీజీ చేసిన ‘బుద్ధుని సందేశం’ అనే ప్రసంగం విన్న ఎర్నస్ట్ సి. బ్రౌన్ అనే వ్యక్తి అనుభవాన్ని చూద్దాం. ఆతడు మత విషయాల పట్ల ఆసక్తిగల యువకుడు. ఒక రోజు అతడు మిలిట్స్ అనే మత బోధకుని ప్రసంగం వినడానికి వెళ్లాడు. ఆనాటి ప్రసంగంలో ఆ బోధకుడు, “సత్యం కోసం సర్వసంగ పరిత్యాగం గురించి నేను మీతో అనేకసార్లు చెప్పి ఉన్నాను. ‘అలాంటి వ్యక్తి ఒకరు ఉంటే మాకు చూపండి’ అని మీరు నన్ను అడిగారు. ఇదిగో అంతటి నిజమైన సన్న్యాసిని మీకు చూపుతాను. ఆయన ఇటీవల భారతదేశం నుంచి వచ్చివున్నారు. ఆయన పేరు స్వామి వివేకానంద. మీరందరూ వెళ్లి ఆయన ప్రసంగం వినాలని నా అభిలాష. భారతదేశపు మహోన్నత ఆచార్యుల, మహోన్నత ఋషిసత్తములలో ఈయన ఒకరు” అని ప్రకటించాడు. ఆ తరువాత బ్రౌన్* నాటి స్వామీజీ ప్రసంగానికి వచ్చాడు. ఆతడి స్మృతులను పరికిద్దాం:
“మేం వెళ్లినప్పుడు స్వామీజీ ఇంకా రాలేదు. కాసేపయ్యాక, కాషాయాంబర ధారి ఒకరు ప్రక్కనే ఉన్న చిన్న గదిలో నుంచి వేదిక వైపుగా వెళ్లారు. ‘ఎవరీయన? చక్రవర్తియై ఉంటారా?’ అని నన్ను నేనే ప్రశ్నించుకొన్నాను. బహుశా దేవుడు ప్రత్యక్షంగా వచ్చి నడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన నడక – పరి పాలింప జన్మించిన వ్యక్తి నడక అది! ఆయన వేదిక మీద ఆసీనులవగానే శ్రోతల కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. ఈ ధ్వని ఆయనలో ఎలాంటి స్పందనా కలిగించలేదు. ఆయన అంతరంగంలో నిండివున్న పరిపూర్ణ ప్రశాంతతకు ముఖం అద్దం పట్టింది. కాసేపటికల్లా ఆయన లేచి శ్రోతలను పరికిస్తూ తమ చేతులను పైకెత్తారు. ఆ క్షణమే సభలో నిశ్శబ్దం రాజ్యమేలింది. ‘ఇంత మంది శ్రోతలను తమ చేతులు ఊపడం మాత్రాననే ఆకట్టుకొన్న ఈయనెవరు? అనేకులకు నేత అయి వుంటారని తోస్తున్నది.’ తరువాత ఆయన ప్రసంగించ నారంభించారు. ప్రసంగం పూర్తికాగానే అందరూ బారులు తీరి నిలబడి ఆయనతో కరచాలనం చేశారు. అనేకులతో ఆయన అతి క్లుప్తంగా మాట్లాడారు. నాతోనూ ఏదో చెప్పారు.”
ఆయన ప్రసంగం విన్న టామ్ అనే వ్యక్తి పారవశ్యంతో ఇలా వ్యాఖ్యా నించాడు: “నేను ఒక వ్యక్తిని కలుసుకొన్నాను. ఆయన మానవమాత్రుడు కాడు, సాక్షాత్తూ దేవుడు. ఆయన సత్యసంధుడు.”
భారతదేశం గురించి ఒక భేటీ
ఈ ప్రసంగం ముగియగానే క్రానికల్ పత్రిక విలేకరి ఒకామె స్వామీజీతో భేటీ చేశారు. స్వామీజీ ప్రసంగం వ్రాసుకొని, దానిని పత్రికలో ప్రచురించడానికి ఆయన ఛాయాచిత్రం అడిగింది. అనేక పత్రికలలో అచ్చయిన ఒక ఛాయాచిత్రాన్ని ఒకరు ఆమెకు అందించారు. అది అనేక చోట్ల పత్రికలలో ప్రచురితమైనప్పటికీ స్వామీజీకి ఆ ఛాయా చిత్రం అంతగా నచ్చలేదు.
విలేకరి : స్వామీజీ! అది మీలా లేదు.
స్వామీజీ (నవ్వుతూ) : నిజమే. ఒథెల్లో నాటకంలోని పాత్రయైన మూర్లా నేను ఎవరినో చంపబోతున్నట్లున్నది.
అలాంటి తీరుతెన్నులు ఆ ఛాయాచిత్రంలో కనిపించడం లేదు. కనుక అందరూ నవ్వారు. విలేకరి ఆ ఛాయాచిత్రాన్ని ఉపయోగించలేదు. భేటీ కొనసాగింది.
విలేకరి : చికాగో సర్వమత మహాసభానంతరం మీరు మీ మాతృదేశానికి వెళ్లినప్పుడు మహారాజులు సైతం మీ పాదాలకు మోకరిల్లి నమస్కరించారు. పలువురు మహారాజులు మీరు ఆసీనులైన బండిని వీథుల గుండా లాగుకొని వెళ్లారని పత్రికలలో వెలువడిన వార్తలు నిజమా? మేం మా మత నాయకులను ఇలాంటి వేడుకలతో ఊరేగించం.
స్వామీజీ : ఆ విషయాల గురించి ప్రస్తావించడం సబబు కాదు. ఒక్కటి మాత్రం చెప్పవచ్చు. భారతదేశంలో మతమే పాలిస్తుంది, డబ్బు కాదు.
విలేకరి : కులం సంగతి?
స్వామీజీ (నవ్వుతూ) : మీ నాలుగు వందల* సంగతేమిటి? భారతదేశం లోని వర్ణ వ్యవస్థను పాశ్చాత్యులు అవగతం చేసుకోలేరు. అది ఎలాంటి లోటు పాట్లూ లేని వ్యవస్థ అని మేం వచించలేదు. మీలోని వర్గీకరణ పద్ధతులను మేం చూడకపోలేదు. అది ఏ రీతిలోనూ మా వర్ణ వ్యవస్థ కన్నా శ్రేష్ఠమైనదిగా కనిపించ లేదు. ఒక శాశ్వతమైన కుల వ్యవస్థను ఆచరణలో చూపి విజయం సాధించిన ఏకైక దేశం భారతదేశం. ఈ స్థితిలో మీ మూఢనమ్మకాలనూ, శాఖలనూ మే మెందుకు పాటించాలి?
విలేకరి : మీరు అన్ని విధాలుగా స్వతంత్రాన్ని గురించి బోధిస్తున్నారు. మీ దేశంలో ‘ఇది తినకూడదు’, ‘అది తినకూడదు’, ‘ఇతణ్ణి ఈమె వివాహం చేసుకో కూడదు’ లాంటి కట్టుబాట్లు కోకొల్లలు. మీరు బోధిస్తున్న స్వతంత్రం అక్కడ ఆచరణలో సాధ్యమేనా?
స్వామీజీ : సాధ్యం కాదు. కాని కుల విధుల అవసరాన్ని భారతదేశం అధిగమించి పోనంత వరకు అక్కడ కులాలు ఉండక తప్పవు.
విలేకరి : విదేశస్థుడో, నాస్తికుడో వండిన ఆహారాన్ని మీరు తినకూడదనే విషయం నిజమా?
స్వామీజీ : భారతదేశంలో వంటచేసే వ్యక్తిని పనిమనిషిగా పరిగణించరు. ఆతడు అదే కులానికి లేదా అంతకన్న ఎక్కువ కులానికి చెందిన వ్యక్తిగా ఉండాలి. ఒక వ్యక్తి స్పృశించే ఆహారం ఆతడి వ్యక్తిత్వాన్ని అభివ్యక్తం చేస్తుంది. మనిషి తనను అభివ్యక్తం చేసుకోవడానికి దేహం ముఖ్యం. ఆ దేహం ఆహారంతో రూపొందుతుంది. కనుక ఆహారం విషయంలో శ్రద్ధ అవసరమని నొక్కివక్కాణి స్తారు. కొన్ని ఆహార పదార్థాలు ఆధ్యాత్మిక పురోగతికి సానుకూలంగానూ, కొన్ని ప్రతికూలంగానూ ఉంటాయి. ఆహారం కోసం మేము జీవరాశులను వధించం, అటువంటి ఆహారం స్థూలదేహాన్ని రూపొందిస్తుంది, ఆధ్యాత్మికతకు అనువైన దేహాన్ని తయారుచేయదు. ప్రాణం ఈ స్థూలదేహాన్ని వదలిపోతున్నప్పుడు ఆధ్యాత్మిక దేహాన్నీ తోడుగా తీసుకొంటుంది. కనుక ఆధ్యాత్మికతకు సానుకూలమైన దేహం ప్రధానం. అంతేకాక ఆహారం కోసం జీవాలను వధించేటప్పుడు వధించే వాణ్ణి పాపం కూడా చుట్టుకొంటుంది.
“అమ్మో!” అంటూ తనకు తెలియకుండానే విలేకరి చిన్నగా కేకపెట్టింది. ఆహార విషయంలో ఇన్ని గొడవలుండడం ఆమెకు క్రొత్త అయివుంటుంది. జీవరాశులన్నీ మనిషి కోసమే సృష్టించబడ్డాయనే భావన మాత్రమే ఎరిగివున్న ఆమె స్వామీజీ భావన వినగానే దిమ్మెరబోయింది. వాటికీ ప్రాణం ఉందని స్వామీజీ చెప్పినప్పుడు, “మేకపిల్లలు, కోడిపిల్లలు, పశువులు ప్రేతాత్మలుగా తిరుగాడుతున్న ఊహ నాలో తలెత్తింది” అంటూ తమాషాగా ఆ విలేకరి వ్యాఖ్యానించింది. స్వామీజీ కొనసాగించారు:
“ఈ జగత్తు అంతా సమానత్వంతో కూడుకొన్నది. అతిసాధారణమైన ప్రాణి నుండి అత్యున్నత యోగి దాకా అందరూ సమానమే. అంతా సమానమే. మనమందరమూ సమానులమే. మీరూ, నేనూ అందరూ సమానులే.”
ఇది చెప్పి ఈ అర్థం వచ్చే సంస్కృత శ్లోకాన్ని మృదుమధురంగా స్వామీజీ ఉచ్చరించారు. అదొక ఆహ్లాదకరమైన ఉదయం. ఆయన ఆ గదిలో పచార్లు చేస్తూ జవాబులిస్తున్నారు. మధ్యమధ్యలో పొగ త్రాగారు.
“మీరు అన్ని కోర్కెలనూ అణచుకోలేకపోతున్నారే!” అంటూ తెగించి ఆవిలేకరి ప్రశ్నించింది. స్వామీజీ విశాలమైన ముఖారవిందాన చిరునవ్వు వికసించింది. ప్రశ్నించిన వ్యక్తికన్నా తెగించి, “లేదు, మేడమ్. నన్ను చూస్తే జితేంద్రియునిలా కనిపిస్తున్నానా ఏమిటి!” అని ఆయన జవాబిచ్చారు. ఆయన ముఖాన వికసించిన చిరునవ్వు మాయం కాలేదు.
విలేకరి : హిందూమత నాయకులు వివాహం చేసుకొంటారా?
స్వామీజీ : వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఒక స్త్రీకి బానిసగా ఉండగోరేవాడు వివాహం చేసుకొంటాడు. బానిసగా ఉండడం ఇష్టపడని వాడు వివాహం చేసుకోడు.
విలేకరి : అలా అందరూ వివాహం చేసుకోకపోతే జనసంఖ్య ఏమౌతుంది?
స్వామీజీ కళ్లు మెరిశాయి. ఆయన ఇలా అన్నారు:
“జన్మించడంలో మీకు అంత ఆనందం ఉందా? ఆకలి, వ్యాధి, అజ్ఞానం నిండిన ఈ ప్రపంచంతో పోరాడడం తప్ప ఉన్నతమైన దేదీ మీకు తెలియలేదా? జన్మించకుండా ఉండడంలో (మరణంతో) మీ ప్రత్యేకతను మీరు కోల్పోతున్నట్లు అనిపించవచ్చు. కాని అందుకోసం భయపడకండి. ఎందుకంటే దాన్లో ఒక లాభం ఉంది – ఇప్పటి ఈ దుఃఖమయమైన ఆకలి, వ్యాధి, అజ్ఞానం నిండివున్న ఈ స్థితి తొలగిపోతుంది. కనుక మనం లేకుండా పోవడం మంచిదే కదా!
“శిశువు రోదిస్తూనే ఈ లోకంలోకి వస్తాడు. వస్తున్న ఆతడు విలపించవచ్చు! కాని లోకం వదలి వెళ్లిపోవడానికి మనం ఎందుకు విలపించాలి? ఒక వ్యక్తి మరణించడమన్నది ప్రాచ్యదేశాలలో, పాశ్చాత్యదేశాలలో వ్యక్తం చేసే విధానాన్ని మీరు గమనించారా? ‘అతడు దేహాన్ని త్యజించాడు” అని మేం చెబుతాం, అతడు ‘ప్రాణం వదలిపెట్టాడు’ అని మీరు చెబుతారు. అదెలా సాధ్యం? మరణించిన దేహం ప్రాణం బయటకు పోవడానికి అనుమతించిందా ఏమిటి? ఎంతటి విచిత్రమైన భావన!”
విలేకరి : కాని స్వామీ! మొత్తం మీద చూస్తే వృథాగా జీవించడం కన్నా చావడమే మేలని మీరు చెప్పేటట్లుంది?
స్వామీజీ : స్వాహా! స్వాహా! మీరు అలాగే అర్థం చేసుకోవచ్చు.
ఇలా ఇంకా ఒకటి రెండు ప్రశ్నలు అడిగిన తరువాత “రైలు సమయ మయింది. నేను బయలుదేరాలి” అంటూ ఆ ఆడ విలేకరి బయలుదేరబోయింది. అందుకు స్వామీజీ, “అమెరికా వారంటే ఇంతే. ఈ బస్సు కోసం లేదా ఆ రైలు కోసం ఎప్పుడూ పరుగెత్తుతూనే ఉంటారు. ఇది వదలిపెడితే తరువాత రైలు లేదా ఏమిటి?” అని అడిగారు. “సమయం గురించి భారతీయులకూ, పాశ్చాత్యులకూ ఉన్న భావనలోని తారతమ్యం గూర్చి నేను స్వామికి విశదీకరించడానికి ప్రయత్నించలేదు. భారతదేశంలో అన్నింటికీ, ‘సరిపడేటంత సమయం’ ఉన్నట్లు తోస్తున్నది – శ్వాసించ, ఆలోచింప, జీవించడాని కన్నింటికీ సరిపడేటంత సమయం ఉంది. కాని ఇక్కడ అలా కాదు. మేం (పాశ్చాత్యులం) కాల ప్రాధాన్యంతో జీవిస్తున్నాం. వారు (భారతీయులు) కాలానికి అతీతంగా జీవిస్తున్నారు” అంటూ ఆ విలేకరి తన భేటీని ముగించింది.
కాలం నా చేతుల్లో!
ఆ విలేకరి వచించింది స్వామీజీకి సంబంధించినంత వరకు ముమ్మాటికీ నిజం. ఆయన ఏదీ తొందరపడి చేయరు. ఎప్పుడూ ఆయన పనులలో నిదానం కనిపిస్తుంది. రైలు, బండి అందుకోవడానికి ఎవరైనా పరు గెత్తడం చూస్తే ఆయనకు విచిత్రంగా కనిపిస్తుంది; “ఎందుకు, దీని తరువాత బండి అందదా?” అని ఆయన అడగడం కద్దు. ప్రసంగాలనో, తరగతులనో సకాలంలో ప్రారంభించడాన్ని గురించి ఆయన కలత చెందరు. అదే విధంగా ఎప్పుడు పూర్తిచేస్తారో కూడా చెప్పలేం. తీసుకొన్న విషయాంశం పూర్తిచేసేదాకా ఆయన ప్రసంగిస్తూనే ఉంటారు; అనుకొన్న సమయం కన్నా రెండింతల సమయం పట్టినా ఆయన లెక్కచేయరు. తరగతులకు వెళ్లడానికి ఇంకా కొన్ని నిమిషాలుందన్నంత వరకూ గదిలోనే తీరికగా కూర్చుని ఉంటారు. మామూలు దుస్తుల్లో, కుర్చీలో బాసికపట్టు (పద్మాసనం) వేసుకొని మాట్లాడుతుంటారు, ప్రశ్నలకు జవాబులిస్తారు, హాస్యాలాడతారు, పొగత్రాగుతారు. బయలుదేరడానికి ఒకటి రెండు నిమిషాలు ఉందనగా లేచి తమ గదిలోకి వెళతారు. కాషాయాంబరాలు ధరిస్తారు, గంభీర వైఖరిలో తరగతిలోకి వెళతారు. ఆ గాంభీర్యం ఎన్నడూ ఆయన నుండి వైదొలగింది లేదు.
ప్రసంగాలకు సామాన్యంగా స్వామీజీ కాస్త ఆలస్యంగానే వెళ్లేవారు. ఒక రోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్వామీజీ శ్రీకృష్ణుని గురించి ప్రసంగించవలసి ఉంది. ఆయన వెళ్లలేదు. స్వామీజీ ప్రసంగాలకు సమావేశకర్తయైన ఆలెన్ పలుమార్లు వీథి మూలకు వెళ్లి స్వామీజీ రాక కోసం చూశాడు. ఐదవసారి వెళ్లి చూసినప్పుడు వీథి చివరన స్వామీజీ నడిచిరావడం కనిపించింది. అప్పుడు సమయం మధ్యాహ్నం మూడున్నర అయింది. అలవాటు ప్రకారం నెమ్మదిగా, గంభీరంగా ఆయన వస్తున్నారు. ఆపైన ఆలెన్ ఉండబట్టలేకపోయాడు. తిన్నగా స్వామీజీ వద్దకు వెళ్లి ఆయనతో కలిసి నడవసాగాడు. స్వామీజీ నడక వేగం పెరగలేదు. చివరికి ఆలెన్, “స్వామీజీ! అందరూ వేచివున్నారు. ఇప్పటికే ఆలస్యమై పోయింది” అని చెప్పాడు. అందుకు స్వామీజీ, “ఆలెన్! నే నెప్పుడూ ఆలస్యం చేయను. లోకంలోని సమయమంతా నాకు ఉంది. కాలమే నా చేతిలో ఉంది” అన్నారు. “శ్రోతలు దీనిని అవగతం చేసుకోలేరే!” అన్నాడు ఆలెన్. కాని స్వామీజీ ఏ మార్పూ లేకుండా అట్లే నెమ్మదిగా నడుస్తున్నారు. విషయం అక్కడితో ఆగిపో లేదు.
దారిలో చెప్పులు పాలిష్ చేసే దుకాణం ఒకటి ఉంది. పాలిష్ చేసే వ్యక్తి పనిలేకుండా ఉండడం చూసి స్వామీజీ తిన్నగా దుకాణంలోకి వెళ్లారు. తమ చెప్పులను పాలిష్ చేయమన్నారు. తొందరను తెలుపడానికి ఏవేవో సైగలు చేశాడు ఆలెన్. కాని స్వామీజీ వేటినీ పట్టించుకోలేదు. చివరికి ఏదో రకంగా వేదిక వద్దకు వచ్చారు. ‘కాలం నా చేతిలో’ అనే స్వామీజీ వచనాన్ని గ్రహించే ఆస్కారం ఆలెన్‌కు అప్పుడే లభించింది. స్వామీజీ వేదిక మీద నిలబడ్డారు, ఆలెన్ ప్రక్కకు వెళ్లి నిలబడే స్వామీజీని పరిచయం చేయనారంభించాడు. పిదప జరిగింది ఇలా చెబుతున్నాడు:
“స్వామీజీని పరిచయం చేస్తూ ఆయన వైపు చూశాను. క్షణంలో ఒక అద్భుత అనుభూతిని చవిచూశాను. హఠాత్తుగా స్వామీజీ అనంత స్వరూపుని గానూ, నేను పిగ్మీ (ఆఫ్రికన్ మరుగుజ్జు) గానూ అనిపించింది. ఈయనను నేను పరిచయం చేయడమా? ఆ తరువాత నేను ఎన్నడూ ఆయన ప్రక్కన నిలబడి పరిచయం చేస్తే ఒట్టు! వేదిక దిగువ నిలబడే పరిచయం చేశాను.”
జగజ్జనని అనుగ్రహిస్తుంది
నాడు ఆయన ప్రసంగాంశం ‘శ్రీకృష్ణుడు’. కాని ఆయన ప్రసంగించింది ‘మహమ్మద్ ప్రవక్త’ మీద. దీనిని వేదిక మీదనే ఆయన నిర్ణయించారు. కాని “మహమ్మద్ ప్రవక్త గురించి ఆయన వ్యక్తం చేసిన భావనల లోనో, చారిత్రక గణనలోనో, తక్కిన సమాచారాలలోనో చిన్న పొరపాటు కూడా దొర్లలేదు” అంటూ ఆలెన్ విస్తుబోయాడు. ప్రసంగం ముగిసి స్వామీజీ రాగానే ఆలెన్ ఆయనతో, “స్వామీజీ! మీ జ్ఞాపకశక్తి అద్భుతం” అని వ్యాఖ్యానించాడు. అందుకు స్వామీజీ, “లేదు, ఆలెన్! నా దేశాన్ని తీసుకొంటే అక్కడున్న అనేకులతో పోల్చినప్పుడు నా జ్ఞాపకశక్తి శూన్యం. మెకాలే రచించిన ‘ఇంగ్లండ్ చరిత్ర’ మీకు తెలుసు కదా! కంఠస్థం చేసి ఉన్నదున్నట్లు పునశ్చరణ చేయడానికి నేను మూడుసార్లు దానిని చదవవలసివచ్చింది. ఏ పుస్తకమైనా ఒక్కసారి చదివి అట్లే పునశ్చరణ చేయగల ప్రతిభ నా తల్లికి ఉంది” అని ఏదో మామూలు విషయం అన్నట్లుగా చెప్పారు. “ఆశ్చర్యంతోను, విస్మ యంతోను నేను అవాక్కయ్యాను. అట్లే మౌనంగా నిలబడిపోయాను. ‘దేవుడా! స్వామీజీ ప్రస్తావించిన చరిత్ర గ్రంథాన్ని కంఠస్థం చేయడానికి మేం ఎన్నిసార్లు చదవవలసి ఉంటుంది!’ అనే ఆలోచన నాలో మెదలింది” అంటూ ఆలెన్ వ్రాస్తున్నాడు.
తాము చదివిన పుస్తకాలను అక్షరం పొల్లుపోకుండా అప్పజెప్పడం ఒక వైపు ఉంటే, ఆయన చదివిన గ్రంథాలు కోకొల్లలు; ఏ అంశం మీదైనా, ఏ సమయంలోనైనా ప్రసంగించడానికి తయారుగా ఉన్న మేరకు అసంఖ్యాక గ్రంథాలను చదివిన వ్యక్తి ఆయన. ఒకసారి ఎగ్జామినర్ అనే పత్రికకు ఆయన భేటీ ఇచ్చినప్పుడు ప్రాచీన రష్యాదేశ చరిత్ర, దేశద్రిమ్మర జాతియైన తార్తారులు, స్పెయిన్‌లో మూర్ వంశీకుల పాలన లాంటి విషయాలు ఎడతెగక మాట్లాడుతూనే ఉన్నారు. ఎక్కడా ఎలాంటి సంకోచమూ, ప్రతిబంధకమూ లేకుండా తేదీలతో సహా కచ్చితంగా చెప్పారు.
కాని స్వామీజీ చెప్పిన వాటిలో తెలివి ద్వారా ఆయన గడించిన జ్ఞానకోశా గారం మాత్రమే కాక దానికి అతీతమైనది ఏదో ఉంది. ఆ ‘ఏదో’, ఊహాతీతమైన ఏదో భూముల నుండి ఆయనకు వస్తున్నదని మాత్రం అర్థమవుతున్నది. తెలివి ఎక్కణ్ణుండి ఉద్భవిస్తుందో, తెలివికి ఆలవాలం ఏదో ఆ స్థలపు ద్వారాలు తెరచివున్నట్లు తోస్తున్నది. ఆ స్థలం స్వామీజీకి సంబంధించినంత వరకు జగజ్జనని పాదపద్మాలు. “నేను జగజ్జననిని విశ్వసిస్తున్నాను. అవిదితమైన ఒక అంశం మీద ప్రసంగించాలంటే నేను ఆమె ఉన్నదనే ధైర్యంతోనే వేదిక నెక్కుతాను. ఎందుకంటే నా నాలుక మీద మాటలను ఆమె నాట్యం చేయిస్తుందని నాకు తెలుసు” అనేవారాయన.
ధ్యాన అనుభవం
స్వామీజీ బహిరంగ ప్రసంగాలను విన్న అనేకులు ఆయన వద్ద విడిగా నేర్చు కోవడానికీ, ఉపదేశాలు పొందడానికీ అభిలషించారు. అందుకోసం తరగతి ప్రసంగాలను స్వామీజీ ప్రారంభించారు. ఇవి సాధారణంగా ఉదయం 10 లేదా 10:30 గంటల సమయంలో మొదల య్యేవి. గంట నుంచి రెండున్నర గంటల సేపు ఈ తరగతులు జరిగేవి. 30 లేదా 40 మంది ఈ తరగతులకు హాజరయ్యేవారు. ఈ తరగతులు స్వామీజీ బసచేసిన ఇంట్లోనే జరిగేవి. అందరికీ చాలినన్ని కుర్చీలు లాంటి సౌకర్యాలు ఉండేవి కావు. అయినప్పటికీ మూడవ అంతస్తులోని ఆ ఇంటి అన్ని మెట్లెక్కి, కొన్ని సమయాల్లో మేడ మెట్ల మీద కూడా కూర్చుని ఆయన ప్రసంగాలను ప్రజలు వినడం కద్దు.
సాధారణంగా స్వామీజీ మంచం మీద లేదా సోఫా మీద పద్మాసనం వేసు కొని ప్రసంగించేవారు. ఆయనను చూసి అనేకులు అదే విధంగా కూర్చోడానికి ప్రయత్నించేవారు. వారి ప్రయత్నాలనూ, పరాజయాలనూ చూసి నవ్వుతూ స్వామీజీ, “మీ కాళ్లు ఈ ఆసనం వేసుకొని కూర్చోడానికి శిక్షణ పొందలేదు. భారతదేశంలో బాల్యం నుంచే మాకు ఇందులో శిక్షణ ఇస్తారు” అనేవారు. పిదప, నేల మీద కూర్చోలేని కొందరిని పిలిచి తమ ప్రక్కన కూర్చోబెట్టుకొనేవారు. “ఏ రీతిలో కూర్చున్నామో అనుకొని కలత చెందకండి. సౌకర్యంగా కూర్చోవాలి. దేహం తిన్నగా ఉండాలి – అంతే. అదే సమయంలో దేహం ప్రకాశమానంగా విరాజిల్లు తున్నట్లు భావించుకోండి” అని చెప్పిన తరువాత మాత్రమే ప్రసంగం ప్రారంభించే వారు. 15 నుంచి 20 నిమిషాలు ప్రారంభంలోనో చివరలోనో అందరినీ ధ్యానం చేయమని చెప్పి, తామూ ధ్యానంలో మగ్నులయ్యేవారు.
ధ్యానారంభంలో ఎంతో గంభీరంగా బిగ్గరగా కొన్ని సంస్కృత శ్లోకాలను ఉచ్చరించేవారు. కూర్చున్న వ్యక్తి నరనరాల్లో ఆ శబ్దం పులకింతను కలిగిస్తుంది. “ఎందుకంటే సరైన ఆరోహణ అవరోహణలతో ఉచ్చరించబడే సంస్కృత శ్లోకాలు నరనరాలలో పులకింతను కలిగించే శక్తి గలవి కనుక” అనేవారు స్వామీజీ. ఆ తరువాత జరిగేది స్వామీజీ సమక్షంలో ఒక అద్భుత అనుభవం.
ఈ అనుభవం, బహుశా ఒకరిద్దరికి తప్ప, అందరికీ లభించింది. ఆయన సమక్షంలో కూర్చున్న వారు ఆ ధ్యాన అనుభవాన్ని పొందకుండా ఉండడం సాధ్యమా? “ఆ సమయంలో నేను నా మనస్సును ఒక ఆనందస్థితికి తీసుకుపోతాను. ఆ తరువాత అదే స్థితిని మీ మనస్సులలోనూ కల్పించడానికి ప్రయత్నిస్తాను” అని ఆ ధ్యాన తరగతుల గురించి స్వామీజీ చెప్పడం కద్దు.
స్వామీజీ ఈ రోజుల్లో రాజయోగం గురించే ఎక్కువగా తరగతి ప్రసంగాలు చేశారు. దాని ఆచరణాత్మక విభాగం అంత సులభం కాదని విద్యార్థులూ గ్రహించారు. అయినప్పటికీ ‘ధ్యానసిద్ధు’ లైన స్వామీజీ సమక్షంలో కూర్చోవడమూ, ఆ ధ్యాన అనుభవాన్ని పొందడమూ గొప్ప అదృష్టం కాదా!
ధ్యానం గురించిన యథార్థం
అయినప్పటికీ ధ్యానం ఒక మార్గం మాత్రమేనని స్వామీజీ విద్యార్థులతో నొక్కివక్కాణించేవారు. ధ్యాన అనుభవం పొందడం లక్ష్యం కాదు; తద్ద్వారా భగవంతుణ్ణి అభిలషించడమే లక్ష్యమని స్పష్టం చేసేవారు. ఆయన ఇలా అనేవారు: “మనం ఎందుకోసం ధ్యానం అనుష్ఠిస్తున్నాం? భగవంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి. భగవంతుడనే లక్ష్యానికి మనలను తీసుకువెళ్లడానికి ఒక మార్గం మాత్రమే రాజయోగం. రాజయోగ ఋషియైన పతంజలి మహర్షి ఈ భావనను తెలియ జెప్పడంలోని ఒక్క అవకాశాన్ని కూడా జారవిడువలేదు. మీరు ఇప్పుడు యువ ప్రాయులు. ఇదే తరుణం. వృద్ధాప్యంలో భగవంతుణ్ణి గురించి ఆలోచిద్దామనుకో కండి. వృద్ధాప్యంలో ఆయనను గురించి ఆలోచించలేం. భగవంతుణ్ణి గురించి ఆలోచించడానికి అవసరమైన శక్తి యువప్రాయంలోనే కలుగుతుంది.”
ఎవరికైనా ఈ భావనలను అర్థం చేసుకోవడంలోనో, శిక్షణలోనో కష్టం కలిగితే స్వామీజీ కరుణామూర్తియై వారికి మార్గదర్శకత్వం వహిస్తారు; “కాస్త ఓపిక పట్టండి. ఈ మార్గంలో విజయం పొందాలంటే ఎంతో సహనం ఆవశ్యకం” అనేవారు ఇంకా వారిలో సందేహం తలెత్తితే, “నేను మీతోనే ఉన్నాను. నా మీద కాస్త నమ్మకం ఉంచండి” అంటూ అభయమిచ్చేవారు. వారికే ధ్యాన అనుభవం అందిస్తారు.
నీ కోసం ధ్యానం చేస్తాను
స్వామీజీ ప్రక్కన కూర్చున్న వారు మాత్రమే ఆ అనుభవాన్ని పొందారా? అంటే లేదు. ఆయన యువప్రాయంలోనే ధ్యానసిద్ధుడు. తమ సంకల్ప మాత్రాననే ధ్యాన అనుభవాన్ని చేకూర్చగలరు. దానిని గురించి హాన్స్బరో జీవిత సంఘటన ఒకదాన్ని పరికిద్దాం.
స్వామీజీకి సూప్ తయారుచేసి ఇచ్చి, 10.30 తరగతిలో హాన్స్బరో పాల్గొనేది. ఈ సూప్ సిద్ధం చేయడానికి 3, 4 గంటలు పట్టేది. ఒక రోజు ఆమె అనుకొన్న సమయానికి పనులు పూర్తిచేసుకోలేకపోయింది. అప్పుడు తరగతికి బయలుదేరిన స్వామీజీ ఆమెతో, “ఏమిటి, నువ్వు ధ్యాన తరగతికి రావడం లేదా?” అని అడిగారు. తాను తరగతికి రాలేని కారణాన్ని తెలిపింది హాన్స్బరో. వెంటనే స్వామీజీ, “ఫరవాలేదు. నీ కోసం నేను ధ్యానం చేస్తాను” అంటూ వెళ్లారు. ఆశ్చర్యం! స్వామీజీ తరగతి ముగిసే దాకా హాన్స్బరో ధ్యాన అనుభవంలోనే లయించింది. స్వామీజీ తన కోసం ధ్యానం చేస్తున్నారని ఆమె అర్థం చేసుకొంది. ఇది చాలాకాలం తరువాత జ్ఞాపకం వచ్చిన హాన్స్బరో, “మరో సంగతి తెలుసా? నాడు మాత్రమే కాదు, ఇప్పటికీ ఆయన నా కోసం ధ్యానం చేస్తున్నారని సదా నేను గ్రహిస్తున్నాను” అంటూ ప్రశాంతంగా చెప్పింది.
మరొక రోజు ఏదో కారణంగా హాన్స్బరో నిరుత్సాహంతో అలసిపోయి కనిపించింది. అది చూసి స్వామీజీ, “రా, కూర్చో! మనం ధ్యానం చేద్దాం” అన్నారు. “ఆహా, స్వామీజీ! నేను ధ్యానం చేసిందే లేదు” అంది హాన్స్బరో. “అయితే ఏమిటి! వచ్చి నా ప్రక్కన కూర్చో, నేను ధ్యానిస్తాను” అన్నారు స్వామీజీ. హాన్స్బరో వెళ్లి స్వామీజీ ప్రక్కన కూర్చుని కళ్లు మూసుకొన్నది. “ఒక్క క్షణమే. నేను ఎక్కడో తేలుతూన్న భావన తలెత్తింది. వెంటనే కళ్లు తెరిచి స్వామీజీని చూశాను. ఒక శిలావిగ్రహంలా ఆయన కూర్చుని ఉన్నారు. 15–20 నిమిషాల తరువాత ఆయన ధ్యానం ముగించి, లేచారు.”
స్వామీజీ ధ్యానమగ్నులై కూర్చుని ఉండగా తిలకించడమే ఒక అద్భుత అనుభవం కదా! తాము చూసిన దృశ్యాన్ని రోడీమల్ అనే వ్యక్తి ఇలా వ్రాస్తున్నారు: “కాషాయాంబరం ధరించి, పద్మాసనస్థుడై, ఒకదాని మీద మరొకటిగా కర కమలాలను చేర్చుకొని ఒడిలో ఉంచుకొని, అర్ధనిమీలిత నేత్రుడై స్వామీజీ ధ్యానమగ్నులై కూర్చుని ఉండడం, రాగి విగ్రహంలా కానవస్తుంది. ఆహా! ఆయన ఒక యోగి అనడంలో సంశయం లేదు. బాహ్య జగత్తు స్ఫురణ ఏదీ లేని ఉన్నత లోకాల స్ఫురణ మాత్రమే ఉన్న ఒక మహోన్నత ఆదర్శ పురుషుడు. ఆయనను చూసిన ఏ వ్యక్తియైనా ఆయనకు మర్యాద ప్రకటించకుండా, ఆయనను అభిల షించకుండా, ఆయన పట్ల భక్తి ప్రదర్శించకుండా ఉండడం అసాధ్యం.”
ఆయన సాక్షాత్తూ దేవుడే!
మీడ్ సోదరీమణులలో ఒకరైన మిసెస్ కెరీ వైకాఫ్, “ఆయన సాక్షాత్తూ దేవుడే!” అని వ్యాఖ్యానించింది. ఆమెకు అంతటి భావనను కలిగించిన సంఘటన గురించి ఆమే ఇలా చెబుతున్నది: “ఒక రోజు మేడ మీద నుంచి మెట్ల గుండా నేను క్రిందికి దిగి వస్తున్నాను. నాకు ముందు స్వామీజీ దిగుతున్నారు. హఠాత్తుగా నా కాలు జారింది. పడబోయిన నేను అట్లే స్వామీజీ భుజం పుచ్చుకొని సంబాళించుకొన్నాను. కాని స్వామీజీని తాకగానే నాలో ‘నువ్వు భగవంతుణ్ణి తాకావు’ అనే ఉద్వేగం తలెత్తింది. నా మనస్సు అత్యున్నత ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడింది. ఆ అత్యున్నత ఆధ్యాత్మిక పరమానంద స్థితిలో కొన్ని రోజులు తేలిపోయాను. ఆయన సాక్షాత్తూ దేవుడే!”
తమ సోదరి ఈ అనుభవం గురించి మిస్ హెలన్ కాలాంతరంలో ప్రస్తావించినప్పుడు, “ఆమె కంఠస్వరంలో ధ్వనించిన మర్యాదా, వ్యక్తమైన భక్తీ, ఉద్వేగమూ, ప్రేమా అది విన్నవారికి సైతం ‘స్వామీజీ సాక్షాత్తూ దేవుడే’ అనే అదే ఉద్వేగాన్ని కలిగించింది” అని వ్యాఖ్యానించింది.*
కొన్ని మధుర ఘటనలు
ఈ తరగతి ప్రసంగాలలోని స్వామీజీ ఉద్దేశం – విద్యార్థుల మనస్సును జ్యోతిర్మార్గంలో త్రిప్పటమే; సౌకర్యమయమైన ఒక మార్గాన్ని
మధురమైన భాషలో తెలిపి వారిని అంధకార మార్గంలో నెట్టడం కాదు. కనుక ఆయన అవసరమైన చోట్ల విద్యార్థులను చీవాట్లు పెట్టడమూ, మనస్సుకు తగిలేలా పరుషంగా మాట్లాడడమూ కద్దు.
ఒకసారి ఒక స్త్రీ, “స్వామీజీ! అందరూ సన్న్యాసం పుచ్చుకొంటే లోకం గతి ఏమిటి?” అని అలవాటైన ప్రశ్న వేసింది. చటుక్కున వచ్చింది స్వామీజీ జవాబు: “మేడమ్! అసత్యాన్ని పెదవుల మీద ఉంచుకొని నా వద్దకు రావడ మెందుకు? మీ స్వీయ సుఖభోగాలు తప్ప ఈ లోకంలో మరి దేనిని గురించీ మీరు కలత చెందిందే లేదు!”
ఒక రోజు స్వామీజీ తరగతి ఆయన కుశాగ్రబుద్ధినీ, జ్ఞానసూక్ష్మతనూ వ్యక్తం చేసేటట్లుగా రాణించింది. మాట్లాడుతున్న ఆయన హఠాత్తుగా ఆపివేసి, “తమ పేరును కూడా వ్రాయలేని ఒక వ్యక్తి శిష్యుణ్ణి నేను. కాని ఆయన పాదరక్షలు విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాను. నా ఈ జ్ఞానాన్ని ఏకమొత్తంగా గంగలో పారవేయగలిగితే ఎంత బాగుంటుంది!” అన్నారు. అప్పుడు ఒక స్త్రీ లేచి నిలబడి, “కాని స్వామీజీ! మీ ఆ జ్ఞానాన్నే కదా నేను అమితంగా అభిలషిస్తున్నాను!” అంది. “అదెందుకో తెలుసా మేడమ్? నువ్వొక మూర్ఖురాలివి నా మాదిరి!” అని స్వామీజీ జవాబిచ్చారు.
“స్వామీజీ! మీరు భగవంతుణ్ణి దర్శించారా?” అని రోడిమల్ ఒకసారి స్వామీజీని ప్రశ్నించాడు. స్వామీజీ నవ్వుతూ, “నన్ను చూస్తే అలా కనిపిస్తున్నానా? నా లాంటి లావుపాటి వ్యక్తి భగవంతుణ్ణి దర్శించి ఉంటాడని అనుకొంటున్నారా?” అని అడిగారు.
ఒక రోజు ఒక వ్యక్తి, “స్వామీజీ! ఏసుక్రీస్తు ఒక కన్య గర్భంలో జన్మించాడనడంలో మీ అభిప్రాయం ఏమిటి?” అని స్వామీజీని అడిగాడు. అందుకు స్వామీజీ, “ఇలా ఇక్కడ మాత్రమే కాదు, యుగాల తరబడి అన్నిచోట్లా చెప్పుకొంటూనే ఉన్నారు. భారతదేశంలోనూ ఇలాగే అనేకుల చరిత్రలలో కూడా చెప్పుకొంటున్నారు. కాని నా మటుకు ఒక సంతోషకరమైన విషయం ఏమిటంటే, నా పుట్టుక సహజమైనదే, నాకు సముచిత రీతిలోని తల్లితండ్రులున్నారు” అన్నారు.
“కాని కన్య గర్భం ధరించడమన్నది ప్రకృతి నియమానికి వ్యతిరేకం కదా?” అని కొనసాగించాడు ప్రశ్నించిన వ్యక్తి.
స్వామీజీ అప్పుడు హుక్కాతో పొగ త్రాగుతున్నారు. కాసేపు మౌనం వహించారు. హుక్కాలోని బూడిదను రాల్చడానికి హుక్కాను తమ పాదరక్షపై తట్టారు. ఆ బూడిద తివాచీ మీద పడి ఆ స్థలాన్ని మలినం చేయడం గురించి ఆయన కలత చెందినట్లు కనిపించలేదు. తరువాత నెమ్మదిగా ఒకసారి పొగ పీల్చి ఇలా అన్నారు:
“మనమందరమూ ప్రకృతికి బానిసలం. ఈ ప్రకృతి అధినేత భగవంతుడు మాత్రమే. ఆయన ఇచ్ఛ మేరకు నిర్వర్తిస్తాడు. ఈ క్షణంలో ఆయన ఒక రూపం దాల్చవచ్చు. లేదా ఒక డజను రూపాలు దాల్చవచ్చు; నచ్చిన రూపంలో రావచ్చు. మనం ఆయనను ఎలా పరిమితం చేయగలం?”
మౌన గురువు
ప్రశ్నలు అడిగి, జవాబు పొంది, సందేహాలను నివృత్తి చేసిన సంఘటనలు కోకొల్లలంటే, జవాబివ్వకుండానే సందేహాలను నివృత్తి చేసిన సంఘటనలూ స్వామీజీ జీవితంలో జరిగాయి. స్వామీజీ ఈ కాలఘట్టంలోని ప్రసంగాలకు కార్యకర్తగా ఉన్న ఆలెన్ భార్య ఎడిత్ ఆలెన్. ప్రేతాత్మలను ఆవాహన చేసి మాట్లాడే ఒక బృందంలో చేరి, వారి ఉపదేశాల మేరకు కొన్ని సాధనలు అనుష్ఠించడంతో ఎడిత్ ఆరోగ్యం దెబ్బతిని, మనఃస్థితి కూడా క్షీణించే స్థితికి దిగజారింది. దాదాపు రెండేళ్లు ఏ నమ్మకమూ లేకుండా బాధపడ్డ ఎడిత్ని స్వామీజీని దర్శించుకోమని ఆలెన్ ప్రోత్సహించాడు.
ఎడిత్ ఒక రోజు సాయంత్రం స్వామీజీ వద్దకు వెళ్లినప్పుడు మర్నాడు ఉదయం తీరికగా రమ్మన్నారు స్వామీజీ. మర్నాటి గురించి ఆలోచిస్తూ రాత్రి బాగా ప్రొద్దుపోయే దాకా నిద్రపోకుండానే గడిపింది ఆమె. స్వామీజీని అడగడానికి అనేక ప్రశ్నలను ఆమె ఆలోచించి పెట్టుకొంది. మర్నాడు ఉదయం వెళ్లినప్పుడు, స్వామీజీ బయటకుపోతున్నారనీ, ప్రస్తుతం ఎవరినీ చూడరనీ హాన్స్బరో తెలిపింది. కాని జీవిత సమస్యలతో కొట్టుమిట్టాడుతూ మరెవరూ కాపాడలేని అధోగతిలో స్వామీజీయే శరణాగతి అనుకొని వచ్చిన ఎడిత్ అంత సులభంగా వెనుదిరుగదలచుకోలేదు. “ఇప్పుడు నన్ను కలుసుకొంటానని ఆయన చెప్పారు. కనుక ఆయన నన్ను కలుసుకొంటారు” అంది ఎడిత్ దృఢంగా. చివరికి ఆమెను మేడ మీద గదిలో కూర్చోబెట్టింది హాన్స్బరో.
కాసేపటికి స్వామీజీ గదిలోకి వచ్చారు. కిటికీ ప్రక్కనున్న ఒక కుర్చీలో కూర్చుని ఆయనకే సొంతమైన గాంభీర్యంతో సంస్కృత శ్లోకాలను ఉచ్చరించ సాగారు. తరువాత ప్రశాంతంగా ఎడిత్ వైపు తిరిగి, “ఏమమ్మా?” అని అడిగారు. అంతే, ఎడిత్ ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె అంతరాంతరాళాల్లో ఎక్కడో ఒక ద్వారం ఠక్కున తెరచుకొన్నట్లయింది. ఎక్కణ్ణుంచో ఏడ్పు వచ్చింది; కళ్లు ధారకట్టగా వెక్కివెక్కి ఏడ్వనారంభించింది. స్వామీజీ మౌనముద్ర దాల్చారు. అరగంటసేపు ఎడిత్ విలపించింది. స్వామీజీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరికి, “రేపు ఇదే సమయంలో రా” అన్నారు. ఎడిత్ వెళ్లిపోయింది. “ఆయన సాన్నిధ్యం నుంచి బయలుదేరినప్పుడు నా ప్రశ్నలన్నింటికీ జవాబులు నాలోనే లభించాయి. నా సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి. నేను ఆయనను ఏమీ అడగలేదు, ఆయన కూడా నాతో ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు బయటకు వచ్చి ఇంటికి పోతున్నప్పుడు వీథిలో పడివున్న గులకరాళ్లన్నీ అనేక వర్ణాలలోని ఒక రకం రత్నాల్లా (opal) ప్రకాశించాయి. ఎలాగో ఇంటికి వచ్చిపడ్డాను. ఆ రోజు జీవితంలో స్వర్ణమయ దినంగా భాసిల్లింది” అంటూ కాలాంతరంలో ఎడిత్ తెలిపింది. ఆ తరువాత కూడా ఒకటి రెండు రోజులు ఎడిత్ స్వామీజీని ఏకాంతంలో కలుసుకొన్నది. అప్పుడు స్వామీజీ ఆమెకు ధ్యానం, ప్రాణాయామ అభ్యాసాలు నేర్పించారు.
సామాన్యంగా ఉదయకాలపు తరగతులు ముగియగానే స్వామీజీ వంట పనిలో నిమగ్నులయ్యేవారు. సామాన్యంగా ఆయన పులావు తయారుచేసేవారు. అతికొద్దిమందిని మాత్రమే వంటగదిలోకి రానిచ్చేవారు. వారు ఆయనకు సహాయపడడం అరుదు. కాని ఆయన సన్నిధిలో ఉండడమే గొప్ప అనుభవం. తమ సన్నిధిలో ఉండడం ద్వారా వారికి ఇంకా కొన్ని విషయాలు తెలుపాలని తాము అనుకొన్నవారిని మాత్రమే సహాయం చేయడానికి వంట గదిలోకి ఆయన అనుమతించేవారు. అలా అదృష్టవంతులైన కొందరిలో ఎడిత్ కూడా ఉంది. ఆ సమయాల్లో స్వామీజీ మాట్లాడిన విషయాల గురించి కొన్ని క్లుప్త వివరాలు ఆమె వదలి వెళ్లింది.
లోకం పాచికలాట
ఒక రోజు స్వామీజీ గీత 18.16 వ శ్లోకాన్ని మృదుమధురంగా ఉచ్చరించి దాని అర్థం వివరించారు: “భగవంతుడు సర్వభూత హృదయా లలో నెలకొని వాటిని తన మాయ వలన – యంత్రం మీద నిలుపబడిన వాటిలా – తిరిగేటట్లు చేస్తాడు.” దీనిని వివరిస్తూ స్వామీజీ ఇలా అన్నారు:
“ఇప్పుడు మనం చూస్తున్న సంఘటనలన్నీ మునుపు జరిగిపోయినవే. ఆటగాడు పాచికలు వేస్తాడు. అంకెలు వస్తాయి. ఒకే విధమైన సంయోగం అనేక సమయాల్లో రావచ్చు. జీవితమూ అంతే. చక్రం తిరుగుతున్నది – ఒకసారి జరిగిందే మళ్లీ జరుగుతోంది. అదిగో ఆ కుండ, ఆ గ్లాసు, ఉల్లిపాయ, ఈ బంగాళాదుంప – అన్నీ మునుపు ఒకసారి ఇదే చోట ఇట్లే ఉన్నాయి. ఇప్పుడు అదే సంయోగంలో మళ్లీ ఇక్కడ ఉన్నాయి. మనం ఏం చేయగలమమ్మా! జీవితచక్రంలో మనలను ఉంచి త్రిప్పుతున్నది ఆయన కదా!”
‘మళ్లీ వస్తాను’
ఎడిత్ ఇలా అంది: “స్వామీజీ ఈ రోజుల్లో దేహం నుండి విముక్తి పొంద డానికి ఎంతో వ్యాకులత చెందారు. ‘కాని నేను మళ్లీ ఒకసారి రావలసి ఉంది’ అని ఆయన ఒకసారి చెప్పారు. దీనిని వివరిస్తున్నప్పుడు, ‘తాము వచ్చినప్పుడు మళ్లీ నేనూ రావాలని శ్రీరామకృష్ణులు ఒకసారి నాతో చెప్పారు’ అని తెలిపారు. వెంటనే నేను, ‘ఆయన చెప్పారనా మీరు రావడం?’ అని అడిగాను. అందుకు స్వామీజీ, ‘ఆయన లాంటివారి శక్తి అనంతం’ అన్నారు.”
ఇలాంటి భావనను స్వామీజీ పాసడేనాలో ఉన్నప్పుడు కూడా ఒకసారి వ్యక్తం చేశారు: “ 200 సం ॥ తరువాత తాము మళ్లీ ఒకసారి వస్తానని శ్రీరామకృష్ణులు చెప్పారు. నేను ఆయనతో వస్తాను. యజమాని వస్తున్నప్పుడు ఆయన తన మనుషులనే తోడ్కొని వస్తాడు కదా, అదే విధంగా!”
ఎడిత్ స్మృతులు కొనసాగాయి: “స్వామీజీ అనేక పరిమాణాలున్న వ్యక్తి. దానిని వర్ణించడం అంత సులభం కాదు. కొన్ని సమయాల్లో వేదాంత కేసరిలా విరాజిల్లే ఆయన కొన్ని సమయాల్లో బాలునిలా వ్యవహరిస్తారు. కాని నాతో ఆయన సదా ఓర్పుగల, ప్రేమగల తండ్రిగా మెలగారు. నేను చెప్పే విషయాలు ఓర్పుతో విన్నారు. తమను ‘స్వామీజీ’ అని సంబోధించవద్దనీ, ‘బాబాజీ’ అని సంబోధించమనీ ఆయన చెప్పారు. బాబాజీ అంటే భారతదేశంలో సన్న్యాసిని మాత్రమే గాక, తండ్రిని సంబోధించడానికీ యుక్తమైన మాట. కొన్ని సమయాల్లో ఆయన ప్రేమమయమూర్తియైన తల్లిగా కూడా నాకు కానవచ్చారు.
“ఆయన క్యాలిఫోర్నియా నుంచి బయలుదేరే ముందు నాతో, ‘మళ్లీ నీకు మానసిక సమస్యలో, మరే ఇతర సమస్యలో ఎదురైతే నన్ను పిలువు! ఎక్కడున్నా నేను నీ పిలుపు వింటాను’ అని వాగ్దానం చేశారు. దానిని జీవితంలో అనేకసార్లు చవిచూశాను.”