ఆహా, బేలూర్ మఠంలో ఎంత ప్రశాంతత! స్వతస్సిద్ధంగా అక్కడ ధ్యానం సిద్ధిస్తుంది. అందుకే నరేన్ ఆ స్థలాన్ని ఎంపిక చేశాడు.
– మాతృమూర్తి శ్రీశారదాదేవి
గోముఖీ గంగోత్రి — పవిత్ర భూమి — బేలూర్ మఠ ప్రారంభం — స్థలాన్ని చదును చేసే పనులు — మాతృదేవి ఆశీస్సులు — మఠ స్థాపన — ధర్మ క్షేత్రం — సన్న్యాస సంప్రదాయం — నూతన సన్న్యాస సంప్రదాయం — రామకృష్ణ సంప్రదాయ సన్న్యాసులు — సన్న్యాసమార్గ మౌలికాంశాలు — మఠ భవిష్యత్తు —
‘నువ్వే శరణు శ్రీరామకృష్ణా!’ — శ్రీరామకృష్ణ ఆలయం — మఠ నియమ నిబంధనలు — అత్యున్నత స్థితి నుంచి రూపొందించిన నియమాలు — ప్రేమ పెంపొందించండి
గోముఖీ గంగోత్రి
“వంగ భూమియైన గోముఖీ నుంచి ఒక కారుణ్యమయ గంగ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. మానవులారా! మీరంతా వేగంగా రండి! వచ్చి ఆ పావన జలాన్ని గ్రోలి, దప్పికతో ఎండిపోయిన మీ గొంతులకు దాహశాంతి కలిగించండి!”* అని శ్రీరామకృష్ణులను గంగానదిలా అభి వర్ణిస్తున్నది ఒక వంగ గీతం. జీవనదియైన గంగ జన్మస్థానం గోముఖీ. ఆమె లోకుల పాపాలను బాపడానికై దేవాలయంలో కొలువుదీరివున్న స్థలం గంగోత్రి. అదే విధంగా శ్రీరామకృష్ణ గంగకు గోముఖీయైనది దక్షిణేశ్వర మయితే గంగోత్రియైనది బేలూర్ మఠం. గంగకు తూర్పు వైపున దక్షిణేశ్వరమూ పశ్చిమాన బేలూర్ మఠమూ వెలసివున్నాయి. దక్షిణేశ్వరం నుండి శ్రీరామకృష్ణ గంగ బయలుదేరి, బేలూర్ మఠం చేరుకొని అనుగ్రహించడానికి దాదాపు పదిహేనేళ్లు పట్టింది. శ్రీరామకృష్ణుల అనుగ్రహమూ, మాతృదేవి ఆశీస్సులూ, స్వామీజీ నిరంతర ప్రయత్నమూ బేలూర్ మఠ పునాదిగా భాసిల్లినవంటే, శ్రీరామ కృష్ణుల తక్కిన శిష్యుల సహకారమూ, స్వామీజీ పాశ్చాత్య శిష్యుల వంతూ ఆ పునాది మీద బ్రహ్మాండమైన కట్టడమై రూపుదాల్చాయి.
పవిత్ర భూమి
బేలూర్ మఠ స్థలమే పవిత్ర భూమి. “గంగ పశ్చిమ తీరం కాశీకి సమానం” అనే లోకోక్తి ప్రకారం గంగానది పశ్చిమ తీరంలో వెలసివున్న బేలూర్ మఠం కాశీకి సమానమయినది. ఆ స్థలం అరటితోటలా ఉన్నప్పుడే అక్కడ శ్రీరామ కృష్ణులు జీవిస్తున్నట్లు మాతృదేవి ఒక దివ్యదర్శనంలో గాంచారు. కాలాంతరంలో ఆమె దానిని గురించి ప్రస్తావించి, “అక్కడ గురుదేవులు జీవిస్తూ ఉండడం నేను చూశాను. గంగానది ఆవలి తీరంలోని ఆ స్థలం మునుపు అరటి తోటగా ఉండేది. అక్కడ ఆయన జీవిస్తున్నారు”* అని చెప్పారు.
ఈ స్థలం స్వామీజీ దూరదృష్టికి నిదర్శనమై ఒప్పారింది. అప్పుడు మఠం వరాహనగరంలో గంగానది తూర్పు తీరాన ఉంది. పాశ్చాత్య దేశాలకు వెళ్లడానికి ముందు ఒక రోజు స్వామీజీ తక్కిన సన్న్యాసులతో గంగానది స్నాన ఘట్టం మీద నిలబడి బేలూర్ను చూపుతూ, “మన శాశ్వత మఠం గంగానది ఆవలి తీరంలో అదిగో ఆ చోట వెలుస్తుందని నాకు అనిపిస్తోంది” అన్నారు. ఆ చోటు బేలూర్.
బేలూర్ మఠ ప్రారంభం
శ్రీరామకృష్ణుల అస్థికలను ఉంచి పూజించడానికే కాక, శ్రీరామకృష్ణ మఠానికి ఒక శాశ్వత స్థలం ఉండాలని స్వామీజీ మనస్సు పడ్డ తపన వర్ణనాతీతం. ఉద్వేగభరితమైన ఆయన లేఖలలో దీనిని మనం చూడవచ్చు. 1897 మార్చ్ లేదా ఏప్రెల్‌లో ఆయన డార్జిలింగ్ నుంచి ఖేత్రీ మహారాజును చూడడానికి కలకత్తాకు వచ్చారు. అప్పుడు మాతృదేవి కలకత్తాలోనే ఉన్నారు. స్వామీజీ ఆమెను దర్శించుకొని, “అమ్మా! మఠానికి ఒక చక్కని స్థలం లభించాలని ప్రార్థిస్తూ గురుదేవులకు 108 బిల్వదళాలు అర్పించాను” అన్నారు. అందుకు మాతృదేవి, “నీ ప్రార్థన ఫలిస్తుంది, నీ ఆకాంక్ష నెరవేరే తీరుతుంది” అంటూ ఆశీర్వదించారు.
కాశీపూర్, పానీహాటీ, క్రొన్నగర్, దక్షిణేశ్వరం మొదలైన చోట్ల భూమి కొనుగోలు చేయడానికి ధరల గురించి సంప్రతింపులు సాగాయి. కాని ఏదో కారణం వలన ఆ ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి బేలూర్‌లో దాదాపు పది ఎకరాల స్థలం కొనుగోలు చేయబడింది. ఇందు కోసం స్వామీజీ పాశ్చాత్య శిష్యురాలైన మిస్ ముల్లర్ అంతకు మునుపే రూ. 40, 000 విరాళం ఇచ్చింది. 1898 ఫిబ్రవరి 25 వ తేదీన ఆ స్థలం స్వాధీనం చేసుకొన్నారు.
స్థలాన్ని చదును చేసే పనులు
పడవలు గంగాతీరంలో నిలిపే స్థలంగా బేలూర్ ప్రాంతం ఉపయోగపడుతూవచ్చింది. స్థలంలో ఈశాన్య మూలలో రెండు చిన్న కట్టడాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మేడ. వాటిని మరమ్మతు చేసి పునరుద్ధరిస్తే మాత్రమే ఆవాసయోగ్యమవుతాయి. వాటి ప్రక్కన అనేక చెట్లు ఉన్నాయి. వాటిలో మామిడి చెట్టు ఒకటి.* దక్షిణ మూలలో మూడు అశోక చెట్లున్నాయి.* ఇవి కాక ఆ స్థలంలో కొలనులు, కొబ్బరి, తాటి, ఖర్జూర, జామ్రూల్, పనస, మామిడి, అరటి చెట్లు ఉన్నాయి. స్థలంగుంటలు, మిట్టపల్లాలమయంగా ఉంది. స్థలాన్ని చదును చేసే పనుల కోసం మిస్ ముల్లర్ రూ. 4, 000/– అదనంగా ఇచ్చింది. ఈ చదును చేసే పనుల బాధ్యత విజ్ఞానానంద తీసుకొన్నారు. అతడికి అద్వైతానంద సహాయపడ్డారు.
మాతృదేవి ఆశీస్సులు
మాతృమూర్తి శ్రీశారదాదేవిని ‘సంఘ జనని’ గా స్వామీజీ పేర్కొనడం ఇంతకు మునుపే చూశాం. రామకృష్ణ సంఘారంభం నుండి అది పురోగమించిన ప్రతి దశలోనూ మాతృదేవి అనుగ్రహం దోహదం చేస్తూనే వచ్చింది. స్వామీజీతో సహా సన్న్యాసులు సంఘాధ్యక్షులుగా ఉన్నప్పటికీ మాతృదేవియే నిజమైన అధ్యక్షురాలిగా విరాజిల్లారు. మాతృ దేవి అనుమతితోనే ముఖ్యమైన నిర్ణయాలనన్నీ వారు తీసుకొన్నారు. “మీ పేరిట సంసారాన్ని త్యజించిన నా కుమారులు తలదాచుకోవడానికి ఒక చోటు కావాలి” అని కన్నీరుమున్నీరై మాతృదేవి శ్రీరామకృష్ణులను ప్రార్థించారు. ఇప్పుడు వారి కంటూ శాశ్వతమైన చోటు ఏర్పడుతున్నప్పుడు ఆమెకన్నా ఆనందించేవారు ఎవరుంటారు?
అనుగ్రహమే మూర్తీభవించిన మాతృదేవి పాదపద్మాలు బేలూరు మఠంలో అడుగిడాలని స్వామీజీ, తక్కిన సన్న్యాసులూ అభిలషించారు. 1898 ఏప్రెల్ నెలలో మాతృదేవి ఆ స్థలాన్ని ప్రప్రథమంగా పావనం చేశారు. ఆమెతో నివేదిత, సారా బుల్, మెక్లౌడ్లు కూడా వచ్చారు. మఠ సన్న్యాసులూ, బ్రహ్మచారులూ మాతృదేవిని వినమ్రంగా ఆహ్వానించారు. మాతృదేవి ఆనందం వర్ణనాతీతం. “ఇప్పుడు నా కుమారులు తలదాచుకోవడానికి ఒక స్థలం లభించింది, చివరికి గురుదేవులు వారిని అనుగ్రహించారు” అన్నారామె సంతోషభరితంగా. స్వామీజీ మాతృదేవికి మఠం త్రిప్పి చూపి, “అమ్మా! ఇది మీ స్థలం, అంతా చూడండి” అన్నారు. ఆ తరువాత మరమ్మతులు, నూతన కట్టడాల పని కొనసాగింది. పూజామందిరం, ధ్యానమందిరం మొదలైనవి క్రొత్తగా కట్టబడ్డాయి. ఇందుకోసం మిసెస్ సారా నిధులు సమకూర్చింది.
అదే సంవత్సరం కాళీపూజ పర్వదినాన (నవంబర్ 12 వ తేదీన) మాతృదేవి ఆ స్థలంలో గురుదేవులను అర్చించి అక్కడ ఆయన అనుగ్రహాన్ని వర్షింపజేశారు. తాము పూజిస్తూ వచ్చిన గురుదేవుల చిత్రాన్ని తీసుకువచ్చి, స్వహస్తాలతో ఆ స్థలంలో ఒక భాగాన్ని శుభ్రం చేసి, అక్కడ ఆ చిత్రాన్ని అమర్చి గురుదేవులను పూజించారు. ఒక నెలలో మరమ్మతు వగైరా పనులు ఒక రకంగా పూర్తయ్యాయి. ఇక ఆలస్యం చేయకుండా శ్రీగురుదేవులను క్రొత్త మఠంలో కొలువుదీర్చా లనుకొన్నారు స్వామీజీ.
మఠ స్థాపన
1898 డిసెంబర్ 9 వ తేదీన శుక్రవారం రోజు స్వామీజీ జీవితంలోను, రామకృష్ణ మఠ చరిత్రలోను ఒక స్వర్ణమయ దినం! ఆ రోజు స్వామీజీ బేలూర్ మఠంలో గురుదేవులను ప్రతిష్ఠితులను గావించారు. సోదర సన్న్యాసుల, శిష్యుల సహాయంతో అన్ని శాస్త్రవిధులనూ స్వయంగా ఆయనే నిర్వర్తించారు. ఉదయం గంగలో స్నానం చేసి, నూతన కాషాయాంబరాలు ధరించి, పూజామందిరంలోకి వెళ్లి, పూజారి ఆసనంలో కూర్చుని ధ్యానమగ్నులయ్యారు. పిదప శ్రీరామకృష్ణుల అసిక్థలున్న కలశాన్ని భక్తి ప్రపత్తులతో పువ్వులతో ఆరాధించారు. ఆ తరువాత గంగాతీరం వెంబడి ఊరేగింపు బయలుదేరింది. ఒక తామ్రపేటికలో ఉంచబడిన శ్రీరామకృష్ణుల పావన అస్థికలను స్వామీజీ తమ కుడి భుజం మీద పెట్టుకొని ముందువెళ్లారు. ఘంటానాదాలూ, శంఖారావాలూ మార్మోగాయి. వెళ్లే దారిలో స్వామీజీ శరశ్చం ద్రతో, “శ్రీరామకృష్ణులు ఒకసారి నాతో, ‘నువ్వు నన్ను నీ భుజం మీద మోసుకొని ఎక్కడకు తీసుకుపోయినా, అది చెట్టు క్రింద అయినా సరే, గుడిసె అయినా అక్కడ నేను నివసిస్తాను’ అన్నారు. అందుకే క్రొత్త మఠానికి నేనే ఆయన అస్థికలను మోసుకుపోతున్నాను. అనేకుల శ్రేయస్సు కోసం ఆయన ఆ చోట శాశ్వతంగా ఉండిపోతారు. ఇది తథ్యం” అన్నారు భావోద్వేగంతో.
శరత్‌తో అనేక విషయాలు మాట్లాడుతూ వెళుతున్న స్వామీజీ చివరికి, “మతశాఖల నన్నింటినీ, సిద్ధాంతాల నన్నింటినీ సామరస్యపరచి మన మఠం విరాజిల్లుతుంది. శ్రీరామకృష్ణులు విశాల దృక్పథాన్ని కలిగివున్నట్లే ఈ మఠమూ అంతటి విశాల దృక్పథానికి కేంద్రంగా భాసిల్లుతుంది. ఇక్కడ నుండి ప్రసరించే సామరస్య ప్రకాశ వెల్లువ ప్రపంచాన్నంతా నింపుతుంది” అన్నారు.
ఇంతలో అందరూ మఠాన్ని చేరుకొన్నారు. స్వామీజీ తమ భుజం మీద నుంచి అస్థికల పేటికను దించి నేల మీద పరచివున్న తివాచీ మీద ఉంచి, దానికి సాష్టాంగ నమస్కారం చేశారు; తక్కినవారు అట్లే ప్రణమిల్లారు. పిదప స్వామీజీ కూర్చుని శ్రీరామకృష్ణ పూజ నిర్వర్తించారు. పూజ ముగించి హోమం అనుష్ఠించారు. సోదర శిష్యుల సహాయంతో స్వయంగా తామే పాయసం వండి శ్రీరామకృష్ణులకు నివేదించారు.
ఈ ఆచార క్రియలు పూర్తయ్యాక స్వామీజీ అక్కడ సమావేశమైన వారితో, “ఈ యుగపు మహోన్నత అవతారపురుషులు శ్రీరామకృష్ణులు. అనేకుల శ్రేయస్సు కోసమూ, అనేకుల ఆనందం కోసమూ నేటి నుంచి ఈ పావన తీర్థస్థలంలో శాశ్వతంగా కొలువై ఈ స్థలాన్ని అద్వితీయమైన మతసామరస్య కేంద్రంగా రూపొందించేటట్లు హృదయపూర్వకంగా ప్రార్థించండి” అన్నారు. అందరూ ఆయన చెప్పినట్లే చేతులు జోడించి ప్రార్థించారు. అంతటితో మఠ స్థాపన కార్యక్రమం ముగిసింది.
ధర్మ క్షేత్రం
తరువాత అందరూ నీలాంబర మఠం చేరుకొన్నారు. నిర్విఘ్నంగా కార్య క్రమం జరిగినందుకు అందరూ పరమానందభరితులయ్యారు. పన్నెండేళ్లుగా మోసిన భారం స్వామీజీ మనస్సు నుంచి దిగింది. అతి ప్రశాంతంగా ఆయన ఇలా అన్నారు: “శ్రీరామకృష్ణుల సంకల్పంతో ఆయన ధర్మక్షేత్రం సుస్థాపితమైంది. పన్నెండేళ్ల నా దిగులు తీరిపోయింది.”
ఈ విధంగా ఒక క్రొత్త పుణ్యతీర్థం రూపొందింది. దానిని గురించి కాలాంతరంలో స్వామి శివానంద ఇలా అన్నారు: “ఈ స్థలం నిజంగా వైకుంఠమే! శ్రీగురుదేవులు ఇక్కడ మనతోనే ఉన్నారు; గురుదేవుల శిష్యులు ఇక్కడ సూక్ష్మ శరీరులై జీవిస్తున్నారు; కొన్ని సమయాల్లో వారు కనిపిస్తున్నారు కూడా! ఇదొక పుణ్యతీర్థం. ఈ స్థలపు ధూళి సైతం పునీతమైనది.”
కాశీకి వెళ్లడం గురించిన ప్రస్తావన ఒకసారి వచ్చినప్పుడు భక్తురాండ్రతో మాతృదేవి ఇలా చెప్పారు: “దక్షిణేశ్వరానికో, బేలూర్ మఠానికో వెళ్లడం కాశీని దర్శించినంత పుణ్యం. కాని నమ్మకం ముఖ్యం. కాశీలో కొలువుదీరి ఉన్న వారే దక్షిణేశ్వరంలోనూ, బేలూరు మఠంలోనూ వెలసివున్నారు.”*
సన్న్యాస సంప్రదాయం
బేలూర్ మఠం ఈ విధంగా పుణ్యతీర్థంగా రూపొందడంతో మాత్రం ఆగిపోలేదు. నూతన సన్న్యాస సంప్రదాయానికి అది కేంద్రంగా విరాజిల్లుతున్నది. సన్న్యాస ఆదర్శం వేదకాలం నాటిది. కాని కాలానుగుణంగా దాన్లో మార్పులు చోటుచేసుకొంటున్నాయి. యుగాచార్యులు ఆ మార్పులు చేస్తున్నారు. మౌలిక నిబంధనల నుండి సమాజపు నాటి పరిస్థితి, అవసరాలను పరిగణించి వారు ఈ మార్పులు చేస్తు న్నారు. వేదకాలం, ఉపనిషత్కాలం, పురాణకాలం, తదనంతరం బుద్ధుడు, ఆదిశంక రుడు, రామానందుడు, మధుసూదన సరస్వతి లాంటి ఆచార్యుల కాలాలలో సన్న్యాస సంప్రదాయంలో ఇటువంటి మార్పులు జరగడం చరిత్ర స్పష్టం చేస్తున్నది.
వేదకాల సన్న్యాసాశ్రమ జీవితంలో కఠోర తపశ్చర్యలు, దేహాలను కృశింప జేసుకొనే అనుష్ఠానాలు లాంటివి ప్రాధాన్యం వహించాయి. ఉపనిషత్కాలంలో కఠోర తపస్సులు మాత్రమే ముక్తిని చేకూరుస్తాయా అనే ప్రశ్న తలెత్తింది; ముక్తికి ఆధ్యాత్మిక జ్ఞానమూ ఆవశ్యకమనే భావన నొక్కివక్కాణింపబడింది.
ఇతిహాస, పురాణ కాలాలలో సన్న్యాసులు సహజీవనం చేయడానికి ప్రయత్నించినట్లు తెలియవస్తోంది. సన్న్యాసాశ్రమాన్ని ప్రప్రథమంగా సంస్థాగతంగా తీసుకువచ్చిన వ్యక్తి మహావీరుడు. తరువాత బుద్ధుడు అరుదెంచి సన్న్యాసాశ్రమంలో ప్రత్యేకించి ఐదు ముఖ్యాంశాలను చేర్చాడు. 1. సన్న్యాసమంటే కేవలం కఠోర తపస్సు, అనుష్ఠానాలూ మాత్రమే కాదు, అదొక జీవిత విధానమనే భావనను తెచ్చింది; 2. సన్న్యాసులను సంస్థాగతంగా తీర్చిదిద్దడం; 3. సన్న్యాసుల సంస్థను మత కేంద్రంగా చేయడం; 4. సన్న్యాసుల సంస్థను విద్యాకేంద్రం చేయడం; 5. లోకుల కష్టాలను తొలగించే కార్యంలో సన్న్యాసులను పాల్గొనజేయడం.
బుద్ధుని సిద్ధాంతాలు హిందూమతంలో చొచ్చుకుపోవడానికి దీర్ఘ కాలం పట్టింది. దానిని క్రీ.శ. 8 వ శతాబ్దంలో నిర్వహించినవారు ఆదిశంకరులు. హిందూమతంలో ప్రప్రథమంగా ఒక సన్న్యాస సంప్రదాయాన్ని ఆయన ప్రారంభించారు. సన్న్యాసులను పది శాఖలుగా వర్గీకరించి ‘దశనామీ సంప్ర దాయం’ స్థాపించారు.
ఆదిశంకరుల మార్గంలో జ్ఞానం మాత్రమే చోటుచేసుకొంది. సన్న్యాస మార్గంలో రామానందుడు భక్తికి కూడా చోటు కల్పించాడు. 12 వ శతాబ్దంలో ఆయన బైరాగులనే వైష్ణవ సన్న్యాస సంప్రదాయాన్ని రూపొందించాడు. కుల వివక్ష లేకుండా సన్న్యాస మార్గాన్ని మహావీరుడూ, బుద్ధుడూ మొదట చూపినప్పటికీ, హిందూమతంలో దానిని యావన్మందికీ ఆవిష్కరించిన ఘనత రామానందులదే!
సన్న్యాసులు సజ్జనులుగా ఉన్నంత మాత్రాన చాలదు, శౌర్యవంతులుగానూ ఉండాలనే భావనను కల్పించిన వ్యక్తి 16 వ శతాబ్దంలో జీవించిన మధుసూదన సరస్వతి. ఈ విధంగా రూపొందినవారే నాగ సంప్రదాయ సన్న్యాసులు. వీరు బ్రాహ్మణ క్షత్రియ శక్తుల మిశ్రమంగా విరాజిల్లారు. వీరిని మూడు శాఖలుగా వర్గీకరించవచ్చు. ప్రతి శాఖ ‘అఖాడా’ అని పేర్కొనబడింది.
తరువాత 19 వ శతాబ్దం వరకు సన్న్యాస మార్గంలో పెద్దగా మార్పులేవీ సంభవించలేదు. అందుకు మారుగా సన్న్యాస మార్గానికి పెద్ద సవాళ్లు ఎదుర య్యాయి. విజ్ఞానం, పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం లాంటి అనేక కారణాల వలన సన్న్యాసమార్గం కించపరచబడ్డది; సన్న్యాసి సమాజంలో పరాన్నభుక్కుగా పరి గణించబడ్డాడు. ఆ తరుణంలోనే స్వామి వివేకానంద భారతదేశ సన్న్యాస వినువీథిలో వేగుజుక్కలా ప్రత్యక్షమైనారు; “సమాజ కర్తవ్యాలను నొక్కివక్కాణించి భారతదేశ చరిత్రలో రూపొందిన ప్రప్రథమ సన్న్యాస సంఘం”* స్థాపించబడింది.
నూతన సన్న్యాస సంప్రదాయం
శ్రీరామకృష్ణుల జననం అన్ని విధాల ఒక నూతన యుగారంభంగా పరి గణించవచ్చు. ఆదర్శాలు, జీవన విధానం, పరిస్థితి, మానవ సంబంధాల లాంటి అన్ని విషయాల్లో ఈ కాలం, గడిచిన కాలాలన్నింటి కన్నా పూర్తిగా భిన్నమైనది. ప్రాచీనకాల కార్యాచరణలు ఈ కాలానికి అనుగుణంగా ఉండవు. కనుక గృహస్థాశ్రమానికీ, సన్న్యాసాశ్ర మానికీ ఆయన నూతన పరిమాణాలను వర్గీకరించి ఇచ్చారు. వాటిని మౌలికంగా తీసుకొని స్వామీజీ నూతన సన్న్యాస సంప్రదాయాన్ని రూపొందించారు. 1897 మార్చ్‌లో డార్జిలింగ్‌లో ఉన్నప్పుడు స్వామీజీ ఒకసారి తురీయానందతో, “సన్న్యాస మార్గంలో నేను విప్లవాన్ని తెస్తాను” అన్నారు. ఆ విప్లవాన్ని గురించి క్లుప్తంగా చెప్పాలంటే సన్న్యాస మార్గం సమాజంతో సమైక్యమయింది; సన్న్యాసులుసమాజంతో సమైక్యమయ్యారు.
రామకృష్ణ సంప్రదాయ సన్న్యాసులు
శ్రీరామకృష్ణులు తోతాపురి అనే సన్న్యాసి నుండి సన్న్యాసం పుచ్చుకొన్నారు. ‘పురి’ అన్నది ఆదిశంకరులు వర్గీకరించిన పది శాఖలలో ఒక శాఖ పేరు. అంతే గాక వరాహనగర మఠంలో శ్రీరామకృష్ణుల యువభక్తులు సన్న్యాసం పుచ్చుకొన్నప్పుడు, అభేదానంద హిమాలయ మఠాల నుంచి తీసుకువచ్చిన సంప్రదాయ సన్న్యాస మంత్రా లను ఉచ్చరించి సన్న్యాసులయ్యారు. కనుక సంప్రదాయం ప్రకారం, రామకృష్ణ మఠ సన్న్యాసులు పురి శాఖకు చెందుతారు. కాని జీవన విధానంలోనూ, కార్యాచరణలోనూ రామకృష్ణ సన్న్యాస సంప్రదాయాన్ని ఒక ప్రత్యేకతతో వివేకానంద రూపొందించారు.
సన్న్యాస మార్గానికి మౌలికంగా మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి. అవి యజ్ఞం, విరజా, ప్రవ్రజనం.
సన్న్యాసమార్గ మౌలికాంశాలు
1. యజ్ఞం : ప్రాచీన ఋషివరేణ్యులు యజ్ఞం ద్వారా ప్రపంచంతో సంబంధముంచుకొన్నారు. ప్రతి ప్రకృతి శక్తీ ఒక దేవతగా రూపొందించబడింది. యజ్ఞాలలో నేయి మొదలైన పదార్థాలను ఆహుతించడం ద్వారా వారికి నైవేద్యం అర్పిస్తున్నట్లూ, దానిని స్వీకరించి వారు మనకు వర్షాదులు ఇస్తున్నట్లూ పరిగణింపబడింది. ప్రకృతీ, మనిషీ సమైక్యతతో జీవించాలన్నదే దీని మౌలిక భావన.
కాని కాలక్రమంలో మనిషి ఇటువంటి యజ్ఞాలు నిర్వహించలేకపోయాడు. కాలావశ్యకతలకు అనుగుణమైన క్రొత్త భావనలు తలెత్తాయి. నేయి మొదలైన పదార్థాలను యజ్ఞాలలో ఆహుతించడానికి మారుగా జీవితాన్నే ఒక యజ్ఞంగా భావించి గడపాలనే భావన రూపొందింది. ఈ భావనను భగవద్గీత చక్కగా విచారణ చేసింది.
ఆ విధంగా ఒక సన్న్యాసి తన జీవితాన్ని ఒక యజ్ఞంగా, ఒక ఆరాధనగా పరిగణించాలన్నారు స్వామీజీ. ఎలా? సేవ–ధర్మం ద్వారా: “మానవాళికి సేవచెయ్యడమే విశేషాధికారం; ఎందుకంటే అది ఈశ్వరోపాసనం కనుక. దేవుడు ఇక్కడ ఈ సకల మానవాత్మల్లోనూ ఉన్నాడు”;* సజీవదైవాన్ని సేవించండి! దేవుడు గ్రుడ్డివాడుగా, కుంటివాడుగా, దరిద్రుడుగా, బలహీనుడుగా, పాపిష్టిగా నీ వద్దకు వస్తున్నాడు. ఆరాధించడానికి మీ కెంత గొప్ప అవకాశం కలిగింది!”* రామకృష్ణ మిషన్ సేవాకార్యాలన్నీ ఈ ప్రాతిపదిక మీదనే నిర్వర్తింపబడుతున్నాయి. సేవ వల్ల ఇతరులకు మంచి జరుగుతున్నది; దానిని ఒక ఆరాధనగా చేయడం వలన, సేవ చేసే వ్యక్తికీ మంచి జరుగుతున్నది. రామకృష్ణ సంప్రదాయ సన్న్యాసి ఈ విధంగా తన జీవితాన్ని ఒక సేవగా, ఒక ఆరాధనగా మలచుకోగోరాలి. వేద భావన అయిన ‘యజ్ఞాన్ని’ ఈ విధంగా కాలానుగుణమైన మార్పులతో సన్న్యాసి జీవితంతో సమైక్యపరిచారు స్వామీజీ.
2. విరజా : సన్న్యాసి తదుపరి ముఖ్యమైన మౌలిక గుణం సమగ్ర పావన జీవితం. దీనిని గుర్తించడానికి ‘విరజా’ అనే హోమం నిర్వర్తింపబడుతుంది. దాని ముందు కొన్ని ప్రతిజ్ఞలు చేసి సన్న్యాసం పుచ్చుకొంటారు. స్వామీజీ ఈ భావనను అట్లే స్వీకరించారు. ఈ పావన జీవితం గడపడానికి మన శాస్త్రాలు సన్న్యాసి చేయవలసినవీ, చేయకూడనివీ అంటూ కొన్ని నిబంధనలు విధించాయి; అవి ఆహార, వస్త్రధారణ, ఆచార వ్యవహారాలన్నింటిలో ఒక దీర్ఘ పట్టిక లిస్తున్నాయి. కాని కొన్ని సమయాల్లో “ఇది చేయాలి, అది చేయకూడదు” అంటూ శ్రద్ధ వహించడంలో చేయాలి చేయకూడదనేవి లక్ష్యాలుగా పరిణమించడం కద్దు; నిజమైన లక్ష్యం మనస్సు నుంచి నిష్క్రమిస్తుంది. శ్రీరామకృష్ణులు ఈ పట్టికను బాగా తగ్గించి, పావన జీవిత ప్రాతిపదికను ఒక సూత్రంగా అమర్చి ఇచ్చారు. అదే కామినీ కాంచన త్యాగం. ఈ మౌలిక వాంఛల నుండి తక్కిన అన్ని కోర్కెలూ, సమస్యలూ జనిస్తున్నాయి. ఈ రెంటినీ త్యజించడం సమస్త కోర్కెలనూ కూకటి వ్రేళ్లతో సహా పెకలించడానికి సమానం. కనుక ‘కామినీ కాంచన త్యాగం’ అన్నది శ్రీరామకృష్ణ సంప్రదాయ సన్న్యాసి ఏకైక వ్రతం.
3. ప్రవ్రజనం : ఒక సన్న్యాసి దేన్లోనూ అనురక్తి చూపని వ్యక్తిగా విరాజిల్లాలి. ఒక స్థలంలో బస చేస్తే ఆ స్థలం పట్లా, వస్తువుల పట్లా అనురక్తి జనిస్తుందని ఎక్కడా మూడు రోజుల కన్నా బస చేయకూడదన్నది సన్న్యాసి నియమం. కాని సన్న్యాసో, గృహస్థో – మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కనికీ తాను జన్మించిన సమాజానికంటూ నిర్వర్తించవలసిన కర్తవ్యం ఒకటి ఉంది. ఆహారం, వస్త్రాలు, జ్ఞానమంటూ తన జీవితానికి అవసరమైన సమస్తాన్నీ మనిషి సమాజం నుంచి పొందుతున్నాడు. దానిని అతడు తిరిగి చెల్లించాలి. వాటిని తిరిగి చెల్లించ కుండా జీవించడం వలననే మనిషి బంధాలకూ, అనురక్తికీ లోనవుతున్నాడనీ, అలా జీవితం గడిపే వ్యక్తి ‘దొంగ’ అనీ భగవద్గీత (3.9, 12) వచిస్తోంది. పరి వ్రాజకుడైన సన్న్యాసి జీవితం ద్వారా సమాజానికి మంచి జరిగింది; ఆతడి పావన జీవితమూ, ఉపదేశాలూ ప్రజలను సన్మార్గం పట్టించాయి. ఈ విధంగా ఆతడు తాను సమాజం నుండి పొందిన దానిని తిరిగి చెల్లించాడు.
స్వామీజీ కాలానుగుణంగా దీనిలో కొంత మార్పు చేశారు. తిరుగాడడం వదలిపెట్టి, ఒక స్థలంలోనే నివసిస్తూ నిస్వార్థ కార్యాలు నిర్వహించడం వలన స్వీయ ఆధ్యాత్మిక ప్రగతీ, తద్ద్వారా ఇతరుల శ్రేయస్సూ ఒనగూరుతాయి. దీని కోసం స్వామీజీ చూపిన దారి కర్మయోగం. స్వామి వివేకానంద అందించిన మహోన్నత కానుకలలో ఇదొకటి.
ఈ కర్మయోగం ద్వారా అనేక నూతనాంశాలు ఆధ్యాత్మిక జీవనంలో చేర్చబడ్డాయి. ఇవి సన్న్యాసికీ, అదేవిధంగా గృహస్థుకూ మహావరప్రసాదాలు:
i. కర్మయోగ కార్యాచరణ – అది ఏ పని అయినా – ఒక ఆరాధనగా నిర్వహింపబడుతున్నది. దీని ద్వారా పని ఒక ఆరాధానాస్థితికి ఉద్ధరింపబడింది. కనుక మనం ఏ పని చేసినా, దానిని ఒక ఆరాధనగా, భగవంతునికి అర్పిస్తే తద్ద్వారా భగవత్సాక్షాత్కారం పొందవచ్చు.
ii. స్వామీజీ ఈ నూతన మార్గాన్ని ఆవిష్కరించే వరకు, పని చేయడాన్ని సన్న్యాసులు అగౌరవ వైఖరితో చూశారు. కాని నిజానికి ఉన్నత స్థితులు పొందని వారు పనిచేయడానికి తమను అతీతులుగా భావించుకోవడంతో వారి ఆధ్యాత్మిక ప్రగతికి ఇది ఆటంకమైంది; వారు ఆధ్యాత్మిక ప్రగతిని కోల్పోయారు. సమాజం వారి పట్ల నమ్మకాన్ని కోల్పోయింది. స్వామీజీ ఆవిష్కరించిన నూతన మార్గం సన్న్యాసులు ఆత్మగౌరవంతో సమాజంలో జీవించడానికి అవకాశమిచ్చింది. ప్రతి ఒక్కరూ పాటుపడి తినడానికి మార్గం కల్పించింది.
iii. సమాజం కోసం పాటుపడడం వలన సన్న్యాసి సమాజంతో ఒక చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఈ కర్మయోగం దోహదం చేసింది.
ఇవి మాత్రమే కాక, కుల, మత, జాతి, భాష, దేశం లాంటి ఏ వివక్షా లేకుండా అందరినీ సమానంగా స్వీకరించడం ఈ నూతన సన్న్యాస సంప్ర దాయంలో ఒక ముఖ్యాంశమై అలరారింది.*
ఈ విధంగా, “సంప్రదాయ సన్న్యాస మార్గానికి, కాలావశ్యకతకు తగిన నూతన రూపమిచ్చారు స్వామీజీ” అంటున్నారు తురీయానంద. ఇలా సన్న్యాస సంప్రదాయానికి కేంద్రంగా బేలూర్ మఠం విరాజిల్లింది, విరాజిల్లుతోంది.
మఠ భవిష్యత్తు
బేలూర్ మఠ భవిష్యత్తు గురించి, స్వామీజీ దానిని స్థాపించిన రోజున ఏం అనుకొన్నారో దానిని తమ శిష్యునితో వ్యక్తం చేశారు: “ఇప్పుడు నా మనస్సులో ద్యోతకమయ్యే దృశ్యం ఏమిటో తెలుసా? ఈ మఠం విద్యకూ, ఆధ్యాత్మికతకూ ఒక కేంద్రంగా విరాజిల్లుతుంది. సన్మార్గగాము లైన గృహస్థులు దీని చుట్టూ ఇళ్లు నిర్మించుకొని జీవిస్తారు, మధ్యలో సన్న్యాసులు జీవిస్తారు. మఠానికి దక్షిణం వైపు ఆంగ్లేయ, అమెరికన్ శిష్యులు నివసించడానికి ఇళ్లు నిర్మితమవుతాయి. ఈ ప్రణాళిక ఎలా ఉంది?”
“మీ ఊహ చాలా అద్భుతంగా ఉంది” అన్నాడు శిష్యుడు. వెంటనే స్వామీజీ ఇలా అన్నారు: “ఏమిటి! దీన్ని ఊహ అనుకొంటున్నావా? కానే కాదు. కాలక్రమంలో సమస్తం జరిగి తీరుతుంది. నేను పునాది మాత్రమే వేస్తున్నాను. భవిష్యత్తులో అనేక అభివృద్ధులు జరుగుతాయి. దీన్లో కొంతభాగం నెరవేరడం నా జీవిత కాలంలోనే చూడగలను. మరి, మీ లాంటి వారిలో అనేక భావాలను జొప్పిస్తాను. భవిష్యత్తులో మీరు వాటిని నెరవేరుస్తారు.”*
శ్రీరామకృష్ణులను ఒక శాశ్వతమైన స్థానంలో ప్రతిష్ఠించిన స్వామీజీ తమ జీవిత మహత్కార్యాలలో ఒకటి నెరవేరిన ఆనందంలో ఓలలాడారు. శ్రీరామకృష్ణు లను కేంద్రంగా చేసుకొన్న ఈ మఠం కాలక్రమంలో ఎలా నిర్వహింపబడుతుందో, ఏ ఏ మహత్కార్యాలు సాధించబోతుందో ఆయన గ్రహించకపోలేదు. వాటిని అప్పుడప్పుడు వ్యక్తం చేశారు కూడా. కాని యుగాచార్యునిగా, యుగనాయకునిగా, జగద్గురువుగా విరాజిల్లిన వారు స్వామీజీ. తాను చెప్పినవి అట్లే జరగాలని ఆయన ఎన్నడూ భావించింది లేదు. కాలక్రమంలో సమాజంలో తలెత్తే మార్పులను పరిగణించి అందుకు తగ్గట్లు కార్యాచరణలో తమను అనుసరించి వచ్చేవారు అవసరమైన మార్పులను తీసుకురావడానికి అవకాశమూ ఆయన కల్పించారు.
బేలూర్ మఠం స్థాపితమై, శ్రీరామకృష్ణులు అక్కడ కొలువుదీరినప్పటికీ 1899 జనవరి దాకా మఠం పాత చోట, అంటే నీలాంబర ముఖర్జీ ఉద్యానగృహం లోనే కొనసాగింది. బేలూర్ మఠ స్థాపన నాటి నుండే కొందరు సన్న్యాసులు క్రొత్త మఠంలో నివసించసాగారు. క్రమంగా అన్ని కార్యకలాపాలూ క్రొత్త మఠంలో జరుగనారంభించాయి.
‘నువ్వే శరణు శ్రీరామకృష్ణా!’
నిజానికి మహత్కార్యాలు సాధించిన అనేకుల జీవితాల్లో వారు తమ చివరి దశలో ఒక సత్యాన్ని వెలిబుచ్చడం చూడగలం. తాము ఏమీ సాధించలేదన్నదే ఆ సత్యం. నిజానికి అన్నీ సంభవించాయి, తాము ఒక పరికర మాత్రులమేనని వారికి తేటతెల్లమవుతుంది. తమ ద్వారా దానిని నిర్వర్తించిన భగవంతుని ఘనతను వారు అవగతం చేసుకొంటారు; “దేవా, నువ్వే శరణు” అంటూ ఆయనను శరణుజొస్తారు. ఇటువంటి ఒక స్థితిని స్వామీజీ రోజుల్లో మనం చూస్తున్నాం. ఆయన ఈ రోజుల్లో రచించిన రెండు గీతాల నుండి దీనిని మనం అవగతం చేసుకోవచ్చు. రెండూ శ్రీరామకృష్ణుల గురించి ఆయన రచించినవి.*
మొదటి గీతం ‘ఆచణ్డాలా…’ అని ప్రారంభమవుతుంది. శ్రీరామకృష్ణుల జీవిత తత్త్వానికి స్వామీజీ రాసిన ఈ గీతం నిలువుటద్దం. ఆయన ఘనతలను పేర్కొని “అంతటి గురువును శరణుజొస్తున్నాను” అని ఈ పాట ముగుస్తుంది.
రెండవది ‘ఓం హ్రీం ఋతం’ అని ప్రారంభమయ్యే గీతం. ఈ గీతానికి ఒక ఘనత ఉంది. ఈ గీతం, ఒక ప్రార్థనగా, స్తోత్రంగా మాత్రమే కాక ఒక మంత్రంగానూ భాసిస్తూన్నది. ఎందుకంటే ఈ గీతంలో శ్రీరామకృష్ణ మంత్రాన్ని స్వామీజీ పొందుపరిచారు. ప్రతి పంక్తిలోని మొదటి అక్షరాన్నీ చేర్చి పఠిస్తే ‘ఓం నమో భగవతే రామకృష్ణాయ’ అని వస్తుంది. కనుక ఈ గీతాన్ని పాడడం ద్వారా మంత్రజప ఫలం కూడా దక్కుతుంది.
ఈ గీతం రచించిన తరువాత ఒక రోజు స్వామీజీ సంస్కృత పండితుడూ, తమ శిష్యుడూ అయిన శరశ్చంద్రతో మాట్లాడారు. దానిని గురించి శరశ్చంద్ర ఇలా వ్రాస్తున్నారు: “ఈ రోజు సరస్వతి స్వామీజీ నాలుకపై నాట్యమాడుతున్నట్లు అనిపిస్తోంది. నాతో రెండు గంటలపైగా చక్కని సంస్కృతంలో సంభాషించారు.” తరువాత స్వామీజీ ఆతడికి ఆ గీతాన్ని ఇచ్చి, “ఇలా చూడు, నా ఆలోచన భావనలో లయించడం వలన వ్యాకరణ దోషాలు దొర్లివుండవచ్చు. వాటిని కాస్త సరిచూడు” అన్నారు. అందుకు శిష్యుడు, “అలా దోషాలు దొర్లినప్పటికీ అవి దోషాలు కావు; అది ఆర్షప్రయోగం, జ్ఞానులకు భాషలో ఇచ్చిన మినహాయింపు” అన్నాడు వినమ్రంగా. వెంటనే స్వామీజీ, “నువ్వు అలా చెప్పవచ్చు, తక్కిన వారూ దీనిని అంగీకరించాలని నిర్బంధమేమున్నది?” అన్నారు. అయినప్పటికీ ఎందుకో స్వామీజీ గీతాన్ని సరిచూడడానికి శరశ్చంద్రకు మనస్కరించలేదు.
ఈ గీతం నాలుగు పాదాలు గలది. ప్రతి పాదంలోనూ చివరి పంక్తిని, ‘కనుక ఓ దీనబంధూ! నీవే నా శరణం’ అని పొందుపరిచారు.
శ్రీరామకృష్ణ ఆలయం
బేలూర్ మఠంలో నిర్మితమయ్యే శ్రీరామకృష్ణ ఆలయ రూపం స్వామీజీ మనోఫలకం మీద ముద్రితమయింది. ఆ ఆలయ నిర్మాణ ప్రణాళికను కూడా రచించారు. ఆ విషయంగా అఖండానందతోనూ, విజ్ఞానా నందతోనూ చర్చించారు. స్వామీజీ వాయవ్య భారతంలో పయనించినప్పుడు విజ్ఞానానందను (హరిప్రసన్న) తమ వెంట తోడ్కొని వెళ్లడం మునుపే చూశాం. అక్కడున్న అనేక దేవాలయాలను హరి ప్రసన్నకు చూపించి, అనేక వాస్తుకళల సూక్ష్మాంశాలను గ్రహించేలా చేశారు. తాను భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ పయనించినప్పుడు తారసపడిన ఆలయాలు, చర్చ్‌లు, మసీదులు, రాజప్రాసాదాలు, ప్రదర్శనశాలలు మొదలైన అన్నింటిలోని విశేషాంశాలనూ స్వామీజీ అవగతం చేసుకొన్నారు.
ఒక రోజు విజ్ఞానానందను పిలిచి శ్రీరామకృష్ణ ఆలయం గురించి తమ భావనలను స్వామీజీ వ్యక్తం చేశారు. ఆ ఆలయం ఎక్కడ నిర్మించబడాలో కూడా చెప్పారు. పిదప విజ్ఞానానందతో తమ భావనలకు తగినట్లు, ఆలయ ప్రణాళికా చిత్రాన్ని రచించమన్నారు. “శ్రీరామకృష్ణులు అన్ని మతాలకూ, అసంఖ్యాక సిద్ధాంతాలకూ ఆలవాలమై విరాజిల్లారు. ఆయన కోసం నిర్మితమయ్యే ఆలయమూ అన్ని వాస్తుకళల సొబగుల సంగమంగా భాసిల్లాలి. గ్రీకు, రోమన్, హిందూ, మహమ్మదీయ వాస్తుకళల సౌందర్యమంతా దాన్లో ప్రతిఫలించాలి” అని చెప్పారు.
విజ్ఞానానంద అందుకు తగ్గట్లు రేఖాచిత్రం సిద్ధం చేశారు. స్వామీజీ భావనలకు అనుగుణంగా రెండు మూడుసార్లు రేఖాచిత్రం సరిదిద్దబడిన తరువాతే స్వామీజీ సమ్మతించారు. కాని విజ్ఞానానందతో, “శ్రీరామకృష్ణుల ఆలయం రూపొందుతున్నప్పుడు దానిని తిలకించడానికి నేను ఈ దేహంతో ఉండను. అయినప్పటికీ పైనుండి చూస్తాను”* అన్నారు.
స్వామీజీ ఆమోదించిన రేఖాచిత్రాన్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుత దేవాలయం నిర్మితమయింది. కాని శ్రీరామకృష్ణుల ఆలయం గురించి స్వామీజీకి ఇంకా కొన్ని భావనలు ఉన్నాయి. వాటిని ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు:
“రాబోయే దేవాలయంలోను, మఠంలోను, ప్రాచ్య పాశ్చాత్య శిల్పాలలో ఉండే అత్యుత్తమమైన దాన్నంతా ఒక చోట చేర్చాలని నా కోర్కె. దాని నిర్మాణంలో శిల్పకళలోని భావాలన్నీ పొందుపరచడానికి ప్రయత్నిస్తాను. ఈ భావాలు నా ప్రపంచ పర్యటనల్లో ప్రోది చేసుకొన్నాను. అనేకమైన స్తంభాలతో కూడిన ఒక పెద్ద ప్రార్థనా మందిరాన్ని కట్టిస్తాను. గోడల్లో పూర్తిగా వికసించిన నూర్లకొలది కమలాలు ఉంటాయి. ఆ హాలు వేయిమంది కూర్చుని ధ్యానం చేయడానికి తగినంత విశాలమైనదిగా ఉంటుంది. ఈ రామకృష్ణ దేవాలయం, ప్రార్థనా మందిరం కలిపి ఎలా నిర్మింపబడాలంటే, దూరాన్నుంచి చూస్తే అది ‘ఓం’ ను సూచించే ప్రతీకగా ఉండాలి. దేవాలయంలో హంస మీద ఆశీనులైన శ్రీరామ కృష్ణుల విగ్రహం ఉంటుంది. ద్వారానికి రెండు వైపులా సింహం, గొర్రెపిల్ల, ఒకదాన్నొకటి నాకుతున్నట్లుగా – మహత్తర శక్తి, సాధుభావం ప్రేమలో మమేకమైనట్లు – ప్రదర్శింపబడాలి. నా మనస్సులో ఇలాంటి భావాలున్నాయి. నేను మరికొంత కాలం జీవిస్తే నేనే వాటిని కార్యరూపంలోకి తీసుకువస్తాను. కాకపోతే ముందుతరాల వాళ్లు క్రమంగా వాటిని కార్యరూపంలోకి తీసుకురావ డానికి ప్రయత్నిస్తారు.”*
మఠ నియమ నిబంధనలు
స్వామీజీకి సంబంధించినంత వరకు ఆయన కార్యాచరణ ముగిసినట్లు అని పించింది. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ అనే కవల సంస్థలు చక్కగా నిర్వహింపబడుతూండడం చూసి స్వామీజీ సంతృప్తి చెందారు. వాటికి సంబంధించిన నియమ నిబంధనలను క్రమబద్ధీ కరించాలని ఆయన అనుకొన్నారు. అనేక లేఖలలో దీనిని గురించి ప్రస్తావించారు కూడా. 1896 ఏప్రెల్ 27 వ తేదీన సోదర సన్న్యాసులకు వ్రాసిన లేఖలో విపులంగా స్వామీజీ కొన్ని నియమ నిబంధనలు తెలిపివున్నారు.* దీన్లో మత నిర్వహణ, నిర్వాహక బృందం, మఠంలోని విభాగాలు, సన్న్యాసుల జీవనశైలి లాంటి వాటిని గురించి వాశారు.
పాశ్చాత్యం నుంచి తిరిగి వచ్చాక స్వామీజీ శిష్యులలో ఒకరైన నిత్యానంద విన్నపం మేరకు నియమ నిబంధనలను క్రమబద్ధీకరించి వాటికి ఒక రూపకల్పన చేశారు. అప్పుడు మఠం ఆలంబజార్లో ఉంది. ఒక రోజు సన్న్యాసు లందరినీ ఒక చోట సమావేశపరిచారు. పిదప తాను చెబుతున్నది ఒకరిని వ్రాయమన్నారు. శుద్ధానంద ఆ పని చేశారు. సమావేశ ముగింపులో స్వామీజీ ఇలా అన్నారు:
“అన్ని నియమ నిబంధనలనూ కచ్చితంగా పాటించడమే మన లక్ష్యం. ఎందుకంటే మనం సన్న్యాసులం, స్వతంత్రులం. కాని చెడులను తొలగించడానికి సముచిత నియమ నిబంధనలు అవసరం. మంచివాటి ద్వారా చెడులను తొలగించి పిదప రెంటినీ వదలిపెట్టవచ్చు. నియమ నిబంధనల సత్ఫలం ఇదే. మనం సజ్జనులుగా ఉండకపోతే కేవలం నియమ నిబంధనల వలన ప్రయోజనం లేదు. నియమ నిబంధనలు ఉన్నప్పుడే వాటిని ఉల్లంఘించాలనే ప్రోద్బలం ఉంటుంది. సన్న్యాసులు ఎన్నటికీ తప్పటడుగు వేయరాదు. ఇతరుల సంక్షేమమే మన ఆదర్శం. క్రొత్తగా మఠంలో చేరేవారు ఈ ఆదర్శాన్ని అవగతం చేసుకోవాలి. అందుకే ఈ నియమ నిబంధనలు.”
తరువాత శుద్ధానందతో, “ఇలా చూడు, వీటిని శ్రద్ధగా వ్రాసి, ప్రతులు తీయి. ‘కూడదు’ లాంటి వ్యతిరేక పదాలు ఏవీ రాకుండా అన్నీ సానుకూల పదాలుండేటట్లు చూడు” అన్నారు.
ఈ నియమ నిబంధనలు సామాన్యంగా ‘బేలూర్ మఠ నియమ నిబంధనలు’ గా పేర్కొనబడుతున్నాయి. రామకృష్ణ మఠాలు పేరుకు మాత్రం మఠంగానూ ఆలయం గానూ ఉండకుండా సమాజానికి హితం చేకూర్చే సంస్థలుగా విరాజిల్లాలి; రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉంచుకోకూడదు లాంటి భావనలు దాన్లో నొక్కివక్కాణించారు.
అత్యున్నత స్థితి నుంచి రూపొందించిన నియమాలు
ఈ నియమ నిబంధనలు కాకుండా నీలాంబర మఠంలోనూ స్వామీజీ కొన్ని నియమాలు రూపొందించారు. వాటిని స్వామీజీ చెప్పగా శివానంద నమోదు చేశారు. ఈ నియమాలను కాలాంతరంలో ఒకసారి బేలూర్ మఠంలో బ్రహ్మానంద గదిలో పలువురు సన్న్యాసుల సమక్షంలో శుద్ధానంద పఠించారు. పఠించగానే బ్రహ్మానంద ఇలా అన్నారు: “స్వామీజీ ఈ నియమ నిబంధనలను మామూలు స్థితిలో వ్యక్తం చేయలేదు. ఆయన తమ మనస్సును అత్యున్నత స్థితికి తీసుకుని వెళ్లి, ఆ స్థితి నుంచి చెప్పారు; శివానంద నమోదు చేశాడు. మానవాళి సంక్షేమం కోసం శ్రీరామకృష్ణుల ఆదర్శాలను వ్యాప్తి గావించడానికి దోహదపడేటందుకే ఈ నియమాలను రూపొందించారు. శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక వారసత్వాన్ని పొంద డానికీ, ఆయనకు సేవలందించడానికీ, స్త్రీ – పురుష, ధనిక – పేద, ఉన్నత కులస్థుడు – నిమ్నకులస్థుడు లాంటి ఎలాంటి వివక్షా లేకుండా అందరికీ హక్కు ఉంది. శ్రీరామకృష్ణుల ఉపదేశాలను పాటించి, ఆయనకు సేవలందించేవారు భాగ్యశాలురు. స్వామీజీ రూపొందించిన నియమాలను నిస్సందేహంగా పూర్తి నమ్మకంతో స్వీకరించండి, మీ జీవితాల్లో వాటిని అమలుపరచండి, ఆ తరువాత వాటిని దశదిశలా ప్రచారం చేయండి. అప్పుడు కలియుగంలోని చెడులు తొలగి, సత్యయుగం వికసించడం చూస్తారు.”
ప్రేమ పెంపొందించండి
అవసరానికి అనుగుణమైన నియమ నిబంధనలను భవిష్యత్తులో చేర్చుకొందా మని స్వామీజీ వచించినప్పటికీ అటువంటి ప్రయత్నాలు ఏవీ జరుగలేదు. అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులలో నుంచి స్వామీజీ వచించిన వాటిని పాటిస్తే చాలునన్న నిర్ణయమే ఇందుకు కారణం. ఒకసారి హీరానంద, బ్రహ్మానందతో, “మహరాజ్! యువశిష్యులకు సహాయపడడానికి మీరు ఇంకా కొన్ని నియమాలను విధిస్తే బాగుంటుంది” అన్నాడు. అందుకు బ్రహ్మానంద, “మనకు ఏం అవసరమో అది ఇంతకు మునుపే స్వామీజీ ఇచ్చేశారు. క్రొత్తగా ఎలాంటి నియమ నిబంధనలనూ చేర్చనవసరం లేదు. మనం చేర్చవలసింది ప్రేమ. ప్రేమ చేర్చండి, భక్తిని చేర్చండి. తక్కిన వారిని ప్రేమించడం ద్వారా వారూ పరమావధి చేరుకోవడానికి దోహదం చేయండి” అన్నారు.
ఈ విధంగా శాశ్వతమైన నియమ నిబంధనలు అందించి, బేలూర్ మఠాన్ని నెలకొల్పడంతో స్వామీజీ తమ జీవిత మహత్కార్యాలలో అత్యంత ప్రధానమైన కార్యాన్ని నెరవేర్చారు.