బాల భానుని లేత కిరణాలు లోకాన్ని స్పృశించిన అతివేకువ వేళలో మన పయనం కొనసాగింది. దారిలో ఒక దివ్యభూమిని సందర్శించి ఒక అపూర్వ అనుభవం పొంది ఇప్పుడు నిలబడి ఉన్నాం. లోకహితానికే ఉద్భవించి తమ జీవితాన్ని అందుకోసం అంకితం చేసి, లోక చింతనా ధోరణులకు మార్పును ఒసగిన దేవర్షియైన స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదివాం.
ఆయనను అర్థం చేసుకొన్నామా?
ప్రత్యక్షంగా దర్శించిన వారే ఆయనను అవగతం చేసుకోలేక సతమత మయ్యారు. ఒక గ్రంథం చదివి ఆయనను అర్థం చేసుకోవడం సాధ్యమా?
ప్రారంభంలో అడిగిన ప్రశ్న, జవాబు లభించక ఇప్పుడూ అట్లే నిలిచి ఉంది:
“అవును, ఇంతకీ ఎవరీయన?”
ఆయనను గురించి ఏదో తెలుసుకొన్నట్లో, అవగతం చేసుకొన్నట్లో హృదయం ససేమిరా అంగీకరించడం లేదు.
కాని అందుకోసం చింతించకండి. ఆయన ఉన్నారు. అఖండానంద వచించినట్లు, మనకు దర్శనం ఇవ్వడానికే, మనలకు మార్గదర్శకత్వం వహించ డానికే మన సమీపంలో, అతి సమీపంలో పచార్లు చేస్తున్నారు!
ఈ భావనే పుష్టిని సంతరింపచేసేట్లుగా ఉంది! ఈ జీవిత చరిత్రలోకి ప్రవేశించినప్పుడు మనకు ఈ పుష్టి లేదు. కాని ఇప్పుడు “ఆయన మన ప్రక్కన ఉన్నా” రనే భావన మనలో పాదుకుపోయింది. అది మనకు బలాన్ని ఇస్తుంది.
దౌర్బల్యం ఆవహించినా ధైర్యం ఇవ్వడానికి ఆయన వచనాలు మన చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి –
ధైర్యం మనలనుంచి వైదొలగినప్పుడల్లా, దౌర్బల్యం మనలను ఆవహించి నప్పుడల్లా – “ ‘నేను ఎవరి కుమారుణ్ణి? ఆయన వద్ద కెళ్లి ఇంతటి బలహీన భావనా, దౌర్బల్యమా?’ అని భావించుకో. అధైర్యాన్నీ, బలహీన మనస్సునూ తన్ని క్రిందకు తోసివేసి లేచి నిలబడి, ‘నేను వీరుణ్ణి, నేను ధీరుణ్ణి, నేను భగవంతుణ్ణి తెలుసుకొన్న వాణ్ణి, నేను చైతన్య ప్రకాశం పొందిన వాణ్ణి’ అని చెప్పు. ‘కామినీ కాంచనాలను నిర్జించిన శ్రీరామకృష్ణులకు సహాయకునిగా వచ్చిన వ్యక్తి శిష్యుణ్ణి నేను’ అనే భావనలతో నీ మహోన్నత్వాన్ని పదేపదే జ్ఞాపకం చేసుకో…. నీలోని సమస్త దౌర్బల్యాలూ, పిరికితనమూ మటుమాయమవడం చూస్తావు” అంటూ ఆయన వచించడం వినవస్తుంది!
సాయంత్రం అయింది!
సాయంత్ర హారతి గంటలు ఆలయాల్లో మ్రోగుతున్నాయి.
సాయంత్రానికే
చెందిన నిశ్శబ్ద శోకం మన మనస్సులను ఆవహిస్తున్నది. మనం వెళ్లవలసిన దూరం ఇంకా ఎంతో ఉంది! మనం సంకోచిస్తూ ఆగలేం, వెళ్లే తీరాలి. కనుక పయనాన్ని కొనసాగిస్తున్నాం.
కాని ఇప్పుడు…
మనకు బాసటగా దైవాంశ సంభూతుడు ఒకరు ఉన్నారనే ధైర్యంతో, ఎలాంటి విఘ్నాలు వాటిల్లినా ప్రతిఘటించవచ్చుననే తెగింపుతో పయనాన్ని కొనసాగిస్తున్నాం.
కొనసాగిద్దాం….
స్వామి వివేకానంద కాలంలో శ్రీరామకృష్ణ పూజామందిరం, బేలూరు మఠం