నరేంద్రుడు కాళికాదేవిని అంగీకరించడం లేదు. కాబట్టే అతడు ఇంత దుఃఖం అనుభవించవలసి వచ్చింది. లోకంలో జీవించాలంటే ఆమెను అంగీకరించే తీరాలి.
– శ్రీరామకృష్ణులు
దుఃఖం ఎందుకు? — తండ్రి హఠాన్మరణం — దారిద్ర్యపు గుప్పిట్లో — శ్రీరామకృష్ణులు పాదుగొలిపిన — నమ్మకం — నిరాశా నిస్పృహలు — వక్రమార్గ దర్శకులు: నరేంద్రుని మానసిక స్థితి — వివాహ ప్రయత్నాలు — భగవంతుడు ఏం చేశాడు! — మానసిక ఆవేదనను మార్చిన అనుభవం — సన్న్యాస స్వీకరణకు నిర్ణయం — కాళీ ఆడిస్తున్నది! — కాళీమాతను అంగీకరించడం — శ్రీరామకృష్ణుల మహదానందం — కాళీ : జీవితపు మరో ప్రక్క
దుఃఖం ఎందుకు?
దే శం, భాష, జాతి, మతం ఇత్యాదు లన్నింటికీ అతీతంగా తాత్త్వికులందరినీ సతమతం చేసిన ప్రశ్న ఏదైనా ఉందా అంటే అది ఇది: “ఈ లోకంలో దుఃఖం ఎందుకు ఉంది?” ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి వారిలో పలువురు ప్రయత్నించకపోలేదు. కాని సబబైన సమాధానం లభించని ప్రశ్నగానే అది మిగిలిపోయింది. జీవితం సుఖదుఃఖమిశ్రితం. ఎవరూ పరిపూర్ణ సుఖంతో జీవించలేరు. అదే విధంగా జీవితమంతాదుఃఖమయంగానూ గడపరు. ఆశ్చర్యపరిచే నిజం ఏమిటంటే అనేక మహత్కార్యాలు సాధించిన మహనీయులందరికీ సుఖం కన్నా దుఃఖమే ఉత్కృష్ట మార్గ దర్శిగా విరాజిల్లింది. దుఃఖాల నుండే వారు ఎక్కువ పాఠాలు నేర్చుకొన్నారు.దుఃఖాలే వారిలో నిద్రాణావస్థలో నున్న అనేక శక్తులనూ, ప్రతిభలనూ అభివ్యక్తంచేశాయి. దుఃఖాలే వారికి మానవాళిని ప్రేమించడానికి ప్రేరణనిచ్చాయి. దుఃఖాలేమానవకోటి కోసం వారిని పాటుపడజేశాయి. తన ఇరవై నాలుగవ ఏట నరేం ద్రుడు అటువంటి దుఃఖభరితమైన ఘట్టాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది.
తండ్రి హఠాన్మరణం
1884 ప్రారంభం. నరేంద్రుని బి.ఏ. పరీక్షలు అప్పుడే పూర్తయ్యాయి. పరీక్షా ఫలితాలు జనవరి 30 వ తేదీన వెలువడ్డాయి. అతడు రెండవ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. విశ్వనాథ్ అతణ్ణి నిమాయ్చరణ్ బోస్ అనే సుప్రసిద్ధ న్యాయవాది వద్ద సహాయకునిగా చేర్పించాడు. మెట్రో పాలిటన్ కళాశాలలో మూడేళ్ల న్యాయశాస్త్ర పాఠ్యక్రమంలో కూడా చేర్పించాడు. న్యాయశాస్త్ర అధ్యయనం నిమిత్తం నరేంద్రుడు ఇంగ్లాండు వెళ్లగోరాడు. విశ్వనాథ్ కూడా అందుకు అంగీకరించాడు. కాని విధి వక్రిస్తుందని ఎవరి కెరుక!
ఫిబ్రవరి 25 వ తేదీ. ఆ రోజు నరేంద్రుడు వరాహనగర మిత్రుల ఆహ్వానంపై అక్కడకు వెళ్లాడు. రాత్రి పదకొండు గంటల దాకా ఆటపాటల సందడితో ఆ చోట ఆనందం వెల్లివిరిసింది. పిదప అందరూ కలసి భోజనం చేసి, పడుకొనే కబుర్లు చెప్పుకొంటున్నారు. రాత్రి రెండు గంటల సమయంలో హఠాత్తుగా మిత్రుడొకడు వచ్చి నరేంద్రుణ్ణి పిలిచాడు. ‘ఈ అపరాత్రి వేళ ఇతడు ఎందుకు ఇక్కడకు వచ్చాడు చెప్మా?’ అనుకొంటూ నరేంద్రుడు వచ్చిన వ్యక్తి వైపు తేరిపార చూశాడు. వచ్చిన వ్యక్తి తటపటాయిస్తూ తాను తెచ్చిన సమాచారం చెప్పాడు –
“మీ నాన్నగారు గుండెపోటుతో మరణించారు.”
కాళ్ల క్రింద భూమి విచ్చుకొని తను తలక్రిందులుగా పాతాళంలోకి పడిపో తున్నట్లు అనిపించింది నరేంద్రునికి!
కాసేపటికి తేరుకొని, గుండె పగిలే దుఃఖాన్ని భరిస్తూ బయలుదేరి ఎలాగో కలకత్తాకు వచ్చి చేరాడు నరేంద్రుడు. విపరీతమైన పనుల ఒత్తిడి కారణంగా కొద్ది కాలంగా విశ్వనాథ్ బాగా అలసిపోయి ఉన్నాడు. రాత్రి దాదాపు పది గంట లప్పుడు హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. విశ్వనాథ్ భౌతికకాయం శ్మశానానికి తీసుకెళ్లడానికి సిద్ధం చేయబడింది. నరేంద్రుని తల్లి, సోదర సోదరీ మణులు విలపిస్తున్నారు. మొదట్లో నరేంద్రుడు తన దుఃఖాన్ని బయటకు వ్యక్తం చేయలేదు. కాని ఎంతసేపు! కాసేపట్లో అతడు కూడా ‘ఓ’ అంటూ విలపించాడు. కుమారులలో నరేంద్రుడు పెద్దవాడు. తండ్రి అంత్యక్రియలు అతడు విధివిహితంగా నిర్వర్తించాడు.
దారిద్ర్యపు గుప్పిట్లో
విశ్వనాథ్ మరణానంతరమే ఆయనను గురించిన ఒక నిజం వెలుగులోకి వచ్చింది. “నా కోసం ఏం చేశారు?” అని ఒకసారి నరేంద్రుడు ఆయనను నిల దీసినప్పుడు, నిలువుటద్దంలో నరేంద్రుని ప్రతిబింబాన్నే చూపించారు కదా! నిజానికి ఆయన అదే చేశారు. ఆయన మరేదీ వదలి పోలేదు. జమీందారీ ఫాయేదాలో జీవించిన కుటుంబం ఒక్క రోజులో దిక్కులేని హీనస్థితికి దిగజారిపోయింది!
న్యాయవాది వృత్తి చేపట్టిన విశ్వనాథ్ నిజానికి పుష్కలంగా ధనం సంపాదిం చాడు. కాని ఆదాయం కన్నా ఎక్కువగా ఖర్చు చేశాడు. అందుకు తోడు పెద్ద కుటుంబం కావడంతో ఆయన ఏదీ కూడబెట్టలేకపోయాడు. ఆయన పినతండ్రి యైన కాళీప్రసాద్ ఉమ్మడి కుటుంబ ఆస్తి నుండి తన వంతు సొమ్ము ఖర్చు చేయ డమే కాక విశ్వనాథ్ నుండి కూడా విడిగా డబ్బు తీసుకొనేవాడు. వృత్తి రీత్యా బయటి ఊళ్లకు వెళ్లే విశ్వనాథ్ మాసాల తరబడి అక్కడే బస చేసేవాడు. ఈ సందర్భాలను పురస్కరించుకొని ఆయన బంధువులు ఆయన పేరిట పలుచోట్ల అప్పులు చేసి, తమ పబ్బం గడుపుకొనేవారు. అప్పులు విశ్వనాథ్ పేరిట; ఖర్చులు బంధువుల నిమిత్తం. మొత్తం మీద విశ్వనాథ్ పేరిట ఉన్న అప్పులు తలకు మించిన వయ్యాయి. కాబట్టి ఆయన కుటుంబం బయటివారి దృష్టికి దర్జాగా బ్రతుకు తున్నట్లు కనిపించినా, నిజానికి అప్పుల ఊబిలో కూరుకుపోయివుంది. ఈ విషయాలేవీ భువనేశ్వరికిగాని, నరేంద్రునికిగాని తెలియవు.
ఇది చాలదన్నట్లు ఉమ్మడి కుటుంబ ఆస్తి వ్యవహారంలో ఇంట్లో గొడవలు జరిగాయి. అందువలన విశ్వనాథ్ ఉమ్మడి ఆస్తియైన ఇంటిని వదలిపెట్టి, భార్యా బిడ్డలతో మరొక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ నివసించసాగాడు. ఈ ఇల్లు నరేంద్రుని అమ్మమ్మ ఇంటికి సమీపంలో ఉంది. అద్దె ఇంట్లోకి వెళ్లిన కొన్ని నెలల లోనే విశ్వనాథ్ కాలధర్మం చెందాడు. విశ్వనాథ్ మరణించిన కొన్ని నెలల తరు వాత కుటుంబంతో సహా నరేంద్రుడు కూడా అమ్మమ్మ ఇంటికే వెళ్లిపోయి నివసించసాగాడు.
విశ్వనాథ్ సహాయసహకారాలతో తమ జీవిత స్థితిగతులను మెరుగుపరుచు కొన్న బంధువులు ఈ శోచనీయ స్థితిలో శత్రువుల్లా వ్యవహరించారు. నరేంద్రుని కుటుంబాన్ని శాశ్వతంగా ఇంటి నుండి బయటకు పంపివేయడానికే నిశ్చయిం చారు. అందు నిమిత్తం న్యాయస్థానంలో దావా వేశారు. అప్పులు ఇచ్చిన వారు తలుపులు తట్టారు, అప్పులు పుచ్చుకొన్నవారు కనుమరుగయ్యారు. కొన్ని రోజు ల్లోనే పూట గడవడం కూడా కష్టమని నరేంద్రునికి తెలియవచ్చింది. కుటుంబానికి ఎలాంటి ఆదాయమూ లేదు. కాని ఐదారుగురిని పోషించవలసిన పరిస్థితి. కనుక నిమాయ్చరణ్ వద్ద తాను పొందుతున్న న్యాయశాస్త్ర శిక్షణను సగంలోనే నరేం ద్రుడు మానుకొని, మైల రోజులు పూర్తికాక మునుపే ఉద్యోగం కోసం పలుచోట్ల తిరగసాగాడు. కాలం కలసిరానప్పుడు వందలాది ప్రయత్నాలు సైతం విఫలమవ డంలో ఆశ్చర్యం లేదు. ఎలాంటి ఉద్యోగమూ లభించకపోవడంతో నరేంద్రునికి అన్ని వైపులా శూన్యమే కానవచ్చింది.
శ్రీరామకృష్ణులు పాదుగొలిపిన నమ్మకం
అంతులేని దుఃఖంలో మునిగివున్నప్పటికీ నరేంద్రునికి శ్రీరామకృష్ణుల స్మృతులు విశ్వాస సంకేత దీపాల్లా భాసిల్లాయి. మైల రోజులు ముగియక మునుపే, నరేంద్రుడు దక్షిణేశ్వరం వెళ్లి శ్రీరామకృష్ణులను దర్శించాడు. శ్రీరామకృష్ణులు రెండు నెలల క్రితం క్రిందపడడంతో ఆయన చేయి ఎముక స్థానభ్రంశం చెందింది. చేతికి కట్లు కట్టారు. నొప్పితో ఇంకా బాధపడుతున్నారు. నరేంద్రుడు ఇతర భక్తులతో పాటు కూర్చున్నాడు. బ్రహ్మసమాజ భక్తుడైన త్రైలోక్యుడు పాడుతున్నాడు. నరేం ద్రుని దుఃఖం చూసిన శ్రీరామకృష్ణుల ఆవేదన వర్ణనాతీతం. అయినప్పటికీ ఆయన ప్రత్యక్షంగా నరేంద్రునితో ఏమీ చెప్పలేదు. పాట పూర్తయ్యాక లోకం, భగవంతుని గురించి పలు అభిప్రాయాలు వెలిబుచ్చి, “దేహం ఉండేది రెండు రోజులు మాత్రమే, భగవంతుడు ఒక్కడే సత్యం. దేహం ఇదుగో ఉంది, మరు క్షణం లేదు…. దేహానికి సుఖదుఃఖాలు ఉండనే ఉంటాయి. నరేంద్రుణ్ణే తీసు కోండి – తండ్రి మరణించాడు, ఇంట్లో అలవికానన్ని కష్టాలు, ఏ దారీ కానరాదు. భగవంతుడు కొన్ని సమయాల్లో మనలను సుఖాలలో ఓలలాడిస్తాడు, మరికొన్ని సమయాలలో దుఃఖంలో ముంచెత్తుతాడు”* అని అన్నారు. ‘నరేంద్రుణ్ణి ఇంకా కరుణించలేదే అని భగవంతుని పట్ల శ్రీరామకృష్ణులు ఆక్రోశంతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉంది. మధ్యమధ్యలో ఆయన నరేంద్రుణ్ణి ఆప్యాయంగా చూస్తున్నారు’* అని వ్రాశాడు ఈ సంఘటనను నమోదు చేసిన ‘మ’.
మరో రోజు నరేంద్రుడు తన మిత్రుడయిన అన్నదా గుహతో కలిసి దక్షి ణేశ్వరం వెళ్లాడు. తమ అనుంగు శిష్యుని దుఃఖం చూసి ఆవేదన చెందిన శ్రీరామ కృష్ణులు అన్నదా గుహతో నరేంద్రుని కష్టాలను ప్రస్తావిస్తూ, నరేంద్రునికి సహాయ పడడం ఒక స్నేహితునిగా అతడి కర్తవ్యమని చెప్పారు. కాసేపటికి అన్నదా బయలుదేరి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయాక నరేంద్రుడు శ్రీరామకృష్ణులతో చిరుకోపంతో, “నా పరిస్థితిని ఊరంతా ఇలా ఎందుకు చాటి చెబుతున్నారు?” అని మండిపడ్డాడు. శ్రీరామకృష్ణుల కళ్లలో నీరు ధారకట్టింది. ఆయన ఆప్యాయ తతో నరేంద్రుణ్ణి చూసి, “నాయనా! నీ కోసం ఇంటింటికీ పోయి బిచ్చమెత్తడానికి సైతం నేను సంకోచించను” అన్నారు. నరేంద్రుడు ద్రవించిపోయాడు.
ఈ విధంగా శ్రీరామకృష్ణులను దర్శించడంతో, ఆయన కరుణాకటాక్షం పైన నరేంద్రుని నమ్మకం బలపడింది. బి.ఏ. చదివిన నరేంద్రుడు తనకు సత్వ రమే ఏదో ఒక ఉద్యోగం లభిస్తుందని ఆశించాడు. రోజూ భగవన్నామాన్ని స్మరిస్తూ అనేక కార్యాలయాలు ఎక్కి దిగాడు. కాని నెలకు పదిహేను రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం కూడా అతడికి లభించలేదు. మౌనంగా దారిద్ర్యాన్ని స్వీక రించాడు, కుటుంబం అతడితోబాటే దానిని స్వీకరించింది. వాళ్లలో ఎవరూ తమ కుటుంబ పరిస్థితులను ఇతరులెవరితోనూ వెల్లడించలేదు.
మైల రోజులు పూర్తి కాగానే నరేంద్రుడు మామూలు దుస్తులు ధరించ సాగాడు. సంపన్నులైన అతడి స్నేహితులూ ఎప్పటిలా రాసాగారు. కాని వారిలో ఎవరూ అతని ఇంటి పరిస్థితిని అర్థం చేసుకోలేదు. ఆతడు కూడా కొన్ని సమ యాలలో వారితోపాటు బయటకు వెళ్లేవాడు. అతడు సన్నబడసాగాడు. అతడి ముఖం కూడా కాస్త పాలిపోయింది. దీనిని కూడా ఆతడి మిత్రులు గమనించి నట్లు లేదు. బహుశా ఎవరైనా గమనించినప్పటికీ, అది పేదరికం వలన అని వారు ఊహించుకోలేకపోయివుండవచ్చు. తండ్రి మరణంతో ఏర్పడిన శోకం కారణం గానే అతడు సన్నబడ్డాడని వారు భావించారు. ఈ రీతిలో పేదరికంతో, గతిలేని స్థితిలో దానిని ఎదుర్కోవడంతో నరేంద్రుని గడ్డురోజులు కొనసాగాయి.
నిరాశా నిస్పృహలు
నరేంద్రుడు తల్లితోను, సోదర సోదరీమణులతోను నవ్వుతూ, విశ్వాసం ఉట్టి పడేలా మాట్లాడేవాడు. సత్వరమే ఉద్యోగం లభిస్తుంది, దుఃఖాలు తీరిపోతాయనే నమ్మకాన్ని వారికి కలుగజేసేవాడు. తక్కినవారు కాస్త ఎక్కువ తినాలనే ఉద్దేశంతో తన భోజనాన్ని తగ్గించుకొనేవాడు. ఉదయమే ఉద్యోగార్థం బయలుదేరేవాడు. సాయంత్రం బాగా అలసిపోయి తిరిగి వచ్చేవాడు. కాసేపటి క్రితమే తిన్నానని చెప్పి, తక్కిన వారు భోజనం చేసేలా చూసేవాడు, తాను పస్తుండేవాడు. ఆ స్థితిలో సైతం ఆతడు న్యాయశాస్త్ర అధ్యయనం వదలిపెట్టలేదు. అనేక రోజులు పస్తులుండి, చిరిగిన దుస్తులు ధరించి కళాశాలకు వెళ్లేవాడు. ఆకలి కారణంగా కొన్నిసార్లు స్పృహ తప్పి పడిపోయాడు.
నరేంద్రుని మిత్రులు అలవాటు ప్రకారం అతణ్ణి తమ ఇళ్లకు తీసుకుపోయే వారు. చాలాసేపు వారితో మాట్లాడుతూ ఉండేవాడు. వారు భోజనానికి పిలిచి నప్పుడు మాత్రం నిరాకరించేవాడు. ఎందుకంటే ఇంట్లో తల్లి, సోదర సోదరీ మణులు పస్తులతో ఉండే దృశ్యం అతడి కళ్ల ముందు ద్యోతకమయ్యేది కనుక. వెంటనే ఏదో ఒక సాకు చెప్పి భోజనం చేయకుండానే ఇంటికి తిరిగి వచ్చేసే వాడు. ఇంట్లో, తను మిత్రులతో కలిసి భోజనం చేసినట్లు చెప్పేవాడు. తన వంతు కూడా తమ్ముళ్లకు, చెల్లికి పెట్టి తాను పడుకొనేవాడు!
ఈ కాలఘట్టం గురించి కాలాంతరంలో నరేంద్రుడు ఇలా చెప్పాడు:*
“మైల గడువు పూర్తికాక మునుపే నేను అక్కడా ఇక్కడా ఉద్యోగం కోసం తిరిగాను. ఆకలితో, ఉత్త కాళ్లతో ఉద్యోగం కోసం దరఖాస్తు చేతపుచ్చుకొని మధ్యాహ్నపు మండుటెండలో ఒక కార్యాలయం నుండి మరొక కార్యాలయానికి తిరిగాను. ఆప్తమిత్రులు కొందరు సానుభూతితో కొన్ని రోజులు నాతోనే ఉండే వారు, కాని కొన్ని రోజులు నాతో ఉండలేకపోయేవారు. కాని ప్రతిచోట నాకు నిరాశా నిస్పృహలే ఎదురైనాయి. ఆ కఠోర లౌకిక వాస్తవాల ప్రప్రథమ అనుభవంతో నిస్వార్థమైన సానుభూతి ఎంతో అరుదైనదనీ, దుర్బలులకూ పేదలకూ ఇక్కడ స్థానం లేదనీ నాకు బాగా అర్థమయింది. ఇదివరలో ఒకటి రెండు రోజులు నాకు సహాయం చేసినందుకు తాము కృతార్థులమయినట్లు భావించిన వారిప్పుడు అందుకు విరుద్ధంగా చేయడమే సబబని భావించసాగారు. సహాయం చేయగల స్థితిలో ఉండి కూడా వాళ్లు నా పట్ల పెడముఖం చూప సాగారు. అటువంటి చేదు అనుభవాలు చవిచూసేకొద్దీ, ఈ లోకం ఒక రాక్షసుని సృష్టిగా నాకు అనిపించేది.
“ఒక రోజు మిట్టమధ్యాహ్నం మండుటెండలో తిరిగి తిరిగి పాదాలు బొబ్బ లెక్కాయి; అలసిసొలసిపోయి మైదానంలోని ‘ఓక్టెర్లోని’ స్మారకచిహ్న నిర్మాణం నీడలో విశ్రమించాను. ఆ రోజు ఒకరిద్దరు మిత్రులు నాతోపాటు ఉన్నారు; అనుకోకుండా అక్కడ కలుసుకోవడం జరిగింది. నన్ను అనునయించడానికి కాబోలు వారిలో ఒకడు, ‘కృపాళువైన బ్రహ్మశ్వాస అనే పిల్లవాయువు వీచ సాగింది’ అనే పాట పాడసాగాడు. ఆ పాట వినగానే అతడు నా తల మీద సమ్మెటతో కొడుతున్నట్లు అనిపించింది. నా తల్లి, తమ్ముల నిస్సహాయ స్థితి గుర్తుకు వచ్చి, అవమానంతో నిరాశానిస్పృహలు ముప్పిరిగొనగా, ‘నోరుముయ్యి, ఎవరికి ఆకలి బాధతో అలమటించే అవసరం లేదో అటువంటి భాగ్యవంతులకు ఈ కల్పనలు మధురంగా కానరావచ్చు. ఒకప్పుడు నాకూ అలాగే అనిపించేది. కాని ఇప్పుడు కఠోర వాస్తవాలు ఎదురైనప్పుడు ఆ కల్పనలు అపహాస్యంగా తోస్తు న్నాయి’ అంటూ అరిచాను. నా మాటలు విని ఆ మిత్రుడు ఎంతో నొచ్చుకొన్నా డేమో! కాని ఎంతటి కటిక దారిద్ర్యం అనుభవిస్తూవుంటే ఆ మాటలు నా నోట వెలువడి ఉంటాయో అతడి కెలా అర్థమవుతుంది?
“ఒక్కో రోజు నిద్ర లేచి రహస్యంగా ఆరాతీయగా ఇంట్లో అందరికీ చాలి నంత ఆహారం లేదని తెలుసుకొని, చేత చిల్లిగవ్వ లేకపోవడంతో, ‘ఒక మిత్రుడు భోజనానికి తన ఇంటికి ఆహ్వానించా’ డని అమ్మతో చెప్పి, బయటకు వెళ్లిపోయే వాణ్ణి. అటువంటి సందర్భాలలో ఏదో కాస్త తినేవాణ్ణి; కొన్ని రోజులు ఇంట్లో తక్కిన వారికి సరిపడే ఆహారం ఉంటుందనే ఉద్దేశంతో పస్తులతోనే గడిపేవాణ్ణి. ఇంట్లో వారికి లేదా బయటి వారికి ఈ విషయాలు తెలుపడానికి అభిమానం అడ్డుపడేది. ఇంతకు ముందు మాదిరే సంపన్నులైన మిత్రులు తమ ఇళ్లకు లేదా ఉద్యానాలకు వచ్చి నా పాటలతో తమ ఆనందాన్ని ఇనుమడింపజేయమని కోరే వారు. వారి కోర్కెను తిరస్కరించలేక, కొన్ని సమయాలలో వారితోబాటు వెళ్లి, నా పాటలతో వారిని సంతోషపరచేవాణ్ణి. కాని నా మనస్సులోని భావాలను వారికి వ్యక్తపరచాలని అభిలషించేవాణ్ణి కాను. నా పరిస్థితి గురించి తమకు తాముగా వారెన్నడూ వాకబు చేసేవారు కారు. ఏ ఒకరిద్దరో అప్పుడప్పుడు ఆప్యాయంగా, ‘ఈ రోజు నువ్వెందుకు నిరుత్సాహంగా, బలహీనంగా కనిపిస్తున్నావు? కారణం ఏమిటో దయచేసి చెప్పు’ అని అడిగేవారు. వారిలో ఒక మిత్రుడు, ఇంకొక మిత్రుడి ద్వారా నా పరిస్థితి తెలుసుకొని, అజ్ఞాతంగా మా అమ్మకు ఉత్తరాలు వ్రాస్తూ, డబ్బు పంపసాగాడు. ఈ విధంగా అతడు నన్ను శాశ్వతంగా ఋణబద్ధుణ్ణి చేసివేశాడు.”
ఏదో విధంగా 1884 ఉత్తరార్ధంలో తాను చదివిన మెట్రోపాలిటన్ పాఠ శాలలోనే నరేంద్రునికి ఉపాధ్యాయునిగా ఉద్యోగం దొరికింది. జూన్ 1886 లో ‘మ’ సిఫారసుతో ఆ పాఠశాల క్రొత్త శాఖలో ప్రధానోపాధ్యాయునిగా పదోన్నతి లభించింది. ఈ ఆదాయం కారణంగా పస్తులుండే పరిస్థితి దాటి ఒక అడుగు ముందుకు రాగలిగారు. కాని కుటుంబ ఆస్తుల దావా వలనా, రాబోయే న్యాయ శాస్త్ర పరీక్షల కారణంగానూ నరేంద్రుడు ఆ ఉద్యోగం వదలుకోవలసి వచ్చింది. అప్పుడు శ్రీరామకృష్ణులకు గొంతులో వ్రణం ఏర్పడింది. ప్రక్కనే ఉండి ఆయనకు సేవ శుశ్రూషలు అందించాలని నరేంద్రుడు అనుకోవడమూ అందుకొక కారణం.
నరేంద్రుడు ఈ రోజుల్లో ‘గీత గోవింద’ కావ్యాన్ని వంగభాషలోకి అనువ దించాడు. ఆతడి మిత్రుడైన మోతీలాల్ బోస్ దానిని ప్రచురించాడు. దీని ద్వారా కాస్త డబ్బు లభించింది.
వక్రమార్గ దర్శకులు: నరేంద్రుని మానసిక స్థితి
ఈ సమస్యల కారణంగా నరేంద్రుడు దాదాపు ఏడు నెలల పాటు శ్రీరామ కృష్ణుల దర్శనార్థం వెళ్లలేకపోయాడు. ఈ మధ్య కాలంలో ఈశాన్ అనే భక్తుడి ఇంటిని శ్రీరామకృష్ణులు పావనం చేసినప్పుడు ఆయనను దర్శించడంతో సరి. ఈ కాలఘట్టంలో అతడికి శ్రీరామ కృష్ణుల భక్తులతోనూ, అక్కడ కలుసుకొన్న యువ మిత్రుల తోనూ దాదాపు ఎలాంటి సాన్నిహిత్యమూ లేకుండాపోయింది. ‘మ’ మాత్రం కొన్ని పర్యాయాలు నరేంద్రుని ఇంటికి వెళ్లివచ్చాడు. ఇద్దరూ కలిసి గీతగోవింద అష్టపదులు పాడుకొనేవారు.
క్రమంగా నరేంద్రుని పరిస్థితి పలువురు మిత్రులకు తెలియసాగింది కాని ఎవరూ ఎలాంటి సహాయం అందించలేదు. పైగా అతణ్ణి తప్పుదారి పట్టించ డానికి కొందరు తయారయ్యారు. ఆతడి మిత్రులలో కొందరు సన్మార్గగాములు కారని మునుపే చూశాం. అలాంటి వ్యక్తుల్లో అన్నదా గుహ ఒకడు. అతడి ఇంట్లో కలుసుకొన్న ఒకరిద్దరు అలాంటి యువకులు నరేంద్రునికి వక్రమార్గంలో డబ్బు సంపాదించే దారులు తెలిపారు. సంపన్నులైన వితంతువులు కొందరు తమ దారిలోకి వస్తే అతడికి సహాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కబురు పంపారు. వారు సూచించిన మార్గాలన్నింటినీ తుచ్ఛమైనవిగా త్రోసిరాజని, తన మార్గంలోనే ఒంటరిగా వెళ్లాడు నరేంద్రుడు!
కాని ‘స్నేహితులు’ వదిలేటట్లు లేరు. నరేంద్రుణ్ణి ఎలాగైనాసరే వక్రమార్గం లోకి దింపాలని వారు కంకణం కట్టుకొన్నట్లు ప్రవర్తించసాగారు. ఒక రోజు నరేం ద్రుడు ఒక మిత్రుని ఇంటికి వెళ్లాడు. అక్కడ మిత్రులందరూ ఆటపాటల్లో ఉల్లా సంగా గడిపారు. ఆ తరువాత నరేంద్రుడు విశ్రాంతికై ఒక గదిలోకి వెళ్లాడు. అప్పుడు ఆ మిత్రులు అంతకుముందే చేసిన ఏర్పాటు ప్రకారం ఒక యువతి ఆ గదిలోకి వెళ్లింది. తనను తాను మంచిదానినిగా పరిచయం చేసుకొని, పేదరికం వలన అష్టకష్టాలు పడుతున్నట్లు చెప్పింది. ఆమె కల్లబొల్లి మాటలు నమ్మి నరేంద్రుడు ఆమెను సాంత్వనపరిచే రీతిలో కొన్ని మాటలు చెప్పాడు. కాసేపట్లో ఆమె దురు ద్దేశంతో అతణ్ణి సమీపించి తన నిజస్వరూపం బట్టబయలు చేసింది. దాంతో నరేంద్రుడు నిష్కర్షగా ఆమెను గదిలో నుండి బయటికి పంపివేశాడు. ఆమె తిన్నగా ఆ మిత్రుల వద్దకు వెళ్లి, “సాధుపుంగవుని వద్దకు నన్ను పంపించారే” అంటూ కసురుకొంది.
మరొకసారి జరిగిన సంఘటన గురించి స్వయంగా నరేంద్రుడు ఇలా చెప్పాడు: “నా మిత్రులలో కొందరు వక్రమార్గంలో డబ్బు సంపాదించేవారు. నా స్థితి గురించి విన్న వారు ఈ తరుణాన్ని వినియోగించుకొని నన్ను తమ వైపు లాగడానికి ప్రయత్నించారు. వారిలో కొందరు నా మాదిరి హఠాత్తుగా పరిస్థితులు తారుమారు కావడంతో పొట్ట గడవడానికై అవినీతి మార్గాల్లో వెళ్లిన వారు. వారు నిజంగానే నా పట్ల జాలి వహించారు. మహామాయ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ధనవంతురాలైన ఒక స్త్రీ చాలాకాలంగా నా మీద కన్ను వేసింది. ప్రస్తుతం నా పరిస్థితిని సదవకాశంగా తీసుకొని ఆస్తితో పాటు తననూ స్వీకరించి దారిద్ర్యానికి స్వస్తి చెప్పమని కబురు పంపించింది! ఆ ప్రతిపాదనను జుగుప్సతో తిరస్కరించాను. మరో స్త్రీ కూడా నన్ను ఆకర్షించ డానికి ప్రయత్నించింది. ‘అమ్మాయీ! ఒక గుప్పెడు బూడిద కాబోయే ఈ శారీరక సుఖం కోసం ఇంతదాకా ఏదేదో చేశావు! ఇదుగో మరణం నీ ముందే ఉంది. దానిని ప్రతిఘటించడానికి నువ్వు ఏదైనా చేసివున్నావా? తుచ్ఛమైన తలంపులను వదలిపెట్టు. భగవంతుణ్ణి ఆర్తితో ప్రార్థించు’ అని ఆమెకు హితవు చెప్పాను.”
కాని తనకు అవినీతి మార్గాలు చూపిన వారి మీద కూడా నరేంద్రుడు కోప గించుకోలేదు. విధి ఇలా ఉన్నప్పుడు ఎవరిని ఎందుకోసం నిందించాలి? వారితో కూడా తన మనస్సులోని విషయాన్ని చెప్పేవాడు; సన్న్యాస జీవిత మహత్వాన్ని గురించి చెప్పేవాడు. అయినప్పటికీ వారు మాత్రం మళ్లీ ఆతణ్ణి లౌకిక విషయాల వైపు లాగడానికే ప్రయత్నించేవారు. “జీవితంలో ఎలాంటి నిర్ణయానికీ రాకుండా ఎందుకు ఇలా ఉన్నావు? ధనం సంపాదించే ప్రయత్నంలో తీవ్రంగా మునిగిపో. అప్పుడే కదా సుఖమయ జీవితం గడపగలవు!’ అంటూ ఉపదేశించేవారు. అందుకు నరేంద్రుడు, “నాకూ అలాంటి ఆలోచనలు రాకపోలేదు. కీర్తి ప్రతిష్ఠలు, పదవీ ఐశ్వర్యమూ, అంతస్తులతో కూడిన జీవితం గడపాలనే ఆలోచన నాలో తరచు కలగడం కద్దు. కాని, బాగా లోతుగా ఆలోచించినప్పుడు, ఈ ధ్యేయం అర్థరహితమని తోచేది. మరణం అనేదొకటి ఈ లోకంలో ఉన్నదే! దాని కబంధ హస్తాల నుండి ఎవరైనా తప్పించుకోగలరా? సన్న్యాసులు మరణపు పిడికిలి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సత్యమైన, శాశ్వతంగా మార్పు లేని వస్తువును అన్వేషిస్తున్నారు. కనుక సన్న్యాస జీవితమే సర్వోత్కృష్టమైనదిగా నేను భావిస్తున్నాను” అన్నాడు. అయినప్పటికీ మిత్రులు వదలిపెట్టలేదు. వారిలో ఒకడు, “దక్షిణేశ్వరంలోని వృద్ధుడే నరేంద్రుణ్ణి పాడుచేస్తున్నాడు, ఇతడి భవి ష్యత్తును నాశనం చేస్తున్నాడు” అన్నాడు. తరువాత నరేంద్రుణ్ణి చూసి, “నరేన్! నీకు సొంత బుద్ధి అనేది ఉంటే, ఆయన వద్దకు వెళ్లడం మానుకో. లేకపోతే నీ చదువు, భవిష్యత్తు నాశనమయిపోతాయి. నువ్వు ప్రతిభావంతుడివి; జీవితం వైపు మనస్సును మరలిస్తే నువ్వు సాధించలేనిది ఏదీ ఉండదు. కనుక దక్షిణేశ్వరానికి స్వస్తి చెప్పు” అని సలహా ఇచ్చాడు. “ఇలా చూడండి! ఆయన గురించి మీకు ఏమీ తెలియదు; నాకూ పెద్దగా ఏమీ అర్థం కాలేదు; కాని, నేను ఆ వృద్ధుణ్ణి, శ్రీరామకృష్ణులను అమితంగా అభిమానిస్తున్నాను” అని గద్గదస్వరంతో చెప్పాడు నరేంద్రుడు.
వివాహ ప్రయత్నాలు
ఒక వంక మిత్రుల ప్రయత్నాలు ఇలా ఉండగా ఇంట్లో భిన్నమైన పరిస్థితిని నరేంద్రుడు ఎదుర్కోవలసి వచ్చింది. తండ్రి బ్రతికి ఉన్నప్పుడే ప్రారంభమైన వివాహ ప్రయత్నాలు మళ్లీ కొనసాగాయి; ఆతణ్ణి మరీ ఇబ్బందికి గురిచేశాయి. తండ్రి ఉన్నప్పుడు అతడు వివాహాన్ని తిరస్క రించడం పెద్ద సమస్యగా తోచలేదు. కాని ఇప్పుడది విశ్వరూపం దాల్చింది. కోరినంత కట్నంతో వధువును ఇవ్వడానికి సిద్ధమయినప్పుడు, ఈ దారిద్ర్య పరిస్థితిలో ఆతడు తిరస్కరించడం ఇంట్లోవారు జీర్ణించుకోలేకపోయారు. పేదరి కపు గుప్పిట నుండి విడివడడానికి కనిపిస్తున్న ఒకే దారిని అతడు మూసి వేస్తున్నాడని వారు భావించారు. చివరకు తల్లియైన భువనేశ్వరి ఒక అడుగు ముందుకువేసి ఒక పిల్లను చూసి నిశ్చయం కూడా చేసింది. ఆ తరువాత నరేం ద్రుడు గట్టిగా తిరస్కరించలేకపోయాడు. జరుగబోయేది జరుగనీ అనుకొని, తనను నమ్ముకొని ఉన్నవారి కోసం వివాహం చేసుకోవడానికే నిశ్చయించుకొన్నాడు.
నరేంద్రుని వివాహం గురించి శ్రీరామకృష్ణులకు తెలిసింది. వెంటనే ఒక బండి బాడుగకు తీసుకొని తిన్నగా నరేంద్రుని ఇంటికి వెళ్లారు. నరేంద్రుడు బయటికి వచ్చి ఆయనను కలుసుకొన్నాడు. అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు ఆతడి చేతులు పుచ్చుకొని, నేను విన్నది నిజమేనా అని అడిగారు. నరేంద్రుడు తలదించుకొని, “అవును. నేను వివాహానికి సమ్మతించాను” అన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు నరేంద్రుని చేతులను నొక్కి పట్టుకొని, “ఈ వివాహం జరగదు. ఇవి నా మాటలు సుమా!” అంటూ బండి ఎక్కి వెళ్లిపోయారు. అవాక్కై నిలబడి పోయాడు నరేంద్రుడు!
భగవంతుడు ఏం చేశాడు!
భగవంతుని పట్ల ఒక వ్యక్తి సంతరించుకొన్న విశ్వాస ప్రగాఢతా, నిశ్చలతా అగ్నిపరీక్షలు ఎదురైనప్పుడు తేలిపోతుంది. “నేను ఇంతగా దుఃఖీస్తున్నానే, ఈ భగవంతునికి కళ్లు లేవా?” అని ప్రశ్నించని సామాన్య వ్యక్తులు ఉండజాలరు. “కృష్ణా! నువ్వు దుష్టుడవు. నీ కొకటి చెబుతాను. నువ్వు నన్ను కౌగిలించుకొని నీ పాదపద్మాల మ్రోల శరణు ఒసగినా సరే, లేక నా చూపులకు అందకుండా నిలబడి ఆవేదన కలిగించినా సరే! నువ్వు నన్ను ఏం చేసినా నువ్వే నా సర్వస్వం. నువ్వు తప్ప నా కెవరూ లేరు!” అని చైతన్య మహాప్రభువు చెప్పినట్లు, భగవంతుణ్ణి దూషించినా ఆయననే విశ్వసించి జీవించడం సామాన్యమైన విషయం కాదు. నరేంద్రుడు ఏం చేశాడు? ఆయన మాటల్లోనే విందాం:
“ఇన్ని కష్టాలూ, పరీక్షలూ ఎదురైనప్పటికీ నా ఆస్తికత చెక్కుచెదరలేదు; ‘భగవంతుడు మంచే చేస్తాడు’ అనే భావనలో కించిత్తూ సందేహం జనించలేదు. ఉదయం లేవగానే భగవంతుణ్ణి స్మరించి, ఆయన దివ్యనామాన్ని ఉచ్చరిస్తూనే పడక నుండి లేస్తాను. ఆ తరువాత పరిపూర్ణ విశ్వాసంతో ఉద్యోగాన్వేషణకు బయలుదేరేవాణ్ణి. అలవాటు ప్రకారం ఒక రోజు భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ పడక నుండి లేచాను. ప్రక్క గదిలో ఉన్న మా అమ్మ అది విని చిరాగ్గా, ‘అది ఆపరా! చిన్నతనం నుండీ దేవుడు, దేవుడు అంటూ పల్లవి పాడుతున్నావు. ఆ దేవుడే ఇంత చేశాడు కదా! ఇంకా ఎందుకు పలవరిస్తావు!’ అని అంది. ఆమె మాటలు నా హృదయంలో గాఢంగా నాటుకుపోయాయి. ‘దేవుడనే వ్యక్తి నిజంగా ఉన్నాడా? ఒకవేళ ఉంటే, మనిషి హృదయపూర్వక ప్రార్థనలను చెవొగ్గి వింటాడా? అలా అయితే, ఇంతగా విలపిస్తున్నానే, దానికి ఎలాంటి జవాబూ రాదు ఎందుకు? సౌజన్యం మూర్తీభవించిన భగవంతుని సృష్టిలో ఇంత చెడు ఎక్కణ్ణుండి వచ్చింది? మంగళమయుడైన భగవంతుని పాలనలో ఇంత అమంగళ మెందుకు?’ అంటూ దీర్ఘంగా ఆలోచించసాగాను. ఇతరుల దుఃఖం చూసి తల్ల డిల్లిన విద్యాసాగర్ ఒకసారి, ‘భగవంతుడు మంచితనమే మూర్తీభవించిన వాడు, మంగళమయుడైన వాడు అయినప్పుడు లక్షలాది ప్రజలు కరవు కాటకాల భయానక గుప్పిట్లో చిక్కి పిడికెడు అన్నం కోసం అలమటిస్తూ మరణిస్తున్నా రెందుకు?’ అని అడిగారు కదా, ఆ వాక్కు పరిహసిస్తున్నట్లు నా చెవుల్లో ప్రతిధ్వనించాయి. ఆ రోజు భగవంతుని పట్ల ఎన్నడూ లేనంత విసుగు నాకు కలి గింది. ఇటువంటి సమయం కోసమే నిరీక్షిస్తున్నట్లుగా, ‘నిజంగానే భగవంతు డున్నాడా?’ అనే సందేహమూ నాలో తలెత్తింది.
“ఏదైనా రహస్యంగా చేయడమన్నది నా నైజానికి విరుద్ధం. చిన్నతనం నుండీ అంతే. భయం కారణంగానో, మరే ఉద్దేశం వల్లనో నా ఆలోచనలు నేను దాచుకోలేను, చేతలను మరుగుపరచడమనే మాటకే చోటులేదు. కనుక, ‘భగవం తుడు లేడు; ఒకవేళ ఉన్నప్పటికీ, ఆయనను గురించి చింతనచేసి ప్రయోజనం లేదు’ అని సాహసించి తక్కిన వారికి చెప్పి, దానిని నిరూపించడానికి నేను ప్రయ త్నించడంలో ఆశ్చర్యం ఏముంది! పర్యవసానం? నేను నాస్తికుణ్ణయిపోయాను, దుష్టులతో కలిసి మధుపానం చేస్తున్నాను, వెలయాళ్ల ఇంటికి పోతున్నానని ఏ మాత్రం సంశయించకుండా మాట్లాడసాగారు! ఎవరికీ అణగిమణగి మెలగే నైజం చిన్నతనం నుండే నాకు లేదు. అది ప్రస్తుతం తప్పుడు పుకారు వలన ఘనీభవించి కరడుగట్టింది. ‘ఈ దుఃఖమయమైన సంసారంలో ఏదో కొంతసేపయినా ఆ దుః ఖాలను మరచిపోవడానికి మధుపానం చేయడమో, వెలయాళ్ల వద్దకు వెళ్లడమో కించిత్తు కూడా తప్పు కాదు. ఈ రీతిలో సుఖం లభిస్తుందని నాకు నిశ్చయంగా తెలిస్తే ఎవరికీ భయపడకుండా నేనూ ఆ మార్గాన్ని అనుసరిస్తాను’ అంటూ వాళ్లు అడగకుండానే అందరితోను చెప్పసాగాను.
“ఈ వార్త గాలికన్నా వేగంగా వ్యాపించింది. నేను చెప్పిన విషయాలకు చెవులు, ముక్కు అన్నీ జతచేర్చి శ్రీరామకృష్ణులకూ, ఆయన భక్తులకూ చేర డానికి ఎక్కువ సమయం పట్టలేదు. నిజం తెలుసుకోగోరి కొందరు వచ్చారు. తాము విన్నవన్నీ నమ్మకపోయినా, కొన్నిటినైనా నమ్మవలసి ఉందని వారు సూచనప్రాయంగా తెలిపారు. వారు నన్ను ఇంత హీనంగా పరిగణించడం చూసి నా మనస్సు క్షోభించింది. అయినా సహనం పాటించాను. మనస్సును రాయి చేసుకొన్నాను. ‘శిక్ష పడుతుందని భయపడి భగవంతుణ్ణి విశ్వసించడం పిరికి తనం’ అంటూ ఉద్వేగంతో చెప్పి హ్యూమ్, పెయిన్, మిల్, కామ్టేలాంటి పలువురు పాశ్చాత్య తాత్త్వికులను ఉదాహరణగా చూపి, ‘భగవంతుడు ఉన్నాడనడానికి ఎలాంటి ఆధారమూ లేదు’ అంటూ తీవ్ర ఉద్వేగంతో వాదించాను. సంస్కరించ లేనంతగా నేను చెడిపోయాను అని నిశ్చయించుకొని వారు వెళ్లిపోయారు. నాకు చాలా సంతోషం కలిగింది.
“శ్రీరామకృష్ణుల గురించి ఆలోచన మెదలినప్పుడు మనస్సు సందిగ్ధా వస్థలో పడిపోయింది. ఇవన్నీ విని ఆయన కూడా బహుశా నమ్ముతారేమోనని పించింది. ఒక్క క్షణమే. ‘ఇలాంటి నిరాధారమైన పుకార్లు విని నేనెటువంటి వాడినో ఆయన నిర్ధారణ చేసే పక్షంలో అలాగే చేసుకోనీ, నేను కలత చెందను’ అని మరుక్షణమే సరిపెట్టుకొన్నాను. కాని ఆయన దీనికి ఎలా స్పందించారో విని ఆశ్చర్యపోయాను. మొదట ఆయన ఎలాంటి బదులూ చెప్పలేదు. ఆ తరువాత భవనాథ్ విలపిస్తూ, ‘మహాశయా! నరేంద్రుడు ఇంతగా దిగజారిపోతాడని నేను కలలో సైతం ఊహించలేదు’ అని చెబుతున్నప్పుడు ఆగ్రహంతో, ‘మూర్ఖుడా! వాగ బోకు! నోరు ముయ్యి. నరేంద్రుడు ఆ రకంగా వ్యవహరించడని జగజ్జనని నాతో చెప్పింది. ఇలాగే నువ్వు మరోసారి మాట్లాడావంటే నీ ముఖం కూడా చూడను’ అని అతడితో నిష్కర్షగా చెప్పారట.
“కాని అహంకరించి ఈ విధంగా నాస్తికులమైతే ఏం ప్రయోజనం? చిన్న తనం నుండి, అందునా ప్రత్యేకించి శ్రీరామకృష్ణులను దర్శించాక నేను పొందిన అద్భుతమయిన దివ్యదర్శనాలు నా హృదయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తు న్నాయి కదా! కనుక, ‘నిశ్చయంగా భగవంతుడు ఉన్నాడు. ఆయనను సాక్షాత్క రించుకొనే మార్గమూ ఉంటుంది. లేకపోతే జీవించ నవసరం లేదు. అన్ని దుఃఖా లకూ, ఆటంకాలకూ మధ్య ఆ మార్గాన్ని కనుగొనే తీరాలి’ అని భావించాను. ఈ విధంగా రోజులు దొర్లిపోసాగాయి. మనస్సు సందేహానికీ స్పష్టతకూ మధ్య ఊగిసలాడింది. మెల్లమెల్లగా ప్రశాంతత వైదొలగిపోసాగింది, దారిద్ర్యమూ ఏ విధంగాను తగ్గేటట్లు కనిపించడం లేదు.
మానసిక ఆవేదనను మార్చిన అనుభవం
“వేసవి గడచి వర్షాకాలం ప్రారంభమయింది. అప్పుడూ యథాప్రకారం ఉద్యోగాన్వేషణ కొనసాగిస్తూవచ్చాను. ఒక రోజు వర్షంలో బాగా తడిసిపోయి రాత్రి ఇంటికి తిరిగివస్తున్నాను. శరీరం బాగా డస్సిపోయింది, మనస్సు దానితో చేరిపోయింది. ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో, ప్రక్కనే ఉన్న ఒక ఇంటి అరుగు మీద కుప్పకూలిపోయాను. బాహ్యస్మృతి ఉందో లేదో తెలియదు. కాని ఏవేవో ఆలోచనలు ఒకటి వెంట ఒకటిగా తలెత్తడమూ, తొలగిపోవడమూ జ్ఞాపకం ఉంది. వాటిని త్రోసివేయడానికి ఏదో ఒక భావనలో మనస్సును ప్రగాఢంగా లీనం చేయలేకపోయాను. ఆ సమయంలో ఏదో ఒక దివ్యశక్తి నా ఆంతరికమైన తెరలను ఒకటి వెంట ఒకటిగా తొలగిస్తూన్నట్లుగా అనిపించింది. ఇన్ని రోజులుగా నా మనస్సును గందరగోళానికి లోను చేస్తున్న, ‘మంచితనం మూర్తీభవించిన భగవంతుని సృష్టిలో చెడు ఎందుకు ఉంటుంది? భగవంతుని కఠోర న్యాయంతోపాటు అపార కారుణ్యమూ ఎలా కలగలసి ఉంటుంది?’ లాంటి పలు సంశయాలకు శాశ్వతమైన పరిష్కారాలను నా హృదయాంతరాళంలో కను గొన్నాను. కట్టలు తెగిన ఆనందంతో లేచాను. శరీరంలో అలసట కాస్త కూడా లేకుండాపోయింది. మనస్సు ఒక అద్భుతమయిన శక్తితోను, ప్రశాంతతతోను భాసించింది. అప్పుడు రాత్రి ముగిసి తెలవారడానికి కాస్త సమయమే ఉంది.
సన్న్యాస స్వీకరణకు నిర్ణయం
“లోకుల నిందాస్తుతులను త్రోసిరాజన్నాను. సాధారణమైన మనుషుల్లా డబ్బు సంపాదించడానికీ, కుటుంబాన్ని పోషించడానికీ, సుఖాలను అనుభవించడానికీ నేను జన్మించలేదనే భావన నా మనస్సులో పాతుకుపోయింది. నా తాతలా సర్వసంగ పరిత్యాగానికి నేను రహస్యంగా తయారయ్యాను. అందుకోసం తేదీ కూడా నిర్ణయించుకున్నాను. కాని ఆశ్చర్యం! ఆ రోజు శ్రీరామకృష్ణులు కలకత్తాలో ఒక భక్తుని ఇంటిని పావనం చేయబోతున్నారని తెలియవచ్చింది. మంచిదే, గురువు దర్శనానంతరం శాశ్వతంగా ఇంటిని పరిత్యజించగోరాను. కాని నేను ఆయనను చూడగానే, ‘ఈ రోజు నువ్వు నాతోపాటు దక్షిణేశ్వరం వచ్చే తీరాలి’ అని గట్టిగా పట్టుబట్టారు. ఎన్నో కుంటిసాకులు చెప్పిచూశాను. కాని ఆయన ఏదీ వినిపించుకోలేదు. ఇక గత్యంతరం లేక ఆయనతోపాటు వెళ్లాను. బండిలో పోతున్నప్పుడు కూడా ఆయన ముక్తసరిగానే మాట్లాడారు. దక్షిణేశ్వరం వెళ్లాక కాసేపు ఇతరులతోపాటు ఆయన గదిలో కూర్చున్నాను. ఇంతలో శ్రీరామకృష్ణులకు పారవశ్య స్థితి కలిగింది. అమాంతం అట్లే నా వైపుగా వచ్చారు. నన్ను ఆప్యాయంగా పట్టుకొని కళ్ల వెంట నీరు ధారలు కట్టగా,
చెప్పగానూ లేము చెప్పకుండను లేము
నమ్మలేకున్నాము పూర్తిగా ఓ రాధా!
ఇప్పుడే నిను గోలుపోవనున్నామని….*
అనే పాటను పాడారు.
“హృదయంలో పొంగిపొరలుతున్న ఉద్వేగ ప్రవాహాన్ని ఇక ఆపుకోలేక పోయాను. ఆయన మాదిరి నా కళ్లలోనూ నీరు ధారకట్టింది. అంతా ఆయనకు తెలిసిపోయిందని స్పష్టంగా నాకు అర్థమయింది. మా ఇద్దరి మధ్య ఏం జరుగు తున్నదో ఎవరికీ అంతుబట్టలేదు. శ్రీరామకృష్ణులు మామూలు స్థితికి వచ్చాక కొందరు, ‘విషయం ఏమిటి?’ అని అడిగారు. ఆయన నర్మగర్భంగా నవ్వుతూ, ‘ఓ అదా, అది మా ఇద్దరికీ సంబంధించింది’ అన్నారు. రాత్రి అందరూ సెలవు పుచ్చుకొని వెళ్లిపోయాక, నన్ను దగ్గరకు పిలిచి, గద్గద స్వరంలో, ‘నాకు తెలుసు నాయనా! నువ్వు జగజ్జనని కార్యం నిమిత్తమే వచ్చావని నాకు బాగా తెలుసు. నువ్వు లౌకిక జీవితం గడపలేవు. అయినప్పటికీ నేను ఉన్నంతదాకా నా కోసం ఇంట్లోనే ఉండు’ అని చెబుతూ, కన్నీరుమున్నీరయినారు.”
కాళీ ఆడిస్తున్నది!
మర్నాడు శ్రీరామకృష్ణుల వద్ద సెలవు పుచ్చుకొని నరేంద్రుడు ఇంటికి బయలు దేరాడు. కుటుంబం గురించిన కలతలు అతడి మనస్సును క్రమ్ముకొన్నాయి. ఉద్యోగాన్వేషణ మళ్లీ మొదలయింది. ఒక న్యాయవాది కార్యాలయంలో పనిచేస్తూ, కొన్ని పుస్తకాలను అనువదిస్తూ ఏదో కాస్త సంపాదించి ఏదో రకంగా కుటుంబ ఖర్చులు వెళ్లదీయసాగాడు. కాని స్థిరమైన ఉద్యోగం ఏదీ లభించలేదు. నరేంద్రుని జీవితం ఇలా గడిచిపోతున్న రోజుల్లో ఒకనాడు హాజ్రా, గురుదేవులతో నరేంద్రుని దారిద్ర్య స్థితిని గురించి ప్రస్తావించాడు. “అతడు అనుభవిస్తున్న బాధలు చాలవన్నట్లు ఇప్పుడు న్యాయ స్థానంలో దావా కూడా తోడయింది” అన్నాడు హాజ్రా. “అతడు కాళీమాతను అంగీకరించడం లేదు. లోకంలో జీవించాలంటే ఆమెను అంగీకరించి తీరాలి” అన్నారు ఠక్కున శ్రీరామకృష్ణులు.
నరేంద్రుని మనస్సులో కూడా ఒక రోజు ఈ ఆలోచన మెదలకపోలేదు. ఈ మధ్యకాలంలో ఒకటి రెండుసార్లు భక్తుల ఇళ్ల వద్ద శ్రీరామకృష్ణులను కలుసు కొన్నాడు కూడా. సెప్టెంబర్ 14 వ తేదీ అతడు దక్షిణేశ్వరం వెళ్లాడు. ఆ రోజు ఉదయం కొన్ని పాటలు పాడాడు. యథాప్రకారం అతడి పాటలు విని శ్రీరామ కృష్ణులు సమాధిమగ్నులయ్యారు. మధ్యాహ్నం జగజ్జననిపై కొన్ని పాటలు పాడాడు. సామాన్యంగా బ్రహ్మసమాజపు పాటలనే పాడే నరేంద్రుడు జగజ్జననిపై పాటలు పాడడం శ్రీరామకృష్ణులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. “అదెలా?” అంటూ హాజ్రాను ఆశ్చర్యపోతూ అడుగుతూనే, ఉత్తరం వైపు వసారాలో నిలబడి ఉన్న నరేంద్రుని వద్దకు వెళ్లారు. “ఏం నాయనా, నేడు జగజ్జనని గురించి పాటలు పాడావే!” అని అడిగారు. కాని నరేంద్రుడు అందుకు జవాబేమీ చెప్పలేదు. ఏదో ఒక శక్తి ఆవేశించినట్లు అతడు మెల్లగా నడుస్తూ గంగాతీరం వైపు వెళ్లాడు. పోటు ప్రారంభం కావడంతో గంగానది ఉత్తరాభిముఖంగా ప్రవహించసాగింది. సూర్యుడు పశ్చిమాద్రిన అస్తమిస్తూండగా ఆకాశం సిందూర వర్ణాన్ని సంతరించు కొని, సిందూర ఛాయగల జగజ్జనని చింతనలను అతడిలో రేకెత్తించినది. ఆమె స్మృతులలో లీనమైపోయి మళ్లీ జగజ్జననిని స్తుతిస్తూ పాటలు పాడనారం భించాడు. ఒకటి తరువాత ఒకటిగా వరుసగా కొన్ని పాటలు పాడాడు. శ్రీరామ కృష్ణులు ప్రక్కనే నిలబడి వింటున్నారు. జగజ్జనని నరేంద్రుణ్ణి ఆడించనారంభిం చిందా? లేకపోతే జగజ్జనని భావనను నరేంద్రునిలో శ్రీరామకృష్ణులు ప్రేరేపించనారంభించారా?
కాళీమాతను అంగీకరించడం
దుఃఖంతో శోకించని హృదయం ఉండదు. అదేవిధంగా, గత్యంతరం లేని స్థితిలో భగవదభిముఖం కాని హృదయం కూడా ఉండదు. తత్త్వాలు ఏకరువు పెట్ట వచ్చు, సిద్ధాంతాలు ప్రతిపాదించవచ్చు. కాని కాలి క్రింది భూమి చీలిపోయే పరిస్థితి ఎదురయినప్పుడు ఎక్కణ్ణుంచి అయినా ఒక అభయహస్తం వచ్చి చేయూతనివ్వదా అనే ఆశాకిరణం మనిషి మనస్సులో మెరవకపోదు. సామాన్యంగా పేదవారు తమ పేదరికంతో సహజంగానే రాజీపడిపోతారు. నరేంద్రుడు కూడా పేదవానిగానే జన్మించి ఉంటే ఈ పరిస్థితి అతణ్ణి అంతగా బాధించివుండేది కాదు. కాని నిన్నటి దాకా మహారాజుగా జీవించినవాడు నేడు బికారిగా మారిపోవడం ఎంత ఘోరం! నిన్నటి దాకా ఎలాంటి చీకూచింతా లేకుండా సీతాకోక చిలుకలా స్వేచ్ఛగా ఎగురుతూ విహరించిన అతడి మీద నేడు ఎంత భారం! ప్రతిసారి ఇంట్లోకి వస్తు న్నప్పుడల్లా, ‘ఈ రోజు నా కుమారునికి ఉద్యోగం దొరికి ఉంటుందా? మా దారిద్ర్యం తీరిపోతుందా?’ అనే ఆశతో ఎదురయ్యే తల్లి ముఖం; ‘ఈ రోజు తమ్ముడు ఏదో దారి కనిపెట్టి ఉంటాడా?’ అనే ఆతురతతో కనిపించే అక్కల ముఖాలు; ‘ఈ రోజు అన్నయ్య ఏదైనా కొని తెచ్చివుంటాడా?’ అనే ఆసక్తితో చెల్లీ తమ్ముళ్ల ముఖాలు; – వీరందరికీ ‘లేదు’ అనే సమాధానంతో ఇంట్లోకి అడుగుపెట్టే యువ కుని మనస్సు పొందే ఆవేదన వర్ణనాతీతం. మార్గం ఎక్కడ లభిస్తుందని అన్వేషిం చిన నరేంద్రుని హృదయానికి జగజ్జనని స్ఫురించింది! మానవ సహాయాలు ఏవీ అందనప్పుడు జగజ్జననినే ఆశ్రయించి చూద్దాం అని అతడు చొరవ తీసు కొన్నాడు. ఆ తరువాత జరిగింది ఆతడి మాటల్లోనే విందాం:
“శ్రీరామకృష్ణుల ప్రార్థనను భగవంతుడు మన్నిస్తాడని నాకు జ్ఞాపకం వచ్చింది. నా కోసం, నా తల్లికి నా సోదరులకు అన్నవస్త్రాలకు లోటు లేకుండా మార్గం చూపించమని జగజ్జననిని ప్రార్థించమని ఆయనను ప్రాథేయపడాలి; తప్పకుండా ఆయన నాకు ఈ సహాయం చేస్తారని ఆశించి దక్షిణేశ్వరం వెళ్లాను. ఆయనవద్దకు వెళ్లి, ‘నా తల్లీ, సోదరుల దారిద్ర్యం తొలగించమని మీరు జగజ్జననినిప్రార్థించాలి” అంటూ వేడుకొన్నాను. అందుకు శ్రీరామకృష్ణులు, ‘నాయనా! ఇలానేను కోరగలనా? నువ్వే వెళ్లి ఎందుకు ప్రార్థించరాదు? నువ్వు కాళీమాతను అంగీకరించడం లేదు. అందుకే ఇన్ని బాధలు’ అన్నారు. వెంటనే నేను, ‘నాకు ఆమె తెలియదు. నా కోసం మీరే ఆమెకు విన్నవించండి, విన్నవించే తీరాలి. అలాచేయనంత వరకు మిమ్మల్ని ముమ్మాటికీ వదలను’ అన్నాను. శ్రీరామకృష్ణులు ఆప్యాయత ఉట్టిపడే స్వరంలో, ‘నీ దుఃస్థితిని తొలగించమని పలుమార్లుజగజ్జననిని ప్రార్థించాను. నువ్వు ఆమెను అంగీకరించనందువలన నా ప్రార్థనను ఆమె మన్నించడం లేదు. పోనీలే, ఈ రోజు మంగళవారం. ఈ రాత్రి కాళికా లయానికి వెళ్లి ఆమెను ఆరాధించు; నువ్వు ఏం కోరినా తప్పక ఆమె అనుగ్రహిస్తుంది. నా తల్లి చైతన్య స్వరూపిణి, బ్రహ్మశక్తి, సంకల్పమాత్రంగానే ఈ లోకాన్నంతాసృజించింది. ఆమె తలచుకొంటే చేయలేనిది ఏదైనా ఉందా?’ అన్నారు.
“కాళీమాతను ప్రార్థించగానే నా కష్టకాలం తీరిపోతుందనే ప్రగాఢ విశ్వాసంనాలో కలిగింది. గంపెడు ఆశతో రాత్రి కోసం ఎదురుచూశాను. చివరికి రాత్రిరానే వచ్చింది. దాదాపు తొమ్మిది గంటలప్పుడు గురుదేవులు నన్ను ఆలయానికి వెళ్లమన్నారు. అలా వెళుతుండగానే ఒక దివ్యమైన మత్తు నన్ను ఆవహించింది. కాళ్లు తడబడ్డాయి. జగజ్జననిని నిజంగానే దర్శించబోతున్నాను, ఆమెపలుకులు వినబోతున్నాను అనే ప్రగాఢ విశ్వాసం నా మనస్సులో చోటుచేసుకొంది. తక్కినదంతా నేను మరచిపోయాను. ఆ ఆలోచనలో మునిగిపోయి ఆలయానికి వెళ్లాను. లోపల అడుగుపెట్టినప్పుడు కాళీమాత నిలబడి ఉంది! మూర్తీభవించిన ప్రేమస్వరూపిణిగా, సాటిలేని సౌందర్యానికి ఆలవాలంగా, సజీవచైతన్యమూర్తిగా ఆమె నిలబడి ఉంది! భక్తిప్రేమలతో నా హృదయం పొంగిపొరలింది. మైమరచి పదేపదే ఆమెకు ప్రణమిల్లి, ‘తల్లీ, నాకు వివేకం ప్రసాదించు, నిన్ను సదా సర్వవేళలా దర్శించగలిగే భాగ్యం అనుగ్రహించు’ అని ప్రార్థించాను. మనస్సు ప్రశాంతమైంది. లోకం పూర్తిగా మాయమైపోయింది. కాళీమాతమాత్రమే నా హృదయాన్ని నింపివేసింది.
“నేను తిరిగి వెళ్లగానే శ్రీరామకృష్ణులు, ‘ఏం నాయనా, దారిద్ర్యం అంతరించాలని జగజ్జననిని వేడుకొన్నావు కదా!’ అని అడిగారు. నేను దిగ్భ్రాంతిచెందాను. ‘లేదు, మరచిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి?’ అని అడిగాను. అందుకు ఆయన, ‘వెళ్లు, వెళ్లు, మళ్లీ వెళ్లు. వెళ్లి నీ కోర్కెలను విన్నవించుకుని రా’ అన్నారు. నేను మళ్లీ ఆలయానికి వెళ్లాను. కాని కాళీమాత సాన్నిధ్యంలోకి వెళ్లగానే అంతా మరచిపోయాను. పదేపదే జగజ్జననికి ప్రణమిల్లి జ్ఞానం, భక్తి ఇత్యాదులు అనుగ్రహించమని వేడుకొని తిరిగి వచ్చాను. ‘ఏమిటి, ఈసారైనా అడిగావా?’ నవ్వుతూ అడిగారు శ్రీరామకృష్ణులు. నేను నిశ్చేష్టుడినయ్యాను. ‘లేదు, జగజ్జననిని చూడగానే ఏదో దివ్యశక్తి ప్రభావంతో సమస్తం మరచిపోయి జ్ఞానం, భక్తి వంటివి అనుగ్రహించమని మాత్రమే వేడుకొన్నాను. ఇప్పుడు ఏం చేయాలి?’ అని అడి గాను. అందుకు ఆయన, ‘ఎంత అప్రయోజకత్వం! కాసేపు నిన్ను నువ్వు అదు పులో ఉంచుకొని కావలసింది అడగలేకపోయావా? వీలైతే మరోసారి వెళ్లు’ అన్నారు. మూడవసారి బయలుదేరాను.
“కాని కాళిమాత సన్నిధికి వెళ్లీవెళ్లగానే చెప్పలేని సిగ్గు నన్ను ఆవహించింది. ఎంతటి అల్ప వస్తువుకై జగజ్జననిని ఆశ్రయించాను. శ్రీరామకృష్ణులు తరచు, ‘మహారాజు అనుగ్రహం పొంది గుమ్మడికాయను కోరినట్లు’ అనేవారు కదా, అట్టి మూర్ఖత్వమే ఇది! ఎంతటి హేయమైన చింతన! సిగ్గుతోను, ఆవేదనతోను పదేపదే జగజ్జననికి ప్రణమిల్లి, ‘తల్లీ, నాకు మరేదీ వద్దు. విశుద్ధ భక్తి జ్ఞానాలు మాత్రం ప్రసాదించు తల్లీ!’ అని వేడుకొన్నాను.
“ఆలయం నుండి బయటికి రాగానే ‘ఇదంతా శ్రీరామకృష్ణుల లీల’ అని గ్రహించాను. లేకుంటే ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, మూడుసార్లు, ‘సిరి కావా’ లని ప్రార్థించకుండా ఉండేవాణ్ణా! అందువలన ఆయన వద్దకు వెళ్లి, ‘మీరే నన్నిలా మరపింపజేశారు. నా తల్లీ సోదరుల దారిద్ర్య విముక్తికి మీరే అనుగ్రహిం చాలి’ అని పట్టుబట్టాను. అప్పుడు ఆయన, ‘ఎవరి కోసమూ ఇలాంటి ప్రార్థనలు చేయడం నా వల్ల కాదు. నా నోట అలాంటి మాటలు రావు. అందుకే జగజ్జననితో నీకు అవసరమైనది కోరుకోమనీ, అది ఈడేరుతుందనీ చెప్పాను. అది నువ్వు చేయ లేకపోయావు. నీ నుదుట ప్రాపంచిక సుఖాలు వ్రాసిపెట్టలేదు. నేనేం చేయను?’ అని అడిగారు. నేను ఆయనను అంత తేలికగా వదలిపెడతానా? ‘అలా చెప్ప కండి. నా కోసం మీరు ప్రార్థించే తీరాలి. మీరు చెబితేనే వారి దుర్దశ తొలగిపోతుం దనే ప్రగాఢమైన విశ్వాసం నాకుంది’ అన్నాను. నా పట్టుదలను చూసి ఆయన, ‘మంచిది! అత్యావశ్యకమైన అన్నవస్త్రాదులకు వారికి ఏ లోటూ ఉండదు’ అన్నారు.”
శ్రీరామకృష్ణుల మహదానందం
కాళీమాతను స్వీకరించి ఆమెను ప్రార్థించడం నరేంద్రుని జీవితంలో అతిముఖ్యమైన సంఘటన. ఈ విషయంలో శ్రీరామకృష్ణులు పరమానందభరితులయ్యారు. మర్నాడు దక్షిణేశ్వరానికి వచ్చిన వైకుంఠనాథ్ ఈ సంఘటనను ఎలా చెప్పాడో వింటే శ్రీరామకృష్ణుల ఆనందపారవశ్యాన్ని అవగతం చేసుకోవచ్చు.
“పగటి పూట నేను దక్షిణేశ్వరం వెళ్లాను. అప్పుడు శ్రీరామకృష్ణులు మంచం మీద కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు బయట నిద్రిస్తున్నాడు. మరెవరూ లేరు. శ్రీరామకృష్ణుల ముఖారవిందాన పరమానందం తొణికిసలాడుతూన్నది. ఆయన వద్దకు వెళ్లి ప్రణమిల్లగానే ఆయన నరేంద్రుణ్ణి చూపుతూ, ఇలా అన్నారు: ‘ఇదుగో! ఇతణ్ణి చూడు. ఎంతో సజ్జనుడు. పేరు నరేంద్రుడు. ఇంతవరకు ఇతడు జగజ్జననిని అంగీకరించలేదు. కాని నిన్న అంగీకరించాడు. దారిద్ర్యంలో మ్రగ్గు తున్నాడు. కనుక కాళీమాత వద్దకు పంపి, ధనధాన్యాదుల కోసం ప్రార్థించ మన్నాను. అతడు దానిని అడగలేకపోయాడు. అలా అడగడం అవమానమట. ఆలయం నుండి తిరిగివచ్చి, ‘ఆమెను గురించి ఒక పాటను నేర్పించండి” అని నన్ను అడిగాడు. ‘తారాదేవీ నువ్వే అమ్మా!’ అనే పాటను నేర్పాను. రాత్రంతా ఆ పాటనే పాడుకొంటూ ఉన్నాడు. ఇప్పుడు నిద్రపోతున్నాడు. (నవ్వుతూ) నరేంద్రుడు కాళీమాతను అంగీకరించాడు! మంచిది, అంతేకదా?’ అని అడిగారు. చిన్నబిడ్డలా ఆయన ఆనందించడం చూసి నేను, ‘అవునండీ, మంచిదే’ అన్నాను. కాసే పయ్యాక నవ్వుతూ, ‘నరేంద్రుడు కాళీమాతను అంగీకరించడం గొప్ప విషయమే కదా!’ అన్నారు మళ్లీ. ఇలా పదే పదే చెబుతూ ఆనందిస్తున్నారు.
“సాయంత్రం దాదాపు నాలుగు గంటలప్పుడు నరేంద్రుడు శ్రీరామకృష్ణుల ప్రక్కకు వచ్చి కూర్చున్నాడు. సెలవు పుచ్చుకొని కలకత్తాకు తిరిగి వెళ్లబోతున్నా డనిపించింది. అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు భావపారవశ్య స్థితిని పొందారు. ఆ స్థితిలోనే నరేంద్రుని శరీరాన్ని స్పృశించారు. తరువాత అతడి ఒడిలో కూర్చొని మాట్లాడారు. శ్రీరామకృష్ణులు నరేంద్రునితో ఎంత సన్నిహితంగా మెలగుతున్నారో అప్పుడు నాకు అర్థమయింది.”
కాళీ : జీవితపు మరో ప్రక్క
కాళీమాతను నరేంద్రుడు అంగీకరించడాన్ని శ్రీరామకృష్ణులు ఒక అతి ముఖ్యమైన సంఘటనగా పరిగణించారు. ఎందుకు? కాళీమాత అంటే- శ్మశానం, చుట్టూ కాలుతున్న శవాలు, పిశాచాల భయానక తాండవం, నక్కల ఊళలు, విరబోసుకున్న శిరోజాలు, రక్తం ఓడుతున్న నాలుక, మానవ కపాలాలతో కూర్చబడిన హారం, చేత రక్తం స్రవించే ఖడ్గం, నరకబడిన శిరస్సు, శివుని ఛాతీ మీద నిలబడిన భంగిమ – ఇదే ఆమె ఆకారం! జీవితపు మరో ప్రక్క చూపించే ప్రతీకగా విలసిల్లుతున్నదామె. సుఖం, హాయి, మాధుర్యం, అందం, ఆనందాల కలయిక మాత్రమే జీవితం కాదు. జీవితానికి మరొక వైపు కూడా ఉంది. దుఃఖం, శోకం, చెడు, ఘోరం, ఏడ్పులతో నిండినదది. అది ఎక్కణ్ణుండి వచ్చింది? స్వామి వివేకానంద మాట ల్లోనే దానిని విందాం:
“చెడు ఎందుకున్నది? దేవుడు మంచి చెడులు రెండింటికీ కారకుడని చెప్పడంలోనే ఈ ప్రశ్నకు జవాబు ఉంది….. దేవుడు సర్వదా మంగళస్వరూపుడే అయితే ఈ మంచి చెడులన్నింటికి ఎవరు బాధ్యులు? సైతాన్ అనే పెద్దమనిషి ఒకడున్నాడని క్రైస్తవులు, మహమ్మదీయులు అంటారు. ఇద్దరు (దైవాలు) పని చేస్తున్నారని మీరెలా చెప్పగలరు? ఉన్న దొక్కరే అయివుండాలి…. తాకితే పిల్ల వాని వేళ్లను కాల్చివేసే అగ్ని ఆహారాన్ని పచనం చేస్తుంది. అగ్ని మంచిదనిగాని, చెడుదనిగాని ఎలా చెప్పగలరు? అగ్నిని సృష్టించిన వారిద్దరు వేర్వేరని ఎలా చెప్ప గలరు? అశుభమనే దాన్నంతా సృష్టించిన వారెవరు? దేవుడే. ఇంతకు మించి సమాధానం లేదు! మృత్యువును, జీవనాన్ని, ప్లేగును, అంటువ్యాధులను సమ స్తాన్ని ఆయనే పంపుతాడు. దేవుడు అలాంటివాడే అయితే అతడు మంగళ కరుడు – అమంగళకరుడు; అతడు సౌందర్యరూపుడు – వికారుడు; అతడు జీవం – మృత్యువు కూడా. ఇలాంటి దేవుణ్ణి ఉపాసించడం ఎలా? భీషణస్వరూ పుణ్ణి ఆత్మ నిజంగా ఎలా ఉపాసించ నేర్చుకోగలదో మనం తెలుసుకొందాం; అప్పుడా ఆత్మకు శాంతి కలుగుతుంది. మీకు శాంతి ఉందా? ఆందోళనల నుండి మీరు ముక్తులా? ఇలా తిరిగి ముందు భీకరమైన మూర్తిని చూడండి, పైముసుగును తొలగించి ఇప్పుడు దేవుణ్ణి చూడండి. అతడు సగుణుడు. శుభం, అశుభం అంతా అతడే. మరొక రెవ్వరూ లేరు.”*
ఈ సత్యాన్ని ఆ రోజు నరేంద్రుడు కనుగొన్నాడు. జీవితం గురించిన అతడి దృక్పథాన్ని, భగవంతుని గురించిన అతడి దృక్పథాన్ని ఈ సత్యం పరిపూర్ణం గావించింది. కాలాంతరంలో జగద్గురువుగా విరాజిల్లనున్న ఆతడి దృష్టి పరిపూర్ణతని సంతరించుకొంది. అందుకే శ్రీరామకృష్ణులు అంతగా సంతోషించారు. తమ కార్యం పూర్తయిందనే భావన బహుశా ఆయన మనస్సులో మెరసివుండ వచ్చు. “శ్రీరామకృష్ణ పరమహంస నన్ను కాళీమాతకు అప్పగించారు. దీన్లో ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ తరువాత ఆయన రెండు సంవత్సరాలే జీవించారు. ఆ రెండు సంవత్సరాలూ కూడా శారీరక రుగ్మతతో ఎంతో బాధపడుతూ గడిపారు. ఈ సంఘటనానంతరం ఆరు నెలలు కూడా ఆయన పూర్ణ ఆరోగ్యంతో జీవించలేదు” అని కాలాంతరంలో స్వామి వివేకానంద చెప్పారు.
ఈ విధంగా దుఃఖమనే ఒక తరంగం ఉవ్వెత్తున లేచి నరేంద్రుణ్ణి పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దింది; జీవితాన్ని యథాతథంగా స్వీకరించేటట్లు చేసింది.