నిజమే. దక్షిణేశ్వరంలోని చైతన్యుల వలన (శ్రీరామకృష్ణుల వలన) అంతా సాధ్యం. ఆయన సర్వసమర్థుడు.
– స్వామి వివేకానంద
గుమ్మడి పువ్వూపిందె — దీక్ష : మార్గదర్శకత్వం — శ్రీరామకృష్ణుల శిక్షణ విధానం — ధ్యాన శిక్షణలో — మార్గదర్శకత్వం — ఏనుగు : నీటిగుంట — బ్రహ్మచర్య జీవితానికి ఆవశ్యకమైన ఉపదేశం — వేడుక, వినోదమూ — మాయ: భీతిల్లే జ్ఞానం — ప్రేమ భక్తీ, రాధా దర్శనం — తాంత్రిక సాధనలు — కొన్ని అతీంద్రియ అనుభవాలు — శ్రీరామకృష్ణుల నుండి పొందిన సందేశం
గుమ్మడి పువ్వూపిందె
ప్ర కృతికీ నియమాలున్నాయి. ఇది ఉంటే అది ఉంటుంది, దీని వెనుక అది వస్తుందంటూ అనేక నియమాలు ప్రకృతికి ఉన్నాయి. మొక్కలలో పువ్వులు ముందు పూస్తాయి, పిదప పిందె వస్తుంది – ఇది అలాంటి నియమాలలో ఒకటి. కాని ఈ నియమాలు కొన్ని చోట్ల, కొన్ని సమయాలలో ఉల్లంఘనమవడమూ కద్దు. గుమ్మడి మొక్కలలో మొదట పిందె వస్తుంది, ఆ తరువాతే పువ్వు పూస్తుంది. ఈశ్వరకోటులైన తమ శిష్యులకు దీనిని ఉదాహరణగా పేర్కొనేవారు శ్రీరామకృష్ణులు. సాధారణంగా ఆధ్యాత్మిక సాధనలు, తపస్సు అనుష్ఠించి భగవదనుభూతి పొందుతారు. ఇది నియమం. కాని ఈశ్వరకోటుల విషయంలో ఈ నియమం మారుతుంది. వారు ముందుగానే ఆధ్యాత్మిక అనుభూతులను పొందివుంటారు. పిదప తపస్సు ఇత్యాదులు ఒనరించి తద్ద్వారా ఆధ్యాత్మిక అనుభవాలు సంతరించుకొని, ముందుగానే తాము పొంది వున్న ఆధ్యాత్మిక అనుభూతులతో వాటిని పోల్చి చూసుకొంటారు.
ఈశ్వరకోటులలో అగ్రతాంబూలం నరేంద్రునిదే. అతడు ఇప్పటికే కొన్ని అత్యున్నత అనుభవాలు పొందడం చూశాం. కాని అతడూ ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించాడు. శ్రీరామకృష్ణులు అతడికి అనేక సాధనలలో శిక్షణలిచ్చారు.
దీక్ష : మార్గదర్శకత్వం
ఆధ్యాత్మిక సాధనా శిక్షణలలో మొదటి మెట్టు మంత్రదీక్ష. సామాన్యంగా గురువు శిష్యుని అర్హతకు తగిన ఒక మంత్రాన్ని ఉపదేశించడం ద్వారా దీక్ష ప్రసాదిస్తాడు; అంటే ఆధ్యాత్మిక జీవితానికి మార్గం చూపుతాడన్నమాట. ఈ మంత్రం సిద్ధమంత్రమై ఉండాలి. సిద్ధమంత్రం అంటే జాగృతం కలిగించే మంత్రం అని అర్థం. అంటే గురువు ఆ మంత్రాన్ని జపించి తద్ద్వారా, ఆ మంత్రానికి చెందిన దేవత అనుగ్రహం పొందినవాడై ఉండాలి. అలాంటి గురువు ఒసగే మంత్రదీక్ష మాత్రమే ఫలవంతమవుతుంది. ఎందుకంటే మంత్రంతోపాటు ఆ మంత్రాన్ని జపించడానికి అవసరమైన శక్తిని కూడా అందిస్తాడు కనుక. అందుకే గ్రంథాల్లో చదివి, ఆ మంత్రాలను జపించ కూడదు, గురువు ద్వారా పొందిన మంత్రాన్నే జపించాలని వక్కాణిస్తారు. ఈ మంత్రదీక్షకి ప్రత్యేక నియమ నిబంధనలు ఉన్నాయి.
కాని పరిపూర్ణ స్థితిని సంతరించుకొన్న గురువు నియమాలను ఉల్లంఘించి, తాను అభిలషించే రీతిలో దీక్ష నివ్వడం కద్దు. ఆధ్యాత్మిక శక్తిని శిష్యునిలో ప్రస రింపజేయడమే దీక్ష ఉద్దేశం. దీనిని వారు తమకు నచ్చిన రీతిలో నెరవేరుస్తారు. ఇలాంటి దీక్షను తంత్రశాస్త్రాలు శాంభవీదీక్ష అని పేర్కొంటాయి. శ్రీరామకృష్ణులు నరేంద్రునికి ఇలాంటి దీక్షనే ప్రసాదించారు.
ఒకసారి శ్రీరామకృష్ణులు అధర్లాల్ సేన్ అనే భక్తుని ఇంటిని పావనం చేశారు. అక్కడ ఆయన భక్తులతో ముచ్చటిస్తున్నప్పుడు హఠాత్తుగా ఆయన దృష్టి నరేంద్రుని మీద పడింది. తక్షణమే లేచి నిలబడి సమాధిమగ్నులయ్యారు. ఆ స్థితిలోనే తమ కాళ్లను చాచి నరేంద్రుని మోకాళ్ల మీద ఉంచారు. చాలాసేపు అలాగే నిలబడిపోయారు. ఆయనకు బాహ్యస్మృతి కించిత్తు కూడా లేదు; కనుగుడ్లు తేలవేసి ఉన్నాయి. మధ్యమధ్యలో నరేంద్రుని హృదయాన్ని స్పృశిం చారు. ఈ రీతిలో నరేంద్రునిలో అనేక విధాల ఆధ్యాత్మిక శక్తిని ప్రసరింపజేశారు.
శ్రీరామకృష్ణుల శిక్షణ విధానం
ఆధ్యాత్మిక సాధనలలో శ్రీరామకృష్ణులు తమకు ఎలా శిక్షణ నిచ్చారో నరేం ద్రుడు కాలాంతరంలో ఇలా చెప్పాడు: “ఆటలు, వేడుకలు లాంటి సామాన్యమైన దైనందిన సంఘటనల ద్వారా ఆయన ఏ విధంగా అత్యున్నత ఆధ్యాత్మిక శిక్షణనిచ్చి, మాకు తెలియకుండానే మా ఆధ్యాత్మిక జీవితాన్ని పురోగమింపజేశారనే విషయం యోచిస్తేనే ఆశ్చ ర్యంగా ఉంటుంది. ఆరితేరిన మల్లయుద్ధ వీరుడు ఒకడు బాలునికి ఆ విద్య నేర్పుతున్నప్పుడు అందుకు అవసరమైన శక్తిని మాత్రమే వ్యక్తం చేస్తాడు; ఎంతో శ్రమతో ఆ బాలుని ఎదుర్కొంటున్నట్లు, కొన్ని సమయాలలో తను ఓడిపోతున్నట్లు కనబడతాడు. తద్ద్వారా విద్యార్థి మనస్సులో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేస్తాడు. శ్రీరామకృష్ణులు కూడా మాకు అట్లే శిక్షణ నిచ్చారు. నీటి బొట్టులో ఆయన సము ద్రాన్నే గాంచారు. మాలోని ఆధ్యాత్మిక బీజం అంకురించి కాలక్రమంలో ఎలా పెరిగి, పూలుపూచి, కాయలు కాచి, పండ్లను అందించబోతున్నదో ఆయనకు దృగ్గోచరమైంది. కనుక మమ్మల్ని ప్రశంసించేవారు, ప్రోత్సహించేవారు. మేం లౌకిక వ్యవహారాదుల్లో చిక్కుకోకుండా మా చేతలను నిశితంగా గమనించి, సలహాలిచ్చి, హెచ్చరించి పరిరక్షించేవారు. కాని ఇదంతా మా కేమీ తెలియదు. బోధించడంలోను, జీవితాన్ని సంస్కరించడంలోను ఆయన విధానం అది.
“శ్రీరామకృష్ణులు సాధనలు ఒనరించిన ఏకాంత ప్రదేశమైన పంచవటి* మా సాధనలకు సముచితమైన చోటు. సాధన మాత్రమే అని ఎందుకు చెప్పాలి? మేం అధిక సమయం ఆటపాటల్లో సంతోషంగా గడిపింది కూడా అక్కడే. అప్పుడు శ్రీరామకృష్ణులు మాతో కలిసి మా ఆనందాన్ని ఎన్నోరెట్లు పెంచేవారు. అక్కడ మేం పరుగెత్తేవారం, చెట్లు ఎక్కేవారం, తీగలను అల్లి ఉయ్యాల లూగే వారం, కొన్ని సమయాల్లో మేమే వండుకొని తినేవారం. ఒక రోజు నేను వండిన ఆహారాన్ని ఆయన తిన్నారు. బ్రాహ్మణులు, అందునా సచ్ఛీలురైనవారు వండిన అన్నాన్ని మాత్రమే శ్రీరామకృష్ణులు తినేవారని నాకు తెలియకపోలేదు. కనుక అన్నం మాత్రం ఆలయ ప్రసాదం నుండి తెప్పించాను. కాని ఆయన నన్ను వారించి, ‘నీలాంటి పరిశుద్ధ సత్వగుణ సంపన్నులు వండిన అన్నం తినడంలో ఎలాంటి దోషమూ లేదు’ అన్నారు. ఎంతగా ఆపడానికి ప్రయత్నించినప్పటికీ వినకుండా నేను వండిన అన్నమే ఆయన భుజించారు.”
ధ్యాన శిక్షణలో మార్గదర్శకత్వం
నరేంద్రుని ధ్యాన శిక్షణలలో శ్రీరామకృష్ణులు ఎలా మార్గదర్శకులయ్యారో పరికిద్దాం. నరేంద్రుడు తెల్లవారుజామున ధ్యానానికి కూర్చునేవాడు. అది సరిగ్గా ప్రక్కనే ఉన్న జనపనార మిల్లులో సైరన్ మ్రోగే వేళ. గుండెలు అవిసేలా మారుమ్రోగే ఆ ధ్వని ధ్యాన సమయంలో నరేంద్రునికి గొప్ప అవరోధంగా తయారయింది. ఒక రోజు ఈ సమస్యను శ్రీరామకృష్ణులకు చెప్పి పరిష్కారం తెలుపమన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, “ఆ ధ్వనిని ఎందుకు అవరోధంగా భావిస్తావు? ఆ ధ్వనిలోనే మనస్సును లీనం చేయడానికి ప్రయత్నించు. అంతా సరిపోతుంది” అన్నారు. ఆ సలహాను తు.చ. తప్పకుండా పాటించిన నరేంద్రుడు ప్రగాఢ ధ్యానంలో నిమగ్నుడు కాగలిగాడు.
ధ్యాన సమయంలో దేహబుద్ధి పూర్తిగా నశించి ధ్యేయ వస్తువులో మనస్సులయించడం లేదని మరొకసారి అతడు శ్రీరామకృష్ణులతో మొరపెట్టుకొన్నాడు.వెంటనే శ్రీరామకృష్ణులు తమ గోటితో నరేంద్రుని భ్రూమధ్యంలో గుచ్చుతూ, “ఈనొప్పిలో నీ మనస్సును లీనం చేయి” అన్నారు. ఆ విధంగా మనస్సును లీనంచేయగానే నరేంద్రుడు దేహబుద్ధిని అతిక్రమించి ధ్యానంలో మగ్నుడు అవగలిగాడు. “ఆ నొప్పి ఉన్నంతదాకా, నేను కోరుకొన్నంత వరకూ మనస్సును ఏకాగ్రం చెయ్యగలిగాను. అప్పుడు తక్కిన అవయవాలు ఉన్నవనే జ్ఞాపకం కూడా పూర్తిగా నశించింది. కనుక దేహస్మృతి ప్రశ్నే సమసిపోయింది” అని కాలాంత రంలో నరేంద్రుడు చెప్పాడు.
ఇదే కాకుండా, నరేంద్రుడు దక్షిణేశ్వరంలో బస చేసినప్పుడు శ్రీరామకృష్ణులు ప్రత్యేకించి కొన్ని సాధనలు అతడికి విపులీకరించి, పంచవటికి వెళ్లిధ్యానించమని పంపడం కద్దు.
ఏనుగు : నీటిగుంట
శ్రీరామకృష్ణుల కృపాకటాక్షం వలన సాధనామయ జీవితంలో నరేంద్రుడుసత్వరమే ప్రగతి సాధిస్తూన్నప్పటికీ, అతడికి సంబంధించినంతవరకు అదొకగొప్ప విషయంగా తోచలేదు. భక్తులలో కొందరు పారవశ్య స్థితులను పొందడమూ, ధారగా కన్నీరు స్రవించడమూలాంటి పరమానంద స్థితులను అనుభవించడం అతడు చూసినప్పుడు, బహుశాతాను పురోగమించలేదేమోనన్న సంశయం అతడికి కలిగింది. కనుక ఒక రోజుశ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లి, తనకూ అట్టి స్థితులను అనుగ్రహించమని ప్రాథేయపడ్డాడు. అందుకు శ్రీరామకృష్ణులు, “నాయనా, దీని కోసం బాధపడాలా! ఒక ఏనుగు మామూలు నీటిగుంటలో దిగుతున్నప్పుడు, గుంటలోని నీరు అల్లకల్లోలమవుతుంది. కాని అదే ఏనుగు గంగానదిలో దిగినప్పుడు, గంగలో ఏమైనామార్పు వస్తుందా? ఇది కూడా అలాంటిదే. ఈ భక్తులు కేవలం నీటిగుంటల వంటివారు; భక్తిపరమైన అనుభవాలు కాసిని పొందగానే ఇలా ఉద్వేగపు వెల్లువలో ఉర్రూతలూగుతారు. నువ్వు గంగలాంటి మహా నదివంటివాడివి. ఇలాంటి ఉద్వేగపు వెల్లువ నీకు కలుగదు” అంటూ నిజాన్ని వెల్లడించారు.
బ్రహ్మచర్య జీవితానికి ఆవశ్యకమైన ఉపదేశం
నరేంద్రుని అమ్మమ్మ ఇంట్లో అతడు చదువుకొనే గదికి శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు వెళ్లడం కద్దు. ఆ సందర్భాలలో ఆధ్యాత్మిక సాధనల గురించి అనేకవిషయాలను ఆతడికి ఉపదేశించేవారు; తల్లితండ్రుల నిర్బంధం కారణంగా వివాహబంధంలో చిక్కుకోవద్దని ఆతణ్ణి హెచ్చరించేవారు; బ్రహ్మచర్య మహత్వాన్నితెలియజెప్పేవారు. “పన్నెండు సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా బ్రహ్మచర్యం పాటిస్తేమేధానాడి జనిస్తుంది. అందువలన సూక్ష్మమయిన, అతి సూక్ష్మమైన విషయాలలో చొచ్చుకొనిపోయి వాటినన్నిటినీ కూలంకషంగా అవగతం చేసుకోగలుగుతాడు. ఈ మేధాశక్తి సహాయంతోనే భగవదనుభూతి పొందడం సాధ్యమవుతుంది.ఇటువంటి పావనమైన బుద్ధిగల వ్యక్తికి మాత్రమే భగవంతుడు దర్శనమిస్తాడు” అంటూ వివరించేవారు.
శ్రీరామకృష్ణుల సాన్నిహిత్యం వలననే నరేంద్రుడు వివాహానికి విముఖంగా ఉన్నాడని ఆతడి ఇంట్లోనివారు భావించారు. ఈ విషయంగా నరేంద్రుడు ఇలాచెప్పాడు: “ఒక రోజు అలవాటు ప్రకారం శ్రీరామకృష్ణులు నేను చదువుకొనే గదిలోకి వచ్చి బ్రహ్మచర్యం గురించి మాట్లాడుతున్నారు. రహస్యంగా మా అమ్మమ్మ ఆ మాటలు విని, నా తల్లితండ్రులతో చెప్పేసింది. ఒక సన్న్యాసితో మెలగుతున్ననేను కూడా సన్న్యాసం పుచ్చుకొంటానేమోనని భయపడి ఆ రోజు నుండి వివాహపు ఏర్పాట్లు తీవ్రతరం చేశారు మా వాళ్లు. కాని ఏం ప్రయోజనం? శ్రీరామకృష్ణుల దివ్యసంకల్పం ముందు వారి ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. కొన్ని సంబంధాలు ఖాయమై, ఇక వివాహమే తరువాయి అనే స్థితికి కూడా వచ్చాయి.కాని ఏదో చిన్న విషయంలో రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయం తలెత్తివివాహం ఆగిపోయేది.”
నరేంద్రుడు తరచు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకపోయినా, ఆతడితో ఆ విషయం ప్రస్తావించడానికి ఎవరికీ ధైర్యం లేదు. బాల్యంనుండి ఆతడు ఎప్పుడూ ఎవరి వ్యతిరేకతలనూ ఖాతరు చేయలేదు. యువకు డయ్యాక ఆహారం, దుస్తులు లాంటి ప్రతి విషయంలోను తన ఇష్టప్రకారమేవ్యవహరించాడు. అతడితో, “ఇది చెయ్యి, అది చెయ్యవద్దు” అంటూ నియమాలు విధిస్తే పర్యవసానం విపరీతంగా ఉంటుందని ఇంట్లో వారికి తెలియకపోలేదు.కనుక నరేంద్రుడు శ్రీరామకృష్ణుల వద్దకు నిరాటంకంగా వెళ్లగలిగాడు.
వేడుక, వినోదమూ
సర్వసాధారణంగా మహాత్ముల జీవితాలలో వేడుకలకూ, వినోదాలకూ కొరతఉండదు. శ్రీరామకృష్ణులు కూడా ఇందుకు మినహాయింపు కారు. ‘కథామృతం’ లో అనేక చోట్ల ఆయన మాటలు విని అందరూ నవ్వుకోవడం చూడ వచ్చు. నరేంద్రునికి సంబంధించి ఒకటి రెండు సంఘ టనలు పరికిద్దాం:
ఒక రోజు నరేంద్రుడు పాడబోతున్నాడు. కాని తంబురాను శ్రుతి చెయ్యడం చాలా ఆలస్యమయింది. పాట ప్రారంభం కాలేదు. శ్రీరామకృష్ణులూ, తక్కిన వారూ సహనం కోల్పోయారు. అక్కడే ఉన్న వినోద్ అనే వ్యక్తి, “ఈ రోజు నరేం ద్రుడు తంబూరాను సిద్ధం చేస్తాడు, మరో రోజు పాడతాడు” అన్నాడు. అందరూ నవ్వారు.
శ్రీరామకృష్ణులూ నవ్వుతూ, “ఆ తంబూరానే పగలగొడితే ఎలావుంటుంది. ఎంతసేపు ఈ ‘దొయ్ంగ్ దొయ్ంగ్’, ‘తానానన నేరెనుం’ సాగుతుంది?” అని అడిగారు.
భవనాథ్ : యాత్ర ప్రారంభంలో కూడా ఇదే తంతు. శ్రుతి కలుపుతున్నా మని వీరు చేసే హడావిడితో అందరికీ విసుగుపుడుతుంది.
నరేంద్రుడు (తంత్రిని లాగుతూ శ్రుతి చేస్తూ) : అర్థం కాకపోతేనే విసుగు కలుగుతుంది.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ) : ఇదుగో, మనల నందరినీ ఊదిపారేశాడు. మరొక రోజు.
శ్రీరామకృష్ణులు (నరేంద్రుడితో) : ఒక పాట పాడరాదూ!
నరేంద్రుడు : నేను ఇంటికి వెళ్లాలండీ, చాలా పనులున్నాయి.
శ్రీరామకృష్ణులు : అలా చెప్పు! మేం చెప్పిన మాటలు నువ్వెందుకు వింటావు? కర్ణాభరణాలు ధరించిన వాడి మాటలు అమూల్యమైనవి. కాని చిరిగిపోయిన గోచీ కట్టుకొన్న వాడి మాటలు ఎవరూ ఖాతరు చేయరు. (అందరూ నవ్వారు). నువ్వు గుహ కుటుంబీకుల ఉద్యాన గృహానికి తరచు వెళుతుంటావని వింటున్నాను. ‘నరేంద్రుడు ఎక్కడున్నాడు?’ అని అడగడమే తరువాయి, ‘అతడు గుహ కుటుంబీకుల ఉద్యాన గృహానికి వెళ్లాడండీ’ అన్న సమాధానం వస్తుంది. ఈ విషయాలన్నీ నేను నీకు చెప్పకుండా ఉండాల్సింది. కాని నువ్వే ఈ మాటలు నేను చెప్పేలా చేశావు.
నరేంద్రుడు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తరువాత, “ప్రక్క వాద్యాలు ఏవీ లేవే! ఊరకే పాట ఒక్కటే పాడమంటారా?” అని అడిగాడు.
శ్రీరామకృష్ణులు: నాయనా! ఏం చేస్తాం, మన పరిస్థితి ఇలాంటిది. బలరాం చేసే ఏర్పాట్లు ఎలాంటివో తెలిసిందే కదా! ఇలాగే నువ్వు పాడగలిగితే పాడు. బలరాం నాతో, ‘మీరు దక్షిణేశ్వరం నుండి వచ్చేటప్పుడు పడవలోనే రండి. మరీ ఇక గత్యంతరం లేదంటేనే బండి కట్టించుకొని రండి’ అంటాడు. (అందరూ నవ్వారు) చూడండి, ఇవాళ అతడు మనందరికీ భోజనం పెట్టించాడు కదా! అందుకని ఈ సాయంత్రం మనతో నాట్యం చేయిస్తాడు. (అందరూ నవ్వారు) ఒక రోజు అతడు నా కోసం ఇక్కడ నుండి దక్షిణేశ్వరానికి బండి కట్టించాడు. బండి కిరాయి పన్నెండు అణాలని చెప్పాడు. నే నడిగాను, ‘పన్నెండు అణాలకు దక్షిణేశ్వ రానికి ఎవరు వస్తారు?’ అని. అందుకు అతడు, ‘ఓ! అదే చాలా ఎక్కువండీ!’ అన్నాడు. బండి వెళ్తుండగా దక్షిణేశ్వరం చేరడానికి ముందుగానే ఒక వైపు చక్రంవిరిగిపడిపోయింది. (అందరూ నవ్వారు) పైగా గుర్రం మధ్య మధ్యలో కదల కుండా అలాగే మొరాయించి నిలబడిపోయింది. బండి తోలేవాడు మాటి మాటికీ దాన్ని చెర్నాకోలతో కొట్టసాగాడు. అప్పుడది కొంత దూరం పరుగెత్తింది; మళ్లీ నిలబడిపోయింది. (అందరూ నవ్వారు) ఈ రోజు సాయంకాల కార్యక్రమం ఏమిటంటే – రామ్ మృదంగం వాయిస్తాడు; దానికి అనుగుణంగా మనమంతా నాట్యం చేయాలి. అయితే రామ్‌కు తాళం బొత్తిగా తెలియదాయె. (అందరూనవ్వారు) ‘పాటలు మీరే పాడుకోండి, నాట్యమూ మీరే చేసుకోండి; మళ్లీ మీరే సంతోషంగా కూడా ఉండండి’ – ఇదీ బలరాం వైఖరి. (అందరూ నవ్వారు)
మాయ: భీతిల్లే జ్ఞానం
నరేంద్రుడు శివాంశ సంభూతుడు. చిన్నతనం నుండే ధ్యానంలో సంలీన మయ్యే శక్తిని అతడు సంతరించుకొన్నాడు. అదే విధంగా ఆత్మజ్ఞానం కూడా అతడిలో సహజసిద్ధంగానే విలసిల్లింది. “లోకాన్నే సమ్మో హింపజేయగల మహామాయ శక్తి కూడా నరేంద్రునికి పది అడుగుల దూరంగా మాత్రమే నిలువగలదు” అని ఆతడి జ్ఞానాన్ని గురించి శ్రీరామకృష్ణులు వ్యాఖ్యానించారు. లౌకికపరమైన కోర్కెలన్నీ ఏకమొత్తంగా తెగ నరికి, భగవద్భావనలో లయించడానికి సిద్ధంగా ఉన్నాడు నరేంద్రుడు. తక్కిన శిష్యుల కోసం జగజ్జననిని “అమ్మా, లోకాన్ని సమ్మోహింపజేసే శక్తియైన ఆవరణను వీరి నుండి తొలగించు” అంటూ ప్రార్థించే శ్రీరామకృష్ణులు, నరేంద్రుని కోసం, “అమ్మా, నీ మాయాశక్తిని కించిత్తు నరేంద్రునిలో నిలిపివుంచు” అంటూ ప్రార్థించేవారు!
ప్రేమ భక్తీ, రాధా దర్శనం
భక్తికి పరాకాష్ఠయైన ప్రేమభక్తి కూడా నరేంద్రునిలో చిన్నతనంలోనే పొంగి పొరలింది. ఒక రోజు అతడి ఇంటికి సోదర శిష్యులైన శరత్, శశి వచ్చారు. ముగ్గురూ నడుచుకొంటూ ప్రక్కనే ఉన్న కారన్‌వాలీస్ స్క్వయర్కు వెళ్లి, అక్కడ కూర్చుని మాట్లాడుకోసాగారు. రాత్రి 11 గంటలయింది. ఆ రోజంతా నరేంద్రుడు భక్తి గురించే మాట్లాడాడు. చివరకు, “ప్రేమ భాండాగారాన్ని వెదజల్లుతూ చైతన్యుడు వస్తున్నాడు. రండి మిత్రులారా అని నిత్యానందుడు ఆహ్వానిస్తున్నాడు” అనే పాటను భావోద్వేగంతో పాడాడు. పిదప తనలో తానే మాట్లాడుకొంటున్నట్లుగా, “ప్రేమ మాత్రమేనా? శక్తినీ, జ్ఞానాన్నీ, ముక్తినీ అందరి ఎదుటా నిజంగానే కోకొల్లలుగా పంచిపెడుతున్నాడు” అన్నాడు మెల్లగా. కాసేపు మౌనం వహించాడు. తరువాత మళ్లీ కొనసాగించాడు: “ఆ రోజు రాత్రి తలుపులు మూసి నేను పడుకొన్నాను. ఆయన నన్ను లాగారు – సరిగ్గా చెప్పాలంటే, నాలోని వ్యక్తిని లాగారు. నన్ను దక్షిణేశ్వరానికి తోడ్కొని వెళ్లారు. నాలో బోలెడంత మాట్లాడారు. ఎంతో ఉపదేశించారు. ఆ తరువాతే తిరిగి రావడానికి నాకు అనుమతి ఇచ్చారు. నిజమే. దక్షిణేశ్వరంలో ఉన్న చైతన్యుడు సమస్తం సాధించగలడు. ఆయన సర్వశక్తి మంతుడు.”
భక్తి ఎంతటిదైనప్పటికీ రాధాకృష్ణుల ప్రేమను నరేంద్రుడు అంగీకరించలేక పోయాడు. వారిద్దరూ నిజానికి చారిత్రక వ్యక్తులా అన్నది అతడి మొదటి సందేహం. వారిద్దరి మధ్యా వెల్లివిరిసిన ప్రేమను దోషభూయిష్ఠమైనదిగా, హద్దు మీరినదిగా అతడు భావించాడు. శ్రీరామకృష్ణులు విశ్వప్రయత్నం చేసినప్పటికీ రాధాకృష్ణుల తత్త్వాన్ని నరేంద్రునికి ఆకళింపు చేయలేకపోయారు. కాబట్టి ఒక రోజు ఆయన ఇలా అన్నారు: “రాధ అనే వ్యక్తి అసలు లేదనే అనుకొందాం. ఎవరో ఒక సాధకుడు తన ఊహలో రాధను రూపొందించాడనుకొందాం. కాని ఊహామాత్రమైనదిగానే ఉన్నప్పటికీ, ఆతడు తనను రాధగా భావించేటప్పుడు, ఆమె గుణగణాలను చింతన చేసేటప్పుడు ఆమె ఆంతరిక భావనలను స్వీకరిం చడం వలన, మైమరచి ఆ క్షణంలో ఆమెగానే అయిపోతున్నాడనడం నువ్వు అంగీకరించాలి కదా! అటువంటప్పుడు ఆ బృందావన లీల జరిగిందనడం నిజమే కదా!”
కాని అనుభవైకవేద్యం కానిదేదీ నరేంద్రుడు అంగీకరించడు గదా! కనుక శ్రీరామకృష్ణులు అతడికి అనుభవాన్ని అనుగ్రహించారు. ఒక రోజు నరేం ద్రుని కలలో శ్రీరామకృష్ణులు కనిపించి, “రా, గోపికయైన రాధను నీకు చూపు తాను” అంటూ అతణ్ణి కాస్తదూరం తీసుకొని వెళ్లారు. తరువాత వెనుకకు తిరిగి, “రాధను ఎక్కడ అన్వేషిస్తావు?” అని అడిగి, సాక్షాత్తు తామే రాధగా మారి పోయారు. రాధ సౌందర్యం వర్ణనాతీతమై ఉండడాన్ని నరేంద్రుడు గాంచాడు. ఈ కల నరేంద్రుని జీవితంలో గొప్ప మార్పును తీసుకువచ్చింది.
సామాన్యంగా బ్రహ్మసమాజంలో పాడే పాటలను మాత్రమే పాడే నరేంద్రుడు ఈ అనుభవానంతరం రాధాకృష్ణుల గురించిన భక్తి గీతాలను ఎక్కువగా పాడ సాగాడు.
తాంత్రిక సాధనలు
తంత్రము లేక తాంత్రికము అనేది దేవిని ఆరాధించే సంప్రదాయం. ఇందులో దక్షిణాచారము, వామాచారము అని రెండు తెగలున్నాయి. దక్షిణా చారం తక్కిన సంప్రదాయాలలా సామాన్య ఆరాధనీయ మార్గం. దక్షిణ భారతదేశంలోను, తక్కిన ప్రాంతాలలోను ప్రబలంగా దేవిని ఆరాధించే శ్రీ విద్యా ఉపాసనల లాంటి పద్ధతులు దక్షిణాచారానికి చెందినవి.
వంగ దేశంలో వామాచారం అప్పట్లో విపరీతంగా ప్రాబల్యం వహించింది. సామాన్యంగా కామ క్రోధ లోభాదులు మనిషికి శత్రువులుగా పరిగణింపబడతాయి. వాటిని నిర్జించమని అన్ని మత సంప్రదాయాలూ బోధిస్తున్నాయి. కాని వామా చారం, కామాదులను మిత్రులుగా భావించమని వక్కాణిస్తున్నది. వాటి మార్గంలో పోయి, వాటి శక్తిని సొంతం చేసుకొని పారమార్థికతలో ప్రగతి సాధించడానికి వామాచారం మార్గదర్శకత్వం వహిస్తుంది. కామాన్నీ, కోర్కెలనూ త్యజించడానికి బదులు వాటిని స్వీకరించి అనుష్ఠించే సాధనలను వామాచారం బోధిస్తుంది. చెప్ప డానికీ, వినడానికీ ఇంపుగా ఉండే ఈ మార్గం, సముచిత జాగ్రత్తలు వహించక పోతే, అధోగతి పాల్పడజేయడం తథ్యం. అట్టి పరిస్థితే నాటి వంగదేశంలో కాన వచ్చింది. తాంత్రిక సాధనల పేరిట దురాచారాలు మితిమీరి సమాజాన్ని భ్రష్టు పట్టించసాగాయి.
ఒక రోజు నరేంద్రుడు వామాచారం గురించి శ్రీరామకృష్ణులను అడిగాడు. ఆయన ఆ ప్రస్తావనను పొడిగించదలచుకోలేదు. “వీటిని గురించి నువ్వు తెలుసు కోనక్కర లేదు. నా మటుకు స్త్రీల నందరినీ నేను తల్లిగా చూస్తున్నాను. ఇది పవిత్ర మార్గం. ఇందులో కలతగాని, అపాయంగాని లేదు. స్త్రీని తోబుట్టువుగా భావించడం కూడా ఫరవాలేదు. స్త్రీని మరెలాంటి దృష్టితో చూసినా తప్పే, ప్రమా దమే. ఈ మార్గాలలో పోతున్నప్పుడు మానసిక పావనతను పరిరక్షించుకోవడం ఎంతో కష్టం. భగవంతుణ్ణి పొందడానికి అనేక మార్గాలున్నాయి. వామాచారం కూడా ఒక మార్గమే కాని అసహ్యకరమైనది. పెద్ద భవనం వెనుక పాకీవాళ్లు రావడానికి దొడ్డిదారి ఉంటుంది కదా, అలాంటి దారి ఇది. సింహద్వారం గుండా రావడమే కదా శ్రేష్ఠం!” అన్నారాయన.
నరేంద్రుని సాధనల గురించి కాలాంతరంలో స్వామి శారదానంద ఇలా అన్నారు: “శ్రీరామకృష్ణులు నరేంద్రునికి అనేక ఉపదేశాలు చేసి, భక్తిమార్గం తదితర మార్గాలలో పలు సాధనలు అనుష్ఠించేటట్లు చూశారు. నరేంద్రుడు కూడా అసాధారణ శక్తి సంపన్నుడిగా, గొప్ప గ్రహణశక్తి గలవాడిగా విరాజిల్లాడు. అందువలన స్వల్ప సమయంలోనే ప్రతి సాధనా మార్గం ద్వారా ప్రగతి సాధించి, ఆ యా సాధనల ఫలితాలను పొందాడు…. ఆ రోజులలో ఒకనాడు నరేంద్రుడు తన ఇంట్లో ఆనందంగా కూర్చుని ఉన్నాడు. ఆతడితో కాసేపు మాట్లాడుతున్న ప్పుడు ఆ ఆనందానికి కారణం తెలియవచ్చింది; గురుదేవులు అనుగ్రహించే శ్రీరాధా దర్శనం ఆతడికి కలిగింది. పలువురు దేవీదేవతల దివ్యదర్శనాలు కూడా ఆతడికి లభించాయి. కాని అతడు ఏదీ వెల్లడించేవాడు కాడు.”
రాధాదేవి భక్తిలో ఊరిపోయిన నరేంద్రుడు కాలాంతరంలో ఒకసారి రాధను గురించి ఇలా చెప్పాడు: “అప్పుడే పితికిన పాలలోని నురుగు పడితే నీ వేళ్లు గాయపడతాయా? బహుశా అది కూడా సాధ్యం కావచ్చు. కాని రాధ హృదయం అంతకన్నా కోమలమైనది.”
ఆధ్యాత్మిక సాధనలు తీవ్రమయ్యే కొద్దీ కొన్ని అతీంద్రియ అనుభవాలను తప్పించుకోలేము. కలలో వచ్చే అనుభవాలు, జాగ్రదావస్థలో జరిగే సంఘటనలు మొదలైనవి ఈ కోవకు చెందుతాయి. వీటిని అర్థం చేసుకోవడానికి, సరి యైన రీతిలో స్వీకరించడానికి ఒక ఉత్తమ గురువు మార్గదర్శకత్వం ఎంతో అవసరం.
కొన్ని అతీంద్రియ అనుభవాలు
నరేంద్రుని కొన్ని అనుభవాలను పరికిద్దాం. ఈ రోజుల్లో రూపంలో తన లాంటి తన ‘కవల’ ను నరేంద్రుడు చూడసాగాడు. అతడు అచ్చం నరేంద్రుడే! అద్దంలో కనిపించే ప్రతిబింబం చేసే విధంగా, నరేంద్రుడు చేసేదంతా ఆ ‘కవల’ కూడా చేసేవాడు. కొన్ని సమయాల్లో ఒక గంటసేపటి దాకా ఆ ‘కవల’ ఉండేవాడు. ఈ విష యాన్ని నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు తెలియజేశాడు. కాని ఆయన ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు; అత్యున్నత ధ్యాన స్థితులలో ఇటువంటి అనుభవాలు సాధారణంగా కలుగుతూ ఉంటాయని మాత్రం ఆయన చెప్పారు.*
మరొక అనుభవం: ఒక రోజు రాత్రి నరేంద్రుడు తన మిత్రుడైన శరత్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో అడుగు పెట్టీపెట్టగానే శిలాప్రతిమలా నిలబడిపోయాడు. అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు, “ఈ ఇంటిని ఇంతకు మునుపు నేను ఎప్పుడో చూసివున్నాను! ఎటుగుండా ఎటు వెళ్లాలో, ఏ గది ఎక్కడ ఉందో నాకు బాగా పరిచయమైనట్లు తోస్తున్నది, ఏం ఆశ్చర్యం!” అన్నాడు. తమాషా ఏమి టంటే నరేంద్రుడు ఆ ఇంట్లోకి అడుగుపెట్టడం అదే మొట్టమొదటిసారి. దీనిని గురించి కాలాంతరంలో అతడు ఇలా చెప్పాడు:
“చిన్నతనం నుండే కొన్ని చోట్లను, వస్తువులను, వ్యక్తులను చూసినప్పుడు, వారిని మునుపే చూసాను, మెలగాను అనే భావన కొన్ని సమయాలలో కలగడం కద్దు. జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, ఎంత ప్రయత్నించినా జ్ఞాపకానికి రాదు. అలాగని వారిని అంతకు మునుపు చూడలేదనీ చెప్పలేను. ఈ విధంగా అప్పుడప్పుడు జరుగుతుంది. మిత్రులతో మాట్లాడుతూవుంటాను. హఠాత్తుగా వారిలో ఏదో ఒక మాట నా జ్ఞాపకాన్ని రగుల్కొల్పుతుంది – ‘ఇదే విషయం గురించి వీరితో ఇదే ఇంట్లో మునుపు కూడా మాట్లాడివున్నాను. కచ్చితంగా ఈ మిత్రుడే అప్పుడూ ఇదే అభిప్రాయం వెల్లడించాడు’ అని అనిపిస్తుంది. కాని ఎంత ప్రయత్నించినప్పటికీ ఎక్కడ, ఎప్పుడు అని మాత్రం జ్ఞాపకానికి రాదు. పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలుసుకొన్నప్పుడు, ఈ చోట్లను ఈ వ్యక్తులను గత జన్మలలో కలుసుకొని ఉండవచ్చు, ఆ జ్ఞాపకాలే కాస్త అప్పుడప్పుడు వస్తున్నాయని సరి పెట్టుకొన్నాను. కాని ఈ నిర్ణయం హేతుబద్ధంగా లేదు. ఇప్పుడు నాకు నిజం బోధపడింది: నేను ఈ జన్మలో ఎవరెవరిని ఎక్కడ, ఎప్పుడు ఎలా కలుసుకో బోతున్నాను, మెలగబోతున్నాను అనే విషయాలు నేను జన్మించడానికి మునుపే చిత్రప్రదర్శనలా చూసివుండాలి; ఆ జ్ఞాపకాలే అప్పుడప్పుడు మనస్సులో మెదలు తున్నాయి.”
సుదూరంలో జరిగేవి చూసే, వినే శక్తీ నరేంద్రునికి అలవడింది. ఒక రోజు అతడు ధ్యానానికి కూర్చున్నాడు. ధ్యానంలో ఒకింత మగ్నుడవగానే ఆతడి మనస్సు ఉన్నత స్థితిని అధిరోహించింది; ఒక ఫలానా వ్యక్తి, ఫలానా ఇంట్లో కూర్చుని, ఒక ఫలానా విషయం గురించి మాట్లాడుతూవుండడం అతడు చూడ గలిగాడు! ఈ విధంగా చూడగానే ఆ దృశ్యం నిజమా కాదా అనే కుతూహలం అతడిలో తలెత్తింది. వెంటనే లేచి తను చూసిన ఆ చోటుకు వెళ్లాడు. అతడు ధ్యానంలో చూసిందంతా యథార్థమే, పిసరంత కూడా మార్పులేదు. కొన్ని రోజులు గడిచాక అతడు ఈ విషయం గురుదేవులకు తెలియజేశాడు. అందుకు శ్రీరామకృష్ణులు, “ఇవి భగవదనుభూతి పొందే మార్గంలోని ఆటంకాలు. కొన్ని రోజులు ధ్యానం చేయబోకు” అని చెప్పారు.
మరొక అతీంద్రియశక్తీ నరేంద్రునిలో పెంపొందసాగింది. ఎవరైనా వ్రాసిన కాగితపు ముక్కలను తన చేతిలో ఉంచుకొంటే చాలు, అది వ్రాసిన వ్యక్తిని గురించి అన్ని విషయాలు అతడికి తెలిసిపోయేవి. ఆ వ్యక్తి ఆకారం, అతడు ఏ దుస్తులు ధరించాడు, అతడి మనస్సులో ఏ ఆలోచనలు చెలరేగుతున్నాయి లాంటి సమస్తమూ అతడికి ఇట్టే తెలిసిపోయేవి. దీనిని తన మిత్రులతో పాలుపంచుకొని అనేక సందర్భాలలో అతడు వినోదించడం కద్దు. కాని శ్రీరామకృష్ణులు దీనిని ఖండించారు. “ఇదొక గొప్ప వరప్రసాదం. కాని మానవాళి శ్రేయస్సుకు తప్ప మరి దేనికీ ఈ శక్తిని ఉపయోగించవద్దు. ఎవరివో గురించిన సమాచారాలను నీ వద్దకు తీసుకొనివస్తున్న ఈ చేతులు మానవాళి బాధలను తొలగించే శక్తి గలవి. నీ శక్తిని ఇతరుల బాధలను తొలగించడానికి ఉపయోగించు” అన్నారు శ్రీరామ కృష్ణులు.
శ్రీరామకృష్ణుల ఈ ఉపదేశం నరేంద్రునికి జీవితం గురించిన ఒక విభిన్న కోణాన్ని చూపిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మనకు భగవంతుడు ప్రసాదించే శక్తులను, విశిష్ట గుణాలను పరుల శ్రేయస్సు కోసం ఉపయోగించా లనే భావన ఆతడి మనస్సులో గాఢంగా ముద్రితమైంది. అయితే మరొక సంఘటన ద్వారా అది పరిపూర్ణంగా ఆతడి మనస్సులో పాదుకుపోయింది.
శ్రీరామకృష్ణుల నుండి పొందిన సందేశం
ఒక రోజు శ్రీరామకృష్ణులు భక్తులతో తమ గదిలో కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు కూడా అప్పుడు అక్కడే ఉన్నారు. మాటలతో, వేడుకలతో, వినోదా లతో సమయం గడుస్తోంది. అప్పుడు వైష్ణవ మతం గురించిన ప్రస్తావన వచ్చింది. ఆ మత సిద్ధాంతాన్ని శ్రీరామకృష్ణులు క్లుప్తంగా ఇలా చెప్పారు: “భగవన్నామ స్మరణ, భూతదయ, ఆరాధన భక్తుల పట్ల మర్యాద అనే మూడింటినీ అనుసరించమని ఈ మతం బోధిస్తోంది. భగవంతుడు, ఆయన దివ్యనామమూ అభిన్నమని గ్రహించి సదా ప్రగాఢ ప్రేమతో భగవన్నామాన్ని ఉచ్చరించాలి; భక్తుడూ భగవంతుడూ ఒక్కరే, కృష్ణుడూ భక్తుడూ ఒక్కరే అన్న విషయం గ్రహించి సాధువులనూ భక్తులనూ స్తుతిస్తూ ప్రణమిల్లాలి. లోకమంతా శ్రీకృష్ణునికి సొంతమనే ప్రగాఢ విశ్వాసంతో భూతదయ….”
‘భూతదయ’ అని చెబుతూవున్న శ్రీరామకృష్ణుల మాటలు తడబడ్డాయి. అట్లే ఆయన పారవశ్య స్థితిలో మగ్నులయ్యారు. కాస్త బాహ్యస్మృతిలోకి రాగానే, “భూతదయా?….? అల్పుడా! హీనమైన పురుగుకు సమమైన వాడివి నువ్వు; నువ్వు భూతదయ చూపడమా? దయ చూపడానికి నువ్వు ఎవడవు? కాదు, ఎన్నటికీ కాదు. మనిషిని మహేశ్వరుని రూపంలో గాంచి సేవ మాత్రమే చేయాలి. అదే నువ్వు చేయవలసింది” అన్నారాయన.
శ్రీరామకృష్ణుల పలుకులు అందరూ విన్నారు. కాని వాటి గూఢార్థాన్ని వారెవరూ అర్థం చేసుకోలేకపోయారు. నరేంద్రు డొక్కడే శ్రీరామకృష్ణుల భావ స్రవంతిని సరిగా అర్థం చేసుకొన్నాడు. గదిలో నుండి బయటకు రాగానే అతడు, “ఈ రోజు గురుదేవుల మాటలలో ఒక అద్భుత కాంతి గోచరమయింది. నిస్సార మైనదిగా, వట్టిపోయినదిగా పేర్కొనబడే వేదాంత జ్ఞానాన్ని, భక్తిమార్గంతో జత చేర్చి ఎలాంటి సరళమైన, మధురమైన సారభూతమయిన మార్గాన్ని ఆవిష్కరిం చారు ఆయన! అద్వైత జ్ఞానాన్ని సంతరించుకోగోరితే సంసారాన్నీ, లోకులనూ ఆసాంతం పరిత్యజించి అరణ్యాలకు పోవాలి; ప్రేమ, భక్తి లాంటి కోమలమైన భావనలను హృదయంలో నుండి కూకటివేళ్లతో సహా పెకలించివేయాలంటూ చెప్పుకొచ్చారు. పర్యవసానం? ఆ మార్గంలో పయనించే వ్యక్తి సంసారాన్నీ, దాన్లోని ప్రతి వ్యక్తినీ తన మార్గంలోని ఆటంకాలుగా ఎంచి, అతణ్ణి ద్వేషించి తన వినాశనాన్ని తానే వెతుక్కొంటున్నాడు. కాని శ్రీరామకృష్ణులు ఈ రోజు పారవశ్య స్థితిలో వెల్లడించిన పలుకుల నుండి, అరణ్యంలోని వేదాంత జ్ఞానాన్ని ఇంటికి తీసుకురావచ్చు, దైనందిన జీవితంలో ప్రతి దశలోను దానిని అనుసరించవచ్చు నని స్పష్టమవుతున్నది. చేస్తూన్న దానిని అట్లే కొనసాగించనీ, దాన్లో హాని లేదు. కాని భగవంతుడే ప్రాణులుగాను, లోకంగాను ఉన్నాడనే భావనను మాత్రం దృఢంగా నిలుపుకొంటే చాలు. జీవితంలో ప్రతి క్షణమూ మనం ఎవరితో వ్యవహ రిస్తున్నామో, ఎవరి పట్ల ప్రేమ కనబరుస్తున్నామో, గౌరవమర్యాదలు చెల్లిస్తు న్నామో, దయ చూపుతున్నామో వారందరూ భగవంతుని అంశలే. ఈ విధంగా అందరినీ శివరూపంగా భావించినప్పుడు అతడు ఇతరులకన్నా తనను గొప్ప వ్యక్తిగా ఎలా అనుకోగలడు? ఇతరుల పట్ల కోపమూ, ద్వేషమూ ఎలా వహించ గలడు? ఏ విధంగా దయ చూపించగలడు? ఈ రీతిలో మానవుని మాధవునిగా గాంచి ఆతనికి సేవ చేయగా చేయగా అతడి హృదయం పావనమవుతుంది; సత్వరమే అతడు తనను మహా చైతన్యస్వరూపుడైన భగవంతుని అంశంగా, పవిత్రునిగా, జాగృతి చెందినవానిగా, ముక్తునిగా గ్రహిస్తాడు.
“శ్రీరామకృష్ణుల ఈ వచనాలు భక్తిమార్గంలో నూతన కాంతిని ప్రసరింప జేస్తున్నాయి. సకల ప్రాణులలోను భగవంతుని దర్శించే దాకా యథార్థమైన భక్తి (పరాభక్తి) అంటే ఏమిటో ఎవరూ గ్రహించలేరు. పరమేశ్వరుని లేక నారాయ ణుని రూపంలో లోకులను గాంచి వారికి సేవలు చేసేటప్పుడు సత్వరమే అతడు నిజమైన భక్తిని పొంది లక్ష్యం సాధిస్తాడు. కర్మయోగ, రాజయోగ మార్గ సాధకు లకు కూడా శ్రీరామకృష్ణుల వచనాలు నూతన కాంతిని ప్రసరింపజేస్తాయి. మనిషి ఒక్క క్షణం కూడా కర్మరహితంగా ఉండలేదు. అందువలన పరమేశ్వర రూపంలో లోకులను గాంచి వారికి సేవలు అందించేటప్పుడు మనిషి తన పరమావధిని సాధిస్తాడని చెప్పకుండానే విశదమవుతుంది. భగవంతుడు నాకు ఒక అవకాశం ఇస్తే, ఈ రోజు విన్న ఈ మహోన్నత సత్యాన్ని లోకం యావత్తు చాటుతాను. పండితుని, పామరుని, ధనవంతుని, పేదవాని, బ్రాహ్మణుని, చండాలుని పర్యంతం అందరికీ చాటి చెబుతాను.”
ఈ రీతిలో శ్రీరామకృష్ణులు జ్ఞాన, భక్తి, యోగ, కర్మ మార్గాల్లో ఇంత దాకా కానరాని వెలుగును ప్రసరింపజేసి జీవిత సరళిని పరిపుష్టం చేశారు. సామాన్యులు ఆయన వచనాలను అర్థం చేసుకోలేకపోయారు. ఆ దివ్యవాణిని మహామేధావియైన నరేంద్రుడు మాత్రమే అవగతం చేసుకొన్నాడు. అప్పుడు ఆ వచనాలను విపులీకరించి తక్కిన వారిని ఆశ్చర్యచకితులను చేశాడు. కాలాంత రంలో నరేంద్రుడు వివేకానందుడై లోకానికి బోధించిన సత్యసారం యావత్తు ఈ వచనాలలో ఇమిడి ఉంది.
ఈ విధంగా ఆధ్యాత్మిక సాధన, శ్రీరామకృష్ణుల సంసర్గం, చదువులతో సాగుతూ వచ్చిన నరేంద్రుని జీవితంలో హఠాత్తుగా పెనుతుపాను వచ్చింది.