ఈ మహోన్నత సత్యాన్ని ఉపదేశించే గురుమా అద్భుతమైనవాడుగా ఉండాలి; శిష్యుడూ అద్భుతమైన వ్యక్తిగా ఉండాలి.
కఠోపనిషత్తు, 1.2.7
గురుమా, శిష్యుడూ — గురుదేవులు: అపురూప గురువు — శ్రీరామకృష్ణ నరేంద్రుల సంబంధం — శ్రీరామకృష్ణుల ప్రేమ — ఈశ్వరకోటి — సహస్రదళ పద్మం — శ్రీరామకృష్ణుల విశ్వాసం — వెతకి వెళ్లి అనుగ్రహించడం — నరేంద్రుని జీవితంలో శ్రీరామకృష్ణులు — కుమారునిగా — ‘నేనే అతణ్ణి’ — నరేంద్రునికి ప్రత్యేక స్థానం — నరేంద్రుని పరీక్ష — దుష్టుల పట్లా కరుణ — శ్రీరామకృష్ణుల పరీక్ష — సిద్ధుల తిరస్కృతి — సాకార భగవంతుని పట్లా, శాస్త్రాల పట్లా సందేహం — దేవతా ఆకృతులు మనోకల్పితాలా? — శ్రీరామకృష్ణులు అవతార పురుషులా? — అద్వైతం — అద్వైతానుభూతి
గురుమా, శిష్యుడూ
గు రువునూ, శిష్యుణ్ణీ ఒకరిలో ఒకరిని హిందూమతం చూస్తుంది. “గురుశిష్యుల మైన మన ఇద్దరినీ భగవంతుడు రక్షించుగాక! ఇద్దరినీ పోషించుగాక! ఇద్దరమూ ఊర్జిత శక్తితో పరిశ్రమిద్దాం గాక! మన స్వాధ్యాయం ఏకాగ్రమూ ఫలవంతమూ అగు గాక! ఎన్నడూ మనమిద్దరమూ పరస్పరం ద్వేషించుకోకుండా ఉందాం గాక!”* అంటూ వేదాలు ఇద్దరినీ కలిపే ప్రస్తావిస్తాయి. శిష్యునికి మానసిక విస్పష్టత గురువు ద్వారా కలిగితే, గురువు పరి పూర్ణత శిష్యుని మూలంగా అభివ్యక్తమవుతుంది. గురువు జీవితాన్ని వెల్లడి చేసి, ఆయన సందేశాన్ని వ్యాప్తిచేసే వ్యక్తే నిజమైన శిష్యుడు.
గురువు వాక్కులను అర్థం చేసుకొని వాటిని తు.చ. తప్పక పాటించే వాడు ఉత్తమ విద్యార్థి. కాని గురువు చెప్పబోయేది ముందుగానే గ్రహించి దానిని అట్లే ఆచరణలో చూపేవాడు శిష్యుడు. నిజంగా అలాంటి శిష్యుని కోసమే గురువు నిరీక్షిస్తుంటాడు. నిరీక్షించడమే కాదు, ప్రార్థిస్తాడు కూడా.
గురుదేవులు: అపురూప గురువు
శ్రీరామకృష్ణులు అలా ప్రార్థన చేశారు. తాము సముపార్జించిన ఆధ్యాత్మిక సంపత్తిని లోకమంతటా పంచిపెట్టే శిష్యులు రావాలని ఆయన విలపించారు. భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవాలి, భగవదనుభూతి పొందాలి అని ఎందరో మహాత్ములు విలపించారు. కాని భగవద్దర్శనంతో వారి విలాపం ఆగిపోయింది. ఇక్కడో శ్రీరామకృష్ణులు ఒక్క మార్గంలో కాదు, రెండు మార్గాల్లో కాదు, అనేక మార్గాల ద్వారా భగవదానందాన్ని చవిచూశారు, భగవదానందంలో లయించిపోయారు. ఆయన ఆక్రందన అంతటితో ఆగిపోవాల్సిందే కాని ఆగలేదు – భగవంతుని కోసం విల పించడం మొదలుపెట్టారు!
మానవాళి కోసం విలపించారు శ్రీరామకృష్ణులు! తాము సముపార్జించిన దివ్యానుభవాలనూ, చవిచూసిన దివ్యానందాన్నీ ఇతరులతో పాలుపంచుకోవాలనీ ఆ దివ్యానందమయ జీవితం వారు కూడా పొందాలనీ ఆయన విలపించారు. “శివ పరమానంద వెల్లువ పొంగిపొరలి పరిపూర్ణమై ఉంది. మరణం ఆసన్న మయే ముందు ఆ దివ్యానందాన్ని చవిచూడడానికి లోకులారా రండి!” అని ఒక ముని* లోకాన్నే ఆహ్వానించారే, అదే విధంగా శ్రీరామకృష్ణులు ఎలుగెత్తి పిలిచారు. వెంటనే ఎవరూ రానందున ఆయన ఉత్సుకత వ్యాకులతగా పరిణమించి, ఆక్రం దనగా రూపుదాల్చింది. “ఆలయాలలో సంధ్యాహారతుల గంటలు మ్రోగుతాయి. ‘ఆహా, మరో రోజు కూడా నిరర్థకంగా గడచిపోయింది! నా బిడ్డలు ఎవరూ రాలేదే!’ అంటూ నా మనస్సు తల్లడిల్లింది; తడిబట్టను మెలిపెట్టి పిండినట్లు భరించరాని బాధ కలిగేది. అతిథి గృహం మేడ మీద నిలబడి, ‘నా బిడ్డలారా, ఎక్కడున్నారు? వెంటనే రండి’ అంటూ అరిచేవాణ్ణి” అని కాలాంతరంలో శ్రీరామకృష్ణులు చెప్పడం కద్దు. ఇలాంటి అద్భుతమైన గురువును లోకం కనీవినీ ఎరుగదు.
ఆయన ఆక్రందన ప్రకృతి అంతటా మౌనంగా ప్రతిధ్వనించింది. ఆ మౌన స్వరాన్ని ప్రకృతిమాతయైన కాళికాదేవి ఆలకించింది. కాల ఆవశ్యకతను ఎరిగిన ఆమె ఒకరి తరువాత ఒకరిగా శిష్యులను పంపసాగింది. కాని ఎవరైనా ‘ఆ ఒక్కరి’ కి సాటి అవుతారా? తానే స్వయంగా వెళ్లి మౌన తపం నుండి తోడ్కొని వచ్చిన ఋషి కాగలరా? ఆతడు ఇంకా రాలేదే అని శ్రీరామకృష్ణులు పరితపిం చారు. ఆ ఋషియైన నరేంద్రుడు ఏతెంచాడు. ఇక తమ సందేశ బీజాలను అతడి మీద చిలకరించాలి. అందుకు ముందుగా క్షేత్రం సంసిద్ధం చేయాలి. ఆ ప్రయత్నంలో ఆయన నిమగ్నులయ్యారు.
శ్రీరామకృష్ణ నరేంద్రుల సంబంధం
నరేంద్రుణ్ణి చూడగానే, “ఇతడు నా కుమారుడు, మిత్రుడు, నా ఆదేశాన్ని శిరసావహించడానికి జన్మించినవాడు, ఎన్నటికీ విడివడని ప్రేమపాశంతో నాతో పాటు అల్లుకుపోయినవాడు” అని శ్రీరామకృష్ణులు గుర్తించారు. శతాబ్దాలుగా సనాతన ధర్మానికి పట్టిన మలినాన్ని తొలగించి, దానిని కాలానుగుణ్యమైన ఒక జీవన విధానంగా మార్చి, సత్యయుగాన్ని స్థాపించే మహత్కార్యం జగజ్జనని తమకు అప్పగించింది; ఆ కార్యంలో తోడ్పడడానికే నరేంద్రుడు జన్మించాడని ఆయనకు దివ్యదర్శనాల ద్వారా తెలియవచ్చింది. ఆ నిజాన్ని ఆయన తన పరిశోధనల మూలంగా ధ్రువీకరించుకొన్నారు. తదనంతరం ఎనలేని ఆప్యాయతతోనూ, విశ్వాసంతోనూ నరేంద్రుడితో శాశ్వత బంధం ఏర్పరచుకున్నారు.
ఆ తరువాత నరేంద్రునికి అనేక రీతుల్లో శిక్షణనిచ్చి, ఆ ఉన్నత లక్ష్యసాధనకి ఉపయోగపడే పరికరంగా అతణ్ణి రూపొందించారు. శిక్షణ పూర్తయి, సంసిద్ధంగా ఉన్న నరేంద్రునికి సత్యయుగ స్థాపన మహత్కార్యంలో ఎలా పాలుపంచుకోవాలో ఉపదేశించారు. పిదప ఆ కార్యాన్నీ, బాధ్యతనూ అతడికి అప్పగించారు.
ఈ శిక్షణలో ఆప్యాయతతో కూడిన విశ్వాసమూ, పరీక్షా, ఉపదేశమూ కలగలసి ఉన్నాయి.
శ్రీరామకృష్ణుల ప్రేమ
శ్రీరామకృష్ణ – నరేంద్రుల ప్రథమ సమావేశానంతరం శ్రీరామకృష్ణులు దాదాపు ఐదేండ్లు జీవించారు. ప్రారంభంలో నరేంద్రుడు ప్రతి వారమూ ఒకటి రెండుసార్లు దక్షిణేశ్వరానికి తప్పక వెళ్లేవాడు. కొన్ని సమయాల్లో రాత్రుళ్లు కూడా అతడు అక్కడే బసచేయడం కద్దు. వరుసగా కొన్ని రోజులు అతడు దక్షిణేశ్వరానికి పోకపోతే శ్రీరామకృష్ణులు తీవ్ర ఆందోళనకు గురయ్యేవారు. వచ్చేపోయేవారందరినీ నరేంద్రుణ్ణి గురించి వాకబు చేసేవారు, అతణ్ణి దక్షిణేశ్వరానికి రమ్మని చెప్పమనేవారు; విలపిస్తూ జగజ్జననిని ప్రార్థించేవారు. రాత్రిళ్లు నిద్ర మానుకొని ఆతణ్ణి గురించి ఆలోచించేవారు. “శ్రీరామకృష్ణులకు నా పట్ల గల ప్రేమే నన్ను ఆయనతో పెనవేసింది” అని కాలాంతరంలో నరేంద్రుడు చెప్పడం కద్దు.
ఒక రోజు రాందయాళ్, బాబూరాం అనే ఇద్దరు యువకులు దక్షిణేశ్వ రంలో బసచేశారు. అప్పుడు రాత్రి పదిగంటలు అయివుంటుంది. శ్రీరామకృష్ణులు తమ గది నుండి బయటకు వచ్చి రాందయాళ్తో, “ఏమోయ్, నిద్రపోయావా?” అని అడిగారు. “లేదు” అనే జవాబు చెప్పగానే ఆయన, “ఇలా చూడు. నరేం ద్రుణ్ణి ఒకసారి దక్షిణేశ్వరానికి వచ్చివెళ్లమని చెప్పు. అతణ్ణి చూడకుండా నా హృదయం ఎంత తల్లడిల్లిపోతూన్నదో తెలుసా? తడిబట్టను మెలిపెట్టి పిండి నట్లుగా నా హృదయాన్ని ఎవరో మెలిద్రిప్పి పిండుతూన్న బాధ కలుగుతూన్నది” అంటూ, చేతిలో ఉన్న బట్టను మెలిపెట్టి పిండి చూపించారు. శ్రీరామకృష్ణుల పసిబిడ్డ మనస్తత్త్వం గురించి ఎరిగిన రాందయాళ్ ఆయనను పరిపరి విధాల సాంత్వన పరిచాడు.
వైకుంఠనాథ్ అనే భక్తుడు తన అనుభవాన్ని ఇలా వివరించాడు:
“ఆ రోజంతా శ్రీరామకృష్ణులు నరేంద్రుని ఘనత గురించే మాట్లాడు తూన్నారు. మాట్లాడేకొద్దీ ఆతణ్ణి చూడాలనే ఆతురత ఆయనలో ఉప్పొంగ సాగింది. హఠాత్తుగా గదిలో నుండి బయటికి వచ్చి, వసారాలో నిలబడి కాళీ మాతను సంబోధిస్తూ, ‘అమ్మా, అతణ్ణి చూడకుండా నేను జీవించలేను’ అంటూ విలపించసాగారు. పిదప గదిలోకి వచ్చి ఆవేదన ధ్వనించే స్వరంలో, ‘నేను ఎంతగా విలపించాను. అయినా అతడు రాలేదు. నా హృదయాన్ని ఎవరో నులిమి పిండుతూన్నట్లుగా ఉంది. అయినప్పటికీ అతడు వీటన్నింటినీ పట్టించుకోవడమే లేదు’ అన్నారు. ఆ తరువాత లేచి బయటకు వెళ్లారు. ఇంతలో మళ్లీ లోపలికి వచ్చారు. ఆయన ఏమీ పాలుబోక ఆరాటపడడం కొట్టొచ్చినట్లు తెలుస్తూన్నది. మళ్లీ ఇలా అన్నారు: ‘ఒక బాలుని కోసం వృద్ధుడనైన నేను ఇలా విలపిస్తూ కుమిలిపోతున్నాను! లోకులు నన్ను చూసి ఏమనుకొంటారు? మీరు నాకు చెందినవారు. నా మనస్సులోనిది మీకు తెలుపడానికి సిగ్గుపడడం లేదు. కాని తక్కినవారు ఏమనుకొంటారు? నన్ను నేను అదుపులో ఉంచుకోలేకపోతున్నాను.’”
ఇలా నరేంద్రుణ్ణి చూడలేకపోయినందువలన తీవ్ర పరితాపం చెందినట్లే, నరేంద్రుడు వస్తే శ్రీరామకృష్ణుల ఆనందానికి అవధులుండేవి కావు. కొన్ని సమ యాల్లో నరేంద్రుణ్ణి చూడగానే సమాధిమగ్నులయ్యేవారు. కనుక కొన్ని సమయా లలో ఆయన, “నరేన్ ఇక్కడికి రాకపోవడమూ మంచిదే. అతణ్ణి చూస్తేనే నాలో భావోద్వేగం పెల్లుబుకుతుంది. అతడు రావడమే ఒక మహత్తర సంఘటన” అని చెప్పేవారు.
ఈశ్వరకోటి
శ్రీరామకృష్ణులు తమ శిష్యులను ఈశ్వరకోటులు, జీవకోటులు అని రెండు తరగతులుగా వర్గీకరించారు. ఒక అవతారపురుషునితోబాటు ఉన్నత లోకాల నుండి ఆయన మహత్కార్య సహాయార్థం వచ్చేవారు ఈశ్వరకోటులు. వీరు ప్రారబ్ధ వశాత్తు జన్మించేవారు కారు. వీరి పుట్టుకా, తపస్సూ, సాధనలూ లోకహితం కోసం మాత్రమేగాని వారికంటూ ఎలాంటి ప్రత్యేక లక్ష్యమూ లేదు. తమ శిష్యులలో ఆరుగురిని ఈశ్వరకోటులుగా శ్రీరామకృష్ణులు పరిగణించారు. వారు: నరేంద్రుడు, రాఖాల్, బాబూరాం, నిరంజన్, యోగీన్, పూర్ణుడు.* “నరేంద్రుడు, రాఖాల్ లాంటివారు నిత్యసిద్ధులు; ఈశ్వర కోటులు. వీరు సాధనలు అనుష్ఠించడం నామమాత్రానికే. నరేంద్రుణ్ణి చూడండి. అతడు ఎవరినీ ఖాతరు చేయడు. ఒక రోజు నాతోబాటు కెప్టెన్ బండిలో వస్తు న్నాడు. కెప్టెన్ నరేంద్రుణ్ణి అనువైన చోట కూర్చోమని చెప్పాడు. కాని అతడు కెప్టెన్ వైపు కన్నెత్తి అయినా చూడలేదు. నన్ను సైతం అతడు లెక్క చెయ్యడు. తనకు తెలిసినదంతా నాతో చెప్పడు; ‘నరేంద్రుడు గొప్ప మేధావి’ అని నేను నలుగురి ముందు ప్రశంసిస్తానని అతడు భావించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. అతడికి మాయామోహాలు లేవు, బంధాలూ లేవు. అతడిలో అనేక సద్గుణాలు కొలువై ఉన్నాయి – పాడతాడు, వాద్యాలు వాయిస్తాడు, రచనలు చేస్తాడు, చదువుతాడు! అంతేకాదు, జితేంద్రియుడు కూడా. వివాహం చేసుకోనంటున్నాడు”* అన్నారు శ్రీరామకృష్ణులు.
సహస్రదళ పద్మం
కేశవచంద్రసేన్, విజయకృష్ణ గోస్వామి లాంటి బ్రహ్మసమాజానికి చెందిన ప్రముఖ నేతలు ఒక రోజు శీరామకృష్ణుల గదిలో సమావేశమైవున్నారు. నరేం ద్రుడు కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. శ్రీరామకృష్ణులు కేశవ్నూ, విజయ్‌నూ వికసిత వదనంతో చూశారు. పిదప నరేంద్రుణ్ణి తిలకించారు. ఆయన మనోఫలకంపై నరేంద్రుని భవిష్యత్తు దేదీప్య మానమైన చిత్తరువులా ద్యోతకమయింది. సమావేశానంతరం ఆయన ఇలా అన్నారు: “ఏ శక్తితో కేశవ్ లోకప్రసిద్ధుడై ప్రశంసలందుకొంటున్నాడో అలాంటి పద్ధెనిమిది శక్తులు నరేంద్రునిలో పరిపూర్ణ స్థితిలో నెలకొని ఉండడం చూశాను! కేశవ్లోనూ, విజయ్‌లోనూ జ్ఞానప్రకాశం ఒక దీపంలా మాత్రమే ప్రకాశిస్తూన్నది. కాని నరేంద్రుణ్ణి చూస్తే, అతడి హృదయంలో జ్ఞానభాస్కరుడే ఉదయించి ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశం, మాయను ఆసాంతం తుడిచివేసింది.”
మరొకసారి ఇలా అన్నారు: “నరేంద్రుడు అత్యున్నత స్థితికి చెందినవాడు. మగతనం గలవాడు. ఎందరో భక్తులు ఇక్కడకు వస్తూవుంటారు. కాని మచ్చుకు ఒక్కరు కూడా అతడి మాదిరి లేరు. ఇక్కడకు వస్తూవున్న భక్తుల గురించి అప్పు డప్పుడు నేను యోచించడం కద్దు. వారిలో కొందరు దశదళ పద్మాలు, కొందరు శతదళ పద్మాలు, కాని నరేంద్రుడో సహస్రదళ పద్మం. తక్కిన భక్తులు కుండలు, కడవలు; నరేంద్రుడు పెద్ద గంగాళం. తక్కిన వారు చిన్న నీటి గుంటలు; నరేంద్రుడు హాల్దార్పుకూర్ లాంటి పెద్ద చెరువు. తక్కినవారు చిన్న చిన్న చేపలు; నరేంద్రుడు ఎర్రటి కళ్లుగల పెద్ద బాడిస చేప.”
శ్రీరామకృష్ణుల ముఖతా ఇలాంటి ప్రశంసలు వింటే ఆంతరిక ప్రకాశం కొరవడిన దుర్బలుడు, అహంకారంతో కన్నూమిన్నూ తెలియకుండా గంతులు వేస్తాడు. నరేంద్రుని విషయంలో ఈ మాటలు పూర్తిగా మరో విధమైన ప్రభావాన్ని చూపాయి. అసాధారణమైన అంతర్ముఖ స్థితిలో ఉండే ఆతడి మనస్సు లోలోతులకు పోయి కేశవ్, విజయ్‌ల ఎనలేని సుగుణాలతో తన అప్పటి స్థితిని పోల్చి చూసింది. అంతటి ప్రశంసలకు తాను తగననుకొన్న నరేంద్రుడు శ్రీరామ కృష్ణుల వాక్కులను నిరసించాడు: “ఏమంటున్నారు? ఇది వింటే లోకులు మిమ్మల్ని పిచ్చివాడంటారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేశవ్సేన్ ఎక్కడ? మహాత్ముడైన విజయ్ గోస్వామి ఎక్కడ? ఏమీలేని పాఠశాల విద్యార్థినయిన నే నెక్కడ? వారితో నన్ను పోల్చకండి, దయచేసి ఇలా మాట్లాడకండి” అన్నాడతడు. కాని నరేంద్రుని నిరసనను శ్రీరామకృష్ణులు పట్టించుకోలేదు. అది ఆయనకు సంతోషాన్నే కలిగిం చింది. ఆప్యాయంగా ఆయన ఇలా అన్నారు: “నాయనా! నేనేం చేయగలను? ఈ మాటలు నేను పలుకుతున్నానని అనుకొంటున్నావా నువ్వు? జగజ్జనని నాకు దర్శింపజేసింది, నేను చెప్పాను. ఆమె సత్యం తప్ప మరేదీ దర్శింపజేయదు. అందువల్లనే అలా మాట్లాడాను.”
శ్రీరామకృష్ణుల విశ్వాసం
“నరేంద్రుణ్ణి ఎవరూ తూనిక వేయకండి. అతణ్ణి పూర్తిగా అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు” అనేవారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుని పట్ల ఆయ నకు గల విశ్వాసం అంతా ఇంతా కాదు. నరేంద్రుని ఆత్మ విశ్వాసం, మగటిమి, ఏకాగ్రమైన పనితనం, పరమ సత్యాన్ని పొందగోరాలన్న తపన లాంటి లక్షణాలు అతడి పట్ల అచం చల విశ్వాసాన్ని ఆయనలో పాదుగొలిపాయి. అతడిలో ఇతరుల దృష్టికి తప్పుగా తోచిన కొన్ని గుణాలు శ్రీరామకృష్ణుల దృష్టికి అలా అనిపించలేదు; బయటి ఆకృతి వెనుకనున్న సత్యాన్ని ఆయన గ్రహించగలిగారు. నరేంద్రుణ్ణి పలువురు మొండిపట్టుదల గల వ్యక్తిగా, మొరటు మనిషిగా, బుద్ధి పరిపక్వం చెందని వ్యక్తిగా పరిగణించారు. కాని శ్రీరామకృష్ణులు ఆతడి మొండిపట్టుదలకు వెనుక ఆత్మవిశ్వాసాన్ని చూశారు. మోటుతనానికి వెనుక మగటిమిని చూశారు. పరిపక్వం చెందని బుద్ధి వెనుక ప్రత్యక్ష అనుభవం తప్ప దేనిమూలంగానూ ఉపశమించని ఆత్మతపనను గాంచారు. దూషణభూషణాలను నరేంద్రుడు పట్టించుకోడు. ఆతడి హృదయ పావనత్వమే అందుకు కారణం. ఆతడి స్వతంత్రమైన చేతలు, చింతనలు ఆత్మసంయమం నుండి జనించినవి. వెలుపల కానవచ్చే ఈ కొన్ని లోపాలు కూడా కాలక్రమంలో తొలగిపోయి నిజమైన గుణాలు బయటపడతాయని శ్రీరామకృష్ణులు ఎరుగకపోలేదు. కనుక నరేంద్రుని పట్ల ఆయనకు అచంచల విశ్వాసం ఏర్పడింది.
ఒక రోజు శ్రీరామకృష్ణుల దర్శనార్థం ఆయన గృహస్థ శిష్యుడైన నాగమహా శయ్ వచ్చాడు. శ్రీరామకృష్ణుల గదిలో వారిద్దరూ మాట్లాడుకొంటున్నప్పుడు, స్నానం చేసి భుజం మీద తడితువ్వాలుతో, “శివోఽహం, శివోఽహం’ అంటూ నరేంద్రుడు లోపలికి వచ్చాడు. నాగమహాశయ్ దిగ్భ్రాంతి చెందాడు. అత్యున్నత కోవకు చెందిన మహాత్ముడయినప్పటికీ తనను నాగమహాశయ్ అతిసామాన్య భక్తునిగా భావించుకొనేవాడు; మూర్తీభవించిన వినమ్రతే అతడు. పదిహేడు, పద్ధెనిమిదేళ్ల యువకుడు, అందునా శ్రీరామకృష్ణుల సమక్షంలో ‘శివోఽహం’ ‘నేను శివుణ్ణి’ అనే మహోన్నత మంత్రాన్ని ఉచ్చరించడం నాగమహాశయ్కు దిగ్భ్రాంతి కలిగించింది. అప్పుడు శ్రీరామకృష్ణులు నాగమహాశయ్ను చూపుతూ నరేంద్రునితో, “ ‘నేను’ అనే అహం కించిత్తూ లేనివాడీతడు. దానిని బయటికి వ్యక్తం చేయడు” అని చెప్పారు. నరేంద్రుడు, “మీరు చెబితే దానికి తిరుగులేదు” అని జవాబిచ్చాడు. శిష్యులిద్దరూ మాట్లాడుకోసాగారు.
నాగమహాశయ్ : అంతా జగజ్జనని ఇచ్ఛానుసారమే జరుగుతున్నది. ఆమె చేస్తూన్న పనులను అహంకారంతో లోకులు తామే చేస్తున్నామని అనుకొంటు న్నారు.
నరేంద్రుడు : కాదు. నా వల్లనే అంతా జరుగుతూన్నది. లోకం నా నుండే ఉద్భవించింది, నాలోనే ఉంటున్నది, నాలోనే లయిస్తుంది.
నాగమహాశయ్ : ఈశ్వరాజ్ఞ లేకుండా ఒక్క అణువు కూడా కదలదు.
నరేంద్రుడు : నా ఇచ్ఛ లేకుండా సూర్యచంద్రులు కూడా కదల్లేరు. నా ఇచ్ఛ వలన మాత్రమే ఈ లోకం యంత్రంలా పనిచేస్తూవుంది.
వారి సంభాషణను ఆసక్తిగా వింటూన్న శ్రీరామకృష్ణులు చిన్నగా నవ్వుతూ, “నరేంద్రుడు ఒర నుండి దూసిన కరవాలం లాంటి వాడు. అతడు చెప్పినదాన్లో తప్పు లేదు” అని నాగమహాశయ్తో చెప్పారు. శ్రీరామకృష్ణుల మాటను విన్న నాగమహాశయ్, నరేంద్రునికి నమస్కరించి మౌనంగా ఉండిపోయాడు.
వెతకి వెళ్లి అనుగ్రహించడం
నరేంద్రుడు ఏకంగా కొన్ని వారాలపాటు దక్షిణేశ్వరం వెళ్లకపోతే శ్రీరామ కృష్ణులు తల్లడిల్లిపోయేవారు. కొన్ని సమయాలలో స్వయంగా ఆయనే నరేంద్రుణ్ణి వెతకుతూ వెళ్లేవారు. ఆ రోజుల్లో నరేంద్రుడు తన అమ్మమ్మ ఇంట్లో నివసించేవాడు. చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుందనీ, అక్కడ ఎవరికంటా పడకుండా రాత్రుళ్లు ప్రగాఢ ధ్యానంలో లయించవచ్చుననీ ఆ ఇంటిని అతడు ఎన్నుకొన్నాడు. అతడు చదువుకొనే గది మేడ మీద ఉంది. ఒక రోజు ఉదయం చదువుకోవడానికి కూర్చున్నాడు. అప్పుడు అతడి మిత్రులైన హరిపదుడు, దాశరథి ప్రభృతులు వచ్చారు. అందరూ కాసేపు మాటల్లో పడ్డారు. తరువాత మిత్రులు నరేంద్రుణ్ణి పాడమని అడిగారు. నరేంద్రుడు పాడనారంభించగానే, క్రింద నుండి ఒక కంఠం ఆరాటంతో, “నరేన్, నరేన్” అని పిలవడం వినవచ్చింది. అది శ్రీరామకృష్ణుల కంఠస్వరంగా గుర్తించాడు నరేంద్రుడు. తక్షణమే ఉరుకులు పరుగుల మీద క్రిందికి వెళ్లి ఆయనను మేడ మీదికి తోడ్కొని వచ్చాడు. నరేంద్రుని కోసం ఆయన కొంత మిఠాయిని ఒక గుడ్డలో కట్టి తీసుకువచ్చారు. పైకి రాగానే, తక్కినవారు ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నరేంద్రునికి మిఠాయి తినిపించ నారంభించారు. ఆ తరువాత అతణ్ణి పాడమని అడిగారు.
‘మేలుకో మా యమ్మ మేలుకో ఓ జననీ…’* అనే పాటనూ, ‘అమ్మా కాళీ, నువ్వు మళ్లీ ఒకసారి ఆనంద తాండవం చేయి’ అనే పాటనూ నరేంద్రుడు పాడాడు. ఆ పాటలు వింటూ శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులయ్యారు. మిత్రు లిద్దరికీ జరుగుతున్నది ఏమీ అంతుబట్టలేదు. శ్రీరామకృష్ణులు రావడమూ, మిఠాయి తినిపించడమూ, మైమరచిన స్థితిలో నిలబడి ఉండడమూ వాళ్లకు అగమ్యగోచరంగా అనిపించింది. సమాధిస్థితిని చూసి వారు గందరగోళంలో పడిపోయారు. బహుశా స్పృహ తప్పిందేమోననుకొని ఆయన ముఖం మీద నీళ్లు చిలకరించడానికి ప్రయత్నించారు. నరేంద్రుడు వారిని వారించి, “వదిలేయండి, కాసేపట్లో ఆయనే తేరుకోగలరు” అన్నాడు; మళ్లీ కాళీమాత మీద పాటలు పాడసాగాడు నరేంద్రుడు. కాసేపటికి శ్రీరామకృష్ణులు బాహ్యచైతన్యంలోకి వచ్చారు. “నువ్వు చాలా రోజులుగా దక్షిణేశ్వరం రాలేదు; ఇప్పుడే నాతోపాటు రా” అని నరేంద్రునితో చెప్పారు. మారుమాట్లాడకుండా నరేంద్రుడు ఆయన వెంట బయలుదేరాడు.
మరొకసారి కూడా ఇలాగే ఒకటి రెండు వారాలపాటు దక్షిణేశ్వరానికి వెళ్ల డానికి నరేంద్రునికి వీలుపడలేదు. అతడి రాకకై ఎదురుతెన్నులు చూసిన శ్రీరామకృష్ణులు ఇక లాభంలేదని తామే కలకత్తాకు వెళ్లాలనుకొన్నారు. “కాని ఆ రోజు ఆదివారం. ఎవరినైనా కలుసుకోవడానికి బహుశా నరేంద్రుడు బయటకు వెళ్లివుండవచ్చు. కనుక కలకత్తాకు వెళ్లినప్పటికీ అతణ్ణి చూడలేనేమో! సాధారణ బ్రహ్మసమాజ ప్రార్థనా సమావేశాలలో అతడు పాడడం కద్దు. కాబట్టి అక్కడికి వెళితే తప్పక అతణ్ణి చూడవచ్చు. హఠాత్తుగా ఎవరూ ఊహించని రీతిలో నేను అక్కడకు పోతే వారు ఇబ్బందిగా భావించరా? ఎందుకు అలా భావించాలి? ఇలా ఎన్నోసార్లు కేశవ్ సమావేశాలకు వెళ్లాను. వారు ఆనందించారు కూడా! విజయ్, శివనాథ్ లాంటి సాధారణ బ్రహ్మసమాజ నాయకులు కూడా అలా ఎన్నో సార్లు దక్షిణేశ్వరానికి వచ్చారు” అని పరిపరి విధాల పర్యాలోచించి, చివరకు వెళ్లాలని నిశ్చయించుకొన్నారు.
కానీ బాలుని వంటి శ్రీరామకృష్ణుల మనస్సు ఒక్క విషయం గుర్తించలేదు. తమతో సాన్నిహిత్యం ఏర్పడిన తరువాత విజయ్, కేశవ్‌ల భావనలలో మార్పులు రావడం గమనించిన శివనాథ్ ప్రభృత సాధారణ బ్రహ్మసమాజ సభ్యులలో పలువురు దక్షిణేశ్వరానికి రావడం క్రమంగా తగ్గించుకొన్నారు; ఈ అంశం శ్రీరామకృష్ణుల దృష్టికి రాలేదు.
అప్పుడు సాయంత్రం అయింది. వందలాది బ్రహ్మసమాజస్థులు సమా వేశమై, ‘సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ’ లాంటి మంత్రాలను ఉచ్చరిస్తూ ప్రార్థ నలు చేస్తున్నారు. కాసేపట్లో ప్రార్థన, ధ్యానం ముగిసాయి. ఆ తరువాత ఆచా ర్యుడు వేదిక మీద ఆసీనుడై, భగవత్ప్రేమ, ఆధ్యాత్మికత ఎలా పెంపొందుతాయన్న అంశం మీద ప్రసంగించాడు. సరిగ్గా ఆ సమయంలోనే భావపారవశ్య స్థితిలో ఉన్న శ్రీరామకృష్ణులు అక్కడకు వచ్చి తిన్నగా ఆచార్యుడు కూర్చునివున్న వేదిక వైపుగా వెళ్లారు. అక్కడ సమావేశమై ఉన్న వారిలో పలువురు శ్రీరామకృష్ణులను అంతకు క్రితమే చూసివున్నారు. కాబట్టి ‘శ్రీరామకృష్ణులు వచ్చారు’ అనే వార్త సమావేశంలో వ్యాపించింది. ఆయనను అంతకు క్రితం చూడని కొందరు లేచి నిలబడీ, బల్లల మీద నిలబడీ చూడడానికి ప్రయత్నించారు. దాంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఆచార్యుడు ప్రసంగించడం నిలిపివేశాడు.
నరేంద్రుడు గానబృందంలో ఉన్నాడు. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు అక్క డకు రావడానికి గల కారణాన్ని గ్రహించి అతడు గబగబా ఆయన వద్దకు వెళ్లాడు. బ్రహ్మసమాజ సభ్యుల మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడడానికి శ్రీరామకృష్ణులే కారణమని ఆచార్యుడూ, మరికొందరు ముఖ్యులైన సభ్యులూ నిర్ధారణ చేసినం దున, వారు గురుదేవులను ఆహ్వానించలేదు. అంతెందుకు, మామూలు అతిథికి ఇచ్చే మర్యాద కూడా ఇవ్వలేదు.
శ్రీరామకృష్ణులు దేనినీ పట్టించుకోకుండా తిన్నగా వేదిక వద్దకు వచ్చి, నిలబడిన స్థితిలోనే సమాధిమగ్నులయినారు. ఆయన ఈ స్థితిని చూడాలనే ఉత్సు కత సమావేశమైన వారిలో కలగడంతో అక్కడ అలజడి, గడబిడ ఏర్పడ్డాయి. పరిస్థితి హద్దులు దాటుతుండడంతో సమావేశాన్ని చాలించాలనే ఉద్దేశంతో ఎవరో దీపాలను ఆర్పివేశారు. పరిణామం విపరీత స్థితికి దారితీసింది. అంధకారం ఆవ రించడంతో భయపడి కుమ్ములాడుకొంటూ అందరూ బయటపడడానికి ద్వారం వైపు త్రోసుకు రావడంతో గలభా చెలరేగింది.
శ్రీరామకృష్ణులను ఆహ్వానించడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనించినప్పుడే నరేంద్రుడు పరిస్థితిని గ్రహించాడు. పరిస్థితి తీవ్రతరమైనప్పుడు ఆయనను ఎలా బయటకు తోడ్కొని వెళ్లాలా అన్నదే అతడి ప్రస్తుత తాపత్రయం. భావపారవశ్య స్థితి నుండి శ్రీరామకృష్ణులు దిగిరాగానే ఎంతో శ్రమతో వెనుక దారిగుండా ఆయనను బయటకు తోడ్కొని వెళ్లాడు. పిదప ఆయనను ఒక బండిలో దక్షిణేశ్వరానికి తీసుకుపోయాడు. ఆ సంఘటన గురించి కాలాంతరంలో నరేంద్రుడు ఇలా చెప్పాడు: “ఆ నాడు నా వలన ఆయనకు కలిగిన అవమానాన్ని తలచుకొని నేను పొందిన దుఃఖం వర్ణనాతీతం. అలా అక్కడకు వచ్చినందుకు ఆయనపై నేనెంత కోపగించుకున్నానో తెలుసా? కానీ అందుకు ఆయన ఎంత మాత్రమూ ఆవేదన చెందలేదు, నా మాటలు పట్టించుకోనూ లేదు.
“నాపై గల ప్రేమ కారణంగా ఆయన తమను గురించి కలత చెందక పోవడాన్ని గ్రహించిన నేను చాలా పరుషంగా మాట్లాడాను. ‘భరతుడు జింకను గురించి పదేపదే యోచిస్తూనే మరణించాడు, జింకగా జన్మించాడు అని పురా ణాలు వచిస్తున్నాయి. అది నిజమైతే, నన్ను గురించే చింతన చేస్తూన్న మీ గతి ఏమవుతుందో కాస్త ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి’ అని చెప్పాను. చిన్నపిల్లల మనస్తత్త్వం గల శ్రీరామకృష్ణులు నా మాటలు విని ఎంతో కలత చెందారు: ‘బాగా చెప్పావు. నిజమే కదా! అలా జరిగితే ఇంకేముంది? కాని నిన్ను చూడకుండా నేను ఉండలేను!’ అని భయంతోను, ఆవేదనతోను ఈ విషయం గురించి కాళీమాత వద్దకే వెళ్లి మొరపెట్టుకొన్నారు. కాసేపటి తరువాత ఆనందంతో తిరిగి వచ్చి, చిరునవ్వుతో నాతో ఇలా అన్నారు: ‘ధూర్తుడా! నీ మాటలు నేను వినను. ‘నువ్వు అతనిలో నారాయణుని చూడడం వలననే ఆతడి పట్ల ప్రేమ వహించావు, ఎప్పుడు ఆతడిలో నారాయణుని చూడవో, అప్పటి నుండి నువ్వు అతని వైపు తిరిగి కూడా చూడవు’ అని జగజ్జనని తెలిపింది.’ ఈ విధంగా నా నిరసనలనూ, వాదనలనూ ఏకమొత్తంగా ఆయన త్రోసిపుచ్చారు.”
నరేంద్రుని జీవితంలో శ్రీరామకృష్ణులు
ఇక, నరేంద్రుని జీవితంలో శ్రీరామకృష్ణుల స్థానం వివరణకు అతీతమైనది. కాలాంతరంలో ఒకసారి నరేంద్రుడు, “వివేకానంద నుండి శ్రీరామకృష్ణులను తీసివేస్తే మిగిలేది కేవలం ఉద్వేగ పిండం మాత్రమే” అని చెప్పాడు. యౌవనదశ నుండే నరేంద్రుడు అనుష్ఠించిన సాధనలు, పొందిన అనుభవాలు, పాటించిన బ్రహ్మచర్యం, తపస్సులాంటి అన్నింటికీ మార్గనిర్దేశం చేసినవారు శ్రీరామకృష్ణులే!
శ్రీరామకృష్ణులకు నరేంద్రుని పట్ల గల ప్రేమానురాగాలకు అవధుల్లేవు. ఇక నరేంద్రుడో ఆయన పట్ల ఎనలేని గౌరవమర్యాదలు కలిగివున్నాడు. నరేంద్రుడు క్రమంగా పరిణతి చెందే కొద్దీ శ్రీరామకృష్ణుల దివ్యప్రేమకు పూర్తిగా వశం కాసాగాడు.
నరేంద్రుడు శ్రీరామకృష్ణులను ఎంతగానో అభిమానించినప్పటికీ ప్రారం భంలో ఆయనను గురువుగా అంగీకరించడమో, పూర్తిగా ఆయనను శరణుజొచ్చ డమో జరగలేదు. ఈ విషయంలో శ్రీరామకృష్ణుల ఇతర శిష్యులైన రాఖాల్, బాబూరాం, శరత్ ప్రభృతుల కన్నా నరేంద్రుడు విభిన్నంగా వ్యవహరించాడు. ఆతడికంటూ ప్రత్యేకమైన నమ్మకాలూ, సిద్ధాంతాలూ ఉన్నాయి. అవి తప్పని ఎవరైనా నిరూపించేదాకా వాటిని ఉడుంపట్టులా అతడు పట్టుకొనే ఉంటాడు.
శ్రీరామకృష్ణుల జీవితం అత్యంత సరళమైనది. ఆయన తమను పూర్తిగా కాళీమాత పాదారవిందాల మ్రోల అర్పించుకొని, ఆమె ఆదేశానుగ్రహం మేరకే జీవితాన్ని గడపేవారు. ఆచార వ్యవహారాలను నిష్ఠగా పాటించే వ్యక్తి ఆయన. నరేంద్రుడు బ్రహ్మసమాజ సభ్యుడు; తిండి విషయంలో, ఇతర ఆచార వ్యవహారా లలో పెద్దగా పట్టింపులు లేనివాడు. అతడికి రకరకాల స్నేహితులున్నారు. కొన్ని సమయాలలో శ్రీరామకృష్ణుల చేతలు అతడి దృక్పథంలో తప్పుగా అనిపించడం కద్దు. అలాంటి వాటిని నిరసించడానికి కూడా అతడు సంశయించ లేదు. కాలాంతరంలో నరేంద్రుడు, “నా గురించి ఏం చెప్పగలను? నేను ఆయన భూత గణాలలో ఒకణ్ణని భావిస్తాను. ఆయన గురించి ఆయనతోనే తప్పుగా వాగేవాణ్ణి. అది విని ఆయన నవ్వేవారు”* అనడం కద్దు.
ఒక రోజు శ్రీరామకృష్ణులు ఒక భావన గురించి వివరిస్తున్నారు. నరేం ద్రుడు దానిని ప్రతిఘటిస్తూ మాట్లాడాడు. శ్రీరామకృష్ణులు ఎంతగా ప్రయత్నించి నప్పటికీ తమ భావనను నరేంద్రునిచే అంగీకరింపజేయలేకపోయారు. అలాగే, తన భావనను శ్రీరామకృష్ణులు ఆమోదించలేదని నరేంద్రుడు నిరాశ చెందాడు. కనుక శ్రీరామకృష్ణులు ఏం చెప్పినా పట్టించుకోకుండా మౌనం వహించాడు. చివరకు శ్రీరామకృష్ణులు కించిత్తు కోపంతో, “ఇలా చూడు, నేను చెప్పింది విననప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడకు వస్తున్నావు?” అని అడిగారు. అందుకు నరేంద్రుడు ప్రశాంతంగా, “మీరు చెప్పింది వినడానికి నేను ఇక్కడకు రావడం లేదు. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను, అందుకే ఇక్కడకు వస్తున్నాను” అని జవాబిచ్చాడు. శ్రీరామకృష్ణులు ఉద్వేగభరితులై లేచి వెళ్లి నరేంద్రుణ్ణి అమాంతంగా కౌగలించుకొన్నారు.
కుమారునిగా
నరేంద్రుణ్ణి శ్రీరామకృష్ణులు తమ కుమారునిగా చూశారు. ఆ రోజుల్లో నరేంద్రుడు కాళీమాతను అంగీకరించేవాడు కాడు. పైగా నిందించేవాడు కూడా. ఒక రోజు నోటికి వచ్చినట్లు తిట్టసాగాడు. అది విని కోప గించుకొన్న శ్రీరామకృష్ణులు, “ధూర్తుడా! ఈ విధంగా తిట్టే పక్షంలో ఇక మీదట నా వద్దకు రాకు” అని కఠినంగా చెప్పారు. నరేంద్రుడు మౌనంగా బయటకు వెళ్లిపోయాడు. కాని తిన్నగా పోయి హుక్కా సిద్ధం చేసి శ్రీరామకృష్ణులకు చిరునవ్వుతో అందించాడు. శ్రీరామకృష్ణులూ నవ్వుతూ దానిని పుచ్చుకొన్నారు. ఈ సంఘటన గురించి ఆ తరువాత ‘మ’* ను శ్రీరామకృష్ణులు, “అతడు నా కుమారుడు. నేను తిట్టినంత మాత్రాన కోపగించుకొంటాడా?” అని అడిగారు.
‘నేనే అతణ్ణి’
తనయుడనే స్థితిని అతిక్రమించి నరేంద్రుణ్ణీ, తమనూ శ్రీరామకృష్ణులు అభిన్నులుగా గాంచిన సంఘటనలు కూడా లేకపోలేదు. ఒక రోజు సాయంత్రం నరేంద్రుడు దక్షిణేశ్వరం వచ్చాడు. శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లి, ఆయనకు ప్రణమిల్లి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ఆ రోజు విచిత్రంగా నరేంద్రుణ్ణి బాగా సమీపించి, దాదాపు అతడి ఒళ్లో కూర్చుండి పోయారు. పిదప తమనూ, నరేంద్రుణ్ణీ మార్చి మార్చి చూపుతూ, “ఇద్దరి మధ్యా ఎలాంటి తారతమ్యమూ ఉన్నట్లు నాకు తెలియడం లేదు. నేను నేనుగానూ ఉన్నాను, ఆతడిగానూ ఉన్నాను. నీటిలో ఒక పుల్లను వేస్తే ఆ క్షణంలో నీరు విభజింపబడినట్లు కనిపిస్తుంది. కాని నిజానికి అలా జరగలేదు. నేను చెబు తున్నది నీకు అర్థమవుతున్నదా? చిట్టచివరన చూస్తే ఉన్నది సమస్తమూ జగజ్జనని మాత్రమే కదా!” అన్నారు.
ఆ తరువాత శ్రీరామకృష్ణులు పొగత్రాగగోరారు. వైకుంఠ్ ఆయన కోసం హుక్కా సిద్ధంచేసి తెచ్చాడు. శ్రీరామకృష్ణులు ఒకసారి పొగ త్రాగి, నరేంద్రుణ్ణి త్రాగమన్నారు. ఆయన చేతనున్న పొగగొట్టం నుండి పీలిస్తే ఆయన చేతులు ఎంగిలి అవుతాయని నరేంద్రుడు సంశయించాడు. కాని ఆయన, “నువ్వో మూర్ఖుడివి. నేను నీ నుండి అభిన్నుడనా? నేనూ నేనే, నువ్వూనేనే” అంటూ, అతడిచేత పొగ త్రాగించారు. నరేంద్రుడు ఒకటి రెండుసార్లు పొగ త్రాగిన తరువాత మళ్లీ తామొకసారి పొగ త్రాగగోరి పొగగొట్టాన్ని తమ నోట్లో ఉంచు కోవడానికి ఆయన ప్రయత్నించారు. తాను పొగ త్రాగిన ఎంగిలి గొట్టాన్ని ఆయన నోట్లో పెట్టుకోకూడదన్న ఉద్దేశంతో నరేంద్రుడు ఆ ప్రయత్నాన్ని వమ్ముచేయాలను కొన్నాడు. కాని ఆయన ఆతణ్ణి అసలు పట్టించుకోకుండా హాయిగా పొగ త్రాగ సాగారు. “నేను నరేంద్రుణ్ణి నా ఆత్మగా చూస్తున్నాను. నేను అతనికి విధేయుణ్ణి” అన్నారు శ్రీరామకృష్ణులు.
శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి తమలో ఒక అంశంగా పరిగణించేవారు. ఎవ రైనా అతణ్ణి తప్పుపడితే “అలా అనకండి. అది శివదూషణ” అనేవారు.
నరేంద్రునికి ప్రత్యేక స్థానం
శ్రీరామకృష్ణులను కలుసుకొన్న తరువాత కూడా నరేంద్రుడు బ్రహ్మసమాజ సమావేశాలకు వెళ్లివచ్చేవాడు. కేశవ్ బ్రహ్మసమాజంలో స్త్రీలకూ, పురుషులకూ విడివిడిగా స్థానాలు కేటాయింపబడి ఉంటాయి. కానీ నరేంద్రుడు సాధారణ బ్రహ్మసమాజ సభ్యుడు. అక్కడ విడివిడిగా కూర్చునే అలాంటి సౌకర్యం లేదు. కనుక ఆ సమావేశాలకు వెళ్లవద్దని తక్కిన శిష్యులను శ్రీరామకృష్ణులు నిషేధించారు. కాని ఆ నిషేధం నరేంద్రునికి వర్తించదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు అతడి దృఢచిత్తం మీద ఎలాంటి ప్రభావమూ చూపలేవని శ్రీరామకృష్ణులు ఎరుగని విషయం కాదు. ఈ ఒక్క విషయంలో మాత్రమే కాదు, సమస్త విషయాల్లోనూ నరేంద్రునికి ప్రత్యేక స్థానం కల్పించారు ఆయన. కొన్ని సంఘటనలు పరికిద్దాం:
ఆహారం : శ్రీరామకృష్ణులు సామాన్యంగా ప్రతి ఒక్కరి నుండి ఆహారం స్వీక రించరు. ఒక గ్లాసు నీరైనా సరే, దానిని తీసుకువచ్చిన వ్యక్తి మనఃస్థితిని బట్టే ఆయన స్వీకరించేవారు; సరియైన వ్యక్తి కాకపోతే పుచ్చుకోరు. తీసుకువచ్చిన వ్యక్తి మనస్సును క్షణంలో చదవగలిగేవారు. దుశ్శీలుర నుండి ఏదీ ఆయన స్వీక రించరు. అదేవిధంగా శ్రాద్ధ ఆహారం ఆయన ససేమిరా తినరు. ఈ విషయాల్లో తమ శిష్యులకు కూడా ఇదే నియమాలను విధించారు. కాని నరేంద్రుడు ఎలాంటి ఆహారాన్నైనా ఎవరి నుండియైనా నిరాక్షేపణీయంగా స్వీకరించవచ్చు. “ఆతడిలో ప్రజ్వరిల్లే జ్ఞానాగ్ని ఎలాంటి దోషాన్నైనా దగ్ధం చేస్తుంది” అనేవారు ఆయన. ఒకసారి ఆయన నరేంద్రునితోనే, “నువ్వు ఎలాంటి ఆహారం తిన్నా ఫరవాలేదు. అది నీకు హానికరం కాదు. గోమాంసమో, పంది మాంసమో ఏది తిన్నా సరే, ఆ తరువాత మనస్సును స్థిరంగా భగవంతుని మీద లగ్నం చేయగలిగితే, ఆ ఆహారం హవిష్యాన్నంతో సమానమైనది. హవిష్యాన్నం భుజించీ ఒక వ్యక్తి మనస్సు కామకాంచనాలలో పొర్లితే అతడు ముమ్మాటికీ అల్పుడే” అని చెప్పారు.
గురుసేవ : ఆధ్యాత్మిక జీవితంలో గురువును సేవించడం ఎంతో ప్రధాన మైనది. గురువును సేవించే ఏ అవకాశాన్నీ శిష్యుడు కోల్పోవడానికి ఇష్టపడడు. గురువును సేవించడం ఆధ్యాత్మిక ప్రగతికి ఒక ముఖ్య నియమంగా మన శాస్త్రాలు వచిస్తున్నాయి. కాని శ్రీరామకృష్ణులు తమకు ఎలాంటి సేవ చేయడానికీ నరేంద్రుణ్ణి అనుమతించేవారు కారు. ఆయనకు వీచడం, కాళ్లు ఒత్తడం, నీళ్లు తీసు కొని వెళ్లడం లాంటి పనులను తక్కిన యువకులు చేస్తున్నప్పుడు తానూ చేయ గోరాడు నరేంద్రుడు. కాని అతడు ఏ పనినైనా చేయడానికి ఉపక్రమించినప్పుడు శ్రీరామకృష్ణులు ఠక్కున ఆపి, “నీ దారి వేరు” అనేవారు.
“సేవించడం మనస్సు పావనమవడానికే. కాని నరేంద్రుడు ఇప్పటికే పావన మనస్కుడు. కనుక అతడు సేవించనవసరం లేదు” అన్నదే శ్రీరామకృష్ణుల అభిప్రాయం. ఇందుకు మరో కారణం కూడా ఉండవచ్చు. “నేను నిన్ను సాక్షాత్తూ నారాయణునిగానే చూస్తున్నాను” అని శ్రీరామకృష్ణులు నరేంద్రునితో చెప్పేవారు. ఆ నారాయణుడు తమకు సేవచేయడమా అనే ఆలోచన కూడా ఆయనకు కలిగి ఉండవచ్చు. “నన్ను ఇంతగా అభిమానిస్తూ, అదేసమయంలో నా పట్ల గౌరవభావం వ్యక్తం చేసిన అలాంటి వ్యక్తి మరొకరు ఉండరు” అని కాలాంతరంలో స్వామి వివేకానంద చెప్పారు.
అలాగని నరేంద్రుడు ఏం చేసినప్పటికీ శ్రీరామకృష్ణులు దానికి ఆమోద ముద్ర వేసేవారని అనుకోకూడదు. “నా పట్ల ఆయనకు ఎంత అభిమానం! అదేసమయంలో నాలో ఏదైనా చెడు తలంపు తలెత్తిన క్షణంలోనే ఆయనకు స్ఫురించేది. ఉద్యోగాన్వేషణలో దిక్కుతోచక తిరుగాడుతున్న రోజుల్లో దుష్ట బృందంలో చిక్కుకొన్నాను. శ్రీరామకృష్ణుల దృష్టిలో ఉద్యోగాన్వేషణ ఒక లౌకిక చర్య. కనుక ఆ రోజుల్లో నేను ఇచ్చే ఏ ఆహారాన్ని ఆయన తినేవారు కారు. తినడానికి చేతులు ఎత్తబోయేవారు, కానీ చెయ్యి పైకి లేచేది కాదు. పిదప నాతో, ‘ఇంకా నువ్వు తయారవలేదు’ అనేవారు” అంటూ కాలాంతరంలో నరేంద్రుడు చెప్పేవాడు.
నరేంద్రుని పరీక్ష
నరేంద్రుడు స్వయంగా తాను పరీక్షించి తేల్చుకోనిదే దేనినీ అంగీకరించే వాడు కాడని చూశాం. దుష్టస్వభావుల చేతుల మీదుగా శ్రీరామకృష్ణులు దేనినీ స్వీకరించలేరని నరేంద్రుడు నమ్మలేదు. “మీ గురువును పగటి పూట పరీక్షించండి, రాత్రి కూడా పరీక్షించండి. బెస్త వనిత నాణేలను పరీక్షించి పుచ్చుకొనేటట్లు పరీక్షించండి” అనేవారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుడు కూడా అందుకు సాహసించాడు. ఒక రోజు శ్రీరామకృష్ణులు శశధర పండితుని ఇంటిని పావనం చేశారు. అప్పుడు ఇంట్లోని ఒక వ్యక్తి త్రాగడానికి ఆయనకు మంచినీళ్లు తెచ్చాడు. గ్లాసును పుచ్చుకొన్న శ్రీరామకృష్ణులు ఆ నీరు త్రాగలేదు. ఎవరి కంటా పడకుండా ఆ నీటిని క్రింద పారబోశారు. నరేంద్రుడు ఇదంతా గమనించాడు. తదనంతరం మంచినీటిని తెచ్చిన ఆ వ్యక్తిని గురించి వాకబు చేసినప్పుడు శ్రీరామకృష్ణుల ఆ ప్రవర్తనకు అసలు కారణం తెలిసింది – ఆ వ్యక్తి దుశ్శీలుడు.
శ్రీరామకృష్ణులు కామాన్నీ, ధనేచ్ఛనూ సమూలంగా త్యజించిన వ్యక్తి. ఆయన ధనం మాత్రమే కాక, ఏ లోహపు వస్తువునూ తాకలేరు. ఒకవేళ తాకితే ఆయన చేతులు ఏదో తేలు కుట్టినట్లు కొంకర్లు పోయేవి. ఈ విషయం కూడా నమ్మడానికి నరేంద్రుడు సిద్ధంగా లేడు. దీనిని పరీక్షించాలనుకొని ఒక రోజు శ్రీరామకృష్ణులు గదిలో లేనప్పుడు నరేంద్రుడు ఆయన పడక క్రింద ఒక నాణెం ఉంచాడు. తరువాత గదిలోకి వచ్చిన శ్రీరామకృష్ణులు పడక మీద కూర్చున్నారు. మరుక్షణమే విలవిలలాడుతూ లేచారు. అందుకు కారణం ఏమిటోనని అందరూ పడకను క్షుణ్ణంగా పరీక్షించారు. పడకను దులిపినప్పుడు ఒక నాణెం క్రింద పడింది. శ్రీరామకృష్ణులు తమ ప్రియతమ శిష్యునిపై అర్థవంతమైన దృక్కును సారించారు. నరేంద్రుడు సిగ్గుతో తలదించుకొన్నాడు.
దుష్టుల పట్లా కరుణ
ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులు ఒక వ్యక్తిని గురించి యువకులతో ప్రస్తా విస్తూ అతడు శీలవంతుడు కాడనీ, అతడి ఇంట్లో ఎవరూ ఏమీ తినకూడదనీ హెచ్చరించారు. నరేంద్రునికి ఈ విషయం ఎలాగో తెలి సింది. వెంటనే శ్రీరామకృష్ణుల హెచ్చరికకు వ్యతిరేకంగా చేసితీరాలని కంకణం కట్టుకొన్న వ్యక్తిలా వ్యవహరించగోరాడు. యువ భక్తులలో ఒకరిద్దరిని వెంటబెట్టుకొని ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి సుష్టుగా భోజనం చేసి దక్షి ణేశ్వరానికి తిరిగి వచ్చాడు. వచ్చినవాడు తిన్నగా శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లి జరిగినదంతా పూసగ్రుచ్చినట్లు చెప్పాడు. ఆయన ఆగ్రహోదగ్రులయ్యారు. ఆయన ఆగ్రహాన్ని చూసి నరేంద్రుడు విలపించసాగాడు. ఎలాగో పరిస్థితి చక్కబడింది.
నరేంద్రుడు అంతటితో ఆగలేదు. స్వాభావికంగానే కరుణాపూరితుడైన ఆతడి హృదయం ఆ వ్యక్తి కోసం ద్రవించిపోయింది. ఒక రోజు ఆ వ్యక్తిని తోడ్కొని సరాసరి శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లాడు. “ఈతడికి సద్గతి లభించేలా అనుగ్ర హించండి, ఈ జన్మలోనే ఇతడు భగవదనుభూతి పొందేలా ఆశీర్వదించండి” అంటూ ఆయనను ప్రార్థించసాగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, “లేదు, ఈ జన్మలో జరగదు” అని కచ్చితంగా చెప్పేశారు. కాని నరేంద్రుడు వదలిపెట్టలేదు. “మీరు నిరాకరిస్తే ఇతడు ఎక్కడకు పోగలడు?” అంటూ హఠం చేశా. “ఇతడికి ఏం చేయాలి? చేయడానికి ఏమీ లేదని చెప్పేశాను కదా!” అన్నారాయన విసిగి పోయి. కాని నరేంద్రుడు పట్టినపట్టు వదల్లేదు. చివరికి శ్రీరామకృష్ణులు, “సరే పో! మరణ సమయంలో ముక్తి లభిస్తుంది” అని చెప్పారు. దుష్టులంటూ ఇతరులు వెలివేసేవారి పట్ల కూడా అంతగా కరుణ చూపే వ్యక్తిగా నరేంద్రుడు విరాజిల్లాడు.
శ్రీరామకృష్ణులు కూడా నరేంద్రుణ్ణి అనేక విధాల పరీక్షించారు. అతడిలోని జితేంద్రియత్వం, సత్యనిష్ఠ మొదలైన ప్రతి అంశాన్నీ పరీక్షించి, తెలుసుకొన్నారు. ముఖ్యమైన రెండు సంఘటనలను పరికిద్దాం:
శ్రీరామకృష్ణుల పరీక్ష
నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చాడంటే చాలు, శ్రీరామకృష్ణుల మాటలూ, చేతలూ సామాన్యంగా ఆతడి గురించే ఉంటాయి. నరేంద్రుని రాకను కాస్త దూరం నుండి చూస్తే చాలు, శ్రీరామకృష్ణుల హృదయం యథాతథంగా బయటకు వచ్చి ఆతణ్ణి ప్రేమతో ఆలింగనం చేసుకొంటూన్నట్లు ఉండేది. “అదుగో న….. న….” అంటూ ఆయన భావపార వశ్య స్థితిలో మగ్నులయ్యేవారు. కాని ఒకసారి ఈ పరిస్థితి తలక్రిందులైంది. నరేంద్రుడు వచ్చినప్పుడల్లా అతణ్ణి పట్టించుకోకుండా, ఎడముఖం – పెడ ముఖంగా ఉండిపోయారు శ్రీరామకృష్ణులు; అతడి రాకను పట్టించుకొన్నట్లే కని పించలేదు. నరేంద్రుడు మామూలుగానే వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి ఆయన ముందు కూర్చున్నాడు. కాసేపు వేచివున్నాడు. కాని శ్రీరామకృష్ణులు కనీసం కన్నెత్తి కూడా అతడి వంక చూడలేదు. శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో నెలకొని ఉన్నారని నరేంద్రుడు భావించాడు. కనుక కాసేపు వేచివుండి బయటకు వచ్చి హాజ్రాతో మాట్లాడుతూ పొగ త్రాగసాగాడు. కాని నరేంద్రుడు బయటకు వెళ్లగానే శ్రీరామకృష్ణులు తక్కిన వారితో మాట్లాడసాగారు. ఆయన మాటల శబ్దం చెవిన పడగానే నరేంద్రుడు లోపలకు వచ్చి కూర్చున్నాడు. అప్పటికీ ఆయన నరేం ద్రునితో మాట్లాడకుండా, ముఖం త్రిప్పుకొని పడుకొన్నారు. ఆ పగలంతా ఇలాగే గడిచింది. సాయంత్రమయినప్పటికీ శ్రీరామకృష్ణుల వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడం చూసి నరేంద్రుడు ఆయనకు ప్రణమిల్లి కలకత్తా తిరుగు ముఖం పట్టాడు.
వారంలోగా మళ్లీ నరేంద్రుడు దక్షిణేశ్వం వచ్చాడు. అప్పుడూ షరా మామూలే. ఆ రోజు పగలంతా అక్కడ నివసిస్తూన్న హాజ్రాతోనూ, ఇతరులతోనూ మాటల్లో గడిపి, సాయంత్రం ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తరువాత రెండుసార్లు వచ్చాడు. కాని శ్రీరామకృష్ణులలో ఎలాంటి మార్పూలేదు. అయినప్పటికీ నరేం ద్రుడు దాని గురించి కించిత్తు కూడా కలత చెందలేదు. మనస్సులో ఎలాంటి మార్పూ లేకుండా అతడు మామూలుగా శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చిపోతున్నాడు. నరేంద్రుడు దక్షిణేశ్వరానికి రాకుండా ఇంట్లోనే ఉన్నప్పుడు ఆతడి క్షేమ సమా చారాలు వాకబు చేయడానికి శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు ఎవరినైనా కలకత్తాకు పంపడం కద్దు. కాని అతడు ప్రత్యక్షంగా వచ్చినప్పుడు మాత్రం అదే ఎడముఖం పెడముఖం. ఈ విధంగా ఒక నెలకు పైగా గడిచింది. నరేంద్రుడు కించిత్తు కూడా కలత చెందకుండా దక్షిణేశ్వరానికి వస్తూవుండడం గమనించిన శ్రీరామకృష్ణులు చివరకు ఒక రోజు అతణ్ణి పిలిచి, “ఏం నాయనా! నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడలేదే! అయినప్పటికీ నువ్వెందుకు వస్తూనే ఉన్నావు?” అని అడిగారు. అందుకు నరేంద్రుడు, “మీ మాటలు వినడానికా వస్తున్నాను? నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను. మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. అందుకే వస్తున్నాను” అని జవాబిచ్చాడు. ఆ మాటలు విన్న శ్రీరామకృష్ణులు పరమానంద భరితులై, “నా ప్రేమానురాగాలు లభించకపోతే, నువ్వు ఇక్కడకు రావడం మానుకొంటావేమోనని నిన్ను పరీక్షించి చూశాను. నీ లాంటి దృఢచిత్తులే ఇంత అవమానాన్నీ, చిన్నబుచ్చడాన్నీ దిగమింగుకోగలరు. మరొకరైతే ఎప్పుడో పలా యనం చిత్తగించేవాడు, ఈ వైపు కన్నెత్తి కూడా చూసి ఉండడు” అన్నారు.
సిద్ధుల తిరస్కృతి
ఒక రోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి విడిగా పంచవటికి తోడ్కొనిపోయి అతడితో, “ఇలా చూడు, ఏళ్ల తరబడి నేను చేసిన తపఃఫలంగా నాకు అణి మాది అష్టసిద్ధులు లభించాయి. కాని బట్ట జారిపోకుండా చూసుకోలేని నా లాంటి వ్యక్తికి వీటిని ఉపయోగించుకోవ డానికి తీరిక ఎక్కడ? తన అనేక కార్యాలను నువ్వు చేయబోతున్నావని జగజ్జనని నాతో చెప్పింది. కనుక ఆమెకు విన్నవించి ఆ సిద్ధులను నీకు ఇవ్వగోరుతున్నాను. ప్రస్తుతం నువ్వు పుచ్చుకొంటే అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఏమంటావు?” అని అడిగారు.
నరేంద్రుడు కాసేపు యోచించిన తరువాత, “మహాశయా! భగవదను భూతిని పొందడంలో ఇవి నాకు ఉపకరిస్తాయా?” అని అడిగాడు. అందుకు శ్రీరామ కృష్ణులు, “ఉపకరించవు. భగవదనుభూతికి ఉపకరించకపోయినా, భగవత్సాక్షా త్కారానంతరం భగవత్కార్య నిర్వహణలో ఇవి ఎంతో ఉపకరిస్తాయి” అన్నారు. తక్షణమే నరేంద్రుడు, “అలా అయితే ఈ సిద్ధులతో నాకు ప్రయోజనం లేదు. మొదట భగవదనుభూతి కలుగనివ్వండి, ఆ తరువాత వాటిని స్వీకరించాలో వద్దో నిర్ణయించుకొంటాను. అద్భుత శక్తులను ఇప్పుడే స్వీకరించినందువలన లక్ష్యాన్ని విస్మరించి, స్వార్థంతో దుష్ప్రేరణకు లోనై వాటిని దుర్వినియోగం చేయవచ్చు. అలాంటప్పుడు అంతా వ్యర్థమయిపోతుంది కదా!” అని జవాబిచ్చాడు. శ్రీరామ కృష్ణులు నిజానికి ఆ దివ్యశక్తులను నరేంద్రునికి ఇవ్వాలనుకొన్నారా లేక నరేంద్రుని మనోవైఖరిని పరీక్షించదలచారా? ఏది ఏమైనప్పటికీ నరేంద్రుడు వాటిని తిరస్కరించడం, శ్రీరామకృష్ణులకు ఎనలేని ఆనందాన్ని కలిగించిందనడం మాత్రం నిజం.
సాకార భగవంతుని పట్లా, శాస్త్రాల పట్లా సందేహం
బాల్యంలోనే సీతారాములు, శివుడు వంటి సాకారమూర్తులను ఆరాధిం చాడు నరేంద్రుడు. యువకుడయినప్పుడు ఈ భావనలో గొప్ప మార్పు కలిగింది. భగవంతునికి రూపం లేదు, విగ్రహారాధన తప్పు అని భావించసాగాడు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలు కూడా ఈ రీతిలోనే ఉండడం వలన ఆతడి నమ్మకం రూఢి అయింది. “విగ్రహారాధన చేయం” అని సమాజ సభ్యులు ప్రమాణం చేయాలి. నరేంద్రుడు కూడా అట్లే ప్రమాణం చేసివున్నాడు. కనుక అతడు దక్షిణేశ్వరానికి వచ్చినప్పటికీ కాళికాలయానికో తక్కిన ఆలయాలకో వెళ్లేవాడు కాడు. శ్రీరామకృష్ణులు విగ్రహారాధన చేయడాన్నే అతడు అంగీకరించలేదు. “కాళీ మాత దివ్యరూపాన్ని అతడు కేవలం బొమ్మ అంటున్నాడు. ‘ఇంకా ఈయన ఆలయం లోకి వెళ్లి విగ్రహారాధన చేస్తున్నారు’ అంటూ నా గురించే చెబుతున్నాడు” అంటూ శ్రీరామకృష్ణులు నవ్వేవారు.
తాను నిజమని నమ్మే దానిని ఎవరితోనైనా సంకోచించక చెప్పడం నరేం ద్రుని నైజం. ఒక రోజు శ్రీరామకృష్ణుల సమక్షంలోనే గిరీశ్ ప్రభృతులతో అతడు ఈ విషయం గురించి వాదన చేశాడు. శ్రీరామకృష్ణ కథామృతంలో* ఈ వాదన పూర్తిగా పొందుపరచబడివుంది. దానిని చూద్దాం:
నరేంద్రుడు : భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడని ఋజువు లేకుండా ఎలా విశ్వసించగలను?
గిరీశ్ : విశ్వాసం అన్నదే దానికి ఋజువు. ఈ వస్తువు ఇక్కడ ఉన్నది అన డానికి ఋజువు ఏమిటి? విశ్వాసమే దానికి ఋజువు.
ఒక భక్తుడు : బాహ్యప్రపంచం అన్నది మనకు బాహ్యంలో ఉంటున్నదని తత్త్వవేత్తలు ఋజువు చేయగలిగారా? అది మన తిరుగులేని విశ్వాసం అని చెప్పి వదిలేశారే!
గిరీశ్ (నరేంద్రుడితో) : భగవంతుడు నీ ముందుకు వచ్చి నిలబడ్డా సరే, నువ్వు ఆయనను విశ్వసించవు. ‘నేనే భగవంతుణ్ణి. మానవరూపంలో వచ్చాను’ అని అబద్ధాలు చెబుతున్నాడని నువ్వు అనవచ్చు.
ఆ తరువాత దేవతల అమరత్వం గురించి ప్రస్తావన వచ్చింది.
నరేంద్రుడు : దానికి ఋజువు ఎక్కడుంది?
గిరీశ్ : వారు వచ్చి నీ ఎదుట నిలబడ్డా సరే, నువ్వు నమ్మవు.
నరేంద్రుడు : వారు గత యుగాలలో కూడా ఉన్నారని నాకు ఋజువు కావాలి.
‘మ’ పల్టుతో ఏదో అన్నాడు.
పల్టు (నరేంద్రునితో నవ్వుతూ) : అమరత్వానికి ఆది ఉండకూడదనే అవ సరం ఏముంది? అమరులు కావాలంటే అంతం లేకుంటే చాలు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ) : నరేంద్రుడు వకీలు కుమారుడు. పల్టు డెప్టీ* కుమారుడు. (అందరూ నవ్వారు)
యోగీన్ (నవ్వుతూ, గిరీశ్ తదితరులతో) : ఇకపై ఈయన (శ్రీరామకృష్ణులు) నరేంద్రుడి మాటలతో ఏకీభవించరు.
శ్రీరామకృష్ణులు (నవ్వుతూ) : ఒకసారి నేను చాతకపక్షి ఆకాశం నుండి పడే నీరు తప్ప మరే నీరూ త్రాగదని చెప్పాను. ‘చాతకపక్షి మామూలు నీటిని కూడా త్రాగుతుంది’ అన్నాడు నరేంద్రుడు. అప్పుడు నేను అమ్మతో, ‘అమ్మా, మరి నేను చెప్పే విషయాలన్నీ మిథ్యయేనా?’ అన్నాను. ఎంతో వ్యథకు లోనయ్యాను. కొన్నాళ్ల తరువాత నరేంద్రుడు మళ్లీ వచ్చాడు. గదిలో కొన్ని పక్షులు ఎగురుతూండడం చూసి, ‘అదే, అదే’ అంటూ అరిచాడు. ఏమిటని నేను అడగ్గా, ‘అదే, చాతకపక్షి!’ అన్నాడు. చూడబోతే అవన్నీ గబ్బిలాలు! ఆ రోజు నుండి అతడు చెప్పేది నేను అంగీకరించడం లేదు. (అందరూ నవ్వారు)
మళ్లీ వాదన కొనసాగింది. నరేంద్రుడు వాదిస్తున్నాడు. అతడి వయస్సు ప్రస్తుతం ఇరవై రెండేళ్ల నాలుగు నెలలు.
నరేంద్రుడు (గిరీశ్, ‘మ’ ప్రభృతులతో) : మరి నేను శాస్త్రాలను ఎలా విశ్వ సించగలను? మహానిర్వాణ తంత్రంలో ఒక చోట, ‘బ్రహ్మజ్ఞానం పొందని వాడికి నరకం ప్రాప్తిస్తుంది’ అని ఉంది. అందులోనే మళ్లీ మరొక చోట, ‘పార్వతీదేవిని ఉపాసించడం మినహా వేరే మార్గం లేదు’ అని ఉంది. మనుస్మృతిలో మనువు తన గురించే వ్రాశాడు. మోజెస్ పెంట్యాట్యుక్లో* తన మరణం గురించే వర్ణించాడు.
సాంఖ్యశాస్త్రం ప్రకారం ‘ఈశ్వరా సిద్ధేః’ – అంటే ‘భగవంతుడు ఉన్నాడు’ అనే దానికి ఋజువు లేదు. మళ్లీ సాంఖ్యమే వేదాలను అంగీకరించాలి, వేదాలు నిత్యమైనవి అని కూడా చెప్పింది.
కాని ఇవన్నీ అసత్యమని నేను చెప్పడం లేదు. వీటిని నేను అర్థం చేసుకో లేకపోతున్నాను. మీరు నాకు అర్థమయ్యేలా చేయండి. శాస్త్రాలను జనం తమకు ఇష్టం వచ్చినట్లు వివరించారు. మరి ప్రస్తుతం మనం వాటిలో దేన్ని అంగీకరిం చాలి? శ్వేతవర్ణ కాంతి ఎర్రటి యానకం ద్వారా వస్తే ఎర్రగానూ, పచ్చని యానకం ద్వారా వచ్చినప్పుడు పచ్చగాను కనిపిస్తుంది.
ఒక భక్తుడు : భగవంతుడే స్వయంగా గీతోపదేశం చేశాడు.
శ్రీరామకృష్ణులు : గీత సకలశాస్త్రాల సారం. సన్న్యాసుల వద్ద వేరే పుస్తకం ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న భగవద్గీత పుస్తకం మాత్రం తప్పక ఉంటుంది.
ఒక భక్తుడు : శ్రీకృష్ణుడే గీతోపదేశం చేశాడు.
నరేంద్రుడు : శ్రీకృష్ణుడు చేశాడో లేక మరెవరయినా చేశారో?
నరేంద్రుని పలుకులు విని శ్రీరామకృష్ణులు నివ్వెరబోయారు.
దేవతా ఆకృతులు మనోకల్పితాలా?
ఒక రోజు శ్రీరామకృష్ణులు నరేంద్రునితో తమ దివ్యదర్శనాలను గురించి ముచ్చటించారు. నరేంద్రుడు వాటిని నమ్మలేదు. అంతా విన్న అతడు చివరకు, “ఈ దృశ్యాలు నిజం కావు. అవి మీ మనోభ్రాంతి జనితాలు” అని తేల్చివేశాడు. శ్రీరామకృష్ణులు చలించిపోయారు. “ఏయ్, ఏమంటున్నావు నువ్వు? ఆ దేవతలు నాతో మాట్లాడుతున్నారు” అన్నారు శ్రీరామకృష్ణులు. “అలాగే అనిపిస్తుంది” అనినరేంద్రుడు తేలిగ్గా కొట్టిపారేశాడు. శ్రీరామకృష్ణులు దిగ్భ్రమ చెందారు. నరేంద్రుడు సత్యనిష్ఠాపరుడు. కనుక అతడు చెబుతున్న దాన్లో పొర పాటు ఉండదని శ్రీరామకృష్ణులకు అచంచలమైన విశ్వాసం. తాను దర్శించిన దేవతా రూపాలన్నీ మనోకల్పిత జనితాలని అతడు చెప్పినప్పుడు శ్రీరామకృష్ణులు గందరగోళ స్థితిలో పడిపోయారు. ఆయన ఉన్నత చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటివి విన్నప్పటికీ నవ్వేసేవారు. ఇతరసమయాలలో ఇలాంటి భావనలు ఆయనను గందరగోళానికి లోనుచేస్తాయి. అది చెబుతున్నది నరేంద్రుడనే ఏకైక కారణం వలననే ఆ గందరగోళం.
ఇప్పుడు కూడా గందరగోళానికి లోనైన శ్రీరామకృష్ణులు తిన్నగా కాళికాలయంలోకి వెళ్లి తమ సమస్యను ఆమెకు విన్నవించారు. కరుణాస్వరూపిణియైన ఆమె ఆయనతో, “నువ్వెందుకు అతడి మాటలు అంతగా పట్టించుకొంటావు? అతడు బాలుడు. ఇప్పుడు ఇలాగే మాట్లాడతాడు. కాలక్రమాన నువ్వు చెప్పే ప్రతి మాటనూనిజమని నమ్ముతాడు” అని చెప్పింది. కాళీమాత చెప్పిన మాటలు నరేంద్రునికిచెబుతూ, “ధూర్తుడా! నాలో అపనమ్మకం కలిగించావే! ఇకపై ఇక్కడకు రావద్దు” అన్నారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుడు మౌనంగా ఉండిపోయాడు.
శ్రీరామకృష్ణులు అవతార పురుషులా?
శ్రీరామకృష్ణులు జీవించి ఉన్నప్పుడే కొందరు ఆయనను అవతార పురుషునిగా ఆరాధించసాగారు. గృహస్థ భక్తులలో రామచంద్ర దత్తా లాంటి వారు వారిలో ముఖ్యులు. శ్రీరామకృష్ణులు సైతం పలువురిని, “నా గురించి నువ్వు ఏమనుకొంటున్నావు?” అని అడగడం కద్దు. భక్తశ్రేష్ఠుడు, సాటిలేని జ్ఞాని, గొప్ప మహాత్ముడు, రాధాదేవి అవతారం, చైతన్య మహాప్రభు అవతారం, సాక్షాత్తు భగవంతుడే మానవరూపం దాల్చి అరుదెంచిన అవతారం అంటూ విభిన్న భక్తుల నుండి వివిధ జవాబులువచ్చేవి. వచ్చే జవాబు నుండి ప్రతి ఒక్కరి మనఃస్థితిని శ్రీరామకృష్ణులు గ్రహించేవారు. తమ శిష్యుల మానసిక స్థితిని పరీక్షించే కొన్ని మార్గాలలో ఇదీ ఒకటి. నరేంద్రుణ్ణి కూడా ఆయన ఇదే ప్రశ్న అడిగినప్పుడు, “వేయిమంది మిమ్మల్నిభగవదవతారంగా పేర్కొనవచ్చు. కానీ నాకు రూఢిగా నమ్మకం కలిగేంత వరకునేను దానిని స్వీకరించలేను” అని అతడు జవాబిచ్చాడు. అలవాటు ప్రకారంశ్రీరామకృష్ణులు నవ్వేసి మౌనం వహించారు.
ఈ విషయంగా ఒకసారి భక్తుల మధ్య చర్చ జరుగుతున్నప్పుడు నరేంద్రుడు, “భగవంతుని లాంటి వ్యక్తిగా నేను ఆయనను పరిగణిస్తున్నాను. స్థావరానికీ (చెట్లు) మృగానికీ మధ్య సృజింపబడింది ఒకటి ఉంది. ఆ ప్రాణి స్థావరమా, మృగమా అని రూఢిగా చెప్పలేం. అట్లే మనిషికీ దేవునికీ మధ్య ఒక దశ ఉంది. ఆ దశలో ఉన్న వ్యక్తి భగవంతుడా, మనిషా చెప్పడం కష్టం. అలాంటి దశలో శ్రీరామకృష్ణులు ఉన్నారు” అని చెప్పాడు. డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ ఆ అభి ప్రాయాన్ని ఖండిస్తూ, “భగవంతుని గురించి విషయాలను ఉదాహరణలు చూపి విపులీకరించలేం” అన్నాడు. అందుకు నరేంద్రుడు, “ఆయనను నేను భగవంతు డని పేర్కొనడం లేదు; మనిషిగానే పరిగణిస్తున్నాను” అన్నాడు. శ్రీరామకృష్ణులతో సన్నిహితంగా మెలగేకొద్దీ నరేంద్రుని దేవుని–భావన క్రమంగా మారిపోసాగింది.
అద్వైతం
భగవంతుడు అనంత సద్గుణ సంపన్నుడు, కాని ఆయన నిరాకారుడు – బ్రహ్మసమాజస్థుల ఈ భావన నరేంద్రునికి ఎంతో అంగీకారయోగ్యమైనది. ఈ స్థితిలో శ్రీరామకృష్ణులు అతడికి అద్వైతతత్త్వం బోధించ గోరారు. దానిని నిరాకరించాడు నరేంద్రుడు. అద్వైతం ఏం చెబుతుంది? దానిని అంగీకరించడానికి నరేంద్రుడు ఎందుకు నిరాకరించాడు? సమస్త రూపాలు, సకల ప్రాణులు, నేను, నువ్వు అనే సమస్తమూ భగవంతుడే అంటుంది అద్వైతం. భగవంతుడు నిరాకారుడంటాడు నరేంద్రుడు. కాని అద్వైతమో సమస్తమూ ఆయన ఆకృతులే అంటుంది. అలాంటప్పుడు దానిని అతడు ఎలా అంగీకరించగలడు? అలా అని శ్రీరామకృష్ణులు వదలిపెడతారా? యోగ్యమైన ఒక ఉపకరణంగా నరేంద్రుడు విరాజిల్లడం చూసి శ్రీరామకృష్ణులు అతడికి అద్వైత జ్ఞానం ప్రసాదించే తీరాలని నిశ్చయించుకొన్నారు.
కనుక నరేంద్రుడు దక్షిణేశ్వరం వచ్చాడంటే వెంటనే ‘అష్టావక్ర సంహిత’ లాంటి అద్వైత గ్రంథాలను ఇచ్చి చదవమనేవారు. నరేంద్రుని దృష్టిలో ఇటు వంటివి నాస్తిక గ్రంథాలుగా కానవచ్చేవి. శ్రీరామకృష్ణుల అభిలాష మేరకు పఠింప నారంభించేవాడు. కాని కాసేపటికే సహనం కోల్పోయి, “దీనికీ నాస్తికతకూ వ్యత్యాసం ఏముంది? ఒక సామాన్య మానవుడు తనను భగవంతునిగా భావించ డమా? దీనికన్నా మహాపాపం మరొకటి ఉంటుందా? సమస్తమూ భగవంతుడట! నేను భగవంతుణ్ణి, నువ్వు భగవంతుడివి, కనిపించేదంతా భగవంతుడు – దీని కన్నా హేతువాదానికి నిలబడనిది మరొకటి ఉంటుందా? ఈ గ్రంథాలను రచించిన ఋషి, మునులకు కచ్చితంగా మతి చెడి ఉండాలి. కాకపోతే వాళ్లు ఇలా వ్రాసి వుంటారా?” అంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యేవాడు. నరేంద్రుడు ఇలా బహి రంగంగా మాట్లాడడం శ్రీరామకృష్ణులకు ఎంతో ఆనందంగా ఉండేది. ఆతడి వైఖరిని ఠక్కున ప్రతిఘటించకుండా, “నా కోసం నిన్ను చదవమంటున్నాను. నువ్వు అంగీకరించాలని నేను చెప్పడం లేదే! ప్రస్తుతం దీనిని నువ్వు అంగీకరించక పోవచ్చు. అందుకోసం ఋషులను, మునులను ఎందుకు వృథాగా నిందిస్తావు? భగవంతుని నైజానికి ఎందుకు హద్దు కల్పిస్తున్నావు? మూర్తీభవించిన సత్యమే అయిన భగవంతుణ్ణి ప్రార్థిస్తూవుండు. ఆయన నీకు ఎలాంటి స్వరూపంలో దర్శనమిచ్చి అనుగ్రహిస్తాడో దానిలో నమ్మకం కలిగివుండు” అనేవారు. కాని నరేంద్రుడు ఆ మాటలను అసలు పట్టించుకోలేదు. హేతువాదంతో స్థాపింపబడని దేదైనా అతడికి అసత్యంగా కానవచ్చేది. అసత్యం ఏదైనా దానిని వ్యతిరేకించడం ఆతడి నైజం; అందువలన అద్వైత తత్త్వాన్ని వ్యతిరేకించాడు, వాదించాడు, పరిహాసం చేశాడు.
అద్వైతానుభూతి
నరేంద్రుడు మాట్లాడిన దాన్లోనో, ప్రవర్తించిన తీరులోనో ఆశ్చర్యపడవల సింది ఏమీలేదు. ఎందుకంటే అద్వైతం నిర్వివాదాంశం కనుక. మాట్లాడే స్థితిలో అద్వైతం లేదు. “సమస్తమూ భగవంతుడు. కుండా భగవంతుడే, కూజా కూడా భగవంతుడే. కనుక కుండా, కూజా ఒక్కటే” అంటే అది అద్వైతం అనిపించుకోదు. అందుకు మారుగా పరిహాసా స్పదమవుతుంది. ఎందుకంటే కుండ, కూజా ఒక్కటి కావు. నిజమేమిటంటే కుండకూ, కూజాకూ మూలం ఒక్కటే. అంటే రెండూ బంకమట్టితో చేయబడినవే. బంకమట్టి స్థితిలో రెండూ ఒక్కటే. అదేవిధంగా ప్రాణమూ, భగవంతుడూ ఒకటి కాదు. మౌలిక ఆత్మస్థితిలో అన్నీ ఒక్కటే. కనుక అద్వైతం అనుభవైకవేద్యమైనదే కాని వివాదాంశం కాదు. అందువలన ఎన్ని గ్రంథాలు చదవమన్నా నరేం ద్రుడు అద్వైతతత్త్వాన్ని అంగీకరించడని గ్రహించిన శ్రీరామకృష్ణులు ఆ సదరు అనుభవాన్ని అతడికి అందించగోరారు.
ఒక రోజు శ్రీరామకృష్ణులు అద్వైతతత్త్వం గురించి నరేంద్రునికి విశదీ కరిస్తున్నారు. నరేంద్రుడు శ్రద్ధగా విన్నాడు. ఆ తరువాత అతడు హాజ్రా వద్దకెళ్లి పొగ త్రాగుతూ ఆతడితో, “అలా కూడా ఉండడం సాధ్యమా ఏమిటి? కుండా భగవంతుడు, కూజా కూడా భగవంతుడే, ఇదేం చోద్యం!” అని ఇద్దరూ పగలబడి నవ్వారు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు భావపారవశ్య స్థితిలో ఉన్నారు. నరేం ద్రుడు నవ్వడం విని ఆయన ఒక బాలునిలా, ధరించిన బట్టలను విప్పి, చంకలో ఉంచుకొని, నవ్వుకొంటూ బయటకు వచ్చారు. తిన్నగా వారి వద్దకు వచ్చి, “ఏం మాట్లాడుకొంటున్నారు?” అని ఆప్యాయంగా అడుగుతూ నరేంద్రుణ్ణి స్పృశించి, సమాధిమగ్నులయ్యారు.
దీనిని గురించి నరేంద్రుడు తరువాత ఇలా చెప్పాడు: “ఆ రోజు గురు దేవులు నన్ను స్పృశించిన క్షణంలో నా మనస్సులో ఒక విప్లవమే చెలరేగింది.ఈ లోకంలో చైతన్యం తప్ప మరేదీ లేదని నాకు అవగతమయింది. ఎంతసేపు ఈ స్థితి కొనసాగుతుందోనని ప్రశాంతంగా గమనించసాగాను. ఆ రోజంతా ఆఅనుభూతి నా నుంచి తొలగిపోలేదు. ఇంటికి తిరిగివచ్చాను. అక్కడా అదే అనుభూతి! చూస్తూన్న చోటంతా చైతన్యమే సంపూర్ణంగా నిండివుంది. భోజనానికికూర్చున్నాను – అన్నం, కంచం, వడ్డించే వ్యక్తి, అన్నం తింటున్న నేను, అంతా అదే తప్ప మరేదీ కాదు! ఒకటి రెండు ముద్దలు తిని స్తంభించిపోయి కూర్చుండి పోయాను; ‘ఎందుకిలా ఉన్నావు? తిను’ అని అమ్మ చెప్పిన తరువాతే మళ్లీ తినసాగాను. ఈ విధంగా తింటున్నప్పుడు, విశ్రాంతి సమయంలో, కళాశాలకుపోతున్నప్పుడు సదా సర్వవేళల్లో అదే దృశ్యం! వర్ణనాతీతమైన ఏదో ఒక పారవశ్యం నన్ను ఆవరించింది. వీథిలో వెళుతున్నాను. బళ్లు వస్తున్నాయి. కానివాటిని తప్పుకొని నడవాలి అనిపించలేదు; ఆ బండి ఏదో, నేనూ అదే అనిపించింది. నా కాళ్లూచేతులూ మొద్దుబారిపోయాయి. అన్నం కించిత్తు కూడా రుచించలేదు. ఎవరో తింటున్నట్లు అనిపించింది. కొన్ని సమయాలలో అన్నం తింటున్నప్పుడే నేలమీదికి ఒరిగిపోయేవాణ్ణి. లేచి కూర్చుని మళ్లీ తినేవాణ్ణి. కొన్ని సమయాలలో అతిగా తినేవాణ్ణి. అలా తినడం వలన నా కెలాంటి కీడు వాటిల్లకపోయినా అమ్మ భయపడిపోయింది. ‘నీ కేదో భయంకరమైన వ్యాధి దాపురించినట్లుంది’ అనేది. ‘ఇక ఇతడు బ్రతకడు’ అని కూడా కొన్ని సమయాల్లో అనేది.
“ఆ అనుభూతి కాస్త ఉపశమించినప్పుడు లోకం ఒక కలలా తోచింది.హేతువా చెరువు తీరాన నడిచిపోతూ ఆ చెరువు నాలుగు వైపులా ఏర్పాటుచేసిన ఇనుప కంచె నిజమా లేక కలా అని తెలుసుకోగోరి వాటిపై తలను ఢీకొట్టి చూశాను! కాళ్లూచేతుల్లో ఎలాంటి స్పందనా లేదు; పక్షవాతం వచ్చినట్లు అనిపించింది. ఇలా కొన్ని రోజులపాటు ఆ అనుభూతి ప్రభావం నుండి విడివడలేకపోయాను. సహజ స్థితిని చేరుకున్నప్పుడు ఇదే అద్వైతానుభూతి అని గ్రహించగలిగాను. అలా అయితే శాస్త్ర వచనాలు అసత్యాలు కావనే నమ్మకం కలిగింది.ఆ తరువాత అద్వైత తత్త్వ తీర్మానాలను నేను సందేహించలేకపోయాను.”
ఈ విధంగా ఆప్యాయతానురాగాలతో, పరీక్షలతో, ఉన్నత అనుభూతులతో ఆ అద్భుత గురుమా, అనుంగు శిష్యుడూ తమ జీవితాలను గడపసాగారు.