నీ తత్త్వశాస్త్రం కనే కల కన్నా ఇంకా ఎన్నో విషయాలు ఇహ పరాల్లో ఉన్నాయి.
– షేక్స్పియర్
నరేంద్రుని తపన — పరిచయం — వివాహానికి విముఖత — దక్షిణేశ్వరంలో ప్రథమ సమావేశం — శ్రీరామకృష్ణుల వింత ప్రవర్తన — వాన చినుకు పడింది! — రెండవ సమావేశం — మూడవ సమావేశం : సందేహ నివృత్తి — నరేంద్రుని మానసిక స్థితి — సప్తర్షులు : దివ్యలోకం — ఏం చేశారు శ్రీరామకృష్ణులు?
నరేంద్రుని తపన
ఎవరో చెప్పారు కనుకా, ఏదో ఫలానా గ్రంథంలో వ్రాశారు కాబట్టీ దేనినీ యథా తథంగా స్వీకరించే వ్యక్తి కాడు నరేంద్రుడు. సత్యాన్ని ప్రత్యక్షంగా ఆవిష్కరించు కొన్న వ్యక్తిని దర్శించాలని అతనిలో చెలరేగిన తపన, ఉత్సుకత అతణ్ణి పలువురి వద్దకు తీసుకొని వెళ్ళాయి. ఆతడు పలు వురిని కలుసుకొని విచారణ చేశాడు. కాని ఎవరి నుండి ‘అవును’ అనే స్పష్టమయిన, రూఢియైన జవాబు లభించలేదు. ఈ తరుణంలో ఒక రోజు ఆతడి బంధుమా, శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో ఒకరూ అయిన రామచంద్ర దత్తా అతడితో, “ఇలా చూడు నరేంద్రా! నిజమైన మహాత్మునికై నువ్వు ఇక్కడా అక్కడా గాలిస్తున్నావు. దక్షిణేశ్వరంలో ఒక పరమహంస నివసిస్తున్నారు. ఒక రోజు నాతోబాటు వచ్చి ఆయనను చూడు” అని చెప్పాడు. అందుకు నరేంద్రుడు “నాకు తెలుసు. ఆయనను గురించి వాకబు చేశాను. కాని ఆయన విద్యాగంధం లేని వారు! స్పెన్సర్, హేమిల్టన్, లాక్కే లాంటి పలువురిని అధ్యయనం చేసిన నాకు, విద్యాహీనులైన ఆయన ఎలా మార్గదర్శి కాగలరు?” అని ఎదురు ప్రశ్న వేశాడు. రామచంద్రదత్తా మౌనం వహించాడు. కాని తన ప్రయత్నం విడవకుండా, సందర్భం లభించినప్పుడల్లా శ్రీరామకృష్ణుల ప్రస్తావన అతడి వద్ద తెస్తూనే వచ్చాడు. దేనికైనా సమయమూ, సందర్భమూ రావాలి కదా! అలాంటి తరుణం సత్వరమే ఆసన్నమయింది.
పరిచయం
శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో సురేంద్రనాథ్ మిత్రా ఒకరు. ఆయన నరేంద్రుని ఇంటికి సమీపంలో నివసిస్తున్నాడు. ఒక రోజు ఆయన శ్రీరామ కృష్ణులను తన ఇంటికి ఆహ్వానించి, ఉత్సవం జరుపుకోవా లనుకొన్నాడు. సామాన్యంగా ఇలాంటి ఉత్సవాలలో కీర్తనలు పాడడం, భాగవత పఠనం లాంటివి నిర్వహించడం పరిపాటి. సురేంద్రుని ఇంట్లో కీర్తనలు గానం చేయడానికి వృత్తి గాయకులు ఎవరూ లభించలేదు. అందువలన ఆయన నరేంద్రుణ్ణి కీర్తనలు పాడడానికి ఆహ్వానించాడు. అప్పుడు నరేంద్రుడు కళాశాల పరీక్షలకు చదువుకొంటున్నాడు. అయినప్పటికీ సురేంద్రుని ఆహ్వానాన్ని అంగీకరించాడు.
అది 1881 నవంబరు. శ్రీరామకృష్ణులు వచ్చిన కాసేపటికి నరేంద్రుడు పాడనారంభించాడు. నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులు ఎంతో ఆకర్షితులయినారు. కనుక సంకీర్తన పూర్తికాగానే సురేంద్రుణ్ణీ, రామచంద్రనూ పిలిచి, సుశ్రావ్యంగా పాడిన ఆ యువకుని గురించి వివరాలు వాకబు చేసి తెలుసుకొన్నారు. ఒక రోజు అతణ్ణి దక్షిణేశ్వర కాళికాలయానికి తోడ్కొని రమ్మని కూడా చెప్పారు. ఆ తరువాత నరేంద్రునితో ఒకటి రెండు మాటలు మాట్లాడారు. అతని శరీర సౌష్టవాన్ని నిశితంగా పరిశీలించారు. ఆలస్యం చేయకుండా చప్పున ఒక రోజు దక్షిణేశ్వ రానికి రావలసిందని స్వయంగా అతణ్ణి ఆహ్వానించారు.
నరేంద్రునికి సంబంధించినంత వరకు ఆనాటి సమావేశం ఆతడిలో ఎలాంటి స్పందనా కలిగించలేదు. కీర్తనలు పాడడం కోసం సురేంద్రుడు బల వంతం చేయడం వలన అక్కడకు వెళ్లాడు, పాడాడు. శ్రీరామకృష్ణులను చూశాడు, కాని ఆయనను గురించి పెద్దగా ఏమీ అనుకోలేదు.
వివాహానికి విముఖత
ఈ సంఘటన జరిగిన కొన్ని వారాల తరువాత నరేంద్రుని పరీక్షలు ముగి సాయి. వెంటనే ఆతడి వివాహం గురించి ప్రస్తావించసాగారు. ఒక గొప్ప కుటుంబం నుండి సంబంధం వచ్చింది. నరేంద్రుడు అందుకు నిరాక రించాడు. పవిత్రత, సత్య దర్శనానికై అతనికి గల తీవ్రమైన తపన అతడి విలక్షణతలుగా విరాజిల్లాయి. బ్రహ్మచర్యమూ, సత్యనిష్ఠా ఆతడి నైజంలో ఊరిపోయి ఉన్నాయి. వాటిని వదలుకోవడం అతడు ఊహించను కూడా ఊహించలేడు. వాటికి ఆటంకంగా వచ్చే దేనినీ ఆతడు స్వీకరించడానికి సిద్ధంగా లేడు. అలాంటి ఆటంకాలలో వివాహం ఒకటని అతడి గట్టి నమ్మకం. అందు వలన వివాహానికి నిరాకరించాడు. కాని పెళ్లికూతురు కాస్త నల్లగా ఉండడం వలన వధువు తండ్రి కట్నంగా పదివేలు ముట్టజెప్పడానికి సిద్ధపడ్డాడు. విశ్వనాథ దత్తా ప్రోద్బలంతో రామచంద్ర దత్తా, తక్కిన బంధువులూ నరేంద్రుణ్ణి ఒప్పించ డానికి శతధా ప్రయత్నించారు. కాని నరేంద్రుడు లొంగలేదు.
ఆధ్యాత్మిక లక్ష్యాల కారణంగా నరేంద్రుడు వివాహానికి నిరాకరిస్తున్నాడని గ్రహించిన రామచంద్రదత్తా, “భగవదనుభూతి పొందాలని నీకు నిజమైన ఆసక్తి ఉండే పక్షంలో, బ్రహ్మసమాజం లాంటి సంస్థల చుట్టూ తిరగడం మానుకొని దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లు” అని నరేంద్రునికి సలహా ఇచ్చాడు. ఆ సమయంలో ఒక రోజు పొరుగున వసిస్తూన్న సురేంద్రుడు కూడా నరేంద్రుణ్ణి తనతో దక్షిణేశ్వరానికి రమ్మని ఆహ్వానించాడు. ఎలాగయినా భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలనే తీవ్ర తపనతో సతమతమవుతున్న నరేంద్రుడు ఈ రోజు దాకా ప్రతి ఒక్కరినీ అడుగుతున్న ఆ ప్రశ్నను శ్రీరామకృష్ణులను అడగాలనుకొన్నాడు. కాబట్టి ఆ ఆహ్వానాన్ని మన్నించి రామచంద్రదత్తాతోపాటు, ఒకరిద్దరు మిత్రులతో సురేంద్రుని గుర్రబ్బండిలో దక్షిణేశ్వరం వెళ్లాడు. అది జనవరి 1882.
దక్షిణేశ్వరంలో ప్రథమ సమావేశం
కలకత్తాకు దాదాపు పది కిలోమీటర్ల దూరంలో గంగాతీరాన ఉన్న దక్షి ణేశ్వరంలో రాణీ రాస్మణి అనే జమీందారిణి నిర్మించిన ఆలయాలు ఉన్నాయి. వాటిలో భవతారిణీ కాళికాలయం ప్రధానమయినది. రాధా కాంత ఆలయమూ, పన్నెండు శివాలయాలూ కూడా ఆ ఆలయాల సమూహంలో చోటుచేసుకొన్నాయి.* అక్కడ ఒక చిన్న గదిలో శ్రీరామకృష్ణులు నివసిస్తున్నారు. ఆ గదిలో పెద్ద, చిన్న మంచాలు రెండు ఉన్నాయి. సామాన్యంగా శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని భక్తులతో సంభాషిస్తారు; పెద్ద మంచం మీద విశ్రమిస్తారు. భక్తులు నేల మీద పరచిన చాప మీద కూర్చుంటారు.
నరేంద్రుడు తక్కిన వారితో వెళ్లిన బండి కాళికాలయం సమీపంలో ఆగింది. అందరూ బండి దిగి శ్రీరామకృష్ణుల గది వైపుగా వెళ్లారు. చలిగాలిని అడ్డుకోవ డానికి గది ఉత్తర ద్వారం ముందు తడికెలు వ్రేలాడగట్టారు. కనుక నరేంద్రుడు పడమర ద్వారం గుండా గదిలోకి వెళ్లాడు. అప్పటికే గదిలో పలువురు భక్తులు ఉన్నారు. శ్రీరామకృష్ణులు సంకీర్తన గూర్చీ, భగవంతుణ్ణి గురించిన మాటల్లో మునిగివున్నారు. నరేంద్రుడు గదిలోకి రాగానే శ్రీరామకృష్ణులు తమ దృక్కులను అతనిపై సారించారు. ఆనాటి సమావేశం గురించి కాలాంతరంలో శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు:
భగవాన్ శ్రీరామకృష్ణుల గది, దక్షిణేశ్వరం
విలియం హేస్ట
శ్రీరామకృష్ణుల గురించి తెలిపిన ప్రొఫెసర్
రామచంద్ర దత్తా
శ్రీరామకృష్ణుల వద్దకు తోడ్కొని వెళ్లిన వ్యక్తి
యువప్రాయంలో కలుసుకొన్న కొందరు నాయకులు
దేవేంద్రనాథ్ టాగూర్
కేశవచంద్ర సేన్
విజయకృష్ణ గోస్వామి
శివనాథ్ శాస్త్రి
శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులలో కొందరు
బలరాం బోస్
మహేంద్రనాథ్ గుప్తా (‘మ’)
గిరీశ్చంద్ర ఘోష్
నాగమహాశయ్
కాశీపూర్ ఉద్యానగృహం
శ్రీరామకృష్ణులు చివరి రోజుల్లో నివసించిన ఇల్లు
‘నరేన్ లోకానికి బోధిస్తాడు’
శ్రీరామకృష్ణుల దస్తూరీ
శ్రీరామకృష్ణుల మహాసమాధి అనంతరం
వరాహ నగర మఠం
సురేంద్రనాథ్ మిత్రా
మొదటి మఠం నెలకొల్పడంలో ముఖ్యపాత్ర వహించిన వ్యక్తి
వరాహనగర మఠం, 1887
నిలబడ్డ వారు : 1. శివానంద 2. రామకృష్ణానంద 3. స్వామీజ
4. వంటమనిషి 5. దేవేంద్ర 6. ‘మ’ 7. త్రిగుణాతీతానంద 8. మస్తాబీ
క్రింద : 1. నిరంజనానంద 2. శారదానంద 3. హూట్కా గోపాల్ 4. అభేదానంద
1892 / 1893
“ఆ రోజు నరేంద్రుడు పడమటి ద్వారం గుండా గదిలోకి వచ్చాడు. అతడు తన దేహం గురించి పట్టించుకొన్నట్లుగా కనిపించలేదు. శిరోజాలు, దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దానికీ అతడు ముఖ్యత్వం ఇస్తున్నట్లుగా లేదు. దేని పట్లా ఆసక్తి ఉన్నట్లు కనిపించలేదు. మనస్సు ఎక్కువగా అంతర్ముఖ స్థితిలో ఉంటున్నట్లు అతడి కళ్లు చెప్పకచెబుతున్నాయి. బొత్తిగా లౌకికులైన ఈ కలకత్తా నగరప్రజానీకంలో సత్వగుణోపేతుడైన ఇలాంటి వ్యక్తి ఉండడం సాధ్యమేనా అని ఆశ్చర్యపోయాను!
“నేలమీద చాప పరచి ఉంది. దాని మీద కూర్చోమని అతడికి చెప్పాను.అదుగో అక్కడ గంగాజలం నింపిన కూజా ఉందే, దాని ప్రక్కన కూర్చున్నాడు.కొందరు స్నేహితులు కూడా అతడితో కలిసి వచ్చారు. వారి నైజం అతడినైజానికి పూర్తి వ్యతిరేకంగా కనిపించింది. ఆ స్నేహితులు సామాన్య యువకులమాదిరి సుఖభోగాలపట్ల అనురక్తి ఉన్నవారుగా కానవచ్చారు.”
నరేంద్రుడు వెళ్లి భక్తులతోపాటు కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు అతణ్ణిపాడమని అడిగారు. బ్రహ్మసమాజంలో పాడే కొన్ని పాటలు అతడు పాడాడు.ఆ పాటలు:
మరలు మనసా! మన నిజనికేతనంబునకు
మారువేషముల దాల్చి
పరదేశపు ఈ భువిలో
వ్యర్థముగా ద్రిమ్మదిరుగు
చుండనేల మన మిచట ॥ మ ॥
వరలు సకల ప్రాణతతులు
పంచమహాభూతములును
గారొక్కరు నీ వారలు
వారెల్ల పరాయివారు ॥ మ ॥
….
….
దారిలో భయమేర్పడిన
ఈశ్వరు నెలుగెత్తి పిలువు
ఆ దారికి ప్రభుడతడు
మృత్యువు సైతము మ్రొక్కును.*
పాటలోని నర్మగర్భితమైన ప్రగాఢ చింతనాధోరణిని వ్యక్తంచేసే రీతిలో ఉద్వేగభరిత స్వరంలో, మనఃఏకాగ్రతతో నరేంద్రుడు పాడాడు. పాటలో లయించి పోయిన శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో మునిగిపోయారు.
మరో పాట:
ఈలాగు వ్యర్థముగ నా దినములన్నియు
గడుపవలసినదేనా దేవా ॥ ఈ ॥
రాత్రింబగళ్లు నే నార్తితో వేచితిని
ఆశాపథము వైపు దేవా
విశ్వనాథుడ వీవు బిచ్చగాడను నేను
ఏలాగు హృది నిలువమని వేడగలను? ॥ ఈ ॥
నా బీద ఎదను గుడిసె తలుపులు బాగ
తెరువబడియున్నవి దేవా
దయయుంచి ఒకసారి దానిలోనికి వచ్చి
హృదయ దాహము తీర్పరావా?
పాట పూర్తయింది. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి బాగా ప్రశంసిస్తూ, “నరేంద్రునికి విద్యాదేవతయైన సరస్వతీదేవి అనుగ్రహం ఉంది” అన్నారు. అందరూ ఆశ్చర్యపోతూ నరేంద్రుణ్ణి చూశారు.
శ్రీరామకృష్ణుల వింత ప్రవర్తన
ఆ తరువాత శ్రీరామకృష్ణులు ప్రవర్తించిన తీరు వింతగా కానవచ్చింది. హఠాత్తుగా నరేంద్రునితో ఆయన, “అవునూ, నిద్ర పోవడానికి ముందు నీకు ఒక జ్యోతి కనిపిస్తుందా?” అని అడిగారు. అందుకు నరేంద్రుడు, “అవును! ఏమిటీ, ఇతరులకు కనిపించదా?” అని అడిగాడు. “ఆహా! అంతా సరిగ్గా ఉంది. నరేంద్రుడు జన్మతః ధ్యాన సిద్ధుడు” అని శ్రీరామకృష్ణులు వ్యాఖ్యానించారు.
ఇంతలో హఠాత్తుగా శ్రీరామకృష్ణులు లేచి నరేంద్రుని చేయిపుచ్చుకొని ఉత్తరం వైపు ఉన్న వసారాలోకి తీసుకుపోయారు. గది నుండి వసారాలోకి దారి తీసే తలుపును మూసివేశారు. అక్కడ వారిద్దరు మాత్రమే ఉన్నారు. తనకు శ్రీరామ కృష్ణులు ఏదో ఉపదేశించబోతున్నారని నరేంద్రుడు అనుకొన్నాడు. కాని జరి గింది మరొకటి! కాలాంతరంలో నరేంద్రుడు అప్పుడు ఏం జరిగిందో ఇలా చెప్పాడు:
“నా చేయి పుచ్చుకొని కళ్ల వెంట ఆనందబాష్పాలు స్రవిస్తూండగా, చిరపరి చితుడైన వ్యక్తిలా ఆప్యాయత ఉట్టిపడే స్వరంలో ఆయన నాతో ఒకింత విలపిస్తూ ఇలా అన్నారు: ‘ఓ, ఇంత ఆలస్యంగా వచ్చావే! లౌకికుల ప్రాపంచికమైన సంభాష ణలతో పలుకులతో నా చెవులు తూట్లుపడ్డాయి. నా ఆత్మానుభవాన్ని గురించి ఒక యోగ్యుడైన వ్యక్తితో ముచ్చటించడానికి ఎంతగా పరితపించానో తెలుసా!’ మరు క్షణమే చేతులు జోడించి నిలబడే నాతో, ‘అయ్యా, తాము సనాతన ఋషియైన నరుడు; నారాయణుని అవతారం; లోకుల దుఃఖాన్ని బాపడానికి ఈ లోకంలో మానవునిగా జన్మించారు’ అంటూ ఏదేదో చెప్పారు.
“కాని నేను లోలోపల, ‘ఇదేం చోద్యం! నేను విశ్వనాథ దత్తా కుమారుణ్ణి. కాని ఈయన నన్ను ఋషి అనీ, నారాయణుడనీ అంటున్నారు! సందేహం లేదు, ఈయన తప్పక పిచ్చివాడై ఉండాలి’ అని అనుకొన్నాను. అయినప్పటికీ నేను ఏమీ మాట్లాడలేదు.”
పిదప శ్రీరామకృష్ణులు తమ గదికి తిరిగి వచ్చారు. మిఠాయి తెచ్చి స్వయంగా తమ చేతులతో నరేంద్రునికి తినిపించారు. నరేంద్రుడు దానిని వారిస్తూ, “నా చేతికి ఇవ్వండి. లోపలికి వెళ్లి నా స్నేహితులతో కలిసి తింటాను” అన్నాడు. కాని శ్రీరామకృష్ణులు ఆ మాట పట్టించుకోకుండా, “వారికి తరువాత ఇస్తారు” అంటూ నరేంద్రునికి తినిపించారు. తదనంతరం అతని చేతులు పుచ్చుకొని, “నాయనా, త్వరలోనే ఒక రోజు ఒంటరిగా వస్తానని వాగ్దానం చేయి” అని వేడుకొన్నారు. ఆయన వేడుకోలును తిరస్కరించలేక నరేంద్రుడు అందుకు సమ్మతించాడు.
వాన చినుకు పడింది!
తరువాత నరేంద్రుణ్ణి గదిలోకి తీసుకువెళ్లి తక్కిన వారితో సంభాషించ సాగారు. నరేంద్రుడు తన మిత్రుల ప్రక్కన కూర్చుని శ్రీరామకృష్ణుల ప్రవర్తనను గమనించసాగాడు. కాసేపటి క్రితం వరండాలో తనతో మాట్లాడిన వ్యక్తీ, ఈయనా విభిన్నంగా అతడికి అనిపించారు. ఆ మేరకు ఆయన తక్కిన వారితో మామూలుగా ప్రవర్తించారు. నరేంద్రుని ఆశ్చర్యం వర్ణనాతీతం.
కాని శ్రీరామకృష్ణుల మాటలూ, అనుభవాలూ ఆయనను నిజమైన సాధు వుగా నరేంద్రునికి తోపింపజేశాయి. ఆయన ఉపదేశాలకు ఆయన జీవితం అద్దం పట్టింది. ఆయన సరళంగా మాట్లాడారు. అప్పుడు నరేంద్రుని మనస్సులో, ‘ఈ వ్యక్తి గురువుగా ఉండగలరా? నా సందేహాన్ని ఈయనను అడగవచ్చా?’ అనే ప్రశ్న మెదలింది. వెంటనే శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్లి, చాలా రోజులుగా తన మనస్సును వేధిస్తున్న, అనేకులను అడిగినా జవాబు లభించని ఆ ప్రశ్నను అడి గాడు:
“మహాశయా, మీరు భగవంతుణ్ణి కళ్లారా చూశారా?”
ఎక్కడెక్కడో వెదకివేసారి నిష్ఫలమై తిరుగుముఖం పట్టిన ప్రశ్న ఎట్టకేలకు సముచితమైన చోటు చేరుకొంది. ఠక్కున జవాబు వచ్చింది:
“అవును, చూశాను. ఎంతో స్పష్టంగా నిన్ను చూస్తున్నంత స్పష్టంగా, ఇంకా స్పష్టంగా” అన్నారు శ్రీరామకృష్ణులు.
సముద్రంలోనే జీవిస్తున్నా వాన చినుకుకై పరితపించి, తనను తెరచి ఉంచుకొని వేచివుంటుంది ముత్తెపు చిప్ప! నేడు వాన చినుకు పడింది!
శ్రీరామకృష్ణులు కొనసాగించారు:
“నిన్ను చూస్తూన్నట్లుగా, నీతో మాట్లాడుతున్నట్లుగా భగవంతుణ్ణి చూడ వచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. కాని ఎవరికి ఆ కోర్కె ఉంది! భార్యాపిల్లల నిమిత్తం లోకులు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు; ధనం కోసమూ, సుఖభోగాల కోసమూ దొర్లుతూ విలపిస్తారు. భగవద్దర్శనం పొందలేదని ఎవరు విలపిస్తు న్నారు? ఆయనను దర్శించాలనే పరమ వ్యాకులతతో బిగ్గరగా పిలిస్తే ఆయన తప్పకుండా సాక్షాత్కరిస్తాడు.”
కాలాంతరంలో నరేంద్రుడు ఇలా చెప్పాడు:
“ఆయన జవాబు నా మనస్సులో ప్రగాఢ ముద్ర వేసింది. ‘నేను భగవం తుణ్ణి దర్శించాను; మతం అనేది అనుభూతి పొందవలసిన సత్యం; ఈ లోకాన్ని మనం అనుభూతం చేసుకోవడానికన్నా అనేక రెట్లు లోతుగా గ్రహించవలసిన విషయం’ అంటూ వచించే ఒక వ్యక్తిని నేను ప్రప్రథమంగా కలుసుకొన్నాను. ఆయన చెప్పిన విషయాలు విన్న తరువాత, ‘ఇతర మత బోధకులలా కల్పనలో స్ఫురించినది ఈయన మాట్లాడడం లేదు. భగవంతుని కోసం నిజంగానే సర్వ స్వాన్నీ త్యజించి, ఆయనను మనఃస్ఫూర్తిగా ప్రార్థించి, భగవదనుభూతి పొంది, తదనుభవంతోనే మాట్లాడుతున్నారు’ అని తెలుసుకొన్నాను.
“కాని ఆయన ఇప్పటి మాటలూ, కాసేపటి క్రితం ప్రవర్తించిన తీరూ ఎంతో విరుద్ధంగా కనిపించాయి. ‘అలా అయితే కొన్ని సమయాల్లో స్పష్టంగాను, మరికొన్ని సమయాల్లో పిచ్చిపట్టినట్లూ ఉంటారా ఈయన? బహుశా సగం పిచ్చేమో!’ అని అనిపించింది. ‘ఉండవచ్చు, పిచ్చివాడై ఉండవచ్చు; కాని భగవం తుని కోసం ఇలా సర్వస్వాన్నీ త్యజించిన వ్యక్తిని చూడడం ఎంతో అరుదు. పిచ్చి వాడే అయినప్పటికీ ఈయన పరమ పావనుడు, అత్యుత్తమ సాధువు; అందుకే మానవాళి స్తుతించి, ఆరాధించదగిన వ్యక్తి’ అని అనుకొన్నాను. ఇలా పరస్పర విరుద్ధమైన భావనలతో ఆ రోజు ఆయన వద్ద సెలవు పుచ్చుకొని కలకత్తాకు తిరుగుముఖం పట్టాను.”
నరేంద్రునికి మరో ఆశ్చర్యం కూడా కలుగకపోలేదు. నిద్రపోతున్నప్పుడు పొందుతున్న జ్యోతిర్మయ దర్శన అనుభవం గురించి తాను ప్రారంభంలో ఒక రిద్దరు మిత్రులతో చెప్పడంతో సరి! ఆ తరువాత ఎవరితోనూ ఆ సంగతి ప్రస్తా వించలేదు. ఆ విషయం ఈయనకు ఎలా తెలిసింది? అదే కాదు, నరేంద్రుణ్ణి ఆయన ‘ధ్యానసిద్ధుని’ గా పేర్కొన్నారు. ‘నాకు ధ్యానం పట్ల అమిత ఆసక్తి ఉండ డమూ, నేను ధ్యానం చేయడమూ ఈయనకు ఎలా తెలుసు?’ ఈ రకంగా అనేక ప్రశ్నలు తరంగాల రూపంలో అతడిలో చెలరేగాయి.
శ్రీరామకృష్ణులలో సైతం తరంగాలు ఉవ్వెత్తున లేచాయి. అవి ప్రేమ తరం గాలు! నరేంద్రుణ్ణి మళ్లీ చూడాలనే వ్యాకులతామయమైన తరంగాలు. ఆ వ్యాకు లత ఆయన హృదయాన్ని మెలిపెట్టి పిండివేసింది.
రెండవ సమావేశం
శ్రీరామకృష్ణులను కలుసుకోవాలనే ఆకాంక్ష నరేంద్రునిలో అప్పుడప్పుడు కలిగినప్పటికీ చాలా రోజుల వరకు అతడు దక్షిణేశ్వరం వెళ్లలేకపోయాడు. చదువు, బ్రహ్మసమాజ సమావేశాలు, మిత్రులతో రోజులు దొర్లిపోయాయి. అంతేకాదు; మొదటిసారి దక్షిణేశ్వరం వెళ్లి నప్పుడు కలిగిన అనుభవం భగవంతుణ్ణి గురించిన భావనలో ఒక స్పష్టతను అతడిలో కలిగించినప్పటికీ, శ్రీరామకృష్ణులను గురించి ఆతడు ఒక నిర్ధారణకు రాలేకపోయాడు. అతను వెళ్ళకపోవడానికి అదొక కారణం. కాని అక్కడకు వస్తా నని శ్రీరామకృష్ణులకు అతడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి దక్షి ణేశ్వరం వెళ్లాలని నరేంద్రుడు నిశ్చయించుకొన్నాడు. దాదాపు నెల తరువాత ఒంటరిగా ఒక రోజు దక్షిణేశ్వరం వెళ్లాడు.
ఆ రోజు జరిగింది ఒక అద్భుతమైన నాటకం! దానిని గురించి నరేంద్రుడు కాలాంతరంలో ఇలా చెప్పాడు: “ఆ రోజు దక్షిణేశ్వర కాళికాలయానికి కాలినడ కన వెళ్లాను. కలకత్తా నుండి దక్షిణేశ్వరం అంత దూరంలో ఉందని నేను ఊహించలేదు. క్రితంసారి బండిలో వెళ్లాను. దాశరథీ సన్న్యాల్, సాత్గడి లాహిరీ ప్రభృత మిత్రులను కలుసుకోవడానికి ఇంతకు ముందు చాలాసార్లు వరాహ నగరం వెళ్ళాను. వారి ఇళ్లకు సమీపంలోనే రాణీ రాస్మణి ఉద్యానం ఉందని అను కొన్నాను. కాని నడుస్తున్నకొద్దీ రహదారి కొనసాగుతూనే వచ్చింది. పలువురిని వాకబుచేసి ఎట్టకేలకు దక్షిణేశ్వరం చేరుకొన్నాను.
“తిన్నగా శ్రీరామకృష్ణుల గదికి వెళ్లాను. అప్పుడు ఆయన చిన్న మంచం మీద తన్మయులై కూర్చుని ఉన్నారు. అక్కడ ఎవరూ లేరు. నన్ను చూడగానే పట్టరాని ఆనందంతో నన్ను పిలిచి మంచం మీద ఒక ప్రక్కన వచ్చి కూర్చో మన్నారు. నేను కూర్చొన్నాను. ఆయన ఏదో తెలియరాని వింతైన మనోభావంలో మునిగివున్నారు. అస్పష్టంగా గుసగుసగా ఏదో చెబుతూ నన్ను తదేకంగా చూస్తూ నాకేసి మెల్లగా జరగసాగారు. ‘పిచ్చి మొదలయింది. ఆ రోజు మాదిరి నేడు కూడా ఏదో విపరీతం చేయనున్నారు’ అని అనుకొన్నాను. ఇంతలో ఆయన నన్ను సమీ పించి తన కుడిపాదాన్ని నా మీద ఉంచారు. ఆ క్షణంలోనే నాకు ఒక అద్భుత అనుభవం కలిగింది. నా కళ్లు తెరచుకొనే ఉన్నాయి. కాని నేను చూసిందేమిటో తెలుసా?
“గదిలోని వస్తువులన్నీ గోడలతోసహా గిర్రున తిరుగుతూ అదృశ్యమయి పోయాయి. చరాచర ప్రపంచమూ, దానితోబాటు ‘నేను’ అనే భావనా సమస్తం మహాశూన్యంలో లయించిపోతున్నట్లు తోచింది! చెప్పనలవిగాని మహాభయం నన్ను ఆవరించింది; ‘నేను – అనే భావన నాశనమే మరణం, ఆ మరణం ఇదుగో నిలబడివుంది, నా కళ్లు ముందు నిలబడివుంది’ అని అనిపించింది! నేను భరించలేకపోయాను. ‘హా! నన్ను మీరు ఏం చేస్తున్నారు! నాకు తల్లితండ్రు లున్నారు’ అని కేకపెట్టాను. అది విని ఆ అద్భుతమైన పిచ్చివాడు పెద్దగా నవ్వి తన చేతులతో నా ఛాతీని స్పృశిస్తూ, ‘అలా అయితే ఇక చాలు. ఒకేసారిగా వద్దులే, సకాలంలో అంతా జరుగుతుంది’ అని అన్నారు. ఆయన అలా పలికిన మరుక్షణమే నా అద్భుత అనుభవం అదృశ్యమయింది! నేను సహజ స్థితిలోకి వచ్చాను. గది లోపల, వెలుపల ఉన్న వస్తువులన్నీ మునుపటిలా ఉన్నట్లే కని పించాయి.
“ఈ సంఘటనను వివరించడానికి ఇంతసేపు పట్టింది. కాని ఇవన్నీ ఒకటి రెండు క్షణాల్లో జరిగిపోయాయి. ఈ సంఘటన నా మనస్సులో గొప్ప విప్లవం కలిగించింది. ఏం జరిగిందోనని విస్తుబోతూ యోచించాను. ఈ వింత వ్యక్తి వలన క్షణంలో ఈ అనుభవం కలిగి, అంతే వేగంతో మాయమయిపోయింది.
“వశీకరణ శక్తి (Hypnotism), సమ్మోహన శక్తి (mesmerism) గురించి చదివాను. ఇదీ అలాంటిదేదో అయివుంటుందని భావించాను. కాని దానిని అంగీ కరించడానికి నా మనస్సు ససేమిరా ఒప్పుకోలేదు. ఎందుకంటే దుర్బల మనస్కుల మీద మాత్రమే అత్యధిక మనోబలం గలవారు ప్రాబల్యం వహించి ఇలాంటి స్థితులను సృష్టించగలుగుతారు. ముమ్మాటికీ నేను దుర్బల మనస్కుణ్ణి కాను. ఇంకా చెప్పాలంటే నా మనోబలం పట్లా, బుద్ధిసూక్ష్మత పట్లా నాకు అచం చలమైన విశ్వాసం ఉంది. మరో విషయం కూడా స్ఫురించింది. ఆయన వ్యక్తి త్వపు తాకిడి నాకు తగిలిందా? అలా జరగదు. సామాన్యులే ఉన్నతులైన వ్యక్తుల గుణగణాలచే ఆకర్షితులై, వారి చేతుల్లో కీలుబొమ్మలవుతారు. నా విషయంలో అలా ఉండడానికి వీలులేదు. ఎందుకంటే మొదటి నుండీ ఈయనను సగం పిచ్చివానిగా నిర్ధారణ చేశాను కదా! నాకు ఇలాంటి స్థితి ఎందుకు కలిగింది? తీవ్రంగా ఆలోచించాను. ఎలాంటి నిర్ణయానికీ రాలేకపోయాను.
“నా మనస్సు గందరగోళంలో కొట్టుమిట్టాడింది. ‘నీ తత్త్వశాస్త్రం కనే కల కన్నా ఇంకా ఎన్నో విషయాలు ఇహ పరాల్లో ఉన్నాయి’* అని ఒక మహాకవి వచించిన మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. ఇదీ దాన్లో ఒకటని అనుకొన్నాను. ఈ రకంగా బుర్రను బద్దలుకొట్టుకొని, చివరకు దీన్ని అర్థం చేసుకోలేని విష యంగా తేల్చుకొన్నాను. ఇకపై ఈ అద్భుతమైన పిచ్చి మనిషి తన శక్తితో నా మనస్సును ఆకట్టుకొని, ఇలాంటి స్థితిని కల్పించడానికి అనుమతించకూడదని గట్టిగా నిర్ణయించుకొన్నాను.
“మనఃస్థైర్యమూ, దృఢ సంకల్పమూ గల నాలాంటి వారి మనస్సులను సైతం పగలగొట్టి, పిండి పిండి చేసి, బంకమట్టిలా పిసికి తాను కోరిన ఆకృతి రూపొందించగల ఈ వ్యక్తిని పిచ్చివాడని ఎలా అనడం అనే భావనా తలెత్తక పోలేదు. కాని నేను మొదటిసారి వెళ్లినప్పుడు నన్ను ఒంటరిగా తీసుకుపోయి ఆయన మాట్లాడినదంతా తలచుకొంటే ఆయనను పిచ్చివాడని కాక మరేం అను కోవాలి? పైన పేర్కొన్న నా అనుభవానికి కారణం కనుగొనలేనట్లుగా, పసిబిడ్డ వంటి పవిత్రతా, సరళతా గల ఆ వ్యక్తి గురించి కచ్చితమైన నిర్ధారణకు నేను రాలేకపోయాను.
“ఒక వస్తువు గురించో, వ్యక్తి గురించో చూసి, విని, హేతువాదపూర్వకంగా విచారించిన తరువాత కూడా నా బుద్ధికి ఏదీ అందడంలేదంటే దానిని నేను స్వీకరించడమో, నిరాకరించడమో చేయను; పట్టించుకోకుండా వదలివేస్తాను. కాని ఆ రోజు నా ఆ నైజానికి బలంగా దెబ్బ తగిలింది. మనస్సు చెప్పనలవిగాని ఆవేదనలో మునిగిపోయింది. ఆ కారణంగా, ఆ వింత వ్యక్తి నైజాన్ని, శక్తినీ ఎలా గైనా పరిశోధించి నిజం కనుగొని తీరాలని నిశ్చయించుకొన్నాను.
“ఈ విధంగా అనేక ఆలోచనలతో, నిశ్చయాలతో ప్రొద్దుపుచ్చసాగాను. ఆ సంఘటన తరువాత శ్రీరామకృష్ణులు పూర్తిగా మారిపోయినట్లుగా కనిపించారు. ఆప్యాయం ఉట్టిపడే రీతిలో తినుబండారాలు నాకు స్వయంగా తినిపించారు. చిర పరిచితునిలా ప్రవర్తించారు. దీర్ఘకాలం తరువాత ఆప్తమిత్రులనో, అతిసన్నిహిత బంధువులనో కలుసుకొన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తామో, అచ్చం అలాగే ఆయన వ్యవహరించారు. నాకు తినిపించి, నాతో మాట్లాడి, వినోదంగా ఉల్లాసంగా నాతో గడిపి నా పట్ల తమకు గల ఎనలేని ఆప్యాయతానురాగాలను ఎన్నో రకాల వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆయన సంతృప్తి చెందినట్లు లేదు. ఇదంతా చూసి నేను పొందిన విస్మయం అంతా ఇంతా కాదు. మెల్లమెల్లగా సాయంకాలమవుతుండగా ఆయన వద్ద సెలవు పుచ్చుకొన్నాను. అప్పుడు ఆయన ఎంతో ఆవేదన చెంది నట్లుగా కనిపించారు. ‘మళ్లీ త్వరలో వస్తావా? చెప్పు’ అంటూ మళ్లీ నిలదీశారు. వస్తానని ఆ రోజు కూడా వాగ్దానం చేయాల్సివచ్చింది. తరువాత ఇంటికి తిరిగివచ్చాను.”
మూడవ సమావేశం : సందేహ నివృత్తి
కాన్ని రోజులు గడిచాక మూడవసారి నరేంద్రుడు దక్షిణేశ్వరం వెళ్లాడు. శ్రీరామకృష్ణుల మహిమాన్విత శక్తిని గురించి తెలుసుకొన్న పిదప, ఆయనను పూర్తిగా అవగతం చేసుకోవాలనే ఉత్సుకత నరేంద్రునిలో తీవ్రస్థాయికి చేరుకొంది. ఏదైనా ఒక విషయం తెలుసుకోవా లనే ఉత్సుకత కలిగినప్పుడు తిండి, బట్ట, విశ్రాంతి లాంటి వాటి మీద అతడి దృష్టి పోదు; దానిని తెలుసుకొనేంత దాకా ఆతడి మనస్సు ఊరడిల్లదు. శ్రీరామకృష్ణులను గురించి తెలుసుకోగోరినప్పుడు కూడా ఆతడి మనస్సు అదేవిధంగా ప్రశాంతతను కోల్పోయింది.
ఈసారి కాస్త హెచ్చరికగానే నరేంద్రుడు వెళ్లాడు. రెండవసారి జరిగినట్లు ఈసారి జరుగకూడదనే గట్టి పట్టుదలతో ఉన్నాడు. కాని కించిత్తు కూడా ఎదురు చూడనిది జరిగింది!
ఆ రోజు దక్షిణేశ్వరంలో బాగా రద్దీగా ఉన్నందువల్లనో ఏమో శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి సమీపంలోని యదుమల్లిక్ ఉద్యానానికి తోడ్కొని వెళ్లారు.యదుమల్లిక్, ఆతడి తల్లీ శ్రీరామకృష్ణుల పట్ల అమిత భక్తిప్రపత్తులు గలవారు.తాము అక్కడ లేనప్పుడు కూడా శ్రీరామకృష్ణులు రావడం సంభవిస్తే, ఆయన ఆసీనులవడానికి ఒక గదిని తెరచి ఉంచాలని పనిమనుషులకు ఉత్తర్వు జారీ చేశాడు యదుమల్లిక్.
ఆ ఉద్యానంలో కాసేపు నరేంద్రునితో పచార్లుచేస్తూ అనేక విషయాలుశ్రీరామకృష్ణులు ముచ్చటించారు. పిదప ఆ గదిలోకి వెళ్లి కూర్చున్నారు. ఇంతలోనే భావపారవశ్య స్థితిలో మగ్నులయ్యారు. కాస్త దూరం నుండే ఇదంతా నరేం ద్రుడు గమనిస్తూనే ఉన్నాడు. అప్పుడు, ఆ పారవశ్య స్థితిలోనే హఠాత్తుగా వచ్చి నరేంద్రుణ్ణి ఆయన స్పృశించారు. నరేంద్రుడు ఎంతో అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఆ శక్తిమంతమైన స్పర్శచే స్మృతి కోల్పోయాడు. మునుపటి అనుభవాల మాదిరి కాకుండా ఈసారి అతడు బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయాడు. కాసేపటి తరువాత అతడికి బాహ్యస్మృతి కలిగినప్పుడు, శ్రీరామకృష్ణులు చిరునవ్వులు చిందిస్తూ అతడి ఛాతీని చేత్తో నిమురుతూ కనిపించారు.
నరేంద్రుని మానసిక స్థితి
ఏం జరిగిందో నరేంద్రునికి అర్థం కాలేదు. బహుశా అతడు అర్థం చేసుకోవలసిన అవసరం లేదని శ్రీరామకృష్ణులు భావించి ఉండవచ్చు. శ్రీరామకృష్ణుల పావన స్పర్శచే నరేంద్రుని మానసిక స్థితిలో గొప్ప మార్పు వచ్చింది. అప్పటి నుండి శ్రీరామకృష్ణులను అతడు పిచ్చి వానిగా భావించలేదు. అందుకు మారుగా, కామకాంచన పీడితులూ, స్వార్థపరులూ అయిన పిచ్చివారి మధ్య జీవిస్తూ బుద్ధి స్పష్టత గలవారిగా ఆయనను పరిగణించాడు. అయినప్పటికీ జరిగిన సంఘటనలు అతడికి అంతుబట్టలేదు.
మొత్తానికి శ్రీరామకృష్ణుల గురించి ఎలాంటి నిర్ణయానికీ నరేంద్రుడురాలేకపోయాడు. ఆయనను గురించి స్పష్టమైన అవగాహన కలుగనంత దాకా ఆయన చెప్పే విషయాలు అంగీకరించడానికి నరేంద్రుని యుక్తియుక్తత ఒప్పుకోలేదు. కాబట్టి ఆయన పట్ల ఆకర్షితుడయినప్పటికీ, ఒకింత దూరంగానే ఉండగోరాడు నరేంద్రుడు. నరేంద్రుని జీవితం పెద్దగా ఒడుదొడుకులు లేకుండాసాగింది. కళాశాలకు వెళ్లాడు. ఇంట్లో పాఠాలు చదువుకొన్నాడు. అలవాటుప్రకారం ఆదివారాల్లో బ్రహ్మసమాజ సమావేశాలకు వెళ్లాడు. మిత్రులతో మెలగాడు. వేడుకలు, వినోదాల్లో పాల్గొన్నాడు.
అదే సమయంలో ఆతడి ఆంతరిక జీవితం మరింత తీవ్రతరమయింది. ప్రగాఢ ప్రశాంతతను సంతరించుకొన్న రాత్రుల్లో ఆతడు చాలాసేపు ధ్యానం చేయ సాగాడు. యోగసాధనలు అనుష్ఠించాడు. కళ్ల వెంట నీరు ధారలుగట్టి చెంపల మీదుగా స్రవిస్తూవుండగా ఆతడు ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించసాగాడు.
సప్తర్షులు : దివ్యలోకం
నరేంద్రుడు వెళ్లినప్పుడల్లా శ్రీరామకృష్ణులు ఏదో చేయడానికి ప్రయత్నించ డమూ, నరేంద్రుడు అందుకు ఇష్టపడకో లేక అందుకు సిద్ధంగా లేకపోవడమో ప్రతిఘటించేలా ఏదో జరుగుతూన్నట్లుగా ఉంది. ఇదంతా ప్రహేళికగా (puzzle) కానవస్తున్నది ఏమిటి? శ్రీరామకృష్ణులు అలా ఏం చేశారు? దానిని అర్థం చేసుకోవాలంటే శ్రీరామకృష్ణులు గాంచిన రెండు దివ్యదర్శనాలను మనం తెలుసుకోవాలి.
శ్రీరామకృష్ణులు ఒక అవతారపురుషుడు. ఒక సందేశంతో లోకంలో అవత రించారని ఇంతకు క్రితమే చూశాం. ఆయనకు సహాయం చేయడానికి నిత్యముక్తు లయిన కొందరు కూడా లోకంలో జన్మిస్తారు. వారిలో ప్రతి ఒక్కరూ వస్తున్నప్పుడు శ్రీరామకృష్ణులు తక్షణమే వారిని గుర్తిస్తారు. ఆయన సందేశాన్ని లోకమంతటా చాటిచెప్పి, సత్యయుగాన్ని స్థాపించడంలో కీలకపాత్రను వహించబోయేది నరేంద్రుడు. ఆతణ్ణి గురించీ శ్రీరామకృష్ణులు కొన్ని దివ్యదృశ్యాలు గాంచారు. వాటిలో రెండింటిని ఇప్పుడు చూద్దాం. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు:
“ఒక రోజు సమాధి స్థితిలో నా మనస్సు జ్యోతిర్మండలం గుండా పైకి పోయింది. సూర్యచంద్ర నక్షత్ర సమేతమైన ఈ స్థూలప్రపంచాన్ని అతిక్రమించి, అది భావమయ సూక్ష్మజగత్తులోకి ప్రవేశించింది. సూక్ష్మ సూక్ష్మతమ భూము లను అధిరోహించేకొద్దీ, బాటకు ఇరువంకలా సౌందర్యవంతులైన దేవతా మూర్తులు కానరాసాగారు. క్రమంగా నా మనస్సు ఆ ప్రాంతం శివార్లను చేరు కొంది. అక్కడ ఖండ, అఖండ జగత్తులను వేరుచేస్తున్న ఒక వెలుగు రేఖను చూశాను. దానిని దాటి నా మనస్సు మెల్లగా ఆ అఖండ జగత్తులోకి ప్రవేశిం చింది. అక్కడ సాకారమైనదేదీ లేదు. దివ్యదేహులైన దేవీదేవతలు సైతం దిగువ లోకాలలోనే ఆధిపత్యం చలాయించగలరు కనుక అక్కడ ప్రవేశించడానికి భయ పడ్డాను. కాని మరుక్షణంలోనే దేహధారులూ, దివ్యతేజస్కులూ అయిన సప్తర్షులు అక్కడ సమాధిమగ్నులై కూర్చుని ఉండడం చూశాను. ఆ ఋషులు జ్ఞానంలో, సౌజన్యంలో, ప్రేమపరిత్యాగాలలో దేవతలనే తలదన్నినట్లుగా నాకు కనిపించారు. వారిని మానవులతో పోల్చే ప్రసక్తే లేదు.
“ఆ సప్తర్షుల గురించీ, వారి మహత్త్వాన్ని గురించీ నేను యోచిస్తూన్నప్పుడు, ఆ అఖండ జగత్తులోని తేజోరాశిలో కొంతభాగం ఘనీభవించి ఒక దివ్య శిశువుగా రూపొందడం చూశాను. ఆ దివ్యశిశువు మెల్లగా ఒక ఋషి వద్దకు వెళ్లి తన మృదువైన చేతులను ఆయన మెడ చుట్టూ వేసి, మృదుమధురమైన స్వరంతో పిలుస్తూ ఆయనను సమాధి స్థితి నుండి మేల్కొల్పడానికి ప్రయత్నించింది. ఆ కోమల హస్త స్పర్శతో ఆ ఋషి జాగ్రదావస్థలోకి వచ్చి అర్ధనిమీలితనేత్రుడై ఆ అద్భుత శిశువును చూశాడు. ఆ శిశువును చూడగానే ఆయన వదనంలో భాసిం చిన మహదానందాన్ని చూసి వారి అనుబంధం శాశ్వతమైనదనే తలంపు నాలోమెదలింది. ఆ అసాధారణ దివ్యశిశువు పరమానందంతో ఆ ఋషితో, ‘నేను వెళుతున్నాను, నువ్వూనాతో రావాలి!’ అని అన్నది. ఆ విన్నపానికి ఆయన ఏం బదులు పలుకలేదు కాని ఆయన ప్రేమాస్పద నేత్రాలు అందుకు అంగీకారాన్ని తెలుపకనే తెలిపాయి. తరువాత ఆ శిశువును ఆప్యాయంగా చూస్తూ ఆయన మళ్లీ సమాధిమగ్నుడైనాడు. ఇదంతా చూసి నేను ఆశ్చర్యపోతూవుండగా, ఆ ఋషి మనశ్శరీరాలలో కొంతభాగం దివ్యప్రకాశంగా మారి భూమి వైపుగా దిగసాగింది.మొట్టమొదటిసారి నరేంద్రుణ్ణి చూసీచూడగానే ఆ ఋషిసత్తముడే అతడని గ్రహించాను.”*
ఇక రెండవ దృశ్యం. ఇది నరేంద్రుడు జన్మించిన సమయంలో శ్రీరామ కృష్ణులు చూసింది. ఆ సమయంలో కాశీ నుండి ఒక దివ్యకాంతి బయలుదేరి కలకత్తాలో జన్మ నెత్తినట్లు ఆయన చూశారు. ‘నా ప్రార్థన సఫలీకృతమయింది; నా సొంతమయిన అతడు ఒక రోజు ఇక్కడకు వస్తాడు’ అంటూ ఆనందంతో ఆయన నృత్యం చేశారు.
ఏం చేశారు శ్రీరామకృష్ణులు?
ఇక శ్రీరామకృష్ణ – నరేంద్రుల సమావేశంలో జరిగిన సంఘటనలు పరి కిద్దాం. సురేంద్రుని ఇంట్లో కలుసుకొన్నప్పుడే ఆతణ్ణి గుర్తించారు శ్రీరామకృష్ణులు. అప్పుడు ఆతడి శరీర లక్షణాలు ఇత్యాదులను నిశితంగా పరిశీలించారు. శ్రీరామకృష్ణులు తమ శిష్యులను పరీక్షించే విధాలలో ఇది ఒకటి. నరేంద్రుని అవయవాల అమరికను గురించి శ్రీరామకృష్ణులు చెప్పడం కద్దు. “ఇదుగో చూడు, నీ అంగ లక్షణాలు గొప్పగా ఉన్నాయి. కాని ఒక్క విషయం. నువ్వు నిద్రిస్తున్నప్పుడు బుస్సుబుస్సు మంటూ భారంగా శ్వాసిస్తావు. ఇలాంటి వారికి ఆయుస్సు తక్కువ అని యోగులు చెబుతారు.” మళ్లీ, “నువ్వొక మెట్ట వేదాంతివి కావని నీ కళ్లు చెబుతున్నాయి. నీలో నిరాడంబర భక్తీ, ప్రగాఢ జ్ఞానమూ జతచేరి ఉన్నాయి” అనీ ఒకసారి ఆయన చెప్పారు. మొదటి రోజు పరీక్ష సంతృప్తి కలిగించడంతో నరేంద్రుణ్ణి దక్షిణేశ్వరం రమ్మని ఆయన ఆహ్వానించారు.
నరేంద్రుడు దక్షిణేశ్వరం వెళ్లాడు. అతణ్ణి ఒంటరిగా తీసుకొనిపోయి, “నువ్వు ఫలానా ఋషివి” అని చెప్పారు. నరేంద్రునికి ఆ మాట అర్థం కాలేదు.
కనుక రెండవసారి వెళ్లినప్పుడు అతడికి ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించి, అతణ్ణి ఉన్నత స్థితులకు అధిరోహింపజేసి, అతడి నుండి నిజాన్ని తెలుసుకోదలచి అతణ్ణి స్పృశించారు. కాని నరేంద్రుడు అందుకు సిద్ధంగా లేడు. “మహాశయా! నాకు తల్లితండ్రులున్నారు” అంటూ కేకపెట్టాడు. దాంతో శ్రీరామకృష్ణులు వదలి పెట్టారు.
మూడవసారి అతడు దక్షిణేశ్వరం వచ్చినప్పుడు మాత్రమే శ్రీరామకృష్ణులు పూర్తిగా విజయం సాధించగలిగారు. ఆ రోజు అతణ్ణి స్పృశించినప్పుడు నరేం ద్రుడు పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు అతణ్ణి ఉన్నత భావనాభూమిలో నిలిపి, అతడి అంతరాంతరాళాల్లో దాగివున్న అనేక విషయాలు తెలుసుకొన్నారు.
శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: “నరేంద్రుడు బాహ్యస్మృతిని కోల్పోయిన తరుణంలో అతడు ఎవరు, ఎక్కడ నుండి వచ్చాడు, ఎందుకోసం జన్మించాడు, ఇక్కడ (ఈ ఇలలో) ఎంత కాలం ఉంటాడు మొదలైన ప్రశ్నలు అతణ్ణి అడిగాను. అతడు కూడా అంతర్ముఖుడై సముచితంగా జవాబులిచ్చాడు. నేను అతణ్ణి గురించి చూసినవాటినీ, తలచినవాటినీ ఆ జవాబులు ధ్రువీకరించాయి. వాటి నన్నింటినీ బహిర్గతం చేయరాదు. కాని అతడి జవాబుల నుండి ఒక విషయం స్పష్టమయింది: తాను ఎవరో తెలుసుకొన్న తరువాత అతడు ఈ లోకం నుండి నిష్క్రమిస్తాడు; అప్పుడే దృఢ సంకల్పంతో యోగమార్గంలో తన దేహాన్ని త్యజి స్తాడు. నరేంద్రుడు ధ్యానసిద్ధుడు, మహాత్ముడు.”
శ్రీరామకృష్ణుల పరిశోధన ముగిసింది. కాని నరేంద్రుడు? అతడి మనస్సు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఆతడి పరిశోధన మొదలయింది.