భగవాన్ శ్రీరామకృష్ణులు
దక్షిణేశ్వర ఆలయాలు
పంచవటి
శ్రీరామకృష్ణులు ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించిన స్థలం
ఓం స్థాపకాయచ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే ।
అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః ॥
– స్వామి వివేకానంద
ఆధ్యాత్మిక జీవితానికి ఒక నిఘంటువు — శ్రీరామకృష్ణులు ఆవిష్కరించిన సత్యాలు — సత్యయుగం: ఒక వీక్షణ — శిష్యుల పని
ఆధ్యాత్మిక జీవితానికి ఒక నిఘంటువు
“భా రతదేశపు మూడు వేల సంవత్సరాల పారమార్థికతనూ, సాంస్కృతిక వారసత్వాన్నీ ఒక్క జీవితకాలంలో జీవించిన వ్యక్తి” అని శ్రీరామకృష్ణ పరమ హంసను విఖ్యాత ఫ్రెంచి రచయితా, మేధావీ అయిన రోమా రోలా అభివర్ణించాడు. ఆధ్యాత్మిక జీవితానికి ఒక నిఘంటువు శ్రీరామకృష్ణులు. ఆయన జీవిత అధ్యయనం ద్వారా మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని అవగతం చేసుకోగలం.
ఆయనను గురించీ, ఆయన దివ్యమయ జీవితం గురించీ అనేక గ్రంథాలు వెలువడ్డాయి. కనుక ఇక్కడ మనం పరమహంస జీవితంతో నరేంద్రుని జీవితం ఏ విధంగా ముడివడి ఒక నూతన సందేశాన్ని లోకానికి అందించిందీ, ఆధునిక యుగానికి పునాదిగా అమరిందనే అంశం మాత్రం పరికిద్దాం. స్వామి వివేకానంద మాటలతోనే ప్రారంభిద్దాం:
“కాలక్రమంలో ఆర్య సంతతివారు సదాచారమార్గం నుండి భ్రష్టులై, వైరాగ్యరహితులై వ్యాప్తిలో ఉన్న ఆచారాలనే పాటిస్తూ క్రమంగా వివేకశూన్యు లయ్యారు. వేదాంత ప్రసక్తే లేదు…. సూక్ష్మాతిసూక్ష్మమైన వేదాంత సత్యాలను అల్పబుద్ధులైన సామాన్యులకు విశదపరచడం కోసం స్థూలంగా, నిర్దిష్టంగా వర్ణించడం చేత, భగవంతుని విభిన్న భావాలను బోధించడం చేత అవి పరస్పర విరుద్ధంగా ఉన్నట్లే కానవస్తాయి. తత్ఫలితంగా అనంతభావ సమష్టియైన అఖండ సనాతన వైదిక ధర్మాన్ని అనేక విభాగాలుగా విడగొట్టి మత వైషమ్యాలను రగిలించి, ఒకర్ని ఒకరు ఆ దావానలంలో పడద్రోయడానికి సదా ప్రయత్నించ సాగారు. ధర్మానికి ఆలవాలమైన భారతదేశాన్ని ఆ రీతిలో వారు దాదాపు నరక తుల్యంగా మార్చివేశారు.
“అలాంటి పరిస్థితిలో ఆర్యుల నిజమైన మతం ఏమిటో, సదా కలహించు కొంటూ స్థూలదృష్టికి శాఖోపశాఖలుగా కానవస్తూ, ఎక్కడ చూసినా విపరీత ఆచా రాల సంప్రదాయాలతో కూడుకొని స్వదేశీయులకు భ్రాంతి జనితమై, విదేశీయు లకు తిరస్కార స్థానమై, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా నానామతాలుగా, సంప్రదాయాలుగా, మతశాఖలుగా చీలిపోయిన మన సనాతన వైదిక మతంలో నిజమైన ఐక్యత ఎక్కడ ఎలా ఉన్నదో చూపించడానికి, కాలానుక్రమంగా కోల్పో యిన సనాతన ధర్మ విశ్వజనీనతను స్వీయ జీవితంలో ప్రత్యక్షంగా అభివ్యక్తం చేసి, ఆ సనాతన మతానికి సజీవ ఉదాహరణమై భగవాన్ శ్రీరామకృష్ణులు ఈ ఇలలో అవతరించారు.”*
మత చరిత్రలో శ్రీరామకృష్ణుల జీవితం ఒక మైలు రాయి. కొన్ని వేల సంవత్సరాలకు మునుపు సింధూ, గంగా, సరస్వతీ నదీతీరాలలో తపమొనరిం చిన ఋషివరేణ్యుల వాణిగా వెలువడిన నాశరహితమైన సత్యాలు శ్రీరామకృష్ణుల జీవితంలో ధ్రువీకరింపబడ్డాయి. ఆధ్యాత్మిక సాధనల ద్వారా తమను అర్హులుగా చేసుకొన్నవారి ముఖతా ఆ సత్యాలు వ్యక్తమవుతాయి. ఆ సత్యాలు దేశకాలాతీత మైనవి. ఆ ఋషులు వెలువరచిన సత్యాలతో కూడిన ఏ శాస్త్రాలనూ శ్రీరామ కృష్ణులు అధ్యయనం చెయ్యలేదు. కాని ఆయన వేదకాలంలోని ఋషులు చూపిన దారిలో తన జీవితాన్ని పరిశోధనారంగంగా చేసుకొని, ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించి ఆ సత్యాలను తమ జీవితంలో అభివ్యక్తం చేశారు. దీనివలన వేదాల సత్యత్వం నిరూపితమైంది. ఈ విధంగా వేదాలు వెలువడడానికి ఒక పరికరంగా తమను రూపొందించుకోవడానికి శ్రీరామకృష్ణులు పన్నెండేళ్లు కఠోర తపోమయ జీవితం గడిపారు.
చదువు సంధ్యలు లేని ఒక సామాన్యునిగా, ఒక కుగ్రామంలో శ్రీరామ కృష్ణుల జీవితం ప్రారంభమయింది. కాని భగవత్సాక్షాత్కారం పొందాలనే తీవ్ర తపన అతి చిరుప్రాయం నుండే ఆయనలో నెలకొంది. యువప్రాయంలోనే ఆయన దక్షిణేశ్వరంలో కాళికాలయంలో పూజారిగా నియుక్తులయ్యారు. తాను నిర్వర్తిస్తున్న పూజను నిజంగానే కాళీమాత స్వీకరిస్తున్నదా లేకపోతే వట్టి శిలావిగ్ర హానికి మాత్రమే పూజ చేస్తున్నానా అనే ప్రశ్న ఆయనలో చెలరేగింది. నిజంగానే కాళీమాత తమ పూజను స్వీకరిస్తున్న పక్షంలో ఆ విషయం తనకు తెలియాలి, ఆమెను దర్శించాలనే మనోవ్యాకులతా, తీరని దాహమూ ఆయనలో ఒక పిచ్చిగా ఎదిగింది. ఆరు సంవత్సరాల నిరంతర వ్యాకులతానంతరం కాళీమాత సాక్షా త్కారం ఆయనకు లభించింది!
కాళీమాత దివ్యదర్శనం మానసిక తృప్తిని ఇవ్వడానికి బదులు ఆయనలో తీవ్ర అన్వేషణాగ్నిని రగిల్చింది. ఎన్ని మార్గాలున్నాయో, అన్ని మార్గాల ద్వారా జగజ్జనని మహిమను తిలకించాలి, అన్ని మార్గాల ద్వారా భగవదానందాన్ని చవిచూడాలనే ఉత్సుకత ఆయనలో కట్టలు తెంచుకొంది. దాంతో హిందూమతం లోని విభిన్న శాఖలనూ, అన్యమతాలైన క్రైస్తవ, మహమ్మదీయ మతాలను ఆచరించి, వాటిలో ప్రతి ఒక్కదానిలోనూ పరమ గమ్యాన్ని సాధించారు. మత చరిత్రలో ఇలాంటి సంఘటన ఇంతకు మునుపు కనీవినీ ఎరుగం.
ఈ విధంగా తమ సంశోధనల పిదప ఆయన, ‘ఎన్ని మతాలో అన్ని మార్గాలు’ అనే సత్యాన్ని ఆవిష్కరించారు. ఏ మతంలోనూ దోషం చూడవద్దు, అన్ని మతాలూ పరమ సత్యం వైపు మనలను తోడ్కొని వెళ్లేవే. కనుక మతాల మధ్య ఘర్షణ వద్దు. ఒక వ్యక్తి తన మతాన్ని మనఃస్ఫూర్తిగా అనుసరిస్తే చాలు, అదే అతణ్ణి పరమ సత్యానికి చేర్చే బాటగా ఏర్పడుతుంది. ఈ మత సామరస్య భావన కాలావశ్యకతకు ఎంతో అనుకూలమయినది.
శ్రీరామకృష్ణులు ఆవిష్కరించిన సత్యాలు
ఈ మతసామరస్య భావనను ప్రాతిపదికగా చేసుకొన్న ఒక క్రొత్త సమా జాన్ని రూపొందించడమే తమ అవతార ఉద్దేశమని దివ్యానుభూతి ద్వారా గ్రహించారు శ్రీరామకృష్ణులు. “కాళీమాత చేతిలో తానొక పరి కరమేననీ, స్వకీయ జీవితంలో అనుభూతి పొందిన మత సామరస్య సిద్ధాంతానికి అనుకూలమైన ఒక క్రొత్త మతాన్ని తాను స్థాపించాలనీ గ్రహించారు గురుదేవులు” అని శ్రీరామ కృష్ణుల జీవిత చరిత్ర రచించిన స్వామి శారదానంద వ్రాశారు.*
“శ్రీరామకృష్ణులు జన్మించినప్పటి నుండి అరుణోదయం కాసాగింది; ఉదయ సూర్యుని కిరణాలు వ్యాపించసాగాయి. కాలక్రమంలో ఆ మహాకాంతి మిట్ట మధ్యాహ్న సూర్యునిలా లోకాన్నే కాంతితో ముంచెత్తుతుంది…. ఆయన పుట్టిన రోజు నుండే సత్యయుగం ప్రారంభమయింది”* అంటారు స్వామి వివేకానంద. ఆ సత్యయుగానికి అనువైన క్రొత్త సమాజమే శ్రీరామకృష్ణులు దర్శించిన సమాజం. ఆ సత్యయుగాన్ని నిర్వహించే ఆ క్రొత్త సమాజంలోని కొన్ని అంశాలను ఆయన ఉపదేశాల ద్వారా చూద్దాం.
సత్యయుగం: ఒక వీక్షణ
క్రొత్త సమాజమనేది ఒక్క రోజులో రూపొందదు. మనుషుల చేరికయే కదా సమాజం. క్రొత్త సమాజం రూపొందాలంటే క్రొత్త మనుషులు రూపొందాలి. క్రొత్త భావనలు, క్రొత్త చింతనలు, క్రొత్త దృక్పథం, క్రొత్త వైఖరి సంతరించుకొన్న వ్యక్తులుగా వారుం డాలి. వారిని గురించి శ్రీరామకృష్ణుల భావనలను పరికిద్దాం.
జీవిత పరమావధి
- జీవిత పరమావధి భగవత్సాక్షాత్కారం. నూనె లేకుండా దీపం వెలగదు. అదే విధంగా భగవంతుడు లేకుండా మనిషి జీవించలేడు.
- భగవత్సాక్షాత్కారానికి కులం, మతం, సంప్రదాయం, భాష, లింగ భేదం, దేశం, అంతస్తు, విద్య, ధనం ఇత్యాదులు ఏవీ ఆటంకాలు కావు.
భగవంతుడు
- భగవంతుడు ఒక్కడే. విభిన్న మతాలు ఆయనను భిన్నభిన్న నామాలతో పేర్కొంటున్నాయి. ఆంగ్లేయులు ‘వాటర్’, ఉత్తర భారతీయులు ‘పానీ’ అనీ, – వివిధ భాషలవారు వేర్వేరు పేర్లతో పిలిచినా జలం ఒక్కటే.
- భగవంతుని స్థితులయిన సాకారమూ, నిరాకారమూ రెండు సత్యమే. ఒకే పాము పడగవిప్పి ఆడడమూ, చుట్టచుట్టుకొని ఉండడమూ లాంటి స్థితులవి. ఒకే భగవంతుడు జగత్ సృష్టి స్థితి లయాలను నిర్వహించేటప్పుడు శక్తి లేక దేవి అని పేర్కొనబడతాడు. అదే భగవంతుడు ఈ చేతలకు అతీతుడుగా ఉన్నప్పుడు బ్రహ్మం అని పేర్కొనబడుతున్నాడు.
- భక్తుల నిమిత్తం భగవంతుడు అనేక రూపాలు దాలుస్తాడు. శీతలం కారణంగా సముద్ర జలం కొన్నిచోట్ల మంచుగడ్డలుగా మారుతుంది. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ మంచుగడ్డలు కరిగి మళ్లీ సముద్ర జలంగా మారుతాయి. అదే విధంగా భక్తి కారణంగా భగవంతుడు పలురకాల రూపాలు ధరిస్తాడు. జ్ఞానభాస్కరమయిన అద్వైత జ్ఞానం ఉదయించినప్పుడు రూపాలు అదృశ్యమవు తాయి, ఆయన నిరాకారునిగా స్ఫురిస్తాడు. కాని మంచు కరగని ప్రాంతాలు ఉన్న ట్లుగా భగవంతుని రూపాలు అదృశ్యంకాని ఉన్నత స్థితులు కూడా ఉన్నాయి.
- యుగాల పర్యంతం భగవంతుడు మానవునిగా అవతరిస్తున్నాడు. తక్కినవారు భగవదనుభూతి పొందడానికి ఒక ద్వారంగా ఆ అవతారపురుషుడు విరాజిల్లుతాడు.
- జగజ్జనని సంకల్పానుసారమే ఈ లోకం మనుగడ సాగుతోంది. జీవితం ఆమె లీల, ఆమె క్రీడ. బంధమూ, ముక్తీ – రెండూ ఆమె చేతిలోనివే. మనిషి తెలివితేటలకు హద్దులున్నాయి. ఆ కారణం వల్లనే ఈ దివ్యలీలలోని యథార్థాన్ని ఆతడు గ్రహించలేకపోతున్నాడు.
ఆధ్యాత్మిక అనుభూతి
- ఆత్మ, భగవంతుడు లాంటి సత్యాలను ధ్రువీకరించడానికిగల ఒకే మార్గం ప్రత్యక్ష అనుభవమే. శాస్త్రాలు సంకేత ఫలకాలలా ఈ సత్యాలను సూచించ గలుగుతాయేగాని, వాటిని నిరూపించలేవు. వర్షం ఎప్పుడు పడుతుందో పంచాంగం తెలుపుతుంది; అలాగని పంచాంగాన్ని పిండితే ఒక చుక్కనీరు కూడా రాదు.
- ఆధ్యాత్మిక అనుభవాలకు హద్దులు లేవు. కనుక పొందిన అనుభవా లతో తృప్తిచెంది ఆగిపోకుండా ముందుకు సాగాలి.
- కుండలినీ శక్తి జాగృతమయినప్పుడే ఆధ్యాత్మిక అనుభవాలు కలుగు తాయి.
- ద్వైతం కాని స్థితియైన అద్వైతానుభవమే అత్యంత ఉన్నతమైన అను భవం.
- కాని అద్వైతం చరమ అనుభూతి కాదు. అద్వైత అనుభవం పొందిన కొందరు మళ్లీ సామాన్య స్థితికి వస్తారు. వారు సర్వత్రా భగవంతుణ్ణి చూస్తారు, ఆ భగవదానందంలోనే జీవిస్తారు. ఈ స్థితి ‘విజ్ఞానం’ అనబడుతుంది. ఈ స్థితిని పొందిన వ్యక్తిని ‘విజ్ఞాని’ అని పేర్కొంటారు. ఆ వ్యక్తి భగవంతుడు (నిత్యం), జగత్తు (లీల) రెంటినీ సత్యంగా దర్శిస్తాడు.
- ఎన్నడూ బద్ధుడుకాని, సదా ముక్తి స్థితిలోనే నెలకొనివున్న వారు కొంద రున్నారు. నిత్యముక్తులయిన వీరు భగవంతుడు అవతరించే తరుణంలో ఆయ నతోబాటే జన్మించి, ఆయన అవతార కార్యానికి తోడ్పడతారు. వీరిని ఈశ్వర కోటులుగా పేర్కొంటారు.
శ్రీరామకృష్ణులు వీటిని బోధించడం మాత్రమే కాక సత్యాలను ధ్రువీకరించ డానికి కొందరి జీవితాలను రూపొందించి నిష్క్రమించారు. ఈ పరమాదర్శాన్ని తమ జీవితంలో పాటించిన వారిలో పురుషులు, స్త్రీలు, సన్న్యాసులు, విద్యావంతులు, విద్యావిహీనులు ఉన్నారు.* ఒక నూతన సమాజాన్ని రూపొందించాలని నొక్కివక్కా ణించడం మాత్రమే కాక, అది సుసాధ్యమేనని ఋజువు పరచారు ఆయన.
శ్రీరామకృష్ణులకు ద్యోతకమైన ఈ సత్యాలు ప్రస్తుతం లోకంలోని కోట్ల మంది ఆధ్యాత్మిక జీవితాలకు మార్గదర్శకాలై విరాజిల్లుతున్నాయి. మత కలహా లకూ, ఘర్షణలకూ పరిష్కారంగా విలసిల్లుతున్న ఆయన ఈ ఆదర్శాలు మానవ జీవితంలో పాటింపబడినప్పుడు జీవితం ఉన్నతమవుతుంది, సమాజం పురోగ మించి క్రొత్త సమాజం రూపొందుతుంది, సత్యయుగం అవతరిస్తుంది.
కాని ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోవాలి. నేడు ప్రతి ఆధ్యాత్మిక గ్రంథం లోనూ ఈ భావనలు సామాన్యంగా కానవస్తాయి. పలువురు ఆచార్యులూ, గురు వులూ ఇలాంటి భావనలనే బోధిస్తున్నారు. కనుక నేడు మనం అనేక చోట్ల చూస్తూన్న ఈ భావనలు శ్రీరామకృష్ణుల నుండే సంక్రమించాయని మరువరాదు. వెన్న లభించే దుకాణాలు ఎన్నో ఉంటాయి. కాని పాలను పెరుగుగా మార్చి, దానిని చిలికి వెన్న తీయవచ్చునని కనుగొన్న మొట్టమొదటి వ్యక్తి తెలివిని మనం సామాన్యంగా గుర్తుంచుకోము. అదే విధంగా శ్రీరామకృష్ణులకు పూర్వం ఉండిన భావనలు ఇంత స్పష్టంగా, సరళంగా విపులీకృతం కాలేదు. ఆయనే ప్రప్రథ మంగా వీటిని విడమరచి, విభజించి సూత్రాలలా అందజేశారు; నేడు మనం చూస్తూన్నది వాటి భాష్యాలే.
శిష్యుల పని
అవతార పురుషులు తమ సందేశాన్ని లోకానికి అందించే ముందు తమ జీవితాలను ఒక మహా పరీక్షా రంగంగా రూపొందించుకోవాలి. ఈ మహత్తరమైన తపస్సు చేసి కాలానుగుణమైన సత్యాలను ఆవిష్కరించడంలో వారి శక్తీ, సమయమూ చాలాభాగం ఖర్చవుతుంది. కనుక అర్హులైన కొందరిని మాత్రమే ఎంపిక చేసుకొని వారికి ఆ సందేశాన్ని అప్పగించి నిష్క్రమిస్తారు. వాన చినుకును తనలో పదిలపరచుకొని ఆల్చిప్ప సముద్రపు లోతులలోకి పోయి దానిని ముత్యంగా రూపొందిస్తుంది. ముత్యంగా రూపొందించడంతో దాని పని పూర్తవుతుంది. ఆ ముత్యాన్ని వెలు పలికి తీసి లోకానికి అందించే పనిని ఇతరులు చేసినట్లు, అవతార పురుషులు తమ మహత్తర తపోమయ జీవితం ద్వారా ఆవిష్కరించిన సత్యాలను వారి శిష్యులు తమ జీవితాలలో చాటిచూపి, లోకానికి అందిస్తారు.
ఆధ్యాత్మిక సత్యాలూ, వారసత్వమూ సామాన్యంగా సన్న్యాసుల పారంపర్యం మూలంగానే పదిలంగా వస్తూవచ్చాయి. శ్రీరామకృష్ణుల ఈ నూతన సందేశాన్ని ప్రచారం చేయడానికి అలాంటి ఒక సన్న్యాస సంఘం ఆవశ్యకమయింది. హిందూమత చరిత్రలో అలాంటి సన్న్యాస సంఘ రూపకల్పన కనీవినీ ఎరుగనిది. దానిని రూపొందించడానికి ఆయనకు తగిన పరికరం అవసరమయింది. అలాంటి పరికరంగా ఉండదగిన వ్యక్తికి మన ఆధ్యాత్మిక సాంస్కృతిక వార సత్వం గురించి క్షుణ్ణంగా తెలిసివుండాలి. దానితోపాటు అప్పట్లో హిందూ మతానికి సవాలుగా నిలచిన పాశ్చాత్య సంస్కృతి, విజ్ఞానం మొదలైనవి కూడా అతడు బాగా అవగతం చేసుకొని ఉండాలి. అలాంటి ఒక వ్యక్తికై శ్రీరామ కృష్ణులు నిరీక్షిస్తున్నారు.
వేదకాలం నాటి ఋషివరేణ్యులు ఆవిష్కరించిన సత్యాలను ప్రత్యక్షంగా దర్శించిన ఒక మహాత్ముని కోసం నరేంద్రుడు అన్వేషిస్తున్నాడు. అలాంటి మహాత్మునిగా విరాజిల్లడం మాత్రమే కాక, తాము దర్శించిన సత్యాలను లోకానికి చాటిచెప్పడానికి ఒక క్రొత్త సన్న్యాస సంఘాన్ని రూపొందించే సమర్థుడైన వ్యక్తి కోసమూ శ్రీరామకృష్ణులు ఎదురుచూస్తున్నారు. వారిద్దరి సమావేశమూ కాలా వశ్యకమయింది.