నరేన్ సాధించింది కాలాల పర్యంతం నిలిచి ఉంటుంది. అతడు ఈ పని కోసమే జన్మించాడు. లోకానికి ప్రకాశాన్నిచ్చే ఆచార్యునిగా,
జగద్గురువుగా అతణ్ణి వేలమంది శ్లాఘిస్తారు!
– మాతృమూర్తి శ్రీ శారదాదేవి
‘మరణం అంచున నిలబడ్డాను’ — బయలుదేరారు — ప్రయాణ టిప్పణులు (notes) — చెన్నై నౌకాశ్రయంలో — అలసింగ పట్ల స్వామీజీ ప్రేమ — కొలంబోలో — ప్రయాణం — తరంగంలా ఉప్పొంగే ఆలోచనలు — ‘ఈ నాగరకత వెనుకనా?’ — లండన్‌లో — స్టర్డీ తప్పుడు ధోరణి — రిచ్మండ్ — ‘ఇదో కవిత్వ సారం!’
‘మరణం అంచున నిలబడ్డాను’
స్వామీజీ రెండవసారి 1899 జూన్ 20వ తేదీన పాశ్చాత్య దేశాలకు బయలుదేరారు. తురీయానంద, నివేదితలు ఆయనతో బాటు వెళ్ళారు. ఆయన పయనానికి రెండు కారణాలు పేర్కొనవచ్చు. ఒకటి, బాగా క్షీణించిన ఆయన ఆరోగ్యం మెరుగుపడుతుందనే నమ్మకం; రెండు – అంతులేకుండా కొనసాగుతున్న భారతీయ కార్యకలాపాల కోసం నిధులు సేకరించే ప్రయత్నం.
పాశ్చాత్యం దేశాలకు వెళ్ళడానికి తురీయానందను ఒప్పించడానికి భగీరథ ప్రయత్నం చేయవలసి వచ్చింది. పూర్వాచారపరాయణత్వం, తపస్సు ఆయనలోని విశేషాంశాలు. ఆధ్యాత్మిక అత్యున్నత స్థితులను పొందిన ఆయనను, “వాక్శుద్ధి, గంభీర కంఠస్వరం గల వ్యక్తి” అని స్వయంగా స్వామీజీయే శ్లాఘించారు. పాశ్చాత్య దేశాలకు వెళ్ళడానికి ఆయన నిరాకరించినప్పడు స్వామీజీ, “ఇలా చూడు, హరీ! నువ్వు అక్కడికి వచ్చి ఏమీ చేయనక్కర్లేదు. వారి మధ్య నివసిస్తే చాలు” అన్నారు. అయినప్పటికీ ప్రజాజీవనం సుతరామూ అభిలషించని తురీయానంద ఈ ప్రతిపాదనను నిరాకరించారు. వెంటనే స్వామీజీ తురీయానంద ప్రక్కకు వెళ్ళి ఆయన భుజాలమీద ఆదరంతో చేతులు వేశారు. తమ తలను ఆయన హృదయం మీద వాల్చారు, స్వామీజీ కళ్ళు చెమ్మగిల్లాయి. గద్గద స్వరంలో తురీయానందతో, “గురుదేవుల పావన కార్యాన్ని నెరవేర్చడానికి అంగుళం అంగుళంగా నా జీవితాన్నే అంకితం చేసి, ఈ రోజు మరణం అంచున నిలబడి ఉన్నాను! చేతులు కట్టుకొని నువ్వు చూస్తూ ఊరుకొంటావా? ఈ భారాన్ని మోయడంలో నాకు చేదోడుగా ఉండవా?” అని అడిగారు. స్వామీజీ కంఠస్వరం అస్పష్టమైంది. ఇక తురీయానంద భరించలేకపోయాడు; చిట్టచివరకు స్వామీజీ విన్నపాన్ని మన్నించాడు.
అమెరికాకు తనతో కొన్ని వేదాంత గ్రంథాలను తీసుకువెళ్ళగోరాడు తురీయానంద. అందుకు స్వామీజీ, “గ్రంథాలూ, అధ్యయనమూ వారు అవసరమైన మేరకు అభ్యసించారు. క్షత్రియ శక్తిని వారు కనుగొన్నారు. బ్రాహ్మణ శక్తిని వారికి చూపగోరుతున్నాను” అన్నారు. భారతదేశాన్ని గురించీ, భారతీయ ఆధ్యాత్మికత గురించీ ధైర్యంగా చెప్పి, ప్రతిఘటించిన అడ్డంకులన్నిటినీ ఛిన్నాభిన్నం చేసి, తుపాను వేగంతో అమెరికా అంతటా తిరిగి ఉపన్యాసాలిచ్చిన తమను అమెరికావారు కనుగొన్నారు. ఇక, భారతీయ సంప్రదాయమూ సంస్కృతులలో పెరిగిన, ధ్యాన జీవితాన్ని ప్రధానంగా తీసుకొన్న తురీయానందను వారు చూడాలన్నదే స్వామీజీ అభిలాష.
నివేదిత తన చెల్లెలి వివాహ విషయంగాను, స్త్రీల పాఠశాలకు నిధులు సేకరించడానికిగాను స్వామీజీతో కలసి వెళ్ళాలని నిశ్చయించుకొంది. బయలుదేరడానికి ఒకటి రెండు వారాల ముందు నివేదిత మాతృమూర్తి శ్రీ శారదాదేవి ఇంటికి వెళ్ళి అక్కడ నివసించసాగింది. మాతృదేవి ఆమెకు ఒకరోజు విందు చేశారు.
బయలుదేరారు
స్వామీజీ బయలుదేరడానికి ఒకటి రెండు రోజులు ముందు పలువురు ప్రముఖులు వచ్చి ఆయనను కలుసుకొన్నారు. స్వామీజీ కూడా వెళ్ళి కొందరు మిత్రులను కలుసుకొని వచ్చారు. జూన్ 19 వ తేదీ రాత్రి స్వామీజీకి, తురీయానందకు వీడ్కోలు విందు ఇచ్చారు. పలువురు ప్రసంగించారు. స్వామీజీ కూడా ‘సన్న్యాసం: దాని ఆదర్శం, ఆచరణ’* అనే అంశం గురించి ప్రసంగించారు. బయలుదేరే రోజు మాతృదేవి తమ ఇంట్లో స్వామీజీకీ తురీయానందకూ, తక్కిన సన్న్యాసులకూ విందు చేశారు.
స్వామీజీకి వీడ్కోలు చెప్పడానికి అనేకులు నౌకాశ్రయానికి వచ్చారు. నాడు శారదానంద తమ్ముడు వారితో అమెరికా వెళ్ళవలసి ఉంది. ఎస్.ఎస్.గోల్కొండ అనే ఓడలో నలుగురూ కలకత్తానుండి బయలుదేరారు.
ప్రయాణ టిప్పణులు (notes)
ఈ ప్రయాణం దాదాపు 40 రోజులు పట్టింది. వంగ పత్రిక ‘ఉద్బోధన్’ సంపాదకుడైన త్రిగుణాతీతానంద విన్నపం మేరకు స్వామీజీ ఈ ప్రయాణం గురించిన తమ జ్ఞాపకాలు వ్రాసుకొంటూ వచ్చారు. ఆ సంస్మరణలు ధారావాహికగా వెలువడ్డాయి. స్వామీజీ చారిత్రక జ్ఞానానికీ, హాస్యప్రియత్వానికీ ఈ ధారావాహిక అద్దం పడుతుంది. అంతేకాక గ్రాంథికంలో వ్యాస రచన సాగిన ఆ కాలంలో వ్యావహారిక భాషలో స్వామీజీ రచించడం విశేషం. దీనిని రవీంద్రనాథ్ టాగూర్ అమితంగా శ్లాఘించారు. కాలాంతరంలో ఈ స్వామీజీ శైలిని ఒక పూర్వ ప్రమాణంగా స్వీకరించి అనేకులు దానిని అనుసరించారు. స్వామీజీ రచించిన ‘ప్రాచ్యం – పాశ్చాత్యం’ అనే వ్యాసం గురించి టాగూర్, “మామూలు వ్యావహారిక భాషలో తేజోవంతంగా, శక్తిమంతంగా ఎలా వ్రాయవచ్చో ఈ వ్యాసం చదవడం వలన గ్రహించవచ్చు” అని వ్యాఖ్యానించారు.
చెన్నై నౌకాశ్రయంలో
అమెరికా వెళ్ళే దారిలో జూన్ 24వ తేదీన ఓడ చెన్నైను చేరుకొంటుందన్న వార్త అందగానే చెన్నైలో స్వామీజీ దర్శనార్థం ఉత్సాహం పొంగి పొరలింది. కాని దురదృష్టవశాత్తు కలకత్తాలో ప్లేగు వ్యాధి వ్యాపించడం వలన ఎవరూ చెన్నైలో దిగలేకపోయారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఓడలోని వారు దిగి క్రిందికి రావడానికో, క్రింద ఉన్నవారు ఓడలోకి వెళ్ళడానికో ప్రభుత్వం అనుమతించలేదు. దీన్లో తమాషా ఏమిటంటే తెల్లవారికి ఈ నియమం వర్తించదు. వారి రాకపోకలకు ఎలాంటి ఆక్షేపణా లేదు. “స్వదేశీయులు మాత్రమే అనుమతింపబడలేదు. తెల్లవాడు పరిశుభ్రంగా ఉంటాడు; ‘స్వదేశీ’ ఎవరైనప్పటికీ అతడు అపరిశుభ్రంగా ఉంటాడు. ప్లేగు వ్యాధిని వ్యాపింపజేస్తాడు! కనుక అతడికి అనుమతి లేదు!”
మాతృదేశంలోనే బానిసలుగా జీవించే ఈ అమానుషత్వం చూసి స్వామీజీ క్రుంగిపోయారు. బోనులో చిక్కువడ్డ సింహంలా ఆయన అటూ ఇటూ పచార్లు చేశారు. “వారు నన్నెందుకు ఖైదు చేయకూడదు? నా ప్రాణం ఎందుకు తీయకూడదు?” అని పదే పదే చెప్పారు. ప్రక్కనే ఉన్న తురీయానంద, “ఎందుకు? మిమ్మల్ని ఖైదు చేసినందువల్లనో, చంపడం వల్లనో ఏం జరుగుతుంది?” అని అడిగారు. అందుకు స్వామీజీ, “ఈ దేశమంతా నన్ను ఎదురు చూస్తూ నిలబడడం నువ్వు చూడలేదా? నాకు వ్యతిరేకంగా ఆంగ్లేయులు ఏదైనా చేసే పక్షంలో యావత్తు దేశం తిరగబడుతుంది” అన్నారు.
ససేమిరా అనుమతి లభించలేదు. కనుక వందలమంది భక్తులూ, సన్న్యాసులూ చిన్నచిన్న పడవలలో వెళ్ళి ఓడ పై భాగానికి వచ్చిన స్వామీజీని చూసి ఆనందించారు. రామకృష్ణానంద, నిర్భయానంద పండ్లు, పువ్వుల లాంటి అనేక కానుకలు తీసుకువెళ్ళారు. చెన్నై ఆప్తులు పలువురు స్వామీజీ దర్శనార్థం వచ్చారు. స్వామీజీ ఓడ పై భాగంలోని ఇనుప కటకటాలను అనుకొని వారితో మాట్లాడారు. రామకృష్ణానంద విన్నపం ప్రకారం స్వామీజీ జాడీలో గంగాజలం తీసుకువచ్చారు. దానిని ఒక త్రాడుతో కట్టి క్రిందికి దింపి ఇచ్చారు. తరువాత ఆ త్రాడును తెంపడానికి పై నుండి ఒక కత్తిని పడేశారు.*
అలసింగ పట్ల స్వామీజీ ప్రేమ
స్వామీజీ మాట్లాడే అవకాశం కోల్పోకూడదని అలసింగ కొలంబో దాకా టికెట్ కొనుగోలుచేసి ఒక ప్రయాణికుడిలా ఓడలోకి వెళ్ళాడు. కుల నియమాలు అతణ్ణి సముద్రయానం చేయడానికి అనుమతించనప్పటికీ స్వామీజీ పట్ల గల ఆదరాభిమానాల కారణంగా అలసింగ శ్రీలంకకు వెళ్ళాడు. బ్రహ్మవాదిన్ పత్రిక గురించి స్వామీజీని సలహా అడగాలనే ఉద్దేశంతో ఉన్నాడతడు.
శిరోముండనం, పిలక, ధోవతి, నుదుట నామాలతో అలసింగ పరమ పూర్వాచారపరాయణుడైన బ్రాహ్మణుని మాదిరి, దేనిని గురించీ కలత చెందని వ్యక్తిలా ఓడ పై భాగంలో పచార్లు చేయడం, ఓడలోని ఏ ఆహారాన్నీ తినకూడదని తాను తెచ్చుకొన్న మరమరాలు, వేరుసెనగ పప్పులు లాంటివి అప్పుడప్పుడు నోట్లో వేసుకోవడం చూపరులకు తమాషాగా కనిపించింది.
స్వామీజీ పట్ల అలసింగకు అపరిమిత భక్తి ప్రవత్తులున్నాయంటే స్వామీజీకి అలసింగ పట్ల గల ప్రేమాభిమానాలకు అవధులే లేవు. ఒక సంఘటన పరికిద్దాం. మెక్లౌడ్ బొంబాయిలో అలసింగను కలుసుకొన్నది. ఆమె ఒక పూర్వాచారపరాయణుడైన భారతీయుణ్ణి కలుసుకోవడం ఇదే మొదటిసారి. కచ్చపోసి కట్టుకున్న ధోవతి, పిలక, నుదుట నామాదులు మెక్లౌడ్కు మరీ కొత్త. అలసింగను విమర్శించనో, పరిహసించనో కూడదని స్వామీజీ హెచ్చరించినప్పటికీ మెక్లౌడ్ తనను అదుపులో ఉంచుకోలేకపోయింది. కాశ్మీర్లో ఉన్నప్పుడు ఒకరోజు ఆమె మాటల్లో, “ఏం తెలివితక్కువతనం! ఈ అలసింగ ఇలా నుదుట రేఖాచిత్రాలు గీసుకొన్నాడే!” అని వ్యాఖ్యానించింది. అంతే, స్వామీజీ కోపంతో, “నోరు ముయ్యి! ఇక అతణ్ణి గురించి ఏదైనా వ్యాఖ్యానిస్తే అప్పుడు తెలుస్తుంది! అలా నువ్వు ఏం పెద్దగా సాధించావు!” అని చీవాట్లు పెట్టారు. అంతే మెక్లౌడ్ కళ్ళ నుండి నీరు ధారకట్టింది. అలసింగ ఇల్లు ఇల్లూ తిరిగి తాము అమెరికా వెళ్ళడానికి డబ్బు సేకరించడమూ, తమ విజయాలకు నేపథ్యంలో అతడి నిస్వార్థ కార్యాచరణ ఉందని స్వామీజీకి తెలియంది కాదు; మెక్లౌడ్కు తెలియదు. కనుక అతణ్ణి బాహ్యచిహ్నాల కోసం విమర్శించరాదన్నారు స్వామీజీ. దానిని మెక్లౌడ్ ఉల్లంఘించినప్పుడు ఆయనకు కోపం వచ్చింది.
కొలంబోలో
ఓడ కొలంబోను సమీపిస్తున్నది, ఆ జూన్ 27 వ తేదీ సాయంత్రాన్ని నివేదిత ఇలా వర్ణిస్తున్నది: “ఇది ప్రశాంత సమయం. ప్రతి రోజూ సూర్యుని వెలుగు తగ్గిపోతున్న ఈ వేళలో సాగరకన్య ఒక క్రొత్త రాగం స్వరకల్పన చేస్తుంది – అదొక శోక రాగం! అలల ధ్వనులతో కలసిపోయి కరిగిపోయే ఒక సన్నని స్వరంలో ధ్వనిస్తోంది. ప్రతి రాత్రీ, రాత్రంతా ఆమె శోకపు మర్మరలు వినవస్తూనే ఉన్నాయి. కాని ఈ రోజు మాత్రం ఆమె ఏదో పేరును ఉచ్చరిస్తున్నట్లు అనిపిస్తోంది. అది – ‘సీత’ అనే పేరు! అలలు ఉవ్వెత్తున లేచి ఓడను ఢీకొన్నప్పుడు అది ‘జై సీతారామ్! సీతారామ్’ జై! జై! జై!’ అని ధ్వనిస్తూన్నట్లుగా ఉంది. పదే పదే వింటూండగా అది ఎక్కడో సుదూరంలో మౌనంలో లయించిపోతోంది.”
జూన్ 28వ తేదీన ఓడ కొలంబో చేరుకొంది. చెన్నైలో లాగా కాకుండా అక్కడ ఓడ నుంచి దిగడానికి స్వామీజీకి అనుమతి లభించింది. నాదస్వర మేళాలతో స్వామీజీకి ఘనంగా స్వాగతం పరికారు. అదుపుచేయలేని జనసమూహం గుమి గూడింది. “జై శివా! జై శివా!” అన్న నినాదం ఆకాశాన్నంటింది. స్వామీజీని శివావతారంగా వారు కొనియాడారు. తరువాత స్వామీజీకి పండ్లు, పాలు సమర్పించారు. ఆ రోజంతా స్వామీజీ శ్రీలంకలో ఉండిపోయారు. “చాలా రోజుల తరువాత ‘మిరియాల నీరు’ (చారు), కొబ్బరిబోండాం పుచ్చుకొన్నాను” అంటూ ఆయన వ్రాస్తున్నారు.
ప్రయాణం
శ్రీలంక నుంచి ఏడెన్, నేపిల్స్ గుండా ప్రయాణం సాగింది. చదువుకోవడంలోను, ‘ఉద్బోధన్’ కోసం వ్రాయడంలోను, నివేదిత, తురీయానందలతో ముచ్చటించడంలోను స్వామీజీ కాలం గడిపారు. ఆయన ఆరోగ్యం మెరుగయింది. తమకంటూ కొన్ని వ్యాయామాలు ఆయన కేటాయించుకొన్నారు. తను మరచిపోతే జ్ఞాపకం చేయమని ఆయన తురీయానందను హెచ్చరించి ఉన్నారు. ప్రారంభంలో కొన్ని రోజులు విడిచిపెట్టకుండా వ్యాయామం చేశారు. ఆ తరువాత, మాటల్లో పడి మరచిపోయేవారు. తురీయానంద జ్ఞాపకం చేస్తే, “ఇవాళ సాధ్యం కాదు. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది. అంతేగాక నేనిప్పుడు నివేదితతో మాట్లాడుతున్నాను. ఆమె పరాయి దేశస్థురాలు. నా నుంచి ఇవన్నీ నేర్చుకోవడానికి స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చింది. ఆమె చాలా తెలివైనది. ఆమెతో మాట్లాడడం నాకూ సంతోషదాయకమే” అంటూ ఏవేవో కారణాలు చెప్పి వ్యాయామానికి స్వస్తి చెప్పేవారు. కాని ఎలాగో ఆయన ఆరోగ్యం బాగా మెరుగుపడింది.
అలలు శాంతించిన కొన్ని సమయాల్లో స్వామీజీ ఓడ పై భాగంలో పచార్లు చేసేవారు. “యువరాజులా గంభీరమైన నడక, ఆకర్షణీయమైన దుస్తులు. చంద్రకిరణాల వంటి దేహచ్ఛాయ, ఆత్మ స్థైర్యం, తెగింపు విరాజిల్లే ఆకృతి, ప్రాచ్యదేశాల ఘనతకూ దృఢత్వానికీ నిదర్శనంగా భాసిల్లే రూపం” అని ఆయన ఆకృతిని నివేదిత వర్ణిస్తున్నది.
తరంగంలా ఉప్పొంగే ఆలోచనలు
ఈ పయానాన్ని ఒక తీర్థయాత్రగా పరిగణించింది నివేదిత. “స్వామీజీతో ఈ 6 వారాల ప్రయాణం నా జీవితంలో అత్యంత ఉత్కృష్టమైన రోజులు. ప్రపంచాన్ని చుట్టే విలాసయాత్ర సైతం గురువుతో వెళ్ళినట్లయితే తీర్థయాత్రగా పరిణమిస్తుంది” అంటూ ఆమె వ్రాస్తున్నది. స్వామీజీ మాట్లాడడం వినడమూ, ఆయన పాదపద్మాల మ్రోల జీవించడమూ ఎంత మహద్భాగ్యమని ఆమె జ్ఞాపకం చేసుకొంటున్నది. శివరాత్రి, విక్రమాదిత్యుని సింహాసనం, పృథ్వీరాజ్, బుద్ధుని కథలు ఒక వంక; కుల, మానవాళి, చరిత్ర లాంటి చింతనలు మరో వంక! ఈ విధంగా కొనసాగాయి స్వామీజీ ఆలోచనా తరంగాలు! కొన్ని సమయాల్లో ఆయన చింతనా స్రవంతిని అనుసరించలేక ఆమె గింజుకొనేది. అప్పుడు “చాలు స్వామీజీ! ఇక నా వల్ల కాదు” అనడం కద్దు. స్వామీజీ ఆపివేసేవారు. కాసేపయ్యాక మళ్ళీ కొనసాగించేవారు! స్వామీజీ తనతో చెప్పేదంతా తన కోసం కాదు, ఇతరుల కోసం; ఆయన చెబుతున్నది స్వీకరించి ఇతరులకు అందించాలన్నది తన కర్తవ్యమని నివేదిత గ్రహించకపోలేదు. స్వామీజీ చెప్పింది వ్రాసుకొని తన The Master as I Saw Him పుస్తకంలో పొందుపరచింది.
శాన్ఫ్రాన్సిస్కో, 1900
ప్యారిస్ ప్రదర్శన ప్రవేశ దృశ్యం, 1900
మౌంట్ లోవ్ సానువు, 1900
కలకత్తా, 1899
త్రిగుణాతీతానంద, శివానంద, స్వామీజీ, తురీయానంద, బ్రహ్మానంద క్రింద : సదానంద
శ్రీరామకృష్ణుల సన్న్యాస శిష్యులు
బ్రహ్మానంద
శివానంద
ప్రేమానంద
యోగానంద
నిరంజనానంద
రామకృష్ణానంద
శారదానంద
తురీయానంద
అద్భుతానంద
అభేదానంద
త్రిగుణాతీతానంద
అద్వైతానంద
సుబోధానంద
అఖండానంద
విజ్ఞానానంద
స్వామి వివేకానంద శిష్యులలో కొందరు
అచలానంద
ఆత్మానంద
బోధానంద
కళ్యాణానంద
నిశ్చయానంద
పరమానంద
ప్రకాశానంద
సదానంద
శుభానంద
శుద్ధానంద
స్వరూపానంద
విమలానంద
విరజానంద
శరశ్చంద్ర చక్రవర్తి
(గృహస్థ శిష్యుడు)
స్వామి వివేకానంద చేతివ్రాత
స్వామి వివేకానంద హస్తరేఖ
న్యూయార్క్, 1895
న్యూయార్క్, 1895
చికాగో, 1893
చికాగో, 1893
‘ఈ నాగరకత వెనుకనా?’
ఓడ ప్రయాణికులలో అమెరికాకు చెందిన క్రైస్తవ మత బోధకుడు ఒకరున్నారు. ఆయన పేరు భోగేశ్. అతడికి వివాహమై ఏడేళ్ళయింది. తన భార్యతోను, ఆరుగురు పిల్లలతోను వచ్చాడతడు. పిల్లలను ఓడ పై భాగంలో విడిచిపెట్టి ఆ దంపతులు గంటలకొద్దీ ఏదో ఒక మూల కూర్చుని మాటల్లో, నవ్వుల్లో ఆనందిస్తూ గడిపేవారు. భోగేశ్ దంపతుల వైఖరి స్వామీజీకి సుతరామూ నచ్చలేదు. విసుగును తమ పయన వ్యాసంలో తమాషాగా ప్రస్తావించారు:
“మా ఓడలో ఇద్దరు క్రైస్తవ ప్రయాణికులున్నారు. వారిలో ఒకరు అమెరికా దేశస్థుడు. కుటుంబంతో సహా వచ్చాడు. అతడు చాలా మంచివాడు, పేరు భోగేశ్. అతడికి వివాహమై ఏడేళ్ళయింది. ఆరుగురు పిల్లలు పుట్టారు. ఓడలోని పనివారు అది దైవానుగ్రహం అంటారు. కాని ఆ పిల్లలు మాత్రం అలా అనుకోవడం లేదు. అతడి భార్య డెక్ మీద ఒక మురికి దుప్పటి పరిచి, వారిని దాని మీద పడుకోబెట్టిపోయేది. వాళ్ళు ఒళ్ళంతా దుమ్ముకొట్టుకొని ఏడుస్తూ, డెక్ మీద దొర్లుతుండేవారు. డెక్ మీద ప్రయాణీకులు వీరెక్కడ కాళ్ళ క్రింద పడి నలిగిపోతారేమోననే భయంతో ఇష్టం వచ్చినట్లు తిరిగేవారు కారు. ఆ భార్యా భర్తలు చంటిపిల్లలను ఒక చదరపు బుట్టలో పడుకోబెట్టి, తాము ఒక మూల కూర్చునేవారు. ఆ ఐరోపీయ నాగరకతను మనం మెచ్చుకోలేం. మనం వీథిలో కూర్చుని ముఖం కడుగుకొన్నా, పుక్కిలించి ఉమ్మేసినా అది అనాగరకత అని వారంటారు. ఈ పనులు ఇంట్లోనే చేసుకోవాలి. బాగానే ఉంది! నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇలా పదిమందిలో కౌగలించుకొని కూర్చోవడం నాగరకమైన చర్యా? ఇలాంటి నాగరకత వెంటబడి మీరంతా పరుగులెత్తుతున్నారే! మీరు ఈ ప్రొటస్టెంట్ మత గురువును చూస్తేగాని ఈ ప్రొటస్టెంట్ మతం ఉత్తర ఐరోపాకు చేసిన మేలు అర్థం కాదు! పది కోట్లమంది ఆంగ్లేయులు మరణించినా వారి మత గురువులు బతికితే చాలు. ఇరవై సంవత్సరాల్లో మళ్ళీ పది కోట్లమంది పుట్టుకొస్తారు!”
కాని ఆ పిల్లల పరిస్థితి చూసిన నివేదిత వారిని అట్లే విడిచిపెట్టలేక పోయింది. కనుక ఒక తల్లిలా వారిని సంరక్షించసాగింది. “ఒక వ్యక్తితో ఆయన కుమార్తెయైన చిన్నపిల్ల వచ్చింది. ఆమె పేరు టూటిల్, పాపం తల్లి పోయిందట. మన నివేదిత ఈ టూటిల్కీ, ఆ భోగేశ్ పిల్లలకూ తల్లి అయింది”* అని స్వామీజీ వ్రాస్తున్నారు.
లండన్‌లో
42 రోజుల ప్రయాణం జూలై 31వ తేదీన లండన్‌లో ముగిసింది. ఉదయం 6 గండలకు ఓడ లండన్ చేరుకొంది. రెండున్నర ఏళ్ళకు మునుపు వందల మంది వచ్చి కన్నీటితో వీడ్కోలు ఇచ్చిన ఆ చోట ఇప్పుడు స్వామీజీని ఆహ్వానించడానికి నివేదిత తల్లి, సోదరి, మిస్ పేస్టెన్తో పాటు అతి తక్కువ మంది వచ్చారు. అమెరికా నుంచి ఆయన శిష్యులైన క్రిస్టైన్, మేరీ ఫంకే వచ్చారు. స్వామీజీ లండన్ కార్యకలాపాలకు నిర్వహణ వహించిన స్టర్డీ కూడా రాలేదు. తాను ఎక్కడకో బయటి ఊరికి పోతున్నట్లు చెప్పి అతడు వెళ్ళిపోయాడు. ఇంగ్లండ్ ఆప్తులు ఎవరూ, ప్రత్యేకించి స్టర్డీ, అక్కడకు రాకపోవడంతో లండన్ కార్యకలాపాలు అంత బాగా లేవని స్వామీజీ గ్రహించారు.
స్టర్డీ తప్పుడు ధోరణి
స్వామీజీ 1896లో లండన్‌లో ఉన్నప్పుడు పనులు బాగా జరిగాయి. బాధ్యతను స్టర్డీకి అప్పగించి అమెరికాకు వెళ్ళిపోయారు స్వామీజీ. కాని స్టర్డీ పనులను సవ్యంగా నిర్వహించలేకపోయాడు. ఆతణ్ణి నాయకునిగా స్వీకరించడానికి తక్కిన వారు సిద్ధపడలేదు. ఆదాయం తగ్గింది. ఇంతలో స్వామీజీ భారత దేశానికి తిరిగి వచ్చేశారు. పనులు పూర్తిగా స్తంభించిపోవడానికి ముందు ఒకసారి స్వామీజీ అక్కడకు వస్తే బాగుంటుందని స్టర్డీ ఆశించాడు. అందుకోసం 1897 మార్చ్ / ఏప్రిల్‌లో స్వామీజీని ఆహ్వానించాడు కూడా. పరిస్థితిని స్పష్టంగా అర్థం చేసుకొన్న స్వామీజీ అందుకు ప్రయత్నించారు. కాని ఆరోగ్యం బాగా క్షీణించడం వలన డాక్టర్లు ఆయనను పయనించవద్దని గట్టిగా చెప్పారు.
స్వామీజీ ఉద్దేశపూర్వకంగా ఇంగ్లండ్ పయనాన్ని ఠలాయించారని స్టర్డీ భావించాడు. లండన్ పనులు రోజురోజుకీ దిగజారి దాదాపు స్తంభించిపోయే స్థితికి వచ్చినప్పుడు స్టర్డీకి స్వామీజీ మీద కోపం వచ్చింది. ఆయన రాకపోవడమే ఈ దుస్థితికి కారణమని నిందమోపాడు. స్వామీజీ మీద అతడి అనిష్టం బాగా పెరిగింది. తరువాత స్వామీజీలో తప్పులు ఎంచ నారంభించాడు. స్వామీజీ అభిప్రాయం, సందేశం, కార్యాచరణాలన్నీ తప్పు, ఆయన జీవన సరళి కూడా సరికాదని వ్రాయసాగాడు. కాని ఇవేవీ స్వామీజీకి ఆతడి పట్ల గల ఆదరాభిమానాలను మార్చలేదు; సానుభూతితో అన్ని లేఖలకూ జవాబులిచ్చారు. దేనితోనూ స్టర్డీ మనస్సును మార్చలేమని తెలుసుకొన్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలను ఒక ముగింపునకు తెచ్చారు స్వామీజీ.
1899 నవంబర్‌లో ఆయన స్టర్డీకి వ్రాసిన లేఖలో, “నా ప్రవర్తనను సమర్థించుకోవడం కాదు” అని ప్రారంభించి, “స్టర్డీ! మంచిది. నా హృదయం వ్యధ చెందుతోంది. నాకు అంతా తెలుసు. నువ్వు ఎవరి అధీనంలో ఉన్నావో నాకు తెలుసు. నిన్ను ఉపయోగించుకొనే వారి చేతుల్లో చిక్కుకొన్నావు… ప్రాచీన భారత దేశాన్ని గూర్చి నువ్వు ఎక్కువగా చెప్పావు. స్టర్డీ! ఆ భారతదేశం ఇంకా సజీవమై ఉంది, నశించలేదు… భారత సంతానాల్లోని ఆఖరివాడవైన నేను, భారతీయ పద్ధతిలో నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్ను ఈ భ్రాంతి నుంచి బయటపడవెయ్యడానికి ఏ రోజైనా సహస్ర శరీరాలనైనా అర్పిస్తాను”* అని స్వామీజీ వ్రాశారు.
ఇప్పుడు స్టర్డీ ఒకసారి వచ్చి స్వామీజీని చూశాడు. అయినప్పటికీ మనస్సు విప్పి అతడు ఏమీ మాట్లాడలేకపోయాడు. లండన్ కార్యకలాపాలు ఈ విధంగా తిరోగతి పట్టిన స్థితిలోను, అమెరికా నుంచి ఇద్దరు తమను చూడడానికి రావడం స్వామీజీ గాయపడ్డ హృదయానికి సాంత్వన కలిగించింది.
రిచ్మండ్
ఇంగ్లండ్ పనులు అస్తవ్యస్తమవడం స్వామీజీ మనస్సును కచ్చితంగా బాధించి ఉంటుంది. అది ఆయన ఆరోగ్యంలో కూడా ప్రతిఫలించింది. ఓడ ప్రయాణ సమయంలో బాగా ఉన్న ఆయన ఆరోగ్యం ఇప్పుడు క్షీణించింది. ఐదు నిమిషాలు నడిస్తేనే ఆయనకు ఆయాసం వస్తోంది. నివేదిత తల్లి, సోదరి, సోదరుడు స్వాములనిద్దరినీ తమ కుటుంబంలో ఒకరుగా చూసుకొన్నారు. రోజూ వెళ్ళడానికి స్వామీజీ ఆరోగ్యం పడనివ్వకపోయినా ఆయన అప్పుడప్పుడు నివేదిత ఇంటికి వెళ్ళి వస్తూనే ఉన్నారు.
నివేదిత సోదరుడైన రిచ్మండ్ యువకుడు. స్వామీజీని ఏసుక్రీస్తు ప్రతిరూపంగా అతడు భావించాడు. “భగవంతుడు, లౌకిక జీవితమనే ఏ సమస్యకైనా పరిష్కారం స్వామీజీ వద్ద లభిస్తుంది” అని అతడు విశ్వసించాడు. కనుక మనస్సు విప్పి ఆయనతో మాట్లాడాడు.
స్వామీజీ దివ్యత్వం రిచ్‌మండ్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. “ఆయన పిలుపును నా సోదరి శిరసావహించిందంటే దాన్లో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే నేను ఆయనను చూశాను, ఆయన శక్తిని గ్రహించాను. ఆయనను చూస్తే చాలు, ఆయన మాట్లాడడం వింటే చాలు; అందరూ ఇది అర్థం చేసుకోగలరు. ఆయన సత్యాన్నే మాట్లాడతారు; అదీ ఒక పండితునిలా, మత బోధకునిలా కాక, ఆత్మ విశ్వాసంతో మాట్లాడతారు. ఆయన తమతో ఆత్మ విశ్వాసాన్ని తెస్తున్నారు. నమ్మకాన్ని, అభయాన్ని ప్రదానం చేస్తున్నారు” అని కాలాంతరంలో వ్రాశాడు రిచ్మండ్.
దాదాపు 15 రోజులు లండన్‌లో గడిపి స్వామీజీ ఆగష్టు 16 వ తేదీన అమెరికాకు బయలుదేరారు. తురీయానంద, ఇద్దరు అమెరికన్ స్త్రీలు ఆయనతో వెళ్ళారు. సోదరి వివాహం కోసం నివేదిత వింబుల్డన్‌లో ఉండిపోయింది.
‘ఇదో కవిత్వ సారం!’
మళ్ళీ 10 రోజులు ఓడ ప్రయాణం. ఈసారి స్వామీజీ ప్రక్కన కూర్చునే భాగ్యం క్రిస్టైన్కూ, మేరీ ఫంకేకీ దక్కాయి. వారికీ ఈ రోజులు చిరస్మరణీయంగా పరిణమించాయి. రోజూ ఉదయం గీతాపారాయణం, వ్యాఖ్యానం, వేదమంత్రాల పారాయణతో రోజులు గడిచాయి. అలలు లేకుండా సముద్రం ప్రశాంతంగా ఉంది. వెండి వెన్నెల ప్రకాశం రాత్రుళ్ళను ఆహ్లాదకరంగా చేసింది. ఆ రాత్రి ఏకాంతంలో స్వామీజీ అంతర్ముఖులై ఓడ పై భాగం మీద గంభీరంగా పచార్లు చేశారు. ఒకరోజు ఇలా కాసేపు పచార్లు చేసి హఠాత్తుగా వెనక్కు తిరిగి అమెరికన్ భక్తురాండ్రను చూసి, “ఈ మాయ ఇంత అందంగా ఉందంటే ఈ మాయకు వెనుకనున్న సత్యం ఎంత అద్భుత అందాన్ని సంతరించుకొని ఉంటుంది!” అన్నారు.
ఒక పౌర్ణమి రోజు పూర్ణ చంద్రుడు వెండి పళ్ళెంలా కానవచ్చి కోమలమైన వెలుగు కిరణాలు ప్రసరిస్తున్నాడు. ఆ రాత్రిని, ఆ అందాన్ని చాలా సేపు మౌనంగా ఆస్వాదించారు స్వామీజీ. పిదప వెనుకకు తిరిగి చంద్రుణ్ణీ, సముద్రాన్నీ చూపుతూ, “కవితలెందుకు? కవిత్వ సారం మన ముందు ప్రవహిస్తూ లభిస్తున్నప్పుడు కవితలు ఎందుకు?” అని అడిగారు.