నరేంద్రనాథ్ మహామేధావి. జర్మనీ ప్రభృత దేశాలను నేను సందర్శించాను. కాని నరేంద్రుని లాంటి వ్యక్తిని ఒక్కరిని సైతం నేను చూడ లేదు. అతడు జీవితంలో ఏదైనా సాధించే తీరతాడు.
విలియం హేస్టీ
(కళాశాల అధ్యక్షుడు)
నరేంద్రుని అన్వేషణ — బుద్ధ దర్శనం — ప్రకృతికి అనుగుణంగా — రాయపూర్‌లో — మళ్లీ పాఠశాలలో — కళాశాల — జ్ఞానపిపాస — తత్త్వశాస్త్ర గ్రంథాలు — సంగీతం — మేధావి — యౌవనం — మిత్రునికి సహాయం — నాటి సమాజం — క్రైస్తవ మిషనరీలు — బ్రహ్మ సమాజం — బ్రహ్మసమాజ సభ్యునిగా — శాకాహారం — ప్రగాఢ ధ్యానాభ్యాసం — లక్ష్య సాధకుడు — బ్రహ్మచర్యం — పావనత్వం — ఆత్మవిచారణ — మహర్షి దేవేంద్రనాథ్ టాగూర్ — ధ్యానం పట్ల ఆసక్తి — గొప్ప మలుపు
నరేంద్రుని అన్వేషణ
మా నవ జీవితంలో యౌవనదశ ఒక ముఖ్యమైన అంచె. ఈ ప్రాయంలోనే మనిషిలో ఆత్మచైతన్యం వికసింప నారంభిస్తుంది. సృజనాత్మ కత, ఆత్మప్రతిష్ఠ, అంతఃప్రేరణ (instinct) అనేవి ఈ ప్రాయంలోనే అత్యున్నత వికాస స్థాయిని సంతరించుకొంటాయి. ఈ మూడింటిని సరిగా పెంపొందించుకొని వినియోగించుకోవడం తెలిసిన వ్యక్తి జీవితంలో రాణి స్తాడు. ఈ మూడింటికీ మూలాధారమైనది అన్వేషణ. అన్వేషించాలి, ఏదైనా సాధించాలి, లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి అని మనిషి దృఢంగా సంకల్పించు కోవాలి. ఆ లక్ష్య దిశగా ఈ మూడింటినీ కేంద్రీకృతం చేయాలి.
ఆరేళ్ల ప్రాయం నుండే నరేంద్రుని అన్వేషణ అంతర్ముఖమైనదిగా ఉండడంచూశాం. సమవయస్కులు బాహ్యాన్ని వాంఛించినప్పుడు నరేంద్రుడు ఆంతరిక అన్వేషణ సాగిస్తూ ధ్యానంలో లయించసాగాడు. పరిచయం లేని ప్రదేశాలలో పయనిస్తున్నప్పుడు సూచన ఫలకాలు మనకు దారి తెలియజేస్తాయి; మనం ఆ ఊరి వైపే పోతున్నాం, సరియైన దారిలోనే వెళుతున్నామని అవి ధ్రువీకరిస్తాయి. అదే విధంగా ఆంతరిక అనుభూతులు ఒక వ్యక్తి ఆంతరిక అన్వేషణకు సూచన ఫలకాలుగా వ్యవహరిస్తాయి. నరేంద్రుడి దైనందిన నిద్ర అలాంటి ఒక అనుభూతిగా అమరడం మనం చూశాం. జ్యోతిర్మయ ప్రకాశంలో నరేంద్రుడు నిద్రించాడు. అంతేకాక అతడు దివ్యదర్శనాలు గాంచాడు. వాటిల్లో ఒకటి బుద్ధ దర్శనం. దానిని స్వామి వివేకానంద వచనాలలో విందాం:
బుద్ధ దర్శనం
“బడిలో చదువుకొంటున్న రోజుల్లో ఒకసారి గది తలుపులు గడియపెట్టి ధ్యానం చేసుకొంటున్నాను. మనస్సు ఏకాగ్రత చెందివుంది. ఆ స్థితిలో ఎంతసేపు ఉండిపోయానో తెలియదు. ధ్యానానంతరం ఆసనం మీద కూర్చున్నాను. అప్పుడు ఆ గది దక్షిణపు గోడ నుండి తేజో విరాజమానుడైన ఒక వ్యక్తి వచ్చి నా ముందు నిలబడ్డాడు. ప్రశాంతతే మూర్తీ భవించిన ఒక సన్న్యాసి ఆయన. ఆయన ముఖారవిందం నుండి అద్భుత ప్రకాశం ప్రసరిస్తూన్నది. ఆయన దివ్యమయ ముఖమండలం అనిర్వచనీయ ప్రశాంతతతో ఒప్పారుతూ, శాంత సముద్రాన్ని పోలివుంది. శిరోముండనం గావించుకొని చేతదండ కమండలాలు ధరించి ఉన్నాడు. నాతో ఏదో చెప్ప నభిలషిస్తూన్నట్లు నన్నే తదేకంగా చూస్తూ కాసేపు నిలబడ్డాడు. నేను చేష్టలుదక్కి కూర్చుని ఉండి పోయాను. హఠాత్తుగా ఏదో తెలియరాని భయం నన్ను ఆవరించింది. తక్షణమే ఠక్కున లేచి, గది తలుపు తెరచుకొని బయటికి పరుగెత్తాను. కాని ఆ తరువాత అలా పలాయనం చిత్తగించడం మూర్ఖత్వమనీ, లేకపోయుంటే ఆయన నాతో ఏదో చెప్పివుండేవారనీ భావించాను. ఆ తరువాత ఆయన దర్శనం నాకు కలుగలేదు. ఈసారి ఆయనను దర్శించగలిగితే భయపడకుండా ఆయనతో మాట్లాడా లని అనేకసార్లు అనుకొన్నాను. కాని మళ్లీ ఆయన నా వద్దకు రానేలేదు….. బహుశా బుద్ధుడై ఉండవచ్చునని ఇప్పుడు అనుకొంటున్నాను.”
ప్రకృతికి అనుగుణంగా
ప్రకృతిపరమైన అనుభూతి కూడా నరేంద్రుడికి యౌవనంలోనే కలిగింది. చిన్నతనం నుండే నరేంద్రుడు ప్రకృతి ఆరాధకుడు. ఏరులు, నదులు, కొండలు, గుట్టలు, పక్షులు, జంతువులు అతడి మనస్సులో శాశ్వతంగా చోటు చేసుకొన్నాయి. ప్రకృతితో తాదాత్మ్యం చెంది జీవించా లని అతడు ఎంతో అభిలషించాడు. మనకై మనం ప్రయత్నించి ప్రకృతిని ఆస్వాదించడం ఒకటి; కాని కొన్ని సమయాల్లో సహజంగా ప్రకృతే మనకు కానుకగా ప్రసాదించే అనుభూతి మరొకటి ఉంది. అదే ప్రకృతి మార్మికతానుభూతి (Nature Mysticism). ప్రకృతి సౌందర్యాన్ని చూసి విస్తుపోవడం కాదది; ప్రకృతి చైతన్యంలో లయమై ఆ చైతన్యంలో విరాజిల్లుతున్న ఒక అంతర్ముఖ చైతన్యావస్థ అది.
హఠాత్తుగా అవగతమయ్యే అనుభవం అది – ఒక ప్రగాఢ ప్రశాంతత; అన్నింటి మూలాధారమూ ఏకమై, ఒకే చైతన్యమయంగా కానవచ్చే అనుభవం. దాన్లో లౌకిక జీవితపు చిక్కుముడి అకస్మాత్తుగా మన ముందు విడివడుతుంది. నిశ్చల, ప్రగాఢ ప్రశాంతతలు సంతరించుకొన్న అనుభవం అది. అక్కడే భూతకాలమూ, వర్తమానమూ లేకుండాపోతాయి. చైతన్యం, వర్తమానపు ఆ క్షణంలో నెలకొని ఉంటుంది. ఆకుల గలగల, పక్షుల గీతారావాలు, అల్లంత దూరం నుండి వినవస్తున్న శిశురోదనం, గూడుకట్టే సాలీడు, బారులుదీరి పోతున్న చీమలు – ఇవన్నీ ఈ ప్రపంచ నాటకపు ఒక అంగంగా విలసిల్లడం ఒంటరిగా నిలబడి ప్రేక్షకునిగా మనం చవిచూసే అద్భుతమైన అనుభూతి. ఈ అనుభూతి పది, పదిహేను నిమిషాలు కొనసాగవచ్చు.
కవులు, తత్త్వవేత్తలు, అగ్రగణ్యులైన ఆధ్యాత్మికవాదులు పలువురు చిన్న తనంలోనే ఇలాంటి అనుభూతి పొందివుండడం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే, ఇలాంటి అనుభూతి పొందిన కొందరే సృజనాత్మక శక్తితో కార్యోన్ముఖులవు తున్నారు. ఏ రంగానికి చెందినవారైనప్పటికీ ఆ రంగంలో వారు నూతనత్వాన్ని సృజింపగలుగుతారు. వర్డ్స్‌వర్త్, షెల్లీ, రవీంద్రనాథ్ టాగూర్, జెఫరీస్, విలియం బ్లేక్ లాంటి కొందరు ఈ ప్రకృతి చైతన్యానుభూతి పొందినవారే! వర్డ్స్‌వర్త్ తన అనుభవాన్ని ఇలా వర్ణిస్తున్నాడు:
పచ్చిక బయలు, తోపు, వాగు
పృథివి, ప్రతి సామాన్య దృశ్యమూ
దివ్యప్రకాశం దాల్చి
కలలోని తాజాదనపు వైభవాన్ని నింపి
ఒకానొక కాలంలో నాకు కానవచ్చాయి.*
ఇలాంటి ఒక అనుభవం బుద్ధునికి కలిగినట్లు ఆయన చరిత్ర చెబుతున్నది. బుద్ధుడు రాజ్యపరిత్యాగానంతరం అరణ్యానికి వెళ్లినప్పుడు, అక్కడ తారసపడ్డ ఒక ఆచార్యునితో ఆయన అడిగిన మొదటి ప్రశ్న, “అయ్యా! బాలునిగా ఉన్నప్పుడు ఒక చెట్టు క్రింద నేను అనుభవించిన ఆ ఆనందప్రదమైన ప్రశాంతతను మళ్లీనేను పొందడానికి సహాయం చేయగలరా?” అన్నదే!
ఇలాంటి అద్భుత అనుభవం నరేంద్రునికీ కలిగింది. అది 1877. అప్పుడు నరేంద్రుడు నేటి 8 వ తరగతికి సమానమైన నాటి మూడవ శ్రేణిలో చదువు కొంటున్నాడు. ఆ సమయంలో ఆతడి తండ్రి వృత్తి రీత్యా మధ్యప్రదేశ్‌లోని రాయ్ పూర్లో కొంతకాలం నివసించవలసివచ్చింది. కుటుంబాన్ని కూడా అక్కడకు రప్పించుకోవాలనుకొన్నాడు కాని ఆయన ముందుగానే వెళ్లిపోవడం వలన కుటుం బాన్ని నరేంద్రుడు తోడ్కొని వెళ్లాడు.
ఆ రోజుల్లో నాగపూర్‌ను దాటి రైలుమార్గం నిర్మితం కాలేదు. ఆ కారణంగా అలహాబాద్, జబల్పూర్ మీదుగా ఎడ్ల బండిలో పదిహేను రోజులకు పైబడి ప్రయాణం చేయవలసి వచ్చేది. దారి మధ్యలో అడవులూ, నిర్జన దారులు, చెదురుమదురు గ్రామాలు, పొలాలు, చెరువులు, మారుతూవున్న ప్రకృతి దృశ్యాలు తిలకిస్తూ ఎడ్లబండిలో నరేంద్రుడు పయనించాడు.
ఆ రోజు కడిగిన ముత్యంలా ఆకాశం ప్రకాశమానంగా ఉంది. గాలిలో కూడా వింతయిన స్వచ్ఛత కానవస్తూన్నది. గాలికి కదలాడుతూన్న చెట్ల ఆకుల గుసగుసలలో, గుత్తులుగుత్తులుగా వికసించిన పువ్వులలో ఎన్నడూలేని ఒక రక మైన పావనతా, పచ్చదనపు శోభా తాండవిస్తున్నాయి. అక్కడ ఎగురుతూవున్న పక్షుల కిలకిలారావాల ప్రతిధ్వని తరంగాలు నరేంద్రుని హృదయాన్ని నింపి వేశాయి. ఇన్ని అందచందాలకూ సరిహద్దుగా దారికి ఇరువైపులా సమున్నత వింధ్యపర్వత పంక్తి అమరివుంది. విభిన్న రకాల పక్షుల వందలాది విభిన్న కిలకిలారావాలు. వాటి రెక్కలు ఎన్నెన్నో రంగులను సంతరించుకొని ఉన్నాయి. చెట్లూ తీగలూ వికసించిన పలు రంగుల పువ్వులను అలంకరించుకొని ఉన్నాయి. వాటి చుట్టూ పరిభ్రమిస్తున్న తేనెటీగెలు చేస్తున్న వందలాది ఝంకారాల స్వరభేదాలు. ప్రకృతి ఆరాధకుడైన నరేంద్రుడు కూడా ఒక తేనెటీగయై ఆ ప్రకృతి సౌందర్యంలో జాలువారే తేనెను ఆస్వాదించసాగాడు.
ఆహా! సమస్త సౌందర్యానికీ పరాకాష్ఠగా అదుగో ఆ పర్వత శిఖరాల నడుమ అదేం అద్భుత కమనీయ దృశ్యం! ఒకే శిఖరం రెండు శిఖరాలుగా చీలి నిలబడ్డట్లుగా కనిపించే ఆ చీలికలో ఎంత పెద్ద తేనెపట్టు! అవును, ఎంత పెద్దది! అంత ఎత్తులో అంత పెద్ద తేనెపట్టు పెట్టడానికి ఎంత కాలం పట్టి వుంటుందో కదా! ఇంతటి పెద్ద గూడును కట్టడానికి ఎన్నివేల, కాదు కాదు లక్షల తేనెటీగలు రేయింబవళ్లు అవిరామంగా పరిశ్రమించి ఉంటాయో కదా! జీవితమే సంగీత మాధుర్యమయమైన ఆ కీటకాలు సృజించిన అద్భుతం కదా ఆ పర్వత శిఖరాన వ్రేలాడుతున్న బ్రహ్మాండమైన ఆ తేనెపట్టు!
పైన చూస్తే విస్తృత వినీలాకాశం! ఆ నీలం నుండి విభజింపలేని నీలమయ మైన పర్వత శిఖరాలు దానిని స్పృశించడానికో అన్నట్లు గంభీరంగా నిలబడి ఉన్నాయి. ఆ శిఖరాగ్రాన చిన్నిచిన్ని జీవరాసుల మహోన్నత సహకారంతో నిర్మిత మైన బ్రహ్మాండమైన ఆ తేనెపట్టు!
ఈ విస్తృత ఆకాశం ఎక్కణ్ణుండి వచ్చింది? ఇంతటి సౌందర్యం ఎక్కణ్ణుండి జాలువారింది? ఇంతటి సమున్నత పర్వతశ్రేణి ఎక్కణ్ణుండి ఉద్భవించింది? ఇంతటి సౌందర్యం అవి ఎలా సంతరించుకొన్నాయి? ఈ లక్షలాది తేనెటీగలు ఎక్కణ్ణుండి వలసవచ్చాయి?
ఎక్కడ నుండి, ఎక్కణ్ణుండి?…..
నరేంద్రుడి ఆలోచనలు గిర్రున తిరుగసాగాయి…..
ఎక్కణ్ణుండి సౌందర్యమయమైన ఈ అద్భుతాలు ఉదయించాయో అక్కడే నరేంద్రుడు దిగబడిపోయాడు.
పువ్వు మృదుత్వం, సువాసనా, మాధుర్యమూ, చెట్ల పచ్చదనమూ, తీగల ఒయ్యారమూ, తేనెటీగల నిస్వార్థ పరిశ్రమా, పక్షుల కిలకిలారావాలూ, పర్వతాల నిశ్శబ్దమూ, ఆకాశపు గాంభీర్యమూ ఏ మహోన్నత మానస కల్పనలో రూపొం దాయో, ఆ మహోన్నత మానసంలో నరేంద్రుడు లయించిపోయాడు.
బాహ్యస్మృతి కోల్పోయాడు!
బాహ్యస్మృతి కోల్పోయిన ఆ స్థితిలో నరేంద్రుడు ఎంతసేపు ఆ ఎడ్లబండిలో ఉండిపోయాడో చెప్పలేం. కాని కళ్లు తెరవగానే సువాసన ద్రవ్యాలు చిలకరించిన జలాలలో స్నానంచేసి వస్తున్నప్పుడు శరీరంలో వినూత్న ప్రకాశం సంతరించు కొన్నట్లుగా, సుందర జలప్రవాహంలో స్నానమాచరించి మనస్సులో నూత్న ఆహ్లాదం నింపుకొన్నట్లుగా నరేంద్రునికి అనిపించింది. అప్పటికే ఎడ్లబండి కొన్ని మైళ్లు దాటివచ్చేసింది.
రాయపూర్‌లో
ఆ రోజుల్లో రాయపూర్‌లో పాఠశాలగాని, కళాశాలగాని లేవు. అందువలన నరేంద్రుడు ఇంటిపట్టునే ఉండవలసి వచ్చింది. ఈ కాలఘట్టంలో తండ్రి అయిన విశ్వనాథుడితో అతడు అతిసన్నిహితంగా మెలగాడు. తండ్రి కూడా ఆలోచనను పురిగొల్పే అనేక విషయాలను అతడికి విశదీకరించి చర్చించేవాడు. ఈ రీతిలో అతడి తెలివితేటలూ, వాదనాపటిమా బాగా ఇనుమడించాయి.
విశ్వనాథుణ్ణి కలుసుకోవడానికి పలువురు మేధావులు ఆయన ఇంటికి రావడం కద్దు. వారి మధ్య జరిగే సంభాషణలో నరేంద్రుడు కూడా పాల్గొని తన అభిప్రాయాలు వెలిబుచ్చేవాడు. ఆతడి అభిప్రాయాలలో వ్యక్తమయ్యే బుద్ధిసూక్ష్మతను చూసి అందరూ అతణ్ణి తమతో సమానుడిగా పరిగణించేవారు. ఇది విశ్వనాథుడికి అపరిమితానందం కలిగించిందనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.ఒక రోజు విశ్వనాథుని స్నేహితుడైన ఒక వంగభాషా పండితుడు తలవని తలంపుగా వచ్చాడు. నరేంద్రుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వంగ సారస్వతంనుండి కొన్ని విభాగాలను యథాతథంగా ఒప్పజెప్పాడు. అది విని దిగ్భ్రమచెందిన ఆ పండితుడు, “నాయనా! నువ్వు తప్పక ఒక గొప్ప పండితుడవవుతావు” అని ఆశీర్వదించాడు.
నరేంద్రుడు స్వాభిమానధనుడు. బాలుడే అయినప్పటికీ తన కుశాగ్రబుద్ధిని ఇతరులు గుర్తించాలని అతడు అభిలషించేవాడు. ఎప్పుడైనా ఆ గుర్తింపు లభించ నప్పుడు అతడికి కోపం వచ్చేది. తనను వ్యతిరేకించిన వ్యక్తులు తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేయనంత దాకా అతడు శాంతించేవాడు కాడు. తండ్రి స్నేహితులకు కూడా ఈ విషయంలో మినహాయింపు లేదు. నరేంద్రుని ఈ ప్రవర్తననువిశ్వనాథుడు సహించేవాడు కాడు. ప్రతిసారి ఈ ధోరణి సబబు కాదని అతడికిచెప్పడం విస్మరించేవాడు కాదు. అయినప్పటికీ కుమారుడి స్వాభిమానాన్నీ, ఉద్వేగాన్నీ మనస్సులో అభినందించకపోలేదు.
భారతదేశంలో ఉద్భవించిన అతిప్రాచీన చదరంగం ఆటను రాయపూర్‌లోనే నరేంద్రుడు నేర్చుకొన్నాడు. నేర్చుకోవడమే కాక చదరంగ పోటీలలో పాల్గొని నెగ్గాడు కూడా. తండ్రి వద్ద పాకకళనూ, సంప్రదాయబద్ధమైన సంగీతాన్నికూడా నరేంద్రుడు రాయపూర్‌లోనే నేర్చుకొన్నాడు.
మళ్లీ పాఠశాలలో
రెండేళ్ల తరువాత 1879 లో విశ్వనాథుడు కలకత్తాకు తిరిగివచ్చాడు.రెండేళ్ల తదనంతరం నరేంద్రుణ్ణి మళ్లీ పాఠశాలలో చేర్పించడం ఒక రకంగాసమస్య అయింది. కాని నరేంద్రుడి తెలివితేటలు గూర్చి ఆతడి ఉపాధ్యాయులకు బాగా తెలుసు. కనుక పాఠశాలలో చేర్చుకోవడమే కాక, అదే సంవత్సరం పరీక్షలు వ్రాయడానికి కూడా అంగీకరిం చారు. మూడేళ్ల పాఠ్యాంశాలను ఒకే ఏడాదిలో చదివి నరేంద్రుడు తుది పరీక్షలోప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ పాఠశాల మొత్తంలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయింది అతడొక్కడే! ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశ్వనాథుడు ఒకచేతి గడియారం నరేంద్రుడికి బహూకరించాడు.
నరేంద్రుడు మెట్రోపాలిటన్ పాఠశాలలో చదువుతున్నప్పుడు విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవమూ, ఉద్యోగ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయునికి వీడ్కోలు సభా ఏర్పాటు చేశారు. జాతీయ నాయకుడైన సురేంద్రనాథ్ బెనర్జీ అధ్యక్షత వహించారు. ఆయన మహావక్త. ఆయన ముందు ప్రసంగించడానికి విద్యార్థు లెవరూ సాహసించలేదు. అందువలన నరేంద్రుణ్ణి ప్రసంగించమని కోరారు. అందుకు అతడు సమ్మతించాడు. పదవీ విరమణ చేస్తూన్న ఉపాధ్యా యుణ్ణి వేనోళ్ల శ్లాఘిస్తూ, ఆయన విరమణ లోటు వలన తామెంత దిగులుపడు తున్నామో దాదాపు అరగంటసేపు అనర్గళంగా, ప్రేక్షకులు స్పందించే రీతిలో ప్రసంగించాడు. ఆ ప్రసంగాన్ని విని సురేంద్రనాథ్ బెనర్జీ అతణ్ణి మనఃస్ఫూర్తిగా అభినందించాడు.
ఆ రోజుల్లో నరేంద్రుడు ఆంగ్ల, వంగ భాషల్లోని ఉత్తమ సాహిత్యాన్ని ఆపో సన పట్టాడు. ఉన్నత గణితం, సంస్కృతం, మన దేశ చరిత్ర మొదలైన వాటిని కూడా లోతుగా అధ్యయనం చేశాడు. పరీక్షలకు నాలుగైదు రోజులు ముందు మాత్రమే పాఠ్యాంశాలు చదివాడు. ప్రవేశ పరీక్ష మొదలవడానికి ఇంకా రెండు మూడు రోజులు మాత్రమే ఉన్నప్పుడు రేఖాగణితం (geometry) చదువ నారంభించాడు. రేయింబవళ్లు కూర్చుని నాలుగు పాఠ్యాంశ పుస్తకాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.
కళాశాల
1880 జనవరిలో తన పదిహేడవ ఏట నరేంద్రుడు ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రథమ కళా తరగతిలో (first Art) చేరాడు. అప్పుడే ఆతడిలో యౌవనం అంకు రిస్తూవుంది. అందమైన ముఖారవిందం, విశాలమైన నేత్రాలు, దృఢమైన దేహంతో చూపరుల దృష్టిని ఇట్టే ఆకట్టుకొనే యువకునిలా నరేంద్రుడు రూపొందాడు. అది ప్రభుత్వ కళాశాల. ఉపాధ్యాయు లలో పలువురు ఆంగ్లేయులు. కనుక విద్యార్థులు ఐరోపీయ దుస్తులలో, చప్కాన్* (alpaca chepkan) ధరించే కళాశాలకు వెళ్లవలసి ఉండేది. చేతిగడియారం తప్పనిసరి. నరేంద్రుడు చప్కాన్ ధరించడానికి ఇష్టపడేవాడు. స్విట్జర్లాండ్ చేతి గడియారం ధరించేవాడు.
మొదటి సంవత్సరం ఎలాంటి అంతరాయమూ లేకుండా నరేంద్రుడు కళా శాలకు వెళ్లాడు. కాని రెండవ సంవత్సరం మలేరియా సోకడంతో చాలా రోజులు ఇంట్లోనే ఉండిపోయి చికిత్స, విశ్రాంతి పొందవలసి వచ్చింది. మంజూరు చేసిన రోజులకన్నా ఎక్కువ రోజులు సెలవు తీసుకొన్నందువలన ఆ సంవత్సరం నరేంద్రుడు ఆ కళాశాలలో పరీక్షలు వ్రాయలేకపోయాడు. కాని స్కాటిష్ జనరల్ మిషినరీ బోర్డ్ కళాశాల అతడికి ప్రవేశం కల్పించి పరీక్షలు వ్రాయడానికి అను మతి నిచ్చింది. తీవ్ర అధ్యయనం, ఏకాగ్ర ధ్యానం వంటి వాటి వలన అతడి ఆరోగ్యం దెబ్బతింది. అందువలన ఎఫ్.ఏ. పరీక్షలకు కొన్ని నెలల ముందు గయకు వెళ్లి అక్కడ విశ్రాంతి తీసుకొన్నాడు. ఆరోగ్యం కుదుటపడ్డాక తిరిగి వచ్చి పరీక్షలు వ్రాశాడు. 1881 లో ఎఫ్.ఏ. పరీక్షలో అతడు ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. అదే కళాశాల నుండి 1884 లో బి.ఏ.లో ఉత్తీర్ణుడై పట్టభద్రు డయ్యాడు. ఆంగ్లం, చరిత్ర, గణితం, న్యాయశాస్త్రం, మనస్తత్త్వశాస్త్రం, తత్త్వ శాస్త్రం బి.ఏ.లో అతడి పాఠ్యాంశాలు. న్యాయశాస్త్రం, తత్త్వశాస్త్రం, ఉన్నత గణితం – వీటిలో అతడికి ఎంతో ఆసక్తి. ఆంగ్లంలో చక్కని పాండిత్యం గడించ డానికి అతడు ఎంతో కృషి చేశాడు. మరీముఖ్యంగా ఆంగ్లంలో సంభాషించడం లోను, వాదించడంలోను అతడు చక్కని శిక్షణ పొందాడు.
నరేంద్రుడు బి.ఏ. మూడవ సంవత్సరం చదువుతున్నప్పుడు అదే కళాశాల లోని న్యాయశాస్త్ర శాఖలో కూడా అతణ్ణి విశ్వనాథుడు చేర్పించాడు. అంతేగాక నిమాయ్చరణ్ బోస్ అనే సుప్రసిద్ధ న్యాయవాది వద్ద సహాయకునిగా ఉంచాడు. భవిష్యత్తులో తనలా నరేంద్రుడు ప్రఖ్యాత న్యాయవాదిగా రాణించాలని విశ్వ నాథుడు అభిలషించాడు. తండ్రితోపాటు ఉన్నత న్యాయస్థానానికి కూడా నరేం ద్రుడు తరచు వెళ్లివచ్చేవాడు. అతణ్ణి పై చదువులకోసం ఇంగ్లండుకు పంపాలనే ఆలోచన కూడా ఆయనకు ఉండేది.
ఈ రోజుల్లో నరేంద్రుని పెళ్లి మాటలు మొదలయ్యాయి. కొందరు బోలె డంత కట్నం ఇవ్వడానికి ముందుకువచ్చారు. మరికొందరు నరేంద్రుడు పై చదు వుకు ఇంగ్లండు వెళ్లడానికి అవసరమైన డబ్బు ఇస్తామన్నారు. కాని ఏ ప్రలోభాలకీ మనస్సులో చోటివ్వని నరేంద్రుడు వివాహానికి సమ్మతించలేదు.
జ్ఞానపిపాస
నరేంద్రుని చదువు గూర్చి తెలుసుకొంటే ఆతడి జ్ఞాన పిపాస తీవ్రత మనం గ్రహించవచ్చు. ఆతడు ఎఫ్.ఏ. చదువుతున్నప్పుడే బి.ఏ. పాఠాలు చదివి పూర్తిచేశాడు. బి.ఏ. చదువుతున్నప్పుడు, అంతకు మించిన ప్రమాణ స్థాయిగల పుస్తకాలు చదివి ముగించాడు. ఉదాహరణకు – ఎఫ్.ఏ. చదువుతున్నప్పుడు Eliphinstone రచించిన History of India, Marshman రచించిన History of Bengal లాంటి గ్రంథాలు; న్యాయశాస్త్రంలో Jevous రచించిన Elementary lessons on Logic మాత్రమే కాక, అదే రచయిత Studies in Deduction Logic వంటి ఉద్గ్రంథాలు, Whately, Mill రచించిన గ్రంథాలు చదివాడు. ఇవన్ని బి.ఏ.కు చెందినవి, అంతకన్నా ఎక్కువ ప్రమాణ స్థాయికి చెందిన పాఠ్యాంశాలు. బి.ఏ. చదువుతున్నప్పుడు Green రచించిన History of England, Allison Philips రచించిన History of Europe, Gibbon రచించిన Decline and Fall of the Roman Empire లాంటి ఉత్క్రష్ట గ్రంథాలు క్షుణ్ణంగా చదివాడు. పై వాటిలో చివర పేర్కొన్న గ్రంథం నాలుగు సంపుటాలతో కూడుకొన్నది. ఆ నాలుగు సంపుటాలనూ మూడే రోజుల్లో నరేంద్రుడు చదివేశాడు. కాలాంతరంలో ఈ గ్రంథంలో ఏ విభాగాన్ని అయినా సరే ఒక్క పంక్తి కూడా తప్పిపోకుండా ఒప్పజెప్పగలిగేవాడని ఆయన సోదరుడైన మహేంద్రనాథ్ దత్త ధ్రువీకరించారు.
ఇవే కాక ఫ్రెంచ్ విప్లవం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. యావజ్జీవితం ఆయనను ఆకట్టుకొన్న నాయకుడు నెపోలియన్. ఆతడి దళపతి ‘నే’ (Ney) కూడా నరేంద్రుణ్ణి అమితంగా ఆకర్షించాడు. ‘నే’ ఎలా నెపోలియన్ ఆజ్ఞలను నిరాక్షేపణీయంగా శిరసావహించాడో అట్టి నమ్రత, ఉన్నత లక్ష్యాల కోసం కృషిచేసేవారు ఎంతో ఆవశ్యకమని కాలాంతరంలో స్వామి వివేకానంద ఉద్ఘాటించేవారు.
తత్త్వశాస్త్ర గ్రంథాలు
కళాశాలలో చదువుకొంటున్న రోజుల్లోనే నరేంద్రుడు పాశ్చాత్య తత్త్వాలను లోతుగా అధ్యయనం చేశాడు. డేకార్టే (Descartes), హ్యూమ్ (Hume), కాంట్ (Kant), ఫిష్టీ (Fichti), స్పినోసా (Spinoza), హెగల్ (Hegel), షోపనేర్ (Schopenhauer), కామ్టే (Comte), డార్విన్ (Darwin), హెర్బర్ట్ స్పెన్సర్ (Herbert Spencer) ప్రభృతుల గ్రంథాలు చదివాడు. కాని ఈ గ్రంథాలను ఆయన ప్రత్యక్షంగా చదవడానికి ఆస్కారం లేదని ఆయన జీవిత చరిత్రను రచించిన వారిలో ఒకరైన రోమా రోలా (Romain Rolland) అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ వారందరు వెలిబుచ్చిన తత్త్వా లను నరేంద్రుడు స్పష్టంగా అవగతం చేసుకొన్నాడని ఆయన సూచిస్తున్నాడు.
పాశ్చాత్య తత్త్వవేత్తలలో హెర్బర్ట్ స్పెన్సర్ అభిప్రాయాలు నరేంద్రునికి బాగా నచ్చేవి. స్పెన్సర్ ప్రగాఢ అభిమాని అని నరేంద్రుణ్ణి పేర్కొనడం అతిశయోక్తి కాదేమో! ఆయన అభిప్రాయాలకు ముగ్ధుడైన నరేంద్రుడు ‘విద్య’* అనే గ్రంథాన్ని అనువదించాలనుకొన్నాడు. అందు నిమిత్తం అనుమతి కోరుతూ స్పెన్సర్‌కు ఉత్తరం వ్రాశాడు. మనఃస్ఫూర్తిగా స్పెన్సర్ అందుకు అనుమతినిస్తూ, అంత చిన్న వయస్సులో అంతటి తాత్త్విక చింతనలు సంతరించుకొన్న నరేంద్రుణ్ణి ప్రశంసించాడు. నరేంద్రుడు ఆ గ్రంథాన్ని కొంతమేరకు క్లుప్తీకరించి అనువదించాడు. ఆపుస్తకం ‘శిక్ష’ పేరిట వంగభాషలో వెలువడింది. కాలాంతరంలో ఉపనిషత్తులు, వేదాంతంలోని క్లిష్టమైన తత్త్వాలను విపులీకరించడంలో స్పెన్సర్ తాత్త్విక తీరుతెన్నులను ఆయన చాలావరకు అనుసరించినట్లు గమనించవచ్చు.
వీరే కాక హామిల్టన్ (Hamilton), మిల్ (Mill), లాక్ (Locke), ప్లేటో (Plato) ప్రభృతుల తత్త్వాలనూ నరేంద్రుడు ఇష్టపడి చదివాడు. హామిల్టన్ తనతత్త్వ గ్రంథం ముగింపులో, “మనిషి మేథస్సు భగవంతుని ఉనికి గురించిమాత్రమే చెప్పగలదు, దాని పని అంతటితో సరి. భగవంతుని స్వభావాన్ని వివరింపగల శక్తి దానికి లేదు. అందువలన ఇక్కడ తత్త్వాలు ఆగిపోతాయి. ఎక్కడతత్త్వాలు అంతరిస్తాయో అక్కడ ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది” 1 అని వచిం చాడు. హామిల్టన్ చివరి పంక్తులు నరేంద్రునికి బాగా నచ్చాయి. సంభాషణలమధ్య ఆతడు దీనిని ఉదహరించడం కద్దు. ధ్యానంలో లీనమైపోతున్నప్పటికీ ఆతడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. చదువు, ధ్యానం, సంగీతాలలో ఎక్కువ సమయం గడిపేవాడు.
సాహిత్యంలో కూడ నరేంద్రుడు ఎంతో ఆసక్తి చూపాడు. సంస్కృతం, బెంగాలీ, ఆంగ్లాలలోని కావ్యాలను చదివాడు. బెంగాలీ రామాయణ మహాభారతాలు ఆతడికి కరతలామలకం. పండితులు తడబడిన అనేక సందర్భాలలోనరేంద్రుడు వారికి చేయూతనిచ్చాడు.
ఆంగ్లంలో షేక్స్పియర్ (Shakespeare), మిల్టన్ (Milton), బైరన్ (Byron), వర్డ్స్‌వర్త్ (Wordsworth) ప్రభృతులను అతడు మరీ ఇష్టపడి చదివాడు. షేక్స్పియర్ Romeo and Juliet, Midsummar Night’s Dream లాంటి నాట కాల నుండి ఆయన కాలాంతరంలో తన ప్రసంగాలలో పలు ఉదాహరణలు ఉటంకించారు. మిల్టన్ Paradise Lost నరేంద్రుణ్ణి బాగా ఆకట్టుకొన్న కావ్యం. “ఉన్న పాపం ఒక్కటే – దౌర్బల్యమే అది. నేను బాల్యంలో మిల్టన్ రచించిన ‘ప్యారడైజ్ లాస్ట్’ కావ్యం చదివాను. అందులో నా పూజ్యభావాన్ని చూరగొన్న సత్పురుషుడు సైతాను. దౌర్బల్యానికి వశుడు కాక, దేనినైనా ఎదుర్కొంటూ చివరి దాకా పట్టువిడవని వ్యక్తే మహాత్ము”* డని కాలాంతరంలో తన గీతోపన్యాసాలలో ఆయన ఉదాహరించడం చూడవచ్చు.
నరేంద్రుని రోజుల్లో వంగ సాహిత్యం విరివిగా లేదు. ఉన్నదంతా అతడు చదివేశాడు. భరత్ చంద్ర రచించిన ‘అన్నదా మంగళ్’, ‘విద్యాసుందర్’ లాంటి పుస్తకాల నుండి ఆయన ఉదాహరించడం కద్దు. బంకించంద్ర, దీనబంధు మిత్ర రచన లన్నింటినీ, ఈశ్వరచంద్ర గుప్త కవితలనూ చదివాడు. మైకేల్ మధుసూదన్ ‘మేఘనాథ వధ’ నరేంద్రుడికి బాగా నచ్చిన కావ్యం. అందులో రావణుని పాత్ర పోషణ తీరు గురించి ఆయన కాలాంతరంలో ప్రశంసించడం గమనార్హం.
ఇన్ని పుస్తకాలను ఒక వ్యక్తి స్వల్పకాలంలో చదివి ఉండడం సాధ్యమా అనే సంశయం రాకపోదు. కాని నరేంద్రుని చదివే విధమే చిత్రమైనదనే సంగతి మనం మరచిపోకూడదు. తాను చదివే తీరును ఆయనే ఇలా వివరించి ఉన్నారు: “ప్రతి పంక్తినీ చదవకుండా పేరాలోని మొదటి, చివరి పంక్తులు మాత్రమే చదవగానే సారాంశాన్నంతా నేను అవగతం చేసుకోగలుగుతాను. ఈ ప్రతిభ ఇనుమడించేకొద్దీ పేరాలు చదివే శ్రమ కూడా లేకపోయింది. పుటలోని మొదటి, చివరి పంక్తి చదివినంత మాత్రానే సారాంశాన్నంతా గ్రహించగలిగేవాణ్ణి. ఉపాధ్యా యుడు ఏదైనా క్రొత్త భావనను పరిచయం చేస్తున్నప్పుడు దానిని నాలుగైదు పుటలలో విపులీకరించేవాడు. దాన్లోనూ మొదటి కొన్ని పంక్తులు చదవగానే అంతా అర్థం చేసుకోగలిగేవాణ్ణి.” ఈ రీతిలో చదవడం కారణంగానే ఆయన స్వల్పకాలంలో అన్ని పుస్తకాలు చదవగలిగాడు.
సంగీతం
సంగీతంలో నరేంద్రుడు లోతుగా మునిగాడు. ప్రగాఢ ఉద్వేగం, శ్రావ్య కంఠం, వీటికి మెరుగులు దిద్దే సంగీత జ్ఞానం సహజంగానే అతడిలో పాదుకొని ఉన్నాయి. ఇందుకు తోడు తండ్రి అందించిన ప్రోత్సాహం ఆతణ్ణి సంగీతంలో ప్రావీణ్యునిగా తీర్చిదిద్దాయి. వేణీమాధవ్ అధికారి, ఉస్తాద్ అహ్మద్ ఖాన్, ఆయన శిష్యుల వద్ద నరేంద్రుడు సంగీతం నేర్చుకొన్నాడు. సుప్రసిద్ధ ద్రుపద్ గాయకుడైన జ్వాలా ప్రసాద్ వద్ద ద్రుపద్ సంగీతం అభ్యసించాడు. కాశీనాథ్ ఘోషాల వద్ద కూడా పాయా, తబలా, పక్వాజ్ మొదలైన సంగీత వాయిద్యాలను చక్కగా వాయించడం నేర్చుకొన్నాడు. ద్రుపద సంగీతంలో నరేంద్రుడు అగ్రగణ్యుడయ్యాడు. ఇవే కాక కీర్తనలు, భజనలు, శ్యామాసంగీతం, రామప్రసాద్ పాటలు, ఆగమనీ పాటలు లాంటి వంగ సంగీత శాఖలలోనూ చక్కని ప్రావీణ్యం గడించాడు. “సంగీతం ఉత్తమోత్తమమైన కళ. దాన్ని అర్థం చేసుకొన్న వారికి అది మహోత్తమమైన ఆరాధన అవుతుంది”* అని కాలాంతరంలో ఆయన వచించారు.
ఒకసారి నరేంద్రుని మిత్రుడొకడు ఆరితేరిన గాయకునిలా పాడాడు. అప్పుడు నరేంద్రుడు ఇలా అన్నాడు: “రాగతాళాలు మాత్రమే సంగీతం అనిపించు కోదు. ఒక భావనను అది వ్యక్తంచేయాలి. కేవలం లాగుతూ, సాగదీస్తూ పాడే పాటలను ఎవరూ ఆస్వాదించలేరు. పాటకు ఆధారమైన భావన గాయకుని భావో ద్వేగాన్ని ప్రేరేపించాలి. పదాలను స్పష్టంగా ఉచ్చరించాలి. రాగమూ తాళమూ అనుగుణంగా ఉండాలి. గాయకుని భావోద్వేగాన్ని ప్రేరేపించనిది సంగీతం అని పించుకోదు.”
సంగీతం నరేంద్రుని నైజంలో, హృదయంలో, నరనరాల్లో ఊరివుంది. సుశ్రావ్యమైన కంఠమూ, సంగీత జ్ఞానమూ సంతరించుకొన్న ఆయన పాడు తున్నప్పుడు శ్రోతలు మైమరచిపోవడం కద్దు.
సంగీతంలో మాత్రమే కాదు; సంగీత శాస్త్రాన్నీ ఆపోసనపట్టాడు నరేం ద్రుడు. 1887 శ్రీచండీచరణ్ బసక్ అనే వ్యక్తి ‘సంగీత కల్పతరు’ వనే గ్రంథం రచించాడు. ఆ గ్రంథంలో పలు భాగాలను సంకలనం చేసింది నరేంద్రుడే! ఆ గ్రంథం ఉపోద్ఘాతంలో సంగీతం గూర్చిన పలు అంశాలను, సంగీత వాద్యాల తత్త్వాలనూ విపులంగా, లోతుగా నరేంద్రుడు విశదీకరించాడు. ఆ గ్రంథంలోని ‘సంగీత సంగ్రహం’ అనే అధ్యాయం భారతదేశంలోని పలు భాషల నుండి సంకలనం చేసిన భక్తిగీతాలను సంతరించుకొన్నది. అనుబంధంలో పొందుపరచ బడ్డ ఆ గీత రచయితల జీవితచరిత్రలను కూడా నరేంద్రుడే రచించాడు.
ఛందోబద్ధమూ అర్థవంతమూ అయిన గీతాలు రచించడంలో కూడా ప్రావీణ్యం గడించాడు. నృత్యంలో కూడా ప్రతిభ చూపాడు. అందమూ దృఢమూ అయిన దేహం, విశాలమైన నేత్రాలు, అందుకు తగిన మనస్సు అన్నింటికీ మించిన సృజనాత్మకశక్తి ఆతడి నృత్యానికి వన్నెతెచ్చాయి. పాటలు పాడుతూ నృత్యం చేసేవాడు. అది చూపరులకు కన్నులపండువగా ఉండేదనడం అతిశయోక్తి కాదు.
బాహ్యాలంకరణ అతడికి సుతరామూ నచ్చదు. శిరోజాలను అలంకార ప్రాయంగా దువ్వుకోవడమూ, పలువురిని ఆకర్షించే రీతిలో దుస్తులు ధరించ డమూ నరేంద్రునికి ఇష్టం ఉండేది కాదు.
మేధావి
తత్త్వమూ, సాహిత్యమూ, సంగీతమూ ఇత్యాదులు నరేంద్రుని సాధనలలో కొన్ని మాత్రమే. ఆయన మేధా పరిణామాన్ని కొంతమేరకు గ్రహించే నిమిత్తమే వీటిని మనం వివరంగా పరికించాం. కేవలం ఒక యువ కుడు ఇవన్నీ సాధించగలడా? అందుకు నరేంద్రుని జీవితం సాధించగలడని ఠక్కున జవాబిస్తుంది.
కళాశాల పాఠాల పరిధిని దాటి ఇన్ని రంగాలలో తన ప్రతిభను చాటడం వలననేమో కళాశాల పాఠాలలో ఆతడు మరీ ఎక్కువ మార్కులు గడించలేక పోయాడు. ఆయన సముపార్జించిన మార్కులు కాస్త పరికిద్దాం:
ప్రవేశ పరీక్ష (Entrance; 1879) : ఆంగ్లం 47, బెంగాలీ 76, చరిత్ర 45, గణితం 38 ; మొత్తం 206 (మొదటి శ్రేణి)
మొదటి కళ (F.A; 1881) : ఆంగ్లం 46, బెంగాలీ 36, చరిత్ర 56, గణితం 40, న్యాయశాస్త్రం 17/50, మనస్తత్వశాస్త్రం 34/50 ; మొత్తం 229 (ద్వితీయ శ్రేణి)
బి.ఏ. (B.A; 1884) : ఆంగ్లం 56 ; గణితం 61, బెంగాలీ 43, చరిత్ర 56, తత్త్వశాస్త్రం 45 ; మొత్తం 261 (ద్వితీయ శ్రేణి)
నరేంద్రుని లాంటి మేధావి ఇలా ద్వితీయ శ్రేణి మార్కులు సంపాదించడం విచిత్రం. అతడు కళాశాల పాఠాలకు అతితక్కువ సమయం కేటాయించేవాడు. అతడి జ్ఞానపిపాస తీర్చడానికి అవి దీటైనవిగా లేవు. కనుక వాటిని చదవడం అతడు పెద్ద విషయంగా భావించలేదు. పరీక్షలకు ఒకటి రెండు నెలల ముందు వరకు ఆయన పాఠ్య పుస్తకాలు కనీసం తెరిచికూడా చూడడు. ఆ తరువాత రేయింబవళ్లు పాఠ్య పుస్తకాలలో మునిగిపోతాడు; పరీక్షలు వ్రాస్తాడు; ఉత్తీర్ణు డవుతాడు. బి.ఏ. పరీక్షలకు ఒక నెల ముందు దాకా తన పాఠ్య పుస్తకాలలో ఒకటియైన గ్రీన్ (Green) రచించిన ‘ఆంగ్లేయుల చరిత్ర’ లో ఒక్క పుటను సైతం చదవకపోగా, కనీసం ఆ పుస్తకం కొనను కూడా కొనలేదు. ఆ తరువాత కొన్నాడు. “దీనిని చదివి పూర్తిచేసే దాకా గదిలో నుండి బయటికి రాను” అని సంకల్పించుకొన్నాడు. మూడు రోజుల్లోనే చదివేశాడు. ఇలా కఠోరంగా చదివే సమయాలలో ప్రక్కన కాఫీ లేదా టీ లాంటివి సిద్ధంగా ఉంచుకొనేవాడు. ఒకవేళ కునుకు పట్టినప్పుడు కాలు కదపవలసి వచ్చేది; అప్పుడు మేలుకోవడానికి ఒక త్రాటిని కాలుకు కట్టి ఉంచేవాడు.
పరీక్షల్లో ఉత్తీర్ణుడవడానికి ఏ మేరకు చదవాలో అంతే చదివేవాడు. ఆ తరువాత తీరిక చిక్కిన నరేంద్రుడు పాఠాలు చదివేవాడు కాడు. బి.ఏ. పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఒక రోజు వేకువనే స్నేహితుల ఇంటికి వెళ్లాడు. వారు ఇంకా పడుకొనే ఉన్నారు. కనుక బయట నిలబడి రవీంద్రనాథ్ టాగూర్ గీతా న్నొకదాన్ని బిగ్గరగా గానం చేశాడు.
ఓ కొండల్లారా, మేఘాల్లారా, మలయమారుతాల్లారా!
బ్రహ్మపదార్థపు మహత్త్వాన్ని గానంచేసి ఆనందించండి!
సూర్యుల్లారా, చంద్రుల్లారా, తళుకులీను తారకలారా!
సత్యస్వరూపుని మహిమను పాడుతూ ఆనందించండి!
పాడుతూ ఆనందించండి, ఆనందంతో పాడండి.
అలా వారిని మేల్కొలిపి, వారు వద్దన్నా వినకుండా తొమ్మిది గంటల దాకా ఆటపాటల్లో కాలం గడిపాడు. ఈ రకంగా పరీక్షలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వని నరేంద్రుడు పాఠ్యాంశాలలో తక్కువ మార్కులే తెచ్చుకోవడంలో వింతేముంది!
యౌవనం
నరేంద్రుడు చదువులోనూ, సంగీతంలోనూ, తాత్త్వికతలోనూ మేధావిగా రాణించడాన్ని బట్టి, సదా ఆతడు ప్రగాఢ చింతనలలో మునిగి ఉండేవాడని అర్థం చేసుకోకూడదు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వేడుకా, వినోదమూ, ఆటపాటలూ ఉన్నట్లే! వీటి కోసమే స్నేహితులు ఆతణ్ణి ఇష్టపడేవారంటే అతిశయోక్తి కాదు. నాటి భారతదేశానికి కలకత్తా రాజధాని. ఒక మహానగరంలో నివసించే ఒక సంపన్న యువకుని జీవితం సామాన్యంగా ఎలా ఉంటుందో అలాగే నరేంద్రుని జీవితమూ ఒప్పారింది. ఆతడి ఉత్సుకత, క్రియాశీలత ఆతడికి పలువురు స్నేహితులను సంపాదించిపెట్టింది. వారంతా ఆతడితో ఉండడానికి ఎంతో ఇష్టపడేవారు. ఆదివారాలూ, సెలవు రోజులూ వచ్చాయంటే అందరూ గంగానదిలోనే. స్నానాలు, ఆటపాటలతో గంటల పర్యంతం గడిపేవారు. కొన్ని సమయాలలో ఒక బండిని బాడుగకు కుదుర్చుకొని స్నేహితులందరూ దాన్లో క్రిక్కిరిసి కూర్చుని, ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా కలకత్తా వీథుల్లో తిరిగేవారు. నరేంద్రుని మిత్రుల్లో కొందరి శీలం గురించి అంతగా సదభిప్రాయం లేదు. అలాంటి స్నేహితులతో నరేంద్రుడు కలసిమెలసి తిరగడం ఇంటా బయటా పలువురికి నచ్చలేదు. అయినప్పటికీ నరేంద్రుడు దానిని గూర్చి కలత చెందలేదు. ఇతరుల జీవితాల మీద ఆతడి ప్రభావం ఉండేదేగాని, ఇతరుల జీవితాలు ఆతడి మీద ఎలాంటి ప్రభావమూ చూపలేవు.
మిత్రునికి సహాయం
జనరల్ మిషన్ కళాశాల పేద విద్యార్థులకు పరీక్ష రుసుమూ, బోధనా రుసుమూ మినహాయించడం పరిపాటి. కాని అందుకు విద్యార్థి తన పేద స్థితిని రూఢిపరచాలి. నరేంద్రుని మిత్రుడైన హరిదాస్ చట్టోపాధ్యాయ్ పేదవాడు. అతడు పరీక్ష రుసుమూ, బోధనా రుసుమూ చెల్లించే స్థితిలో లేడు. కళాశాల ప్రధాన అధికారితో మాట్లాడి హరిదాస్ చెల్లించా ల్సిన రుసుములను మినహాయించే ఏర్పాటు చేస్తానని నరేంద్రుడు చెప్పాడు.
అప్పుడు రాజ్‌కుమార్ అనే వ్యక్తి ప్రధాన అధికారిగా పనిచేస్తున్నాడు. ఒక రోజు నరేంద్రుడు అతడి వద్దకు వెళ్లి హరిదాస్ విషయం వినమ్రంగా ఇలా ప్రస్తావించాడు: “హరిదాసు పరీక్షా రుసుము చెల్లించగల స్థితిలో లేడు. పరీక్షలు వ్రాయడానికి అతడికి మీరు అనుమతినిస్తే మొదటి శ్రేణిలో తప్పక ఉత్తీర్ణుడవు తాడు. లేకపోతే అతడి జీవితం నాశనమైపోతుంది. దయదలచి పరీక్షలు వ్రాయ డానికి అతడికి అనుమతి మంజూరు చేయండి” అని ప్రాథేయపడ్డాడు. కాని రాజ్ కుమార్ ఆ అభ్యర్థనను మన్నించక, “నీ సిఫారసు అక్కర్లేదు. నీ పనిని మాత్రం నువ్వు చూసుకో. రుసుము చెల్లించకుండా అతడు పరీక్షలు వ్రాయలేడు” అని నిష్కర్షగా చెప్పాడు. విషయం తెలిసి హరిదాస్ కుమిలిపోయాడు. అతణ్ణి ఓదా రుస్తూ, “బాధపడకు. ఎలాగైనాసరే ఇందుకు నేనొక మార్గం కనిపెడతాను. ధైర్యంగా ఉండు” అన్నాడు నరేంద్రుడు.
ఆ రోజు కళాశాల వదలిపెట్టగానే నరేంద్రుడు ఇంటికి వెళ్లకుండా ఊరికి కాస్త దూరంలో ఉన్న ఒక నిర్జన ప్రాంతానికి వెళ్లాడు. అబిన్లాంటి మాదక ద్రవ్యాలు లభించే చోటు అది. రాజ్‌కుమార్‌కు అక్కడికి వెళ్లడం అలవాటు. ఆ రోజు బాగా చీకటిపడ్డాక ఎవరి కంటాపడకుండా అక్కడకు రాజ్‌కుమార్ వచ్చాడు. హఠాత్తుగా రాజ్‌కుమార్ ఎదుట నరేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ సమయంలో ఊహించని రీతిలో నరేంద్రుణ్ణి అక్కడ చూసి హడలిపోయిన రాజ్‌కుమార్, “నరేంద్రా! ఏమిటి సంగతి?” అని అడిగాడు. నరేంద్రుడు హరిదాస్ విషయం ప్రస్తావించాడు. రుసుము మినహాయించకపోతే, మాదక ద్రవ్యాలు సేవించే ఆతడి అలవాటును బట్టబయలు చేస్తానని భయపెట్టాడు. బెదరిపోయిన రాజ్‌కుమార్ బోధనా రుసుమును మాత్రం మినహాయిస్తాననీ, పరీక్ష రుసుము మాత్రం హరిదాస్ చెల్లిస్తే సరిపోతుందనీ ఒప్పుకొన్నాడు.
మర్నాడు ఉదయం నరేంద్రుడు హరిదాస్ ఇంటి తలుపు తట్టి ఈ క్రింద పాట పాడాడు:
ఈ వినిర్మల తొలిసంజ వేళలో
ధ్యానించు సాటిలేని మహిమాన్విత బ్రహ్మాన్ని
మనోజ్ఞ ముఖారవింద తేజంతో పర్వతాగ్రం మీద
తొంగిచూస్తున్న బాలభానుని తిలకించు.
మంగళప్రదమైన నేడు వీస్తూన్న మలయమారుతం
ఆయన విభవాన్ని గానంచేస్తూ అమృతాన్ని చిలకరిస్తూన్నది
హృదయాల్లోని ప్రేమను నివేదిస్తూ వెళదాం
మనమంతా భగవంతుని ఆవాసానికి.
పిదప క్రితం రోజు సాయంత్రం జరిగిందంతా హరిదాస్‌కు పూసగుచ్చినట్లు చెప్పాడు. అది విని హరిదాస్ కడుపుబ్బ నవ్వాడు.
ఒకసారి మిత్రుడొకడు నరేంద్రుణ్ణి గురించి ఇలా వ్యాఖ్యానించాడు:
“నరేంద్రుడు మాట్లాడుతున్నప్పుడు వినడం మాకు ఎంతో ఆనందాన్నిచ్చేది. అందుకోసమే మేం ఏదో ఒక భావన గూర్చి మాట్లాడడం ప్రారంభించేవారం. నరేంద్రుడు తనదైన శైలిలో దానిని వివరించేవాడు. తాను వెలిబుచ్చిన అభి ప్రాయాన్ని ఎవరైనా వ్యతిరేకించి మాట్లాడితే తన వాదనాపటిమతో వారిని చిత్తు చేసేవాడు. అన్ని రకాల బలహీనతలనూ అతడు నిరసిస్తాడు. సాహసం, ప్రతిభ, బలం – వీటిని ఆహ్వానిస్తాడు. ఒకసారి నేను అతడి ఇంటికి వెళ్లినప్పుడు అతడికి ఒంట్లో బాగాలేదు. పడుకొని ఉన్నాడు. కాని నన్ను చూడగానే ఆప్యాయంగా ఆహ్వానించి ఉపచర్యలకు ఉపక్రమించాడు. ఎంత వారించినా వినకుండా పొగ త్రాగడానికి నా కోసం హుక్కా సిద్ధం చేయసాగాడు. ఆతడి ప్రేమ ఎల్లలెరుగనిది.”
నాటి సమాజం
ఇంతదాకా మనం చూసింది నరేంద్రుడు గడిపిన జీవితంలో ఒక వైపు – అద్భుతమైన ఆదర్శాలూ, నైతిక విలువలూ, ఉన్నతమైన లక్ష్యాలూ, కవితలతో గుబాళించే సాహిత్యమూ, భగవత్స్వరూపంగా పరిగణింపబడే సంగీత లోకం. ఇవి వికసించిన చిత్తరువు మహోన్నతమైనది. కాని నిజ జీవితంలో నరేంద్రుడు తిలకించిన చిత్తరువు ఏమిటి? అది పూర్తిగా భిన్నమైనది. ఈ ఆదర్శాలతోనో కవితల గుబాళింపులతోనో కించిత్తు కూడా సంబంధం లేనిది.” మేం జన్మించిన నాటి సమాజం శోచనీయమైనదిగా, జుగుప్సా కరంగా, భీతిగొలిపేదిగా ఉండేది” అంటూ ఆ చిత్తరువును నరేంద్రుని సోదరుడైన మహేంద్రుడు వర్ణించేవాడు. ప్రత్యేకించి నరేంద్రుడు నివసించిన సిమూలియా పేట త్రాగుబోతుల రాజ్యంగా వర్ధిల్లింది. సాయంత్రం అవగానే తప్పత్రాగి బురదలో దొర్లాడేవారు కొందరు. వారిని ఖైదు చేయడానికి వచ్చే పోలీసులకూ, వారికీ మధ్య గొడవలు జరగడం పరిపాటి. ఇక విశేష పూజలు జరిపే రోజులు వచ్చాయంటే మేకలనూ దున్నలనూ బలి ఇవ్వడం వలన అక్కడక్కడా రక్తపుమడుగులు దర్శనమిస్తాయి. విన భరించలేని గూఢార్థాలతో (అశ్లీల పద జాలంతో) పాడే పంజారీ, తర్జా లాంటి సంగీతాలు పర్వదినాల్లో వీథి అంతటా వినిపిస్తుంటాయి. ఇక తాంత్రిక సాధనల పేరిట జగుప్సాకరమైన హీనకార్యాలు చేస్తూ మరో బృందం తిరుగుతూ ఉంటుంది.
ఆడపిల్లకు ఎనిమిదేళ్ళు నిండితే ఆమెకు వివాహం జరిగిపోవాలి. పదహారేళ్లు పైబడ్డ మగపిల్లవానికి వివాహం కాకుంటే అతణ్ణి కులం నుండి బహిష్కరిస్తారు. తమ ఇంట్లో ఒక పండుగో పబ్బమో జరుగబోతోందని ఇతరులను ఆహ్వానింప వచ్చిన వ్యక్తికి తన ఏడు తరాలవారి పేర్లూ తెలిసివుండాలి; కులం, గోత్రం తప్పక తెలిసి ఉండాలి. అప్పుడే ఆ ఆహ్వానాన్ని మన్నిస్తారు. ఈ విషయంలో కుటుంబాల మధ్య తలెత్తే కలహాల గూర్చి చెప్పనవసరం లేదు!
భట్టాచార్య బ్రాహ్మణుడు నివసించే వరుసలో గోస్వామి బ్రాహ్మణుడు ససేమిరా నివసించడు. బ్రాహ్మణుల మధ్యే ఇలాంటి కుల వివక్షలు నెలకొని ఉంటే, వారికీ ఇతర కులస్థులకూ మధ్యనున్న గందరగోళాల గూర్చి చెప్పతరమా!
మతం మాటకు వస్తే, అలాంటిది ఎక్కడా లేదనే చెప్పాలి. హిందూమతాని కంటూ సరిపడ్డ గ్రంథాలు లేవు. రామాయణ, మహాభారతాలు ఉండనే ఉన్నాయి. కాని వేదవేదాంతాల లాంటి ఉన్నత భావనలు తెలియజేసే గ్రంథాలు లేవు. గీత, ఉపనిషత్తుల లాంటి పదాలు పలువురు వినడంతో సరి, ఆ గ్రంథాలు చూసింది కూడా లేదు. ఏదో అతికొద్దిమంది భట్టాచార్య బ్రాహ్మణులు చండీ (దేవీ మాహాత్మ్యం) పారాయణ చేసేవారు. చైతన్యుల గురించిన గ్రంథాలు కూడా అంత ప్రాచుర్యం పొందలేదు.
క్రైస్తవ మిషనరీలు
ఈ సదవకాశాన్ని జారవిడుచుకోని క్రైస్తవ మిషనరీలు, అసంఖ్యాక క్రైస్తవ మత గ్రంథాలను ముద్రించి, పంపిణీ చేశారు; రోడ్ల కూడలిలోను, సంతలలోను, బహిరంగ ప్రదేశాలలోను జనాన్ని సమీకరించి హిందూ దేవతలను తూలనాడ డమే వ్రతంగా చేపట్టారు. ఒక రోజు నరేంద్రుడు వెళుతున్న వీథిలో ఇలాంటి సభ ఒకటి జరుగుతూన్నది. ఒక మిషనరీ, “గంగానదిలో స్నానం చేస్తే పాప ప్రక్షాళనమవుతుందనడం పాపం. ఇలాంటి మూఢ నమ్మకాలతో కూడుకొన్నదే హిందూమతం” అంటూ ఉపన్యాసం దంచేస్తున్నాడు. నరేంద్రుడు సహించలేకపోయాడు. ఆతడు దానిని ఖండించాడు. గుమిగూడిన జనంలో కొందరు మిషనరీకి మద్దతు నివ్వగా, కొందరు నరేంద్రునికి మద్దతు నివ్వడంతో అక్కడ పెద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎక్కడ అది మత కలహానికి దారితీస్తుందోనని భయపడ్డప్పుడు ఎలాగో రెండు పక్షాలవారూ శాంతించి అలాంటి వికృత పరిస్థితి రాకుండా అరికట్టారు.
హిందూమతపు ఔన్నత్య భావనలను తెలుసుకోవడానికి అవసరమైనన్ని గ్రంథాలు లేవు. అందువలన మిషనరీల దూషణలను హిందువులు సమర్థ నీయంగా ఖండించలేకపోయారు. వారు తమ సొంత మతాన్ని త్యజించనూలేక, క్రైస్తవ మతాన్ని పుచ్చుకోనూలేకపోయారు.
బ్రహ్మ సమాజం
హిందూమతంలో సనాతన వాదాలూ, మూఢనమ్మకాలూ కోకొల్లలని హిందువులలో కొందరైనా గ్రహించగలిగారు. కాని అందుకు కారణం ఏమిటి, తప్పు ఎక్కడ జరిగింది అనే సంగతి వారికి అంతుబట్టలేదు. దాంతో మతం మీదే ఏకంగా నెపం నెట్టి పలువురు హిందూ మతం నుండి వైదొలగసాగారు. కొందరు హిందూమతంలోని కొన్ని నమ్మకాలను వదలిపెట్టి, అదే సమయంలో క్రైస్తవ మతంలోని కొన్ని భావనలను స్వీకరించి ఒక క్రొత్తరకం మత సంస్థను ప్రారంభించారు. ఇలాంటి సంస్థలలో ప్రధానమైనది బ్రహ్మసమాజం.
ఆనాటి కలకత్తాలో బ్రహ్మసమాజం గొప్ప ప్రభావం కలిగించింది. అనేక దేవుళ్ల భావన, సాకారోపాసన, అవతారతత్త్వం, గురువు ఆవశ్యకత మొదలైన అంశాలను ఈ సమాజం వ్యతిరేకించింది. నిరాకారమూ సగుణమూ అయిన ఒకే దేవుణ్ణి అది ప్రతిపాదించింది. సమాజంలో కూడా అనేక సంస్కరణలు తీసుకు రావడానికి బ్రహ్మసమాజం ప్రయత్నించింది. కుల పట్టింపులను నిర్మూలించడం, సర్వులకూ సమాన హక్కులు కల్పించడం, స్త్రీలకు విద్య, స్త్రీల వివాహ వయః పరిమితిని పెంచడం లాంటి ఆదర్శాలను అది చేపట్టింది.
1828 లో రాజారామ్ మోహనరాయ్ స్థాపించిన ఈ బ్రహ్మసమాజం మహర్షి దేవేంద్రనాథ్ టాగూర్చే* పెంపొందింది. ఈయన తమ భావనలకు ఆధారంగా ఉపనిషత్తులను స్వీకరించాడు. అదే సమయంలో ఇస్లాం, క్రైస్తవ మత భావనలు సమాజంలో చొచ్చుకొనిపోకుండా శ్రద్ధవహించాడు. తర్వాత నాయకునిగా వచ్చిన వ్యక్తి కేశవచంద్ర సేన్. ఈయన సంస్కృతం నేర్చుకోలేదు. ఆంగ్ల విద్యను అభ్యసించాడు. క్రైస్తవమతం పట్ల మొగ్గు కనబరిచాడు. కనుక ఏసు క్రీస్తును బ్రహ్మసమాజంలో చొప్పించడానికి ప్రయత్నించాడు. ఈ కారణంగా ఏర్పడ్డ భేదాభిప్రాయాలతో ఈయన తన అనుయాయులతో ఇండియా బ్రహ్మసమాజం అనే సంస్థను స్థాపించాడు. దాంతో బ్రహ్మసమాజం కాస్తా, ఆది బ్రహ్మసమాజం అనే పేరిట పేర్కొనబడింది. కాలాంతరంలో శ్రీరామకృష్ణుల భావనల ప్రభావంతో కేశవ్సేన్ చింతనాధోరణిలో ఎంతో మార్పువచ్చింది. ఈ క్రొత్త భావనలతో ఇండియా బ్రహ్మసమాజం, ‘నవవిధాన్’ గా పిలువబడింది. తన కుమార్తె వివాహ విషయంలో కేశవ్సేన్ తన సమాజ నియమాలను ఉల్లంఘించినందువలన విజయకృష్ణ గోస్వామి, శివనాథ్ శాస్త్రి లాంటి నాయకులు విడిపోయి సాధారణ బ్రహ్మసమాజం అనే సంస్థను నెలకొల్పారు. నరేంద్రుడు ఈ సాధారణ బ్రహ్మ సమాజంలో సభ్యుడయ్యాడు.
బ్రహ్మసమాజ సభ్యునిగా
సమాజాన్ని, మరీ ముఖ్యంగా యువకుల మనస్సులను బ్రహ్మసమాజం గొప్పగా ప్రభావితం చేసింది. సదా క్రొత్త భావనలను ఆహ్వానించే నరేంద్రుణ్ణి బ్రహ్మసమాజ భావనలు ఆకట్టుకొన్నాయి. సమాజ ప్రార్థనా సమావేశాలకు తప్పనిసరిగా వెళ్లసాగాడు. సమాజ ఆశయాలను తనూ స్వీకరించాడు. అక్కడ ప్రదర్శించిన ‘నవవిధాన్’ అనే నాటకంలో ఒక సన్న్యాసి పాత్ర పోషించాడు కూడా.
కేశవచంద్ర సేన్ మహావక్త. తన వాదనా ప్రతిభతోను, మేధస్సుతోను, ప్రగాఢ చింతనతోను, సరళతతోను, ఠీవితోను అనేకులను ఇట్టే ఆకట్టుకొన్నాడు. తను కూడా ఏదో ఒకనాడు ఆయన మాదిరి అవాలని నరేంద్రుడు తలచడం కద్దు.
శాకాహారం
బ్రహ్మసమాజపు హేతువాద విధానం ప్రారంభంలో నరేంద్రుడికి బాగా నచ్చింది. ప్రార్థనల వలనా, భక్తి గీతాల వలనా తాను ఉన్నతుడైనట్లు అతడు గ్రహించాడు. వెంటనే సమాజ ఆశయాలను కఠోరంగా పాటించసాగాడు. వాటిలో శాకాహారం ఒకటి. వంగదేశంలో సామాన్య ఆహారమైన చేపలు భుజించ డాన్ని కూడా అతడు మానుకొన్నాడు. శాకాహారమే పుచ్చు కొంటూ నరేంద్రుడు కూడా తన తాత మాదిరి సంసారాన్ని త్యజించి సన్న్యాసం స్వీకరిస్తాడేమోనని తల్లితండ్రులు కలతచెందారు.
ఒక రోజు నరేంద్రుని అక్కయైన స్వర్ణమయి అతడికి భోజనం వడ్డిస్తూ ఉంది. నరేంద్రుని ముందు చేపల కూర ఒక పళ్లెంలో ఉంచింది. కాని నరేంద్రుడు అది వద్దని కాయగూరలు వడ్డించమన్నాడు. వెంటనే ఆమె ఆ పళ్లెం తీసుకెళ్లి అందులోని చేపలను తీసివేసి మళ్లీ ఆ పళ్లెరాన్ని అతడి ముందు ఉంచింది. నరేంద్రుడికి కోపం వచ్చింది. దాంతో అక్కాతమ్ముళ్లు వాగ్యుద్ధం చేశారు. ఆ సమ యంలో విశ్వనాథ్ స్నానం చేస్తున్నాడు. వారిద్దరి తగాదా గమనించి, “పద్నాలుగు తరాల పర్యంతం ఇతడి పూర్వీకులు ఎండ్రకాయలూ, నత్తలూ తిని జీవించారు. ఇతడేమో ఇప్పుడు బ్రహ్మరాక్షసుడు* అయిపోయాడట, చేపలు తినడట” అన్నాడు కోపంగా. అయినప్పటికీ ఆయన నరేంద్రుని విషయంలో జోక్యం చేసుకోలేదు.
ప్రగాఢ ధ్యానాభ్యాసం
బ్రహ్మసమాజ ఉపాసనా పద్ధతులను నరేంద్రుడు పాటించినప్పటికీ తక్కిన సభ్యుల నుండి విలక్షణంగా ఉన్నాడు. భగవంతుడంటూ ఒకరు ఉండివుంటే నిశ్చయంగా ఆయన నిజమైన ప్రార్థనలను ఆలకించి భక్తునికి దర్శనమిస్తాడు; ఆయన సాక్షాత్కారం పొందడానికి ఏదో ఒక మార్గం ఉండితీరాలి; అలా లేకపోతే జీవితమే నిరర్థకమని అతడి గట్టి నమ్మకం. కాని అలాంటి భగవన్మార్గాన్ని బోధించడంలో బ్రహ్మసమాజం అనుకూలమైనది కాదని కొద్ది రోజుల్లోనే నరేంద్రుడు గ్రహించకపోలేదు.
సత్యాన్ని తెలుసుకోవాలి; భగవత్సాక్షాత్కారం పొందాలనే తపన ఈ కాల ఘట్టంలో అతడిలో అవధులు దాటింది. అప్పటి నుండి నరేంద్రుడు ఒక క్రొత్త పద్ధతిలో ధ్యానాభ్యాసం ప్రారంభించాడు. భగవంతుణ్ణి సాకారునిగా తలచినా, నిరాకారునిగా ఎంచినా మానవ రూపాన్నీ, గుణాలనూ స్వీకరించకుండా మనం ఆయనను ధ్యానించలేం. దీనిని గ్రహించడానికి మునుపు నరేంద్రుడు బ్రహ్మ సమాజ పద్ధతి మేరకు భగవంతుణ్ణి నిరాకార సగుణ బ్రహ్మంగా ధ్యానించేవాడు. ఇదీ ఒక రకమైన కల్పనగా నిర్ధారణ చేసిన నరేంద్రుడు ఆ ధ్యాన పద్ధతిని విడిచిపెట్టి, “భగవంతుడా! నీ నిజస్వరూప దర్శనానికి నన్ను అర్హుణ్ణి చేయి” అంటూ ప్రార్థించాడు. ఆ తరువాత మనస్సును ఆలోచనారహితం చేసి, గాలిలేని చోట వెలిగే దీపశిఖలా మనస్సును నిశ్చలంగా ఉంచడానికి అభ్యాసం చేయ సాగాడు. ఈ రీతిలో కొంతకాలం అభ్యసించిన తరువాత అతడి మనస్సు పూర్తిగా శాంతించింది. కొన్ని సమయాలలో దేహభావన, కాల భావన కూడా అతడికి మృగ్యమవడం కద్దు. ఇంట్లో అందరూ నిద్రించడానికి పోగానే, అతడు తన గదిలో ఈ తీరులో ధ్యానించేవాడు. అనేక రాత్రుళ్లు ధ్యానంలోనే గడచిపోయేవి.
ఆ కారణంగా ఒక రోజు నరేంద్రునికి అసాధారణమైన అనుభవం ఒకటి కలిగింది. ఆతడు ఇలా అన్నాడు: “ఏ ఆధారమూ లేకుండా మనస్సును ఏకాగ్రం చేసి స్థిరంగా నిలిపితే, మనస్సులో ఒక రకమైన ప్రశాంతతతో కూడుకొన్న పరమానందం జనిస్తుంది. ధ్యానానంతరం కూడా చాలాసేపు ఆ పరమానందపు మత్తు కొనసాగుతుంది. కనుక ఆసనాన్ని విడిచిపెట్టి వెంటనే లేవడానికి మనస్క రించదు.” అలాంటి ధ్యానానందాన్ని చవిచూడసాగాడు నరేంద్రుడు.
లక్ష్య సాధకుడు
బాహ్యంగా నరేంద్రుడు వేడుకలు, వినోదాలు, సంగీత వ్యాయామాదులలో కాలం గడుపుతూన్నప్పటికీ, ఆంతరికంగా ఆతడి మనస్సు ఇలా ధ్యానం ద్వారా సత్యాన్ని అన్వేషించసాగింది. ‘ఈ లోకాన్ని సృజించి, పరి రక్షించే పనులు నిర్వహించే ఒక శక్తి ఉండివుంటే, ఆ శక్తిని ఎందరో మహాత్ములు దర్శించి, పూజించి, స్తుతించడం నిజమే అయితే, ఆ సత్యాన్ని, ఆ శక్తిని తాను కూడా దర్శించుకోవాలి’ అనే తలంపు అతడిలో తీవ్రతర మయింది. ముఖాముఖీ దర్శనం కన్నా మరెలాంటి ఋజుమా అతణ్ణి తృప్తిపర చేదిగా లేదు. అలా అయితే ఆ సత్యాన్ని దర్శించాలి.
అందుకు మొదట అవసరమైనది ఏమిటి?
అందుకు తగిన అర్హత.
ఆ అర్హత లేవి?
“తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం (కర్మ ఫలాలను ఈశ్వరునికి అర్పించడం) – ఈ మూడు క్రియాయోగం” అంటున్నది పతంజలి యోగ సూత్రం.* దీన్లో తపస్సే అన్నింటికీ ఆధారం. తపస్సు అంటే దగ్ధం అని అర్థం. దేనిని దగ్ధం చేయాలి? మన లౌకిక వాంఛలను, ఇంద్రియాల ఉద్వేగాన్ని, దుర్గుణాలను దగ్ధం చేయడమే తపస్సు.
దీనికి పునాదియైనది బ్రహ్మచర్యం. కామశక్తిని అధోముఖంగా పోనివ్వ కుండా అడ్డుకోవడమే బ్రహ్మచర్యపు ముఖ్య కర్తవ్యం. కామమార్గంలో పోకుండా ఉండడమే గొప్ప తపస్సుగా పరిగణింపబడుతున్నది.
స్వాధ్యాయం లేక ఆత్మవిచారణ మూలంగా ఈ కామశక్తి ఉదాత్త లక్ష్యాన్ని చేరుకొంటుంది. తపస్సు మూలంగా పవిత్రమైన, స్వాధ్యాయం మూలంగా ఉదాత్త లక్ష్యాన్ని చేరుకొన్న కామశక్తి సత్యస్వరూపుడైన భగవంతుని అభి ముఖంగా నిర్దేశింపబడినప్పుడు, అది సత్యాన్ని పొందే పథంలోకి సాధకుణ్ణి చేరుస్తుంది. నరేంద్రునికి ఈ మూడు స్వతఃసిద్ధంగానే కరతలామలకమని చూస్తున్నాం.
బ్రహ్మచర్యం
కామ మార్గంలో పోతున్న శక్తిని అదుపుచేసి, ఉన్నత లక్ష్యాలకై వెచ్చించి నప్పుడు ఆ లక్ష్యం సత్వరమే సిద్ధిస్తుంది. కాని కామశక్తిని అదుపుచేయడమూ, దానిని ఉన్నతమైన ఒక మలుపు వైపు త్రిప్పడమూ అంత సులభం కాదు. అలా ఒక వ్యక్తి చేయగలిగితే అది అతనిలో బ్రహ్మచర్యశక్తి లేదా మేధాశక్తి అనే నూతన శక్తిని జనింపచేస్తుంది. ఈ శక్తి అసాధ్య కార్యాలను సాధ్యం చేస్తుంది. ఈ శక్తిని సముపార్జించే తీరాలని నరేం ద్రుడు నిశ్చయించాడు. అందుకు తగ్గట్లు తన జీవిత విధానాన్ని మలచుకొన్నాడు. అయినప్పటికీ ఒక రోజు ఆ ఉద్వేగం కట్టలు తెంచుకొని ఆతడిలో ఉప్పొంగింది. ఇక మీదట అది తలెత్తకుండా అదుపులో ఉంచే తీరాలని సంకల్పించాడు. తలచుకొన్నది సాధించే తీరుతాడు కదా నరేంద్రుడు! చుట్టూ పరికించాడు. చలి కాచుకోవడానికి పొయ్యి రాజేసి ఉన్నారు. శరీర భాగం తాకేటట్లు ఆ పొయ్యి మీద కూర్చున్నాడు! ఆ పుండు నయం కావడానికి నెలలు పట్టింది! శరీరం మీద పుండు ఏర్పడ్డదే తప్ప కామం అనే పిడికిలి నుండి మనస్సు విడివడింది. ఆ తరువాత ఆయన జీవితంలో కామం అనే పదానికే చోటులేకపోయింది. ఆ యౌవనావస్థలోనే తనను కోరివచ్చిన స్త్రీలను తల్లిగా భావించి, వారిని త్రోసి రాజన్న శక్తి ఆతడిలో కలిగింది. కొన్ని సంఘటనలు చూద్దాం:
పరీక్షలు దగ్గరపడుతున్నప్పుడు సమీపంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి చదువు కోవడం నరేంద్రునికి అలవాటు. ఆ ఇల్లు కాస్త నిర్జన ప్రాంతంలో ఉండడం వలన అక్కడ శబ్దాలూ, శ్రద్ధను భంగపరచే ఆకర్షణలూ లేవు. రేయింబవళ్లు చదువులో మునిగిపోయి రోజులకొద్దీ అక్కడే ఉండిపోయాడు. చదువవలసిన పాఠాలు ముగించకుండా గది నుండి బయటకు రాకూడదని సంకల్పించు కొన్నాడు.
చదువుకొంటున్నప్పుడు మధ్య మధ్యలో సన్నని గొంతుతో పాడుకోవడం నరేంద్రునికి పరిపాటి. ఆ ఇంటికి ఎదురింట్లో యౌవనవతియైన ఒక వితంతువు నివసిస్తూవుంది. ఆమె తన ఇంటి కిటికీ వద్ద నిలబడి నరేంద్రుని పాటను వింటూ వచ్చింది. ఆతడి శ్రావ్యకంఠానికి ఇతరుల మాదిరే ఆమె కూడా ఆకర్షితురాలైంది. క్రమంగా ఆతడి పాటలపట్ల ఆమె అనురక్తి పెంచుకోసాగింది. అతడు పాడ నారంభించగానే తన ఇంటి కిటికీ బార్లా తెరచి వినసాగింది; చివరకు అతణ్ణి ప్రేమించసాగింది. ఇదేదీ నరేంద్రుడికి తెలియదు. ఒక రోజు రాత్రి ఆమె తెగించి సరాసరి అతడి గదిలోకి వచ్చేసింది. ఆమె ఉద్దేశమో, వేషభాషలో నరేంద్రుణ్ణి చలింపజేయలేదు. ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి, “తల్లీ! ఈ సమయంలో ఇక్కడకు రావడం తప్పు కదా! తక్షణం ఇక్కణ్ణుండి వెళ్లిపోండి” అని అన్నాడు. అచంచల మనస్కుడైన ఆతణ్ణి చూసి ఆమె సిగ్గుతో తల వాల్చేసి, తక్షణం అక్క ణ్ణుండి నిష్క్రమించింది. ఈ సంఘటనానంతరం నరేంద్రుడు తను చదువుకొనే గదిని మార్చుకొన్నాడు.
పావనత్వం
ఆ రోజుల్లోనే నరేంద్రుని పావనత్వం చూసి పలువురు శ్లాఘించకుండా ఉండలేకపోయారంటే అతిశయోక్తి కాదు. ఒకసారి ప్రఖ్యాత నాటక ప్రయోక్తయైన గిరీష్ ఘోష్ ‘బిల్వమంగళుడు’ అనే నాటకం ప్రదర్శింప బడింది. గిరీష్‌కు నరేంద్రునితో పరిచయం ఉంది. నరేంద్రుని సంగీత ప్రావీణ్యాన్ని ఎరిగిన గిరీష్ అతణ్ణి రంగస్థలం మీదకు రావించి ఒకటి రెండు పాటలు పాడమని కోరాడు. నరేంద్రుడు తంబూరా మీటుతూ పాడనారం భించాడు. అలంకరణ చేసుకొనే గదిలోని నటీమణులకు ఆ పాట వినిపించింది. ఏదో ఒక రకమైన భయంతో కూడిన గౌరవాన్ని ఆ పాట వారిలో ఉత్పన్నం చేసింది. విశ్రాంతి తీసుకొంటున్న వారందరూ లేచి, చేతులు జోడించి కాస్త దూరంగా నిలబడ్డారు. ఆ నటీమణుల భయాన్ని అర్థం చేసుకొన్న గిరీష్ ఒకటి రెండు పాటలు పూర్తికాగానే నరేంద్రుణ్ణి అక్కణ్ణుండి తీసుకొని వెళ్లిపోయాడు.
మర్నాడు ఒక నటీమణి, “ఆయన గొప్ప ఆధ్యాత్మిక సాధకునిలా కని పిస్తున్నాడు. మా లాంటి స్త్రీలు ఉంటున్న చోటుకు ఆయనను తోడ్కొని రావచ్చా? ఆయనను చూసి మా మనస్సుల్లో ఏవైనా తుచ్ఛ తలంపులు తలెత్తితే మాకు పుట్టగతులుంటాయా? ఈ లోకం (ఇహం) ఇప్పటికే మాకు లేకుండా పోయింది. పరం కూడా మాకు లేకుండా పోవాలా?” అంటూ గిరీష్‌ను చీవాట్లు పెట్టింది. యువకునిగా ఉన్నప్పుడే ఎలాంటి వ్యక్తి మనస్సులోనైనా ఆ రకంగా పావ నత్వాన్ని జనింపచేసే పావనమూర్తిగా ఆతడు విరాజిల్లాడు. “నా పట్ల నువ్వు ఎలా గౌరవాన్నీ, విశ్వాసాన్నీ వ్యక్తం చేయాలో తెలుసా? నీ పావనమయ జీవితం ద్వారానే” అంటూ ఒకసారి భువనేశ్వరీదేవి చెప్పిన విషయం తు.చ. తప్పక జీవి తాంతం పాటించాడు నరేంద్రుడు.
ఆత్మవిచారణ
తర్వాతి అర్హత స్వాధ్యాయం. చదువు, మంత్రజపం అని సామాన్యంగా దీనికి అర్థం చెప్పుకొంటారు. కాని దీని విశేషార్థం, ‘తనను అధ్యయనం చేసు కోవడం’ (స్వ+అధ్యయనం). అంటే ఆత్మ విచారణ అని అర్థం. ఆధ్యాత్మిక జీవితానికి మాతృమూర్తి శ్రీ శారదాదేవి దీనిని ఒక ముఖ్యమయిన నియమంగా అభివర్ణించారు. నౌకకు చుక్కానిలా ఆత్మ విచారణ సాధకునికి మార్గదర్శి వంటిదని కూడా ఆమె పేర్కొన్నారు. “నే నెవరిని? నా మనోవైఖరి ఏమిటి?”, “నేను దేనిని అన్వేషిస్తున్నాను?” “దానిని పొందడానికి తగిన మార్గంలోనే వెళుతున్నానా?” ఇలాంటి ప్రశ్నలను లోతుగా యోచించడం తప్పనిసరి. వీటికి జవాబులు లభించినా, లభించకపోయినా నిత్యం కొంతసేపు వీటిని గూర్చి యోచించడం ఎంతో ఆవశ్యకం.
నరేంద్రుని జీవితంలో ఈ ఆత్మవిచారణ స్వతస్సిద్ధంగా విలసిల్లింది. సత్యాన్ని సాక్షాత్కరించుకోవడమే తన లక్ష్యమని అతడికి స్పష్టంగా తెలుసు.
సత్య సాక్షాత్కారానికి రెండు మార్గాలు సూచిస్తుంది హిందూమతం.
- ప్రవృత్తి మార్గం : బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం – ఈ ఆశ్రమ ధర్మాలను పాటించి, అవి ఒసగే అనుభవాలతో పరిపక్వతను సంతరించు కొని పరమసత్యమయిన భగవంతుని చేరుకోవడం.
- నివృత్తి మార్గం : సంసారాన్నీ, అది అందించే అనుభవాలనూ త్రోసి రాజని, ఇంద్రియాలను నియంత్రించి, యౌవనంలోనే సన్న్యాస జీవితం స్వీకరించి భగవంతుణ్ణి ఆకాంక్షించడం.
రెండవ మార్గం అందరూ ఆచరించలేనిది, ఎంతో కఠోరమయినది. కాని నరేంద్రుణ్ణి ఈ రెండవ మార్గమే విపరీతంగా ఆకట్టుకొంది. ఈ రెండు మార్గాల గురించి అతడు ప్రగాఢంగా చింతనచేసేవాడు, సంశోధించేవాడు. ఆతడి సంశోధన కేవలం ఊహామాత్రంగా జరిగేది కాదు. ఆతడు నిద్రిస్తున్నప్పుడు ఈ రెండు దృశ్యాలూ ఒక నాటకంలా అతడి కళ్ల ముందు కానవచ్చేవి. మొదటిది లౌకిక సుఖ జీవిత దృశ్యం: అష్టైశ్వర్యాలతో తులతూగే జీవితం; పెద్ద ఇల్లు, పని మనుషులు, మంచి భార్య, పిల్లలు, పేరుప్రతిష్ఠలతో నిండినది. రెండవది సంసారాన్ని త్యజించిన ఒక సన్న్యాసి జీవిత దృశ్యం: రిక్తహస్తాలతో, భగవంతుణ్ణే పరిపూర్ణంగా ఆశ్రయించి, దేశాటనం చేస్తూ, భిక్షాన్నం మాత్రం స్వీకరిస్తూ, ఏదో చెట్టు క్రింద రాత్రుళ్లు గడపుతూ జీవించడం.
ఈ రెండు దృశ్యాలూ అతడి మనోనేత్రాల ముందు కాసేపు భేటీ ఇస్తూ న్నట్లు ఒకాదాన్నొకటి అధిగమించడానికి ప్రయత్నించేవి. అతడు గాఢంగా అంత ర్ముఖుడయ్యేకొద్దీ మొదటి దృశ్యం వెలావెలాబోయి, సన్న్యాస జీవిత దృశ్యం ఆతడి మనస్సును పూర్తిగా ఆక్రమించేది. రోజులు గడిచేకొద్దీ సన్న్యాస జీవిత దృశ్యం అతడి మనస్సులో చెరిపివేయలేనంతగా ముద్రితమైపోయింది.
సన్న్యాస జీవితం కేవలం మార్గం మాత్రమే; సాధించవలసిన లక్ష్యం కాదు. గృహస్థ జీవితం నీటిప్రవాహంతోబాటే వెళ్లడంలా భావిస్తే, సన్న్యాస జీవితం దానికి ఎదురీత లాంటిది. అర్హుడైన వ్యక్తి సహాయం లేకుండా ఇందులో విజయం సాధించడం ఎంతో అరుదు. ఆ వ్యక్తినే మన శాస్త్రాలు గురువు అని పేర్కొంటు న్నాయి. ఆయన సత్యాన్ని గ్రహించిన వాడై ఉండాలి; సత్యం అనేది ఒకటి ఉండి వుంటే దానిని ఆయన ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకొని ఉండాలి.
‘సత్య సాక్షాత్కారం పొందాను’ అని చెప్పగల వ్యక్తే ప్రస్తుతం నరేంద్రునికి అవసరమయ్యాడు. కనుక సర్వజ్ఞులూ, తత్త్వవేత్తలూ, మహాత్ములూ అని ఎవరిని గురించి విన్నా వారిని వెళ్లి కలుసుకొని ఈ ప్రశ్నలు అడగడం అతడికి నిత్యకృత్య మైంది.
మహర్షి దేవేంద్రనాథ్ టాగూర్
ఈ ప్రశ్నతో నరేంద్రుడు కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఒక రోజు అతడు మహర్షి దేవేంద్రనాథ్ టాగూర్‌ను కలుసుకోవడం తటస్థించింది. బ్రహ్మ సమాజాన్ని పెంపొందించి, ప్రాచుర్యంలోకి తెచ్చిన వారిలో ఆయన ప్రముఖుడు. కాబట్టి నాటి సర్వజ్ఞులలో ఆయనది అగ్రతాంబూలం అనడం నిర్వివాదాంశం; పలువురికి ఆధ్యాత్మిక గురువుగా కూడా ఆయన విరాజిల్లాడు. ఆయనను కలుసుకోవడానికి స్నేహితులతో నరేంద్రుడు వెళ్లాడు. నరేంద్రుని ఆసక్తినీ, తపననూ గుర్తించి ఆయన గాఢంగా ధ్యానించమని సలహా ఇచ్చాడు. కాని నరేంద్రునికి ఆ సలహా అంతగా రుచించలేదు. ఎలాగైనా సరే ఒకసారి ఆయనను ఒంటరిగా కలుసుకోవాలని నిశ్చయించుకొన్నాడు.
గంగానదిలో ఒక పడవ ఇంట్లో ఏకాంతంలో వసిస్తూన్న మహర్షిని ఒక రోజు నరేంద్రుడు కలుసుకొన్నాడు. చెప్పాపెట్టకుండా హఠాత్తుగా అలా నరేం ద్రుడు తన ముందు ప్రత్యక్షమవడంతో మహర్షి క్షణకాలం ఆశ్చర్యచకితుడయి నాడు. ఆయన ఆశ్చర్యంలో నుండి తేరుకోక ముందే, “అయ్యా, మీరు భగవం తుణ్ణి దర్శించారా?” అని సూటిగా నరేంద్రుడు ప్రశ్నించాడు. మహర్షి అందుకు స్పష్టంగా జవాబు చెప్పలేక, “నాయనా! నీకు యోగికి ఉండవలసిన నేత్రా లున్నాయి” అని మాత్రం చెప్పాడు. ఈ జవాబు నరేంద్రునికి తృప్తి కలిగించలేదు; అతడు నిరాశ చెందాడు.
అయినప్పటికీ నరేంద్రుడు కలత చెందలేదు. పలువురు సర్వజ్ఞులను, మత నాయకులను కలుసుకొని ఆతడు ఈ ప్రశ్నను అడుగుతూనే వచ్చాడు. కాని జవాబు మాత్రం లభించలేదు.
ధ్యానం పట్ల ఆసక్తి
కాని మహర్షిని కలుసుకోవడం నరేంద్రుని జీవితంలో ధ్యాన పురోగతికి సార్థకతను సంతరింపజేసింది. ఆ రోజు మహర్షి నరేంద్రునీ, ఆతడి మిత్రులనూ తన ప్రక్కన కూర్చోబెట్టుకొని కొన్ని ఉపదేశాలు చేశాడు. నిత్యం ధ్యానం అభ్యసించమని చెప్పాడు. నరేంద్రునిలో యోగి లక్షణాలు కానవస్తూన్నాయనీ, అతడు ధ్యానం అభ్యసిస్తే యోగశాస్త్రాలు పేర్కొన్న సత్ఫలితాలు సత్వరమే పొందగలడనీ కూడా తెలిపాడు. ఆ సలహా మేరకు నరేంద్రుడు ముందుకన్నా సమధికోత్సాహంతో ధ్యానం అభ్యసించ సాగాడు. తత్ఫలితంగా అనతికాలంలోనే ఆతడు అహోరాత్రాలు ధ్యానంలో మగ్నుడై గడపడం అలవరచుకొన్నాడు.
గొప్ప మలుపు
ఈ విధంగా ధ్యానంలో పరిపక్వత చెందుతూ, ఉన్నత స్థితులను అతడు అనుభూతం చేసుకోసాగాడు. అయినప్పటికీ తనకు మార్గదర్శకుడైన వ్యక్తి కోసం అన్వేషించడం మానుకోలేదు. నిజమైన ప్రయత్నం ఎన్నటికీ వృథాకాదు కదా! నరేంద్రుని ప్రయత్నం ఫలించే తరుణం రానేవచ్చింది. అది 1881 నవంబరు నెల. నరేంద్రుడు అప్పుడు ఎఫ్.ఏ. చదువుతున్నాడు. ఆంగ్ల ఉపాధ్యాయుడు సెలవులో ఉండడం వలన, నరేంద్రుని ఆంగ్ల సాహిత్య తరగతిని కళాశాల అధ్యక్షుడైన విలియం హేస్టీ తీసుకొన్నాడు. వర్డ్సవర్త్ రచించిన Excursion అనే కవిత నాటి పాఠ్యాంశం. అందులో బాటసారి ఒకడు ప్రకృతి రామణీయకతను అనుభవిస్తూ దాన్లో లయించిపోయి, పారవశ్య స్థితిని పొందిన ఘటనను ఆయన వివరిస్తున్నాడు.* పారవశ్య స్థితిని విద్యార్థులకు ఎలా అర్థమయ్యేలా వివరించడం? సామాన్య అనుభూతులు కూడా చవిచూడని వ్యక్తికి వివరించడం అసాధ్యం. ఉదాహరణకు, తీపి పదార్థమే రుచి చూడని వ్యక్తికి తీపి ఎలా ఉంటుందో వివరించగలమా? ఈ స్థితిలో, అతీంద్రియ అనుభూతులను వివరించడం సాధ్యమేనా?
హేస్టీకి ఠక్కున ఒక ఆలోచన స్ఫురించింది. పారవశ్య స్థితిని ఆయన పొందకపోవడం నిజమే. కాని పారవశ్య స్థితిని పదేపదే అనుభూతం చేసుకొం టున్న ఒక వ్యక్తిని గురించి ఆయనకు తెలుసు. ఆ వ్యక్తి శ్రీరామకృష్ణ పరమ హంస. వెంటనే హేస్టీ, విద్యార్థులతో, “ఈ అనుభూతి అపూర్వమైనది, ప్రత్యేకించి ఈ ఆధునిక కాలంలో మరీ అరుదు. మానసిక పవిత్రత, మానసిక ఏకాగ్రతల ఫలితంగా, దీర్ఘకాల అభ్యాస పర్యవసానంగా లభించే ఆనందానుభూతి అది. ఆ అద్భుత అనుభూతిని పొందిన ఒక వ్యక్తిని నేను చూసివున్నాను. దక్షిణేశ్వరంలో వసిస్తూన్న శ్రీరామకృష్ణ పరమహంసే ఆయన! మీరు కూడా ఆయనను దర్శించు కొంటే పారవశ్యం అంటే ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు” అని చెప్పాడు.
తన హృదయ తంత్రులను ఎవరో మీటినట్లు నరేంద్రునికి అనిపించింది. అంధకారం ఆవరించివున్న గదిలో దిక్కుతోచని వ్యక్తికి సన్నని రంధ్రం గుండా ఒక కాంతి కిరణం ప్రసరించి దారి చూసినట్లుగా అతడికి స్ఫురించింది!
మానవ జీవితంలో కొన్ని సమయాల్లో కొన్ని సంఘటనలు, కొన్ని ప్రేర ణలు, కొన్ని మాటలు ఒక గొప్ప మలుపును కల్పిస్తాయి. నిశ్చితార్థం నాడు భోజనాలకు ఆలస్యం కావడం సదాశివబ్రహ్మేంద్రులు రూపొందడానికి కారణ మయింది. నరేంద్రుని జీవితంలో అట్టి సంఘటనగా విరాజిల్లినవి శ్రీరామకృష్ణు లతో సమావేశమూ, తండ్రి మరణమూ. శ్రీరామకృష్ణులతో నరేంద్రుని సమావేశం దైవసంకల్పం! ఆ సమావేశాన్ని పరికించే ముందు శ్రీరామకృష్ణుల గురించి కాస్త తెలుసుకొందాం!