పాశ్చాత్యదేశాలలో విజయ దుందుభి మ్రోగించారనో, వేద వేదాంతాలు ఆయనకు కరతలామలకమనో, నేను మీ స్వామీజీకి ప్రణామాలర్పించడం లేదు. పేదల కోసమూ, పీడితుల అందరి కోసమూ ద్రవించి తల్లడిల్లిపోతున్న ఆయన హృదయాన్ని చూసే నేను ప్రణమిల్లుతున్నాను.
– గిరీష్‌చంద్ర ఘోష్
సన్న్యాసులకు శిక్షణ — ‘స్థాపకాయ చ’ — ‘భూకంపం కలిగించిన’ ప్రసంగం — నీలాంబర మఠం — అంటరానితన నిర్మూలనలో ప్రథమ ప్రయత్నం — పరమేశ్వరునిగా! — ఆరతి గీతం — శ్రీరామకృష్ణ జయంత్యుత్సవం — ‘ఇంగ్లండిచ్చిన మరో కానుక’ — మాతృదేవి ఆశీస్సుల కోసం — సోదరి నివేదిత — స్త్రీల కోసం మఠం — విశిష్టమైన మహాత్ముడు! — అగ్నిపర్వత ప్రమాదం — ప్లేగు నివారణ — సేవ చేయండి, పేరు, ఖ్యాతి వద్దు — ధర్మపాలునితో
సన్న్యాసులకు శిక్షణ
పాశ్చాత్యం నుంచి 1897 ఫిబ్రవరిలో కలకత్తాకు తిరిగి వచ్చాక మళ్లీ పాశ్చాత్య దేశాలకు 1899 జూన్ 20వ తేదీన బయలుదేరే వరకు దాదాపు రెండేళ్లు స్వామీజీ కలకత్తాలోనే ఉండిపోయారు. ఈ కాలఘట్టంలో రెండు యాత్రలు చేశారు. అల్మోరా మొదలైన చోట్లకు మొదటి యాత్ర పూర్తిచేసుకొని, 1898 జనవరి మాసాంతంలో కలకత్తాకు తిరిగి వచ్చారు. మే 11వ తేదీ దాకా కలకత్తాలోనే ఉండిపోయారు. ఈ రోజులను దాదాపు ఆయన మఠంలోనే గడిపారని చెప్పుకోవాలి. రాబోయే తరం సన్న్యాసులను రూపొందించడంలో ఆయన ఎంతో శ్రద్ధ వహించారు. వారితో ఎక్కువ కాలం గడిపారు. గీత, ఉపనిషత్తులు, చరిత్ర, విజ్ఞానశాస్త్రం లాంటి తరగతులు నిర్వహించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వారికి ప్రోత్సాహం కల్పించి, ఉపన్యాసాలు వారిచే ఇప్పించారు.
ఇంతలో స్వామీజీ ఖ్యాతి దేశమంతటా వ్యాపించడంతో ఆయన దర్శనార్థం అనేకులు రాసాగారు. శాశ్వతమయిన మఠం స్థాపించడంలో కూడా ఆయన శ్రద్ధ వహించవలసి వచ్చింది. అంతేగాక, రామకృష్ణ మిషన్ వారాంతపు సమావేశాల్లో పాల్గొన్నారు. అధ్యయనం చేశారు, లేఖలు వ్రాశారు, దీర్ఘకాలిక ధ్యానాలలో మగ్నులయ్యారు. శ్రీరామకృష్ణ భక్తుల ఇళ్లను పావనం చేసి వారి యోగక్షేమాలు విచారించారు.
‘స్థాపకాయ చ’
శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యులలో ఒకరు నవగోపాల్ ఘోష్. రామకృష్ణ పూర్లో జీవించిన ఆతడూ, ఆతడి భార్యయైన నిస్తారిణీ గురుదేవుల పట్ల అపరిమిత భక్తిప్రపత్తులు చెల్లించారు.* ఇద్దరూ తమ ఇంట్లో గురుదేవుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధించాలని అభిల షించారు. స్వామీజీయే ప్రతిష్ఠిస్తే గురుదేవులు అక్కడ కొలువై ఉండడం తథ్యమని విశ్వసించిన ఆ దంపతులు స్వామీజీతో తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. స్వామీజీ మనఃస్ఫూర్తిగా అందుకు అంగీకరించారు.
1898 ఫిబ్రవరి 6 వ తేదీ ఉదయం మఠం నుంచి తక్కిన సన్న్యాసులతో మూడు పడవలలో స్వామీజీ రామకృష్ణపూర్‌కు వెళ్లారు. కాషాయాంబరాలు, తలపాగా ధరించిన ఆయన పాదరక్షలు ధరించలేదు. మెడలో కోల్ వాయిద్యాన్ని వ్రేలాడదీసుకొని, భజన చేస్తూ అందరూ వెళ్లారు. “పేద బ్రాహ్మణి ఒడిలో ప్రాకే భగవాన్ నువ్వు ఎవరివో? లోకాన్ని జ్యోతిర్మయం గావించే ఉదాత్తుడా నువ్వు ఎవరివో?” అనే శ్రీరామకృష్ణుల గురించిన సుప్రసిద్ధ పాటను పాడుకొంటూ వారు పోతున్న దృశ్యాన్ని ప్రజలు దారి పొడవునా గుంపులు కట్టి చూడసాగారు. “లోక ప్రసిద్ధుడైన స్వామి వివేకానంద ఈయనేనా!” అన్న ఆశ్చర్యం వారి ముఖాలలో ద్యోతకమయింది.
అందరూ నవగోపాల్ ఘోష్ ఇంటిని చేరుకొన్నారు. పూజామందిరం అందంగా అలంకరింపబడింది; గచ్చు చలువరాళ్లతో తాపడం చేయబడింది. అక్కడ కాస్త ఎత్తయిన పీఠం మీద పింగాణీతో రూపొందించబడిన శ్రీరామకృష్ణుల విగ్రహం అమర్చి ఉంచారు. గదిలోని ఏర్పాట్లూ, స్వామీజీ సాన్నిధ్యమూ అక్కడ అద్భుతమయిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించాయి. స్వామీజీ అక్కడకు వెళ్లగానే, నిస్తారిణి ఆయనకు ప్రణమిల్లి, “ఏదో మా శక్తి మేరకు చేశాం. గురుదేవు లను మీరే ఇక్కడ కొలువుదీరేలా చేయాలి” అని వినమ్రంగా అడిగింది. అందుకు స్వామీజీ, “అమ్మా! మీ గురుదేవులూ సరి, ఆయన 14 తరాలూ సరి, ఇలాంటి చలువరాళ్లు పరచిన ఇంట్లో నివసించి ఉండలేదు. అతి సామాన్యమైన గుడిసెలో అతి నిరాడంబరులుగానే ఆయన జీవించారు. మీలాంటి నిర్మల మనస్కుల సేవను స్వీకరించి, ఇక్కడ కొలువుదీరకుండా మరెక్కడ కొలువుదీరతారు?” అన్నారు.
పిదప విభూతి అలదుకొని పూజారి ఆసనంలో కూర్చుని శ్రీరామకృష్ణులను అక్కడ కొలువుదీరమని హృదయపూర్వకంగా ప్రార్థించారు. ఆయన శిష్యుడయిన ప్రకాశానంద సముచిత మంత్రాలు ఉచ్చరించి పూజ నిర్వర్తించాడు. నేడు శ్రీరామకృష్ణుల ఆరాధనాగీతంగా అన్ని చోట్లా పారాయణం చేసే స్తుతి నాడు స్వామీజీ ధ్యానం నుండి ఆయన ముఖతః వెలువడింది:
ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే ।
అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః ॥
– “(సత్య) యుగధర్మాన్ని స్థాపించిన వారూ, మూర్తీభవించిన సమస్త ధర్మాలయిన వారూ, అవతారాలలో వరిష్ఠులైన వారూ అయిన శ్రీరామకృష్ణ దేవా మీకు ప్రణామాలు.”
‘భూకంపం కలిగించిన’ ప్రసంగం
మఠవాసులకు స్వామీజీ ఇచ్చిన శిక్షణలో ప్రసంగం చేయడం ఒకటి. తక్కిన మఠవాసుల ముందు ప్రసంగించాలి. గురుదేవుల శిష్యులూ ఇందుకు మినహాయింపు కారు. ఈ పద్ధతిలో ఒక రోజు సుబోధానంద ప్రసంగించ వలసి వచ్చింది. ఆయన ఇందుకు సమ్మతించ లేదు. ఎన్నో కుంటిసాకులు చెప్పాడు. కాని ఏవీ స్వామీజీ ముందు పనిచేయలేదు. ప్రసంగించే తీరాలని స్వామీజీ నిష్కర్షగా చెప్పేశారు.
ఖోఖా* మహరాజ్ ప్రసంగం ఆలకించడానికి అందరూ సమావేశమయ్యారు. అందరూ ఆతురతతో ఎదురుచూస్తున్న ప్రసంగ సమయం ఆసన్నం కాసాగింది. సుబోధానంద ఇక విధి లేక లేచాడు. ఇంకా మాట్లాడ నారంభించలేదు. ఇంతలో మఠం కంపించసాగింది. బయట చెట్లు కూకటివేళ్లతో సహా ఒరిగిపోయి నేల మీద వ్రాలుతున్న శబ్దం చెవులను బ్రద్దలు చేయసాగింది. అది – 1898 జూన్ 12వ తేదీ వంగదేశంలో సంభవించిన భయంకర భూకంపం!
అందరూ బయటకు పరుగెత్తి వెళ్లి వీథిలో గుంపుగా నిలబడ్డారు. నిర్మలా నంద మాత్రం, నిత్యపూజలందుకొంటున్న గురుదేవుల చిత్తరువునూ, ఆయన పావన అస్థికలు పదిలపరచిన పెట్టెనూ ఛాతీకి హత్తుకొని, “జై శ్రీరామకృష్ణ!” అంటూ అక్కడే నిలబడిపోయాడు. “ఖోఖా భూకంపం సృష్టించేటట్లు కదా ప్రసంగించాడు!” అని వ్యాఖ్యానిస్తూ స్వామీజీ నవ్వసాగారు. అందరూ ఆ నవ్వుతో జత కలిపారు.
నీలాంబర మఠం
ఆలంబజార్ మఠం అప్పటికే శిథిలావస్థకు దిగజారి అన్ని విధాల ‘దయ్యాల కొంప’ గా సార్థక నామధేయం పొందింది. ఆ ఇంట్లో ఇకపైన బస చేయడం ప్రమాదానికి దారితీస్తుందనే స్థితికి ఈ భూకంపం ఛేదాన్ని కలిగించింది. అంతేకాదు శాశ్వత మఠ నిర్మాణానికై అప్పటికే బేలూరులో స్థలం కొనుగోలు చేసివున్నారు. ఆ స్థలానికి సమీపంలో ఉండడం మఠ నిర్మాణ పనులకు అనుకూలంగా ఉంటుందన్న కారణం వలన మఠాన్ని ఆ ప్రాంతానికి మార్చాలని నిశ్చయించారు. కొనుగోలు చేసిన స్థలం సమీపంలోని నీలాంబర ముఖర్జీ ఇంటికి 1898 ఫిబ్రవరి 13వ తేదీన తాత్కాలికంగా మఠాన్ని మార్చారు. మాతృదేవి ఈ ఇంట్లో చాలాకాలం నివసించారు; ‘పంచతపస్సు’* అనే కఠోర వ్రతాన్ని కూడా ఇక్కడే అనుష్ఠించారు. ఈ రకంగా ఈ ఇల్లు* పావనత్వాన్ని సంతరించుకొంది.
ఫిబ్రవరి 19వ తేదీ మహాశివరాత్రి పర్వదినం. స్వామీజీకి ఇది ఆనందం ఇనుమడించిన రోజుగా పరిణమించింది. ఎందుకంటే అనేక ప్రాంతాల నుండి కార్యాచరణ ప్రగతి గురించిన వార్తలు ఆయనకు అందాయి. శివానంద శ్రీలంక నుండి తిరిగి వచ్చారు. త్రిగుణాతీతానంద దినాజ్పూర్లో సహాయ పునరావాస కార్యాలను చక్కగా నిర్వర్తించి తిరిగి వచ్చారు. బ్రహ్మానంద నేతృత్వంలో మఠ నిర్వహణ, కార్యక్రమాలు తృప్తికరంగా కొనసాగుతూ వచ్చాయి. యువ సన్న్యాసు లకూ, బ్రహ్మచారులకూ తురీయానంద శిక్షణనిచ్చే తీరుతెన్నులు సంతృప్తి కలిగించాయి. కనుక మహాశివరాత్రి మధ్యాహ్నం చిన్న సమావేశాన్ని ఏర్పాటుచేసి, స్వామీజీ అందరినీ ప్రశంసించారు.
కానీ ఆ మహాశివరాత్రి పర్వదినాన కనీసం ఒక్కరు కూడా ఉపవాసం చేయకపోవడం స్వామీజీకి చాలా బాధ కలిగించింది. రాత్రి భోజన సమయంలో శుద్ధానందతో, “నువ్వు ఉపవాసం ఉండగలవా?” అని స్వామీజీ అడిగారు. “ఉండగలను” అనగానే, ఆతణ్ణి ఉపవాసం చేయమన్నారు. అయినప్పటికీ ఆతడి ఆరోగ్యదృష్ట్యా పండ్లు మాత్రం పుచ్చుకోవడానికి అనుమతించారు.
అంటరానితన నిర్మూలనలో ప్రథమ ప్రయత్నం
ఫిబ్రవరి 22వ తేదీ శ్రీరామకృష్ణుల జయంతిని ఒకింత విభిన్నంగా స్వామీజీ జరిపించాలనుకొన్నారు. అది, అంటరానితన నిర్మూలనలో ఒక ప్రయత్నం! “మనో నైజం నుండి ఉద్భవించిన గుణాలకు అనుగుణంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల పనులు వర్గీకరింపబడ్డాయి.”* చింతనాశీలి బ్రాహ్మణుడు, కార్యశీలి క్షత్రియుడు, ఆర్జనా పరుడు వైశ్యుడు, ఆజ్ఞలు పాటించేవాడు శూద్రుడు. సమాజ వ్యవస్థ ఒడుదొడుకులు లేకుండా సాఫీగా సాగడానికి పై నాలుగు వర్గాల వారి భాగస్వామ్యం అత్యవసరం. ఈ వ్యవస్థలో వ్యక్తిగత మనిషి నైజమే పరిగణన క్రిందికి వస్తుంది. పుట్టుకతో బ్రాహ్మణునికి జన్మించిన వాడు బ్రాహ్మణుడు, శూద్రునికి జన్మించినవాడు శూద్రుడు కాడు. బ్రాహ్మణునికి జన్మించినవాడు ఆ అర్హత లోపం వలన శూద్రుడై ఉండవచ్చు. అదే విధంగా శూద్రునికి జన్మించిన వాడు తన అర్హత కారణంగా బ్రాహ్మణుడై కూడా ఉండవచ్చు.
ఈ తారతమ్యాలు సమాజ వ్యవస్థ చక్కగా పురోగతి గాంచడానికి మన పూర్వీకులూ, శాస్త్రాలూ చూపిన దారి అవుతుంది. కాని కాల ప్రవాహంలో కొన్ని భావనలు మెరుగుపడుతున్నవి, కొన్ని భావనలు మందగిస్తున్నాయి. మన పూర్వీకుల సమాజ వర్గీకరణ రెండవ కోవకు చెందుతుంది. “మనో నైజానికి” అనుగుణంగా మనుషులను వర్గీకరించడం పోయి, పుట్టుక ద్వారా వారి అర్హతలు పరిగణనకు వచ్చాయి. స్వామీజీ కాలంలో ఈ వర్గీకరణ భావన అట్టడుగుకు చేరుకొంది. అందుకే, “మన మతం వంట గదిలో ప్రవేశించింది. వంట కుండ మన ‘ఇష్టదేవతై’ వెలసింది. ‘నేను పరిశుద్ధుణ్ణి, నన్ను తాకకు’ అనే పలుకులే మహావాక్యాలై పోయాయి. ఈ స్థితే మరొక శతాబ్ద కాలం సాగితే మనలో ప్రతి వ్యక్తీ పిచ్చి ఆసుపత్రిలో చేరవలసి ఉంటుంది”* అంటూ స్వామీజీ ఆగ్రహంతో వచించారు. కేవలం మాటలతో ఆగిపోయే వైఖరి కాదు ఆయనది. దానిని సంస్కరింప సాహసించారు.
అందుకోసం శ్రీరామకృష్ణుల జయంతి మహోత్సవాన్ని ఎంపిక చేసుకొ న్నారు. శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యులు కొందరితో తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు; బ్రాహ్మణేతరులకు ఆ రోజు ఉపవీతం ధరింపజేసి, గాయత్రీమంత్రం ఉపదేశించి, బ్రాహ్మణులుగా రూపొందింపబడతారని తెలియజేశారు. అందుకోసం జయంతి పర్వదినాన 50 మంది వచ్చారు. వారు గంగలో స్నానమాచరించి, శ్రీరామకృష్ణులకు మ్రొక్కి, ఉపవీతం ధరించారు. వారికి గాయత్రీ మంత్రోపదేశం చేశారు. నిత్యం నూరుసార్లయినా ఆ మంత్రం జపించాలని స్వామీజీ చెప్పారు.
అక్కడొక తమాషా జరిగింది. వచ్చినవారికి శరశ్చంద్ర గాయత్రీమంత్రం ఉపదేశించాడు. స్వామీజీ ఎరుపు శాలువా కప్పుకొని ప్రక్కనే నిలబడి హుక్కాతో పొగ త్రాగుతున్నారు. నాడు ఉపదేశం పొందిన వారిలో ఒకరయిన హరిచరణ్ మల్లిక్ ఇలా వ్రాస్తున్నాడు: “చూడడానికి ఆయన పొగ త్రాగుతున్నారు. కానీ ఆయన కళ్లను చూసినప్పుడు ఆయన అంతర్ముఖులై ఉన్నట్లు తెలియవచ్చింది. ఆత్మలో సుప్రతిష్ఠితులై ఆ ఆనందంలో లయించిపోతున్నారు. ఏం మాట్లాడకుండా మాలో శక్తిని ప్రసరింపజేస్తున్నారని మాకు అవగతమయింది.”
క్రతువు ముగిసింది. అక్కడ ఉపనిషత్తులు, శ్రీభాష్యం లాంటి శాస్త్ర గ్రంథాలు ఒక వస్త్రంతో చుట్టబడి ఉన్నాయి. స్వామీజీ వాటిని తీసి, ప్రతి ఒక్కరి తల మీద ఆ గ్రంథాలను తాకించారు. పిదప, “నేటి నుండి మీకు వేదాధ్యయనానికి అనుజ్ఞ నిస్తున్నాను” అన్నారు. స్వామీజీ స్వయంగా ప్రతి ఒక్కరికీ ఉపవీతం ధరింపజేశారు.
ఆనాటి కుల నియమాల నేపథ్యంలో చూసినప్పుడు ఈ సంఘటన సాహసో పేతమైన సోపానంగా పేర్కొనడంలో ఎలాంటి సందేహమూ లేదు. తాము చెప్పింది చేసి చూపించగలనని స్వామీజీ నిరూపించిన ఒక సంఘటన ఇది. కాని ఇది ఒక ఆదర్శమో, తదనంతరం అనుసరింపదగినదో కాదు.
పరమేశ్వరునిగా!
ఉపనయన కార్యక్రమం ముగిసిన తరువాత మఠంలోని సన్న్యాసులు స్వామీజీని పరమేశ్వరునిగా అలంకరించారు. శరీరమంతా విభూతి రేఖలు అలదినారు. జటాజూటాన్ని, చెవులకు కుండలాలను ధరింపజేశారు. రుద్రాక్షమాలలు వేశారు. ఎడమ చేతిలో త్రిశూలాన్ని ఉంచారు. ఈ విధంగా నాడు స్వామీజీ సజీవ శివునిగా కానవచ్చారు. స్వామీజీ ‘శివాంశ’ మని సాక్షాత్తు శ్రీరామకృష్ణులే ఉద్ఘాటించి ఉన్నారు. “నువ్వు శివుడివి, నేను శక్తిని” అని ఆయన అనేకసార్లు స్వామీజీతో వచించడం కద్దు. స్వామీజీ కూడా చిన్నతనం నుండే పరమేశ్వరుని పట్ల అచంచల భక్తి కలిగిఉండడం మనం ఇంతకు క్రితమే చూశాం. స్వామీజీ పరమేశ్వరునిగా పద్మాసనంలో ఆసీనులై ఉన్నారు. ఆయన అర్ధనిమీలిత నేత్రులైనారు. చేత తంబూరా పుచ్చుకొని మీటుతూ శ్రీరాముని గురించిన ఒక పాట పాడారు. ఆ తరువాత అరగంట సేపు అక్కడ ప్రగాఢ ప్రశాంతత రాజ్యం చేసింది. తదనంతరం స్వామీజీ విరచిత ‘సృష్టి’* గీతాన్ని శారదానంద పాడారు. ఆ పాటకు స్వామీజీ పక్వాజ్* వాయించారు.
పాటలు పూర్తయ్యాక స్వామీజీ తమ అలంకారాన్ని తొలగించి, ప్రక్కనే ఉన్న గిరీష్‌కు ధరింపచేశారు. “గిరీష్ భైరవాంశ సంభూతుడని గురుదేవులు చెప్పడం కద్దు. కనుక మనకూ ఆయనకూ తారతమ్యం లేదు.”* అంటూ, గురుదేవుల గురించి ఏదన్నా గిరీష్‌ను చెప్పమన్నారు. భక్తితో గిరీష్ పులకించిపోయాడు. “కారుణ్యమే మూర్తీభవించిన మన ప్రభువు గురించి ఏం చెప్పగలను! నా లాంటి అనర్హుడు, నేడు పునీతులయిన మీ ప్రక్కన కూర్చుని ఉన్నాడంటే అది ఆయన అవధుల్లేని అనుగ్రహం కాక మరేమిటి!” అన్నాడు గిరీష్.
నాడు నాగమహాశయ్ రాగానే స్వామీజీ ఆనందం కట్టలు తెంచుకొంది. ముషీరాబాద్‌లో అనాథ శరణాలయం నిర్వహిస్తున్న అఖండానంద కూడా వచ్చివున్నారు.
ఆరతి గీతం
నాటి కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామీజీ శ్రీరామకృష్ణుల గురించి క్రొత్తగా రచించిన, “ఖండన భవబన్ధన….” అనే గీతం సాయంత్రం ఆరతి సమయంలో గానం చేశారు.* స్వామీజీ పాడడం గురించి శివానంద ఇలా వ్రాస్తున్నారు: “ఈ ఆరతి గీతాన్ని స్వామి వివేకానంద రచించడంతో పాటు రాగాన్ని కూడా ఆయనే స్వరకల్పన చేశారు. సాయంత్రం ఆరతి సమయాల్లో మృదంగం వాయిస్తూ, ఆయన ఈ గీతాన్ని భక్తులతో కలసి, మైమరచి పాడేవారు. ఆహా, ఎంతటి అద్భుతమయిన దృశ్యం అది! హృదయాన్ని దోచుకొనే ఆయన కంఠస్వరమూ, పాట లయ కలగలసి అక్కడ ఒక క్రొత్త దివ్యలోకాన్నే రూపొందిస్తుంది!”
శ్రీరామకృష్ణ జయంత్యుత్సవం
ఫిబ్రవరి 27వ తేదీ ఆదివారం శ్రీరామకృష్ణ జయంతి. దక్షిణేశ్వరంలో తమకు అనుమతి నిరాకరించడం వలన మఠం నిమిత్తం బేలూరులో కొనుగోలు చేసిన స్థలంలో ఉత్సవం జరిపించాలని స్వామీజీ నిశ్చయించు కొన్నారు. కానీ అనేక కారణాల వలన స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం కుదరలేదు. కనుక దానికి ప్రక్కనున్న మరో స్థలంలో ఉత్సవం జరుపుకొన్నారు. ఆ సమయంలో భారతదేశానికి వచ్చిన మిస్ ముల్లర్, మిసెస్ సారా, మిస్ మెగ్లౌడ్, మిస్ నోబెల్‌లు ఆ ఉత్సవంలో పాల్గొనడం విశేషం.
‘ఇంగ్లండిచ్చిన మరో కానుక’
ఈ పాశ్చాత్య స్త్రీలలో మిస్ నోబెల్ రాక ప్రాధాన్యం వహించింది. స్వామీజీ భావనలను స్వీకరించి, భారతీయ స్త్రీల ఉద్ధరణ కార్యానికై ఆమె భారతదేశానికి వచ్చారు. ఆమె తన అభిలాషను వ్యక్తం చేసినప్పుడు స్వామీజీ, “భారత దేశాభ్యుదయ కార్యక్రమంలో నీకు గొప్ప భవిష్యత్తు ఉందని నా కిప్పుడు దృఢ నమ్మకం కలిగిందని నీకు మనఃస్ఫూ ర్తిగా చెబుతున్నాను. కావలసింది పురుషుడు కాదు, స్త్రీ. భారతీయ జనోద్ధరణకై, అందునా ముఖ్యంగా స్త్రీలకై కావలసింది యథార్థమైన ఒక సివంగి. భారతదేశం ఇంతవరకు గొప్ప స్త్రీలను ఉద్భవింపజేయలేదు. ఇతర దేశాల నుండి వారిని అరువు తెచ్చుకోవలసి ఉంది. నీ విద్యాబుద్ధులు, భావసంశుద్ధి, నైర్మల్యం, అఖండ ప్రేమానురాగాలు, పట్టుదల, అన్నింటికన్నా ముఖ్యంగా నీలోని వీర (Caltic) రక్తం నిన్ను మాకు కావలసిన వ్యక్తిగా రూపొందిస్తున్నాయి”* అని స్వామీజీ స్వయంగా వ్రాశారు. అదే సమయంలో సమాజ పరిస్థితి, కాలస్థితి లాంటివి తెలియజెప్పి, ఆమెను హెచ్చరించారు కూడా. ఏ కష్టాలు వాటిల్లినా ఎదుర్కొంటా నని ఆమె చెప్పినప్పుడు, ఆమెను రెండు చేతులా చాచి స్వామీజీ ఆహ్వానించారు. ఆ విధంగా నోబెల్ భారతదేశానికి వచ్చింది. ఆమె కలకత్తా చేరుకొన్నప్పుడు ఆమెకు స్వాగతం పలుకడానికి నౌకలోకి స్వయంగా స్వామీజీయే వెళ్లారు. అప్పటికే వచ్చివున్న స్త్రీల బృందంలో నోబెల్ చేరిపోయింది. వారు బేలూరులో క్రొత్తగా కొనుగోలు చేసిన స్థలానికి ప్రక్కన ఉన్న ఒక పాత భవనానికి మరమ్మతులు చేసుకొని అక్కడ నివసించసాగారు. తరువాత తక్కిన స్వామీజీ పాశ్చాత్య శిష్యులు ప్రసంగించారు.
మాతృదేవి ఆశీస్సుల కోసం
నోబెల్ తమ కార్యాలకు శ్రీకారం చుట్టడానికి ముందు మాతృమూర్తి శ్రీ శారదాదేవి ఆశీస్సులు ఆమె పొందాలని స్వామీజీ అభిలషించారు. కనుక మార్చ్ 17వ తేదీన పాశ్చాత్య స్త్రీలను మాతృదేవి వద్దకు తోడ్కొని వెళ్లారు. మాతృదేవి వారిని ఆప్యాయతానురాగాలతో ఆదరించి, వారిని తమ ప్రక్కన కూర్చోబెట్టుకొని, వారితో కలసి భోజనం చేశారు. సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన మాతృదేవి, “మ్లేచ్ఛులు” అని పరిగణింపబడిన పాశ్చాత్య స్త్రీలను స్వీకరించడం, తమ కార్యా చరణ ప్రారంభ విజయంగా స్వామీజీ భావించారు. “మాతృదేవి ఇక్కడ ఉన్నారు. ఐరోపా స్త్రీలు, అమెరికన్ స్త్రీలు ఆమె దర్శనానికై వెళ్లారు. ఏమనుకొన్నావు? అమ్మ అక్కడ వారి ప్రక్కన కూర్చుని భుజించారు! ఇది అద్భుతంగా లేదా?”* అని రామకృష్ణానందకు స్వామీజీ వ్రాశారు.
సోదరి నివేదిత
మార్చ్ 25వ తేదీన మిస్ నోబెల్‌కి బ్రహ్మచర్య దీక్ష నిచ్చారు. ఆమెను పూజామందిరంలోకి తోడ్కొని వెళ్లారు. దీక్షకు అవసరమైన క్రతువులు ఆచరిం చారు. ఆమెకు ‘సోదరి నివేదిత’ అని నామధేయం ఇచ్చారు. తరువాత చేతుల్లో పువ్వులు తీసుకొని అక్కడ ఉన్న బుద్ధుని విగ్రహానికి ఆమెను సమర్పించమన్నారు. ఈ విధంగా ఆ కార్యక్రమం ముగిసింది. మిస్ మార్గరెట్ నోబెల్ కాస్తా, ‘సోదరి నివేదిత’ (అర్పితమైనది) అయింది.
కాని ఒక సన్న్యాసిని కావాలనే ఆసక్తి నివేదితకు లేకపోలేదు. 1899 మార్చ్‌లో ఆమెకు ‘నైష్ఠిక బ్రహ్మచారిణి’ దీక్షను స్వామీజీ అనుగ్రహించారు. అయిన ప్పటికీ సన్న్యాస దీక్షనివ్వలేదు. ఏప్రెల్ నెల స్వామీజీ అస్వస్థులై పడకబెట్టినప్పుడు నివేదిత ఆయన వద్దకు పోయి, “స్వామీజీ, సన్న్యాసదీక్ష పొందడానికి నాకు ఇంకా ఏం అర్హత ఉండాలి?” అని అడిగింది. “నువ్వున్న స్థితిలోనే ఉంటే చాలు” అన్నారు స్వామీజీ. నివేదిత చివరి దాకా నైష్ఠిక బ్రహ్మచారిణిగానే జీవించింది. కాలాంత రంలో అమెరికాలో రిట్జ్లీ మేనర్లో విడిది చేసివున్నప్పుడు నివేదితకూ, సారాకూ కాషాయాంబరాలు ఇచ్చారు స్వామీజీ. వాటిని నివేదిత ధ్యాన సమయంలో ధరించేది. సాధారణంగా ఆమె ఒక రకమైన పసుపురంగు దుస్తులు ధరించేది.*
స్త్రీల కోసం మఠం
పురుషుల కోసం ఒక మఠం నెలకొల్పాలని నిశ్చయించుకొన్నట్లే స్త్రీలకూ అదే తీరులో ఒక మఠం నెలకొల్పాలని స్వామీజీ అభిలషించారు. పురుషుల మఠం ఎలా నిర్వహించబడాలో, దాని నియమ నిబంధనలు ఎలా ఉండాలో వివరించి, లండన్ నుండి బ్రహ్మానందకు స్వామీజీ ఒక లేఖ వ్రాశారు. దానిలో, “గౌరీమా, యోగీన్ మా ప్రభృతులకు ఈ ఉత్తరం చూపించి, వారి ద్వారా స్త్రీలకు ఇటువంటి ఒక మఠాన్ని నెలకొల్పండి. గౌరీ – మాను ఒక సంవత్సరం దానికి అధ్యక్షురాలిగా చేయండి. తరువాత దాని ననుసరించి తక్కిన ఏర్పాట్లు చేయవచ్చు. కాని మీలో ఎవరూ అక్కడకు వెళ్లకూడదు. తమ పనులన్నింటినీ స్వయంగా వారే నిర్వర్తించు కొంటారు” అని తమ అభిలాషను వ్యక్తంచేశారు. పురుషుల మఠం ప్రారంభించ డానికి మునుపే స్త్రీల మఠమే రూపొందాలని మొదట్లో స్వామీజీ తలంచకపోలేదు. “ముందుగా మాతృదేవి కోసం (శ్రీ శారదాదేవి) మఠం నిర్మించాలి. మొదట మాతృదేవి, ఆమె కుమార్తెలే, తరువాతే తండ్రీ, తనయులూ – అర్థమవుతోందా?” అని శివానందకు స్వామీజీ వ్రాశారు.
కానీ స్వామీజీ ఈ ప్రయత్నం అప్పుడు నెరవేరలేదు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చు. అయినప్పటికీ మాతృదేవి సన్నిహిత సేవకులలో ఒకరూ, శ్రీరామకృష్ణులచే ఈశ్వరకోటిలో ఒకరుగా పరిగణింపబడినవారూ అయిన యోగానంద భావన ఒక ముఖ్యకారణమయింది. స్వామీజీ ప్రణాళికలనూ, ఉత్సుక తనూ గ్రహించిన తరువాత యోగానంద ఆయనతో ఇలా చెప్పాడు: “సమాజానికి ఏది శ్రేయస్కరమని నువ్వు భావిస్తున్నావో దానిని నిస్సంకోచంగా నిర్వర్తించు. కాని సోదరా, దయచేసి మాతృదేవిని ఇప్పుడు ప్రజా జీవితంలోకి దింపవద్దు. జనసామాన్యం అధికంగా రాసాగితే తమ దేహం ఎక్కువ రోజులు నిలబడదని గురుదేవులు వచించడం నువ్వు మరచిపోయి ఉండవు. మాతృదేవి విషయంలోనూ దానిని అట్లే అన్వయించుకోవచ్చు.” యోగానంద మాట్లాడడం పూర్తికాగానే స్వామీజీ చిరునవ్వుతో, “గురుదేవుల వచనాలు జ్ఞప్తికి తెచ్చి సముచిత సమయంలో విషయాన్ని స్పష్టంచేసి, ఒక మంత్రిగా వ్యవహరించావు. నేను మాతృదేవిని ఇబ్బందిపెట్టను. తమ సంకల్పం మేరకు ఆమె పనులు చేస్తారుగాక! ఆమెను ఆదేశించడానికి మనం ఎవరం? ఆమె ఆశీస్సులతో కదా మన కార్యాచరణ సాగు తున్నది! మాతృదేవి ఆశీస్సుల శక్తి నాకు తెలియంది కాదు. అది అద్భుతాలను చేయగలదు” అన్నారు.
ఈ సంఘటన అనంతరం స్త్రీల మఠ మనే భావనను మాతృదేవి సంకల్పా నికే వదలివేశారు.*
విశిష్టమైన మహాత్ముడు!
మార్చ్ 29వ తేదీన స్వామీజీ ఇద్దరు యువకులకు సన్న్యాసదీక్ష ఒసగారు. వారు సురేంద్రనాథ్ బోస్ (సురేశ్వరానంద), అజయ్ హరి బెనర్జీ (స్వరూపానంద). స్వామీజీ ఆరోగ్యం బాగా క్షీణించడం గమనించి ఆయనను డార్జిలింగ్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకోమని విజ్ఞప్తి చేశారు. ఆయనకు అంతగా ఇష్టం లేకపోయినప్పటికీ, మఠవాసుల ఆకాంక్ష ప్రకారం మార్చ్ 30వ తేదీన డార్జిలింగ్ వెళ్లారు. అక్కడ ఒక నెల విశ్రాంతి తీసుకోవడంతో ఆయన ఆరోగ్యం బాగా పుంజుకొంది.
కాని, “స్వామీజీ ఉత్సాహంగానే ఉన్నారు. హఠాత్తుగా ఒక రోజు ఉదయం ఆయన ప్రగాఢ మౌనగాంభీర్యాలు దాల్చారు. ఆ రోజు పూర్తిగా ఆయన ఏమీ తినలేదు; ఎవరితోనూ మాట్లాడలేదు. డాక్టర్‌ను రావించారు. కాని ఆయన కూడా స్వామీజీ రుగ్మతను కనుగొనలేకపోయాడు. తలను తలగడ మీద ఆనించి రోజంతా ఆయన అట్లే కూర్చుండిపోయారు. చివరికి ప్రశాంతంగా ఇలా అన్నారు: ‘మనం వారికి సేవ చేసి తీరాలి. సమస్తమూ తెగనమ్మినా ఫరవాలేదు. తిరుగాడుతూ చెట్ల క్రింద నివసించవలసిన సన్న్యాసులమే కదా మనం! వారి సేవకై సమస్తమూ తెగనమ్మి చెట్ల క్రిందే నివసిద్దాం.’ అప్పుడే స్వామీజీ మౌనానికి కారణం అర్థ మయింది – కలకత్తాలో ప్లేగు వ్యాధి వ్యాపించసాగింది, అనేకులు ఆ వ్యాధికి బలి అయ్యారు” అని వ్రాస్తున్నారు స్వామీజీతో పాటు డార్జిలింగ్ వెళ్లివున్న అఖండా నంద. ఆపైన స్వామీజీ డార్జిలింగ్‌లో ఉండలేకపోయారు. అదే స్వామీజీ!
స్వామీజీని తక్కిన మహాత్ముల నుండి విశిష్టంగా కనబరచే వాటిలో ముఖ్యమైనది ఆయన అపార కారుణ్యం అనడం అతిశయోక్తి కాదు. తోటి మనుషుల కోసం ఇంతగా ద్రవించిపోయే వ్యక్తిని చూడడం అరుదు. బీదసాదలకు, పామరులకు, కష్టాల్లో అలమటించిపోయే వారికి ఏదైనా సాయం చేయాలని ఆయన హృదయం తల్లడిల్లిపోయేది. వారిని తలచుకొని ఆయన విలపించారు. ఈ రోజులు అందుకు నిదర్శనం.
స్వామీజీ పేదల కోసమూ, కష్టాలు అనుభవించేవారి కోసమూ తల్లడిల్లా రంటే అది కారుణ్యం కారణంగా కాదు. స్వామీజీ స్థితి దానికన్నా అత్యున్నత మయినది. ఆయన స్థితిని ‘విశ్వాత్మ బోధం’ అని అఖండానంద అభివర్ణిస్తారు. అంటే సమస్త ప్రాణకోటీ తాననే భావించే – అత్యున్నత స్థితి అది. కనుక ఎవరు దుఃఖీంచినా అది ఆయనను తల్లడిల్లజేస్తుంది. ఆ దుఃఖాలను ఆయన స్వయంగా తనవేనని అనుభూతం చేసుకొన్నారు. ఇందుకు ఉదాహరణగా బేలూరు మఠంలో జరిగిన ఒక సంఘటన గురించి విజ్ఞానానంద ఇలా చెబుతున్నారు:
అగ్నిపర్వత ప్రమాదం
“బేలూరు మఠంలో ఒక రోజు రాత్రి రెండు గంటలయివుంటుంది. హఠాత్తుగా స్వామీజీ నిద్ర నుంచి లేచి వసారాలో పచార్లు చేయసాగారు. అప్పుడు నేను ఆయనను సమీపించి, ‘ఏమిటి స్వామీజీ, నిద్ర పట్టడం లేదా?’ అని అడిగాను. అందుకు ఆయన, ‘ఇలా చూడు నాయనా! మంచి నిద్రలోనే ఉన్నాను. హఠాత్తుగా ఎవరో నన్ను పట్టుకొని త్రోస్తున్నట్లుగా ఉండడంతో, నిద్ర నుంచి లేచాను. ఎక్కడో ఏదో ప్రమాదం సంభవించింది, అందువలన అనేకులు దుఃఖీస్తున్నారని అనిపిస్తోంది’ అన్నారు. ‘ఎక్కడో ఏదో ప్రమాదం సంభవించిందట, ఈయనకు నిద్రాభంగమ యిందట! ఇది సంభవమా!’ అని నాకు అనిపించింది. నాలో నేనే నవ్వుకున్నాను. కానీ ఆశ్చర్యం! మర్నాడు వార్తాపత్రికలో దిగ్భ్రాంతి కలిగించే వార్త వెలువడింది–
“స్వామీజీకి నిద్రాభంగమయిన అదే రెండు గంటల సమయంలో ఫిజీ సమీపంలోని ఒక దీవిలో అగ్నిపర్వతం బ్రద్దలవడంతో అనేకులు మృతి చెందారు, అనేకులు గృహాలు కోల్పాయారు, ఎంతో నష్టం సంభవించింది. వార్త చదివి నేను విస్తుపోయాను. భూకంపం తెలిపే పరికరం కన్నా స్వామీజీ నాడీవ్యవస్థ నిర్దుష్టంగా ఉంది! మనిషి ఏ దేశంలో ఎక్కడో దుఃఖాలు అనుభవించినప్పటికీ అది ఆయన నాడీవ్యవస్థను దహించివేసింది!”
ప్లేగు నివారణ
మే 3వ తేదీన స్వామీజీ కలకత్తా చేరుకొన్నారు అప్పుడు కలకత్తా మరణభీతితో గడ్డకట్టుకుపోయి ఉంది. ప్రజలు తండోపతండాలుగా నగరం వదలి బయటకు పోతున్నారు. కలకత్తాకు వచ్చిన రోజే వ్యాధి వ్యాపించకుండా ఎలా నిరోధించాలో, ఇటువంటి సమయాల్లో భగవంతుని దివ్యనామాన్ని ఉచ్చరించడం ఎలా ప్రయోజన కారిగా ఉంటుందోనని ఒక కరపత్రం రచించి దానిని వంగ భాషలోనూ, హిందీ లోనూ ముద్రించి ప్రజలకు పంచిపెట్టడానికి స్వామీజీ ఏర్పాటుచేశారు. ప్లేగు వ్యాధి ప్రకటన పత్రిక అనడం కన్నా దీనిని స్వామీజీ హృదయ ప్రకటన పత్రిక అంటే సబబుగా ఉంటుంది:
కలకత్తా సోదరులారా!
1. మీరు ఆనందంగా ఉంటే మేం కూడా ఆనందంగా ఉంటాం, మీరు దుఃఖీస్తే మేము కూడా దుఃఖీస్తాం. దుర్భరమైన ఈ కాలఘట్టంలో మేం మీ కోసం ఎడతెగకుండా ప్రార్థిస్తున్నాం; ఈ అంటువ్యాధి భయం నుంచి మీరు విముక్తి చెందడానికే, మిమ్మల్ని ఈ వ్యాధి నుంచి కాపాడడానికే మేం ఒక సులభమైన మార్గం గురించి యోచిస్తున్నాం.
2. ప్రాణాంతక వ్యాధి చూసి భీతి చెంది అగ్రకులస్థులూ, నిమ్నకులస్థులూ, ధనవంతుడూ, పేదవాడూ అంటూ సర్వులూ నగరం వదలి పారిపోతున్నారు. ఈ వ్యాధి మనకు నిజంగా సంక్రమిస్తే మీకు సేవలందించడంలోనూ, శుశ్రూష చేయడంలోనూ మేం నశించినప్పటికీ అదొక గొప్ప వరంగా భావిస్తాం. ఎందు కంటే మీరందరూ భగవత్స్వరూపులు. ఆహంకారం, మూఢనమ్మకం, అజ్ఞానం కారణంగా మిమ్మల్ని మరో విధంగా భావించేవాడు భగవంతునికే ద్రోహం చేసినవాడవుతాడు. తద్ద్వారా మహాపాపానికి లోనవుతాడు. దీన్లో కించిత్తు కూడా సందేహం లేదు.
3. కారణరహితమైన భయంతో ఆరాటం చెందవద్దని మిమ్మల్ని వినమ్రంగా వేడుకొంటున్నాం. భగవంతుణ్ణి నమ్ముకోండి. సమస్యను సంబాళించుకోవడానికి మంచి మార్గం కనుగొనడానికి ప్రశాంతంగా ప్రయత్నించండి. లేకపోతే అలా కార్యమగ్నులయ్యే వారితో సహకరించండి.
4. భయ మెందుకు? ఈ వ్యాధి కారణంగా ప్రజలలో తలెత్తిన భయానికీ ఎలాంటి నిజానికీ ఆధారమూ లేదు. నిజం చెప్పాలంటే ప్లేగు వ్యాధి ఉద్ధృతంగా కలకత్తాలో చెలరేగలేదు. భగవంతుని సంకల్పమే అందుకు కారణం. ప్రభుత్వం మనకు చాలా సహాయకారిగా ఉంది. కనుక భయ మెందుకు?
5. రండి. భగవంతుని అనంత కారుణ్యం పట్ల నమ్మకం ఉంచుకొని, ఈ మిథ్యా భయన్ని వదలివేద్దాం. ఆయన అనుగ్రహం వలన ఈ అంటువ్యాధీ, దానిని గురించిన భయమూ సమసిపోతాయి గాక!
6. i. ఇల్లు, చుట్టుప్రక్కల గదులు, వస్త్రాలు, పరుపు, మురుగు కాలువ, మొదలైన అన్నింటినీ శుభ్రంగా ఉంచుకోండి.
ii. కుళ్లిన, నిల్వవుంచిన ఆహారాన్ని తినకండి; తాజా పౌష్టిక ఆహారాన్ని తినండి. దుర్బల దేహానికే వ్యాధి సులభంగా సంక్రమిస్తుంది.
iii. మానసికంగా సదా ఉత్సాహంగా ఉండండి. ఏదో ఒక రోజు అంతా మరణించే తీరాలి. మనస్సులో తలెత్తే భయం కారణంగా పిరికిపందలు ఈ మరణభయాన్ని పదేపదే అనుభవిస్తూ దుఃఖపడుతుంటారు.
iv. ‘సన్మార్గంలో ధనం సంపాదించని వ్యక్తి’ ని, పరులకు హాని కలిగించే వ్యక్తిని ఎన్నడూ భయం వదలిపోదు. కనుక మరణభయాన్ని మనం ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఇటువంటి ప్రవర్తన నుండి విడివడదాం.
v. ఈ సమయంలో, మీరు గృహస్థులై ఉన్నప్పటికీ కోప కామాల నుండి విడివడి ఉండండి.
vi. వదంతులను ఖాతరు చేయకండి.
vii. ఆంగ్ల ప్రభుత్వం ఎవరినీ నిర్బంధించి టీకాలు వేయదు. ఎవరు సమ్మతిస్తే వారికే టీకాలు వేస్తారు.
viii. మా వైద్యశాలలో రోగులకు శ్రద్ధగా చికిత్స చేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం. వచ్చేవారి మతం, కులం, ఘోషా పద్ధతి మొదలైన అన్నిటినీ పరిగణించి చికిత్స అందజేయబడుతుంది. ధనవంతులు పలాయనం చిత్తగించనీ. మేం పేదలం, కనుక పేదల ఆవేదన మాకు బాగా తెలుసు. నిస్సహాయులకు ఏకైక తోడు జగజ్జననియే! ‘భయపడకండి, భయపడకండి’ అంటూ ఆమె మనకు అభయమిస్తూన్నది.
7. సోదరా! నీకు సహాయపడడానికి ఎవరూ లేకపోతే బేలూరు మఠంలో నివసిస్తూన్న భగవాన్ శ్రీరామకృష్ణుల సేవకులకు తక్షణం కబురు పంపు. మేం చేయగల సహాయం వెంటనే అందిస్తాం. జగజ్జనని అనుగ్రహంతో ధన సహాయం కూడా సాధ్యమే.
గమనిక: అంటువ్యాధి భయాన్ని పోగొట్టడానికి ప్రతి చోటా నిత్యం సాయంత్రం నామసంకీర్తన చేయండి.
క్షామనివారణ కార్యాలను ఎలా నిర్వహించాలో చర్చించారు. అప్పుడు సోదరు సన్న్యాసి ఒకరు, “స్వామీజీ! వీటికంతా నిధులకు ఎక్కడికి పోతాం?” అని అడిగారు. క్షణం కూడా తాత్సారం చేయకుండా స్వామీజీ జవాబిచ్చారు: “ఎందుకు, మఠం కోసం ప్రస్తుతం కొనుగోలు చేసిన స్థలాన్ని అమ్మివేద్దాం! మనం సన్న్యా సులం. భిక్షాన్నం తిని చెట్ల క్రింద నిద్రించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అట్లే కదా మనం జీవించాం! మన కళ్ల ముందు దురవస్థలోనున్న వేలమంది దుఃఖాన్ని బాపడానికి ఈ మఠాన్నీ, తక్కిన ఆస్తిపాస్తులనూ అమ్మివేయడం ఒక పెద్ద సంగతా ఏమిటి?”
అదృష్టవశాత్తూ విషయం అంతదూరం పోలేదు; అవసరమైన పైకం చందాల రూపంలో రాసాగింది. సోదరి నివేదిత, సదానంద, తక్కిన సన్న్యాసులు, భక్తులు ఈ క్షామనివారణ కార్యంలో ముమ్మరంగా పాల్గొన్నారు. ఈ సహాయకార్యం రామకృష్ణ సన్న్యాసులను, రామకృష్ణ మిషన్‌ను ప్రజల మనస్సులో మరో మెట్టు పైకి తీసుకుపోయిందనడం అత్యుక్తి కాదు. “వీరు బోధించడంతో ఆగిపోవడం లేదు; ప్రజల కష్టాలలో సైతం పాలుపంచుకొంటున్నారు, దుఃఖం బాపడానికైన కార్యాలలో పాల్గొంటున్నారు” అనే అంశాన్ని ప్రజలు అవగతం చేసుకోసాగారు.
సేవ చేయండి, పేరు, ఖ్యాతి వద్దు
క్షామనివారణ కార్యాలూ, సేవలూ చేస్తున్నప్పుడు ప్రేమ, సానుభూతియే ప్రాధాన్యం వహిస్తాయని ఇక్కడ స్వామీజీ ప్రకటన పత్రం నుంచి, కార్యాచరణ నుంచి గ్రహించవచ్చు. అదే విధంగా ఇటువంటి పనులకు పేరు, ఖ్యాతి ఆశించకూడదని స్వామీజీ నొక్కివక్కాణించేవారు. అటువంటి ఒక సంఘటనను చూద్దాం. సేవ–ధర్మం భావనను స్వీకరించి కార్యాచరణ రూపంలో ప్రప్రథమంగా అమలుపరచింది అఖండానంద. ఈయన సర్ఘాచీలో ఇద్దరు అనాథ పిల్లలతో రామకృష్ణ సేవాసంస్థను ప్రారంభించారు. కరవుతో తల్లితండ్రులను, బంధువులను కోల్పోయిన పిల్లలు వారు. ఈ క్షామ నివారణకై అఖండానంద అక్కడ పనిచేశారు. ఆయన అలుపొందని శ్రమకు మూలమూల నుండి సహాయం లభించింది. ప్రభుత్వం కూడా సహాయం చేసింది. చెన్నై భక్తుల నుండి పైకం సమీకరించి రామకృష్ణానంద పంపించారు. మహాబోధి సొసైటీ బౌద్ధ దేశాలలో చందాలు ప్రోగుచేసి చెప్పుకోదగ్గ మొత్తం అందించింది. పిదప క్షామ నివారణ కార్యం గురించి వారు చేసిన ప్రకటన పత్రికలో యావత్తు క్షామ నివారణ కార్యాన్నీ మహాబోధి సొసైటీ చేస్తూన్నట్లు వ్రాసుకొన్నారు. ఇది అఖండానందనూ, తక్కినవారినీ బాధించింది. దీనిని గురించి స్వామీజీకి కూడా వ్రాశారు. అందుకు స్వామీజీ వ్రాసిన జవాబు సహాయ కార్యాలకు ఒక మార్గదర్శిగా ఉంటుందనడంలో సందేహం లేదు:
“పైనున్న మీరు, పేరు ఎవరికి రావాలా అని పెనగులాడుతూండగా పేద ప్రజలు ఆకలితో అలమటించి చావవలసిందేనా? ఆ ఘనతను ‘మహాబోధి’ తీసుకొంటే తీసుకోనివ్వు. పేదలను లాభం పొందనివ్వు. పని బాగా జరిగిపోవడం మంచిదే. ఎక్కువ ఉత్సాహంతో పని సాగించు.”
ధర్మపాలునితో
చికాగో సర్వమత మహాసభలో పాల్గొన్న ధర్మపాలుడు మే 8 వ తేదీన మఠానికి వచ్చారు. స్వామీజీని ఎంతగానో అభిమానించిన వ్యక్తి ఆతడు. ఆతడు వచ్చిన రోజున వర్షం కుండపోతగా కురుస్తూన్నది. స్వామీజీతో మాట్లాడిన తరువాత ధర్మపాలుడు, మిసెస్ సారాను చూడ గోరాడు. స్వామీజీ ఆతణ్ణి తోడ్కొని వెళ్లారు. వాన కారణంగా దారంతా బురద మయంగా ఉంది. ఎంతో ప్రయాసకోర్చి ఇద్దరూ వెళ్లారు. ఒకసారి ధర్మపాలుని కాళ్లు బురదలో కూరుకుపోయాయి. స్వామీజీ ఆతడి నడుం పుచ్చుకొని బయటికి లాగారు. సారా ఇల్లు చేరుకోగానే ధర్మపాలుడు తమ కాళ్లను కడుగుకోబోయాడు. స్వామీజీ ఆతడి చేతినుండి నీటిపాత్ర లాక్కొని, “మీరు నా అతిథి. నేనే ఆ పని చేయాలి” అంటూ స్వయంగా తామే ఆతడి కాళ్లు కడుగడానికి సిద్ధపడ్డారు. ధర్మపాలుడూ, స్వామీజీ పాశ్చాత్య శిష్యురాండ్రూ అందుకు ససేమిరా సమ్మతించ లేదు. ఆయన వద్ద నుండి నీటిపాత్రను తీసుకొన్నారు. “స్వామీజీ! ఇలా అనుకోవ డానికి మీ కెలా మనస్కరించింది? మీ శిష్యురాండ్రు చూస్తూండగా మీరిలా ప్రవర్తించడం సబబు కాదు” అన్నాడు ధర్మపాలుడు. స్వామీజీ వినమ్రతా, సభ్యతా అందరినీ ఆకట్టుకొన్నాయి.
సెలవు పుచ్చుకోవడానికి ముందు ధర్మపాలుడు, “స్వామీజీ! పాళీభాష తరగతులు ప్రారంభించాలనుకొంటున్నాను. మీరు సహాయం చేస్తారా?” అని స్వామీజీని అడిగాడు. “తప్పకుండా – నేను మీ ప్రథమ విద్యార్థిని అవడం ద్వారా” అన్నారు స్వామీజీ.