ఆహా! శ్రీరామకృష్ణులు వివేకానందను తీర్చిదిద్దారు. వివేకానంద నూతన భారతదేశ రూపశిల్పులలో ప్రథమశ్రేణికి చెందినవారు.
– మహాకవి సుబ్రహ్మణ్య భారతి
మళ్లీ తమిళ గడ్డమీద — రామనాథపురం — నిజమైన ఆరాధన — పరమకుడి, మానామదురై — మదురై — కుంభకోణం — అద్భుతాలు వద్దు — రైలు పట్టా మీద తల ఆన్చుదాం
మళ్లీ తమిళ గడ్డమీద
స్వామీజీ ప్రప్రథమంగా తమిళనాడుకు 1893 ప్రారంభంలో వచ్చివున్నారు. నాడు ఆయన ఎవరూ ఎరుగని ఒక మామూలు సన్న్యాసి. తమిళనాడు ఆయన గొప్పదనాన్ని కనుగొన్నది, ఆయన ప్రతిభను, అర్హతను, శక్తిని గ్రహించింది. ఆయనను పాశ్చాత్య దేశాలకు పంపడంలో అగ్రస్థానం వహించింది. నేడు ఆయనకు స్వాగతం పలకడం లోనూ అపరిమిత ఆనందం పొందింది.
జనవరి 26వ తేదీ మంగళవారం నాడు తమ పాశ్చాత్య శిష్యులతో జాఫ్నా నుండి స్టీమరులో స్వామీజీ బయలుదేరారు. పాక్ జలసంధి, మన్నార్ సింధుశాఖ గుండా దాదాపు యాభై మైళ్లు పయనించి సాయంత్రం 3 గంటల సమయంలో పాంబన్కు వచ్చారు. రామనాథపుర రాజు మరో పడవలో వచ్చి స్వామీజీని తోడ్కొని వెళ్ళేలా ఏర్పాటు చేశారు. కాని రాజు రాక ఆలస్యమవడంతో స్వామీజీ వేచివుండవలసి వచ్చింది. దాదాపు ఐదు గంటలకు మనోహరంగా అలంకరింప బడిన పడవలో రాజు వచ్చాడు. స్వామీజీ ఆ పడవలోకి వెళ్లారు.
రామనాథపురం
రాజైన భాస్కర సేతుపతి, స్వామీజీ కలుసుకొన్న దృశ్యం మనస్సులను పుల కరింపజేసింది. రాజూ, ఆయనతో వచ్చిన వారూ స్వామీజీకి సాష్టాంగ నమస్కారం చేశారు. పిదప రాజు, ఆయనను సింహాసనంలో ఆశీనులనుజేసి స్వామీజీ పాదరక్షలను ఆయన పాదాలకు ధరింపచేస్తూ, “అమూల్యమైన వజ్రాన్ని శిరస్సున ధరించడం కన్నా దీనినే మహా భాగ్యంగా పరిగణిస్తున్నాను” అని పలికాడు.
పడవ పాంబన్ను చేరుకొంది. అక్కడ గుమిగూడిన అసంఖ్యాక ప్రజల జయజయధ్వానాల, వైభవోపేత స్వాగతాల నేపథ్యంలో అలంకరింపబడిన ఒక పందిరిలోకి స్వామీజీని తోడ్కొని వెళ్లారు. అక్కడ ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, స్వాగతపత్రం చదివారు. అందుకు స్వామీజీ స్పందిస్తూ ప్రసంగించారు. పిదప సమీపంలోని ఒక భవనంలో* ఆయనకు బస ఏర్పాటుచేశారు. ఆ భవ నానికి స్వామీజీని తీసుకొనిపోతున్నప్పుడు రాజు ఆయనను రాజవాహనంలో ఆసీనులను చేసి, తాను పరివార సమేతంగా కాలినడకన వచ్చాడు. కాస్త దూరం వెళ్లగానే బండికి పూన్చిన గుర్రాలను విప్పివేయమని ఆదేశించి, తక్కిన వారితో కలసి స్వయంగా రాజే బండిని లాగుకొని వెళ్లాడు.
మర్నాడు స్వామీజీ, రాజూ, తక్కిన వారూ రామేశ్వర ఆలయానికి వెళ్లారు. అక్కడ స్వామీజీకి రాచమర్యాద లభించింది. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, ఆలయ చిహ్నాలు కలగలసిన ఊరేగింపు ఆయనను ఆహ్వానించింది; ఆలయ స్తోత్ర గాయకులు ఎదురువెళ్లి స్వామీజీకి స్వాగతం పలికారు. పిదప స్వామీజీ రామేశ్వర శివుణ్ణి ఆరాధించారు. ఆలయ ఆభరణాలు ఆయనకు చూపించారు. ఆ తరువాత ఆయన ఆలయం చుట్టూ తిరిగి చూశారు. ఆలయంలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల మండపంలో నుండి స్వామీజీ వస్తూన్నప్పుడు, అక్కడ గుమిగూడివున్న అసంఖ్యాక భక్తులకు అనుగ్రహభాషణం చేయమని రాజు వేడుకొన్నాడు.
నిజమైన ఆరాధన
ప్రజలలో పరమేశ్వరుణ్ణి గాంచి, వారికి సేవ చేయడమే నిజమైన ఆరాధన అనే తత్త్వాంశాన్ని తేలికగా అర్థమయ్యే రీతిలో స్వామీజీ అక్కడ ప్రసంగించారు: “ఒకడు సోమరి, మాయలమారి, మోసగాడు, ఏమీ పని చేయడు. కాని శివుని కన్నుల అందాన్ని, ముక్కు చక్కదనాన్ని, ఇతర అవయవాల సౌందర్యాన్ని ఊరకే అభివర్ణిస్తూ స్తోత్రాలు చేస్తూవుంటాడు. రెండోవాడు శివుని సంతానమైన దరిద్రులను, దీనులను, సమస్త జంతుజాలాన్ని, అది ఇది అనడమెందుకు? సమస్త సృష్టినీ – కనిపెట్టుకుని సేవిస్తూ ఉంటాడు. వీరిద్దరిలో శివునికి ఎక్కువ ప్రియుడెవరు? నిస్సందేహంగా ఆయన బిడ్డలకు సేవచేసేవాడే! తండ్రికి సేవచేయగోరేవాడు మున్ముందు ఆయన పిల్లలకు సేవ చేయాలి… స్వార్థపరుడు సమస్త దేవాలయాలను దర్శిస్తూ అన్ని తీర్థాలను సేవిస్తూ, చిరుతపులిలా శరీరమంతా బొట్లు ధరించినప్పటికీ అతడు శివునికి సుదూరంగానే ఉంటాడు.” (లేవండి, మేల్కొనండి!, సంపుటం 6, పుట 37–38)
స్వామీజీ సందేశాన్ని తక్షణమే రాజు కార్యాచరణలో పెట్టాడు. మర్నాడే వేల మంది పేదలకు ఆయన అన్నదానం చేశాడు. స్వామీజీ తమ దివ్యపాదారవిందా లను తన రాజ్యంలో మోపిన స్మృతిచిహ్నంగా 40 అడుగుల ఎత్తుగల విజయస్తూపాన్ని నిర్మించాడు.*
అక్కణ్ణుండి రామనాథపురానికి ఎడ్లబండిలో ప్రయాణం కొనసాగింది. వేకువన బయలుదేరిన వారు మధ్యదారిలో ఒక సత్రంలో ఉపాహారం పుచ్చు కొన్నారు. రామనాథపురాన్ని సమీపిస్తున్నప్పుడు ఒక చెరువును దాటి వెళ్లవలసి వచ్చింది. దానిని వారు ప్రభుత్వ పడవలో దాటారు. చెరువును దాటగానే స్వామీజీకి స్వాగతం పలుకుతున్నట్లు ఫిరంగులు ప్రేలాయి, తారాజువ్వలు ఆకాశంలోకి ఎగిరాయి. చెరువు గట్టు, సాయంత్రవేళ, ఆకాశంలో అందమైన తారాజువ్వల విన్యాసాలతో ఆ ప్రదేశం ఒక అత్యద్భుత దృశ్యంగా గోచర మయింది. వేలాది ప్రజలు అక్కడ గుమిగూడి ఉన్నారు. ఆ తరువాత ఊరేగింపు, స్వాగత కార్యక్రమమూ వైభవంగా నిర్వహింపబడ్డాయి.
కాస్త దూరం స్వామీజీ ప్రభుత్వ వాహనంలో వెళ్లారు. రాజు కాలినడకన ఆయనను అనుసరించాడు. పిదప రాజు విన్నపం మేరకు స్వామీజీ పల్లకీలో వెళ్లారు. స్పామీజీ బస చేయడానికి ఏర్పాటు చేసిన ‘శంకర విల్లా’ అనే భవనంలో కొంతసేపు విశ్రాంతి తీసుకొన్న తరువాత, ఆయనను రాజసభకు గౌరవపుర స్సరంగా తోడ్కొని వెళ్లారు. రాజసభలో అప్పటికే వేలమంది సమావేశమై ఉన్నారు. రాజుగారి సోదరుడైన రాజా దినకర సేతుపతి స్వాగత పత్రాన్ని చదివి, దానిని ఒక బంగారు నగిషీతో కూడిన పేటికలో అమర్చి స్వామీజీకి సమర్పిం చాడు. అక్కడ స్వామీజీ ఒక మహోపన్యాసం చేశారు.
స్వామీజీ రామనాథపుర విజయానికి జ్ఞాపక చిహ్నంగా మద్రాసు కరవు నివారణ నిధికి ప్రజలు చందా పోగుచేసే పథకాన్ని రాజుగారు ప్రకటించారు.
మర్నాడు క్రైస్తవ మిషనరీ పాఠశాలలో స్వామీజీ ఒక ప్రసంగం చేశారు. స్వామీజీ గౌరవార్థం రాజుగారు దర్బారు నిర్వహించారు. ఆ దర్బారులో రాజు గారికి ‘రాజర్షి’ అనే బిరుదును స్వామీజీ ఒసగారు. రాజుగా వ్యవహరిస్తూ అదే సమయంలో ఋషిగానూ విరాజిల్లుతున్నాడని ఆ బిరుదుకు అర్థం. ఆ రోజు రాజు కోర్కె మేరకు ‘భారతదేశంలో శక్త్యారాధన’ అనే అంశంపై ఫోనోగ్రాఫ్లో (ధ్వని గ్రాహక యంత్రం) స్వామీజీ ప్రసంగించారు.
పరమకుడి, మానామదురై
చెన్నైకి వస్తూన్న దారిలో స్వామీజీకి అనేక చోట్ల నుండి ఆహ్వానాలు వచ్చాయి. ఆయనకూ దేహం అనేది ఒకటి ఉందనీ, దానికి విశ్రాంతీ నిద్రా అవ సరమనీ భక్తులు విస్మరించినట్లుగా తోస్తున్నది. ఈ ప్రయాణంలో క్షణం కూడా నిద్రించకుండా ఆయన గడిపిన రోజులు కొన్ని ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. శారీరక శ్రమలను కించిత్తు కూడా లెక్కించక తమ శక్తి మేరకు ఆహ్వానాలను మన్నించారు.
జనవరి 31 తేదీ అర్ధరాత్రి రామనాథపురం నుండి బయలుదేరి ఫిబ్రవరి 1 వ తేదీ వేకువజామున పరమకుడి చేరుకొన్నారు. గుర్రపు బండిలో 23 మైళ్ళు పయనించిన స్వామీజీ నిద్రించలేదని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. పరమకుడిలో సమర్పించిన స్వాగత పత్రానికి స్పందిస్తూ అందుకు సమాధానంగా స్వామీజీ ప్రసంగించారు.
పరమకుడిలో కొన్ని గంటలసేపు మాత్రమే గడిపిన తరువాత స్వామీజీ అక్కణ్ణుండి 15 మైళ్ల దూరంలోని మానామదురైకి వెళ్లారు. అక్కడ మానా మదురై పురజనులతో శివగంగ ప్రజానీకమూ కలిసి స్వామీజీకి ఘనంగా స్వాగతం పలికారు. ఆ ఊళ్ల జమీందారులూ ఆ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసంగానంతరం ఆనాటి రాత్రి స్వామీజీ అక్కడే గడిపారు.
మదురై
ఉదయం రైలులో బయలుదేరిన స్వామీజీ బృందం, పదిన్నర గంటలకుమదురై చేరుకొంది. అక్కడ ఆయన సోదర సన్న్యాసియైన శివానందస్వామి ఆయనను కలుసుకొన్నారు. అక్కడ కూడా ఘనస్వాగతం లభించింది. ఆ తరువాత రామనాథపురపు రాజుగారి ‘రామనాథ కోటి’ అనే రాజ భవనంలో స్వామీజీ బసచేశారు. యథాప్రకారం ఇక్కడ కూడాభక్తులు తండోపతండాలుగా స్వామీజీ దర్శనార్థం వచ్చారు. కొందరు పండితులువచ్చి స్వామీజీతో చాలాసేపు మాట్లాడారు. ముక్తి, మాయ, బౌద్ధతత్త్వాల వంటి అంశాలు వారి చర్చల్లో చోటుచేసుకొన్నాయి. ఆ తరువాత స్వామీజీ మీనాక్షీ దేవాలయానికి వెళ్లి దైవదర్శనం చేసుకొన్నారు. పూర్ణకుంభంతో ఆలయ సిబ్బందిస్వామీజీకి స్వాగతం పలికారు; దేవాలయ ఆభరణాలు తెచ్చి ఆయనకు చూపించారు. వాటిలో ‘గజ మోతి’ (ఏనుగు ముత్యం) పేర్కొనదగినది.
అక్కడ నుండి నేటివ్ కళాశాలకు వెళ్లారు. సాయంత్రం 5 గంటలప్రాంతంలో అక్కడ ఆయనకు ఘనస్వాగత మిచ్చారు. అందుకు స్పందిస్తూస్వామీజీ క్లుప్తంగా ప్రసంగించారు. “సన్న్యాసులకూ దేహం అంటూ ఒకటి ఉంది” అని గుర్తుచేసి తమ అలసటను వ్యక్తం చేస్తూ, మూడు వారాలపాటు ఎడతెగ కుండా పయనించవలసి వచ్చినందున తాను సుదీర్ఘంగా ప్రసంగించలేకపోతున్నందుకు స్వామీజీ విచారం వెలిబుచ్చారు.
కుంభకోణం
రాత్రి పదిన్నరకు స్వామీజీ రైలులో కుంభకోణానికి బయలుదేరారు. ఆ 150 మైళ్ల మధ్య దూరంలో నెలకొన్న దాదాపు అన్ని రైలు నిలయాలలోనుభక్తులు వేలాదిగా గుమిగూడారు. తిరుచ్చిలో రైలు 25 నిమిషాలు ఆగింది. అక్కడ ఒక స్వాగత పత్రం చదివిస్వామీజీకి సమర్పించారు. తంజామారులోనూ అట్లే జరిగింది.
చికాగోలో స్వామీజీ పొందిన అఖండ విజయాన్ని పురస్కరించుకొనికుంభకోణంలోనూ అదే సమయంలో స్వామీజీని శ్లాఘిస్తూ బహిరంగ సభలునిర్వహించారు. ప్రస్తుతం స్వామీజీ స్వయంగా వచ్చి పాల్గొన్న అభినందన సభనుపురజనులు ఘనంగా జరిపారు. పురజనుల తరఫున, విద్యార్థుల తరఫున పోర్టర్టౌన్హాలులో రెండు స్వాగత పత్రాలను సమర్పించారు. అక్కడ ‘వేదాంత ప్రచారం’ అనే అంశం మీద స్వామీజీ సుదీర్ఘంగా ప్రసంగించారు.
చెన్నైలో ఆయన ప్రసంగాలు కొనసాగించవలసి ఉంది. విశ్రాంతి అరుదై పోతోందని గ్రహించిన అనుయాయులు, ఆయన కుంభకోణంలో మూడు రోజులు బసచేసి విశ్రాంతి తీసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేశారు. అప్పుడు తిరుచ్చికి చెందిన అనుయాయులు కొందరు స్వామీజీని కలుసుకొని, కుంభకోణంలో బస చేయబోయే మూడు రోజుల్లో ఒక రోజు రద్దుచేసుకొని తిరుచ్చికి వచ్చి పావనం చేయమని అర్థించారు. 750 మంది విద్యార్థులు సంతకాలు చేసిన విన్నపాన్ని వారు స్వామీజీ ముందు ఉంచారు. స్వామీజీ వినమ్రంగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు.
అద్భుతాలు వద్దు
స్వామీజీ నాలుగేళ్ల క్రితం చెన్నైకు వచ్చివున్నప్పుడు ఒక రోజు తమ తల్లి చనిపోయినట్లు కల కన్నారు. దాన్లోని నిజాన్ని తెలుసుకోవడానికై వలంగైమాన్ లోని గోవిందచెట్టి అనే ప్రేతాత్మలతో మాట్లాడే వ్యక్తి వద్దకు ఆయనను తోడ్కొని వెళ్లారు. కల నిజం కాదని తెలిపి, స్వామీజీ ఆరాటాన్ని ఉపశమింపజేశాడు గోవిందచెట్టి. అతడు కుంభకోణ స్వాగత సభ జనసమూహంలో నిలబడి ఉండడం చూసి స్వామీజీ, ఆతణ్ణి పిలిచి, తరు వాత తమను విడిగా కలుసుకోమన్నారు. గోవిందచెట్టి వచ్చినప్పుడు స్వామీజీ అతణ్ణి, “మీకు అద్భుతశక్తులు ఉన్నాయని నాకు తెలుసు. అది మీకు డబ్బూ, ఖ్యాతీ విరివిగా సమకూర్చిపెట్టడం నిజం. కాని ఆధ్యాత్మికత విషయంలో మీరు ఒక్క అడుగు సైతం పురోగమించలేదు. ఎక్కడ ప్రారంభించారో అక్కడే ఆగి పోయారు. అదే కదా నిజం? భగవదభిముఖంగా మీ మనస్సు కాస్తయినా వెళ్లిందా?” అని అడిగారు. గోవిందచెట్టి స్వామీజీ వ్యక్తపరచిన నిజాన్ని అంగీ కరించాడు. వెంటనే స్వామీజీ, “మీ మనస్సు భగవంతుని వైపు మరలకుంటే ఈ శక్తుల వలన ప్రయోజనం ఏం ఉంది? భగవదానందాన్ని ఒకసారి మీరు చవి చూస్తే, ఆ తరువాత ఇవన్నీ నిరర్థకాలని గ్రహిస్తారు” అని, గోవిందచెట్టిని ఆలింగనం చేసుకొన్నారు. చిత్రం ఏమిటంటే, నాటినుండి గోవిందచెట్టి అద్భుత శక్తులు సమసిపోయాయి. ఆయన భగవంతునికై మనోవ్యాకులతతో, సంసారాన్ని త్యజించిన వ్యక్తిలా జీవించాడు.
రైలు పట్టా మీద తల ఆన్చుదాం
కుంభకోణం నుండి చెన్నై (194 మైళ్లు) పయనం మొదలయింది. ఫిబ్రవరి 5 వ తేదీ రాత్రి 10–45 గంటలకు రైలు బయలుదేరింది. స్వామి నిరంజనానంద, స్వామి శివానంద, గుడ్విన్, తిరువనంతపురంలో స్వామీజీని కలుసుకొన్న ప్రొఫెసర్ రంగాచార్య ప్రభృతులు స్వామీజీతో పయనించారు. సేవియర్ దంపతులు ఒక రోజు ముందే బయలుదేరారు. ఈ ప్రయాణంలోను దారిపొడవునా ఘనస్వాగతాలు ఆయన కోసం కాచుకొని ఉన్నాయి. “జై స్వామి వివేకానంద మహరాజ్జీకీ జై” అనే నినా దాలు మిన్నుముట్టాయి. మాయవరం రైలు నిలయంలో రైలు ప్రవేశించినప్పుడు సమయం రాత్రి 11–30 గంటలయి ఉంటుంది. అక్కడ పది నిమిషాలు రైలు ఆగింది. అక్కడ కూడా వేలమంది గుమిగూడారు. స్వాగతపత్రం చదివి, సమర్పించారు.
మర్నాడు ఉదయం ఆరు గంటలకు రైలు చెంగల్పట్టు చేరింది. The Madras Mail, The Hindu పత్రికా విలేఖరులు అక్కడ రైలులో ఎక్కారు. వారు చెన్నై దాకా స్వామీజీతో భేటీ జరిపి, వాటిని పత్రికలలో ప్రచురించారు.
చెన్నైకి ముందున్న ఒక స్టేషన్లో రైలు ఆగదు. కాని స్వామీజీ దర్శనార్థం తండోపతండాలుగా వచ్చిన జనం రైలును కొంచెంసేపయినా ఆపించమని స్టేషను మాస్టర్‌ను వేడుకొన్నారు. అతడు అందుకు సమ్మతించలేదు. స్వామీజీని ఒకసారి అయినా కళ్లారా చూడడానికి గుమిగూడిన ఆ జనసమూహం, ఒకరి వెంట ఒకరుగా రైలుపట్టాల మీద అడ్డంగా పడుకొన్నారు. గత్యంతరం లేక రైలును ఆపవలసి వచ్చింది. స్వామీజీ ఉద్వేగంతో చలించిపోయారు. బయటకు వచ్చి ఆప్యాయపూరితమైన దృక్కులతో జనసమూహాన్ని చూసి, తమ రెండు చేతులు పైకెత్తి వారిని మనఃస్ఫూర్తిగా ఆశీర్వదించారు. రైలు కదలింది.