స్వామి వివేకానంద ప్రసంగాలనూ, రచనలనూ నేను క్షుణ్ణంగా చది వాను. ఆ తరువాత నా దేశభక్తి వేయి రెట్లు పెరిగింది. యువకులారా! ఆయన రచనలు చదవాల్సిందిగా మిమ్మల్ని కోరుకొంటున్నాను.
– మహాత్మా గాంధీ
ఇండియా స్వాగతం — శ్రీలంకలో ఘన స్వాగతం — ప్రమాదం — కొందరు బౌద్ధుల నిరసన — జాఫ్నాలో — తమిళనాడు నుండి ఆహ్వానం
ఇండియా స్వాగతం
పాశ్చాత్య కార్యాన్ని తను విజయవంతంగా నెరవేర్చడం భారతీయులకు మహదా నందం కలిగించిందని స్వామీజీకి తెలియకపోలేదు. తనకు భారతదేశం ఘనంగా స్వాగతం పలుకుతుందని కూడా స్వామీజీకి తెలుసు. కాని అందుకైన ఏర్పాట్ల గురించో, శ్రీలంక నుండి తమిళ నాడు యావత్తు ప్రజానీకం కృతనిశ్చయంతో స్వాగతపు ఏర్పాట్లలో మునిగివుంటా రనీ ఆయన అనుకోలేదు. శారీరకంగా బాగా అలసిపోయిన ఆయన, “ఇప్పుడు విశ్రాంతికై పరితపిస్తున్నాను. ఏదో కొంత విశ్రాంతి లభిస్తుందని ఆశిస్తున్నాను, భారతీయులు నన్ను వదలిపెడతారని అనుకొంటున్నాను. కొన్నేళ్లపాటు మూగగా ఉండిపోకూడదా అని ఎంత పరితపిస్తున్నానో తెలుసా?” అని ఒకింత విశ్రాంతికై తపించారు. అలాగని విశ్రాంతి కోసం ఆయన భారతదేశానికి తిరిగి రాలేదు, అక్కడా కఠోరంగా శ్రమించాల్సే ఉంటుంది; అక్కడ తాను అందించవలసిన సందేశం ఒకటి ఉన్నదనీ ఆయన గ్రహించే ఉన్నారు. భారతదేశం లోకానికి అందించిన జ్ఞానఖని, ఆధ్యాత్మిక నిధి గురించి డెట్రాయిట్లో ఒకసారి స్వామీజీ ప్రసంగిస్తున్నారు. హఠాత్తుగా ఆయన ఉత్తేజితులైనారు; ఆయన దేహం ఒకింత కంపించింది.
“భారతదేశం నా మాటలు చెవులప్పగించి వినే తీరాలి! నేను భారతదేశాన్ని కూకటి వ్రేళ్లతో సహా ప్రకంపింపజేస్తాను. దాని జాతీయ నాడుల ద్వారా ఒక విద్యుత్ దిగ్భ్రాంతి కల్పిస్తాను! వేచివుండండి! భారతదేశం నన్ను ఎలా సమాద రిస్తుందో చూడబోతారు. ఇక్కడ అందరికీ సునాయాసంగా లభించే రీతిలో నా హృదయ రుధిరాన్ని చిందించి వేదాంతం గూర్చి వివరించాను; కాని దానిని యథార్థంగా స్వీకరించడం భారతదేశానికి, నా సొంత భారతదేశానికి మాత్రమే తెలుసు. ఆ భారతదేశం నాకు ఘనంగా స్వాగతం పలుకుతుంది!” అని ఉద్రేకంగా పలికారు ఆయన.
శ్రీలంకలో ఘన స్వాగతం
1897 జనవరి 15 వ తేదీ నౌక కొలంబో నౌకాశ్రయాన్ని చేరింది. స్వామీజీకి స్వాగతం చెప్పడానికి ఆయన సోదర సన్న్యాసియైన నిరంజనానంద స్వామి వచ్చారు. శ్రీలంక ఆహ్వాన సంఘ ప్రతినిధియైన హ్యారిసన్ పడవలో వెళ్లి స్వామీజీని ఆహ్వానించారు.
స్వామీజీని తీరానికి తోడ్కొని రావడానికై స్టీమ్బోట్ ఒకటి సిద్ధంగా ఉంది. అది సాయంత్రం వేళ. స్వామీజీ ఎక్కిన బోట్ మెల్లగా తీరాన్ని సమీపించింది. తీరంలో వేలాదిమంది గుమిగూడి ఉన్నారు. కరతాళ ధ్వనులూ, జయ ఘోషలూ సాగర తరంగ గంభీర ఘోషను దిగమింగాయి. స్వామీజీని ఒకసారి తనివితీరా చూడ డానికై అక్కడ ఇసుక వేస్తే రాలని జనం గుమిగూడి ఉన్నారు. ఆహ్వాన సంఘ అధ్యక్షుడైన పి. కుమారస్వామి, స్వామీజీని సుగంధ కుసుమ మాలాలంకృతులను చేసి, పుష్పగుచ్ఛం సమర్పించారు. ఆ తరువాత స్వామీజీని స్వాగతాలంకారశోభిత మైన పందిరి వద్దకు తురంగ శకటంలో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అక్కడ దిగి స్వామీజీ పందిరిలోకి వెళ్లారు. అక్కణ్ణుండి తమ బస వద్ద ఏర్పాటు చేసిన పందిరి వద్దకు ఊరేగింపుగా అరుదెంచారు. ఊరేగింపులో పతాకాలు, అలంకారయుత మైన ఛత్రచామరాదులు, నాదస్వరం ఇత్యాది తమిళుల సంస్కృతీ ప్రతీకలన్నీ కానవచ్చాయి. దారి వెంట అంతటా తోరణాలు వ్రేలాడగట్టి ఉన్నాయి.
పందిరిలోకి ప్రవేశించగానే అక్కడ అమర్చి ఉంచిన మనోహరమైన ఒక కృత్రిమ సహస్రదళ కమలం వికసించింది. దాన్లో నుండి ఒక పిట్ట రివ్వున పైకి ఎగిరిపోయింది. స్వామీజీ మీద, ఆయనతో కలిసి వచ్చిన వారిపైన పుష్పవృష్టి కురిసింది. స్వామీజీ, తక్కినవారు వేదిక నలంకరించగానే తేవార గీతాలు గానం చేయబడ్డాయి. స్వామీజీని శ్లాఘిస్తూ రచించిన సంస్కృత స్తుతి పారాయణ చేసి, స్వాగతోపన్యాసం పఠించారు. ఆ పిదప స్వామీజీ లేచి స్వాగతానికి స్పందిస్తూ క్లుప్తంగా ప్రసంగించారు.*
కొలంబోలో స్వామీజీ నాలుగు రోజులు బస చేసిన భవంతి ఒక తీర్థ స్థలంగా మారింది. స్త్రీలూ, పురుషులూ చేత కానుకలు పుచ్చుకొని ఆయనను ఆరాధించే రీతిలో రాసాగారు. ఇంతలో, ఆయన తిరుజ్ఞాన సంబంధర్* అవతార మనే పుకారు వ్యాపించింది. ఈ వార్త శైవ మతాన్ని ఆదరించిన శ్రీలంకలో సత్వరమే వ్యాపించింది. తత్ఫలితంగా స్వామీజీ బస చేసిన స్థలంలోను, బయటకు పోతున్నప్పుడు ఆయన దర్శనార్థం ప్రజలు తండోపతండాలుగా రాసాగారు.
జనవరి 17 వ తేదీ సాయంత్రం స్వామీజీ సమీపంలోని శివాలయానికి వెళ్లారు. దారి వెంట ఇళ్ల ముందు రంగవల్లికలను తీర్చిదిద్ది, వాటి మధ్య కలశాలు ఉంచి, దీపాలు వెలిగించి ఆయనకు స్వాగతం పలికారు. ఆయన శివాలయంలోకి ప్రవేశించినప్పుడు, “జయ జయ మహాదేవ!” అన్న జయఘోష మారుమ్రోగింది.
స్వామీజీ మర్నాడు చెల్లయ్య అనే అభిమాని ఇంటికి ఆహ్వానితులై వెళ్లారు. దారి వెంట మళ్లీ అవే దృశ్యాలు. వేలమంది బాటకు ఇరువైపులా నిలబడి ఆయన మీద పుష్పవృష్టి కురిపించారు. అందరికీ స్వామీజీ విభూతి పంచి ఇచ్చారు. ఆ ఇంట్లోకి వెళ్లినప్పుడు అక్కడ గురుదేవుల (శ్రీరామకృష్ణుల) చిత్తరువు వ్రేలాడి ఉండడం కంటబడింది. వెంటనే స్వామీజీ భక్తిప్రపత్తులతో గురుదేవుల చిత్తరువుకు నమస్కరించారు.
ప్రమాదం
శ్రీలంకను పర్యటించి చూడాలని స్వామీజీ అభిలషించారు. ముందుగా కాండీ వరకు రైలులో పయనించి, అక్కణ్ణుండి గుర్రపుబండిలో అనూరాధపురానికి వెళ్లాలని నిర్ణయించారు. కాండీలో బుద్ధుని పన్ను పదిలపరచ బడి ఉన్న ఆలయాన్ని స్వామీజీ సందర్శించారు. అక్కడ నుండి అనూరాధపురానికి పోతున్న దారిలో ఒక ప్రమాదం జరిగింది. బండి ఒక కొండ బాట మీదుగా పోతున్నప్పుడు ముందు వైపు చక్రం విరిగింది. అదృష్ట వశాత్తూ చక్రం బండి నుండి విడిపోలేదు. అయినప్పటికీ స్వామీజీ, తక్కినవారు బ్రతికి బయటపడడం భగవంతుని అనుగ్రహమే! ఆ చోట మరో గుర్రపుబండి లభించే అవకాశం ఏమీ లేదు. ఒకే ఒక్క ఎడ్లబండి మాత్రమే లభించింది. అందులో సేవియర్ దంపతులను, సామానులను ఎక్కించారు. స్వామీజీ, తదితరులు కొన్ని మైళ్లు నడవవలసి వచ్చింది. ఆ తరువాత కొన్ని ఎడ్ల బండ్లు లభించాయి. ఆ రాత్రి ఎడ్లబండ్లలోనే గడిపారు. దాదాపు 25 మైళ్ల కన్నా ఎక్కువ దూరం కాలినడకన పయనించి, ఎనిమిది గంటలు ఆలస్యంగా అందరూ అనూరాధపురం చేరుకొన్నారు.
కొందరు బౌద్ధుల నిరసన
అనూరాధపురంలో ప్రాచీన ఆలయాలను, బౌద్ధ స్తూపాలను స్వామీజీ దర్శించారు. బోధివృక్షం క్రింద ఆరాధించారు. బుద్ధగయలోని బోధివృక్షం నుండి తీసుకువచ్చిన వృక్షశాఖ అది. అక్కడ స్వామీజీ చాలాసేపు ధ్యానమగ్నులయ్యారు. బుద్ధుని మహిమలోను, కరుణలోను లీనమైపోయిన స్వామీజీ బౌద్ధుల నుండి నిరసనను ఎదురు చూసి ఉండరు. కాని ఆ నిరసన రానే వచ్చింది.
ఆ రోజు స్వామీజీ బోృధివృక్షం క్రింద తమ ప్రసంగం ప్రారంభించారు. దాదాపు మూడువేల మంది ఆయన ప్రసంగం వినడానికి సమావేశమయినారు. ఒకటి రెండు మాటలే స్వామీజీ మాట్లాడి ఉంటారేమో! అంతలో బౌద్ధమతానికి చెందిన భిక్షువులు, గృహస్థులు, స్త్రీ పురుషులు, పిల్లలు పెద్ద గుంపుగా వచ్చి ఆ స్థలాన్ని ఆక్రమించారు. ప్రసంగం వినడానికి వచ్చిన ప్రజలను, పారద్రోలే ఉద్దేశంతో పెద్ద మద్దెలలు, జేగంటల లాంటి వాద్యాలు మ్రోగించి పెద్ద ధ్వనులు పుట్టించారు. అక్కడ హిందువులకు, బౌద్ధులకు మధ్య ఒక పెద్ద రగడే చెలరేగి ఉండేది. కాని స్వామీజీ హిందువులను ప్రశాంతంగా ఉండమని వేడుకొన్నారు. రగడ తప్పిపోయింది. కాని ప్రసంగ కార్యక్రమం జరగకుండానే జనం వెళ్లిపోయారు.
జాఫ్నాలో
అనురాధపురం నుండి జాఫ్నా 125 మైళ్ల దూరంలో ఉంది. రైలు సౌకర్యం లేదు. బండ్లలో రోజుకు దాదాపు ముప్ఫై మైళ్లు ప్రయాణం చేసి జనవరి 24 వ తేదీ స్వామీజీ జాఫ్నా చేరుకొన్నారు. ఈ ప్రయాణం ఎంత ప్రయాసతో కూడుకొన్నదో చెప్పనవసరం లేదు. తమ శారీరక ఆరోగ్యాన్నో, శ్రమలనో స్వామీజీ ఎవరికీ వ్యక్తం చేసేవారు కారు. ఆయన ఎప్పటిలా ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నారు. జాఫ్నాలో, వెళ్లిన చోటల్లా మును పెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. మత వివక్ష పట్టించుకోకుండా హిందువులూ, బౌద్ధులూ, మహమ్మదీయులూ, క్రైస్తవులూ ఆయనకు స్వాగతం పలికారు. అన్ని ఇళ్ల ముందు రంగవల్లికలను తీర్చి దిద్ది, వాటి మధ్య కలశాలు అమర్చి ఉంచారు. ఊరేగింపులో దాదాపు పదిహేను వేల మంది పాల్గొన్నారు. వారిలో ఎవరూ పాదరక్షలు ధరించకపోవడం విశేషం. అందరూ కరదీపికలు పుచ్చుకొని ఉన్నారు. దాదాపు 15 వేల మంది దీపాలు పుచ్చుకొని స్వామీజీని తోడ్కొని వెళ్లడం కన్నులపండువగా ఉన్నదంటే అతిశయోక్తి కాదు. జాఫ్నా పయనంతో స్వామీజీ శ్రీలంక విజయం పూర్తయింది. జాఫ్నాలో కూడా ఆయన ఒక ప్రసంగం చేశారు.
తమిళనాడు నుండి ఆహ్వానం
స్వామీజీ శ్రీలంకను చేరుకొన్నప్పుడే తమిళనాడులో అనేక చోట్ల నుండి ఆయనకు ఆహ్వానాలు వచ్చాయి. కలకత్తాకు వెళ్లే దారిలో తమ రాజ్యాన్ని పావనం చేయమని రామనాథపుర రాజు స్వామీజీకి ఆహ్వానం పంపారు. ఆ ఆహ్వానాలను పురస్క రించుకొని జనవరి 26 వ తేదీ అక్కడకు వస్తున్నట్లుగా స్వామీజీ ఆయనకు జవాబు పంపారు.
స్వామీజీ తమిళనాడులో అడుగిడడమూ, అక్కడ కొన్ని రోజులు బసచేసిన పిదప కలకత్తాకు వెళ్లడమూ తమిళనాడు ఆధ్యాత్మిక చరిత్ర పుటలలో చెరిగిపోని ఒక అధ్యాయంగా నిలిచిపోయింది.