జీవిత అవస్థలన్నింటిలోను సంస్కరణలు గావించినవారు అనేకు లున్నారు. కాని దేశ ప్రజలు ఒక మౌలిక దుర్బలత్వంతోనూ, ఆత్మ న్యూనతాభావంతోనూ మ్రగ్గి ఉన్నారు. ఆ రుగ్మతను రూపుమాపడం ఆవశ్యకమైంది. మన జాతీయ ఆత్మన్యూనతాభావ జాడ్యాన్ని వదలించు కొనేలా చేసిన వ్యక్తి వివేకానందే!
– రాజాజీ
మేలుకొలుపు — రచిస్తున్నది జగజ్జననే! — మూడు అంశాల ప్రణాళిక — కార్యాచరణ పథకం–విభిన్న అభిప్రాయాలు — బ్రహ్మవాదిన్ — ప్రబుద్ధ భారతం — పిల్లల పత్రిక — వివేకానంద ఇలా ప్రసంగించారు — రామకృష్ణ మఠం — మహిళల పని
మేలుకొలుపు
పాశ్చాత్య దేశాలకు వెళ్లి మన ఆధ్యాత్మిక వారసత్వాన్నీ, సంస్కృతిలోని గొప్ప దనాన్నీ అక్కడ చాటిచెప్పినప్పుడే భారతీయుల అంతరంగాన్ని స్వామీజీ జాగృతం గావించారు. ఆ విధంగా ఆయన పాశ్చాత్య విజయం భారతీయు లకు ఒక మేలుకొలుపు అయిందని చెప్పుకోవాలి. “మీరు బానిసలు, మీరు నిరర్థకులు, మీకంటూ ఎలాంటి వారసత్వమూ లేదు. మేం వచ్చే సమస్తం మీకు అందించాం” అని ఆంగ్లేయులు చెప్పడం వినీ, వారి అణచివేత వలనా తాము మనుష్యులమనే విషయం కూడా మరచిపోయి గాఢసుషుప్తిలో భారతీయులు మునిగిపోయారు. భారతదేశ మహత్త్వాన్నీ, ఆధ్యాత్మిక వారసత్వాన్నీ స్వామీజీ పాశ్చాత్య దేశాలలో చాటి చెప్పినప్పుడు విస్తుబోయింది పాశ్చాత్యమే కాదు, భారతదేశం కూడా! ‘తాము నిజంగానే ఇంత మహత్త్వం సంతరించుకొన్న వారమా, ఆధ్యాత్మిక రంగంలో జగద్గురువులు కాగల అర్హత ఉన్నవారమా?’ అని భారతీయులు చింతన చేయనారంభించారు. ఈ చింతనను వారిలో జాగృతం చేసినవి సార్వకాలీనమైన స్వామీజీ లేఖలే అనడం నిర్వివాదాంశం.
రచిస్తున్నది జగజ్జననే!
పరమపావనులైన స్వామీజీ చింతనలు లేఖల ద్వారానే మనకు అందుబాటు లోకి వచ్చాయి. లేఖల మూలంగానే తమ భారతీయ మహత్కార్యాన్ని స్వామీజీ ప్రారంభించారని చెప్పవచ్చు. తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు, భగవదనుగ్రహం వలన పావనతను సంతరించుకొన్న మనస్సులో ఉద్భవించిన చింతనలు లోకాన్నే కదలించివేయగలవనడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే అట్టి మనస్సులో చింతనలను ఉద్భవింపచేసేది సాక్షాత్తు జగజ్జననియే కాబట్టి. “ఉత్తిష్ఠత! జాగృత – లేవండి, మేల్కొనండి. భగవంతుడు మనకు అండగా ఉన్నాడు. ఇంతకన్నా ఎక్కువ వ్రాయలేను. ముందుకు సాగం డనే చెబుతున్నాను. ఈ లేఖను ఎవరు చదువుతారో వారికి నా శక్తి సంక్రమిస్తుంది. శ్రద్ధ వహించండి. ముందుకు, మున్ముందుకు! ఓ పర మేశ్వరా! ఎవరో చేయి పుచ్చుకొని నా చేత ఈ విధంగా వ్రాయిస్తున్నారు. ముందుకు నడవండి, ఓ పరమేశ్వరా!”* అని తమ లేఖల గురించి స్వామీజీ వ్రాస్తున్నారు. ఈ విధంగా జగజ్జనని చేతిలో పరికరమై స్వామీజీ లేఖలు అందించారు.
స్వామీజీ లేఖలు మరో మహత్త్వాన్ని కూడా సంతరించుకొన్నాయి. ఆయన సోదర శిష్యులూ, పలువురు అనుయాయులూ వ్రాసిన లేఖలు ఇతరుల చేతి వ్రాతలో ఉన్నాయి, సంతకం మాత్రం వారు చేశారు. కాని స్వామీజీ లేఖలన్నీ ఆయనే స్వయంగా వ్రాశారు. ఆయన వ్రాసిన లేఖలలో 778 లేఖలు మాత్రమే లభించాయి. ఆ లేఖలు వివేకానంద సాహిత్య సర్వస్వంలో (9, 10 సంపుటాలలో) పొందుపరచబడ్డాయి. ఊపిరిసలుపని పనుల మధ్య ఇన్ని లేఖలు వ్రాయడం ఆశ్చర్యం!
స్వామీజీ భారతీయ మహత్కార్య ప్రణాళికలోని ముఖ్యమైన మూడు అంశాలను ఆయన లేఖల ద్వారా మనం తెలుసుకోవచ్చు.
1. మేలుకొలుపు : కాలాల పర్యంతం బానిసత్వంలో మ్రగ్గిన కారణంగా దుర్బలులై, నిద్రాణమై ఉన్న భారతీయులకు ప్రప్రథమావసరం మేలుకొలుపు. స్వామీజీ భారతదేశానికి వ్రాసిన లేఖలన్నింటిలోనూ ఆయన భావోద్వేగం మనకు స్పష్టంగా కానవస్తుంది.
మూడు అంశాల ప్రణాళిక
“లేవండి! లేవండి! దీర్ఘరాత్రి అంతరిస్తోంది. పగలు సమీపిస్తున్నది. మహోన్నత తరంగం ఉవ్వెత్తున లేచింది. ఆ తరంగ నిర్ఘాతాన్ని ఏదీ ప్రతిఘటించలేదు. నా వత్సలారా! ఉత్సాహం! ఉత్తేజం! ప్రేమ, నా బిడ్డలారా! ప్రేమ, విశ్వాసం, అపరిమిత విశ్వాసం, ఇవే కావాలి. భయపడకండి. భయమే మహాపాపం. మీ అందరికీ నా ఆశీస్సులు.”*
2. జాగృతి : మేల్కొన్న వారు మళ్లీ నిద్రించరాదు. వారు జాగృతి చెందాలి. దానిని విద్య మూలంగా అందించాలి.
“యథార్థమైన జాతి కుటీరాలలో నివసిస్తోంది. వారు తమ మానవత్వాన్నీ, వ్యక్తిత్వాన్నీ మరచిపోయారు. వారు హిందువుల, మహమ్మదీయుల, క్రైస్తవుల పాదాల క్రింద త్రొక్కివేయబడ్డారు. జేబులో నాలుగు రూకలున్న వారెవరైనా సరే, వారి పాదాల క్రింద త్రొక్కివేయబడడానికే తాము జన్మించామని తలచే స్థితికి వచ్చారు. వారు కోల్పోయిన వ్యక్తిత్వాన్ని వారికి తిరిగి అందించాలి. వారిని విద్యావంతులను చేయాలి….. పామర జనులకు విద్యనిచ్చి, వారిని ఉద్ధరించడం వల్లనే ఒక జాతి రూపొందుతుంది.”*
కాని దాన్లో ఒక చిక్కు ఉందని స్వామీజీ గమనించకపోలేదు.
“ఒకవేళ మనం ప్రతి గ్రామంలో ఒక పాఠశాల స్థాపించే స్థితిలో ఉన్నామనుకొందాం. కాని పేదపిల్లలు జీవనోపాధికై పొలాలకు వెళతారుగాని, పాఠశాలలకు రారు. మన వద్దా ధనం లేదు. వారినా పాఠశాలకు రప్పించలేం. సమస్య పరిష్కరింపజాలనిదిగా కనిపిస్తోంది. కాని దీన్నుండి నాకొక దారి కనిపిస్తోంది. అది ఇది: కొండ మహమ్మదు వద్దకు రాకపోతే మహమ్మదు కొండ వద్దకు వెళ్లాలి. బీదవాడు పాఠశాలకు రాలేనప్పుడు, విద్యే అక్కడికి వెళ్లి చేరాలి. ఎలా? నా సోదర శిష్యులను మీరు చూశారు కదా! అట్టి స్వార్థరహితులూ, ఉత్తములూ, విద్యావంతులూ అయిన వారిని, వందల మందిని భారతదేశపు అన్ని వైపుల నుండి సంపాదించగలను. ప్రజలలో ప్రతి ఒక్కరి గుమ్మం వద్దకు, గ్రామ గ్రామానికి వీరు మతంతో పాటు విద్యను కూడా తీసుకొని వెళ్లాలి. అదేవిధంగా వితంతువులను సంఘటితపరచి స్త్రీలకు అధ్యాపికలుగా చేయాలనే ఆలోచన ఉంది.”*
ఏ రకమైన విద్య గరపాలి?
“కెమెరా పుచ్చుకొని వారి వద్దకు వెళ్లి, వారికి ఖగోళ సంబంధమైనవి గాని, లేక ఏ ఇతరమైన బొమ్మలను, వివిధ దేశాల చరిత్రలకు సంబంధించిన అంశా లను చూపిస్తున్నారనుకొందాం. ఆ విధంగా గ్లోబుల ద్వారా, దేశ పటాల ద్వారా ఎంత విద్య నేర్పవచ్చు? ఆ బోధన అంతా నోటితోనే. విద్య పొందడానికి కన్ను ఒక్కటి మాత్రమే ద్వారం కాదు. చెవులు కూడా ఆ పని చేయగలవు. ఆ విధంగా వారికి ఆశయాలు ఏర్పడతాయి. నైతిక దృక్పథం అలవడుతుంది. అభివృద్ధి చెందడానికి అవకాశం కలుగుతుంది. మన పని ఇంతటితో సరి. మిగిలింది వారే నెరవేర్చుకొంటారు.”*
కాని ఈ విద్యను గురించినంత వరకు ఒక విషయంలో బహు జాగ్రత్తగా వ్యవహరించాలని స్వామీజీ హెచ్చరించారు. అది – మత చేతన నుండి ప్రజలను వైదొలగకుండా చేయడం:
“వారి వారి మతానికి దెబ్బ తగలని రీతిలో పామర జనులను ఉద్ధరించడం – అనే ఆదర్శాన్ని ముందుంచుకోండి….. మీరు జనసామాన్యాన్ని ఉద్ధరించ గలరా? వారి స్వాభావికమైన ఆధ్యాత్మిక నైజం కుంటుపరచక, వారు కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగి వారికి అందించగలరా? సమత్వంలోను, స్వాతంత్ర్యంలోను, కార్యదక్షతలోను, శక్తిలోను పాశ్చాత్యు లందరి కన్నా మీరు పాశ్చాత్యులు కాగలరా? అదే సమయంలో ఆధ్యాత్మిక సంస్కృతిలోను, స్వభావాలలోను మీరు పరిపూర్ణులైన హిందువులుగా ఉండగలరా?….. దానిని మనం చేసే తీరాలి. దానిని సాధించడం కొరకే మీరు జన్మించారు.”*
వీటిని సంస్థాగతంగా ఆచరణరూపంలో పెట్టడంలో శ్రద్ధ వహించారు స్వామీజీ:
“నా జీవిత ఆశయం ఇదే – ఉత్తమ భావాలను ప్రతి గుమ్మం వద్దకు కొని పోయే ఒక యంత్రాంగాన్ని స్థాపించాలి. పిదప స్త్రీలు, పురుషులు తమ విధిని తామే నిర్ణయించుకొంటారు. ప్రధానమైన జీవిత సమస్యలను గూర్చి మన పూర్వీ కులు, ఇతర దేశాల వారు ఏమి ఆలోచించారో, ఆ విషయాలను వారికి తెలియ జేయండి. ముఖ్యంగా ఇతరులు ఏం చేస్తున్నారో చూసిన తరువాత వారిని నిర్ణయించుకోనివ్వండి. రసాయన పదార్థాలను ఒక చోట చేర్చడమే మన పని. ప్రకృతే దాని విధానాల ననుసరించి స్ఫటికీకరణం చేసి తీరుతుంది. కష్టించి పనిచేయండి.స్థైర్యంగా ఉండండి. భగవంతుని యందు విశ్వాసంతో మెలగండి. నే నిప్పుడో, త్వరలోనో వస్తాను.”*
కొలంబో, 1897
చెన్నై, 1897
నిలబడ్డవారు : 1. అలసింగ పెరుమాళ్ 2. గుడ్విన్ 3. ఎం.ఎన్. బెనర్జీ
కుర్చీలో కూర్చున్నవారు : 2. శివానంద 3. స్వామీజీ 4. నిరంజనానంద 5. సదానంద
క్రింద కూర్చున్నవారు : 2. బిలిగిరి అయ్యంగార్ 4. డా. నంజుండరావు
కేసిల్ కర్న్న్
ప్రస్తుత వివేకానంద గృహం, చెన్నై
1897 ఫిబ్రవరి 6 నుంచి 15 వరకు స్వామీజీ బసచేసిన విడిది
కలకత్తా, 1897
నిలబడ్డవారు : 1. శాంతిరామ్ 2. టర్న్‌బుల్ 3. ప్రకాశానంద
5. స్వామీజీ 6. కెప్టెన్ సేవియర్ 7. శివానంద
కుర్చీలో కూర్చున్నవారు : 1. అలసింగ పెరుమాళ్ 2. రామకృష్ణానంద 3. ప్రేమానంద
4. మిసెస్ సేవియర్ 5. అద్భుతానంద 6. తురీయానంద 7. సి.జి. నరసింహాచార్య
క్రింద కూర్చున్నవారు : 2. హారిసన్ (కొలంబో)
కాశ్మీర్ పడవ గృహంలో, 1898
రామకృష్ణ మఠం : నాలుగు దశలు
వరాహ నగర మఠం 1886–1892
ఆలంబజార్ మఠం 1892–1898
నీలాంబర మఠం 1898–1899
బేలూర్ మఠం 1899 నుంచి
బేలూర్ మఠం : ఒక విభాగం
కుడివైపు కట్టడం మేడ కుడి మూలలో స్వామీజీ గది;
కట్టడం ప్రక్కన ‘స్వామీజీ మామిడి చెట్టు’
స్వామీజీ గది
బేలూర్ మఠం, 1899
రెండవసారి పాశ్చాత్యానికి బయలుదేరడానికి ముందు రోజు
నిలబడ్డవారు : 1. దేవేంద్రనాథ్ మజుందార్ 2. నిర్మలానంద 3. విరజానంద 4. శివానంద 5. తురీయానంద
6. అఖండానంద 7. విజ్ఞానానంద 8. శారదానంద 9. సచ్చిదానంద.
కుర్చీలో కూర్చున్నవారు : స్వామీజీ, ప్రక్కన బ్రహ్మచారి హరేంద్రనాథ్. బల్లమీది వారు : 2. సోమానంద 3. కళ్యాణానంద
4. అద్వైతానంద 5. ఆత్మానంద 6. త్రిగుణాతీతానంద 7. సురేశ్వరానంద 8. బోధానంద
9. బ్రహ్మచారి నందలాల్ 10. ఖేడా 11. ప్రకాశానంద 12. ప్రజేన్ 13. శుద్ధానంద. నేల మీద : నిశ్చయానంద
ఆలంబజార్ మఠం, 1897
క్యాలిఫోర్నియా, 1900
బెల్గామ్, 1892
న్యూయార్క్, 1895
“అక్కడ వారిని సంఘటితపరచి కార్యదర్శి బాధ్యత, కోశాధికారి బాధ్యత నువ్వే వహించడానికి తయారుగా ఉండు; ఇక్కడి నా మిత్రులతోను, సానుభూతి పరులతోను సరాసరి ఉత్తరప్రత్యుత్తరాలను, లావాదేవీలను ఎప్పుడు సాగిస్తావో అప్పుడు నీకూ, నాకూ మేలు కలుగుతుంది….. పనంతా నువ్వే చేస్తూ ప్రముఖులను కార్యనిర్వాహక సభ్యులుగా వేసుకో; వారి పేరుకు మంచి విలువ ఉంటుంది.”*
3. శ్రీరామకృష్ణులు : ఈ పనులన్నీ శ్రీరామకృష్ణుల దివ్యనామం పేరిట ఆయనను కేంద్రంగా చేసుకొని జరగాలి.
“మద్రాసులో ఒక దేవాలయం నిర్మించడానికి మైసూరులోను, ఇతర ప్రాంతాలలోను నిధులను సేకరించడానికి ప్రయత్నించు. ఆ దేవాలయంలో గ్రంథాలయం ఒకటి ఉండాలి. కార్యాలయానికి, సన్న్యాసులైన ప్రచారకులు, అర్ధంతరంగా వచ్చే బైరాగులు బస చేయడానికి కొన్ని గదులు ఉండాలి.
“సులభమైన మార్గం ఉంది: ఒక కుటీరాన్ని తీసుకొని దాన్ని గురు మహ రాజ్ ఆలయంగా చేసుకోవాలి. సహాయం పొందడానికీ, పూజించడానికీ పేదలను అక్కడకు చేరనివ్వాలి. ఉదయం, సాయంత్రం అక్కడ పురాణ కథలు వినిపించాలి. తద్ద్వారా జనులకు మీరు బోధింపదలచిన విషయాల నన్నింటినీ బోధించవచ్చు. క్రమేణా ప్రజలకు దాన్లో అభిరుచి కలుగుతుంది. వారే ఆ ఆల యాన్ని నిర్వహించగలరు. కొన్ని సంవత్సరాల్లో ఈ కుటీర దేవాలయమే ఒక మహోన్నతమైన సంస్థగా రూపొందవచ్చు. క్షామనివారణ నిమిత్తమై వెళ్లే వారు ప్రతి జిల్లాలోను మొదట ఒక కేంద్రస్థానాన్ని నిర్ణయించుకొని అక్కడ ఒక కుటీర ఆలయం ప్రారంభించాలి. అక్కణ్ణుండి మన పనులన్నీ సాగుతూవుండాలి.*
ఈ ఆలయంలో శ్రీరామకృష్ణులు ఆరాధ్య దైవంగా ఉండాలని సూచిస్తు న్నారు. ఎందుకు?
“భారతదేశం ఎంతో కాలం బాధలకు లోనయింది. సనాతన ధర్మం ఎంతో కాలం కష్టాల పాలయింది. కాని భగవంతుడు దయామయుడు. తన బిడ్డలను ఉద్ధరించడానికి ఆయన మరోసారి అవతరించాడు. బాగు పడడానికై అనాథలకు మరొక అవకాశం దక్కింది. శ్రీరామకృష్ణుల పాదాక్రాంతమైతేగాని భారతదేశం ఉద్ధరింపబడదు. ఆయన జీవితం, సందేశాలు దేశదేశాంతరాలలో వ్యాప్తి గాంచాలి. హైందవ సమాజంలోని నరనరాలలోకి అవి పాకిపోవాలి.” (లేవండి, మేల్కొనండి!, సంపుటం, 9. 250)
“శ్రీరామకృష్ణుల జీవితం ఒక దివ్యజ్యోతి, దాని అద్భుత తేజంలో హిందూ మత పరావధి అంతా యథార్థ రూపంలో అర్థం చేసుకోవచ్చు. శాస్త్రాలలో ప్రతిపాదించిన తత్త్వజ్ఞానాని కంతటికీ ఆయన ప్రత్యక్ష నిదర్శనం. ఋషులు, అవతారపురుషులు దేనిని బోధింపనెంచారో ఆ తత్త్వాల నన్నింటినీ ఆయన తన జీవితంలో ప్రదర్శించారు. గ్రంథాలూ, సిద్ధాంతాలూ – ఈయన వాటి ఆచరణ, అనుభవం. ఐదు వేల సంవత్సరాల జాతీయ ఆధ్యాత్మిక జీవితాన్నంతా ఈయన తన యాభై ఒక్క సంవత్సరాల జీవితంలో గడిపి, భావితరాలవారికి తానొక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిపోయారు.” (9.274)
ఇక్కడ మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పటికే హిందూమతంలో ఆరాధింపబడుతూన్న దేవతల సంఖ్యకు ఒకటి చేర్చడం కోసం స్వామీజీ శ్రీరామకృష్ణులను మన ముందు ఉంచలేదు. అందుకు మారుగా ఒక ఆదర్శనీయునిగా శ్రీరామకృష్ణులను గుర్తింపజేస్తున్నారు. శ్రీరామకృష్ణులనే ప్రత్యేక వ్యక్తి కాదు; శ్రీరామకృష్ణులనే తత్త్వమే ఇక్కడ సూచింపబడుతున్నది. శ్రీరామ కృష్ణులు గడపిన జీవితం, బోధించిన ఆదర్శాలు మన జీవిత ఆదర్శాలుగా రూపొందాలి. అదే శ్రీరామకృష్ణుల నిజమైన ఆరాధన.
“ఆయన పావన నామం ఎంత అధికంగా వ్యాప్తి చెందితే అంత మంచిది. కాని ఒక విషయం తెలుసుకోవలసి ఉంది. లోకానికి ఒక ప్రత్యేక సందేశమివ్వడానికే మహాయోగులు ఆవిర్భవిస్తారు. పేరుప్రతిష్ఠలకై కాదు. కాని వారి అనుయాయులు ఆ మహనీయుల బోధనలను వెనక్కునెట్టి వారి పేర్ల కోసమే పెనగులాడుతుంటారు. ఇదే ప్రపంచ చరిత్ర. శ్రీరామకృష్ణుల పేరును జనం అంగీ కరించినా, అంగీకరించకపోయినా నేను లెక్కపెట్టను. కాని ఆయన బోధనలు, జీవితం, సందేశం లోకమంతటా వ్యాప్తిచేయడానికై ప్రాణాలను అర్పించడానికి సైతం నేను సంసిద్ధుణ్ణి” (9.258) అని స్వామీజీ వ్రాస్తున్నారు.
పాశ్చాత్యంలో స్వామీజీ అనుభవాలు పెంపొందేకొద్దీ ఆయన భారతదేశా నికి అవసరమైన తన కార్యాచరణ పథకంలో కూడా కొన్ని మార్పులు చేయ గోరారు:
కార్యాచరణ పథకం–విభిన్న అభిప్రాయాలు
“పామర జనుల్లో విద్యావ్యాప్తి చేయాలనే నా ఉద్దేశాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశాను. అది నెమ్మది నెమ్మదిగా జరుగుతుంది. ఉత్సాహపూరితులైన మత ప్రచార కులు ప్రస్తుతం నాకు అవసరం. మద్రాసులో మన కిప్పుడు ఒక కళాశాల అవసరం. దాన్లో వివిధ మతాల్లోని సామరస్యాలను, వ్యత్యాసాలను అధ్యయనం చేయించాలి. సంస్కృతం, వేదాంతంలోని వివిధ సంప్రదాయాలు, ఐరోపా భాషలు అందులో బోధింప బడాలి. దేశీయ భాషల్లోను, ఆంగ్లంలోను పత్రికలు ప్రచురించడానికి ఒక ముద్ర ణాలయం కావాలి.” (9.292)
“ఇదే తరుణం, ఇది చేజారిపోతే ఎన్నడూ కాలం కలసిరాదు. విభిన్న దృక్పథాలలో విషయాలను విచారణ చేసిన తరువాత ఇప్పుడు నా మనస్సు ఈ క్రింది పథకంలో కేంద్రీకృతమైంది. ముందుగా మద్రాసులో ధర్మశాస్త్ర కళాశాల (Theological College) నొక దాన్ని ప్రారంభించాలి. పిదప దాని ఆశయాలను విస్తృతపరచాలి. అక్కడ యువకులకు వేదాలూ, వాటి భాష్యాలూ, తత్త్వాలూ వాటితోబాటు ఇతర మతాల గురించి అవగాహన నేర్పాలి. ఆ కళాశాల ఒక అంగంగా ఆంగ్లంలోను, ప్రాంతీయ భాషలోను ఒక పత్రిక కూడా ప్రారంభిం చాలి.”*
పత్రిక ప్రారంభించాలనే ప్రయత్నంలో స్వామీజీ ముమ్మరంగా ఉన్నారు:
“ఎలాగైనా పత్రికను వెలువరించాలనుకొంటున్నాను. నువ్వు ప్రచురించే పత్రిక చౌకబారుది కాక, స్థిరమైనదిగా ఉదాత్తమైనదిగా ఉండాలి. నీకు డబ్బు పంపుతాను….. పని ప్రారంభించు. ఇక్కడ కొందరు చందాదారులను చేర్పిస్తాను. నేను కూడా పత్రికకు కొన్ని వ్యాసాలు వ్రాస్తాను; అప్పుడప్పుడు అమెరికన్ రచయితలచే వ్రాయించి కూడా పంపుతాను. నువ్వు కూడా అక్కడ శాశ్వత విలువ లున్న రచనలు చేయగల రచయితలను కొందరిని సంపాదించు.”*
బ్రహ్మవాదిన్
స్వామీజీ లేఖలు భారతదేశంలో ముఖ్యంగా, చెన్నైకు, కలకత్తాకు వ్రాయ బడ్డాయి. చెన్నైలో అలసింగ ప్రభృతులు స్వామీజీ ఆదేశం మేరకు వెంటనే ‘రామకృష్ణ సంఘం’ ఒకదాన్ని ఏర్పాటుచేసి పని ప్రారంభించారు. స్వామీజీ ఇచ్ఛ మేరకు మరొక పని కూడ వెంటనే ప్రారంభమయింది. అది ‘బ్రహ్మవాదిన్’ అనే ఆంగ్ల పత్రిక. ఆ పత్రిక ప్రారంభిం చడంలోని ఉద్దేశం అలసింగ ఇలా వివరించారు:
“స్వామి వివేకానంద మార్గదర్శకత్వంలో ‘బ్రహ్మవాదిన్’ అనే పత్రిక ప్రారం భించాలని తీర్మానించారు. హైందవధర్మాన్ని ఆధారం చేసుకొని వేదాంతాన్ని విపులీకరించడమూ, మానవాళికి సామాజికపరమైన, క్రమశిక్షణపరమైన పురోభి వృద్ధికై కృషిచేయడమూ – ఇవి ఈ పత్రిక లక్ష్యాలు….”
1895 సెప్టెంబర్ 15 వ తేదీ ‘బ్రహ్మవాదిన్’ అనే ఆంగ్ల పత్రిక మొదటి సంచిక విడుదలయింది. అలసింగ పెరుమాళ్ ఆ పత్రిక సంపాదకుడయ్యాడు. సేవకూ, వినమ్రతకూ ప్రతిరూపమై విరాజిల్లిన అలసింగ నామధేయం పత్రికలో ఎక్కడా అచ్చు కాలేదు. ఈ పత్రికకు పంపిన ఆశీర్వచన సందేశంలో స్వామీజీ ఇలా వ్రాశారు:
“ముక్తికి మార్గం ఇదేనన్న రీతిలో ‘బ్రహ్మవాదిన్’ విజయానికై కృషిచెయ్యి. పరిపూర్ణ విశ్వాసం అవసరం. ఈ పత్రిక నీ ఇష్టదేవతగా మారాలి. నీ లక్ష్యాన్ని ఎలా సిద్ధించుకోవాలో అప్పుడే నీకు అవగతమవుతుంది.”
స్వామీజీ ఆశీర్వచనాలను హృదయంలో పాదుగొలుపుకొని అలసింగ పని చేయసాగాడు. స్వల్ప ఆదాయం గలవాడైనప్పటికీ, ఇంటి సమస్యలు, తక్కిన పను లన్నింటినీ పట్టించుకోకుండా అతడు పత్రికకు సేవలందించాడు. న్యూయార్క్, లండన్ లాంటి చోట్ల నుండి స్వామీజీ ఆ పత్రికకు చందాదారులను చేర్పించారు. అలసింగ పెరుమాళ్ బావగారైన ఆచార్య రంగాచారి, చెన్నైలోని ప్రముఖులు కొందరు పత్రికలో వ్రాసేవారు. ప్రారంభంలో సి.జి. నరసింహాచార్, ఆర్.ఏ. కృష్ణమాచార్, జి. వేంకట రంగారావు అనేవారు పత్రిక వెలువడడంలో సహాయం అందించారు. అలసింగతో కలసి పలువురు యువకులు కూడా పని చేశారు. ఒక వైపు శంకరుడు, రామానుజుడు, సదాశివ బ్రహ్మేంద్రుడు, పతంజలి గ్రంథాల అను వాదం; కాంట్ మొదలైన పాశ్చాత్య తత్త్వజ్ఞుల రచనలు; ప్రధాన మతాల గురిం చిన వ్యాసాలు; శ్రీరామకృష్ణుల సన్న్యాస శిష్యుల, ధర్మపాలుని, మాక్స్‌ముల్లర్ లాంటి అనేకుల రచనలతో ‘బ్రహ్మవాదిన్’ పత్రిక విజయవంతంగా నడిచింది.
స్వామీజీ సహస్ర ద్వీప వనంలో బసచేసి ఉన్నప్పుడు రచించిన ‘యతిగీతం’ కవితను తమ ప్రథమ కానుకగా ‘బ్రహ్మవాదిన్కు’ పంపించారు. ఆయన మార్గదర్శకత్వ ఫలితంగా, అలసింగ పెరుమాళ్ నిర్విరామ కృషి కారణంగా ‘బ్రహ్మవాదిన్’ విజయవంతంగా కొనసాగింది.* స్వామీజీ ఈ పత్రికపై ఎంతో ఆశ పెట్టుకొన్నారు. నిధుల కొరత కారణంగా పత్రికను నడపడానికి బాగా ఇబ్బంది ఏర్పడ్డప్పుడు స్వామీజీ, “బ్రహ్మవాదిన్ ఆర్థిక దుఃస్థితిని గూర్చి నీ ఉత్తరం ద్వారా తెలుసుకొన్నాను. నేను లండన్‌కు తిరిగి వెళ్లాక సహాయం అందించడానికి ప్రయ త్నిస్తాను. పత్రిక ప్రమాణాన్ని దిగజారనివ్వక కొనసాగించు…. ధైర్యం వహించు. ‘బ్రహ్మవాదిన్’ ఒక మణి – అది అంతరించకూడదు. అలాంటి పత్రిక సహ జంగా, తన కాళ్ళమీద తాను నిలబడాలి. మనం ఆ విధంగా తప్పక చేద్దాం. కొన్ని నెలలు ఓపిక వహించు”* అని వ్రాశారు. పలు లేఖలలో ఆయన ఈ పత్రిక గురించి ప్రస్తావించడమూ, పొరపాట్లను ఎత్తి చూపించడమూ మనం చూడవచ్చు.
ప్రబుద్ధ భారతం
‘బ్రహ్మవాదిన్’ ఉన్నత ప్రమాణాలలో కొనసాగడం వలన మతం, తత్త్వాల గురించి కొంత అవగాహన గలవారే ఆ పత్రికను చదివి అవగతం చేసుకోగలి గారు. కాని శ్రీరామకృష్ణుల, స్వామీజీ, తక్కిన తత్త్వజ్ఞుల భావనలు జనసామాన్యానికి సైతం అందుబాటులో ఉండా లని అలసింగ పెరుమాళ్ అభిలాష. ఎందుకంటే జనసామాన్యాన్ని చేరుకోవడమే స్వామీజీ ప్రధానోద్దేశం కనుక. అలసింగ, డా ॥ నంజుండరావుతో ఆలోచించి మరో పత్రిక ప్రారంభించడానికి స్వామీజీ అంగీకారం కోరాడు. క్రొత్త పత్రిక ప్రారంభించడంలో స్వామీజీ అంతగా ఆసక్తి కనబరచలేదు. అయినప్పటికీ యువకుల ఉత్సాహానికి అవరోధం కల్పించరాదని సమ్మతించారు. ఈ క్రొత్త పత్రికకు ‘ప్రబుద్ధ భారతం’ అని పేరుపెట్టారు. ఇది కూడా ఆంగ్ల మాసపత్రికే. యువకుడూ, విద్యాధికుడూ అయిన పి.ఆర్. రాజం అయ్యర్ ఆ పత్రికకు సంపాదకుడయ్యాడు. ‘బ్రహ్మవాదిన్’ ముద్రితమయ్యే అదే ముద్రణశాలలో ‘ప్రబుద్ధ భారతం’ కూడా ముద్రింపబడింది. 1896 జూలైలో మొదటి సంచిక వెలు వడింది. ఆ రోజుల్లోనే దానికి మూడు వేలమంది చందాదారులు ఉండేవారు.*
పిల్లల పత్రిక
డాక్టర్ నంజుండరావు పిల్లల కోసం ఒక పత్రిక ప్రారంభించాలనుకొన్నారు. దానిని ప్రోత్సహిస్తూ స్వామీజీ ఇలా వ్రాశారు: “పిల్లలకు నువ్వు తలపెట్టిన పత్రిక విషయంలో నీకు నా పూర్తి ఆమోదం ఉంది. నాకు చేత నైనంత సాయం కూడా చేస్తాను…. దానిని స్వతంత్రమైన దాన్నిగా చేయి… సంస్కృత వాఙ్మయంలో అనేక చోట్ల వెల్లివిరిసిన అద్భుతమైన కథలను అతి సులభశైలిలో తిరగరాస్తే అది పత్రికకు ముఖ్యాంశమవుతుంది. నాకు తీరిక చిక్కినప్పుడల్లా వీలైనన్ని కథలను వ్రాసి పంపుతాను” (10.22). ‘వింత లోకంలో ఆలిస్’ (Alice in Wonderland) లాంటి ఒక పిల్లల పుస్తకాన్ని స్వయంగా తానే వ్రాయగోరారు స్వామీజీ.
వివేకానంద ఇలా ప్రసంగించారు
స్వామీజీ భావనలు ఈ రకంగా భారతదేశంలో ప్రప్రథమంగా తమిళ నాడులో కార్యరూపం దాల్చాయి. ‘లోకోపకారి’ లాంటి పలు తమిళ పత్రికలలో స్వామీజీ ప్రసంగాలు అనువదింపబడి వెలువడసాగాయి. అంతేగాక గ్రామీణ ప్రాంతాలలో ఆయన భావనలు ప్రచారం గావించే ప్రయత్నాలు ఆయన జీవితకాలంలోనే తమిళ నాడులో కొనసాగాయి. నాట్రాంపల్లి సమీపంలోని వాణియంబాడికి చెందిన శ్రీ వేంకటస్వామి నాయుడు ఒక సంస్కర్త. ఆయనకు ఆంగ్లం తెలియదు. స్వామీజీ అమెరికాలో ఇచ్చిన ప్రసంగాల తమిళ అనువాదాలను పత్రికలో ఆయన చూశారు. అవి చూసీ, ఆ పత్రికలలో ప్రచురితమైన స్వామీజీ ఛాయాచిత్రాన్ని చూసీ ఆకర్షితుడైన ఆయన స్వామీజీ భావనలను ప్రచారం చేయడమే తన లక్ష్యంగా చేసుకొన్నాడు. ఆయన జ్ఞాపకశక్తి అమోఘం. స్వామీజీ శంఖారావా లన్నీ ఆయనకు కంఠోపాఠం. స్వామీజీ మాదిరే దుస్తులు ధరించి వేదిక మీద నిలబడి వాటిని అట్లే ఒప్పజెప్పేవాడు. చివరగా, “వివేకానంద అమెరికాలో ఈ రకంగా ప్రసంగించారు” అని ముగించేవాడు. ఇది జనులను విపరీతంగా ఆకట్టు కొంది.
స్వామీజీ సేవ–ధర్మ భావనను కూడా వేంకటస్వామి కార్యాచరణలో చూపించారు. పేదల కోసం ఎంతో బాధపడ్డ ఆయన, వారి కోసం ఎన్నో పనులు చేపట్టారు. ఆ ఉద్దేశంతో, ‘వివేకానంద వేదాంత సంఘం’ స్థాపించారు. దానిని గురించి కాలాంతరంలో స్వయంగా స్వామీజీకి ఉత్తరం ద్వారా తెలియజేశారు కూడా! అందుకు అభినందిస్తూ స్వామీజీ ఇలా వ్రాశారు:
శ్రీ కె. వేంకటస్వామి నాయుడు,
వి.వే. సంఘం,
ప్రేమాస్పదా!
మీ అభిమానానికి కృతజ్ఞతలు. వేదమతాన్ని ప్రచారం చేయడానికై మీరు విజయవంతంగా ఒక సంఘాన్ని ప్రారంభించిన సందర్భంగా నా శుభాకాంక్షలు అందుకోండి. మీ ప్రయత్నాలన్నీ విజయవంతమగుగాక! అందరి సభ్యులకూ నా కృతజ్ఞత, శుభాకాంక్షలు.
భగవత్సేవలో మీ
వివేకానంద
స్వామీజీ జీవిత కాలంలోనే ఆయన పేరిట, ఆయన ఆశయాల స్ఫూర్తితో నిర్వహించబడిన తమిళనాడుకు చెందిన సంఘం ఇదొక్కటే అయివుండవచ్చని అనిపిస్తూన్నది. తమ పేరిట సంఘం ఏర్పడి ఉండడం వలన సిగ్గుపడో ఏమో స్వామీజీ తమ పేరును పూర్తిగా వ్రాయకుండా వి.వే. సంఘం అని వ్రాశారు.*
ఈ విధంగా అనేక మార్గాలలో స్వామీజీ భావనలు భారతదేశంలో ఆచరణ రూపాన్ని దాల్చసాగాయి.
రామకృష్ణ మఠం
ఈ కార్యక్రమాలన్నింటికీ కేంద్రంగా విరాజిల్లవలసినవి రామకృష్ణ మఠాలు. ప్రారంభకాలంలో వరాహనగరంలోను, పిదప ఆలంబజార్లోను నెలకొన్న మఠంలో నివసించిన సోదర సన్న్యాసులకు స్వామీజీ పలు లేఖలు వ్రాశారు. వాటిలో వారి జీవితాలను భగవత్పరమైన జీవితాలుగా తీర్చిదిద్దుకోవాలని పదేపదే వక్కాణించి ఉన్నారు. శ్రీరామకృష్ణుల పేరిట స్థాపితం కానున్న ఈ మఠం మూడు విషయాలలో శ్రద్ధ వహించాలని స్వామీజీ అభిలషించారు. అవి: 1. అధ్యయనం, ప్రచారం 2. సేవ 3. ఆధ్యాత్మిక సాధనలు.
వీటిలో ‘సేవ’ అనే అంశాన్ని స్వామీజీ మరీ మరీ వక్కాణించారు. శ్రీరామ కృష్ణులను కేంద్రంగా చేసుకొని సేవాకార్యాలన్నీ జరగాలి; ఇంటింటికీ వెళ్లి సేవా కార్యక్రమాలలో పాల్గొనాలనే భావనలను పదేపదే వాక్రుచ్చివున్నారు:
కొన్ని విషయాలను గుర్తుంచుకోండి –
- మనం సన్న్యాసులం. భక్తి, ముక్తి, భోగం మొదలైన అన్నింటినీ మనం త్యజించాం.
- లోకానికీ, అధముడి వరకు ప్రతిఒక్కరికీ అత్యుత్తమమైన మేలు చేకూర్చడం – ఇదే మన వ్రతం. ముక్తిగాని, నరకంగాని – దానివల్ల ఏది ఎదురైనా సరే!
- జగత్కల్యాణానికి శ్రీరామకృష్ణ పరమహంస అవతరించారు. ఆయనను మానవుడనిగాని, దైవం అని గాని, అవతారమనిగాని మీ ఇష్టం వచ్చినట్లు పిలుచుకోండి. మీకు అర్థమైన రీతిలో ఆయనను ఒప్పుకోండి.
- ఆయన ముందు ప్రణమిల్లిన వాడు తక్షణమే మేలిమి బంగారంగా మార్చివేయబడతాడు. ఈ సందేశాన్ని తీసుకొని ప్రతి గుమ్మానికీ వెళ్లండి. మీలోని అశాంతి పూర్తిగా అంతరిస్తుంది. భయపడవద్దు. భయానికి తావెక్కడ? దేనికైనా భయపడకుండడమే మీ జీవిత లక్షణం. ఇంతవరకు మీరు ఆయన నామాన్ని, మీ శీలాన్ని వ్యాప్తి చేశారు. మంచిదే. ఇప్పుడు దాన్ని సమైక్యమైన విధానంలో వ్యాప్తి చేయండి. భగవంతుడు మీ వెంట ఉన్నాడు. ధైర్యం వహించండి.*
ఈలోగా రామకృష్ణ – వివేకానంద ఆదర్శాలచే ఆకట్టుకోబడిన యువకులుపలువురు తమ జీవితాన్ని భగవంతుని కోసమూ, మాతృదేశం కోసమూ అంకితం చేయడానికి ముందుకు వచ్చి మఠంలో చేరారు.
నిర్వాహకులకు సంబంధించినంత వరకు ఒక ఆవర్తన విధాన నియమాన్ని ఆయన అభిలషించాడు. ముందుగా బ్రహ్మానందస్వామి అధ్యక్షుడు, నిర్మలానంద స్వామి ప్రధాన కార్యదర్శీ – కోశాధికారీ, సదానంద స్వామి గ్రంథాలయాధిపతిగా ప్రారంభించవచ్చు. రామకృష్ణానందస్వామి, అభేదానందస్వామి, తురీయానంద స్వామి, త్రిగుణాతీతానందస్వామి – వీరు తరగతులను, ప్రచార కార్యాన్ని నిర్వ హించవచ్చు. బుద్ధుడు తన మఠాన్ని నిర్వహించిన రీతిలో నిర్వహణ బాధ్యతలు ఉండాలని స్వామీజీ పలు మార్గదర్శక సూత్రాలు తెలిపారు. ఆలంబజార్ మఠ వాసులు సేవాకార్యాలలో ఉత్సాహంతో పాల్గొంటున్నారని తెలిసి స్వామీజీ ఎంతో సంతోషించారు.
ఇలాంటి మఠాలు దేశవ్యాప్తంగా ఉద్భవించాలని స్వామీజీ అభిలషించారు: “కలకత్తాలో ఉన్న మన మఠం వంటిది ప్రతి జిల్లాలోను వెలసినప్పుడు నా హృదయాభీష్టం నెరవేరినట్లవుతుంది”*
మహిళల పని
మహిళల పని కోసమూ స్వామీజీ యోచిస్తూనే వచ్చారు. మాతృమూర్తి శ్రీశారదాదేవిని కేంద్రంగా చేసుకొని తక్షణమే ఉపక్రమించాలని ఆయన పథకం. ఆయన ఇలా వ్రాశారు: “మాతృమూర్తి శ్రీ శారదాదేవికి ఒక చోటు రూపొందించగలిగితే నా ఆందోళన దాదాపు తగ్గి పోతుంది, అర్థమవుతూన్నదా? రెండు మూడు వేల రూపాయలలో ఏదైనా ఒక స్థలం చూడండి. స్థలం విశాలంగా ఉండాలి. కట్టడం గట్టిగా ఉండాలి… మన విషయం గురించి కలత చెందాల్సిన పని లేదు. అంతా క్రమంగా జరుగుతుంది…. ఒక చోటంటూ ఏర్పడితే మాతృదేవిని కేంద్రంగా చేసుకొని గౌరీమా, గోలాప్ మా ప్రభృతులు జాగృతిని కలిగిస్తారు గాక!”
ఈ విధంగా స్వామీజీ పథకాలైన మఠాలూ, సేవాకార్యమూ, పత్రికలూ పెంపొందసాగాయి. దేశం తన దీర్ఘనిద్ర నుండి మేల్కొనసాగింది. ఇలా చక్కగా దున్ని సిద్ధం చేసిన పొలంలో తమ సందేశ బీజాలను చల్లడానికి స్వామీజీ మాతృ దేశాభిముఖులైనారు.