సంతానం కావాలని ప్రార్థన చేయాలి. శాపగ్రస్థులై జన్మించిన, క్షణికోద్రేక ఫలితంగా పుట్టిన, నిరోధించలేనందున జన్మించిన పిల్లల నుండి, అలాంటి వారసత్వం సంతరించుకొన్నవారి నుండి మనం ఏం ఆశించగలం?
– స్వామి వివేకానంద
భువనేశ్వరి ప్రార్థన — యుగనాయకుని అవతరణ — ముద్దుబిడ్డ — చిలిపి చేష్టలు — ప్రాథమిక విద్యాభ్యాసం, ఆధ్యాత్మిక బీజం — కథలోయ్ కథలు! — మొదటి ఆంతరిక చైతన్య దశ — ఆంజనేయ అన్వేషణ — సాధువుల పట్ల అనురక్తి — ‘నేను సన్న్యాసిని అవుతాను!’ — నేను సన్న్యాసినై ఉండేవాణ్ణి — ‘అనిర్వచనీయ ఆనందం పొందాను!’ — ప్రాథమిక విద్యాభ్యాసం — మిత్రులతో — మాతృదేవోభవ — పితృదేవోభవ — సాహస వివేకాలు — కులం అంటే ఏమిటి? — తన ప్రాణాన్ని సైతం తెగించి…. — నేత — గంగాభవాని పట్ల భక్తి — వ్యాయామ మండలి — కర్రసాము వీరుడు — దయ — సాహసం — ప్రమాదం — అంతర్ముఖ స్థితి — ధ్యాన సిద్ధుడు — జ్యోతి వెలుగులో నిద్రించే ఉన్నత బాలుడు
భువనేశ్వరి ప్రార్థన
“నా జననం కోసం నా తల్లితండ్రులు ఏళ్ల పర్యంతం నోములు నోచి, ప్రార్థనలు చేశారు. సంతానార్థం తల్లితండ్రులు ప్రార్థించాలి. ‘ప్రార్థన వలన జన్మించినవాడే ఆర్యుడు’ అని స్మృతికర్తయైన మనువు ఆర్యుని గూర్చి నిర్వచిస్తున్నాడు. ప్రార్థనారహితంగా జన్మించిన ప్రతి శిశుమా మనువు అభిప్రాయంలో ధర్మవిరుద్ధంగా జన్మించిందే” అంటున్నారు స్వామి వివేకా నంద.
అవసరాలు కలిగినప్పుడే ప్రార్థన జనిస్తుంది. సంతానం కావాలనే తల్లి తండ్రుల హృదయపూర్వకమైన ఆర్తి, ప్రార్థనగా పరిణమిస్తుంది; దాని ఫలితంగా ఈ లోకంలోకి వచ్చేవాడు శ్రేష్ఠతముడైన వ్యక్తిగా విరాజిల్లుతాడు. భువనేశ్వరీదేవి కూడా చిత్తశుద్ధితో ప్రార్థించింది. అచంచల భక్తిప్రపత్తులతో ఆమె పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చింది. మొదట మగపిల్లవాడే జన్మించినప్పటికీ, అతడు విగతజీవు డయ్యాడు. తరువాత వరుసగా నలుగురు ఆడపిల్లలు పుట్టారు. అందుకే మగపిల్ల వాడికోసం ఆమె ఆర్తితో పరమశివుణ్ణి ప్రార్థించింది. ఒక సంవత్సరం అవి చ్ఛిన్నంగా ఆమె సోమవార వ్రతం* అనుష్ఠించింది. కాశీలో నివసిస్తూన్న తన అత్తలలో ఒకరిని కాశీలో వెలసివున్న వీరేశ్వర శివునికి* సోమవారాలలో తన తరఫున విశేష పూజలు చేయమని కోరింది. ఈ విధంగా భువనేశ్వరి ఒక సంవత్సర కాలంపాటు నిరంతరాయంగా జప, పూజ, పారాయణలతో తపోమయ జీవితం గడపింది.
ఇలావుండగా ఒక రోజు పగలంతా ప్రార్థనలోను, పూజలోను నిమగ్ను రాలైన భువనేశ్వరి ఆ రాత్రి ఒక కలకన్నది. ఆ కలలో శివుడు ధ్యాన స్థితిలో మగ్నుడై కనిపించాడు. హఠాత్తుగా ఆయనలో నుండి ప్రకాశమానమైన కాంతి వెల్లువలా వెలువడి భువనేశ్వరిని ఆవరించింది. అప్పుడు భువనేశ్వరి మనస్సు అనిర్వచనీయ ఆనందంలో ఓలలాడింది. ఆ సమయంలో పరమశివుడు ధ్యానం చాలించి లేచి ఒక మగపిల్లవాడుగా మారిపోయాడు. “సాక్షాత్తు ఆ భగవంతుడు నాకు కుమారునిగా జన్మించబోతున్నాడా! నా ప్రార్థనను ఈ విధంగా నెరవేర్చ నున్నాడా? చిత్తశుద్ధితో భక్తులు చేసే ప్రార్థనలను భగవంతుడు ఈ రకంగా ఈడేరుస్తాడా? ప్రభో, పరమేశ్వరా!” అంటూ భువనేశ్వరి మనస్సు పారవశ్యంలో విలపించింది. ఇంతలో కల చెదరిపోయింది. మేల్కొన్న తరువాత కూడా ఆ కాంతి వెల్లువ తనను ఆవరించి ఉండడం ఆమె గమనించకపోలేదు.
యుగనాయకుని అవతరణ
చిత్తశుద్ధితో చేసిన ప్రార్థనల వలనా, దైవసంకల్పం చేదోడు గావడం వలనా త్వరలోనే భువనేశ్వరి గర్భం దాల్చింది. 1863 జనవరి 12 వ తేదీ సోమ వారం (కృష్ణ సప్తమి, ధనుర్లగ్నం, కన్యారాశి, హస్తానక్షత్రం) ఉదయం ఆరు గంటల 33 నిమిషాల 33 సెకండ్లకు ఒక అందమైన మగబిడ్డకు భువనేశ్వరి జన్మనిచ్చింది. అప్పటికి సూర్యోదయానికి ఇంకా ఆరు నిమిషాలుంది. నాడు మకర సంక్రాంతి పర్వదినం. సూర్యుడు ఉత్తరాభిముఖంగా తన సంచారాన్ని ప్రారంభించే ఉత్తరాయణ పుణ్య కాలం. కాశీ వీరేశ్వర శివుని అనుగ్రహం వలన జన్మించాడు కాబట్టి ఆ పిల్ల వాడికి విశ్వేశ్వరుడని నామకరణం చేశారు. ముద్దుగా ‘బిలే’ అని పిలిచేవారు. ఆ తరువాత నరేంద్రనాథ్ అనే పేరు స్థిరపడింది. క్లుప్తంగా నరేన్ అనేవారు.
ముద్దుబిడ్డ
బాల్యం మధురంగా గడచిపోవడం ఉత్కృష్ట జీవితానికి ఒక చక్కని పునాది లాంటిది. సంతానం ఎలాంటివారైనా తల్లితండ్రులకు అల్లారుముద్దే. ఇక దీర్ఘ కాలం తపస్సు, ప్రార్థనలు అనుష్ఠించిన తదనంతరం పుట్టిన బిడ్డ విషయం విడిగా చెప్పనక్కరలేదు. అలా జన్మించినవాడు నరేన్. అందువలన తల్లితండ్రులకు అతడు ముద్దుబిడ్డ గావడంలో వింతేమీలేదు. అందంతోను, చిలిపిచేష్టలతోను, చురుకుదనంతోను చూపరులందరి మనస్సు లనూ నరేన్ దోచుకొనేవాడు. ఇంటికి వచ్చిన అత్తల, పిన్నమ్మల, బంధువుల, ఇరుగుపొరుగు వారందరితోను నరేన్ ఇట్టే కలిసిపోయేవాడు. అతడితో ఆడు కోవడానికీ, అతణ్ణి సముదాయించడానికీ ఇంట్లో బంధువుల, స్నేహితుల పిల్లలు పలువురు ఉండేవారు. ఆడుకోవడానికి అతడికి బోలెడన్ని ఆటవస్తువులు ఉండేవి.
తల్లి భువనేశ్వరీ దేవి
కాశీ వీరేశ్వర శివుడు
మగబిడ్డ కోసం భువనేశ్వరి ఆరాధించిన ఆలయం
స్వామీజీ జన్మగృహం
ప్రస్తుత ఆకృతి
రుక్మిణీదేవి
అమ్మమ్మ
స్వర్ణమయీదేవి
పెద్ద అక్క
మహేంద్రనాథ్ దత్తా
పెద్ద తమ్ముడు
భూపేంద్రనాథ్ దత్తా
చిన్న తమ్ముడు
కలకత్తా, 1886
పశుపక్ష్యాదుల పట్ల నరేన్‌కు అపార ప్రేమ. కోతి, మేక, నెమలి, పావురం, తెల్ల ఎలుకలు ఇత్యాదులను విశ్వనాథ్ కుమారుడికి కొనియిచ్చాడు. అక్కడ ఒక మృగప్రదర్శనశాల వెలసిందనడం సబబేమో! అతడు స్వయంగా తనే వాటికి స్నానం చేయించి, ఆహారం తినిపించేవాడు. గోవులంటే అతడికి ఎంతో ప్రీతి. పర్వ దినాలలో పెద్దలు పూజించేటప్పుడు తను కూడా వాటికి బొట్టుపెట్టి నమస్కరించే వాడు. కాస్త ఎదిగిన తరువాత స్వారీ చేయడానికి ఒక పిల్లగుర్రాన్ని తండ్రి కొని ఇచ్చాడు.
తమ బండి తోలే వాడిపట్ల నరేన్ ఎంతో అపేక్షగా ఉండేవాడు. ఉత్తి అపేక్షే కాదు, బండితోలేవాడు కావాలన్నది అతడి భావి ధ్యేయంగా ఉండేది. బండి తోలేవాడి తలపాగా, ఉడుపులు, కొరడా, ఒక్క చిటికలో దౌడుతీసే గుర్రాలు నరేన్ దృష్టికి అతిపెద్ద విషయాలుగా తోచాయి. అతడికి గుర్రాలంటే ఎంతో మక్కువ. “శ్రేష్ఠమైన గుర్రాలను కొంటాను. ఊళ్లోనే మిన్నయైన బండిని కొంటాను. సాహస వంతుడైన బండి తోలేవాణ్ణి నియమించుకొంటాను” అనేవాడు నరేన్.
చిలిపి చేష్టలు
దుడుకు, అల్లరి, చిలిపి సమ్మిశ్రితమైన దుందుడుకు బాలుడు నరేంద్రుడు. అతడిలో సదా చిలిపితనం చిందులాడేది. ఒకింతసేపు కూడా అతడు ప్రశాం తంగా ఉండేవాడు కాడు. ఈ క్షణం కూర్చుంటాడు, మరు క్షణంలో లేస్తాడు. చేయడానికి ఏం తోచకపోతే అల్లరి చేస్తాడు. అతణ్ణి అదుపులో ఉంచడం అసాధ్యం. ఎలాంటి గదమాయింపుతోను అతణ్ణి శాంతింపజేయడం కుదరనిపని. భువనేశ్వరి విసిగివేసారి, “సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు కుమారునిగా జన్మించాలని వరం కోరుకొంటే, ఆయన తన భూతగణాలలో ఒకదాన్ని పంపించాడు” అని వాపోవడం కద్దు. అతణ్ణి శాంతింప జేయడానికి ఒక్కటే దారి! ‘శివ శివ’ అంటూ తలమీద చన్నీరు కుమ్మరించడమే! మరుక్షణమే అతడి అల్లరి అణగిపోయేది. అతడి అల్లరితో విసిగిపోయే భువనేశ్వరి ఒక్కోసారి, “ఇదుగో చూడు బిలే! ఇలా అల్లరి పిల్లవాడిగా తయారయ్యావంటే పరమేశ్వరుడు నిన్ను కైలాసానికి రానివ్వడు” అని బెదిరించగానే నరేంద్రుడి అల్లరి మటుమాయమయ్యేది. అంతేగాక, “పరమేశ్వరా! ఇకమీదట ఇలా ప్రవర్తించను. ఈ ఒక్కసారికి మాత్రం క్షమించు” అని పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవాడట. ప్రార్థన అయితే ఇట్టే చేసేవాడుగాని అల్లరి? అట్లే కొనసాగేది.
నరేన్ అక్కలిద్దరినీ ఆటపట్టించేవాడు. వారిని బాగా విసిగించి, ఒకే పరు గులో వీథి చివరన ఉన్న మురుగు కాలువలో దిగి నిలబడేవాడు. వారు అక్కడ కొచ్చి తనను పట్టుకోరని అతడి ధీమా. మురుగు కాలువలో నిలబడడం మాత్రమే కాక, బురద తీసి వారి మీద విసిరి, “ఇప్పుడు పట్టుకోండి చూద్దాం” అని వారిని కవ్వించి, వెక్కిరించేవాడు. “కేవలం అతణ్ణి చూసుకోవడానికి ఇద్దరు దాదులను నియమించాను” అని కాలాంతరంలో భువనేశ్వరి చెప్పడం కద్దు.
పళ్లెంలో మిఠాయిలు తెచ్చి పిల్లలందరికీ పంచిపెట్టడానికి వచ్చేవారు. నరేంద్రుడు తన వంతు మిఠాయి పుచ్చుకొని కాస్త రుచిచూసేవాడు. ఆ మిఠాయి నచ్చితే తాను రుచి చూసిన మిఠాయిలో మిగిలిన దాన్ని పళ్లెంలోని మిఠాయిల మీద ముక్కలు చేసి చల్లేవాడు. ఆ తరువాత, “మిఠాయి అంతా ఎంగిలయి పోయింది. ఎవరు తింటారు ఈ మిఠాయిలన్నీ!” అంటూ చిలిపిగా అందరివంకా చూసేవాడు. అతడు అనుకొన్నట్లే జరిగేది. మిఠాయిలు తినడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కారు. అప్పుడు తనకు కావలసినంత తీసుకొని తినేవాడు.
ప్రాథమిక విద్యాభ్యాసం, ఆధ్యాత్మిక బీజం
తల్లి ఒడిలోనే బిడ్డ విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టబడుతుంది. తల్లి పాలతో పాటు ఆమెలోని సద్గుణాలూ, ఉన్నతాదర్శాలూ గ్రోలడమే బిడ్డకు విద్యాభ్యాసంగా పరిణమిస్తుందనడం అతిశయోక్తి కాదు. తల్లి తన బిడ్డను పెంచే తీరు ఆతడి భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. నరేంద్రుడి తల్లి ఆతడికి గరపిన విద్య సాటిలేనిది. “జీవితంలో నేను సాధించినవన్నింటికీ నా తల్లికి ఋణపడివున్నాను” అనేవారు కాలాంతరంలో స్వామి వివేకానంద.
భారతీయ సంస్కృతిలోని దేవీదేవతల, ఋషుల, వారి త్యాగమయ జీవి తాల, ఇతిహాస నాయకులను గూర్చి కథల ద్వారా, పాటల ద్వారా భువనేశ్వరీదేవి నుండి నరేంద్రుడు విన్నాడు. ముఖ్యంగా ఆమె చెప్పిన రామాయణ, మహాభారత కథలు అతడి హృదయంలో చెరిగిపోని ముద్రవేశాయి. తన బామ్మ, ఆమె అమ్మ వద్ద అనేక భాగవత కథలు కూడా నరేంద్రుడు విన్నాడు.
ఆ రోజుల్లో వీథి గాయకులు చారిత్రక సత్యాలను, తత్త్వాలను, సాహసో పేత వీరగాథలను సరళమైన గ్రామ్య పాటల రూపంలో గానం చేస్తూ భిక్షాటన చేసేవారు. నిరక్షరాస్యులైన గ్రామస్థులకూ, చిన్నపిల్లలకూ ఈ పాటలు ప్రాథమిక విద్యలో ఒక ముఖ్య అంశంగా చోటుచేసుకొన్నాయి. కొన్ని సమయాల్లో ఒంటరి గాను, కొన్ని సందర్భాలలో ఒక బృందంగాను కృష్ణుని వేషం దాల్చీ, దేవి చిత్తరు వును చేతుల్లో ఉంచుకొనీ వచ్చేవారందరినీ నరేంద్రుని కోసం తమ ఇంటి ప్రాంగణంలోకి పిలిపించి భువనేశ్వరి పాడమని కోరేది. ఆడుతూ పాడుతూవున్న వారి ముందు నిశ్చలంగా కూర్చుని వారి ఆటపాటలు చూసీ వినీ నరేంద్రుడు ఆనందించేవాడు. రోజూ ఇంట్లో మధ్యాహ్నంపూట రామాయణ మహాభారతాలు పారాయణ చేసేవారు. ఆ సమయాల్లో కూడా తన చిలిపిచేష్టలు కట్టిపెట్టి నరేం ద్రుడు ప్రశాంతంగా కూర్చుని వినేవాడు.
కథలోయ్ కథలు!
ఇలా తాను విన్న కథలను తమ్ముళ్లకూ, చెల్లికీ చెప్పి నరేంద్రుడు వారిని ఆనందింపజేసేవాడు. అందరూ ఒకే చోట పడుకొనేవారు. మొదట నరేంద్రుడు, తరువాత మహేంద్రుడు, సోదరీమణులు, నాయనమ్మ, అమ్మ – ఈ వరుసలో పడుకొనేవారు.* కొన్ని సమయాల్లో నరేంద్రుడు ముఖాన్ని దిండులో పెట్టి, బోర్లాపడుకొనేవాడు. “అన్నయ్యా, ఒక కథ చెప్పవా?” అని మహేంద్రుడు అడిగిందే తడవు, వెల్లకిలా తిరిగి కథ చెప్పనారంభించేవాడు.
ఒక ఊళ్లో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె ఒక మేకను పెంచుతూ వచ్చింది. ఒక రోజు ఆ మేకమీద కన్నువేసిన దొంగ ఒకడు దానిని కాజేసి, దాని మాంసం వండుకొని హాయిగా తిన్నాడు. సంగతి ఎలాగో పసిగట్టి ఆ వృద్ధురాలు ఆ దొంగతో దెబ్బలాడింది. అందుకు ఆ దొంగ, “నాయనమ్మా, నీ మేకను నేను కాజేశానని అనుకొంటున్నావా? లేదు, నేను దొంగలా కనిపిస్తున్నానా? ఆ మేక ప్రస్తుతం పునర్జన్మ పొందింది. ప్రక్క ఊళ్లో ఒక ముల్లాగా పుట్టింది. కావాలంటే వెళ్లి చూసిరా!” అన్నాడు. మేకను కట్టి తీసుకురావడానికి ఒక తాడుతో సహా ముసలమ్మ తిన్నగా ఆ ఊరికి వెళ్లింది. ఆ సమయంలో ముల్లా ఒక పంచాయతీ జరుపుతున్నాడు. ఆ ముల్లా నల్లగా ఉన్నాడు. మేక కూడా నలుపే! ఆ పంచాయతీలో ఒక గొర్రెల కాపరి కూడా ఉన్నాడు. వీటినన్నింటిని తరచి పరికించిన ఆ వృద్ధురాలు దొంగ చెప్పింది నిజమేనని నిశ్చయించుకొంది. వెంటనే త్రాడు చేత పుచ్చుకొని ముల్లా వద్దకెళ్లింది. త్రాడును ముల్లా ముందు ఆడిస్తూ, “ఉర్ర్ర్, అర్ర్ర్, మేమే…. రా రా” అనసాగింది. ముల్లాకు ఏమీ అర్థం కాలేదు. ఆగ్రహంతో అతడు, “పిచ్చిదానిలా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు?” అని వృద్ధురాలిని గద్దించాడు. అప్పుడు జరిగిందంతా ఆ వృద్ధురాలు పూసగ్రుచ్చినట్లు ముల్లాకు వివరించి చెప్పింది. ముసలమ్మను ఆ దొంగ మోసగించాడని ముల్లా గ్రహించి, వాణ్ణి పట్టుకొని తగిన శిక్ష విధించాడు.
“అన్నయ్యా! మరో కథ…” అనేవాడు మహేంద్రుడు. అలా అడగడమే తరువాయి, నరేన్ ప్రారంభించేవాడు.
చేతుల నీడను గోడ మీద పడేలాచేసి, ఆ నీడలతో అనేక ఆకృతులు కల్పించడంలో కూడా నరేంద్రుడు సిద్ధహస్తుడు. చెల్లీ తమ్ముళ్లు అలా చేసి చూప మని నరేంద్రుణ్ణి అడగడం కద్దు. వెంటనే ఒక దీపం తీసుకొని వెలుగు గోడ మీద పడేలా దానిని అమర్చేవాడు. తరువాత తన చేతులను గోడకూ దీపానికీ మధ్య ఉంచి చేతులనూ వ్రేళ్లనూ చిత్రవిచిత్రంగా వంచి, త్రిప్పి దుర్గ, సరస్వతి, లక్ష్మి, గణపతి, ఎగిరే గబ్బిలం, గుర్రపుస్వారీ చేస్తున్న వీరుడు వంటి ఆకృతులను కల్పించి చూపేవాడు. ఈ ప్రక్రియలో నరేంద్రుడి ప్రతిభ మెచ్చుకోదగ్గదే అయినప్ప టికీ, చూపరులు కూడా తమ కల్పనాశక్తికి కాస్త పదనుపెట్టుకోవాల్సి ఉండేది.
మొదటి ఆంతరిక చైతన్య దశ
తల్లి నుండి, వీథిగాయకుల నుండి, ఇతరత్రా విన్న రామాయణ కథ, సీతారాముల ఆదర్శం నరేంద్రుడి హృదయంలో గాఢంగా పాదుకుపోయాయి. పూజామందిరంలో దేవీదేవతల ముందు పెద్దలు కళ్లుమూసు కొని ధ్యానంచేస్తూ కూర్చోవడం చూసినప్పుడు, నరేంద్రునికి కూడా అలా ధ్యానం చేయాలనే ఆసక్తి జనించింది. కాబట్టి మిత్రుడైన హరితో కలిసి ఒక సీతారాముల బొమ్మను కొన్నాడు. ఇంట్లో మామూ లుగా అంతగా ఎవరూ వెళ్లని మేడమీది ఒక గదిని ఎంచుకొన్నాడు. గది లోపలికి వెళ్లి, గడియ పెట్టుకొని సీతారాముల బొమ్మను ఒక చోట అమర్చి దాని ముందు వారిద్దరూ కూర్చుని ధ్యానం ప్రారంభించారు. చాలాసేపటి దాకా వారిద్దరూ కన బడకపోవటంతో ఇద్దరి ఇళ్లవారు వారికోసం వెదుకనారంభించేవారు. అనేక చోట్ల వెదకిన తరువాత ఆ గదివద్దకు వచ్చారు.
తలుపు తట్టారు. బదుల్లేదు. దాంతో తలుపులు బ్రద్దలు కొట్టడానికి ప్రయ త్నించారు. బయట ఏవేవో శబ్దాలూ, తలుపులు బ్రద్దలు కొట్టే ధ్వనీ హరి మాత్రం విన్నాడు. వారు తలుపులు బ్రద్దలు కొట్టి గదిలోకి రాగానే హరి పలాయనం చిత్తగించాడు. కాని నరేంద్రుడు మాత్రం కళ్లు మూసుకొని కూర్చునే ఉన్నాడు. ఎంత పిలిచినా లేవలేదు. తరువాత గట్టిగా తట్టి లేపినప్పుడే అతడికి బాహ్య స్మృతి కలిగింది. అతడు కళ్లు తెరచి, “నన్నెందుకు విసిగిస్తున్నారు? నన్ను ఏకాం తంగా వదలిపెట్టండి” అన్నాడు. అలవాటుకు మారుగా నిర్బంధం, ఒత్తిడి అతడి మాటల్లో ధ్వనించాయి. ఒక రకంగా విస్తుబోయినవారు ఏం అనడానికీ పాలుబోక అక్కణ్ణుండి వెళ్లిపోయారు. నరేంద్రుని ధ్యానం వయస్సుకు మించిన సాధనగా వారికి తోచింది. నరేంద్రుడు ఆంతరిక చైతన్యంలో లయించిపోగల సమర్థుడని పై సంఘటన చెప్పక చెబుతుంది. అప్పుడు ఆతడి వయస్సు ఏడేళ్లు.
శ్రీరాముడు పాటించిన ఏకపత్నీవ్రత ఆదర్శమూ, ఒక ఆదర్శప్రాయమైన సతీమణిగా జీవించిన సీత చిత్తరుమా నరేంద్రుడి హృదయంలో చెరగని ముద్ర వేశాయి. ఇలాంటి ఆదర్శప్రాయమైన జీవితం గడపడమే అత్యుత్తమ లక్ష్యమని అతడు విశ్వసించాడు. కాని ఒక రోజు బండి తోలేవాడితో మాట్లాడుతున్నప్పుడు, తన వైవాహిక జీవితంలో ఎదుర్కొంటున్న శ్రమలను, కష్టాలను ఆ బండివాడు ఏకరవు పెట్టడం తటస్థించింది. చివరికి వైవాహిక జీవితం నిరర్థకమని కూడా అతడు తేల్చిచెప్పాడు.
‘అలా అయితే……’ నరేంద్రుడి ఆలోచన గిర్రున తిరిగింది; ‘శ్రీరాముడు కూడా వివాహితుడే కదా! నిరర్థకమైన వివాహం చేసుకొన్న ఆయన నా కెలా ఆరాధనీయుడవుతాడు?’ అనుకొన్నాడతడు. అంతే, తనను నిగ్రహించుకోలేక పోయాడు. భోరున విలపిస్తూ ఒక్క పరుగులో వెళ్లి అమ్మ ఒడిలో వాలిపోయి తన సమస్యను చెప్పాడు. “దానికేం నాయనా! నువ్వు శ్రీరాముణ్ణి ఆరాధించవద్దు, శివుణ్ణి ఆరాధించవచ్చు కదా! ఆయన త్యాగమూర్తి కదా!” అని సమయోచితంగా జవాబిచ్చింది భువనేశ్వరి. ఈ జవాబు నరేంద్రుడికి బాగా నచ్చింది. పరుగెత్తు కొంటూ పోయి మేడమీది తన గదిలో అమర్చివుంచిన సీతారాముల విగ్రహాన్ని విసిరి పారేశాడు.
మర్నాడే శివుని విగ్రహాన్ని తెచ్చి సీతారాముల విగ్రహం ఉంచిన అదే చోట అమర్చి దాని ముందు కళ్లు మూసుకొని కూర్చుని ధ్యానం చేయనారంభించాడు. ఏదైనా ఒక విషయం తీసుకొంటే దాని అంతు తేల్చేదాకా దాన్లో లీనమైపోవడ మనే నిశ్చలబుద్ధి చిన్ననాడే నరేంద్రుడిలో స్వతస్సిద్ధంగా పాదుకుపోయింది.
ఆంజనేయ అన్వేషణ
సీతారాముల విగ్రహాన్ని విసిరివేసినప్పటికీ రామాయణం పట్లా, సీతా రాముల ఆదర్శాలపట్లా, ఆంజనేయస్వామి పట్ల ఉన్న గాఢాభిమానం మాత్రం చెక్కుచెదరలేదు. చుట్టుప్రక్కల ఎక్కడ రామాయణ కాలక్షేపం జరిగినా నరేంద్రుడు అక్కడ హాజరు కావలసిందే. ఒక రోజు రామాయణ కథ చెబుతున్న పండితుడు ఆంజనేయుడు అరటి తోటల్లో నివసిస్తూవుంటాడని చెప్పాడు. ఈ మాట నరేంద్రుని పసిమనస్సులో గాఢంగా హత్తుకు పోయింది. అతడు తిన్నగా ఆ పండితుణ్ణి సమీపించి, “అయ్యా! మీరు చెప్పింది నిజమేనా? అరటితోటకు వెళితే ఆంజనేయుణ్ణి చూడవచ్చా?” అని అడిగాడు. ఆ బాలుడికి ఏదో ఒక జవాబు సర్దిచెప్పాలి కదా అనుకొని ఆ పండితుడు, “తప్ప కుండా! నువ్వు వెళితే ఆయనను చూడవచ్చు. ప్రయత్నించి చూడు” అన్నాడు.
ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, సమీపంలో అరటితోట ఉందన్న విషయం నరేంద్రునికి చటుక్కున జ్ఞాపకం వచ్చింది. అందువల్ల తిన్నగా ఆ అరటితోటకు వెళ్లాడు. అక్కడ ఆంజనేయునికోసం వేచివున్నాడు. చాలాసేపు వేచివున్నప్పటికీ ఆంజనేయుడు రాలేదు. నిరాశా నిస్పృహలతో, వాడిపోయిన ముఖంతో ఇంటి ముఖం పట్టాడు. అతడి నమ్మకం సన్నగిల్లకూడదని భువనేశ్వరి, “ఆంజనేయ స్వామి ఏదో తొందర పనిమీద వెళ్లివుండవచ్చు. అందుకే ఆయనను నువ్వు చూడ లేకపోయావు” అని అతణ్ణి అనునయించింది. తల్లి జవాబుతో నరేంద్రుడు ఊరట చెందాడు.
మరొక రోజు ఇంకెవరో, “ప్రతి మనిషి చేతలనూ భగవంతుడు పరిశీలిస్తూం టాడు” అనడం నరేంద్రుడు విన్నాడు. వెంటనే పడక గదిలోకి వెళ్లి పడుకొని పైకప్పును చూస్తూ, ‘పైకప్పు ఎప్పుడు తెరచుకొంటుంది, దాన్లో భగవంతుని ముఖం ఎప్పుడు కనిపిస్తుంది’ అని అనుకోసాగాడు నరేంద్రుడు.
సాధువుల పట్ల అనురక్తి
కాషాయాంబరాలు ధరించిన సాధువులు నరేంద్రుణ్ణి అమితంగా ఆకర్షిం చారు. చేతికి అందిన వస్తువులన్నీ వారికి ఇచ్చేసేవాడు. ఏదీ లభించకపోతే తాను ధరించిన బట్టలు విప్పి ఇచ్చేసేవాడు. అడిగితే, “వారికి అవసరం, నా వద్ద ఉంది, ఇచ్చేశాను” అనేవాడు. విశ్వనాథుని ఉదారత్వం కారణంగా పలువురు సాధువులు ఇంటికి వచ్చిపోతూవుండేవారు. సాధువులు వచ్చినప్పుడు నరేంద్రుణ్ణి ఒక గదిలో ఉంచి తాళం పెట్టేవారు. అలా చేయకపోతే ఇక ఇంట్లో ఏదీ మిగలదు. కాని గదిలో బందీగా ఉన్నప్పటికీ కిటికీ గుండా సాధువులకు వస్తువులు విసిరివేసి నరేన్ ఆనందంతో గంతులువేసేవాడు.
బడిలో చదువుకొంటున్నప్పుడు క్రొత్తగా చేరిన విద్యార్థి వద్దకెళ్లి అతడి పూర్వీకుల గూర్చి వాకబు చేసేవాడు. అతడి తాత ఎవరైనా సన్న్యాసం పుచ్చు కొన్నాడా అని ప్రత్యేకించి మరీ అడిగేవాడు. అలా ఎవరైనా సన్న్యాసం పుచ్చుకొని ఉంటే ఆ సదరు విద్యార్థితో సన్నిహితంగా అభిమానంగా మెలగేవాడు.
కొన్ని సమయాల్లో నరేంద్రుడూ, స్నేహితులూ పరస్పరం తమ అరచేతి రేఖలు చూసుకోవడం కద్దు. అంతా వేడుకే! నరేంద్రుడే హస్తసాముద్రిక నిపు ణుడు! తన అరచేతిలోని ఏదో ఒక రేఖను చూపుతూ, “ఇదుగో చూడండి, ఈ రేఖ ఉన్నందువల్లే నేను సన్న్యాసిని అవుతాను” అనేవాడు. తన తాత ఒకరు ఇలా తనతో చెప్పారని కూడా చెప్పేవాడు. “నరేంద్రా! నువ్వు సన్న్యాసివయితే మేం కూడా సన్న్యాసులమవుతాం” అనేవారు స్నేహితులు. ఆ మేరకు స్నేహితుల మనస్సుల్లో స్థానం ఆక్రమించుకొన్నాడు నరేంద్రుడు.
నరేంద్రుడు తన తాతయైన దుర్గాప్రసాద్ పోలికల్లో ఉండేవాడు. “చూడండి, నేనూ ఒక రోజు నా తాతలా సన్న్యాసిని అవుతాను” అని తన స్నేహితులతో చెప్పే వాడు.
‘నేను సన్న్యాసిని అవుతాను!’
దేవుళ్లందరిలో నరేంద్రునికి బాగా నచ్చిన దేవుడు పరమశివుడు. సర్వసంగ పరిత్యాగం చేసి మూర్తీభవించిన త్యాగమూర్తిగా ఆయన కొలువుదీరి ఉండడం అతడి మనస్సును అమితంగా ఆకట్టుకొంది. కొన్ని సమ యాల్లో అతడు కూడా బట్టలన్నీ విప్పేసి కౌపీనధారియై తిరిగే వాడు. ఈ చర్య భువనేశ్వరి మనస్సులో తెలియరాని ఏదో దిగులు పుట్టించేది. ‘ఇతడు కూడా తాత మాదిరే సన్న్యాసం పుచ్చుకొంటాడేమో!’ అని ఆందోళనపడేది. “నరేన్, ఏమిటిది? ఇదేం వేషం?” అని అడిగేది. “నేను శివుణ్ణయిపోయాను, చూడు, నేను శివుణ్ణయిపోయాను. నేనే శివుణ్ణి” అనేవాడు నరేన్. అతడు తెలిసి చెప్పాడో, తెలియక చెప్పాడో! కాని అత్యున్నత మానసిక స్థితిలో ఉచ్చరించే మంత్రమైన ‘శివో-హం’ ను (నేనే శివుణ్ణి) పసితనంలోనే ఉచ్చ రించాడు నరేంద్రుడు.
నేను సన్న్యాసినై ఉండేవాణ్ణి
మేడ మీది గదిలో శివుని విగ్రహం ముందు కూర్చున్నప్పుడల్లా నరేంద్రునికి అప్పుడప్పుడు తల్లి చెప్పే మాటలు జ్ఞాపకానికి వచ్చేవి. తన భూతగణంలో శివుడు ఒక భూతాన్ని బహిష్కరించినట్లూ, ఆ భూతమే అతడని ఆమె చెప్పడం నరేంద్రుణ్ణి దీర్ఘాలోచనకు గురిచేసింది. ‘అయితే నేనోదో తుంటరిపని చేసినందుకు, ఏదో తప్పు చేసినందుకు శివుడు నన్ను పంపించివేశాడా?’ అనే సందేహమూ, సందిగ్ధమూ అతడి మనస్సును తొలచివేశాయి. తక్షణమే అమ్మ వద్దకు పరుగుపరుగున వెళ్లి, “అమ్మా, ఏమిటో తెలియడం లేదు. నేను ఎన్నడో సన్న్యాసినై ఉండివుంటానని అనిపిస్తోంది.తప్పులు చేయకుండా, అల్లరి చేయకుండా ఉంటే శివుడు మళ్లీ నన్ను స్వీకరిస్తాడా?” అని అడిగేవాడు. అందుకు భువనేశ్వరీదేవి, “అవును” అని ఠక్కునజవాబిచ్చేది. కాని నరేంద్రుడి ప్రశ్న భువనేశ్వరీదేవి మనస్సును కలవరపరచేది. ‘ఇతడు కూడా శివాన్వేషణలో సన్న్యాసి అయిపోతాడా?’ అనే దిగులు ఆమెలోచోటుచేసుకొంది. ‘అలా జరగడానికి ఆస్కారంలేదు. అలాంటి విషయాల గురించియోచించగల వయస్సు కాదిది’ అనుకొని ఊరడిల్లేది.
‘అనిర్వచనీయ ఆనందం పొందాను!’
సన్న్యాసం పట్ల అనురక్తీ, శివునిపట్ల అభిరుచీ పెరిగేకొద్దీ నరేన్ మేడమీదిగదిలో శివుని విగ్రహం ముందు ధ్యానమగ్నుడై కూర్చోవడమూ పెరిగింది. ఇంటి పెద్దల్లో ఒకరు ఒక రోజు నరేన్‌తో, “దీర్ఘకాలం ధ్యానం చేస్తే శిరోజాలు పెరిగి, పొడవుగా జడలుకట్టి మర్రిచెట్టు ఊడల్లా భూమిలోకి దిగిపోతాయి” అన్నాడు. వెంటనే నరేంద్రుడు వెళ్లిధ్యానంలో కూర్చుండిపోయాడు. మధ్యమధ్యలో వెనుకకు తిరిగి శిరోజాలు పెరిగిభూమిలోకి దిగిపోతున్నాయా అని చూసుకోసాగాడు. అలాంటిదేమీ జరగలేదు.వెంటనే తల్లి వద్దకు పరుగెత్తి ఎందుకలా జరుగలేదని అడిగాడు. అందుకుభువనేశ్వరి, “ఒక్క రోజులో అలా జరగదు. అందుకు అనేక నెలలూ, అనేకసంవత్సరాలూ పడుతుంది” అని జవాబిచ్చింది.
నరేంద్రుని ధ్యానాభ్యాసం కొనసాగింది. కొన్ని సమయాల్లో మైమరచిధ్యానంలో మగ్నుడవడం కద్దు. ఒక రోజు స్నేహితులతో కలసి ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు హఠాత్తుగా అక్కడకు ఒక నల్లత్రాచుపాము ప్రాక్కొంటూవచ్చింది.పామును చూడగానే మిత్రులు పలాయనం చేశారు. ఒకరిద్దరు దూరంగా పోయి అతణ్ణి పిలిచారు. నరేంద్రుడిలో చలనం లేదు. పరుగెత్తుకెళ్లి ఇంటివారితోవిషయం చెప్పారు. వారు మేడమీదికి వెళ్లి చూసేసరికి నరేన్ నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. అతడి ముందు పాము పడగవిప్పి నిలబడివుంది. ఏం చేయడానికీపాలుబోక వారు దిగ్భ్రాంతిలో ఉండగా, అదృష్టవశాత్తు పాము దానంతట అదేవెళ్లిపోయింది. అప్పటికీ నిశ్చల స్థితిలోనే ఉన్న నరేంద్రుని వద్దకెళ్లి అతణ్ణి కుదిపిలేపారు. “పాము రాగానే ఎందుకు పారిపోలేదు?” అని వారు అడిగారు. అందుకు అతడు, “పామును నేను చూడలేదు. అది రావడం నా కసలు తెలియదు. అనిర్వచనీయ ఆనందంలో మునిగి ఉన్నాను” అని జవాబిచ్చాడు.
ప్రాథమిక విద్యాభ్యాసం
ఆరవ ఏట నరేంద్రుణ్ణి ప్రప్రథమంగా బడికి పంపించారు. అది వీథి బడి. మొదటి రోజు కొత్త ధోవతి ధరించాడు. బడికి వెళ్లే పిల్లలు కూర్చోవడానికి తమ ఆసనాలను తామే తెచ్చుకోవాలి. నరేంద్రుడు కూడా చిన్న చాపను తెచ్చుకొన్నాడు. రెల్లుతో చేసిన కలం కూడా తెచ్చుకొన్నాడు. అది జారిపో కుండా నడుముకు బిగించి పొడవైన దారంతో దానిని కట్టారు. ఈ విధంగా మొదటి రోజు బడికి వెళ్లే పిల్లలకు సహజంగా ఉండే హుందాతనంతో నరేంద్రుడు బడికి వెళ్లాడు.
కాని ఆ బడిలో ఒకటి రెండు రోజులే; పాఠాలు నేర్చుకోవడానికి మునుపే సహాధ్యాయుల నుండి బోలెడన్ని చెడు మాటలు నేర్చాడు. ఆ కారణంగా అతణ్ణి ఆ బడికి పంపడం మానుకొన్నారు. తదనంతరం అతడికీ, ఇంట్లోని తక్కిన పిల్ల లకూ కలిపి తండ్రి ఒక ఉపాధ్యాయుణ్ణి ఇంట్లోనే నియమించాడు. తోటిబాలురు ఇంకా గుణింతాలతో కుస్తీపడుతూవుంటే నరేంద్రుడు చదువనూ, వ్రాయనూ చక్కగా నేర్చుకొన్నాడు.
అతని జ్ఞాపకశక్తి అసాధారణం. ఒక్కసారి విన్నది తు.చ. తప్పక అట్లే అప్పజెప్పగలిగేవాడు. అతడు పాఠాలు వినే పద్ధతే విలక్షణంగా ఉండేది. ఉపా ధ్యాయుడు పాఠాలు చెబుతున్నప్పుడు కళ్లుమూసుకొని నిశ్చలుడై ఉండేవాడు లేదా పడుకొనేవాడు. అతడు ఏం చేస్తున్నాడో ఉపాధ్యాయుడికి ముందు అర్థంకాలేదు. నిద్రపోతున్నాడని నిశ్చయించి అతణ్ణి తట్టి లేపి, పాఠాలు చెబుతున్నప్పుడు నిద్ర పోతున్నందుకు చీవాట్లు పెట్టాడు. ఆ చీవాట్లన్నీ మౌనంగా విని, ఉపాధ్యాయుడు బోధించిన పాఠాలన్నీ తు.చ. తప్పక అప్పజెప్పాడు. అతడి అసాధారణ జ్ఞాపక శక్తిని చూసి ఉపాధ్యాయుడు దిగ్భ్రమ చెందాడు.
ఇంత చిన్నతనంలో ఇంతటి సూక్ష్మబుద్ధీ, జ్ఞాపకశక్తీ నరేంద్రుడు సంత రించుకోవడం గమనించిన బంధువొకరు అతడికి ‘ముగ్ధబోధ’ అనే సంస్కృత వ్యాకరణం, వారి వంశవృక్షం, రామాయణ మహాభారతాలలోని ముఖ్యఘట్టాలు మొదలైనవి నేర్పించాడు. ప్రతి రోజూ రాత్రి ఆ బంధువు నరేంద్రుడు నిద్రించ డానికి ముందు అమర శ్లోకాలను చెప్పి ‘అమరకోశాన్ని’ చాలావరకు బాలుడిచే కంఠస్థం చేయించాడు. నరేంద్రునికి సంస్కృతంలో ప్రత్యేకమైన ఆసక్తి జనించ డానికి ఇదొక కారణం.
ఒక సంవత్సరంలో నరేంద్రుడు సంస్కృతంలో చక్కని ప్రావీణ్యం గడించ డమే కాకుండా రామాయణ మహాభారతాలలో కొన్ని భాగాలను కంఠస్థం చేశాడు. ఒకసారి వీథిగాయకుల బృందం ఒకటి అతడి ఇంటి ముందుకు వచ్చి రామాయణ గీతాలు పాడినప్పుడు, వాటిలో దొర్లిన దోషాలను ఎత్తిచూపి సవరించే టంతటి ప్రతిభ అంత చిన్నతనంలోనే నరేంద్రుడు పుణికిపుచ్చుకోగలిగాడు.
నరేంద్రుని ఆరవ ఏట అతని పినతాతయైన కాళీప్రసాద్‌కు అవసానకాలం సమీపించింది. అప్పుడు ఆయన భగవత్కథాశ్రవణం చేయగోరి ఇంట్లోని అందరినీ చేరబిలిచి మహాభారతం చదివి వినిపించమన్నాడు. కాని చదవడానికి ఎవరూ సాహసించలేదు. నరేంద్రు డప్పుడు ఒక్క పరుగులో వెళ్లి ఆ గ్రంథం తీసుకు వచ్చాడు. ఆ గ్రంథాన్ని తన ఒడిలో ఉంచుకొని నెమ్మదిగా ముద్దుముద్దుగా చదువ నారంభించాడు. అక్క హరమణి చదవడంలో అతడితో జతకలిపింది. అందులో గరుత్మంతుడు తన తల్లియైన వినతిని భుజస్కంధాలపై ఆసీనురాలిని చేసి ఊర్ధ్వ గమనం చేసే ఘట్టం వచ్చింది. ఆ వృద్ధుని ఆత్మకూడా దేహాన్ని వీడి ఎగురసాగింది. ఆయన శ్వాసకూడా భారంగా పీల్చసాగాడు. అయినప్పటికీ తన యావచ్ఛక్తీ కూడ దీసుకొని, “నాయనా, నీకు మహోన్నత భవిష్యత్తు ఉంది” అని ఆశీర్వదించాడు. కాసేపటికి ఆయన తుదిశ్వాస విడిచాడు.
1871 లో తన ఎనిమిదవ ఏట నరేంద్రుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు. ఆనాటి పాఠశాలలలో అది బహుళ ప్రాచుర్యం పొందింది. నరేంద్రుని కుటుంబ సభ్యులలో పలువురు ఆ పాఠశాలలోనే చదివారు.
చరిత్ర, సంస్కృతం అతడికి నచ్చిన పాఠ్యాంశాలు, గణితమంటే అసలు నచ్చదు. ‘గణితం కిళ్లీకొట్టువాడికి సముచిత’ మని అతని తండ్రి వ్యాఖ్యానించే వాడు. నరేంద్రుని అభిప్రాయం కూడా ఇదే. ఆంగ్లం నేర్చుకోవడానికి కూడా అతడు సుతరామూ ఇష్టపడలేదు. మాతృభాషలో చక్కగా చదువుకోవడం మానుకొని పరాయి భాషను చదువుకోవడ మెందుకని అతడు వాదించేవాడు. తల్లితండ్రులు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ నరేంద్రుణ్ణి సమ్మతింపజేయలేకపోయారు. ముసలి బంధువైన నరసింహ దత్త అతణ్ణి చేరదీసి ఎంతగా చెప్పిచూసినప్పటికీ నరేం ద్రుడు అంగీకరించలేదు. కొన్ని నెలలు గడిచిన తరువాత మొత్తానికి ఎలాగో అతడు వారి సలహాను పాటించాడు. ఆంగ్ల అక్షరమాలనూ, ప్రాథమిక పాఠాలనూ స్వయంగా భువనేశ్వరే అతడికి నేర్పింది. కాని అతడికి దాన్లో అంతగా అభిరుచి కలుగలేదు. ఆ రోజుల్లో ఆంగ్ల బాలశిక్షలలో పిల్లల మనస్సులను ఆకర్షించేవి ఏవీ ఉండకపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చు. భారతీయుల నరనరాల్లో ఊరిపోయి సహజసిద్ధంగా వారు చేయగల వాటిని గోరంతలు కొండంతలు చేసి వ్రాసి ఉంటారు. అది అతడికి ఏదోలా అనిపించింది. ఆ విషయంగా కాలాంతరంలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు:
“నేను ఆంగ్లభాషను నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు ఒక ఆంగ్ల పుస్తకంలో విధేయుడైన ఒక బాలుణ్ణి గూర్చిన కథ చదివాను. అతడు ఇల్లు విడిచి పని చేయడానికి పోయే ముందు తన ముసలి తల్లికి తాను సంపాదించిన ధనంలో కొంత భాగం ఇచ్చాడట. ఇది మూడు నాలుగు పుటలలో శ్లాఘింప బడింది. దీన్లో ఏముంది? హిందూ బాలుడెవరూ ఈ కథలోని నీతి ఏమిటో ఎన్నటికీ గ్రహింపలేడు. ‘ఎవరికి వారే’ అనే పాశ్చాత్య ధర్మతత్త్వాన్ని విన్న నా కిప్పుడు ఆ కథలోని నీతి తెలిసింది. ‘చిన్న నా పొట్టకు శ్రీరామరక్ష’ అని కొందరు అన్నింటినీ తమ కోసమే దాచుకొంటూంటే, తల్లులు తండ్రులు భార్యలు బిడ్డలు దిక్కులేని వారవుతున్నారు. ఇది ఏ దేశంలోగాని, ఏ కాలంలోగాని గృహస్థులకు ఆదర్శం కాకూడదు.”
కాని ఎవరు చేసిన పుణ్యమో, కాదు, లోకం చేసుకొన్న పుణ్య ఫలంగా అతడు ఆంగ్లభాషను ఆసక్తితో నేర్చుకోసాగాడు. కాలాంతరంలో ఆ భాషకే వన్నె తెచ్చే రీతిలో ఆంగ్లభాషాకోవిదుడయ్యాడు.
నరేన్ బడికి పోవడం మొదలుపెట్టినప్పుడు ప్రారంభమయిన అజీర్తి వ్యాధి అతణ్ణి దీర్ఘకాలం పీడించింది. మునుపటిలా అన్నింటినీ అతడు తినలేకపోయాడు. అజీర్తి వ్యాధిని ప్రకోపింపజేయని ఆహార పదార్థాలనే తినాలని అతడికి తోచింది. దాంతో సన్నబడ్డాడు. అయినా చలాకీతనంలో, వేడుకలు వినోదాలలో ఎలాంటి మార్పూ లేదు.
మిత్రులతో
నరేంద్రుడు సూక్ష్మబుద్ధి గలవాడు. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండా లనిపించేది. క్షణం కూడా ఊరకే ఉండలేడు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు లేదా చెయ్యవలసినదాన్ని గూర్చి యోచిస్తూవుంటాడు. ఏదో ఒక శక్తి ఊట తనలో పొంగిపొరలుతూన్నట్లు అనిపించ డంతో అతడు సదా కార్యోన్ముఖుడయ్యే ఉండేవాడు. నేడు ఒక నాటక బృందాన్ని ఏర్పాటు చేస్తాడు, మర్నాడు స్నేహితులతో కలిసి ఒక నాటకం ప్రదర్శించి చూపి స్తాడు. వ్యాయామం చేస్తూవుంటాడు. మిత్రులకు ఎగతాళిగా పేర్లు పెట్టడంలో సిద్ధహస్తుడు. మామూలుగా మిత్రులను ఆ పేర్లతోనే పిలిచేవాడు.
ఆటల్లోనూ అమిత ఆసక్తి చూపేవాడు నరేంద్రుడు. పరుగెత్తి, నక్కిదాక్కొని ఆడేవాడు. గోలీ ఆటలోను అతడు నేర్పరి. పోటీలో మిత్రులందరి గోలీలు ప్రతి రోజూ నరేంద్రుని సొంతమవడం తథ్యం. ఎత్తునుండిదూకడం, పరుగు, కబడి, దాగుడు మూతలు, మల్లయుద్ధం మొదలైన ఆటలన్నీ అతడికి కరతలామలకాలు. కాని నిత్యం ఒక లాగు చిరిగిపోవడం మాత్రం ఖాయం! ప్రతి రోజూ ఒక క్రొత్త లాగు కుట్టించి ఇవ్వడం విశ్వనాథునికి పరిపాటి అయిపోయింది.
చిన్నతనం నుండే ఆట వస్తువులతో ఆడుకోవడం నరేంద్రునికి చాలా ఇష్టం. ఎదిగేకొద్దీ ఈ ఇష్టం విజ్ఞానశాస్త్రపరమైన పరికరాలు తయారుచేసే అభిరుచిగా పరిణమించింది. సహజవాయువుతో పనిచేసే పరికరాలు, బొమ్మ రైలు, నాడు కలకత్తాలో బహుళ ప్రాచుర్యం పొందిన సోడా మొదలైనవి తయారుచేయడంలో నరేంద్రుడు నిమగ్నమయ్యేవాడు.
మాతృదేవోభవ పితృదేవోభవ
పుస్తకాల చదువులు ఎన్ని నేర్చినా, తల్లితండ్రుల నుండి, వారి జీవితాల నుండి గ్రహించిన విద్యే జీవితంలో రాణించడానికి దోహదపడుతుంది. నరేంద్రుడు కూడా తన తల్లితండ్రుల నుండి ఎన్నో నేర్చుకొన్నాడు. సత్ప్రవర్తన అంటే ఏమిటి? దానికి కొలబద్ద ఏది? కష్టాల పరంపరతో జీవితం తల్లడిల్లిపోతున్నప్పుడు సైతం చలించక సన్మార్గంలోనే జీవించడం, జీవితానికి ఉత్కృష్ట ఆలంబనం భగవంతుడేనని ఎంచి ఆయనను శరణుజొచ్చి జీవించడం లాంటివి తల్లి నుండి నరేంద్రుడు నేర్చుకొన్నాడు.
ఒక రోజు భువనేశ్వరి, నరేంద్రుడితో ఇలా అంది: “నాయనా! సదా పునీతు డవుగా, ఆత్మగౌరవంతో మెలగు. అదే సమయంలో పరుల ఆత్మగౌరవాన్ని పరిగ ణించి జీవించడమూ అలవరచుకో. సరళ స్వభావిగా, సమతను పాటిస్తూ వ్యవహరించు, కాని అవసరమైనప్పుడు నీ హృదయాన్ని ఉక్కులా చేసుకోవడానికీ సంకోచిం చకు.” ఇవి అనుభవంతో చెప్పిన మాటలు. నరేంద్రుని జీవితంలో అనేక సందర్భా లలో ఈ మాటలు అతడికి మార్గదర్శకాలై ఒప్పారాయి. అందుకే కాలాంతరంలో స్వామి వివేకానంద, “తల్లిని ఆరాధించని వ్యక్తి ఉన్నతి పొందలేడు. నా ధీశక్తి యావత్తుకూ కారకురాలు నా తల్లి” అన్నారు. కొన్ని సంఘటనలను పరికిద్దాం.
నరేంద్రుని పాఠశాలలోని ఉపాధ్యాయు డొకడు చీటికీమాటికీ విద్యార్థులను కొట్టేవాడు. ఒక రోజు ఆ ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని ఎడాపెడా కొట్టనారంభిం చాడు. అది చూసి నరేంద్రుడు ఓర్చుకోలేకపోయాడు. కాని పిల్లవాడైన అతడు ఉపాధ్యాయుణ్ణి ఏంచేయగలడు? చేతగానితనం కారణంగా అతడి కోపం నవ్వుగా వ్యక్తమయింది. అతడు పగలబడి నవ్వసాగాడు. ఆ నవ్వు చూసి కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుని ఆగ్రహం నరేంద్రునిపై మళ్లింది. అంతే, అతణ్ణి బాదసాగాడు. ‘ఇకపై నవ్వను’ అని బలప్రయోగపూర్వకంగా క్షమాపణ చెప్పమని కొట్టసాగాడు. కాని నరేంద్రుడు ససేమిరా క్షమాపణ చెప్పలేదు. దాంతో ఆగ్రహోదగ్రుడైన ఆ ఉపాధ్యాయుడు నరేంద్రుడి చెవి పుచ్చుకొని మెలిత్రిప్పాడు. చెవి నుండి రక్తం స్రవించసాగింది. అప్పటికీ నరేంద్రుడు క్షమాపణ కోరలేదు. ఇక నొప్పి భరించలేక పోయినప్పుడు నరేంద్రుడు బిగ్గరగా, “ఆపండి. నన్ను కొట్టడానికి మీరెవరు? ఇక నన్ను తాకితే అప్పుడు మీ సంగతి తెలుస్తుంది” అని అరిచాడు. సరిగా అదే సమయంలో పాఠశాల నిర్వాహకుడైన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అక్కడకు రావడం తటస్థించింది. నరేంద్రుడు ఏడుస్తూ జరిగిందంతా ఆయనకు చెప్పు కొన్నాడు. ఆ తరువాత తన పుస్తకాలు తీసుకొని, “ఇక ఈ బడికే రాను” అంటూ బయటికి వెళ్లిపోసాగాడు. అప్పుడు విద్యాసాగర్ అతణ్ణి తన గదికి తీసుకువెళ్లి, సముదాయించి పంపించాడు. అదేసమయంలో అతడు ఆ ఉపాధ్యాయుడితో, “నువ్వు మనిషివి అనుకొన్నాను కాని మృగంలా ప్రవర్తిస్తున్నావు” అంటూ గట్టిగా చీవాట్లు పెట్టాడు. ఆ తరువాత బడిలో ఇలాంటి సంఘటనలు జరుగకుండా గట్టి చర్యలు తీసుకొన్నారు.
ఇంటికి వెళ్లిన నరేంద్రుడు అలవాటు ప్రకారం తల్లితో జరిగిందంతా చెప్పి మొరపెట్టుకొన్నాడు. పరిపరివిధాల అతణ్ణి సముదాయించి, ఇకపై ఆ బడికి పోవద్దంది భువనేశ్వరి. అయినప్పటికీ నరేంద్రుడు తనకు జరిగింది అంతగా పట్టించుకోకుండా ఎప్పటిలా బడికి వెళ్లాడు.
మరొకసారి తరగతిలో భూగోళశాస్త్ర పాఠం చెబుతున్నారు. ఉపాధ్యాయుడు దేశపటం ఒకటి వ్రేలాడదీసి దాన్లో ఒక ఫలానా నగరాన్ని గుర్తించమని నరేం ద్రుణ్ణి ప్రశ్నించాడు. నరేంద్రుడు చూపించాడు. ఉపాధ్యాయుడు అది తప్పు అన్నాడు. దాన్ని తిరస్కరించి, తనదే ఒప్పు అన్నాడు. తన జవాబును తిరస్క రిస్తున్నాడనే కోపంతో ఉపాధ్యాయుడు అతణ్ణి చేతులు చాచమని బెత్తంతో కొట్టాడు. దెబ్బలన్నీ ఓర్చుకొన్నాడేగాని తన జవాబు తప్పు అని మాత్రం అతడు అంగీకరించలేదు. కాసేపటి తరువాత పుస్తకం చూసినప్పుడు తన జవాబే తప్పని ఉపాధ్యాయుడు గ్రహించాడు. వెంటనే నరేన్‌ను క్షమించమని అడగడమేగాక అప్పటి నుండి అతడిపట్ల గౌరవభావంతో మెలగసాగాడు. ఈ సంఘటనను కూడా తు.చ. తప్పక తల్లితో చెప్పాడు నరేన్. భువనేశ్వరి అతణ్ణి హృదయానికి హత్తుకొని, “నా చిట్టితండ్రీ! న్యాయం నీ వైపు ఉన్నప్పుడు నువ్వు కలతచెందనవ సరం లేదు. న్యాయమార్గం కొన్ని సమయాలలో దుర్గమంగానూ, కష్టజనితంగాను ఉండవచ్చు. కాని నువ్వు న్యాయమని అనుకొన్న దానిని చేయడానికి ఎన్నటికీ తటపటాయించవద్దు” అని చెప్పింది. ఈ ఉపదేశం నరేంద్రునికి జీవిత పర్యంతం ఒక గుణపాఠమైంది. ఏ పరిస్థితిలోనూ అతడు ఆ గుణపాఠాన్ని విస్మరించింది లేదు.
నరేంద్రుని విద్యాభ్యాసంలో అతడి తండ్రి కూడా విశిష్ట పాత్రే వహించాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య తాను పురోభివృద్ధి చెందడమే కాక తన చుట్టూ వున్న పలువురి జీవితాలు కూడా ఆయన పెంపొందింపజేస్తూవచ్చాడు. తన పిల్లల మీద కూడా ఆయన చెరిగిపోలేని ప్రభావాన్ని చూపించాడనడం నిర్వివాదాంశం. ఆత్మగౌరవం ఉండాలి, కాని అదే సమయంలో వినమ్రతాభావం కూడా అందుకు జతజేరి ఉండాలని ఆయన ఆశించేవాడు. పిల్లలు తప్పు చేస్తే మామూలుగా తండ్రులు కోపగించుకోవడం, కొట్టడం చేస్తారు. కాని ఆయన అలా ప్రవర్తించే వాడు కాడు. ఇష్టంవచ్చినట్లు తిట్టడమూ, కొట్టడమూ పిల్లలను సరిదిద్దే విధానం కాదని ఆయన గట్టి నమ్మకం. ఒక సంఘటన పరికిద్దాం.
మామూలు విషయాలలో సైతం నరేన్ తల్లితో పోట్లాడేవాడు. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ల గ్లాసును కూడా కుడిచేతితోనే పుచ్చుకొని త్రాగడం వంగ దేశంలో రివాజు. కాని కుడిచేయి ఎంగిలిగా ఉన్నందున ఎడమ చేతితో త్రాగడమే సబబు అని నరేంద్రుడు వాదించాడు. తల్లీ కుమారుల మధ్య మాటా మాటా పెరిగి వాగ్యుద్ధం మొదలయింది. చివరకు కోపంతో తల్లిని నరేంద్రుడు నానా దుర్భాషలాడాడు. ఇదంతా విన్న విశ్వనాథుడు నరేంద్రుణ్ణి కోపగించుకోలేదు, చీవాట్లు పెట్టలేదు. అతడి తప్పును ఎత్తి చూపించడానికి ఒక తెలివైన మార్గం ఎన్నుకొన్నాడు. నరేంద్రుడు తన మిత్రులను కలుసుకొనే గది తలుపు మీద, నరేన్ ఈ రోజు ఇలాంటి మాటలతో తల్లిని తిట్టాడు అని వ్రాసిపెట్టాడు. నరేంద్రుడికి అది చాలు. ఆ గదిలోకి మిత్రులు వచ్చినప్పుడల్లా అతడికి తలకొట్టేసినట్లు అని పించింది. ఆ తరువాత పొరపాటుగా కూడా అతడు ఎన్నడూ తిట్టి ఎరుగడు.
మరొక రోజు విశ్వనాథుడు నరేంద్రుడితో, “నాయనా! దేనిని చూసీ ఆశ్చర్యం చెందకు” అన్నాడు. జీవితంలో ఏవేవో జరుగవచ్చు, ఎన్నో మార్పులు ఎదుర్కొనవలసి రావచ్చు; కాని దేనికీ విస్తుబోయి మ్రాన్పడిపోకూడదు. భగవం తుని రాజ్యంలో ఏమైనా జరగవచ్చునని గ్రహించి పురోగమించాలి. ఇది కూడా నరేంద్రుడికి జీవిత పర్యంతం మార్గదర్శక సూత్రమై విరాజిల్లింది.
తండ్రి నుండి అనేక రకాల వంటకాలను వండడం నరేన్ నేర్చుకొన్నాడు. క్రమేణా అతడు పలు రకాల వంటకాలను రుచిగా వండే నైపుణ్యం గడించాడు. అతడి వంటలో కాస్త కారం పాలు ఎక్కువగా ఉంటుందేగాని, రుచి మాత్రం అమోఘం!
సాహస వివేకాలు
సాహసానికి మారుపేరు నరేంద్రుడు. కాని ఆ సాహసం వివేకంతో జత కలిసి సమయస్ఫూర్తితో నిండి ఉండేది. ఒక మిత్రుని ఇంట్లో చంపక (సంపెంగ) వృక్షం ఒకటి ఉండేది. ఆ చెట్టెక్కి మిత్రులతో ఆడుకోవడం, దాని కొమ్మల నుండి తలక్రిందులుగా వ్రేలాడడం నరేంద్రు డికి చాలా ఇష్టం. చంపక పుష్పం శివునికి ఎంతో ప్రీతికరం. నరేంద్రునికి కూడా ఆ పుష్పం అంటే ఎంతో ఇష్టం. ఆ చెట్టు మీదికెక్కి ఆడుకోవడం నరేన్‌కు రివాజు. అతడు ఎక్కడ క్రింద పడిపోతాడోనని ఆ ఇంట్లో ఉన్న ముసలి తాత భయపడే వాడు. నరేంద్రుడు మటుకు చెట్టు మీదికెక్కకపోతే మరెవరూ ఎక్కరని ఆయనకు బాగా తెలుసు. అతణ్ణి దారిలోకి ఎలా తీసుకురావాలి? అతణ్ణి చేరబిలిచి, “నాయనా! ఆ చెట్టు పైకి ఎక్కకు” అన్నాడు. “ఎందుకు?” అని ఎదురు ప్రశ్న వేశాడు నరేంద్రుడు. అతడికి ఏం కారణం చెప్పాలి? భయపెడదామనుకొని ఆ వృద్ధుడు, “బాబూ! ఆ చెట్టు మీద ఒక భూతం ఉంది. రాత్రిళ్లు అది తెల్లని వస్త్రాలు ధరించిపోతున్నప్పుడు చూడ్డానికి ఎంత భయంగా ఉంటుందో తెలుసా? చెట్టు మీదికి ఎక్కేవాణ్ణి అది గొంతునులిమి చంపేస్తుంది” అన్నాడు.
ఆ తాత చెప్పిన మాటలన్నీ నరేంద్రుడు వినయంగా విన్నాడు. అతణ్ణి మోస పుచ్చానని మనస్సులో సంతోషించి ఆ తాత వెళ్లిపోయాడు. తాత అటు వెళ్లి పోగానే గబగబా చెట్టెక్కి నరేంద్రుడు యథాప్రకారం తలక్రిందులుగా వ్రేలాడ సాగాడు. ఆ తాత మాటలకు భయపడ్డ ఒక స్నేహితుడు నరేంద్రుడితో, “ఇప్పుడే కదా ఆ తాత చెప్పాడు! చప్పున క్రిందికి దిగు. లేకుంటే ఆ భూతం నిన్ను పట్టు కొని చంపేస్తుంది” అన్నాడు భయాందోళనలతో. నరేంద్రుడు ఫకాలున నవ్వాడు. తరువాత కళ్లు చిట్లించి, “మూర్ఖుడా! ఎవరో ఏదో కట్టుకథ చెబితే నమ్ముతావా! ఆ తాత చెప్పింది నిజమే అయివుంటే ఎప్పుడో నా గొంతు నులిమి వేయబడి వుండేది కదా!” అన్నాడు స్నేహితుడితో.
ఆ స్నేహితుడి తండ్రికి నరేంద్రుడంటే ఎంతో అభిమానం. అతడు భవిష్యత్తులో ఘనకార్యాలు సాధిస్తాడని ఆయనకు గట్టి నమ్మకం. అలవాటు ప్రకారం ఒక రోజు నరేంద్రుడు చెట్టు మీద తలక్రిందులుగా వ్రేలాడుతూండడం ఆయన చూశాడు. వెంటనే అతణ్ణి పిలిపించి, “నువ్వు ప్రొద్దస్తమానం ఇలా ఆట లాడుతూ తిరగడంలోనే గడపివేస్తావా? లేకపోతే చదుమా సంధ్యా ఉన్నాయా?” అని అడిగాడు. అందుకు నరేంద్రుడు, “నేను చదువుకొంటాను, ఆడుకొంటాను, రెండూ చేస్తాను” అని జవాబిచ్చాడు. అతణ్ణి పరీక్షించే ఉద్దేశంతో భూగోళం, గణితం మొదలైన పాఠాలనుండి కొన్ని ప్రశ్నలడిగాడు; పద్యాలు ఒప్పగించమని అడిగాడు. ఆ ప్రశ్నలన్నింటికీ నరేంద్రుడు తడుముకోకుండా జవాబులు చెప్పి ఆయనను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తాడు. అప్పుడు ఆయన నరేంద్రుణ్ణి మన సారా ఆశీర్వదించి, “అవునూ, నీ తండ్రి లాహోర్‌లో కదా ఉంటున్నారు! ఇక్కడ నీ కెవరు పాఠాలు నేర్పిస్తున్నారు?” అని అడిగాడు. “మా అమ్మ” అన్నాడు నరేం ద్రుడు. “నాయనా! నువ్వు మహోన్నత వ్యక్తిగా వర్ధిల్లుతావు. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకు ఉంటాయి” అంటూ ఆయన దీవించాడు.
కులం అంటే ఏమిటి?
నరేంద్రుని తండ్రి ప్రఖ్యాత న్యాయవాది కావడం వలన వ్యాజ్యెం విషయంగా అనేకులు వారి ఇంటికి వచ్చిపోతూవుండేవారు. వారిలో విభిన్న కులాలకు చెందిన వారు ఉండేవారు. నాటి కుల పట్టింపులకు తగ్గట్లు విభిన్న కులాల వారికి వేర్వేరు హుక్కాలు విశ్వనాథుడు అమర్చి ఉంచేవాడు.* ఈ కులం విషయం నరేంద్రుడికి ఎంతమాత్రం అంతుబట్టేది కాదు. ఒక కులంవారి హుక్కాతో మరొక కులంవారు పొగత్రాగితే ఏమవుతుంది? ఇంటి కప్పు కూలిపోతుందా? ప్రాణాలు పోతాయా, ఏమవుతుంది? ఇందుకు జవాబుకై అతడు తపన చెందాడు. ఒక రోజు స్వయంగా తనే చేసి చూడాలని అతడు నిశ్చయించాడు. ఎవరూ లేని సమయంలో తిన్నగా ఆ గదిలోకి వెళ్లాడు. ప్రతి హుక్కా నుండి ఒకసారి పొగత్రాగి చూశాడు. ఏమీ జరగలేదు! తను చనిపోలేదు! మరెందుకు కుల వివక్షలు అని అతడి మనస్సు ప్రశ్నిం చింది. అదేసమయంలో విశ్వనాథుడు అక్కడకు వచ్చాడు. “నరేంద్రా! ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు, “ఏంలేదు నాన్నా! కుల పట్టింపు లను అతిక్రమిస్తే ఏం జరుగుతుందో చూశాను. కాని ఏమీ జరగలేదు” అని జవాబు ఇచ్చాడు. నోరారా నవ్వి కుమారుణ్ణి తదేకంగా చూసి విశ్వనాథుడు అక్క ణ్ణుండి వెళ్లిపోయాడు. కుల పట్టింపుల పేరిట ఏర్పడ్డ మూఢనమ్మకాలను అతడు నిరసించాడు.
విశ్వనాథ్ కక్షిదారైన ఒక మహమ్మదీయుణ్ణి నరేంద్రుడు ‘మామా’ అంటూ సంబోధిస్తూ, ఆయనతో చనువుగా మెలగేవాడు. ఆ పెద్దమనిషి ఇచ్చే తీపిభక్ష్యా లను తినేవాడు. ఇతరులు అది చూసి ఆశ్చర్యపోయేవారు. కాని తండ్రి మాత్రం కుమారుని ఆ చేష్టను చూసి నవ్వుకొంటూ వెళ్లిపోయేవాడు.
తన ప్రాణాన్ని సైతం తెగించి….
కష్టాలలో ఉన్న వారికి ఉపకారం చేయడం చిన్నతనంలోనే నరేంద్రుడికి సహజ నైజంగా అబ్బింది. అవసరమైనప్పుడు తన ప్రాణాలను సైతం తెగించి ఇతరు లకు సాయం చేసేవాడు. అప్పుడు నరేంద్రుడికి ఆరేళ్లు. ఒక సారి తమ బంధువుల పిల్లవాడితో కలిసి ఒక తీర్థోత్సవానికి వెళ్లాడు. అక్కడ పరమశివుని బొమ్మలు కొనుగోలు చేసి ఇద్దరూ ఇంటికి తిరిగివస్తున్నారు. ఆ జనసందోహంలో మిత్రుడు విడిపోయినట్లు అని పించగా నరేంద్రుడు వెనుకకు తిరిగి చూశాడు. తిరిగి చూసిన నరేంద్రునికి హఠాత్తుగా వాయువేగంతో వస్తూన్న గుర్రపుబండి కనిపించింది. గుర్రం కాళ్ల క్రిందపడి మిత్రుడు నలిగిపోబోతున్నాడు. ఇక నరేంద్రుడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. బొమ్మలను ఎడమ చంకలో ఇరికించుకొని, పరుగున వెళ్లి కుడిచేత్తో అతణ్ణి పట్టుకొని ఈడ్చి క్రిందికి దొర్లాడు. జనసమూహంలోని వారు నరేంద్రుని సాహసచర్యను చూసి దిగ్భ్రాంతులయ్యారు. కొందరు అతణ్ణి ఆశీర్వదించారు. మరికొందరు అతణ్ణి పైకి లేవదీసి ప్రశంసాపూర్వకంగా అతడి వీపు తట్టారు. ఈ సంగతి విన్న భువనేశ్వరి కుమారుని ధైర్యసాహసాలను ఎంతగానో మెచ్చుకొని ఆనందబాష్పాలు స్రవిస్తూండగా, “అవును, నరేంద్రా! సదా నువ్వు వీరపురుషునిగా వర్ధిల్లు” అని ఆశీర్వదించింది.
మరొకసారి అతడు ఒక వీథిగుండా పోతున్నప్పుడు ఒక గుర్రపుబండిలో ఒక స్త్రీ ఆ వీథిగుండా పోవడం తటస్థించింది. హఠాత్తుగా గుర్రం అదుపు తప్పి పరుగుతీయనారంభించింది. భయకంపితురాలైన ఆ స్త్రీ కేకలు పెట్టింది. ఆమె సహాయార్థం ఎవరూ వెళ్లలేదు. నరేంద్రుడు ఒక్క పరుగున పోయి తెగించి ఆ గుర్రాన్ని పట్టుకొని ఆపి, ఆ స్త్రీని కాపాడాడు.
నేత
మిత్రబృందంలో నరేంద్రుడు సదా నాయకుడుగానే విరాజిల్లాడు. ఆటల్లో అతడే రాజుగాను, న్యాయమూర్తిగాను వ్యవహరించేవాడు. మిత్రులు కూడా అతణ్ణి అట్లే చూడగోరేవారు. సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కారానికై అతణ్ణే ఆశ్రయించే వారు. రెండు పక్షాల వాదాలనూ శ్రద్ధగా విని, పర్యాలో చించి, రెండు పక్షాలవారూ ఏకీభవించే రీతిలో న్యాయ నిర్ణయం చేయడంలో అతడు నిపుణుడయ్యాడు.
నరేంద్రుడి రాజదర్బారు చూడడానికి కన్నుల పండువగా ఉండేది. క్రింద నుండి మేడ మీది పూజాగృహానికి దారితీసే మెట్లే రాజదర్బారు. మొదటి పై మెట్టు మీద మహారాజుగా అతడు కూర్చుంటాడు. ఒకటి రెండు మెట్లు దిగువన మహా మంత్రి, సేనాధిపతి నిలబడి ఉంటారు. ఇంకా దిగువన కప్పం చెల్లించే సామం తులు కూర్చుంటారు. రాజదర్బారు మొదలవుతుంది. ఒకరి తరువాతి ఒకరుగా సామంతులూ, ఇతర రాజాధికారులూ వచ్చి, “రఘుకుల తిలకా, త్రిభువన చక్రవర్తీ, ధర్మపరిపాలకా, విజయీభవ, దిగ్విజయీభవ!” అంటూ అతడికి పాదాక్రాంతు లయ్యేవారు. మహారాజు రాజ్య పరిస్థితి, ప్రజల కొరతలాంటి విషయాల గూర్చి ప్రశ్నిస్తాడు. ఆ తరువాత నిందితుణ్ణి ప్రవేశపెట్టి, దోషారోపణ పత్రం చదువుతారు. అంతా సావధానంగా విన్న తరువాత మహారాజు, “రక్షకభటులారా, ఇతడికి శిరచ్ఛేదం చేయండి” అంటూ శిక్ష విధిస్తాడు. రక్షకభటులు నేరస్తుణ్ణి ఈడ్చుకొనిపోతారు. ఈ ‘మహారాజు’ ఆట అంటే నరేంద్రుడికి మహా ఇష్టం.
ఏది సాధించగోరినా మిత్రులు నరేంద్రుణ్ణి ఆశ్రయించేవారు. అతనికి పద కొండేళ్లప్పుడు ఇంగ్లండు నుండి ఒక యుద్ధనౌక కలకత్తా రేవుకు వచ్చింది. మిత్రు లకు ఆ నౌకను చూడాలనే కోర్కె కలిగింది. ఎంతో ఆసక్తితో వెళ్లినప్పుడు, పిల్ల లన్న కారణంగా వారికి అనుమతి నిరాకరించారు. లోపలికి పోవాలంటే ఆంగ్లేయ అధికారి వద్ద అనుమతి పొందాలి. ఏం చేయాలి? తిన్నగా అందరూ ఆ అధి కారిని చూడబోయారు. అక్కడా సమస్య ఎదురయింది. చిన్నపిల్లలు కనుక ఆ అధికారిని కలుసుకోవడానికి బంట్రోతు వారిని అనుమతించలేదు. అధికారి గది మేడ మీద ఉంది. నరేంద్రుడు అటూ ఇటూ చూశాడు. ఇతరుల దృష్టి అంతగా పడని విధంగా మేడ మీదకు వెళ్లే మెట్లు వెనుక భాగంలో కనిపించాయి. మెల్లగా పిల్లిలా పోయి ఆ మెట్లెక్కి నరేంద్రుడు ఎలాగో ఆ ఆంగ్లేయ అధికారిని కలుసుకొని అనుమతి సంపాదించగలిగాడు. ఆ తరువాత అందరూ దిగి వచ్చే మెట్లగుండా క్రిందికి దర్జాగా దిగివచ్చాడు. కాపలాదారుకి ఏమీ అంతుబట్టలేదు. “ఎలా లోపలికి వెళ్లావు?” అని అడిగాడు. “నేను మంత్రవాదిని కదా, అందుకే” అంటూ నరేంద్రుడు కళ్లు మిటకరించాడు.
గంగాభవాని పట్ల భక్తి
గంగాభవానికి ఘనంగా జరిపే విశేష పూజలలో మకర సంక్రాంతి ఒకటి. ఆ రోజు గంగానదీమతల్లికి విశేష పూజలు జరిపి ఆరాధించడానికీ, ఆ నదిలో పుణ్యస్నానాలు చేసి పండుగను అంగరంగ వైభవంగా జరుపు కోవడానికీ ఏర్పాట్లు చేశారు. అక్కడ కూడా నాయకుడు నరేంద్రుడే! తండ్రి అనుమతీ, ఖర్చుల నిమిత్తం డబ్బూ పుచ్చు కొన్నాడు. తండ్రి నియమించిన ఉపాధ్యాయుని వద్ద గంగాభవానిపై భక్తిగీతాలు నేర్చుకొన్నాడు. పూజ నాడు పిల్లలందరూ ఊరేగింపుగా ఇంట్లో నుండి బయలు దేరారు. చేతులలో పతాకాలు, పూలమాలలు పుచ్చుకొని గంగాభవాని మహ త్వాన్ని గానం చేసుకొంటూ వీథుల గుండా వెళ్లారు. వర్ణించనలవిగాని అద్భుత దృశ్యం అది! తిన్నగా గంగానది వద్దకు చేరుకొన్నారు. “గంగాభవానిని ఆరా ధిస్తాం” అనే పాటను పాడి, తాము తెచ్చిన పూలమాలలను గలగలా పారుతున్న గంగానదికి అర్పించారు. ఉదయకాల పూజ ముగిసింది.
తరువాత సాయంత్రం అందరూ వెళ్లి అరటిదొప్పతో చిన్న తెప్పలు చేసి, వాటిలో దీపాలు వెలిగించి గంగానదిలో తేలేలా వదలిపెట్టి, గంగామాతకు ప్రణమిల్లారు. నరేంద్రుని బృందంలా అనేక బాలుర బృందాలు నదిలో వదలిన తెప్ప దీపాలు బారులుదీరి గంగానది అంతటా తేలుతూ, కదలుతూ సాగిపోతున్న ఆ దృశ్యం ఎంత రమణీయంగా ఉందో కదా!
వ్యాయామ మండలి
తన మిత్రులతో కలిసి నరేంద్రుడు ఒక నాటక సమాజాన్ని ఏర్పాటుచేసి స్వయంగా కొన్ని నాటకాలలో కూడా నటించాడు. కాని కొన్ని నాటకాలు ప్రదర్శిం చాక అతడి తాతగారు కోపంతో ఇకమీదట ఇంట్లో నాట కాలు ప్రదర్శించరాదని నిషేధించాడు. దాంతో నాటక సమాజం మూతబడింది. వెంటనే ఇంటి ప్రాంగణంలో ఒక వ్యాయామ మండలి ప్రారంభించాడు. అది ఉత్సాహభరితంగా కొనసాగింది. కాని బంధువుల పిల్ల వాడొకడు చేయి విరగ్గొట్టుకోవడంతో అదీ మూతబడింది. నరేంద్రుడు వదలి పెట్టలేదు. నవగోపాల్ మిత్ర అనే పెద్దమనిషి జరిపిస్తున్న వ్యాయామశాలలో చేరి వ్యాయామం కొనసాగించాడు. నరేంద్రుడి, ఆతడి మిత్రుల ఆసక్త్యుత్సాహాలను గమనించి నవగోపాల్ వ్యాయామశాల బాధ్యతను వారికే అప్పగించాడు.
ఒకసారి వ్యాయామ కసరత్తుల కోసం తాళ్లతో అడ్డంగా వ్రేలాడగట్టి ఉండే బరువైన కొయ్య దండం (trapeze) ఎత్తులో అమర్చవలసి వచ్చింది. ఆ పెద్ద కొయ్యదండాన్ని బాలురు అమర్చడాన్ని చూడడానికి జనం గుమిగూడారు. అలా అమర్చడం తమకు అసాధ్యమయ్యేసరికి, జనంలో నిలబడివున్న ఒక ఆంగ్లేయ నావికుణ్ణి సహాయం చేయమని నరేంద్రుడు కోరాడు. ఆ నావికుడు ఆ కొయ్య దుంగను ఎత్తడానికి సహాయపడుతున్నప్పుడు, అకస్మాత్తుగా ఆ దుంగ జారి అతడి తలమీద పడింది. తల నుండి రక్తం ధారకట్టగా అతడు నేలకొరిగిపోయాడు. అతడు మృతిచెందాడని భావించిన గుంపు క్షణంలో అదృశ్యమైంది. ఇక అక్కడ మిగిలింది నరేన్, ఒకరిద్దరు మిత్రులు మాత్రమే. నరేన్ క్షణం కూడా జాప్యం చేయకుండా తన ధోవతిని పర్రున చింపి అతడి తలకు కట్టుకట్టాడు. అంతా కలిసి ఆ నావికుణ్ణి ప్రక్కనే ఉన్న బడిలోకి ఎత్తుకొని వెళ్లారు. ఒక వైద్యుణ్ణి రప్పించి అవసరమైన చికిత్స చేయించారు. అతడు తేరుకొన్న తరువాత నరేన్, మిత్రులు కలిసి కొంత పైకం సేకరించి అతడికిచ్చి పంపించారు.
కర్రసాము వీరుడు
కర్రసాములోనూ నరేంద్రుడు ఎంతో నేర్పు గడించాడు. పలువురు మహమ్మ దీయ నిపుణుల వద్ద అతడు ఈ విద్యను అభ్యసించాడు. అప్పుడతడు కేవలం పదేళ్ల వయస్కుడు. మెట్రోపాలిటన్ పాఠశాలలో జరుగు తున్న కర్రసాము పోటీని అతడు చూస్తున్నాడు. అది అంత ఆసక్తికరంగా లేదు. క్రమేణా ప్రేక్షకుల్లో విసుగు చోటుచేసుకోసాగింది. హఠాత్తుగా నరేంద్రుడు లేచి నిలబడ్డాడు. చేతిలో కర్ర పుచ్చుకొని గిర్రున త్రిప్పుతూ ఎవరైనా సరే తనతో పోటీ పడవచ్చని సవాలు చేశాడు. నరేంద్రుని సవాలును స్వీకరించి ఒక యువకుడు ముందుకు వచ్చాడు. అతడు బలశాలి, పైగా బాగా తర్ఫీదు పొందిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఇద్దరి కర్రలు తలపడ్డాయి. అందరూ దిగ్భ్రాంతి చెందే విధంగా నరేంద్రుడు కర్రను వాయువేగంతో త్రిప్పసాగాడు. పోటీపడ్డ వ్యక్తి నరేంద్రుని ధాటికి నిలబడలేకపోయాడు. ఒక ఘట్టంలో నరేంద్రుని ఒకే దెబ్బకు ప్రత్యర్థి కర్ర రెండు ముక్కలయింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతోపాటు బహుమతిని కూడా నరేంద్రుడు గెలుచుకొన్నాడు. ఈత, మల్లయుద్ధం, ఆత్మరక్షణ యుద్ధవిద్య, పడవ నడపడం లాంటివి కూడా నరేంద్రునికి కరతలామలకం.
దయ
వినోదభరితుడై ఉన్నప్పటికీ కరుణ, దయ నరేంద్రుడి చేతలన్నిటిలో ఉట్టి పడేవి. సహచరులకు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు దానిని పరిష్కరించడం తన ప్రథమ కర్తవ్యంగా అతడు భావించేవాడు. ఒక రోజు తన మిత్రులతో కలకత్తా కోటను సందర్శించడానికి నరేన్ వెళ్లాడు. వారిలో ఒకరు ఒంటి నొప్పితో బాధపడుతున్నాడు. తక్కినవారు అతణ్ణి ఎగతాళిచేస్తూ నవ్వుకొంటూ, అతణ్ణి వదలిపెట్టి ముందుకు వెళ్లిపోయారు. నరేంద్రుడు కూడా వారితోపాటే ముందుకు వెళ్లాడు. కాని కాసేపటికి వారితో, “అతడు నొప్పితో నిజంగానే బాధపడుతున్నట్లుంది. మీరు వెళుతూ ఉండండి, నేను పోయి అతణ్ణి చూసివస్తాను” అని చెప్పి, తిరిగి వచ్చాడు. ఆ బాలుడు జ్వరంతో బాధపడుతున్నాడు. నరేంద్రుడు అతడికి శుశ్రూష చేసి, బండిలో కూర్చోబెట్టి జాగ్రత్తగా అతడి ఇంట్లో దిగబెట్టాడు.
సాహసం
ఒక రోజు నరేంద్రుడూ, మిత్రులూ పడవలో గంగానది మీదుగా నవాబు గారి జంతుప్రదర్శనశాలకు వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు మిత్రులలో ఒకరు వాంతి చేసుకొన్నారు. పడవ నడిపేవారు వారితో పడవను పరిశుభ్రం చేయమన్నారు. బాలురు అందుకు సమ్మతించ కుండా, దానికి బదులుగా రెండు రెట్ల కేవు (పడవ కిరాయి) చెల్లిస్తామన్నారు. కాని పడవవారు ఇందుకు అంగీకరించలేదు. పడవను పరిశుభ్రం చేయకుండా క్రిందికి దిగడానికి వీల్లేదని బెదిరించారు. నరేంద్రుడు ఇదంతా గమనించక పోలేదు. వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు మెల్లగా జారుకొని ఎవరికంటా పడకుండా క్రిందికి దిగాడు. కాస్త దూరంలో పోతున్న ఆంగ్లేయ సిపాయిలను చూసి వారితో, వచ్చీరాని ఆంగ్లంలో తమ సమస్యను తెలియజేశాడు. మృదువుగా తన చేతులతో వారి చేతులు పుచ్చుకొని వారిని పడవ వద్దకు తోడ్కొని వచ్చాడు. సిపాయిలను చూడగానే పడవవారు ఆ బాలురను వదలిపెట్టారు. నరేంద్రుని ధైర్యసాహసాలూ, సమయస్ఫూర్తీ ఆ సిపాయిలను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. అతడికి ఏదైనా చేయగోరి తమతోపాటు థియేటర్‌కు రమ్మని ఆహ్వానించారు. కాని నరేంద్రుడు ఆ ఆహ్వానాన్ని వినమ్రంగా నిరాకరించి, వారికి ధన్యవాదాలు తెల్పి మిత్రులతో వెళ్లిపోయాడు.
నరేంద్రుడు పద్నాలుగేళ్ల వయస్కుడై ఉన్నప్పుడు ఒక రోజు నాటక ప్రదర్శ నకు వెళ్లాడు. నాటకం జరుగుతూన్నది. ఆ సమయంలో నటులలో ఒకరిని ఖైదు చేయడానికి ఆంగ్లేయ అధికారి ఒకరు వచ్చారు. అతడు తిన్నగా రంగస్థలం మీద ఉన్న ఆ నటుణ్ణి సమీపించి, “నిన్ను ఖైదు చేస్తున్నాను” అన్నాడు. హఠాత్తుగా ప్రేక్ష కుల మధ్యలో నుండి, “రంగస్థలం మీద నుండి ముందు క్రిందికి దిగండి. నాటకం ముగిసిన తరువాత మీకు కావలసింది చేసుకోవచ్చు. ప్రేక్షకులను ఇలా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు!” అంటూ ఒక కంఠం మార్మోగ్రింది. ఆ కంఠ స్వరం నరేంద్రునిది! ఒక వ్యక్తి అలా సాహసం చేసి పలుకగానే తక్కిన వారూ గొంతెత్తారు. అలా పెద్ద ఎత్తున నిరసన తారస్థాయికి చేరుకోవడంతో ఆ అధికారికి వెనుకకు తిరగడం తప్ప గత్యంతరం లేకపోయింది. నాటక ప్రదర్శన నిరాటంకంగా సాగింది. తరువాత అందరూ నరేంద్రుని వద్దకు వచ్చి, “మంచి పని చేశావు. చెల్లించిన డబ్బు వృథా కాకుండా చూశావు” అని ప్రశంసిం చారు.
ప్రమాదం
నరేంద్రుని ఉద్వేగమూ క్రియాశీలతా పరికించినప్పుడు అతడిలో ఏదో శక్తి పొంగిపొరలుతున్నట్లు ఇంతకు క్రితమే పేర్కొన్నాం. అది ముమ్మాటికీ నిజం. అత డిలో గుర్తించలేని శక్తి ఒకటి పెంపొందుతూ వచ్చింది. ఆ విషయంగా కాలాంతరంలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు: “శైశవం నుండే నాలో ఏదో ఒక శక్తి పెంపొందుతున్నట్లు నాకు అని పించేది. అది నాలో నుంచి ఎగసి నన్ను అతిక్రమించి వ్యాపించసాగింది. ఆ శక్తే నా క్రియాశీలతకు కారణం. ఒక్క క్షణం కూడా నన్ను ఊరుకోనివ్వకుండా చేసింది ఆ శక్తే! నేను సదా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. పని ఏమీ లేకపోతే ఏదో ఒక చిలిపిచేష్ట చేస్తాను. రెండు మూడు రోజులు ఏమీ చేయకుండా ఊరకే ఉంటే నన్ను ఏదో రుగ్మత ఆవహించేది, లేకుంటే అదుపుతప్పిపోతాను. ఒక భూకంపం నాలో చెలరేగి బీభత్సం సృష్టిస్తున్నట్లుగా నాలోని ఆ శక్తి, ‘ఇది చెయ్యి’, ‘అది చెయ్యి’ అంటూ నన్ను ఏదో ఒకటి చేయమని పురమాయిస్తూ ఉంటుంది.”
ఇంతటి శక్తిని భరించడానికి లోకం సిద్ధంగా లేదు. కనుక ఒక ప్రమాదం మూలంగా అది అదుపుచేయబడింది. ఒక రోజు మిత్రులతో నరేంద్రుడు మేడ మీద నుండి దిగివస్తున్నప్పుడు క్రిందపడ్డాడు. నెత్తికి ఒక రాయి తగిలి రక్తం ధార కట్టింది. చాలా రక్తం పోయింది. ఆ గాయం ఆరడానికి కొంతకాలం పట్టింది. ఆ గాయం తాలూకు మచ్చ నెత్తిన ఎడమ కంటికి పైన శాశ్వతంగా ఉండి పోయింది. ఈ ప్రమాదం గురించి కాలాంతరంలో విన్న శ్రీరామకృష్ణులు, “ఈ ప్రమాదం మూలంగా నరేంద్రునిలోని శక్తి నియంత్రించబడింది. లేకపోతే అతడు లోకాన్ని కుదిపివేసేవాడు” అన్నారు.
అంతర్ముఖ స్థితి
ఆ మహాశక్తి బాహ్యంగా అతడిలో ఉద్వేగ క్రియాశీలతలను ఉద్భవింపజేయ డంతో ఆగకుండా అతణ్ణి ప్రగాఢ అంతర్ముఖ స్థితిలో మగ్నుణ్ణి చేసింది. అతడు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడే భువనేశ్వరి, ‘నేను పిల్లవాడు కావాలని వరం కోరాను. కాని ఆ పరమశివుడు తన భూత గణంలో ఒకదాన్ని పంపించాడు’, ‘ఇలా అల్లరిచేస్తే శివుడు మళ్లీ నిన్ను కైలాసం లోకి అనుమతించడు’ అనే మాటలు అతడి మనస్సులో గాఢంగా నాటుకు పోయాయి. నిజంగానే తాను కైలాసవాసుడైన పరమశివునికి చెందిన వాడననీ, ఏదో పొరపాటు చేసినందున ఆయన తనను భూమ్మీదకు పంపించాడనీ అతడు గట్టిగా నమ్మాడు. కనుక ఎలాగైనా మళ్లీ పరమశివుని లోకాన్ని చేరుకోవాలని అతడు తహతహలాడాడు. అందుకోసం ఏం చేయాలి? పరమశివుణ్ణి మళ్లీపొందగోరాలనే తీవ్ర ఆకాంక్షతో కొన్ని సమయాలలో సూర్యోదయానికి మునుపే శ్లోకాలు పఠించడం ప్రారంభించేవాడు. పగలంతా వాటిని స్మరిస్తూనే ఉండేవాడు. ఏడేళ్ల ప్రాయం నుండే నరేంద్రుడు ఇలా చేస్తూవచ్చాడు.
బాహ్యంగా వేడుకలు, వినోదాదుల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నప్పటికీ, అప్పుడప్పుడు జట్టునుండి తప్పుకొని ఏకాంతాన్ని అతడు అభిలషించడం కద్దు. తన దేహాన్ని విడిచిపెట్టి ఏదో సుదూర ప్రాంతాలలో సంచరించే వ్యక్తిలా కూర్చుండిపోయేవాడు. ఆటపాటలతో కేరింతలాడే మిత్రులు కూడా ఆ సమయంలో సద్దుమణగిపోయేవారు. అతణ్ణి సమీపించడానికి సైతం జంకేవారు. అంతర్ముఖ స్థితిలో కూర్చొన్న నరేంద్రుడు హఠాత్తుగా మాట్లాడనారంభించేవాడు: “నే నొక మహారాజును అవుతాను. నేను ఇది సాధిస్తాను, అది సాధిస్తాను, ఇది ఇలా చెయ్యాలి, అది అలా చెయ్యాలి.” ఇలా అర్థంలేని ఏవేవో మాటలు అతడి నోటి నుండి వెలువడేవి. కాసేపటి క్రితం అతడు చేస్తూవున్న దానికీ, అతడు ఉన్న పరిస్థితికీ, ఆ మాటలకీ ఎలాంటి పొంతనా ఉండేది కాదు. కాసేపట్లో మామూలు స్థితిలోకి వచ్చేసేవాడు. అప్పుడు అంతసేపూ జరిగింది ఏదీ అతడికి జ్ఞాపకం ఉండేదికాదు. అందరూ తనను తదేకంగా చూడడం గమనించినప్పుడు అతడు సిగ్గుతో తల దించుకొనేవాడు. “బిలే మంచివాడే, బాగా నవ్వుతాడు, వేడు కల్లో వినోదాల్లో పాల్గొంటాడు. కాని ఒక ‘మర’ మట్టుకు కాస్త వదులయింది. కొన్ని సమయాలలో అతడి ప్రేలాపనలు ఏమిటో ఎవరికీ అర్థం కావు” అనేవారు స్నేహితులు.
ధ్యాన సిద్ధుడు
“నరేన్ జన్మతః ధ్యానసిద్ధుడు” అనేవారు కాలాంతరంలో శ్రీరామకృష్ణులు. అంటే గత జన్మలలో ఏకాగ్రంగా ధ్యానం అనుష్ఠించి పరిపూర్ణ స్థితిని పొందిన వాడని అర్థం. ఏడేళ్ల వయస్సులోనే ప్రక్కనే త్రాచుపాము పడగవిప్పి ఆడడమూ, ఇంట్లోవారు గగ్గోలు పెట్టడమూ తెలియకుండా మైమరచిపోయి ధ్యానంలో మగ్నుడై పోవడం ముమ్మాటికీ సామాన్యమైన విషయం కాదు. రోజులు గడిచేకొద్దీ అతడి ధ్యానం తీవ్రం కాసా గింది. నరేంద్రుని ధ్యానం ససేమిరా ఒక అభ్యాసం క్రింద పరిగణించరాదు. సుదీర్ఘ కాల అభ్యాసం మూలంగా సముపార్జించిన ధ్యానస్థితిని అతడు అప్పటికే సిద్ధించుకొన్నాడు.
“ఎనిమిదేళ్లప్పుడే సమాధి స్థితిలో మగ్నుడై ఉండడం ఆయనకు సుసాధ్య మైంది” అని సోదరి నివేదిత వ్రాసింది.
జ్యోతి వెలుగులో నిద్రించే ఉన్నత బాలుడు
అనునిత్యం అతడు గాంచే దృశ్యాలు ఎన్నో. అంతెందుకు, ప్రతి రోజూ రాత్రిపూట అతడు నిద్రించే విధానమే అత్యద్భుతం. అతడు పడుకొని కళ్లు మూసుకోగానే భ్రూమధ్యం నుండి ఒక జ్యోతి కానవస్తుంది. విభిన్న కాంతులతో కూడుకొన్న ఆ జ్యోతి క్రమంగా విస్తృతించి ఎట్టకేలకు చెల్లాచెదరవుతుంది. ఆ జ్యోతి వెలుగులు శరీరమంతటా పాలనురుగులాంటి తెల్లని కాంతులీనుతూ ముంచెత్తేది. ఆ కాంతిలో నిద్రిస్తాడు ఉన్నతుడైన ఆ బాలుడు. కొన్ని సమయాలలో ఒక బాలుడు అతని ఎదుట కనిపించి కాంతి బంతి నొకదాన్ని కాలితో తన్ను తాడు. అది దొర్లుతూ అతని వైపు వస్తుంది. తన ప్రక్కకు రాగానే నరేంద్రుడు దాన్లో లయించిపోతాడు, అంతా మరచిపోవడం జరుగుతుంది. కొన్ని సమయాల్లో ఆ జ్యోతి వర్ణనాతీతమైన మహాజ్యోతిగా ఉండేది. అతడు దాన్లో ప్రవేశించి అట్లే కరగిపోయేవాడు.
నిద్ర అన్నది అందరికీ ఇలాగే ఉంటుందని అనుకొనేవాడు నరేంద్రుడు. ఒక రోజు ఒక మిత్రుణ్ణి ఇలాంటి అనుభవం కలుగుతుందా అని అడగనే అడిగాడు. ఆ మిత్రుడు, “లేదు” అని జవాబిచ్చాడు. వెంటనే నరేంద్రుడు, “పడుకోగానే నిద్రలోకి జారుకోకు. కాసేపు గమనించి చూడు. నువ్వూజ్యోతిని చూడగలవు” అన్నాడు ఆ మిత్రుడితో ఉపదేశ ధోరణిలో. అయినప్పటికీ మిత్రుడికి అలాంటి అనుభవం కలుగలేదని విన్నప్పుడు అది ప్రత్యేకించి తనకు మాత్రమే కలిగిన అనుభవమని నరేంద్రునికి అవగతమయింది. తదనంతరం దీనిని గురించి మరెవరితోనూ అతడు ప్రస్తావించలేదు.
ఒక వ్యక్తిలో ఎన్నో సంస్కారాలు ఉండవచ్చు; ఎంతో శక్తిసామర్థ్యాలు బహి ర్గతం కావచ్చు, ఎంతో ప్రతిభ పాదుకొని ఉండవచ్చు. వీటన్నింటినీ పెనవేసు కొన్న, వీటన్నిటితో కలిసి ఒక విశిష్ట సంస్కారం విరాజిల్లుతూ ఉంటుంది. ఆ సంస్కారమే అతడెవరు, అతడి జీవితం ఎలా పరిణమించబోతుందో నిర్ణయి స్తుంది. నరేంద్రుడి జీవితంలోను ఆ చిరుప్రాయంలోనే ఎన్నో సుగుణాలు పరిమ ళించడం చూస్తున్నాం. కాని వాటన్నింటిలోను ప్రత్యేకంగా కానవచ్చేది అంతర్ముఖ ఆకర్షణ, ఒక ఆంతరిక అన్వేషణ. సమవయస్కులైన ఇతర బాలురు జీవితాన్ని బహిర్ముఖంగా చూస్తూ మనస్సును బయటి దారులలోకి వెళ్లనిచ్చినప్పుడు నరేంద్రుడు మాత్రం జీవితాన్ని అంతర్ముఖంగా చూశాడు. మనస్సును అంత ర్ముఖం గావించి ధ్యానంలో లయించిపోయాడు. ఇంద్రియాలూ, మనస్సూ సహ జంగా బాహ్యంలో సంచరిస్తూవుండగా అపురూపంగా ఎవరో ఒక వివేకవంతుడు అమరమైన దివ్యజీవితం అభిలషించి మనస్సును బాహ్యం నుండి అంతర్ముఖం గావించి ఆత్మానుభూతి పొందుతాడని ఉపనిషత్తు* పేర్కొంటున్నది. చిన్నతనంలోనే అంతటి వివేకవంతుడై నరేంద్రుడు రాణించాడు.