రాత్రి నా గదిలోకి వెళ్లి పడుకొంటాను. కాసేపటికల్లా పరమానంద స్వరూపిణియైన జగజ్జననిని చూస్తాను. మనుషులు, జంతువులు, ఆకాశం, భూమి ఇత్యాది సమస్తమూ ఆనందంతో పొంగిపొరలడం అనుభూతమయ్యేది. తదనంతరం నేను పడుకోలేకపోయేవాణ్ణి.
– స్వామి వివేకానంద
మళ్లీ ఇంగ్లండ్‌లో — దైనందిన జీవితం — కొనసాగిన ఉపన్యాసాలు — ఉల్లాస బాలుడు – జగద్గురువు — జ్ఞాన పరిధులు — తేలిక క్షణాలు — కొన్ని గొణుగుడులు — సత్య సాక్షాత్కారం — చరిత్రలో ప్రజ్ఞ — స్టర్డీ మనస్సు మార్చుకోవడం — మార్పులేని భగవద్ధ్యాస — జగజ్జనని సాక్షాత్కారం — బుద్ధునిలా — సేవియర్ దంపతులు — ఇంగ్లండ్‌లో విజయం — అతీంద్రియ శక్తులు — మాక్స్ ముల్లర్‌తో — గుండె పోటు — భారతదేశ కార్యంలో — ఇంగ్లండ్ శిష్యులు
మళ్లీ ఇంగ్లండ్‌లో
రెం డవసారిగా 1896 ఏప్రెల్‌లో స్వామీజీ లండన్‌కు వెళ్లారు. ఆయన ఆహ్వానాన్ని పురస్కరించుకొని అప్పటికే అక్కడకు వచ్చిన శారదానంద స్టర్డీతో బసచేసి ఉన్నాడు. కొన్ని ఏళ్ల తరువాత శారదానందను స్వామీజీ కలుసు కోవడంతో సోదర సన్న్యాసులిద్దరూ పరమానందభరితులయ్యారు. శారదానందతో పాటు స్వామీజీ సోదరుడైన మహేంద్రనాథ దత్తా పైచదువుల కోసం లండన్‌కు వచ్చాడు. ఆయనను సంస్కృత నిఘంటువైన ‘వాచస్పత్యభిదానం’ అనే గ్రంథాన్ని తీసుకురమ్మని స్వామీజీ చెప్పారు. ఆ గ్రంథం లభించగానే దానిని చదవడంలో మునిగిపోయారు. దానితో సరిపోల్చి తమ గ్రంథాలను సరిదిద్దడం లాంటి పనులలో నిమగ్నులయ్యారు. ఈ రోజుల్లో ఆయన బైక్ (bike) నడపడం కూడా నేర్చుకొన్నారు.
శారదానంద ముఖతః ఆలంబజార్ మఠ విశేషాలను తెలుసుకొన్నారు. శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో తమ కార్యక్రమాలు భారతదేశంలో కూడా వేళ్లూ నుతున్నవని ఎంతో తృప్తి చెంది లండన్ కార్యాచరణలో శ్రద్ధ వహించారు.
దైనందిన జీవితం
దాదాపు ఒక వారం స్వామీజీ స్టర్డీతో బసచేశారు. ఆయనతోపాటు మరికొందరు కూడా బసచేశారు. అదొక యువకుల బృందంగా ఒప్పారింది. జాన్ ఫాక్స్ (23), గుడ్విన్ (25), మహేంద్రనాథ్ (26), శారదానంద (30), స్వామీజీ (33), స్టర్డీ (36), మిస్ ముల్లర్ (45). రాత్రుళ్లు సాధారణంగా స్వామీజీ ధ్యానంలో గడిపేవారు. ఈ అనుభవాలను ఆయన కొన్ని సమయాలలో ఇతరులతో పంచుకోవ డమూ కద్దు. ఉదయం దాదాపు తొమ్మిది గంటలకు ఆయన ఉపాహారం స్వీకరించేవారు. తదనంతరం వాలు కుర్చీలో కూర్చుని గుడ్విన్, శారదానందలతో కాసేపు ముచ్చటించేవారు.
కొన్ని సమయాలలో దినపత్రికలు చదివి ప్రపంచంలో నెలకొనివున్న దారుణ పరిస్థితులు చూసి ఆయన హృదయం ద్రవించిపోయేది. రష్యాలో జార్ రెండవ నికొలస్ చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవ సందర్భంలో జరిగిన హత్యల గురించిన వార్తలు ఆ పత్రికలను నింపివేశాయి. పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించడానికీ, అక్కడ ఉచితంగా లభించబోయే అందమైన కప్ (enameled cup) కోసమూ సుదూర గ్రామాల నుండి వచ్చిన నిరుపేద రైతులు దాదాపు 2000 మంది త్రొక్కిసలాటలోనూ పోలీసుల దౌర్జన్యం వలనా హృదయ విదారకంగా మరణించడం విని స్వామీజీ హృదయం ఆవేదనతో తల్లడిల్లిపోయింది. ఇంగ్లండ్ నాగరకతా ప్రగతిని, అంతగా పురోగమించని రష్యా నాగరకతను తులనాత్మక పరిశీలనచేసి స్టర్డీ, గుడ్విన్లు చర్చించుకొన్నారు. స్వామీజీ మౌనంగా కూర్చుండి పోయారు. తరువాత హఠాత్తుగా ఇలా అన్నారు:
“ఎంతటి శోకం! ఎంత దుఃఖం! కేవలం ఒక కప్ కోసం సుదూర గ్రామాల నుండి నగరానికి వచ్చారు పాపం ఆ అమాయకులు. ఇంతమంది దుర్మరణం చెందారే! ఒక కప్ కోసం అసువులు బాసారంటే అక్కడ ఎంతటి దారిద్ర్యం విలయతాండవం చేస్తోందో కదా! ఎంత దారుణం!”
అప్పుడు లండన్‌లో దాదాపు అందరి నోళ్లలోనూ నానుతున్న ఒక అవినీతి కరమైన సంఘటనను ప్రస్తావిస్తూ స్వామీజీ ఇలా చెప్పారు: “ఒక జాతి నశిస్తున్న దనడానికి మొదటి సంకేతం అది లోలోపల క్రుళ్లిపోవనారంభించడమే! ఆ తరువాత శత్రువు వస్తాడు, సర్వనాశనం చేస్తాడు. ఆంగ్ల జాతి ఈ పంథాలోనే సాగిందంటే దాని వినాశం తథ్యం. సామాజిక అవినీతి నుంచే తక్కిన అన్ని అవినీతులూ పుట్టుకొస్తాయి.”
కొనసాగిన ఉపన్యాసాలు
స్వామీజీ ఒకసారి గుడ్విన్తో, “ఈ ప్రజల నరనరాల్లో వేదాంతాన్ని ప్రవహింపజేయకుండా ఈ దేశం నుండి తిరిగి వెళ్లను” అన్నారు. కనుక లభించిన ఏ అవకాశాన్నీ జారవిడువకుండా వెళ్లి ప్రసంగించి వచ్చారనడం అతిశయోక్తి కాదు. ఉన్నత శ్రేణికి చెందిన ప్రజలు, అంతెందుకు, మరెక్కడికీ వెళ్లని రాజవంశస్థులు సైతం స్వామీజీ ఉపన్యాసాలకు శ్రోతలుగా వచ్చారు. ఒకసారి ఎవరి కంటా పడకుండా మహారాణి కోడలు కూడా, స్వామీజీ ప్రసంగం వినడానికి వచ్చింది.
కొన్ని రోజులు స్టర్డీ ఇంట్లో గడపిన తరువాత, నగర శివార్లలోని మిస్ ముల్లర్ ఇంట్లో స్వామీజీ బస చేశారు. అక్కడా, మరికొన్ని చోట్లా ఆయన తరగతులు నిర్వహించారు. లండన్ హిందూ అసోసియేషన్‌లో ఆయన ప్రసంగించి నప్పుడు దాదాభాయ్ నౌరోజీ కూడా హాజరయ్యాడు. ఆనాటి స్వామీజీ ప్రసంగం విన్నవారి హృదయాలలో విద్యుచ్ఛక్తి లాంటి ప్రకంపనాలు లేచాయి.
ప్రసంగాలే కాక అనేక చోట్ల తరగతి ప్రసంగాలు కూడా స్వామీజీ చేశారు. అనేకులు ఆయనను తమ ఇళ్ళకు ఆహ్వానించి తమ అతికొద్దిమంది మిత్రులతో కలిసి విడిగా ఆయన ప్రసంగం విన్నారు. స్వామీజీని సాదరంగా ఆహ్వానించి అనిబిసెంట్ ప్రసంగం చేయించింది. ఆ ప్రసంగ సమావేశంలో కల్నల్ ఆల్కాట్ కూడా పాల్గొనడం విశేషం.
ఉల్లాస బాలుడు – జగద్గురువు
ఒక రోజు ఉదయం స్వామీజీ తరగతులకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఆయన గది మేడ మీద ఉంది. అక్కణ్ణుంచి వీథులను చూశారు. ఉదయకాలపు సందడి, తొందర అక్కడ కానవచ్చాయి. ఒక వైపు వేగంగా పరుగెత్తే గుర్రపుబండ్లు. ఉత్తేజభరితంగా కదలి వెళుతున్న స్త్రీలూ పురుషులూ మరో వైపు. ఇవన్నీ చూసినప్పుడు స్వామీజీలో ఎందుకో ఉల్లాసభావం జనించింది. ఆయన ఉల్లాసభరితంగా పాడారు:
చేత ఛత్రం, శిరసున టోపీ,
గంపలకొద్దీ పౌడర్ పులుముకొన్న ముఖం,
పరుగులెత్తే స్త్రీలు…..
స్వామీజీ పాట, ఆయన కంఠస్వరంలో ధ్వనించిన పరిహాసం మహేంద్రుణ్ణి కడుపుబ్బ నవ్వించాయి. పాడిన పిదప స్వామీజీ శారదానందతో, “ఈ స్త్రీలు ఇంత పౌడర్ ముఖాన పులుముకొన్నారే, దీన్నంతా గోకి తీయాలంటే పార, లేకుంటే గడ్డికోసే యంత్రమో అవసరం” అన్నారు.
తరగతుల వేళ కావస్తోంది. స్వామీజీ అదే మానసిక స్థితిలో ఒక బాలునిలా నవ్వూపరిహాసాలతో ఉల్లాసభరితంగా వినోదిస్తున్నారు. ప్రక్కన ఉన్నవారి పార్శ్వాస్థి (rib) నొక్కుతూ కితకితలు పెట్టారు. ఇలా అందరూ నవ్వుకొంటూ మెట్ల మీదుగా క్రిందికి దిగారు. దిగుతున్న స్వామీజీ స్థితి హఠాత్తుగా మారిపోయింది. ఆయన గంభీర ముద్ర వహించారు; ఆయన అంతర్ముఖులవుతూన్నట్లు ముఖమూ, కళ్లూ సూచించాయి. ప్రగాఢమైన ప్రశాంతత ఆయనలో కానవచ్చింది. క్రిందికి దిగి వెళ్లి సరాసరి తరగతి గదిలోకి వెళ్లారు. “గదిలోకి వచ్చిన ఆయన వినోదాలు చేసిన బాలుడు కాదు; భగవత్సాక్షాత్కారం పొందిన, సదా సర్వవేళలా భగవంతుని సాంగత్యాన్ని పొందుతూవున్న, భగవదనుభూతిపరుడైన జగద్గురువు” అంటూ వ్రాస్తున్నది మేరీ లూయీ బర్క్.
ఈ రోజుల్లో స్వామీజీ తమ బసలో దాదాపుగా భోజనం చేసి ఎరుగరు. ప్రతి రోజూ ఎవరో ఒకరు ఆయనను తీసుకువెళ్లేవారు. కొన్ని సమయాల్లో ఎవరన్నా ఆహ్వానించి ఉంటారు. కాని స్వామీజీ ఆ విషయం మరచిపోయేవారు. భోజనానికి కూర్చున్న తరువాతే ఆ విషయం జ్ఞాపకం వచ్చేది. వెంటనే ఆ భోజనం అర్ధంతరంగా ఆపివేసి తొందర తొందరగా బయటికి వెళ్లిపోయేవారు.
జ్ఞాన పరిధులు
స్వామీజీ జ్ఞాన పరిమాణాలకు అవధులు లేవు. ఆయనతో ఉంటున్న ప్రతి ఒక్కరూ ఆయన సర్వతోముఖ జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. గుడ్విన్తో రాజకీయాలు ముచ్చటిస్తారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చరిత్ర శాఖలో పట్టాలు సముపార్జించిన ఫాక్స్‌తో చరిత్ర గురించి చర్చించేవారు. కేవలం సంఘటనలు మాత్రమే కాదు, చరిత్రలోని అతి చిన్న అంశాలు సైతం ఆయనకు తెలియకపోలేదు. తిండిపోతు అయిన రోమన్ చక్రవర్తి విట్టలియస్ అస్సామ్ నుండి మైనాపిట్టలను తెప్పించి వాటిని పాలలోను, నేతిలోను వండించుకొని తినడం గురించి చెప్పేవారు. అమెరికా బళ్లలో చక్రాలు ఎలా తయారుచేస్తారో వివరించేవారు. ఇటీవలి జర్మనీలోని వైజ్ఞానిక ఆవిష్కరణలను గురించి విపులీకరించేవారు. యూదు తత్త్వాలు, పారశీక ఆచారవ్యవహారాలు, ఐరోపా రాజకీయ వ్యవస్థ, ఖగోళశాస్త్రం ఇత్యాది విభిన్న రంగాలలో ఆయనకున్న కూలంకష పరిజ్ఞానానికి పరిధుల్లేవు. వాటినంతా ఊరకే చెప్పకుండా నేటి మానవ జీవన సరళితో పరస్పర సంబంధం కల్పించి మాట్లాడడంలో ఆయన అద్వితీయులు. ఎక్కడ మాట్లాడినా, ఏ సమయంలో మాట్లాడినా, దేనిని గురించి మాట్లాడినా భారతదేశమూ, దాని ఘనతా ఆయన మాటల్లో ద్యోతకమయ్యే తీరుతాయి.
తేలిక క్షణాలు
స్వామీజీ ఎక్కడ జీవించినా ఆ స్థలంతో తాదాత్మ్యమైపోతారు. ఆ మాటలు, ఆ ఆచారవ్యవహారాదులన్నింటిలో ఆయన స్థానికులలాగ మారిపోయినట్లుగా ఉంటుంది. మహేంద్రుడు కొన్ని సమయాల్లో దుస్తుల్లో శ్రద్ధ చూపనప్పుడు మందలించేవారు. ఆయన పరిహాసాలు చెయ్యకుండా ఉండడం అంటూ ఉండదు. ఆయనతోపాటు ఉన్నవారు కడుపుబ్బ నవ్వకుండా ఉండలేరు.
పాఠశాలల్లో పిల్లలను బెత్తంతో కొట్టడం గురించిన ప్రస్తావన ఒక రోజు వచ్చింది:
స్టర్డీ : ఎవరైనా పిల్లలను కొట్టడం చూస్తే నాకు కోపం ముంచుకొస్తుంది.
గుడ్విన్ : పిల్లలనే ఎందుకు, గాడిద అయినాసరే, ఎవరైనా వాటిని కొట్టడం చూస్తే నాకు తారస్థాయిలో కోపం వస్తుంది.
స్వామీజీ : నిజమే. వారి వారి జాతి మీద అనురక్తి తప్పదు కదా!
నవ్వకుండా స్వామీజీ దీనిని నొక్కివక్కాణించినప్పుడు ఎవరూ తమ నవ్వును అణచుకోలేకపోయారు. పొట్టచెక్కలయ్యేలా నవ్వింది గుడ్వినే!
కొన్ని గొణుగుడులు
ఇంగ్లండ్‌లోనూ స్వామీజీ కార్యం అంత సులభమైనదిగా కనిపించలేదు. అక్కడ కూడా ఆయన ఫాదరీల ప్రతిఘటనలను ఎదుర్కొనవలసి వచ్చింది. ఫాదరీల పురమాయింపులతో పత్రికలు ఆయనను గురించి వార్తలు ప్రచురించడం మానుకొన్నాయి. ఆయన ప్రసంగించే చోట్లలో సైతం కొందరు క్రైస్తవ మిషనరీలు చిన్నచిన్న గొడవలు కల్పించడానికి ప్రయత్నిం చారు. ఇలాగే ఒక రోజు ఒక వ్యక్తి, స్వామీజీ ప్రసంగం పూర్తికాగానే లేచి, “మీరు ముందుగానే ప్రసంగాన్ని తయారుచేసుకోకుండా ఇలా మాట్లాడడం మానుకొని, వ్రాసుకొని సిద్ధం చేసి మాట్లాడితే బాగుంటుంది” అన్నాడు. స్వామీజీ మళ్లీ లేచారు. మళ్లీ ప్రసంగించసాగారు. ఆయన ప్రసంగ మహత్త్వం శ్రోతలను పూర్తిగా సమ్మోహితులను గావించింది – గందరగోళం సృష్టించాలని ప్రయత్నించిన మిషనరీ మాయమైపోయాడు!
మరొకసారి స్వామీజీ తమ ప్రసంగం పూర్తిచేస్తున్న సమయంలో అక్కడ కూర్చునివున్న ఒక సుప్రసిద్ధ తత్త్వజ్ఞుడు లేచి, “మీరు చాలా బాగా ప్రసంగించారు. అందుకు నా హృదయపూర్వక అభినందనలు. కాని ఒక్క విషయం. మీ మాటల్లో నూతన భావాలు ఏవీ లేవు” అన్నాడు. స్వామీజీ సుశ్రావ్య గంభీర స్వరం కొనసాగింది: “నేను మీతో సత్యమే చెప్పాను. సత్యాన్ని గురించి చెప్పాను. యుగాల పర్యంతం వెలసివున్న పర్వతాల లాంటి అనాదియైన సత్యాన్ని, మానవాళి లాంటి అతి ప్రాచీన సత్యాన్ని, భగవంతునిలా శాశ్వతంగా విరాజిల్లే సత్యాన్ని చెప్పాను. ఎలా చెబితే మీరు ఆ సత్యాన్ని మీ జీవితంలో పాటించడానికి ప్రయత్నిస్తారో అలా నేను చెప్పివుంటే అది చాలదా?” స్వామీజీ చెప్పి ముగించడమే ఆలస్యం – “అద్భుతం! ఎంతటి అద్భుతమైన జవాబో చూడండి” అంటూ అనేక కంఠస్వరాలు గదిలో ప్రతిధ్వనించాయి; దానితోపాటు కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. ఎలాంటి ప్రతిఘటనలకూ చలించకుండా, శ్రోతలను స్వామీజీ ఎలా మంత్ర ముగ్ధులను చేశారు అన్నదానికి ఇదొక ఉదాహరణ.
సత్య సాక్షాత్కారం
“నేను ఎలా సత్య సాక్షాత్కారం పొందానో మీకు చెబుతాను” అంటూ స్వామీజీ కొనసాగించారు. ఆ రోజు నిష్కల్మషమూ పావనమూ అయిన శ్రీరామ కృష్ణుల జీవితం, దృఢ సంకల్పంతో ఆయన ఒనరించిన సత్యాన్వేషణ, ఆయన ఆవిష్కరణ, అన్నింటికీ మించి, ‘ఎక్కడ నేను ఉన్నానో అక్కడ సత్యం ఉంటుంది’ అని ఆయన లోకానికి చాటిచెప్పడం లాంటివి స్వామీజీ పేర్కొన్నారు. పిదప గంభీర స్వరంలో ఇలా చెప్పారు:
“నాకు సత్య సాక్షాత్కారం కలిగింది. ఎందుకంటే అది నా హృదయంలో అప్పటికే నెలకొనివుంది కనుక. సత్యమనేది ఈ మతంలోనో, ఆ మతంలోనో ఉందని ఊహించుకోకండి, ఆత్మవంచన చేసుకోకండి. మీ మతం మీకు సత్యాన్ని అందించలేదు. మీరే దానిని మీ మతానికి అందించాలి. సత్యానికి ప్రజలు, మతాచార్యులు అనేక పేర్లు పెడుతున్నారు; వారంతా “సత్య సాక్షాత్కారానికి దీనిని నమ్మండి, దానిని నమ్మండి” అంటూవుంటారు. కాని నేను చెబుతున్నాను: అమూల్య రత్నమయిన సత్యం మీలోనే ఉంది. ఉన్నది ఒక్కటే. శ్రద్ధగా వినండి: ఆ సత్యం సాక్షాత్తూ మీరే!”
గొణుగుడులో, ప్రతిఘటనలో ఏది తలెత్తినా స్వామీజీ ప్రసంగాలు అనేకుల జీవితాలలో పరివర్తనను తీసుకువచ్చాయనడం మాత్రం ముమ్మాటికీ నిజం. పై ప్రసంగం వినడానికి వెళ్లిన ఒక స్త్రీ కాలాంతరంలో ఇలా చెప్పింది: “చర్చ్‌లో నిర్వహించే ఉపన్యాసాలకు సక్రమంగా హాజరయ్యేదాన్ని. అందరూ వెళ్లారు, అందరూ వెళ్లితీరాలి కాబట్టి నేనూ వెళ్లాను. ఆ ప్రసంగాలు నిర్జీవమైనవి, స్ఫూర్తి రహితమయినవి, విసుగు పుట్టించేవి. కాని స్వామీజీ ప్రసంగాలు విన్న తరువాత నా ధార్మిక జీవితంలో ఒక జ్యోతి వెలిగింది. ఆయన అభిప్రాయాలు యథార్థ మయినవి, సజీవమైనవి. అవి నా జీవితాన్నే మార్చివేశాయి.”
చరిత్రలో ప్రజ్ఞ
స్వామీజీ ప్రసంగాలలో కల్లోలం సృష్టించడానికంటూ వచ్చేవారు కూడా కద్దు. వీరిలో అనేకులు భారతదేశంలో పనిచేసి పదవీవిరమణ చేసిన ఆంగ్లేయులు; ఆంగ్ల ప్రభుత్వం తమతో మర్యాదామన్ననలతో వ్యవహరించాలని భారతీయులు కోరడాన్ని వీరు వ్యతిరేకించేవారు. వీరిలో కొందరు ఒకసారి స్వామీజీ ఉపన్యాసానికి వచ్చారు. స్వామీజీ ప్రారంభించి కొన్ని నిమిషాలే అయివుంటుంది. అంతలో ఒకడు లేచి బొంగురు గొంతుతో, “ఆహా అద్భుతం, బాగా మాట్లాడారు, కృతజ్ఞత, కృతజ్ఞత!” అంటూ బిగ్గరగా అరిచాడు. అందరూ ముఖాలు త్రిప్పి అతణ్ణి చూశారు. కాని స్వామీజీ ఎడతెగకుండా ప్రసంగం చేస్తూవుండడంతో ఆతణ్ణి పట్టించుకోలేదు. ఆంగ్లేయుడు వదల్లేదు. పదేపదే అదే చెబుతూ ఇబ్బంది కలిగించసాగాడు. అందరికీ పట్టరాని కోపం వచ్చినప్పటికీ ఎవరూ ఏమీ చేయలేదు.
స్వామీజీ అప్పుడు బుద్ధుణ్ణి గురించి ప్రసంగిస్తున్నారు. బుద్ధుని త్యాగమూ, ప్రశాంతత – శాంతి సర్వత్రా నెలకొనడానికి ఆయన సందేశంమూలాంటి వాటిని వివరిస్తున్నారు. ఆ సమయంలో అతగాడు మళ్లీ లేచి, “మీరు చెబుతున్నది తప్పు. సర్ మానియర్ విలియమ్స్ రచించిన పుస్తకంలో, ‘బుద్ధుడు ఒక స్వార్థపరుడు, దుష్టుడు, భార్యను కుమారుణ్ణి వదలిపెట్టిన ద్రోహి, నాస్తికుడు’ అంటూ పేర్కొన బడివుంది! సమాజం కోసం కొన్ని నియమనిబంధనలు తప్ప అంత గొప్పగా ఆయన ఏం చెప్పారు? భగవంతుణ్ణి గురించి ప్రస్తావించని ఆయన సిద్ధాంతాలను ఒక మతమని పరిగణించడమే తప్పున్నర తప్పు” అని బిగ్గరగా చెప్పాడు.
అప్పటికీ స్వామీజీ ఆతణ్ణి పట్టించుకోక, బుద్ధుని ప్రేమ, దానశీలత లాంటి సద్గుణాలను స్ఫూర్తిమంతంగా చెప్పసాగారు; నేటికీ ఆయన లాంటి మహాత్ములు భారతదేశంలో జీవిస్తున్నారని సూచించారు. అప్పుడు మళ్లీ ఆ ఆంగ్లేయుడు, “మీరు తప్పుడు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మహాత్ములంటూ మీరు చెబుతున్న యావన్మందీ దొంగలు, కేవలం దొంగలు. ఇలాంటి వారు వచ్చినప్పుడు నేను పోలీసుల సహాయంతో వారిపై నిఘా ఉంచాను. కొన్ని చోట్ల నుండి వారిని తరిమిగొట్టాను కూడా! దొంగలూ, మోసగాళ్లే కాషాయం ధరిస్తున్నారు. ప్రజలు వారిని సాధువులని పేర్కొంటున్నారు” అన్నాడు.
ఇదంతా చూసి ఇక స్టర్డీ సహించలేకపోయాడు. లేచి ఆ ఆంగ్లేయుని వద్దకు వెళ్లి, “ఆపు. నేను భారతదేశంలో ఉన్నప్పుడు అనేకమంది సాధువులను చూశాను, మాట్లాడాను. వారంతా పవిత్రులు” అని కోపంగా చెప్పి తన చోటికి తిరిగి వెళ్లాడు.
ఆ ఆంగ్లేయుడు స్వామీజీని ఒక తమిళుడనుకొన్నాడు. కలకత్తాలో బౌ బజార్లో పలువురు తమిళ డాక్టర్లు నివసించేవారు. వారిలో పలువురి పేర్ల చివర ‘స్వామి’ రావడం కద్దు. దానిని బట్టి ‘స్వామి’ వివేకానంద కూడా ఒక తమిళుడని అతడు నిశ్చయించుకొన్నాడు. కాని ఆయన ఒక బెంగాలీ అని తెలియగానే స్వామీజీతో, “ఓ, మిమ్మల్ని ఒక తమిళునిగా భావించాను. ఇప్పుడు చూస్తే మరొక బెంగాలీ అని తెలుస్తోంది. సిపాయిల తిరుగుబాటు సమయంలో మిమ్మల్నందరినీ మేమే రక్షించాం. ఇది మీకు తెలియంది కాదు!” అన్నాడు.
ఇంతలో స్టర్డీ ఒక్క పరుగున ఆతడి వద్దకు వచ్చి, “తేరగా రక్షించలేదే! డబ్బు పుచ్చుకొనే కదా ఆ పని చేశారు!” అన్నాడు కోపంగా. స్టర్డీ శరీరం కోపంతో కంపించింది. ఆతణ్ణి అమాంతం ఒక మూటలా బయటికి విసిరివేయా లని స్టర్డీకి అనిపించింది.
స్వామీజీ ప్రసంగాన్ని సంక్షిప్త లేఖనంలో నమోదు చేసుకొంటున్న గుడ్విన్ అప్పుడప్పుడు కోపంగా ఆతణ్ణి చూస్తున్నాడు. ఇక తనను అదుపులో ఉంచుకోలేక పోయాడు; సహనాన్ని కోల్పొయి చొక్కా మడతలను పైకి లాక్కొంటూ ఒక ముష్టిఘాతంతో అతడికి బుద్ధిచెప్పాలని ప్రసంగం ముగింపు కోసం తహతహ లాడుతూ వేచివున్నాడు. పరాయి దేశంలో, పరాయి ప్రజల మధ్య ఉన్న ఈ స్థితిలో, ఈ గందరగోళం ఎక్కడకు దారితీస్తుందోనని శారదానంద, మహేంద్రుడు ఆందోళనతో కూర్చునివున్నారు.
ఇంతదాకా జరుగుతున్నది కించిత్తు కూడా పట్టించుకోకుండా ప్రసంగిస్తున్న స్వామీజీ ఈ ఘట్టంలో ఆ ఆంగ్లేయుని వైపు దృష్టిని సారించారు. అలా దృష్టిని సారించినప్పుడు ఆయన ఆకృతే మారిపోయింది. ప్రశాంతంగా, గంభీరంగా కానవచ్చే ఆయన ఇప్పుడు చూడడానికే భయంగా ఉన్నారు. ప్రళయకాల రుద్రునిలా ఆ ఆంగ్లేయునిపై దృష్టిని కేంద్రీకరించి దాదాపు 35 నిమిషాలు ఆంగ్లేయుల చరిత్రనూ, వారు చేసిన దురాగతాలనూ, అఘాయిత్యాలనూ ఏకరవు పెట్టారు. ఐదవ శతాబ్ది మధ్యలో హెంగిష్ట్, హౌర్సా కాలం నుండి అప్పటి దాకా వారు దేశదేశాలకూ వెళ్లి అక్కడి ప్రజలను బానిసలుగా చేసుకోవడాన్నీ, అక్కడ వారు జరిపిన భయానక కృత్యాలనూ, ఘాతుకాలనూ తగిన ఆధారాలను ఉదాహరిస్తూ పేర్కొన్నారు.
అందరూ నిశ్చేష్టులై స్వామీజీనే చూస్తూవుండిపోయారు. ఆయన ఆంగ్ల పాండిత్యాన్ని చెప్పాలా? చరిత్రలో ఆయనకు గల సునిశిత జ్ఞానాన్ని చెప్పాలా? చరిత్రను విపులీకరించడంలోని ఆయన ప్రతిభను పేర్కొనాలా? మంత్రముగ్ధులై నట్లుగా అందరూ అట్లే కూర్చుండిపోయారు.
స్వామీజీ ప్రత్యక్ష తాకిడితో ఆ ఆంగ్లేయుడు కుప్పకూలిపోయాడు. తన తప్పును అతడు గ్రహించి విలపించ నారంభించాడు. చేతిరుమాలుతో కళ్లు తుడుచుకొంటూ వెక్కివెక్కి ఏడ్వసాగాడు.
ఆ తరువాత స్వామీజీ తమ దృష్టిని ఆతడి వైపు నుండి త్రిప్పి శ్రోతల వైపు సారించారు. ఆయన ఆకృతి, కంఠస్వరం మారాయి. శాంత గంభీరులయ్యారు. మెల్లని స్వరంలో, “ఇక మనం ప్రత్యాహారం, ధారణలను చూద్దాం…” అంటూ ఆపిన చోట నుండి తమ ప్రసంగాన్ని కొనసాగించారు.
మాములుగా జరిగే ‘ప్రశ్నోత్తరాల’ కార్యక్రమం ఆ రోజు చోటుచేసుకోలేదు. ఉపన్యాసం పూర్తికాగానే అనేకులు, “స్వామీజీ! సహనం అంటే ఏమిటో ఈ రోజు మీరు మాకు ఆచరణాత్మకంగా చూపించారు” అన్నారు స్వామీజీతో.
ఆ ఆంగ్లేయునిలో కూడా పరివర్తన కనిపించింది. ప్రశాంతంగా లేచి స్టర్డీ వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పి బయటికి వెళ్లిపోయాడు. అక్కడున్న యువకులు ఆతణ్ణి వదిలేటట్టుగా లేరు. ప్రసంగానంతరం వారు ఇంటి ప్రాంగణంలో గుమిగూడి ఆ విషయం గురించి ఘాటుగా మాట్లాడుకొంటున్నప్పుడు స్వామీజీ ప్రశాంతంగా, “ఆ విషయం ఇంతటితో వదలిపెట్టండి. అతడు కూడా నారాయణుడేనని మరచి పోకండి” అన్నారు. ఈ సంఘటననే ఆయన లెగెట్కు వ్రాసిన లేఖలో ప్రస్తావించి ఉండాలి: “నేను ఓర్పులోనూ, సానుభూతిలోనూ నా పాఠాలను ప్రతినిత్యం నేర్చు కొంటున్నానంటే నువ్వు సంతోషపడతావు. ఈ ఉన్నతమైన బలవత్తర ఆంగ్లో ఇండియన్లలో కూడా నేను దివ్యత్వాన్ని దర్శించడానికి ఆరంభిస్తున్నానను కొంటున్నాను. దయ్యమనేది ఒకటి ఉంటే ఆ దయ్యాన్నే ప్రత్యక్షంగా ప్రేమించగలిగే స్థితికి చేరుకోబోతున్నానని భావిస్తున్నాను.”*
స్టర్డీ మనస్సు మార్చుకోవడం
బయటనున్న ఇతరులు కల్పించే సమస్యలు ఒక వైపు ఉండగా, స్వామీజీ ఆంగ్లేయాభిమానుల నుండి కూడా సమస్యలు రాసాగాయి. స్వామీజీ గ్రంథాలు ప్రచురించడంలో స్టర్డీకీ, అమెరికాలో లెగెట్, వాల్డో ప్రభృతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అమెరికాలో ఏ గ్రంథాలు ప్రచురించాలి, ఇంగ్లండ్‌లో వేటిని ప్రచురించాలనే విషయంలో సమస్య ఏర్పడింది. అనేక సందర్భాలలో సారా జోక్యం చేసుకొని సమస్య జటిలం కాకుండా గట్టిగా ప్రయత్నించింది. స్వామీజీ దృష్టిలో అందరూ సమానులే. ఆయన ఎవరి వైపూ మొగ్గు చూపలేరు. అయినప్పటికీ భక్తుల మధ్య నెలకొన్న ఈ వైఖరి ఆయనకు ఆవేదనాభరితంగా పరిణమించింది. ఇందుకు తోడు స్వామీజీని అవగతం చేసుకోవడంలో కూడా స్టర్డీలో లోటుపాట్లు కానవచ్చాయి.
స్టర్డీ దివ్యజ్ఞాన సమాజ సిద్ధాంతాలతో ప్రభావితుడైన వ్యక్తి; శాకాహారం అలవరచుకొన్నాడు. ఇలాంటి విషయాల్లో వ్యక్తిగతంగా అతడికి కొన్ని నిశ్చితాభి ప్రాయాలు ఉన్నాయి. మాంసాహారం, పొగత్రాగడం లాంటి స్వామీజీ అలవాట్లను ఆతడు జీర్ణించుకోలేకపోయాడు. పైగా అతడిలో కొంత పిసినారితనం చోటుచేసు కొంది. పొగాకు ఇత్యాది విషయాల్లో చవకబారు వాటినే స్వామీజీకి ఇవ్వసాగాడు. “ఆహా, ఈ మనిషి చేతుల్లో పడ్డానే! ఇతడు నా ప్రాణాలు తోడేస్తున్నాడే!” అని స్వామీజీ బాధపడేటంతగా స్టర్డీ వ్యవహరించాడు.
అదేవిధంగా ముల్లర్ మొండిపట్టుదల కూడా స్వామీజీకి ఆవేదన కలిగించింది. గుడ్విన్, ఫాక్స్, మహేంద్రాదులు ఆ ఇంట్లో ఉండడం ఆమెకు సుతరామూ నచ్చలేదు. ఇది కూడా అనేక అభిప్రాయభేదాలకూ, మనస్తాపాలకూ దారితీసింది.
మార్పులేని భగవద్ధ్యాస
అది భారతదేశమైనా, అమెరికా అయినా, ఇంగ్లండ్ అయినా స్వామీజీ సాధారణ జీవితానికి సంబంధించినంత వరకూ పెద్దగా ఎలాంటి మార్పూ లేదు. బహిరంగ ప్రసంగాలు, ఉపదేశాలు; ఆంతరికంగా సదా భగవద్ధ్యాసలో లయించిన మనస్సు; వీటితోపాటే విరాజిల్లే తమాషా, వినోద ప్రవృత్తి. వాలు కుర్చీలో కూర్చుని ప్రగాఢ చింతనలో మునిగి ఉంటారు. ఆ మౌనాన్ని భగ్నపరుస్తూ హఠాత్తుగా ‘సోఽహం, సోఽహం’ అంటూ కోమల స్వరంలో ఉచ్చరిస్తారు. సన్నని స్వరంలో బెంగాలీ పాటలు పాడతారు. అంతరంగంలో సదా ఆనందమూ, భగవద్ధ్యాస అవిచ్ఛినంగా ఒక ఆరాధనగా విరాజిల్లుతుండడం ఆ పాటల్లోనూ, ఆయన ముఖారవిందం లోనూ ద్యోతకమవుతుంది.
జగజ్జనని సాక్షాత్కారం
సాయంత్రాలలో స్వామీజీ ఫాక్స్ లాంటి ఎవరితోనైనా కలిసి వాహ్యాళికి వెళ్లివచ్చేవారు. కొన్ని సమయాల్లో వేడినీటి స్నానం చేసి తమ గదిలోకి వెళ్లి ప్రశాంతంగా పడుకొనేవారు. కాని స్వామీజీ పడుకోవడం నిద్రించడానికి కాదు. సదా సర్వవేళలా భగవద్ధ్యాసలోనూ, పరమానందంలోనూ ఆయన విరాజిల్లారు. దానిని గురించి స్వయంగా ఒకసారి ఆయనే ఇలా అన్నారు: “రాత్రి గదిలోకి వెళ్లి పడుకొన్న కాసేపటికల్లా నాలో పరమానంద తరంగాలు ఉప్పొంగుతాయి. ఆ తరువాత నేను పడుకోలేకపోయేవాణ్ణి. మూర్తీభవించిన పరమానంద స్వరూపిణియైన జగజ్జనని దర్శనం నాకు కలుగుతుంది. మనుషులు, జంతువులు, ఆకాశం, భూమి ఇత్యాది సమస్తమూ ఆనందంతో పొంగిపొరలడం అనుభూతమయ్యేది. పిదప గది మధ్యలో నాట్యం చేయనారంభిస్తాను. ఆ ఆనందాన్ని హృదయంలో అణచుకోలేనని అనిపిస్తుంది. ప్రపంచమంతా ఆనందమయంగా ఉన్నట్లుంటుంది.” దీనిని ఒక రోజు చెబుతున్నప్పుడు స్వామీజీ ఆ ఆనందపారవశ్య స్థితిలోకి వెళ్లిపోయారు; చిన్నపిల్లవానిలా నృత్యం చేశారు. అక్కడున్న అందరినీ ఆప్యాయంగా చూస్తూ, “ఆనందంగా ఉండండి, ఎన్నడూ కలత చెంది అలసిసొలసి ఉండకండి. సర్వత్రా దేవి కొలువై ఉన్నది, సర్వత్రా ఆనందమే నిండి ఉంది” అన్నారు.
బుద్ధునిలా
లండన్‌లో ఉన్నప్పుడు స్వామీజీ ఆధ్యాత్మికశక్తి ఎక్కువగా అభివ్యక్తమయినట్లు మహేంద్రనాథ్ దత్తా తన పుస్తకంలో పేర్కొన్నాడు: “ఆత్మజ్ఞానమూ, ఆధ్యాత్మికశక్తీ ఆయనలో పొంగిపొరలాయి. ఆ శక్తులను ఆయన ఇతరులతో పాలుపంచుకోవడమూ లండన్‌లో ఎక్కువగా కానవచ్చింది.” జాతక కథల నుండి అనేక కథలు స్వామీజీ చెప్పారు. “ఈ రోజుల్లో ఆయన నాకు ఆధునిక బుద్ధునిలా తోచారు” అని మహేంద్రుడు వ్రాస్తున్నాడు.
లండన్‌లోనే జ్ఞానయోగ తరగతులు జరిగాయి. “భారతీయ వారసత్వంలోనూ, భావనలలోనూ ఊరిపోయిన వారికే జ్ఞానయోగ భావనలు అగ్రాహ్యం. అంతటి వారసత్వంలేని పాశ్చాత్యదేశస్థులయిన మీరు వాటిని ఎలా అవగతం చేసుకోగలి గారు?” అని సోదరి క్రిస్టైన్ను ఎవరో అడిగారు. అందుకు ఆమె, “స్వామీజీ ప్రసంగిస్తున్నప్పుడు కేవలం భావనలను వ్యక్తం చేయడంతో ఆగిపోరు. శ్రోతల మానసికస్థితిని పెంపొందించి ఆ చైతన్యస్థితిలోకి తీసుకువెళ్లిన తరువాతే ప్రసంగించేవారు. కనుక ఆయన భావనలను అర్థం చేసుకోవడంలో మాకు ఎలాంటి ఇబ్బందీ కలుగలేదు” అని జవాబిచ్చింది.
సేవియర్ దంపతులు
ఈ జ్ఞానయోగ ప్రసంగాల సందర్భంలోనే కెప్టెన్ సేవియర్, ఆయన భార్య ప్రప్రథమంగా స్వామీజీని కలుసుకొన్నారు. సేవియర్ ఆంగ్ల సైనిక విభాగంలో పనిచేశాడు. స్వామీజీ ప్రసంగం ఒకటి విని బయటకు వచ్చిన అతడు అక్కడ నిలబడి ఉన్న మెక్లౌడ్తో, “ఈ యువకుణ్ణి మీకు తెలుసా? నిజంగానే ఈయన మహాత్ముడేనా?” అని అడిగాడు. “అవును” అంది మెక్లౌడ్. వెంటనే సేవియర్, “అలా అయితే ఈయనను అనుసరించాలి, ఈయనతో కలసి భగవత్సాక్షాత్కారం పొందాలి” అన్నాడు. తరువాత తిన్నగా తన భార్య వద్దకొచ్చి, “నేను ఈ స్వామికి శిష్యుణ్ణవడానికి నువ్వు అంగీకరిస్తావా?” అని అడిగాడు. “సరే” అని జవాబిచ్చిన మిసెస్ సేవియర్, “నేనూ ఆయన శిష్యురాలినవడానికి మీరు అంగీకరిస్తారా?” అని అడిగింది. నవ్వుతూ, “నాకు తెలియదు” అని సేవియర్ జవాబిచ్చాడు. స్వామీజీతో ఈ విధంగా మొదలైన వారి సాంగత్యం జీవితాంతం కొనసాగింది.
ఇంగ్లండ్‌లో విజయం
ఇంగ్లండ్‌లో కూడా స్వామీజీ ప్రసంగాలకు చక్కని స్పందన లభించింది. ఆంగ్లంలో ఆయనకు గల అసాధారణ పాండిత్యమూ, వాగ్ధాటీ, నూతన భావనల గురించి పత్రికలు ప్రశంసించి వ్రాశాయి. ఆంగ్లికన్ చర్చ్ (Anglican Church) ఫాదరీలు స్వామీజీని అంగీకరించారు, ఆయనను ప్రతిఘటించలేదు. ఆ చర్చ్ వ్యవస్థలోని అత్యున్నత స్థానం వహించిన కొందరు స్వామీజీకి సన్నిహిత మిత్రులయినారు కూడా.
కేనన్ హావీస్ ఆంగ్లికన్ చర్చ్‌కి చెందిన వ్యక్తి, స్వామీజీతోపాటు సర్వమత మహాసభలో పాల్గొన్నాడు. అక్కడ స్వామీజీ ప్రసంగం విన్న తరువాత ఆయన పట్ల ఆసక్తి చెందాడు. ఆతడు లండన్‌లోని సెయింట్ జేమ్స్ చర్చ్‌లో రెండు ప్రసంగాలిచ్చాడు. వాటిలో స్వామీజీని శ్లాఘించడంతోపాటు, స్వామీజీ భావనలు ఏ విధంగా ఏసుక్రీస్తు బోధనలతో సామరస్యం చెందివున్నాయో కూడా తెలిపాడు. అంతేకాక భక్తి – భక్తుడు లాంటి స్వామీజీ భావనలను స్వీకరిస్తే క్రైస్తవమతానికి మేలొనగూరుతుందనీ సూచనప్రాయంగా చెప్పాడు.
అతీంద్రియ శక్తులు
గారడీలు ప్రదర్శించడమూ, అతీంద్రియ శక్తులను అభివ్యక్తం చేయడమూ స్వామీజీకి సుతరామూ నచ్చదు. డెట్రాయిట్లో దీనిని ఒక సవాలుగా తీసుకో మన్నప్పుడు కూడా ఆయన అలాంటి వాటిని ప్రదర్శించడానికి నిరాకరించారు. కాని కొన్ని సమయాలలో ఇలాంటివి ఆయనకు అతీతంగా జరిగిపోయాయి. మహేంద్రుణ్ణి దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా పీడిస్తున్న జ్వరాన్ని నయం చేశారు. అదే విధంగా శారదానంద జ్వరాన్నీ నయం చేశారు.
మరొకసారి ఆయన తరగతి నిర్వహిస్తున్నప్పుడు హఠాత్తుగా అక్కడున్న వారితో, “నన్ను అడగాలనుకొంటున్న ప్రశ్నలు ఒక కాగితం మీద వ్రాసి మడచి ఉంచుకోండి” అన్నారు. వారంతా అట్లే చేశాక, ప్రతి ఒక్కరూ వ్రాసి ఉంచుకొన్న ప్రశ్నను చెప్పి, అందుకు జవాబు కూడా తెలిపారు. అంతేకాక ప్రతి ప్రశ్ననూ చెప్పి, ఆ ప్రశ్నను అడిగిన వ్యక్తి గురించి కూడా చెప్పారు.
మాక్స్ ముల్లర్‌తో
ఇంగ్లండ్‌లో స్వామీజీ ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్‌ను కలుసుకొన్నారు. ఆయన పట్ల స్వామీజీ అపార గౌరవం వ్యక్తంచేశారు. “నా అభిప్రాయం ఏమిటో తెలుసా? వేదాలకు తాను వ్రాసిన భాష్యాన్ని పునరుద్ధరించడానికి సాయనాచార్యుడే మళ్లీ మాక్స్ ముల్లర్గా అవతరించాడు. ఈ అభిప్రాయం నాకు ఎంతో కాలం నుంచి ఉంది. మాక్స్ ముల్లర్‌ను కలుసుకొన్న తరువాత రూఢి అయింది. ఈ దేశంలో కూడా వేదాల విషయంలోనూ, వేదాంత విషయంలోనూ అంత పట్టుదల, అంత పాండిత్యం గల పండితుడు కనిపించడు. అంతేగాక శ్రీరామకృష్ణుల పట్ల ఆయనకున్న గౌరవం ఎంత గాఢం! ఎంత అగాధం! భగవంతుని అవతారంలో ఆయనకు విశ్వాసముందని నీకు తెలుసా? నేను ఆయనకు అతిథిగా ఉన్నప్పుడు నా కెంత గౌరవ మర్యాదలు చూపాడో!… నాకు వీడ్కోలు చెప్పేటప్పుడు ఆ వృద్ధుని కళ్లలో నీళ్లు క్రమ్మాయి”* అంటూ స్వామీజీ తమ శిష్యుడైన శరశ్చంద్రతో ఒకసారి చెప్పారు. అందుకు శరశ్చంద్ర, “సాయనుడే మాక్స్ ముల్లర్గా జన్మిస్తే, ఆయన ఈ పవిత్ర భారత దేశంలో జన్మించకుండా మ్లేచ్ఛుడుగా ఎందుకు జన్మించాడు?” అని అడిగాడు. భావోద్వేగంతో స్వామీజీ అందుకు ఇలా జవాబిచ్చారు:
“నేను ఆర్యుణ్ణి, ఇతడు మ్లేచ్ఛుడు అనే భావం అజ్ఞానం నుండి జనిస్తుంది. వేదాలకు భాష్యం వ్రాసి జ్ఞానతేజంలా ప్రకాశిస్తున్న ఆ మహనీయునికి కులభేదా లేమిటి? అవి అర్థరహితాలు. మానవాళికి మేలు చేయడానికి, ఆయన ఇచ్ఛ వచ్చిన చోట మానవాకృతి దాల్చవచ్చు. ముఖ్యంగా సంపదలోను, జ్ఞానంలోను వన్నెకెక్కిన ఆ దేశంలో జన్మించకపోతే, ఇంతటి బృహత్తరమైన సంపుటాలను ప్రచురించ డానికి అవసరమైన ధనం ఆయన ఎక్కణ్ణుండి సంపాదించగలడు? ఋగ్వేదం ప్రచురించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ తొమ్మిది లక్షల రూపాయలు ఆయనకు ఇచ్చిందని నువ్వు వినలేదా? ఆ ధనం కూడా సరిపోలేదు. నెలసరి ఉపకారవేతనం మీద మన దేశంలోని వందలాది వైదిక పండితులను నియమించాల్సి వచ్చింది. జ్ఞానం కోసం అటువంటి అమోఘమైన తృష్ణ, విద్యకు అంత విస్తారంగా ధనం వెచ్చించగలిగిన వారెవరైనా ఈ దేశంలో, ఈ యుగంలో కనిపిస్తున్నారా? తన ఉపోద్ఘాతంలో స్వయంగా మాక్స్ ముల్లరే వేద సుపరిష్కృత ముద్రణకి ఇరవై ఐదేళ్లు వ్రాతప్రతులు తయారుచేశానని వ్రాశారు. అచ్చు వేయడానికి మరో ఇరవై సంవత్సరాలు పట్టింది. ఈ ఒక్క ప్రచురణ కోసమే నలభై ఐదేళ్లు శ్రమించడం సామాన్య మానవుడికి సాధ్యమా? ముందు నేను చెప్పిన విషయం గురించి ఆలోచించు! మాక్స్ ముల్లరే సాయనాచార్యుడనడం నా వెర్రి ఊహ అంటావా?”*
తమకు ఇంత మర్యాదామన్ననలు గల మాక్స్ ముల్లర్‌ను స్వామీజీ 1896 మే 28 వ తేదీన ఆయన ఇంట్లో కలుసుకొన్నారు. “ఎంతటి అద్భుతమైన వ్యక్తి ఆయన! కొద్ది రోజుల క్రితం నేను ఆయనను కలుసుకొన్నాను. కలుసుకొన్నానడం కన్నా ఆయనకు నమస్కరించడానికి వెళ్లాననడం సబబు. ఎందుకంటే శ్రీరామ కృష్ణులను ప్రేమించే ఎవరినైనాసరే వెళ్లి కలుసుకోవడాన్ని ఒక తీర్థయాత్రగానే నేను పరిగణిస్తాను” అంటూ బ్రహ్మవాదిన్ పత్రికకు స్వామీజీ వ్రాశారు.
స్వామీజీ కలుసుకొన్నప్పుడు మాక్స్ ముల్లర్ 70 ఏళ్ల వృద్ధుడు. “ఆయన చిన్న ఇంటిని అందమైన తోట పరివేష్టించి ఉంది. చెట్లూ చేమలూ, తీగలూ, పువ్వులతో ఆ చోటు ప్రాచీన ఋషుల తపోవనంగా నాకు అనిపించింది. ఆయన, ఆయన భార్య వసిష్ఠుడు, అరుంధతిలా జీవిస్తున్నారు. బ్రహ్మర్షులు, రాజర్షులు, మహానుభావులైన వానప్రస్థులు గడపిన జీవితాన్ని నాకు వారు జ్ఞప్తికి తెచ్చారు…. భారతదేశంపట్లా, వేదాంతంపట్లా ఆయనకున్న శ్రద్ధలో సగమైనా నాకు ఉండ కూడదా అనిపిస్తోంది” అంటూ తమ సమావేశం గురించి స్వామీజీ అభివర్ణించారు.
మాక్స్ ముల్లర్ వద్ద సెలవు పుచ్చుకొంటున్నప్పుడు స్వామీజీ ఆయనతో, “మీ రెప్పుడు భారతదేశానికి రాబోతున్నారు?” అని అడిగారు. వృద్ధుడైన ఆ ఋషివర్యుని ముఖారవిందం వికసించింది. కళ్లు ధారలు కట్టాయి; మెల్లగా తల ఊపుతూ ఆయన, “నేను భారతదేశానికి వస్తే మళ్లీ ఇక్కడికి తిరిగి రాలేను. మీరు నన్ను అక్కడే దహనం చేయాల్సి వస్తుంది” అన్నారు.
శ్రీరామకృష్ణుల పట్ల మాక్స్ ముల్లర్‌కు ఎనలేని గౌరవమర్యాదలు ఉన్నాయి. శ్రీరామకృష్ణుల జీవితచరిత్రను రచించాలనీ, అందుకు స్వామీజీ తోడ్పడాలనీ ఆయన స్వామీజీని అడిగారు. ఆయనకు అవసరమైన సమాచారాన్నీ, విశేషాలనూ పంపించమని రామకృష్ణానందకు స్వామీజీ లేఖ వ్రాశారు.
మాక్స్ ముల్లర్ పట్ల ఇంత గౌరవం ఉన్నప్పటికీ, మాక్స్ ముల్లర్‌తో సహా పాశ్చాత్య జ్ఞానులకు భారతదేశం గురించీ, దాని ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వం గురించీ సరియైన అవగాహన లేదని స్వామీజీకి తెలియకపోలేదు. మాక్స్ ముల్లర్ కూడా కొన్ని వ్యాసాలలో హిందూమతం గురించీ, భారతదేశం గురించీ కొన్ని యథార్థంకాని భావనలను వ్యక్తం చేశారు. దానిని గురించి, “ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్ హిందూమతాన్ని గురించి చేసిన రచనలన్నింటిలో చివరకు ఏదో ఒక కించపరచే మాటను చేరుస్తాడు అని నే నెప్పుడూ భావించేవాణ్ణి. కాని కాలక్రమాన సత్యాన్ని పూర్తిగా గుర్తించే కాలం వచ్చే తీరుతుంది. సాధ్యమై నంత త్వరలో ఆయన ఇటీవల ప్రచురించిన ‘వేదాంతిజమ్’ (వేదాంత మతం) అనే గ్రంథాన్ని చదవండి. దాన్లో ఆయన హిందూమతం, దాన్లోని పునర్జన్మ మొదలయిన దంతా దిగమింగినట్లు మీకు తెలుస్తుంది”* అని ఆయన వ్రాస్తున్నారు.
భాషాశాస్త్రం సహాయంతో పాశ్చాత్య పండితులు వేదాల కాలాన్ని గణించడం కూడా సరికాదని స్వామీజీకి తెలుసు. “వేదాలను గూర్చి పాశ్చాత్యం చేసిన సిద్ధాంతాలపై నాకు నమ్మకం లేదు. వారు, నేడు వేదాలు ఏదో ఫలానా కాలానికి చెందినవని నిర్ణయించి, రేపు ఇంకొక వేయి సంవత్సరాలు ముందుకు తెస్తారు”* అని ఆయన వ్రాస్తున్నారు. అభిప్రాయం ఏదైనా స్వామీజీకి చివరి దాకా మాక్స్ ముల్లర్ పట్ల గల మర్యాదామన్ననలలో ఎలాంటి మార్పూ లేదు.
గుండె పోటు
ఒక రోజు మధ్యాహ్నం భోజనానంతరం వాలుకుర్చీలో స్వామీజీ విశ్రాంతి తీసుకొంటున్నారు – చింతనలోనో, ధ్యానంలోనో మగ్నులై ఉండవచ్చు. హఠాత్తుగా ఆయన ముఖంలో తీవ్రమైన బాధ ద్యోతకమయింది. తరువాత గాఢంగా శ్వాసిస్తూ ఫాక్స్‌తో, “హఠాత్తుగా గుండెలో విపరీత మైన బాధ కలిగింది; గుండె ఆగిపోతుందేమో ననిపించింది. మా నాన్న గుండె పోటుతోనే మరణించారు. గుండెజబ్బు మా వారసత్వం” అన్నారు.
భారతదేశ కార్యంలో ఇంగ్లండ్ శిష్యులు
స్వామీజీ ఆరోగ్యం క్షీణించడం బహిరంగంగా తెలియవచ్చింది. కనుక స్విట్జర్లాండ్‌లో కొన్ని రోజులు ఆయన విశ్రాంతి తీసుకోవడానికి శిష్యులు ఏర్పాటు చేశారు. ఇంతలో ఇంగ్లండ్‌లోనూ అనేకులు స్వామీజీ మార్గం అనుసరించడానికి సిద్ధపడ్డారు. మిస్ ముల్లర్ తన అపార సంపద తీసుకొని భారతదేశానికి వెళ్లి, శేషజీవితాన్ని అక్కడ గడపాలని నిశ్చయించుకొంది. సేవియర్ దంపతులు హిమాలయాల్లో ఒక ఆశ్రమం నెలకొల్పి అక్కడే జీవించాలని నిర్ణయించుకొన్నారు.
స్వామీజీ భారతదేశ కార్యాచరణలో ఆయన సోదర శిష్యులు అప్పటికే తమను అంకితం చేసుకొన్నారు. కాని మహిళల కోసం ఆయన తలపెట్టిన పనులకు ఇంకా శ్రీకారం చుట్టబడలేదు. ఆ కార్యనిర్వహణకు మార్గరెట్ నోబుల్ నడుంబిగించింది. నోబుల్ నిర్ణయం స్వామీజీని ఆనందాబ్ధిలో ఓలలాడించింది:
“నా మాట విశ్వసించు. లోకాన్ని ఉర్రూతలూగించే శక్తి నీలో నిక్షిప్తమై ఉంది. ఇది సత్యం. నీలాంటి వారు ఇతరులూ వెలువడతారు. ధీరవాక్కులూ, ధీరతరమైన చేతలూ మనకు అవసరమై ఉన్నాయి. ఓ మహనీయులారా! లేవండి, మేల్కొనండి, లోకం దుఃఖంతో మాడిపోతోంది. మీరు నిద్రపోగలరా? నిద్రిస్తున్న దేవతలు మేల్కొనే వరకు, లోనున్న దైవం ‘ఓ’ అని పలికే వరకు మనం ఎలుగెత్తి పిలుద్దాం గాక! ఇంతకన్నా మహత్కార్యం ఏముంది?”* అంటూ నోబెల్‌కు స్వామీజీ వ్రాశారు.