నాకు వెనుక ఉన్న శక్తి వివేకానంద కాదు, సాక్షాత్తూ భగవంతుడే!
– స్వామి వివేకానంద
భగవదాదేశం! — శుభాకాంక్షలు — స్నానాల గదికై అన్వేషణ — నిజమైన అనుష్ఠాన వేదాంతి — స్టర్డీ — ‘నా వెనుక భగవంతుడే!’ — బుసగొట్టే వృషభం ఎదుట — మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ — ఇంగ్లండ్ నుండి బయలుదేరడం — మళ్లీ న్యూయార్క్‌లో — వాల్డో: భగవంతుని సేవిక — లోకం కృతజ్ఞతాబద్ధమైన వ్యక్తి : గుడ్విన్ — ముగ్గురు మేధావులు — న్యూయార్క్ పనులు — డెట్రాయిట్ : గందరగోళ ప్రారంభం — హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో — పదవులూ పట్టాలూ అక్కర్లేదు — ఎవరు పండితుడు? — సర్వతోముఖ విద్వత్తు
పునీత హస్తం — పుస్తకాల ప్రచురణ — ‘నా పయనం’ — వేదాంత తత్త్వ గ్రంథం — తక్కిన గ్రంథాలు
భగవదాదేశం!
అ మెరికా కార్యాచరణలకు స్వామీజీ ఇంగ్లండు ప్రయాణం ఒక విరామమని చెప్పవచ్చు. ఇంగ్లండ్ మిత్రుల ఆహ్వానాన్ని పురస్కరించుకొని స్వామీజీ అక్కడకు వెళ్లి మూడు నెలలు గడిపారు. ఈ రోజులు ఆయనకు కొంతలో కొంత విశ్రాంతి ఇవ్వడంతో పాటు ఇంగ్లండ్‌లో కార్యాచరణకు గల ఆస్కారాన్ని ఆయన ప్రత్యక్షంగా తెలుసుకోగలిగారు. భారతదేశం నుండి బయలుదేరినప్పుడే ఇంగ్లండ్ వెళ్లాలనే ఉద్దేశం ఆయనకు లేకపోలేదు. సహస్రద్వీప వనం నుండి న్యూయార్క్ వెళ్లాక ఆ ఉద్దేశాన్ని రూఢిపరచు కొన్నారు. ఆ సమయంలో ఆయనకు మిస్ హెన్రిటా ముల్లర్ అనే మహిళ నుండి ఆహ్వానం వచ్చింది. దానితోపాటు ఈ.టి. స్టర్డీ అనే వ్యక్తి కూడా ఇంగ్లండ్‌లో కార్యాచరణకు గల అవకాశాలను పేర్కొని, స్వామీజీని ఆహ్వానిస్తూ లేఖ వ్రాశాడు. అదే సమయంలో ప్యారిస్‌లో జరుగనున్న తన వివాహానికి రమ్మని ఫ్రాన్సిస్ లెగెట్ కూడా స్వామీజీని ఆహ్వానించాడు. ఇంగ్లండ్‌కు వెళ్లే అవకాశం లభించడం చూసిన స్వామీజీ, “లండన్‌లో పనిచేయడానికి కలిగిన ఈ అవకాశాన్ని నేను వదలుకో దలచలేదు. మీ ఆహ్వానాన్ని, దానితోపాటు లండన్ నుండి వచ్చిన ఆహ్వానాన్ని, అక్కడ పని సాగించడానికి ఇచ్చిన భగవదాదేశంగా భావిస్తున్నాను”* అని లెగట్కు వ్రాశారు. ఈ ఆహ్వానాలను భగవదాదేశాలుగా పరిగణించి స్వామీజీ ఇంగ్లండ్ వెళ్లాలని నిశ్చయించుకొన్నారు.
శుభాకాంక్షలు
స్వామీజీ బయలుదేరే సమయంలో ఒక అభినందన లేఖ ఆయనకు వచ్చింది. డెట్రాయిట్లో స్వామీజీ పనులకు మద్దతు నిచ్చిన మిసస్ బాగ్లీ నుండి ఆ లేఖ వచ్చింది. కొద్ది రోజుల క్రితమే స్వామీజీ భారతదేశం నుండి అందమైన కొన్ని కాశ్మీర్ శాలువాలను తెప్పించి కొందరికి బహూకరించారు. మిసెస్ సారా, మిస్ ఫిలిప్స్, మిసెస్ బాగ్లీ ప్రభృతులు వారిలో కొందరు. దానిని ప్రస్తావిస్తూ మిసెస్ బాగ్లీ ఇలా వ్రాసింది:
“ప్రియమైన స్వామి వివేకానంద!
బంగారు జరీ పువ్వుల పనితనంతో తయారైన అందమైన కాశ్మీర్ శాలువ ఈ రోజు ఉదయం అందింది. అభిమానంతో నన్ను జ్ఞాపకం ఉంచుకొన్నందుకు కృతజ్ఞతలు. దానిని ఉపయోగిస్తున్నప్పుడల్లా భారతదేశం గురించిన ఆలోచనలు మాత్రమే కాకుండా, మీ ఆశీస్సులు దాన్లో పొదిగివున్నాయని అనుభూతి పొందు తున్నాను. మీ ఇంగ్లండ్ ప్రయాణం విజయవంతం కావాలని మేమందరమూ ప్రార్థిస్తున్నాం. మీరు మళ్లీ అమెరికాకు, అందునా డెట్రాయిట్కు, అందునా మా ఇంటికి తిరిగి వస్తారని ఆశిస్తున్నాం. డెట్రాయిట్కు వచ్చినప్పుడు మా ఇంట్లోనే బస చేయాలి, దీనినే మీ కార్యాచరణ కేంద్రంగా చేసుకోవాలి.
“శాస్త్రధ్యయనం చేసిన కొందరిని మీ దేశం నుండి ఇక్కడకు రావించి మాకు మా మతాన్నీ, తక్కిన మతాలను గురించీ బోధించే ఏర్పాటు మీరు చేయలేరా?… మా జీవితాలకు ప్రేరణ కల్పించడానికీ, మా హృదయాలలో భగవదుద్దీపన కలగడానికీ ఇది మాకు అత్యవసరం.
“సుదూరంగా ఉన్న ఒక దేశంలో తన కుమారుడు ఇన్ని మంచిపనులు చేశాడని తెలుసుకొన్న మీ తల్లి తప్పకుండా ఆనందిస్తారు. నా ప్రియమైన శుభాకాంక్షలను ఆనందంతో ఆమెకు పంపిస్తున్నాను.”
చివరి రెండు వాక్యాలూ స్వామీజీ హృదయాంతరాళాలను స్పృశించి ఉంటాయనడంలో సందేహం లేదు. సమధికోత్సాహంతోనూ, శుభాకాంక్షలతోనూ స్వామీజీ ఇంగ్లండ్‌కు బయలుదేరారు.
స్నానాల గదికై అన్వేషణ
1895 ఆగస్టు 17 వ తేదీన న్యూయార్క్ నుండి బయలుదేరి, 24 వ తేదీన స్వామీజీ ప్యారిస్ చేరుకొన్నారు. ఆయనతోబాటు ఫ్రాన్సిస్ లెగెట్ కూడా ప్రయాణం చేశాడు. ప్యారిస్‌లో మిస్ మెక్లౌడ్, ఆమె సోదరియైన పెట్రీ స్టర్జస్ ప్రభృతులు స్వామీజీకి స్వాగతం పలికారు. వేసవికాలంలో ప్యారిస్ బాగా వేడిగా ఉంటుంది. అక్కడ చన్నీటితో స్నానం చేయడానికి, అంతెందుకు సాధ్య పడితే హిమాలయ గంగానదిలోనే మునిగి ఉండిపోవాలని స్వామీజీ ఆశించి ఉంటారు. కాని వింత ఏమిటంటే ప్యారిస్ లోని హోటళ్లలో అసలు స్నానాల గదులే లేవు! అతి పెద్దవైన, అత్యంత ఆధునికమైన హోటళ్లలో కూడా ఆ సౌకర్యం లేదు. ఎందుకంటే ఫ్రెంచివారు స్నానం చేయడం అరుదు, కాలాంతరంలో దీనిని గురించి స్వామీజీ తమాషాగా ఇలా వ్రాశారు:
“ప్యారీస్ నగరం ఆధునిక నాగరకతకు కేంద్రం. భోగాలకు, ఫ్యాషన్లకు, ఉల్లాస జీవనానికి, ఇహలోక స్వర్గప్రాయమైంది. విద్యలకు, కళలకు కేంద్రం. నా మిత్రుడు రాజగృహాన్ని పోలిన ఒక హోటల్లో నాకు బస ఏర్పాటుచేశాడు. అక్కడి భోజన ఏర్పాట్లు రాజాధిరాజులకు అర్హమైనవి. కాని స్నానానికి ఏర్పాట్లు? ఆ పేరే అక్కడ కనిపించదు! దీన్ని నేను రెండు రోజులు మౌనంతో భరించాను. చివరకు ఇక భరించలేక, నా మిత్రుడికి ఇలా చెప్పాల్సి వచ్చింది: ‘ప్రియసోదరా! ఈ రాజభోగం, నువ్వూనీ వారూ మాత్రం అనుభవించండి! ఇక్కడ నుండి బయటపడడానికి నేను ఉక్కిరిబిక్కిరవుతున్నాను. ఇంతటి ఉష్ణ వాతావరణంలో స్నాన సౌకర్యం లేనేలేదు! ఇదే స్థితిలో కొంతకాలం ఉంటే నాకు పిచ్చెక్కి, పిచ్చి కుక్కనయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది.’ ఇది విని నా మిత్రుడు ఎంతో బాధపడి, హోటల్ అధికారులపై ఎంతో కోపగించుకొని, నాతో ఇలా అన్నాడు: ‘నిన్ను నేనింక ఇక్కడ ఉండనివ్వను. వెళ్లి మంచి అనుకూలంగా ఉండే చోటు చూద్దాం.’ అక్కడి ప్రధానమైన పన్నెండు హోటళ్లు తిరిగి చూశాం. కాని వాటిలో ఎక్కడా స్నానానికి తావే లేదు! ప్రత్యేక స్నానమందిరాలు కొన్ని ఉన్నాయి. అక్కడికి ఎవరైనా వెళ్లి నాలుగైదు రూపాయలు చెల్లించి ఒకసారి స్నానం చేయవచ్చు. సర్వేశ్వరా! ఏమిటీ స్థితి! ఒక వృద్ధురాలు స్నానపు తొట్టిలో మునిగి వెంటనే మరణించిందని ఆనాటి మధ్యాహ్నం నేనొక వార్తాపత్రికలో చదివాను! ఈ విషయంలో డాక్టర్ల అభిప్రాయం ఏది ఏమైనప్పటికీ, నాకు తోస్తున్న నిజమైన కారణం: అన్ని నీళ్లను ఒక్కసారిగా చూసి అందులో మునగడం ఆమెకు అదే మొదటిసారి అయి ఉంటుంది; ఆ ఆకస్మిక దిగ్భ్రాంతిని శరీరం తట్టుకోలేక ఆమె ప్రాణాలు కోల్పోయి ఉంటుంది. ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు.”*
నిజమైన అనుష్ఠాన వేదాంతి
ప్యారిస్‌లో స్వామీజీ అనేక ప్రదేశాలు సందర్శించారు. ఒక రోజు ఆయన డచ్చస్ డి పోమర్ అనే మహిళతో బండిలో వెళుతున్నారు. అదొక గ్రామీణ ప్రాతం. దారిలో బాట వైపుగా ఒక చిన్న పిల్లవాడు, చిన్నపిల్ల తమ దాసీతో నడచిపోతున్నారు. వారిని చూడగానే బండి నడిపే వ్యక్తి బండిని ఆపి, క్రిందికి దిగి, ఆ పిల్లల వద్దకు వెళ్లి కాసేపు వారిని ముద్దాడి తిరిగివచ్చాడు. అతడు రాగానే డచ్చస్, “నువ్వెందుకు వెళ్లి ఆ పిల్లలను ముద్దాడావు? వారు శ్రీమంతుల పిల్లలు కదా?” అని అడిగింది. అందుకు ఆ బండి నడిపే వ్యక్తి, “ఎందుకు, నేనూ గొప్ప ధనవంతునిగానే ఉండేవాణ్ణి. ప్యారిస్‌లోని ఒక పెద్ద బ్యాంక్‌లో నేను కార్యనిర్వాహకునిగా పనిచేశాను. ఈ మధ్యే ఆ బ్యాంకు దివాలా తీసింది. నా డబ్బంతా పోయింది. మిగిలిన డబ్బుతో గుర్రపు బండీ, గుర్రాలూ కొన్నాను. గ్రామీణ ప్రాంతంలో ఒక అద్దె ఇంటికి కుటుంబంతో సహా తరలిపోయాను. ఇదిగో ఇప్పుడు అందరమూ ఆనందంగా నిరాడంబర జీవితం గడపుతున్నాం” అన్నాడు.
జరుగుతున్నదంతా స్వామీజీ గమనిస్తూనే ఉన్నారు. ఆ బండి నడిపే వ్యక్తి జీవిత దృక్పథం ఆయనను ఎంతగానో ఆకట్టుకొంది. కష్టాలు వచ్చినప్పుడు కలత చెందకుండా, వాటిని యథాతథంగా స్వీకరించి సంతృప్తితో జీవిస్తున్న ఆతణ్ణి స్వామీజీ ఎంతో ప్రశంసించారు. ఈ సంఘటనను కాలాంతరంలో ప్రస్తావిస్తూ ఆయన, “దీనినే నేను అనుష్ఠాన వేదాంతం అంటాను. ఆ బండి నడిపే వ్యక్తి ఒక అనుష్ఠాన వేదాంతి. అతడు వేదాంత సారాన్ని అవగతం చేసుకొన్నాడు. అంతటి పెద్ద పదవి నుండి క్రిందికి జారి పడినప్పటికీ అతడు సమతౌల్యం కోల్పోలేదు. ఆహా! ఆతడి మనఃశక్తి ఎంత అద్భుతం! భగవంతునికే కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగానే ఆతడు ఒక వేదాంతి” అని చెప్పేవారు.
రెండు వారాలు ప్యారిస్‌లో బసచేసి ఫ్రాన్సిస్ లెగెట్ పెట్రీ స్టర్జస్ వివాహం తిలకించి 1895 సెప్టెంబర్‌లో లండన్‌కు వెళ్లారు స్వామీజీ.
స్టర్డీ
స్వామీజీని ఇంగ్లండ్‌కు ఆహ్వానించిన వారిలో ఒకరైన స్టర్డీ ఒక ఆంగ్ల యువకుడు. గారడీ విద్యల పట్ల ఆసక్తిగల ఇతడు వాటి కోసం దాదాపు రెండేళ్ల క్రితం భారతదేశానికి వచ్చాడు. దివ్యజ్ఞాన సమాజ సభ్యుడైన ఇతడు హిందువుల ఆచార అనుష్ఠానాలను తు.చ. తప్పక పాటించాడు. అల్మోరాలో స్వామి శివానందను కలుసుకొన్నప్పుడు ఆయన పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు. ఆ తరువాత దివ్యజ్ఞాన సమాజానికి స్వస్తి చెప్పి, వేదాంతాన్ని అనుసరించసాగాడు. ఆతడు గొప్ప శ్రీమంతుడు, సంస్కృతంలో చక్కని ప్రవేశముంది, హిందూ ధర్మశాస్త్రాలను అభ్యసించాడు. మిస్ ముల్లర్ కూడా దివ్యజ్ఞాన సమాజానికి చెందిన వ్యక్తే. ఈమె కూడా తరువాత ఆ సమాజం నుండి వైదొలగింది. మొదట్లో స్వామీజీ స్టర్డీ ఇంట్లో బస చేశారు. ఆ ఇల్లు థేమ్స్ నదీతీరంలో ఉంది. రెండు వైపులా చెట్లు ఏపుగా పెరిగివున్నాయి.
‘నా వెనుక భగవంతుడే!’
ముమ్మరంగా పనిలో మునిగిపోవాలనో, ఒక ప్రత్యేక ప్రణాళికతోనో స్వామీజీ ఇంగ్లండ్‌కు వెళ్లలేదు. అమెరికా కార్యాచరణ నుండి కొంత మేరకు విశ్రాంతి పొందడానికి ఇంగ్లండ్ పయనం దోహద పడుతుందని ఆయన అమెరికా మిత్రులు భావించారు. అమెరికా కన్నా ఇంగ్లండ్ మరికాస్త పరిచిత ప్రాంతంలా స్వామీజీకి తోచింది.
ఆంగ్లేయులలో అనేకులు భారతదేశాన్ని అభిమానించారు. కాని కొందరు దోషాలు ఆరోపించి బహిష్కరించారు. అమెరికాలో స్వామీజీని ప్రతిఘటించిన ఫాదరీలూ, మిషనరీలు తమ చాకచక్యాన్ని ఇంగ్లండ్‌లోనూ ప్రదర్శించారు. ఆయనను గురించి అపవాదులు ప్రచారం చేశారు. అమెరికాలోనూ, ఇక్కడ కూడా వారి ఈ ప్రతిఘటనకు స్వామీజీ కించిత్తు కూడా జంకలేదు. “ఎందుకంటే నా వెనుక ఉన్న శక్తి వివేకానంద కాదు, సాక్షాత్తూ భగవంతుడే!” అన్నదే స్వామీజీ అనుభవరీత్యా గడించిన దృఢవిశ్వాసం.
బుసగొట్టే వృషభం ఎదుట
ఒక రోజు స్వామీజీ మిస్ ముల్లర్తోనూ, మరొక ఆంగ్లేయునితోనూ పొలం గట్టు మీద నడిచి వెళుతున్నారు. హఠాత్తుగా ఎదురుగా ఒక ఎద్దు రంకె వేస్తూ వేగంగా వస్తూన్నది. ఆ ఆంగ్లేయుడు ఒక్క పరుగులో సురక్షితమైన చోటికి చేరుకొన్నాడు. ముల్లర్ శక్తి మేరకు పరుగుతీసి, ఆపైన సాధ్యంకాక ఆయాసంతో చతికిలపడింది. ‘ఈమెకు సాయం చేయలేకపోతున్నానే’ అని ఒక్క క్షణం యోచించి స్వామీజీ తిన్నగా పరుగెత్తి ముల్లర్ ముందు వెళ్లి నిలబడ్డారు. చేతులు జోడించి కళ్లు మూసుకొన్నారు; ‘అంతే, ఇంకా కొన్ని క్షణాల్లో అంతా సమాప్తం’ అని ఆయనకు అనిపించింది. ఎద్దు వేగంగా వచ్చి వాడియైన కొమ్ములతో తనను చీల్చనున్న ఆ క్షణంలో కూడా స్వామీజీలో విచిత్రమైన ఆలోచన తలెత్తింది. ‘ఎద్దు నన్ను కుమ్మి కొమ్ములతో అమాంతం ఎత్తి పారవేసినప్పుడు నేను ఎన్ని అడుగుల దూరంలో పోయి పడతాను?’ అంటూ ఆయన మనస్సు లెక్కించింది. కాని ఆవేశంతో వస్తున్న ఆ ఎద్దుకు ఏం అనిపించిందో ఏమో! స్వామీజీ ముందు కొన్ని అడుగుల దూరంలోకి రాగానే అది హఠాత్తుగా ఆగిపోయింది, చేతులు జోడించిన స్వామీజీని ఒకసారి తేరిపార చూసింది, తల తిప్పి వచ్చిన దారినే వెళ్లిపోయింది.
మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్
స్టర్డీతో, ముల్లర్‌తో అధ్యయనం, చర్చలతో స్వామీజీ రోజులు గడపసాగారు. మొదట్లో ఒక నెల స్టర్డీకి శాస్త్రాధ్యయనంలోను, కొన్ని రోజులు అనువాదంలోను ఆయన సహాయపడ్డారు. వాటిలో ‘నారద భక్తి సూత్రాలు’ ఒకటి. అప్పుడప్పుడు కొన్ని ప్రసంగాలు కూడా చేశారు. ‘ప్రేమను గురించి ప్రాచ్యదేశాల భావన’, ‘ఆత్మజ్ఞానం’ వంటివి ఆయన ప్రసంగాంశాలు. ఈ ప్రసంగాలు ఇంగ్లండ్‌లో అనేక కార్యాలకు బీజాంకురమైనాయి. పెద్ద ఎత్తున ఏ కార్యమూ జరగలేదు. కాని ఈసారి స్వామీజీకీ, ఆయన మూలంగా భారతదేశానికీ ఒక గొప్ప అపురూపమైన కానుక లభించింది. ఆ కానుకే కాలాంతరంలో సోదరి నివేదితగా వికసించిన మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్.
లేడీ మార్కసస్ ఇంటి ఆహ్వానితుల గదిలో ప్రప్రథమంగా స్వామీజీని నోబుల్ కలుసుకొంది. అది నవంబర్ తొలినాళ్లు. నోబుల్ ఇలా వ్రాస్తున్నది: “ఆ రోజు పదిహేను లేదా పదహారు మంది సన్నిహిత మిత్రులు మాత్రమే ఆహ్వానింపబడ్డారు. స్వామీజీని వీరు పరివేష్టించి కూర్చున్నారు. స్వామీజీ ఎరుపురంగు దుస్తులు ధరించి ఉన్నారు. సుదూర దేశం నుండి ఏదో ఒక సందేశాన్ని తీసుకువచ్చిన ‘దైవం మానుష రూపేణ’ అన్నట్లుగా ఆయన కనిపించారు. అప్పుడప్పుడు ‘శివ శివ’ అని ఆయన ఉచ్చరిస్తూ ఉండడం మనస్సుకు ఆహ్లాదం చేకూర్చింది. దీర్ఘకాలంగా ప్రగాఢ ధ్యానమయ జీవితం గడపిన వారి ముఖారవిందాన విలసిల్లే ప్రశాంతత ఆయన ముఖాన ద్యోతకమయింది. ఆయన దృష్టిలో కోమలత్వమూ, గాంభీర్యమూ కలగలసి కానవచ్చాయి. రాఫెల్ చిత్రించిన దివ్యశిశువు చూపులో గోచరించే కోమలత్వం అలాంటిది అది… ఆ రోజు ఆయన వల్లించిన సంస్కృత శ్లోకాలు నేటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎంతటి మాధుర్యమైన, అదే సమయంలో, చర్చ్‌లో వినవిచ్చే పాటల కన్నా పూర్తిగా విలక్షణమైన సంగీతం అది!”
ప్రథమ సమావేశంలోనే స్వామీజీ పట్ల ఎంతగానో ఆకర్షితురాలైంది నోబెల్. ఆ తరువాత ఒకటి రెండు స్వామీజీ ప్రసంగాలు విన్నది. స్వామీజీ భావనల నన్నింటినీ వెంటనే నోబెల్ స్వీకరించలేకపోయింది. కనుక ప్రసంగం మధ్యలోనే అనేకసార్లు, “కాని…స్వామీ…” అంటూ ఆమె స్వామీజీకి అంతరాయం కలిగిస్తూ ప్రశ్నలు అడిగింది, ఖండిస్తూ మాట్లాడింది. నోబుల్ వైఖరి వలనగానీ, ప్రశ్నల వలనగానీ స్వామీజీ తొట్రుపాటు పడలేదు. “ఇట్లే ప్రశ్నలడిగీ, ప్రతిఘటించి మాట్లాడి నేను నా గురుదేవులతో ఆరు సంవత్సరాలపాటు పోరాడాను. దాని పర్యవసానంగా దారిలోని ప్రతి విభాగమూ నేడు నాకు స్పష్టంగా తెలిసింది” అంటూ నోబెల్ విచారణాత్మకమైన మనస్సును ప్రేరేపించారు. క్రమక్రమంగా స్వామీజీ భావాల పట్ల ఆకర్షితురాలై, ఆయనను ఆరాధనీయునిగా భావించే స్థితికి ఆమె వచ్చింది.
ఇంగ్లండ్ నుండి బయలుదేరడం
ఈ మొదటి ప్రయాణం ఇంగ్లండ్‌లో స్వామీజీ భవిష్యత్ కార్యాలకు శ్రీకారం చుట్టింది. ఇంగ్లండ్ పనికి సంబంధించినంత వరకు స్వామీజీ ఎంతో నమ్మకంతో ఉన్నారు. అక్కడ పని కొనసాగించడానికి తమ సోదర సన్న్యాసులలో ఎవరినైనా రప్పించాలని కూడా ఆయన అనుకోక పోలేదు. స్టర్డీ అభిమతమూ అదే. వచ్చే వ్యక్తి ఆంగ్లంలోనూ, శాస్త్రాలలోనూ చక్కని అభినివేశం గల వ్యక్తిగా ఉండడం ఆవశ్యకం. స్వామీజీ మనస్సులో రామకృష్ణానంద, అభేదానంద, త్రిగుణాతీతానంద, శారదానందలు స్ఫురించినప్పటికీ, ఆరోగ్యరీత్యా కూడా శారదానంద సముచిత వ్యక్తిగా ఆయనకు తోచారు. కనుక ఆయనను రమ్మనమని వ్రాశారు.
మళ్లీ న్యూయార్క్‌లో
దాదాపు 14 వారాలు ఇంగ్లండ్‌లో గడిపిన తరువాత స్వామీజీ నవంబర్ 27 వ తేదీన న్యూయార్క్ బయలుదేరారు. ఆ ప్రయాణం కల్లోల వాతావరణంలో సాగింది. అట్లాంటిక్ మహాసముద్రం గుండా పయనిస్తున్నప్పుడు ఓడ విపరీతంగా ఊగిపోసాగింది. స్వామీజీ సముద్ర రుగ్మతకు గురయ్యారు. డిసెంబర్ 6 వ తేదీన న్యూయార్క్ చేరుకొన్నారు. న్యూయార్క్ రేవులో స్వామీజీని కృపానంద ఆహ్వానించి తీసుకు వెళ్లాడు. కృపానందతో కలసి ఉంటూ తరగతి ప్రసంగాలు చేశారు. కాని ఆ చోటు స్వామీజీకి అంతగా నచ్చలేదు. తక్కువ అద్దె, నగరంలో ఏ ప్రాంతం నుండయినా అక్కడికి సులభంగా చేరుకోవచ్చుననే అంశాలే ఆ ఇంటి సానుకూలతలు. ఇల్లూ, పరిసరాలూ ఏవీ స్వామీజీ జీవితానికి యోగ్యమైనవిగా లేవు.
స్వామీజీ ఇంగ్లండ్ వెళ్లిన రోజుల్లో కృపానంద, అభయానందలు అనేక చోట్ల తరగతులు నిర్వహించారు. స్వామీజీ తమ శిష్యులలో వారిద్దరికి మాత్రమే తరగతులు నిర్వహించడానికి అనుమతి నిచ్చారు. తిరిగి వచ్చిన తరువాత స్వామీజీ మళ్లీ తరగతులు నిర్వహించసాగారు.
వాల్డో: భగవంతుని సేవిక
ఒక రోజు స్వామీజీ వాల్డోతో, “ఇక్కడ భోజనం అంత పరిశుభ్రమైనదిగాకనిపించడం లేదు. నా కోసం వంట చేయగలవా?” అని అడిగారు. వాల్డో మహ దానందంతో ఆ బాధ్యతను స్వీకరించింది. ఆ రోజు అక్కడే వంట చేసింది. మర్నాడు తన ఇంట్లో నుండి వంటపాత్రలు మొదలై నవి తీసుకువచ్చి వంటచేయ నారంభించింది. కాలాంతరంలో స్వామీజీ వాల్డోకు ‘సోదరి హరిదాసి’ అనే పేరు ఒసగారు. అంటే భగవంతుని సేవిక అని అర్థం. స్వామీజీ సేవికగానే వాల్డో విరాజిల్లింది.
వాల్డో ఇల్లు బ్రూక్లిన్‌లో ఉంది. రోజూ ఆమె గుర్రపు బండిలో రెండు గంటలసేపు ప్రయాణం చేసి రావాలి. ఉదయం ఏడు లేక ఎనిమిది గంటలకు వచ్చి వంటావార్పూ ముగించి, తక్కిన పనులు పూర్తి చేసుకొని రాత్రి తొమ్మిది పది గంటలకు ఇల్లు చేరుకొనేది.
ఈ విధంగా అనేక రోజులు గడిచాయి. వాల్డోకు స్వామీజీ పట్ల గల భక్తి ప్రపత్తులు ఎనలేనివి.
ఉపన్యాసాలు ఏవీ లేనప్పుడు స్వామీజీ వాల్డో ఇంటికి వెళ్లేవారు. కొన్ని సమయాల్లో, “నేను సాయం చేస్తాను” అంటూ ఆయన స్వయంగా వంట చేయ డమూ కద్దు. అటువంటి రోజు వాల్డోకు సహాయం అంతగా ఉండకపోవడంతో బాటు, మామూలు కన్నా ఎక్కువగా పాత్రలు తోమవలసి ఉంటుందన్న సంగతి తెలిసిందే కదా!
తమ సొంత వ్యక్తిగా సాక్షాత్తూ స్వామీజీచే పేర్కొనబడిన భాగ్యశాలి వాల్డో. ఆ సంఘటన పరికిద్దాం: ఒక రోజు ఒక మూల కూర్చుని వాల్డో ఏడుస్తూవుంది. అది చూసి స్వామీజీ ఆమె వద్దకు వెళ్లి అందుకు కారణమేమిటని అడిగారు. అందుకు వాల్డో, “నేను మీకు నచ్చలేదని అనుకొంటున్నాను. తక్కినవారు తప్పు చేసినా మీరు నన్నే తిడుతున్నారు” అంది. వెంటనే స్వామీజీ, “వారినందరినీ నేనెలా తిట్టగలను? ఆ మేరకు వారు నాకు సన్నిహితులు కారు. కనుకే నీ వద్దకు వస్తున్నాను. నాకు సొంతమయిన వారిని కాక మరెవరిని తిట్టగలను?” అని అడిగారు. ఆ తరువాత స్వామీజీ కోపమూ, తిట్లూ వాల్డోను కలత చెందించలేదు. స్వామీజీ సొంత వ్యక్తిలా ఉండడంలోనే ఆమె సంతృప్తి చెందింది.
లోకం కృతజ్ఞతాబద్ధమైన వ్యక్తి : గుడ్విన్
వాల్మీకి లేనిదే రామాయణం లేదు; వ్యాసుడు లేనిదే మహాభారతం లేదు; ‘మ’ లేకుండా శ్రీరామకృష్ణ కథామృతం లేదు – గుడ్విన్ లేకుండా స్వామీజీ ఉపన్యాసాలు లేవు. నేటి ప్రపంచానికి స్వామీజీ ఉపన్యాసాలనే మహోన్నత సాహిత్యం లభించడానికి కారణభూతుడు జోసైయా జాన్ గుడ్విన్. కనుక లోకం గుడ్విన్కు కృతజ్ఞతాబద్ధమై ఉండడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఈ రోజుల్లో స్వామీజీ జీవితంలో మమేకమయ్యారు. స్వామీజీ ఉపన్యాసాలను సంక్షిప్త లేఖనంలో వ్రాయడానికి పలువురిని నియమించారు. కాని ఎవరూ నిలకడగా ఉండలేకపోయారు. చివరికి డిసెంబర్ 12 వ తేదీ హెరాల్డ్, వరల్డ్ అనే రెండు పత్రికలలో ప్రకటన ఇచ్చారు.
కావలెను- వారంలో పలు గంటలసేపు జరిగే ఉపన్యాసాలను వేగంగా సంక్షిప్త లేఖనంలో వ్రాయగల ఒక అభ్యర్థి కావాలి. 228, 39 – పడమర వీథి అనే చిరునామాకు దరఖాస్తులు పంపండి.
ఈ ప్రకటన చూసి స్వామీజీ వద్దకు గుడ్విన్ వచ్చాడు.
గుడ్విన్ 25 ఏళ్ల ఆంగ్ల యువకుడు; పత్రికారంగంలో కొన్ని ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి. మూడు వార్తాపత్రికలకు సంపాదకునిగాను, ఆ తరువాత విలేఖరిగాను పనిచేశాడు. గుడ్విన్ను చూడగానే స్వామీజీకి అతడి పట్ల సదభిప్రాయమూ, సాన్నిహిత్యమూ కలిగాయి. ఒక ఉద్యోగిగా కాకుండా తమ సొంతమనిషిగానే అతణ్ణి స్వామీజీ పరిగణించారు; అట్లే స్వీకరించారు కూడా. కాలాంతరంలో గుడ్విన్ ఇలా అన్నాడు: “నా గత జన్మల గురించి స్వామీజీ చెప్పారు. ఇది నాలో, నా జీవితంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. నా జీవితం మారిపోయింది. నేను పేదవానిగా జన్మించాను. జీవనమార్గం అన్వేషిస్తూ అనేకచోట్ల అలమటించాను. కొందరు గొప్పవాళ్ల వద్ద పనిచేశాను. వారు నాకు పని ఇచ్చారు, జీతమిచ్చారు. కాని ఎవరూ హృదయపూర్వకమైన ప్రేమను ఇవ్వలేదు. చివరికి అమెరికాలో స్వామి వివేకానందను కలుసుకొన్నాను. ప్రేమంటే ఏమిటో ఆ తరువాతే అర్థంచేసు కొన్నాను. జీతం ఉన్నదో లేదో, నేను వారికి వశుణ్ణయ్యాను! స్వామి వివేకానంద వంటి ఒక మహోన్నత వ్యక్తిని నేను చూసి ఎరుగను. మనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తిలా మనం ఆయన వైపు ఆకర్షితులమైపోతాం.”
ప్రస్తుత సంక్షిప్త లేఖనం ఆనాడు అంతగా ప్రాచుర్యంలో లేదు. ఉదయమూ, సాయంత్రమూ స్వామీజీ తరగతులు నిర్వహించారు. ఆయన వేగానికి దీటుగా తనదైన వైఖరిలో సంక్షిప్త లేఖనంలో వ్రాసుకొని పిదప దానిని టైపు చేసుకొంటాడు గుడ్విన్. అతడు పేదవాడు కనుక జీతం పుచ్చుకొనే తీరాలి. కనుక తన ఖర్చులకు అవసరమైనంత డబ్బు మాత్రమే పుచ్చుకొని రాత్రీపగలూ అని చూడకుండా పనిచేశాడు. ఈ విధంగా మనకు లభించినవే స్వామీజీ ప్రసంగాలలో అధికభాగం.
ముగ్గురు మేధావులు
ఫిబ్రవరి ప్రారంభంలో న్యూయార్క్‌లో స్వామీజీకి ఇద్దరు మేధావులతోసన్నిహితంగా మెలగే అవకాశం లభించింది. మేధావులు ముగ్గురూ ఒక రోజు కలుసుకొన్నారు. మేరీ లూయీ బర్క్ ఇలా వ్రాస్తున్నది: “ఆధ్యాత్మిక రంగంలో మేధావియైన స్వామీజీ, కళారంగంలో మేధావియైన మేడం సారా బెర్న్‌హార్ట్, విజ్ఞాన రంగంలో మేధావియైన నికోలా టెస్లా – ఈ ముగ్గురి కలయిక మనం ఊహించుకొని ఆనందించవలసిన గొప్ప దృశ్యం. ప్రతి ఒక్కరూ తమ రంగంలో మేధావులు. ‘ఈయన మానవశక్తికి మించిన శక్తిసంపన్నుడు’ అని ప్రతి ఒక్కరూ తక్కిన ఇద్దరిగురించీ భావించారు. ముగ్గురి నుండి అసాధారణశక్తి అభివ్యక్తమై అనేక స్థితులలో లోకం చుట్టూ తిరిగి వచ్చింది. సారా బెర్న్‌హార్ట్ ఉద్వేగాల, ఇంద్రియ లోకంలో తమ ఆధిక్యాన్ని నెలకొల్పింది. బౌద్ధిక లోకంలో తన ఆధిక్యాన్ని నికోలా ప్రదర్శించాడు. బుద్ధి, ఉద్వేగాలు రెంటినీ కలగలిపి అదేసమయంలో రెంటినీ అతిక్రమించిన ఆధ్యాత్మిక ప్రపంచంలో తమ ఆధిక్యాన్ని చాటిచూపారు స్వామీజీ.”
ఈ ముగ్గురు మేధావులూ 1896 ఫిబ్రవరి 5 వ తేదీన సమావేశమయ్యారు. వారి గురించీ, వారి ద్వారా తాము చేయనున్న కార్యం గురించీ స్వామీజీ ఇలా వ్రాస్తున్నారు:
“ఫ్రెంచ్ నటి సారా బెర్న్‌హార్ట్ ఇక్కడ ‘ఇజైల్’ అనే నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉంది. అది ఫ్రెంచ్ నాటకంగా మార్చిన ఒక రకమైన బుద్ధుని జీవితం. బోధివృక్షం (మర్రివృక్షం) క్రింద ఆసీనుడయిన బుద్ధుణ్ణి వేశ్య అయిన ఈ ‘ఇజైల్’ మోహపరచ డానికి ప్రయత్నిస్తుంది. బుద్ధుడు ఆమెకు ప్రపంచ అనిత్యత్వాన్ని బోధిస్తూవుంటాడు. ఆ బోధిస్తున్న సమయంలో ఆమె ఆయన ఒడిలో కూర్చుని ఉంటుంది. ఏమైనా – మంచిగా ముగిసేదంతా మంచిదే – ఆ వెలయాలు అపజయం పొందుతుంది. బెర్న్‌హార్ట్ వెలయాలిగా నటించింది.
“ఈ బుద్ధుని నాటకమేదో చూడ్డానికి వెళ్లాను. ప్రేక్షకుల మధ్య ఉన్న నన్ను ఆమె ఎలాగో చూసి నాతో మాట్లాడడానికి అవకాశం కోరింది. ఆమెతో పాటు సుప్రసిద్ధ గాయకురాలైన మదామ్ ఎం. మొరల్, విద్యుత్ పరికరాలతో పనిచేసే టెస్లా అనే వ్యక్తి కూడా వచ్చారు. మదామ్ విద్యావంతురాలు, తత్త్వశాస్త్రం బాగా చదివింది. ఎం. మొరల్కు శ్రద్ధ కలుగుతూవుంది. కాని టెస్లా వేదాంతంలోని ‘ప్రాణం’, ‘కల్పాలు’ అనే విషయాలు విని ముగ్ధుడయ్యాడు. ఈ సిద్ధాంతాలు మాత్రమే ఆధునిక విజ్ఞానశాస్త్రాలకు సరిపోతాయని అతడి అభిప్రాయం. ఆకాశం, ప్రాణం రెండూ మహత్తు నుండి లేదా బ్రహ్మం లేక ఈశ్వరుడి నుండి ఉద్భవిస్తున్నవి. ‘శక్తి’, ‘పదార్థం’ అనేవాటిని స్థితిశక్తి (Potential energy) లోకి మార్చవచ్చనీ, గణిత శాస్త్ర రీతిలో వీటిని నిరూపించవచ్చనీ టెస్లా అభిప్రాయపడుతున్నాడు. వచ్చేవారం అతడి వద్దకెళ్లి గణితశాస్త్ర విధానంలో దీన్ని ఋజువు చేయడ్ం చూడవలసివుంది.
“ఇది సఫలమైతే వేదాంతంలో చెప్పినట్లు విశ్వనిర్మాణాన్నంతా స్థిరమైన పునాదుల మీద నిలుపవచ్చును. వేదాంతంలో చెప్పబడిన సృష్టిని గూర్చి, ప్రళయం (మరణానంతర స్థితి)పై ఎక్కువగా నేను పరిశ్రమ చేస్తున్నాను. ఆధునిక విజ్ఞానంతో అవి పూర్తిగా సరిపోతున్నట్లు నాకు విస్పష్టంగా కానవస్తోంది. ఒకటి విస్పష్టమైతే రెండవది కూడా దాన్ని అనుసరించి విస్పష్టమవుతుంది. ప్రశ్నోత్తరాల పద్ధతిలో తర్వాత నేనొక గ్రంథం రచించాలనుకొంటున్నాను. మొదటి అధ్యాయం సృష్టిని గూర్చింది. దాన్లో వేదాంత సిద్ధాంతాలకూ, ఆధునిక విజ్ఞానశాస్త్ర సిద్ధాంతాలకూ మధ్య ఉన్న సామ్యత సూచింపబడుతుంది…
“భ్రాంతు లన్నింటి నుండి విడివడి, నాకు విషయం విస్పష్టమయింది. కరడుగట్టి, ఎండిపోయిన హేతు (వాదాన్ని) వును భక్తి (ప్రేమ) అనే మధురమైన పాకంలో (ఊరబెట్టి) మెత్తపరచి, యోగమనే వంటశాలలో పచనం చేసి తీవ్రమైన కృషి అనే కర్మతో పోపుపెట్టి, పసిబిడ్డలకు కూడా సులభంగా జీర్ణమయ్యేట్లు చేసి వారికి ఇవ్వాలని అభిలషిస్తున్నాను.”*
స్వామీజీ శాస్త్రీయ మానసం ఈ భావనలను జీవితాంతం విచారణ చేస్తూ వచ్చింది. కాలాంతరంలో లాహోర్‌లో ఆయన ప్రసంగించిన సుప్రసిద్ధ ‘వేదాంతం’ అనే ఉపన్యాసంలోనూ ఆయన తమ విచారణను కొనసాగించడం చూడవచ్చు:
“శక్తి అంతా ఏకమై ప్రాణమవుతోంది. ద్రవ్యమంతా ఏకమై ఆకాశమవు తోంది. ఈ రెండూ, ఇంకా ఏకం కావడం కనిపిస్తుందా? అవి రెండూ ఒకటిగా కరిగిపోతాయా? మన ఆధునిక శాస్త్రాలు ఈ విషయంలో మౌనం వహించాయి. వాటి కిక్కడ ఇంకా మార్గం దొరకలేదు.”*
నికోలా వైజ్ఞానిక మేధను సైతం అతిక్రమించి స్వామీజీ ఆనాడే చింతన చేశారు. జడపదార్థం, శక్తి విభిన్నమైనవనే నికోలా కూడా భావించాడు. “అణువు అన్నది దృఢమైన, కఠినమైన, విడగొట్టలేని, పగులగొట్టలేనిది” అని న్యూటన్ నిర్వచనాన్నే పంథొమ్మిదవ శతాబ్దపు విజ్ఞానవేత్తలు విశ్వసించారు. నికోలా కూడా అదే వక్కాణించాడు. జడ పదార్థమూ, శక్తీ ప్రాతిపదికలో ఒక్కటే, ఒకటిని మరొకటిగా మార్చవచ్చునని అతడు నమ్మలేదు; నమ్మడానికి ఇష్టపడలేదు. ఈ విషయంలో స్వామీజీ ఆతడికన్నా ఎన్నో మెట్లు ముందున్నారు.*
ఈ ముగ్గురూ మళ్లీ ఒకేసారి కలుసుకోకపోవడం గమనార్హం. “వందలాది సంవత్సరాలకు లేదా వేలాది సంవత్సరాలకు ఒకసారి రోదసిలో అపూర్వంగా కొన్ని గ్రహాల కూటమి సంభవిస్తుందే, అటువంటిది ఈ ముగ్గురు మేధావుల సమావేశం. ఈ సమావేశం వలన సారా జీవితంలోనూ, నికోలా జీవితంలోనూ, సర్వ సామాన్యంగా మానవ జీవితంలోనూ ఎలాంటి ప్రభావం ఏర్పడిందో మనం కేవలం ఊహించగలం” అని పారవశ్యంతో మేరీ లూయీ బర్క్ వ్రాస్తున్నారు.
న్యూయార్క్ పనులు
ఈ రోజుల్లో స్వామీజీ కార్యాచరణ సర్వతోముఖంగా అభివృద్ధి గాంచింది. ప్రసంగాలు కొనసాగాయి. నాలుగు యోగాలు, ప్రపంచం, సాంఖ్యం లాంటి ప్రసంగాలూ, తరగతి ప్రసంగాలూ స్వామీజీ చేశారు. అభయానంద, కృపానందలు అనేక చోట్ల తరగతులు నిర్వహించారు.
ఈ రోజుల్లో స్వామీజీ ఒక ‘మతసామరస్య ఆలయం’ నిర్మించాలని ప్రయత్నించారు. “అన్ని మతాలూ ఒకే భగవంతుని వద్దకు తోడ్కొనిపోయే మార్గాలే అనే ఉద్దేశంతో ఈ ఆలయం అందరి ఆధ్యాత్మిక పురోగమనానికీ ఒక సంస్థగా భాసిల్లుతుంది”* అని పత్రికలు వ్రాశాయి. కాని ఈ పథకం విడనాడినట్లు మార్చ్ నెలలో అలసింగకు స్వామీజీ తెలియజేశారు.
మరొక ముఖ్యమైన పని కూడా స్వామీజీ ఈ రోజుల్లో చేశారు. అది మంత్రదీక్ష. స్వామీజీ పలువురికి మంత్రదీక్ష ఒసగారు. డాక్టర్ స్ట్రీట్ అనే వ్యక్తికి సన్న్యాసదీక్ష అనుగ్రహించి, స్వామి యోగానంద నామధేయాన్ని ఇచ్చారు. వాల్డో, గుడ్విన్, వాన్హకన్లకు బ్రహ్మచర్య దీక్ష ఇచ్చారు. వాల్డోకు ‘హరిదాసి’ అనే పేరు ఇచ్చినట్లే ‘యతి మాత’ అనే పేరును కూడా ఒసగారు. కాలాంతరంలో వాల్డో ‘సోదరి యతిమాత’ పేరిటే ప్రాచుర్యం పొందారు.
న్యూయార్క్‌లో స్వామీజీ చివరి ఉపన్యాసం ఫిబ్రవరి 23 వ తేదీన ఇచ్చారు. ఆ రోజు స్వామీజీ శ్రీరామకృష్ణులను గూర్చి ప్రసంగించారు.
డెట్రాయిట్ : గందరగోళ ప్రారంభం
మార్చ్ 3 వ తేదీన స్వామీజీ న్యూయార్క్ నుండి డెట్రాయిట్ వెళ్లారు. స్వామీజీ, గుడ్విన్ల బస ఏర్పాట్లు క్రిస్టైన్, ఫంకేలు చూసుకొన్నారు. మొదటిసారి స్వామీజీ వెళ్లినప్పుడు ప్రతిఘటనలూ, జవాబులంటూ ఝంఝామారుతం లాంటి సంఘటనలూ జరగడం ఇంతకు క్రితమే చూశాం. మళ్లీ మరొకసారి అలాంటి ప్రజాజీవనాన్ని ఆయన ఇష్టపడలేదు. ఈసారి ప్రశాంతంగా వెళ్లి కొన్ని తరగతి ప్రసంగాలు నిర్వహించాలనీ, అర్హులైన కొద్దిమందికి ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించడానికి మార్గదర్శకత్వం వహించాలనీ స్వామీజీ ఉద్దేశించారు. కాని ఆయన అనుమతి లేకుండానే ఆయన రాకను తెలియపరుస్తూ పత్రికలలో కృపానంద ప్రకటనలు ఇచ్చాడు. మళ్లీ ఒక పత్రికా పోరాటం ప్రారంభమయింది. తోపర్న్ అనే ఫాదరీ ఎప్పటి మాదిరి స్వామీజీపై అపనిందలు మోపి వ్రాస్తూ, “వివేకానందను డెట్రాయిట్ నుండి తరిమిగొడతాం” అన్నాడు.
మర్నాడు స్వామీజీ బస వద్దకు జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. వీరిలో అధిక సంఖ్యాకులు క్రొత్తవారు. కొద్దిమంది మిత్రులు, శిష్యులతో ప్రశాంతంగా రోజులు గడపగోరిన స్వామీజీకి ఇది పెద్ద నిరాశగా పరిణమించింది. పత్రికలో తోపర్న్ వ్యాఖ్యానాలు చూపిస్తూ అనేకులు స్వామీజీతో, “మీ రెందుకు దీనికి ఘాటుగా జవాబివ్వకూడదు?” అని అడిగారు. అందుకు స్వామీజీ శ్రీరామకృష్ణుల వచనాలు జవాబుగా వినిపించారు. “ఏనుగును చూసి కుక్కలు మొరిగితే ఏనుగుకు ఏమన్నా హాని వాటిల్లుతుందా? ఏనుగు దానిని ఖాతరు చేస్తుందా?”
ఈవెనింగ్ న్యూస్ అనే పత్రికలో శ్రీరామకృష్ణుల ఛాయాచిత్రాన్ని ముద్రించి, ఆయనను కూడా తప్పుబట్టి వ్రాసివుండడం చూసినప్పుడు స్వామీజీ ఇక భరించలేకపోయారు. దీనికంతటికీ కారణభూతుడైన కృపానందను చీవాట్లు పెట్టారు.
ఈ గొడవల మధ్య స్వామీజీ తమ తరగతులను ప్రారంభించారు. ప్రతిఘటించే వారి నోళ్లు మూయించడానికి కొన్ని సమయాల్లో ఆయన బహిరంగో పన్యాసాలు కూడా చేయవలసివచ్చింది.
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో
దాదాపు రెండు వారాలు డెట్రాయిట్లో గడిపాక స్వామీజీ బోస్టన్ బయలు దేరారు. అక్కడ కొన్ని ఉపన్యాసాలిచ్చారు. 1896 మార్చ్ 25 వ తేదీన బోస్టన్లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో స్వామీజీ ప్రసంగించారు. ఈ ఉపన్యాసం అమితంగా ప్రశంసలందుకోవడమే కాక, ఈ సంఘటన ఆయన అమెరికా జీవితంలో ఒక ముఖ్య ఘట్టంగా విలసిల్లింది. ఇంత క్రితం కూడా ఒకటి రెండుసార్లు ఆయన అక్కడ ప్రసంగించి ఉన్నారు. కనుక అక్కడి విద్యార్థులలో ఆయన ప్రాచుర్యం పొందివున్నారు. ఈ సందర్భంలో ఆయన ‘వేదాంత దర్శనం’ అనే అంశం మీద ప్రసంగించారు. స్వామీజీ ప్రసంగాలలో అత్యంత ఉత్కృష్టతను సంతరించుకొన్న వాటిలో ఇది ఒకటిగా పరిగణింపబడుతున్నది.* ప్రసంగానంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా జరిగింది.
పదవులూ పట్టాలూ అక్కర్లేదు
భారతీయ తత్త్వశాస్త్ర ఘనతను చూసిన హార్వర్డ్ ప్రొఫెసర్లు ఆశ్చర్యచకితు లయ్యారు. ఆచరణాత్మకంగా విచారణ చేయడానికి భారతీయ తత్త్వశాస్త్రం ఉపయుక్తమైనది కాదనీ, దాన్లో విచారణకే చోటులేదనీ వారు భావించారు. కాని స్వామీజీ ప్రసంగం వారికి కనువిప్పు అయింది. స్వామీజీ ఉపన్యాసం ముద్రించబడినప్పుడు దాని ఉపోద్ఘాతంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసరయిన రెవరెండ్ సి.సి. ఎవరెట్, “ప్రాచ్య చింతనలను పాశ్చాత్య దేశాలకు తీసుకువచ్చే తమ ప్రయత్నంలో స్వామి వివేకానంద విజయవంతులయ్యారు…. మేం పాశ్చాత్యదేశాలలో వివిధత్వం (manifold) గురించి విస్తృతంగా విచారణ చేస్తున్నాం. కాని ఈ వివిధత్వం ఎక్కడ నెలకొని ఉందో ఆ ఏకత్వం గురించి అవగతం చేసుకోకుండా వివిధత్వాన్ని ఎలా అర్థం చేసుకోవడం? ఈ విషయం గురించి ప్రాచ్యదేశాలు మనకు నేర్పుతాయి. ఈ పాఠాన్ని జయప్రదంగా బోధించినందుకు వివేకానందకు మేం కృతజ్ఞతాబద్ధులం” అని వ్రాశారు.
స్వామీజీకి ప్రాచ్యతత్త్వశాస్త్ర విభాగ అధ్యక్ష పదవి (Chair of Eastern Philosophy) సమర్పించడానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయం ముందుకు వచ్చింది. ఇది ఒక అనుపమానమైన సంఘటన. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నూరు సంవత్సరాలకు పైబడ్డ వారసత్వం సంతరించుకొన్నది. ఆ విశ్వవిద్యాలయం నుండి ఇంతటి పదవి పొందడం అసాధారణం. కాని తాను సన్న్యాసిననీ, సన్న్యాసికి ఇటువంటి పదవులూ పట్టాలూ సముచితం కావనీ స్వామీజీ దానిని మర్యాదపూర్వ కంగా నిరాకరించారు.
ఎవరు పండితుడు?
స్వామీజీ ప్రసంగం హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లనూ, విద్యార్థులనూ అమితంగా ఆకట్టుకొంది. అక్కడ ఒక రోజు ప్రసంగానంతరం ఇద్దరు విద్యార్థులు పరస్పరం ఇలా మాట్లాడుకొన్నారు:
మొదటి విద్యార్థి : వివేకానంద ప్రసంగం విన్నాను. నిరాశ చెందాను.
రెండవ విద్యార్థి : ఎందుకు?
మొదటి విద్యార్థి : ఏదో “ఈయన మహాపండితుడు, ప్రగాఢ తత్త్వాలను గురించి ప్రసంగిస్తున్నారు” అని చెప్పుకొంటున్నారు. కాని అలా ఏమీ కనిపించలేదు!
రెండవ విద్యార్థి : ఆయన భావనలు ప్రగాఢమైనవి కావని నీ కెందుకు అనిపిస్తున్నది?
మొదటి విద్యార్థి : ఎందుకంటే ఆయన చెప్పిన ప్రతీ మాటా నాకు అర్థమయింది కదా!
అర్థం కాని రీతిలో మాట్లాడే వ్యక్తే పండితుడని ఆ విద్యార్థి భావన!
సర్వతోముఖ విద్వత్తు
డెట్రాయిట్లో స్వామీజీ సర్వతోముఖ విద్వత్తు అభివ్యక్తమైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒక సంభాషణా కార్యక్రమంలో ఒక స్త్రీ ఆయనతో, “స్వామీ! రసాయనశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ఏ గ్రంథాలు చదవాలి?” అని అడిగింది. వెంటనే రసాయనశాస్త్ర గ్రంథాల పెద్ద జాబితాను ఏకరవు పెట్టారు. మరొకరు ఖగోళశాస్త్రం గురించి అట్లే ప్రశ్నించినప్పుడు ఠక్కున స్వామీజీ నుండి జవాబు వచ్చింది. ఇది అక్కడున్నవారిని ఆశ్చర్యంలో ముంచెత్తితే, తరువాతి ప్రశ్నకు స్వామీజీ ఇచ్చిన జవాబు అందరినీ దిగ్భ్రాంతులను చేసింది. ఒక స్త్రీ ఏసుక్రీస్తును గురించి కాసేపు ప్రసంగించి, “స్వామీ, ‘ఏసుక్రీస్తు’ అనే పదానికి అర్థం ఏమిటి?” అని అడిగింది. తక్షణమే స్వామీజీ జవాబిచ్చారు.* అప్పుడు ఆయన ముఖారవిందాన చిరునవ్వు వెల్లివిరిసిందట! “ఈయన జ్ఞానానికీ, డెట్రాయిట్లో తమను తాము సాంస్కృతిక పరిరక్షకులుగా పరిగణించుకొనే కొందరు పెద్దమనుషుల జ్ఞానానికీ ఉన్న తారతమ్యాన్ని పరికిస్తే నాకు సిగ్గుగా ఉంది” అని ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఒక స్త్రీ వ్యాఖ్యానించింది. ఈ సంఘటన ఈవెనింగ్ న్యూస్ పత్రికలో ప్రచురితమయింది కూడా.
ఈ విధంగా సర్వతోముఖ విద్వత్తును స్వామీజీ ఎలా సంతరించుకొన్నారు? దానిని గురించి స్వయంగా ఆయనే ఒకసారి ఇలా చెప్పారు: “నేను దేనిని చూసినా అది అట్లే నా మనస్సు అంతరాంతరాళాల్లో పాదుకుపోతుంది. తరువాత అవసరమైనప్పుడు నాకు అది చటుక్కున స్ఫురిస్తుంది.”
మరోసారి ఇలా చెప్పారు: “నేను శంకరాచార్యుల మానసాన్ని ధ్యానిస్తే శంకరుణ్ణే అయిపోతాను, బుద్ధుని మానసాన్ని ధ్యానిస్తే బుద్ధుణ్ణే అయిపోతాను. ఒక ప్రత్యేక విషయం గురించి ప్రగాఢంగా చింతన చేసి, మనస్సును ఏకాగ్రం చేసినప్పుడు ఆ విషయం గురించి సమస్త భావనలు నా మనోభూమిని చేరుతాయి. అంతదాకా నాకు తోచని భావనలూ, ఆలోచనలూ జనిస్తాయి; అవి నాకు సుస్పష్టంగా గోచరిస్తాయి. నాకు ఇలా వచ్చిన వాటిని మైమరచిన స్థితిలో మాట్లాడుకొంటూ పోతాను. నేను పండితుణ్ణి కాను, ఒక సాధారణ వ్యక్తిని అని మీకే తెలుసు.”
పునీత హస్తం
స్వామీజీకి గల ఇంతటి మేధస్సు ప్రజలను ఆశ్చర్యచకితులను చేసిందంటే ఆయన పావనత్వం తన దగ్గరకి వెళ్లిన వారిని ఆకర్షించింది, స్తుతింపజేసింది. ఒక రోజు ప్రసంగానంతరం స్వామీజీని అభినందించి ఆయనకు కృతజ్ఞత తెలుపడానికి మిస్ మార్గరెట్ కుక్ అనే స్త్రీ వచ్చింది. ఆమె ఒక ఉపాధ్యాయిని. సాధారణంగా ఆమె ఉద్వేగి కాదు. కాని ఆ నాటి స్వామీజీ ప్రసంగంతో చలించిపోయింది. కనుక ప్రసంగం పూర్తి కాగానే తిన్నగా స్వామీజీ వద్దకు వెళ్లింది. ఆయనతో కరచాలనం చేసింది. ఏదో ఉద్వేగం ఆమెను ఆవహించింది. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. అట్లే ఇంటికి వెళ్లిపోయింది. స్వామీజీ దివ్యస్పర్శ కలిగించిన పారవశ్యం ఆమెలో పొంగి పొరలింది. స్వామీజీ పునీత హస్తం తాకిన తన చేతిని ఆమె మూడు రోజుల దాకా కడగనేలేదట!
అనేక చోట్ల ఉపన్యాసాలిచ్చి ఏప్రెల్ ప్రారంభంలో స్వామీజీ చికాగో వెళ్లారు.
పుస్తకాల ప్రచురణ
స్వామీజీ అమెరికా కార్యాచరణలో ఆయన పుస్తకాల ప్రచురణ మరో పరిమాణం. ఆయన బహిరంగ ఉపన్యాసాల, తరగతి ప్రసంగాల పర్యవసానాలలో ఇదొకటి. స్వామీజీ తమ ప్రసంగాల మూలంగా కొందరికి మార్గదర్శకులయ్యారు; వారి జీవితాలలో దిగ్భ్రాంతి కలిగించే పరివర్తనలు తీసుకువచ్చారు. ఆ సత్కార్యం కాలాల పర్యంతం కొనసాగడానికి ఆయన పుస్తక ప్రచురణ కార్యక్రమం దోహదం చేసింది. “నేను ఇక్కణ్ణుండి వెళ్లాక నా పనికి దోహదకారులుగా ఉండే రెండు పాఠ్య పుస్తకాలను దీక్షతో వ్రాయడానికి ప్రారంభించాను. వాటిని త్వరలో పూర్తిచేయాలనుకొంటున్నాను. నేను వెళ్లే లోపుగా నాలుగు చిన్న పుస్తకాలను కూడా త్వరలో పూర్తిచేయాలని నా ఉద్దేశం”* అని 1895 లో శ్రీమతి బుల్‌కు స్వామీజీ వ్రాశారు.
‘నా పయనం’
స్వామీజీ రచించిన పూర్తి పుస్తకం ‘నా ఐరోపా యాత్ర.’* రెండవసారి పాశ్చాత్యదేశాలకు ఆయన వెళ్లినప్పుడు రచించిన పుస్తకం ఇది. రామకృష్ణ మఠ బెంగాలీ పత్రికయైన ‘ఉద్బోధన్’ లో ధారావాహికగా వెలువడింది. ఆనాటి ఐరోపా, చరిత్ర, హాస్యం వంటి అనేక విశేషాంశాలతో కూడుకొన్నదిగా ఈ పుస్తకం భాసిల్లింది.
స్వామీజీకి తగినంత సమయం లభించి ఉంటే ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా తక్కిన రంగాలలో కూడా అద్భుత రచనలు చేసివుండేవారని వీటి నుండి స్పష్టమవుతున్నది.
వేదాంత తత్త్వ గ్రంథం
హిందూమతంలోని ఏ శాఖయైనా, దానికంటూ ఉపనిషత్తులు, గీత, బ్రహ్మ సూత్రాలనే ప్రస్థానత్రయానికి ఒక భాష్యం ఉండాలి. లేకుంటే, వేదాంతతత్త్వాన్ని తమ దృక్పథంలో వివరించే గ్రంథాలయినా రచించబడి ఉండాలి. శంకర, రామానుజ, మధ్వాచార్యుల వంటి వేదాంతాచార్యులు తమ మార్గాన్ని స్థాపించ డానికి ఇలాంటి గ్రంథాలను రూపొందించారు. ప్రస్తుత కాలానికంటూ ఏతెంచిన యుగనాయకుడైన స్వామీజీ అలాంటి గ్రంథం ఒకటి రచించాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు. తమ ఉత్సుకతను అలసింగకు వ్యక్తం చేశారాయన:
“వేదాంత సిద్ధాంతం మీద ఒక ఉద్గ్రంథాన్ని వ్రాసే పనిలో నిమగ్నమై ఉన్నాను. వేదాంతం మీద త్రిమత సిద్ధాంతాలకు సంబంధించిన భాగాలను వేదాల నుండి క్రోడీకరిస్తున్నాను. ఈ పనికి నువ్వు ఒకరిని సంపాదించిపెట్టి సాయపడ గలవా? అతడు ముందుగా అద్వైతపరమైన, తరువాత విశిష్టాద్వైతపరమైన, తదనంతరం ద్వైతపరమైన భాగాలను సంహితల నుండి, బ్రాహ్మణాల నుండి, ఉపనిషత్తుల నుండి, పురాణాల నుండి సేకరించాలి. ప్రతి భాగాన్నీ శీర్షికల క్రింద విభజించి దాని పేరు, అధ్యాయం పేరు, గ్రంథం పేరు స్పష్టంగా వ్రాయాలి. ఈ సిద్ధాంత గ్రంథాన్ని రచించకుండా పాశ్చాత్య దేశాలను వదలిరావడం శోచనీయం. అష్టోత్తరశత (108) ఉపనిషత్తులతో తమిళ లిపిలో మైసూర్ నుండి ప్రచురింపబడ్డ ఒక గ్రంథాన్ని ప్రొఫెసర్ డ్యూసెన్ గ్రంథాలయంలో చూశాను. దేవనాగరిలిపిలో ఆ గ్రంథం లభిస్తే నా కొక ప్రతి పంపు. లేకుంటే తమిళ లిపిలోని గ్రంథాన్నే పంపించు. ఒక కాగితం మీద తమిళ అక్షరాలు, సంయుక్తాక్షరాలు వ్రాసి, వాటికి ఎదురుగా నాగరి లిపిలోని అక్షరాలు వ్రాస్తే, నేను తమిళ వర్గాలను (అక్షరాలను) నేర్చుకొంటాను”* అంటూ అలసింగకు స్వామీజీ వ్రాశారు. ఈ గ్రంథం వ్రాయబడివుంటే అది మానవాళికి స్వామీజీ అర్పించిన మహోన్నత కానుకగా విరాజిల్లేది! కాని అది జరుగలేదు.
అమెరికాలో ఉన్న తొలినాళ్లలో ఆ దేశం గురించి ఒక పుస్తకం రచించాలను కొన్నారు స్వామీజీ. అది కూడా జరగలేదు.
హిందూమతం గురించి అలవోకగా అవగతమయ్యే ఒక గ్రంథం రచించా లని స్వామీజీ ఆశించారు:
“హైందవ సిద్ధాంతాలను ఆంగ్లంలోకి తర్జుమాచేసి, దుస్తరమైన తత్త్వశాస్త్రాన్ని, గహనమైన పౌరాణిక వాఙ్మయాన్ని, భయానకమై వింతగొలిపే మానసికశాస్త్రాన్ని సులభంగానూ, సరళంగానూ, జనానుమోదంగానూ, మేధావులైనవారి మనస్సులకు అనుగుణంగానూ తయారయ్యే ఒక మతాన్ని రూపొందించడమనేది – ఆ ప్రయత్నం చేసిన వారికి మాత్రమే అవగతం కాగలదు.
“గ్రహించడానికి దుస్తరమైన అద్వైతాన్ని, కళాత్మకమైనదిగా, దైనందిన జీవితంలో సజీవమైనదిగా చేయాలి. దుర్భేద్యమైన పురాణాలలో నుండి సులభంగా అర్థమయ్యే నైతిక సూత్రాలు వెలువడాలి. భయం కలిగించే యోగ సంప్రదాయాల నుండి అత్యంత శాస్త్రీయమూ, ఆచరణ యోగ్యమూ అయిన మానసికశాస్త్రం ఈవలకు రావాలి – ఇదంతా పసిబాలుడికైనా అర్థమయ్యేటటువంటి స్థితిని పొందాలి. ఇదే నా జీవితోద్దేశం. దీన్లో నేనెంత దాకా జయం పొందగలనో ఆ పరమాత్ముడికే ఎరుక.”*
తక్కిన గ్రంథాలు
రచనావ్యాసంగంలో స్వామీజీకి గల ఉత్సుకత చివరి దాకా కాస్తంత కూడా తగ్గలేదు. 1901 లో ఆయన మాయావతికి వెళ్లినప్పుడు ఉత్తేజభరితమయిన తమ ప్రాసంగిక జీవితం నుండి వైదొలగి శేషజీవితాన్ని గ్రంథ రచనలో గడపబోతున్నట్లు తమ శిష్యులతో చెప్పారు. తరువాత బేలూర్ మఠానికి తిరిగి వచ్చాక, “లోకానికి భారతదేశ సందేశం”, “దివ్యజ్ఞాన సందేశం” అనే రెండు గ్రంథాలను రచింపనారంభించారు. అందు కోసం పాఠ్యక్రమణికలను కూడా రూపొందించుకొన్నారు. భారతదేశ చరిత్ర, దాని నాగరకత వికాసం గురించిన ఒక గ్రంథాన్ని వ్రాయాలని ఒక పాఠ్యక్రమణికను కూడా రచించారు. కాని ఇవేవీ సఫలీకృతం కాలేదు.