దివ్యచైతన్యమయమైన తమ రెక్కల మీద మమ్మల్ని ఎక్కించుకొని, తమ స్వస్థానమైన అత్యంత ఉన్నత ప్రాంతంలోని అద్భుత లోకాలకు స్వామీజీ ఎగిరారు.
– సోదరి క్రిస్టైన్
ధ్యానయోగి — విచిత్రమైన భగవంతుడు — గోల్ఫ్: మానసిక ఏకాగ్రత — నాలుగు యోగాలు — విశ్రాంతికై… — మళ్లీ యాతనలు — పెర్సీ మకాం — నిర్వికల్ప సమాధిలో — సహస్రద్వీప వనం — ‘ఏసుక్రీస్తును అభిలషించినట్లు’ — తపోమయ జీవితం — మూడు తత్త్వాలు: వారసత్వం — మధ్యాహ్నం — సాయంత్రం వేళల్లో — తేలిక క్షణాలు — కృత్రిమత్వం వద్దు — వంట — చిన్నపిల్లవాడే ఆయన — యతి గీతం — నిర్వికల్ప సమాధిలో
ధ్యానయోగి
అలలు సద్దుమణిగాక సముద్రంలో స్నానం చేద్దామనుకుంటే అది అసాధ్యం – ఈ సత్యాన్ని స్పష్టంగా స్వామీజీ గ్రహించారు. ఎంచుకొన్న కొద్దిమందికి శిక్షణనిచ్చి వారిని నిజమైన ఆధ్యాత్మిక జీవితంలో సుప్రతిష్ఠితులను గావించాలన్న భావన స్వామీజీలో గ్రీనేకర్ రోజుల నుండే ప్రగాఢమవుతూ వచ్చింది. అందు కోసం వేచివుండడం నిష్ప్రయోజనమని గ్రహించిన స్వామీజీ వీస్తూన్న ప్రతికూల పవనాలను ఒక వైపు సంబాళిస్తూ, ఎంపిక చేసుకొన్న కొద్దిమంది జీవితాలలో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగించారు.
తాము ఎంచుకొన్న కొద్దిమందికి స్వామీజీ ధ్యానంలో శిక్షణనిచ్చారు. కాని కొన్ని సందర్భాలలో శిక్షణ నిచ్చేటప్పుడు స్వయంగా తామే ప్రగాఢ ధ్యానంలో మగ్నులవడం కద్దు. బాహ్య ప్రపంచ స్ఫురణ ఆయనలో పూర్తిగా లుప్తమయ్యేది. శారీరక స్మృతి ఆమూలాగ్రం కోల్పోయి ఒక శిలావిగ్రహంలా కూర్చుండిపోయే వారు. బహుశా ఆయన మృతి చెందారేమోనని భయపడి కొందరు లేచి పరుగులు తీసిన సందర్భాలూ ఉన్నాయి. తరగతుల సమయంలో ఈ విధంగా ధ్యానంలో లయించిపోవడం సుతరామూ ఆయనకు ఇష్టం లేదు. నేర్పిస్తున్నప్పుడు ఆచార్యునిగా ఉండాలే గాని యోగిగా వ్యవహరించకూడదని అనుకొనేవారు. కాని అది ఆయనకు సాధ్యం కాలేదు. కించిత్తు ప్రేరణ సైతం ఇట్టే ఆయనను ప్రగాఢ ధ్యానమగ్నుని గావించేది.
ఇలాంటి సమయాల్లో తనకు బాహ్యస్మృతి ఎలా రప్పించాలో కొందరు అతిసన్నిహిత శిష్యులకు ఆయన తెలిపారు. వారికి ఒకటి రెండు మాటలో, భగవన్నా మాలనో చెప్పి, తాను ప్రగాఢ ధ్యానంలో లయించి ఉన్నప్పుడు వాటిని చెవుల వద్ద బిగ్గరగా ఉచ్చరిస్తే తాను బాహ్యస్మృతిలోకి రాగలనని వివరించారు. ఈ విధంగా దక్షిణేశ్వర చరిత్ర పునరావృతమయింది! గురుదేవుల జీవితంలో నిత్యకృత్యమైన ఇది, సుదూరంలో ఆయన అనుంగు శిష్యుని జీవితంలో సంభవించింది!
విచిత్రమైన భగవంతుడు
ధ్యానానికి సంబంధించిన అనుభవాలు మాత్రమే కాదు; సాక్షాత్తు భగవంతునితో ఆయన సంభాషించిన సంఘటనలూ జరిగాయి. ఈ కాలఘట్టంలో కొన్ని రోజులు ఆయన రిడ్జ్లీ మేనర్ అనే ఇంట్లో విడిది చేశారు.* నగర శివారులో ఉన్న ఈ ఇల్లు లెగ్గెట్ అనే వ్యక్తికి చెందింది. అక్కడ ఆయనతోపాటు మిస్ మెక్లౌడ్, ఆమె సోదరియైన పెట్రీ స్టర్జస్, ఆమె పదహారేళ్ల కుమారుడు హాలిస్టర్, పద్దెనిమిదేళ్ల కుమార్తె ఆల్బెర్టాలు బసచేశారు. స్వామీజీ హాలిస్టర్ పట్ల ఎంతో మక్కువ చూపారు. “ఇతడికన్నా ప్రీతిపాత్రుడైన యువకుణ్ణి నేను చూడలేదు” అని స్వామీజీ వ్యాఖ్యానించేవారు. అదేవిధంగా కాలాంతరంలో హాలిస్టర్ కూడా “వివేకానంద కన్నా మహోన్నత వ్యక్తిని నా జీవితంలో చూడలేదు” అనేవాడు. వారిద్దరి మధ్య అపూర్వమైన ప్రేమానుబంధం నెలకొంది.
ఒక రోజు స్వామీజీ తమ గదిలో ఉన్నప్పుడు హాలిస్టర్ ఆ వైపుగా వెళు తున్నాడు. హఠాత్తుగా స్వామీజీ గదిలో నుండి నవ్విన శబ్దం వినవచ్చింది. స్వామీజీ ఆనందంగా నవ్వుతున్నారు, మధ్య మధ్యలో ఆయన ఎవరితోనో మాట్లాడడమూ వినిపించింది. కాసేపటి తరువాత ఆయన బయటికి వచ్చినప్పుడు హాలిస్టర్ ఆయనతో, “స్వామీ! గదిలో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?” అని అడిగాడు. అందుకు స్వామీజీ, “ఎవరితోనూ మాట్లాడలేదు. గదిలో ఒంటరిగా ధ్యానమగ్నుడనై ఉన్నాను” అన్నారు. “అలా అయితే నవ్వు వినవచ్చిందే!” అంటూ సందేహం వెలిబుచ్చాడు హాలిస్టర్. కాసేపు మౌనం వహించాక స్వామీజీ, “ఓ అదా? భగవంతుడున్నాడే, ఆయన విచిత్రమైన వాడు” అన్నారు. భగవంతుడనే మహోన్నత శక్తితో తమాషాగా మాట్లాడి నవ్వుకొనేటంత ప్రత్యక్షంగా ఆయనను స్వామీజీ దర్శించారు.
హాలిస్టర్ జీవితంపై స్వామీజీ చెరిగిపోని ప్రభావముద్ర వేశారు. కాలాంత రంలో హాలిస్టర్ కుమారుడు ఒకసారి తండ్రిని తాత్త్విక విషయాల్లో సందేహాలు అడిగినప్పుడు, “వీటిని గురించి నేను గాఢంగా యోచించింది లేదు. కాని భగవంతుడంటూ ఒకరు ఉన్నారు, అది ముమ్మాటికీ సత్యం. ఎందుకంటే స్వామీజీ అలా చెప్పారు” అన్నాడు హాలిస్టర్. అతడికి స్వామీజీ పట్ల అంతటి అచంచల విశ్వాసం ఉంది!
గోల్ఫ్: మానసిక ఏకాగ్రత
స్వామీజీ మానసికశక్తి, ఆచరణయుత ప్రతిభ హాలిస్టర్ను ఎంతగానో ఆకట్టుకొన్నాయి. స్వామీజీ మానసికశక్తిని ప్రదర్శించే అద్భుతమైన ఒక సంఘటన రిడ్జ్లీ మేనర్లో జరిగింది. స్వామీజీ, హాలిస్టర్ పచ్చికబయలు మీద నడచిపోతున్నారు. అక్కడ లెగ్గట్కు సొంతమయిన గోల్ఫ్ (golf) మైదానం ఉంది. స్వామీజీకి గోల్ఫ్ గురించి తెలియదు. కనుక మైదానంలో ఒక జెండా ఎగురుతూ ఉండడం చూసి హాలిస్టర్ను దానిని గురించి అడిగాడు. గోల్ఫ్ ఆట గురించి హాలిస్టర్ విపులీకరించిన తరువాత, “మొదట ఆడేవారికి ఆ జెండా క్రింద ఉన్న గుంటలో బంతిని వేయడానికి 4, 7 లేక 9 అవకాశాలు ఇవ్వబడతాయి” అన్నాడు. వెంటనే స్వామీజీ, “నేను ఒక్క ప్రయత్నంలోనే గుంటలో బంతి వేస్తాను. కావాలంటే పందెం కాయి” అన్నారు.
స్వామీజీ అప్పటిదాకా గోల్ఫ్ ఆడి ఎరుగరు, కనుక అది అసాధ్యమనుకొన్నాడు హాలిస్టర్. “పందేనికి నేను సిద్ధం. మీరు ఒకే ప్రయత్నంతో బంతిని గుంటలో వేయగలిగితే మీకు 50 సెంట్స్ ఇస్తాను” అన్నాడు. “అలా వేయలేకపోతే నేను ఒక డాలర్ ఇస్తాను” అన్నారు స్వామీజీ. అప్పుడు అక్కడకు వచ్చిన లెగ్గట్ కూడా పందెంలో పాల్గొన్నాడు. “స్వామీజీ బంతిని వేయగలిగితే పది డాలర్లు ఇస్తాను” అన్నాడతడు. స్వామీజీ కర్ర చేతపుచ్చుకొన్నారు. కాసేపు నిశితంగా జెండా వైపు దృష్టిని సారించిన తరువాత బంతిని చాకచక్యంగా కొట్టారు. బంతి సరిగ్గా వెళ్లి గుంటలో పడింది!
అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. “అవును స్వామీజీ, ఒక దెబ్బతో బంతిని గుంటలో వేయడం మీ యోగశక్తితోనా?” అని అడిగాడు లెగ్గెట్. అందుకు స్వామీజీ, “ఇలాంటి స్వల్ప విషయాలకు నేను యోగకశక్తిని ఉపయోగించను” అన్నారు. పిదప వివరించారు: “నేను చేసిందేమిటో మీకు రెండు మాటల్లో చెబుతాను. మొదట దూరాన్ని కళ్లతో కొలిచాను, దానితోపాటు నా చేతి బలం నాకు తెలుసు. రెండవదిగా ఈ పందెంలో జయిస్తే పదిన్నర డాలర్లు లభిస్తాయని నా మనస్సుకు చెప్పాను. ఆ తరువాత బంతిని కొట్టాను.”
స్వామీజీ మానసిక శక్తీ, ఆచరణయుత ప్రతిభా ఈ సంఘటన మూలంగా స్పష్టంగా తెలుస్తూన్నవి. అదేసమయంలో ఆయన యోగశక్తి సంపన్నులని అక్కడున్న వారికి అవగతమయింది.
నాలుగు యోగాలు
ఈ రోజుల్లో సర్వసామాన్యంగా స్వామీజీ యోగం, వేదాంతం వంటి అంశాల మీదే ఉపన్యాసాలు చేశారు. ఈ రోజుల్లోనే ఆయన తమ మహత్తర కానుకయైన ‘నాలుగు యోగాలు’ గురించి తరగతులు ప్రారంభించారు. నేడు ప్రపంచమంతా ప్రఖ్యాతిగాంచిన ‘నాలుగు యోగాలు’ భావన స్వామీజీ ప్రప్రథమంగా లోకానికి అందించారు. “అనేక మార్గాల ద్వారా ఒక్క గమ్యాన్నే చేరగలమనేది వేదాంత మతంలోని మహోదాత్త ఆశయం; కర్మ, భక్తి, యోగం, జ్ఞానం అని వీటిని నేను స్థూలంగా నాలుగుగా వర్గీకరించాను. అయినా ఈ మార్గాలు ఒకదానితో ఒకటి చేరనే చేరనంత వేరైనవి కావని గుర్తుంచుకోండి. ఒక యోగం మరో యోగంలో కలసిపోతుంది. కాని ఎందులో ఏది ప్రధానంగా ఉందో దానికి ఆ పేరు పెడతారు. కర్మయోగానికి తప్ప ఇతర యోగాలకు కేవలం అసమర్థులైనవారు కొందరు, ఉపాసకులు మాత్రమే అయినవారు కొందరు, జ్ఞానాన్య విహీనులైనవారు కొందరు ఉన్నారని కాదు. ఎవరిలో ఏ విధం ఏ పథం ప్రధానంగా ఉందో అనేదాన్ని అనుసరించి ఈ విభాగాలు ఏర్పరచబడ్డాయి”* అని దీనిని గురించి స్వామీజీ వ్రాస్తున్నారు.
“మాలో కొందరం స్వామీజీ నిర్వహించిన ఒక్క తరగతిని కూడా విడిచిపెట్టే వారం కాము. భక్తియోగం, జ్ఞానయోగం లాంటి తరగతులను కొనసాగించాం. దానితోపాటు రాజయోగ, కర్మయోగ మార్గాల్లోనూ సంచరించాం. ఆహా! ఎందుకు నాలుగు యోగాలు మాత్రమే ఉన్నాయి? ఆరు యోగాలు, ఎనిమిది యోగాలంటూ ఉండివుంటే ఇంకా ఎక్కువగా స్వామీజీ ప్రసంగాలను విని ఉండవచ్చు కదా!” అంటూ వ్రాస్తున్నది లారా.
విశ్రాంతికై…
1895 స్వామీజీ కఠోర పరిశ్రమ చేసిన సంవత్సరం. ప్రతికూల పవనాలను సంబాళించడం, బహిరంగ తరగతి ప్రసంగాలు ఇవ్వడం, ప్రశ్నోత్తరాలంటూ అనేక కార్యక్రమాలతో నిర్విరామంగా ఆయన జీవితం గడచింది. ప్రసంగాల ద్వారా ప్రజల దృష్టిని ఆకట్టుకోవడం జరిగి పోయింది. ఇక పదిమంది వచ్చినా చాలు, వారిలో నిజమైన ఆధ్యాత్మిక జాగృతి కలిగిస్తే చాలుననే తీరులో ఆయన కార్యాచరణను కొనసాగించారు. “నా ఉపన్యాసా లకు ఇంకా వేలమంది తరలి వచ్చేలా చేయగలను. కాని తండోపతండాలుగా జనాన్ని సమీకరించడం నా ఉద్దేశం కాదు. జనసందోహం కాదు, నిజమైన ఆధ్యాత్మిక పరమావధిని చేరుకోవాలని తపించిపోయే కొద్దిమంది మాత్రమే నా కార్యాన్ని విజయవంతం చేయగలరు. నా యావజ్జీవిత ప్రయత్నంలో ఒకే ఒక్కడు ముక్తి పథంలో వెళ్లడానికి నేను సహాయపడగలిగితే నా ప్రయత్నం విఫలం కాలేదనీ, విజయవంతమయిందనీ భావిస్తాను” అన్నారాయన.
విశ్రాంతికై స్వామీజీ శరీరం తపించిపోయింది. “ఈ సంవత్సరం పనుల భారం చాలా ఎక్కువనే భావిస్తున్నాను. ఎందుకంటే విపరీతంగా అలసట చెందు తున్నాను. చక్కని విశ్రాంతి కావాలని అనిపిస్తున్నది…. ప్రాణాలిచ్చి శ్రమించాను. నా కార్యాలలో సత్యబీజం ఏదైనా ఉండివుంటే కాలక్రమంలో అది తప్పక మొలకెత్తి తీరుతుంది. కనుక సమస్త విషయాలలోను నేను కలత చెందకుండానే ఉంటున్నాను. ఉపన్యాసాలలోనూ, తరగతులలోనూ నాకు చీకాకు కలుగుతోంది. ఇంగ్లండులో కొన్ని నెలలు పనిచేసి, ఇండియాకు తిరిగి వెళ్లి కొన్ని సంవత్సరాల పాటుగాని లేక శాశ్వతంగానో చతికిలపడవలసిందే. ‘పనిచేయని సాధువు’ గా నేనున్నది లేదు. ఇందులో నాకు కాస్త కూడా సందేహం లేదు. వ్రాయడానికయిన ఒక నోట్ పుస్తకం నా వద్ద ఉంది. అది నాతో లోకమంతా తిరిగి వచ్చింది. ఏడేళ్ల క్రితం దాన్లో నేను వ్రాసినది – ఎక్కడైనా ఏకాంత ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని, మరణాన్ని ఎదురుచూస్తూ పడివుండాల్సిందే.’ నేడు చూస్తున్నాను. కాని ఇంత కర్మను అనుభవించవలసివుంది కదా! ఇప్పుడు నా కర్మ తీరిపోయిందని భావిస్తాను. ప్రచారం, లోకక్షేమం లాంటి పనుల నుండి భగవంతుడు నాకు విముక్తి కలిగిస్తాడని నమ్ముతున్నాను” అని వ్రాస్తున్నారు స్వామీజీ.
మళ్లీ యాతనలు
కాని భగవంతుని ప్రణాళిక ఎవరికెరుక! స్వామీజీ మనశ్శరీరాలు విశ్రాంతిని ఆశించాయి. కాని ఆయనకు లభించినవి మళ్లీ యాతనలు! స్వామీజీ న్యూయార్క్ కార్యాచరణలో చాలా సహాయమందించిన లాన్స్బర్గ్ జూన్ నెలాఖరున వెళ్లిపోయాడు. కనుక సహాయానికి ఎవరూ లేక పోవడంతో స్వామీజీ తమ అవసరాలతో సహా అన్నీ స్వయంగా చూసుకోవలసి వచ్చింది. “లాన్స్బర్గ్ మరోచోట నివసించడానికి వెళ్లిపోయాడు. నేను ఏకాకినైనాను. పండ్లు, పాలు, ఎండినపళ్లు (గింజలు) వంటివి నా ప్రస్తుత ఆహారంలో ఎక్కువ భాగం చోటుచేసుకొంటున్నాయి. ఇది శ్రేష్ఠమైనదిగాను, ఆరోగ్యకరమైనదిగాను కనిపిస్తోంది. ఈ వేసవిలో నా బరువు 30 నుండి 40 పౌండ్లకు తగ్గుతుందనుకొంటున్నాను”* అని ఆయన వ్రాస్తున్నారు.
తరగతుల బాధ్యత కూడా స్వామీజీ మీదే పడింది. వచ్చే వారి పేర్లు నమోదు చేసుకోవడమూ, వారికి వివరాలు తెలియజేయడమూ ఆయనే చేసుకో వాల్సివచ్చింది. కొద్దికాలం ఈ పనిని మిస్ హేమ్లిన్ అనే ఆమె చేసింది. ఇప్పుడు స్వయంగా స్వామీజీయే చేస్తున్నారు. “పేర్లు వ్రాసుకొని విజ్ఞప్తులను పంపించడం పెద్ద పనే. ఆ పనిని నిర్వర్తిస్తున్నందుకు వారిద్దరికీ నా ధన్యవాదాలు. కాని ఇది నా సోమరితనమేనని గ్రహించాను. ఇతరుల మీద ఆధారపడడం అన్యాయం. సోమరితనం ఫలితం ఎల్లప్పుడూ పాపమే. కాబట్టి ఇక ముందు ఆ పనిని నేనే నిర్వర్తిస్తాను. కనుక భవిష్యత్తులో ఎవరూ నా కలతకు కారణమవరు”* అంటూ వ్రాస్తున్నారు స్వామీజీ.
మొత్తానికి న్యూయార్క్ కార్యం, ఆశయానికి చెందినంత వరకు స్వామీజీకి ఘనవిజయంగానే పరిణమించింది. కాని నిధులు ఆశించినంతగా లభించలేదు. “తరగతులు జరిగిపోతున్నాయి. శ్రోతల సంఖ్య విస్తారం. కాని రాబడి అద్దెకు కూడా సరిపోనందున విచారిస్తున్నాను. ఒక వారం చూసి ఆ తరువాత వీటిని ముగిస్తాను”* అంటూ వ్రాస్తున్నారు స్వామీజీ. కాని విద్యార్థుల ఉత్సుకత కారణంగా స్వామీజీ ఆ తరగతులకు స్వస్తి చెప్పలేకపోయారు. వారు పేదవారు కావడంతో అవసరమైన పైకం చెల్లించలేకపోయారు. అయినప్పటికీ వారి ఆసక్తీ, ఉత్సుకతా చూసి స్వామీజీ తరగతులను కొనసాగించారు.
పెర్సీ మకాం
ఆశించినంత విశ్రాంతి స్వామీజీకి లభించకపోయినా కొంతలోకొంత లభించకపోలేదు. మిస్ మెక్లౌడ్ ద్వారా ఫ్రాన్సిస్ లెగ్గెట్ స్వామీజీకి పరిచయస్థుడయ్యాడు. ఆతడు ఆధ్యాత్మిక జిజ్ఞాసువు. స్వామీజీతో పరిచయమయ్యాక ఆయన పట్ల ఎంతో అక్కర వహించాడు. పెర్సీ అనే చోట గల తన మకాంకు స్వామీజీని ఆహ్వానించాడు. 1895 జూన్ 7 వ తేదీన స్వామీజీ పెర్సీ మకాంకు వెళ్లారు. మిస్ మెక్లౌడ్, ఆమె సోదరియైన పెట్రీ స్టర్జస్ ప్రభృతులు కూడా అక్కడ ఉన్నారు. స్వామీజీ అక్కడ మహానందంగా రోజులు గడపారు. మానసికోల్లాసంతో ఇలా వ్రాస్తున్నారు:
“నేను ఇంతవరకు చూసిన వాటన్నిటిలో ఇది ఒక అత్యంత సౌందర్య వంతమైన ప్రాంతం. ఒక సరోవరాన్ని ఊహించు. మహారణ్యంతో కూడిన పర్వతాలు దానిని ఆవరించి ఉన్నాయి. ఇక్కడ మేం ఏకాంతంగా ఉన్నాం. ఎంత విశ్రాంతిదాయకం. నగరాల సంకులంలో కాలం గడిపాక ఇక్కడ నా కెంత హాయిగా ఉందో నువ్వు ఊహించుకోవచ్చు. ఇక్కడ ఉండడం నాకొక నూతన జీవితాన్ని ప్రసాదించింది. ఏకాంతంగా అరణ్యంలోకి పోయి శాంత్యానందాలతో గీత చదువుతున్నాను.”*
నిర్వికల్ప సమాధిలో
ఒక రోజు ఉదయం ఉపాహారం తీసుకోవడానికి ముందు స్వామీజీ తమ గదినుండి బయటికి వచ్చారు. ఆయన చేతిలో గీత ఉంది. ఆయన మెక్లౌడ్తో, “జో!* అదుగో ఆ దేవదారు వృక్షం క్రింద కూర్చుని గీత చదువుకొంటాను. ఆహారం తయారయిన తరువాత వస్తాను. ఆహారం బ్రహ్మాండంగా ఉండాలి” అన్నారు. అరగంట తరువాత స్వామీజీని పిలవడానికి మెక్లౌడ్ అక్కడకు వెళ్లింది. కాని అక్కడ ఆమె చూసిన దృశ్యం వర్ణనాతీతం –
నిశ్చలమైన శిల్పంలా స్వామీజీ కూర్చునివున్నారు. అర్ధనిమీలిత నేత్రాల నుండి స్రవించిన కన్నీటితో ఆయన దుస్తులు తడిసివున్నాయి. మెక్లౌడ్ దగ్గరకు వెళ్లి చూసింది. శ్వాస పూర్తిగా ఆగిపోయివుంది. స్వామీజీ మృతి చెందారని భయపడి పరుగెత్తికెళ్లి తక్కినవారితో, “చప్పున రండి. స్వామి వివేకానంద మనల్ని వదలి వెళ్లిపోయారు” అని ఉక్కిరిబిక్కిరవుతూ చెప్పింది. పెట్రీ, లెగ్గెట్ తదితరులందరూ అక్కడికి పరుగున వెళ్లారు. స్వామీజీ పరిస్థితి చూసి అందరూ ఏడ్వసాగారు.
ఏడెనిమిది నిమిషాలు గడచిపోయినప్పటికీ స్వామీజీ స్థితిలో ఎలాంటి మార్పూ లేదు. హఠాత్తుగా లెగ్గట్, “లేదు. ఆయన సమాధిమగ్నులయ్యారు. ఆయనను తట్టి, ఊపి లేపుదాం” అంటూ స్వామీజీని సమీపించాడు. ప్రగాఢ ధ్యానమగ్నులై ఉన్న సమయంలో తనను ఎవరూ తాకరాదని స్వామీజీ చెప్పడం మెక్లౌడ్కు జ్ఞాపకం వచ్చింది. వెంటనే ఆమె, “వద్దు, అలా చేయకండి” అని అరిచింది.
మరో ఐదు నిమిషాలు గడచాయి. అప్పుడు స్వామీజీలో శ్వాసిస్తున్న చిహ్నాలు ద్యోతకమయ్యాయి. మెల్లమెల్లగా ఆయన కళ్లు విప్పారాయి. ఏదో తమలో మాట్లాడుకొంటున్నట్లు “నే నెవరు? నేను ఎక్కడున్నాను?” అని రెండు మూడుసార్లు పలికారు. పిదప ఆయన పూర్తిగా బాహ్యస్మృతిలోకి వచ్చారు. మమ్మల్ని చూసి కాస్త సిగ్గుపడుతూ లేచారు. “మిమ్మల్నందరినీ భయపెట్టేశానా! ఓపిక వహించండి. ఇలాంటి స్థితి అప్పుడప్పుడు నాకు కలగడం కద్దు. భయపడకండి, మరణించను. మీ దేశంలో నా దేహాన్ని త్యజించను. పెట్రీ, ఆకలిగా ఉంది. తినడానికి వెళదాం” అంటూ బయలుదేరారు.
స్వామీజీ అత్యున్నతమైన నిర్వికల్ప సమాధి స్థితిలో మగ్నులైన సంఘటనల్లో ఇదొకటి.
సహస్రద్వీప వనం
పెర్సీ అరణ్యాలలో కోకొల్లలుగా పెరిగిన కొండరావి (birch) చెట్ల పట్టలతో స్వామీజీ రెండు చిన్న పుస్తకాలు తయారుచేశారు. వాటిపైన ఆంగ్లంలోను, సంస్కృతంలోను వ్రాసి మిస్ మెక్లౌడ్కీ, ఆమె సోదరీమణికీ ఇచ్చారు. ఆ చెట్టు పట్ట మీద మేరీ హేల్‌కు ఒక లేఖ కూడా వ్రాశారు: “నేనిప్పుడు వ్రాసిన కొండరావి పత్రం మీదనే భారత దేశంలోని పవిత్రగ్రంథాలన్నీ రచించబడ్డాయి. కాబట్టి నీ కిప్పుడు ఆ సంస్కృతం వ్రాస్తున్నాను. ‘ఉమాపతిః త్వాం సదా రక్షతు – ఉమాపతి సదా నిన్ను రక్షిస్తాడు.”* పెర్సీ మకాంలో విడిది చేయడం స్వామీజీలో ఒక నూతనోత్సాహాన్ని రగిలించింది.
పెర్సీ మకాంలో దాదాపు పది రోజులు గడిపిన తరువాత స్వామీజీ సహస్ర ద్వీప వనానికి బయలుదేరారు. ఆయన న్యూయార్క్‌లో ఉన్నప్పుడే ఈ వనానికి వేంచేయమని ఆహ్వానం వచ్చింది. “పది రోజుల తరువాత ఇక్కణ్ణుండి బయలుదేరి సహస్రద్వీప వనానికి వెళ్తున్నాను. నియమిత వేళల్లో ధ్యానం చేస్తాను. కేవలం ఏకాంతంలో ఉంటాను. ఈ ఆలోచనే మహోత్సాహకరంగా లేదా!”* అంటూ ఆనందంతో వ్రాస్తున్నారు స్వామీజీ.
న్యూయార్క్‌కు 300 మైళ్ల దూరంలో సెయింట్ లారెన్స్ నది ప్రవహిస్తూ ఉంది. ఆ నదిలో నెలకొనివున్న లంకలలో పెద్దది సహస్రద్వీప వనం. నదీ తీరానికి కాస్త దూరంలో రాళ్లతో కూడుకొన్న ప్రాంతంలోని ఒక పెద్ద శిల మీద ఒక అందమైన మేడ వుంది. ఆ మేడ స్వామీజీ శిష్యురాలైన మిస్ మేరీ ఎలిజబెత్ టట్చర్ది. అక్కడ బస చేసి తరగతులు నిర్వహించమని స్వామీజీని టట్చర్ సాదరంగా ఆహ్వానించింది. భగవదాహ్వానంగా భావించి 1895 జూన్ 18 వ తేదీన స్వామీజీ అక్కడకు వెళ్లారు. ఆయన కోసం ఇంటిని క్రొత్తదనం ఉట్టిపడేలా రూపొందించి ‘స్వామి వివేకానందకు సుస్వాగతం’ అనే తోరణం కట్టించింది టట్చర్.
అదొక వనప్రాంతం. ఏపుగా దట్టంగా ఎదిగిన చెట్లు, శిలలు, సమీపంలో ప్రవహిస్తున్న నది ఆ ప్రాంతాన్ని ఒక తపోభూమిగా స్వామీజీకి స్ఫురింపజేశాయి. బహుశా దక్షిణేశ్వరం రోజులు ఆయనకు జ్ఞాపకానికి వచ్చివుండవచ్చు. గంగానదీ తీరంలోని పంచవటీ వన ప్రదేశం ఆయన మనస్సుపై చెరగిపోని ముద్ర వేసింది కదా!
స్వామీజీ అక్కడకు చేరుకొనడానికి మునుపే ముగ్గురు నలుగురు విద్యార్థులు వచ్చేశారు. మొత్తం విద్యార్థినీ విద్యార్థులు పన్నెండుమంది. వారు: మిస్ టట్చర్, డాక్టర్ వైట్, మిసెస్ ఫంకే, మేరీ లూయీ, లియాన్ లాన్స్బర్గ్, స్టెల్లా కేంప్బెల్, వాల్టర్ గుడ్ ఇయర్ దంపతులు, మిస్ రూత్ ఎల్లిసీ, మిస్ వాల్డో, మిస్ క్రిస్టైన్. మరొకరు ఎవరో తెలియడం లేదు. కాని ఏకకాలంలో పదిమంది కన్నా ఎక్కువ మంది అక్కడ ఉండలేదన్నది మాత్రం తథ్యం.
‘ఏసుక్రీస్తును అభిలషించినట్లు’
డెట్రాయిట్లో స్వామీజీ ఉపన్యాసం విని ఆయన పట్ల ఆకర్షితులయిన మిస్ క్రిస్టైన్ గ్రీన్స్టైడల్, మిసెస్ మేరీ సీ. ఫంకేలు అక్కడకు చివరగా చేరుకొన్నారు. స్వామీజీని ఒంటరిగా కలుసుకోవాలని ఆశించినప్పటికీ న్యూయార్క్‌లో వారికి ఆ ఆస్కారం లభించలేదు. అవిరామంగా ప్రయాణం చేస్తున్న స్వామీజీ గురించి వారికి ఎలాంటి భోగట్టా అందలేదు. బహుశా ఆయన భారతదేశానికి తిరిగి వెళ్లిపోయి ఉంటారేమోననే ఆలోచన కూడా వారికి రాకపోలేదు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు గడిచిన తదుపరి స్వామీజీ సహస్రద్వీప వనంలో విడిది చేసిన సమాచారం అప్పుడే వారికి అందింది. మరేమీ ఆలోచించకుండా తిన్నగా వెళ్లి స్వామీజీని కలుసుకొని ఉపదేశం పొందాలని నిశ్చయించుకొన్నారు. క్రిస్టైన్ ఇలా వ్రాస్తున్నది:
“మేం అక్కడకు చేరుకొనేసరికి బాగా చీకటిపడిపోయింది. అందుకు తోడు జోరుగా వాన కురుస్తూన్నది. మాకు దారి సరిగా తెలియదు. ఒక చోట విచారించినప్పుడు, ‘విచిత్రమైన దుస్తులు ధరించిన ఒక విదేశీ వ్యక్తి’ బస చేసివున్న చోటు గురించి తెలియవచ్చింది. మేం వెళ్లవలసింది అక్కడికే అని గ్రహించు కొన్నాం. అదృష్టవశాత్తూ చేత లాంతరు పుచ్చుకొని ఒక వ్యక్తి మా ముందుగా వెళుతున్నాడు. ఆ వెలుతురులో గుట్టల మీద ఎక్కసాగాం. జాన ఎక్కితే మూర జారుతున్నది. మొత్తానికి ఆ ఇంటిని చేరుకోగలిగాం. ఇంటి ప్రాంగణంలోకి చేరేసరికి స్వామీజీ కంచుకంఠం లోపల మార్మోగుతున్నది.
“స్వామీజీని కలుసుకొన్నప్పుడు ఆయనతో ఏం మాట్లాడాలో మేం తయారు చేసుకొనే వెళ్లాం. కాని ఆయనను ప్రత్యక్షంగా చూసినప్పుడు సమస్తం మరచిపోయాం. ‘మేం డెట్రాయిట్ నుండి వస్తున్నాం. మిస్ ఫిలిప్స్ మమ్మల్ని పంపించింది.’ అని ఒకరం చెప్పినప్పుడు మరొకరర్, ‘ఏసుక్రీస్తు ఈ లోకంలో జీవించివుంటే ఎలా ఆయనను ఆశ్రయించి ఉండేవారమో అలా మిమ్మల్ని అభిలషించి వచ్చాం’ అన్నాం.
“స్వామీజీ ఆదరాభిమానాలతో మమ్మల్ని చూశారు. ‘ఆహా! నాకు మాత్రం ఏసుక్రీస్తు మాదిరి శక్తి ఉంటే మీకు ఈ క్షణమే ముక్తి ఇచ్చే వాణ్ణి’ అన్నారాయన మధురంగా. పిదప మమ్మల్ని తక్కిన వారితో చేర్చుకొన్నారు.”
ఈ విధంగా పేరెన్నికగన్న పన్నెండుమందికి ఆ సహస్రద్వీప వనంలో ఆధ్యాత్మిక సౌధపు ముఖద్వారాన్ని తెరిచారు స్వామీజీ.
తపోమయ జీవితం
తరగతులు, దైనందిన కార్యాలు, ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలంటూ ఈ రోజులు అందరికీ ఒక తపోమయ జీవితంగా గడిచాయి. గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, నారద భక్తిసూత్రాలు, బైబిల్ ఇత్యాది అనేక విషయాంశాలపై స్వామీజీ తరగతులు నిర్వహించారు. ఈ రోజుల్లో ఆయన మహోన్నత మానసిక స్థితిలో విరాజిల్లారు. “తుపానులా తిరుగుతూ ఉపన్యాసాలు చేసిన సన్న్యాసి అక్కడ లేరు; తమలో పొంగిపొరలే ప్రశాంతతనూ, పరమానందాన్నీ పరిపక్వత చెందిన శిష్యుల హృదయసీమలలో నింపే ఋషిసత్తముడు మాత్రమే అక్కడున్నాడు. అంధకారాన్ని తొలగించి, ఎర్రబారిన ఆకాశం ఒడిలో దోగాడుతూ, పిల్లగాలులతో కలసి ఏతెంచే కొంగ్రొత్త ఉషోదయంలా ఆయన ముఖతః జాలువారే వాక్కులు ఎంతటి మధురాతి మధురమైనవి!” అంటూ కాలాంతరంలో రామకృష్ణానంద వ్రాశారు.
అక్కడ బస చేసిన వ్యక్తులలో ఒకరైన మిస్ వాల్డో వ్యాఖ్యానాలను* చూద్దాం:
“ఆ చోటు నిజానికి మాకు ఒక పవిత్ర దేవాలయమయింది. వృక్షాగ్రాలనున్న ఆకులు ఆకుపచ్చని సముద్రంలా మా కాళ్ల క్రింద కదిలాయి. పెద్ద ఇల్లు అంటూ ఏదీ అక్కడ మా కంటపడలేదు. అనేక మైళ్ల పర్యంతం నిర్మానుష్యమైన దట్టమైన అడవి మధ్యలో మేం విడిది చేశాం. సెయింట్ లారెన్స్ నదిలో అక్కడక్కడ అనేక లంకలు ఉన్నాయి. ఆ లంకలలోని భోజనశాలల నుండి, హోటళ్ల నుండి మిణుకు మిణుకుమంటున్న దీపాల వెలుతురు కానవచ్చింది. దూరం కారణంగా ఈ దృశ్యాలు నిజానికి చిత్రదృశ్యాల మాదిరి తోచాయి. మా ఏకాంతానికి భంగం వాటిల్లజేసే మానవ కంఠ ధ్వని ఏదీ అక్కడ వినిపించదు. తుమ్మెదల ఝంకారాలు, పక్షుల కిలకిలారావాలు, గాలి వీయడం వలన ఆకులు చేసే మర్మర ధ్వని మాత్రమే మాకు వినవచ్చాయి. చుట్టూ ఉన్న దృశ్యం కొన్ని సమయాల్లో వెన్నెలలో తడసినట్లుగా కానవచ్చేది. ఆ చంద్రుని బింబం క్రింద నీటిలో ప్రతిబింబించింది. మనస్సును ఆహ్లాదమయం చేసే ఇటువంటి ప్రకృతి దృశ్యాలలో లీనమైపోయి ప్రపంచాన్ని మేం మరచిపోయి, ప్రపంచం మమ్మల్ని మరచిపోయి ప్రేమ ఒప్పారగా ఏడు వారాలు గడిపాం. మాకు అత్యంత ప్రేమాస్పదుడైన ఆచార్యవర్యుని ఆసక్తి జనింపజేసే పలుకులు ఆలకించాం.
“అటువంటి పావన వేళల్లో మేం పొందిన ఆధ్యాత్మిక స్పందన, తద్ద్వారా మేం సంతరించుకొన్న ఔన్నత్యం ఎవరమూ మరచిపోలేం; ఈ వేళల్లో స్వామీజీ తమ హృదయాన్ని పరిపూర్ణంగా తెరచి చూపించారు. తాము చవిచూసిన పోరాటాలనన్నింటినీ మళ్లీ అట్లే మా ముందుకు తీసుకువచ్చారు. మేం ఉన్నామనే ధ్యాసే లేకుండా స్వామీజీ కూర్చుండిపోవడం కద్దు. ఆయన చింతనా స్రవంతికి భంగం వాటిల్లి ఆయనకు ఇబ్బంది కలుగుతుందేమోనని మేం నిశ్శబ్దంగా కూర్చుండిపోయేవారం. తాము కూర్చున్న ఆసనం నుండి లేచి, వసారాలో నడుస్తూ, ఉప్పెనలా, పరిపూర్ణమైన అనుభూతితో స్వామీజీ మాట్లాడేవారు. ఈ వేళల్లో ఆయనలో అనురాగమూ, ప్రశాంతతా కొట్టొచ్చినట్లు పొంగిపొరలేవి.
“స్వామి వివేకానంద వంటి మహాత్ములతో ఏర్పడిన ఆధ్యాత్మిక సాంగత్యం ఆజన్మాంతం కొనసాగుతుంది. అవిచ్ఛిన్న ప్రగాఢ ఆధ్యాత్మిక వాతావరణంలో మేం జీవించాం. అప్పుడప్పుడు ఆయన తమాషాగానూ, విచిత్రంగానూ, పరిహాసపూర్వ కంగా మాట్లాడేవారు. ఇతరుల నుండి వచ్చే జవాబులను అంగీకరించేవారు. అయినప్పటికీ తమ జీవిత మహత్కార్యం నుండి ఆయన ఎన్నడూ వైదొలగలేదు. పురాణ కథలకు కాణాచిగా స్వామీజీ భాసిల్లారు. ఆ కథల నేపథ్యంలోని మహోన్నత ఆధ్యాత్మిక సత్యాలను విడమరచి చెప్పడం మాత్రం మరచేవారు కారు. శక్తిసంపన్నులైన ఇటువంటి ఆచార్యుని వద్ద పాఠాలు నేర్చుకొనే అదృష్టవంతులు ఈ విద్యార్థులు. ఇందుకోసం వారు తమను తామే శ్లాఘించుకోవాలి.”
మూడు తత్త్వాలు: వారసత్వం
తరగతులు నిర్వహించడంతో పాటు వేదాంత గ్రంథాలను కూడా స్వామీజీ అధ్యయనం చేస్తూ వచ్చారు. అందు నిమిత్తం భారతదేశం నుండి శంకర, రామానుజ, మధ్వాచార్యుల భాష్యాలను తెప్పించారు. “సహస్రద్వీప వనంలో ఉంటున్నప్పుడు అవస్థాత్రయంలోని వేదాంత తత్త్వం గురించి ఆంగ్లంలో ఒక గ్రంథం రచించాలి”* అని ముందే ఆయన అనుకొన్నారు. అందుకోసం మూడు భాష్యాలూ సాంగోపాంగంగా అధ్యయనం చేశారు. ప్రతి ఆచార్యుడూ తమ సిద్ధాంతాలను ప్రతిపాదించడానికి శాస్త్రాలను సవరించి భాష్యం చెప్పడం చూసి ఆయన ధ్యానంలో లయించిపోయి స్వయంగా తామే క్రొత్త వ్యాఖ్యలను కనుగొన్నారు.
అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం – ఈ మూడింటి తాత్త్విక మార్గాలను సమన్వయ పరచడం స్వామీజీ అందించిన వారసత్వాలలో ఒకటి. సామాన్యంగా ఈ మూడూ పరస్పర విరుద్ధమైనవిగాను, వ్యతిరిక్తమైనవిగాను పరిగణింపబడ తాయి. ఈ మూడూ వేదాంతానికి మూడు సోపానాలు, ఒక మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి ఈ మూడు సోపానాలూ ఆవశ్యకాలని ప్రప్రథమంగా లోకానికి స్వామీజీ చాటిచెప్పారు. ఆ వారసత్వం గురించి స్వయంగా స్వామీజీ చెప్పింది విందాం:
“ఇప్పుడు నేను కనుగొన్న విషయాన్ని మీకు చెబుతున్నాను. అన్ని మతాలూ వేదాంతంలో ఇమిడివున్నాయి. అంటే – ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత సిద్ధాంతాల్లో ఇమిడివున్నాయి. అవి ఒక దాని తదుపరి మరొకటి వస్తాయి. మానవుని ఆధ్యాత్మికాభివృద్ధికి ఈ మూడూ మూడు సోపానాలు. వాటిలో ప్రతిదీ అవసరమే. ఇదే మత సారం. భారతదేశంలోని వివిధ జాతి, మత, ఆచారాలకు వేదాంతాన్ని అన్వయిస్తే, అది హిందూమతమవుతుంది. వేదాంతంలోని మొదటి సోపానమైన ద్వైతాన్ని ఐరోపాలోని వివిధ జాతుల ఆశయాలకూ భావాలకూ అనువర్తిస్తే అది క్రైస్తవమతం అవుతుంది. యూదుల, అరబ్బుల భావాలకు ద్వైత సిద్ధాంతాన్ని అనువర్తింపజేస్తే అది మహమ్మదీయ మతమౌతుంది. అద్వైతాన్ని యోగ దృష్టి రూపంలో అన్వయిస్తే అది బౌద్ధమతం అవుతుంది. ఇట్లే తక్కినవి కూడా…. దీనిని గురించి ఒక గ్రంథం రచించాలనుకొంటున్నాను. కనుకనే మూడు భాష్యాలు పంపమని వ్రాశాను.”*
కాలాంతరంలో ఒకసారి శిష్యుడొకరు స్వామీజీతో, “ఈ విధంగా మూడు తత్త్వాలూ మూడు సోపానాలవడం నిజమయితే ఇంతకు మునుపు ఏ ఆచార్యుడూ దీనిని గురించి ప్రస్తావించలేదే?” అని అడిగాడు. “ఎందుకంటే అందుకోసమే జన్మించిన వాణ్ణి నేను కనుక. ఆ కార్యం నా కోసమే కేటాయించబడింది” అన్నారు స్వామీజీ.
మధ్యాహ్నం
మధ్యాహ్న కార్యక్రమాల గురించి మిసెస్ ఫంకే ఇలా వ్రాస్తున్నారు: “మధ్యాహ్న వేళల్లో సామాన్యంగా మేం పచార్లు చేసేవారం. ఇంటి నుండి మిట్టపల్లాల దారి గుండా కొంత దిగువన ప్రవహించే నది దాకా వెళ్లడమే మాకు నచ్చిన మార్గం. దారిలో అనేక చోట్ల పచ్చికబయళ్ల మీద స్వామీజీని పరివేష్టించి కూర్చునేవారం. ఆయన కూడా అద్భుతమైన అనేక విషయాల గురించి మాకు చెప్పేవారు. ఒక పక్షి, ఒక పువ్వు, ఒక సీతాకోకచిలుక ఇత్యాది అతి చిన్న ప్రకృతి ప్రేరణ చాలు, స్వామీజీ మాట్లాడనారంభిస్తారు; వేదాలలోని కథలు చెప్పేవారు; భారతీయ కవితలు గానం చేసేవారు.”
సాయంత్రం వేళల్లో
సాయంకాల సమయాలలో స్వామీజీ విద్యార్థులను ప్రసంగించమనేవారు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. ప్రసంగం నుండి తప్పించుకోగోరేవారు తరగతులకు హాజరు కాకపోవడం కద్దు. సాయంత్రం గడిచేకొద్దీ స్వామీజీ క్రమక్రమంగా అంతర్ముఖులయ్యేవారు; ఆయన పలుకులు ప్రత్యక్ష దివ్యవాక్కులలా వినవచ్చేవి. కొన్ని సమయాలలో రాత్రంతా మాట్లాడేవారు. వాల్డో ఇలా వ్రాస్తున్నది: “ఆయన మాతో మాట్లాడుతూన్నట్లు అనిపించేది కాదు. ఏదో సుదూర లోకాలలో సంచరిస్తూ తమలో తామే మాట్లాడుకొంటున్నట్లుగా ఉండేది. కాని ప్రతి మాటా అగ్నికణంలా వెలువడేది – అంత లోతైన దిగా, అర్థవంతమైనదిగా, అచంచల దృఢత్వంతో కూడినదిగా, మా హృదయాలను ప్రత్యక్షంగా స్పృశించేదిగా, విన్నవారు ఎన్నటికీ మరచిపోలే నట్టిదిగా ఉండేది. మేం ప్రశాంతతలో లయించి పోయినవారిగా కూర్చుండిపోయే వారం. ఎక్కడ మా ఉచ్ఛ్వాస నిశ్వాసాల సవ్వడి ఆయన చింతనా స్రవంతికి భంగం వాటిల్లజేస్తుందో, ఎక్కడ ఆ అద్భుత వచనాలలో ఒకదాన్ని కోల్పోతామేమో ననే భయం కారణంగా మేం శ్వాస బిగబట్టి కూర్చునేవారం.”
కొన్ని సమయాలలో స్వామీజీ పడక కుర్చీలో కూర్చుని ధ్యానమగ్నులయ్యే వారు. విద్యార్థులు ఆయన ముందు నేల మీద కూర్చుని ధ్యానంలో నిమగ్నులయ్యే వారు. గంటల పర్యంతం ఈ ధ్యానం కొనసాగేది.
తేలిక క్షణాలు
అధ్యయనం, ఆధ్యాత్మిక సాధనలు ఒక వంక సాగుతున్నప్పటికీ అక్కడ వేడుకలకూ వినోదాలకూ కొదువ లేదు. హాస్య కథలకు స్వామీజీ వద్ద కొరత లేదు. సహస్రద్వీప వనంలో ఆయన చెప్పిన ఒకటి రెండు కథలను చూద్దాం.
- నరమాంస భక్షకులు నివసించే దీవికి మిషనరీ ఒకరు వెళ్లారు. వెళ్లగానే అక్కడి ప్రజలను చూస్తూ, “నా సోదరులారా! నాకు ముందు ఇక్కడికి ఒక మిషనరీ వచ్చారు కదా! ఆయన మీకు రుచించాడా?” అని అడిగాడు. అందుకు ఆ ప్రజలు ఇలా అన్నారు:
- “అవును. బాగా రుచించాడు. ఆహా! ఆయన మహా ‘రుచి’ గా ఉన్నాడు!”
- భగవంతుడు లోకాన్ని సృష్టించడం గురించి ఒక మిషనరీ సుదీర్ఘంగా వివరించి చెబుతున్నాడు:
“ప్రారంభంలో అంతా శూన్యమే. తరువాత భగవంతుడు బంకమట్టితో ఆడమ్‌ను సృష్టించాడు. తడిమట్టితో ఉన్న ఆతణ్ణి ఆరబెట్టవలసి వచ్చింది. భగవంతుడు చుట్టూ కలయజూశాడు. సమీపంలో కనిపించిన కంచె మీద ఆతణ్ణి ఆరవేశాడు.
‘ఫాదర్!’ అన్న ఒక కంఠం శ్రోతల నుండి వినవచ్చింది. ‘ఫాదర్, ఆ కంచె ఎక్కణ్ణుండి వచ్చింది? దానిని సృష్టించిం దెవరు?’ అని అడిగాడు ఆ శ్రోత.
మిషనరీ ఆగ్రహోదగ్రుడయ్యాడు! ‘నోరుమూసుకో. ఇలాగా ప్రశ్నలడగడం? చూడబోతే మా జీవనాధారాన్నే పాడుచేసేటట్లున్నావే!’ అంటూ గబగబా బయటికి వెళ్లిపోయాడు.
మిసెస్ ఫంకే ఇలా వ్రాస్తున్నది: “పొట్ట చెక్కలయ్యేలా నవ్వేవారం. కొన్ని సమయాలలో స్వామీజీ వంటమనిషిలా దుస్తులు ధరించి వచ్చి, “భోజనం తయారయింది” అంటూ కచ్చితంగా వంటవానిలా ఉచ్చరించడం చూస్తే, కడుపుబ్బ నవ్వనివారు ఎవరూ ఉండరనడం అత్యుక్తి కాదు. భోజనాల బల్ల వద్దకు పోతే, మా ప్రవర్తననూ, చేష్టలనూ ఆయన అనుకరించి చూపడం చూసి విరగబడి నవ్వేవారం. దేన్లోనూ ఎవరి మనస్సూ గాయపడే రీతిలో తమాషా చేయరు. అంతా కేవలం తమాషా, కేవలం వినోదం మాత్రమే.”
కృత్రిమత్వం వద్దు
ఈ మకాం జీవితం ఆ పాశ్చాత్యులకు కనువిప్పుగా భాసిల్లింది. ప్రత్యేకించి ఆ స్త్రీలు ఒక రకమైన కృత్రిమత్వంలోనే జీవించడానికి అలవడ్డారు. స్వామీజీ దానిని ఛిన్నాభిన్నంచేసి సత్యమనే వెలుగులో జీవించడానికి వారికి తోడ్పడ్డారు. ఒక సంఘటన పరికిద్దాం. స్త్రీలు మామూలుగా మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా పురుషులు చేతులు అందించి తోడ్పడాలి. ఇది అక్కడి సంప్రదాయం. దీనిని గురించి క్రిస్టైన్ ఇలా వ్రాస్తున్నది:
“ఇక్కడేమో బండరాళ్ల మీద సైతం మేం మరొకరి తోడ్పాటు లేకుండా ఎక్క వలసి ఉంది. ఏ పురుషుడూ మాకు చేతులందించలేదు. స్వామీజీ మా భావనలను అవగతం చేసుకొని ఇలా అన్నారు: ‘మీరు వృద్ధురాళ్లుగానో, బలహీనంగానో, గతిలేని స్థితిలోనో ఉండివుంటే నేను మీకు తోడ్పడాలి. కాని మీరు బాగానే ఉన్నారు కదా! మీరు ఈ కాలువను దాటగలరు, ఈ బండరాళ్ల మీద తోడ్పాటు లేకుండా ఎక్కగలరు. నా కెలా సాధ్యమో అట్లే మీకూ సాధ్యమవుతుంది. కనుక నే నెందుకు మీకు తోడ్పడాలి? మీరు స్త్రీలు కావడం వలనా? లేకపోతే ఇది స్త్రీకి పురుషుడు చూపే ఔదార్యమా? ఈ ఔదార్యం వెనుక కామం ఉంటుందని మీకు తెలియదా?’ ఎంతటి అద్భుత వచనాలు! స్త్రీలను నిజంగా గౌరవించడమంటే ఏమిటో నాడు స్వామీజీ వచనాలలో గ్రహించాం.”
సహస్రద్వీప వనంలో విడిది చేసిన వారిలో ఒకామె తక్కిన వారిపై ఆధిక్యం చలాయించే స్వభావి. ఇది గ్రహించిన స్వామీజీ ఆమె మనోవైఖరిలో మార్పు తీసుకువచ్చారు. ఆ స్త్రీ అనేక ప్రణాళికలు ప్రతిపాదిస్తుంది. అన్నింటినీ ప్రశాంతంగా ఆలకిస్తూ స్వామీజీ మౌనం వహిస్తారు. కాని ఆఖరి క్షణంలో అన్నింటినీ మార్చివేస్తారు. మొదట ఆ స్త్రీకి రోషం కలిగినా తరువాత నవ్వుతూ, “ఆయన కోసమే ప్రణాళికలు రూపొందించాను. ఆఖరి క్షణంలో తలక్రిందులు చేస్తారు. ఆయన మార్గంలోనే ఆయన వెళతారు. కంచు పాత్రల దుకాణంలో ఏనుగు జొరబడినట్లుగా ఉంటుంది ఆయన తీరు” అంటుంది.
ఈ విధంగా కృత్రిమత్వ రహితమైన నిరాడంబరతతో జీవితాన్ని ఎలా గడపాలో అక్కడున్న వారికి స్వామీజీ నేర్పించారు.
వంట
వంటతో సహా అన్ని పనులలోను సమానంగా అందరూ పాలుపంచుకో వాలని ప్రారంభంలోనే నిర్ణయించారు. కాని విద్యార్థులలో ఎవరూ ఇలాంటి పనులు చేసినవారు కాకపోవడంతో ఇంటి పనుల వరకు కొంత శ్రమ తప్పలేదు. స్వామీజీ దానిని పట్టించుకోలేదు. “నేను వంట చేస్తాను” అంటూ అప్పుడప్పుడు స్వామీజీ రంగంలోకి దిగేవారు. “అయ్యో!” అంటూ లాన్స్బర్గ్ అరిచేవాడు. స్వామీజీ పాకశాస్త్ర నైపుణ్యం న్యూయార్క్ రోజుల్లోనే ఆయనకు బాగా తెలుసు. స్వామీజీ వంట అంటే, కళ్లలో నీరు తెప్పించే కారం ఒక వైపు; వంట గదిలోని పాత్రలన్నింటినీ మళ్లీ తోమవలసిన అగత్యం మరో వైపు! అక్కడున్న అనేకులకన్నా చిన్నవారైన స్వామీజీ ఒక తండ్రిలా, తల్లిలా, కుటుంబ పెద్దగా నడుం బిగించి ఇంటి పనులలో తలమునకలవడం వారందరికీ స్వామీజీ పట్ల సహజంగానే గౌరవమర్యాదలను ఇనుమడింప జేసింది. “ఆయన వంట రుచిగానే ఉంది. కాని ‘నిజానికి’ కారమంటే అంత ఘాటైన కారం. దానికి తోడు మసాలా ఎక్కువగా ఉంటుంది. అది తినడం వలన ప్రాణం పోకపోయినా సరే – కారం మమ్మల్ని దాదాపు ఆ స్థితికి తీసుకెళ్లింది – నేను తినాలని నిశ్చయించుకొన్నాను. ఆ మహా మహా వివేకానందుడే నా కోసం వంట చేశారంటే, నేను చేయగలిగిందల్లా దానిని తినడమే” అన్నది మిసెస్ ఫంకే.
ఒకసారి తాము వండిన వంట గురించి స్వామీజీయే కాలాంతరంలో తమాషాగా చెప్పింది ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు. మేరీ హేల్‌కు ఆయన ఇలా వ్రాస్తున్నారు: “నిన్న రాత్రి నేనొక వంటకం తయారుచేశాను. అది కుంకుమపువ్వు, లావెండర్, జాపత్రి, జాజి కాయ, చలవ మిరియాలు, జాజికాయ చెక్క, లవంగాలు, ఏలక్కాయ, మీగడ, నిమ్మరసం, నీరుల్లి, ఎండుద్రాక్ష, బాదం, మిరియాలు, వరి అన్నం కలిపి తయారుచేసింది. అది ఎంత బాగుందనుకొన్నావు! దాన్ని నేను తినలేకపోయాను. ఇంగువ లేదు. ఇంగువ వేస్తే అది మెత్తబడిగుటుక్కున మింగడానికి వీలుగా ఉండేది.”*
చిన్నపిల్లవాడే ఆయన
సహస్రద్వీపవన మకాం సమీపంలో ఒక చర్చ్ ఉంది. ఒక ఆదివారం అక్కడ ఆరాధనలో స్వామీజీ పాల్గొన్నారు. బోధకుడు తన ప్రసంగం ముగించి, “ఏసుక్రీస్తు కోసం మీ వద్ద ఉన్నదంతా ఇచ్చివేయండి” అన్నాడు. తదుపరి ఒక వ్యక్తి కానుకలు సేకరించడానికి ఒక పళ్లెం పుచ్చుకొని ప్రతి వ్యక్తి వద్దకూ వెళ్లాడు. పలువురు తమకు తోచినంత పైకం ఆ పళ్లెంలో వేశారు.
పళ్లెం పుచ్చుకొన్న వ్యక్తి స్వామీజీ ముందు కూడా పళ్లాన్ని జాపాడు. అంతే, స్వామీజీ తమ జేబులోని మొత్తం పైకాన్ని పళ్లెంలో వేశారు. అది పెద్ద మొత్తం! స్వామీజీతోపాటు వెళ్లిన మిస్ టట్చర్ ఆశ్చర్యచకితురాలయింది. ఆమె మెల్లగా, “స్వామీజీ, మీ రెందుకు అంత పెద్ద మొత్తం చెల్లించారు?” అని అడిగింది. “మీ వద్ద ఉన్నదంతా ఇవ్వండని కదా బోధకుడు చెప్పాడు. నా వద్ద అంత మొత్తం ఉంది కనుక అంతా ఇచ్చివేశాను” అన్నారు స్వామీజీ చిన్నపిల్లవాడి మాదిరి!
యతి గీతం
స్వామీజీ గడపిన ఈ రోజులను విశిష్టంగా చూపేవి ఆయన ఉన్నత ఆధ్యాత్మిక స్థితులు. ఆయనతో కలసి సహజీవనం చేసిన శిష్యులందరూ దీనిని ధ్రువీకరించారు. ఈ స్థితిలో నెలకొనివున్న రోజులలోనే అద్భుతమైన కవితలలో ఒకటయిన ‘యతిగీతం’ అక్కడ రచించారు. మిసెస్ ఫంకే ఇలా వ్రాస్తున్నది: “ఒక రోజు మధ్యాహ్నం ఆయనసన్న్యాస మహత్త్వం గురించి చెబుతున్నారు. హఠాత్తుగా అక్కడ నుండి లేచి వెళ్లిపోయారు. కాసేపటికల్లా తిరిగివచ్చినప్పుడు ఆయన చేతిలో ఈ కవిత ప్రత్యక్షమయింది.” పదమూడు చరణాలు గల ఈ కవిత సన్న్యాసం గొప్పతనాన్నీ, అత్యున్నత ఆధ్యాత్మిక స్థితి మహత్త్వాన్నీ చాటిచెబుతున్నది.*
తమ అత్యున్నత మానసిక స్థితిని గురించి స్వామీజీ ఇలా వ్రాస్తున్నారు:
“ఈ ప్రదేశాన్ని నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. మిత భోజనం, అధిక ధ్యానం, సంభాషణ, అధ్యయనాలు చేస్తున్నా. నా ఆత్మను అద్భుతమైన ప్రశాంతత ఆవరిస్తోంది. నిత్యం నాకు కర్తవ్యం ఏమీ లేదని తోస్తోంది; నేనిప్పుడు నిరవధిక విశ్రాంతిలోను, ప్రశాంతతలోను ఉన్నాను. కర్త భగవంతుడు; మనం కేవలం ఉపకరణాలం; ఆయన నామం ధన్యమౌగాక! కామ, కాంచన, కీర్తి అనే బంధత్రయం నా నుండి ప్రస్తుతం తొలగిపోయినట్లు అనిపిస్తున్నది. భారతదేశంలో కొన్నిసార్లు నేను భావించినట్లు ఇక్కడా మరొకసారి భావించాను. ‘నా నుండి సకల బంధాలూ వీడిపోయాయి; సకల సుకృతాలూ లేక దుష్కృతాలూ, సర్వ భ్రాంతులూ, అజ్ఞానమూ అదృశ్యమైనాయి. గుణాతీతపథంలో సంచరిస్తున్నాను.’ ఏ విధిని నేను పాటిస్తాను? దేన్ని ఉల్లంఘిస్తాను? ఆ మహోన్నతస్థితి నుండి చూస్తే ఈ లోకం ఒక మురికి గుంటలా కనిపిస్తుంది. ‘హరి ఓం తత్సత్’ – ఉన్న దతడే! అన్యమేదీ లేదు; నేను నీలో ఉన్నాను; నువ్వు నాలో ఉన్నావు. ఓ దేవా నువ్వే నా శాశ్వత శరణ్యం. ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.”*
ఈ రోజుల్లో ఆయనలో ఆధ్యాత్మికశక్తి పొంగిపొరలిందనే చెప్పాలి. “నేను ప్రతి రోజూ హృదయ వికాసాన్ని అనుభవిస్తున్నాను”* అంటూ స్వామీజీ వ్రాశారు.
నిర్వికల్ప సమాధిలో
ఈ సహస్రద్వీప వనంలో స్వామీజీ మరొకసారి నిర్వికల్ప సమాధి స్థితిని పొందారు. మిసెస్ ఫంకే ఇలా వ్రాస్తున్నది: “ఆనాటి ఉదయం తరగతులు లేవు. స్వామీజీ మా ఇద్దరితో, ‘కాస్త నడచివద్దాం, వస్తారా?” అని అడిగారు. మేం సంతోషంగా బయలుదేరాం. కొండ మీద అర మైలు దూరం నడిచివుంటాం. దట్టమైన అడవి, సర్వత్రా నిశ్శబ్దం. స్వామీజీ కాస్త దూరం ముందుకు వెళ్లి ఒక పెద్ద ఓక్ (సిందూర వృక్షం) చెట్టు క్రింద కూర్చున్నారు. మేమూ వెళ్లి ఆ చెట్టు క్రింద కూర్చున్నాం. ఏదో చెప్పబోతున్నారని మేం ఎదురుచూస్తున్నప్పుడు స్వామీజీ హఠాత్తుగా, “మనం ధ్యానం చేద్దాం. అశ్వత్థవృక్షం క్రింద కూర్చున్న బుద్ధునిలా మనమూ అవుదాం” అన్నారు. ఆ తరువాత మాటలు లేవు. ఆయనలో ఎలాంటి చలనమూ లేదు. ఆయన ఒక కంచు విగ్రహంలా అయిపోయారా అనిపించింది. విస్తుపోతూ మేం ఆయననే చూస్తూండిపోయాం. హఠాత్తుగా ఒక ఉరుము ఉరిమి భారీగా వర్షం కురవసాగింది. స్వామీజీలో బాహ్యస్మృతి పూర్తిగా లేదు. నేను గొడుగు తెరచి ఆయన తల మీద పట్టుకొని వీలయినంత వరకు వర్షం ఆయనపై పడకుండా చూసుకొన్నాను. ఇంట్లో మేం కనబడకపోవడంతో పలువురు గొడుగులూ, వర్షం కోట్లు పట్టుకొని అక్కడకు వచ్చారు. అందరమూ ప్రశాంతంగా స్వామీజీని చూస్తూ నిలబడిపోయాం. చాలాసేపటికి ఆయనకు బాహ్యస్మృతి కలిగింది.* ప్రశాంతంగా మా అందరినీ చూశారు. మౌనంగా నవ్వి, ‘మళ్లీ ఒకసారి నేను కలకత్తా వర్షంలో తడిసినట్లుగా ఉంది’ అన్నారు.” నరేంద్రునిగా ఉద్యోగాన్వేషణలో అలమటిస్తూ స్పృహతప్పి పడిపోయి, మనస్సులో నుండి తెరలు తొలగిపోయిన అద్భుత అనుభవాన్ని సూచిస్తున్నారా స్వామీజీ?
స్వామీజీతో పాటు సహస్రద్వీప వనంలో నివసించిన భాగ్యశాలురైన ఆ పన్నెండు మంది గురించి చూద్దాం.
1. మిస్ టట్చర్ : 63 ఏళ్ల వయస్కురాలైన ఈమె క్రైస్తవ మెథాడిస్ట్ శాఖకు చెందినది. క్రైస్తవ మతంలోనూ, దాని ఆచార వ్యవహారాదులలోనూ బాగా ఊరి పోయిన ఈమె స్వామీజీ ప్రసంగాలు ఆలకించేకొద్దీ ఆమెలో ఊరి కరడుగట్టిన అభిప్రాయాలు మటుమాయం కాసాగాయి. అదేసమయంలో నూతన భావాలను ఆమె చప్పున స్వీకరించలేకపోయింది. ఈ మానసిక పోరాటం శారీరక రుగ్మతగా పరిణమించింది. శరీరం అస్వస్థతకు గురైనప్పుడు ఆమె రెండు మూడు రోజులు తరగతులకు హాజరు కాలేదు. అందుకు కారణం స్వామీజీకి స్పష్టంగా తెలుసు. “ఈ రుగ్మత శారీరకమైనది కాదు. మనస్సులో జరిగే పోరాటమూ, కలతా రుగ్మతగా పరిణమించాయి. టట్చర్ దీనిని తట్టుకోలేకున్నది” అన్నారు ఒకసారి స్వామీజీ. కాని స్వామీజీ సాంగత్యం వలన జీవితంలో సానుకూలమైన మార్పులను ఆమె పొందగలిగింది.
2. డాక్టర్ వైట్ : ఈయన డెబ్భై ఏళ్ల పైబడ్డ వ్యక్తి. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యా లయంలో విద్య నభ్యసించాడు. తమాషాగా మాట్లాడతాడు. స్వామీజీ సహస్రద్వీప వనంలో అద్వైత సిద్ధాంతాన్ని ఎక్కువగా బోధించారు. కనుక ప్రసంగాలు ముగిసి నప్పుడు వైట్, “స్వామీజీ! చివరికి విషయం ఇదే – నేను భగవంతుణ్ణి, సమస్తం నేనే, అంతేకదా?” అని స్వామీజీని అడిగాడు. అందుకు స్వామీజీ చిన్నగా నవ్వుతూ, “అవును, మిత్రమా! మీరు భగవంతుడు. అంటే మీలో ఉన్న నిజమైన పదార్థం భగవంతుడే” అన్నారు. కొన్ని సమయాలలో వైట్ తరగతికి ఆలస్యంగా వచ్చేవాడు. అప్పుడు స్వామీజీ పరిహాసంగా, “ఇదిగో భగవంతుడు వస్తున్నాడు, ఇదిగో సమస్తమూ అయిన వ్యక్తి వస్తున్నాడు” అనేవారు. అందరూ ఘొల్లున నవ్వేవారు.
3. మిసెస్ ఫంకే : ఈమె యువతి. ఆచార్యవరేణ్యుడైన స్వామీజీ పాదార విందాల వద్ద తన సమస్తాన్నీ ధారబోసిన వ్యక్తిగా ఈమెను అందరూ పరిగణించారు. స్వామీజీ ప్రసంగిస్తున్నప్పుడు దానిని వ్రాసుకోవడంలో ఇతరు లందరూ నిమగ్నులై ఉంటారు. కాని ఈమె మాత్రం గంధర్వ గానాన్ని తలపించే స్వామీజీ కంఠమాధుర్యాన్ని ఆలకిస్తూ మైమరచిపోయేది. తక్కిన వారు అడగడానికి జంకే ప్రశ్నలను ఆమె సాహసించి స్వామీజీని అడగడం కద్దు. స్వామీజీకి విశ్రాంతి అవసరమని తక్కినవారి కన్నా బాగా గ్రహించిన వ్యక్తి ఈమే. మనశ్శరీరాలు సదా ఉద్రిక్తస్థితిలో ఉండకూడదని వేడుకలు వినోదాలతో స్వామీజీకి కాస్త శారీరక మానసిక విశ్రాంతి కలిగేలా ఈమె వ్యవహరించేది.
కాలాంతరంలో భారతీయ మహిళా వికాస కార్యక్రమంలో నివేదితకు తోడ్పడడానికి క్రిస్టైన్ భారతదేశానికి వచ్చింది. అప్పుడు క్రిస్టైన్ స్నేహితురాలయిన ఫంకే కూడా ఆమెతో కలసి భారతదేశానికి రాగోరింది. అందుకు స్వామీజీ, “నువ్వు గృహస్థురాలిగా జీవిస్తున్నావు. నీ భర్తలోను, కుటుంబంలోను భగవంతుణ్ణి దర్శించ డానికి గాంచ ప్రయత్నించు. ప్రస్తుతానికి నీ కదే మార్గం” అని హితవు చెప్పారు.
ఆఖరి రోజులలోనూ స్వామీజీ ధ్యాసలోనే ఫంకే జీవించిందని చెప్పవచ్చు. సదా సర్వవేళలా స్వామీజీ సాన్నిధ్యంలో ఉన్నట్లుగా భావించి ఆమె జీవించింది. “ఆఖరి క్షణంలో అంధకారాన్ని తొలగిస్తూ ఒక జ్యోతి వస్తుంది, ఆ జ్యోతిలో స్వామీజీ జ్యోతిర్మయరూపులై ఏతెంచి తనకు ముక్తి కలిగిస్తారు” అనే ప్రగాఢ విశ్వాసం ఆమెలో పాదుకుపోయింది.
4. మేరీ లూయీ : యాభై ఏళ్ల వయస్కురాలైన ఈమె ఫ్రాన్స్ దేశస్థురాలు. 25 సంవత్సరాలుగా న్యూయార్క్‌లో నివసిస్తూన్నది. భగవంతుని పట్ల అంతగా నమ్మకం లేని ఈమె సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేది. చూడగానే ఆడో మగో తెలియని సందిగ్ధత కలిగే ఆకృతి ఆమెది. తనది జ్ఞానమార్గమని ఆమె చెప్పుకొనేది.
సహస్రద్వీప వనంలో స్వామీజీ ఈమెకు సన్న్యాసదీక్షను, క్రిస్టైన్తో కలిపి ఐదుగురికి మంత్రదీక్షను, బ్రహ్మచర్య దీక్షను ప్రసాదించారు. స్వామి అభయానంద నామధేయాన్ని స్వామీజీ ఈమెకు ఇచ్చారు.
సహస్రద్వీప వనంలో తరగతులు పూర్తికావడానికి ముందే ఈమె అక్కణ్ణుండి వెళ్లిపోయింది. త్వరలోనే క్యాలిఫోర్నియా, వాషింగ్టన్లలో వేదాంత కేంద్రాలను నెలకొల్పింది.
5. లియాన్ లాన్స్బర్గ్ : స్వామీజీ నూయార్క్‌లో తరగతులు నిర్వహించి నప్పుడే ఆయనతోబాటు ఉన్న వ్యక్తి. సహస్రద్వీప వనంలో స్వామీజీ నుండి సన్న్యాస దీక్ష పుచ్చుకొన్న మరొక వ్యక్తి లాన్స్బర్గ్. ఈయన స్వామి కృపానంద నామధేయాన్ని స్వీకరించారు.
6. స్టెల్లా కేంప్బెల్ : సహస్రద్వీప వనానికి తరగతులలో పాల్గొనడానికి వచ్చినప్పటికీ ఈమె అంతగా తరగతులకు హాజరు కాలేదు. సదా ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తూ తన గదిలోనే ఉండిపోయేది. ఈమె సాధనలు చేస్తున్నదని తక్కినవారు అంతగా నమ్మలేదు. ఈమె వృత్తిరీత్యా ఒక నటి. అందమూ, యౌవనమూ తగ్గిపోతున్నప్పుడు వాటిని పునఃప్రాప్తించుకోవడానికి రాజయోగం అభ్యసించ నారంభించింది. బాలగోపాలుణ్ణి ఈమె ఇష్టదైవంగా గుర్తించి సాధనలు నేర్పించారు స్వామీజీ.
ఒక రోజు తరగతిలో స్టెల్లాను గురించి స్వామీజీ ప్రస్తావిస్తూ, “ఈ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం. ఈమె ఎంతో నిరాడంబరమయిన వ్యక్తి” అన్నారు. ఈ పలుకులను ఎవరూ ఆమోదించనట్లుగా తరగతిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. అప్పుడు స్వామీజీ గంభీరంగా ఇలా అన్నారు: “ఈమెను నా బిడ్డ అని ఎందుకు పేర్కొన్నానో తెలుసా? అది విని అయినా ఆమె తన కృత్రిమత్వాన్నీ అసహజత్వాన్నీ తొలగించుకొని బిడ్డలా రూపొందాలనే ఉద్దేశంతోనే!”
కాలాంతరంలో ఆర్సార్ట్ సరోవరంలోని ఒక ద్వీపంలో ఇల్లు కట్టుకొని అక్కడ ఈమె ఒంటరిగా జీవించింది. తలపాగా ధరించింది. యోగం అభ్యసించింది. పత్రికా విలేఖరులు ఆమెను కలుసుకొన్నారు. ఆమెను గురించి వార్తలు పత్రికలలో రాసాగాయి.* స్వామీజీ సత్సాంగత్యాన్ని ఆమె కొనసాగించింది. మిస్ మెక్లౌడ్, క్రిస్టైన్ ప్రభృతులకు వ్రాసిన లేఖలలో స్వామీజీ ఆమె గురించి విచారించేవారు. “ప్రియమైన బిడ్డా” అనే ఆమెను గురించి స్వామీజీ లేఖలలో ప్రస్తావించేవారు; ఆమెను భారతదేశానికి తీసుకురావడానికి కూడా స్వామీజీ ప్రయత్నించారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు. కొంతకాలం తరువాత సాధారణ జీవితం గడపసాగిన స్టెల్లా 1945 లో మరణించింది.
7, 8 వాల్టర్ గుడ్ ఇయర్ దంపతులు : 1895 జనవరిలో న్యూయార్క్‌లో స్వామీజీ ప్రసంగం విన్న ఈ దంపతులు తమను ‘స్వామీజీకి పరమ శిష్యులు’ గా పరిగణించుకొన్నారు. స్వామీజీ ఉపన్యాస సమావేశాలలో కార్యక్రమాలను ప్రకటించే వ్యక్తిగాను, ఆదాయం వ్యయం లెక్కలను చూసుకొనే వ్యక్తిగాను వాల్టర్ కొద్దికాలం వ్యవహరించాడు. 1895 సెప్టెంబర్‌లో బ్రహ్మవాదిన్ పత్రికకు* అమెరికా ఏజెంట్‌గానూ ఉన్నాడు.
9. మిస్ రూత్ ఎల్లిస్ : ఈమె న్యూయార్క్ పత్రికా కార్యాలయంలో పని చేసింది. బహు నెమ్మదస్థురాలు. ప్రతి విషయంలోనూ ఆమె తనను నేపథ్యంలోనే ఉంచుకొనేది. భక్తి, ప్రేమలమయంగా ఆమె భాసిల్లిందనడం అతిశయోక్తి కాబోదు.
వాల్డో, క్రిస్టైన్లు స్వామీజీ జీవితంలో ముఖ్యపాత్ర వహించిన వారు. వీరి ప్రస్తావన అనేక చోట్ల చూశాము. ఇక ముందు కూడా చూడబోతాం.
ఈ విధంగా తాము ఉన్నత ఆధ్యాత్మిక స్థితులలో విరాజిల్లి శిష్యులను కూడా ఆ స్థితులలోకి తోడ్కొని వెళ్లిన స్వామీజీ సహస్రద్వీప వనంలో ఏడు వారాలు గడిపారు. అక్కడ నుండి ఆగస్టు 7 వ తేదీన న్యూయార్క్ బయలుదేరారు. బయలుదేరడానికి ముందు, “ఈ సహస్రద్వీప వనాన్ని దీవిస్తున్నాను” అని చెప్పి సెలవు పుచ్చుకొన్నారు.