అమెరికాకు ‘దైవం మానుష రూపేణ’ అన్నట్లుగా స్వామీజీ వచ్చారు. అక్కడ తమ ఆధ్యాత్మిక కార్యాన్ని కొనసాగించారు. వెళ్లిన ప్రతి చోటా ఆధ్యాత్మిక బీజాలను నాటారు. అసంఖ్యాకమైన ప్రజల్ని ఆశీర్వదించారు.
– మేరీ లూయీ బర్క్
‘దైవం మానుష రూపేణ’ — అమెరికా కార్యం : మూడు ఘట్టాలు — లియాన్ ఇంట్లో — తలపాగా విన్యాసం — స్వామీజీని ఆకట్టుకొంది — నేర్చుకొంటున్నారు — పాశ్చాత్య సంగీతం — విజ్ఞానవేత్తలతో — రాబర్ట్ ఇంగర్సాల్తో — ఎమ్మా కాల్వే — అమరత్వ స్థితి అంటే ఏమిటి? — రాక్ఫెల్లర్తో — భగవంతుడు దారి చూపుతున్నాడు — అత్యున్నత స్థితులలో — శ్రీరామకృష్ణుల నిరోధం — ‘జోనాలా బయటకు వచ్చాను!’ — తుపాకీ తూటాల వర్షంలో — ‘ముందు నన్ను కాపాడండి’ — జాతి మౌఢ్యం — రాసులను త్రోసి ఇచ్చేదెవరు? — అతీంద్రియ శక్తులు — తాళం వేసిన గదిలో నుండి — మనస్సులను ఆకట్టుకొన్నారు — ఎల్లలకు అతీతుడు
‘దైవం మానుష రూపేణ’
స ర్వమత మహాసభానంతరం దాదాపు రెండున్నర సంవత్సరాలు స్వామీజీ అమెరికాలో గడిపారు. మధ్యలో 1895 సెప్టెంబర్ నుండి నవంబరు దాకా ఒకసారి ఇంగ్లండు వెళ్లి వచ్చారు. ఈ ఒక్క వ్యవధానం తప్ప 1896 ఏప్రెల్ 15 దాకా స్వామీజీ గడపిన అమెరికా జీవితం ఎంతో ఉత్తేజభరితంగా సాగింది. ఒక రోజు ఒక మూలలో, మర్నాడు సుదూరప్రాతంలో ఆయన ఉపన్యాసాలు జరిగాయి. విశ్రాంతి, స్వీయ సుఖ సౌకర్యాలు ఏవీ పట్టించుకోకుండా ఆయన కార్యాచరణలోనే ఉండిపో యారు. స్వామి అభేదానంద ఇలా వ్రాస్తున్నారు:
“స్వామీజీకి అమెరికాలో ఎదురైనా కష్టాలూ, ఇబ్బందులూ ఒకటి రెండు కావు. ఆహారం, దుస్తులు, పరిస్థితులు లాంటివి ఆయన శారీరక ఆరోగ్యాన్నిక్రుంగదీశాయి. కొన్ని సమయాలలో చలికాలంలో ఆయన వద్ద వేసవికాల దుస్తులే ఉండడం కద్దు. వాటితోనే సర్దుకొనేవారు. అమెరికా వాతావరణం హఠాత్తుగా మారిపోతుంది; ఆ మార్పు కూడా తీవ్రస్థాయిలో ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇతరులకు సహాయం చేయడానికి తమ సౌకర్యాలను ఆయన నిరాకరించడం పరిపాటి. తమ అవసరాలను ఆయన సామాన్యంగా వెలిబుచ్చే వారు కారు. తోడ్కొని వెళ్లేవారు ఇచ్చే వాటితోనే సరిపెట్టుకొనేవారు.” చేత ఒక్కసంచీ పుచ్చుకొని కొన్ని సమయాలలో ఒకే రోజు మూడు ఉపన్యాసాలు ఇస్తూ స్వామీజీ పయనించారు.
“నరేన్ ప్రపంచానికి బోధిస్తాడు” అన్న గురుదేవుల వచనాన్ని ఈ అమెరికా రోజులు ఋజువుపరచాయి. అమెరికా పుణ్యం చేసుకొన్నదనే పరిగణించాలి – గురుదేవుల అనుగ్రహమూ, మాతృదేవి ఆశీస్సులూ, కఠోర సాధనలూ, పరివ్రాజక జీవితమూ, తీవ్ర తపస్సుల ఫలితంగా ఆయనలో ప్రేరేపితమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రప్రథమంగా పొందిన అమెరికా కదా భాగ్యశాలి! “అమెరికాకు ఒక దేవదూతగా స్వామీజీ విచ్చేశారు. అక్కడ తమ ఆధ్యాత్మిక కార్యాన్ని కొనసాగించారు. వెళ్లిన ప్రతి చోటా ఆధ్యాత్మిక బీజాలను నాటారు. అసంఖ్యాకమైన ప్రజల్ని ఆశీర్వదించారు” అని మేరీ లూయీ బర్క్ వ్రాస్తున్నారు.
“ప్రాచ్యదేశాలకు బుద్ధుడు ఒక సందేశాన్ని అందించినట్లుగా పాశ్చాత్య దేశాలకు అందించడానికి నా వద్ద సందేశం ఉంది” అన్నారు స్వామీజీ.
అమెరికా కార్యం : మూడు ఘట్టాలు
స్వామీజీ చేపట్టిన ఈ మహత్తర కార్యాన్ని మూడు ఘట్టాలుగా విభజించ వచ్చు. సర్వమత మహాసభానంతరం (1893 సెప్టెంబర్ 27) స్వామీజీ జీవితం ప్రయాణాలతోను, ఉపన్యాసాలతోను గడచింది. విశ్రాంతీ విరామమూ లేని ఈ కార్యంలో అలసిపోయి, తమ కార్యాచరణ విధానాన్ని మార్చుకోవాలా అనే ప్రశ్నతో 1894 మార్చ్ మొదటి వారంలో స్వామీజీ చికాగోకు తిరిగివచ్చారు. దాదాపు ఈ ఆరునెలలూ స్వామీజీ మహత్కార్యంలోని మొదటి ఘట్టం.
1895 జనవరి దాకా, అంటే దాదాపు పది నెలలను రెండవ ఘట్టంగా పరిగణించవచ్చు. ఈ కాలఘట్టంలో బహిరంగ ఉపన్యాసాలకన్నా తరగతి ప్రసంగాలలో ఆయన ఎక్కువ ఆసక్తి కనబరిచారు. ఎంపిక చేసుకొన్న శిష్యులతో సహస్రద్వీప వనంలో అంతర్యోగ జీవితం గడిపారు. తమ కార్యాన్ని కొనసాగించే నిమిత్తం శిష్యులను తీర్చిదిద్దడంలో నిమగ్నులయ్యారు.
స్వామీజీ మాతృదేశం తిరిగి వచ్చేవరకు (1896 డిసెంబర్ 16), అంటే దాదాపు ఒక సంవత్సరం 11 నెలల కాలాన్ని ఆయన చేపట్టిన మహత్కారంలోని మూడవ ఘట్టంగా పేర్కొనవచ్చు. ఆయన రెండవసారి పాశ్చాత్యానికి వెళ్లి వచ్చిన కాలాన్ని (1899 ఆగస్టు 26 నుండి 1900 జూలై 20) కూడా మూడవ ఘట్టం క్రిందికే తీసుకోవచ్చు.
లియాన్ ఇంట్లో
సర్వమత మహాసభలో పాల్గొన్న వారిలో జాన్ పి. లియాన్ ఒకరు. ఈయన చికాగోలో ప్రముఖ వ్యక్తి. మహాసభలో పాల్గొనే ప్రతినిధులలో కొందరికి తన ఇంట్లో బస ఏర్పాటు చేయవచ్చునని కార్యనిర్వాహకులతో చెప్పాడు. ఈయన మతమౌఢ్యాన్ని ఆమూలాగ్రం నిరసిస్తాడు. సంకుచిత దృక్పథాలులేని విశాలహృదయులను మాత్రమే తన ఇంటికి పంపించమన్నాడు. కనుక స్వామీజీకి బస ఆయన ఇంట్లో ఏర్పాటు చేశారు.
మొదటి ఉపన్యాసం జరిగిన రాత్రి స్వామీజీ ఆయన ఇంటికి వెళ్లారు. తిన్నగా తమకు కేటాయించిన గదిలోకి వెళ్లిపోయారు. ఆయనే కాక ఆ ఇంట్లో మరికొందరు అతిథులు కూడా ఉన్నారు. తెల్లజాతి వారు తప్ప మరెవరూ వీరికి సుతరామూ నచ్చరు. కనుక లియాన్ సతీమణియైన ఎమిలీ, ప్రక్కనున్న హోటల్లో స్వామీజీకి బస ఏర్పాటు చేయవచ్చునని భర్తకు సూచించింది. లియాన్ సందిగ్ధంలో పడ్డాడు.
ఏం చేయాలో పాలుపోక తిన్నగా అతడు స్వామీజీ గదిలోకి వెళ్లాడు. ఆయనతో కాసేపు మాత్రమే మాట్లాడి ఉంటాడు. అతడి గందరగోళం మటు మాయమయింది. తిన్నగా భార్య దగ్గరకెళ్లి ఇలా చెప్పాడు: “ఇదిగో చూడు! ఈ భారతీయుడు ఇష్టమైనన్ని రోజులు ఇక్కడే బస చేస్తాడు. ఇటువంటి మేధావి ఇంతవరకు మన ఇంట్లో అతిథిగా ఉన్నది లేదు. తక్కిన అతిథులు అందరూ ఇల్లు విడిచి వెళ్లిపోయినా కలత చెందను.” కాస్తంత సంభాషణతోనే లియాన్‌ను స్వామీజీ అంతగా ప్రభావితం చేశారు.
రోజులు గడిచేకొద్దీ ఎమిలీ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకొని స్వామీజీ పట్ల అమిత ఆదరాభిమానాలతో మెలగింది. స్వామీజీ ‘అమ్మా’ అని సంబోధించిన కొందరిలో ఎమిలీ ఒకతె. ఉపన్యాసాలు చేయడానికి వెళ్లిన స్వామీజీ అక్కడ లభించిన పైకాన్ని చేతిరుమాలులో కట్టి తెచ్చేవారు; మొదట్లో ఆయన వద్ద ‘పర్సు’ లేదు. ఆ పైకాన్ని అట్లే ఎమిలీకి ఇచ్చేవారు. ఆ పైకాన్ని లెక్కించి ఆమె బ్యాంక్‌లో జమచేసేది.
ఎమిలీ, ఆమె కోడలూ సర్వమత మహాసభలో స్వామీజీ ఉపన్యాసాలు వినడానికి వెళ్లడం కద్దు. ఆ కోడలు యౌవనంలోనే భర్తను కోల్పోయింది. స్వామీజీ ఆమెను ఎంతో ఊరడించి, సాంత్వనపరచేవారు.*
తలపాగా విన్యాసం
లియాన్ మనుమరాలైన కార్నీలియా కాంకర్ అప్పుడు ఆరేళ్ల బాలిక. ఆమె పట్ల స్వామీజీ ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఆమెకు భారతదేశం గురించి ఎన్నో కథలు చెప్పేవారు. కోతులు, నెమళ్లు, మర్రిచెట్లు మొదలైన వాటి గురించి వారు చెప్పే కథలను ఆ బాలిక ఆయన ఒడిలో కూర్చుని ఆసక్తిగా వినేది. ఆమె పాఠ్యపుస్తకాల నుంచి ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగేవారు. పాఠ్యపుస్తకంలోని ప్రపంచపటంలో భారతదేశాన్ని చూపించేవారు. అప్పుడు కూడా ఆయన మనస్సు భారతదేశాన్ని గురించే యోచిస్తూ, “అమెరికాలోని పిల్లలకు చదువుకోవడానికి ఉన్న సౌకర్యాలు భారతదేశపు పిల్లలకు లేవు కదా” అని వ్యాకులత చెందారు.
స్వామీజీ తలపాగా కార్నీలియాకు ఎంతో విచిత్రంగా కనిపించింది. ప్రతిసారీ ధరించేటప్పుడు తలపాగాను ఆయన తలంతా చుట్టుకోవడం ఆమెకు వినోదంగా ఉండేది. దానిని చుట్టుకొనే విధానాన్ని పదే పదే చేసి చూపించమని ఆయనను వేధించేది. స్వామీజీ కూడా విసుగు చెందకుండా ఆమెకు ‘తలపాగా విన్యాసం’ చేసి చూపించేవారు.
కాని ఒక విషయం. స్వామీజీ ధ్యానమగ్నులై ఉన్నప్పుడు మాత్రం ఆ బాలిక వేధించదు. ఆ సమయంలో ఆయన తమకు తెలిసిన మామూలు స్వామీజీ కాదు, ఆ సమయంలో ఆయనను వేధించకూడదని ఆమెకు సహజంగానే తెలిసింది.
బాలబాలికల పట్ల స్వామీజీ సదా అనురాగంతో మెలగేవారు. వారు కూడా ఆయనతో సహజంగా కలసిపోయేవారు. స్వామీజీ ఒక నిర్దిష్ట సమయంలో ఒక ఉద్యానంలో కాసేపు కూర్చునేవారు. ఆ సమయంలో ఒక తల్లి తన బాలికతో అటు వైపుగా నిత్యం దుకాణానికి వెళ్లేది. స్వామీజీ కూర్చుని ఉండడం చూసి ఒక రోజు ఆయన వద్దకొచ్చి, “ఈ అమ్మాయిని మీ వద్ద వదలి వెళ్లనా? దుకాణం నుండి తిరిగి వస్తున్నప్పుడు తోడ్కొని వెళతాను” అని అడిగినందుకు స్వామీజీ ఆనందంగా అంగీకరించారు. తల్లి తిరిగి వచ్చేదాకా ఆ బాలికకు కథలు చెబుతూ, ఆడుకొంటూ ఆయన కాలం గడిపేవారు. ఇలా కొన్ని రోజులు జరిగింది.*
స్వామీజీని ఆకట్టుకొంది
ఒక రోజు స్వామీజీ ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఎమిలీ ఆయన సమీపంలో కూర్చునివుంది. ఆ ప్రగాఢ నిశ్శబ్దాన్ని భంగం చేస్తూ, “అమ్మా! మీ దేశంలో వీరిలా నన్ను మరెవరూ ఆకట్టుకోలేకపోయారు” అన్నారు. “అలా మిమ్మల్ని ఆకర్షించింది ఎవరు స్వామీజీ?” అని తమాషాగా అడిగిందామె. స్వామీజీ ఫక్కున నవ్వి, “ఆకర్షిం చింది స్త్రీ కాదు; సంస్థాగతంగా కార్యాచరణను నిర్వర్తించే అమెరికా వారి ప్రతిభ. నలుగురు కలసి ఇక్కడ పనిచేసే తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకొంది” అన్నారు.
తమాషాగా మాత్రమే కాకుండా, ఉద్దేశపూర్వకంగా కూడా, “మిమ్మల్ని ఆకట్టుకొన్నది ఎవరు?” అని ఎమిలీ అడిగింది. ఎందుకంటే స్వామీజీ తమ విజయంతో విశ్వవిఖ్యాతులయ్యారు కనుక; ఆయన వ్యక్తిత్వం పట్ల, వేషభాషల పట్ల ఆకర్షితులైన కొందరు మహిళలు ఆయన చుట్టూ గుమిగూడారు. బహుశా ఆ స్త్రీలలో ఎవరైనా ఆయనను తుచ్ఛభావనతో సమీపిస్తే, వారి బారి నుండి ఆయనను పరిరక్షించాలనే సదుద్దేశంతోనే అలా ప్రశ్నించింది. ఒక రోజు దానిని గురించి స్వామీజీతో చెప్పను కూడా చేప్పింది.
ఎమిలీ సదుద్దేశం స్వామీజీ హృదయాన్ని కదలించివేసింది. ఆప్యాయతతో ఆమె చేతులు పుచ్చుకొని, “అమెరికాదేశంలోని నా ప్రియతమ తల్లీ! నన్ను గురించి కలత చెందకండి. అనాథగా నేను వీథి ప్రక్కన మర్రిచెట్టు క్రింద పడుకొని నిద్రించాను, ప్రేమతో ఒక రైతు ఇచ్చిన జావ మాత్రమే త్రాగి జీవించాను. అదే విధంగా నేను మహారాజుల రాజప్రాసాదాలలో అతిథిగా ఉన్నాను కూడా, రాత్రంతా సేవకురాండ్రు నెమలిపింఛపు వీవనలతో విసురుతూంటే నిద్రించాను. ఆకర్షణ, వశీకరణమంటే ఏమిటో నాకు బాగా తెలుసు. నా గురించి కలత చెందకండి” అని వినమ్రతతో చెప్పారు.
కాలాంతరంలో ఆయన ఒంటరిగా ఇక్కడా అక్కడా ఎన్నో ఇళ్లలో బస చేయవలసి వచ్చింది. అప్పుడు ఇంటికి వెలుపల ఒక తపాలా పెట్టెను ఉంచేవారు. తపాలా బంట్రోతు ఉత్తరాలను దాన్లో వేసి పోయేవాడు. స్వామీజీ వచ్చాక అవి తీసి చదివేవారు. వాటిలో ధనవంతులైన, విద్యావంతులైన కొందరు యువతుల ఉత్తరాలు కూడా ఉండేవి. తమను వివాహం చేసుకోమని వారు ఆ ఉత్తరాలు వ్రాసేవారు. ఇటువంటి ఉత్తరాలకు స్వామీజీ జవాబే ఇచ్చేవారు కారు.
కొందరు తిన్నగా వచ్చి దీనిని గురించి మాట్లాడనారంభించేవారు. వారితో స్వామీజీ, “చూడండి, నేనొక సన్న్యాసిని. భారతదేశంలో సన్న్యాసులు వివాహం చేసుకోరు. వారికి స్త్రీ లందరూ తల్లితో లేదా సోదరీమణులతో సమానులు. కనుక వివాహం ప్రసక్తే లేదు” అని తెగేసి చెప్పేవారు. వారికి ఈ సమాధానం ఎంతో ఆశ్చర్యం కలిగించేది. అయినప్పటికీ స్వామీజీ అంతరంగాన్ని అవగతం చేసుకొని మౌనంగా తిరిగి వెళ్లిపోయేవారు.
వివాహం చేసుకోవడానికి స్వామీజీని ప్రత్యక్షంగా కలుసుకొన్న స్త్రీలు లేకపోలేదు. ఒకసారి ఒక శ్రీమంతురాలు, “స్వామీ! నాతోపాటు నా తరగనంత ఆస్తిని తమ పాదాక్రాంతం చేస్తాను” అంది. అందుకు స్వామీజీ, “ఇలా చూడండి, నేనొక సన్న్యాసిని. నాకు వివాహ మేమిటి! నాకు సంబంధించినంత వరకు స్త్రీలందరూ నాకు తల్లితో సమానం” అన్నారు.
“అమెరికన్ వనితలు ఎక్కువ భావోద్వేగం గలవారు. ప్రేమ పిచ్చి అధికం. అయితే నేనొక కామభావన లేని వింత పశువును. అందువలన నా పట్ల వారికి ఆ విధమైన భావనే రాదు. వారు నా పట్ల అధిక గౌరవం చూపిస్తారు. వారందరూ నన్ను ‘తండ్రి’ అని గాని, ‘సోదరా’ అని గాని సంబోధించేటట్లు చేస్తాను. ఇతర భావంతో వారిని నా దరి చేరనివ్వను. క్రమక్రమంగా వారినందరినీ దారిలోకి తీసుకువచ్చాను”* అని స్వామీజీ వ్రాశారు.
నేర్చుకొంటున్నారు
తనతో సాంగత్యం కలిగిన ప్రతి ఒక్కరితోను స్వామీజీ ఒక బిడ్డలా మెలగారు. వారు కూడా ఆయనను ప్రేమతో ఆరాధించారు. అమెరికా ఆచార వ్యవహారాలను స్వామీజీకి నేర్పించారు. స్వామీజీ కూడా ఎంతో ఆసక్తిగల విద్యార్థిలా వాటినన్నింటినీ నేర్చుకొన్నారు. మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పురుషులు ముందుగా వెళ్లాలా లేక స్త్రీలా లాంటి విషయాలు కూడా ఆయన అడిగి తెలుసుకొన్నారు.
ఎమిలీ ఒక స్త్రీల వైద్యశాల అధ్యక్షురాలు. స్వామీజీ ఎంతో ఆసక్తితో వెళ్లి ఆ వైద్యశాలను సందర్శించారు. అక్కడ శిశు మరణాల శాతం గురించి వివరాలు కూడా అడిగి తెలుసుకొన్నారు.
చికాగోలోని చిత్ర వస్తుప్రదర్శనశాలలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, కళామందిరాలు మొదలైన వాటిని ఆయన తిలకించారు. తద్ద్వారా పాశ్చాత్యుల జీవిత స్ఫూర్తిని అవగతం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఒక శ్రేష్ఠమైన కళాసృష్టిని, కళాత్మకమైన ఒక భవనాన్ని, అభివ్యక్తమయ్యే అద్భుత ప్రతిభ లాంటిది ఏదైనా ఆయన వెళుతున్న దారిలో చూడడం జరిగితే అట్లే ఆగిపోయి, చూసి, ఆస్వాదించి, దాన్లో లయించిపోయేవారు. భారతీయ జీవితంతో కలసిపోయి దాని లోతులను అవగతం చేసుకొన్నట్లుగా ఇక్కడ కూడా పాశ్చాత్య జీవితపు లోతులను ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నించారు.
పాశ్చాత్య సంగీతం
ఒక రోజు మధ్యాహ్నం ఎమిలీ, స్వామీజీని ఒక సంగీత కార్యక్రమానికి తోడ్కొని వెళ్లింది. స్వామీజీ ఎంతో శ్రద్ధగా పాటలు విన్నారు. కాని ఎందుకో తలను ఒక వైపుగా కాస్త వంచి, ముఖకవళికలలో అర్థంకాని వైఖరి ఉట్టిపడేటట్లు కూర్చున్నారు. కార్యక్రమం పూర్తికాగానే ఎమిలీ ఆయనతో, “సంగీతాన్ని ఆనందించారా?” అని అడిగింది. “మ్… ఆనందించాను” అన్నారు అర్ధాంగీకారంతో స్వామీజీ. “ఎందుకు, ఏమిటి సంగతి?” అని ఎమిలీ అడిగింది. అందుకు స్వామీజీ ఇలా అన్నారు: “రెండు విషయాలు నాకు అర్థం కాలేదు. మొదటిది వారి ప్రకటన. ‘ఇదే కార్యక్రమం రేపు సాయంత్రం కూడా జరుగుతుంది’ అన్నారు. మధ్యాహ్నపు పాటలను ఎలా సాయంత్రం వినగలం? భారతదేశంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అంటూ ప్రతి వేళకు ప్రత్యేక రాగాలు ఉన్నాయి. ప్రతి రాగానికీ భిన్నమైన గుణాలున్నాయి. ప్రతి ఒక్కటీ విలక్షణమైనది. మధ్యాహ్న రాగాన్ని సాయంత్రం విని ఆనందించలేం. మరొకటి: ఈ సంగీతంలో అంతరం చాలా ఉన్నట్లు తోస్తున్నది. కనుక మాధుర్యం తగ్గినట్లుగా అనిపిస్తున్నది. రంధ్రాలతో కూడిన జున్నును (swiss cheese) ఉదయం తినడానికి నాకు ఇచ్చారు కదా, దానిలా ఉంది ఈ సంగీతం.”
అదే సమయంలో పాశ్చాత్య సంగీతపు గొప్పతనాన్ని కూడా స్వామీజీ గ్రహించకపోలేదు. తమ మిత్రుడైన ప్రియనాథ్ సిన్హాతో ముచ్చటిస్తున్నప్పుడు, “దానిలో సమ్మేళనపు పరిపూర్ణత ఉంది. అది మనకు ఇంకా రాలేదు. అలవడని మన చెవులకు అది శ్రావ్యంగా ఉండదు. గాయకులు నక్కలలా ఊళలు పెడుతున్నారనుకొంటాం. నాకు కూడా మొదట్లో అటువంటి అభిప్రాయమే ఉండేది. కాని ఆ సంగీతాన్ని శ్రద్ధగా విని, సూక్ష్మదృష్టితో పరిశీలించిన తరువాత దానిని అంతకంతకు అర్థం చేసుకొని దాని మహత్త్వంలో పరవశుణ్ణైపోయాను. ప్రతి కళ విషయంలోను అంతే. ఉన్నత స్థాయిలో చిత్రించిన చిత్రపటాన్ని హఠాత్తుగా చూసినప్పుడు దాన్లో సౌందర్యం ఎక్కడవుందో గ్రహించలేం. అంతే కాకుండా కన్ను సుశిక్షితం కాకపోతే, ఆ చిత్రంలోని సునిశితమైన మెరుగులు, రంగుల కలయికలు, ఆ కళాఖండంలోని ఆంతరిక ప్రతిభను గ్రహించలేం”* అన్నారు.
విజ్ఞానవేత్తలతో
ఈ సమయంలోనే ప్రపంచంలోని మహామేధావులు కొందరు ప్రపంచ ప్రదర్శన తిలకించడానికి వచ్చారు. వారిలో పలువురు చింతనాశీలురతోను, విజ్ఞానవేత్తలతోను స్వామీజీకి పరిచయం కలిగింది. సర్వమత మహాసభకు మునుపు చికాగోలో ఆగస్టు 21 నుండి 25 వరకు విద్యుచ్ఛక్తి గురించి జరిగిన సదస్సులో పాల్గొనడానికి వచ్చిన విజ్ఞాన వేత్తకు స్వామీజీ పరిచయం చేయబడ్డారు. విద్యుత్ సాధనాన్ని కనుగొన్న ప్రొఫెసర్ ఎలిషాగ్రే, ఆయన భార్య తమ ఇంట్లో ఈ సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. చికాగో నుండి దాదాపు 90 మైళ్ల దూరంలోని వెర్మిలన్ నదీతీరంలో స్ట్రీటర్ అనే ఊళ్లో వారు నివసిస్తున్నారు. ఈ సదస్సులో సుప్రసిద్ధ భౌతికశాస్త్రవేత్తలయిన లార్డ్ కెల్విన్, ప్రొఫెసర్ హెర్మన్ వాన్ హల్మ్హోల్డ్జ్ కూడా పాల్గొన్నారు. విద్యుచ్ఛక్తిని గురించి స్వామీజీకున్న అవగాహన చూసి ఆ విజ్ఞానవేత్తలు విస్తుబోయారు.
రాబర్ట్ ఇంగర్సాల్తో
సుప్రసిద్ధ అజ్ఞేయవాదీ (agnost), వక్తా అయిన రాబర్ట్ ఇంగర్సాల్ను స్వామీజీ చికాగోలో కలుసుకొన్నారు. ఆయన కూడా స్వామీజీచే ఆకట్టుకోబడ్డాడు. స్వామీజీ ఆయనతో పలుమార్లు మత, తాత్త్విక విషయాలను గురించి చర్చించారు. స్వామీజీ తెగింపూ, దాపరికం లేకుండా మాట్లాడే ధోరణి ఆయనను ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. ఒకసారి ఆయన స్వామీజీతో తిన్నగా, “స్వామీజీ! నూతన భావాలను వెలిబుచ్చుతున్నప్పుడూ, అమెరికా సామాజిక ఆచార వ్యవహారాలనూ ప్రజలనూ విమర్శిస్తున్నప్పుడూ కాస్త జాగ్రత్త వహించండి” అని సుతిమెత్తగా హెచ్చరించారు. “ఎందుకు?” అని స్వామీజీ అడిగారు. అందుకు ఇంగర్సాల్, “మీరు ఒక మత బోధకునిగా యాభై సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చివుంటే మిమ్మల్ని ఉరి తీసేవారు లేదా సజీవంగా తగులబెట్టేవారు. ఇంకా కొంతకాలం ముందే వచ్చి ఉంటే రాళ్లు రువ్వి మిమ్మల్ని వెళ్లగొట్టి ఉండేవారు” అన్నాడు. స్వామీజీ బిత్తరబోయారు; అమెరికాలో ఇంతటి మతమౌఢ్యమూ, సంకుచిత మనస్తత్త్వమూ ఉండివుంటాయని ఆయన నమ్మలేకపోయారు.
స్వామీజీ, ఇంగర్సాల్ పలుమార్లు తమ భావనలను పరస్పరం వ్యక్తంచేసుకొన్నప్పటికీ సిద్ధాంతపరంగా వారు భిన్నమైనవారు. ఇంగర్సాల్ మతాల పట్ల నమ్మకంలేని వ్యక్తి; భగవంతుని ఉనికిని సందేహిస్తాడు. స్వామీజీ సనాతన హిందూమతానికి చెందినవారు, ఇతర మతాలు కూడా సత్యమేనని అంగీకరించే వ్యక్తి; జీవితాన్నే భగవదాయత్తంచేసి జీవిస్తున్నారు.
ఒక రోజు ఇంగర్సాల్ స్వామీజీతో ఇలా అన్నారు: “ప్రపంచాన్ని అనుభ వించాలి, ప్రపంచం నుండి ఎంత పొందగలమో అంతటినీ పొందితీరాలి. కమలా ఫలాన్ని ఆసాంతం పిండినట్లు, చివరి బొట్టు దాకా ప్రపంచాన్ని అనుభవించాలి. ఎందుకంటే మనకు రూఢిగా తెలిసింది ఈ జీవితం ఒక్కటి మాత్రమే. మళ్లీ మరొక జీవితం ఉందో లేదో ఎవరి కెరుక!” అందుకు స్వామీజీ ఇలా బదులు చెప్పారు:
“నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. నా వద్ద కూడా ఒక పండు ఉంది. దానిని పూర్తిగా పిండుకోవడమే నా కోర్కె కూడా. మనకున్న తేడా పండ్లలోనే. మీరు కోరేది కమలాఫలం. నాకు ఇష్టమైనది మామిడి. ఈ లోకంలో జీవించి, కడుపార తిని, త్రాగి, కొంచెం భౌతికశాస్త్రజ్ఞానం సముపార్జిస్తే చాలని మీ భావం. కాని ఆ భావం అందరికీ రుచిస్తుందనడానికి మీకు ఏం అధికారం ఉంది? నా కది ఏమాత్రం గిట్టదు. పండు భూమ్మీద ఎలా పడుతుందో, విద్యుత్తరంగం నా నరాలను ఎలా చలింపజేస్తుందో – ఇటువంటి వాటిని తెలుసుకోవడమే నా పని అయితే, నేను ఆత్మహత్య చేసుకొంటాను. వస్తు హృదయాంతరాళాన్ని, వస్తు మూలతత్త్వాన్ని గ్రహించాలని నా అభిలాష. మీరు గ్రహించగోరేది జీవం యొక్క వ్యక్తరూపాలను, నేను గ్రహించాలనుకొంటున్నది జీవాన్నే.”
కాసేపు మౌనం వహించి మళ్లీ స్వామీజీ ఇలా అన్నారు: “ప్రపంచమైన కమలాఫలాన్ని ఆసాంతం రసం పిండాలన్నారు. అది కూడా నాకు అంగీకారమే. దానికి సైతం మీ మార్గం కన్నా శ్రేష్ఠమైన మార్గం నాకు తెలుసు. ఆ మార్గంలో నాకు ఎంతో ఎక్కువ రసం లభిస్తుంది. నాకు మరణం లేదని తెలుసు. కనుక నేను తొందరపడను. మరణ భయం లేనందున నెమ్మదిగా రసం పిండుతాను. నాకు కర్తవ్యాలు లేవు. భార్య, పిల్లలు, ఆస్తి, సుఖం లాంటి బంధాలు ఏవీ లేవు.అందువల్ల స్త్రీలు, పురుషులు అనే తారతమ్యం లేకుండా అందరినీ నేను ప్రేమించగలను. ఆహా! మనిషిని భగవంతునిగా పరిగణించి ప్రేమించడం లోని ఆ ఆనందాన్ని ఊహించి చూడండి! ఈ మార్గంలో కమలాఫలాన్ని పిండి చూడండి, లక్షరెట్లు ఎక్కువ రసం లభిస్తుంది. ఈ విధానంలో ఆఖరి బొట్టు దాకా మీకు లభ్యమవుతుంది.”
ఎమ్మా కాల్వే
స్వామీజీ పరిచయ భాగ్యం పొంది, తమ జీవితాలను సార్థకం చేసుకొన్న వ్యక్తులలో ఒకరు ఎమ్మా కాల్వే. ఆమె అప్పుడు కీర్తి శిఖరాగ్రాన్ని అధిరోహించిన ఒక ‘ఒపేరా’ గాయని. ఫ్రాన్సు దేశస్థురాలైన ఆమె అక్కడా, ఇంగ్లండులోనూ సుప్రసిద్ధ గాయనిగా విరాజిల్లుతున్నది.
కీర్తి శిఖరాగ్రాన్ని అధిరోహించిన వ్యక్తుల జీవితాలు శోకపూరితమై ఉండడం సత్యదూరం కాదు. కాల్వే ఇందుకు మినహాయింపు కాదు. “శోకాన్ని అణచుకొని ఇతరుల కోసం పాడతాను” అని ఆమె ఒకసారి చెప్పింది. అంతటి దుఃఖంలోనూ, శోకంలోనూ ఆమెకున్న సాంత్వన ఆమె ఏకైక కుమార్తె. కాని విధి వికటాట్టహాసంలో ఒక రోజు హఠాత్తుగా ఆ బాలిక అగ్నికి ఆహుతి అయి పోయింది. రంగస్థలం మీద గానం చేస్తున్న కాల్వే ఈ విషాద వార్త వినీవినగానే మూర్ఛపోయింది. అటు తరువాత ఆమె జీవితానికి ఎలాంటి ఆలంబనా లేకుండా పోయింది. పలుమార్లు ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది.
ఆఖరికి ఒక రోజు సమీపంలోని ఒక ఏటిలో దూకి ఆత్మహత్య చేసుకో వాలని ఇంట్లో నుండి బయలుదేరింది. కాని ఏదో సమ్మోహనశక్తికి లోనైనట్లు ఆమె ప్రమేయం లేకుండానే కాళ్లు ఒక స్నేహితురాలి ఇంటికి ఆమెను ఈడ్చుకు పోయాయి. ఈ విధంగా పలుమార్లు జరిగింది – ఏటి వైపు వెళ్లడమూ చివరికి స్నేహితురాలి ఇంటిని చేరడమూ పరిపాటి.
ఆశ్చర్యం అది కాదు; ఆ స్నేహితురాలి ఇంట్లోనే స్వామీజీ బస చేసి ఉన్నారు–అదే ఆశ్చర్యం! ఈ రీతిలో స్వామీజీ దివ్యసమక్షంలోకి ఎమ్మా కాల్వే వచ్చిచేరింది.
“స్వామీజీ మాట్లాడడానికి ముందుగా నువ్వు నోరు విప్పకూడదు” అని ఆమెకు చెప్పారు. ఆమె గదిలోకి వెళ్లినప్పుడు స్వామీజీ ధ్యానమగ్నులై ఉన్నారు. కమలాపండు రంగు దుస్తులు ధరించి ఉన్నారు. దృష్టి నేలవైపు సారించి ఉన్నారు. కొన్ని క్షణాలు దొర్లిపోయాయి. హఠాత్తుగా ఆయన తల పైకెత్తకుండానే మాట్లాడసాగారు.
స్వామీజీ : అమ్మాయీ! ఎంతటి సంకట పరిస్థితిలో ఉన్నావు! ప్రశాంతంగా ఉండు. అది ఎంతో ఆవశ్యకం.
కాల్వే పేరు సైతం ఎరుగని స్వామీజీ ఇలా చెప్పి, ఆమెను గురించీ, ఆమె సమస్యల గురించీ, కలతలను గురించీ చెప్పనారంభించారు. కాల్వే అతి సన్నిహిత స్నేహితులకు సైతం ఆ వివరాలు తెలియవు.
కాల్వే : ఇవన్నీ మీకు ఎలా తెలుసు? నా గురించి ఇంతకు మునుపే ఎవరైనా మీకు చెప్పారా?
చిరుదరహాసం ముఖారవిందాన విలసిల్లగా స్వామీజీ తలెత్తి చూశారు. మూర్ఖంగా ప్రశ్నించే ఒక చిన్నపిల్లను చూస్తున్నట్లుగా ఉందా చూపు.
స్వామీజీ : ఎవరూ చెప్పలేదు. అది అవసరమనుకొంటున్నావా? అమ్మాయీ, నువ్వు నాకొక తెరచిన పుస్తకం లాంటి దానివి. అంతా మరచిపో. ఉత్సాహంగా ఉండు, సంతోషంగా ఉండు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. ఏకాంతంలో కూర్చుని నీ క్లేశాలను గురించి అదేపనిగా ఆలోచిస్తూ ఉద్వేగం చెందకు. నీ ఉద్వేగాలను ఏదో ఒక బాహ్యవిషయం వైపుగా మళ్లించు. నీ ఆధ్యాత్మికతకు అది ఎంతో అవసరం. నీ కళకు కూడా అత్యవసరం.
ఈ సమావేశం కాల్వే జీవితంలో ఒక నూతనోధ్యాయాన్ని తెరచింది. ఆమె మనస్సును పీడిస్తున్న గందరగోళాలూ, సందేహాలూ, సమస్యలూ పటాపంచ లయ్యాయి. ఆమె జీవితం మళ్లీ నూతనోత్సాహంతో ప్రారంభమయింది. ఆమె తన కళాత్మక జీవితాన్ని యథాప్రకారం కొనసాగించింది. “ఆమె మహోన్నతమైన మహిళారత్నం. ఆకాశం ఎత్తుకు ఎదిగిన దేవదారు చెట్టు తుపానును ప్రతిఘటించి పోరాడడం మహత్తర దృశ్యం కాదా?” అని కాల్వే గురించి కాలాంతరంలో స్వామీజీ వ్రాశారు. “స్వామీజీ ఎలాంటి కనికట్టు, సమ్మోహనశక్తి ఉపయోగించ లేదు. అలా అయితే నా జీవితంలో ఇంతటి మార్పును తీసుకువచ్చిన ఆ శక్తి ఏమిటి? అది ఆయన సత్ప్రవర్తనాశక్తి, మానసిక పవిత్రత, దృఢచిత్తం” అని కాల్వే వ్రాసింది.
అమరత్వ స్థితి అంటే ఏమిటి?
ఒక రోజు స్వామీజీ కాల్వేతో మాట్లాడుతున్నప్పుడు అమరత్వ స్థితిని గురించి ప్రస్తావించారు; ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి విశ్వభావనలో ఐక్యమయ్యే స్థితి అది అని వివరించారు. “అయ్యో!” అంటూ చలించి పోయి అరిచింది కాల్వే; “స్వామీజీ! ఆ స్థితి నాకు వద్దు. నాకు నా వ్యక్తిత్వం కావాలి. నేనొక ప్రత్యేక వ్యక్తిని అనే స్థితిలోనే సదా ఉండిపోవాలి. ఎటువంటి సాధారణమైన స్థితి అయినప్పటికీ నాకు ఇది చాలు. నాకు విశ్వభావన వద్దు. అపరిమిత ఐక్యస్థితి కూడా వద్దు. వీటిని గురించి వినడానికే నాకు భయంగా ఉంది” అంది కాల్వే.
ఒక బిడ్డను సముదాయించే ధోరణిలో కాల్వేకు నిజం అర్థమయ్యేలా చెప్పారు. “ఇలా చూడమ్మా! ఒక రోజు వర్షపుచినుకు ఒకటి సముద్రంలో పడింది. విస్తృతించిన సముద్రంలో తను ఒంటరిగా ఉండడం చూసి నీలాగే భీతి చెందివిలపించనారంభించింది. అది చూసి సముద్రం నవ్వింది. పిదప ఆ వర్షపు చినుకుతో, “నువ్వెందుకు ఏడుస్తున్నావు?” అని అడిగింది. “ఎక్కడ నేను లేకుండా పోతానోనని భయంగా ఉంది” అంది వర్షపుచినుకు. బిగ్గరగా సముద్రం నవ్వింది. తరువాత మృదువుగా ఆ వర్షపుచినుకుతో ఇలా అంది: “నీ భయానికి కారణమేమిటో నాకు అర్థం కాలేదు. నువ్వు, నీలాంటి అసంఖ్యాకమైన నీ తోటి వర్షపుచినుకుల కలయికయే నేను. కనుక నువ్వు నాలో చేరినప్పుడు నిజానికి నీ తోటి వారితో చేరుతున్నావన్నమాట. చినుకుగా ఉన్న నువ్వు సముద్రంగా మారుతున్నావు. సముద్రంగా ఉంటూ సత్ఫలాన్ని ఇవ్వడమేకాదు; నువ్వు తలచుకొంటే ఏదో ఒక రోజున ఒక సూర్యకిరణం సహాయంతో పైకి వెళ్లి, మళ్లీ వర్షపుచినుకువై భూమ్మీదపడి దప్పికగొన్న ప్రపంచపు దాహాన్ని తీరుస్తావు; ప్రాణికోటికే ఒక వరప్రసాదమవుతావు.” అదేవిధంగా వ్యక్తిత్వాన్ని కోల్పోవడమన్నది నిజానికి గొప్ప వ్యక్తిత్వాన్ని పొందడమని ఆమెకు అవగతం చేశారు స్వామీజీ.
రాక్ఫెల్లర్తో
చికాగోలో స్వామీజీ కలుసుకొన్న మరొక ప్రముఖుడు, తదనంతర కాలంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నులలో ఒకరైన రాక్ఫెల్లర్. ఆనాడు ఆయన అంత సుప్రసిద్ధుడు కాడు. స్వామీజీని గురించి ఆయన పలువురు మిత్రులద్వారా విన్నాడు. కాని ఎందుకో స్వామీజీని కలుసు కోవడానికి సంకోచించాడు. పలుచోట్ల బసచేస్తూ ఉపన్యాసాలు చేస్తూన్న స్వామీజీ ఒక సందర్భంలో రాక్ఫెల్లర్ మిత్రుని ఇంట్లో బసచేయడం తటస్థించింది. అప్పుడు స్వామీజీని కలుసుకోవాలన్న ప్రేరణ ఒక రోజు హఠాత్తుగా రాక్ఫెల్లర్లో జనించింది. ఆ ఉద్వేగంతో సరాసరి స్వామీజీ బసచేసిన మిత్రుడి ఇంటికి వెళ్లాడు. తలుపులు తెరచిన పనిమనిషిని ప్రక్కకు త్రోసి, అనుమతి లేకుండా తిన్నగా స్వామీజీ గదిలోకి వెళ్లాడు.
స్వామీజీ అప్పుడు ఏదో వ్రాసుకొంటూ కూర్చుని ఉన్నారు. ఇంత వేగంగా రాక్ఫెల్లర్ వచ్చినప్పటికీ స్వామీజీ కనీసం ముఖం పైకెత్తి వచ్చిందెవరో కూడా చూడలేదు. కాసేపు గడచింది. కాల్వే వెళ్లిన రోజు జరిగినట్లే ఆ రోజూ జరిగింది. తల దించిన స్థితిలోనే స్వామీజీ హఠాత్తుగా రాక్ఫెల్లర్ జీవితం గురించి, ఆతడికి తప్ప మరెవరికీ తెలియని ఆతడి గతం గురించి చెప్పసాగారు. చివరికి, “మీరు కూడబెట్టిన ధనం నిజానికి మీకు చెందింది కాదు. లోకహితార్థం భగవంతుడు మీ వద్ద ఆ ధనాన్ని దాచి ఉంటాడు, అంతే. కనుక ఆ ధనంతో లోకులకు మంచి చేయండి” అన్నారు.
స్వామీజీ మాటలు రాక్ఫెల్లర్కు రుచించలేదు. తాను ఏం చేయాలో ఇతరులతో చెప్పించుకోవడం అతడికి సుతరామూ నచ్చదు. దాంతో సభ్యత కోసమైనా నమస్కారం కూడా చెప్పకుండా వేగంగా గదిలో నుండి వెళ్లిపోయాడు. కాని స్వామీజీ వ్యక్తిత్వపు పరిధిలోకి వచ్చిన వ్యక్తి ఆయన ఆకర్షణను తప్పించుకో గలడా? రాక్ఫెల్లర్ మీదా స్వామీజీ శక్తి పనిచేసింది.
ఒక వారం గడచింది. ఒక ప్రజాసంస్థకు అతిపెద్ద మొత్తం విరాళంగా ఇవ్వడానికి రాక్ఫెల్లర్ నిశ్చయించాడు. దానికైన ప్రణాళికా వివరాలు పొందుపరచిన కాగితం పుచ్చుకొని మునుపులాగే అదే వేగంతో స్వామీజీ వద్దకు వచ్చాడు. క్రితంసారి లాగే అనుమతి లేకుండా ఆయన గదిలోకి వెళ్లాడు. ఆ రోజు కూడా స్వామీజీ ఏదో చదువుకొంటున్నారు. తాను తెచ్చిన కాగితాన్ని రాక్ఫెల్లర్ ఆయన ముందు పడేసి, “ఇదిగో, దీనిని చదవండి. మీరు నాకు కృతజ్ఞత చెప్పాల్సి ఉంటుంది” అన్నాడు.
స్వామీజీలో ఎలాంటి స్పందనా కనిపించలేదు, తలెత్తి కూడా రాక్‌ఫెల్లర్‌ను చూడలేదు. ప్రశాంతంగా అంతా చదివారు. చదివాక, “కృతజ్ఞతలు చెప్పవలసింది నేను కాదు, మీరే” అన్నారు. ప్రజాసంక్షేమానికి రాక్ఫెల్లర్ తన జీవితంలో ఇచ్చిన అతి పెద్ద విరాళం అదే!
భగవంతుడు దారి చూపుతున్నాడు
సర్వమత మహాసభానంతరం స్వామీజీ దాదాపు రెండు నెలలు చికాగోలోనే గడిపారు. ఈ కాలంలో ఆయన హిందూమతం, అద్వైతం, పునర్జన్మ, కులం, వర్ణాశ్రమం, హైందవ సమాజ ఆచారవ్యవహారాలు, నిస్వార్థాలను గురించి హిందూమత భావన లాంటి పలు అంశాలపై ఉపన్యాసాలు చేశారు. ఆ సమయంలో ఆయన ఇళ్లు, హోటళ్లలో బస చేయవలసి వచ్చింది. “నా కేది సంభవించినా అది భగవంతుడే ప్రసాదిస్తున్నాడనుకొని తదనుగుణంగా జీవితాన్ని గడపుకొంటున్నాను. అమెరికాకు వచ్చిన మొదట్లో నీరు విడిచిన చేపలా ఉన్నాను. భగవదేచ్ఛను అనుసరింపక, నాపై నేను ఆధారపడి ఉంటానేమోనని భయపడ్డాను. అది ఎంత ఘోరమైన దుశ్చేష్ట, అది ఎంత కృతఘ్నత. ఏ పరమపురుషుడు నేను హిమశిఖరాలలో, మండుతున్న భారతదేశ మైదానాలలో తిరుగుతున్నప్పుడు, కనిపెట్టివున్నాడో, ఆయన ఇక్కడ సైతం నన్ను కనిపెట్టి నడిపిస్తున్నాడని నేను స్పష్టంగా గుర్తిస్తున్నాను. ఉత్తమోత్తముడైన ఆయనకు జయమగుగాక! క్రమక్రమంగా నేను నా పాతపద్ధతుల్లోకి వచ్చాను. ఎవరో ఒకరు నాకు ఆశ్రయమిచ్చి ఆహార మిస్తున్నారు. ఎవరో ఒకరు నా వద్దకొచ్చి భగవంతుని గూర్చి ప్రసంగించమని కోరుతున్నారు. వారిని భగవంతుడు పంపుతున్నాడనీ, ఆయన ఆజ్ఞను పాటించడమే నా కర్తవ్యమనీ నాకు తెలుసు. నా అవసరాలనన్నింటినీ ఆయనే చూసుకొంటు న్నాడు. ఆయన ఆజ్ఞే నెరవేరుగాక!”* అని స్వామీజీ వ్రాస్తున్నారు.
అత్యున్నత స్థితులలో
ఎడతెగని ఉపన్యాసాలు, తరగతులు, ప్రశ్నోత్తరాలు, ప్రయాణాలతో స్వామీజీ జీవితం ఎంత హడావిడిగా సాగిందో, అంతగా ఆయన మనస్సు ఉన్నత స్థితులలో నెలకొంటూ వచ్చింది. ఆయన ఎక్కడ బసచేసినప్పటికీ, ఏ పనిలో నిమగ్నులై ఉన్నప్పటికీ భగవద్ధ్యాసలోనే విరాజిల్లారు.
నేను నీ పక్కనే ఉన్నాను
అనే నీ తియ్యని పలుకులు
నాకు వినిపిస్తాయి
వెంటనే గుండె దిటవు పడుతుంది
నువ్వు నాతో ఉంటే
వెయ్యి మృత్యువులు కూడా
నన్ను భయపెట్టలేవు.
నువ్వు పసిబిడ్డలు కనురెప్పలు మూసే
తల్లి జోలపాట పాడుతావు
అమాయక బిడ్డల ఆటపాటల్లో
నువ్వు వారి ప్రక్కలో నిలబడి ఉండడం
నేను చూస్తాను.
పవిత్రస్నేహం
చేతులు కలిపేటప్పుడు
వారి మధ్య నిలిచేది అతడే
అమ్మ ముద్దుల్లో అమృతం నింపేది అతడే
‘అమ్మా’ అనే బిడ్డల మాటల్లోని మాధుర్యం కూడా అతడే
ప్రాచీన ప్రవక్తలు పూజించింది
నా దేవుడవైన నిన్నే
మతాలన్నీ పుట్టింది
నీ నుండే
వేదాలు, బైబిల్, ఖురాను
ముక్తకంఠంతో పాడేది
నిన్నే.
ప్రచండ జీవన ప్రవాహంలో
అన్ని అంతరాత్మల ఆత్మవు
నువ్వే! నువ్వే.
ఓం తత్ సత్ ఓం
నువ్వు నా దేవుడివి
ప్రియతమా!
నేను నీ వాణ్ణి, నీ వాణ్ణి.*
–స్వామీజీ చెంత సదా సర్వవేళలా భగవంతుడున్నాడు; ఆయనే దారి చూపుతున్నాడని ఈ కవితలో చూడవచ్చు.
ప్రొఫెసర్ రైట్‌కు వ్రాసిన ఉత్తరంలో స్వామీజీ రైట్ పిల్లలకు ఇలా వ్రాశారు: “ఆత్మీయులారా! మీ తల్లికన్నా, తండ్రికన్నా ఆయన (భగవంతుడు) మీకు అత్యంత సన్నిహితుడు. మీరు అమాయకులు, పుష్పాల్లా పవిత్రులు. మీరు ఆ విధంగానే ఉండండి. మీకు ఆయన కనిపిస్తాడు. ప్రియమైన ఆస్టిన్! నువ్వు ఆడుకొంటు న్నప్పుడు నీతో కూడా ఆడడానికి మరొక ఆటగాడున్నాడు. నిన్ను ప్రేమించే ఇతరుల కన్నా నిన్ను ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఓహో! ఆయన ఎంతో సరదాగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ ఆటలాడుతుంటాడు–ఒక్కొక్కప్పుడు మనం సూర్యుడు, చంద్రుడు అని చెప్పుకొనే పెద్ద బంతులతో ఆడుతుంటాడు. ఒక్కొక్కప్పుడు మీ లాంటి పిల్లలతో నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆడుకొంటాడు. ఆయనను చూసి, ఆయనతో ఆడితే ఎంత బాగుంటుందో! ప్రేమాస్పదా! ఈ విషయం గూర్చి యోచించు.”*
శ్రీరామకృష్ణుల నిరోధం
భగవంతుడు తన వెంటే ఉన్నాడని అవగతం చేసుకోవడం మాత్రమే కాదు; భగవద్ధ్యాసలో మైమరచి, ఆధ్యాత్మిక అత్యున్నత స్థితులను స్వామీజీ అనుభూతం చేసుకోసాగారు. విశ్రాంతీ విరామమూ లేని కార్యాచరణ మధ్య రోజులను గడపసాగారు. బాహ్యప్రపంచం కూడా ఆయన భగవన్మయమైన ఆంతరిక జీవితానికి ఏ విధంగానూ అడ్డుపడ లేదు. కొన్ని సమయాల్లో ట్రామ్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఆయన ధ్యానమగ్నులయ్యేవారు. ఆయన దిగవలసిన చోటును ట్రామ్ పలుమార్లు చుట్టివచ్చినప్పటికీ ఆయనకు ఆ ధ్యాసే లేకుండా ధ్యానంలో లయించి ఉండేవారు. చివరికి ఎక్కువ దూరం ప్రయాణం చేసినందున అదనంగా ఎక్కువ పైకం చెల్లించి క్రిందికి దిగేవారు. ఇటువంటి పరిస్థితి సుతరామూ నచ్చనప్పటికీ ఆయన నిస్సహాయుడు. భారతదేశమైనా, అమెరికా అయినా గురుదేవులు పేర్కొన్నట్లు ‘ధ్యానసిద్ధుడు’ ధ్యానసిద్ధుడుగానే విరాజిల్లాడు!
ఒకరోజు స్వామీజీ మిచిగన్ సరోవర తీరంలో నిలబడివున్నారు. సహజం గానే ఉన్నత స్థితులలో లయించే మనస్సు ఆ ప్రకృతి సౌందర్యం తిలకించడంతోనే తటాలున అంతర్ముఖమవుతుంది. అట్లే ఆ రోజు కూడా స్వామీజీకి జరిగింది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో ఒక రోజు ఆయనను స్పృశించినప్పుడు జరిగిందే ఇక్కడా జరిగింది. చెట్లు, సూర్యుడు, ఇళ్లు, ఆయన నిలబడివున్న సరోవరంతో సహా సమస్తం గిరగిరా తిరిగిపోతూ, ఎగిరిపోతూ అణువులుగా పగిలిపోయి, చెల్లా చెదరై ఎక్కడో మాయమయ్యాయి. అంతా కరగిపోయి ఆయన నిర్వికల్పసమాధిలో లయింపనున్నారు. ఆ క్షణంలో హఠాత్తుగా అక్కడ శ్రీరామకృష్ణులు ప్రత్యక్షమైనారు. స్వామీజీని తాకి, “నరేన్, నీ పని ఇంకా ఉంది” అని చెప్పి ఆయనను ఆ పరాకాష్ఠ స్థితిలో లయించి పోకుండా బాహ్యచైతన్యానికి తీసుకువచ్చారు.
‘జోనాలా బయటకు వచ్చాను!’
స్వామీజీ ఉపన్యాసాలకు ప్రతిచోటా చక్కని ఆదరణ లభించింది. విశాల దృక్పథం గల యూనిటేరియన్లు ఆయనను ఎంతో ఇష్టపడి ఆహ్వానించారు. యూనిటేరియన్ క్రైస్తవ ఫాదరీలు ఆయనను తమ చర్చ్‌కి ఆహ్వానించడంతోపాటు, ఉపన్యాసం చేయమని విజ్ఞప్తి చేశారు.
కాని స్వామీజీ వ్యక్తం చేసిన భావనలు అంత సులభంగా అంగీకరించేవి కావు కదా! కాలాలపర్యంతం భారతదేశం గురించి తాము విన్న అభిప్రాయాలన్నీ ఏకపక్షమైనవి, అందునా అనేకమైనవి పూర్తిగా తప్పులతడక అని ఒకరు వచిస్తే ఠక్కున వారు ఎలా అంగీకరిస్తారు? కాని వచిస్తున్నది సాధారణమైన వ్యక్తి కాడు. భగవదాదేశం పొంది బోధింప అరుదెంచిన వ్యక్తి. కనుక వారు స్వామీజీ భావనలను నమ్మలేకుండానూ ఉండలేకపోయారు. అందువల్ల ప్రశ్నల వర్షం కురిపించారు. స్వామీజీ కూడా అందుకు దీటుగా జవాబు లిచ్చారు. నిజాన్ని ధైర్యంగా నొక్కివక్కాణించే తెగింపు ఆయనకు ఉంది. కొన్ని సమయాల్లో తిన్నగా జవాబు చెప్పారు, కొన్ని సమయాల్లో ఫిరంగి గుండులా పేలారు, కొన్ని సమయాల్లో సరదాగా జవాబులిచ్చారు.
ఇలాగే ఒకసారి ఆయన మినియాపోలిస్‌లో మాట్లాడుతున్నారు. అప్పుడు సభలో నుండి ఒక వ్యక్తి లేచినిలబడి, “అవును స్వామీజీ, మీ దేశంలో తల్లులు తమ పిల్లలను మొసలి నోట్లోకి విసిరివేస్తారట కాదా!” అని అడిగాడు. పరిహాస ధోరణిలో నవ్వుతూ, “అవును, నిజమే. నన్ను కూడా అట్లే విసిరివేశారు. అయినా నేను మీ జోనాలా* మొసలి నోటి నుండి తప్పించుకొని వచ్చేశాను” అన్నారు స్వామీజీ. శ్రోతలు గొల్లున నవ్వారు.
నిజం చెప్పడానికి తెగింపు ఉండాలి. అందువలన కలిగే పర్యవసానాలను ఎదుర్కోవడానికి చెక్కుచెదరని మనస్సు ఉండాలి. అటువంటి తెగింపూ, మనస్సూ నిజం నుండి మాత్రమే వస్తాయి. అంటే చెప్పే వ్యక్తి సత్యనిష్ఠుడై ఉండితీరాలన్న మాట.
తుపాకీ తూటాల వర్షంలో
ఒకసారి స్వామీజీ భగవదనుభూతిని గురించి ప్రసంగించారు. భగవత్సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఎటువంటి పరిస్థితిలోనూ కలత చెందడు, ఆందోళన చెందడు అని చెప్పారు. శ్రోతలలో విద్యావంతులైన కొందరు యువకులు కూడా ఉన్నారు. కాని వారు అదుపులేకుండా జీవితాలు గడుపుతున్నారు. స్వామీజీ వచనాలను పరీక్షించి చూడాలని వారు నిర్ణయించుకున్నారు. ఆయనను ఒక ఉపన్యాసానికి ఆహ్వా నించారు. స్వామీజీ వెళ్లారు. మొదటి నుంచీ స్వామీజీని పరీక్షించడమే వారిముఖ్యోద్దేశం అన్నట్లు ప్రవర్తించారు. ఒక చెక్కపెట్టెను తలక్రిందులుగా వేసి, “ఇదే వేదిక, దీని మీద నిలబడే ప్రసంగించాలి” అన్నారు. స్వామీజీ ఎలాంటి అభ్యంతరమూ చెప్పకుండా అందుకు అంగీకరించారు. ప్రసంగించనారంభించారు. కాసేపటికల్లా ప్రసంగంలో లీనమైపోయి పరిసరాలను మరచిపోయారు.
హఠాత్తుగా చుట్టూ తుపాకులు పేలసాగాయి. చెవులను చిల్లులుపరచే పేలుడు శబ్దాలు. కొన్ని తూటాలు స్వామీజీ చెవుల ప్రక్కగా దూసుకుపోయాయి. అక్కడ హాహాకారాలూ, గందరగోళమూ రాజ్యమేలింది. కాని స్వామీజీ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదు. ఈ ఉద్రిక్త పరిస్థితి ఆయన మీద ఎలాంటి ప్రభావమూ చూపలేదు. ఆయన ప్రసంగం కొనసాగుతూనే ఉంది. పరీక్షించిన వారు పరాజితు లయ్యారు. అసలు ఏమీ జరగనట్లు నిర్ణీత సమయానికి స్వామీజీ ప్రసంగం ముగించారు. ఆ యువకులు పశ్చాత్తాపపడి స్వామీజీని క్షమించమని వేడుకొన్నారు.
‘ముందు నన్ను కాపాడండి’
స్వామీజీ ఎంతో ఉత్సాహంతో ఉపన్యాసం చేస్తున్న తొలి రోజులు అవి. ఒక సంచీ మాత్రమే ఆయన వద్ద ఉండేది. ఒక చోటికి వెళ్లి ప్రసంగం చేసి, వెంటనే మరో చోటికి వెళ్లేవారు. ఈ రీతిలో ఒకసారి ఒక ఊరికి వెళ్లారు. ఆయనను ఆహ్వానించిన సంస్థ అధ్యక్షుడు కాసేపట్లో ప్రసంగం ప్రారంభించవచ్చునని చెప్పి, స్వామీజీని ఒక గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గదిలో వెలుతురు చాలక కాస్త మసకగా ఉంది. ఆయన తిరిగి వచ్చేదాకా కూర్చుందామనుకొని స్వామీజీ అక్కడున్న ఒక కుర్చీలో కూర్చున్నారు. ఆ కుర్చీ ఎప్పుడు విరిగిపడదామా అని కాచుకొని ఉన్నట్లుగా ఆయన కూర్చోగానే అది విరిగి క్రిందపడిపోయింది. స్వామీజీ దాన్లో ఇరుక్కు పోయారు. బయటికి రావడానికి ప్రయత్నించేకొద్దీ పరిస్థితి మరింత అధ్వాన్నం కావడంతో ఇక లాభం లేదనుకొని కుర్చీని పెనవేసుకొన్నట్లుగా అట్లే ఉండి పోయారు.
కొంతసేపు గడచాక ఆ సంస్థ అధ్యక్షుడు వచ్చి, “స్వామీజీ, రండి. అందరూ మీ కోసమే నిరీక్షిస్తున్నారు” అన్నాడు. క్రిందపడివున్న ఆ స్థితిలోనే స్వామీజీ, “వారు నిరీక్షించడం సరే. ముందు నన్ను కాపాడండి. ఆ తరువాతే వారికి నేను ఏదైనా చేయగలుగుతాను” అన్నారు. స్వామీజీ పరిస్థితి చూడగానే ఆయన పరుగున వచ్చి స్వామీజీ లేవడానికి సాయం చేశాడు. ఈ సంఘటనను గురించి కాలాంతరంలో ప్రస్తావించినప్పుడల్లా స్వామీజీ మైమరచి నవ్వేవారు; వినేవారిని సైతం పొట్టచెక్కలయ్యేలా నవ్వించేవారు.
జాతి మౌఢ్యం
మనిషిలో మైత్రీభావం, ఆప్యాయతా, మంచితనమూ నెలకొని ఉన్నట్లే ద్వేషం, పగ, చెడు కూడా ఉంటాయేమో! మతం, జాతి, భాష, ఇత్యాది ఏదో ఒక వ్యత్యాసాన్ని తనకు తానే కల్పించుకొని ఒకరి పట్ల మరొకరు ద్వేషాన్ని పెంచుకొంటారు మనుషులు. లోకమంతా ఇదే తంతు. అమెరికాలో కూడా వర్ణమౌఢ్యం ఆ రోజుల్లో విలయ తాండవం చేసింది. నల్లజాతి జనుల కాయకష్టంతో ఉన్నతులైనా వారిని బానిసలుగా చేసుకొన్నారు తెల్లజాతివారు. నల్లజాతివారి హక్కులు పరిహరించారు. బహిరంగ ప్రదేశాలలో వారికి ప్రవేశం లేదు. హోటళ్ళలో కూడా వారిని అంటరానివారుగా పరిగణించారు.
అనేక చోట్ల స్వామీజీని కూడా అమెరికన్లు అవమానించారు. స్వామీజీని ఉపన్యాసానికి ఆహ్వానించి ఆయన కోసం ఒక హాస్టల్లోనో, ఒక హోటల్లోనో ఒక గది కేటాయించి ఉంచేవారు. తీరా స్వామీజీ తెల్లజాతి వ్యక్తి కారని తెలియగానే ఆ హోటల్ యజమాని స్వామీజీ కోసం కేటాయించిన గదిని ఇవ్వడానికి నిరాకరించేవాడు. దాంతో కార్యకర్తలు స్వామీజీ బస కోసం వేరే చోటు చూడవలసి వచ్చేది. ఒకటి రెండు రోజుల్లో ఆ ప్రాంతమంతా స్వామీజీ పేరు మార్మోగిపోయేది. పత్రికలలో ఆయనను గురించిన వార్తలు ప్రచురితమవుతాయి, ఎక్కడ చూసినా ఆయన ఛాయాచిత్రాలు కానవస్తాయి. ఈ కీర్తిప్రతిష్ఠలు చూడగానే అదే హోటల్ యజమానులు స్వయంగా వచ్చి స్వామీజీని క్షమాపణ కోరడం కూడా కద్దు. అనేక సందర్భాలలో భోజనం లేకుండా హోటళ్ల నుండి స్వామీజీని పంపివేయడం కూడా జరిగింది. క్షౌరశాలలో సైతం ఆయనకు తిరస్కృతే లభించింది.
“పాశ్చాత్యదేశాలలోని నిమ్న వర్గం వారు పామరులు మాత్రమే కాదు, సంస్కారహీనులు కూడా. ఒకసారి నేను ఒక లండన్ వీథి గుండా వెళుతున్నాను. అప్పుడు నేను భారతీయ వేషధారణలోనే ఉన్నాను. ఆ వీథి వెంట ఒక బొగ్గుబండి వెళ్లింది. బండి తోలుతున్న వ్యక్తి నా దుస్తులు చూసి ఒక పెద్ద బొగ్గు ముక్కను నా మీదికి రువ్వాడు. అదృష్టవశాత్తు అది నా మీద పడకుండా నా చెవిని రాసుకొంటూ వెళ్లింది” అని స్వామీజీ ఒకసారి చెప్పారు.
తనను అవమానించిన చోట్లలో స్వామీజీ తాను నల్లజాతి వ్యక్తి కానని తెలిపివుంటే చాలు; ఆయనకు ఆదరణ లభించేది. ఈ విషయంగా కాలాంతరంలో ఆయన శిష్యులలో ఒకరు అడిగినప్పుడు స్వామీజీ, “ఏమిటి! ఒకరిని కించపరచి నేను ఉన్నతుణ్ణి కావడమా? అందుకోసం నేను జన్మించలేదు” అన్నారు. మరొకసారి కూడా ఇదే ప్రశ్నకు ఆయన, “అది నా సోదరుణ్ణి నేనే తిరస్కరించడంకాదా?” అని అడిగారు. “ధవళవర్ణులైన ఆర్యులు నా పూర్వీకులని చెప్పడానికి గర్విస్తాను, పసుపు రంగుగల మంగోలులు నా పూర్వీకులని చెప్పడానికి మరింత గర్విస్తాను. నలుపురంగు గల నీగ్రోలు నా పూర్వీకులు అని చెప్పడానికి ఎంతగానే గర్విస్తాను” అనేవారు స్వామీజీ.
అదే సమయంలో స్వామీజీని తమలో ఒకరిగా చేసుకొని, ఆయన విజయాన్ని తమ విజయంగా నల్లజాతివారు ఎంచి ఆనందభరితులవడమూ కద్దు. ఒక ఊళ్లో యథాప్రకారం స్వామీజీని వైభవోపేతంగా ఆహ్వానించారు. అప్పుడు నల్లజాతి పోర్టర్ ఒకడు స్వామీజీ వద్దకొచ్చి, “మాలో ఒకరు ఇంత కీర్తిని పొందడం మాకందరికీ ఎంతో గర్వంగా ఉంది” అంటూ ఆయనతో కరచాలనం చేయగోరాడు. స్వామీజీ కూడా చేతులు చాపి ఆతణ్ణి సాదరంగా ఆహ్వానించి, “కృతజ్ఞత, సోదరా! కృతజ్ఞత” అన్నారు.
రాసులను త్రోసి ఇచ్చేదెవరు?
ఒకసారి శ్రీరామకృష్ణులతో ఒక భక్తుడు, “మీరు ఇన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతున్నారు?” అని ఆశ్చర్యపోతూ అడిగాడు. అందుకు ఆయన, “నేనా చెబుతున్నాను! నా తల్లి కాళీమాత కదా నన్ను చెప్పనిస్తున్నది! ధాన్యం కొలిచే చోట నువ్వు చూడలేదా? ఒకడు కొలుస్తూ ఉంటాడు, మరొకడు ధాన్యం ముందుకు తోస్తూవుంటాడు. అట్లే కాళీమాత నా వెనుక ఉండి ముందుకు తోస్తూ ఉంటుంది” అన్నారు. గురువుగారి జీవితంలో జరిగిందే శిష్యుని జీవితంలోనూ జరిగింది.
“స్వామీజీ చెప్పింది ఎన్నడూ మళ్లీ చెప్పరు. ప్రతిరోజూ ఆయన క్రొత్తవిషయాలే మాట్లాడతారు” అని వ్రాస్తూంది సోదరి నివేదిత. అలా “రాసులను త్రోసి ఇచ్చేదెవరు?”
స్వామీజీ జీవితంలో జరిగిన ఎన్నో అద్భుతాలలో ఇదీ ఒకటి!
స్వామీజీ ఒక వారంలో 12 నుండి 14 దాకా ప్రసంగాలు, కొన్ని సమయాల్లో రోజుకు మూడు ప్రసంగాలు చేయడం పరిపాటి. ప్రసంగాలు పూర్తికాగానే సొమ్మసిల్లి పరుపు మీద పడిపోయేవారు. “రేపటి ప్రసంగానికి ఏం చేయాలి? దేనిపై ప్రసంగించాలి?” అని తనలో తాను అనుకొనేవారు. అప్పుడు ఆ అద్భుతం జరుగుతుంది. హఠాత్తుగా ఎక్కణ్ణుంచో ఒక వ్యక్తి మాట్లాడతాడు; మర్నాటి ఆయన ప్రసంగానికి అవసరమైన భావాలు అందులో ఉంటాయి. కొన్ని సమయాల్లో ఆ కంఠధ్వని సుదూరం నుండి వినవస్తుంది. క్రమంగా అది దగ్గరవుతూ చివరికి ఆయన ప్రక్కనుండి వినిపిస్తుంది. కొన్ని సందర్భాలలో ప్రక్కనే నిలబడి ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా ఉంటుంది. మరికొన్ని వేళలలో రెండు కంఠాలు చర్చించు కొంటాయి. స్వామీజీ ఆలోచనల పరిధిలోకి రాని భావనలు ఆ చర్చలో వ్యక్తమవు తాయి. దీన్లో ఆశ్చర్యం ఏమిటంటే ఆ కంఠధ్వనులను స్వామీజీ మాత్రమే కాదు, ప్రక్క గదుల్లోని వారు కూడా వినివుంటారు!
కాని స్వామీజీ ఇటువంటి సంఘటనలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వరు. “స్వామీజీ! నిన్న రాత్రి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? బిగ్గరగా చాలా ఉత్సాహంగా మాట్లాడారే!” అని ఎవరైనా అడిగితే, స్వామీజీ మృదువుగా నవ్వి, ఆ ప్రశ్నను దాటవేయబోయేవారు. మరీ పట్టుబట్టి అడిగినప్పుడు, “అవన్నీ మానసిక శక్తులు” అని చెప్పేవారు. మనస్సుకు ఒక ప్రశ్నగాని, సమస్యగాని ఇస్తే దానికి జవాబు మనస్సే కనుగొంటుంది. మనస్సుకు మనం ఎంత శిక్షణ నిచ్చామో, ఏ మేరకు మనం మనస్సును నియంత్రించామో అంత త్వరగా మనస్సుకు జవాబు లభిస్తుంది. నియంత్రితమైన పవిత్రమైన మనస్సు స్వయంగా తానే గురువై సదరు వ్యక్తికి దారి చూపుతుందనడం ఇదే. దీనిని వివరిస్తూ స్వామీజీ, “వేదకాల ఋషులు కూడా ఉపనిషత్తులను ఈ విధంగానే అనుగ్రహించారు” అన్నారు. నిజమే కదా! ఆంగ్లంలో ఉపనిషత్తులను అనుగ్రహించిన వారు కదా స్వామీజీ!
అతీంద్రియ శక్తులు
ఈ రోజుల్లో స్వామీజీలో అనేక యోగ శక్తులు అభివ్యక్తమయ్యాయి. ఒక్కసారి తాకినంత మాత్రాన కొందరి జీవిత వైఖరిని ఆయన మార్చగలిగారు. సుదూరంలో జరుగుతున్నది వీక్షించగలిగారు. కొన్ని సమయాల్లో ఆయన శిష్యులు దీనిని పరీక్షించి, అట్లే జరిగినట్లు ధ్రువీకరించారు. అనేక సంశయాలతో, ప్రశ్నలతో కొట్టుమిట్టాడుతూ వచ్చిన వ్యక్తులు, నోరు విప్పక మునుపే ఆ ప్రశ్నలకు స్వామీజీ జవాబులు ఇవ్వడం చూశారు. కేవలం ఒక్క చూపులోనే ఒక వ్యక్తి గత జన్మలు తెలుసుకొని ఆతడి మనస్సును తెరచిన పుస్తకంలా ఆయన చదవగలిగారు.
చికాగోలోని సుసంపన్నుడైన ఒక వ్యక్తి స్వామీజీ యోగశక్తులను గురించి విన్నాడు. కాని సంశయాత్మక దృష్టితో స్వామీజీ వద్దకొచ్చి, “అలా అయితే నా గతజన్మను గురించి చెప్పండి చూద్దాం. నా మనస్సును చదవగలరేమో చూస్తాను” అన్నాడు. ఇటువంటి శక్తులను వినియోగించడానికో, ఇతరుల ముందు ప్రదర్శించ డానికో స్వామీజీకి సుతరామూ ఇష్టం లేదు. కనుక ఒక క్షణంసేపు సంకోచించారు. కాని వచ్చిన వ్యక్తి, మరీ పట్టుబట్టడంతో తమ దృష్టిని అతడి మీద సారించారు. ఆతడి అంతరంగంలోని సమస్తాన్నీ పెకలించి ఏకమొత్తంగా బయటికి విసిరివేసే రీతిలో ఆయన దృష్టి చొచ్చుకుపోయింది. దాంతో ఆ వ్యక్తి ఠారెత్తిపోయి, “ఓ స్వామీజీ, నన్నేం చేస్తున్నారు! నా జీవిత రహస్యాలనన్నింటినీ పెకలించి బయటికి తీసుకువచ్చేలా ఉన్నారు” అంటూ విలవిల్లాడాడు.
తాళం వేసిన గదిలో నుండి
స్వామీజీ తమ పర్యటనలో ఒక సందర్భంలో మిసెస్ బాగ్లీ ఇంట బస చేశారు. అక్కడ కూడా స్వామీజీ తమ యోగశక్తులను ప్రదర్శించినట్లు తెలియ వస్తోంది. ఆ ఇంటికి వచ్చిన అతిథులలో ఒకరు స్వామీజీని, మిస్టర్ బాగ్లీ అధ్యయన గదిలో ఉంచి, ఆ గదికి తాళం బిగించి, తాళం చెవిని తన వద్ద ఉంచుకొన్నాడు. అది ఎంతో విశాలమైన ఇల్లు. ఆ ఇంటికి మరోవైపునగల ఆహ్వానితుల గదిలో అందరూ సమావేశమయ్యారు. హఠాత్తుగా స్వామీజీ అక్కడ ప్రత్యక్షమయ్యారు. గదికి తాళం వేసివచ్చిన వ్యక్తి పరుగెత్తుకొంటూ వెళ్లి గది తలుపులు తెరిచాడు. ఆశ్చర్యం! గదికి తాళం వేసినప్పుడు స్వామీజీ ఏ భంగిమలో కూర్చుని ఉన్నారో ఇప్పుడూ అట్లే కూర్చుని ఉన్నారు.
“ఇటువంటి గారడీలలో నాకు పిసరంత కూడా నమ్మకం లేదు. ఇవి ప్రకృతికి అతీతమైనవిగా తోస్తాయి. అయినప్పటికీ ఇవి కూడా ప్రకృతి నియమాల మేరకే జరుగుతాయి. హఠయోగులు వీటిని అలవోకగా చేస్తారు” అని ఒక పత్రికకు ఇచ్చిన భేటీలో స్వామీజీ తెలిపారు. గుహలో తనను నిర్బంధించుకొని అనేక సంవత్సరాలు అన్నాహారాలు లేకుండా జీవించిన ఒక వ్యక్తి తనకు తెలుసని స్వామీజీ చెప్పారు. ఒక వ్యక్తిని నేలలో పాతిపెట్టి, ఆ మట్టి మీద బార్లీ పండించి, కోత కోసి తరువాత నేలను త్రవ్వి ఆ వ్యక్తిని సజీవంగా బయటకు తీసుకువచ్చిన ఉదంతం గురించి కూడా ఆయన చెప్పారు. ఇటువంటి అతీంద్రియ శక్తులను స్వామీజీ ఎన్నడూ ఆధ్యాత్మిక అభివ్యక్తిగా భావించలేదు. ఈ శక్తులను ఆయన ఎంతో అరుదుగా తప్ప ప్రదర్శించింది లేదు.
మనస్సులను ఆకట్టుకొన్నారు
స్వామీజీ తమ అతీంద్రియ శక్తులను ప్రదర్శించారా లేదా, ప్రదర్శిస్తే ఎందుకు ప్రదర్శించారు అన్నవి జవాబు లభించని ప్రశ్నలు. అద్భుతాలలోను, మాయమంత్రాలలోను, మానవాళికి నాటి నుండి నేటి దాకా గల సమ్మోహనం గురించి స్వామీజీ ఎరుగక పోలేదు. అటువంటి గారడీలను ప్రదర్శిస్తే తండోపతండాలుగా జనం వస్తారనే విషయం ఆయనకు తెలియంది కాదు. కాని అటువంటి జనబాహుళ్యాన్ని ఆయన ఆశించరు. “మనిషి దివ్యుడు. ఆ దివ్యత్వాన్ని అవగతం చేసుకోవడమే మానవజీవితపు పరమావధి” అనే సత్యాన్ని పాశ్చాత్యులకు చాటిచెప్పాలనేమహోన్నత సందేశంతో వెళ్లినవారు స్వామీజీ. కనుక ఇటువంటి శక్తులను ఆయన ప్రదర్శించలేదు.
అతీంద్రియ శక్తులను ప్రదర్శించవలసిన అవసరం కూడా ఆయనకు రాలేదు. ఆయనలో కొలువైవున్న ఆధ్యాత్మికశక్తి వాటికన్నా ఎన్నోరెట్లు సమ్మోహకశక్తి గలది కదా! పావన మనస్కులు సహజంగానే ఆయనపట్ల ఆకర్షితులు కావడంలో ఆశ్చర్యం లేదు. జనసామాన్యం కూడా ఒక క్షణం నిలబడి ఆశ్చర్యంగా చూసేటంతగా ఆయనలో ఆధ్యాత్మిక తరంగాలు ఉప్పొంగాయి. సజ్జనులు ఆయన దరిజేరి, ఆయన నిర్దేశించిన మార్గంలో వెళ్లడానికి ప్రయత్నించారు.
దాదాపుగా స్వామీజీ మిత్రుల ఇళ్లలోనే బసచేశారు. పెద్దవారు ఆయనను తమసొంత కుమారునిగా పరిగణించారు. లియాన్ దంపతులు, హేల్ దంపతులు, మిసెస్ సారా వంటివారు పలువురు ఆయనను కుమారునిగా భావించడమే కాదు, ఆ బాంధవ్యంతోనే ఆయనతో మెలగారు. చిన్నవారు– స్త్రీలైనా పురుషులైనా – ఆయనను తమ సోదరునిగా భావించారు. స్వామీజీలోని పవిత్రత ప్రభావం అంతటిది!
ఎల్లలకు అతీతుడు
స్వామీజీని అనేకులు కుమారునిగాను, సోదరునిగాను భావించారన్నప్పుడు దాని గాఢతను అవగతం చేసుకోవడం అవసరం. ఇదంతా జరుగుతున్నది భారతదేశంలో కాదు, అమెరికాలో. భారతదేశంలో ఇటువంటి బాంధవ్యాలు క్రొత్త కాదు. కాని అమెరికాలో ఇటువంటి వైఖరిని ఊహించతరం కాదు. అంతేకాక, జాతిమౌఢ్యం, వర్ణమౌఢ్యం విలయతాండవమాడిన కాలం అది. స్వామీజీ ఒక బానిసదేశం నుండి వెళ్లినవారు. నల్లజాతి ప్రజలను ద్వేషించే మేరకు లేకపోయినా, భారతీయులనూ అమెరికన్లు మనుషులుగానే పరిగణించలేదు. అటువంటి అమెరికాలో ఈ విధంగా అసంఖ్యాక మనస్సులను దోచుకోవడం గమనార్హం. మతం, జాతి, వర్ణం వంటి విభేదాలు వారి మనస్సులలో తలెత్తలేదు.
ఇది ఎలా సాధ్యమయింది?
“అహింసలో నెలకొనివున్న వ్యక్తి సాన్నిధ్యంలో (ఇతరుల) వైరాలు తొలగిపో తాయి”* అంటున్నారు పతంజలి మహర్షి. సత్యనిష్ఠుని సాన్నిధ్యంలో అసత్యం నశించిపోతుంది. ఈ రీతిలోనే పవిత్రుని సాన్నిధ్యంలో చెడులు నశిస్తాయి. అన్ని ఎల్లలనూ అతిక్రమించిన ఆత్మజ్ఞానంలో సుప్రతిష్ఠితులైనవారు స్వామీజీ. ఆయన సాన్నిధ్యంలో ఎలాంటి వివక్షా తలెత్తడం అసాధ్యం. సుసంపన్నుడైన రాక్ఫెల్లర్ నుండి సామాన్య నల్లజాతి పోర్టర్ దాకా అందరినీ ప్రేమమయ నేత్రాలతో స్వామీజీ చూడగలిగారు. ప్రతి ఒక్కరికీ వారికి సముచితమైన గౌరవ మర్యాదలు ఆయన ఇచ్చారు. వారూ, కనీసం ఆ సందర్భంలోనైనా ఆయనను సమాన దృష్టితో చూశారు.
స్వామీజీ చికాగోలో ఉన్నప్పుడు ఆయన ఆధ్యాత్మిక శక్తి గురించి సర్వత్రా మాట్లాడుకోసాగారు. ఇందువలన అనేకులు ఆయనతో సన్నిహితంగా మెలగడానికీ, ఏకాంతంగా కలుసుకోవడానికీ అభిలషించారు. ఆయన సమక్షంలో మనస్సు ప్రశాంతంలో లయించిపోవడం గ్రహించిన వారు పదే పదే రాసాగారు. స్వామీజీ కూడా కారుణ్యమూర్తులై అందరినీ ఆదరించి, వారికి మార్గదర్శకులయ్యారు.