హిందూమతంలోని ఆశయాలను గురించి స్వామి వివేకానంద ప్రసంగింప నారంభించారు. ఆయన ముగించి నప్పుడు హిందూమతం సృజింపబడింది.
– సోదరి నివేదిత
కొలంబస్ హాల్ — వేదిక — మొదటి రోజు — ప్రతినిధులు — కార్యక్రమాల ప్రారంభం — ‘సోదర సోదరీమణులారా!’ — అద్భుత శక్తి — ఏం ప్రసంగించారు? — ‘అమ్మా, దారి చూపు!’ — మరునాడు —
మరో వైపు — చికాగో ఉపన్యాసం : ఒక దృక్కోణం — మత మౌఢ్యం గురించి ఎందుకు ప్రసంగించారు? — ఉపన్యాసాల కొనసాగింపు — హిందూమత పరిరక్షకుడు — భారతదేశం ఆధ్యాత్మిక గురువు — స్వామీజీ తోడ్పాటు — దేని ప్రతినిధి? — సర్వమత మహాసభ ఏం సాధించింది
కొలంబస్ హాల్
స ర్వమత మహాసభ చికాగో కళా సంస్థలో (Art Institute) 1893 సెప్టెంబర్ 11 వ తేదీ సోమవారం నుండి 27 వ తేదీ వరకు జరిగింది. ఆ భవనం మిచిగన్ ఎవెన్యూలో ఉంది. ప్రపంచ ప్రదర్శనలో అదొక అంగం, చిత్తరువులు, శిల్పాలు, కంచువిగ్రహాలు మొదలైన కళాత్మక అంశాలతో అది కూడుకొని ఉంది. ఆ భవనం అప్పుడే క్రొత్తగా కట్టబడింది. దాన్లో అనేక చావడులలో ప్రదర్శిత వస్తువులు అమర్చబడలేదు; ఖాళీగా ఉన్నాయి. ఆ చావడులు సర్వమత మహాసభకు కేటాయింపబడ్డాయి. వాటిలో ఒకట కొలంబస్ హాల్.
సర్వమత మహాసభ కొలంబస్ హాల్లో ప్రారంభమయింది. అందులోని క్రింది అంతస్తులోను, పై అంతస్తులోను కలిపి దాదాపు 4000 మంది కూర్చో వచ్చు. కార్యక్రమాల సమయంలో అనేకులకు చోటు దొరకలేదు. కనుక నాలుగవ రోజు నుండి కార్యక్రమాలు వాషింగ్టన్ హాల్లో జరిగాయి. ఆ హల్లో ఇంకా కొన్ని వేల మంది కూర్చోవచ్చు. మొదటి మూడు రోజులు జరిగిన కార్యక్రమాలను నాలుగవ రోజు అందరి కోసమూ మళ్లీ ఒకసారి నిర్వహించారు.
ప్రతి రోజూ మూడు విభాగాలుగా కార్యక్రమాలు నిర్వహింపబడ్డాయి. ప్రతి విభాగంలో కార్యక్రమాలు దాదాపు 2-3 గంటలసేపు జరిగాయి. అన్ని విభాగాలకు అధిక సంఖ్యలో జనం హజరయ్యారు. వారిలో మహిళలు ఎక్కువ మంది కావడం గమనార్హం.
వేదిక
వేదికను దాదాపు 50 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో రూపొందించారు. సిసిరో* , డెమస్తనీస్ల* పాలరాతి శిలావిగ్రహాలు ఆ వేదికను అలంకరించాయి. ఈ విగ్రహాలకు మధ్య సింహాసనం లాంటి ఒక ఎత్తయిన ఇనుప ఆసనం అమర్చబడి ఉంది. మొదటి రోజు ఆ ఆసనం అమెరికా క్యాథలిక్ మతస్థులందరికీ నాయకుడైన కార్డినల్ గిబ్బన్స్కు కేటాయించబడింది. ఈ ఆసనానికి రెండు వైపులా వరుసకు 30 చొప్పున మూడు వరుసలలో చెక్కకుర్చీలు అమర్చారు. ఉపన్యాసవేదిక (rostrum) కూడా ప్రధాన వేదిక మీద అమర్చబడింది. వేదిక వెనుక వైపు గోడలను అందమైన జపానీయ, హిబ్రూ చిత్తరువులతో అలంకరించారు. డెమస్తనీస్ శిలావిగ్రహానికి ఎడమ వైపు కుడిచేతిని పైకెత్తి, ఒక విహంగాన్ని ఎగురవేస్తూ నిలబడివున్న మినర్వా (రోమన్ విద్యాధిదేవత) రాగి విగ్రహాన్ని అమర్చి ఉంచారు.
మొదటి రోజు
సెప్టెంబర్ 11 వ తేదీ ఉదయం స్వామీజీతోపాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ కొలంబస్ హాల్లోని ఒక విభాగంలో సమావేశమయ్యారు. ఆ హాల్లో నాలుగువేలకుపైగా స్త్రీ పురుషులు ఆసీనులై ఉన్నారు. వందలమంది స్థలాభావంచే తలుపుల వద్దా, బయటా నిలబడివున్నారు. ఇంతమంది సమావేశమయినప్పటికీ అక్కడ ప్రగాఢమైన ప్రశాంతత రాజ్యం చేసింది. ఆ వైపుగా ఒక పక్షి ఎగిరి వెళితే దాని రెక్కల సవ్వడి కూడా వినిపించేటంత నిశ్శబ్దం చోటుచేసుకొన్నట్లు నాడు అక్కడ కూర్చున్న ఒక వ్యక్తి అభివర్ణించాడు.
ఉదయం 10 గంటలయింది. సర్వమత మహాసభలో పాల్గొన్న ముఖ్యమైన 10 మతాలయిన బ్రహ్మసమాజం, యూదు, ఇస్లాం, హిందూ, బౌద్ధ, తావో, కన్ఫ్యూషియ, షింటో, జొరాష్ట్రియ, క్యాథలిక్, గ్రీక్ చర్చ్, ప్రొటెస్టంట్ మతాలను సూచించే రీతిలో అక్కడున్న న్యూ లిబర్టీ గంట 10 సార్లు మ్రోగింది.* హాల్ ప్రక్కనుండి ప్రతినిధుల ఊరేగింపు బయలుదేరింది. కార్డినల్ గిబ్బన్స్, పోనీలు పరస్పరం చేతులు పుచ్చుకొని సుదీర్ఘమైన ఆ ఊరేగింపున మార్గదర్శకత్వం వహించారు. వారి వెనుక ప్రపంచ ప్రదర్శన మహిళా విభాగపు నాయకురాలైన మిసెస్ పాట్టర్ పామర్, ఉపనాయకురాలు మిసెస్ చార్లెస్ హెచ్. హెన్రడిన్లు వెళ్లారు. వారి వెనుక ప్రతినిధులు వెళ్లారు. “అది అత్యద్భుతమైన దృశ్యం. విభిన్న, విచిత్రమయిన దుస్తులు; ఎన్నో రకాల టోపీలు; అనేక రంగుల అంగీలు; వారు ధరించిన విభిన్న శిలువలు, చంద్రవంక లాంటి చిహ్నాలు; ముండన శిరస్సులు, అనేక రకాలుగా అలంకరించుకొన్న తలలతో ఆశ్చర్యచకితులను చేసేలా సాగింది ఆ ఊరేగింపు” అని ఒక ప్రేక్షకుడు అభివర్ణించాడు. అందరూ నెమ్మదిగా, గంభీ రంగా నడుస్తూ హాలులోకి వచ్చి వేదికను అలంకరించారు. ప్రేక్షక సందోహం ఎడతెగని కరతాళ ధ్వనులు చేస్తూ వారిలో సమధికోత్సాహాన్ని జనింపజేసింది.
ప్రతినిధులు
కార్డినల్ గిబ్బన్స్ వేదిక మధ్యలోని అధ్యక్షుని ఆసనంలో ఆసీనుడయ్యాడు. ఆయనకు కుడి వైపు చైనా నుండి వచ్చిన ఐదుగురు బౌద్ధ భిక్షువులు, ఎడమ వైపు గ్రీకు చర్చ్ ప్రధాన బిషప్‌లూ ఆసీనులయ్యారు. తక్కిన వారు తక్కిన ఆసనాలలో ఆసీనులయ్యారు. అందరూ తమ దేశానికీ, మతానికీ తగినట్లు దుస్తులు ధరించివున్నారు. గిబ్బన్స్ లేత ఎరుపు రంగు అంగీ ధరించారు. బౌద్ధ భిక్షువులు ధవళ వస్త్రాలు ధరించారు. గ్రీకులు నల్లని రంగు అంగీలు ధరించి, దంతం రంగు చేతికర్రలు పుచ్చుకొని ఉన్నారు. కన్ఫ్యూషియన్లు చైనా దేశపు సంప్రదాయ దుస్తులు ధరించారు. ఆఫ్రికా యువరాజు చక్కని ఎంబ్రాయిడరీ చేసిన దుస్తులు ధరించాడు. బ్రహ్మసమాజానికి చెందిన ప్రతాప్‌చంద్ర మజుందార్ నల్లటి ఐరోపీయ దుస్తుల్లో ఉన్నాడు.
స్వామీజీ ఎరుపురంగు దుస్తులు, పసుపురంగు తలపాగా ధరించి కనిపించారు. ఆయన 31 వ ఆసనంలో కూర్చున్నారు. ఆయన ప్రక్కన బొంబాయికి చెందిన నగర్కర్, ఆ తరువాత శ్రీలంక వాస్తవ్యుడైన ధర్మపాలుడు, పిదప మంజుదార్ ఆసీనులయ్యారు. జైనమత ప్రతినిధియైన వీర్చంద్ గాంధీ, థియొసాఫికల్ సొసైటీ ప్రతినిధులయిన జ్ఞానచంద్ర చక్రవర్తి, మిసెస్ అనీబెసెంట్ కూడా పాల్గొన్నారు.
కార్యక్రమాల ప్రారంభం
అందరూ తమ తమ ఆసనాలలో ఆసీనులై ఉన్నారు. అక్కడ ప్రగాఢమైన నిశ్శబ్దం నెలకొంది. హఠాత్తుగా పియానో వాద్యం మొదలయింది. తదనంతరం హాలులో కూర్చుని ఉన్న దాదాపు నాలుగువేల మంది లేచి నిలబడి, “భగవంతుణ్ణి స్తుతించండి…” అనే క్రైస్తవ స్తుతిని గానంచేశారు. తరువాత “పరలోకంలోని మా పితా…” అనే ప్రార్థనను ముక్తకంఠంతో పలికారు. ఆ తరువాత కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఆహ్వానోపన్యాసాలూ, అందుకు ప్రతినిధుల జవాబులు చోటుచేసుకొన్నాయి. అందరూ ఉపన్యాసాలను సిద్ధం చేసుకొని వచ్చారు. దాదాపు అందరి ఉపన్యాసాలకూ చక్కని స్పందన లభించింది. కొందరి ఉపన్యాసాలకు కరతాళధ్వనులు మిన్నుముట్టాయి.
ప్రతినిధులలో మొట్టమొదట ప్రసంగించినవారు గ్రీక్ చర్చ్ ఆర్చ్బిషప్అయిన జాన్తే. తమ ప్రసంగాంతంలో చేతులు పైకెత్తి, “పైకెత్తిన చేతులతో, హృదయంలో ఉప్పొంగే ప్రేమతో ఈ మహోన్నత దేశాన్ని ఆశీర్వదిస్తున్నాను; సంతోషపరులూ, అదృష్టవంతులూ అయిన అమెరికా ప్రజలను అభినందిస్తు న్నాను” అని చెప్పినప్పుడు ప్రేక్షకులు చాలాసేపు కరతాళధ్వనులతో తమ స్పందనను వ్యక్తం చేశారు.
మజుందార్ ప్రసంగానికీ చక్కని స్వాగతం లభించింది. పది సంవత్సరాలకు పైగా అమెరికాలో నివసిస్తున్న ఆయనకు అనేకులతో పరిచయం ఉంది.
కన్ఫ్యూషియన్ మత ప్రతినిధియైన పుంగ్ క్వాంగ్ యూ ప్రసంగించడానికి లేచి నిలబడ్డాడు. “ఈయనకు దక్కిన స్వాగతం లాంటిది వేదిక మీద మరెవరికీ లభించలేదు” అని డాక్టర్ బారోస్ వ్యాఖ్యానించే మేరకు ఆయనకు స్వాగతం లభించింది. స్త్రీలూ పురుషులూ లేచి నిలబడి తమ టోపీలు, చేతిరుమాళ్లు మొదలైనవి చేతుల్లోకి తీసుకొని ఊపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. “కాని ఈ స్వాగతం ఆయన మతం కోసం కాదు. దీర్ఘకాలం చైనా వారి పట్ల అమెరికా వారు ప్రవర్తించిన తీరుతెన్నులకు క్షమాపణ కోరడానికే, గాయపడిన చైనీయుల హృదయాలకు సాంత్వన కలిగించడానికే ఈ స్వాగతం” అని పోనీ తమ ఉపన్యాసంలో వ్యాఖ్యానించాడు.
శ్రీలంక బౌద్ధమతానికి ప్రతినిధియైన ధర్మపాలుడు తన ఉపన్యాసంతో ప్రేక్షకులను దిగ్భ్రాంతులను చేశాడు. స్పష్టంగా, బిగ్గరగా ప్రసంగించిన ఆయన కంఠస్వరమూ, ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొనే రూపమూ, విశాలమైన నుదురూ బుద్ధుని దూతగా ఆయనను దర్శింపజేశాయి.
నలుగురి ఉపన్యాసాలతో ఉదయపు కార్యక్రమాలు పూర్తయ్యాయి. మధ్యాహ్న కార్యక్రమాలు ప్రారంభమై ఒకరి తరువాత ఒకరుగా ప్రసంగించ నారంభించారు.
స్వామీజీ?
‘సోదర సోదరీమణులారా!’
మౌనముద్ర వహించిన వ్యక్తిలా ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన మదిలో ఏయే అలలు ఉవ్వెత్తున లేచి అణగిపోయాయో, ఏయే ఉద్వేగ ప్రవాహాలు పొంగి పొరలి ముఖారవిందాన దివ్యమయమైన ప్రశాంతతగా భాసించాయో ఎవరి కెరుక? రేయింబవళ్లూ, అనవరతమూ తనను రక్షిస్తున్న గురుదేవులను తలచుకొన్నారా? తనను బానిసగా చేసుకొన్న కాళికాదేవిని తలచుకొన్నారా? ఆశీస్సులను ప్రసాదించి ఆప్యాయంగా సాగనంపిన శ్రీశారదామాతను తలచుకొన్నారా? ఎవరు జవాబివ్వగలరు?
కార్యక్రమ నిర్వాహకుడు పలుమార్లు ఆహ్వానించినప్పటికీ స్వామీజీ లేచి వెళ్లలేదు; “ఇప్పుడు కాదు తరువాత” అంటూ వాయిదా వేస్తూనే వచ్చారు. మధ్యాహ్నం గడచి సాయంత్రం కాసాగింది. బహుశా ఈయన మాట్లాడరేమోననే సందేహం తక్కిన వారిలో తలెత్తకపోలేదు. ఇక జాప్యం చేయలేని పరిస్థితి ఆసన్నమైనప్పుడు స్వామీజీ లేచారు. ఒక క్షణం సరస్వతీదేవిని తలచుకొన్నారు. “అమెరికా దేశపు సోదర సోదరీమణులారా” అంటూ సంబోధించారు. “అంతే. తరువాత మాట మాట్లాడలేకపోయారు. అక్కడ సమావేశమైన అందరినీ ఏదో మహోత్సాహం ఆవహించింది. వందలమంది తమ ఉత్సాహాన్ని అణచుకోలేక లేచి నిలబడ్డారు. చెవులు చిల్లులుపడేటట్లు అక్కడ కరతాళధ్వనులు మిన్నుముట్టాయి” అంటూ ఒక ప్రేక్షకుడు వ్రాశాడు. పిదప స్వామీజీ రెండు నిమిషాలసేపు మాట్లాడాలని ప్రయత్నించారు. కానీ ఆ కరతాళధ్వనులలో ఆయన మాట్లాడ లేకపోయారు. ఇటువంటి ఘనమైన స్వాగతమా అనుకొని ఆయన కాస్త చలించిపోయారు. ఆయన ఇలా వ్రాస్తున్నారు:
“ఒక అత్యద్భుతమైన సంగీతంతోను (మంగళ తూర్యారావాలు), కార్య కలాపంతోను, ఉపన్యాసాలతోను ఆ మహాసభ మొదలయింది. తదుపరి ఒక్కొక్క ప్రతినిధిని పరిచయం చేయగా ఒక్కొక్కరే వేదికను అలంకరించి ప్రసంగించారు. అప్పుడు నా హృదయం దడదడలాడింది; నోరెండిపోయింది. శరీరం కంపించింది. అందువల్ల ఉదయపు సమావేశంలో ప్రసంగించడానికి సాహసించలేకపోయాను. మజుందార్ చక్కని ప్రసంగం చేశాడు. చక్రవర్తి మరింత అద్భుతంగా ప్రసంగిం చాడు. వారిద్దరూ విశేష ప్రశంసలందుకొన్నారు. ముందుగానే చక్కగా తయారు చేసుకొన్న ఉపన్యాసాలతో వారు సంసిద్ధులై వచ్చారు. నేనొక మూర్ఖుణ్ణి, నేనా పని చేయలేదు. కానీ సరస్వతీదేవిని ప్రార్థించి వేదిక పైకి వచ్చాను. డాక్టర్ బారోస్ నన్ను పరిచయం చేశారు. నేను క్లుప్తంగా ప్రసంగించాను. ఆ మహాసభను ఉద్దేశిస్తూ, ‘అమెరికాదేశపు సోదర సోదరీమణులారా!’ అని సంబోధించాను. అంతే, రెండు నిమిషాలపాటు చెవులు గింగురుమనేట్లు కరతాళధ్వనులు చెలరేగాయి. తరువాతే ప్రసంగం కొనసాగించగలిగాను.”*
స్వామీజీ ఏం ప్రసంగించారు?
చరిత్ర పుటలలో నమోదైన ఆ ఉపన్యాసంలోని కొన్ని భాగాలు ఇవి….*
“మాకు మీ రొసగిన మనఃపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో ముచ్చటించడం నాకు మహానందదాయకం. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం పేర మీకు నా అభివాదాలు; సమస్త మతాలకూ సమస్త ధర్మాలకూ తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివాదాలు; నానాజాతులతో, నానాసంప్రదాయాలతో కూడిన భారత జనసహస్రాల పేరిట మీకు నా అభివాదాలు” అంటూ తమ ఉపన్యాసాన్ని స్వామీజీ ప్రారంభించారు.
“సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని లోకానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నే కాక, సర్వమతాలూ సత్యాలనే మేం విశ్వసిస్తాం” అంటూ హిందూమత ఔన్నత్యాన్ని చాటిచెప్పారు.
“సమస్త మతాల నుండి, సమస్త దేశాల నుండి పరపీడితులై, శరణాగతులై వచ్చిన వారికి శరణ్యమైన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమన్ల నిరంకు శత్వానికి గురియై తమ దేవాలయం తుత్తునియలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి, శరణు పొందిన యూదులను– నిజమైన యూదులు అనదగ్గవారిలో మిగిలిన వారిని – మా కౌగిట చేర్చుకొన్నామని తెలుపడానికి గర్విస్తున్నాను. మహాజొరాస్టరీయ సంఘంలో శేషించిన వారికి శరణు ఒసగి – నేటికీ వారిని ఆదరిస్తూన్న (సనాతన) ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను” అంటూ భారతదేశ ఔన్నత్వాన్ని స్వామీజీ నొక్కివక్కాణించారు.
శాఖాభిమానం, మత మౌఢ్యం లాంటి వాటిని ఖండించి అవి లేనట్టి ఒక సమాజాన్ని రూపొందించాలనే సదుద్దేశంతో, “వాటికి అవసాన సమయం ఆసన్నమయింది. ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మ్రోగించబడిన గంట సర్వవిధాలైన స్వమత దురభిమానానికీ, పరమత ద్వేషానికీ – కత్తితో గానివ్వండి, కలంతో గానివ్వండి సాగించబడే నానావిధాలైన హింసకు మాత్రమేగాక, ఒక్క గమ్యాన్నే ప్రాపించబోయే జనం కొందరిలోని నిష్ఠుర ద్వేషభావాలకూ శాంతిపాఠం కాగలదని నేను మనఃస్ఫూర్తిగా ఆశిస్తున్నాను” అంటూ తమ ప్రసంగాన్ని ముగించారు.
తరువాత….
“ఉపన్యాసం ముగిసింది, ఉద్వేగభరితులై అట్లే కూర్చుండిపోయారు. నా ప్రసంగమే అన్నింటికన్నా అగ్రగణ్యమయిందని పత్రికలన్నీ వ్రాశాయి. అమెరికా అంతటా నా పేరు మార్మోగింది. భాష్యకారుడైన శ్రీధరులవారు, ‘మూకం కరోతి వాచాలం – మూగవాణ్ణి సైతం మహావక్తగా మారుస్తాడు’ అంటూ యథార్థాన్నే వచించాడు. ఆ భగవంతుని పావన నామానికి జై”* అంటూ లేఖలో స్వామీజీ వ్రాస్తున్నారు.
అద్భుత శక్తి
చిన్న ఉపన్యాసమే అయినప్పటికీ అది మత చరిత్రలోనేగాక, ప్రపంచ చరిత్రలో సైతం సువర్ణాక్షరాలతో లిఖీతమైన ఒక పుటగా విరాజిల్లింది. “ఆయన మాటల్లో అగ్నికణాలు విరజిమ్మాయి” అని రోమారోలా వ్రాస్తున్నారు. కానీ ఆ అగ్నికణాలు దగ్ధంచేసే కిరణాలు కావు, లోక తాపంచే వాడిపోతున్న హృదయ పద్మాలను వికసింపజేసే శీతల కిరణాలు! కనుకనే ఆ హాలులో ఆసీనులై ఉన్న సమస్త హృదయాలూ ముక్తకంఠంతో ఉత్సాహపూరితంగా శ్లాఘించాయి. వేలాది హృదయాలను దోచుకొనే ఆ దివ్యశక్తి ఎక్కణ్ణుంచి వచ్చింది? అది ఎలాంటి శక్తి?
స్వామీజీ అందరినీ సోదర సోదరీమణులుగా భావించి సంబోధించిన సౌభ్రాతృత్వమే జనంలో ఒక ఉద్వేగభరితమైన స్ఫూర్తిని రగిలించిందని చెప్పవచ్చు. కానీ స్వామీజీకి ముందే అక్కడ ఇద్దరు ‘సోదర సోదరీమణులారా’ అని సంబోధించి ప్రసంగించారు. స్వామీజీ 23 వ వక్త. 5 వ వక్త అయిన మిస్ అగస్టా, 20 వ వక్తయైన ప్రొఫెసర్ పినాస్ చెరాస్ కూడా పై విధంగా సంబోధించే ప్రసంగించారు. వీళ్లు కాక మరికొందరు కూడా సౌభ్రాతృత్వ భావనను నొక్కివక్కాణించి ప్రసంగించారు. కనుక స్వామీజీ విజయానికి ఆ మాటలో, సౌభ్రాతృత్వ భావనో మాత్రమే కారణం కాదు.
మేరీ లూయీ బర్క్ ఇలా వ్రాస్తున్నారు:
“స్వామీజీ మాటలు విని కరతాళధ్వనులు చేయడానికి ముందు ప్రేక్షకులు మౌనంగా, ప్రశాంతంగా ఉన్నారు, స్వామీజీ మాట్లాడడమే తరువాయి కరతాళ ధ్వనులు చేశారని అనుకోరాదు. అందరికీ చక్కని ఆదరణ లభించింది. కానీ ఆ ఆదరణకు అనేక కారణాలున్నాయి. ప్రత్యేక రాజకీయ సంప్రదాయానికి చెందినవారు, ప్రత్యేక మతశాఖకు చెందినవారు, అప్పటికే చిరపరిచితులు, మునుపు అమెరికన్లచే పీడింపబడిన జాతికి చెందినవారు కావడం కారణంగా వారికి చక్కని ఆదరణ లభించింది. ఉదయం నుండి సాయంత్రం దాకా సౌభ్రాతృత్వాన్ని గురించి పలువురు ప్రసంగించారు. కనుక ఈ కారణాల వలన స్వామీజీకి చక్కని ఆదరణ లభించలేదు. ఆయనకు లభించిన ఆదరణకు ఏకైక కారణం ఆధ్యాత్మిక శక్తి.”
స్వామీజీ మాటల్లో విందాం:
“చికాగోలో నా మొదటి ఉపన్యాసంలో నేను అందరినీ ‘అమెరికా దేశంలోని సోదర సోదరీమణులారా’ అని సంబోధించగానే, అందరూ లేచి ఆనందంతో కరతాళధ్వనులు చేయడం మీకు తెలుసు. కానీ అలా వారు పారవశ్యం చెందడానికి కారణం ఏమిటో తెలుసా? ఏదో అద్భుతశక్తి నాలో ఉందని మీరు అనుకోవచ్చు. నిజమే నాలో అలాంటి శక్తి ఉంది, అది ఇదే – ఒక్కసారి కూడా కామభావన నాలో ప్రవేశించడానికి నేను అనుమతించలేదు. నా మనస్సు, నా ఆలోచనలు, సామాన్యంగా మనిషి ఆ మార్గంలో ఖర్చు చేసే శక్తులన్నింటికీ ఒక ఉన్నత దిశలో పోయేటట్లు శిక్షణ నిచ్చాను. ఎవరూ ఆపలేని ఒక మహాశక్తిగా అది రూపొందింది.”
పావన జీవిత శక్తి అటువంటిది. “విశుద్ధి నుంచి నిశ్శబ్దత నుంచే అమోఘ వాక్కు వెలువడుతుంది”* అంటారు స్వామీజీ. ఆ శక్తితో కూడుకొన్న మాటలే ఆనాడు వేలాది హృదయాలను, తదనంతరం అమెరికా యావత్తును, ప్రస్తుతం ప్రపంచాన్నంతా ఆక్రమించాయి.
చికాగో ప్రసంగాల విభిన్న పరిమాణాలను గురించి సోదరి నివేదిత వివరణను పరికిద్దాం:
“సర్వమత మహాసభలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం గురించి ఏం చెప్పాలి! హిందువుల మత సిద్ధాంతాలను గురించి మాట్లాడనారంభించారు ఆయన. ఆయన ముగించినప్పుడు హిందూమతం సృజింపబడిందని చెప్పవచ్చు…
ఏం ప్రసంగించారు?
“అటువంటిదీ మానసిక క్షేత్రం, అటువంటిదీ భావనాసాగరం– తారుణ్య పూర్ణం; సంక్షోభమయం; ఆత్మశక్తితో, ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణం; అయినా కౌతూహలాయుతం; అత్యంత జాగ్రతాపూర్ణం – వివేకానందులు ఉపన్యసించడానికి లేచినప్పుడు వారు ఎదుర్కొన్న వారి ముందున్న సదస్సు.
“దీనికి సరిగా వ్యతిరిక్తమైనది ఆయన వెనుకవున్న ఆ సాగరం; ఆధ్యాత్మిక వికాసంతో కూడిన ప్రశాంత మహాసాగరం; ఆయన వెనుకనున్నది ఒక విచిత్ర ప్రపంచం. ఏ ప్రపంచం తన కాలాన్ని వేదాలతో గణిస్తుంటుందో, తన గతాన్ని ఉపనిషత్తులతో జ్ఞాపకం చేసుకొంటూ ఉంటుందో, దేనితో పోల్చినప్పుడు బౌద్ధమతం నిన్నమొన్నటిదిగా కనిపిస్తూంటుందో, ఏ ప్రపంచం వివిధ మతశాఖలతో నిండివున్నదో, ఏ ప్రశాంత ప్రపంచాన్ని ఉష్ణమండల సూర్యకాంతి ముంచెత్తు తూందో, యుగయుగాల నుంచి యోగిపుంగవులు తమ పద పరాగంతో ఏ ప్రపంచపు దారుల ధూళిని పవిత్రీకరిస్తూ వస్తున్నారో – అటువంటి పావన ప్రపంచం స్వామి వివేకానంద వెనుక ఉన్న ప్రపంచం. వేయి మాటలెందుకు అది పావన భారతదేశం – ఈ దేశం వేల సంవత్సరాల నుంచి చేస్తున్న తన రాష్ట్రీయ వికాసనా యత్నంలో ఎన్నో విషయాలను పరిశోధించింది; ఎన్నో విషయాలను ఋజువు చేసింది; ఇంచుమించు అన్ని విషయాలనూ సాక్షాత్కరించుకొంది. ఒక్క విషయం మాత్రం – తనలోని సంపూర్ణ ఐకమత్యమూ, విస్తారమూ అయిన తన దేశకాలాల ఒక చివరినుంచి ఇంకొక చివరి వరకు తనలో ఉన్న సంపూర్ణ ఐకమత్యం, విశాలమూ విస్తారమూ అయిన తన దేశకాలాలలో కొన్ని మూలమైన, ముఖ్యమైన సత్యాలను గూర్చి తన దేశీయులందరూ ఏకగ్రీవులనీ, తద్ద్వారా పారమార్థికంగా, సాంస్కృతికంగా తనలో పరిపూర్ణమైన ఐకమత్యం ఉన్నదనే విషయం మాత్రం – భారతదేశం గ్రహించలేకపోయింది.
“ఇక ఇవి, ఈ రెండు మనోప్రవాహాలు, రెండు విశాలచింతనా నదులు – ఒకటి ప్రాచ్యం, మరొకటి ఆధునికం. విశ్వమత మహావేదికపై నిలబడ్డ కాషాయాంబర ధారి అయిన పరివ్రాజకుడు ఈ రెండు ప్రవాహాల కలయికకు స్థానమయ్యాడు తాత్కాలికంగానైనా! వ్యక్తిత్వాభిమాన శూన్యుడైన ఈ మహావ్యక్తి ద్వారా సంభవమైన ఆ కలయిక ఒక ప్రచండమైన ఆఘాతం కలిగించింది. ఆ ఆఘాతపు ఫలితమే హిందూమత మూలసత్యాల రూపీకరణం. ఎందుకంటే స్వామి వివేకానంద అక్కడ ఉద్ఘోషించింది తన స్వానుభవం కాదు. అసలాయన తన గురుదేవులను గూర్చి చెప్పడానికైనా ఆ సదావకాశాన్ని వినియోగించలేదు. ఈ రెండింటికీ బదులు ఆయన ద్వారా వినిపించింది భారతీయ ఆధ్యాత్మిక చేతనకీ, తమ సుదీర్ఘ గతం ద్వారా సునిర్దిష్టం గావించబడిన సమస్త భారతీయుల ధర్మసందేశపు వాణి.
“పాశ్చాత్యుల యౌవనకాలంలో, మధ్యాహ్నకాలంలో స్వామి వివేకానంద అక్కడలా ఉపన్యసిస్తూంటే, ప్రశాంత మహానగరపు ఆవలి తీరాన, అర్ధభూగోళపు చీకటినీడలో నిదురిస్తూన్న జాతి ఒకటి (భారతదేశం) తమవైపే అగ్రసరమౌతున్న ఉషస్సు ద్వారా మోసుకొని రాబడుతున్న ఆ దివ్యసందేశామృతం కోసం – ఏ సందేశామృతం తమలోనే నిక్షిప్తమైవున్న మహిమాశక్తుల రహస్యాన్ని ప్రకాశం చేయగలదో– ఆ సందేశామృతం కోసం ఎంతో తహతహతో కాచుకొని ఉంది.
“తమ తమ ప్రత్యేక మతశాఖల, మతసంస్థల ప్రతినిధులుగా ఇతర మతప్రవక్తలు కూడా స్వామి వివేకానందతోపాటు ఆ వేదికపై ఆసీనులై ఉన్నారు. కాని ఒక మహత్తరమైన మతాన్ని ప్రచారం చేసిన గౌరవం దక్కింది వారికొక్కరికే. ఆయన పలుకులలోనే ఆ మతం ఎటువంటిదంటే – వివిధ అవస్థల ద్వారా, వివిధ పరిస్థితులలో అనేకమంది స్త్రీ పురుషులు ఒకే గమ్యాన్ని చేరడానికి చేసే ప్రయాణాలే వివిధ మతాలు; ఈ మతాలన్నీ చివరికి చేరేవి ఆ మహామతంలో– అటువంటిది ఆ మహత్తర మతం. ఈ వివిధ, విభిన్న మతాలన్నింటినీ గూర్చి ఈ విషయంలో లేదా మరొక విషయంలోగాని, ఈ కారణంగా లేదా మరొక కారణంగా గాని, ఈ మతంగాని లేదా మరొక మతంగాని సత్యమనిగాని, అన్ని మతాలూ సత్యాలే అనీ, ఇవన్నీ ‘సూత్రేమణిగణా ఇవ,’ అంటే సూత్రీకరింపబడిన మణిహారంలా అన్నీ నాలోనే అనుస్యూతాలనీ, మానవజాతిని పైకెత్తి, పవిత్రీక రించే అసాధారణమైన పవిత్రతను, శక్తిని ఎక్కడెక్కడ చూస్తావో అక్కడ నేనే ప్రకటీభూతుడనౌతున్నాననీ తెలుసుకో’ అని ఘోషించిన ఒక మహాపురుషుణ్ణి గూర్చి చెప్పడానికే నేనిక్కడకు వచ్చివున్నానని ఆయన చెప్పారు.
“స్వామీజీ బోధించింది పండితుల మాదిరి కాదు, ఆధికారిక పురుషునిలా! ఎందుకంటే తాను ప్రచారం చేసిన సత్యాల లోతుల్లోకి దిగి, వాటిని సాక్షాత్కరించుకొన్న తరువాతే, ఆచార్య రామానుజులలా తిరిగి వచ్చి, చండాలురకు, అంత్యజులకు, విదేశీయులకు ఆ రహస్యాలను తెల్పారు ఆయన.”*
‘అమ్మా, దారి చూపు!’
ఉపన్యాసం ముగిసింది. కూర్చుని ఉన్న స్త్రీలూ పురుషులూ ఒకరినొకరు నెట్టుకొంటూ ఆయనను సమీపించడానికి ప్రయత్నించారు. ఆయన దుస్తులను తాకడానికి అనేకులు ప్రయత్నించారు. ఆ రోజు అక్కడ ఉన్న మిసెస్ ప్లాజెట్ ఇలా అంటున్నారు: “ఆ యువకుడు లేచి నిలబడి, ‘అమెరికాదేశపు సోదర సోదరీమణులారా!’ అని సంబోధించడమే ఆలస్యం! అక్కడ సమావేశమైన అందరూ లేచి నిలబడికరతాళధ్వనులు చేశారు. తామెందుకు అలా చేస్తున్నారో వారికి తెలియరాలేదు. ఉపన్యాసం ముగిసింది. బారులు బారులుగా స్త్రీలు లేచి బెంచీల మీద నడుస్తూ ఆయనను సమీపించారు. ఒకసారి దగ్గరికి వెళ్లి ఆయనను చూస్తే చాలునని వారుభావించినట్లుగా ఉంది. ‘ఓ యువకుడా! ఈ స్త్రీల దాడిని తట్టుకోగలిగితే నువ్వునిజంగా భగవంతుడివే’ అని నాలో నేను చెప్పుకొన్నాను.”
స్వామీజీ విజయం చరిత్రాత్మకం. “హరీ! సర్వమత మహాసభ దీనినిమిత్తమే నిర్వహింపబడుతోంది. నా మనస్సు అదే చెబుతోంది. ఇది ధ్రువీకృతంకావడం నువ్వు భవిష్యత్తులో చూస్తావు” అని ఆయన అమెరికాకు బయలుదేరడానికి మునుపు చెప్పింది ఆనాడు ఋజువయింది.
కానీ స్వామీజీ?
ఈ కీర్తి, సందడితో ఆయన ఉప్పొంగిపోయారా?
లేదు. నాడు తన గదికి తిరిగి వచ్చి రాత్రి పడుకొన్నారు. ఆయన కళ్ల ముందు భారతదేశమే కనిపించింది! భారతదేశంలోని నిరుపేదల కోసమే ఆయనహృదయం స్పందించింది, పేదరికంలోనూ యాతనలలోనూ వాడిపోతున్న సోదరభారతీయుల కోసమే! వారు అనుభవిస్తున్న కష్టాలు ఒక వైపు, ఇక్కడ అమెరికాసౌభాగ్యం మరొక వైపు. రెండింటినీ పోల్చిన స్వామీజీ కళ్లు ఆర్ద్రమైనాయి; కళ్లుమాత్రమే కాదు, తల కూడా తడిసిపోయింది. “అమ్మా! జగజ్జననీ! ఈ పేరుప్రతిష్ఠలు నా కెందుకు? నా మాతృదేశం పేదరికంలో మ్రగ్గిపోతున్నప్పుడు ఈ కోలాహలాలతో నాకు ఏం ప్రయోజనం? పామర భారతీయులను ఉద్ధరించేది ఎవరు? వారికి నేనెలా తోడ్పడగలను? అమ్మా, దారి చూపు!” అంటూ ఆయన మానసికంగా ప్రార్థించారు.
మరునాడు
మరునాడు జరుగబోయేది ఏమిటో స్వామీజీ గ్రహించకపోలేదు. పేరుప్రతిష్ఠలు సర్వత్రా వ్యాపించి తానొక సార్వజనీన వ్యక్తిగా విరాజిల్లనున్నాననీ, తన వ్యక్తిగత జీవితానికి తెర పడబోతున్నదనీ ఆయనకు బాగా తెలుసు. ఒక్క రోజులో జయించడం, ఒక్క క్షణంలో జయించడం, ఒక్క చూపులో జయించడం అని చెబుతుంటారు కదా, కచ్చితంగా అదే స్వామీజీ జీవితంలో జరిగింది. చికాగో వీథుల్లో ఆయన నిలువెత్తు చిత్రాలు చోటుచేసుకొన్నాయి. “హైందవ సన్న్యాసి వివేకానంద” పేరిట వీథుల్లో పోతున్న వారు ఒక క్షణం ఆగి, చూసి తలవంచి చేతులు జోడించి ఆయనకు నమస్కరించి వెళ్లసాగారు.
మరునాడు పత్రికలలో సర్వమత మహాసభ, దానిలో అగ్రగణ్యులు స్వామీజీ అన్న వార్తే పతాక శీర్షిక అయింది:
కొన్ని అంశాలలో అగ్రగణ్యులుగా విరాజిల్లిన వ్యక్తి బ్రాహ్మణ సన్న్యాసియైన స్వామి వివేకానంద.* నారింజ రంగు దుస్తులు; కాషాయ రంగు తలపాగా; చక్కగా తీర్చిదిద్దిన ముఖారవిందం; దృఢమైన శరీరం; అందమైన ముఖం; విశాలమైన నల్లని తీక్ష్ణమైన, ఎవరి అంతరంగాన్నైనా చొచ్చుకొనిపోయి చూసే నేత్రాలు; ఎంతో ప్రసన్నమైన ఆకృతి; ఏ సమావేశంలో ఉన్నప్పటికీ సర్వులనూ ఆకట్టుకొనే వ్యక్తిత్వంతో అందరికీ ఇష్టులయ్యారు అయన. ఇక ఆయన ఆంగ్లభాషా పాటవం అద్భుతం; మాతృభాషలా అనర్గళంగా ప్రసంగించారు.*–చికాగో అడ్వకేట్
ఈ రీతిలో అనేక పత్రికలు వ్రాశాయి. ఆ రోజు మహాసభలో పాల్గొన్న మిస్ మన్రో ఇలా వ్రాశారు:
“అన్ని విధాలా సర్వమత మహాసభ విజయవంతమయింది. అందుకోసం శ్రమించిన అందరికీ, ప్రత్యేకించి డాక్టర్ బారోస్కు ఇదొక మహత్తర విజయం. ఆయన దీనికోసం రెండేళ్లు అవిశ్రాంతంగాశ్రమించారు…. దీనిలో అందరినీ ఆమూలాగ్రం ఆకట్టుకొన్న వ్యక్తి స్వామి వివేకానంద. చికాగో నగరాన్నే ఆయన తన పాదాక్రాంతం చేసుకొన్నారు.”
మరో వైపు
కాని దీనికి రెండవవైపు కూడా ఉంది. చికాగో ప్రధాన దినపత్రికలయిన చికాగో డైలీ ట్రిబ్యూన్, చికాగో డైలీ న్యూస్ లాంటివి స్వామీజీ ఉపన్యాసం అద్భుతంగా ఉందనిగాని, గొప్ప ప్రభావం కల్పించిందనిగాని వ్యాఖ్యానించలేదు. సెప్టెంబర్ 12 వ తేదీ నాటి చికాగో డైలీ న్యూస్ అనేక ఉపన్యాసాలను ప్రచురించింది కాని స్వామీజీ ప్రసంగాన్ని ప్రచురించ లేదు; కేవలం ‘వివేకానంద ప్రసంగించారు’ అని మాత్రం ప్రస్తావించింది. సహజంగా అంతమంది చాలాసేపు కరతాళధ్వనులు చేశారనికూడా ఆ పత్రిక పేర్కొనలేదు.
కొన్ని పత్రికలలో ఇతర వక్తలతో స్వామీజీని పోలుస్తూ, ఆయనను శ్లాఘిస్తూ నర్మగర్భంగా అప్రతిష్ఠ పాలు చేయడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఉదాహరణకు చికాగో అడ్వకేట్, ఇంటీరియర్ లాంటి పత్రికలు. ఇంటీరియర్ (1893 సెప్టెంబర్ 28) ఇలా ప్రచురించింది: “ఆయన ఆంగ్ల వాక్పటిమ అద్భుతం. తమ మాతృభాష మాదిరిగానే ఆంగ్లం మాట్లాడారు. కాని మజుందార్ ఆంగ్లం కూడా ఇందుకు తీసికట్టు కాదు. అంతేకాక ఆధ్యాత్మికతలోనూ, మతం పట్ల ఉన్న ఆసక్తిలోనూ వివేకానంద కన్నా మజుందార్ అగ్రగణ్యునిలా కనిపించాడు.”
కాని ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేసిన పత్రికలు నిష్పక్షపాత వైఖరిని అవలంబించే పత్రికలు కాదనడం సత్యదూరం కాదు. క్రైస్తవమత అభిమాని కావడం వల్లనే మజుందార్‌ను ఇంటీరియర్ పత్రిక కూడా ప్రశంసించింది. ఈ దిగువ వ్యాఖ్యానం దీనిని మనకు చెప్పక చెబుతుంది:
“మజుందార్ బ్రహ్మసమాజానికి చెందిన వ్యక్తి. బ్రహ్మసమాజం హిందూ మత పరిణామంగా చెప్పవచ్చు. నేడు అది ఎంతో వ్యాప్తి గాంచుచున్నది. దాని పురోగతి పరాకాష్ఠగా ఏసుక్రీస్తును ‘దేవకుమారుడు’ అనీ, ‘లోకరక్షకుడు’ అనీ స్వీకరించింది.”
ఆదరణ నిరాదరణలు ఎలా ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించి స్వామీజీ ఖ్యాతిగాంచారు. అనేక పత్రికలు ఆయనను ప్రశంసించాయి. సర్వమత మహాసభ కార్యనిర్వాహకులూ, ఆ సభలో పాల్గొన్నవారూ సమైక్యంగా ఆయనను శ్లాఘించారు.
చికాగో ఉపన్యాసం : ఒక దృక్కోణం
సర్వమత మహాసభలో స్వామీజీ ప్రసంగించిన ‘చికాగో ఉపన్యాసాలు’ నేడు మానవాళి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖీతమైన ఒక పుటగా విరాజిల్లుతున్నాయి; ప్రపంచ మత చింతనాధోరణిలో ఒక గొప్ప మలుపుగా పరిగణింపబడుతున్నాయి. స్వామీజీ ఉపన్యాసాలలో మనకు లభించినవి ఆరు. అవి: 1. స్వాగతానికి ప్రత్యుత్తరం. 2. మన విభేదాలకు కారణం? 3. హిందూమతం 4. మతం: భారతదేశ సత్వర ఆవశ్యకత కాదు. 5. హైందవమత సాఫల్యతే బౌద్ధమతం. 6. తుది సమావేశ ప్రసంగం. వీటిలోనూ 1, 3 మాత్రమే పూర్తిగా లభించాయి.*
ఈ ఉపన్యాసాలలో స్వామీజీ పాశ్చాత్య సందేశపు సారాంశాన్ని చూడవచ్చు.
1. స్వాగతానికి ప్రత్యుత్తరం
ఈ ఉపన్యాసం స్వామీజీకి అంతర్జాతీయంగా గుర్తింపును తెచ్చింది. భారతదేశ, హిందూమత ఘనతను సంగ్రహంగా, స్పష్టంగా ఈ ప్రసంగంలో తేటతెల్లం చేశారు. భారతదేశం ఏ విధంగా ఇతర దేశాలకు ఆశ్రయం ఇచ్చిందో, హిందూమతం ఎలా విశ్వవ్యాప్తమైన మతంగా విరాజిల్లిందో ఇందులో ఆయన విపులీకరించారు. “దేనినీ ద్వేషించక గౌరవించాలనే సిద్ధాంతాన్ని నమ్మడంతో పాటు, సకల మతాలూ సత్యమేనని మేం అంగీకరిస్తున్నాం కూడా” అని ఆయన ప్రసంగించినప్పుడు శ్రోతలు దిగ్భ్రమ చెందారనే చెప్పాలి. ఎందుకంటే ఈ భావన ఆ రోజుల్లో కనీవినీ ఎరుగనిది, అంతెందుకు పాశ్చాత్యుల ఊహల్లో కూడా మెదలలేదు. సకల మతాలూ సత్యమే, సకల మతాలూ ఒకే భగవంతుణ్ణి గురించే ప్రస్తావిస్తున్నాయి. కనుక అన్ని మతాలనూ అంగీకరించాలని చెప్పినప్పుడు, భగవద్గీతను (4.11) ఉదాహరించినప్పుడు అమెరికావారికి అది ఒక క్రొత్త ప్రపంచాన్నే సృజించిందనడం అతిశయోక్తి కాదు.
2. మన విభేదాలకు కారణం?
మనోదృక్పథాలు విశాలమై ఉండాలని ఈ ఉపన్యాసంలో స్వామీజీ నొక్కివక్కాణించారు. ‘బావి కప్ప’ కథ చెప్పి, మనం సంకుచిత పరిధుల నుండి బయటికి రావాలని సూచించారు.
3. హిందూమతం
“హిందూమత ఆదర్శాలను గురించి స్వామి వివేకానంద ప్రసంగించ నారంభించారు. ఆయన ముగించినప్పుడు హిందూమతం సృజింపబడింది” అని ఏ మతాన్ని సోదరి నివేదిత సూచించిందో దానిని ఈ ప్రసంగంలో స్వామీజీ అద్భుతంగా అభివర్ణించారు.
మిషనరీల ప్రచార ప్రభావంతో అక్కడున్న ప్రేక్షకులలో సగం మంది అయినా చైనా, జపాన్, భారతదేశం లాంటి ప్రాచ్యదేశాలను “అనాగరక ఆటవిక జాతులు నివసిస్తూన్న దేశ” మని భావించారు. “రాయినీ రప్పనూ పూజించేవారు, అసంఖ్యాక దేవతలున్నవారు, రథచక్రాల క్రిందపడి ఆత్మార్పణ చేసుకొనేవారు” అని వారు పరిగణించారు.
కాని స్వామీజీ, “అమృతపుత్రులారా!” ఆహా! ఏం మధురవాక్కు! ఏం ఆశా జనకమైన దివ్యనామం! సోదరులారా! ఈ పేరుతో– అమృతపుత్రులనే పేరుతో– మిమ్మల్ని సంబోధించనివ్వండి – నిజంగా హైందవులు మిమ్మల్ని పాపులనడానికి నిరాకరిస్తారు. మీరు భగవంతుని బిడ్డలు, అమృత సంతానం, పావనులు, పరిపూర్ణులు. మీరు భూదేవతలు! పాపులా? మనిషిని పాపి అనడమే పాతకం; మానవ స్వభావానికి అపకీర్తి!” అని గర్జించారు కదా, అది వారి దృకృథాన్ని ఆమూలాగ్రం మార్చివేసింది. వారు ఆశ్చర్యచకితులయ్యారు. ఇంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక నిధులతో అలరారుతున్నవా ప్రాచ్యదేశాలు అనుకొని విస్మయులయ్యారు!
ఈ ఉపన్యాసం లోక చింతనా ధోరణులకు స్వామీజీ అందించిన ఒక మహత్తర కానుక అంటే అతిశయోక్తి కాబోదు. దీని మూలంగా ఆయన హిందూమత యథార్థ సారాన్ని బయటికి తీసుకురావడమే కాక ప్రపంచానికే కొన్ని అద్భుత భావనలను వెల్లడించారు. వాటిలో కొన్నింటిని పరికిద్దాం:
1. మానవుని గూర్చిన నూతన చైతన్య దృక్పథం:
“ప్రపంచంలో జీవిస్తున్న దేవతలారా! మీరు పాపులా?” ఈ ఐదు పదాలు – ఒక మంత్రంలా ఒక అణుబాంబులా పడింది. “మనిషి పాపి, అజ్ఞాని, గతిలేనివాడు” అని బోధిస్తూవచ్చిన దేశం అది. అందులోనూ బోస్టన్ ఫాదరీ అయిన జోసఫ్ కుక్ పాపం గురించి ఒక కవితను రచించి చదివాడు. తనను పాపాత్ముడంటూ, హీనుడంటూ, క్రైస్తవమతం తప్ప గత్యంతరం లేదని ఆయన అందులో రచించింది క్రైస్తవులనే దిగ్భ్రాంతి గావించింది. దానిని గురించి ‘ది ఓపెన్ కోర్ట్’ అనే పత్రిక ఇలా ప్రచురించింది: “సర్వమత మహాసభలో అంతా ప్రశాంతంగా జరిగింది. మొదట ఆ ప్రశాంతతను భగ్నపరచింది హిందువో, ముస్లిమో, యూదుడో కాదు; సాక్షాత్తు ఒక క్రైస్తవుడే అవడం శోచనీయం.”
ఆ స్థితిలో, “మీరు పాపులు కారు, మీరు భూమి మీద సంచరించే దేవతలు” అని ప్రసంగించడం ఆ ప్రజలకు దిగ్భ్రమానందాన్ని చవిచూపి ఉంటుంది, అమృతబిందువులను నింపివుంటుందనడంలో సందేహంలేదు. ఈ ఐదు పదాల మంత్రంలోని మొదటి మూడు పదాలు ఆనందం, విశ్వాసం, గౌరవం, వీరం, శక్తి, స్వేచ్ఛ అని యావత్తు సజ్జనత్వపు సందేశాన్ని కలిగివున్నాయి. చివరి రెండుపదాలు వ్యతిరేకమైన దుఃఖ వైఖరితో కూడుకొన్న సమస్త గుణాలకు సమ్మెటపోటుగా పడ్డాయి. “మనిషి దివ్యుడు, ఆతడు తన దివ్యత్వాన్ని అభివ్యక్తం చేస్తే చాలు” అనే ఒక నూతన సందేశాన్ని ఈ ఉపన్యాసం ద్వారా స్వామీజీ అందించారు.
2. నూతన ప్రకాశంతో కూడుకొన్న మతం: హిందూ మతమంటే రాయీ రప్పలను పూజించడం, మూఢనమ్మకాల పుట్ట అని మిషనరీలు ప్రచారంచేసి, ఇతరులను కూడా కొంతమేరకైనా విశ్వసించేలా చేసిన ఆ కాలంలో హిందూ మతం గురించిన నిజమైన భావనను, ఒక నూతన భావనను ఈ ప్రసంగం ద్వారా స్వామీజీ అందించారు. తద్ద్వారా ‘విశ్వజనీన మతం’ అనే అద్భుత భావనను ఆయన ఇక్కడ అందించారు:
“హిందూమత ఆశయాల సారం ఇది. హైందవుడు తన ప్రణాళిక లన్నింటినీ అమలుపరచడంలో విఫలమై ఉండవచ్చు. కాని ఎప్పుడైనా విశ్వజనీన మతం అంటూ ఒకటి స్థాపితమవాలంటే, అది దేశకాలాలకు అతీతమైనదిగా ఉండాలి. ఆ మతం ఎవరిని గురించి ప్రచారం చేస్తుందో, ఆ భగవంతునిలా పరిధులు లేనిదై ఉండాలి. సూర్యుడు తన కిరణాలను అందరి మీదా సమానంగా ప్రసరించేటట్లు అది కృష్ణభక్తుల, క్రీస్తుభక్తుల, జ్ఞానుల, పాపుల ప్రభృతు లందరినీ సమానంగా చూడాలి. అది బ్రాహ్మణ మతంగానో, బౌద్ధమతంగానో, క్రైస్తవమతం గానో, మహమ్మదీయ మతంగానో కాకుండా, వీటన్నింటికీ ఒద్దికగా ఉండేదిలా, ఇంకా పురోగతి చెందడానికి ఆస్కారం ఉండేదిలా ఉండాలి. పశుప్రాయులైన అనాగరక మానవుల నుండి, ఈయన కూడా మానవమాత్రుడేనా అని సమాజం భయభక్తులతో మ్రొక్కే స్థితికి, తెలివితేటలతోను, సద్గుణాలతోను ఉన్నతి చెంది మానవనైజానికి అత్యున్నతంగా విరాజిల్లే సత్పురుషుల వరకు, అందరినీ ఇముడ్చుకొని, ఆలింగనం చేసుకొనే విశాల దృక్పథం కలిగినదిగా ఉండాలి. ఆ మతంలో ఇతర మతస్థులను హింసించడమూ, సహనరహితంగా ప్రవర్తించడమూ ఉండదు. ఆ మతం స్త్రీ పురుషులందరిలోను దివ్యత్వం నెలకొని ఉండడాన్ని అంగీకరిస్తుంది. మానవాళి తన యథార్థమైన దివ్యత్వాన్ని గ్రహించడానికి తోడ్పడ డమే ఆ మత ఉద్దేశం. దాని శక్తి యావత్తూ అందుకే ఉపయోగపడుతుంది. అటువంటి మతాన్ని అందించండి.”
3. మత సామరస్యం: “హైందవునికి ప్రపంచంలోని మతాలన్నీ, వివిధ పరిస్థితులలోను, సందర్భాలలోను ఉన్న స్త్రీ పురుషులందరూ ఒకే గమ్యం వైపుగా చేసే ప్రయాణమే… ఒకే కాంతి వివిధ రంగుల అద్దాల గుండా ప్రసరించి వివిధ రంగులలో కానవస్తుంది. మనలను మార్చుకోవడానికి ఈ వైవిధ్యాలు ఆవశ్యకం… హిందువులు మాత్రమే రక్షింపబడతారు, తక్కిన వారు పరిరక్షింపబడరని సంస్కృత తత్త్వసాహిత్యంలో ఎక్కడన్నా ప్రస్తావించబడిందా అని కనుగొనమని నేను ప్రపంచానికి సవాలు చేస్తున్నాను.”
శ్రీరామకృష్ణులు తమ జీవితాన్ని ఒక ప్రయోగ క్షేత్రంగా చేసుకొని, “మతాలెన్నో మార్గాలన్ని” అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి, వెల్లడించిన విషయాన్ని ఇక్కడ వెలిబుచ్చారు.
ఈ భావన కూడా అమెరికాలో ఒక గొప్ప విప్లవంగా పరిణమించిందన డంలో ఎలాంటి సందేహమూ లేదు. “క్రైస్తవమతం తప్ప తక్కిన ఏ మతమూ సత్యం కాదు. ఏసుక్రీస్తు తప్ప మరే రక్షకుడూ లేడు” అన్నది క్రైస్తవమత నిశ్చిత అభిప్రాయం. కాని కాలక్రమంలో ఈ భావన చిక్కదనం తగ్గింది. 19 వ శతాబ్దంలో నెలకొన్న భావన గురించి పెరిహియాసింథ్ అనే వ్యక్తి ఇలా వ్రాస్తున్నారు: “అన్ని మతాలూ సమానమైనదనడం నిజం కాదు. అలాగే ఒక మతం తప్ప తక్కిన మతాలన్నీ తప్పైనవని చెప్పడమూ నిజం కాదు. ప్రాచీన క్రైస్తవమతంలా కాకుండా, నేటి క్రైస్తవమతం, అన్ని మతాలకూ సముచిత స్థానాన్ని ఇవ్వాలి.”
“క్రైస్తవ మతం తప్ప గత్యంతరం లేదు” అనే స్థితి నుంచి, ఏదో కొద్దిమంది ఒక మెట్టు దిగివచ్చినప్పటికీ, కార్యాచరణలో దీనిని క్రైస్తవ మత నాయకులు అంగీకరించలేదు. ఆ పరిస్థితిలో స్వామీజీ వెల్లడించిన మతసామరస్య భావన ప్రాధాన్యం వహిస్తుంది.
4. విజ్ఞానం – మతసామరస్యం: విజ్ఞానమూ, మతమూ పరస్పర విరుద్ధ మైనవని పాశ్చాత్యులు ఆది నుండి భావిస్తూవచ్చారు. రెండింటికీ వైరుద్ధ్యం లేదు, అవి పరస్పర అనుబంధం గలవని ఈ ఉపన్యాసం ద్వారా ఉద్ఘాటించారు:
“ఏకత్వ స్థితిని ఆవిష్కరించడమే విజ్ఞానం. పరిపూర్ణ ఏకత్వ స్థితినిసంతరించుకోగానే విజ్ఞానం ఇక ముందుకుపోక ఆగిపోతుంది. తన లక్ష్యాన్నిచేరుకోవడమే అందుకు కారణం. అదే విధంగా, ఏ ముడి సరకు నుండి సమస్త పదార్థాలు సృజింపబడుతున్నవో, దానిని కనుగొన్న తరువాత రసాయనశాస్త్రంపురోగమించదు. ఏ మూల శక్తి నుండి శక్తులన్నీ ఆవిర్భవిస్తున్నవో, దానినికనుగొన్న తరువాత భౌతికశాస్త్రం ఆగిపోతుంది. మరణంతో కూడుకొన్న ఈప్రపంచంలో, మరణానికి అతీతమైన ఒకే జీవిని కనుగొనగానే, మారుతూవున్నప్రపంచంలో పరిణమించని ఒకే ఆధారమయిన ఆతణ్ణి కనుగొనగానే, ఏ ఒకే ఆత్మ నుండి ఇతర ఆత్మలు వెలువడుతున్నట్లు మాయ వలన కానవస్తుందో ఆ ఆత్మను కనిపెట్టగానే మతవిజ్ఞానం పరిపూర్ణమవుతుంది.”
5. మతం అన్నది ఆచరణాత్మక విజ్ఞానం: “హైందవుడు మాటల్లోను, సిద్ధాంతాలలోను జీవించగోరడు. ఇంద్రియాలకు వశపడిన మామూలు జీవితానికి అతీతమైన జీవితాలు ఉన్నాయంటే, ఆతడు వాటిని ముఖాముఖీ చూడాలని అభిలషిస్తాడు…. హిందూమతమనేది ఏదో ఒక సిద్ధాంతాన్నో ఒక సూత్రాన్నో విశ్వసించడం కోసం పోరాటాలలోను, ప్రయత్నాలలోను ఇమిడిపోదు. కేవలంవిశ్వాసం మాత్రమే కాదు, అనుభూతి, అనుభూతి పొంది తదాత్మ్యం చెందడమేహిందూమతం. నిరంతర ప్రయత్నం ద్వారా పరిపూర్ణస్థితిని పొందడమూ, దివ్యత్వాన్ని సంతరించుకోవడమూ, భగవదాభిముఖంగా పోవడమూ, ఆయనను సాక్షాత్కరించుకోవడమే వారి మార్గంలోని ఏకైక ధ్యేయం. భగవంతుని సాన్నిధ్యంలోకి వెళ్లి, ఆయనను దర్శించి, స్వర్గంలోని పితలా పరిపూర్ణ స్థితినిపొందడమే హిందువుల మతం” అని స్వామీజీ గర్జించడం విన్న శ్రోతలు ఆపాదమస్తకం కంపించిపోయారు. “కొన్ని సిద్ధాంతాలను విశ్వసించాలి, లేకుంటేనరకం” అనే ఇంతదాకా వారికి బోధింపబడింది. కాని “సత్యాన్ని ముఖాముఖీకలుసుకోవచ్చు” అంటూ స్వామీజీ గర్జించారు.
4. మతం: భారతదేశ సత్వర ఆవశ్యకత కాదు
భారతదేశ మహత్త్వాన్ని, దాని ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని మొదటి మూడు ఉపన్యాసాలలో స్పష్టంచేసి, అమెరికా ప్రజలకు నిజాన్ని గ్రహింపజేశారు స్వామీజీ.ఈ నాలుగవ ఉపన్యాసంలో, ఇటువంటి ఒక దేశానికి మతాన్ని బోధించడానికి మిషనరీలను పంపించడం అవసరమా అనే ప్రశ్నను లేవనెత్తారు. మతాన్నో, ఆధ్యాత్మికతనో భారతీయులకు క్రొత్తగా ఎవరూ బోధింపనవసరంలేదు; కనుక ఆహారమే వారి తక్షణ ఆవశ్యకత అని స్పష్టం చేశారు. “అజ్ఞానుల ఆత్మలను రక్షించడానికి, మతప్రచారకులను పంపే క్రైస్తవులయిన మీరు వారి శరీరాలనుపస్తుల నుండి పరిరక్షించడానికి ఎందుకు ప్రయత్నించరు?” అంటూ వారిని తీవ్రంగా విమర్శించారు. “ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు మత ప్రచారం చేయడం వారిని అగౌరవపరచడమవుతుంది” అంటూ వారికి మానవత్వంతో చెప్పారు.
5. హైందవమత సాఫల్యతే బౌద్ధమతం
హిందూమతంలో నామమాత్రానికి కానవచ్చే దేవాలయ ఆరాధన వంటివి బౌద్ధం నుంచి స్వీకరించబడ్డాయి. అంతేకాదు, హిందూమతంలోని మరికొన్ని అంశాలు కూడా ఈ విధంగానే బౌద్ధం నుంచి గ్రహించబడ్డవే. “బౌద్ధమతం లేకుండా హిందూమతం జీవించలేదు. అదేవిధంగా హిందూమతం లేకుండా బౌద్ధం జీవించలేదు.” బౌద్ధమతాన్ని హైందవమత సాఫల్యతగా పరిగణించారు స్వామీజీ. ఆ విషయాన్ని ఈ ప్రసంగంలో స్పష్టంచేశారు.
6. తుది సమావేశ ప్రసంగం
“కావలసింది కలహం కాదు, సహకారం.” “ధ్వంసం కాదు, ఐక్యత.” “శత్రుత్వం కాదు, శాంతియుత సమన్వయం.” – ఈ సందేశంతో స్వామీజీ మహోన్నత చికాగో ఉపన్యాసాలు ముగిశాయి.
మత మౌఢ్యం గురించి ఎందుకు ప్రసంగించారు?
చికాగో ఉపన్యాసాలలో మత మౌఢ్యం గురించి స్వామీజీ ప్రస్తావించడానికి ఒక ముఖ్యకారణం ఉంది – అప్పుడు బొంబాయిలోను తక్కిన చోట్ల హిందూ మహమ్మదీయ కలహాలు, ప్రారంభమై ఆ కారణంగా హింసాకాండ, ఘోరహత్యలు జరిగాయి. ఆగస్టు 11 వ తేదీన మహమ్మదీయులూ హిందువులూ నిర్వహించిన మత పరమైన ఊరేగింపు నుండి సమస్య ప్రారంభమయింది. తరువాత ఘోరహత్యలు కొనసాగాయి. దీనిని గురించి వార్తలు అమెరికాలోనిముఖ్య పత్రికలన్నింటిలోను వెలువడ్డాయి. కచ్చితంగా స్వామీజీ వాటిని చదివి వుంటారు. ఈ కలహాలను సూచిస్తూ న్యూయార్క్ టైమ్స్ (1893 ఆగస్టు 15) ఇలా వ్రాసింది:
“భారతదేశంలో హిందూ–ముస్లిం కలహాలు చాలావరకు తగ్గాయి. అందుకు ఆంగ్లేయ పాలనను మనం అభినందించే తీరాలి. ఆంగ్ల ప్రభుత్వం భారతదేశంనుండి వైదొలగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మళ్లీ తలెత్తిన కలహం సూచిస్తుంది.”
ఈ విధంగా హిందూ–ముస్లిం సమస్యను కారణంగా చూపి, ఆంగ్లేయుల పాలనను సమర్థించడం స్వామీజీని కచ్చితంగా బాధించివుంటుంది.
ఉపన్యాసాల కొనసాగింపు
ఈ రోజుల్లో ‘పరమహంస రామకృష్ణులు’ అనే చిన్న పుస్తకాన్ని స్వామీజీ పంపిణీ చేశారు. ఇది థీస్టిక్ క్వార్టర్లీ రెమ్యా (1879 అక్టోబర్) అనే పత్రికలో ప్రతాపచంద్ర మజుందార్ రచనకు మలిముద్రణగా పరిగణింపబడింది. శ్రీరామకృష్ణుల శిష్యుడూ, స్వామీజీ మిత్రుడూ అయిన హరమోహన్ మిత్రా* దీనిని చికాగోలో పంపిణీచేయడానికి ధర్మపాలునిచేత పంపించారు. ఆయన వాటిని స్వామీజీకి అందజేయడంతోపాటు తాను స్వయంగా కొన్ని ప్రతులను పంపిణీచేశాడు.
సర్వమత మహాసభ పదిహేడు రోజులు జరిగింది. స్వామీజీ పలుమార్లు ఉపన్యసించారు. ప్రదర్శనశాలలోని విజ్ఞాన విభాగంలోనూ ఆయన పలుమార్లు ప్రసంగించారు. అనేక విందులలో పాల్గొని వాటిలోనూ ఆయన ప్రసంగించారు. మిసెస్ పాటర్ పామర్ ఇచ్చిన విందులో ఆయన మహిళల స్థితిగతులను గురించి ప్రసంగించారు. ఇవే కాకుండా భగవత్ప్రేమ, వేదకాలంనాటి హిందూమతం: వేదాంతం, భారతదేశంలోని ఆధునిక మతాలు, హిందూమత సారాంశం వంటి అంశాలపై అనేక ప్రసంగాలు చేశారు. కాని ఇవన్నీ అలభ్యాలు. అయినప్పటికీ ఆయన ప్రసంగాలన్నింటికీ చక్కని స్వాగతం లభించింది. జనసందోహాన్ని అదుపు చేయడానికి, ముందుగానే అనుమతి పొందిన వారికి మాత్రమే ప్రవేశం కల్పించ బడింది. అర్ధంతరంగా శ్రోతలు వెళ్లిపోకుండా ఉండడానికి స్వామీజీ ప్రసంగాన్ని చిట్టచివరి కార్యక్రమంగా ఏర్పాటు చేసేవారు. స్వామీజీ ఆంగ్ల శైలీ, ఆంగ్ల భాషను అమిత కౌశలంగా ఉపయోగించుకొనే తీరుతెన్నులూ ఎంతో శ్లాఘింపబడ్డాయి. ప్రత్యేకంగా ప్రశ్నోత్తరాల విభాగాలకు చక్కని స్పందన లభించింది.
వేదిక మీద ఎవరైనా అంతూపొంతూ లేకుండా ప్రసంగిస్తున్నప్పుడు, వందలమంది లేచి బయటకు వెళ్లిపోవ నారంభించేవారు. వెంటనే కార్యనిర్వా హకుడు లేచి, “వందన సమర్పణకు ముందు స్వామి వివేకానంద ప్రసంగిస్తారు” అని ప్రకటించేవాడు. అంతే, బయటికి పోతున్న జనం ఠక్కున తిరిగి వచ్చి గప్‌చుప్‌గా కూర్చునేవారు. చిన్న విసనకర్రలతో విసురుకొంటూ, ముఖాన ఉత్సాహం పొంగిపొరలగా, స్వామీజీ చేయనున్న అరగంట ప్రసంగం వినటానికి ఎన్నో గంటల ఊకదంపుడు ప్రసంగాలను భరిస్తూ కూర్చుండిపోయేవారు.
హిందూమత పరిరక్షకుడు
అంతమాత్రంచేత స్వామీజీ సదా వారితో మృదుమధురంగా, సౌమ్యంగా మాట్లాడి ఉంటారనుకోకూడదు. సెప్టెంబర్ 22 వ తేదీన సర్వమత మహాసభలో అతిముఖ్యమైన అంశం మీద చర్చ జరిగింది. “మత మార్పిడులతో క్రైస్తవ మతం ఇతర మతాలు తుడిచిపెట్టుకు పోయేలా చేయాలా?” అన్నదే ఆ అంశం. స్వామీజీ ఆ చర్చలో పాల్గొనలేదు. ఈ చర్చ పర్యవసానం ఏదైనప్పటికీ, అసలు ఆ భావనే స్వామీజీకి నచ్చలేదనడంలో సందేహం లేదు. అదేవిధంగా సెప్టెంబర్ 25 వ తేదీన రెవరెండ్ జార్జ్ టి. పెంతెకోస్ట్ హిందుమతాన్ని నిమ్నస్థాయికి దిగజార్చి ఘాటుగా విమర్శించాడు. పౌరోహిత్యం చేస్తున్న వందలమంది వేశ్యల గురించి తనకు తెలుసనీ, వారు పౌరోహిత్యం చేస్తున్నందున వేశ్యలైనారనీ, వేశ్యలయినందున పౌరోహిత్యం చేస్తున్నారనీ ఏదేదో తలాతోకా లేకుండా ప్రసంగించాడు.
ఈ ప్రేలాపనతో స్వామీజీ ఆగ్రహోదగ్రులయ్యారు. కాని తన అభిప్రాయం వెలిబుచ్చడానికికానీ, తత్కారణంగా పత్రికల వాదోపవాదాల్లో చిక్కుకోవడానికికానీ ఆయన సుతరామూ ఇష్టపడలేదు. సముచిత తరుణం కోసం ఆయన వేచివున్నారు. ఒక రోజు ఆయన ఉపన్యసిస్తున్నారు. హఠాత్తుగా ప్రసంగాన్ని ఆపుజేసి శ్రోతలను ఉద్దేశించి ఇలా అడిగారు: “మీరు హైందవ శాస్త్రాలు ఏవైనా చదివారా? అవి ఏం వచిస్తున్నాయో మీకు ప్రత్యక్షంగా తెలుసా? అలా చదివినవారు ఎవరైనా ఉంటే దయచేసి చేతులెత్తండి.” ఆ సమావేశంలో క్రైస్తవ తత్త్వజ్ఞులు అనేకులు ఉన్నప్పటికీ మూడో నాలుగో చేతులు మాత్రమే పైకి లేచాయి. ముఖాన ద్యోతకమయ్యే ఒక రకమైన జాలితో స్వామీజీ శ్రోతల వైపు దృష్టిని సారించారు. తరువాత నిటారుగా నిలబడి, “అయినప్పటికీ మమ్మల్ని హీనంగా విమర్శించ డానికి సాహసించారు!” అన్నారు గంభీర స్వరంలో. ఈ విధంగా క్రైస్తవ దేశంలో క్రైస్తవుల నడుమ హిందూమత పరిరక్షకునిగా స్వామీజీ భాసిల్లారు.
“హిందూమతం అతిసూక్ష్మమైనదీ, శ్రేష్ఠతమమైనదీ అన్నమాట నిజమయితే భారతీయులు ఎందుకు నిరుపేదలై ఉన్నారు? ఎందువలన పలుమార్లు భారతదేశం అన్యులకు బానిసగా ఉండడం జరిగింది?” – ఈ ప్రశ్నను అనేక పర్యాయాలు స్వామీజీ ఎదుర్కొన్నారు. “క్రైస్తవ మతమే నిజానికి అత్యంత శ్రేష్ఠమైన మతం. ఎందుకంటే క్రైస్తవ దేశాలు శక్తిమంతమైనవిగా, సుసంపన్నంగా ఉన్నాయి కనుక” అనే వైఖరిలో పలువురు ప్రసంగించారు. ఇందుకు సమాధానం అన్నట్లుగాస్వామీజీ సర్వమత మహాసభలో సెప్టెంబర్ 19 వ తేదీన ఇలా ప్రసంగించారు:
“ప్రాచ్య దేశాల నుండి వచ్చిన మేము ఇక్కడ రోజు కొక అభిప్రాయం వింటున్నాం. మేం అంగీకరించి తీరాలనే ధోరణిలోనే ఆ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. అది ఎలాంటి అభిప్రాయం? మేము క్రైస్తవ మతాన్ని అంగీకరించి తీరాలన్నదే అది. ఎందుకు? ఎందుకంటే క్రైస్తవ దేశాలు సుసంపన్నమైనవికనుక. మేమూ మా కళ్లతో చూస్తున్నాం, అభిప్రాయాలు వింటున్నాం. నిజమే, ప్రపంచంలోనే ఇంగ్లండు సుసంపన్నమైన క్రైస్తవ దేశంగా విరాజిల్లుతున్నది. కానిదాని కాళ్లు ఎక్కడున్నాయి? 25 కోట్ల ఆసియావాసుల గొంతుకల మీద! చరిత్రనువెనుకకు త్రిప్పండి. క్రైస్తవ ఐరోపా సంపత్తి స్పెయిన్ నుంచి వచ్చింది. మెక్సికోపై దాడి చేయడం వలన స్పెయిన్‌కు ఆ సంపత్తి లభించింది. అంటే సాటి మనుషుల గొంతులను తెగనరకడం ద్వారా మాత్రమే క్రైస్తవ మతం సంపదను కూడబెట్టింది. ఆ రకమైన సంపదను హైందవుడు ఆశించడు.”
భారతదేశం ఆధ్యాత్మిక గురువు
కాలాంతరంలో ఒక లేఖలోనూ దీనిని గురించి ఆయన ప్రస్తావించారు:
“ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాల్లో భారతదేశానికి ఎదురు నిలబడగల దేశం మరొకటి లేదు; కాని అదేం చిత్రమోగాని క్రైస్తవ దేశాల నుండి ఇక్కడకు వచ్చిన వారందరిని, ఒక పిచ్చి అభిప్రాయం ఆవేశించింది. క్రైస్తవులు అధికారవంతులూ సంపన్నులూ అనీ, హిందువులుకారనీ, కనుక హిందూమతం కన్నా క్రైస్తవ మతం గొప్పదనీ వారి అభిప్రాయం. సరిగా ఇదే కారణం వలన హిందూమతం ఒక గొప్ప మతం అనిపించుకొంటుందని, క్రైస్తవమతం ఆ మాటకు తగదని హిందువులు వారికి తగినట్లు సమాధానమిస్తారు. కాబట్టే పశుతుల్యమైన ఈలోకంలో మోసానిదే పైచెయ్యి. మంచితనం ఎప్పుడూ దెబ్బతింటుంది. భౌతికవిజ్ఞానంలో పాశ్చాత్యులు ఎంత ఔన్నత్యాన్ని సాధించినా, పారమార్థిక విద్యలోవారింకా పసిపిల్లలతో సమానులేనని నాకు తోస్తోంది. భౌతిక విజ్ఞానం, భౌతికసంపదలను మాత్రమే చేకూర్చగలదు. ఆధ్యాత్మిక విజ్ఞానం శాశ్వతమైనబ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. ఒకవేళ అమృతత్వం (శాశ్వత జీవితం) అనేదిలేదనుకొన్నా, ఆధ్యాత్మిక భావాలు ఆదర్శాలుగా మానవుడికి అమిత ఆనందాన్నికలిగిస్తున్నాయి. ప్రాపంచికత అనే మూఢత్వం, అధికమైన కోర్కెలను రేకెత్తించి, స్పర్థలను జనింపజేసి, చివరికి వ్యక్తిని, సంఘాన్ని కూడా నశింపజేస్తుంది.”*
మరొకసారి స్వామీజీ ఇలా ప్రస్తావించారు:
“ఇంగ్లండు మాకు దేశపాలనను గురించి నేర్పవచ్చు. ఎందుకంటే ఆ కళలో అన్నిదేశాలలోనూ అది అగ్రగణ్యంగా రాణిస్తున్నది. వ్యవసాయం, విజ్ఞానం మొదలైన వాటిని కౌశలంగా చేయగల సమర్థతను అమెరికా మాకు నేర్పవచ్చు. మేం మీ పాదాల వద్ద కూర్చుని నేర్చుకొంటాం. కాని–”, ఇంతదాకా స్వామీజీ కంఠస్వరం మృదుమధురంగా, సౌమ్యంగా ఉంది. ఇక్కడ ఆయన కంఠం గాంభీర్యాన్ని సంతరించుకొంది. ఆయన కొనసాగించారు: “కాని భారతదేశానికి ఆధ్యాత్మికతను బోధిద్దామని ఏ దేశమూ భావించనక్కరలేదు. ఆధ్యాత్మికతను భారతదేశమే ప్రపంచానికంతటికీ బోధిస్తుంది.”
స్వామీజీ తోడ్పాటు
సర్వమత మహాసభ ప్రజలలో గొప్ప జాగృతిని కలిగించిందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సామాన్యంగా ప్రాచ్యదేశాల మతమూ, ఆ దేశస్థులయిన సన్న్యాసులూ అంటేనే మాయలూ మంత్రాలు, రోగనివారణ లాంటి చిట్కాలూ, హస్తలాఘవాలతో కూడుకొన్నదేనని ఆ రోజుల్లో పరిగణించడం కద్దు. కాని ప్రాచ్యదేశాల నుండి సర్వమత మహాసభలో పాల్గొన్న జ్ఞానులు దానిని తప్పు అని నిరూపించారు. కన్ఫ్యూషియ మతస్థుడైన పుంగ్ క్వాంగ్ యు, జపాను బౌద్ధమతానికి చెందిన హోరిన్ టోకీ, శ్రీలంక బౌద్ధమతస్థుడు ధర్మపాలుడు, భారతదేశ బ్రహ్మసమాజస్థు లైన మజుందార్, నగర్కర్ లాంటి వారు సభలో గొప్ప స్పందనను జనింపజేశారు. తత్ఫలితంగా తాత్త్వికత, చింతనలలో ప్రాచ్యదేశ మతాలు మహోన్నతమైనవని పాశ్చాత్య దేశాలకు, ప్రత్యేకించి క్రైస్తవ మిషనరీలకు సుస్పష్టమయింది. క్రైస్తవమత ఆధిక్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పడానికి ఏర్పాటుచేసిన మహాసభ వారికి ప్రతికూలమయింది.
దాన్లో స్వామీజీ వంతు?
అది ప్రత్యేకతను సంతరించుకొంది. బాహ్యంగా ఎగసిన ఉత్సాహపుటలల లోనేగాక, ఉద్వేగ ప్రవాహాలలోనేగాక, నరనరాల్లోకీ చొచ్చుకుపోయిన నూతనోత్తేజంలో కూడా ఆయన వంతు అధికం. ఆయన ప్రభావం ఎంత సుస్థిరమైనదంటే, దానిని “ఒక్క మాటలో చెప్పడానికో వ్రాయడానికో కుదిరేపని కాదు” అని మేరీ లూయీ బర్క్ వ్యాఖ్యానించింది. తరువాతి అధ్యాయాలలో దీనిని గురించి వివరంగా చూద్దాం.
దేని ప్రతినిధి?
సర్వమత మహాసభలో అనేక క్రైస్తవ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. బౌద్ధం, జైనం, కన్ఫ్యూషియమంటూ అనేక మతాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ తమ సంస్థ పరిచయపత్రంతో వచ్చారు; సముచిత రీతిలో పాల్గొన్నారు.
స్వామీజీ ఏ మత ప్రతినిధిగా పాల్గొన్నారు?
ఏ మత ప్రతినిధిగానూ కాదు. ఏ మత, సంస్థ, శాఖవారు ఇచ్చిన పరిచయపత్రమూ ఆయన వద్ద లేదు. స్వామీజీ ఒక హిందువు. కాని ఆయనను ఏ హైందవసంస్థా పంపించలేదు. సముద్రం దాటితే కులం భ్రష్టుపట్టిపోతుంది కదా! కనుక భారతదేశం నుండి కొందరు వెళ్లినప్పటికీ హిందూమత ప్రతినిధిగా ఎవరూ వెళ్లలేదు. అలా ఒక ప్రతినిధిని పంపడంలో మానవ ప్రయత్నం విఫలమయినప్పుడు భగవంతుడే స్వామీజీని పంపించారు. ఎన్నోమార్లు సంక్షోభాలకిగురైనప్పుడు హిందూమతం భగవంతుని వలనా, అవతార పురుషుల వలనా పరిరక్షింపబడడం లోకవిదితం. ఇప్పుడు కూడా ఆ భగవంతుడే స్వామీజీని ఎంపిక చేసి పంపించి హిందూమతాన్ని కాపాడాడు.
బహుశా అదే హిందూమతంలోని ఘనత కాబోలు! హిందూమతానికిస్థాపకుడంటూ ఎవరూ లేరు. ఏ మనిషి జీవితంతోనూ ముడిపడింది కాదు; శాశ్వత సత్యాలే దీనికి పునాది కనుక సనాతనధర్మమని పేరుగాంచింది. కనుక ఏ ప్రత్యేక వ్యక్తి, సంస్థ, వ్యవస్థ ఎంపిక చేయకుండా, శాశ్వత సత్యాల శక్తే ఎంపిక చేసినట్లుగా స్వామీజీ వెళ్లారు.
స్వామీజీని పాశ్చాత్య దేశాలకు పంపించినవారు ఆయనను హిందూమతప్రతినిధిగా నిర్ణయించి పంపించలేదు. ఆయన అమెరికా వెళ్లడానికి సహాయంచేసి, ఆయన ఏం చేయాలో ఆయనకే వదలిపెట్టారు. ఎందుకంటే ఆయన ఒక సందేశంతో వెళుతున్నారని ఆయనను కలుసుకొన్న అనేకులకు ప్రత్యక్షంగా తెలుసు. తాము ప్రపంచానికి అందించడానికి సందేశం ఒకటి ఉందని తమ భారతీయ పర్యటనలలో కఠోరమైన తపోమయ జీవిత ఫలితంగా స్వామీజీగ్రహించారు. అదే విధంగా ఆయనను కలుసుకొన్న అనేకులు ప్రపంచానికి అందించడానికి అవసరమైన ఆధ్యాత్మిక శక్తి ఆయనలో పొంగిపొరలడంగుర్తించారు. “అరుదైన కొన్ని కార్యాలను నిర్వర్తించే దాకా మీరు విశ్రమించరు” అని కచ్ మహారాజు స్వామీజీతో చెప్పివున్నారు. “ప్రపంచాన్నే మార్చి తీర్చిదిద్దగలశక్తి నాలో నెలకొని ఉండడం గ్రహిస్తున్నాను” అని పోరుబందర్లో స్వామీజీ, త్రిగుణాతీతానందతో చెప్పారు.
ఆ శక్తి మేల్కొన్నది, కార్యాచరణకు ఉపక్రమించింది!
సర్వమత మహాసభ ఏం సాధించింది
ఈ సర్వమత మహాసభ సాధించింది ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతున్నది. “బహుశా మతమౌఢ్యులు మరింత మతమౌఢ్యాన్ని సంతరించుకొన్నారు, విశాల హృదయులు మరింత విశాల హృదయులయ్యారు” అని మేరీ లూయీ బర్క్ వ్రాస్తున్నారు. అద్భుతమైన అభిప్రాయం, కాని ముమ్మాటికీ నిజం!
సర్వమత మహాసభ ద్వారా క్రైస్తవమత ఆధిక్యాన్ని ప్రపంచానికి తెలియ జేయాలని అభిలషించిన వారు స్వామీజీ, ప్రాచ్యదేశ మత ప్రతినిధుల సాఫల్యం వలన తమ ఆశయం నెరవేరకపోవడంతో ఆగ్రహించారు. స్వామీజీని రెండు చేతులూ చాపి ఆహ్వానించిన అమెరికా ప్రజలు క్రైస్తవ మిషనరీలను కొంతమేరకు బహిష్కరించారనే చెప్పాలి. భారతీయ మతం, సమాజం, ఆచార వ్యవహారాల లాంటి వాటిని మిషనరీలు అభివర్ణించి అందించిన సమాచారం మూలంగానే ఇంతదాకా తెలుసుకొన్న అమెరికా సమాజం స్వామీజీ ఉపన్యాసాలతో నిజాన్ని ఆకళింపు చేసుకొంది. వితంతువులను సజీవంగా దహనం చేయడం, రథచక్రాల క్రిందపడి జనం ప్రాణత్యాగం చేసుకోవడం, ఆడ శిశువులను మొసళ్లకు ఎరగా వేయడం మొదలైన కట్టుకథలతో భారతదేశాన్ని గురించి మిషనరీలు ప్రచారం చేసినవి అతిశయోక్తులని అమెరికావాసులకు అవగతమయింది. అందువలన మిషనరీలకు వ్యయం చేస్తూన్న నిధులను అమెరికావారు తగ్గించనారంభించారు; మిషనరీల ఆదాయం తగ్గసాగింది.
“మతమౌఢ్యపు వెన్నెముక విరగలేదు. అయినప్పటికీ, తమ మీద మొదటి సమ్మెట పోటు పడినట్లు వారు గ్రహించారు” అని మేరీ లూయీ బర్క్ వ్రాస్తున్నారు. చర్చ్‌ని, మిషనరీలను ప్రతిఘటిస్తూ లేచిన రివైవలిస్ట్ (Revivalist) సంస్థ ప్రగతి దీనిని ధ్రువీకరించింది. ఈ సంస్థ పురోభివృద్ధిని ఎదుర్కోవడానికి చర్చ్, మిషనరీలు ఎంతో పాటుపడవలసిన అగత్యం ఏర్పడింది. వారిలో కొందరి మతమౌఢ్యం తారస్థాయికి పోయింది.
అదే సమయంలో విశాలహృదయులు ప్రాచ్యదేశ మత ఆశయాల ఆధిక్యాన్ని గుర్తించారు. ఇంతటి గొప్ప ఆదర్శాలుగల ఒక దేశానికి మిషనరీలను పంపడం వృథా అని గ్రహించారు. భారతదేశాన్ని గురించీ, హిందూమతం గురించీ తెలుసుకోవడంలో ఆసక్తి కనబరిచారు. “స్వామి వివేకానంద కార్యసాధనల వలన హిందూమతం ఉద్వేగభరితమయింది. దాని శక్తులు నూతన చైతన్యాన్ని సంతరించుకొన్నాయి. ఆంగ్లమయమైనదే, నిస్సారమైనదే హిందూమతమని ఇంతదాకా అమెరికా ప్రజలు భావిస్తూవచ్చారు. స్వామి వివేకానంద ముఖతః నిజమైన హిందూమతం వారికి లభించింది…. ఆయనను పంపించినందుకు అమెరికా, భారతదేశానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నది” అని ప్రపంచ ప్రదర్శనశాల విజ్ఞాన విభాగపు అధ్యక్షుడైన స్నెల్ వ్యాఖ్యానించాడు.
సర్వమత మహాసభ అధ్యక్షుడైన డాక్టర్ బారోస్ కూడా స్వామీజీకి అత్యంత గౌరవస్థానం ఇచ్చాడు: “ఈ వక్త ఒక ఉన్నత కులస్థుడైన హిందువు, సనాతన హిందూమతానికి ప్రతినిధి. సర్వమత మహాసభలో అసంఖ్యాకులైన ప్రజలను ఆకట్టుకొన్న వారిలో ఆయన ప్రథములు” అని ఆయన వ్రాశారు.
అమెరికాకు నిజమైన హిందూమతాన్ని అందించడమూ, స్వామీజీకి గుర్తింపు రావడమూ సర్వమత మహాసభ సాధనల్లో ఒక వైపు మాత్రమే. మరో వైపు ఆ మహాసభ, సాక్షాత్తు భారతదేశంకూడా స్వామి వివేకానందను గుర్తించేలా చేసింది.
“స్వామి వివేకానంద అమెరికా కార్యపు పర్యవసానం ఏదైనప్పటికీ ఒక్కటి మాత్రం విస్మరించలేని నిజం: నాగరకత పురోభివృద్ధి చెందిన ఆ దేశ ప్రజల కళ్లకు నిజమైన హిందూమతం అంటే ఏమిటో ఆయన దర్శింపజేశారు; దాని విలువను వారి హృదయాలలో పెంపొందించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ ఒక్క మహత్కార్యం నిమిత్తమే హిందూ సమాజం స్వామి వివేకానందకు కృతజ్ఞతాబద్ధమై ఉండాలి” అని ‘ఇండియన్ మిర్రర్’ (1894 ఫిబ్రవరి 21) పేర్కొంది.
సర్వమత మహాసభ ముగిసిన తరువాత కూడా అమెరికాలో కొంతకాలం ఉండి భారతీయ ఆధ్యాత్మిక మహత్త్వాన్ని అంతర్జాతీయంగా ప్రచారం చేయగోరారు స్వామీజీ. ఆయన దృష్టిలో, “చికాగో సర్వమత మహాసభ భారతదేశానికీ, భారతీయ చింతనాధోరణులకూ లభించిన ఒక మహత్తర విజయం. వేదాంత తరంగం ప్రపంచాన్నే ప్రదక్షిణ చేసిరావడానికి ఈ విజయం తోడ్పడింది.” దానితోబాటు, “అమెరికాలో ఎగసే ఒక అల భారతదేశంలో సహస్ర తరంగాలను ఉత్పన్నం చేస్తుంది.” తద్ద్వారా తమ మాతృదేశ ప్రగతికి ఆస్కారం పెరుగుతుందని ఆయన గ్రహించారు. కనుక అమెరికాలో ఉండి తమ కార్యాన్ని కొనసాగించారు.