నేను ప్రపంచానికి అందించే సందేశం ఒకటి ఉంది. భయం కాని, భవిష్యత్తు గురించిన సంకోచం కాని లేకుండా దానిని నేను అందిస్తాను.
– స్వామి వివేకానంద
సమాజం — సంపత్తి వనరులు — నూతన ఆవిష్కరణలు — జీవిత దృక్పథం — మతం — మతాతీతమైన సంస్థలు — క్రైస్తవ మత ఆనాటి పరిస్థితి — దేశీయ సమస్యలు — సమాజంలోని సాధారణ పరిస్థితులు —
సర్వమత మహాసభ
సమాజం
స్వా మీజీ సుదీర్ఘ సముద్రయానం ముగిసి, ఆయన తమ పాదపద్మాలను మోపనున్న అమెరికా గురించి కాస్త తెల్సుకుందాం. వైశాల్యంలో భారతదేశానికి రెండు రెట్లు పెద్దది అమెరికా. ప్రజలలో దాదాపు 11 శాతం నల్లజాతి వారు. వారు కాక తెల్లవారు, రెడ్ ఇండియన్లు, జపానీయులు, చైనీయులు మొదలైనవారు అక్కడ వసిస్తున్నారు. ఆర్థికరంగం లోను, రాజకీయాలలోను స్త్రీలకు స్వాతంత్ర్యం లేకపోయినప్పటికీ, సమాజంలో వారి గౌరవ మర్యాదలకు లోటు లేదు.
ఐరోపాలో మాదిరిగానో, భారతదేశంలో మాదిరిగానో కాక అమెరికాలో రాజకీయ సమైక్యత కానవచ్చింది. వైశాల్యంలో పెద్దదయినప్పటికీ ఆచార వ్యవహారాలలో తారతమ్యమో, భాషా సమస్యో, ప్రగతికి ఆటంకాలైన మరో అడ్డంకులో అక్కడ అంతగా లేవు. దేశ సార్వభౌమాధికారాన్ని కాని, రక్షణను కాని భంగపరచేందుకు ప్రయత్నించే పొరుగు దేశాలూ లేవు.
సంపత్తి వనరులు
ప్రకృతి వనరులూ, అటువంటివే అయిన మానవ ప్రయత్నాలూ చేయూత నివ్వడం వలన సంపత్తి వనరులలో అమెరికా ఆనాడూ ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉండేది. నేలబొగ్గు, ఇనుము, చమురు లాంటివి అక్కడ పుష్కలం. దీనికి తోడు సాంకేతిక పరిజ్ఞానం కూడా త్వరితగతిన పురోగమించింది. ప్రకృతి వనరులను సముచితంగా ఉపయోగించుకొనే బుద్ధికుశలత, క్రొత్తవి కనుగొనడంలో ప్రతిభ కలగలసి అమెరికాకు ఈ సంపత్తి వనరులను అందించాయి. “ఈ దేశంలో ధనం నదిలా ప్రవహిస్తున్నది. సౌందర్యం దాని చిరు అల, విద్య దాని పెద్ద అల. సంపదలో వీరు పొర్లాడుతున్నారు…. ఇక్కడ అద్భుతమయిన తేజస్సు, శక్తి ప్రకటితమవుతున్నాయి. ఆహా! ఏం బలం, ఏం కార్యతత్పరత, ఏం పౌరుషం!”* అని ఆశ్చర్యచకితులయ్యారు స్వామీజీ. అనేక లేఖల్లో ఆయన అమెరికా శక్తినీ, ప్రతిభనూ వేనోళ్ల శ్లాఘించారు.
నూతన ఆవిష్కరణలు
స్వామీజీ శ్లాఘించడానికి కారణం లేకపోలేదు. వారు అమెరికాలో అడుగు పెట్టిన 1890 లలోనే నూతన ఆవిష్కరణలు ముమ్మరంగా సాగాయి. 1892 లో అలగ్జాండర్ గ్రాహంబెల్ టెలిఫోన్ కనుగొనడంలో ముందడుగు వేశాడు; విద్యుచ్ఛక్తి సహాయంతో న్యూయార్క్ నుండి చికాగోకు ఆయన టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. అదే సంవత్సరం న్యూయార్క్‌లో ఈస్ట్మేన్ ప్రప్రథమంగా ఈస్ట్మేన్ కోడక్ కంపెనీ ప్రారంభించాడు. 1893 లో హెన్రీఫోర్డ్ మొట్టమొదటిసారిగా పెట్రోలుతో పనిచేసే యంత్రాన్ని (gasoline engine) నడిపించాడు. ఆ సంవత్సరమే నికోలా టెస్లా విద్యుచ్ఛక్తి పర్యవసానం (polyphase alternating current) కొలంబియన్ ప్రపంచ ప్రదర్శనలో ప్రదర్శించి చూపాడు.
జీవిత దృక్పథం
కాని డబ్బు, ఇంద్రియ సుఖాల వెంట పరుగెత్తడంలో మనుషుల జీవితం ఉన్నత ఆదర్శాలకు దూరమయింది. అమెరికా ప్రజలకు ఈ వేగాన్ని ఇచ్చింది ప్రొటెస్టంట్ మత సంస్కర్త అయిన కాల్విన్ మత సిద్ధాంతాలే. కాల్విన్ ఏం చెప్పాడు? “కొందరు స్వర్గానికి పోతారు, కొందరు నరకానికి పోతారు – దీనిని భగవంతుడు ఎప్పుడో నిర్ధారణ చేశాడు. స్వర్గానికి వెళ్లేదెవరు? ధనవంతులు, ఆరోగ్యవంతులు, ఆనందంగా ఉండేవారు. ఎందుకంటే డబ్బు, ఆరోగ్యం, ఆనందం అనేవి భగవదనుగ్రహానికి చిహ్నాలు. ఎవరికి ఇవి ఉన్నాయో వారికి భగవదనుగ్రహం ఉన్నట్లు అర్థం. కనుక వారు స్వర్గానికి పోతారు.”
కాల్విన్ సిద్ధాంతం ప్రజలకు జీవితంపై ఒక ఉద్ధృతిని కల్పించింది. నరకానికి పోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కనుక డబ్బు గడించడంలో అందరూ తలమునకలవసాగారు. బీదసాదలను దోపిడీకి గురిచేసి, దుర్బల దేశాలను బానిసలుగా చేసుకొని, విచక్షణారహితంగా పోటీపడి ఏదో విధంగాడబ్బు గడించాలనే ఉద్వేగం పాశ్చాత్యదేశాలలో కలిగించింది ఈ కాల్విన్ సిద్ధాంతమే.* ఈ దృక్పథాన్ని స్వామీజీ తమ ప్రసంగాలలో తీవ్రంగా ఖండించారు.
మతం
“ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని అవగతం చేసుకోవడానికి పాశ్చాత్యులకు చాలాకాలం పడుతుంది. వారందరికీ రూపాయి, అణా, పైసలే సర్వస్వం. మతం వలన సంపదకానీ, ఆరోగ్యంకానీ, దీర్ఘాయువుకానీ లభించే పక్షంలో దానిని తండోపతండాలుగా ఆశ్రయిస్తారు; లేకుంటే దాని దరికి చేరరు…. ఇది చాలా పెద్ద దేశం; అత్యధికులు మతం గురించి అంతగా పట్టించుకోరు. 99.9 శాతం అట్టివారే. కేవలం దేశభక్తి పేరిటే క్రైస్తవమతం తన ఉనికిని చాటుకొంటున్నది, అంతే; అంతకంటే మరేమీ లేదు” అని స్వామీజీ వ్రాస్తున్నారు.*
యూదు మతంలాంటి ఒకటి రెండు మతాలు తప్ప క్రైస్తవ మతంలో దాదాపు 200 శాఖలున్నాయి. ఈ 200 శాఖలు దాదాపు రెండు లక్షల సంస్థల మూలంగా పనిచేస్తున్నాయి. ఆసియా, ఆఫ్రికాలలోని జనుల మతం మార్చడమే వీరి ఏకైక కార్యం. దీనికోసం ఆ రోజుల్లో ప్రతి ఏటా దాదాపు 33 కోట్ల డాలర్లు ఖర్చుచేసేవారు. అమెరికాలో ప్రొటెస్టంట్ శాఖవారు అధికంగా ఉన్నారు. క్యాథలిక్కులు వారిలో సగం మాత్రమే. క్రైస్తవ మత శాఖలలో ప్రెస్బిటీరియన్ (presbyterian), పేపల్ (papal), ఎపిస్కోపాలియన్ (Episcopalian), కాంగ్రిగేషనల్ (Congregational), మెథాడిస్ట్ (Methodist), యూనిటేరియన్ (Unitarian), బాప్టిస్ట్ (Baptist), మానసిక చికిత్స (Mind-cure), క్రిస్టియన్ సైన్స్ (Christian Science), స్పిరిటిజమ్ (Spiritism), ఎవల్యూషనిజమ్ (Evolutionism) లాంటశాఖలు ప్రజలను అత్యధికంగా ఆకర్షించాయి.
200 కు పైగా శాఖలు ఉన్నప్పటికీ, 33 కోట్ల డాలర్లకు పైగా వ్యయం చేస్తున్నప్పటికీ అమెరికా ప్రజలలో 46 శాతం మాత్రమే ఏదో ఒక మతశాఖకు చెందినవారై ఉన్నారు. తక్కిన వారంతా ధనమే లక్ష్యంగా చేసుకొని జీవితాలు గడుపుతున్నారు.
మతాతీతమైన సంస్థలు
విజ్ఞానాభివృద్ధీ, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పురోభివృద్ధీ అనేకులను మతశాఖల పట్ల విశ్వాసాన్ని కోల్పోయేలా చేశాయి. వీరు నూతన భావాలను అభిలషించారు. ఎమర్సన్ (Ralph Waldo Emerson, 1803–82) అతీత తత్త్వశాస్త్రం (Transcendentalism) ముఖ్యమైన ఒక సంస్థగా ఎదిగింది. దీనిని ఐక్యోద్యమంగా (Concord Movement) కూడా పేర్కొంటారు. థోరో (Henry David Thoreau, 1817 -62) ఈ ఉద్యమంచే ఆకట్టుకొన బడిన నూతన చింతనాశీలురలో ఒకరు. గొప్ప కవియైన వాల్ట్విట్మేన్ (Walt Whitman), ఈ సంస్థకు చెందిన వ్యక్తే! ఈ సంస్థకు చెందిన అనేక చింతనాశీలురపై హైందవ భావనల ప్రభావం ఉంది. అమెరికన్ రచయితలు దీనిని గురించి ప్రస్తావించకపోయినప్పటికీ ఫ్రెంచ్ జ్ఞానియైన రోమారోలా దీనిని స్పష్టంగా తెలిపివున్నాడు.* “ఎమర్సన్ ప్రేరణకు మూలకారణం ఏదో తెలుసా? ఈ పుస్తకం, ఈ భగవద్గీతే! ఆయన కార్లైల్‌ను (Carlyle) చూడడానికి వెళ్లాడు. కార్లైల్ ఆయనకు భగవద్గీత బహూకరించాడు. ఆ పుస్తకమే ఎమర్సన్ ఐక్యోద్యమానికి కారణభూతమయింది. అమెరికాలోని పెద్ద సంస్థలన్నీ ఏదో ఒక విధంగా ఈ సంస్థకు ఋణపడినాయి”* అంటున్నారు స్వామీజీ.
మానసిక చికిత్స, క్రిస్టియన్ సైన్స్, స్పిరిటిజమ్, ఎవల్యూషనిజమ్ లాంటి మత శాఖలలో హైందవ సిద్ధాంతాల ప్రభావం అధికంగా కానవస్తుంది.
క్రైస్తవ మత ఆనాటి పరిస్థితి
క్రైస్తవమతం ఈ విధంగా అనేక శాఖలుగా వ్యవహరిస్తున్నప్పటికీ, మొత్తం మీద కాస్త నిరాశానిస్పృహల్లో పడిందనవచ్చు. ప్రత్యేకించి బైబిల్ స్పష్టివాదాన్ని డార్విన్ పరిణామవాదం తుత్తునియలు చేసినప్పుడు క్రైస్తవ మతం ఒకింత కంపించింది. దానితోబాటు ‘ఉన్నతస్థాయి విమర్శ’ (Higher Criticism) పేరిట జర్మన్ జ్ఞానులు బైబిల్ చారిత్రక సత్యాలపై సందేహాలను లేవదీశారు. ఈ సంస్థ కూడా బలంగా పాదుకు పోయింది. వాణిజ్య రంగ అభివృద్ధి ధనవంతుణ్ణి మరింత ధనవంతునిగానూ, పేదవాణ్ణి మరింత పేదవాణ్ణిగాను చేస్తున్నప్పుడు చర్చ్‌ల సామాజిక న్యాయం గురించి పశ్నలు తలెత్తసాగాయి. ప్రెస్బిటీరియన్లు చర్చ్‌లను తీవ్రంగా ప్రతిఘటించారు. వారికి జనసామాన్యంలో చక్కని మద్దతు లభించింది.
అమెరికన్ ఫాదరీలు ఈ క్రొంగొత్త తరంగాలను ప్రతిఘటించి పెద్దగా ఏమీ చేయలేకపోయారు. దాంతో చర్చ్‌ల పట్ల విశ్వాసం కోల్పోయిన అనేక శాఖలు ఉత్పన్నమైనాయి. స్వామీజీ అమెరికాలో కాలిడినప్పుడు క్రైస్తవ మతం ఈ విధంగా కాస్త దుర్బల స్థితిలో కానవచ్చింది.
చికాగో, సెప్టెంబర్ 1893
ప్రపంచ ప్రదర్శన : ఒక విభాగం
రేఖాచిత్రం
ఆర్ట్ ఇన్స్టిట్యూట్
చరిత్రాత్మక ‘చికాగో ఉపన్యాసాలు’ జరిగిన స్థలం
సర్వమత మహాసభ వేదిక మీద మత ప్రతినిధులు
సర్వమత మహాసభ వేదికపై
1. వీర్చంద్ గాంధీ 3. ధర్మపాలుడు 4. స్వామీజీ
పాశ్చాత్య కార్యాచరణలో
కేథే సెన్బర్న్
మిసెస్ హేల్
హేల్ సోదరీమణులు
హేరియట్ మెకండ్లీ, మేరీ హేల్, ఇసబెల్ మెకండ్లీ, హేరియట్ హేల్
మిసెస్ సారా బుల్
మిస్ జోసెఫైన్ మెక్లౌడ్
ఇ.టి. స్టర్డీ
ఫ్రాన్సిస్ లెగ్గాట్
జాన్ పి. లియాన్
మిసెస్ లియాన్
ప్రొఫెసర్ జె.హెచ్. రైట్
ఆలన్
మిస్ హెన్రిట్టా ముల్లర్
మీడ్ సోదరీమణులు (కింద)
పై వరుస : తురీయానంద, జెస్సీ మీడ్, డోరథీ
క్రింది వరుస : గారీ వైకాఫ్, రాల్ఫ్, హెలెన్ మీడ్, ఆలిస్ హెన్స్బరో
కలుసుకొన్న మేధావులలో కొందరు
ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్
నికోలా టెస్లా విజ్ఞానవేత్
మేడమ్ సారా బెన్హార్ట్
మేడమ్ ఎమ్మా కాల్వే గాయని
రాక్ఫెల్లర్ పారిశ్రామికవేత్త
ఇంగర్సాల్ అజ్ఞేయవాది
ప్రొఫెసర్ పాల్ డ్యూసన్
జె.ఎన్. టాటా పారిశ్రామికవేత్త
పాశ్చాత్య శిష్యులలో కొందరు
జె.జె గుడ్విన్
సేవియర్ దంపతులు
సోదరి నివేదిత
సోదరి క్రిస్టైన్
ఆధ్యాత్మిక మకాంలో, గ్రినేకర్ 1894
పత్రికలలో ప్రసంగాల ప్రకటనలు
భారతదేశం గురించి పాశ్చాత్య పత్రికలలో మిషనరీలు ఇచ్చిన తప్పుడు చిత్రాలు
స్త్రీలు శిశువులను మొసళ్లకు వేస్తున్నారు!
క్రూరమృగాల రోగాల వ్యాధులమయమైన దేశం భారతం
స్త్రీల సజీవ దహనం
మూఢనమ్మకాలతో శిశువులు కాకులకు, రాబందులకు ఆహారంగా వేయబడుతున్నారు!
లండన్, 1896
దేశీయ సమస్యలు
అంతేగాక, 19 వ శతాబ్ద ఉత్తరార్థాన అమెరికాలో ఉద్రిక్తతా, దౌర్జన్యమూ విపరీతంగా ప్రాబల్యం వహించాయి. యజమానులకూ కార్మికులకూ మధ్య అభిప్రాయభేదాలూ, సమస్యలూ అధికమయ్యాయి. 1892 లో మొదటిసారిగా ఇదొక పోరాటంగా, సమ్మెగా పరిణమించింది. దాంతో ఊరేగింపులు, బాంబు ప్రేలుళ్లు, తుపాకీ కాల్పులు, ఖైదు లాంటి సంఘటనలు చెదురుమదురుగా జరుగసాగాయి.
1893 లో దేశం యావత్తూ ఆర్థిక సమస్యతో తల్లడిల్లిపోయింది. వెండి సమస్య* కారణంగా అనేక మిల్లులు, బ్యాంకులు మూతపడ్డాయి. స్వామీజీ అమెరికా నుండి వ్రాసిన మొదటి లేఖలోనే, “ప్రభుత్వం కూడా ఖర్చులను అదేవిధంగా నిలకడ చేయడానికి శాసనం చేయడం వలన, ఏ ఇతర దేశమూ దాని సమీపంలోకి రాలేకపోతోంది”* అంటూ దానిని సూచించారు. అదేసమయంలో వ్యవసాయ రంగం క్షీణించింది. ఇతర వృత్తులు ప్రారంభమై కర్మాగారాలు అధికమయ్యాయి.
దీనితోపాటు నల్లజాతి ప్రజల సమస్యలు తలెత్తాయి. 1892 లో ప్రవేశపెట్టిన శాసనం ప్రకారం నల్లజాతి ప్రజల ఓటు హక్కు ఉపసంహరించబడింది. సర్వతో ముఖంగా వారిని అణగద్రొక్కడానికి ప్రయత్నాలు చేయబడ్డాయి. “ఇప్పుడో, వారెవరి సొత్తూ కారు. వారి ప్రాణాలకు విలువ లేదు. ఏమాత్రం మిష దొరికినా, వాళ్లను నిలువునా కాల్చిచంపుతారు. వాళ్లను కాల్చి చంపే హంతకులను శిక్షించే శాసనం లేదు! వాళ్లు నల్లవాళ్లు కాబట్టి మనుష్యులే కారట! పోనీ వాళ్లు పశువులైనా కారు. అని కదా తెల్లవారు అభిప్రాయపడుతున్నారు”* అని స్వామీజీ వ్రాస్తున్నారు.
దేశీయ సమస్యలు ఈ రకంగా తలెత్తగా, జర్మనీ ఒక శక్తిమంతమైన దేశంగా రూపొంది అమెరికా భద్రతకే ముప్పు వాటిల్లేటట్లు సవాలుగా నిలిచింది. ఇందువలన అమెరికా తన విదేశీ సిద్ధాంతాలను సవరించుకోవలసిన అగత్యం ఏర్పడింది. ఈ విధంగా రాజకీయ రంగంలోనూ ఒక వ్యతిరేకమైన ఉప్పెన కానవచ్చింది.
సమాజంలోని సాధారణ పరిస్థితులు
ఇక సమాజంలోని సాధారణ పరిస్థితులను పరికిద్దాం. స్వామీజీ అమెరికా వెళ్లినప్పుడు మతం దాదాపు కొనఊపిరితో కొట్టుకుంటోంది. దేవుడు ‘మృతిచెందాడు’ అనే భావన పాదుకోసాగింది. క్రైస్తవ మతం ప్రకారం ‘చర్చ్’ భగవంతుని దేహం. దేహమైన చర్చ్తో జీవమైన దేవుడు సమైక్యమయినప్పుడే ఆయన ‘సజీవుడు’. కాని చర్చ్ తన వైఖరితో గౌరవాన్ని కోల్పోసాగింది. దేవుని దృష్టి చర్చ్ పైనుండి మరలిపోయినట్లు అనిపించింది. దేహం నుండి ప్రాణం విడి వడితే అది మరణమే కదా! అందుకే చర్చ్ నుండి విడివడిన దేవుణ్ణి ‘మరణించిన దేవుడు’ అని భావించసాగారు. ఇటువంటి భావనా, విశ్వాసరాహిత్యమూ సమాజంలో విస్తృతంగా తలెత్తసాగాయి. దేవుడు ‘నిష్క్రమించడం’ తో పాటు ఆయన ఒప్పందం మీద* నిర్మితమయిన సత్ప్రవర్తనలూ అదృశ్యం కాసాగాయి.
స్త్రీ విద్యా వ్యాప్తి ప్రారంభమయింది. దానితోబాటు మానవతావాద భావనలతో కూడుకొన్న సంస్కరణ సంస్థలు సైతం ఉద్భవించసాగాయి. చర్చ్‌లలో ఆదివారపు ప్రసంగాలలో మానవతావాద భావనలు బోధింప నారంభించారు.
వైజ్ఞానికరంగంలోని నూతన ఆవిష్కరణలు ప్రజల వేలాది సంవత్సరాల భగవద్విశ్వాసాన్నీ, మతం పట్లగల నమ్మకాన్నీ వమ్ము చేయనారంభించాయి. భూగర్భశాస్త్ర పరిశోధనలు బైబిల్ వచించే సృష్టి భావనను కూకటి వ్రేళ్లతో పెకలించివేయసాగాయి.* చివరగా డార్విన్ పరిణామవాద సిద్ధాంతం ప్రతిపాదింప బడింది. దాంతో పురాతన మత సిద్ధాంతాల ప్రాబల్యం చతికిలపడింది.
తదనంతరం కాల్విన్ సిద్ధాతం బయలుదేరింది. రోమారోలా పేర్కొన్నట్లు ధనం అమెరికా వాసుల పాలిట ‘మరో దేవుని’ గా పరిణమించింది. సుప్రసిద్ధ అమెరికన్ చింతనాశీలులో ఒకరు ఇలా వ్రాస్తున్నారు; “మత సిద్ధాంతాలు మనిషిని నియంత్రించలేని పరిస్థితి ఎదురయినప్పుడు ఆతడు తనను పూర్తి స్వేచ్ఛాజీవిగా భావించాడు. ఈ స్వేచ్ఛాయుత పోకడ సమాజ అక్షాన్నే వాల్చివేస్తుందేమోనని ఆతడు భయపడ్డాడు. మతమూ, పాత నమ్మకాలూ అగ్రాసనంలో లేనప్పుడు తానుగా ఒక అగ్రాసనాన్ని సృష్టించుకొన్నాడు.”* ఆ అగ్రాసనమే ‘డబ్బు’.
సర్వమత మహాసభ
ఈ విధంగా డబ్బు కూడగట్టడం ప్రారంభించి ప్రపంచ దేశాలలో అత్యంత సంపన్న దేశంగా అమెరికా అలరారిన తరుణంలోనే కొలంబస్ అమెరికాను కనుగొని 400 ఏళ్ళయ్యే సందర్భం (1892) సమీపించింది. ఆ సందర్భాన్ని ఉత్సవంగా జరుపుకోవాలని తీర్మానించిన చికాగో ప్రజలు ఒక ప్రపంచ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రదర్శనకు ఇదొక ముఖ్యకారణమయినప్పటికీ, మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి. విక్టోరియా మహారాణి సింహాసనం అధిష్ఠించిన రజతోత్సవం 1851 లో లండన్‌లో వైభవంగా జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని లండన్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను 60 లక్షల కన్నా ఎక్కువమంది చూసి, ఆనందించారు. అదేవిధంగా 1889 లో ప్యారిస్‌లో ఒక ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనను దాదాపు మూడున్నర కోట్ల మంది తిలకించి, ఆనందించారు. ప్రపంచ అద్భుతాలలో ఒకటైన ఈఫిల్ గోపురానికి (Eiffel Tower) ఆ సందర్భంలోనే ప్రారంభోత్సవం జరిగింది. ప్యారిస్ ప్రదర్శన లండన్ ప్రదర్శన కన్నా శోభాయ మానంగా నిర్వహింపబడింది. ఈ రెండిటిని మించిన రీతిలో ఒక ప్రదర్శనను ఏర్పాటు చేయగోరింది అమెరికా. అందుకు ఈ సందర్భాన్ని పురస్కరించుకొంది.
భౌతిక ప్రపంచంలో మనిషి సాధించిన ప్రగతినీ, దానితోపాటు చింతనా ప్రపంచంలో ఆతడి అభ్యుదయాన్నీ ఆ ప్రదర్శనలో అనేకులకు తెలియజెప్పాలని నిశ్చయించారు. స్త్రీల పురోగతీ, పత్రికలు, వైద్యం, మద్యపాన నిషేధం, ఆర్థిక వ్యవస్థ, సంగీతం, రాజకీయాలు, శిక్ష్మాస్మృతి లాంటి ఇరవై శాఖలలో మతానికి కూడా ఒక చోటు కేటాయించబడింది. ఛార్లస్ కరోల్ పోనీ అనే న్యాయవాది సర్వమత మహాసభను సమావేశపరుద్దామనే అభిప్రాయం వెలిబుచ్చాడు. ఆతడి అభిప్రాయం ఆమోదించబడింది. చికాగో ప్రెస్బిటీరియన్ చర్చ్ మతబోధకుడైన జాన్ హెన్రీ బారోస్ సర్వమత మహాసభ పాలకవర్గ సమితికి అధ్యక్షునిగా నియమితుడయ్యాడు.
వైజ్ఞానిక పురోభివృద్ధీ, మతం పట్ల విశ్వాసరాహిత్యమూ వంటి కారణాల వలన ప్రకంపనలు చవిచూసిన క్రైస్తవమతాన్ని నిబ్బరపరచడం క్రైస్తవులకు అనివార్యమైన ఆవశ్యకత అయింది. సర్వమత మహాసభను సమావేశపరచడానికి ఇదొక ముఖ్యకారణం. “సర్వమత మహాసభ క్రైస్తవ మతాన్ని ప్రపంచంలో ఉత్కృష్ట మతంగా తీర్చిదిద్దుతుంది” అని పోనీ అభిప్రాయపడ్డాడు. అనేక దేశాల నుండి, అనేక మతశాఖల వారిని ఆహ్వానించి, వారిని తమ తమ మతాల సిద్ధాంతాలను విశదీకరించేలా చేసి, క్రైస్తవమత ఘనతను స్థాపించాలని వారి కల.* రోమన్ క్యాథలిక్కుల కార్డినల్* అయిన గిబ్బన్స్ దీన్లో ఎంతో ఉత్సాహం కనబరిచాడు. కాని భగవంతుని పథకం ఎవరి కెరుక?
దీనికి సంబంధించిన పనులకు 1890 అక్టోబర్‌లో శ్రీకారం చుట్టారు. పోనీ అధ్యక్షత వహించిన సంఘం అక్టోబర్ 30 వ తేదీన సమావేశమయింది. 10, 000 ఉత్తరాలు, 40, 000 విజ్ఞప్తుల వంటివి ప్రపంచ దేశాలన్నింటికీ పంపబడ్డాయి. ప్రపంచ దేశాలన్నింటి నుండి 3000 మంది సలహాదారులు నియమితు లయ్యారు. దీనిలో భారతదేశం నుండి ఈ క్రింది వారు ఎంపికచేయబడ్డారు: 1. జి.యస్. అయ్యర్ (చెన్నైలోని ది హిందూ దినపత్రిక సంపాదకుడు), 2. పి.పి. నగర్కర్ (బొంబాయి), 3. ప్రతాపచంద్ర మజుందార్ (కలకత్తా). మహాబోధి సొసైటీ ప్రధాన కార్యదర్శియైన ధర్మపాల, బొంబాయి జైనమత సన్న్యాసియైన ముని ఆత్మారాంజీతో ఆ సంఘం వారు సర్వమతమహాసభ విషయంగా సంప్రతించారు. ది హిందూ పత్రికలో జి.ఎస్. అయ్యర్ వ్రాయడం వల్లనేభారతదేశంలో సర్వమత మహాసభ గురించి అనేకులకు తెలిసింది.
క్రైస్తవమత ఉత్కృష్టతను లోకమంతా చాటడానికే సర్వమత మహాసభ సమావేశమవుతున్నప్పటికీ, బాప్టిస్ట్, ఆంగ్లికన్ చర్చ్ లాంటి కొన్ని క్రైస్తవ మతసంస్థలు ఆ ప్రయత్నం తప్పని ఖండించడంతో పాటు, ఆ సభలో పాల్గొనబో మని తెగేసి చెప్పేశాయి. ఆంగ్లికన్ చర్చ్ ఆర్చ్‌బిషప్, బారోసుకు వ్రాసిన లేఖలో, “సరిసమానమైన స్థాయిలోని మతాలు మాత్రమే ఇటువంటి ఒక మహాసభలో పాల్గొనగలవు. అలా కాకుండా సర్వ మతాలనూ పాల్గొనమని మీరు ఆహ్వానించడం వలన నేను ఇందులో పాల్గొనలేకపోతున్నాను” అని వ్రాశాడు. బారోస్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని “ఏసుక్రీస్తుకు విరుద్ధమైన వంచన పథకం” అని హాంకాంగ్ ఫాదరీలు ఖండించారు.
ఈ రకంగా ఆహ్వానమూ, ప్రతిఘటలూ కలగలసిన ఒక పరిస్థితిలో సర్వమత మహాసభ ఏర్పాటయింది.