రండి, మనుషులవండి. మీ సంకుచిత దృక్పథం నుండి బయటకు వచ్చి, దృష్టిని విస్తృతం చేయండి. దేశాలు పురోగమించడం చూడండి. మనిషిని మీరు ప్రేమిస్తున్నారా? మీ దేశాన్ని ప్రేమిస్తున్నారా? అయితేరండి. ఉన్నతమైన, ఉత్కృష్టమైన విషయాల కోసం మనం పాటుపడదాం.
– స్వామి వివేకానంద
సౌందర్యోపాసకుడు — కొలంబో — పినాంగ్ — సింగపూర్ — హాంకాంగ్ — కాంటన్ — కొట్టడానికి వచ్చినవారు వినమ్రులయ్యారు — టాటాకు ఒక సలహా — అమెరికా వైపుగా
సౌందర్యోపాసకుడు
ఓ డ మీది జీవితం ప్రారంభంలో స్వామీజీకి అంత ఆసక్తికరంగా లేదని చెప్పవచ్చు. పడుకోవడానికి నిరంతరమయిన స్థలమంటూ ఒకటి లేకుండా కట్టుబట్టలతో పర్యటించిన వ్యక్తి ఆయన. దాదాపు గత ఐదేళ్లుగా ఆయన జీవితం అవరోధాలు లేకుండా ప్రవహించే అరణ్యవాహినిలా సర్వస్వతంత్రంగా గడచింది. ఇప్పుడు పెట్టేబేడా, బాధ్యత, సుదూర దేశానికి పోతున్నాననే సంకోచం – అంతా కలసి ఆయన మనస్సును కాస్త సంకటపరచి ఉంటాయనడంలో సందేహంలేదు. కాని ఆత్మజ్ఞానీ, సౌందర్యోపాసకులూ అయిన స్వామీజీ ఒకటి రెండు రోజుల్లోనే మనస్సును కుదుటబరచుకొన్నారు. గదిలో ఉన్నప్పుడు భగవద్ధ్యాసలో లయించి ఆంతరిక సౌందర్యాన్ని గ్రోలారు. బయటకు వచ్చినప్పుడు భగవంతుడు సృజించిన ప్రకృతి సౌందర్యంలో తన్మయులయ్యారు.
సముద్ర యానం స్వామీజీకి ఒక క్రొత్త అనుభవం. అపరిమితంగా విస్తరించిన సముద్రం, దాన్లో ఉవ్వెత్తున లేచిపడే తరంగాలు, నూతనోత్సాహాన్ని అందిస్తున్న రీతిలో వీచే గాలులు, విశాలమైన ఆకాశం అన్నీ ఆయనకు క్రొత్తగా ఉన్నాయి. క్రొత్త వ్యక్తులు, క్రొత్త పరిసరాలు, క్రొత్త ఆహారాదులకు క్రమంగా స్వామీజీ అలవాటుపడ్డారు. ఆంగ్లేయుల ఆచారవ్యవహారాలను కూడా నేర్చుకొన్నారు. తోటి ప్రయాణికులు కూడా స్వామీజీలో ఒక విలక్షణమయిన వ్యక్తిని చూశారు. సౌజన్యపూర్వకమైన ఆయన ప్రవర్తన, అనురాగ దృక్కులు, నిర్మలమైన ముఖా రవిందం, ఆ ముఖారవిందాన తాండవించే తేజస్సు, కాషాయాంబరాలు అన్నీ స్వామీజీ పట్ల ఇతరులకు ఎనలేని గౌరవమర్యాదలను కలిగించాయి. ప్రత్యేకించి ఓడ కెప్టెన్ స్వామీజీ పట్ల ఎంతో ఆకర్షితుడయ్యాడు. తీరిక లభించినప్పుడల్లా ఆతడు స్వామీజీ వద్దకు వచ్చి మాట్లాడేవాడు; స్వామీజీ తీరికగా పచార్లుచేస్తున్నప్పుడు వచ్చి కలుసుకొనేవాడు; స్వామీజీకి ఓడంతా త్రిప్పి చూపిస్తూ, ఓడలోని యంత్రాలను గురించి వివరించి చెప్పేవాడు.
స్వామీజీకి బొంబాయిలోనే పరిచయమైన ఛాబిల్దాస్ కూడా అదే ఓడలోప్రయాణం చేస్తున్నాడు. ఆయన స్వామీజీతో సన్నిహితంగా మెలగినట్లు కాని, వేరేసహాయాలు అందించినట్లు కాని దాఖలాలు లేవు.
కొలంబో
ఈ ప్రయాణపు విశేషాలను స్వామీజీ మాటల్లోనే చూద్దాం:* “బొంబాయి నుండి మేం కొలంబో చేరాం. మా ఓడ రేవులో ఒక రోజు పూర్తిగా ఆగింది. ఈ అవకాశాన్ని పురస్కరించుకొని ఊరు చూడబోయాం. వీథుల్లో తిరిగాం; నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు చూసింది ఒక్క ఆలయాన్ని మాత్రమే. ఆ ఆలయంలో బుద్ధభగవానుని విగ్రహం చాల పెద్దదిప్రతిష్ఠితమై ఉంది. బుద్ధుడు నిర్యాణంలోకి ప్రవేశిస్తూన్న రీతిలో ఉంది ఆవిగ్రహం. ఆలయంలోని బౌద్ధ భిక్షువులతో మాట్లాడాలని ప్రయత్నించాను; కానివారికి సింహళ భాష తప్ప మరే భాషా తెలియకపోవడంతో నా ప్రయత్నం ఫలించలేదు. అక్కణ్ణుండి దాదాపు 80 మైళ్ల దూరంలో మధ్య శ్రీలంకలో వెలసిననగరం కాండీ. శ్రీలంక బౌద్ధమత కేంద్రం అది. అక్కడికి వెళ్లడానికి సమయంచిక్కలేదు. ఇక్కడి బౌద్ధులు గృహస్థులు – స్త్రీ పురుషులందరూ – మాంసాహారులు; బౌద్ధభిక్షువులు మాత్రం శాకాహారులు. సింహళ దేశీయుల వేషధారణ, ముఖాకృతిమీ తమిళుల మాదిరే ఉన్నాయి. వారి భాష నాకు అంతుబట్టలేదు. కాని ఉచ్చారణమాత్రం మీ తమిళంలా ఉంది.
పినాంగ్
“మా రెండవ మజిలీ పినాంగ్. ఇది మలయా ద్వీపకల్పంలోని సముద్రతీరం వెంటనున్న ఒక భూఖండం. మలయావాసులు మహమ్మదీయులు. పూర్వంవారు వర్తకుల పాలిట మహాభయంకరులుగా ప్రసిద్ధికెక్కిన ఓడ దొంగలు. కాని ఇప్పుడు అమోఘమైన ఫిరంగులు అమర్చబడివున్న యుద్ధనౌకల ధాటికి తట్టుకోలేక దొంగతనం విడిచిపెట్టి ప్రశాంతమైనవృత్తులను చేసుకొంటూ ఉన్నారు.
“పినాంగ్ నుండి సింగపూర్ పోయే దారిలో ఉన్నతమైన పర్వతాలతో అలరారుతున్న సుమత్రా ద్వీపచ్ఛాయలను చూశాం. పూర్వకాలంలో ఓడ దొంగలకు ఆటపట్టులయిన అనేక ప్రాంతాలను ఓడ కెప్టెన్ నాకు చూపించాడు.
సింగపూర్
“స్ట్రెయిట్స్ సెటిల్మెంట్స్కు సింగపూర్ ముఖ్యపట్టణం. అక్కడ చక్కని వృక్షజాతులుండే ఒక ఉద్యానం ఉంది. ఏర్చికూర్చిన అత్యద్భుతమైన అనేక తాళవృక్షాలు అందులో ఉన్నాయి. విసనకర్రలలా ఉండి ‘బాటసారుల తాళవృక్ష’ (traveller’s palm) మని పేరు గాంచిన చెట్లు అక్కడ కోకొల్లలు. పనస లాంటి (breadfruit) చెట్లు అంతటా విస్తరించి ఉన్నాయి. తమిళనాడులో విరివిగా ఉండే మామిడి చెట్లలా ఇక్కడ ప్రఖ్యాతిగాంచిన మంగుస్థాన్ చెట్లు కోకొల్లలు. అయినా వాటిని మామిడిపండ్లతో పోల్చలేం. ఇక్కడి ప్రజలు తమిళులలాగానే ఉన్నారు; కాని నలుపురంగు విషయంలో పోలిస్తే తమిళులలో సగం కంటె తక్కువే. సింగపూర్‌లో ఒక చక్కని చిత్రవస్తు ప్రదర్శనశాల ఉంది. తమలపాకుల అలవాటూ, ఇంద్రియవాంఛ ఇక్కడ అధికంగా కానవస్తాయి. ఇక్కడ నివాసం ఏర్పరచుకొన్న ఐరోపీయులు ఏదో తమ ప్రథమ కర్తవ్యంలా వీటిలో పాల్గొంటున్నారు.
హాంకాంగ్
“తరువాత మేం హాంకాంగ్‌లో ఆగాం. ఇక్కడకు రాగానే చైనా వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ చైనా వాతావరణం అంత ఎక్కువగా ఉంది. పరిశ్రమలూ, వాణిజ్యమూ అంతా చైనీయుల చేతుల్లోనే ఉంది. హాంకాంగే నిజమైన చైనా. ఓడ లంగరు దించగానే, ప్రయాణికులను తీరానికి చేర్చడానికి వందలకొద్దీ చైనీయుల పడవలు చుట్టుముట్టాయి. ఈ పడవలకు రెండు చుక్కానులు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పడవ వాడు తన కుటుంబంతో పడవలోనే కాపురముంటాడు. అతడి భార్య ఒక చుక్కానిని చేతుల తోను, రెండవ చుక్కానిని కాలితోనూ వేస్తూ, చుక్కానుల వద్దే ఉంటుంది. వీరిలో నూటికి తొంభైమంది తమ పిల్లలను చేతులూ కాళ్లూ మాత్రమే కదలడానికి వీలుచేసి, తమ వీపులకు కట్టుకొంటారు. తల్లి తన పనిలో సతమతమవుతూ ఉంటుంది. ఒక వైపు పెద్ద పెద్ద బరువులను తోస్తూ, ఆశ్చర్యకరమైన మెలకువతో ఒక పడవ మీది నుండి మరొక పడవ మీదికి దూకుతూండగా ఈ చంటిబిడ్డలు తమ కేమీ పట్టనట్లు కాళ్లు ఆడించుకొంటూ ఉండడం చూడడానికి ఒక వింత దృశ్యంగా కనిపిస్తుంది. తల్లి ఇచ్చిన బియ్యపు రొట్టె ముక్కను చీకుతూ వాడు ప్రశాంతంగా ఉంటాడు. చైనా శిశువు ఒక వేదాంతి. మన భారతీయ బాలుడు చేతులపై కాళ్లపై ప్రాకుతూన్నప్పుడు ఈ చైనా శిశువు ప్రశాంతంగా పనిలోకి వెళతాడు. అవసరం అనే సిద్ధాంతాన్ని అతడు చక్కగా ఆకళింపు చేసుకొన్నాడు. చైనావారుగాని భారతీయులుగాని స్తబ్ధత చెందిన నాగరకతతో ఉండడానికి కారణం దుస్తరమైన వారి దారిద్ర్యమే. నిత్యావసరాలను గూర్చిన దిగులే, సాధారణ భారతీయుణ్ణిగాని, చైనీయుణ్ణిగాని మరొక విషయాన్ని గురించి ఆలోచింపనివ్వదు.
“హంకాంగ్ సుందరమైన నగరం. నగరానికన్నా చాలా చల్లగా ఉండే కొండచరియలలోను, ఆ కొండ శిఖరాలలోను ఈ పట్టణం నిర్మితమై ఉంది. కొండల పైకి నిటారుగా పోయే ట్రామ్ బళ్లు ఉన్నాయి. ఆవిరిశక్తితోను, దిట్టమైన తీగలతోను ఆ ట్రాములు నడుస్తాయి.
కాంటన్
“మేం హాంకాంగ్‌లో మూడు రోజులుండి కాంటన్ చూడడానికి వెళ్లాం. కాంటన్ నదికి ఎనభై మైళ్లు ఎగువలో ఉంది. ఆ నది అతి విశాలంగా ఉండడంతో పెద్దపెద్ద ఓడలు దాన్లో సునాయాసంగా రాకపోకలు చేస్తూంటాయి. హాంకాంగ్, కాంటన్ల మధ్య అనేక ఓడలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఒక రోజు సాయంత్రం ఒక ఓడలో బయలుదేరి మర్నాడు ఉదయం కాంటన్ చేరాం. ఆహా! ఏం దృశ్యం. కలకలమై, జీవం ఉట్టిపడుతున్నదా అన్నట్లున్నది. నీటి ఉపరితలాన్ని పూర్తిగా కప్పివేస్తూ ఎన్ని పడవలు! కేవలం అవి పడవలేకావు, ఇళ్లలా ఉపయోగపడే గూటి పడవలు వందలకొద్దీ వాటిలో ఉన్నాయి. వాటిలో చాలాభాగం చక్కని నివాసయోగ్యమైన పెద్దపడవలు. వాటికి చుట్టూ వసారాలు, మధ్యలో రహదార్లు కలిసి, రెండు మూడు అంతస్తుల పెద్ద పెద్ద ఇళ్లలా ఉన్నాయి. అవన్ని నీటి ఉపరితలం మీద తేలుతున్నాయి!
“విదేశీయులు బసచేయడానికి చైనా ప్రభుత్వం కేటాయించిన ఒక భూభాగం మీద మేం దిగాం. ఈ మహానగరం నదికి ఇరువైపులా మైళ్లకొద్దీ విస్తరించి ఉంది. ఇక్కడ త్రొక్కిసలాడుతూ, త్రోసుకొంటూ, ఉప్పొంగుతూ, ఘోషపెడుతూ మహారణ్యం అనేట్లువున్న జనసమూహం కనిపిస్తుంది. ఇంత జనాభా ఉన్నా, ఇంత కార్యోన్ముఖమైన సందడితో ఉన్నా ఇటువంటి అపరిశుభ్రమైన నగరాన్ని నేను ఎక్కడా చూడలేదు. నేను చెప్పేది భారతదేశంలో కనిపించే మురికి పట్టణం వంటిదని కాదు. ఎందుకంటే నలుసంత అశుద్ధాన్నైనా చైనీయులు చూస్తూ, వదిలిపెట్టరు. కాని ఈ చైనావాడు జన్మలో ఎప్పుడూ స్నానం చేయనని శపథం చేశాడా అనేట్లు ఉండడం వలన, అపరిశుభ్రంగా ఉందన్నాను!
“ప్రతి ఇల్లూ ఒక దుకాణమే; పై అంతస్తులో జనం కాపురం చేస్తూ క్రిందిభాగాన్ని దుకాణంగా ఉంచుకొంటారు. వీథులు ఎంత ఇరుకుగా ఉన్నాయంటేమనం పోతున్నప్పుడు వీథికి ఇరువైపులా ఉన్న దుకాణాలు మనకు తగులుతూ ఉంటాయి. ప్రతి పది అడుగులకీ ఒక మాంసం అంగడి ఉంది. వాటిలో కుక్కమాంసం, పిల్లిమాంసం అమ్మే అంగళ్లు కూడా ఉన్నాయి. అయితే అతిబీదవారు మాత్రమే కుక్కలనూ పిల్లులనూ తింటారు.
“చైనా స్త్రీలు ముఖాలను ఎన్నడూ చూపించరు. ఉత్తర భారతదేశ హిందువులలో మాదిరి వీరికి ఘోషా పద్ధతి ఉంది. కూలీ స్త్రీలను మాత్రమేచూడగలం. వారి పాదాలు చిన్నపిల్లల పాదాలంత చిన్నవిగా ఉంటాయి. వారినడకను నడక అనలేం, అది కుంటడం మాత్రమే.
“నేను అనేక దేవాలయాలను దర్శించాను. కాంటన్‌లోని అతి పెద్ద దేవాలయం, ప్రప్రథమ బౌద్ధ చక్రవర్తి* , బౌద్ధమతానికి చెందిన మొదటి ఐదువందల మంది జ్ఞాపకార్థం నిర్మితమయింది. ఆ దేవాలయంలో ప్రతిష్ఠిత మయిన మూర్తి బుద్ధభగవానునిదే; ఆయనకు ప్రక్కన కాస్త క్రిందుగా ఆ చక్రవర్తివిగ్రహం ప్రతిష్ఠితమయి ఉంది; ఇరువైపుల కొయ్యతో సుందరంగా మలచబడిన శిష్యుల విగ్రహాలు ఉన్నాయి.”
కొట్టడానికి వచ్చినవారు వినమ్రులయ్యారు
అక్కడున్న ఒక చైనా మఠాలయాన్ని సందర్శించగోరారు స్వామీజీ. కాని ఏమఠంలోనూ విదేశీయులను అనుమతించరు. లోపలికి వెళ్లడానికి మార్గం ఏదైనా ఉందా అని కూడా వచ్చిన దుబాసీని స్వామీజీ అడిగారు. అతడు అసాధ్యమని తెగేసి చెప్పేశాడు. ఈ ప్రతికూలతలూ, నిరాకరణలూ ఉత్సుకతను నీరుగార్చడానికి బదులు స్వామీజీలోమరింత ఆసక్తిని పెంచాయి. “బహుశా విదేశీయుడు ఎవరైనా మఠంలోకి వెళితే ఏమవుతుంది?” అని స్వామీజీ అడిగారు. “దెబ్బలూ తన్నులే” అన్నాడు ఆ దుబాసీ.స్వామీజీ వదలిపెట్టేలా లేరు. “చంపేస్తారా ఏమిటి? రండి, వెళ్ళి చూద్దాం!” అంటూ, ఆతణ్ణి కూడా లాక్కొని ముందుకు వెళ్లారు. కొందరు జర్మనీ ప్రయాణికులూవారితోబాటు వెళ్లారు. ఒకటి రెండు అడుగులు ముందుకు వేసేలోగానే, మఠంలోనుండి కొందరు చేతుల్లో కర్రలు పుచ్చుకొని పరుగెత్తుకొంటూ వచ్చారు. అంతే, దుబాసీ పలాయనం చిత్తగించడానికి సంసిద్ధుడయ్యాడు. స్వామీజీ అతణ్ణి పట్టుకొని ఆపి, “నువ్వు పరుగెత్తు, నేను వద్దనను. కాని ‘భారతీయ యోగి’ అనడానికి చైనా భాషలో ఏమంటారో కాస్త చెప్పి మరీ, పరుగెత్తు” అన్నారు స్వామీజీ.దుబాసీ చెప్పాడు. ఆ మాటను స్వామీజీ బిగ్గరగా చెప్పారు.
‘యోగి’ అనే మాట ఒక మంత్రంలా పనిచేసింది. కొట్టడానికి పరుగెత్తు కొంటూ వచ్చిన వారు స్వామీజీ పాదాల మ్రోల వాలిపోయారు. లేచినిలబడి ఎంతో వినమ్రంగా చేతులు జోడించి ఆయనకు నమస్కరించారు. తరువాత చేతులు జోడించుకొనే ఆయన నుండి ఏదో ఎదురుచూస్తూన్నట్లు ఏదేదో చెప్పారు. వారి మాటల్లో ‘కబట్చ్’* అనే పదం మాత్రమే స్వామీజీకి అర్థమయింది. వారు ఏదో తాయెత్తు అడుగుతున్నారని స్వామీజీ గ్రహించారు. దానిని రూఢి చేసుకోగోరారు. కాని దుబాసీ ప్రక్కన ఉంటే గదా! భయపడి పారిపోయిన అతడు కాస్త సురక్షితమైన దూరంలో నిలబడి ఉన్నాడు. కర్రలు పుచ్చుకొని కొట్టడానికి వచ్చిన వారు పాదాల మీద పడిపోయి నమస్కరించిన విచిత్రాన్ని చూసి అతడు తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఇలాంటి అనుభవాన్ని అతను తన జీవితంలో పొందలేదు. అయినప్పటికీ స్వామీజీ అడగగానే, “అవును. వారు తాయెత్తులే అడుగుతున్నారు. భూతప్రేతాలను తరిమిగొట్టడానికీ, దుష్టశక్తులను అంతం చేయడానికీ వారికి మీ శక్తీ, రక్షణా కావాలట” అన్నాడు దుబాసీ.
స్వామీజీ తమ జేబు నుండి ఒక కాగితం తీశారు. దానిని చిన్నచిన్న ముక్కలుగా చేశారు. వాటి మీద ‘ఓం’ అని సంస్కృతంలో వ్రాసి వారందరికీ ఇచ్చారు. ఏదో అరుదైన నిధి లభించినట్లుగా ఆనందించిన వారు భక్తిప్రపత్తులతో వాటిని తమ శిరస్సులకు ఒత్తుకున్నారు. ఆ తరువాత గౌరవపూర్వకంగా స్వామీజీని మఠంలోకి తీసుకొని వెళ్లారు.
అదొక పురాతన కట్టడం. కొన్నిచోట్ల శిథిలావస్థలో ఉంది. కాని ఆశ్చర్యం! అక్కడ కొన్ని పురాతనమయిన సంస్కృత తాళపత్రాలు, అందునా పురాతన వంగ లిపిలో ఉన్నాయి. ఠక్కున స్వామీజీకి తాను ఇంతకు మునుపే చూసిన ఒక దేవాలయం జ్ఞాపకానికి వచ్చింది. ప్రప్రథమ బౌద్ధ చక్రవర్తి కోసం నిర్మితమయిన దేవాలయం అది. బుద్ధుడు తమ ఐదు వందల శిష్యులతో ఆసీనుడై ఉన్నచిత్తరువు కూడా అక్కడ ఉంది. ముఖంలోని కవళికలనిబట్టి శిష్యులలో కొందరు బెంగాలీలలా ఉన్నారు. స్వామీజీ చరిత్ర విద్యార్థి కదా! ఈ ఆధారాలు ఆయనకు చారిత్రక నిజాలను కొన్నింటిని తేటతెల్లం చేశాయి – ఒకానొక కాలంలో చైనాకూ వంగదేశానికీ మధ్య సన్నిహితమైన రాకపోకలూ, సంబంధాలూ ఉండేవి; వంగదేశంలోని బౌద్ధ సన్న్యాసులు అనేకులు చైనా వెళ్లి బౌద్ధమతాన్ని వ్యాపింప జేశారు. మొత్తానికి చైనా నాగరకత మీద భారతీయ చింతనాధోరణుల ప్రభావం ఎంతో ఉండేది.
కాంటన్ నుండి స్వామీజీ జపాన్ చేరుకొన్నారు. అక్కడ నుండి మరొక భారతీయుడు స్వామీజీతో కలసి పయనం చేశాడు. ఆ వ్యక్తి భారతదేశంలోని అత్యంత సంపన్నులలో ఒకరూ, ఉక్కు కర్మాగార అధిపతీ అయిన సర్ జమ్షెడ్జీ టాటా. స్వామీజీ మాటల్లో చూద్దాం:
“ముందుగా నాగసాకీ అనే రేవును చేరుకొన్నాం. ఓడ నుండి దిగి కొన్ని గంటలసేపు ఆ నగరాన్ని తిరిగి చూశాం. ఆహా! ఎంతమార్పు! ప్రపంచంలో అత్యంత పరిశుభ్రమైన వారిలో జపానీయులు ఒకరు. సమస్తం పరిశుభ్రంగా, సక్రమంగా ఉన్నాయి. దాదాపు వీథులన్నీ విశాలంగా, తిన్నగా, వరుసగా అమరి వున్నాయి. వారి చిన్న ఇళ్లు పంజరాలలా ఉన్నాయి. దేవదారు వృక్షాలతో నిండి సదా సస్యశ్యామలంగా ఉన్న చిన్న గుట్టలు దాదాపు ప్రతి గ్రామానికీ నగరానికీ నేపథ్యంగా భాసిల్లుతున్నాయి. పొట్టిగా, తెలుపు రంగులో, విచిత్ర వేషధారణతో కూడుకొన్న జపానీయుల వైఖరులూ, సైగలూ అన్నింట్లోను అందం ఉట్టిపడుతుంది. జపాన్ అందమైన దేశం. దాదాపు ప్రతి ఇంటి పెరటిలో ఒక తోట తప్పక ఉంటుంది. చిన్నచెట్లు, చిన్న పచ్చిక బయళ్లు, చిన్న చిన్న కృత్రిమమైన నీటిప్రవాహాలు, చిన్న రాతి వంతెనలు జపానీయుల శైలిలో అమర్చబడి ఉన్నాయి.
“నాగసాకీ నుండి కోబే చేరుకొన్నాం. జపాన్ లోపలి ప్రాంతం చూడగోరి నేను ఓడ దిగి నేల మీదుగా యోకోహామా వెళ్లాను. జపాన్ లోపలి ప్రాంతంలో మూడు పెద్ద నగరాలను చూశాను; అవి పెద్ద పారిశ్రామిక నగరమైన ఒసాకా, పాత రాజధానియైన క్యోటో, ప్రస్తుత రాజధానియైన టోక్యో. కలకత్తా కన్నా దాదాపు రెండు రెట్లు పెద్దది టోక్యో; జనాభా కూడా దాదాపు రెండు రెట్లు ఉంటుంది. పాస్‌పోర్ట్ లేకుండా జపాన్ లోపలి ప్రాంతాలలో విదేశీయులు పయనించడానికి అనుమతి ఇవ్వబడదు.
“ప్రస్తుత అవసరాలను గురించి జపానీయులకు చక్కని అవగాహన ఉందని తోస్తున్నది. వారి వద్ద చక్కని క్రమబద్ధమైన సైన్యం ఉంది. వారి అధికారులలో ఒకరు కనుగొన్న అద్వితీయమైన తుపాకీలతో ఆ సైన్యం పటిష్ఠంగా ఉంది. నౌకాదళాన్నీ వారు విస్తృతిస్తున్నారు. ఒక జపాన్ ఇంజనీర్ నిర్మించిన దాదాపు మైలు పొడవుగల సొరంగం ఒకటి నేను చూశాను.
“అగ్గిపెట్టెల కర్మాగారాల దృశ్యమే దృశ్యం! అవసరమైన సమస్తాన్నీ తమ దేశంలోనే ఉత్పత్తి చేసుకోవడంలో వారు పూర్తిగా నిమగ్నులై ఉన్నారు. చైనాకూ జపాన్‌కూ మధ్య జపాన్‌వారి ఆవిరి ఓడల రాకపోకలున్నాయి; త్వరలోనే బొంబాయికీ యోకోహామాకూ మధ్య కూడా వారు ఓడల రాకపోకలకు ఏర్పాటు చేయాలనుకొన్నారు.
“అనేక దేవాలయాలను సందర్శించాను. అన్నింట్లోనూ పురాతన వంగ లిపిలో వ్రాయబడివున్న సంస్కృత మంత్రాలు కానవచ్చాయి. పురోహితులలో ఏ కొద్దిమందో సంస్కృతం తెలిసినవారున్నారు. వారు తెలివైనవారు. ప్రగతి, ప్రగతి అనే ఆధునిక స్ఫూర్తి ఈ పురోహిత వర్గంలోనూ చొచ్చుకొనిపోయింది.”
టాటాకు ఒక సలహా
స్వామీజీ పట్ల టాటా బాగా ఆకర్షితుడయ్యాడు. ఆయన కాలాంతరంలో స్వామీజీ గురించి ప్రస్తావించినప్పుడు, “స్వామీజీ జపాన్ సందర్శించినప్పుడు ఆయనను చూసిన జపానీయులు ఆశ్చర్యచకితులయ్యారు. బుద్ధునికీ, స్వామీజీకి ఎంతో సారూప్యం ఉన్నట్లు వారు భావించారు” అనేవారు. స్వామీజీ కూడా టాటా పట్ల ఎంతో ఆకర్షితులయ్యారు. ఆయన ఒక పారిశ్రామికవేత్త. ఆయన తలచుకొంటే పారిశ్రామిక రంగంలో అనేక మార్పులు తీసుకురాగలరని స్వామీజీ గ్రహించకపోలేదు. అంతేగాక జపాన్‌లోని అగ్గిపెట్టెల కర్మాగారాన్ని చూసిన జ్ఞాపకం స్వామీజీ మనస్సులో చెరగని ముద్రవేసింది. ఒక రోజు ఆయన టాటాతో, “మీరెందుకు అగ్గిపుల్లలు జపాన్ నుండి భారతదేశానికి దిగుమతి చేసుకొంటున్నారు? అందువలన మీకు కొంత లాభం ఉన్నమాట నిజమే. కాని భారతదేశ సంపద జపాన్‌కు కదా తరలిపోతున్నది! మీరు భారతదేశంలోనే ఒక అగ్గిపెట్టెల కర్మాగారం ప్రారంభించవచ్చు కదా! మీకు లాభానికి లాభమూ దక్కుతుంది, నిరుద్యోగంతో అల్లాడుతున్న భారతీయులలో పలువురికి పని కూడా దొరుకుతుంది. భారతదేశ సంపద వనరులు మరెక్కడికీ పోకుండా పరిరక్షింపబడతాయి” అన్నారు.
స్వామీజీ దేశభక్తీ, ఆచరణాత్మకమైన జ్ఞానమూ, భారతదేశ అభ్యున్నతికి ఆయన చూపిన మార్గమూ టాటా మనస్సులో బాగా నాటుకుపోయాయి. ఆయన స్వామీజీ భావనను కాలాంతరంలో తమ సంస్థలో అమలుచేశాడు. ఆ తదనంతరం (1898 నవంబర్ 23 వ తేదీన) స్వామీజీకి ఇలా వ్రాశారు:
“జపాన్ నుండి చికాగో దాకా నేను మీతో ప్రయాణం చేసిన విషయం మీరు మరచిపోయివుండరని ఆశిస్తాను. నాడు మీరు వ్యక్తం చేసిన భావనలు నా మనస్సులో ఇంకా తాజాగా మెదలుతున్నాయి. భారతీయులలో ఏదో తపోమయ జీవితంలో పాల్గొనే ధోరణి ఎక్కువ అవుతున్నదని మీరు చెప్పారు. అలాంటి మనోవైఖరిని ధ్వంసం చేయడం కాదు, సరైన దిశలోకి మళ్ళించడమే మన కర్తవ్యమని తెలిపారు. నా భారతదేశ విజ్ఞాన పరిశోధనా సంస్థ గురించి మీరు వినివుంటారు. ఆ ప్రణాళికలో మీ భావనలను జోడించాలనుకొంటున్నానని మీకు తెలుపుకొంటున్నాను.”
చైనా అయినా, జపాన్ అయినా దేనిని చూసినా, ఏది విన్నా స్వామీజీ మనస్సులో భారతదేశ ప్రగతి ఒక్కటే కదలాడుతూండేది. భారతదేశానికి ఎంతో వెనుక వచ్చిన దేశాలు బాణంలా దూసుకొని ముందుకు పోతున్నప్పుడు, భారత దేశానికి మాత్రం ఎందుకు ఈ తిరోగమనం? ప్రయాణంలో కంటబడ్డ దృశ్యాలు కలిగించిన సంతోషం మనస్సును తట్టిలేపినా వెంటనే ఆయన భారతదేశాన్ని తలచుకొని ఆవేదన చెందారు. జపాన్ను శ్లాఘిస్తూ అదే వైఖరిలో భారతాన్ని విమర్శించిన ఆయన లేఖ ఇలా కొనసాగింది:
“జపానీయుల గురించి నా మనస్సులోనిదంతా ఈ చిన్న లేఖలో వ్రాయలేను. ఒక కోరిక మాత్రం ఉంది: మన యువకులు ప్రతి ఏడూ జపాన్, చైనా వెళ్లిరావాలి. ఉత్కృష్టతకీ, సౌజన్యానికీ ఇంకా భారతదేశాన్ని స్వాప్నిక జగత్తుగా జపానీయులు భావిస్తున్నారు. కాని మీరో, జీవిత పర్యంతమూ నిష్ప్రయోజనమైన మాటలు, వ్యర్థ ప్రలాపాలు, మీరేం ప్రజలు! రండి, ఈ దేశ ప్రజలను వచ్చి చూడండి, తిరిగి వెళ్లి సిగ్గుతో మీ ముఖాలను మూసుకోండి. వట్టి ముసలితనం! బయటికి వస్తే మీ కులం భ్రష్టుపట్టిపోతుందే! అనేక శతాబ్దాలుగా స్ఫటికీకరిం చిన మూఢవిశ్వాసాల భారం మీ తలను అణగద్రొక్కుతూంది. ఈ ఆహారమా, ఆ ఆహారమా? ఇది స్పృశ్యమైనదా, అస్పృశ్యమైనదా అనే వాదనల్లోనే మీ శక్తి యావత్తూ వృథా అయిపోతున్నది….. ఇప్పుడు మటుకు మీరు ఏం చేస్తున్నారు?…. చేతుల్లో పుస్తకాలు పుచ్చుకొని, సముద్రతీరంలో పచార్లుచేస్తూ, ఐరోపీయులు కనుగొన్న రసఖండాలను కంఠస్థం చేస్తున్నారు; ముప్ఫై రూపాయల గుమస్తా పనికోసం, మహా అయితే, యువభారత ఉత్కృష్ట లక్ష్యమైన ఒక న్యాయవాదిగా కావడం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీనికితోడు మన ప్రతి విద్యార్థి కాళ్ల మీద పడి ‘అన్నంపెట్టు’ అని అడుక్కుని తిరిగే పస్తులతో అలమ టించే పిల్లల మూక మరొకటి. ఇది కదా లక్షణం! మిమ్మల్ని, మీ పుస్తకాలను, కోటులను, యోగ్యతాపత్రాలను ముంచివేయడానికి సముద్రంలో చాలినంత నీరు లేకుండా పోయిందా?
“రండి, మనుషులవండి! ప్రగతికి సదా ఆటంకంగా ఉన్న పురోహితుల ముఠాను ఛిన్నాభిన్నం చేయండి. వారి హృదయాలు ఎన్నటికీ వికాసం చెందవు. అనేక శతాబ్దాల మూఢనమ్మకాలకూ, ఏకచ్ఛత్రాధిపత్యానికీ వారు వారసులు. ముందు పౌరోహిత్యాన్ని కూకటివ్రేళ్లతో పెకలించి వేయండి. రండి, మనుషుల వండి. మీ సంకుచిత దృక్పథం నుండి బయటికి వచ్చి, దృష్టిని విస్తృతం చేయండి. దేశాలు పురోగమించడం చూడండి. మనిషిని మీరు ప్రేమిస్తున్నారా? మీ దేశాన్ని ప్రేమిస్తున్నారా? అయితే రండి. ఉన్నత, ఉత్కృష్ట విషయాల కోసం మనం పాటుపడదాం. వెనక్కి తిరిగి చూడకండి, అది మాత్రం వద్దు; మనప్రేమకు పాత్రులయినవారూ, అత్యంత ఆప్తులూ విలపించడం చూసినా వెనక్కి తిరగకండి. వెనక్కి చూడకండి, ముందుకు వెళ్లండి.”
అమెరికా వైపుగా
జపాన్‌లోని కోబే నగరంలో పెనిస్సులార్ ఓడ నుండి దిగి, ఎంప్రెస్ ఆఫ్ ఇండియా అనే ఓడలో వాంకూవర్ వైపుగా స్వామీజీ బయలుదేరారు. ఆ ఓడ జూన్ 14 వ తేదీన యోకోహామా రేవు నుండి బయలు దేరింది. ఈ ప్రయాణం అంత సుకరంగా సాగలేదు. ఎముకలు కొరికే చలిని తట్టుకోవడానికి ఆయన వద్ద ఉన్ని దుస్తులు లేవు. ఉత్తర పసిఫిక్ ప్రాంతాలలో జూలై నెలలో ఇంత కఠోరమైన చలి ఉంటుందని ఆయనగానీ, చెన్నై శిష్యులుగానీ ఊహించలేదు. కెప్టెన్ తన ఉన్ని దుస్తులను స్వామీజీకి ఇచ్చాడు. ఆ దుస్తులే ఆయనను కొంతలో కొంత పరిరక్షించాయి. ఆయన ఇబ్బందినో, కష్టాన్నో ఏ మాత్రం పట్టించుకోనట్లుగా వాంకూవర్‌కు అభిముఖంగా ‘ఇండియా సమ్రాజ్ఞి’ వెళ్లసాగింది.