సోదరా! నా హృదయం విశాలమైంది, మరింతగా విశాలమైంది. నేను స్పందించడం నేర్చుకొన్నాను. నిజమే సోదరా, నేను తీవ్రంగా స్పందించడం నేర్చుకొన్నాను.
– స్వామి వివేకానంద
మళ్లీ ఖేత్రీకి — ‘సర్వమత మహాసభ నా నిమిత్తమే!’ — ‘నా హృదయం విస్తృతించింది’ — అందరికోసం విలపించారు — ఆత్మగౌరవం అవసరం — పాశ్చాత్య ప్రయాణ ఏర్పాట్లు — వివేకానంద — బయలుదేరారు! — ఒంటరిగా వెళుతున్నారా?
మళ్లీ ఖేత్రీకి
స్వా మీజీ చెన్నై శిష్యులు సమధికోత్సాహంతో ప్రయాణ ఏర్పాట్లు చేశారు. దాన్లో అనుకోని ఒక మార్పు వచ్చింది. స్వామీజీ ఖేత్రీలో ఉన్నప్పుడు తనకు పుత్రప్రాప్తి కలగాలని స్వామీజీని ఆశీర్వదించమన్నాడు మహారాజు. 1893 జనవరి 26 వ తేదీన మహారాజుకు పుత్రోదయ మయింది. తమ ఆనందాన్ని ఉత్సవంగా జరుపుకోవాలని మహారాజు అభిలషించాడు. స్వామీజీ ఆశీర్వాదం వలననే తనకు పుత్రుడు జన్మించాడని గట్టిగా నమ్మిన మహారాజు ఆ వేడుకలలో స్వామీజీ తప్పకుండా పాల్గొనాలని ఆశించాడు. అప్పుడు స్వామీజీ చెన్నైలో బస చేసివున్నారని తెలుసుకొని తన వ్యక్తిగత కార్యదర్శియైన మున్షీ జగ్మోహన్లాల్ను చెన్నైకు పంపించాడు.
1893 ఏప్రెల్ నెలలో ఒక రోజు మన్మథనాథ్ ఇంట్లో హఠాత్తుగా మున్షీ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు స్వామీజీ ఇంట్లో లేరు. కనుక ఇంటి పనిమనిషితో, “స్వామీజీ ఎక్కడ?” అని అడిగాడు. “సముద్రం పైకి వెళ్లారు” అని అతడు జవాబిచ్చాడు. ‘సముద్రం పైకి’ అనే మాటకు సముద్రం దాటి పాశ్చాత్యానికి వెళ్లారని భావించిన మున్షీ జగ్మోహన్, “ఏమిటీ! అంతలోనే స్వామీజీ పాశ్చాత్యానికి వెళ్ళిపోయారా?” అని ఆందోళనతో అడిగాడు. యాదృచ్ఛికంగా ఆతడి చూపు అక్కడ వ్రేలాడుతున్న కాషాయాంబరాల మీద పడింది. వాటిని చూసిన తరువాతే స్వామీజీ వెళ్లివుండరని మున్షీ ఊపిరి పీల్చుకొన్నాడు.
సరిగ్గా ఆ సమయంలో స్వామీజీ వచ్చారు. కాసేపు పచార్లు చేయటానికి మన్మథనాథ్తో ఆయన సముద్రతీరానికి వెళ్లారు. తన రాకలోని ఉద్దేశాన్ని మున్షీ జగ్మోహన్ తెలియజేశాడు: “అంతేకాదు; తమ పాశ్చాత్య ప్రయాణానికి డబ్బు చాలకపోతే ఆ మొత్తం మహారాజుగారు ఇవ్వాలనుకొన్నారు” అంటూ మహారాజు అభిమతాన్నీ తెలిపాడు. అందుకు స్వామీజీ, “ప్రియమైన జగ్మోహన్! నేను అమెరికాకు బయలుదేరడానికి ఇంకా ఒకటిన్నర నెల మాత్రమే ఉంది. ఇప్పుడు నే నెలా రాగలను?” అని అడిగారు. జగ్మోహన్ వదల్లేదు. “మీరు అక్కడకు రావడం మూలంగా మీ ప్రయాణ ఏర్పాట్లలో ఎలాంటి ఆటంకమూ వాటిల్లకుండా చూసుకొంటానని మహారాజు మరీ మరీ చెప్పారు” అని తెలిపి చివరికి ఎలాగో స్వామీజీని ఒప్పించాడు. మున్షీ జగ్మోహన్తో స్వామీజీ ఖేత్రీ బయలుదేరారు.
‘సర్వమత మహాసభ నా నిమిత్తమే!’
ముందుగా స్వామీజీ బొంబాయి వెళ్లారు. అక్కడ యాదృచ్ఛికంగా బ్రహ్మనంద, తురీయానందలను ఆయన కలుసుకొన్నారు. వీరందరూ గురుదేవుల శిష్యుడయిన కాళీపదఘోష్ ఇంట్లో బసచేశారు. అక్కడ సాయంత్రం వేళల్లో అనేకులు స్వామీజీ వద్దకు వచ్చేవారు. స్వామీజీ కూడా ఏదో ఒక అంశం మీద మాట్లాడేవారు. ఒక రోజు అనారోగ్య కారణంగా ఆయన తురీయానందను ప్రసంగించమన్నారు. తురీయానందకు ఇష్టం లేకపోయినప్పటికీ స్వామీజీ మాటను కాదనలేక కాసేపు ప్రసంగించాడు.
ప్రసంగించగానే స్వామీజీ తురీయానందతో, “హరీ, వారు గృహస్థులు. వారితో సన్న్యాసం గురించీ, వైరాగ్యం గురించీ ఎందుకు ప్రసంగించావు? నువ్వు సన్న్యాసివై ఉండవచ్చు. కాని వారు సంసారులు కదా! వారికి ప్రయోజకరమైనది ఏదైనా చెప్పివుండాలి. నువ్వు చెప్పిందంతా విని వారు వణకిపోయివుంటారు; వారి మనస్సులు గందరగోళానికి లోనైవుంటాయి. వారు గ్రహించగలిగిన, అర్థం చేసుకోగలిగిన విషయాలనే నువ్వు మాట్లాడాలి. ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వారి కోసమే మాట్లాడు” అన్నారు. అందుకు తురీయానంద, “నా ప్రసంగం మీరు వింటున్నారని భావించగానే నేను గందరగోళంలో పడిపోయాను. నేను మాట్లాడుతున్నది అసంగతంగా ఉండకూడదనే భయంతో తెలివితక్కువగా మాట్లాడాను” అన్నాడు.
ఒక రోజు తురీయానందతో స్వామీజీ ఇలా చెప్పారు: “హరీ! నేను అమెరికా వెళుతున్నాను. అక్కడ జరుగనున్న సర్వమత మహాసభ ఎందుకో తెలుసా? అంతా (తన ఛాతీని తట్టి చూపుతూ) దీని కోసమే. దీని కోసమే (తన కోసమే) సమస్తమూ చేస్తున్నారు.”
‘నా హృదయం విస్తృతించింది’
బొంబాయిలో కొన్ని రోజులు గడిపిన తరువాత స్వామీజీ, జగ్మోహన్లు ఖేత్రీకి బయలుదేరారు. బ్రహ్మనంద, తురీయానందలు అబూ రోడ్డు దాకా ఆయనతో వెళ్లారు. స్వామీజీ, జగ్మోహన్లు ఏప్రిల్ 21 వ తేదీ రాత్రి 9 గంటలకు ఖేత్రీ చేరుకొన్నారు. రాజప్రాసాదంలో ఎటుచూసినా ఉత్సవ వాతావరణం కనపడుతున్నది. ఎడతెగకుండా మూడు నాలుగు రోజులు వేడుకలు కొనసాగాయి. ఆటపాటలతో నగరం ఆనందంలో మునిగిపోయింది. స్వామీజీని చూసిన మహారాజు ఆనందం వర్ణనాతీతం. పసిబిడ్డను తీసుకువచ్చి మహారాజు స్వామీజీ నుండి ఆశీస్సులు పొందాడు. ఖేత్రీలో మూడు వారాలు గడపి అక్కణ్ణుండి స్వామీజీ బయలుదేరారు.
ఖేత్రీ నుండి జగ్మోహన్తో బయలుదేరిన స్వామీజీ అబూరోడ్డులో మళ్లీ బ్రహ్మానంద, తురీయానందలను కలుసుకొన్నారు. స్వామీజీని కలుసుకోవడానికి వారు ఎడ్లబండిలో వచ్చారు. స్వామీజీ వారితో, “ఓ, మీరు ఎడ్లబండిలో వచ్చారా? మీ సౌకర్యార్థం బాగా ఎండుగడ్డి పరచి ఉంచారా?” అని అడిగారు. అందుకు వారు, “లేదు, అందుకేనేమో ఒళ్లంతా ఒకటే నొప్పులు” అన్నారు. వెంటనే స్వామీజీ, “బండివాడికి నాలుగు అణాలు ఇచ్చివుంటే అతడే దట్టంగా గడ్డిపరిచి ఉంచేవాడు. అంతమాత్రం మీరు ఆలోచించలేకపోయారా?” అని సుతిమెత్తగా చీవాట్లు పెట్టారు. సెలవు పుచ్చుకొనే సమయంలో స్వామీజీ అత్యున్నతమైన మనఃస్థితిలో ఉన్నారు. ఆయన తురీయానందతో, “బ్రహ్మానందను ఇక్కడ విడిచిపెట్టి, నువ్వు మఠానికి తిరిగి వెళ్లు. అక్కడ గురుదేవుల పనులు చేసుకొంటూ మఠాన్ని వృద్ధిపరచడానికి ప్రయత్నించు” అన్నారు.
నాటి స్వామీజీ ఆకృతి తురీయానంద మనస్సులో శాశ్వతంగా నిలిచి పోయింది: “ఆ రోజు స్వామీజీ చెప్పినవన్నీ నా మనస్సులో అట్లే ఉండిపోయాయి. ఆయన నిలబడ్డ తీరుతెన్నులు, మాటలు, వాటి ఉద్వేగం, వాటిలో జాలువారిన శోకం నా కళ్ల ముందు ద్యోతకమవుతున్నాయి; ఆ మాటలు ఇంకా నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఆయన నాతో, ‘హరీ! మీరందరూ మతం, మతం అంటూ ఏదో చెబుతున్నారే, అదేమిటో నాకు ఇసుమంత కూడా అర్థం కాలేదు’ అన్నారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆయన ముఖాన దుర్భరమైన విషాదచ్ఛాయలు అలముకొన్నాయి. హృదయంలో ఉద్వేగపు వెల్లువ పొంగిపొరలి అణగిపోయి నప్పటికీ, అందువల్లనో ఏమో ఆయన శరీరం ఒకసారి వణకింది. ఆ ఉద్వేగపు వెల్లువల మధ్య ఆయన తమ చేతిని ఛాతీ మీద ఉంచుకొని, ‘సోదరా, నా హృదయం విశాలమైంది, మరింతగా విశాలమైంది. నేను స్పందింపచడం నేర్చుకొన్నాను. నిజమే సోదరా! నేను తీవ్రంగా స్పందించడం నేర్చుకొన్నాను’ అన్నారు. ఆయన స్వరం గద్గదమయింది. ఇంకేమీ మాట్లాడలేకపోయారు. కొన్ని నిమిషాల సేపు అక్కడ అసాధారణమైన ప్రశాంతత రాజ్యం చేసింది. స్వామీజీ కళ్లు ఆర్ద్రమయ్యాయి.”
ఈ సంఘటనను వర్ణిస్తున్నప్పుడు తురీయానంద కూడా ఉద్వేగంతో తల్లడిల్లిపోయినట్లు కనిపించాడు. మూసుకొన్న కళ్ల నుండి నీరు ధారకట్టింది. ఆయన వదలిన భారమైన నిట్టూర్పు అక్కడ నెలకొన్న ప్రశాంతతను భగ్నం చేసింది. “స్వామీజీ ఈ విధంగా చెప్పినప్పుడు నా మనస్సులో ఏం మెదలిందో తెలుసా? బుద్ధుని స్మృతులు! ‘స్వామీజీ పలుకులూ, ఉద్వేగమూ అచ్చం బుద్ధునివిలా ఉన్నాయి!’ అనే ఆలోచన నాలో జనించింది. మానవాళి సమస్త దుఃఖాల విలాపాలూ స్వామీజీ హృదయంలో ప్రతిధ్వనించడం వినగలిగాను. మానవాళి దుఃఖాలన్నింటినీ ఉపశమింపజేసే ఔషధం తయారుచేసే ఒక అతి పెద్ద కాగులా ఆయన హృదయం నాకు కానవచ్చింది.”
అందరికోసం విలపించారు
ఈ సంఘటన గురించి చెబుతున్నప్పుడు కాలాంతరంలో జరిగిన మరొక సంఘటనను కూడా తురీయానంద జ్ఞాపకం చేసుకొన్నారు: “అప్పుడు స్వామీజీ బలరాం ఇంట్లో బసచేసారు. నేను ఆయనను కలుసుకోవడానికి వెళ్లినప్పుడు ఆయన తీవ్రమైన ఆలోచనల్లో మునిగి పోయినట్లుగా వసారాలో ఒంటరిగా పచార్లు చేస్తున్నారు. నా రాకను ఆయన గమనించలేదు. ఆయన ఆలోచనలకు భగ్నం కలిగించరాదనే ఉద్దేశంతో మౌనంగా నిలబడిపోయాను. కొంతసేపు గడచిపోయింది. ఆయన కళ్ల వెంట నీరు ధారకట్టింది. మెల్లని స్వరంలో మీరాబాయి పాట ఒకటి పాడారు.
“పిదప పిట్టగోడకు ఆనుకొన్నారు. ముఖాన్ని చేతుల్లో కప్పుకొని హృదయం కరిగిపోయేటంత విషాదకంఠంతో, ‘ఆహా, నా దుఃఖాన్ని ఎవరు గ్రహించగలరు! నా దుఃఖాన్ని ఎవరు గ్రహించగలరు!’ అంటూ ఆ పాటలోని చరణాలు పాడారు. స్వామీజీలోని దుఃఖమూ, శోకమూ అక్కడంతా శోకమయం గావించినట్లు అనిపించింది. ‘దుఃఖాలు కలిగించే ఆవేదన దుఃఖీంచే వ్యక్తికి తప్ప మరెవరికి అర్థమవుతుంది!’ అనే చరణాలు ఆ పరిస్థితులనే శోకంలో ముంచివేశాయి. ఆయన స్వరం ఒక బాణంలా నా హృదయాన్ని ఛేదించింది. నా కళ్లూ ఆర్ద్రమయినాయి. కాని స్వామీజీ దుఃఖానికి కారణం నాకు తెలియలేదు. అది నా హృదయాన్ని వ్యాకుల పరచింది. హఠాత్తుగా నాకు అంతా తేటతెల్లమయింది. స్వామీజీ దుఃఖం వ్యక్తిగతమైనది కాదు, అది ప్రపంచపు దుఃఖం. లోకంలోని దుఃఖమంతా స్వీకరించిన వ్యక్తిలా ఆయన విలపించారు. పేదసాదలు, అణచి వేయబడినవారు వంటి అందరి కోసమూ ఆయన విలపించారు!”
ఆత్మగౌరవం అవసరం
అబూ రోడ్డు నుండి స్వామీజీ రైలులో బయలుదేరారు. ఆయనతోపాటు ఒక మిత్రుడు కూడా ప్రయాణం చేస్తున్నాడు. అప్పుడు టికెట్ పరీక్షకుడు అక్కడికి వచ్చాడు. ఆతడు ఒక ఆంగ్లేయుడు. ఆ మిత్రుడు పెట్టెలో పయనించరాదని కటువుగా చెప్పి ఆతణ్ణి ఆ పెట్టె నుండి దిగిపొమ్మని బలవంతపెట్టాడు; తనకు తోచిన రైల్వే శాసనం ఒకటి పేర్కొన్నాడు. ఆ మిత్రుడు కూడా ఒక రైల్వే ఉద్యోగి కావడంతో అలాంటి శాసనం ఏదీ లేదని చెప్పి బయటకు వెళ్లడానికి నిరాకరించాడు. తనను ఒక భారతీయుడు అధిక్షేపించడం సహించలేని ఆ ఆంగ్లేయునికి కోపం ముంచుకొచ్చింది. చివరికి స్వామీజీ జోక్యం చేసుకొన్నారు. అది కూడా ఆ ఆంగ్లేయుణ్ణి సాంత్వన పరచలేదు. ఆతడు ఆగ్రహంతో స్వామీజీతో హిందీలో మాట్లాడసాగాడు:
పరీక్షకుడు : నువ్వెందుకు దీన్లో జోక్యం చేసుకొంటున్నావు?
స్వామీజీ : మొదటి తరగతి ప్రయాణీకుణ్ణి ‘నువ్వు’ అంటూ అమర్యాదగా సంబోధిస్తున్నారే! ముందుగా ఇతరులతో మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోండి.
పరీక్షకుడు : పొరపాటే, మన్నించండి. నాకు హిందీ సరిగా తెలియదు. ఇతడు (this man)…
స్వామీజీ (అడ్డుపడి) : హిందీ సరిగా తెలియదన్నారు. కాని ఇప్పుడు మీ మాతృభాషయైన ఆంగ్లం కూడా మీకు రాదని తెలుస్తున్నది. ‘ఇతడు’ అని కాదు ‘వీరు’ (this gentleman) అని సంబోధించాలి.
తన తప్పును గ్రహించిన ఆ పరీక్షకుడు చప్పున పెట్టె నుండి వెళ్లి పోయాడు.
ఈ సంఘటనను ప్రస్తావిస్తూ స్వామీజీ జగ్మోహన్తో ఇలా అన్నారు: “ఆంగ్లేయులతో వ్యవహరిస్తున్నప్పుడు మన ఆత్మగౌరవాన్ని వదలుకోకూడదు. సముచితులయిన వారికి తగిన మర్యాద చెల్లించనందు వలన ఆంగ్లేయులు మనలను అవమానిస్తున్నారు. ఆత్మగౌరవం ముఖ్యం, ఇతరులకు కూడా మర్యాదనివ్వాలి.”
పాశ్చాత్య ప్రయాణ ఏర్పాట్లు
మళ్లీ చెన్నై తిరిగి రావడానికి తగినంత సమయం లేకపోవడం వల్లనో ఏమో బొంబాయి నుండే అమెరికాకు బయలుదేరుతున్నట్లు ఏప్రెల్ 27 వ తేదీన చెన్నై మిత్రులకు స్వామీజీ తెలియపరిచారు. ఆయన చెన్నై రావడం లేదని తెలియగానే అలసింగ బొంబాయి బయలు దేరాడు. స్వామీజీ, జగ్మోహన్లు ఖేత్రీ నుండి బొంబాయి చేరుకొన్నప్పుడు, రైలు నిలయంలో వారికి అలసింగ స్వాగతం చెప్పాడు.
స్వామీజీ ప్రయాణపు ఏర్పాట్లన్నీ శ్రద్ధగా చూడమని ఖేత్రీ మహారాజు జగ్మోహన్ను ఆదేశించాడు. స్వామీజీని మంచి మంచి దుకాణాలకు తీసుకువెళ్లి అవసరమైన వస్తువులన్నీ జగ్మోహన్ కొనుగోలు చేశాడు. స్వామీజీ వద్దంటున్నా కూడా వినకుండా విలువైన దుస్తులు కొన్నాడు; ఖర్చులకు పైకం ఇచ్చాడు. మే 31 వ తేదీన స్వామీజీ బొంబాయి నుండి బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లూ జరిగాయి. జపాన్ దాకా వెళ్లే పెనిన్సులార్ ఓడలో స్వామీజీ కోసం అంతకు మునుపే కొన్న రెండవ తరగతి టికెట్ రద్దుచేసి, మొదటి తరగతి టికెట్ కొన్నారు. థామస్ కుక్ కంపెనీ ద్వారా ఈ ఏర్పాట్లు చేయబడ్డాయి
వివేకానంద
అప్పటి నుండి స్వామీజీని ‘వివేకానంద’ అని పేర్కొనడంలో భిన్నాభి ప్రాయాలున్నాయి. ఖేత్రీలోనే ఆయన ఆ నామధేయాన్ని స్వీకరించారనే అభిప్రాయం సర్వజనామోదం. ఆ సంఘటన గురించి అలసింగ ఇలా అంటున్నాడు:
“బొంబాయిలో మేం ఉన్నప్పుడు ఒక రోజు, ‘స్వామీజీ మీరు అమెరికా వెళుతున్నారు. అక్కడ సమయం ఎంతో అమూల్యమైనది. కనుక మీకు ఒక గడియారం అవసరం’ అని ఆయనతో చెప్పాం. ‘వెంటనే కొనండి’ అన్నారాయన. ‘మీ పేరు ముద్రితమైన కొన్ని కార్డులు కూడా చాలా అవసరం’ అన్నాం. ‘మంచిది, వంద కార్డులు ముద్రించండి’ అన్నారు స్వామీజీ. ‘కార్డులో ఏ పేరు ముద్రించాలి?’ అని అడిగాం. అప్పుడు స్వామీజీ ‘సచ్చిదానంద’ పేరిట పేర్కొన బడుతూవచ్చారు. ‘స్వామి వివేకానంద అని ముద్రించండి’ అన్నారు స్వామీజీ.”
మిగిలిన రోజులన్నీ స్వామీజీ పూర్తిగా ధ్యానంలో గడిపారు. ప్రపంచాన్ని మరచిపోయి ధ్యానంలో మగ్నులయినప్పటికీ సోదర సన్న్యాసులనూ, మఠాన్నీ మనస్సు నుండి ఆయన తొలగించలేకపోయారు. ఆ సమయంలో మఠం ఆలంబజార్లో నిర్వహింపబడుతున్నది. మఠవాసులు ఎలా జీవిస్తున్నారు, మఠం ఎలా నిర్వహింపబడుతున్నది అనే ఆలోచనలు ఆయన మనస్సులో చెలరేగాయి. అన్నీ సవ్యంగానే జరుగుతాయి, గురుదేవులు సర్వదా వారిని కాపాడుతూనే ఉంటారని నిశ్చయించుకొని స్వామీజీ సాంత్వన చెందారు.
బయలుదేరారు!
1893 మే 31 వ తేదీ స్వామీజీ అమెరికా బయలుదేరే రోజు. విదేశాలు, ఓడ ప్రయాణం, సెలవు పుచ్చుకోవడాలు, శుభాకాంక్షలు, మూటాముల్లెలు – ఇవన్నీ ఆయనకు క్రొత్త. తమ వస్తువులను, తమను జాగ్రత్తగా చూసుకోవలసిన బాధ్యత లాంటివి ఆయన సన్న్యాస వైఖరికి పూర్తిగా సరిపడనివి! కాని గత్యంతరం లేదు. గురుదేవుల కార్యార్థమూ, మాతృదేశ ప్రగతి సాధించడం కోసమే కదా ఆయన పయనం! కనుక అందుకు అవసరమైనవన్నీ చేసే తీరాలి!
అపరిచిత దేశంలో, వారి ఆచారవ్యవహారాలను ఎలా పాటించాలో, ఒంటరిగా ఏం చేయబోతానో అనే కలత స్వామీజీ మనస్సును ఆవరించక పోలేదు. ‘పది వేల మైళ్లు దాటి కదా పోతున్నాను! అక్కడికి వెళ్లి ఒంటరిగా ఏం సాధించబోతాను?’ అని పదే పదే ఆయన మనస్సు చింతన చేయసాగింది.
వేయి భావోద్వేగాలతో స్వామీజీ ఓడ మెట్లు ఎక్కసాగారు. అంతదాకా ఆయనను అనుసరిస్తూ వచ్చిన జగ్మోహన్, అలసింగ ఆయన పాదపద్మాలకు నమస్కరించి సెలవు పుచ్చుకొన్నారు.
గంటలు గణగణమని మ్రోగడంతో బ్రహ్మాండమైన ఆ ఓడ సముద్ర తరంగాలను చీల్చుకొంటూ ముందుకుసాగింది.
యావద్భారతదేశం పర్యటించిన స్వామీజీ భారతీయుల కోసం సుదూర దేశానికి వెళుతున్నారు. జగజ్జనని అనుగ్రహమూ, గురుదేవుల ఆశీస్సులూ, శ్రేయోభిలాషుల నమ్మకాన్నీ పెట్టుబడిగా తీసుకొని సర్వమత మహాసభలో పాల్గొనడానికి ఆయన పోతున్నారు.
ఒంటరిగా వెళుతున్నారా?
ఓడ పైభాగం మీదకి వచ్చి స్వామీజీ నిలబడ్డారు. సముద్రపు నీలం రంగుకూ ఆకాశపు నీలం రంగుకూ ప్రస్ఫుటంగా తారతమ్యం చూపే కాషాయాంబరాలను స్వామీజీ ధరించి ఉన్నారు. తమకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన అందరికీ రెండు చేతులూ ఎత్తి ఆశీర్వాదం చేస్తూ ముప్ఫై రెండేళ్ల ఆ ఋషిపుంగవుడు నిలబడి ఉన్నాడు.
స్వామీజీకీ, తీరానికీ మధ్యనున్న దూరం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆయన కళ్లు ఆర్ద్రమైనాయి.
భవతారిణిని తలచుకొన్నారు; గురుదేవులను తలచుకొన్నారు, శారదా మాతను తలచుకొన్నారు; సోదర శిష్యులను తలచుకొన్నారు; తమకు సహాయం చేసిన మహారాజులనూ, విద్యావంతులనూ, జనసామాన్యాన్నీ తలచుకొన్నారు. వారితోబాటు జన్మనిచ్చిన తల్లి ముఖం జ్ఞాపకం వచ్చే ఉంటుంది! చివరకు తాను సహాయం చేయవలసిన పామర భారతీయుల నందరినీ స్వామీజీ జ్ఞప్తికి తెచ్చుకొన్నారు.
స్వామీజీ దృష్టి మరో వైపునకు తిరిగింది. “త్యాగభూమి నుండి భోగభూమికి వెళుతున్నాను; మునులు, ఋషులు, యోగులు, సిద్ధులు, భక్తులు, ముక్తులు జీవించిన పవిత్ర దేశం నుండి పారిశ్రామికవేత్తలు, విజ్ఞానవేత్తలు, రాజకీయ వేత్తలు, ఆర్థికవేత్తలు జీవిస్తున్న దేశానికి వెళుతున్నాను. యుగాల పర్యంతం మహోన్నత నాగరకతను సంతరించుకొని సజీవమై విలసిల్లుతూన్న పవిత్ర దేశం నుండి పసికందు అయిన ఐరోపా నాగరకత వ్యాపించిన క్రొత్త దేశానికి వెళుతున్నాను. భారతీయ నాగరకతను ఆ దేశానికి అందిస్తాను. భారతదేశానికి ఆ దేశపు ఆర్థిక సహాయాన్ని తెస్తాను. ఇది అంత సులభంగా జరిగే పని కాదు. ఇకమీదట నా జీవితపర్యంతం పరిశ్రమ, కఠోర పరిశ్రమ, క్షణం కూడా తీరిక ఎరుగని పరిశ్రమే! ఈ శరీరం రాలిపోయేటంత దాకా, ఎముకలు చెల్లాచెదరయ్యే దాకా, నరాలన్నీ చిట్లిపోయే దాకా పరిశ్రమిస్తాను. అమెరికాలోనూ, ఐరోపాలోనూ భారతీయ ఆధ్యాత్మికతను ప్రచారం చేస్తాను.
“భారతీయ పేద ప్రజానీకం కోసం అక్కడ నిధులు సేకరించి మాతృదేశానికి తిరిగివస్తాను. ఆ తరువాత పేదల జీవితార్థం సంస్థలు నెలకొల్పి వాటిలో అవిశ్రాంతంగా శ్రమిస్తాను.
“ఇంతటి కఠోర పరిశ్రమ నేను చేయగలనా? నాకు అంతటి శక్తి ఉందని భావిస్తే అహంకారం నన్ను దిగమ్రింగదా? జగజ్జనని బిడ్డగా, గురుదేవుల శిష్యునిగా ఉండే నా కార్యాన్ని నిర్వర్తిస్తాను.”
–స్వామీజీ హృదయం ద్రవించిపోయింది. “సర్వేశ్వరీ, గురుదేవా” అంటూ పైకే బిగ్గరగా అనేశారు.
నీలం రంగు సముద్రంపై పయనిస్తున్న ఆయన నిజానికి ఒంటరిగా వెళ్లారా? లేదు! బహుశా ఆయన తోటి ప్రయాణికులు అంతదాకా మరెవరితోనూ ప్రయాణం చేసివుండరు!
అలా ఆయనకు తోడుగా ఎవరు వెళ్లారు?
గంగ, యమున, సింధు, నర్మద, కావేరి గోదావరీ నదులూ, మధురాతి మధురమైన భారతీయ ఆత్మ ఆయనకు తోడుగా వెళ్లాయి.
గౌరీ శిఖరం, కాంచన శిఖరం, ధవళగిరి, వింధ్యపర్వతాలు, తూర్పు పశ్చిమాలుగా వరుసలు దీరిన కనుమల సొబగులు సంతరించుకొన్న భారత దేశపు గంభీరమైన ఆత్మ ఆయనకు తోడుగా వెళ్లాయి.
భారతీయ ఆధ్యాత్మిక సత్యం ఆయనకు తోడుగా వెళ్లింది. దాని పురాణ కవిత్వం ఆయనకు తోడుగా వెళ్లింది. ఎల్లోరాలోను, అజంతాలోను, దిల్వారాలోను, తంజామారులోను వెల్లివిరిసిన కళాత్మకత ఆయనకు తోడుగా వెళ్లింది.
తులసీదాసు, మీరాబాయి, చండీదాసు, తుకారాం, ఆండాళ్ (గోదాదేవి), త్యాగరాజు ప్రభృతులు పెంచి పోషించిన సంగీతం ఆయనకు తోడుగా వెళ్లింది.
ఆ తత్త్వాలన్నింటి అపరావతారంగా విరాజిల్లిన శ్రీరామకృష్ణులు ఆయనకు తోడుగా వెళ్లారు.
ఈ లోకంలో వెలసివున్న దేవతల అనుగ్రహం ఆయనకు తోడుగా వెళ్లింది. ఆ దేవతలందరికీ అధిదేవతయైన ఆదిపరాశక్తి ఆయనకు తోడుగా వెళ్లింది.
వీటి అన్నింటినీ మించి, గుప్పుగుప్పుమని లేచిన దుమ్ము కణాలు గోళ్ల సందుల్లో ఇరుక్కోగా, దానిని తీసివేయడానికి కూడా ఆస్కారం లేకుండా భూమిని దున్నుకొంటూపోయే నాగలి వెనువెంట వచ్చే భారతదేశ కోటానుకోట్ల నిరుపేదల హృదయాలు – మండుటెండలో ముచ్చెమటలు పోస్తూవుంటే దానిని తుడుచుకోవ డానికి కూడా వీలులేకుండా తల మీది గడ్డిమోపును ఒక చేత్తోనూ, చంకనుంచు కొన్న పసిబిడ్డను ఒక చేత్తోనూ పట్టుకొని భారంగా ఉచ్ఛ్వాసనిశ్వాసాలు చేస్తూ నడిచే కోటానుకోట్ల పేదస్త్రీల హృదయాలు-
స్వామీకి తోడూనీడగా వెళ్లాయి.