పాశ్చాత్య దేశాలకు వెళ్ళి తీరాలి. ఇప్పుడు నేను అందుకు తయారుగా ఉన్నాను. హృదయపూర్వకంగా పనిచేద్దాం. ఫలితం జగజ్జనని అనుగ్రహిస్తుంది. ఆమె నాతో మాట్లాడింది.
– స్వామి వివేకానంద
చెన్నై వేచివుంది — సర్వమత మహాసభకు ఎవరు పోతారు? — అలసింగ పెరుమాళ్ — నూతన అధ్యాయం
మనస్సును ఆకట్టుకొనే వివరణలు — కృష్ణుడు ఎందుకు నీలమేఘచ్ఛాయారూపుడు? — స్పెన్సర్ ఏం చెబుతున్నాడు? — ఏది సమాజ సంస్కరణ? — హిందూమత ముఖ్యాంశాలు — ‘ఎరుగబడనిది నేను తెలుసుకొన్నాను’ — సర్వమత మహాసభకు వెళతారా? — దిన పత్రికలలో — కిడి — వి. సుబ్రహ్మణ్య అయ్యర్ — తమిళ వంటకాల పట్ల ప్రీతి — కొన్ని సంఘటనలు — ప్రేతాత్మలనూ కరుణించడం — ఎందుకు సృష్టించారు? — పాశ్చాత్య దేశాలకు వెళ్లాలి — హైదరాబాద్‌లో — నవాబుతో — ‘పాశ్చాత్యానికి వెళ్లడంలోని నా ఉద్దేశం’ — అతీంద్రియ శక్తులు ప్రదర్శించే యోగితో — తల్లి జ్ఞాపకంతో కలత చెందడం — అనుగ్రహ నిమిత్తం — గురుదేవులు పిలుస్తున్నారు — మాతృదేవి దర్శనం — పేదల ధనమే కావాలి — పసిపిల్లల వచ్చీరాని ముద్దు మాటల ఆనందంలో
చెన్నై వేచివుంది
భ గవంతుని ప్రణాళికలు చిత్రమైనవి, ఆచరణ విధానాలు అంతకన్నా విచిత్రంగా ఉంటాయి. ప్రపంచం మారుమూలల్లో ఎవరెవరో జన్మిస్తారు; అక్కడక్కడ విడివిడిగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఒక నిర్ణీత సమయంలో వారు ఏకమవుతారు; ఒక చరిత్ర రూపొందు తుంది. అటువంటి విచిత్రమైన చరిత్రలలో ఒకటే స్వామీజీ చెన్నై వెళ్ళడం. ఆయన వంగదేశంలో జన్మించారు. ఎవరూ తమను గుర్తించకూడ దని అప్పుడప్పుడు పేరు కూడా మార్చుకొని పర్యటించిన ఆ సన్న్యాసి కోసం చెన్నై మహానగరం వేచివుందంటే నమ్మశక్యమా? కాని అది అక్షర సత్యం. స్వామీజీ కోసం చెన్నై వేచివుంది!
సర్వమత మహాసభకు ఎవరు పోతారు?
చికాగో నగరంలో 1893 జూలై నెలలో ప్రపంచ వస్తుప్రదర్శనలో ఒక భాగంగా సర్వమత మహాసభ ఒకటి జరగబోతున్నదని 1892 ప్రారంభంలోనే చెన్నైలో తెలియవచ్చింది. 1892 మధ్య కాలంలో ‘ది హిందూ’ దినపత్రికలో దీనిని గురించిన ఒక ప్రకటన వెలువడింది. సభను గురించిన వివరాలు తెలుపుతూ, హిందూమతానికి ప్రతినిధిగా ఒకరు వెళ్లాలని కూడా దాన్లో తెలియజేయబడింది. కాని విదేశాలకు వెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయంగా ‘ది హిందూ’ పత్రిక సంపాదకుడు తన సంపాదకీయంలో, “హిందూమతం ప్రస్తుత సమాజ పోకడలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపగలిగేదిగా లేదు” అని వ్యాఖ్యానించాడు. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. దీనిని ఆదరిస్తూ, వ్యతిరేకిస్తూ వ్యాసాలు ‘ది హిందూ’ పత్రికలో ప్రచురితమయ్యాయి.
“హిందూమత పునర్నిర్మాణం అసాధ్యం. ఇది నిర్జీవంగా పడివుంది. దానికి కాలం తీరింది. దాని చిట్టచివరి అధ్యాయం వ్రాయడం జరిగిపోయింది.” “ఈ హిందూదేశం ఒక మహాత్ముణ్ణి రూపొందించలేదు. స్వతంత్రంగా ఆలోచించ గల, సచ్ఛీల సంపత్తిగల, అకుంఠిత దీక్షాకంకణుడైన, ఐరోపాను లోకంలో అగ్రగణ్య దేశంగా రూపొందించడానికి పాటుపడిన మహావీరుల సరసన నిలబడ దగిన ఒక మహనీయుణ్ణి భారతదేశం రూపొందించలేదు.” – ఇటువంటి అభిప్రాయాలు వెలువడ్డాయి.
మహాసభలో పాల్గొనబోయేది ఎవరో తేలలేదు. సనాతనులు, పండితులు వంటి వారెవరూ సముద్రం దాటి ఆ సభలో పాల్గొనడానికి ముందుకు రాలేదు. సముద్రం దాటి వెళితే అతడు కులభ్రష్టుడవడమే అందుకు కారణం. అతడు కులం నుండి వెలివేయబడతాడు! 1892 ఆగస్ట్‌లో ఇది ఒక సవాలుగానే పరిగణింపబడింది. “సొంత కులస్థుల వ్యతిరేక నినాదాలను సంబాళించుకొని, సముద్రం దాటి ధైర్యంగా ఆ సర్వమత మహాసభలో పాల్గొని హిందూమతం గురించి విశదపరచడానికి సిద్ధంగా ఉన్న ఒక్క సనాతన పండితుడు ఉన్నాడా అని నేను సవాలు చేస్తున్నాను. పోనీ ఎవరైనా వెళ్లినా అక్కడ ప్రసంగించడానికి హిందూమతంలో గొప్పగా ఏముంది? ‘ప్రపంచానికి అందించడానికి మా వద్ద ఏమీ లేదు’ అని మాత్రమే చెప్పగలం” అని ఒక వ్యక్తి వ్రాశాడు. హిందూమతానికి ప్రతినిధిగా ఎవరూ చికాగోకు వెళ్లరేమోననే సందిగ్ధ పరిస్థితి నెలకొంది.
చికాగో సర్వమత మహాసభ కార్యకర్తలలో ఒకరైన డాక్టర్ బారోస్, ఆ మహాసభ వివరాలు మద్రాసు క్రైస్తవ కళాశాల ప్రొఫెసర్ అయిన డాక్టర్ విలియం మిల్లర్‌కు తెలియజేశాడు. అదే సమయంలో అమెరికాలోని హిందూ సమితి (Hindu League) తో సన్నిహిత సంబంధం కలిగివున్న యోగి పార్థసారథి అయ్యంగార్ అనే వ్యక్తికి కూడా ఆ మహాసభ వివరాలు తెలిశాయి. హిందూమత ప్రతినిధిగా ఎవరిని పంపాలి, ఎవరు వెళ్లాలి అనే ప్రశ్న వీరి మనస్సులను తొలచి వేసింది. పార్థసారథి శాస్త్రాధ్యయనం చేసిన వ్యక్తి, జ్ఞాని, కాని కుల నియమాల కారణంగా ఆయన సంశయించాడు.
అలసింగ పెరుమాళ్
పార్థసారథి అల్లుడు అలసింగ పెరుమాళ్.* స్వామీజీ జీవితంలోశాశ్వతంగా చోటుచేసుకొని కీర్తిమంతుడైన ఈయన మిల్లర్ విద్యార్థి. తనతెలివితేటలతోను, ప్రతిభతోను 26 ఏళ్ల ప్రాయంలోనే చెన్నై పచ్చయప్ప కళాశాలకు అనుబంధ విద్యాసంస్థయైన ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయ పదవిని అలంకరించాడు.నెల జీతం వంద రూపాయలతో తల్లితండ్రులను, భార్య, నలుగురు పిల్లలనుపోషించవలసిన బాధ్యత ఇతడి మీద ఉంది. కాని పేదరికం ఈయన ఉన్నతాదర్శాలకు ఆటంకం కాలేదు. సమాజ సంక్షేమానికీ, ప్రజాసేవకీ తనను అంకితంగావించుకొన్న ఈయన తనలాంటి యువకులను కూడగట్టుకొని శాస్త్రాధ్యయనంలోను, సమాజ సేవలోను పాల్గొంటూ జీవించసాగాడు. వీరిలో ముఖ్యులు ఆర్.ఏ.కృష్ణమాచారి, జి.జి. నరసింహాచారి, ప్రొఫెసర్ ఎం.పి. నంజుండరావు, బిలిగిరి అయ్యంగార్, టి.ఆర్. బాలాజీరావు, రాజమయ్యర్, జస్టిస్ ఎస్. సుబ్రహ్మణ్య అయ్యర్, సింగారవేలు మొదలియార్ ప్రభృతులు.
అలసింగతో సర్వమత మహాసభ గురించి పార్థసారథి ప్రస్తావించాడు.అందుకు అర్హమయిన వ్యక్తి ఎవరైనా ఉంటే సూచించమని కూడా చెప్పాడు. చెన్నైలో మాత్రమే కాక, అప్పటికే భారతదేశంలో అనేక ప్రాంతాలలో సర్వమత మహాసభను గురించి వార్త వ్యాపించింది. అనేకులు ఆ సభ గురించి చర్చించారు. కాని ఎవరూ దానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అలసింగ మహాసభ ప్రాధాన్యాన్ని అవగతం చేసుకొన్నాడు. ఎవరిని పంపాలి, అందుకు అర్హులెవరు అన్న ప్రశ్న ఆతడి మనస్సునూ తీవ్రంగా కలచివేసింది. తన బావగారయిన ప్రొఫెసర్ రంగాచారితో ఈ విషయం ప్రస్తావించి ఆయనను పాల్గొనమనికోరాడు. ఆయన కూడా నిరాకరించాడు. ఈ పరిస్థితిలోనే స్వామీజీ చెన్నైలో కాలుపెట్టారు.
నూతన అధ్యాయం
అది 1893 ప్రారంభ కాలం. స్వామీజీ 31 వ సంవత్సరంలో అడుగుపెట్టారు. చెన్నై వచ్చిన స్వామీజీ శాంథోమ్లోని మన్మథనాథ్ ఇంట్లో బసచేశారు. ఆంగ్లం మాట్లాడే సన్న్యాసి ఒకరు వచ్చారనే వార్త చెన్నైలో కార్చిచ్చులా వ్యాపించింది. హైందవులలో అత్యధిక సంఖ్యాకులకు నాటి హిందూమతంలో ఒక రకమైన విశ్వాసరాహిత్యంనెలకొన్న కాలం అది. కనుక ఆంగ్లం మాట్లాడే సన్న్యాసి అనే వార్తే అనేకులు స్వామీజీ వద్దకు రావడానికి కారణమయింది. శాంథోమ్లోని మన్మథనాథ్ ఇంట్లోచాలామంది యువకులు స్వామీజీని కలుసుకొన్నారు. వారిలో ఎక్కువమంది విద్యాధికులు, ప్రగతిశీల దృక్పథంగలవారు. వారు అడిగిన ప్రశ్న లన్నింటికీ స్వామీజీ మృదుమధురంగా, కాని దృఢనిశ్చయంగా జవాబులిచ్చి యువకులను అమితంగా ఆకట్టుకోగలిగారు. అందువలన ఒక రోజు ఆయనను కలుసుకొన్న యువకులు ఆ తర్వాత ప్రతిరోజు ఆయనను కలుసుకోకుండా ఉండలేకపోయే వారు. ఇలా వినే అలసింగ, ఆయన మిత్రులూ స్వామీజీని కలుసుకోవడం తటస్థించింది. అప్పటి నుండి ప్రారంభమయింది స్వామీజీ జీవితంలో ఒక నూతనాధ్యాయం.
మనస్సును ఆకట్టుకొనే వివరణలు
స్వామీజీ ఒక విచిత్రమైన వ్యక్తి. ఆయన మాటలు వింటున్నప్పుడు ఆయనకు తెలియనిదంటూ ఏమీ లేదని అనిపిస్తుంది! నేడు వేదవేదాంతాల గురించి మాట్లాడతారు, మర్నాడు విజ్ఞానం, ఆ మర్నాడు వాల్మీకి, కాళిదాసు, భవభూతి మొదలైన భారతీయ సాహితీ అనర్ఘరత్నాలను గురించి; హోమర్, విర్జిల్, షేక్స్పియర్, బైరన్ లాంటి పాశ్చాత్య సాహితీవేత్తలు; ఈ రోజు ట్రోజన్ యుద్ధం, రేపు పాండవులు, ఆ తరువాత హెలెన్, పిదప ద్రౌపది; గ్రీకు కళ, భారతీయ కళ అంటూ ఆయన స్పృశించని అంశం ఏదీ ఉండదు. ఒక సన్న్యాసికి ఇన్ని విషయాలలో కూలంకష జ్ఞానం ఉండడం ఎవరికి ఆశ్చర్యం కలిగించదు!
ప్రశ్నలు అడిగే వారి మనఃస్థితిని అర్థంచేసుకొని అందుకు తగినట్లు జవాబివ్వడం స్వామీజీకిగల విశేష ప్రతిభ. ఒక ఫలానా వ్యక్తి మనస్సును అవగతం చేసుకొని ఎలా ఆయన జవాబు ఇవ్వగలుగుతున్నారని అడిగినప్పుడు స్వామీజీ ఇలా అన్నారు: “శరీరానికి వైద్యులు ఉన్నట్లు మానసిక వైద్యులు సన్న్యాసులు. చికిత్సకు మునుపే రుగ్మత కారణాన్నీ, లక్షణాలనూ వైద్యులు అర్థంచేసుకొనే రీతిలోనే సన్న్యాసులుకూడా ప్రశ్నకు బదులు చెప్పడానికి ముందే వారి మనఃస్థితిని అవగతం చేసుకోగలరు.”
సమావేశమైన వారిలో ఎవరిలోనైనా ఒక దురాలోచనో, తప్పుడు ఆలోచనో మెదలగానే స్వామీజీ తక్షణమే గుర్తించగలిగేవారు. అలా ఏదైనా జరిగితే వెంటనే ఆయన పెదవులు అదో రకమైన నవ్వును చిందించగా ఆయన ఆ సదరు వ్యక్తిని ఒక పర్యాయం తేరిపార చూస్తారు. కాని ఆయన దయార్ద్ర హృదయులు కనుక వాటిని పెద్దవి చేయకుండా అతి మామూలుగా పరిగణించి క్షమిస్తారు. “ఆయన దివ్య సమక్షంలో ఉండడమన్నది భయంకరమైన మందుగుండు సామాను ముందు ఉండడం లాంటిది. కాని దయాస్వరూపులైన స్వామీజీ మన దుశ్చర్యలన్నింటినీ క్షమిస్తారనే ఆలోచనే సంశయం లేకుండా ఆయన సమక్షంలో ఉండనిచ్చింది” అని వ్రాస్తున్నారు ఆయన శిష్యులలో ఒకరు.
హిందూమతాన్ని ఒక నూతన దృక్పథంలో అందించడానికి ఎవరూ లేరా అని చెన్నై యువకులు తపించిపోయినప్పుడు ఒక ప్రకాశమానమైన జ్యోతిలా భాసించారు స్వామీజీ. ఆయనను కలుసుకొన్న ప్రతి క్షణమూ ఆ యువకులకు క్రొత్త తొలి సంజలా అనిపించింది. ప్రశ్నలకు క్షణం కూడా తడుముకోకుండా ఆయన ఇచ్చిన జవాబులు వారి మనస్సులను ఇట్టే దోచుకొన్నాయి.
ఒక రోజు సాయంత్రం సముద్రతీరపు ఇంట్లో స్వామీజీ కూర్చుని ఉన్నారు. యథాప్రకారం పలువురు యువకులు ఆయనను కలుసుకోవడానికి వచ్చారు. క్రింద తరంగాలతో ఉప్పొంగుతున్న నీలిసముద్రం, పైన విస్తృతమైన నీలాకాశం. ఒకరు ఇలా అడిగారు.
కృష్ణుడు ఎందుకు నీలమేఘచ్ఛాయారూపుడు?
ప్రశ్న : స్వామీజీ, కృష్ణుణ్ణి నీలమేఘశ్యామునిగా ఎందుకు అభివర్ణిస్తారు?
స్వామీజీ : ఎందుకంటే విస్తృతమయినదంతా నీలి రంగులో ఉంటుంది. మీ సమీపంలోని అంతరిక్షాన్ని (Space) చూడండి, దానికి రంగు లేదు. కాని పైన విస్తృతించివున్న పరిమితిలేని ఆకాశాన్ని చూడండి. అది నీలిరంగులో ఉంది. సముద్ర జలాన్ని చేతుల్లోకి తీసుకొని చూడండి. దానికి రంగు లేదు. కాని విశాలమైన సముద్రాన్ని చూడండి, అది నీలిరంగులో కనిపిస్తుంది. మీ సమీపంలోని నేలను చూడండి, అది విభిన్న రంగుల్లో ఉంది. కాని దూరంగా కనిపించే కొండను చూడండి, దాని రంగు నీలం. కృష్ణుడు సర్వాంతర్యామి, ప్రకృతి అంతటా చొచ్చుకొనిపోయి వ్యాపించిన వాడు. ఆయన అనంతుడని చూపడానికే నీలమేఘశ్యామునిగా అభివర్ణింపబడుతున్నాడు.
స్పెన్సర్ ఏం చెబుతున్నాడు?
ప్రాచ్య, పాశ్చాత్య తత్త్వాలను గురించి చర్చ వచ్చింది. ఒక విద్యార్థి స్పెన్సర్‌ను అమితంగా శ్లాఘించాడు. అప్పుడు స్వామీజీ ఇలా అన్నారు: “స్పెన్సర్ ‘గ్రహింపజాలనిది’ అని వచించినది దేనిని? మనం చెప్పే ‘మాయ’ కాదా! ఈ పాశ్చాత్య తాత్త్వికులు ‘గ్రహింపజాలనిది’ అనే భావనను తలచుకొంటేనే భయపడిపోతారు. కాని మన తాత్త్వికులు తెగించి దాన్లోకి దూకి దానిని జయించారు. పాశ్చాత్య వాగాడంబర తత్త్వానికీ, ప్రాచ్యుల అనుభూతికీ ఇదే తేడా.”
ఏది సమాజ సంస్కరణ?
సమాజం భ్రష్టుపట్టింది, దానిని సంస్కరించాలనే ఆరాటం నాటి యువకులలో ఎక్కువగా కనిపించింది. కాని దాని కోసం వారు ఎంపిక చేసుకొన్న మార్గం నిర్మాణాత్మకంగా లేదని స్వామీజీ గ్రహించారు. భ్రష్టుపట్టడానికీ, తిరోగమనానికీ మన మతమూ, సంస్కృతే కారణమని నమ్మిన ఆ యువకులు మన వారసత్వాన్నే విస్మరిస్తూ, అవహేళనగా మాట్లాడనారంభించారు. స్వామీజీ దానిని ఆమోదించ లేదు. మన పతనావస్థకు కారణం మన మతమో, నాగరకతో, సంస్కృతో కాదు; వాటిని సముచితంగా అవగతం చేసుకోకపోవడమూ, ఆలోచనారహితంగా విశ్లేషణారహితంగా పాశ్చాత్య లౌకిక సంస్కృతిని అలాగే స్వీకరించి అనుసరించ డమే మన పతనావస్థకు కారణంగా ఆయన పరిగణించారు. సమాజ సంస్కరణ అక్కర్లేదన్నది ఎన్నటికీ ఆయన ఉద్దేశం కాదు; కాని ఆ సంస్కరణ అంతరంగం నుండి రావాలే కాని బయటినుండి కాదని ఆయన నొక్కివక్కాణించారు. అంటే మన వారసత్వాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా సమాజాన్ని సంస్కరించాలే గాని పాశ్చాత్యదేశాల నుండి అరువు తెచ్చుకొన్న భావనలను జొప్పించడం ద్వారా కాదని స్వామీజీ అభిప్రాయపడ్డారు.
హిందూమత ముఖ్యాంశాలు
“స్వామీజీ, హిందూమతంలోని ముఖ్యాంశాలు ఏవి?” అని ఒక కళాశాల ప్రొఫెసర్ అడిగారు. “భగవద్విశ్వాసం, వేదాలపట్ల విశ్వాసం, కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం. హిందూమతానికీ తక్కిన మతాలకీ ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటో తెలుసా? మనిషి అసత్యం నుండి సత్యం వైపుగా పయనిస్తున్నాడని తక్కిన మతాలు వచిస్తున్నాయి. అతడు సత్యం నుండి సత్యానికి, నిమ్న సత్యం నుండి ఉన్నతమైన సత్యానికి పయనిస్తున్నాడంటుంది హిందూమతం. వేదాలను లోతుగా అధ్యయనం చేస్తే అక్కడ సామరస్యం అనే భావనే కనిపిస్తుంది. పరిణామక్రమ భావనా దృక్పథంలో వేదాలను అధ్యయనం చేయాలి.”
‘ఎరుగబడనిది నేను తెలుసుకొన్నాను’
ఒక రోజు విద్యాధికులు కొందరు స్వామీజీని కలుసుకోవడానికి వచ్చారు. స్వామీజీ తననుతాను అద్వైతిగా భావిస్తారు. అద్వైతం పరమ నేను సత్యాన్ని గురించి చెబుతుంది. “ప్రాణం, లోకం, పరమ సత్యం అనే విభజనలు లేవు; ఉన్నది ఒక్కటే, అదే నేను” అన్నదే దాని భావం. వచ్చిన వారు ఈ భావనను ఆమోదించని వ్యక్తులు. ఒక సవాలు విసిరినట్లే స్వామీజీతో, “మీరూ భగవంతుడు ఒక్కటే అని చెబుతున్నారు. దీని ద్వారా మీ బాధ్యతను కడిగివేసుకొన్నారు. మీరు తప్పు చేస్తే అడ్డుకొనే దెవరు? సరైన మార్గం నుండి వైదొలగితే సరిదిద్దేదెవరు?” అని అడిగారు. అదే ఉద్ఘాటనతో స్వామీజీ ఇలా అన్నారు: “నేను భగవంతునితో తాదాత్మ్యం చెంది వున్నానని నిజంగా గ్రహించివుంటే తప్పుడు మార్గంలో వెళ్లనేవెళ్లను. నన్ను సరిదిద్దడానికో, అడ్డుకోవడానికో ఎవరి అవసరమూ ఉండదు.”
స్వామీజీ రామనాథపుర రాజప్రాసాదంలో బసచేసి ఉన్నప్పుడు కూడా ఇటువంటి వాదన ఒకటి తలెత్తింది. ఎరుగని పరమ సత్యాన్ని తెలుసుకోలేమని ఒక వ్యక్తి పరిహసించసాగాడు. కాసేపు సహనం వహించిన స్వామీజీ స్పష్టంగా, “ఎవరూ ఎరుగనిది నేను తెలుసుకొన్నాను” అన్నారు.
సర్వమత మహాసభకు వెళతారా?
స్వామీజీ ఆకృతీ, ఆయనకు గల విషయపరిజ్ఞానమూ, నూతన దృక్పథాలతో ఆయన భావనలను విశ్లేషించే తీరుతెన్నులూ చెన్నై యువకులను, ప్రత్యేకించి అలసింగను అమితంగా ఆకట్టుకొన్నాయి. అట్లే స్వామీజీ కూడా చెన్నై యువకుల పట్ల ఆకర్షితులయ్యారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. “హిందూమతం గురించిన ఆయన సరిక్రొత్త విశ్లేషణలు నిజానికి చెన్నైలోనే ఆదరణకు నోచుకొని, స్వీకరింపబడ్డాయి. అక్కడే శ్రీరామకృష్ణుల సందేశం తక్షణం స్వీకరింపబడింది” అని స్వామీజీ ఆంగ్లేయ జీవిత చరిత్రకారులు వ్రాస్తున్నారు.
అలసింగ ఇకపై ఆలస్యం చేయలేదు. ఒక రోజు “స్వామీజీ, మీ రెందుకు చికాగోలో జరుగనున్న సర్వమత మహాసభలో పాల్గొనకూడదు?” అని స్వామీజీని అడిగాడు. వెంటనే స్వామీజీ, “నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఎవరైనా పంపితే నేను వెళతాను” అన్నారు. అప్పుడు సమావేశంలోని ఒక వ్యక్తి తక్షణమే స్వామీజీకి కొంత డబ్బు (రూ 2/=) ఇచ్చారు. స్వామీజీ స్వహస్తాలతో ఆ పైకం పుచ్చుకొన్నారు. “మొట్టమొదటిసారిగా ఆయన చేత్తో డబ్బు పుచ్చుకోవడం అప్పుడే చూశాను” అని అలసింగ కాలాంతరంలో చెప్పాడు. చేతిలోని పైకం చూసి నవ్వుతూ, “నేను కలుసుకోబోయే మొదటి భిక్షగానికి ఈ పైకం ఇస్తాను” అన్నారు. అట్లే చేశారు కూడా. అమెరికా వెళ్లడం గురించి ఎలాంటి నిర్ణయానికీ స్వామీజీ రాకపోయినప్పటికీ, ‘నే నెందుకు పాల్గొనకూడదు?’ అనే భావన ఆయన మనస్సులో పదేపదే మెదలసాగింది. అలసింగ కూడా అవకాశం చిక్కినప్పుడల్లా ఈ విషయంలో స్వామీజీపై సుతిమెత్తగా ఒత్తిడి చేస్తూనే వచ్చాడు.
దిన పత్రికలలో
ఆ రోజుల్లో చెన్నైలో 15 కన్నా ఎక్కువ హిందూమత సంస్థలు ఉన్నాయి. కాని ఈ సంస్థల నాయకులుకానీ, హిందూమత అధినేతలుకానీ స్వామీజీని కలుసు కోవడం తటస్థించలేదు. పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు వచ్చి స్వామీజీని కలుసుకొన్నారు. కాని జనం తండోపతండాలుగా వచ్చారు. సామాన్యంగా వారు సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు ఆయనతో ముచ్చటించేవారు.
చెన్నై సంఘాలలో ఒకటయిన ‘తిరువళ్లిక్కేణి సాహిత్య సభ’ స్వామీజీని పలుమార్లు ఆహ్వానించి ఉపన్యాసాలు ఏర్పాటు చేసింది. తద్ద్వారా చెన్నైలో స్వామీజీ పేరు బాగా వ్యాప్తిలోకి వచ్చింది. స్వామీజీ అక్కడ చేసిన ప్రసంగాల గురించిన వార్తలు కొన్ని సందర్భాలలో దినపత్రికలలో వెలువడ్డాయి.
హిందూమతం మరియు సమాజశాస్త్రం గురించి వంగదేశ సన్న్యాసి
దాదాపు 32 ఏళ్ల వయసుగల వంగదేశ సన్న్యాసి ఒకరు చెన్నై వచ్చారు. ఆయన కలకత్తా విశ్వవిద్యాలయ స్నాతకోత్తరులు (ఎం.ఏ)* . విద్యావంతులైన దాదాపు 100 మంది హైందవులు ఆయనతో తిరువళ్లిక్కేణి సాహిత్య సభలో గత వారం ముచ్చటించారు. వారిలో దివాన్ బహదూర్ రఘునాథరావు కూడా ఉన్నారు. ఆ సన్న్యాసి ప్రసంగాంశాలు ఇంతకు మునుపే ‘ఇండియన్ సోషియల్ రిఫార్మర్’ పత్రికలో వెలువడ్డాయి…
వేదమతం, జీవితం గురించీ హిందూమతం వచించే ఆదర్శం, శ్రాద్ధ క్రియలు, స్త్రీవిద్య, హిందువుల ప్రగతి మొదలైన వాటి గురించీ స్వామీజీ చేసిన ప్రసంగాలలోని భావనలను పై నివేదిక క్లుప్తీకరించింది.
చెన్నైలోని అడయార్‌లో నెలకొన్న దివ్యజ్ఞాన సమాజంలో (Theosophical Society) కూడా స్వామీజీ ఒకటి రెండుసార్లు ప్రసంగించారు. వారి పత్రికయైన ‘ది థియోసఫిస్ట్’ 1893 మార్చ్ సంచికలో ఆ వార్త ప్రచురితమయింది.
ప్రసంగాలు, సంభాషణలు, వీటికన్నా ఎక్కువగా స్వామీజీ దివ్యతేజస్సు, వ్యక్తిత్వం వందలమందిని ఆకట్టుకొన్నాయి. స్వామీజీ అనుగ్రహభాషణం వలన కొందరి జీవితాలలో సైతం మార్పు వచ్చింది. ఒకరిద్దరి గురించి చూద్దాం. అలసింగను గురించి ముందే చూసివున్నాం. స్వామీజీపట్ల పూర్తిగా ఆకర్షితుడైన వ్యక్తి అతడు. తన తుదిశ్వాస వరకు ఆతడు స్వామీజీ కోసమే, స్వామీజీ ధ్యాసలోనే జీవించాడు. “మన అలసింగ వంటి వారు లోకంలో ఎవరూ లేరు. కించిత్తు కూడా స్వార్థంలేని, ఇంత కఠోరంగా శ్రమించే, గురువు పట్ల ఇంతటి భక్తి ప్రపత్తులు, ఇంత వినమ్రతాభావం గల శిష్యుణ్ణి ఈ లోకంలో చూడడం ఎంతో అరుదు” అని సాక్షాత్తు గురువైన స్వామీజీ ప్రశంసలందుకొన్న శ్లాఘనీయుడు అలసింగ. స్వామీజీ దివ్యమయ చరిత్ర ఈ లోకంలో నిలిచివున్నంత దాకా అలసింగ కీర్తిచంద్రికలు ప్రకాశిస్తూనే ఉంటాయి.*
కిడి
తరువాతి వ్యక్తి ‘కిడి’. ఇది ఆయనకు స్వామీజీ పెట్టిన ముద్దుపేరు. ఆయన అసలు పేరు సింగారవేల్ మొదలియార్. ఆయన క్రైస్తవ కళాశాలలో విజ్ఞానశాస్త్ర శాఖలో ఉప అధ్యాపకుడు. క్రైస్తవ మత భావనల ప్రభావంతో హిందూమతాన్ని ఆయన తీవ్రంగా విమర్శించేవాడు. స్వామీజీ గురించి విని, ఆయనతో వాదించడానికి ఒక రోజు వచ్చాడు. ఆ సంఘటన గురించి కాలాంతరంలో స్వామీజీ తమాషాగా, “ ‘వచ్చాను, చూశాను, జయించాను’ అన్నాడు అలనాడు జూలియస్ సీజర్. కాని కిడి ‘వచ్చాడు, చూశాడు, జయింపబడ్డాడు’” అనేవారు. స్వామీజీని కలుసుకొన్న తరువాత కిడీ తన జీవితాన్ని పూర్తిగా స్వామీజీ కార్యకలాపాలకు అంకితం చేశాడు.
ఒక రోజు సాయంత్రం వేళ. యథాప్రకారం నాడు కూడా స్వామీజీని కలుసుకోవడానికి పలువురు వచ్చారు. ఆ రోజు స్వామీజీ మనస్సు పూర్తిగా భగవద్ధ్యాసలో లయించి ఉంది. ఆయనలో దివ్యశక్తి పరవళ్లు త్రొక్కుతున్నది. హఠాత్తుగా స్వామీజీ ఒక రకమైన పారవశ్య స్థితిని పొందారు. ఆ స్థితిలోనే, “ఇప్పుడు ఎవరైనా నన్ను స్పృశిస్తే వారు మహాత్ములయిపోతారు” అన్నారు. ఆ బృందంలో కిడీ ఉన్నాడు. పర్యవసానాలను గురించి అతడు ఆలోచించలేదు. ఠక్కున వెళ్లి స్వామీజీని స్పృశించాడు. విద్యుచ్ఛక్తి ప్రసరించినట్లు ఏదో ఒక ఉద్వేగం ఆతడిలో ప్రవేశించింది. స్వామీజీ వచించినట్లే ఆతడి జీవితం ఆ తరువాత పూర్తిగా మారిపోయింది. ఇంటికి వెళ్లడమే మానుకొన్న అతడు కాలాంతరంలో సన్న్యాసిలా తపోమయ జీవితం గడిపాడు.
ఆతడికి ‘కిడి’ అనే పేరు స్వామీజీ పెట్టడం కూడా ఎంతో ఆసక్తికరమైన ఉదంతం. స్వామీజీని కలుసుకోకమునుపే ఆతడు తన జీవితాన్ని కట్టుబాట్లతో మలచుకొన్నాడు. పాలు, పళ్లు మాత్రమే ఆతడు ఆహారంగా పుచ్చుకొనేవాడు. ఇందువలన ఆతణ్ణి తమిళ భాషలో ‘కిళి’ (చిలుక) అని సంబోధించాలని స్వామీజీ అభిలషించారు. స్వామీజీ ఉచ్చారణలో ‘ళి’ ‘డి’ గా మారిపోయి ‘కిడి’ అయింది.
కాలాంతరంలో స్వామీజీ అభిమతం మేరకు ‘ప్రబుద్ధ భారత’ అనే ఆంగ్ల మాసపత్రిక చెన్నైలో ప్రారంభించబడినప్పుడు దాని కార్యనిర్వాహక బాధ్యతను కిడి వహించాడు.
వి. సుబ్రహ్మణ్య అయ్యర్
ఒక రోజు కొందరు యువకులు సరదాగా, ప్రొద్దుపుచ్చడంకోసం ఆంగ్లం మాట్లాడే సన్న్యాసిని చూడగోరి వచ్చారు. వారు వచ్చినప్పుడు స్వామీజీ హుక్కా త్రాగుతున్నారు. సగం జాగ్రదవస్థలో, సగం స్వప్నావస్థలో తేలిపోతున్నట్లుగా ఆయన కనిపించారు. యువకులు కాసేపు వేచివున్నారు. వారిలో ఒకరు “స్వామీజీ! భగవంతుడంటే ఏమిటి?” అని స్వామీజీని అడిగాడు. స్వామీజీ ఆ ప్రశ్నను పట్టించుకోనట్లుగాహఠాత్తుగా తల పైకెత్తి, “మంచిది, మిత్రమా! శక్తి అంటే ఏమిటి? కాస్త వివరించు చూద్దాం” అన్నారు. యువకులు ఈ ప్రశ్నను ఏమాత్రం ఎదురు చూడలేదు. ఒకరిముఖాలొకరు చూసుకొంటూ ఆశ్చర్యచకితులై నిలబడిపోయారు. వెంటనే స్వామీజీ, “ఏమిటిది! శక్తి లేకుండా దైనందిన జీవితం లేదు. అటువంటి చిన్న పదాన్నే మీరు వివరించలేకపోతున్నారు. భగవంతుణ్ణి గురించి వివరించ మని నన్ను అడుగుతున్నారే!” అన్నారు. ఆ యువకులు అడిగిన ప్రతి ప్రశ్నకూ అలాంటి ఎదురు ప్రశ్నల రూపంలోనే జవాబు లిచ్చారు. కాసేపటికి వారు సెలవుపుచ్చుకొని వెళ్లిపోయారు. ఒక వ్యక్తి మాత్రం వారితో వెళ్లిపోకుండా స్వామీజీ కోసం వేచివున్నాడు. ఆ వ్యక్తి సుబ్రహ్మణ్య అయ్యర్. స్వామీజీ పట్ల అమితంగా ఆకర్షితుడైన అయ్యర్ రోజూ ఆయన వద్దకు రాసాగాడు.
ప్రతి రోజూ మెరీనా సముద్రతీరంలో పచార్లు చేయడం స్వామీజీకీ, శిష్యులకూ అలవాటయిపోయింది. ఒక రోజు స్వామీజీ అయ్యర్‌తో, “మంచిది, నాయనా! నీకు మల్లయుద్ధం తెలుసా?” అని అడిగారు. “తెలుసు” అని అయ్యర్ జవాబివ్వగానే, “అలా అయితే రా, ఒక పట్టుపడదాం” అన్నారు స్వామీజీ. ఈ సంఘటనానంతరం స్వామీజీని ‘పహిల్వాన్ స్వామి’ అని అయ్యర్ పేర్కొన సాగాడు.
తమిళ వంటకాల పట్ల ప్రీతి
బాలాజీరావును చూడడానికి స్వామీజీ తిరువళ్లిక్కేణి సింగరాచారి వీథిలోని ఆతడి ఇంటికి అప్పుడప్పుడు వెళ్లడం కద్దు. కొన్ని సమయాలలో బాలాజీ ఏదో పనుల్లో ఉన్నప్పుడు స్వామీజీ వేచివుండేవారు. ఆ సమయాలలో కళ్లుమూసుకొని ‘ఓం’ అనే ప్రణవ మంత్రాన్ని స్వామీజీ బిగ్గరగా ఉచ్చరించేవారు. ఆ ఓంకార నాదమూ, శక్తీ ఇంటినే కదలించివేసేదిగా ఉండేవట! వెళ్లినప్పుడల్లా బాలాజీ భార్యను చారు అడిగి పుచ్చు కొనేవారు. అట్లే అప్పడాలు, వడియాలు లాంటివి కూడా ఇష్టంగా తినేవారు.
కొన్ని సంఘటనలు
ఒక రోజు స్వామీజీ ఏకాంతంగా ఉన్నప్పుడు మన్మథనాథ్ ఆయన వద్దకొచ్చి, “స్వామీజీ! అత్యున్నత వేదాంత తత్త్వాలు సంతరించుకొన్నప్పటికీ హిందువులు విగ్రహాలను ఆరాధిస్తున్నారే?” అని అడిగాడు. అందుకు స్వామీజీ, “మనకు హిమాలయ పర్వతాలున్నాయి కదా, అందుకే” అన్నారు. మహోన్నతమైన ఆ పర్వతరాజాలను చూస్తున్నప్పుడు దాని సృష్టికర్తను ఆరాధించకుండా ఉండలేం అన్నదానినే స్వామీజీ అలా సూచించారు.
సాధారణంగా స్వామీజీ ఎవరినీ తప్పుబట్టడమో, గర్హించడమో చేసేవారుకారు. కాని ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆయనతో, “స్వామీజీ! సంధ్యా వందనం అనుష్ఠించడానికి కొన్ని సమయాలలో తీరిక ఉండడంలేదు. అలా అనుష్ఠించకపోవడం తప్పా?” అని అడిగాడు. ఉరుములా గర్జిస్తూ జవాబిచ్చారు స్వామీజీ: “ప్రాచీన ఋషులకు, మనలా మందగమనం కాకుండా అంగలు వేస్తూ నడచిన మహామేధావులకు, ఎవరి ముందు నువ్వు కేవలం ఒక పురుగువో, ఆ మహానుభావులయిన ఋషులకు తీరిక లభించింది. నీకు తీరిక దొరకలేదు, అంతే కదా!”
ఇదే విధంగా మరొక రోజు ఒక వ్యక్తి వచ్చి వేదకాల ఋషుల ఉపదేశాలు “అర్థంపర్థంలేని పిచ్చికూతల” మాదిరి ఉన్నాయని చెప్పాడు. అప్పుడు కూడా స్వామీజీ భగ్గున మండి ఇలా జవాబిచ్చారు: “పూజనీయులైన ప్రాచీన ఋషులను ఇలా తూలనాడడానికి నీ కెంత ధైర్యం! మిడిమిడి చదువులు నీ మెదడును పాడుచేశాయి. వారు ఆవిష్కరించిన సత్యాలను నువ్వు ఎప్పుడయినా విశ్లేషించి చూశావా? విశ్లేషణ అలా ఉంచు, వేదాలను ఒక్కసారయినా చదివి చూశావా? చదివి చూడు, వారు ఉద్ఘోషించింది అప్పుడు తెలుస్తుంది. ధైర్యముంటే అది చేసిచూడు.”
ఒక రోజు మన్మథనాథ్ వంటమనిషి మైసూరు మహారాజు స్వామీజీకి కానుకగా ఇచ్చిన హుక్కాను కుతూహలంగా చూస్తున్నాడు. అది గమనించిన స్వామీజీ, “నీకు అది కావాలా?” అని అడిగారు. “అవును” అని చెప్పడానికి సంశయిస్తూ అతడు నిలబడిపోయాడు. ఆతడి వాలకం ఇట్టే గ్రహించిన స్వామీజీ హుక్కాను ఆ వంటమనిషికి ఇచ్చేశారు. “నువ్వు చూసి విస్తుబోయే వస్తువు నీకే సొంతం” అన్నారు స్వామీజీ. తమ వద్దనున్న ఏ వస్తువును చూసి ఎవరైనా ఆశ్చర్యచకితులయితే వెంటనే దానిని ఆ వ్యక్తికే ఇవ్వడం స్వామీజీ నైజం.
ప్రేతాత్మలనూ కరుణించడం
చెన్నైలో స్వామీజీకి ఒక విచిత్రమయిన అనుభవం కలిగింది. కొన్ని ప్రేతాత్మలు ఆయనను ఇబ్బందిపెట్టాయి. ఆయన మనస్సు కలతచెందే విధంగా, “ఇది జరుగబోతోంది”, “అది జరుగబోతోంది” అంటూ ఆయనతో చెప్పసాగాయి. అవన్నీ అబద్ధాలని తరువాత తేలేవి. మొదట్లో స్వామీజీ వీటిని అసలు పట్టించుకోలేదు. కాని ఇలా కొన్ని రోజులు నిరంతరాయంగా జరిగినప్పుడు, స్వామీజీలో సహనం నశించింది. ఆయన కోపాన్ని చూసిన ఆ ప్రేతాత్మలు ఆయన వద్దకు వచ్చి, తమ నికృష్ట పరిస్థితిని తెలియజేసి, తమకు సద్గతి అనుగ్రహించమని వేడుకొన్నాయి. వాటి వేడుకోలును మన్నించిన స్వామీజీ ఒక రోజు మెరీనా సముద్ర తీరానికి వెళ్లారు.చేత పిడికెడు మట్టి తీసుకొని, దానిని తర్పణ ద్రవ్యాలుగా భావించి, ఆ ప్రేతాత్మల సద్గతి కోసం హృదయపూర్వకంగా ప్రార్థించారు. ఆ తరువాత ఆ ప్రేతాత్మలు కనిపించలేదు.
ఎందుకు సృష్టించారు?
కొన్ని సమయాలలో స్వామీజీ మెరీనా సముద్రతీరంలో ప్రశాంతంగా పచార్లు చేయడం కద్దు. ఒక రోజు ఆయన అలా పచార్లు చేస్తున్నప్పుడు కొందరు మత్స్యకారుల పిల్లలను చూడడం తటస్థించింది. తైలసంస్కారంలేని తల, గుంటలు పడ్డ కళ్లు, వెన్నుకు అతుక్కుపోయిన కడుపుతో వారి నికృష్ట పరిస్థితిని చూసి స్వామీజీ కోమల హృదయం ద్రవించిపోయింది. “భగవంతుడా! వీరిని ఎందుకు సృష్టించావు? నా హృదయం తల్లడిల్లిపోతున్నది! ఎంత కాలం ప్రభో, ఎంత కాలం!” అంటూ కన్నీరు స్రవిస్తూ ఆయన ప్రార్థించారు.
పాశ్చాత్య దేశాలకు వెళ్లాలి
పేదలను చూసినప్పుడల్లా ఆయన హృదయం తల్లడిల్లిపోతుంది. వారికి ఏదైనా చేయాలంటే డబ్బు కావాలి, అందుకోసం పాశ్చాత్య దేశాలకు వెళ్లాలి, అక్కడ మన ఆధ్యాత్మిక సంపత్తిని ధారాళంగా వారికి పంచి ఇచ్చి, వారి వద్ద నుండి గొప్ప ఆర్థిక సహాయం పొంది, తిరిగి వచ్చి ఈ పామర ప్రజలను ఉద్ధరించడంతో భారతదేశం కోల్పోయిన మహత్త్వాన్ని పునరుద్ధరించాలనే భావన ఆయనలో ఉవ్వెత్తున లేవడం కద్దు. ఒక రోజు చెన్నై మిత్రులకు దానిని గురించి స్వామీజీ తెలిపారు:
“మన ఆధ్యాత్మిక సంపదను విరివిగా పంచి ఇవ్వవలసిన తరుణం ఆసన్నమయింది. ప్రాచీన ఋషులు మనకు అందించిన హిందూమతాన్ని ఆచరణ యుతంగా రూపుదిద్దే కాలం వచ్చేసింది. పారమార్థిక సంపత్తి అపారంగా నిల్వవున్న మన ప్రాచీన కోటను పరాయివారు వచ్చి ముట్టడించే దాకా వేచివుండడమా? మన కోటలో ఏ శత్రుమా ప్రవేశించలేడని భుజాలు చరుచుకొంటూ ఊరకే ఉండడమా? ఏ పనీ చేయకుండా ముడుచుకొని పడివుండడమా? లేకపోతే పూర్వకాలంలో జరిగినట్లు మన సనాతనధర్మ మహత్త్వాన్ని లోకమంతటాప్రచారం చేయడమా? సామాజిక వర్గాలను స్థానిక సంప్రదాయాలను పట్టుకొని వ్రేలాడుతూ సంకుచిత పరిధిలో పడివుండడమా లేక యావత్ప్రపంచాన్నీ మన చింతనా సంపత్తితో నింపివేసి, తద్ద్వారా భారతదేశ ప్రగతిని అభిలషించడమా? ఏది చేయాలి? మనం మేలుకోగోరితే మన దేశం శక్తిమంతమై ఉండాలి, ఐకమత్యంతో భాసిల్లాలి, శక్తుల నన్నింటినీ ఒకే దిశగా మళ్లించాలి.”
స్వామీజీ భావన చెన్నై మిత్రులకు చక్కగా అర్థమయింది; “అవును, స్వామీజీ. మనం మేలుకొనే తీరాలి. దానిని సాధించడానికే మీరు జన్మించారు. మీరు మహాద్భుత కార్యాలను నిర్వర్తిస్తారు” అని వారు చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు, స్వామీజీ విదేశ పయనానికి డబ్బు కూడా వసూలుచేయ నారంభించారు. చెప్పుకోదగ్గ మొత్తం వసూలయింది. డబ్బును చూసినప్పుడు స్వామీజీ దిగ్భ్రమచెందారు ‘నా ఆదర్శాలకు అనుగుణంగానే కార్యాలను నిర్వర్తిస్తున్నానా? కేవలం ఉత్సుకత ప్రేరణ నన్ను లాక్కొనిపోతున్నదా? లేక నా ప్రణాళికలకు వెనుక నిజంగానే బలమైన ఉద్దేశం ఉందా?’ అని ఆయనహృదయం తర్జనభర్జనలకు గురియైంది. “అమ్మా, జగజ్జననీ! నీ సంకల్పం ఏమిటో తెలియజేయి. సమస్తాన్నీ నిర్వర్తింపజేసేది నువ్వే! నేను నీ చేతిలో కేవలం ఒక పరికరాన్ని మాత్రమే కదా!” అంటూ హృదయపూర్వకంగా ప్రార్థించారు.
ఆయన ఒక సన్న్యాసి. లోకం తీరుతెన్నులు ఆయనకు క్రొత్త. కనీ వినీ ఎరుగని, పరిచయస్థులంటూ ఎవరూ లేని ప్రపంచానికి ఆయన వెళ్లాలి. ఒక వినూత్న సమాజాన్ని చూడాలి, ఒక నూతన సందేశాన్ని వారికి అందించాలి – మనస్సు సంశయానికి లోనవడం సహజమే కదా! సమధికోత్సాహంతో తమకోసం డబ్బు వసూలుచేసిన యువకులను పిలిచి స్వామీజీ ఇలా అన్నారు: “మిత్రులారా, పాశ్చాత్యదేశానికి వెళ్లే విషయంగా నేనిప్పుడు ఏమీ చెప్పలేను. జగజ్జనని సంకల్పం ఏమిటో తెలియాలి. నేను వెళ్లడం తన ఆదేశమని ఆమె నాకు గ్రహింపజేయాలి. ఆమె దివ్యహస్తాలు నన్ను పట్టుకొని తోడ్కొని వెళ్లనిదే నేనెలా అంధకారంలో అడుగిడను? నేను వెళ్లాలన్నది ఆమె సంకల్పమయితే డబ్బు మళ్లీ వస్తుంది. కనుక ప్రస్తుతానికి ఈ డబ్బును పేదలకు వినియోగించండి.” స్వామీజీనే సర్వస్వంగా పరిగణించిన యువకులు ఆయన చెప్పినట్లే చేశారు. మనస్సులోని భారం దిగిపోయినట్లుగా స్వామీజీ ప్రశాంతి పొందారు.
స్వామీజీ నిర్ణయానికి రామనాథపురం మహారాజు మనస్సు మార్చు కోవడమూ ఒక కారణం కావచ్చు. స్వామీజీ రామనాథపురంలో ఉన్నప్పుడు ఆయన విదేశీ పర్యటనకు మహారాజు సానుకూలంగా స్పందించడమే కాక పది వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించాడు. కాని చెన్నై భక్తులు డబ్బు కోసం ఆయనను సంప్రతించినప్పుడు నిరాకరించాడు. అంతేకాదు; చెప్పుడు మాటలు విని స్వామీజీని సందేహించాడు కూడా! “స్వామీజీ ఒక బెంగాలీ, విద్యాధికుడు. బహుశా ఆయనకు రాజకీయాలతో ప్రమేయం ఉండివుండవచ్చు. అంతెందుకు, నా పాలనను కూలదోయడానికి ప్రయత్నించే వ్యక్తి కూడా కావచ్చు” వంటి లేనిపోని అనుమానాలు మహారాజులో తలెత్తాయి. ఈ విషయం విన్నప్పుడు స్వామీజీ మనస్సు ఎంత వ్యథ చెందివుంటుంది! బహుశా అందువల్లనేమో సమస్తాన్నీ జగజ్జనని పాదపద్మాల వద్ద అర్పించి, ఆమె ఆదేశం కోసం స్వామీజీ వేచివున్నారు కాబోలు. సంభాషణలతోను, మిత్రులతోను స్వామీజీ చెన్నైలో రోజులు గడుపుతున్నప్పటికీ, జగజ్జనని మార్గనిర్దేశం నిమిత్తం ఆంతరికంగా హృదయం ద్రవించేలా స్వామీజీ ప్రార్థించసాగారు.
ఇటువంటి ఒకటి రెండు సంఘటనలు స్వామీజీ మనస్సును బాగా ఆవేదనకు గురిచేశాయనడంలో సందేహంలేదు. “నా ప్రణాళికలన్నీ నీరుగారి పోయాయి…. బరువైన నిట్టూర్పుతో వాటినన్నింటికీ తిలోదకాలిస్తున్నాను; భగవంతుని సంకల్పానుసారం జరుగనీ, ఇది నా నుదిటివ్రాతే తప్ప వేరెవరినీ నేను తప్పుపట్టడం లేదు… మైసూర్ మహారాజు, ‘బహుశా’ నన్ను పంపుతారేమో చూస్తాను. ‘బహుశా’ ఎందుకంటే దక్షిణ భారతంలోని మహారాజుల వాగ్దానాలను యథాతథంగా విశ్వసించలేం; ఎందుకంటే వారు రాజపుత్రులు కారు కదా! రాజపుత్రులు ప్రాణాలు త్యజిస్తారే తప్ప ఆడినమాట తప్పరు. పోనీలే, అనుభవాల నుండే మనిషి నేర్చుకొంటాడు, ఈ ప్రపంచంలో అనుభవమే అన్నింటికీ మించిన గురువు” అంటూ స్వామీజీ ఆవేదనతో ఆ తరువాత అలసింగకు వ్రాశారు.
హైదరాబాద్‌లో
ఈ రోజుల్లో హైదరాబాద్‌లోని ఆప్తులు స్వామీజీని అక్కడికి రావలసిందిగా పదేపదే ఆహ్వానించసాగారు. వారి ఆహ్వానాన్ని స్వామీజీ నిరాక్షేపణీయంగా స్వీకరించారు. ఈ ఆహ్వానంలో ఏదైనా దైవసంకల్పం ఉండ వచ్చునని స్వామీజీ భావించకపోలేదు. హైదరాబాద్ నిజామ్ కొలువులో చీఫ్ ఇంజనీరుగా ఉన్న బాబు మధుసూదన ఛటర్జీకి తంతివార్త పంపించారు. ఫిబ్రవరి 9 వ తేదీన స్వామీజీకి ఘనమైన బహిరంగ స్వాగతోత్స వానికి ఏర్పాటు, 10 వ తేదీన మధుసూదన్ ఇంట విందు ఏర్పాటు చేయబడ్డాయి. రైలు నిలయంలో స్వామీజీకి స్వాగతం పలుకడానికి హిందువులు, మహమ్మదీ యులు కలసి దాదాపు 500 మంది వేచివున్నారు. హైదరాబాద్‌లో అత్యున్నత పదవులలో ఉన్న వ్యక్తులూ, పెద్దమనుషులూ కూడా వచ్చారు. కాషాయాంబరాలు ధరించి, చేత కమండలంతో మొదటి తరగతి పెట్టె నుండి దిగిన స్వామీజీని అక్కడ సమావేశమైన వారిలో పలువురు పూలమాలాలంకృతుని చేసి సాదరంగా ఆహ్వానించారు. కలకత్తాలోనే స్వామీతో పరిచయమున్న కాళీచరణ్ అనే వ్యక్తి ఆయనను అందరికీ పరిచయం చేశాడు.
మర్నాడు పాలు, పండ్లు, మిఠాయిలు మొదలయిన ఎన్నో కానుకలు పుచ్చుకొని సికిందరాబాద్ నుండి వందమంది స్వామీజీ దర్శనార్థం వచ్చారు. తమ ఊళ్లోని మెహబూబ్ కళాశాలలో ఉపన్యసించ వలసిందిగా వారు స్వామీజీని ఆహ్వానించారు. స్వామీజీ ఇంతదాకా బహిరంగ ప్రసంగాలు ఏవీ చేయలేదు. కాని ఇప్పుడు ఎందుకోగాని అంగీకరించారు.
ఆ రోజు గోల్కొండ కోటను సందర్శించి తిరిగి వచ్చేసరికి, హైదరాబాద్‌లో అత్యంత ప్రముఖుడూ, నిజామ్ బావమరిది అయిన నవాబ్ బహదూర్ సర్ ఖుర్షీద్ ఝా ఆంతరంగిక కార్యదర్శి ఆయన కోసం వేచివున్నాడు. మర్నాడు ఉదయం నవాబును కలుసుకోవలసిందిగా స్వామీజీకి ఆతడు ఆహ్వానం అందజేశాడు.
నవాబుతో
మర్నాడు కాళీచరణ్‌తో పాటు స్వామీజీ నవాబు రాజప్రాసాదానికి వెళ్లారు. ఖుర్షీద్ ఝా విశాల మనోభావాలు గల వ్యక్తి. మహమ్మదీయుడే అయినప్పటికీ హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు వెలసివున్న హైందవ పుణ్యతీర్థాలను అన్నింటినీ ఆతడు సందర్శించాడు. ఆతడిని కలుసుకోవడంలో స్వామీజీ కూడా సంతోషభరితులయ్యారు. ఇద్దరూ దాదాపు రెండు గంటలుపైగా మాట్లాడుకొన్నారు. హిందూ, క్రైస్తవ, మహమ్మదీయ మతాలలోని అనేక అంశాలను గురించి వారు చర్చించుకొన్నారు. ఖుర్షీద్ ఝా విగ్రహారాధనను ఆమోదించని వ్యక్తి. ఆతడికి భగవదారాధన పరిణామక్రమాన్ని గురించి స్వామీజీ విశదపరిచారు. అత్యున్నత వేదాంత తత్త్వాలను గురించి వివరించి చెప్పారు స్వామీజీ. వివరిస్తున్నప్పుడు ఆయన కళ్లలో భాసిల్లిన ప్రకాశమూ, ముఖారవిందాన ద్యోతకమయిన తేజస్సూ, భావాలలోని స్పష్టత చూసి నవాబు ఆశ్చర్యచకితుడై మరింత ఉత్సుకతతో విన్నాడు. చివరికి తాను పాశ్చాత్యదేశాలు వెళ్లనున్న విషయం ప్రస్తావించినప్పుడు నవాబు ఆ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి, తన వంతుగా వేయి రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు. చెన్నైలో లాగానే ఇక్కడ కూడా డబ్బు నిరాకరించారు స్వామీజీ; “నవాబ్జీ, కాలం ఇంకా ఆసన్నం కాలేదు. భగవదాదేశం వచ్చినప్పుడు తప్పకుండా మీకు తెలియజేస్తాను” అంటూ నవాబు వద్ద సెలవు పుచ్చుకొన్నారు.
మక్కా మసీదు, చార్మినార్, ఫలక్నామా, నిజామ్ రాజప్రాసాదాలు, బషీర్‌బాగ్ మొదలైన హైదరాబాద్‌లోని ముఖ్యమైన చోట్లు సందర్శించారు.
‘పాశ్చాత్యానికి వెళ్లడంలోని నా ఉద్దేశం’
13 వ తేదీ ఉదయం ప్రథమ మంత్రితో సహా పలువురు ప్రముఖులను స్వామీజీ కలుసుకొన్నారు. వారు కూడా ఆయన పాశ్చాత్యదేశాల ప్రయాణానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ముందే నిశ్చయం చేసినట్లు ఆ రోజు సాయంత్రం మెహబూబ్ కళాశాలలో ‘పాశ్చాత్యానికి వెళ్లడంలోని నా ఉద్దేశం’ అనే అంశం మీద ప్రసంగించారు. ఐరోపావారితో కలిసి ఆ సమావేశంలో 1000 మందికి పైగా పాల్గొన్నారు. స్వామీజీ ఆంగ్లభాషా వక్తృత్వమూ, పాటవమూ వారిని ఆశ్చర్యచకితులను చేసింది. హిందూమత ప్రాశస్త్యమూ, సనాతన హైందవ సమాజమూ, సంస్కృతీ, వేదవేదాంత భావనలూ, పురాణాలు బోధించే నైతిక ఆదర్శాలూ ఇలా అనేక అంశాల గురించి వారి ముఖతః వెలువడిన భావనా తరంగాలు శ్రోతలను నూతన లోకానికి తీసుకువెళ్లాయని చెప్పడం అతిశయోక్తి కాబోదు. భారతదేశ ఔన్నత్యాన్ని బహుముఖంగా చాటిచెప్పిన తరువాత చివరగా స్వామీజీ తాము పాశ్చాత్యదేశాలు వెళ్లడంలోని ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు: “మన మాతృదేశానికి నూతన ప్రాణాన్నీ, ఉద్వేగాన్నీ ఎక్కించాలి. అందు నిమిత్తమే ఈ పాశ్చాత్యదేశాల ప్రయాణం” అని చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు.
మర్నాడు ఉదయం బేగం బజారులోని బ్యాంకు సొంతదారులు కొందరు సేట్ మోతీలాల్ అనే వ్యక్తి నేతృత్వంలో వచ్చి స్వామీజీని కలుసుకొన్నారు. వారు కూడా ఆయన ప్రయాణానికి సహాయం చేస్తామని వాగ్దానం చేశారు. అదే సమయంలో పుణేనుండి కూడా స్వామీజీకి ఆహ్వానం వచ్చింది. కాని ఆ ఆహ్వానాన్ని ఆయన వెంటనే ఆమోదించలేకపోయారు. ఆ మరుసటి రోజు కొన్ని హైందవ ఆలయ శిథిలాలను, బాబా షరాఫుద్దీన్ సమాధి, సర్ సాలార్జంగ్ రాజభవనం స్వామీజీ తిలకించారు.
అతీంద్రియ శక్తులు ప్రదర్శించే యోగితో
అతీంద్రియ శక్తులు సంతరించుకొన్న ఒక యోగిని స్వామీజీ హైదరాబాద్‌లో కలుసుకొన్నారు. ఏ వస్తువును కోరుకొన్నా దానిని రప్పించగల శక్తిమంతుడు ఆయన. కొందరు మిత్రులతో స్వామీజీ ఆయనను కలుసుకోవడానికి వెళ్లారు. అప్పుడా యోగి జ్వరంతో బాధపడుతున్నాడు. స్వామీజీ ఆయన వద్దకు వెళ్లి ఆయన శక్తులను ప్రదర్శించి చూపమని అడిగారు. అందుకు ఆ యోగి, “తప్పకుండా ప్రదర్శించి చూపుతాను. కాని అంతకు మునుపు మీరు నా తల మీద చేయి ఉంచి ఆశీర్వదించాలి. నా జ్వరం నయమవుతుంది” అన్నాడు. స్వామీజీ అట్లే చేశారు. పిదప ఆ యోగి వారితో, “మీకు కావలసినవి ఒక కాగితం మీద వ్రాసి నాకు ఇవ్వండి” అన్నాడు. ఆ ప్రాంతంలో లభించని ద్రాక్ష, కమలాఫలాల లాంటి పండ్ల పేర్లను వ్రాసి ఆయనకు ఇచ్చారు. ఒక కౌపీనం మాత్రమే ధరించి ఉన్న ఆ యోగికి, స్వామీజీ ఒక శాలువ ఇచ్చారు. దానిని ఆయన కప్పుకొన్నాడు. దానిలో నుండి గుత్తులుగుత్తులుగా ద్రాక్ష, కమలాఫలాలు మొదలైన వారు కోరుకొన్నవన్నీ తీసియిచ్చారు. ఆవిర్లుగ్రక్కుతున్న వేడివేడి అన్నం కూడా తెప్పించాడు! వాటిని తినమని స్వామీజీతో చెప్పాడు. అదేదో గారడీ ఏమోనని తలచిన మిత్రులు స్వామీజీని తినకుండా అడ్డుకొన్నారు. కాని స్వయంగా ఆ యోగి వాటిని తిననారంభించగానే అందరూ తిన్నారు. అన్నీ బాగానే, రుచిగానే ఉన్నాయి. చివరగా అద్భుతమైన గులాబీపువ్వులను తెప్పించాడు. ఆ గులాబీల రేకులు కించిత్తు కూడా వాడక, మంచుబిందువులతో ఎంతో తాజాగా ఉన్నాయి. అవి ఒకటి రెండు కావు, బోలెడన్నిపువ్వులు.* “ఇది ఎలా?” అని స్వామీజీ అడిగినప్పుడు, “అంతా హస్తలాఘవం” అన్నాడు ఆ యోగి!
అక్కణ్ణుంచి తిరిగి వచ్చాక కూడా స్వామీజీ ఆ యోగి గురించే ఆలోచిస్తూ ఉండిపోయారు. ఆయన ఇదంతా ఎలా చేయగలిగాడని దీర్ఘంగా ఆలోచించిన తరువాత స్వామీజీకి లభించిన యుక్తియుక్తమైన జవాబు ‘మనస్సు’ అన్నదే. మనస్సును వశపరచుకొంటే శక్తి ఉద్భవిస్తుంది; ఇతరుల మనస్సులను కూడా తన ఇచ్ఛ మేరకు వ్యవహరింపజేసే సమర్థత లభిస్తుంది. ఎందుకంటే ఆధారంలో మనస్సులన్నీ పరస్పరం సమైక్యమైనవే కనుక. వ్యక్తిగత మనస్సు అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు. మానసిక శక్తిని చూపించి, “అక్కడ ఏనుగు ఉంది” అని చెబితే ఆ మరో వ్యక్తికి ఏనుగు కనిపిస్తుంది. అది మానసికశక్తి సృష్టించే అద్భుతం!
మానసిక శక్తికి ఒక నిదర్శనాన్ని ప్రత్యక్షంగా చూసిన స్వామీజీకి హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ ఉపన్యాసం గొప్ప స్ఫూర్తిని, చొరవను ఇచ్చిందనడం అత్యుక్తి కాదు. ఫిబ్రవరి 17 వ తేదీన చెన్నైకి తిరిగి వచ్చిన స్వామీజీ పాశ్చాత్యదేశాలు వెళ్లడంలో మరింత సానుకూలతతో స్పందించినట్లు కనిపించారు. ఆయన సంభాషణలూ, ప్రసంగాలూ పై విషయాన్ని సూచిస్తున్నట్లు గానే ఉన్నాయి.
తల్లి జ్ఞాపకంతో కలత చెందడం
కన్నతల్లిని, పుట్టింటిని, సోదర సోదరీమణులను విడిచిపెట్టి వచ్చి దీర్ఘకాల మయింది. కాని వారి గురించిన జ్ఞాపకమూ, వారి క్షేమానికై ప్రార్థనలూ జీవిత పర్యంతం ఆయనలో ఉంటూనే వచ్చాయి. తల్లి జ్ఞాపకం క్షణం కూడా ఆయనను వదలిపెట్టలేదు. జీవితంలో తాను సాధించిన ఘన కార్యాలన్నింటికీ కారణభూతు రాలు తన తల్లే అని ఆయన పలుమార్లు చెప్పివున్నారు. ఎంతోకాలం ఎడబాసి ఉన్నప్పటికీ, అంతిమ సమయంలో పరుగు పరుగున వచ్చి తల్లి అంత్యక్రియలను ఇతరులతోడ్పాటు లేకుండా తానొక్కడే నిర్వర్తించిన ఆదిశంకరుల సన్న్యాస పరంపరకి చెందినవారు కదా స్వామీజీ!
కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాదు; వీలైనప్పుడల్లా తమ తల్లికీ, సోదరసోదరీమణులకీ శక్తి మేరకు స్వామీజీ సహాయం చేయనేచేశారు. గతిలేనిపరిస్థితిలో కుటుంబాన్ని తాను వదలి రావడం గురించి తెలుసుకోలేని వ్యక్తి కాదు ఆయన. స్వామీజీ కుటుంబ పరిస్థితిని గురించి తెలిసినప్పుడు ఖేత్రీ మహారాజు, ఆయన తల్లికి ప్రతి నెలా రూ. 100/– పంపించ నారంభించాడు. కనుకస్వామీజీకి కొంతలో కొంత మనోభారం తగ్గింది.
హఠాత్తుగా ఒక రోజు ఆయన కన్న కల ఆయన మనఃస్తిమితాన్నికోల్పోయేలా చేసింది. తమ తల్లి మరణించినట్లు స్వామీజీ కల కన్నారు. ఆయనమనస్సు వర్ణనాతీతమైన ఆవేదనకు లోనయింది. అది ఒక వైపు! ఆయననుపాశ్చాత్యదేశాలు వెళ్లమని మిత్రులు బలవంతపెట్టడం మరో వైపు. ఈ రెంటి మధ్యా స్వామీజీ మనస్సు నలిగిపోయింది. తమ మానసిక స్థితిని మన్మథనాథ్తో స్వామీజీ వ్యక్తంచేశారు. కుంభకోణం సమీపంలోని వలంగైమాన్ అనే ఊళ్లో ఉన్నజోస్యం చెప్పే వ్యక్తిని కలుసుకోమని మన్మథనాథ్ సలహా ఇచ్చాడు. ఆ వ్యక్తి పేరుగోవిందశెట్టి. జరిగిందీ, జరుగబోయేదీ చెప్పగల సమర్థుడు. మైసూర్ మహారాజు, చెన్నై పరగణా గవర్నర్ లాంటి ప్రముఖులు ఆతణ్ణి సంప్రతించేవారు. అతడువీథిలో వెళుతున్నప్పుడు ఊరి ప్రజలు మర్యాదపూర్వకంగా లేచి నిలబడేవారు! ఆవ్యక్తిని కలుసుకోవడానికి స్వామీజీ అంగీకరించారు. స్వామీజీ, మన్మథనాథ్, అలసింగ, మరొకరు ఆ జోస్యం చెప్పే వ్యక్తిని కలుసుకోవడానికి బయలుదేరారు.
ఈ నలుగురూ రైలులో కుంభకోణం వెళ్లి అక్కడ నుండి కొంతదూరం కాలినడకన వెళ్ళి ఆ ఊరు చేరుకొన్నారు. ఒక శ్మశానం సమీపంలో ఆ జోస్యం చెప్పే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అలసిసొలసిన కళ్లు, కారునలుపు రంగులో చూడగానేభీతిగొల్పే ఆకృతిలో ఉన్నాడతడు. ముందు అతడు వీరిని అసలు పట్టించుకోలేదు.కాసేపు నిరీక్షించి ఇక లాభం లేదనుకొని వీరు అక్కణ్ణుండి వెళ్లిపోవాలనిలేచినప్పుడు అతడు వారిని కూర్చోమన్నాడు. అతడి గ్రామ్య తమిళాన్ని అలసింగ తర్జుమా చేసి స్వామీజీకి చెప్పాడు. పిదప అతడు పెన్సిల్‌తో కొన్ని చిత్రాలు గీశాడు.కాసేపటికల్లా ఆతడి మనస్సు నిశ్చలస్థితిలో ఏకాగ్రమవడం స్వామీజీ గమనించారు. ఆ స్థితిలోనే కాసేపటికి అతడు స్వామీజీ పేరు, వారి వంశవృక్షంలోని పూర్వీకుల పేర్లు మొదలైన వ్యక్తిగత వివరాలు తడుముకోకుండా చెప్పాడు. అంతా కచ్చితంగా చెప్పాడు. చివరికి శ్రీరామకృష్ణులు స్వామీజీని పరిరక్షిస్తూ ఉండడం గురించీ తెలియజేశాడు. “మీరు దేశమంతటా పర్యటిస్తున్నప్పుడు ప్రతి ఘట్టంలోనూ ఆయన మీతోనే ఉన్నారు. మీ తల్లిని గురించిన వార్త అబద్ధం, మీరు కలత చెందకండి. అంతేకాదు, ఆధ్యాత్మికతను బోధించడానికి మీరు త్వరలో సుదూరదేశాలకు వెళ్లవలసి ఉంటుంది” అని కూడా అతడు చెప్పాడు.
స్వామీజీ మనస్సులోని భారం దిగిపోయింది. అందరూ అక్కణ్ణుండి తిన్నగా చెన్నై తిరిగి వచ్చారు. ఆ జోస్యుడు చెప్పిన విషయం ధ్రువీకరిస్తున్నట్లుగా, స్వామీజీ తల్లి క్షేమంగా ఉన్నారనే తంతి కలకత్తా నుండి వచ్చింది.
అనుగ్రహ నిమిత్తం
అడయార్‌లోని థియోసాఫికల్ సొసైటీలో (దివ్యజ్ఞాన సమాజంలో) స్వామీజీ ఉపన్యసించారని మునుపే చెప్పుకున్నాం. ఆ సొసైటీకి అమెరికాలో పలు శాఖలున్నాయి. ఒకవేళ తాను అమెరికా వెళ్లేపక్షంలో వారి పరిచయ పత్రం తనకు ఉపయోగంగా ఉంటుందనుకొని స్వామీజీ ఆ సొసైటీ అధ్యక్షుడైన కల్నల్ ఆల్కాట్‌ను కలుసు కొన్నారు. “పరిచయ పత్రం ఇవ్వగలం. కాని మీరు మా సొసైటీలో చేరాలి” అనే షరతు పెట్టాడు ఆల్కాట్. అందుకు స్వామీజీ, “అదెలా సాధ్యం? మీ సిద్ధాంతా లలో చాలావాటి పట్ల నాకు అసలు నమ్మకం లేదు. అటువంటప్పుడు మీ సొసైటీలో నే నెలా చేరగలను?” అని అడిగారు. “అయితే నేను మీకు సహాయం చేయలేను” అన్నాడు నిష్కర్షగా ఆల్కాట్.
వ్యక్తులను ఆశ్రయిస్తే దక్కేది దుఃఖమే కనుక భగవంతుణ్ణే ఆశ్రయించాలి. ఎవరు నిరాకరించినప్పటికీ నిరాకరించని, సదా అనుగ్రహ వృష్టి కురిపించే ఒక కరుణాసింధువు తమను సదా సర్వవేళలా పరిరక్షిస్తూ ఉండడం స్వామీజీకి తెలియకపోలేదు. “నా పట్ల సానుభూతి గలవారు ఎవరుంటారు? ఎవ్వరూ లేరు ఒక్కరు తప్ప”* అని కాలాంతరంలో స్వామీజీ వాపోయారు కదా, ఆ ఏకైక వ్యక్తినే ఆశ్రయించాలనుకొన్నారు స్వామీజీ. ఆమె మాతృమూర్తి శ్రీ శారదాదేవి. తమ ఉద్దేశాన్ని స్పష్టపరచి మాతృదేవి అనుమతినీ, ఆశీస్సులను ఆయన పొందగోరారు.
గురుదేవులు పిలుస్తున్నారు
శ్రేయోభిలాషులూ, మిత్రులూ స్వామీజీ పాశ్చాత్య ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు త్వరిత పరచసాగారు. కాని స్వామీజీ పూర్తిగా అంతర్ముఖులై ఉన్నారు. గురుదేవుల అనుగ్రహ ఆదేశం కోసం వేచివున్నారు. చివరికి అదీ ప్రాప్తించింది. ఒక రోజు రాత్రి స్వామీజీ మగత నిద్రలో ఉన్నారు. ఆయన కళ్ల ముందు అలలు పొంగే సముద్రం కనిపించింది. ఆ తీరంలో గురుదేవులు నిలబడి ఉన్నారు. హఠాత్తుగా నీటి మీద నడుస్తూ లోపలికి పోవనారంభించారు. కాస్త దూరం వెళ్లి వెనుకకు తిరిగి చూసి స్వామీజీని పిలుస్తూ తమను అనుసరించమని చెప్పారు. ఈ దృశ్యం కనిపించడం ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, చాలా రోజులు కొనసాగింది.
స్వామీజీ గదికి ప్రక్కనున్న గదిలో నరసింహాచారి పడుకొనేవాడు. రాత్రుళ్లలో స్వామీజీ ఎవరితోనో మాట్లాడుతూండడం ఆయన వినేవాడు. ఆ సంభాషణ చాలాసేపు కొనసాగడం కద్దు. నరసింహాచారికి ఏమీ అర్థం కాలేదు. చివరికి ఒక రోజు ఆయన తిన్నగా స్వామీజీనే అడిగాడు: “స్వామీజీ! రాత్రుళ్లలో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?” స్వామీజీ ఏవేవో చెప్పి మభ్యపెట్టజూపారు. కాని నరసింహాచారి వదలిపెట్టలేదు. చివరగా స్వామీజీ ఇలా చెప్పారు:
“చికాగో సర్వమత మహాసభ గురించిన భావనకు నేను దాదాపు స్వస్తి చెప్పాను. కాని అనేక రాత్రుల నుండి శ్రీరామకృష్ణులు దర్శనమిస్తున్నారు. ఎడతెగ కుండా నాతో, ‘నువ్వు నా కోసం మహాకార్యం చేయాలి. నువ్వు వెళ్లే తీరాలి. ఒక్కటి మాత్రం నిశ్చయంగా తెలుసుకో – ఆ మహాసభ నీ నిమిత్తమే ఏర్పాటవు తున్నది. సంశయించకు. నీ ప్రసంగం విని జనం ఆశ్చర్యచకితులవుతారు’ అని చెబుతున్నారు. నేను సంశయించేకొద్దీ ఆయన పదేపదే పట్టుబడుతున్నారు. చివరికి ఆయన ఆదేశాన్ని శిరసావహించ నిశ్చయించుకొన్నాను. ఇదుగో సిద్ధ మవుతున్నాను.”
మాతృదేవి దర్శనం
ఈ సంఘటనానంతరం స్వామీజీలో తలెత్తిన సంశయాలన్నీ తొలగి పోయాయి. అయినప్పటికీ మాతృదేవి నుండి అనుజ్ఞను, ఆశీస్సులను పొందగోరి స్వామీజీ తమ ఉద్దేశాన్ని వివరిస్తూ శారదానందకు ఉత్తరం వ్రాశారు: “నేను పాశ్చాత్య దేశాలకు వెళ్లాలని గురుదేవులు ఆదేశిస్తూన్నట్లు నాకు దర్శనం లభించింది. నా మనస్సు చంచల స్థితిలో ఉంది. మాతృదేవికి నా పరిస్థితిని తెలియజేసి ఆమె అభిప్రాయం నాకు వ్రాయి.”
శారదానంద మాతృదేవి వద్దకు వెళ్లి ఈ విషయం ప్రస్తావించి, “అమ్మా! మీ అభిప్రాయం నరేన్ తెలుసుకోగోరుతున్నాడు” అని చెప్పాడు. అందుకు మాతృదేవి, “ఒకటి రెండు రోజుల్లో చెబుతాను” అన్నారు. స్వామీజీ అభిమతం తెలుసుకొన్నప్పుడు మాతృదేవి మనఃస్థితి వర్ణనాతీతం. ఎందుకంటే స్వామీజీ జగద్గురువుగా విరాజిల్లబోవడం ఆమెకు స్పష్టంగా విదితం. దానిని గురించి ఒక అద్భుతమైన దృశ్యాన్నీ ఆమె గాంచివున్నారు:
ఆ సమయంలో మాతృదేవి గంగాతీరంలోని నీలాంబర ముఖర్జీ ఇంట్లో నివసిస్తున్నారు. ఆ రోజు పౌర్ణమి రాత్రి. పూర్ణచంద్రుని చల్లని కిరణాలు చుట్టు ప్రక్కలంతా ప్రసరించి ప్రపంచాన్ని ఒక స్వప్నలోకంగా మార్చివేయడమేగాక, గంగానది చిరు అలలపై పడి ప్రతిఫలించడంతో, ఆ స్వప్నలోకంలో గంగ ఒక వెండి నదిలా ప్రవహిస్తూన్నది. ఆ ఆహ్లాదకర పరిసరాల్లో పూర్తిగా మైమరచి పోయిన మాతృదేవి మెల్లగా వెళ్లి గంగా ఘట్టం మెట్ల మీద కూర్చుని ఆ ప్రకృతి సౌందర్యాన్ని గ్రోలారు. అప్పుడు హఠాత్తుగా గురుదేవులు అక్కడ సాక్షాత్కరించి, వెనుక నుంచి మాతృదేవిని త్రోసివేసేటట్లుగా వచ్చి ఠక్కున గంగలో దిగారు. దిగిన వారు అట్లే దాన్లో కరగిపోయారు. మాతృదేవి దిగ్భ్రాంతితో ఆ చోటును అట్లే చూస్తూ కూర్చుండిపోయారు. మరుక్షణం హఠాత్తుగా స్వామీజీ అదే చోట సాక్షాత్కరించారు. ఆయన ఆ నీటిని దోసిళ్లలో తీసుకొని, “జై శ్రీరామకృష్ణ!” అని నినాదం చేస్తూ ప్రజల మీద చిలకరించారు. ఈ దృశ్యం మాతృదేవి మనస్సులో చెరగిపోని ముద్రను వేసింది.
గురుదేవులు గంగాజలంలో కరగిపోయి దానిని స్వామీజీ ప్రజల మీద చల్లుతున్న ఆ దృశ్యం గురుదేవుల ఉపదేశాలను, ఆదర్శాలనూ స్వామీజీ ప్రచారం చేయబోయే కార్యారంభంగా ఉండబోవడం అని మాతృదేవి గ్రహించారు. ఇదే కాకుండా మాతృదేవికి కూడా ఒక కల వచ్చింది. దాన్లో గురుదేవులు కనిపించారు; తమను అనుసరించమని స్వామీజీని రమ్మని పిలుస్తూ సముద్ర అలల మీద ఆయన నడచివెళ్లారు. మాతృదేవికి అంతా సుస్పష్టమయింది. కనుక తమ అనుగ్రహ ఆశీర్వాదాలను తెలుపుతూ స్వామీజీకి ఒక ఉత్తరం వ్రాశారు.
మాతృదేవి లేఖ అందినప్పుడు స్వామీజీ తమ ఉద్వేగాలను అణచుకోలేక పోయారు. కళ్లు అశ్రుపూరితాలయ్యాయి. తమ ఉద్వేగాలను ఇతరులు తెలుసుకో కూడదని ఠక్కున తమ గదిలోకి వెళ్లిపోయారు. కాసేపటి తరువాత సముద్రతీరా నికి పోయి పచార్లు చేశారు. “అవును, ఇప్పుడు అంతా స్పష్టమయిపోయింది. మార్గం విస్పష్టంగా కనిపిస్తున్నది. జగజ్జనని సంకల్పం అవగతమయింది” అనితమతో తాము చెప్పుకొన్నారు.
సముద్ర తీరం నుండి మన్మథనాథ్ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు స్వామీజీ వదనారవిందం దేదీప్యమానంగా ప్రకాశిస్తూవుంది. అక్కడ ఆయన ప్రసంగం వినగోరి పలువురు మిత్రులు సమావేశమై ఉన్నారు. లోపలకు వెళ్లగానే వారితో స్పష్టంగా ఇలా చెప్పారు: “అవును. పాశ్చాత్యదేశాలు వెళ్లేతీరాలి. ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. హృదయపూర్వకంగా పనిచేద్దాం. ఫలితాన్ని జగజ్జనని ప్రసాదిస్తుంది. జగజ్జనని నాతో మాట్లాడింది.” స్వామీజీ తేజోవిరాజమాన ముఖారవిందమూ, స్పష్టమైన ఆయన మాటలూ అందరినీ పరమానంద భరితులను చేశాయి.
పేదల ధనమే కావాలి
తదుపరి సమస్య డబ్బు! “నేను అమెరికా వెళ్లాలన్నది జగజ్జనని సంకల్ప మయితే డబ్బు కూడా ఆమే అందజేస్తుంది” అన్నారు స్వామీజీ. జనసామాన్యం నుండీ, పేదల నుండీ వసూలు చేయాలన్నదే స్వామీజీ అభిమతం. పెద్దమనుషుల, ధనవంతుల నుండి డబ్బు పుచ్చుకోవద్దని స్వామీజీ నిష్కర్షగా చెప్పారు. రామనాథపుర మహారాజు, మరి ఇంకా ఒకరిద్దరు సంపన్నుల వద్ద పొందిన అనుభవమే ఇందుకు కారణం. స్వామీజీ అమెరికాకు వెళ్లే పక్షంలో పూర్తి బాధ్యతను తానే వహిస్తానని ఒక సంపన్నుడు కూడా వాగ్దానం చేసివున్నాడు. పిదప ఆయనను సంప్రతించినప్పుడు అతి తక్కువ మొత్తాన్ని మాత్రమే ఇచ్చాడు. ఈ విషయం స్వామీజీకి అలసింగ తెలిపినప్పుడు ఆయన కాస్త బాధపడ్డారు. అందుకే ఇకపై ధనవంతుల వద్దకు వెళ్లవద్దని స్పష్టంగా చెప్పేశారు.
మార్చ్-ఏప్రిల్‌లో చెన్నై శ్రేయోభిలాషులు స్వామీజీ పాశ్చాత్య ప్రయాణానికై పైకం వసూలుచేయ నారంభించారు. అలసింగ పెరుమాళ్ నేతృత్వంలో కొందరు ఒక బృందంగా చేరి పనిచేయసాగారు. స్వామీజీ శిష్యులను, శ్రేయోభిలాషులను, మిత్రులను అనేకులను కలుసుకొని పైకం వసూలు చేయాలని నిర్ణయించు కొన్నారు. స్వామీజీ విదేశీ ప్రయాణానికి యువకులే ఎక్కువ మొత్తం వసూలుచేశారు; అది కూడా మధ్యతరగతి ప్రజల వద్దకే ఎక్కువగా వారు వెళ్లారు. “జగజ్జనని సంకల్పం అదే అయితే నేను పాశ్చాత్య దేశాలకు వెళతాను. అందుకు అవసరమైన డబ్బు జనసామాన్యం నుండి రావాలి. ఎందుకంటే నేను పాశ్చాత్య దేశాలకు పోవడం జనసామాన్యం కోసమే, పేదల కోసమే” అనే కదా స్వామీజీ యువకులతో వక్కాణించి ఉన్నారు!
అలసింగ, తదితరులు రేయింబవళ్లు శ్రమించారు. ఇంటింటికీ వెళ్లారు. కొందరు డబ్బు ఇవ్వడానికి ససేమిరా నిరాకరించారు. కొందరు ఇచ్చారు, కాని అమర్యాదలు, తిట్లు వడ్డించిన తరువాతే! అలసింగ, మిత్రులు వీటిని అసలు పట్టించుకోలేదు. ఒక మహత్కార్యంలో తాము నిమగ్నులమై ఉన్నామని మాత్రమే భావిస్తూ వారు పనిచేశారు. చెన్నైలో డబ్బు వసూలుచేసే బాధ్యతను మిత్రులకు అప్పగించి అలసింగ బెంగళూరు, రామనాథపురం, హైదరాబాద్ మొదలైన ఊళ్ళు వెళ్లి పైకం వసూలు చేసుకొని వచ్చాడు.
స్వామీజీ కూడా కొందరిని కలుసుకొని ఈ విషయంగా ప్రయత్నించారు. న్యాయమూర్తి సర్ సుబ్రహ్మణ్య అయ్యర్‌ను ఆయన వెళ్లి కలుసుకోవడం గురించి రామానుజాచారి ఇలా వ్రాస్తున్నారు: “ఒక రోజు ఉదయం స్వామీజీ చేతికర్రతో గంభీరంగా మైలాపూర్ లజ్ చర్చ్ రోడ్డు మీదుగా నిటారుగా దృష్టిని సారించి వెళుతున్నారు. ఆయన వెనుక దాదాపు పదిహేను ఇరవై మంది యువకులు వస్తున్నారు. ఒక ఊరేగింపుగా వారు వెళుతూవుండడం న్యాయమూర్తిని కలుసుకొని సహాయం కోరడానికే! స్వామీజీ వేషభాషలూ, వ్యక్తిత్వమూ రోడ్డు మీద నిలబడి వున్న అందరినీ ఆకట్టుకొన్నాయి. అనేకులు ఆయనను అనుసరించి నడవసాగారు, నేను కూడా. న్యాయమూర్తి ఇంటిని చేరుకొన్నప్పుడు పెద్ద జనసమూహమే స్వామీజీ వెనుక గుమిగూడి ఉంది. నేను స్వామీజీని మొట్టమొదటిసారి, చివరిసారి చూసింది ఆ ఒక్క సందర్భంలో మాత్రమే.”*
పసిపిల్లల వచ్చీరాని ముద్దు మాటల ఆనందంలో
పేదలను, పామరులను బహిష్కరించడం వల్లనే మన దేశం పతనం చెందిందనే యథార్థాన్ని ప్రప్రథమంగా చాటిచెప్పిన వ్యక్తి స్వామీజీయే! దేశ ప్రగతి కోసం చేయబోయే ఏ కార్యమైనా వారిని ఉద్ధరించడంతోనే ప్రారంభించాలని ఆయన ప్రగాఢ విశ్వాసం. అది మనస్సులో ఉంచుకొనే పనులకు రూపకల్పన చేశారు. “పేదల పురోభివృద్ధికై డబ్బు సేకరించాలని విదేశాలకు పోతున్నాను. అందుకు అవసరమైన డబ్బు వారి నుండే స్వీకరిస్తాను” అంటూ వారి వద్ద నుండే పైకం వసూలు చేయాలని ఆయన అభిలషించారు. డబ్బు వసూలు చేసి మొదట సేకరించిన రూ. 200/– స్వామీజీకి సమర్పించారు. దానిని పుచ్చుకొన్న స్వామీజీ వెంటనే బజారుకు వెళ్లారు. పిల్లల కోసం మిఠాయిలు, బొమ్మలు కొనుగోలు చేశారు. వాటిని తీసుకొని వెళ్లి ఆయన బసచేసిన ఇంటికి చుట్టుప్రక్కల నివసిస్తున్న పిల్లలందరికీ పంచిపెట్టి ఆనందించారు.
స్వామీజీకి పిల్లలంటే మహాప్రీతి. వారికి ఆయన కథలు చెప్పేవారు, వేడుకలు వినోదాలు చేసి చూపేవారు. బాలాజీరావు ఇంట్లో ఆతడి కుమారుడైనచిన్న పిల్లవాడి కోసం కొన్ని హస్తలాఘవ గారడీలు కూడా చేసి చూపించారట. కత్తితో తమ చేతిని గట్టిగా నరికేవారు స్వామీజీ. కాని అందుండి చుక్క రక్తం కూడా స్రవించదు! ఇది చూసి పిల్లలు ఆశ్చర్యానందాలు పొందడం చూసి ఆయన కూడా ఎంతో సంతోషించేవారట.
కొద్ది కొద్దిగా డబ్బు వసూలయింది. మొదట నిరాకరించిన రామనాథపుర మహారాజు కూడా తక్కిన మహారాజులూ, ఇంకా పలువురూ ఆర్థిక సహాయం చేయడం గురించి విన్న తరువాత తానూ రూ. 500/– ఇచ్చాడు. ఈ విధంగా చెన్నై శ్రేయోభిలాషులు రూ. 4, 000/– వసూలు చేశారు.
పెనిస్సులార్ అనే ఓడలో మే 31 వ తేదికి స్వామీజీకి రెండవ తరగతి టికెట్టు కొనుగోలు చేశారు. 179 పౌండ్లు (రూ. 2685/–) స్వామీజీకి రొక్కంగా ఇచ్చారు.
స్వామీజీ కూడా మానసికంగా తమ అమెరికా ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నులయ్యారు.