మనలను యథార్థమైన మనిషిగా రూపొందించడానికి అవసరమైన విచక్షణాజ్ఞానం, సమాజ శ్రేయస్సుకోసం కావలసిన చైతన్యాలను అందించే తత్త్వమూ, మతమూ నేడు అవసరం.
– స్వామి వివేకానంద
తమిళనాడుకు పోవడానికి ముందు — విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించు — శ్రీరాముడు ఆహారం పంపించారు — పులి కూడా అర్థం చేసుకొన్నది — నేను దుర్బలుణ్ణా? — మూర్ఖులను ఎదుర్కోవడం… — అమృతంకన్నా రుచికరం — ఎండమావి — పరివర్తన చెందిన చోరుడు — సన్న్యాసులు చేసే ‘సహాయం’ — కారాగారం ఫరవాలేదు — కాషాయాంబరం ధరించకపోతే… — మారే ఆదర్శాలు
తమిళనాడుకు పోవడానికి ముందు
స్వా మీజీ జీవితంలోనూ, మహత్కార్యాలు సాధించడంలోనూ తమిళనాడు కీలకపాత్ర వహించింది. పాశ్చాత్య దేశాలకు వెళ్లాలనే ఉద్వేగం ఆయనకు ఇక్కడనుండే, ముఖ్యంగా కన్యాకుమారీదేవికి మ్రొక్కి, అక్కడ ఆయన అనుష్ఠించిన ధ్యానానంతరం కలిగింది. ఆ సంఘటనకు ముందు ఆయన పరివ్రాజక జీవితంలో జరిగిన కొన్నిసంఘటనలు పరికించవలసివుంది. అవి జరిగిన స్థలమూ, కాలమూ కచ్చితంగాతెలియకపోవడం వలన వాటిని ఇక్కడ సంగ్రహంగా పొందుపరచాం.
విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించు
ఒక వ్యక్తి ఒక సందర్భంలో స్వామీజీతో పాటు ప్రయాణించసాగాడు. ఆతడు విద్యాధికుడు. చక్కని లోకజ్ఞానమూ, కుశాగ్రబుద్ధీ సంతరించుకొన్న వ్యక్తిలా కనిపించాడు. కాని అద్భుతాలను ఇట్టే నమ్మేవ్యక్తిలా ఉన్నాడు. తాను హిమాలయాలలో నివసించిన విషయం స్వామీజీ ప్రస్తావించగానే ఆతడు, “స్వామీజీ, అక్కడ సిద్ధగణాలను కలుసుకొన్నారా?” అని అడిగాడు, అతడు ఎంతదూరం వరకు పోతాడో చూద్దామనుకొన్న స్వామీజీ సంభవించని కొన్ని అద్భుతాలను ఏకరవుపెట్టారు. మహాత్ములయిన సిద్ధులు తమ వద్దకు వచ్చినట్లూ, ప్రపంచం అంతం గురించి తమతో చెప్పినట్లూ తెలిపారు. ఈ యుగాంతం ఎప్పుడో, ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో, తదుపరి యుగం ప్రారంభమయినప్పుడు ఏ ఏ సిద్ధపురుషులు ఎవరెవరుగా జన్మించి ఏ విధంగా మానవాళికి ఎలా మార్గదర్శకత్వం వహిస్తారో అతిశయోక్తులు జోడించి స్వామీజీ కట్టుకథలు అల్లారు. ఆ సహ ప్రయాణీకుడుసంశయరహితంగా అంతా వినసాగాడు. ఆ తరువాత ఇంతదాకా ఇన్ని అద్భుతాలను వివరించి చెప్పిన స్వామీజీని కృతజ్ఞతాపూర్వకంగా భోజనానికి ఆహ్వానించాడు.
ఆ రోజుల్లో స్వామీజీ చేతిలో డబ్బు ఉంచుకొనేవారు కారు. ఎవరైనా టికెట్ కొనియిస్తే, దానినిమాత్రం పుచ్చుకొని పయనించేవారు. ఆహారం, దుస్తులు, బస ఇత్యాదులన్నీ భగవంతుని మీదే వదలిపెట్టేసేవారు. ఆ రోజు ఆ వ్యక్తి సమర్పించిన ఆహారం స్వీకరించారు. తరువాత ఒక క్షణం ఆతణ్ణి ప్రశాంతంగా చూశారు. ఆ వ్యక్తికి కుశాగ్రబుద్ధి, విశాలహృదయం ఉన్నాయి. కాని రెంటినీ చెడగొట్టింది ఆతడి మూఢనమ్మకం. అతడికి సత్యాన్ని ఎరుక పరచగోరిన స్వామీజీ ఆప్యాయంగా ఆతడితో ఇలా అన్నారు:
“ఇంత చదుమా, తెలివితేటలూ ఉన్న నువ్వు నేను చెప్పిన కల్పిత కథల నన్నింటినీ నమ్ముతున్నావే? మిత్రమా, నువ్వు బుద్ధిశాలివి. నీలాంటి వారు వివేకాన్ని ఉపయోగించాలి కదా? ఆధ్యాత్మికత అన్నది చమత్కారమూ, గారడీ కాదు, మిత్రమా! వీటిలో ఆసక్తి ఉన్నంత దాకా మనిషి కోర్కెలకు బానిసగాను, స్వార్థపరుడు గాను ఉండిపోతాడు. సుగుణాలు, సత్ప్రవర్తనలలోనే నిజమైన శక్తి ఉంది. ఆ శక్తిని పొందడమే ఆధ్యాత్మికత. ఉద్వేగాలనూ, కోర్కెలనూ జయించడమే ఆధ్యాత్మికత.జీవిత సమస్యలను పరిష్కరించడానికి నిరుపయోగమైన గారడీల వెంట వెళ్లడం మన శక్తిని వృథా చేయడమే తప్ప మరేమీ కాదు. అది మనస్సును పాడుచే స్తుంది. ఈ అబద్ధమే నేడు దేశ నైతికతను క్షీణింపజేస్తున్నది. మనలను యథార్థమైన మనిషిగా రూపొందించడానికి అవసరమైన విచక్షణాజ్ఞానం, సమాజశ్రేయస్సు కోసం కావలసిన చైతన్యాలను అందించే తత్త్వమూ, మతమూ నేడు అవసరం.
శ్రీరాముడు ఆహారం పంపించారు
ఒక సందర్భంలో స్వామీజీ వేసవికాలంలో ఉత్తరప్రదేశ్లో రైలులో ప్రయాణం చేస్తున్నారు. ఆయనతోపాటు ఒక వ్యాపారస్థుడు కూడా ప్రయాణం చేస్తున్నాడు. స్వామీజీ వద్ద పైకంగాని మరే విధమైన సౌకర్యాలూ లేక పోవడం చూసి అతడు ఆయనను చిన్నచూపు చూడడమేగాక పరిహాసం కూడా చేయసాగాడు. ప్రతి స్టేషనులోను రైలు ఆగినప్పుడు సుష్టుగా తింటూ, స్వామీజీని పరిహసించడం కొనసాగిస్తూనే వచ్చాడు. చివరికి దారీఘాట్ అనే స్టేషన్ వచ్చింది. అది మిట్టమధ్యాహ్నం ఎండ మండిపోతున్నది. ఆకలిదప్పులతో స్వామీజీ అలమటిస్తున్నారు. స్వామీజీ వద్ద కనీసం కమండలం కూడా లేదు. రైలు నిలయంలోని పందిరి క్రింద కూర్చోవడానికి వెళ్లారు. సామానులు మోసే కూలీవాడు అక్కడ ఆయనకు చోటు ఇవ్వడానికి నిరాకరించాడు. చేసేదిలేక మండుటెండలో ఆయన కటిక నేల మీద కూర్చున్నారు.
అక్కడికి కూడా ఆ వ్యాపారస్థుడు వచ్చి ఆయనకు ఎదురుగా చక్కని ఆసనం మీద బైఠాయించాడు. భోజనం తెప్పించుకొని ఆయన ముందేతినసాగాడు. అంతటితో ఆగకుండా స్వామీజీతో, “ఏయ్ సన్న్యాసీ! ధనాన్నిత్యజించినందు వలన నీకు వాటిల్లిన కష్టాన్ని చూశావా? తినడానికికానీ, దాహంతీర్చుకోవడానికికానీ నీకు మార్గం లేకుండాపోయింది. నా మాదిరి నువ్వు కూడా ఎందుకు సంపాదించకూడదు!” అని గొడవ చేసే ధోరణిలో మాట్లాడాడు.స్వామీజీ ఏమీ మాట్లాడలేదు. పిదప అతడు పూరీలు, లడ్డూలు తెప్పించుకొనితిన్నాడు. తింటూ స్వామీజీని చూస్తూ “సంపాదనాపరుడనైన నాకు పూరీలు, లడ్లులభిస్తున్నాయి. సంపాదించని నీకు ఆకలిదప్పులు, మండుటెండ మాత్రమే దక్కాయి. ప్రతి ఒక్కరూ తమ అర్హత మేరకే పొందుతారు” అంటూ తత్త్వోపదేశంచేశాడు. స్వామీజీ ప్రశాంతంగా అంతా విన్నారు. ఆయన ముఖకవళికలలో ఎలాంటి మార్పూ లేదు.
హఠాత్తుగా దృశ్యం మారింది! అక్కడికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. అతడి చేతుల్లో ఒక పొట్లం, మంచినీరు, ఆసనం మొదలైనవి ఉన్నాయి. ఆసనాన్నినీడలో పరచి తిన్నగా అతడు స్వామీజీ వద్దకు వచ్చాడు. “స్వామీజీ, మీ కోసంభోజనం తెచ్చాను రండి” అని ఆహ్వానించాడు. ఇటువంటి సంఘటన జరుగుతుందని స్వామీజీ కాస్తయినా ఎదురుచూడలేదు, నమ్మలేకపోయారు కూడా. ‘ఊరూ పేరూ తెలియని ఈ చోట నన్ను ఆహ్వానిస్తున్న దెవరు? ఇతడునన్నెందుకు ఆహ్వానించాలి, దీనికి అర్థం ఏమిటి?’ అని ఆలోచించసాగారు. ఇదిచూసిన వ్యాపారస్థుడికి ఎక్కడో చురుక్కుమంది. తాను భావించినట్లు ఆయనసామాన్యమైన వ్యక్తి కారని అతడికి అవగతం కాసాగింది. జరుగుతున్నది అతడు దిగ్భ్రాంతితో చూడసాగాడు.
ఆ అపరిచిత వ్యక్తి మళ్లీ, “స్వామీజీ, రండి, త్వరగా వచ్చి భుజించండి” అని స్వామీజీతో చెప్పాడు.
స్వామీజీ : చూడు నాయనా! నన్ను ఎవరిగానో భావించి పొరపాటుగాపిలుస్తున్నావు. నిన్ను నేను చూసిందికూడా లేదు.
పరిచిత వ్యక్తి : లేదు స్వామీజీ, నేను చూసిన సన్న్యాసి సాక్షాత్తు మీరే!దాన్లో ఎలాంటి సందేహమూ లేదు.
స్వామీజీ (ఆశ్చర్యంగా) : నన్ను చూశావా? ఎక్కడ చూశావు?
అపరిచిత వ్యక్తి : నాది మిఠాయి దుకాణం. మధ్యాహ్నం భోజనానంతరం అలవాటు ప్రకారం కాస్త కునుకు తీశాను. అప్పుడు శ్రీరాముడు కలలో కనిపించాడు. మిమ్మల్ని చూపిస్తూ, ‘ఇదిగో నా కుమారుడు రెండు రోజులుగా పస్తుతో ఉన్నాడు. వెంటనే లేచి పూరీలు, మిఠాయిలు అన్నీ తీసుకొని రైలు నిలయానికి వెళ్లు’ అని ఆదేశించాడు. నేను ఠక్కున లేచాను. అప్పుడు తెలిసింది అది కల అని. కనుక దానిని అలక్ష్యపరచి మళ్లీ పడుకొన్నాను. అవ్యాజ కరుణాసాగరుడైన శ్రీరామచంద్రుడు మళ్లీ నన్ను తట్టి లేపాడు. ఆ తరువాత నేను ఉపేక్షించలేకపోయాను. ఆయన ఆదేశం మేరకు అన్నీ తయారుచేసి తీసుకు వచ్చాను. నేను కలలో చూసిన మీరే సాక్షాత్తు ఇక్కడున్నారు. దూరం నుండే మిమ్మల్ని గుర్తించాను. రండి, బాగా ఆకలితో ఉండివుంటారు. వేడి చల్లారిపోక ముందే భోజనం చేయండి.
స్వామీజీ భావోద్వేగం వర్ణనాతీతం. కంట నీరు స్రవిస్తూండగా ఆ అపరిచిత వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపారు. ఆతడు ఆయనను వారిస్తూ, “నాకు కృతజ్ఞతలు తెలుపకండి స్వామీజీ! అంతా శ్రీరామచంద్రుని అనుగ్రహమే” అన్నాడు.
జరుగుతున్నదంతా ఆ వ్యాపారస్థుడు చూస్తూనే ఉన్నాడు. సాక్షాత్తు శ్రీరాముడే వచ్చి భోజనం పంపించాడంటే ఈయన ఎంతటి గొప్ప మహాత్ముడై ఉంటారోనని భావించిన ఆతడు తనను తాను అదుపులో ఉంచుకోలేకపోయాడు. తక్షణమే పరుగెత్తుకొంటూ వచ్చి స్వామీజీ పాదాల మ్రోల వాలిపోయి తననుక్షమించమని అర్థించాడు. స్వామీజీ మౌనంగా అతణ్ణి ఆశీర్వదించి, భోజనానికి కూర్చున్నారు.
పులి కూడా అర్థం చేసుకొన్నది
ఆ వ్యాపారస్థుడు చెప్పినట్లు స్వామీజీకి ఒకసారి ఇలా అనిపించింది: ‘నిజమే కదా! నా కాళ్లూ చేతులూ బాగానే ఉన్నాయి! నేను ఇంటింటికీ వెళ్లి భిక్షకోరి తినడం న్యాయమేనా?’ సబబు కాదని ఆయన హృదయం చెప్పింది. ఈ రోజుల్లో ఒక సోదర సన్న్యాసికి ఆయన ఇలా వ్రాశారు: “నేను సిగ్గూ లజ్జా లేకుండా, కించిత్తు కూడా మానసిక ఆవేదన లేకుండా, కాకిలా ఇతరుల ఇళ్లలో భిక్ష కోరుతూ తిరుగు తున్నాను.” ఈ భావన మెదలగానే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు.
“నాకు ఆహారం సమర్పించే పేదలకు నా వలన ఏం ప్రయోజనం? వారు ఒక పిడికెడు బియ్యం పొదుపు చేసుకోగలిగితే సొంత బిడ్డలకు అది ఒక రోజు ఆహారానికి సరిపోతుందే! అదంతా సరే, ఈ శరీరాన్ని పరిరక్షించి ఏం చేసుకో వాలి? ఇకపై నేను భిక్షాటనకు పోను” అని స్వామీజీ దృఢంగా నిర్ణయించు కొన్నారు. ఏదో ఒక అరణ్యానికి పోయి తపస్సు చేసి, శరీరం శుష్కింపచేసి ఎండుటాకులా రాలిపోయే దాకా ఉపవాసం చేయాలని నిశ్చయించుకొన్నారు.
ఈ కృతనిశ్చయంతో ఒక అడవిలోకి ప్రవేశించి అన్నాహారాలు లేకుండా ఒక రోజంతా నడిచారు. సాయంత్రమయ్యేసరికి స్పృహతప్పే స్థితిలో ఒక చెట్టు క్రింద కూలబడి భగవంతుణ్ణి ధ్యానించసాగారు.
ధ్యానం కాస్త భగ్నమయినప్పుడు…
ఆహా…. అదుగో కానవస్తున్నవి రెండు అగ్నిగోళాలు….
అవి…. సందేహమే లేదు! పులి కళ్లే!
అదుగో, ఆ కళ్లు సమీపిస్తున్నాయి, ఇదుగో వచ్చేశాయి!
స్వామీజీ శరీరమూ, మనస్సూ కించిత్తు కూడా చలించలేదు. భారంగా కదలి వస్తూవున్న ఆ పులి ఎందుకో ఆయనకు కొంత దూరంలో వచ్చి పడుకొంది.
పులి వైపు ఆప్యాయంగా స్వామీజీ చూశారు.
శుష్కమైన దరహాసం ఆ ముఖాన వెల్లివిరిసింది. ‘సరే నా మాదిరి ఈ పులి కూడా పస్తుతో ఉన్నట్లుంది. ఇద్దరమూ పస్తులే. ఈ నా శరీరం వలన లోకానికి ఏ ప్రయోజనమూ కలుగుతుందని తోచడంలేదు. ఈ పులికైనా ఉపయోగపడితే అది ఆనందిచాల్సిన విషయం’ అని భావించారు. ప్రశాంతంగా, నిశ్చలంగా, చెట్టుకు బాగా ఆనుకొని, కళ్లుమూసుకొని, ఇప్పుడు పులి నా మీద దూకబో తున్నది అని అనుకొన్నారు. ఒక క్షణం, రెండు క్షణాలు, ఒక నిమిషం అలా సమయం గడచిపోతున్నది. కళ్లు తెరిచి చూశారు. అక్కడ పులి జాడలేదు. అది వెళ్లిపోయింది. ఆహా! భగవంతుడు తనను ఏ రకంగా కాపాడుతున్నాడో తలచుకొని ద్రవించిపోయారు. ఆ రాత్రి అక్కడే ఆత్మచింతనలో గడిపారు. తెల్లవారింది. నిన్నటి అలసట, శ్రమ ఏదీ శరీరంలో కానరాలేదు. మనశ్శరీరాలు ఒక నూతన శక్తిని పొందినట్లుగా అనిపించింది. తమ యాత్రను కొనసాగించారు.
నేను దుర్బలుణ్ణా?
మరొక సందర్భంలో మండుటెండలో స్వామీజీ అలసిసొలసిపోయి ఒళ్లంతా చెమటలు పట్టి ఆకలిదప్పికలతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఒక చెట్టు నీడలోకి పోయి కూర్చున్నారు. అప్పుడు మెరుపులాంటి ఒక ఆలోచన ఆయన మదిలో మెదలింది. “ఆత్మ సర్వశక్తిమంతమైనదనే మాట అసత్యం కాదు! అటువంటప్పుడు ఆకలిదప్పులు ఎక్కణ్ణుంచి వచ్చాయి? శరీరానికీ మనస్సుకూ కలిగిన అలసటా అలుపూ నాకని నేనెందుకు భావించాలి? నే నెలా దుర్బలునిగా ఉండగలను?” అంటూ స్వామీజీ ఆలోచించారు. ఆ క్షణమే ఆయన శరీరమంతటా ఒక శక్తి వెల్లువ ప్రవహిస్తూన్నట్లు అనిపించింది. ఆయన మనస్సు విస్పష్టమైన కాంతిని సంతరించుకొంది. అలసటా, దుర్బలతా అంటే ఏమిటో కూడా తెలియ కుండా ఎగిరిపోయాయి. తాను ఎన్నటికీ దుర్బలతకు దాసోహం కాకూడదనేదృఢ నిశ్చయంతో స్వామీజీ లేచి నడకసాగించారు. ఈ విధంగా తమ శారీరక దుర్బలతను ఆత్మబలంతో జయించిన సందర్భాలు అనేకం. దీనిని కాలాంతరంలో ఆయన తమ ప్రసంగాలలో ప్రస్తావించారు:
“అన్నంలేక కాళ్ళనోప్పితో విసిగి నేనెన్నోసార్లు మృత్యుముఖంలో పడ్డాను. కొన్ని రోజులపాటు నాకు ఆహారం లభించేది కాదు. అనేకసార్లు ముందుకు అడుగు వెయ్యలేకపోయేవాణ్ణి; నేనొక చెట్టు క్రింద చతికిలపడేవాణ్ణి – ప్రాణం పోతూన్నట్లనిపించేది. మాట్లాడలేకపోయేవాణ్ణి. ఆలోచించలేకపోయేవాణ్ణి. అయినా చివరికి నా మనస్సు ఈ భావానికి మరలేది. ‘నీకు భయం లేదు, మృత్యువు లేదు; ఆకలిదప్పులు లేవు, ‘సో-హం’ ‘సో-హం’ సమస్త ప్రకృతీ ఏకమైనా నిన్ను అణగద్రొక్కలేదు; అది నీ బంటు. ప్రభువులకు ప్రభువువి. దేవుళ్లకు దేవుడవు. నీ శక్తిని బల్లగుద్ది ప్రకటించు! కోల్పోయిన నీ సామ్రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకో! లే, లెమ్ము! ముందుకు నడువు. ఎక్కడా ఆగకు!’ అప్పుడు నేను ధీరునిలా లేస్తాను. అలా నేను ఈనాడు ఇక్కడ సజీవుడనై ఉన్నాను.
“అంధకారం ఆవరించినప్పుడల్లా సత్యాన్ని ఉద్ఘాటించు. అందుకు ప్రతికూల మైనదల్లా అంతరించిపోవలసిందే. ఎందుకంటే ఇదంతా స్వప్నమే కనుక. కష్టాలు కొండంతగా కనిపించినా, పరిస్థితులన్నీ భయంకరాలుగా, నిరాశాజనకాలుగా ఉన్నప్పటికీ అవన్నీ మాయే. దానికి భయపడవద్దు – అది తొలగిపోతుంది. దాన్ని అణచిపెట్టు. అది అదృశ్యమవుతుంది. దాన్ని తొక్కివెయ్యి. అది చస్తుంది. భయపడకు.”*
పరివ్రాజక జీవితం గురించి కాలాంతరంలో ఒక శిష్యునితో స్వామీజీ ఇలా చెప్పారు: “ఆహా, ఆ రోజుల్లో నేను పడిన పాట్లు! ఒకసారి వరుసగా మూడు రోజులు అన్నాహారాలు లేకపోవడంతో స్పృహతప్పి వీథి మధ్యలో పడిపోయాను.ఎంతసేపు ఆ స్థితిలో ఉన్నానో తెలియదు. స్పృహలోకి వచ్చినప్పుడు నా బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి. భారీ వర్షం కురిసిందని గ్రహించాను. ఆ తడి నాకు నూతనోత్సాహం కలిగించింది. లేచి నిలబడి కష్టపడుతూ నడవ సాగాను. కాస్త దూరంలోని ఒక మఠాన్ని చేరుకొన్నాను, అక్కడ నాకు లభించిన ఆహారం నా ప్రాణాలను రక్షించింది.”
మూర్ఖులను ఎదుర్కోవడం…
రాజపుఠాణాలో రైలులో స్వామీజీ పయనిస్తున్నప్పుడు ఆ పెట్టెలో ఆయన కాక ఇద్దరు ఆంగ్లేయులున్నారు. స్వామీజీకి ఆంగ్లం తెలియదని ఎంచి ఆయనను పరిహాసం చేస్తూ నిందిస్తూ నవ్వుకోసాగారు. స్వామీజీ ప్రశాంతంగా ఉన్నారు. తమకు ఆంగ్లం తెలిసినట్లు వ్యక్తం చేసుకోలేదు. రైలు ఒక స్టేషన్లో ఆగినప్పుడు అక్కడున్న ఒక వ్యక్తితో, “నీళ్లు కావాలి” అని ఆంగ్లంలో అడిగారు. స్వామీజీ ఆంగ్లంలో మాట్లాడడం విన్న ఆ ఆంగ్లేయులు దిగ్భ్రాంతి చెందారు. వారు స్వామీజీ వద్దకు వచ్చి, “మేము ఇంతగా మిమ్మల్ని పరిహాసం చేస్తూన్నప్పటికీ మీరు నిరసనగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయారే, ఎందుకు?” అని అడిగారు. అందుకు స్వామీజీ, “అది ఎందుకా? ఎందుకంటే, మిత్రులారా, నేను మూర్ఖులను కలుసుకోవడం ఇది మొదటిసారి కాదు” అని జవాబిచ్చారు. ఆ ఆంగ్లేయులు ఆగ్రహోదగ్రులయ్యారు. ఆయనను కొట్టడానికి సిద్ధపడ్డారు. స్వామీజీ కూడా అందుకు తయారుగా లేచి నిలబడ్డారు. ఆయన దృఢకాయాన్నీ, బలిష్ఠమైన భుజస్కంధాలనూ చూసిన ఆంగ్లేయులు ఆయన పట్ల అణకువగా మెలగడమే శ్రేయస్కరమని భావించి, కిక్కురుమనలేదు.
అమృతంకన్నా రుచికరం
తరువాతిది ఖేత్రీలో జరిగిన సంఘటన. ఒక ఫలానా ఊళ్లో ప్రజలు తండోపతండాలుగా స్వామీజీ వద్దకు వచ్చారు. స్వామీజీ వారితో ఎడతెగకుండా మాట్లాడుతూనే ఉన్నారు. స్వామీజీ మాటల్లోనే ఆ సంఘటన గురించి విందాం: “నమ్మశక్యం కాదు, కాని ఎడతెగకుండా మూడు రాత్రుళ్లు పగళ్లు నాకు క్షణం కూడా విశ్రాంతి లేదు, నిద్రాహారాలు లేవు. ఎవరూ ఈ విషయం పట్టించుకొన్నదీ లేదు. వారు వస్తూనే ఉన్నారు, నేను మాట్లాడుతూనే ఉన్నాను. మూడవ రోజు రాత్రి అయింది. అప్పటికి అందరూ వెళ్లిపోయినట్లున్నారు. అప్పుడు నిమ్నకులానికి చెందిన ఒక వ్యక్తి నా వద్దకు వచ్చాడు. ‘స్వామీజీ! మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా మీరు మాట్లాడుతూనే ఉండడం నేను గమనిస్తూనేవున్నాను. నా మనస్సు ఆవేదనతో తల్లడిల్లిపోతున్నది. ఆకలీ, అలుపూ మీకు కూడా ఉంటాయి కదా! ఒక గ్లాసునీరు కూడా మీరు త్రాగలేదు!’ అన్నాడు ఆప్యాయతానురాగాలు ఉట్టిపడే స్వరంలో. ఆతడి ప్రేమాభిమానాలు నన్ను కదలించివేశాయి. ‘తినడానికి నువ్వు ఏమైనా ఇస్తావా?’ అని అడిగాను. ‘ఇవ్వాలనే నా మనస్సు తహతహ చెందు తున్నది. కాని ఏం చేయగలను? నేను నిమ్న కులస్థుణ్ణి, చెప్పులు కుట్టేవాణ్ణి. నేను చపాతీలు తయారుచేసి మీకు ఇవ్వలేను. పిండి తదితర పదార్థాలు తీసుకొచ్చి ఇస్తాను. మీరే చేసుకొని తినండి’ అన్నాడతడు. అందుకు నేను, ‘ఫరవాలేదు. నువ్వే తయారుచేసి పట్రా! నేను తింటాను’ అన్నాను. అతడు హడలిపోయాడు. చెప్పులు కుట్టే వాడయిన అతడు ఒక సన్న్యాసికి ఆహారం ఇచ్చాడని తెలిస్తే శిక్షింపబడతాడు; అంతేకాదు దేశబహిష్కరణ చేస్తారు కూడా. కాని నేను అతణ్ణి సాంత్వన పరిచాను; ‘నీకు శిక్ష పడకుండా నేను చూసుకొంటాను’ అని వాగ్దానం చేశాను. ఆతడు నా మాటలను అంతగా నమ్మినట్లులేదు. కాని నా పట్లగల అభిమానంకొద్దీ చపాతీలు తీసుకొచ్చాడు. నేను వాటిని తిన్నాను. దేవేంద్రుడు ఒక బంగారు కలశంలో అమృతాన్ని తెచ్చి ఇచ్చినా, అది కూడా ఇంత రుచిగా ఉండదని నాకు అనిపించింది. నా హృదయం ప్రేమతోను, కృతజ్ఞతతోను పొంగిపొరలింది. కళ్లు చెమ్మగిల్లాయి.
“ఖేత్రీ మహారాజుతో పరిచయం కలిగాక నేను ఆయనతో ఈ విషయం చెప్పాను. ఆయన వెంటనే ఆ వ్యక్తిని రప్పించారు. తన తప్పుకు శిక్ష పడుతుందని అతడు హడలిపోతూనే వచ్చాడు. మహారాజు అతణ్ణి మెచ్చుకొని బోలెడంత ధనమూ, వస్తువులూ బహూకరించి పంపించారు.”
ఎండమావి
కచ్ ప్రాంతంలో స్వామీజీ పయనం చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఆయన ఎడారి గుండా పోతున్నారు. మండుటెండ, దాహంతో ఆయన గొంతు ఎండిపోయింది. కనుచూపు మేరలో జనసంచారం కనిపించ లేదు. ఆయన నడుస్తూనే ఉన్నారు. హఠాత్తుగా దూరంలో ఒక గ్రామం కనిపించింది. నీటి కొలనులు కూడా కనిపించాయి. ఆయన మాటల్లోనే విందాం:
“నేనొకసారి భారతదేశ పశ్చిమ ప్రాంతంలో, సముద్ర తీరపు ఎడారి ప్రదేశంలో పయనిస్తున్నాను. ప్రయాణమంతా కాలినడకనే. ఎన్నో రోజులు ఆ ఎడారిలో నడిచాను. చక్కని చెరువులు, వాటి చుట్టూ వృక్షపంక్తులు, తలక్రిందులుగా ప్రతిబింబించి, కన్నుల పండువ చేస్తున్న ఆ చెట్ల నీడలను ప్రతి రోజూ చూసి ఆశ్చర్యపడేవాణ్ణి. ‘ఎంత అద్భుతంగా ఉంది! ఇది ఎడారి ప్రదేశమట?’ అని అనుకొనేవాణ్ణి. అందమైన ఆ చెరువులు, చెట్లు, మొక్కలు చూస్తూ దాదాపు నెలరోజులు నడిచాను. ఒక రోజు బాగా దాహం వేసి, నీళ్లు త్రాగాలని ఒక నిర్మల మనోహర జలాశయం వద్దకు వెళ్లాలని చూశాను. కాని దగ్గరకు వెళ్లగానే అది అదృశ్యమయింది. పుస్తకాలలో చదివిన ఎండమావులు ఇవే అనీ, ప్రతి రోజూ ఈ ఎండమావులను చూస్తూ కూడా తెలుసుకోలేకపోయాననీ నా కప్పుడు చటుక్కున స్ఫురించింది. మర్నాడు మళ్లీ నడక సాగించాను, ఆ చెరువు మళ్లీ కనిపించింది కాని అది చెరువు కాదు, ఎండమావి అనే జ్ఞానం కూడా ఠక్కున కలిగింది.”*
ఎండమావి గురించి స్వామీజీ తమ ప్రసంగాలలో అడపాదడపా ప్రస్తావించడం మనం చూస్తాం:
“ఈ జగత్తు విషయం కూడా అట్టిదే. జగత్తు అనే ఎండమావిలో మన మందరం దినదినం, నెలనెల, ఏటేటా ప్రయాణం చేస్తున్నాం. కాని ఎండమావి అని తెలుసుకోలేకున్నాం. ఈ అజ్ఞానం ఒక రోజు తొలగిపోతుంది. కాని అది మళ్లీ కలుగుతుంది. పూర్వకర్మ బలం వలన ఈ శరీరం నిలిచివుండాలి. కాబట్టి ఈ ఎండమావులు మళ్లీ కనిపిస్తాయి. కర్మబంధం ఉండేటంత కాలం ఈ జగత్తు మనల్ని వదలదు. స్త్రీలు, పురుషులు, జంతువులు, తరు లతాదులు, అనురాగాలు, బాధ్యతలు – ఇవేవీ విడువవు. కాని వాటికి మునుపటి బలం ఉండదు.”*
పరివర్తన చెందిన చోరుడు
హృషీకేశ్లో ఒక గొప్ప సన్న్యాసిని స్వామీజీ కలుసుకొన్నారు. ఆయన ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను పొందిన వ్యక్తిలా కనిపించగా, స్వామీజీ ఆయన వద్దకెళ్లి మాట్లాడనారంభించారు. తమ ప్రయాణ విశేషాలు గురించి చెబుతూ తాము కలుసుకొన్న మహాత్ములను గురించి ప్రస్తావించారు. మాటల మధ్యలో పవహారీ బాబా పేరు చెప్పగానే ఆ సన్న్యాసి కళ్లవెంట నీరు ధారకట్టింది. గద్గదస్వరంలో ఆయన, “స్వామీజీ! మీకు బాబా తెలుసా?” అని అడిగారు. “తెలుసు” అని స్వామీజీ జవాబిచ్చారు. “ఆయన ఆశ్రమంలో జరిగిన దొంగతనం గురించి తెలుసా?” అన్న ప్రశ్నకు, “తెలుసు” అన్నారు స్వామీజీ.
“ఒక రోజు ఆయన ఆశ్రమంలో ఒక దొంగ ప్రవేశించాడు. ఆయనను చూడగానే భయపడిపోయి, తాను దొంగిలించిన వస్తువుల మూటను అక్కడే పడేసి పరుగు లంకించుకొన్నాడు. వెంటనే ఆయన ఆ మూటను పుచ్చుకొని, దొంగను వెంబడించి కొన్ని మైళ్లు పరుగెత్తి ఎట్టకేలకు అతణ్ణి పట్టుకొన్నారు. ఆమూటను ఆతడి పాదాల వద్ద ఉంచి, చేతులు జోడించి, చెమ్మగిల్లిన కళ్లతో, ‘నాయనా!, నిజానికి ఇవన్నీ నీవే. నీ వస్తువులను నువ్వు తీసుకొన్నప్పుడు అడ్డుపడినందుకు నన్ను క్షమించు. వీటిని పుచ్చుకో’ అని ప్రాధేయపడ్డాడు” అని స్వామీజీ ఆ కథనం చెప్పి, “నిజంగానే బాబా ఒక అద్భుతమైన వ్యక్తి” అన్నారు.
మౌనంగా వింటూవున్న ఆ సన్న్యాసి కథనం పూర్తికాగానే స్వామీజీని చూస్తూ, ప్రశాంతంగా “స్వామీజీ, ఈ కథలో వచ్చిన దొంగను నేనే” అన్నాడు. స్వామీజీ ఆశ్చర్యచకితులయ్యారు. సన్న్యాసి కొనసాగించాడు:
“ఆ రోజు బాబాను కలుసుకోవడం నా జీవితంలో అనుకోని గొప్ప మలుపుగా పరిణమించింది. నా మార్గం తప్పని నేను గ్రహించాను. ఐశ్వర్యాలలో కెల్లా అత్యున్నతమైన ఐశ్వర్యమయిన భగవంతుణ్ణి పొందడానికి ఈ మార్గాన్ని ఎంపిక చేసుకొన్నాను.”
ఆ తరువాత ఆయన సన్న్యాసిగా తాను పొందిన అనుభవాలను స్వామీజీతోచెప్పారు. రాత్రి బాగా ప్రొద్దుపోయే దాకా ఇద్దరూ ముచ్చటించుకొన్నారు. ఆయనను కలుసుకోవడం స్వామీజీకి ఒక మధురానుభవమయింది. “ఎవరినీ పాపిగా దూషించరాదు. పాపిలో కూడా ఒక మహాత్ముడున్నాడు. ఆయన ఏదో ఒక రోజు అభివ్యక్తమవుతాడు” అంటూ కాలాంతరంలో స్వామీజీ తమ ఉపన్యా సాలలో ప్రస్తావించడం ఈ సన్న్యాసిని మనస్సులో ఉంచుకొనే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ఈ సన్న్యాసి ఇలా ఉంటే కొందరు సన్న్యాసులు అలా ఉంటారు:
సన్న్యాసులు చేసే ‘సహాయం’
ఒకసారి స్వామీజీ ఒక పోలీసు అధికారికి అతిథిగా ఉన్నారు. ఆతడు భక్తుడు, నిత్యం శాస్త్రాధ్యయనం చేస్తాడు. ఆతడు స్వామీజీ పట్ల అపార భక్తిప్రపత్తులు చెల్లించేవాడు. ఆతడి నెల జీతం రూ 125/–. కాని అతడి ఖర్చులు అంతకు రెండింతలు. ఒక రోజు స్వామీజీ దీనిని గురించి అతణ్ణి అడిగారు. అందుకు ఆ అధికారి నవ్వేసి, “స్వామీజీ! ఈ ఖర్చులకు నిజానికి మీలాంటి సన్న్యాసులే సహాయం చేస్తున్నారు” అన్నాడు. ఆ జవాబు స్వామీజీకి విచిత్ర మనిపించింది. “అది ఎలా?” అని అడిగారు. ఆ అధికారి మళ్లీ నవ్వుతూ ఇలా అన్నాడు: “ఇదొక పుణ్యతీర్థం. ఇక్కడికి సన్న్యాసులు అనేకులు వస్తారు. అందరూ మీ లాంటి సజ్జనులు కారు. నాకు ఎవరి మీదనన్నా సందేహం కలిగితే వారిని శోధిస్తాను. కొందరు రకరకాల రీతుల్లో తమ వద్ద బోలెడంత డబ్బు దాచి ఉంచుతారు. ఆ పైకం చట్టవిరుద్ధమైన మార్గంలో సేకరింపబడినదని నాకు సందేహం కలిగితే, వారి నుండి బలవంతంగా నిజాన్ని రాబడతాను. ఖైదు నుండి తప్పించుకోవడానికి డబ్బును నాకు ఇచ్చి, కృతజ్ఞత కూడా చెప్పుకొని బ్రతుకుజీవుడా అనుకొని పరుగుతీస్తారు. ఈ రకంగా డబ్బు నాకు లభిస్తుంది. నిజం చెబుతున్నాను, స్వామీజీ! మరే రీతిలోనూ నేను లంచం పుచ్చుకోవడం లేదు.” స్వామీజీ నవ్వేశారు.
కారాగారం ఫరవాలేదు
ఒక సందర్భంలో స్వామీజీ అలవాటు ప్రకారం నడచి పోతున్నారు. హఠాత్తుగా వెనుక నుండి ఎవరో ఆయనను పిలిచినట్లు వినిపించింది. తిరిగి చూస్తే గుర్రం మీదనున్న ఒక పోలీసు అధికారి, ఆతడి ప్రక్కన కొందరు పోలీసులూ వస్తూ కనిపించారు. దగ్గరకు రాగానే ఆ అధికారి స్వామీజీతో, “నువ్వు ఎవరివి?” అని మొరటుగా అడిగాడు. ఆ రోజుల్లో సన్న్యాసులను సంశయాత్మక దృష్టితో చూడడం కద్దు. సన్న్యాసి అంటేనే సోమరి, దొంగ, గూఢచారి అని అనుకోవడం పరిపాటి! స్వామీజీ ప్రశాంతంగా, “నేనొక సన్న్యాసిని” అని చెప్పారు. “సన్న్యాసులందరూ మోసగాళ్లు” అని అధికారి చెబుతూ, “నాతోపాటు రా, నిన్ను కారాగారంలో త్రోసిన తరువాతే మరో పని” అన్నాడు. కలత, భయం లాంటివి ఎరుగని వారు స్వామీజీ! కనుక ధైర్యంగా, కాని మృదువుగా, “ఎన్ని రోజులకు?” అని అడిగారు. “పదిహేను రోజులకు, ఎందుకు, ఒక నెల కూడా ఉండవచ్చు” అన్నాడు అధికారి.
స్వామీజీ ముఖంలో అసంతృప్తి ద్యోతకమయింది. ఆయన ఆ అధికారికి ఇంకా దగ్గరగా వెళ్లి, కృతజ్ఞతాపూర్వకంగా “అయ్యా! ఒక నెల మాత్రమేనా? ఆరు నెలలైనా నన్ను కారాగారంలో ఉంచకూడదా? లేకుంటే కనీసం మూడు నాలుగు నెలలకైనా ప్రయత్నించకూడదా!?” అని అడిగారు.
ఆ మాటలు విన్న అధికారి దిగ్భ్రాంతుడయ్యాడు. కాళ్లూ చేతులూ పట్టుకొని బ్రతిమలాడి తప్పించుకోవడానికి ప్రయత్నించే వారే అంతదాక ఆతడికి తారసపడ్డారు. ఇక్కడ ఒక సన్న్యాసి ఎక్కువ రోజులు కారాగారంలో గడపడానికి అనుమతి కోరి నిలబడివున్నాడు. “ఎందుకు, కారాగారవాసం అభిలషిస్తున్నావు?” అంటూ ఆశ్చర్యపోతూ ఆ అధికారి అడిగాడు. సుతిమెత్తని స్వరంలో స్వామీజీ ఇలా జవాబిచ్చారు:
“నేను ఇప్పుడు గడుపుతున్న జీవితం కన్నా కారాగారజీవితం ఎంతో నయం.ఉదయం నుండి సాయంత్రం దాకా ఈ మండుటెండలో నడవడం కన్నా కారాగా రంలోని పనులు కఠినం కావు. ఇక్కడ ఆహారం లభిస్తుందనే ఎలాంటి పూచీ లేదు; చాలా మార్లు పస్తులు ఉండవలసిన అగత్యం ఏర్పడుతుంది. కాని కారాగారంలోరెండు పూటలా భోజనానికి కొరత ఉండదు. కనుక నన్ను కొన్ని నెలలకైనాకారాగారంలో ఉంచితే, నిజానికి మిమ్మల్ని నా శ్రేయోభిలాషిగా భావిస్తాను.”
పోలీసు అధికారిలో చెలరేగిన ఉద్వేగం వర్ణనాతీతం. ఇలాంటి వ్యక్తి కూడాఉంటాడా? అని అతడికి అనిపించింది. నిరాశా నిస్పృహలు, అనిష్టం ఆతడి ముఖంలో ప్రతిఫలించాయి. “వెళ్లిపో ఇక్కడనుండి!” అని బిగ్గరగా అరిచి, గుర్రాన్ని అదిలించాడు.
కాషాయాంబరం ధరించకపోతే…
తరువాతది కూడా పోలీసులకి సంబంధించిన సంఘటనే! ఈ సంఘటనవరాహ నగర రోజుల్లో జరిగి ఉండవచ్చు. స్వామీజీ, సోదర సన్న్యాసులు ఊరి శివారు ప్రాంతంలో ఒక పాడుబడ్డ భవనంలో ఆధ్యాత్మిక సాధనలూ, అధ్యయనమూ చేస్తూ జీవిస్తూన్న రోజులవి. ఆయన కుటుంబానికి మిత్రుడైన ఒక వ్యక్తి నేర పరిశోధకశాఖలో పోలీసు అధికారిగా ఉన్నాడు. అనేక పతకాలూ, బిరుదులూ అతడు సముపార్జించాడు. ఒక రోజు అతడు స్వామీజీని సాయంత్రం విందు భోజనానికై తన ఇంటికి ఆహ్వానించాడు. అట్లే స్వామీజీ వెళ్లారు. పలువురు వచ్చారు, వెళ్లారు.కాని విందు ఏర్పాట్లకు ఎలాంటి సూచనలూ కనబడలేదు.
ఆ అధికారి ఏవేవో విషయాల గురించి మాట్లాడసాగాడు. ఇంతలోహఠాత్తుగా అతడి ధోరణిలో మార్పు వచ్చింది. స్వామీజీ వైపు తిరస్కార ధోరణిలో చూస్తూ, “ఇలా చూడు! ఇక నిజాన్ని దాచి ప్రయోజనం లేదు. నీ కల్లబొల్లికబుర్లతో నన్ను మోసగించలేవని నీకు బాగా తెలుసు. నుమ్వా, నీ అనుయాయులూ ఆధ్యాత్మికత అనే నెపంతో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని నమ్మకంగా నాకు తెలియవచ్చింది. నిజం చెప్పు” అంటూ గద్దించాడు.
ఈ హఠాత్పరిణామాన్ని స్వామీజీ కొంచెం కూడా ఎదురుచూడలేదు. “ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలంటున్నారు, ఆధ్యాత్మికత అనే నెపంతో అంటున్నారు. వాటికీ మాకు సంబంధం ఏమిటి?” అని కచ్చితంగా స్వామీజీ అడిగారు. “అదే కదా నేను తెలుసుకోవాలంటున్నది!” అన్నాడు ఆ అధికారి. “అదొక భయంకరమైన కుట్ర, దానికి నువ్వే నాయకుడివి. నిజం చెప్పు. తప్పు ఒప్పుకొంటే శిక్ష తగ్గించడానికి ప్రయత్నిస్తాను” అన్నాడు మళ్లీ. ఆగ్రహోదగ్రులై లేచారు స్వామీజీ. “అంతా మీకు తెలిసివుంటే, మేం నివసిస్తూన్న భవనాన్ని ఎందుకు సోదా చేయరాదు? అక్కడికే వచ్చి మమ్మల్ని ఖైదు చేయవచ్చు కదా?” అన్నారు ధైర్యంగా.
అంతటితో ఆగలేదు. మౌనంగా వెళ్లి గది తలుపులు బిగించారు. అధికారి వైపు తీక్ష్ణంగా చూడసాగారు. స్వామీజీ బలిష్ఠమైన దేహం, భగ్గుమనిపించే చూపులూ చూసి ఆ అధికారి గడగడలాడిపోయాడు. తీక్షణంగా చూస్తూ స్వామీజీ ఆతణ్ణి సమీపించారు. పిదప గంభీరంగా ఇలా అన్నారు: “దొంగతనంగా నన్ను ఇక్కడకు రప్పించి, లేనిపోని నేరారోపణలు నా మీద మోపుతున్నావు. ఇది మీ పనిలో ఒక భాగం. కాని నేను నేర్చుకొన్నది ఏమిటో తెలుసా? ఎవరు అవమానించినా కోపగించుకోకూడదు అన్నదే. నేనూ ఒక అపరాధిగా, కుట్ర పన్నిన వ్యక్తిగా ఉండివుంటే మీరు ‘సహాయం’ అని అనడానికి కూడా అవకాశం ఇచ్చివుండను. గొంతు నులిమి ఉండేవాణ్ణి. కాని నేనొక సన్న్యాసిని కనుక మిమ్మలి ఏం చేయకుండా వదలివేస్తున్నాను.” ఇలా అంటూ బయటికి వెళ్లిపోయారు. ఆ అధికారి భయంతో బిర్రబిగుసుకుపోయాడు. ఈ సంఘటనానంతరం ఆ అధికారి మఠం వైపుగా తల అయినా పెట్టుకొని పడుకొంటే ఒట్టు.
తరువాతి సంఘటన ఉత్తర భారతదేశంలో జరిగింది. ఆ రోజులలో స్వామీజీ రోజంతా నడవడం, వెనుతిరిగి చూడకుండా ముందుకు పోవడం, యాచించకుండా యాదృచ్ఛికంగా లభించే ఆహారాన్నే స్వీకరించడం అనే నియమాలను పాటించారు. ఒకసారి రెండు రోజులపాటు ఎలాంటి ఆహారమూ ఆయనకు లభించలేదు. మర్నాడు మధ్యాహ్నం ఒక ధనవంతుని ఇంటి అశ్వశాల గుండా ఆయన వెళుతున్నారు. గుర్రాలను చూసుకొనే పనిమనిషి అక్కడ నిలబడి ఉన్నాడు. అతడు స్వామీజీని చూడగానే ఆయన పరిస్థితిని అర్థం చేసుకొన్నాడు. ఆయనను సమీపించి వినమ్రంగా, “బాబాజీ!, నేడు మీరు ఏదైనా తిన్నారా?” అని అడిగాడు. “లేదు” అన్నారు స్వామీజీ. అతడు ఆయనను అశ్వశాలలోకి తీసుకొనివెళ్లి, ఆసీనులను చేసి త్రాగడానికి మంచినీళ్లు ఇచ్చాడు. పిదప చపాతీ, పచ్చడి ఇచ్చాడు. ఆ పచ్చడి బాగా కారంగా ఉంది. స్వామీజీకి కారం అంటే మహా ఇష్టం. ఈ పరివ్రాజక రోజుల్లో అనేక సందర్భాలలో ఆయనకు లభించిన కూర, పులుసు అంతా కలిసి ఒక్క మిరపకాయ మాత్రమే. కనుక ఆయన దానికి బాగా అలవాటు పడిపోయారు. కాని ఒకటి రెండు రోజులుగా పస్తున్న కడుపు లోకి కారంగా ఉన్న పచ్చడి పోగానే కడుపు మండిపోతున్నట్లు బాధ కలిగింది. బాధ తట్టుకోలేక స్వామీజీ నేల మీద పొర్లసాగారు.
ఆ పనిమనిషికి ఏం చేయాలో పాలుబోక నిర్ఘాంతపోయాడు. ఒక సన్న్యాసికి మంచి చేయబోయి ఇలా హాని చేశామేనని అతడు తల్లడిల్లిపోయి చేతులతో తల బాదుకొంటూ, “అయ్యో, ఎంత పనిచేశాను! ఒక సాధువు ప్రాణంపోయే లాంటి ఘోరమైన పనిని కదా చేశాను!” అంటూ విలపించసాగాడు.
అప్పుడు తల మీద ఒక గంపను మోసుకొంటూ ఒక వ్యక్తి అటు వైపుగా వచ్చాడు. పనిమనిషి ఏడుపు విని అక్కడకు వచ్చి చూశాడు. అతణ్ణి చూసిన స్వామీజీ, “ఆ గంపలో ఏముంది?” అని అడిగాడు. “చింతపండు” అన్నాడు ఆ వ్యక్తి. “ఆ! అదే నాకిప్పుడు కావలసింది” అన్నారు స్వామీజీ. కొంచెం చింతపండు తీసుకొని నీళ్లలో కరిగించి త్రాగారు. కాసేపటికల్లా కడుపునొప్పి క్రమంగా తగ్గిపోయింది. ఆ తరువాత తన ప్రయాణాన్ని స్వామీజీ కొనసాగించారు.
మారే ఆదర్శాలు
ఒకప్పుడు స్వామీజీ ఒక టిబెట్ కుటుంబంతో బస చేయవలసి వచ్చింది. టిబెట్లో కొన్ని ప్రాంతాల్లో ఒక స్త్రీ, పలువురు పురుషులను వివాహం చేసుకోవడం కద్దు. స్వామీజీ బసచేసివున్న కుటుంబంలోని ఆరుగురు సోదరులూ ఒకే స్త్రీని వివాహం చేసుకొన్నారు. స్వామీజీ వారితో సహజంగా మెలగడం ప్రారంభించిన తరువాత ఈ విషయంగా తమ అభిప్రాయాన్ని వారికి తెలిపారు. పాతివ్రత్యాన్ని వివరించి చెప్పి, ఒక స్త్రీ పలువురు పురుషులను వివాహం చేసుకోవడం సరికాదన్నారు. ఇది విన్న వారిలో ఒక వ్యక్తి సహనాన్ని కోల్పోయి, “సన్న్యాసులైన మీరు ఇతరులను స్వార్థపరులుగా ఉండమని బోధించడం ఏం న్యాయం? ‘ఈమెను నేను మాత్రమే అనుభవించి సుఖీంచాలి; ఇతరులకు ఇవ్వకూడదు’ అని భావించడం తప్పు కదా! ప్రతి ఒక్కరూ తనకంటూ మాత్రమే ఒక భార్యను అనుభవించడం స్వార్థం కదా! అందులోను సోదరులుగా పుట్టినవారు తమకు చెందినవన్నిటినీ సమంగా పంచుకోవాలి – భార్యతో సహా!” అన్నాడతడు. పాతివ్రత్య ధర్మం ప్రకారంగాను, తర్కరీతిలోను నిశితంగా పరికిస్తే ఆతడి వాదం లోపభూయిష్ఠమైవుండవచ్చు. కుశాగ్రబుద్ధితో దేనినైనా ఆదరిస్తూనో లేదా వ్యతిరేకిస్తూనో మాట్లాడవచ్చు. అయినప్పటికీ ఆ కొండజాతి ప్రజల నిరాడంబర భ్రాతృత్వాన్ని తలచుకొని స్వామీజీ విస్తుబోయారు.
ఈ విషయం గురించి తమ మహాభారత ప్రసంగంలో స్వామీజీ ప్రస్తావిం చారు. పాండవులు ఐదుగురిని పరిణయమాడిన ద్రౌపదిని గురించి చెబుతూ ఇలా అన్నారు: “ద్రౌపది పంచపాండవులకు ఉమ్మడి భార్య అయింది. ప్రతి సమాజ పురోభివృద్ధిలోనూ దశలుంటాయని మీకు తెలుసు. ఈ ఇతిహాసంలో ప్రాచీన కాలపు పరిస్థితి అద్భుతంగా చిత్రించబడింది. ఇతిహాస రచయిత ఐదుగురు సోదరులు ఒకే కన్యను పెళ్లాడిన వృత్తాంతాన్ని తెల్పి దానికొక సమాధానాన్ని కారణాన్ని అన్వేషించడానికి, దానికి కొంత మెరుగులు దిద్దడానికి ప్రయత్నించాడు: ‘అది తల్లి ఆజ్ఞ! విపరీత వివాహమైనా దానికి తల్లి అనుమతి ఉంది.’ ఈ తీరుగా చెప్పుకొంటూ పోతాడు. ప్రతి దేశంలోను ఒకే స్త్రీ అనేకమంది – ఒక కుటుంబం లోని సోదరులనందరినీ, ఉమ్మడిగా వివాహం చేసుకొనే ఒక దశ ఉండేది. ప్రస్తుతం ఈ సంఘటన ఆ దశను – బహు భర్తృత్వాన్ని – సూచిస్తోందనడం స్పష్టం.”*
ఇదే విధంగా హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు నివసించిన విభిన్నమైన ప్రజల ఆచార వ్యవహారాలు స్వామీజీకి ప్రత్యక్షంగా తెలిసి ఉండడం వలన సామాజిక సంస్కరణను ఒక విస్తృత దృక్పథంతో ఆయన చూడగలిగారు. స్వకీయ కొలబద్దతో ఇతరుల ఆచార వ్యవహారాలను చూడడం కన్నా వారి దృక్పథంతోనే సానుభూతితో స్వామీజీ పరికించారు. అదే విధంగా భారతీయ సంస్కృతి అనే ఆధ్యాత్మిక నాగరకతను కొలబద్దగా గైకొని వారి పురోభివృద్ధికీ స్వామీజీ ప్రయత్నించారు.