నేను కొన్ని కార్యాలు నిర్వర్తించాలని భగవత్సంకల్పం అయితే, అందుకవసరమైన శక్తిని ఆయనే అనుగ్రహిస్తాడు.
– స్వామి వివేకానంద
మైసూర్లో — అసత్యం పలుకడమా? — సన్న్యాసం — ‘మీకు ఏం చేయాలి?’ — ధ్వని ముద్రణ — ‘ఏదీ వద్దు’ — తిరుచ్చూర్‌లో — కోడుంగల్లూర్లో — ఛట్టాంబి స్వామితో — తిరువనంతపురంలో — ఇతరులను గౌరవించాలి — ‘శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు’ — కులతత్వ క్రౌర్యం — ఆర్య-ద్రావిడ సమస్య — నిజమైన దేశభక్తి
మైసూర్లో
మా ర్గోవా నుండి ధార్వాడ్ మీదుగా స్వామీజీ మైసూర్ పరగణాలోని* బెంగుళూరుకు వెళ్లారు. అక్కడ వైద్య విభాగపు అధికారియైన డాక్టర్ పల్పు అనే వ్యక్తి ఇంట్లో ఆయన బసచేశారు. పల్పు కేరళలోని* ఈళవ (Ezhava) వర్గానికి చెందిన వ్యక్తి. ఉన్నత కులస్థుల చేత అణచి వేయబడి, హింసలకు బలి అయినవారు ఈళవ వర్గంవారు. కనుక తగిన అర్హత ఉన్నప్పటికీ ఆతడికి తిరువాన్కూర్లో ప్రభుత్వ ఉద్యోగం లభించలేదు. అందు వలన ఆతడు మైసూర్ పరగణాకు రావలసిన అగత్యం ఏర్పడింది. తమ జీతంలో చెప్పుకోగినంత పైకం, ఖాళీ సమయం ఈళవ వర్గంవారి ప్రగతి కోసం ఖర్చు చేశాడు పల్పు.
ఉన్నత కులాలవారిచేత అణచివేయబడే విధానం గురించి ఒక రోజు పల్పు, స్వామీజీతో చెప్పినప్పుడు ఆయన, “మీ రెందుకు బ్రాహ్మణుల వెనుక పోవాలి? మీ వర్గంలోనే ఉదాత్త పురుషుడెవరో తెలుసుకుని ఆతణ్ణి మీ నాయకు నిగా ఎందుకు స్వీకరించకూడదు?” అని అడిగారు. స్వామీజీ పై సలహాను పాటించి డాక్టర్ పల్పు శ్రీనారాయణ గురు వద్దకు వెళ్లాడు. శ్రీనారాయణ గురు ఈళవ వర్గాన్ని ఉన్నతస్థితికి లేవనెత్తడం కేరళ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం.
మైసూరు పరగణా దివాన్ అయిన శేషాద్రి అయ్యర్‌కు అతిథిగా స్వామీజీమూడు నాలుగు వారాలు గడిపారు. మైసూర్ రాజసభలోని ప్రముఖులలోపలువురిని స్వామీజీ అక్కడే కలుసుకోగలిగారు.
మతమనే పరిధిని అతిక్రమించి అందరూ స్వామీజీని అభిమానించారు.స్వామీజీకి ఖురాన్లో కూడా చక్కని అభినివేశం ఉండడంచూసి మైసూర్ సంస్థానంలోని కౌన్సిలర్లలో ఒకరైన అబ్దుల్ రహమాన్ ఆశ్చర్యచకితుడైనాడు. ఖురాన్లో అబ్దుల్ రహమాన్‌కు గల సంశయాలు కొన్నింటిని స్వామీజీ నివృత్తి చేయడం విశేషం.
అసత్యం పలుకడమా?
స్వామీజీ జ్ఞానమూ, అత్యున్నత ఆదర్శాలూ చూసిన దివాన్ ఆయనను మైసూర్ మహారాజయిన చామరాజేంద్ర వడయార్‌కు పరిచయం చేశాడు. ఈ పరిచయానంతరం స్వామీజీ మైసూర్ మహారాజు అతిథిగా రాజప్రాసాదంలోనే బసచేశారు; తనకు సాధ్యమైనంత సమయం స్వామీజీతోనే మహారాజు గడిపాడు.
ఒక రోజు పలువురు రాజసభలోని ప్రముఖుల సమక్షంలో మహారాజూ, స్వామీజీ మాట్లాడుకోసాగారు.
మహారాజు : స్వామీజీ! నా సభికుల గురించి మీరు ఏమనుకొంటున్నారు?
స్వామీజీ : మహారాజా! మీరు విశాలహృదయులు. కాని దురదృష్టవశాత్తు మిమ్మల్ని పరివేష్టించి సభికులున్నారు. సభికులు ఎక్కడున్నప్పటికీ సభికులే! వారిని గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు.
మహారాజు : అలా కాదు స్వామీజీ! కనీసం నా దివాన్నైనా మీరు ఒప్పుకొనవలసిందే. ఆయన కుశాగ్రబుద్ధి, విశ్వాసపాత్రుడు.
స్వామీజీ : కాని మహారాజా, దివాన్ అంటేనే రాజును దోచి ఆంగ్లేయుడికి చెల్లించేవాడే కదా!*
ఈ సంభాషణ కొనసాగించడానికి ఇష్టపడని మహారాజు వేరే విషయాల గురించి మాట్లాడాడు. ఆ తరువాత ఏకాంతంలో స్వామీజీతో ఇలా సంభాషించ సాగాడు.
మహారాజు : ప్రేమాస్పదులైన స్వామీజీ! కొన్ని విషయాలు బహిరంగంగా మాట్లాడడం కొన్ని సమయాలలో పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. సభా ప్రముఖుల సమక్షంలోనే వారిని గురించి ఇలా మాట్లాడితే వారిలో ఎవరైనా మిమ్మల్ని విషం పెట్టి చంపడానికి కూడా సాహసించవచ్చు.
స్వామీజీ : చేయనీ! ప్రాణం పోతుందని భయపడి ఒక నిజమైన సన్న్యాసి సత్యసంధతను వదలివేస్తాడా? మహారాజా! ఒకవేళ మీ కుమారుడే రేపు నా వద్దకు వచ్చి, “మా నాన్నను గురించి మీ అభిప్రాయం ఏమిటి?” అని అడిగాడను కుందాం. మీలో లేని గుణగణాలన్నీ ఏకరువుపెట్టి, మిమ్మల్ని ‘ఇంద్రుడు, చంద్రుడు’ అని ప్రశంసిస్తానా ఏమిటి? నేను అసత్యం పలుకడమా! అది ఎన్నటికీ జరగదు.
సత్యసంధత విషయంలో స్వామీజీ దృఢచిత్తులై విరాజిల్లారు. అలాగని, నిజం పేరిట ఇతరుల మనస్సు నొప్పించడం ఆయనకు సుతరామూ నచ్చదు. ఒక వ్యక్తిలోని దుర్బలతను ఆతడి సమక్షంలోనే చెప్పడమూ, ఆతడి సద్గుణాలను ఆతడి పరోక్షంలో శ్లాఘించడమూ గొప్పవారి నైజం. స్వామీజీ ఆ గుణానికి ఆలవాలం. కాలాంతరంలో తమ శిష్యుల పట్ల కూడా స్వామీజీ ఇలాగే వ్యవహరించారు. దుర్బలతను ఎత్తి చూపినప్పుడే తమను సరిదిద్దుకోవడానికి వారికి ఆస్కారం లభిస్తుంది. సద్గుణాలను ప్రత్యక్షంగా శ్లాఘిస్తే అహంకారం తలెత్తుతుంది; కనుకనే స్వామీజీ దానిని తప్పించారు.
మైసూరు మహారాజు రాజప్రాసాదంలో అతిథిగా ఉన్నప్పుడు స్వామీజీకి ఒక ఆస్ట్రియా గాయకునితో పరిచయం కలిగింది. పాశ్చాత్య సంగీతం గురించి ఆయనతో స్వామీజీ ముచ్చటించడం చూసి అందరూ విస్మయులయ్యారు. అదే విధంగా ఒక రోజు విద్యుత్ శాఖ కార్మికుడు ఒకనితో ఆయన విద్యుచ్ఛక్తి గురించి చర్చించడం కూడా అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది.
సన్న్యాసం
స్వామీజీకి కానుకలు ఇవ్వాలని మైసూర్ దివాన్ అభిలషించాడు. ఒక రోజు ఆయన తన సహాయకుడు ఒకరిని స్వామీజీతో పాటు దుకాణాలున్న వీథికి పంపించి, స్వామీజీ ఏది కోరినా కొని ఇవ్వమని ఆదేశించాడు. దుకాణానికి వెళ్లిన స్వామీజీ ఒక చిన్నపిల్లవాడిలా ఆనందంతో ప్రతి వస్తువునూ ఎంతో ఆసక్తితో చూశారు. తరువాత ఆ సహాయకునితో, “మీ దివాను తప్పకుండా నాకు ఏదైనా ఇవ్వగోరితే ఈ ఊళ్లో లభించే శ్రేష్ఠమైన చుట్ట ఒకటి కొని ఇవ్వండి. అది చాలు” అన్నారు. చుట్ట కొని ఇచ్చినప్పుడు ఆయన ఉత్సాహంగా పొగత్రాగారు. దాని ఖరీదు ఒక రూపాయి.
‘మీకు ఏం చేయాలి?’
ఒక రోజు స్వామీజీ ముఖ్యమంత్రితోపాటు మహారాజును చూడడానికి వెళ్లారు. అప్పుడు మహారాజు, “స్వామీజీ, మీకు నేను ఏం చేయాలి?” అని స్వామీజీని అడిగారు. అందుకు స్వామీజీ ప్రత్యక్షంగా ఎలాంటి జవాబూ ఇవ్వలేదు. కాని ఆయన చెప్పిన దాన్లో ఆయన భావిప్రణాళిక సారాంశం ద్యోతకమయింది. ముందుగా భారతదేశపు గొప్పతనం, భారతీయ ఆధ్యాత్మిక మహత్త్వం వంటి వాటిని గురించి దాదాపు ఒక గంటసేపు మాట్లాడారు. తదనంతరం పాశ్చాత్య వైజ్ఞానిక భావనలు, సంస్థాగతమైన కార్యనిర్వహణ మాత్రమే అప్పుడు భారతదేశానికి ఆవశ్యకాలని నొక్కివక్కాణించారు. భారతీయ ఆధ్యాత్మిక సంపత్తిని పాశ్చాత్య దేశాలకు అందించాలని తేటతెల్లం చేశారు. తాను పాశ్చాత్య దేశాలకు వెళ్లి ప్రచారం చేయనున్నట్లు పరోక్షంగా సూచనప్రాయంగా తెలిపారు. చివరగా, “మహారాజా! నాకు ఏం కావాలనే కదా అడిగారు! నాకు కావలసింది ఇది: పాశ్చాత్య దేశాలు మనకు సహాయం అందించాలి. ఏ రకంగానో తెలుసా? మన ఆర్థిక వ్యవస్థను పెంపొందించే రీతిలో మనకు సహాయపడాలి. మన ప్రజలకు ఆధునిక వ్యవసాయం, ఆధునిక పనితనంలో మెలకువలు, ఆధునిక విజ్ఞానం మొదలైనవి నేర్పించాలి” అని అన్నారు. ఉద్వేగభరితమైన స్వామీజీ భావనలను సావధానంగా విన్న మహారాజు, స్వామీజీ పాశ్చాత్యదేశాలకు వెళ్లి తీరాలనీ, అందుకయ్యే ఖర్చు తానే భరిస్తాననీ తెలియజేశాడు. కాని ఆ సహాయాన్ని ఎందుకో స్వామీజీ వెంటనే స్వీకరించలేదు.
ధ్వని ముద్రణ
మహారాజు, దివాను భారతదేశ పునరుజ్జీవనానికి అవతరించిన మహాత్మునిగా స్వామీజీని పరిగణించారనడం అతిశయోక్తి కాబోదు. తాను మైసూరు నుండి బయలుదేరబోతున్నట్లు ఆయన చెప్పడం వారు భరించలేకపో యారు. ఆయనకు సెలవివ్వడానికి వారు ఏమాత్రం ఇష్టపడలేదు. కాని తప్పక వెళ్లి తీరాలన్న స్వామీజీ సంకల్పం చూశాక వారు, “స్వామీజీ! మీరు వెళ్లిపోయినప్పటికీ మీ జ్ఞాపకార్థం ఏదో ఒకటి పదిలపరచుకోవాలని అభిలషి స్తున్నాం. కనుక మీ కంఠస్వరాన్ని ధ్వనిముద్రణ చేసుకోవడానికి అనుమతించండి” అని ఆయనను అభ్యర్థించారు. స్వామీజీ అందుకు సమ్మతించడంతో ఆయన కంఠస్వరం ధ్వనిగ్రాహకయంత్రం (Phonogram ) లో ధ్వనిముద్రణ గావించబడింది.* స్వామీజీకి పాదపూజ చేయగోరాడు మహారాజు. కాని అందుకు స్వామీజీ ససేమిరా సమ్మతించలేదు.
‘ఏదీ వద్దు’
కొన్ని రోజుల తరువాత మైసూరు నుండి కొచ్చి బయలుదేరడానికి స్వామీజీ సిద్ధమయ్యారు. ఆయనను కానుకలతో ముంచెత్తివేయాలని మహారాజు అభిల షించాడు. కాని స్వామీజీ ఏదీ స్వీకరించలేదు. మహారాజు మరీ ఒత్తిడి చేయడంతో చివరికి, “మహారాజా! కచ్చితంగా ఏదైనా ఇచ్చి తీరాలని మీరు భావిస్తే అలోహంతో చేసిన హుక్కా ఒక్కటి మాత్రం ఇవ్వండి. నాకది ఉపయోగిస్తుంది” అన్నారు స్వామీజీ. మహారాజు శ్రేష్ఠమైన నల్ల చేవమాను (Ebony) కలపతో నగిషీలు మలచి తయారయిన హుక్కాను స్వామీజీకి కానుకగా సమర్పించాడు. స్వామీజీ బయలు దేరుతున్నప్పుడు మహారాజు ఆయన పాదాల వద్ద మోకరిల్లాడు. ముఖ్యమంత్రి ఒక నోట్లకట్ట స్వామీజీకి ఇవ్వబోయాడు. కాని స్వామీజీ దానిని నిరాకరిస్తూ, “మీరు నాకు ఏదైనా చేసే తీరాలనుకొంటే రైలు టికెట్ కొని ఇవ్వండి” అన్నారు. అట్లే రెండవ తరగతి రైలు టికెట్‌తో పాటు, కొచ్చి దివాన్ అయిన శంకరయ్యకు ఒక పరిచయ పత్రం కూడా ముఖ్యమంత్రి స్వామీజీకి అందజేశాడు. స్వామీజీ మైసూరు నుండి బయలుదేరారు.
తిరుచ్చూర్‌లో
ఆనాడు కొచ్చికి, తిరువాన్కూర్ సంస్థానానికి రైలు సౌకర్యం లేదు. కనుక తిరుచ్చూర్ పోవాలంటే ఇరవై ఒక్క మైళ్ల దూరంలోని షోరనూర్ దాకా రైలులో పయనించి, అక్కడ నుండి మరేదైనా వాహనంలో వెళ్లవలసి వుంది. స్వామీజీ ఆ ఇరవై ఒక్క మైళ్లు ఎడ్లబండిలో వెళ్లారు. ఆయన వెళ్లే దారిలో సుబ్రహ్మణ్య అయ్యర్ ఇల్లు ఉంది. ఆయన కొచ్చి సంస్థాన విద్యాధికారి. ఇంటి బయట నిలబడివున్న ఆయనను స్వామీజీ చూసి, “ఇక్కడ స్నానానికి సౌకర్యం ఏదన్నా ఉందా?” అని అడిగారు. స్వామీజీ వేషభాషలూ, వ్యక్తిత్వమూ చూసి ముగ్ధుడయిన అయ్యర్ ఆయన స్నానానికి అవసరమైన సౌకర్యాలు చేయించి ఇవ్వడమేకాక, తమ పొరుగింట్లో ఆయన బస చేయడానికి కూడా ఏర్పాటు చేశాడు. అప్పుడు స్వామీజీ గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఆయనను వైద్యశాలకు తోడ్కొని వెళ్లి చికిత్స కూడా అయ్యర్ చేయించాడు.
కోడుంగల్లూర్లో
తిరుచ్చూర్‌లో కొన్ని రోజులు గడిపిన తదనంతరం స్వామీజీ కోడుంగల్లూర్కు వెళ్లారు. అది విద్యాకేంద్రంగా బాసిల్లుతున్నది. అక్కడ వెలసిన భగవతి దేవాలయం ఎంతో ఖ్యాతిగాంచింది. స్వామీజీ ఆ ఆలయ దర్శనానికి వెళ్లినప్పుడు ఆలయ ప్రవేశానికి అభ్యంతర పెట్టారు. కేరళకు బయటి నుండి వచ్చేవారు ఏ కులస్థులో తెలియకపోవడం వలన ఆయనకు ఆలయ ప్రవేశం లభించదని ఆలయ అధికారులు చెప్పారు. స్వామీజీ ఆలయ సమీపంలోని ఒక మర్రిచెట్టు క్రింద ప్రశాంతంగా కూర్చుని జగజ్జననిని మానసికంగా ఆరాధించసాగారు.
అక్కడున్న యువకుడొకడు స్వామీజీని పరిహాసం చేయాలనే ఉద్దేశంతో ఆయన వద్దకు వచ్చాడు. ఒకటి రెండు మాటల్లోనే ఆయన సామాన్యులు కారని గ్రహించి, తక్షణమే తిరిగి వెళ్లిపోయాడు.
కాసేపట్లో కొడుంగల్లూర్ యువరాజులయిన కొచ్చుణ్ణి తంబిరాన్, భట్టన్ తంబిరాన్లు ఆలయానికి వచ్చారు. వారిని స్వామీజీ వద్దకు ఆ యువకుడు తీసుకువెళ్లాడు. యువరాజు లిద్దరూ సంస్కృతంలోనూ, శాస్త్రాలలోనూ చక్కని ప్రావీణ్యం ఉన్నవారు. వారితో అనేక విషయాలు స్వామీజీ సంస్కృతంలోనే మాట్లాడారు. తనకు ఆలయ ప్రవేశం లభించకపోవడానికి గల కారణాన్ని వారి ముఖతః తెలుసుకొన్నారు స్వామీజీ. ఆయనతో కాసేపు మాట్లాడడంతోనే ఆయన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్నీ, శాస్త్రపరిజ్ఞానాన్నీ గ్రహించిన యువరాజులు ఆయనను ఆలయంలోకి తోడ్కొని వెళ్లగోరారు. కాని తాము స్థానిక సంప్రదాయాలను ఉల్లంఘించ దలచుకోలేదని తెలిపి స్వామీజీ వెలుపల నుండే జగజ్జననిని ఆరాధించారు.
భగవతీ ఆలయం సమీపంలోనే స్వామీజీ బసచేశారు. స్వామీజీ పాండిత్యాన్ని చూసిన యువరాజులు ప్రతి రోజూ వచ్చి మర్రిచెట్టు క్రింద కూర్చుని ఆయనతో మాట్లాడారు, వాదాలూ చేశారు. ప్రతిసారి వారే పరాజయం చవిచూశారు. మూడవ రోజు వెళ్లినప్పుడు స్వామీజీ ప్రగాఢమైన ధ్యానంలో ఉండడం వారు చూశారు. ఆయన ధ్యానం ముగింపునకు వచ్చేదాకా వేచివుండి, తరువాత ఆయన పాదాల వద్ద మోకరిల్లి నమస్కరించి తిరిగి వెళ్లిపోయారు.
ఆ తరువాత రాచకుటుంబానికి చెందిన కొందరు స్త్రీలు వచ్చి స్వామీజీని కలుసుకొన్నారు; ఆయనతో స్వచ్ఛమైన సంస్కృతంలో మాట్లాడారు. స్త్రీలు సంస్కృతంలో ఇంత అనర్గళంగా మాట్లాడడం చూసి స్వామీజీ ఆశ్చర్యచకితు లయ్యారు. భారతదేశంలో మరే ప్రాంతంలోనూ ఇలాంటిది స్వామీజీకి తారస పడలేదు. ఆయన ఎంతో సంతోషించారు.
స్వామీజీ దర్శనార్థం యువరాజులు నాలుగవ రోజు వెళ్లినప్పుడు మర్రిచెట్టు క్రింద ఎవరూ లేరు. స్వామీజీ కొచ్చి వెళ్లిపోయినట్లు వారికి తెలిసింది.
ఛట్టాంబి స్వామితో
కొచ్చి జిల్లాలోని ఎర్నాకుళానికి స్వామీజీ పడవలో వెళ్లారు. అది 1892 డిసెంబర్ నెల. చందూలాల్, రామయ్య అనే ఇద్దరు ప్రప్రథమంగా స్వామీజీని కలుసుకొన్నారు. స్వామీజీ పట్ల ఎంతో ఆకర్షితులైన ఆ ఇద్దరూ ఆయనను తమ ఇళ్లకు తీసుకొనివెళ్లారు. “ఆంగ్లం తెలుసా?” అన్న వారి ప్రశ్నకు, హిందీలో, “ఏదో కొద్దిగా తెలుసు” అని స్వామీజీ జవాబిచ్చారు. ఆయన ఆంగ్లంలో నిష్ణాతులని ఆ తరువాత వారికి తెలిసింది.
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడే సన్న్యాసి ఒకరు వచ్చారనే వార్త కార్చిచ్చులా వ్యాపించింది. ఎర్నాకుళంలోని అనేకులు స్వామీజీ దర్శనార్థం వచ్చారు.ఆ సమయంలోనే ఛట్టాంబి స్వాములు కూడా ఎర్నాకుళంలోనే బస చేశారు. సంస్కృతంలో చక్కని అభినివేశమూ, ప్రగాఢ శాస్త్రజ్ఞానమూ గల సన్న్యాసి ఆయన. స్వామీజీని గురించి విని ఆయనను కలుసుకోవడానికి వచ్చారు. కాని అక్కడ సమావేశమై ఉన్న జనసందోహాన్ని చూసి కాస్త దూరం నుండే స్వామీజీనిదర్శించి తిరిగి వెళ్లిపోయారు. భక్తుల నుండి ఛట్టాంబి స్వామి వచ్చి వెళ్లిన సంగతితెలుసుకొన్న స్వామీజీ, “అంతటి గొప్ప మహాత్ముడు నన్ను వెతుక్కుంటూరావడమా! నేనే వెళతాను” అంటూ ఆయనను చూడడానికి వెళ్లారు.
ఛట్టాంబి స్వామికి హిందీ తెలియనందువల్ల వారిద్దరూ సంస్కృతంలో మాట్లాడుకొన్నారు. స్వామీజీతో ఏకాంతంగా మాట్లాడగోరి ఆయనను ఒక చెట్టుక్రిందికి తీసుకొని వెళ్లి ఛట్టాంబి స్వామి మాట్లాడసాగాడు. అప్పుడు ఆ చెట్టు మీదఒక కోతి ఉంది. ఇద్దరూ మాటల్లోపడ్డ కాసేపటికి ఆ కోతి చెట్టు కొమ్మలను అదేపనిగా ఊపసాగింది. తదేకంగా ఆ కోతిని చూస్తూ స్వామీజీ, “నా మనస్సులా ఈ కోతి కూడా అశాంతంగా ఉంది” అని వ్యాఖ్యానించారు. వెంటనే ఛట్టాంబి స్వామి, “ఇలా పోల్చడం మీ లాంటి పెద్దవారికే చెల్లుతుంది” అన్నాడు.
ఆ తరువాత సంభాషణ చిన్ముద్ర* మీద మళ్లింది. “చిన్ముద్రకు అర్థంఏమిటి?” అని స్వామీజీ అడిగారు. ఛట్టాంబి స్వామి తమిళ గ్రంథాలను చక్కగా అధ్యయనం చేసిన వ్యక్తి, కనుక చిన్ముద్రకు అద్భుతమైన వివరణ నిచ్చారు. ఆ వివరణ విని స్వామీజీ ఎంతో సంతోషించి, ఆయన చేతులు పుచ్చుకొని, “చాలా బాగుంది” అని హిందీలో చెప్పారు.
స్వామీజీ సుశ్రావ్యమైన కంఠస్వరం ఛట్టాంబి స్వామిని ఎంతగానో ఆకట్టుకొంది; “బంగారు కుండను తట్టినప్పుడు ధ్వనించే కింకిణీనాదం లాంటిది ఆయన కంఠస్వరం! ఆహా, ఏం మాధుర్యం!” అనేవారయన. స్వామీజీ నేత్రాలను కూడా ఆయన ఎంతగానో ప్రశంసించారు. స్వామీజీని ఛట్టాంబి స్వామి, ఆయన శిష్యుడయిన నారాయణగురు స్తుతించి, శ్లాఘించారు. “స్వామీజీ పక్షిరాజైన గరుత్మంతుడయితే నేను కేవలం ఒక దోమను” అన్నారు ఛట్టాంబి స్వామి. కాని స్వామీజీ మాంసాహారం తినడం మాత్రం వారు ఆమోదించలేదు. “ఆ ఒక్క లోటు మాత్రం లేకుంటే ఆయన ఒక దివ్యపురుషుడే” అనేవారట ఛట్టాంబి స్వామి. స్వామీజీ కూడా ఛట్టాంబి స్వామిచే బాగా ఆకర్షితులయినారు. “నేను ఒక నిజమైన మనిషిని కేరళలో కలుసుకొన్నాను” అని స్వామీజీ వ్రాసివున్నారు.
తిరువనంతపురంలో
కొచ్చి నుండి ఇంకా దక్షిణాన ఉన్న తిరువాన్కూర్ వైపుగా స్వామీజీ బయలుదేరారు. ముగ్ధమనోహర ప్రకృతితోబాటు ఆయన దాదాపు 140 మైళ్లు పయనించవలసివుంది. కొచ్చి దివాన్ కార్యదర్శియైన రామయ్యర్ స్వామీజీకి తోడుగా తిరువనంతపురం దాకా వెళ్లడానికి కార్యాలయ సిబ్బంది ఒకరిని ఏర్పాటు చేశాడు. ఆతడు ఒక మహమ్మదీయుడు. ఆతడితో 1892 డిసెంబర్ 13 వ తేదిన స్వామీజీ తిరువనంతపురం చేరుకొన్నారు.
తిరువనంతపురంలో ప్రొఫెసర్ సుందరరామ అయ్యర్‌ను కలుసుకోవడానికి స్వామీజీ వెళ్లారు. ఆయన తిరువాన్కూర్ మహారాజు అల్లుడయిన యువరాజు మార్తాండవర్మకు ఉపాధ్యాయుడు. అప్పుడు యువరాజు ఎం.ఏ చదువుతున్నాడు. ఇంటి వద్దకు వెళ్లినప్పుడు 12 ఏళ్ల బాలుడైన అయ్యర్ రెండవ కుమారుడు ఇంటి గుమ్మం వద్ద నిలబడివున్నాడు. స్వామీజీ తలపాగా, దుస్తులను చూసి ఆ బాలుడు ఆయనను ఒక మహమ్మదీయునిగా భావించాడు. లోపలికి వెళ్లి తండ్రితో ఇద్దరు మహమ్మదీయులు ఆయనను చూడడానికి వచ్చారని చెప్పాడు! తిరువనంత పురంలో స్వామీజీ సుందరరామ అయ్యర్ ఇంట్లో బసచేశారు.
ఇంట్లోకి వెళ్లగానే తనకు తోడుగా వచ్చిన ఆ మహమ్మదీయ మిత్రునికి భోజన ఏర్పాట్లు చేయమని స్వామీజీ కోరారు. గత రెండు రోజులుగా ఆయన కూడా పాలు తప్ప మరేమీ పుచ్చుకోలేదు. అయినప్పటికీ తోడుగా వచ్చిన వ్యక్తి ఆకలిని ముందుగా తీర్చి అతణ్ణి తిరిగి పంపించారు.
కాసేపు మాట్లాడగానే స్వామీజీ ఒక అసాధారణమైన వ్యక్తి అని అయ్యర్ గ్రహించాడు. కొచ్చిలో బయలుదేరినప్పటి నుండి ఆయన దాదాపు పస్తున్నట్లు తెలుసుకొన్న అయ్యర్, “స్వామీజీ, మీకు ఎలాంటి ఆహారం కావాలి?” అని అడిగాడు. అందుకు స్వామీజీ, “మీరు ఏం పెట్టినా నాకు సమ్మతమే. సన్న్యాసులు రుచులు చూసి తినరు” అని జవాబిచ్చారు.
స్వామీజీ వ్యక్తిత్వమూ, సుశ్రావ్యమైన కంఠస్వరమూ, కళ్లల్లో ద్యోతకమయ్యే ప్రకాశమూ అయ్యర్‌ను అమితంగా ఆకర్షించాయి. ఆయనతో మాట్లాడుతూ ఉండిపోవాలి, ఆయన సమక్షంలోనే ఉండిపోవాలి అనుకోవడంతో నాడు అయ్యర్ యువరాజుకు పాఠాలు చెప్పడానికి కూడా వెళ్లలేదు. సాయంత్రం ఇద్దరూ తిరువనంతపురం కళాశాలలో రసాయనికశాఖ ఆచార్య పదవిని అలంకరించి వున్న రంగాచారిని చూడడానికి వెళ్లారు. యావత్తు దక్షిణ భారతదేశంలో జ్ఞానిగా, మేధావిగా ఆయనకు గొప్ప ఖ్యాతి ఉంది. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేనందున ఇద్దరూ తిరువనంతపురం క్లబ్బుకు వెళ్లారు. తిరువనంతపుర ప్రముఖులలో పలువురిని స్వామీజీ అక్కడ కలుసుకొన్నారు.
ఇతరులను గౌరవించాలి
ఆ సమయంలో క్లబ్బులో నారాయణ మీనన్, బ్రాహ్మణుడైన దివాను పేష్కర్ ఉన్నారు. నారాయణ మీనన్ సెలవు పుచ్చుకొని బయలుదేరుతున్నప్పుడు దివాన్‌కు చేతులు జోడించి నమస్కరించాడు. ఇతరులకు సమానమైన గౌరవం ఇవ్వడానికి ఆనాటి బ్రాహ్మణ సమాజం సిద్ధంగా లేదు. మీనన్‌కు చేతులు జోడించి నమస్కరించకుండా దివాన్ తన కుడిచేతిని కాస్త పైకెత్తి ఆతడి నమస్కారాన్ని ఆమోదించాడు. స్వామీజీ నిశితమైన చూపు దీనిని గమనించకపోలేదు. కాసేపటికి దివాన్ బయలుదేరుతూ స్వామీజీ వద్దకు వచ్చి తలవంచి, చేతులు బోడించి నమస్కరించాడు. స్వామీజీ ఆయనకు ప్రతి నమస్కారం చేయకుండా, సన్న్యాస సంప్రదాయం ప్రకారం ‘నారాయణ’ అని మాత్రం అన్నారు. స్వామీజీ తనకు ప్రతినమస్కారం చేయక పోవడం అవమానంగా భావించి దివాన్ కుపితుడయ్యాడు. అప్పుడు స్వామీజీ ప్రశాంతంగా, “నారాయణ మీనన్ మీకు నమస్కరించినప్పుడు ప్రతినమస్కారం చేయకుండా మీ కుల ఆధిక్యాన్ని ప్రదర్శించే అలవాటును పాటించినప్పుడు నేనెందుకు సన్న్యాస సంప్రదాయాన్ని పాటించకూడదు? ఇతరులకు సన్న్యాసి ఎలా నమస్కరించాలో అదే రీతిలోనే నమస్కరించాను” అన్నారు. స్వామీజీ జవాబును దివాను జీర్ణించుకోలేకపోయాడు. కాని ఆ తరువాత తన సోదరుణ్ణి పంపి పరోక్షంగా స్వామీజీకి క్షమాపణ తెలుపుకొన్నాడు. చూడడానికి ఈ సంఘటన చిన్నదే అయినప్పటికీ, అంతమంది సమావేశమై ఉన్న ఆ చోట స్వామీజీని విశిష్ట వ్యక్తిగా చాటిచూపింది.
ఆ తరువాత స్వామీజీ యువరాజయిన మార్తాండవర్మను కలుసుకొన్నారు. వారిద్దరూ అనేక విషయాల గురించి ముచ్చటించు కొన్నారు. స్వామీజీ పట్ల అమితంగా ఆకర్షితుడైన యువరాజు ఆయన ఛాయాచిత్రం తీసి, దానిని ప్రతిభావంతమైన ఒక చిత్తరువుగా రూపొందించి, చెన్నైలో జరిగిన కళాప్రదర్శ నకు కూడా పంపించాడు.
‘శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడు’
స్వామీజీని గురించి విన్న పండితులు, మేధావులు, సామాన్యులు ఆయనను కలుసుకోవడానికి రాసాగారు. స్వామీజీ పలికిన ప్రతి మాటలోనూ ఒక ఉజ్జ్వలత కానరావడం అయ్యర్ గమనించాడు. కనుక ఆయనను ఒక ఉపన్యాసం ఇవ్వవలసిందిగా అభ్యర్థించాడు. అందుకు స్వామీజీ తాను అంతదాకా బహిరంగ ప్రసంగాలు ఏవీ చేయలేదనీ, కాదుకూడదని ప్రయత్నిస్తే మిగిలేది అవహేళన, పరాజయమే అనీ నిరాకరించారు. కాని అయ్యర్ అంతటితో వదలిపెట్టే రకం కాదు. అమెరికాలో జరుగబోయే సర్వమత మహాసభలో హిందూమత ప్రతినిధిగా స్వామీజీ పాల్గొనాలని మైసూర్ మహారాజు అభ్యర్థించిన సంగతి అయ్యర్‌కు తెలుసు. కనుక ఆ సంగతి ప్రస్తావిస్తూ, “ఈ చిన్న వేదికకే మీరు తటపటా యిస్తున్నారంటే, అంత గొప్ప మహాసభలో ఎలా వ్యవహరించగలరు?” అని అడిగాడు. అందుకు స్వామీజీ తిన్నగా జవాబివ్వకుండా, “నన్ను తన పరికరంగా చేసుకోవాలి, తద్ద్వారా నేను కొన్ని కార్యాలు నిర్వర్తించాలని ఆ భగవంతుడు సంకల్పిస్తే అందుకు అవసరమైన శక్తినీ ఆయనే ప్రసాదిస్తాడు” అన్నారు.
“అలా ఒక ఫలానా వ్యక్తికి హఠాత్తుగా ఆయన శక్తిసామర్థ్యాలు ప్రసాదిస్తారా, అలా ప్రసాదించడం సాధ్యమేనా?” అనే సందేహం అయ్యర్ వెలిబుచ్చాడు. అంతే, ఉప్పొంగుతూ లేచారు స్వామీజీ. “మీరు నామమాత్రపు వైదికులు. మీ నిత్య పూజ, పారాయణ అంతా నిరుపయోగం. హృదయంలో విశ్వాసం లేకుండా మీరు వీటిని అనుష్ఠిస్తున్నారు. లేకుంటే జీవితావశ్యకాలను భగవంతుడు ప్రసాదించగలుగుతాడా అనే సందేహం మీకు వస్తుందా?” అంటూ పిడుగులా గర్జించారు. “సమ్మెటపోట్లలా ఉన్నాయి ఆయన పలుకులు” అని అయ్యర్ వ్రాశారు.
అయ్యర్ కుటుంబ సభ్యులూ, బయటి నుండి వచ్చేవారూ స్వామీజీని కలుసుకోవడం ఒక మహద్భాగ్యంగా భావించారు. ప్రతి వ్యక్తితోనూ వారి మనో స్థితికి తగ్గట్లు మాట్లాడడం స్వామీజీకి కరతలామలకం. కనుక ఆయనతో మెలగిన ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందారనడం అత్యుక్తి కాదు. స్పెన్సర్, షేక్స్పియర్, కాళిదాసు, డార్విన్ పరిణామవాదం, యూదుల చరిత్ర, ఆర్య నాగరకత, ఇస్లాం, క్రైస్తవం లాంటి ఆయన ముచ్చటించిన అంశాలు కోకొల్లలు. అక్కడ బస చేసిన కొద్ది రోజులలో స్వామీజీ కొన్ని తమిళ మాటలు నేర్చుకోవడం విశేషం.
కులతత్వ క్రౌర్యం
కులతత్వ క్రౌర్యం గురించి బెంగళూరులో డాక్టర్ పల్పు తమతో చెప్పిన మాటలు అక్షరసత్యమని స్వామీజీ గ్రహించారు. కులతత్వం పేరిట ఎన్ని ఘోరాలు జరగడానికి ఆస్కారం ఉందో అవన్నీ ఇక్కడ కొనసాగు తున్నాయి. నిమ్న కులస్థులకు ఆలయ ప్రవేశం లేదు, అగ్రవర్ణాల వారి వీథుల్లోకి వీరు ప్రవేశించరాదు, వారిని కన్నెత్తి చూడకూడదు, శాస్త్రాధ్యయనం చేయరాదు. వీటన్నింటికీ పరాకాష్ఠగా ఒక ఫలానా కులానికి చెందిన స్త్రీలకు వివాహం నిషేధింపబడింది. కులతత్వం పేరిట జరుగుతున్న ఈ దమనకాండతో క్రైస్తవ ఫాదరీలు ఇదే అదనుగా వందలాది హిందువులను క్రైస్తవులుగా మార్చారు. స్వామీజీ ఇలా వ్రాస్తున్నారు:
“మనం ఎటువంటి హాస్యాస్పదమైన స్థితికి దిగజారేమో కదా! ఒక పాకీవాడు, పాకీవాడి స్థితిలో ఎవరి వద్దకైనా వస్తే, ప్లేగు వ్యాధిలా అతణ్ణి తరిమివేస్తాం. కాని ఒక ఫాదరీ వచ్చి అతడి నెత్తిన ఒక చెంబెడు నీళ్లు కుమ్మరించి, కొన్ని ప్రార్థనా మంత్రాలు గొణిగిన తరువాత, అతడు ఒక కోటు ధరించి, అది ఎంత చిరిగిపోయినదైనా సరే – సనాతనాచారపరాయణుడైన ఒక హైందవుని ఇంట్లోకి వస్తే, అతడికి కూర్చోవడానికి ఒక కుర్చీ వేసి, హృదయ పూర్వకంగా కరచాలనం చేయకుండా ఉండే ధైర్యం ఎవరికుంది? ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమిటి ఉంటుంది? ఈ దక్షిణ దేశంలో, ఈ ఫాదరీలు వచ్చి ఏం చేస్తున్నారో చూడండి. లక్షలాది నిమ్నకులస్థులను తమ మతంలో కలుపుకొంటు న్నారు. భారతదేశంలో పురోహితుల అధికారం ఎక్కడ ఎక్కువ ఉన్నదో, ఎక్కడ భూమి ప్రతి అంగుళం బ్రాహ్మణులకు ఆస్తిగా ఉన్నదో, ఎక్కడ రాజకుటుంబానికి చెందిన స్త్రీలు సైతం బ్రాహ్మణులకు ఉంపుడుగత్తెలుగా జీవించడాన్ని గొప్పగా భావిస్తారో – ఆ తిరువాన్కూర్లో దాదాపు ఇరవై ఐదు శాతం ప్రజలు క్రైస్తవులుగా మారిపోయారు.”*
ఆర్య-ద్రావిడ సమస్య
భవిష్యత్తులో భారతదేశ సమైక్యతకే చేటుగా దాపురించనున్న ఆర్య-ద్రావిడ సమస్య అంకురాన్ని స్వామీజీ ఆనాటి తిరువాన్కూర్లో చూడగలిగారు. ఉత్తర దిశ నుండి వచ్చిన బ్రాహ్మణుల (ఆర్యుల) భావనలూ, ఆధిక్యమూ దక్షిణ భారతీయులయిన ద్రావిడులను అణచివేయడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడక్కడ నిరసన స్వరాలు బయలుదేరాయి. విద్యాధికుడైన ప్రొఫెసర్ సుందరం పిళ్లై లాంటి వారుకూడా తమను తాము ద్రావిడులమనీ, సామాన్యంగా భావింపబడుతున్నట్లు ‘హిందువులు’ కామనీ పేర్కొనడం స్వామీజీని ఆశ్చర్యచకితులను చేసింది. అదే సమయంలో అయ్యర్ లాంటి వ్యక్తుల ఏకమొత్త భిన్నమైన భావన కూడా స్వామీజీకి అంగీకార యోగ్యంగా అనిపించలేదు. ఇటువంటి ఆర్య, ద్రావిడ అనే వేర్పాటునే స్వామీజీ సమ్మతించలేదు. నల్లగా ఉన్న బ్రాహ్మణులు కచ్చితంగా ద్రావిడుల పూర్వీకుల నుండి వచ్చినవారే; కనుక ఇటువంటి విభజన అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. స్వామీజీ అభిప్రాయాన్ని వారు ఆమోదించలేకపోయారు.
అదే విధంగా ఆహార విషయంలో కూడా స్వామీజీ ఉద్దేశాలు వారిని ఆశ్చర్యచకితులను చేశాయి. ప్రాచీన కాలంలో బ్రాహ్మణులు యాగాలలో పశువు లను బలి ఇచ్చారు, వాటి మాంసం ఆరగించారు; తేనె కలిపిన మధువనే పానకం అతిథులకు ఇచ్చారు. దీని గురించిన నిదర్శనాలు వేదాలలో ఉన్నాయి. తదనంతరం బౌద్ధమతం వ్యాపించడంతో ఈ సంప్రదాయానికి కాలం చెల్లిపోయింది. శక్తిమంతమూ, ఆధిక్యమూ గల ప్రపంచదేశాలయిన బ్రిటిష్ సామ్రాజ్యంతోగాని, లేదా దానికి వెలుపలనున్న దేశాలతోగాని భారతదేశం పోటీచేసి ప్రగతి సాధించాలంటే హిందువులకు మాంసాహారం ఆవశ్యకమని స్వామీజీ అభిప్రాయపడ్డారు. దీనిని కూడా వారు ఆమోదించలేకపోయారు.
నిజమైన దేశభక్తి
అయ్యర్ కుమారుడైన రామస్వామిశాస్త్రితో స్వామీజీ తెలిపిన అభిప్రాయాలు ఆయన భవిష్యత్తులో నిర్వర్తించగోరిన కార్యానికి అద్దంపడుతు న్నాయి. “దేశభక్తి, దేశభక్తి అంటున్నారు. నిజానికి అదేమిటి? అదొక అంధవిశ్వాసమా? లేదా ఉద్వేగాల ఉప్పెనా? కాదు. దేశప్రజలకు సేవచేయాలనే మహా ఉత్సుకతే నిజానికి దేశభక్తి. భారతదేశం యావత్తు చూశాను. అజ్ఞానమూ, దుఃఖమూ, శీలరాహిత్యాలే కంటబడ్డాయి. నాహృదయం భగ్గున మండింది. ఈ అరిష్టాలను కూకటివేళ్లతో సహా పెకలించి వేయాలని తపించిపోతున్నాను. ‘వారి దుష్కర్మ ఫలం అది, అందుకే కష్టాలనుభ విస్తున్నారు’ అంటూ కర్మసిద్ధాంతం వల్లిస్తుంటారు. దయచేసి అలా మాట్లాడకండి. కష్టపడడం వారి కర్మ అయితే, దాన్నుండి వారికి విముక్తి కలిగించడం మన కర్మ. భగవద్దర్శనం పొందగోరితే మానవసేవ చేయండి. నారాయణుని పొందాలంటే ఆకలితో అలమటిస్తున్న లక్షలాది దరిద్ర నారాయణులకు సేవచేయండి. అదే నిజమైన దేశభక్తి.”
ఇటువంటి భావనలను స్వామీజీ అక్కడ అనేకుల వద్ద వ్యక్తం చేశారు. యావద్భారత దేశాన్ని ఎలాంటి సంస్కరణల ద్వారా తీర్చిదిద్దాలో స్వామీజీ తెలిపారు. స్వామీజీ విజయమూ, ఆయన ఛట్టాంబిస్వామి ప్రభృతులను కలుసుకొని ముచ్చటించడమూ కాలాంతరంలో కేరళ చవిచూసిన సామాజిక విప్లవాలకు ఒక బీజంగా వెలుగొందాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
స్వామీజీ తిరువనంతపురంలో బసచేసినప్పుడు కలకత్తాకు చెందిన మన్మథనాథ్ అనే వ్యక్తి కార్యాలయం పని మీద తిరువనంతపురం వచ్చాడు. ఆయన చెన్నైలో సహాయ ప్రధాన గణకుడుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన స్వామీజీకి పరిచయమయ్యాడు. తిరువనంతపురం నుండి బయలుదేరడానికి స్వామీజీ సిద్ధమవుతున్నప్పుడు వంజీశ్వరశాస్త్రి అనే పండితుడు ఆయనను చూడడానికి వచ్చాడు. కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే వారు మాట్లాడుకో గలిగారు. అయినప్పటికీ మాట్లాడి బయటికి వచ్చిన శాస్త్రి, స్వామీజీకి సంస్కృత వ్యాకరణంలో గల ప్రతిభను శ్లాఘించాడు.
తొమ్మిది రోజులు తిరువనంతపురంలో గడిపి, 1892 డిసెంబరు చివరలో స్వామీజీ కన్యాకుమారి బయలుదేరారు.