శ్రీరామకృష్ణులు నా గురించి అనేక విషయాలు ప్రస్తావించేవారే! వాటిని ఇప్పుడిప్పుడే అర్థంచేసుకోనారంభించాను. లోకాన్నే ఉర్రూ తలూగించే అపరిమిత శక్తి నాలో నెలకొని ఉండడం ఇప్పుడు నేను నిజంగా గ్రహిస్తున్నాను.
– స్వామి వివేకానంద
అహమ్మదాబాద్‌లో — సన్న్యాసి పేరిట… — జునాగఢ్‌లో — గిర్నార్ — సోమనాథ్‌లో — పోరుబందర్లో
పిల్లలతో — మళ్లీ ఒక స్మృతి — స్వామీజీ వ్యాకులత — ‘లోకాన్ని ఉర్రూతలూగించే శక్తి నాలో ఉంది’ — వదలి పెట్టకుండా వెంబడించే అఖండానంద — పాలిటానాలో — బహిరంగ ప్రసంగాల వలన ప్రయోజనం శూన్యం — చికాగో గురించి — గత జన్మలో బౌద్ధుడు — తిలక్‌తో — సన్న్యాసులు నిష్ప్రయోజకులా? — లపిస్తున్నప్పుడు అక్కున చేర్చుకొనే తల్లి — ‘బంగారమూ వజ్రాలూ అవసరంలేదు’ — వినూత్న సన్న్యాసి: బెల్గామ్‌లో — హరిపాద మిత్రా — ‘మానసిక శక్తిని వృథా చేయకూడదు’ — రుగ్మతలు దాదాపుగా మనస్సంబంధమైనవి — భిక్ష ఇవ్వడమా, ఇవ్వకపోవడమా? — ఇతరులు మనకు అద్దం లాంటివారు — నిజమైన ఉపాధ్యాయుడు
పారిశుద్ధ్య ఆవశ్యకత — సైద్ధాంతిక మౌఢ్యం: ఒక కథ — హరిపాద మిత్రాకు దీక్ష — గోవా క్రైస్తవ మఠం
అహమ్మదాబాద్‌లో
ప్రా చీన కాలంలో కర్ణావతి అని పేర్కొనబడిన అహమ్మదాబాద్ గుజరాత్సుల్తానుల రాజధానిగా విలసిల్లింది. అత్యంత అందమైన నగరాలలో దానిని ఒకటిగా పరిగణించడం అతిశయోక్తి కాదు. జైన దేవాలయాలు, మసీదులు ఇప్పటికీ ఆ నగర సాంస్కృతిక ఘనతను చెప్పక చెబుతున్నాయి. స్వామీజీ వీటి నన్నింటినీ తీరికగా కొన్నిరోజులపాటు సందర్శించారు. భిక్షాటన చేసి జీవించారు. జైనమతానికి ఆలవాలమైన ఆ నగరంలో ఆయన జైన పండితులను కలుసుకోగలిగారు. వారిసహాయంతో ఆయన తమ జైనమత జ్ఞానాన్ని పెంపొందించుకొన్నారు. కొన్నిరోజులు అక్కడ గడిపిన తరువాత వాద్వాన్ మీదుగా లింబ్డీ చేరుకొన్నారు. భిక్షస్వీకరిస్తూ దారి ప్రక్కన గడుపుతూ ఆయన పయనించారు.
సన్న్యాసి పేరిట…
లింబ్డీలో పలుచోట్ల తిరుగాడిన స్వామీజీ చివరికి సన్న్యాసులు బసచేయ డానికి ఒక చోటు ఉన్నట్లు తెలుసుకొన్నారు. జనసంచారం లేని మారుమూల ఆ ఇల్లు ఉంది. స్వామీజీ అక్కడికి వెళ్లారు. అక్కడున్న సన్న్యాసులు ఆయనను ఆప్యాయంగా ఆహ్వానించి, ఇష్టమొచ్చినన్ని రోజులు అక్కడ ఉండవచ్చునని చెప్పారు. ఆకలితోనూ, బడలికతోనూ అ లసిసొలసిపోయిన స్వామీజీ వారి ఉపచర్యలు స్వీకరించి అక్కడే బసచేశారు. కాని అది ఎలాంటి స్థలమో అప్పుడు ఆయనకు తెలియలేదు. ఒకటి రెండు రోజులు గడిచాయి. ఒక రోజు ప్రక్క గది నుండి స్త్రీలూ, పురుషులూ ఆడుతూ పాడుతూ గోలగోల చేస్తున్న శబ్దాలు వినవచ్చాయి. తీరా వెళ్లి చూస్తే ఆసన్న్యాసులు ఆధ్యాత్మిక సాధనల పేరిట కామ వాంఛలను తీర్చుకొంటున్న వారని స్వామీజీకి అర్థమయిపోయింది. ఇంక క్షణం కూడా అక్కడ ఉండడం ప్రమాదమని గ్రహించి, తక్షణమే అక్కణ్ణుండి వెళ్లిపోవాలని నిశ్చయించుకొన్నారు. గది తలుపులు తెరవడానికి ప్రయత్నించారు. కాని తలుపులు బయటి నుండి గడియపెట్టబడి ఉండడంతో తెరచుకోలేదు. ఆయన తప్పించుకొనిపోకుండా ఒక వ్యక్తి కాపలాగా ఉన్నాడు. అయినప్పటికీ స్వామీజీ కలత చెందలేదు.
పిదప ఆ బృందం నాయకుడు స్వామీజీని పిలిచి ఇలా అన్నాడు: “మీరొక అద్భుతమైన సన్న్యాసి. అసాధారణమైన ఆకర్షణశక్తి ఏదో మీలో ఉంది. మీరు ఏళ్ల పర్యంతం బ్రహ్మచర్యవ్రతం నిష్ఠగా పాటిస్తూన్న వ్యక్తిలా తెలుస్తోంది. మీ దీర్ఘకాలిక తపఃఫలాన్ని మేం పొందబోతున్నాం. అందు నిమిత్తం మేం జరుప బోయే ఒక క్రతువులో మీ బ్రహ్మచర్య జీవితాన్ని మంటగలుపుతాం. ఆ క్రతువు మూలంగా మాకు అసాధారణ శక్తులు లభిస్తాయి.” అప్పుడు స్వామీజీ కాస్త చలించారు. కాని దేనినీ బయటికి వ్యక్తం చేయలేదు. వారు చెప్పింది అసలు పట్టించుకోనట్లే వ్యవహరించారు.
అప్పుడప్పుడు స్వామీజీని కలుసుకొన్న వారిలో ఒక యువకుడు అక్కడ ఉన్నాడు. ఆతడి ద్వారా స్వామీజీ ఆ సంస్థాన యువరాజయిన ఠాకూర్ సాహెబ్‌కు వివరాలన్నీ తెలియపరిచి సహాయం కోరారు. యువరాజు వెంటనే భటులను పంపించి స్వామీజీని అక్కణ్ణుండి బయటకు తెప్పించాడు. ఆ తరువాత యువరాజు ఆహ్వానాన్ని మన్నించి రాజప్రాసాదంలో స్వామీజీ నివసించసాగారు. అక్కడ పలువురు పండితులతో సంస్కృతంలో వాదోపవాదాలు కూడా ఆయన చేశారు.
జునాగఢ్‌లో
లింబ్డీలో కొన్ని రోజులు గడిపిన తరువాత యువరాజు నుండి పరిచయ పత్రాలు పుచ్చుకొని స్వామీజీ జునాగఢ్ వెళ్లారు. లింబ్డీ అనుభవం తరువాత తాము మెలగే వ్యక్తుల బస చేసే చోట్ల పట్ల స్వామీజీ అప్రమత్తంగా ఉన్నారు. జునాగఢ్‌లో ఆ సంస్థాన దివాన్ అయిన హరిదాస్ విహారీదాస్ దేశాయ్‌కు అతిథిగా స్వామీజీ ఉన్నారు.
హరిదాస్ స్వామీజీ పట్ల అమితంగా ఆకర్షితుడయ్యాడు: “ఆయన నిరాడం బరత, వినమ్రత, అనేక కళలలోను విజ్ఞానశాస్త్రంలోను ఆయనకు గల ప్రతిభ, విశాల భావాలు, మతం పట్ల గల అవగాహన, ఎవరినైనా ఇట్టే ముగ్ధులను చేయగల వాక్పటిమ, అందరినీ ఆకర్షించే సమ్మోహక శక్తి, అసాధారణమైన వ్యక్తిత్వం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకొన్నాయి. సంగీతంలో సైతం ఆయనకు చక్కని ప్రావీణ్యముంది; భారతీయ కళలలోని అన్ని అంశాలూ తెలిసిన వ్యక్తిలా ఉన్నారు. అంతేకాదు. ఆయన పాకశాస్త్రంలోకూడా ప్రావీణ్యుడు. రుచికరమైన రసగుల్లాలు తయారుచేసి ఇచ్చారు. మేము ఆయన పట్ల అమిత భక్తిప్రపత్తులతోమెలగాం” అంటూ కాలాంతరంలో ఆయన వ్రాశారు.
జునాగఢ్ చరిత్ర ప్రసిద్ధి చెందిన ప్రదేశం. అక్కడి పురాతన భవంతులు, పాడుబడిన స్మారక చిహ్నాలు స్వామీజీకి చరిత్రపైనున్న జిజ్ఞాసను ప్రేరేపించాయి.ఉపర్ కోట్‌లోని పురాతన కోట, రాజపుఠాణా రాజుల పురాతన రాజప్రాసాదం, పురాతన బావులు, బౌద్ధుల కాలంనాటి కప్రాకోటియా గుహలను ఎంతో ఉత్సుక తతో స్వామీజీ సందర్శించి చూశారు. నగరం వెలుపల గల అశోకుని శిలాశాసనం ఆయనను ఎంతగానో ఆకర్షించింది. అది ఒక పెద్ద శిల మీద ప్రతిష్ఠితమైఉంది. అశోక చక్రవర్తి, మరో ఇద్దరు రాజుల శిలాశాసనాలు దాన్లో ఉన్నాయి.
జునాగఢ్‌లో స్వామీజీ ఏసుక్రీస్తు, ఐరోపా నాగరకత లాంటి విషయాలను గురించి ఎక్కువగా ప్రసంగించారు. పాశ్చాత్యుల నైతికతను పునరుజ్జీవింపజేయడంలో ఏసుక్రీస్తు ప్రభావాన్ని చక్కగా విశ్లేషించి చూపారు. రాఫెల్ తైలవర్ణచిత్రాలు, సెయింట్ ఫ్రాన్సిస్ (అస్సిసీ వాస్తవ్యుడు) భక్తిప్రపత్తులు, బ్రహ్మాండమైనచర్చ్లు, శిలువ యుద్ధాలు (Crusades), పాశ్చాత్యుల రాజకీయ వ్యవస్థలు, మతజీవితం, సన్న్యాస సంప్రదాయాలలాంటివన్నీ ఒక సన్న్యాసియైన ఏసుక్రీస్తు బోధనలతో ఏదో రకంగా ఎలా ముడివడివున్నవో ఆయన వివరించి చెప్పారు. కాని ఎక్కడ నుండి ప్రారంభించినా సనాతన ధర్మమైన హిందూమతాన్నీ, భారతదేశాన్నీస్పృశించకుండా ఆయన ప్రసంగం సమాప్తం కాదు. పాశ్చాత్య మత భావనల లోను, సామాజిక జీవన స్రవంతిలోను హిందూమత ప్రభావం ఏ మేరకు ఉందో వారు విశదీకరించి చెప్పారు. శ్రీరామకృష్ణుల జీవితం ఎలా కాలావశ్యకతను ఈడేర్చేలా రాణించిందో ఆయన విపులీకరించి తెలిపారు.
గిర్నార్
జునాగఢ్ నుండి రెండు మైళ్ళ దూరంలో గిర్నార్ ఉంది. ఇది హిందూ, బౌద్ధ, జైన మతస్థుల పుణ్యక్షేత్రంగా విరాజిల్లింది. ఇది పది పర్వతాల శ్రేణి.వీటిలో అతి ఎత్తైనది గోరఖ్‌నాథ్ శిఖరం. దీని ఎత్తు 3600 అడుగులు. ఈ శిఖరాగ్రాన్ని చేరడానికి పర్వతంలో పదివేలకు పైగా మెట్లు చెక్కబడివున్నాయి. ఈ పర్వతాలలోని ఒక గుహలో ఉండి సాధనల్ని అనుష్ఠించారు స్వామీజీ. జునాగఢ్ దివాన్ ఒక మిత్రుణ్ణి పంపి స్వామీజీ అవసరాలను చూశాడు.
కొన్ని రోజులు అక్కడ గడిపిన తరువాత స్వామీజీ జునాగఢ్‌కు తిరిగి వచ్చారు. అక్కడే ఉండి సమీపంలోని పుణ్యక్షేత్రాలు సందర్శించారు.
సోమనాథ్‌లో
తదనంతరం ప్రభాసతీర్థంగా పురాణాలలో ఖ్యాతిగాంచిన సోమనాథ్‌కు వెళ్లారు స్వామీజీ. శ్రీకృష్ణుని కాలంలోనే యాదవకులస్థులు పరస్పరం కొట్టుకొని మృతిచెందడమూ, యోగస్థితిలో ఆసీనుడైన కృష్ణుడు వేటగాని బాణంతో తమ ఇహజీవితానికి స్వస్తి చెప్పిందీ ఇక్కడే. ఇక్కడ వెలసిన శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయం మూడు సార్లు పరాయివారిచే ధ్వంసం గావించబడి మళ్లీ నిర్మించబడింది. స్వామీజీ కాలంలో ఉన్న దేవాలయం ఇండోర్ రాణియైన అహల్యాబాయిచే నిర్మించబడింది.* ఈ ఆలయంలో స్వామీజీ ఆరాధించారు. మూడు నదుల సంగమ స్థానంలో ఆయన స్నానమాచరించారు. ఇక్కడ కచ్ రాజును కలుసుకొని పలుమార్లు సుదీర్ఘంగా సంభాషించారు. స్వామీజీ బహుముఖ ప్రజ్ఞాపాటవాలను చూసి రాజు ఆశ్చర్య చకితుడయ్యాడు: “స్వామీజీ! అనేక గ్రంథాలు పఠిస్తే తల తిరిగిపోతుంది కదా! అట్లే మీ ప్రసంగాలు విన్నా నా తల గిర్రున తిరిగిపోతున్నది. ఇంత జ్ఞానాన్నీ, ఇన్ని ప్రతిభలను ఎలా ఉపయోగించబోతున్నారు? స్వామీజీ, ఒక విషయం చెబుతాను; అనుపమానమైన కొన్ని కార్యాలను సాధించకుండా మీరు విశ్రమించరు” అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో మహారాజు. అంతా విని స్వామీజీ మౌనంగా నవ్వారు.
మళ్లీ జునాగఢ్‌కు తిరిగి వచ్చిన స్వామీజీ, దానిని కేంద్రంగా చేసుకొని కథియవార్, కచ్ లాంటి చోట్లకు పలుమార్లు వెళ్లివచ్చారు. చివరగా అక్కణ్ణుండి పోరుబందర్ బయలుదేరారు.
పోరుబందర్లో
శ్రీకృష్ణుని బాల్యస్నేహితుడుగా విరాజిల్లిన కుచేలుడు (సుదాముడు) జీవించిన ఊరు పోరుబందర్. భాగవతపురాణం సుదామాపురి అని ఈ ఊరిని పేర్కొంటు న్నది. కుచేలుని పేరిట ప్రాచీన దేవాలయం ఒకటి ఇక్కడ ఉంది. స్వామీజీ ఆ ఆలయంలో ఆరాధించారు. ఆ సంస్థాన దివానయిన శంకర్ పాండురంగ స్వామీజీ పట్ల ఎంతో ఆకర్షితుడైనాడు. గొప్ప వేదపండితుడైన ఆయన ఆ సమయంలో వేదాలను అనువదిస్తున్నాడు. స్వామీజీకి గల అపార శాస్త్రజ్ఞానం చూసి దివాన్ పలు సమయాల్లో తన అనువాదానికి స్వామీజీ సహాయం కోరాడు. స్వామీజీ కూడా ఆనందంగా అక్కడ కొన్ని రోజులు బసచేసి దివాన్ అనువాద కార్యంలో సహాయం చేశారు. దానితోపాటు, ఇక్కడపాణిని సూత్రాలను, పతంజలి మహభాష్య అధ్యయనాన్నీ పూర్తిచేశారు.
పాండురంగ సంస్కృత పండితుడేకాక, ఎంతో రాజకీయ పరపతీ, అంతస్తూ ఉన్న వ్యక్తి. యుక్తవయస్కుడు కాని ఒక బాలుడు రాజుగా అభిషిక్తుడవడం వలన పరిపాలన అస్తవ్యస్త స్థితిలో పడిపోయింది. కనుక ఆంగ్ల ప్రభుత్వం పాండురంగకు నిర్వహణా బాధ్యతను అప్పగించింది. ఆయన సంస్థానాన్ని సమర్థంగాపాలించడంతో పాటు, కొన్ని ఐరోపా దేశాలనూ సందర్శించి వచ్చాడు. ఆ సందర్శనాల వలన ఫ్రెంచ్, జర్మన్ లాంటి కొన్ని ఐరోపా భాషలను కూడా నేర్చుకోగలిగాడు. తన మాతృభాషయైన మరాఠీ కాక ఏడు భాషలు ఆయనకుతెలుసు. ఆయనకు సొంతంగా ఒక పెద్ద గ్రంథాలయం ఉంది. ఎక్కువ సమయంగ్రంథాలయంలో ఆయన వెచ్చించేవాడు. ఆ గ్రంథాలయం స్వామీజీని ఎంతగానో ఆకర్షించింది. అందు నిమిత్తమే మళ్లీ ఆయన ఇక్కడకు వచ్చారు. ఇష్టమైనన్నిరోజులు ఉండడానికీ, గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవడానికీ స్వామీజీకిమనఃస్ఫూర్తిగా పాండురంగ అనుమతి నిచ్చాడు.
పిల్లలతో
పాండురంగకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఒక రోజు వారందరితోపాటు స్వామీజీ సముద్రతీరానికి వెళ్లారు. ముగ్గురు బాలికలూ ఇసుకలో ఇల్లు కట్టి, చప్పట్లు కొట్టి పాడుతూ దాని చుట్టూ తిరుగుతూ ఆడుకొంటున్నారు. స్వామీజీ కూడా వారితోపాటుచప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతూ ఆనందించారు. ఆ తరువాత ఇద్దరుబాలురను తమ భుజం మీద ఎత్తుకొని, పడవలో కాస్తదూరం నీటిలోకి పోయి, అక్కడ వారికి ఈదడం నేర్పించారు. దివాన్‌తో చాలాసేపు గుర్రపు స్వారీ చేశారు.ఆయన భార్యకు క్రొత్త క్రొత్త వంటకాలు చేయడం నేర్పించారు.
మళ్లీ ఒక స్మృతి
అనువాదపు పని కారణంగా స్వామీజీతోపాటు మాట్లాడేకొద్దీ ఆయన ప్రగాఢజ్ఞానం, నూతన భావాలు చూసి దివాన్ ఆశ్చర్యచకితుడయ్యాడు. ఒక రోజు, “స్వామీజీ! మన దేశంలో మీరు గొప్పగా ఏదో సాధించ గలరని నాకు అనిపించడంలేదు. మీ భావనలను ఏదో కొద్ది మంది స్వీకరించవచ్చు. మీరు పాశ్చాత్య దేశాలను సందర్శిం చాలి. అక్కడి ప్రజలు మిమ్మల్ని అర్థంచేసుకొంటారు; మీ మహత్త్వాన్ని గ్రహిస్తారు. శాశ్వతమైన మన సనాతనధర్మాన్ని అక్కడ బోధించడం ద్వారా పాశ్చాత్య సంస్కృతిపై మీరొక మహోజ్జ్వలకాంతిని ప్రసరింపజేయగలరు. నేను పాశ్చాత్య దేశాలను సందర్శించాను, పలువురు మేధావులను కలుసుకొన్నాను. వారు హైందవశాస్త్రాలను, హైందవ తత్త్వాలను తెలుసుకోవడానికి ఎంతో ఆతురతతో ఉన్నారు. మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్లి, మన వేద సంప్రదాయం గురించి వారికినొక్కివక్కాణిస్తే అదొక మహత్కార్యమవుతుంది.” అన్నాడు. అందుకు స్వామీజీ, “ఇల్లూవాకిలీ లేని సన్న్యాసిని నేను. నాకు ఈ దేశం ఏమిటి! ఆ దేశం ఏమిటి!అవసరమయితే నేను వెళతాను. అది ఎలా సాధ్యమో కూడా నాకు తెలియదు” అన్నారు నిబద్ధంకాని రీతిలో. తరువాత దివాన్, “స్వామీజీ! మీరు ఫ్రెంచి భాషనేర్చుకోవాలి. అది మీకు ఉపయోగపడుతుంది” అన్నారు. దాంతో స్వామీజీ అక్కడే ఫ్రెంచి భాష నేర్చుకోవడం ప్రారంభించారు. అక్కడ నుండి ఆలంబజార్ మఠంలోని* తమ సోదర సన్న్యాసులకు ఫ్రెంచి భాషలో ఒక ఉత్తరం వ్రాశారు.
స్వామీజీ వ్యాకులత
పాండురంగ మాటలు స్వామీజీ హృదయంతరాళాలలో ఏదో ఒక పోగునులాగినట్లనిపించింది. ఏదో తెలియని ఒక వ్యాకులతలో ఆయన మునిగిపోయినసమయమది. మాతృదేశమైన భారతదేశానికి ఏదైనా చేయాలి. ఏదైనా అంటే ఆధ్యాత్మిక పునరుజ్జీవనమే. దానిని ఎలా చేయాలి? వెళ్లిన చోట్లల్లా రెండు సరిహద్దులను ఆయన చూశారు. ఒక వైపు కొన్ని క్రతువులను, సంప్రదాయాలను, స్థానిక ఆచారాలను గట్టిగా పట్టుకొని, ‘ఇదే మతం, ఇదే ఆధ్యాత్మికత’ అనే అజ్ఞానాంధకారంలో మునిగివున్న పూర్వాచార పరాయణులు. మరో వైపు మతాన్ని సంస్కరించబోతున్నామని చెప్పుకొంటూ అనవసరమైన పాశ్చాత్య సంస్కృతిని ప్రక్షిప్తంచేసి, భారతదేశవారసత్వ సంస్కృతినే భ్రష్టుపట్టిస్తున్న సంఘసంస్కర్తలు. ఈ రెండు బృందాలూ నిర్మాణాత్మకంగా ఏమీ సాధించలేకపోయాయని స్వామీజీ గ్రహించారు. కనుకనిర్మాణాత్మకమైన ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కలిగించడానికి తాను ఒక నూతన పథాన్ని ఆవిష్కరించాలి.
ఆ పునరుజ్జీవన మేది?
నిజమైన మతాన్ని ఆవరించుకొనివున్న మలినాలయిన అనవసర క్రతువులు, సంప్రదాయాల లాంటి వాటిని అంటిపెట్టుకొని ప్రగతినీ, మార్పులనూ త్రోసి రాజన్న పూర్వాచారపరాయణత్వం ఎంతమాత్రం కాదు పునరుజ్జీవనం అన్నది; అంతేగాక వికాసం పేరిట నిజమైన సనాతన ధర్మాన్నే కూకటివ్రేళ్లతో పెకలించివేయడమూ కాదు. చేయవలసిందంతా నిజమైన మతాన్ని ఆవరించుకొనివున్న మలినాన్ని పూర్తిగా తొలగించి దానిని పండితుడు – పామరుడు, స్త్రీ–పురుషుడు, యువకుడు – వృద్ధుడు, పేదవాడు – ధనికుడు అనే తారతమ్యం లేకుండా అందరికీ అందించడమే. స్వామీజీ దృష్టిలో ఇదే అసలైన సంస్కరణ, పునరుజ్జీవనం.
సమాజం తమ భావనలను స్వీకరించే పరిపక్వ స్థితిలో ఉందా అనే సంశయం స్వామీజీకి కలుగకపోలేదు. తమ భావనలను పలువురు మహారాజుల, దివానుల, పండితుల, ప్రముఖుల ముందు వెలిబుచ్చారు స్వామీజీ. వారిలో అనేకులు వాటిని స్వీకరించారు. కాని నాటి సమాజ స్థితి అందుకు భిన్నంగా ఉంది. ఏది చెప్పినా పాశ్చాత్యుడే చెప్పాలి, ఆతడు చెప్పిందే వేదం, ఆతడు చేసేదే సరియైనది, అదే శ్రేష్ఠమైనదని ప్రజలు గుడ్డిగా నమ్మిన కాలం అది. కనుక తమ భావనలు కూడా పాశ్చాత్యం నుండి దిగుమతి అయ్యేపక్షంలో వాటికి ఆదరణా, ఆమోదమూ ఎక్కువగా ఉంటాయి; ఆ భావనలు సత్వరమే వ్యాప్తి చెందడానికి అది దోహదం చేస్తుందని ఆయనకు తోచింది. కాబట్టి తాము పాశ్చాత్యదేశాలు వెళ్లడం అవసరమనే యోచన ఆయనలో బలపడసాగింది. కాని ఆయన భగవంతునికి పూర్తిగా ఆధీనుడై జీవిస్తున్న ఒక సన్న్యాసి. కనుక కాలం కలసివచ్చి తగిన త్రోవ భగవంతుడే చూపించే దాకా వేచివుండాలని నిర్ణయించుకొన్నారు.
ఒక రోజు వేకువ జామున స్వామీజీ సముద్ర తీరానికి వెళ్లారు. కనుచూపు మేర వరకు విస్తరించివున్న ఆ నీలి జలార్ణవంలో అక్కడక్కడ తెల్లని అ లలు ఉవ్వెత్తున లేచి దోగాడుతున్నాయి. వాటిని ప్రశాంతంగా స్వామీజీ చూస్తూవుండి పోయారు. అప్పుడు హఠాత్తుగా ఆయన మనస్సులో, ‘నేను కూడా అ లలతో నిండివున్న ఈ సముద్రాన్ని దాటి ఎక్కడో సుదూర దేశానికి వెళ్లితీరాలి’ అనే ఆలోచన మెదలింది. క్షణ మాత్రం ఆలోచించి స్వామీజీ సమస్తం భగవంతునికి అర్పించి లేచి నడవసాగారు.
‘లోకాన్ని ఉర్రూతలూగించే శక్తి నాలో ఉంది’
పోరుబందర్లో త్రిగుణాతీతను* స్వామీజీ కాకతాళీయంగా కలుసుకోవడం జరిగింది. బలూచీస్థాన్* ఎడారి గుండా ఒక సాధువుల బృందంతో ఒక పుణ్య క్షేత్రానికి త్రిగుణాతీతానంద వెళుతున్నారు. కాని ముందుకు వెళ్లేకొద్దీ ప్రయాణం మరీ శ్రమతో కూడివున్నదవడంతో ఒంటె మీద స్వారీ చేస్తూ వెళ్లాలనుకొన్నారు వారు. కాని పైకం లేదు. అప్పుడు పోరుబందర్ ప్రభుత్వ నిర్వాహకుడయిన పాండురంగ గురించి విన్నారు. ఆంగ్లం మాట్లాడే సన్న్యాసి ఒకరు ఆయనకు అతిథిగా ఉన్నారనీ, పాండురంగ ఆయన పట్ల ఎంతో మర్యాదామన్ననలు చెల్లిస్తున్నారనీ తెలుసుకొన్న ఆ సన్న్యాసి బృందం ఆ సన్న్యాసి ద్వారా పాండురంగ నుండి ఆర్థిక సహాయం పొందాలని నిర్ణయించింది. ఆ బృందంలో ఆంగ్లం తెలిసిన ఏకైక సన్న్యాసి త్రిగుణాతీతానంద. కనుక ఆయనను ఆ ఆంగ్లం మాట్లాడే సన్న్యాసిని కలుసుకోమని వారు అడిగారు.
ఆంగ్లం మాట్లాడే సన్న్యాసి అన్నప్పుడే త్రిగుణాతీతానందకు ఆయన స్వామీజీ అయివుంటారేమోనన్న సందేహం రాకపోలేదు. అందరూ కలసి ఆంగ్లం మాట్లాడే ఆ సన్న్యాసిని కలుసుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో పాండురంగ భవనంమేడ మీద స్వామీజీ పచార్లు చేస్తున్నారు. దూరం నుండి త్రిగుణాతీతను చూడగానే స్వామీజీ అమితానందం పొందారు. అయినప్పటికీ ఆయన తన వద్దకు వచ్నినప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తూ, “నన్ను వెంబడించి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా వినవేం!” అన్నారు. కాని స్వామీజీని చూడడంలో త్రిగుణాతీతానంద పరమానంద భరితుడ య్యాడు. స్వామీజీ కోపాన్ని పట్టించుకోకుండా పరిస్థితిని విడమరచి చెప్పాడు. “నేను ఎవరినీ ఆర్థిక సహాయం చేయమని అడగను. ఒక సన్న్యాసి డబ్బు అడగడం సబబు కాదు. విధి నడిపించే మార్గంలో వెళ్లడమే ఆతడి ధర్మం” అని నిష్కర్షగా స్వామీజీ చెప్పేశారు. విచారంతో తలదించుకొని త్రిగుణాతీతానంద వెనుదిరిగాడు.
అదంతా ఒక్క క్షణమే! స్వామీజీ తమను తాము అదుపులో ఉంచుకోలేక పోయారు. త్రిగుణాతీతను మళ్లీ పిలిచారు. ఇద్దరూ ఏకాంతంలో చాలాసేపు ముచ్చటించుకొని ఆనందించారు; దక్షిణేశ్వర జ్ఞాపకాలలో మునిగిపోయారు. అప్పుడు స్వామీజీ ఇలా అన్నారు: “శారదా! గురుదేవులు నన్ను గురించి అనేక విషయాలు ప్రస్తావించే వారే! వాటిని ఇప్పుడిప్పుడే అర్థంచేసుకోనారంభించాను. లోకాన్నే ఉర్రూతలూగించే అపరిమిత శక్తి నాలో నెలకొని ఉన్నదని ఇప్పుడు నేను నిజంగా గ్రహిస్తున్నాను.”
తరువాత త్రిగుణాతీతానందకూ, తక్కిన సన్న్యాసులకూ అవసరమైన ఆర్థిక సహాయం అందేలా స్వామీజీ ఏర్పాటుచేశారు.
వదలి పెట్టకుండా వెంబడించే అఖండానంద
పోరుబందర్ నుండి స్వామీజీ ద్వారక వెళ్లారు. మధురాపురి ప్రజానీకాన్ని జరాసంధుడి దండయాత్రల నుండి కాపాడడానికి కృష్ణుడు సముద్ర మధ్యంలో నిర్మించిన నగరం అది. కాని ఆనాటి ద్వారక నామరూపాలు లేకుండా పోయింది. అది వెలసి ఉండిన చోట ప్రస్తుతం సముద్రపు అ లలు ఉవ్వెత్తున లేచిపడుతున్నాయి. ఆదిశంకరులు స్థాపించిన శారదామఠంలో స్వామీజీ బసచేశారు. కొన్ని రోజులు అక్కడ గడపికచ్చ్ మహారాజు ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లారు.
“మీరు పాతాళానికి వెళ్లినా అక్కడ కూడా మిమ్మల్ని వెంబడిస్తాను” అని జైపూర్‌లో చెప్పి వెళ్లిపోయిన అఖండానంద స్వామీజీని అనుసరిస్తూనే ఉన్నాడు. ఆయన ద్వారక వచ్చినప్పుడు స్వామీజీ మహారాజు ఆహ్వానాన్ని మన్నించి కచ్చ్ ప్రాంతంలోని మాండ్వీ అనే చోటికి వెళ్లారని తెలిసింది. అఖండానంద మాండ్వీ చేరేసరికి స్వామీజీ నారాయణ సరోవరానికి బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. వెంటనే అక్కడకు బయలుదేరాడు. ఆ దారి బందిపోటు దొంగల ఆలవాలం. అయినప్పటికీ స్వామీజీని కలుసుకోవాలనే ఉత్సుకతతో తెగించి బయలు దేరాడు. దారిలో బందిపోట్లు ఆయనను చితకబాది దోచుకొన్నారు. ఇంత దురవస్థకు గురియైనప్పటికీ ఇంకా అనేక చోట్ల స్వామీజీని వెంబడించి చివరికి మాండ్వీలో భాటియా అనే వ్యక్తి ఇంట్లో స్వామీజీ బసచేసివున్నారని తెలుసుకొని, అఖండానంద అక్కడకు వెళ్లాడు. అఖండానందను చూడగానే స్వామీజీ ఆనందించారు; జైపూర్ నుండే తనను ఆయన వెంబడిస్తూ రావడమూ, బందిపోట్లు కొట్టడమూ విని స్వామీజీ చలించిపోయారు. అయినప్పటికీ ఒంటరిగా వెళ్లాలనే అభిలషించారు. “ఇదుగో చూడు గంగా! నాకంటూ పనులున్నాయి. నువ్వు నాతో కలసివుంటే నేను వాటిని నిర్వర్తించలేను” అంటూ తాను ఒంటరిగా వెళ్లాలనే తన అభిలాషను వ్యక్తంచేశారు. కాని స్వామీజీతో పాటు వెళ్లాలని అఖండానంద గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఎలాగైనా ఆతణ్ణి ఆ ప్రయత్నం నుండి ఆపించాలనే ఉద్దేశంతో స్వామీజీ, “ఇలా చూడు, నేను నిజంగా చెడిపోయాను. అందుకే నిన్ను నాతో రావద్దంటున్నాను” అన్నారు. కాని అవన్నీ నమ్మే వ్యక్తా అఖండానంద! “అయితే ఏమిటి? మీరు చెడిపోయి ఉంటే అది ఏ విధంగా నాపై దుష్ప్రభావం చూపుతుంది? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు సజ్జనులైనా, దుర్జనులైనా దాన్లో ఎలాంటి మార్పూ లేదు. పోనీలెండి. నేను మీ కార్యానికి అడ్డంగా నిలబడ దలచుకోలేదు. మిమ్మల్ని చూడాలనే తీరని తపన నన్ను మథించివేసింది. అది ఇప్పుడు ఈడేరింది. ఇక మీరు ఒంటరిగానే వెళ్లవచ్చు” అన్నాడు అఖండానంద. ఆతడి అవ్యాజ ప్రేమ, విశ్వాసమూ చూసి స్వామీజీ కంట తడిబెట్టారు.
అఖండానంద పట్టుదలకు ప్రేమాభిమానాలే కారణమని చెప్పలేం. ఇద్దరూ బయలుదేరుతున్నప్పుడు మాతృదేవి స్వామీజీని కంటికి రెప్పలా చూసుకోమని చెప్పడం కూడా ఆతడు సదా స్వామీజీని అనుసరించడానికి ఒక కారణమని అనుకోవచ్చు.
మర్నాడు స్వామీజీ భుజ్ బయలుదేరారు. ఆ మర్నాడు ఆఖండానంద కూడా బయలుదేరి ఆయనను భుజ్‌లో కలుసుకొన్నారు. అప్పుడు స్వామీజీ ఆతడితో ఇలా అన్నారు: “మనం ఎక్కువ రోజులు ఇక్కడ బస చేయకూడదు. మహారాజు మనలను బాగా చూసుకొంటున్నాడు. కాని ఇదంతా చూసి ఇతరులు మనం ఆయనను అంటిపెట్టుకొని సుఖభోగాలు అనుభవిస్తూన్నమని భావిస్తారు. రేపే మనం ఇక్కడ నుండి బయలుదేరిపోవాలి.” అనుకొన్నట్లే మర్నాడు ఇద్దరూ బయలుదేరారు. ఇద్దరూ విడివిడిగా ప్రయాణం చేసినప్పటికీ దారిలో ఒకటి రెండు చోట్ల స్వామీజీని అఖండానంద కలుసుకోవడం తటస్థించింది.
భుజ్ నుండి బయలుదేరిన స్వామీజీ మాండ్వీ మీదుగా పోరుబందర్ తిరిగి వచ్చి పాండురంగ ఇంట్లో బసచేశారు. ఈసారి స్వామీజీ సంస్కృతంలో సంభాషించడానికి శిక్షణ పొందారు. తరువాత అక్కణ్ణుండి జునాగఢ్ మీదుగా గుజరాత్‌లోని పాలిటానా చేరుకొన్నారు.
పాలిటానాలో
పాలిటానాలోని శత్రుంజయ పర్వతం జైనులకు అత్యంత పవిత్రమైన స్థలం. ఆ పర్వతం మీద పలు దేవాలయాలు ఉన్నాయి. వాటిలో హనుమంతుని ఆలయమూ, హెంగర్ అనే మహమ్మదీయ మహాత్ముని సమాధీ చాలా ఖ్యాతిగాంచినవి. స్వామీజీ పర్వత శిఖరం మీదికెక్కి ఆలయాలను దర్శించుకొన్నారు. ప్రకృతి శోభను ఆస్వాదించారు. పలు చోట్ల పాడారు, సంగీత వాద్యాలు కూడా వాయించారు.
పాలిటానా నుండి నాడియాడ్‌కు వెళ్లిన స్వామీజీ అక్కడ దివాన్ ఇంట్లో బస చేశారు. అక్కడున్న గ్రంథాలయానికి వెళ్లి రవివర్మ తైలవర్ణచిత్రాలను చూసి ఆనందించారు.
అక్కణ్ణుండి ఆయన బరోడా వెళ్లారు. అప్పటికే పరిచయమైన లింబ్డీ మహారాజు జస్వంత్‌సింగ్ దక్షిణ మహారాష్ట్రలోని పర్వతవాస స్థలమైన మహాబలే శ్వర్ వచ్చినట్లు తెలిసి, అక్కడకు వెళ్లారు. అక్కడ మహారాజుతో పాటు దాదాపు రెండున్నర నెలలు బసచేశారు. ఆయనతో శాస్త్రచర్చలు జరిపారు. అక్కణ్ణుండి స్వామీజీ బయలుదేరడానికి సిద్ధమయినప్పుడు మహారాజు, “స్వామీజీ! నాతో పాటే వచ్చి లింబ్డీలోనే శాశ్వతంగా ఉండిపోండి” అని వేడుకొన్నాడు. స్వామీజీ చిన్నగా నవ్వుతూ, “ప్రస్తుతం అది సాధ్యం కాదు, మహారాజా! నేను నిర్వర్తించవలసిన కార్యం ఉంది. విశ్రాంతి అన్నది నా కిప్పుడు లేదు. నా జీవితంలో విశ్రాంతి అనే రోజులు రాసిపెట్టివుంటే అప్పుడు వచ్చి మీతో ఉంటాను” అన్నారు.
1892 జూన్‌లో స్వామీజీ ఖాండ్వా చేరుకొన్నారు. అక్కడ హరిదాస్ బాబు అనే న్యాయవాది ఇంట్లో బసచేశారు. అక్కణ్ణుండి ఇండోర్ వెళ్లి వచ్చారు. ఇండోర్ రాణియైన అహల్యాబాయి స్మృతి చిహ్నాలను సందర్శించారు.
బహిరంగ ప్రసంగాల వలన ప్రయోజనం శూన్యం
ఖాండ్వాలో స్వామీజీ బహిరంగ ఉపన్యాసం ఒకటి ఏర్పాటుచేయాలని హరిదాస్ అనుకొన్నాడు. స్వామీజీ అందుకు ఇష్టపడలేదు. “బహిరంగ ఉపన్యాసాల వలన ప్రయోజనం శూన్యం. మన వారసత్వమైన గురుశిష్య పరంపర రీతితో కూడిన బోధనే శ్రేష్ఠమైనది. ఇందులో విద్యార్థి గురువును ప్రత్యక్షంగా కలుసుకోవచ్చు; ఆయన ప్రేమకు పాత్రుడు కావచ్చు. వారి మధ్య తండ్రి – తనయుల సంబంధం ఏర్పడుతుంది. అటువంటి బోధన వలన మాత్రమే ప్రయోజనం ఉంటుంది” అని స్వామీజీ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ హరిదాస్ బలవంత పెట్టినప్పుడు స్వామీజీ ఇలా అన్నారు: “మీరు ఇంతగా అడుగుతున్నప్పుడు నేను కాదనలేకపోతున్నాను. కాని ఇంతవరకు నేను వేదిక మీద ఉపన్యసించింది లేదు. వేదిక మీద ఆరోహణ అవరోహణలకు అనుగుణంగా ఎలా కంఠస్వరాన్ని మార్చుకోవాలో నాకు తెలియదు. అయినప్పటికీ నా ప్రసంగం వినడానికి అనేకులు ఉత్సుకతగా ఉన్నారంటే నేను ప్రసంగిస్తాను. ఉత్సుకతగలవారు పలువురు ఉంటే ఉపన్యాసకుని ప్రతిభ చక్కగా వెల్లడవుతుంది.” కాని కారణాంతరాల వలన ఆ బహిరంగ ఉపన్యాసం జరగలేదు.
చికాగో గురించి
ఖాండ్వాలో ఉన్నప్పుడు అమెరికాలోని చికాగోలో జరుగనున్న సర్వమత మహాసభను గురించిన అభిప్రాయాలు మరింత స్పష్టమయ్యాయి. దానిని గురించి కథియవార్‌లో ఆయన విన్నారు. ఇప్పుడు ఆ మహాసభ గురించి మరిన్ని వివరాలు తెలిసినప్పుడు ఆయన హరిదాస్‌తో, “నా ప్రయాణపు ఖర్చులను ఎవరైనా భరించి, తక్కిన విషయాలు కూడా సానుకూలంగా జరిగితే నేను అక్కడకు వెళతాను” అన్నారు.
ఖాండ్వాలోనే ఇంకా చాలా రోజులు స్వామీజీని ఉండమని హరిదాస్ వేడు కొన్నాడు. అందుకు స్వామీజీ, “మిత్రమా! ఉండాలనే ఉంది. నేను వచ్చిన మార్గంలో ప్రతి ఒక్కరూ నా పట్ల ఎనలేని ప్రేమాభిమానాలను చూపించారు. కాని రామేశ్వరం వెళ్లాలని సంకల్పించుకొన్నాను. ఇలా ప్రతి చోటా చాలాకాలం గడిపితే నేను రామేశ్వరం వెళ్లలేను” అన్నారు. అక్కణ్ణుండి బొంబాయిలోని ప్రసిద్ధ న్యాయ వాదియైన సేట్ రామ్‌దాస్ ఛాబిల్దాస్ను కలుసుకోవడానికి పరిచయ పత్రంతో స్వామీజీ బయలుదేరారు. బయలుదేరుతున్నప్పుడు హరిదాస్, “స్వామీజీ! ఈ న్యాయవాది మీకు సహాయపడతారని ఆశిస్తున్నాను. నిజంగానే మీకు ఉజ్జ్వలమైన భవిష్యత్తు ఉంది” అన్నాడు. “ఉండవచ్చు. దాని గురించి తెలియదు. కాని నా జీవితంలో అనేక అసాధారణ కార్యాలు జరుగుతాయని నా గురుదేవులు చెప్పి వున్నారు” అని నొక్కివక్కాణించి రైలులో బొంబాయి బయలుదేరారు.
గత జన్మలో బౌద్ధుడు
1892 జూలై మాసాంతంలో స్వామీజీ బొంబాయి చేరుకొన్నారు. రామ్‌దాస్ ఛాబిల్దాస్ ఇంట్లో ఆయన బసచేశారు. అక్కడ వేదాధ్యయనం ప్రారంభించారు. అక్కడికి 20 మైళ్ల దూరంలో ఉన్న అందమైన సాల్సెట్ దీవిని సందర్శించి కన్హేరీ గుహలు తిలకించి ఆనందించారు. బౌద్ధ కాలపు ప్రారంభంలో బౌద్ధభిక్షువులు నివసించిన గుహలు అవి. అక్కడ మొత్తం 109 గుహలున్నాయి. బుద్ధఘోషుడు తమ శిష్యులతో అక్కడ నివసించి, పిదప శ్రీలంక, బర్మా వెళ్లినట్లు చెప్పబడుతున్నది.
స్వామీజీ కాలంలో ఈ గుహలు బయటి ప్రపంచానికి అంతగా తెలియవు. స్వామీజీ అక్కడకు వెళ్ళినప్పుడు ఆయనకి గతజన్మ జ్ఞాపకాలు గుర్తుకి వచ్చినట్లు సదానంద వచించారు: “స్వామీజీ అమెరికాకు వెళ్లడానికి ముందు పశ్చిమ భారతదేశంలో పర్యటించారు. అప్పుడు కన్హేరీ గుహలను సందర్శించారు. ఆ స్థలం ఆయనను అమిత పారవశ్యంలో ముంచెత్తింది. గతజన్మలో తాము అక్కడ జీవించినట్లు స్వామీజీ గ్రహించారు. ఆ గుహల ఉనికి ఆ రోజుల్లో పెద్దగా ఎవరికీ తెలియదు. అయినప్పటికీ స్వామీజీ వాటి గురించి తెలుసుకొని అక్కడకు వెళ్లారు. భవిష్యత్తులో ఆ గుహలను కొనుగోలుచేసి, వాటిని తమ భవిష్య కార్యంలో ఒక కేంద్రంగా రూపొందించాలని ఆయన ఆశించారు.”
కన్హేరీ గుహల లాంటి గుహలను నిర్మించడానికికూడా స్వామీజీ ప్రణాళిక రూపొందించారు. స్వామీజీ పాశ్చాత్య శిష్యురాలయిన సోదరి క్రిస్టైన్ ఇలా వ్రాసింది: “మూడు వైపులా సముద్రంతో ఆవృతమైన ఒక దీవిని ఎంపిక చేయాలి. ఇద్దరికి మాత్రమే నివాసయోగ్యమైన చిన్నచిన్న గుహలను అక్కడ నిర్మించాలి. గుహల మధ్య స్నానార్థం నీటితో నిండివున్న అందమైన కొలనులు ఉంటాయి. త్రాగు నీరు ప్రత్యేక గొట్టాల ద్వారా అన్ని గుహలకు సరఫరా చేయబడుతుంది. అందరూ సమావేశమై ప్రార్థనలు జరుపుకోవడానికి అనువయిన శిలలు మలచ బడిన స్తంభాలతో కూడుకొన్న ప్రార్థనా మందిరం ఒకటి ఉంటుంది. పూజకంటూ విడిగా ఒక వేదిక ఉంటుంది – ఇటువంటి చోటు లభిస్తే ఎంత బాగుంటుంది అని స్వామీజీ కలగన్నారు.” ప్రణాళిక గురించి వివరిస్తున్నప్పుడు ఆయన మనస్సులో మెదలినవి కన్హేరీ గుహలే అని క్రస్టైన్ వ్రాసింది.
తిలక్‌తో
బొంబాయిలో రెండు నెలలు గడిపిన తరువాత స్వామీజీ మళ్లీ పూనా వెళ్లారు. బొంబాయి రైలు నిలయంలో ఆయన లోకమాన్య బాలగంగాధర తిలక్‌ను కలుసుకొన్నారు. తిలక్ విఖ్యాత విద్వాంసుడు, దేశభక్తుడు. తిలక్ కూడా స్వామీజీతో పూనా వెళ్లారు. ఆయన వద్ద స్వామీజీ పది రోజులు బసచేశారు. తిలక్‌తో అద్వైతం గురించీ, వేదాంతం గురించీ స్వామీజీ దీర్ఘంగా చర్చించారు. ఇతరు లెవరితోను ఆయన సన్నిహితంగా మెలగలేదు. ‘దక్కన్ క్లబ్’ అనే సంఘంలో తిలక్ సభ్యుడు. ప్రతి వారమూ సభ్యులందరూ సమావేశమై చర్చించుకోవడం కద్దు. అటువంటి ఒక సమావేశా నికి స్వామీజీని తిలక్ తోడ్కొని వెళ్లారు. ఆ రోజు కాశీనాథ్ గోవిందనాథ్ అనే వ్యక్తి తత్త్వశాస్త్రం గురించి ప్రసంగించాడు. అందరూ దానిని యథాతథంగా స్వీకరించారు. కాని స్వామీజీ లేచి నిలబడి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం తత్త్వంలోని ఒక పక్షానికి చెందినదేనని ఎత్తి చూపి, దాని మరో పక్షాన్ని అనర్గళ మైన ఆంగ్లంలో వివరించి చెప్పారు. స్వామీజీ అపార జ్ఞానసంపత్తి అందరినీ ఆకట్టుకొన్నదని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
ఈ సంఘటనానంతరం స్వామీజీని కలుసుకోవడానికి అనేకులు రాసాగారు. వారితో ఆయన గీత, ఉపనిషత్తుల గురించి కూలంకషంగా చర్చించారు. కాని ఆయనకు జనం గుమిగూడడం నచ్చలేదు. కనుక ఒక రోజు తిలక్ మహాశయు నితో, “నేను రేపు బయలుదేరుతాను” అన్నారు. మర్నాడు చెప్పినట్లే ఎవరూ నిద్రలేవక ముందే వెళ్లిపోయారు. తిలక్‌తో తనెవరయిందీ స్వామీజీ వెల్లడించ లేదు. తిలక్ స్వామీజీ గురించి కాలాంతరంలో ఇలా వ్రాశారు:
“స్వామీజీ నాతోబాటు ఎనిమిదో పదో రోజులు బస చేశారు. అప్పటికి ఆయన విశ్వవిఖ్యాతుడు కాలేదు. అది 1892. ఆయన నామధేయం ఏమిటని అడిగి నప్పుడు, ‘సన్న్యాసి’ అని మాత్రం చెప్పారు. ఆయన ప్రసంగాలు ఏవీ చేయలేదు. ఆయన అద్వైతం గురించీ, వేదాంతం గురించీ మాత్రమే మాట్లాడారు. ఇతరులతో కలసిమెలసి ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన వద్ద చిల్లిగవ్వ కూడా లేదు. ఒక జింకచర్మం, ఒకటి రెండు బట్టలు, ఒక కమండలం – ఇవే ఆయన ఆస్తి.”
సన్న్యాసులు నిష్ప్రయోజకులా?
పూనా నుండి స్వామీజీ మహాబలేశ్వర్ వెళ్లారు. మొదటి తరగతిలోనే ఆయన రైలు ప్రయాణాలు చేయడానికి అభిలషిస్తారు. మధుమేహ వ్యాధి కారణంగా స్వామీజీ తరచు మూత్రవిసర్జన చేయవలసివచ్చేది. అందుకు తగిన సౌకర్యాలు మొదటి తరగతిలో ఉండేవి. కనుక ఎవరైనా పైకం ఇవ్వడానికి ముందుకు వచ్చి నప్పుడు మొదటి తరగతి టికెట్ కొని ఇవ్వమనేవారు. ఇలా మహాబలేశ్వర్ బయలుదేరిన స్వామీజీ తమకు కేటాయించిన స్థలంలో కాళ్లు చాపుకొని నడుం వాల్చారు. ఆ పెట్టెలో పెద్ద మనుషులు కొందరు కూడా ప్రయాణం చేస్తున్నారు. వారిలో ఒకరిద్దరికి స్వామీజీ ఇలా నడుం వాల్చడం నచ్చలేదు. అందువల్ల ఆంగ్లంలో, “ఇటువంటి సన్న్యాసులే భారతదేశాన్ని సర్వనాశనం చేశారు” అంటూ వ్యాఖ్యానించ నారంభించారు. ఇదంతా పడుకొనే స్వామీజీ విన్నారు. కాని వారందరూ ఈ విషయాన్నే ఊక దంపుడుగా మాట్లాడుకొంటూ పోతూవుంటే ఇక స్వామీజీ సహించలేకపోయారు. ఠక్కున లేచి కూర్చుని, “ఏమిటి, ఏమంటున్నారు? సన్న్యాసులు భారతదేశాన్ని పాడుచేశారనా మీరు అంటున్నది! నిజానికి వారు భారతదేశాన్ని పరిరక్షించి, సజీవంగా నిలిపివుంచారు: బుద్ధుడు, శంకరుడు, చైతన్యాదు లందరూ ఎవరు? వీరందరూ మన దేశానికి ఏం చేశారో కాస్త యోచించి చూడండి” అన్నారు. ఆ తరువాత సన్న్యాసులు భారతదేశానికి అందించిన సేవలన్నింటిని చారిత్రక ఆధారాలతో వరుసక్రమంలో వివరించి చెప్పారు. ఆంగ్లంలో స్వామీజీ వాగ్ధాటి, వెలిబుచ్చిన భావనలు ఆ పెద్దమనుషులను ఆశ్చర్యచకితులను చేశాయి. ఆ తరువాత వారు పెదవి విప్పితే ఒట్టు!
విలపిస్తున్నప్పుడు అక్కున చేర్చుకొనే తల్లి
విలపించే బిడ్డకు స్వామీజీ ప్రేమమూర్తియైన తల్లిగా వ్యవహరించిన సంఘటన ఒకటి మహబలేశ్వర్‌లో జరిగింది. అక్కడ స్వామీజీ డాక్టర్ మోరో పంత్ విశ్వనాథ్ జోషీ అనే వ్యక్తి ఇంట్లో దాదాపు ఒక నెల రోజులు గడిపారు. అప్పుడు జోషీకి, కమల అనే రెండవ కుమార్తె పుట్టి ఆరేడు నెలలైంది. ఏదో కారణంగా కమల రాత్రి నిద్రపోకుండా ఎడతెగకుండా ఏడుస్తూవుంది. రాత్రంతా ఆ బిడ్డతోపాటు, తల్లి కూడా నిద్రలేకుండా బాధపడ్డారు. రెండు రోజులు ఇది గమనించిన స్వామీజీ ఆ బిడ్డ తల్లితో, “మీరు పగలంతా పనిచేస్తూ ఉంటారు. రాత్రి బిడ్డ కారణంగా విశ్రాంతి లేదు. కనుక రాత్రిళ్లు బిడ్డను నా వద్ద విడిచి పెట్టండి. నేను చూసుకొంటాను” అన్నారు. స్వామీజీ ఇంటికి వచ్చిన అతిథి, పైగా ఒక సన్న్యాసి కూడా. ఆయన వద్ద ఎలా బిడ్డను విడిచిపెట్టడమని ఆమె సంకోచించింది కాని స్వామీజీ బలవంతపెట్టి అందుకు సమ్మతింపజేశారు.
తరువాత ఏం జరిగిందో కమల సోదరియైన లక్షీబాయి రాజ్వాడే కాలాంతరంలో ఇలా చెప్పింది: “కమలను ఒడిలో ఉంచుకొని స్వామీజీ ధ్యాన మగ్నులయ్యారు. నిశ్చలంగా ఆమె నిద్రించింది. ఆయన కూడా రాత్రంతా ధ్యానం లోనే గడిపారు. ఒకటి కాదు, రెండు కాదు కొన్ని రోజులు ఇలాగే గడిచాయి.”
దీన్లో విచిత్రం ఏమిటంటే ఈ కమలే కాలాంతరంలో సాంగ్లీ రాజ్యానికి రాణి అయింది. ఆమె పేరు అప్పుడు సరస్వతీబాయి సాహీబా. ఒక రాణిగా ఆమె అనేక సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. “ఎన్నో విపరీత పరిణామాలలోనూ నా సోదరి మానసిక సమతౌల్యాన్ని కోల్పోకుండా వ్యవహరించింది. స్వామీజీ ఆశీస్సులే ఇందుకు కారణమనడంలో ఎలాంటి సందేహమూ లేదు.”
‘బంగారమూ వజ్రాలూ అవసరంలేదు’
మహాబలేశ్వర్ నుండి అక్టోబర్ 10 వ తేదీ ప్రాంతాన స్వామీజీ కొల్హాపూర్ వెళ్ళారు. కొల్హాపూర్ మహారాణికి చూపవలసిన పరిచయ పత్రం స్వామీజీ వద్ద ఉంది. స్వామీజీ వెళ్లిన సమయంలో మహారాణి అక్కడ లేదు. అప్పుడు నిర్వాహకుడుగా ఉన్న రావుసాహెబ్ లక్ష్మణరావు గోల్వాల్కర్ స్వామీజీని సాదరంగా ఆహ్వానించి, జన సంచారంలేని, దూరంగా ఉన్న ఒక ఇంట్లో ఆయనకు బస ఏర్పాటుచేశాడు. మహారాణి వచ్చిన తరువాత స్వామీజీని రాజప్రాసాదానికి తోడ్కొని వెళ్లారు. గొప్ప భక్తురాలయిన మహారాణి స్వామీజీకి పాదపూజ చేసింది. వెండి పళ్లెంలో బంగారం, వజ్రాభరణాలు, డబ్బు ఉంచి స్వామీజీకి సమర్పించింది. వాటిని చూసిన స్వామీజీ, “నేనొక సన్న్యాసిని. ఈ వజ్రవైడూర్యాలు నాకు నిష్ప్రయోజనం” అంటూ వినయంగా వాటిని తిరస్కరించారు. తరువాత మహారాణి మరీ బలవంతం చేసినప్పుడు రెండు కాషాయాంబరాలను మాత్రం స్వీకరించారు. తదనంతరం, “సన్న్యాసుల వద్ద ఎంత తక్కువ వస్తువులుంటే అంత మంచిది” అంటూ తమ వద్ద అప్పటికే ఉన్న గుడ్డలను అక్కడ వదలిపెట్టేశారు.
శివాజీ చక్రవర్తి వంశస్థుల రాజధానిగా కొల్హాపూర్ విరాజిల్లింది. శివాజీ పట్ల స్వామీజీకి గల గౌరవమర్యాదలు వర్ణనాతీతం. ఆంగ్లేయులు శివాజీ గురించి వ్రాసిన చిత్రణలు పాక్షికమైనవనీ, అవి అనేక చోట్ల దోషపూరితాలనీ స్వామీజీ అభిప్రాయపడ్డారు. శివాజీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన భావపారవశ్య స్థితులలోకి వెళ్లిపోవడం కద్దు. “పరమేశ్వరాంశగా జన్మించిన వ్యక్తి శివాజీ” అనేవారు స్వామీజీ.
కొల్హాపూర్‌లోనూ స్వామీజీ కొన్ని ప్రసంగాలు చేశారు. వాటిని విన్న ఒకవ్యక్తి ఆయన ప్రసంగాలలోని ఒకటి రెండు భావనలను ఇలా గుర్తుచేసుకొన్నాడు: “స్వామీజీ మాట్లాడిన రెండు వాక్యాలు నాకు బాగా జ్ఞాపకమున్నాయి. ‘నా మతం ఏదో తెలుసా? దాని ఒక విప్లవాత్మక శిశువే బౌద్ధమతం. దానిని అనుకరించ డానికి చేసిన డొంక తిరుగుడు ప్రయత్నమే క్రైస్తవ మతం. హిందూ మతాన్ని ఐరోపావారు ఎలా అవగతం చేసుకోగలరు? వారు పటాటోపమైన జీవితం వెంట పరుగుదీస్తున్నారు.’ ఇక్కడ ప్రేక్షకులలో ఒకరు, ‘మాంసాహారులు ఎలా మతాన్ని అర్థం చేసుకోగలరు?’ అని అందుకొన్నాడు. ‘అ లా అనకండి. మీ ప్రాచీన ఋషులు మాంసాహారులే! ఉత్తరరామ చరిత్రలో మీరు చదవలేదా?’ అని అడిగిన స్వామీజీ ఆ గ్రంథం నుండి కొన్ని శ్లోకాలు ఉదాహరించారు. మాంసాహారానికి మద్దతునిస్తూ ఆయన చేసిన ప్రసంగం విన్న అనేకులలో ఆయన కులం గురించి సందేహం తలెత్తింది. కాని ఆయనను ప్రశ్నించే సాహసం ఎవరికుంది?”
వినూత్న సన్న్యాసి: బెల్గామ్‌లో
1892 అక్టోబర్ మధ్యకాలంలో కొల్హాపూర్ నుండి స్వామీజీ బెల్గామ్ వెళ్లారు. అక్కడ ఒక మరాఠీ మిత్రుని ఇంట్లో బసచేశారు. ఆయన కుమారుడైన ప్రొఫెసర్ జి.ఎస్. భాటే సంస్మరణలు ఎంతో ఆసక్తికరమైనవి. తామొక వినూత్న సన్న్యాసే కాక ఒక నూతన యుగపు వేగుజుక్క భాసిల్లుతున్నట్లు స్వామీజీ ఇక్కడ అభివ్యక్తం కావడం చూస్తాం:
“ఒక రోజు ఉదయం 6 గంటలప్పుడు పరిచయ పత్రం పుచ్చుకొని స్వామీజీ మా ఇంటికి వచ్చారు. చూడగానే ఇట్టే ఆకర్షించే అద్భుత వ్యక్తిత్వం ఆయనది. ఆయన గురించి మాకు అప్పుడు ఏమీ తెలియదు. కాని ఆయన మా ఇంట్లో బస చేసిన కొద్ది రోజుల్లోనే అనేక విషయాలు మాకు తెలియసాగాయి. ఒక వినూత్న సన్న్యాసిలా కనిపించారాయన. ప్రవర్తన, దుస్తులు, భావన, ఆహారం ఇత్యాది ప్రతి ఒక్క అంశంలోనూ ఆయన సంప్రదాయ సన్న్యాసుల కన్నా ఎంతో భిన్నంగా ఉన్నారు.
“కాషాయాంబరాలే ధరించారు. కాని బనియన్ కూడా ధరించారు. సంప్రదాయ సన్న్యాసులు బనియన్ ధరించరు. సంప్రదాయ సన్న్యాసులు తమ వద్ద ఉంచుకొనే యోగదండానికి* బదులుగా ఈయన పొడవైన చేతికర్ర ఉంచు కొన్నారు. సన్న్యాసులు ఆంగ్లం మాట్లాడడం మేం కనీవినీ ఎరుగం. ఆయన అనర్గళంగా ఆంగ్లం మాట్లాడారు. మతం, తాత్త్వికత లాంటి అంశాలలో మాత్రమే కాకుండా ఆయన బహుముఖ ప్రజ్ఞాధురీణులుగా కానవచ్చారు. ఈ అంశాలన్నీ ఆయనను సంప్రదాయ సన్న్యాసుల నుండి విభిన్నులుగా చేశాయి. ఇవే మాకు ఆశ్చర్యాన్ని కలిగించాయనుకొంటే ఆయన ఆహార పద్ధతులు మమ్మల్ని దిగ్భ్రాంతు లను చేశాయి. మొదటి రోజు భోజనం చేయగానే తాంబూలం అడిగారు. మేంవిస్తుపోయాం. ఆ తరువాత ఆయన అడిగింది పొగాకు! ఒక సన్న్యాసి నుండి ఇటువంటిది మేం కలలో సైతం ఎదురుచూడలేదు. మా ముఖాలపై ద్యోతకమవు తున్న హావభావాలను అవగతం చేసుకొన్న ఆయన, ‘మీ సందేహం సబబే! నేనుబ్రాహ్మణుణ్ణి కాను కాని సన్న్యాసిని. ఇటువంటి విషయాలకు నేను దూరంగా ఉండాలని మీరు అనుకోవడం న్యాయమే. కాని ఏం చెయ్యను! నేను వీటిని వదలలేకపోతున్నాను’ అన్నారు. ఆయన నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంమా మనస్సుల్లో ఆయన పట్ల గొప్ప సదభిప్రాయాన్ని కలిగించింది.
“స్వామీజీ కొనసాగించారు. ఆయన మాటలు మమ్మల్ని గందరగోళంలో ముంచెత్తాయి: ‘ఇలా చూడండి! నేను కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకొని పట్టభద్రుణ్ణయ్యాను. సంపన్న జీవితాన్ని గడిపిన ఒక యువకుణ్ణి. శ్రీరామకృష్ణులనుకలుసుకోవడానికి మునుపు నేను మామూలు జీవితం గడిపాను. ఆయననుకలుసుకొన్న తరువాత జీవితం గురించి నా వైఖరి మారిపోయింది. కాని కొన్ని అలవాట్లను వదలుకోలేకపోయాను.’
“ఈ సమయంలో ఒకరు, ‘మీరు మాంసాహారం కూడా తింటారా?’ అని అడిగారు. అందుకు స్వామీజీ, “నేను సాధారణ సన్న్యాస సంప్రదాయానికిచెందిన వాణ్ణి కాను; పరమహంస సంప్రదాయస్థుణ్ణి. మేం ఏ ఆహారాన్నైనాస్వీకరించవచ్చు. అయాచితంగా లభించకపోతే నిరాహారిగానే జీవించాలి. ఒకపరమహంస సంప్రదాయానికి చెందిన సన్న్యాసి కులమతాదులకు అతీతంగా ఎవరి నుండి అయినా ఆహారం స్వీకరించవచ్చు” అన్నారు.
“మాకు ఆయన గురించిన గందరగోళమూ, విస్మయమూ అధికమయ్యాయి; ఎలాంటి నిర్ధారణకూ రాలేక సతమతమయినప్పుడు మా హృదయ స్పందనలను అర్థం చేసుకొన్న వ్యక్తిలా ఆయన మాట్లాడారు. నిజమైన మతం ఇలాంటి ఆచారవ్యవహారాలకూ నియమాలకూ అతీతమైనది. బాహ్య వ్యవహారాదుల కన్నా ఆంతరిక జీవితమే ముఖ్యమైనదని అద్భుతంగా వివరించి, మతం గురించీ, సన్న్యాసం గురించీ ఒక కొత్త దృక్పథాన్ని మాలో జనింపజేశారు.”
పలువురు పండితులతో దీర్ఘమైన చర్చాగోష్ఠులలో కూడా స్వామీజీపాల్గొన్నారు. ఇలాంటి సమయాలలో కూడా స్వామీజీ అసాధారణ పరిమాణం వ్యక్తమయింది. ఎటువంటి పరిస్థితులలోనైనా ఆయన నిగ్రహాన్ని కోల్పోరు. స్వామీజీతో జరిగిన ఒకటి రెండు వాదనలలోనే ప్రత్యర్థులు ఖంగుతింటారు. ఆపైన వాదించడానికి భావనలు స్ఫురించనప్పుడు ఆవేశానికీ, కోపానికీ లోనై అరుస్తారు, తిడతారు. కాని స్వామీజీ గాంభీర్యమూ, ప్రశాంతతా దేనివల్లా భగ్నం కాదు. అదే దివ్యకాంతులీనే చిరునవ్వులు చిందే ముఖారవిందంతో అనర్గళంగా, నిశ్చయంగా తమ భావనలు వ్యక్తం చేసేవారు.
హరిపాద మిత్రా
కొన్ని రోజులు గడిచాక హరిపాద మిత్రా అనే వ్యక్తిని కలుసుకోవడానికి స్వామీజీ వెళ్లారు. అతడికి సన్న్యాసుల పట్ల సదభిప్రాయం లేదు. హరిపాదమిత్రా దృష్టిలో సన్న్యాసి అంటేనే దగాకోరు; అతడి అభిప్రాయంలో మతం, దేవుడు లాంటివన్నీ నిరర్థకాలు. ఏదో యాచించ డానికో లేదా మరాఠీ వారితో కలసి ఉండడం ఇష్టం లేకో స్వామీజీ ఇక్కడికి వచ్చివుంటారని హరిపాదమిత్రా భావించాడు. కాని కాసేపు మాట్లాడేసరికి స్వామీజీ మహత్త్వాన్ని అవగతం చేసుకొని ఆయన పట్ల బాగా ఆకర్షితుడయ్యాడు. స్వామీజీని తన ఇంట్లో బస చేయమని అభ్యర్థించాడు. అందుకు స్వామీజీ, “ఆ మరాఠీ మిత్రునితో నేను ఆనందంగానే ఉన్నాను. ఒక బెంగాలీని చూసిన వెంటనే ఇక్కడకు వచ్చేస్తే ఆయన బాధపడతాడు. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు నన్ను ఎంతో అభిమానంగా చూసుకొంటున్నారు” అన్నారు. అయినప్పటికీ మర్నాడు ఉదయం ఉపాహారం స్వీకరించడానికి వస్తానని చెప్పారు.
మర్నాడు ఉదయం నిర్ణీత సమయానికి స్వామీజీ వెళ్లలేకపోయారు. దాంతో ఆయన కోసం భాటే ఇంటికి వెళ్లాడు హరిపాద మిత్రా. అక్కడ పలువురు పండితులు, న్యాయవాదులు, ప్రముఖులు తమను పరివేష్టించి ఉండగా స్వామీజీ కూర్చుని ఉన్నారు. వారు అడుగుతున్న ప్రశ్నలన్నింటికీ ఆంగ్ల, హిందీ, వంగ, సంస్కృత భాషల్లో స్వామీజీ అనర్గళంగా సమాధానాలిస్తున్నారు. హరిపాద మిత్రా కూడా అట్లే కూర్చుండిపోయాడు. తక్కిన వారందరూ వెళ్లిపోయిన తరువాత స్వామీజీ హరిపాదతో, “నిర్ణీత సమయానికి మీ ఇంటికి రాలేకపోయినందుకు క్షమించాలి. ఇంతమంది ఇక్కడ వేచివున్నప్పుడు వీరి నందరినీ వదలిపెట్టి రావడానికి మనస్కరించలేదు” అన్నారు. పిదప స్వామీజీని తన ఇంట్లో బసచేయ మని మళ్లీ హరిపాద అభ్యర్థించాడు. అందుకు స్వామీజీ, “భాటే ఆమోదిస్తే వస్తాను” అన్నారు. ఎంతో బ్రతిమాలుకొన్న తరువాత భాటే ఆమోదించాడు.
మూడు రోజులు హరిపాద ఇంట్లో గడిపిన తరువాత అక్కణ్ణుండి ఇక బయలుదేరుతానన్నారు స్వామీజీ. “ఒక సన్న్యాసి మూడు రోజుల కన్నా ఎక్కువ ఒక నగరంలో బస చేయకూడదు, ఒక రోజు కన్నా ఎక్కువ ఒక గ్రామంలో బస చేయకూడదు. ఒక చోట కొన్ని రోజుల పాటు బస చేస్తే అనురక్తి జనిస్తుంది. అనురక్తిని పెంపొందించే ప్రతి విషయానికీ మేం దూరంగా ఉండాలి” అన్నారాయన. కాని స్వామీజీ సాంగత్యాన్ని ఒక మహాభాగ్యంగా పరిగణించిన హరిపాద మిత్రా, స్వామీజీని బాగా ఒత్తిడికి గురిచేశాడు. కనుక ఒకటి రెండు రోజులు ఉంటానని చెప్పి తొమ్మిది రోజులు ఆతడి ఇంట్లో బసచేశారు.*
‘మానసిక శక్తిని వృథా చేయకూడదు’
స్వామీజీ సాంగత్యంలో హరిపాద మిత్రా ఆనందంగా గడిపాడు. తన పరివ్రాజక జీవితం గురించి ఆతడితో అనేక విషయాలు స్వామీజీ ముచ్చటిం చారు. సన్న్యాసులకి, స్థలం లేదని ఆయనను తరిమిగొట్టిన సంఘటనలు ఉన్నాయి. బాగా ఆకలిగా ఉన్న సమయాలలో బాగా కారం దట్టించిన ఆహారపదార్థాలు ఇవ్వగా నోటిలో, కడుపులో మంటలు పుట్టి ఆయన బాధపడ్డ రోజులు అనేకం. ఆయనను దొంగ గానో, గూఢచారిగానో అనుమానించి రక్షకభటులు ఆయనపై నిఘా ఉంచిన సందర్భాలు లేకపోలేదు. కాని సమస్తమూ జగజ్జనని లీలావిలాసమని పరిగణించి తమ దారిలో ఒంటరిగా పయనించారు స్వామీజీ.
స్వామీజీతో మాట్లాడేకొద్దీ మతం, తత్త్వం గురించి మాత్రమే కాక, తక్కిన సాహిత్యాలలోనూ ఆయనకు చక్కని ప్రవేశం ఉందని హరిపాద గ్రహించాడు. ఒక రోజు స్వామీజీ ఆంగ్లంలో హాస్యప్రధానమైన నవల Pickwick Papers నుండి దీర్ఘమైన విభాగాలను అట్లే ఉదాహరిస్తూ మాట్లాడారు. ఇది హరిపాదుణ్ణి అమిత ఆశ్చర్యంలో ముంచెత్తింది. బాల్యంలో ఒకసారి, ఐదారు నెలలకు మునుపు ఒకసారి, వెరసి రెండుసార్లు మాత్రమే ఆ పుస్తకాన్ని చదివినట్లు స్వామీజీ తెలిపారు. రెండుసార్లు చదివినంత మాత్రాన ఇన్ని భాగాలు కంఠస్థమవుతాయా అని హరిపాదుడు సంశయం వెలిబుచ్చినప్పుడు స్వామీజీ ఇలా అన్నారు:
“దేహంలో పనిచేసే శక్తులను నియంత్రించడం వలన మానసికశక్తి ఇనుమ డిస్తుంది. కనుక దేహంలో పనిచేసే భౌతిక శక్తులను నియంత్రించి, పొదుపు చేసి వాటిని మానసిక శక్తిగా, ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకోవాలి. దేనిని గురించీ పర్యాలోచించకుండా అర్థంలేని ఇంద్రియ సుఖాలలో దైహిక శక్తులను వృథాచేస్తే ప్రమాదం; ఇది మనస్సులోని ధారణాశక్తి సామర్థ్యాన్ని (Retentive Faculty) నశింపజేస్తుంది. మరో విషయం: నువ్వు ఏది చేసినా మనఃస్ఫూర్తిగా చేయాలి. ఒకసారి ఒక సన్న్యాసి ఇత్తడి వంటపాత్రలను తోమడం చూశాను. తోముతున్న కొద్దీ అవి బంగారు పాత్రలలా మెరసిపోసాగాయి. పూజ, ధ్యానాలను ఎంత సావధానంగా, మనఃస్ఫూర్తిగా చేస్తారో అదే తీరులోనే పాత్రలను తోముతున్నారు.”
ఈ రోజుల్లో స్వామీజీ వద్ద ఫ్రెంచి సంగీతం గురించిన ఒక పుస్తకం ఉండేది.
రుగ్మతలు దాదాపుగా మనస్సంబంధమైనవి
అనేక రుగ్మతల నిమిత్తం విభిన్నమైన మందులు హరిపాద పుచ్చుకొంటున్నాడు. అలా ప్రతిదానికీ మందులు పుచ్చుకోవడం శారీరక ఆరోగ్యానికి హానికర మని స్వామీజీ ఆతడికి హితవు చెప్పారు: “దాదాపుగా అన్ని వ్యాధులూ మనోజనిత సంబంధమైనవి (Psychosomatic). మానసిక స్థితులను మార్పు చేయడం మూలంగా అనేక రుగ్మతలను నయం చేయవచ్చు.* అంతేగాక, సదా రుగ్మతను గురించే యోచిస్తూ ఉండడం వలన ప్రయోజనం ఏమిటి? నీతిమంతంగా జీవించు. మనస్సును ఉన్నతపరిచే భావనలను గురించి ఆలోచించు. ఉత్సాహంగా ఉండు. శరీరాన్ని వ్యధపెట్టే లేదా తదనంతర కాలంలో పశ్చాత్తాపానికి దారి తీయించే సుఖభోగాలలో లయించిపోకు. ఇదంతా పాటిస్తే అంతా చక్కబడుతుంది. మరణం అందరికీ తప్పదు. నువ్వు, నేనూ, మనలాంటివాళ్లూ మరణించడం వలన భూమి అక్షం ఒరిగిపోతుందా ఏమిటి? మనం లేకుండా ఈ ప్రపంచం సాగదని అహంకరించకూడదు.”
బోలెడన్ని మందులు పుచ్చుకొనే అలవాటును హరిపాద ఆ రోజునుండి విడిచిపెట్టాడు.
భిక్ష ఇవ్వడమా, ఇవ్వకపోవడమా?
మాతృదేశం కోసం ఏదైనా చేసి తీరాలనే తీవ్ర వ్యాకులత అప్పుడప్పుడు స్వామీజీలో ఉద్వేగభరిత ప్రవాహంలా బయల్వెడలేది. ఒక రోజు ఆయన వార్తాపత్రిక చదువుతున్నారు. కలకత్తాలో ఒక వ్యక్తి ఆకలితో అలమటించి మరణించిన వార్త అందులో వచ్చింది. ఆ దుర్ఘటన ఆయనను విచారంలో ముంచివేసింది. తీవ్రమైన వ్యధతో, వాడిపోయిన ముఖంతో ఆయన కూర్చుండిపోయారు. అది చూసిన హరిపాద అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు స్వామీజీ ఇలా అన్నారు: “పాశ్చాత్య దేశాలలో ఎన్నో ధార్మిక సంస్థలు ఉన్నాయి. ధార్మిక కార్యాల కోసం వారు ఎంతో ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ సమాజం బహిష్కరించడం వలన మరణించేవారు అనేకులు. సమాజం పేదలను స్వీకరించదు; బహిష్కరిస్తుంది. మన దేశం పేద దేశమైనప్పటికీ, ధర్మం చేయాలన్నది సమాజంలో నియమంగా ఉన్నందు వలన పేదలనో, భిక్షగాళ్లనో సమాజం బహిష్కరించడంలేదు; ఒక పిడికెడు బియ్యమో, ఒక ముద్ద అన్నమో పొందకుండా ఎవరూ ఏ ఇంటి నుండి వెనుకకు తిరిగిపోవడం అరుదు. కనుక మన దేశంలో కరవు వాటిల్లని కాలాలలో ఆకలిబాధతో మరణించేవారు బహు అరుదు. ఆకలి బాధతో ఒక వ్యక్తి మృతి చెందాడనే వార్త ఇప్పుడే నేను ప్రప్రథమంగా వింటున్నాను.”
“కాని స్వామీజీ! భిక్షగాళ్లకు భిక్ష వేయడం వృథా ఖర్చే కదా! మనం ఇచ్చే అన్నమో, వస్తువులో వారికి మేలు చేయడానికి బదులుగా కీడే చేస్తాయని నా అభిప్రాయం. మనం ఇచ్చే డబ్బుతో గంజాయి, సారాయి త్రాగి వారు చెడిపోతారే తప్ప, నిర్మాణాత్మకంగా ఏదీ జరగదు” అన్నాడు హరిపాద.
“ఒక పైసా ఇచ్చి అది వాడు ఏం చేస్తున్నాడని లెక్కగట్టి నువ్వెందుకు నీ తల బ్రద్దలు కొట్టుకొంటావు? నీ వద్ద డబ్బు ఉంది, ఇవ్వు, అంతే. నువ్వు ఇవ్వకుండా తరిమిగొడితే వాడు ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. గంజాయి, సారాయి త్రాగితే అది ఆ ఒక్కణ్ణి మాత్రమే బాధిస్తుంది. దొంగతనం చేస్తే సమాజమంతటినీ అది బాధిస్తుంది కదా!” అని స్వామీజీ వ్యాఖ్యానించారు.
ఇతరులు మనకు అద్దం లాంటివారు
మంచి జీతం లభించే ఉద్యోగమే హరిపాద చేస్తున్నాడు. ఆతడి పై అధికారులు ఆంగ్లేయులు. వారు తనను కసరుకోవడం హరిపాదకు సుతరామూ ఇష్టం లేదు. తన అసంతృప్తిని అతడు బహిరంగంగానే ప్రదర్శించాడు. ఈ విషయం తెలుసుకొని స్వామీజీ ఇలా అన్నారు:
“ఇలా చూడు! డబ్బు కోసం నువ్వే ఈ పని ఎంచుకున్నావు. నీకు ఇవ్వ వలసిన జీతం కచ్చితంగా ఇస్తున్నారు. ‘ఓ! వీరు నన్ను బానిసగా చూస్తున్నారు’ అంటూ ఎందుకు ఆరోపిస్తున్నావు? చిన్న విషయాన్ని ఎందుకు అంత పెద్దది చేస్తావు? ఎవరూ నిన్ను బానిసను చేయలేదు. నువ్వు బానిసగా ఉండడానికి కారణం నువ్వే. ఇప్పుడు అనుకొన్నా నీ ఉద్యోగానికి రాజీనామా చేయవచ్చు! అధికారులను తప్పుబట్టడం ఎందుకు? ప్రస్తుత పరిస్థితులు నీకు సానుకూలంగా లేవంటే అందుకు మరెవరినీ తప్పుపట్టబోకు; నిన్ను నువ్వే తప్పుబట్టుకో. నువ్వు వారి క్రింద పనిచేయడమూ చేయకపోవడమూ వారికొక లెక్క అని నువ్వు భావిస్తున్నావా? నువ్వు వైదొలగితే ఆ స్థానంలో పనిచేయడానికి వందలమంది కాచుకొనివున్నారు. నీ గురించి నువ్వు కలతచెందు; నీ కర్తవ్యాలనూ, బాధ్యత లనూ గురించి ఆలోచించి చూడు; అంతటితో ఆపు. ముందు నీకు నువ్వు మంచివాడివిగా ఉండు. అప్పుడు నీ చుట్టూ ఉన్న లోకమంతా మంచిగా కనిపిస్తుంది. ఇతరులలో ఉండే మంచిని మాత్రమే అప్పుడు నువ్వు చూస్తావు. మనం చూసే బాహ్యప్రపంచం మన ప్రతిబింబమే. ఇతరులను తప్పుబట్టే అలవాటు మానుకో; నువ్వు ద్వేషిస్తున్న వారందరూ క్రమక్రమంగా నిన్ను స్వీకరించడం చూస్తావు. ఆశ్చర్యపడే విషయమేగాని, ఇది నిజం. మన మానసిక స్థితిని బట్టే ఇతరులు మనతో మెలగుతారు. ఇతరులు మనతో మెలగే తీరు చూసి మన మానసిక స్థితిని, మానసిక పరిపక్వతను తెలుసుకోవచ్చు.”
నిజమైన ఉపాధ్యాయుడు
స్వామీజీ ఈ ఉపదేశాలు హరిపాద మిత్రా జీవితాన్ని జాగృతం చేశాయి. స్వామీజీ మార్గదర్శకత్వంలో భగవద్గీత పఠించ నారంభించాడు హరిపాద. ఇంతదాకా అర్థంకాని అనేక సత్యాలు అతడు గ్రహించగలి గాడు. మతమూ, తాత్త్వికతలాంటి పరిధులను అతిక్రమించి సాహిత్యజ్ఞానం పెంపొందించుకోవాలని చెప్పి, స్వామీజీ థామస్ కార్లైల్ (Thomas Carlyle) రచించిన గ్రంథాలను, జూల్స్ వెర్న్ (Jules Verne) రచించిన నవలలను హరిపాదను చదవమన్నారు. స్వామీజీ బోధనా పద్ధతిని గురించి హరిపాద ఇలా వ్రాశాడు:
“స్వామీజీ నిజమైన ఉపాధ్యాయునిగా భాసించారు. బెత్తం పుచ్చుకొన్న ఉపాధ్యాయుని ముందు అణగిమణగి కూర్చుని ఒక విద్యార్థి నేర్చుకొన్నట్లుగా కాదు స్వామీజీ వద్ద నేర్చుకోవడం. అత్యున్నతమైన విషయాలను సైతం ఆయన వినోదంగా, పరిహాసపూర్వకంగా, నవ్వులతో కలగలిపి బోధించేవారు. ఆయన వద్దకు విభిన్న రకాల వ్యక్తులు వచ్చేవారు; కొందరు ఆయన మేధాశక్తిని గురించి వినీ, కొందరు ఆయన తెలివితేటలను పరీక్షించడానికీ, కొందరు స్వార్థం కోసమూ, కొందరు ఉపదేశం పొందడానికీ, కొందరు ఆయన పట్ల ఆర్షించబడీ, కొందరు ఆయన దివ్యసాన్నిధ్యంలో నెలకొనే ప్రగాఢ ప్రశాంతతను చవిచూడడానికీ రావడం కద్దు. వచ్చే వ్యక్తులు ఎలాంటి వారైనప్పటికీ వారి ఉద్దేశాన్ని ఇట్టే ఒక్క చూపులోనే గ్రహించేవారు స్వామీజీ; వారి అంతరంగంలో చొచ్చుకొనిపోయి వారి మనస్సును ఆయన చదివినట్లుగా ఉండేది. చదువుకోకుండా తప్పించుకోవడానికి ఒక యువకుడు ఆయన వద్దకు వచ్చి తాను సన్న్యాసం పుచ్చుకొంటానని చెప్పాడు. మరుక్షణమే స్వామీజీ, ‘తమ్ముడూ! ముందుగా నువ్వు ఎం.ఏ. పూర్తిచేసి, తరవాత సన్న్యాసం పుచ్చుకో. సన్న్యాసాశ్రమ జీవితంతో పోలిస్తే ఎం.ఏ.లో ఉత్తర్ణమవడం ఎంతో సులభం’ అన్నారు. స్వామీజీ మా అందరి హృదయాలను ఎలా చూరగొన్నారో అని ఆలోచిస్తేనే దిగ్భ్రమ కలుగుతుంది. నా ఇంటి ముంగిట ఉన్న చందనవృక్షం క్రింద కూర్చుని ఆయన నాకు అనుగ్రహించిన ఉపదేశాలను ఎన్నటికీ నేను మరచిపోలేను.”
పారిశుద్ధ్య ఆవశ్యకత
బెల్గామ్‌లో స్వామీజీ పలు చోట్ల ఉపన్యాసాలూ, చర్చలూ చేశారు. మతం, తాత్త్వికత లాంటివే కాకుండా విజ్ఞానశాస్త్రం, సాంఘిక శాస్త్రం లాంటి అంశాల లోనూ ఆయనకు గల అభినివేశాన్ని చూసి జనం విస్తుబో యారు. కాని ఎలాంటి ఉద్దేశాలూ, ఉన్నత లక్ష్యాలూ లేకుండా పామరులు వాడిపోవడం చూసి ఆయన అమిత ఆవేదన చెందారు. సామాన్య పారిశుద్ధ్యం విషయంలో కూడా వారు అజ్ఞానంలో ఉండిపోవడం ఆయన మనస్సుకు క్షోభ కలిగించింది. స్నానం చేసే కొలనులోనే పాత్రలు మొదలైనవి తోమడం, బట్టలు ఉతకడం, అంతేకాక అదే నీటిని త్రాగడానికి ఉపయోగించడం వంటివి చేస్తూ జీవించే వారిని ఉద్దేశించి, “ఇటువంటి జనానికి తెలివితేటలుంటాయని ఎలా అనుకోవడం!” అని స్వామీజీ వాపోయారు.
సైద్ధాంతిక మౌఢ్యం: ఒక కథ
స్వామీజీ సైద్ధాంతిక మౌఢ్యాన్ని ఆమూలాగ్రం ఖండించేవారు. ఆయన ముందు ఎవరైనా ఏకపక్ష భావనలను వెలిబుచ్చితే ఆయన మండిపడేవారు. నిరాధారిత భావనను మొండిగా పట్టుకొని వ్రేలాడుతున్న మూర్ఖుల గురించి ఆయన తమాషాగా ఒక కథ చెప్పేవారు:
ఒక రాజు తన రాజ్యం మీద పొరుగు రాజు దండెత్తి రాబోతున్నాడనే వార్త విని అత్యవసర సలహా సంఘాన్ని సమావేశపరిచాడు. ఆగమేఘాల మీద దండెత్తి వస్తున్న శత్రుసేనను ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి ప్రతిచర్యలు చేపట్టాలి అని రాజు సలహాసంఘ సభ్యులను అడిగాడు. ఇంజనీర్లు లేచారు. రాజధాని చుట్టూ పెద్ద ఎత్తైన మట్టిగోడను కట్టి, దాని చుట్టూ కందకం త్రవ్వించాలని సలహా ఇచ్చారు. కాని వడ్రంగులు, “మట్టిగోడ నిష్ప్రయోజనం. వర్షం కురిస్తే అది కరిగి పోతుంది. కాబట్టి కలపతో గోడను నిర్మించాలి” అని సలహా ఇచ్చారు. ఇది విన్న చర్మకారులు, “అవి రెండూ పనికిరావు. తోలుతో నిర్మితమైన గోడ కన్నా సురక్షితమైనది మరొకటి లేదు” అన్నారు. అప్పుడు కమ్మరులు లేచి, “అందరూ మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. ఇనుప గోడ కన్నా పటిష్ఠమైనది మరొకటి ఉందా?” అని అడిగారు. న్యాయవాదులు వదలిపెడతారా! “ఏదైనా చట్టబద్ధంగా చేయడమే మంచిది. పరాయివారి ఆస్తిని దౌర్జన్యంగా కైవసం చేసుకోవడం చట్ట ప్రకారం నేరమని శత్రువుకు వివరించి చెబుదాం. గోడ నిర్మాణానికి ధనం ఎందుకు వృథాచేయాలి?” అని వారు వాదించారు. చివరగా లేచినవారు పురోహితులు. అంతదాకా సలహాలిచ్చిన వారిని చూసి, పరిహాసంగా నవ్వి ఇలా అన్నారు: “మీ అందరి మాటల్లో అర్థం పర్థం ఉందా? అందరూ వెర్రివాళ్లలా ప్రేలాపనలు చేశారు. ముందుగా యాగాలు నిర్వర్తించి దేవతలను ఆనందింపజేయాలి. ఆ తరువాత ఈ శత్రువులు మనలను కదిలించగలరా?” అన్నారు. ఈ రకంగా ఆలోచనలు, వాదప్రతివాదాలు, తర్కవితర్కాలు, ఘర్షణ, గోల, గందరగోళం ఇత్యాదులలో వీరి మునిగివుండగా శత్రుసైన్యం తుపానులా విరుచుకుపడి నగరాన్ని నేలమట్టం చేసి వెళ్లిపోయింది. సైద్ధాంతిక మౌఢ్యం వినాశనానికి దారితీస్తుందేగాని ఎన్నడూ నిర్మాణాత్మకమైన దేదీ చేయలేదు.
హరిపాద మిత్రాకు దీక్ష
ఒక రోజు స్వామీజీ హరిపాదతో చికాగో సర్వమత మహాసభ గురించి ప్రస్తావించి, అందులో పాల్గొనాలనే తమ అభిలాషను వ్యక్తంచేశారు. ఇది విని ఉత్సాహభరితుడైన హరిపాద వెంటనే చందాలు సేకరించి స్వామీజీ బయలుదేరడానికి తగిన ఏర్పాట్లు చేస్తానన్నాడు. “వద్దు నాయనా! వెంటనే ఏదీ చేయవద్దు. రామేశ్వరం వెళ్లాలని మ్రొక్కుకొన్నాను. కనుక అక్కడకు వెళ్లి తీరాలి. ఆ తరువాత చూద్దాం” అని చెప్పి హరిపాదను వాదించారు.
స్వామీజీ బెల్గామ్ రావడానికి కొద్ది కాలం మునుపు హరిపాద సతీమణి యైన ఇందుమతి తను ఒక గురువు నుండి మంత్రదీక్ష పొందాలనే కోరిక వెలిబుచ్చింది. అందుకు హరిపాద, “నువ్వు ఎంపిక చేసుకొనే గురువు నాకూ గౌరవనీయుడైన వ్యక్తిగా ఉండాలి. అటువంటి వ్యక్తి తారసపడినప్పుడు మనం ఇద్దరం దీక్ష పుచ్చుకొందాం” అన్నాడు. ఇప్పుడు ఇద్దరూ దీక్ష స్వీకరించాలనే తమ అభిలాషను స్వామీజీవద్ద వ్యక్తం చేశారు. ముందు కాస్త సంశయించినా తరువాత వారి కోర్కెలు మన్నించారు. ఈ దంపతుల పట్ల స్వామీజీ అవ్యాజ ప్రేమను చూపించారు. ఆయన పాశ్చాత్యానికి బయలుదేరడానికి ముందు ఇందుమతికి వ్రాసిన లేఖ వారి పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాన్ని చాటి చెప్పడమే కాక, ఒక గృహిణి కర్తవ్యానికి అద్దం పట్టేదిగా కూడా ఉంది:
“ఎల్లప్పుడు కృష్ణార్పితంచేసి జీవితాలు గడుపుతూవుండండి. మనం భగవంతుని చేతిలోని ఆటబొమ్మలమని సదా గుర్తుంచుకో. ఎల్లప్పుడు పవిత్రు రాలివిగానే ఉండు. వాక్కాయాలలోనే గాక, తలంపులలో కూడా అపవిత్రురాలివి కాకుండేట్లు శ్రద్ధ వహించు. నీకు చేతనైనంతగా పరోపకారం చేయి. మనోవాక్కా యాలచే పతిని సేవించడమే, సతికి ప్రధాన విధి అని సదా గుర్తుంచుకో. అవకాశం ఉన్నంతవరకు ప్రతి రోజూ గీతాధ్యయనం చేయి… అమ్మా! ఎక్కువ వ్రాయడం అనవసరం. నీ శ్రేయస్సుకే నేను ఎల్లప్పుడు ప్రార్థిస్తున్నానని నమ్ము. నీకు సత్వరమే సంతాన భాగ్యం కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.”*
గోవా క్రైస్తవ మఠం
1892 అక్టోబర్ మాసాంతంలో స్వామీజీ గోవా వెళ్లారు. అప్పుడు గోవా పోర్చుగీసు వారి వలస. ఇక్కణ్ణుండి స్వామీజీ వ్రాసిన లేఖలలో ‘సచ్చిదానంద’ అని సంతకం చేయడం చూస్తాం. గుజరాత్, రాజస్థాన్‌లలో ఉపయోగించిన ‘వివేకానంద’ నామధేయాన్ని ఆయన ఇక్కడ ఉపయోగించలేదు.
బెల్గామ్ ప్రముఖులలో ఒకరైన షిర్గాంకర్, మార్గోవాలోని తన మిత్రుడైన సుబ్రాయ్ నాయక్ అనే వ్యక్తికి స్వామీజీని పరిచయం చేస్తూ ఒక లేఖ వ్రాశాడు. స్వామీజీ రైలు దిగినప్పుడు, తనను ఆహ్వానించడానికి రైలు నిలయం వద్ద ఏర్పాట్లు ఘనంగా చేసివుండడం చూశారు. వందలమంది సమావేశమై ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. తరువాత గుర్రపుబండిలో ఆయనను ఆసీనులను చేసి ఊరేగింపుగా సుబ్రాయ్ నాయక్ ఇంటికి తోడ్కొని వెళ్లారు. సంస్కృతంలోను, శాస్త్రాలలోను సుబ్రాయ్ నాయక్‌కు చక్కని అభినివేశం ఉంది. అతడు ఒక ఆయుర్వేద వైద్యుడు కూడా. స్వామీజీ సర్వతోముఖ ప్రజ్ఞాపాటవాలను చూసి నాయక్ పరమానందభరితుడయ్యాడు.
స్వామీజీ గోవా వెళ్లడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. క్రైస్తవ మతం గురించీ, ప్రత్యేకించి క్రైస్తవ ధర్మశాస్త్రం గురించీ ఆయన కూలంకషంగా తెలుసు కోగోరారు. ప్రాచీన దేవాలయాలూ, మఠాలూ గోవాలో కోకొల్లలు. అక్కడ అరుదైన ప్రాచీన గ్రంథాలు లభిస్తాయి. స్వామీజీ ఉత్సుకతను గ్రహించిన నాయక్ ఆయనను తన క్రైస్తవ మిత్రుడయిన ఆల్వరెస్కు పరిచయం చేశాడు. అతడు విద్యాధికుడు. ఆల్వరెస్ స్వామీజీతో మాట్లాడినప్పుడు ఆయనకు గల ప్రగాఢ జ్ఞాన సంపత్తిని గుర్తించాడు. కనుక రాఛోల్ మఠాలయంలో ఆయన బస చేయడానికి ఏర్పాట్లు చేసియిచ్చాడు. ఈ మఠాలయం మార్గోవా నుండి నాలుగు మైళ్ల దూరంలో ఉంది. గోవాలోని అతిప్రాచీనమైన ఈ మఠాలయంలో మరెక్కడా లభించని అరుదైన అనేక పుస్తకాలూ, వ్రాతప్రతులూ పదిలపరచబడి ఉన్నాయి.
స్వామీజీ అక్కడ మూడు రోజులు బసచేశారు. అక్కడున్న క్రైస్తవ మత గ్రంథా లను పరిశోధించారు. ఆయనకు గల అసాధారణ జ్ఞాపకశక్తి, ప్రగాఢజ్ఞానం, క్రైస్తవం గురించిన ఆయన భావనలు అక్కడి ఫాదరీలను అమితంగా ఆకట్టుకొన్నాయి.
ఆ తరువాత మార్గోవాకు తిరిగివచ్చిన స్వామీజీ మళ్లీ నాయక్ ఇంట్లో బస చేశారు.* ఒక రోజు ఆయన పాడుతున్నప్పుడు ఖారుప్జీ అనే వ్యక్తి తబలా వాయించారు. గొప్ప విద్వాంసుడుగా పేరు గాంచిన అతడికి తబలా వాయిస్తు న్నప్పుడు ముఖంలో అనేక వికృతమైన హావభావాలు ప్రకటించడం పరిపాటి. అది గమనించిన స్వామీజీ పాటలు ముగిసిన తరువాత ఆయనతో ఆ అ లవాటును మానుకోమని చెప్పారు. కాని అ లా ముఖంలో వికృతమైన హావభావాలు వ్యక్తీ కరించకుండా తబలా వాయించడం అసాధ్యమని వాదించాడు ఖారుప్జీ. కాని అతడూ, అక్కడున్న అందరూ విభ్రాంతులయ్యే రీతిలో స్వయంగా తామే వాయించి, చూపి, తాము చెప్పింది చేసి చూపారు స్వామీజీ.