భారతీయులే భారతదేశ చరిత్రను రచించాలి. కనుమరుగైన, కప్పబడి వున్న మన ప్రాచీన నిధులను వెలికి తీసుకువచ్చే ప్రయత్నంలో దిగండి.
– స్వామి వివేకానంద
ఢిల్లీలో — ఆళ్వార్‌లో — వృద్ధురాలి కారుణ్యం — పారవశ్య స్థితులలో — భిక్షాటన ఎందుకు? — విగ్రహారాధన: వివరణ — ‘పేదలను అనుమతించాలి’ — ‘స్వయంకృషి గల వ్యక్తినే భగవంతుడూ ఇష్టపడతాడు’ — భారతదేశ చరిత్రను భారతీయులే రచించాలి — కుల సంస్కారాలు — స్వామీజీ వినమ్రత — చమురు ఎందుకు? — నిజాయతీగా జీవించ సాధ్యమా? — వ్యావసాయిక విజ్ఞాన శాస్త్రం కావాలి — విడిచిపెట్టం
నీలకంఠుడు: వ్యాఖ్యానం — జైపూర్‌లో — మూడు గంటల్లో పాణినీ సూత్రం — ‘సజీవ కృష్ణుణ్ణి చూడండి’ — ‘మీరు ఏ అవతారం? — అనుసరించే అఖండానంద — ఆజ్మీర్లో — మౌంట్ ఆబూలో — శిలల మీద కూర్చుని పాడడం — గుహ వాసం — ‘సర్వత్రా భగవంతుణ్ణి గాంచుచున్నాను’ — ‘జీవితమంటే ఏమిటి?’ — సత్యమంటే ఏమిటి? — నర్తకి నేర్పిన పాఠం — ‘సమస్తం నేర్చుకొన్నారు!’ — ‘నా వలన ఏ ప్రాణీ భీతిల్లకూడదు!’ — ఖేత్రీ మహారాజుకు గురువుగా — సంతాన వరం
ఢిల్లీలో
మీ రట్ నుండి స్వామీజీ ఢిల్లీ వెళ్లారు. అక్కడ సేట్ శ్యామ్‌లాల్ అనే వ్యక్తి ఇంట్లోబసచేశారు. శతాబ్దాల పర్యంతం రాజ వంశీయులకు ఢిల్లీ రాజధానీ నగరంగావిరాజిల్లింది. ఢిల్లీలోని ప్రతి ప్రాంతమూ చరిత్రాత్మకమైనది, సాంస్కృతికమైన ప్రత్యేకతను సంతరించుకొన్నది. స్వామీజీకి చరిత్ర అంటే ఎంతో ఇష్టం. భారతదేశ, ప్రపంచ చరిత్రలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు ఆయన. కనుక ఆయనకు ఢిల్లీ సందర్శనం పరమానందభరితమయింది. రాజప్రాసాదాలు, మసీదులు, రాతి కట్టడాలలాంటి పలు సందర్శనాస్థలాలు ఆయన తిలకించారు. మహాభారత కాలం నుండి ఢిల్లీని పరిపాలించిన అనేక రాజవంశాల చారిత్రక చిహ్నాలను కూడా చూశారు. ఇలా దాదాపు పదిరోజులు ఢిల్లీలో తిరిగారు. హఠాత్తుగా ఒక రోజు ఆయనకు తమ సోదరసన్న్యాసులు తారసపడ్డారు. అదొక తమాషా సంఘటన.
మీరట్‌లో సోదర సన్న్యాసులను వదలి వచ్చేటప్పుడు, తనను ఎవరూవెంబడించకూడదని స్వామీజీ వారిని హెచ్చరించారు. వారిని మళ్లీ ఢిల్లీలోచూసినప్పుడు వారు తనను వెంబడించి వస్తున్నారని ఆయన అపోహపడ్డారు.స్వామీజీని కలుసుకోవడం వారికెంతో ఆనందం కలిగినప్పటికీ, స్వామీజీకిమాత్రం అది నచ్చలేదు. “నన్ను వెంబడించకూడదని మీకు స్పష్టంగా చెప్పానుకదా! నాకంటూ కొంత పని ఉంది. కనుక నన్ను వెంబడించకండి. ఇది విన్నపంకాదు, ఆదేశం. నా పాత సంబంధాలన్నీ తెగతెంపులు చేసుకోబోతున్నాను. నా ఆత్మ మార్గనిర్దేశం చేసే ప్రదేశాలకు నేను వెళ్తాను. నేను వెళ్ళేది అరణ్యం కావచ్చు, ఎడారి కావచ్చు, పర్వతం కావచ్చు, ప్రజలు నివసించే పట్టణం కావచ్చు. దేనిగురించీ కలత చెందక వెళుతున్నాను” అని వారితో నిష్కర్షగా చెప్పేశారు.
స్వామీజీ నిష్కర్ష సంభాషణ, సంకల్పమూ సోదర సన్న్యాసులకు తీవ్రమైనదిగ్భ్రాంతి కలిగించాయి. ఎందుకంటే వారు పనిగట్టుకొని ఆయనను వెంబడించలేదు. యాదృచ్ఛికంగా అలా కలుసుకోవడం తటస్థించింది. అంతే. జరిగింది ఇది: తమను ఎవరూ గుర్తించరాదనే ఉద్దేశంతో అక్కడక్కడ పేర్లు మార్చుకొంటూస్వామీజీ పర్యటించారు. ఢిల్లీలో ఆయన పేరు వివిధిషానంద. సోదర సన్న్యాసులుకేవలం ఢిల్లీ సందర్శనార్థం వచ్చినప్పుడు వివిధిషానంద అనే ఆంగ్లం మాట్లాడేసన్న్యాసి గురించి విని ఆయనను చూడడానికి వచ్చారు. ఆ వ్యక్తి సాక్షాత్తుస్వామీజీ అయి ఉంటారని వారు కలలో సైతం ఊహించలేదు. ఈ విధంగాయాదృచ్ఛికంగా కలుసుకోవడం జరిగింది.
స్వామీజీ ఇచ్ఛమేరకు సోదర సన్న్యాసులు ఆయనను ఒంటరిగా వదలిపెట్టారు.. ఆ తరువాత కూడా స్వామీజీ కొన్ని రోజులు ఢిల్లీలోనే గడిపారు.బసలు వేరయినప్పటికీ భోజన సమయానికి అందరూ సేఠ్జీ ఇంట్లో కలుసుకొనేవారు. కొన్ని రోజులు గడిచాక ఒక్కొక్కరూ ఒక్కో దిశలో తమ పయనాన్ని కొనసాగించారు. స్వామీజీ రాజపుఠాణా వైపు వెళ్లారు.
ఒంటరితనంలో లీనమయిన వ్యక్తిలా స్వామీజీ సంచారం చేశారు. ఒంటరిసన్న్యాసి జీవిత విధానాన్ని అభివర్ణించే ధమ్మపదం* చరణాలు ఆయనస్మృతిపథంలో మెదలాయి:
దేనికీ భీతిల్లక, దేనినీ ఖాతరుచేయక
దారీ తెన్నూ లేకుండా
ఖడ్గమృగంలా ఏకాంతంగా సంచరిస్తూ
ముందుకి సాగు!
ధ్వనులకు కంపించని సింహంలా
వలలో చిక్కుకోని వాయువులా
పంకంలో పుట్టినా కళంకమవని పద్మంలా
సంచరించు నువ్వు ఖడ్గమృగంలా!
ఈ చరణాలు స్వామీజీని ఉద్వేగభరితుణ్ణి గావించాయి. ఈ ఆదర్శాన్నే మనస్సులో పాదుగొలుపుకొని రాజపుఠాణా దిశగా నడకసాగించారు.
ఆళ్వార్‌లో
రాజపుఠాణా అనగానే చటుక్కున జ్ఞాపకానికి వచ్చేవి శౌర్యం, సాహసం, త్యాగం కలగలసిన చరిత్రలు. రాజపుఠాణా అనే పేరు వింటేనే భారతీయుల మనస్సుల్లో వీరం ఉద్భవిస్తుంది. భారతదేశ చరిత్ర సంక్షిప్తత రాజపుఠాణా చరిత్ర అనడం అతిశయోక్తి కాదు. ఆ చరిత్రతో పాటు రాజపుఠాణాను ఆవరించివున్న పర్వతశ్రేణులు, సుదూరంలో కానవచ్చే పర్వత శిఖరాలు, చలువరాతి రాజప్రాసాదాలు – అన్నీ కలిసి ఒక అత్యద్భుత దృశ్యాన్ని స్వామీజీ దర్శించారు.
1891 ఫిబ్రవరిలో ఆళ్వార్ రైలు నిలయంలో స్వామీజీ దిగారు. అక్కడ ఒక గమ్యం లేకుండా నడవసాగారు. బాటకు ఇరువైపులా పుష్పభరిత ఉద్యానవనాలు, విస్తృతమైన పచ్చని పొలాలు, బారులుతీరిన ఇళ్లు – ఇలా కానవస్తున్న సుందర దృశ్యాలను తనివితీరా తిలకిస్తూ చివరకు ప్రభుత్వ వైద్యశాల వద్దకు వచ్చారు. అక్కడ గురుచరణ్ లాస్కర్ అనే డాక్టర్ బయట నిలబడి ఉన్నాడు. స్వామీజీ వ్యక్తిత్వం ఆతణ్ణి ఎంతగానో ఆకర్షించింది. స్వామీజీ తిన్నగా అతణ్ణి సమీపించి, “సన్న్యాసులు బసచేయడానికి ఇక్కడ ఏదైనా స్థలం ఉందా?” అని అడిగారు. గురుచరణ్ ఆయనను అక్కడున్న బజారు వీథికి తీసుకుని వెళ్లాడు. ఒక దుకాణం పైన సన్న్యాసులు బసచేయడానికి ఒక ప్రత్యేకమైన గది ఉంది. ఆ గదిని స్వామీజీకి చూపించి, ఆయన అక్కడ బసచేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాడు.
వృద్ధురాలి కారుణ్యం
స్వామీజీ వద్ద పరిచయ పత్రాలు ఏవీ లేవు. కనుక భోజనానికీ, బసకీ ఎలాంటి ఏర్పాట్లూ లేవు. అప్పుడు ఆ దుకాణానికి సమీపంలో నివసిస్తున్న ఒక వృద్ధురాలు స్వామీజీ పట్ల ఆసక్తి కనబరచింది. ఆమె ఆప్యాయంగా ఆయనను ‘లాలా’ (బిడ్డా!) అని సంబోధించింది. స్వయంగా తనే చపాతీలు చేసి రోజూ తెచ్చి స్వామీజీకి తినిపించేది. కొన్ని సమ యాలలో రామస్నేహి అనే వైష్ణవ సన్న్యాసితో స్వామీజీ భిక్షాటనకు వెళ్లి గోధుమ పిండి సేకరించి తెచ్చేవారు. రామస్నేహి చపాతీలు తయారుచేయగా ఇద్దరూ కలిసి తినేవారు. ఈ విధంగా ఆళ్వార్‌లో స్వామీజీ రోజులు గడవసాగాయి.
పారవశ్య స్థితులలో
ప్రారంభంలో స్వామీజీని గురించి అక్కడి ప్రజలు అంతగా తెలుసుకోలేదు. తరువాత క్రమంగా జనం రాసాగారు. ఉదయం, సాయంత్రం స్వామీజీ భక్తి గీతాలు పాడేవారు. అది వినడానికే జనం తండోపతండాలుగా వచ్చేవారు. ఒక రోజు వారిలో ఒక వ్యక్తి, “స్వామీజీ, మీరు ఏ కులస్థులు?” అని కుతూహలంతో అడిగాడు. “కాయస్థుణ్ణి” అని జవాబిచ్చారు స్వామీజీ. మరొక వ్యక్తి, “మీ రెందుకు కాషాయవస్త్రాలు ధరించారు?” అని అడిగినప్పుడు, “ఎందుకంటే అవి భిక్షగాళ్ల బట్టలు కాబట్టి” అన్నారు స్వామీజీ.
ఆ రోజుల్లో స్వామీజీ జగజ్జనని ధ్యాసలో మునిగి ఉండేవారు. కొన్ని సమయాల్లో ఆయన జగజ్జననితో అతి సన్నిహితంగా మెలగుతూవున్నట్లు కని పించేది. “అమ్మా”, “అమ్మా” అనే మాటలు తప్పమరేదీ ఆయన నోట వచ్చేవి కావు. మూసుకొన్న కళ్ల నుండి నీరు ధారలు కట్టేది. ఇలాంటి పారవశ్య స్థితులలో ఆయన ఉండేవారు. ఆయన సంభాషించేవారు, వేద ఉపనిషత్తుల నుండి మంత్రాలు పారాయణ చేసేవారు. కళ్లవెంట నీరు ధారలు కడుతూవుంటే కృష్ణుని గురించీ, జగజ్జననిని గురించీ ఉద్వేగభరితులై పాడేవారు. అక్కడ సమావేశమైన వారిలో భక్త్యావేశం పెల్లుబికి వారు మైమరచిపోయేవారు.
గురుచరణ్ ద్వారా స్వామీజీ గురించి విన్న మౌల్వీ ఒకరు ఆయన పట్ల ఎంతో ఆకర్షితుడయ్యాడు. ఈ మౌల్వీ ఒక ఉన్నత పాఠశాలలో ఉర్దూ, పారసీకం బోధించే ఉపాధ్యాయుడు. తరచు ఆ ఇద్దరూ స్వామీజీని కలుసుకొని ఆయనతో మాట్లాడేవారు. ఖురాన్లో స్వామీజీకి గల అపార పాండిత్యం అప్పుడు వెల్ల డయింది.
స్వామీజీ దర్శనార్థం జనం తండోపతండాలుగా రాసాగారు. కులమత వివక్ష లేకుండా హిందువులలో పలు శాఖల వారు, మహమ్మదీయులలో పలు శాఖలవారు వచ్చారు. వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగేసరికి ఆళ్వార్ సంస్థానంలో పదవీవిరమణ చేసిన ఇంజనీర్ అయిన పండిట్ శంభునాథ్ అనే వ్యక్తి ఇంట్లో స్వామీజీ బస చేయడానికి ఏర్పాట్లు జరిగాయి.
కనీసం ఒక్క రోజైనా స్వామీజీని తన ఇంటికి ఆహ్వానించి విందు చేయాలని మౌల్వీ ఉబలాటపడ్డాడు. శంభునాథ్ పూర్వాచారసంపన్నుడైన బ్రాహ్మణుడు. ఆయన ఇంట్లో స్వామీజీ బస చేస్తూండడం వలన ఆయన సమ్మతించాలి కదా అని భావించిన మౌల్వీ, శంభునాథ్ వద్దకెళ్లి, “మీరు ఇందుకు సమ్మతించాలి. ఆచారవంతులైన బ్రాహ్మణులచేత వంట చేయిస్తాను. కుర్చీలు బల్లలు మొదలైన వాటిని బ్రాహ్మణులచేత శుభ్రం చేయిస్తాను. బ్రాహ్మణుల ఇళ్ల నుండి పాత్రసామగ్రి తెప్పించి వడ్డన చేయిస్తాను. ఆచారాలు పాటించడంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూసుకొంటాను” అంటూ ఉద్వేగభరితుడై విన్నవించుకొన్నాడు. మౌల్వీ భక్తిప్రపత్తులకు ముగ్ధుడయిన శంభునాథ్, “మీరు అటువంటి ఏర్పాట్లు ఏవీ చేయ నక్కరలేదు. మీ భక్తి ఒక్కటే చాలు. మీ ఇంట్లో భోజనం చేయడానికి నేను కూడా సిద్దమే. స్వామీజీ ఒక ముక్తపురుషుడు. ఆయనను గురించి ఇక చెప్పడానికి ఏముంది! ఆయన ఎక్కడయినా భోజనం చేయవచ్చు” అని చెప్పాడు.
భిక్షాటన ఎందుకు?
ఆళ్వార్ సంస్థానపు దివాన్ అయిన మేజర్ రామచంద్ర స్వామీజీని గురించి విని, ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ సంస్థానాధీశుడైన మంగళ్ సింగ్‌కి పాశ్చాత్య సంస్కృతిపట్ల వ్యామోహం ఎక్కువ. ఆలోచనలలో, చేతలలో అన్నీ ఆంగ్లేయుల పద్ధతులు అనుస రించడంలో అమిత ఆసక్తి గలవాడు. దివాన్‌కు అది సుతరామూ నచ్చదు. రాజు స్వామీజీని కలుసుకోగలిగితే బాగుంటుందని దివాన్ భావించాడు. కనుక రాజుకు, “ఆంగ్లభాషలో అపార అభినివేశం గల ఒక గొప్ప సాధువు ఇక్కడ ఉన్నారు” అని వ్రాశాడు. రాజు మర్నాడే దివాన్ ఇంటికి వచ్చి స్వామీజీని కలుసుకొన్నాడు.
రాజు వచ్చి స్వామీజీకి నమస్కరించి, కూర్చుని సంభాషణ ప్రారంభించాడు.
రాజు : స్వామీజీ! మీరు విద్యాసంపన్నులని విన్నాను. మీ చదువుకు మీరు రెండు చేతులా ఆర్జించవచ్చు కదా! ఎందుకిలా భిక్షాటన చేస్తున్నారు?
స్వామీజీ : రాజా, రాజ్యం పట్ల నిర్వర్తించవలసిన బాధ్యతలు ఎన్నో మీకు ఉన్నాయి. అవన్నీ వదలిపెట్టి మీరు ఎందుకు వేట అదీ ఇదీ అంటూ ఆంగ్లేయు లతో కలసి సమయమంతా వృథాచేస్తున్నారు?
ఏమాత్రం సంకోచించకుండా స్వామీజీ వేసిన ప్రశ్న అక్కడున్న వారందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. రాజు దానిని తేలిగ్గా తీసుకొన్నాడు.
రాజు : ఫలానా కారణమని చెప్పడానికి ఏదీలేదు. నాకు అది బాగా నచ్చింది.
స్వామీజీ : అలాగే నాకు కూడా ఇది బాగా నచ్చింది. నేను భిక్షాన్నం తింటాను.
విగ్రహారాధన: వివరణ
కాసేపటి తరువాత రాజు, “స్వామీజీ, నాకు విగ్రహారాధన పట్ల నమ్మకం లేదు. నా గతి ఏమవుతుంది?” అని అడిగాడు. ఈ ప్రశ్న రాజు చిన్నగా నవ్వుతూ పరిహాసపూర్వకంగా అడిగాడు. ఆయన ప్రశ్నించిన తీరు స్వామీజీకి చిర్రెత్తించింది.
స్వామీజీ : మీరు పరిహసిస్తున్నారని భావిస్తున్నాను.
రాజు : లేదు స్వామీజీ! అందరిలా ఎందుకో నేను మట్టిని, చెట్టును, రాతిని, కట్టెను ఆరాధించలేకపోతున్నాను. పరలోకంలో దుఃఖం అనుభవించడమే నా తలరాతా?
స్వామీజీ : మంచిది, ప్రతి ఒక్కరూ వారివారి నమ్మకాలకు అనుగుణంగా జీవించాలి. అదే మంచిది.
అక్కడున్న వారిలో ఎవరూ ఈ రకమైన జవాబు ఎదురు చూడలేదు. స్వామీజీ విగ్రహారాధనపట్ల సుముఖులు. స్వామీజీ రాజుకు తగినరీతిలో వివరించి చెప్తారని వారందరూ ఎదురుచూశారు. కాని జవాబు చెప్పాక స్వామీజీ తమ దృష్టిని ఆ గది చుట్టూ సారించారు. అక్కడ గోడకు వ్రేలాడుతున్న ఒక చిత్తరువు
ఆయనను ఆకట్టుకొంది. వెంటనే దానిని దింపి తీసుకురమ్మన్నారు.
స్వామీజీ : ఈ చిత్తరువులో ఉన్నది ఎవరు?
దివాన్ : అది రాజుగారి చిత్తరువు.
పిదప స్వామీజీ దివాన్‌తో అన్న మాటలు అందరినీ హడలగొట్టాయి.
స్వామీజీ : దివాన్జీ, ఈ చిత్తరువు మీద ఉమ్మండి.
అందరూ దిగ్భ్రాంతులై చేష్టలుదక్కి నిలబడిపోయారు. స్వామీజీ అది పట్టించుకోకుండా, “ఉమ్మండి దివాన్!” అని మళ్లీ దివాన్‌తో చెప్పారు. దివాన్ కదలలేదు. వెంటనే స్వామీజీ అక్కడున్న తక్కిన వారిని ఉద్దేశించి, “దివాన్ కాక పోతే మీలో ఎవరైనా ముందుకు రండి. ఈ చిత్తరువులో ప్రత్యేకత ఏముంది? వట్టి కాగితమే కదా! దీని మీద ఉమ్మడానికి ఎందుకు తటపటాయిస్తున్నారు?” అని అడిగారు.
అక్కడున్న తక్కిన వారిలో కూడా ఎవరూ స్వామీజీ చెప్పినట్లు చేయడానికి సాహసించి ముందుకు రాలేదు. వారందరూ స్వామీజీని, రాజును మార్చి మార్చి విస్తుబోయి చూస్తూ నిలబడిపోయారు. అప్పుడు స్వామీజీ మళ్లీ దివాన్‌తో, “ఏమిటి, అలాగే నిలబడిపోయారు! ఈ చిత్తరువు మీద ఉమ్మండి” అని కాస్త నొక్కి చెప్పారు. ఆపైన దివాన్ ఉండబట్టలేకపోయాడు; కంపించే స్వరంలో, “స్వామీజీ, ఏమంటున్నారు? అర్థమయ్యేటట్లు చెప్పండి. ఇది రాజుగారి చిత్త రువు. దీని మీద నేనెలా ఉమ్మగలను?” అని అడిగాడు.
స్వామీజీ : అయితే ఏమిటి? రాజుగారి చిత్తరువే కాని సాక్షాత్తు రాజుగారు కాదు కదా! ఈ చిత్తరువులో రాజుగారు సజీవంగా లేరు. ఇది వట్టి కాగితం ముక్క మాత్రమే. రాజుగారి ఎముకలో, కండరాలో, రక్తమో దీన్లో లేవు. ఇది మాట్లాడలేదు, నడవలేదు, రాజుగారిలా వ్యవహరించలేదు. అయినప్పటికీ దీని మీద ఉమ్మడానికి మీరెవరూ సాహసించి ముందుకు రాలేదు. ఎందుకు? ఎందుకంటే ఈ చిత్తరువులో రాజుగారి ప్రతిబింబాన్ని మీరు చూస్తున్నారు. దీని మీద ఉమ్మితే స్వయంగా రాజుగారినే అవమానిస్తున్నట్లు భావిస్తున్నారు.
ఇలా చెప్పి స్వామీజీ రాజుగారి వైపు తిరిగి సంభాషణ కొనసాగించారు: “చూడండి రాజా! ఈ చిత్తరువు మీరు కాదు; కాని ఒక రకంగా మీరే. అందుకే దీనిపై ఉమ్మమన్నప్పుడు మీ పట్ల భక్తిప్రపత్తులు కలిగిన మీ సేవకులు నిరాకరిం చారు. ఇది మీ ప్రతిబింబం. ఈ చిత్తరువును చూస్తున్నప్పుడు వారి మదిలో మీరే నిలుస్తారు. అందువల్లనే మీ పట్ల చూపే మర్యాదామన్ననలను ఈ చిత్తరువు పట్ల కూడా చూపుతున్నారు. రాతితోను, మట్టితోను, చెక్కతోను రూపొందించిన దైవవిగ్రహాలను ఆరాధించే భక్తుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. వారు ఆరాధించే విగ్రహం వారికి ఆ పరమాత్మను జ్ఞప్తికి తెస్తుంది. ఎన్నో చోట్లకు తీర్థయాత్ర చేశాను. ఏ హైందవుడూ, ‘ఓ రాయీ, నిన్ను ఆరాధిస్తున్నాను. ఓ మట్టీ, నన్ను అనుగ్రహించు’ అని ప్రార్థించడం నేను చూడలేదు. రాజా! సర్వాంతర్యామియైన, పరమానంద స్వరూపుడైన ఆ ఆదిదేవుణ్ణే ప్రతి ఒక్కరూ ఆరాధిస్తున్నారు. భగవంతుడు కూడా వారి వారి పరిపక్వతకు అనుగుణంగా అనుగ్రహిస్తాడు.”
విగ్రహారాధనను గురించి ఈ అద్భుతమైన ఆచరణాత్మక వివరణ రాజు గారికి కనువిప్పు కలిగించింది. చేతులు జోడించి రాజుగారు స్వామీజీతో, “మీరు నాకు కనువిప్పు కలిగించారు. స్వామీజీ, ఇంతదాకా ఇలాంటి వివరణను నేను కనీవినీ ఎరుగను. అజ్ఞానంలో మునిగి ఉన్నాను. నా గతి ఏమిటి? నా పట్ల కరుణ వహించండి” అని వినమ్రంగా అడిగాడు. అందుకు స్వామీజీ, “రాజా! భగ వంతునికి తప్ప ఎవరికీ ఎవరి పట్లా కరుణ చూపగల సమర్థత లేదు. ఆయన కరుణాపయోనిధి. ఆయనను ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని కరుణిస్తారు” అన్నారు.
‘పేదలను అనుమతించాలి’
కాసేపటికి స్వామీజీ సెలవు పుచ్చుకొన్నారు. స్వామీజీ వెళ్లిపోయిన తరువాత కూడా రాజు తీవ్రంగా యోచిస్తూ కాసేపు అట్లే కూర్చుండిపోయాడు. పిదప దివాన్‌తో, “దివాన్జీ! ఇలాంటి గొప్ప మహాత్ముణ్ణి నేను ఇంతదాకా కలుసుకోలేదు. ఎలాగన్నా ప్రయత్నించి కొంతకాలం ఆయనను ఇక్కడ ఉండేటట్లు చూడండి” అన్నాడు. అందుకు దివాన్, “నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను. కాని నా ప్రయత్నం సఫలీకృతమవుతుందో లేదో చెప్పలేను. ఎందుకంటే ఆయన సర్వస్వతంత్రుడు, పైగా ఉద్వేగభరితుడు” అన్నాడు. ఆ తరువాత దివాన్ స్వామీజీని కలుసుకొని రాజుగారి విన్నపాన్ని తెలిపాడు. మొదట్లో స్వామీజీ వీలుకాదన్నారు. చివరికి, ఏ సమయంలోనైనాసరే పేదలను, సామాన్యులను తమను కలుసుకోవడానికి అనుమతిస్తేనే తాను ఆ భవంతిలో బసచేస్తానని చెప్పారు.
‘స్వయంకృషి గల వ్యక్తినే భగవంతుడూ ఇష్టపడతాడు’
ఇక్కడ స్వామీజీ సాంగత్యంలో తమ జీవితాలను పలువురు మార్చు కొన్నారు. ఎందరో ఆయనను మార్గదర్శిగా చేసుకొన్నారు. పలువురు ఆయన వద్దకు వెళ్లడం చూసిన ఒక వృద్ధుడు కూడా వెళ్లి తనకు దారి చూపమని అర్థించాడు. స్వామీజీ కొన్ని ఉపదేశాలిచ్చి వాటి ప్రకారం నడచుకోమని చెప్పారు. కాని ఆ వృద్ధుడు ఆయన చెప్పినదేదీ పాటించకుండా పదే పదే వచ్చి తనకు దారిచూపమని అడిగేవాడు. స్వామీజీ ఈ వ్యవహారాన్ని కొన్ని రోజుల దాకా ఓపిగ్గా సహించారు. ఆ వృద్ధుడు ఏమీ సవ్యంగా చేసేటట్లు కనిపించలేదు. కనుక ఒక రోజు అతడు వచ్చినప్పుడు స్వామీజీ అతణ్ణి పట్టించుకోకుండా కూర్చుండిపోయారు. ఆ వృద్ధుడు అడిగిన ఏ ప్రశ్నకూ బదులు చెప్పడంగాని, ఆత డితో మాట్లాడడంగాని చేయలేదు. దాదాపు ఒకటిన్నర గంటల సేపు ఈ విధంగా గడిచింది. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. స్వామీజీ శిలాప్రతిమలా కూర్చుండి పోయారు. ఇదంతా చూసి పట్టరాని కోపంతో ఆ వృద్ధుడు, “ఇకపై ముమ్మాటికీ ఈ స్వామి వద్దకు రానేరాను” అని బిగ్గరగా చెప్పి బయటికి వెళ్లిపోయాడు. ఆతడు వెళ్లిపోయాక స్వామీజీ విరగబడి నవ్వారు. ఒక యువకుడు అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు స్వామీజీ సౌమ్యంగా ఇలా అన్నారు:
“సోదరులారా! నేను మీ కోసం ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను చెప్పినట్లు చేయడానికి మీరు తయారుగా ఉన్నారు కాబట్టి. అందుకు కావలసిన శక్తిసామర్థ్యాలూ మీలో ఉన్నాయి. ఈ వృద్ధుడు విషయ సుఖాల వెంట పరుగెత్తి తన జీవితంలో తొంభైశాతం కోల్పోయాడు. ఇతడు ఆధ్యాత్మిక జీవితానికీ అర్హుడు కాడు, లౌకిక జీవితానికీ అనర్హుడు. ‘దారి చూపండి, కరుణించండి’ అని అడిగినంత మాత్రాన సమస్తం ప్రాప్తిస్తుందని ఇతడు భావిస్తున్నాడు. అది సాధ్యమా? భగవత్సాక్షాత్కారం పొందాలంటే స్వయంకృషి ఉండాలి. ఏమీ చేయని సోమరిపోతును భగవంతుడు అనుగ్ర హిస్తాడా? ధైర్య శౌర్యాలు కొరవడిన వ్యక్తే సోమరిపోతుగా ఉంటాడు. వీరుడైన అర్జునుడు ఈ విధంగా ధైర్య శౌర్యాలు కోల్పోయే స్థితికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఆతడికి గీతోపదేశం చేశాడు. ప్రతిఫలాపేక్షరహితంగా కర్మలు నిర్వహించి ఆతడు ఉన్నత స్థితిని పొందడానికీ, ఆంతరిక పవిత్రతని సంతరించుకోవడానికీ, భగవంతుని శరణుజొచ్చి జీవించడానికీ మార్గం చూపాడు. అందువలన బలిష్ఠులై ఉండండి, పురుషోచితంగా మసలుకోండి. బలిష్ఠులూ, పురుషోచితంగా మసలు కొనే వ్యక్తులు దుర్మార్గులైనప్పటికీ వారిని నేను గౌరవిస్తాను. ఎందుకంటే ఆ బలమే ఏదో ఒక రోజు ఆతణ్ణి దుర్మార్గం నుండి సన్మార్గంలోకి నడిపించడమే కాక, స్వార్థాన్నీ త్యజింపజేసి చిట్టచివరికి ఆతణ్ణి భగవంతుని వద్దకు చేరుస్తుంది.”
భారతదేశ చరిత్రను భారతీయులే రచించాలి
ఆళ్వార్‌లో స్వామీజీ కొందరికి మంత్రదీక్ష నిచ్చారు. ఆచరణాత్మకంగా జపం, ప్రాణాయామం నేర్పించారు. బలిష్ఠులుగా, పురుషోచితంగా వారు భాసిల్లా లని ఆయన బోధించారు. అంతేగాక ఆయన ఉపదేశాల ప్రభావంతో పలువురు ఉన్నత విద్యతోపాటు సంస్కృతం కూడా అభ్యసించారు. సంస్కృత అధ్యయనాన్ని స్వామీజీ ఎంతో ప్రోత్సహించారు. ఆయన ఉపదేశాల మేరకు ఆళ్వారులోని యువకులు అనేకులు సంస్కృతం నేర్చుకోసాగారు. సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి అన్న ప్రశ్నకి జవాబుగా స్వామీజీ ఇలా అన్నారు:
“సంస్కృతం అధ్యయనం చేయండి. అయితే దానితోపాటు పాశ్చాత్య విజ్ఞా నాన్నీ అభ్యసించండి. దేనినైనా కూలంకషంగా తెలుసుకోండి. ఎందుకో తెలుసా? తగిన సమయం ఆసన్నమయినప్పుడు మన చరిత్రను మీరు శాస్త్రీయంగా రచించ గలుగుతారు. ప్రస్తుతం చలామణిలోవున్న భారతదేశ చరిత్ర తారుమారయినది. దానిలో కాలక్రమానుసారంగా ఏదీ పొందుపరచబడలేదు. మన చరిత్రను రచించి నది ఆంగ్లేయులు. వారు రచించినది చదివితే ఒంటబట్టేది దుర్బలత మాత్రమే. ఎందుకంటే వారు మన పతనాన్ని గురించి వ్రాశారు. మన ఆచార వ్యవహారాలు, నాగరకత, సంస్కృతి, వారసత్వం, మతం, తత్త్వంలాంటి అంశాలను ఏవీ ఎరుగని వారు మన చరిత్ర ఎలా సరిగా వ్రాయగలుగుతారు? కాని ఒక విషయం. గత చరిత్రను ఎలా పరిశోధించాలో వారు చూపించారు. ఆ మార్గాన్ని అనుసరించి మనం స్వతంత్రంగా మన చరిత్రను పరిశోధించాలి; వేదాలు, పురాణాలు, పురాతన శాస్త్రాలు అధ్యయనం చేయాలి. వాటి ఆధారంతో యథార్థ మైన ఆత్మస్ఫూర్తిని కలిగించే చరిత్రను రచించాలి. భారతీయులే భారతదేశ చరిత్రను రచించాలి. కనుమరుగైన, కప్పబడివున్న మన ప్రాచీన నిధులను వెలికి తెచ్చే ప్రయత్నంలో ఉండండి. బిడ్డను పోగొట్టుకొన్న వ్యక్తి బిడ్డ లభించేదాకా ఎలా అవిశ్రాంతంగా ఉంటాడో, అదే విధంగా మహోన్నతమైన మన గతచరిత్ర ప్రతి భారతీయుని మనస్సులో ముద్రితమయ్యే దాకా విశ్రమించకండి. నిజమైన జాతీయ విద్య ఇదే. ఈ జాతీయ విద్య వ్యాప్తిలో ఉన్నంతవరకూ నిజమైన జాతీ యతాభావం జాగృతం చెందుతుంది.”
కుల సంస్కారాలు
స్వామీజీని కలుసుకొన్న వారిలో ఒక బ్రాహ్మణ బాలుడు కూడా ఉన్నాడు. స్వామీజీ పట్ల అతడు అపరిమిత భక్తిప్రపత్తులు కలిగిఉన్నాడు. ఉపనయనం జరిపించే వయస్సు వచ్చినప్పటికీ ఆర్థిక స్థోమత లేనందున అతడికి ఉపనయనం ఇంకా చేయలేదు. ఈ సంగతి తెలుసు కొన్న స్వామీజీ తమ వద్దకు వచ్చే వారిలో కాస్త స్థోమత గల ఒక వ్యక్తితో ఈ విషయం చెప్పారు: “ఈ బాలునికి తగిన వయస్సు వచ్చినప్పటికీ స్థోమత లేనందువలన ఉపనయన సంస్కారం జరగలేదు. ఆతడికి సహాయం చేయడం గృహస్థులయిన మీ అందరి కర్తవ్యం. అతడొక బ్రాహ్మణ బాలుడు. ఆ కులానికి తగిన సంస్కార కర్మలు చేయకుండా ఉండడం భావ్యం కాదు. అతడికి ఉప నయనం జరిపించి, ఆతడి చదువుకు కావలసిన ఏర్పాట్లూ మీరు చేస్తే నేను చాలా సంతోషిస్తాను.” ఆళ్వారు నుండి వెళ్లిపోయిన తరువాత కూడా మరచిపో కుండా దీనిగురించి ఉత్తరం వ్రాసి, ఆ బాలునికి సహాయం అందిందని రూఢి చేసుకొన్నారు స్వామీజీ.
స్వామీజీ వినమ్రత
“ఇక్కడ ఎవరైనా మహాత్ములు ఉన్నారా?” అని ఒక రోజు స్వామీజీ భక్తు లను అడిగారు. వృద్ధుడైన వైష్ణవ బ్రహ్మచారి ఒకరు ఉన్నట్లు వారు చెప్పారు. ఒకరిద్దరు భక్తులతో ఒక రోజు స్వామీజీ ఆయనను చూడడానికి వెళ్ళారు. ఆ వైష్ణవ బ్రహ్మచారి వేదాంత సన్న్యాసులను ద్వేషిస్తాడు. కనుక స్వామీజీ అక్కడకు వెళ్ళగానే ఆయన సన్న్యాసులను తూలనాడ సాగాడు. ఆతడి పరుషమైన మాటలన్నీ స్వామీజీ వినమ్రంగా విన్నారు. అంతే గాక, “స్వామీ! భగవంతుని గురించీ, ఆధ్యాత్మిక జీవితం గురించీ మీ ముఖతా తెలుసుకోగోరి వచ్చాను. ఏదైనా ఉపదేశం చేయండి” అని వేడుకున్నారు కూడా. స్వామీజీ వినమ్రతనూ, భక్తినీ చూసి ఆ బ్రహ్మచారి, “పోనీలెండి. నాకు మీపట్ల ద్వేషంకానీ, కోపంకానీ లేవు. తినడానికి ఏదైనా మీకు తెస్తాను, ఉండండి” అన్నాడు. అందుకు స్వామీజీ, “మీకు ఆ శ్రమ వద్దు. ఇప్పుడే తిని వచ్చాను” అన్నారు. తన విన్నపాన్ని స్వామీజీ నిరాకరించగానే వృద్ధుడు మళ్లీ పాత స్థితికి వచ్చాడు. ఆగ్రహోదగ్రుడై, “ఇక్కణ్ణుండి వెళ్లిపో, కనిపించకుండా పో” అని అరిచాడు. వినమ్రతతో స్వామీజీ ఆయనకు నమస్కరించి బయటికి వచ్చేశారు. బయటికి రావడమే ఆలస్యం, అంతసేపు అణచుకొన్నదంతా ఒక్కసారి ఉబికి వచ్చినట్లు విరగబడి నవ్వసాగారు. “ఓహ్, ఎలాంటి అద్భుతమైన మహాత్ముని వద్దకు నన్ను తీసుకొని వచ్చారు!” అంటూ నవ్వసాగారు. భక్తులు కూడా స్వామీజీ నవ్వుతో జతకలిపారు.
చమురు ఎందుకు?
ఒక రోజు స్వామీజీని శిష్యుడొకడు తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. స్వామీజీ వెళ్లినప్పుడు ఆతడు స్నానం చేయడానికి ముందు ఒంటికి చమురు రాచుకొంటున్నాడు. స్వామీజీని చూడగానే ఆయనను సాద రంగా ఆహ్వానిస్తూ, “స్వామీజీ! స్నానం చేయడానికి ముందు ఒంటికి చమురు రాచుకొన్నందువలన ఏదైనా మేలు జరుగుతుందా?” అని అడిగాడు. అందుకు స్వామీజీ, “అవును, 1⁄ 16 శేరు (50 గ్రాములు) చమురును ఒంటికి పట్టిస్తే అది ¼ శేరు (250 గ్రాముల) నేతిని ఆరగించడంతో సమానం” అని జవాబిచ్చారు.
నిజాయతీగా జీవించ సాధ్యమా?
ఒకసారి స్వామీజీ ఒక శిష్యుని ఆహ్వానం మేరకు ఆతడి ఇంటిని పావనం చేశారు. భోజనానంతరం విశ్రాంతి తీసుకొంటున్నప్పుడు ఆ శిష్యుడు, “స్వామీజీ! సత్యసంధత, పవిత్రత, నిస్వార్థ కర్మ, నిజాయతీ అంటూ మీరు బోధిస్తున్నారు. పనిచేసుకుంటూ జీవించే వ్యక్తి వీటిని పాటించగలుగుతాడని నేను అనుకోను. అందునా సొంత వ్యాపారాలు చేసుకొంటున్నవారు సత్యసంధులుగానూ, నిజాయతీపరులుగానూ వ్యవహరించడం ఈ రోజుల్లో అసాధ్యం. నిజాయతీగా, నీతి వ్యాపారం చేసి ఈ లోకంలో జీవించ సాధ్యమా?”
స్వామీజీ ఇలా అన్నారు: “దీనిని గురించి నేను దీర్ఘంగా ఆలోచించాను. నిజాయతీగా సంపాదించడానికి ఏ ఒక్కరూ ఇష్టపడడం లేదన్నదే నాకు లభించిన జవాబు. అదే నిజం! ఇదంతా ఎవరు ఆలోచిస్తున్నారు? దీనిని గురించి ఆలోచించడానికి కూడా ఎవరూ ఇష్టపడడం లేదు కూడా. ఇటువంటి సమస్య ఒకటి ఉందని కూడా ఎవరూ గ్రహించలేదు కూడా. ప్రస్తుత విద్యావిధానమే ఈ పతనానికి కారణం.
వ్యావసాయిక విజ్ఞాన శాస్త్రం కావాలి
“వ్యవసాయం వృత్తిగా ఎన్నుకోవడం మంచిదని నా అభిప్రాయం. కాని దీనిని గురించి ఎవరితోనైనా ప్రస్తావిస్తే, ‘విద్యావంతుణ్ణి అయిన నేనేమిటి వ్యవసాయం చేయడమేమిటి? దేశంలోని ప్రతి ఒక్కరూ రైతు కావడమా? ఇప్పటికే దేశం రైతులతో నిండిపోయివుంది. అందువలననే దేశం ఇంతగా పతనమయింది’ అంటాడు. కాని ఇది ఎన్నటికీ నిజం కాదు. రామాయణం చదవండి. జనకుడు ఒక చేత్తో నాగలి పుచ్చుకొని పొలం దున్నుతూ, మరో చేత్తో వేదాధ్యయనం చేసినట్లు అందులో ప్రస్తావించారు. మన ప్రాచీన మహర్షులు కర్షకులుగా కూడా విరాజిల్లారు.
“వ్యవసాయం అంటే ప్రస్తుతం మన రైతులు అవలంబిస్తున్న పామర తనమైన వ్యావసాయిక వృత్తిని గురించి కాదు నేను ప్రస్తావిస్తున్నది. అమెరికాను చూడండి. వ్యావసాయిక రంగాన్ని శాస్త్రీయంగా పురోభివృద్ధి గావించడం మూలంగా మాత్రమే వారు సర్వత్రా ఇంత అభివృద్ధిని సాధించగలిగారు. అదే విధంగా మనం కూడా వ్యవసాయాన్ని ఒక విజ్ఞాన శాస్త్రంగా నేర్చుకోవాలి. శాస్త్రీయ విధానంతో దానిని పెంపొందించాలి.
“నేడో, ఒక గ్రామస్థుడు రెండు ఆంగ్ల పుస్తకాలు తిరగవేస్తే చాలు, పట్ట ణానికి పరుగుతీస్తాడు. గ్రామంలో ఆతడికి ఎంతో పొలం ఉంటుంది, కాని అత డికి అది చాలదు. పట్టణంలో ఉద్యోగం చేయాలని ఉవ్విళ్ళూరుతాడు, పట్టణ జీవి తాన్ని చవిచూడాలని తపిస్తాడు. ఆ కారణంగానే ఇతర జాతుల వారిలా హిందు వులు ప్రగతి సాధించలేకపోయారు.
“అంతేకాక మన దేశంలో మరణ శాతం ఎక్కువ. పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి స్వల్పకాలంలో మన దేశం అధోగతిపాలవుతుంది. దీనికంతటికీ ముఖ్య కారణం ఇక్కడ వ్యావసాయిక ఉత్పత్తి సరిపడినంతగా లేదు. పంటలకు ఆధారమైన గ్రామాలలో నివసించేవారికి పట్టణ వ్యామోహం! వ్యవసాయదారుని కుమారుడు కాస్త చదువుకొంటే చాలు వారసత్వంగా వస్తున్న తమ కులవృత్తికి స్వస్తి చెబుతాడు; ఉద్యోగార్థం పట్టణానికి పోతాడు.
“గ్రామాలలో జీవించడం వలన ఆయుస్సు పెరుగుతుంది; వ్యాధులు అక్కడ చాలా తక్కువ. విద్యావంతులు గ్రామాల్లో నివసింపనారంభిస్తే గ్రామాలు పురోభి వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. అక్కడ శాస్త్రీయరీత్యా సాగుచేస్తే వంట దిగు బడి అధికమవుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులలో జాగృతం కలిగించ వచ్చు. వారి తెలివితేటలు పెంపొందుతాయి. వారు మరిన్ని మంచి విషయాలను నేర్చుకోగలుగుతారు. మన దేశానికి అత్యంత ఆవశ్యకమైనది కూడా తత్ఫలితంగా సాధించవచ్చు.”
శిష్యుడు : మన దేశానికి అత్యంత ఆవశ్యకమైనది అని మీరన్నారు కదా, అదేమిటి స్వామీజీ?
స్వామీజీ : ఇంకేమిటి? అగ్రవర్ణాలవారికీ, నిమ్నకులానికి చెందినవారికీ మధ్య ఒక రకమైన సౌభ్రాతృత్వం రూపొందుతుందంటాను! నీ బోటి విద్యా వంతులు గ్రామాలకు పోయి, వ్యవసాయం చేపట్టి గ్రామస్థులతో కలిసి జీవిస్తూ, వారిని మీ బంధువులుగా పరిగణించి, మైత్రీభావంతో మెలగండి! వారు మీ కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉంటారని మీరు గ్రహిస్తారు. నేడు మనం ముఖ్యంగా చేయవలసింది ఏమిటి? పామరులకు కూడా విద్య నేర్పడం, నిమ్న కులస్థులకు కూడా అత్యున్నత సత్యాలను బోధించడం, వారిపట్ల ప్రేమ, సానుభూతి చూపించడం. ఇవన్నీ జరుగుతాయి.
శిష్యుడు: ఎలా జరుగుతాయి, స్వామీజీ?
స్వామీజీ : ఏమిటీ! వెళ్ళి గ్రామస్థులతో కలసి జీవించి చూడు. విద్యా వంతులతో సాంగత్యం నెరపడానికి వారు ఎంత ఉత్సుకత చూపుతారో అప్పుడు నీకు తెలుస్తుంది. జ్ఞానపిపాస అందరిలోనూ ఉంది. ఒక విద్యావంతుడు గ్రామానికి వెళితే గ్రామస్థులు ఆతణ్ణి పరివేష్ఠించి, ఆతడు చెప్పే మాటలు ఎంత ఆసక్తితో వింటారో కదా! గ్రామస్థులలోని ఈ ఉత్సుకతను విద్యావంతులు ఉపయోగించు కోవాలి. వారిని సాయం సమయాల్లో తమ ఇళ్లకు ఆహ్వానించి, కథలు, దృష్టాంతాలు మొదలైన వాటి మూలంగా వారికి విద్య గరపాలి. దీనిని జాతీయ స్థాయిలో, ఒక జాతీయ ఉద్యమంగా నిర్వహిస్తే, ఇతర మార్గాలలో వెయ్యేళ్లలో సాధించేదానికన్నా నూరు రెట్లు ఫలితాన్ని పదేళ్లలోనే మనం సాధించగలం.
విడిచిపెట్టం
దాదాపు ఏడు వారాలు ఆళ్వారులో గడిపిన తరువాత స్వామీజీ అక్కణ్ణుండి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. కాని స్వామీజీని వదలిపెట్టడానికి అక్కడున్న వారెవరూ సిద్ధంగా లేరు. “నేను వెళ్ళాలి. సన్న్యాసి సదా పర్యటిస్తూనే ఉండాలి” అని చెప్పి, మార్చ్ 28 వ తేదీన అక్కణ్ణుండి స్వామీజీ బయలుదేరారు. ప్రతి ఒక్కరూ చెమ్మగిల్లిన కళ్ళతో ఆయనకు పాదాభివందనం చేసినప్పుడు స్వామీజీ సైతం ఉద్వేగభరితులయ్యారు. మనః స్ఫూర్తిగా వారిని ఆశీర్వదించారు. కాని ఆయన వెళ్లక తప్పదు కదా! నేర్పిస్తూ, బోధిస్తూ మానవాళికి సహాయపడుతూ, భగవంతుణ్ణి ధ్యానిస్తూ పర్యటించడమే కదా ఆయన కర్తవ్యం!
మిత్రులలో కొందరు పట్టుబట్టి స్వామీజీతో కలిసి కొంతదూరమైనా వెళ్ళి ఆయనకు వీడ్కోలు ఇవ్వాలనే ఉద్దేశంతో బయలుదేరారు. స్వామీజీ కాలినడకనే వెళ్లాలనుకొన్నారు. కాని వారి విన్నపం మన్నించి దాదాపు 18 మైళ్ళ దూరంలోని పాండుపోల్ అనే ఊరు దాకా ఎడ్లబండిలో పయనించడానికి సమ్మతించారు.
పాండుపోల్లో సుప్రసిద్ధమైన ఆంజనేయస్వామి దేవాలయం ఒకటి ఉంది. ఆ రాత్రి స్వామీజీ ఆ ఆలయంలో గడిపారు. మర్నాడు అందరూ కలిసి దాదాపు 16 మైళ్లు అరణ్య మార్గం గుండా నడిచి వెళ్లారు. క్రూర మృగాలు సంచరించే ప్రాంతం అది. కాని స్వామీజీతో కలిసి పోతున్నవారు దానిని గురించి ఆందోళన చెందలేదు. ఎందుకంటే స్వామీజీ మాటలు, కథలు, హాస్యోక్తులు వారిని పరిసరా లను కాని, సమయాన్ని గురించి కాని స్ఫురింపనీయకుండా చేశాయి. అందరూ కలిసి తహ్లా గ్రామం చేరుకొని, ఆ రాత్రి నీలకంఠ మహాదేవాలయంలో గడిపారు.
నీలకంఠుడు: వ్యాఖ్యానం
పరమేశ్వరుడు ఎలా నీలకంఠుడయ్యాడు? దీనిని గురించి ఒక కథ ఉంది. దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలికారు. దాన్లో నుండి ఐరావతమనే ఒక గొప్ప ఏనుగు, ఉచ్చైశ్రవమనే గుర్రం, అతిలోక సౌందర్య రాశియైన కన్య, నవరత్నాలు లాంటి అమూల్యమైనవి ఉద్భవించాయి. దేవతలు, రాక్షసులు అన్నీ స్వాధీనం చేసుకొ న్నారు. చివరగా హాలాహలం ఉద్భవించింది. దాని తీక్ష్ణతను భరించలేక అందరూ తలో దిక్కూ పారిపోయారు. ఆ హాలాహలం లోకాలనే దహించివేసేట్లుగా ఉంది. కనుక ఏం చేయాలో పాలుబోక చివరికి అందరూ పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చారు. పాలసముద్రాన్ని చిలికినప్పుడు ఉద్భవించిన ఏ సంపత్తినీ ఖాతరు చేయక పర మేశ్వరుడు అంతర్ముఖుడై ధ్యానమగ్నుడై ఉండిపోయాడు. ఇప్పుడు సురాసురుల ఆర్తనాదాలు ఆలకించి వారి సహాయార్థం వెళ్ళి, చేతులు చాపి ఆ హాలాహలాన్ని తీసుకొని ఠక్కున మ్రింగేశాడు. అది ఆయన కంఠంలో ఉండిపోవడంతో కంఠం నీలమయిపోయింది.
స్వామీజీ ఇందుకు అద్భుతమైన ఒక వ్యాఖ్యానమిచ్చారు. మనిషి లోకంలో జీవిస్తున్నాడు. అతడు సంసారమనే సాగరాన్ని చిలకరిస్తాడు. ఇంద్రియానందం కలిగించే అనేక వస్తువులు అందులో నుండి ఉద్భవిస్తున్నాయి. వాటిని అనుభవిస్తున్నాడు. కాని ఈ అనుభవాలలో అనాసక్తుడై వైదొలగి ఉంటాడు సన్న్యాసి. అంతర్ముఖుడై ఆత్మానందాన్ని చవిచూస్తున్న ఆతడు మాయ అందించే మనస్సును ఆకర్షించే ఏ వస్తువునూ స్వీకరించడు. చిట్టచివరగా వచ్చేది మరణమనే విషం. దానిని చూసి భయపడి, వణకిపోతూ పరుగెత్తి తన వద్దకొచ్చి శరణుజొచ్చేవారిని, మహాదేవునిలా, వారి అజ్ఞానాన్ని నశింపజేసి మరణ భయం నుండి కాపాడతాడు సన్న్యాసి. ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తికి మరణ భయం లేదని కూడా గ్రహింపజేస్తున్నాడు.
జైపూర్‌లో
ఈ విధమైన కథలూ, వ్యాఖ్యానాలూ వింటూ స్వామీజీతోపాటు పద్దెనిమిది మైళ్ల దూరంలోని నారాయణి అనే గ్రామం దాకా మిత్రులంతా వెళ్లారు. కాస్త దూరమనుకొని ప్రారంభించిన వారు దాదాపు యాభై మైళ్ళకు పైగానే స్వామీజీతోపాటు కలసి వచ్చారు. ఇక అంతకుమించి వారు తనను అనుసరించి రావడానికి స్వామీజీ సుతరామూ ఇష్టపడలేదు. కనుక అక్కడ వారికి వీడ్కోలిచ్చారు. అక్కణ్ణుండి పదహారు మైళ్లు కాలినడకన వెళ్ళి రైలెక్కి జైపూర్ చేరుకొన్నారు. ఆళ్వారులో కలుసుకొన్న ఒక భక్తుడు అక్కడ స్వామీజీకి స్వాగతం పలికాడు.
మూడు గంటల్లో పాణినీ సూత్రం
జైపూర్‌లో స్వామీజీ రెండు వారాలు గడిపారు. ఒక గొప్ప సంస్కృత పండి తుడు అక్కడ ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళి స్వామీజీ సంస్కృత వ్యాకరణ గ్రంథమయిన పాణిని అష్టాధ్యాయిని నేర్చుకోగోరారు. ఆ పండితుడు గొప్ప విద్వాంసుడు. కాని ఆయనకి ఇతరులకు నేర్పే ప్రతిభ లేదు. కనుక మూడు రోజులు గడచినప్పటికీ స్వామీజీ మొదటి సూత్రాన్ని సైతం అర్థం చేసుకోలేకపోయారు. నాలుగవ రోజు ఆ పండితుడు, “స్వామీజీ, మూడు రోజులుగా నేర్చుకుంటున్నా ఎలాంటి ప్రయోజనమూ లేదు. నా వద్ద అభ్యసించడం మీకు అంతగా ప్రయోజనం ఉండ దని అనుకొంటున్నాను” అని స్వామీజీతో చెప్పాడు. పండితుని మాటకు స్వామీజీ అంగీకరించారు. కాని ఆసక్తిని కోల్పోలేదు; ఆ సూత్రాలను నేర్చుకుని తీరాలని సంకల్పించుకొన్నారు. స్వయంగా తామే నేర్చుకోసాగారు. మూడు రోజుల్లో సాధించలేనిది కేవలం మూడు గంటల్లోనే స్వయంకృషితో స్వామీజీ సాధించారు. తరువాత ఆ పండితుని వద్దకు పోయి సూత్రార్థమూ. వ్యాఖ్యానమూ తెలిపారు. ఆ పండితుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఈ విధంగా స్వయంగా తామే ఒక్కో సూత్రాన్నీ స్వామీజీ నేర్చుకొన్నారు.
‘సజీవ కృష్ణుణ్ణి చూడండి’
జైపూర్ సంస్థాన సేనాధిపతియైన సర్దార్ హరీసింగ్ స్వామీజీకి పరిచయమ య్యాడు. ఆయన ఆహ్వానం పురస్కరించుకొని స్వామీజీ ఆయన ఇంట్లో కొన్ని రోజులు బసచేశారు. హరీసింగ్కు వేదాంత సిద్ధాంతాల పట్ల గట్టి నమ్మకం ఉంది. కాని విగ్రహారాధన లాంటి వాటి పట్ల ఆతడికి నమ్మకం లేదు. ఈ విషయం స్వామీజీ గంటల తరబడి ఆతడికి వివరించి చెప్పినప్పటికీ ఆతడు దానిని నమ్మలేదు. ఒక రోజు సాయంత్రం ఇద్దరూ కాలినడకన పోతున్నారు. అప్పుడు ఎదురుగా కృష్ణుని విగ్రహాన్ని ఊరేగిస్తూ ఒక భజన బృందం రాసాగింది. ఇద్దరూ కాసేపు నిలబడి ఊరేగింపు చూశారు. హఠాత్తుగా స్వామీజీ హరీసింగ్ను తాకి, “హరీసింగ్జీ, అదుగో చూడండి, కృష్ణుణ్ణి సజీవంగా చూడండి” అన్నారు. హరీసింగ్ చూసినప్పుడు అక్కడ విగ్రహానికి మారుగా నిజంగానే కృష్ణుడు నిలబడి ఉన్నాడు. హరీసింగ్ నమ్మలేక పోయాడు. పారవశ్యానికి లోనైన ఆతడి కళ్ళు నిశ్చలమైనాయి; కళ్ల నుండి నీరు ధారకట్టింది. ఆ స్థితి ఉపశమించాక ఆతడు, “స్వామీజీ, గంటల తరబడి వివరించినా సాధించలేనిది మీ స్పర్శ అలవోకగా సాధించింది. నేను కృష్ణుణ్ణి దర్శించాను” అన్నాడు గద్గద స్వరంతో!
‘మీరు ఏ అవతారం?
మరొక రోజు పలువురు మిత్రులతో స్వామీజీ కూర్చుని ఉన్నారు. ఆ సమ యంలో పండిట్ సూరజ్ నారాయణ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. జైపూర్‌లో సుప్రసిద్ధ పండితుడిగా ఆయన పేరుపొందాడు. స్వామీజీ మిత్రుల ముచ్చటిస్తున్నదంతా కాసేపు విన్న తరువాత ఆయన, “స్వామీజీ, నే నొక వేదాంతిని. అవతారం అనే మాటనే నేను నమ్మను. అవన్నీ పురాణాలు వచించే కట్టుకథలు. మన మందరమూ పరబ్రహ్మ స్వరూపులం. ఇలావున్నప్పుడు నాకూ ఒక అవతారానికీ తారతమ్య మేమిటి?” అని అడిగాడు. వేదాంతాన్ని సముచితంగా అర్థంచేసుకోని ఆ పండితుడి ప్రశ్న స్వామీ జీకి చీకాకు కలిగించింది. ఆతడికి కాస్త ఘాటుగా జవాబివ్వాలనుకొని, “నిజమే. మీరు చెప్పింది ముమ్మాటికీ నిజం. మీరూ అవతారమూ అభిన్నం. కాని చేప, తాబేలు, పంది – వీటిని కూడా హిందువులు అవతారంగా పరిగణిస్తున్నారు. దీన్లో మీరు ఏ అవతారం?” అని అడిగారు స్వామీజీ. అక్కడ సమావేశమైన వారందరూ ఘొల్లున నవ్వారు.
అనుసరించే అఖండానంద
ఈ రోజుల్లో కూడా స్వామీజీ అప్పుడప్పుడు వరాహనగర మఠానికి ఉత్త రాలు వ్రాసేవారు. వాటి మూలంగా ఆయన బసచేసిన చోటు ఉజ్జాయింపుగా వారికి తెలిసింది. ఈ రీతిలో స్వామీజీ జైపూర్‌లో ఉంటున్న విషయం తెలుసుకొన్న స్వామి అఖండానంద ఆయనను చూడడానికి వచ్చారు. సోదర సన్న్యాసులలో అఖండానందకు స్వామీజీ పట్ల ప్రత్యేకమైన అక్కర, గౌరవం ఉన్నాయి; ఆయనను సాక్షాత్తు గురువుగానే భావించారు. ఒక రోజు స్వామీజీ మిత్రులతో మాట్లాడుతూన్నప్పుడు, హఠాత్తుగా అఖండానంద ఆయన ముందుకొచ్చి నిలబడ్డారు. స్వామీజీ మొదట ఆనందించినా, తమ ఆనందోద్వేగాన్ని బయటకు వెలిబుచ్చలేదు. అఖండానందుని సుతిమెత్తగా మందలిస్తూ, “ఇక నన్ను అనుసరించావంటే జరిగేది వేరు” అంటూ భయపెట్టి పంపించివేశారు. అఖండానంద అప్పటికి వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ పలుచోట్ల స్వామీజీని వెంబడించక పోలేదు.
ఆజ్మీర్లో
జైపూర్‌లో రెండు వారాలు గడిపిన తరువాత స్వామీజీ ఆజ్మీర్ వెళ్ళారు. పలువురు హైందవ, మహమ్మదీయ రాజుల స్మృతి చిహ్నాలమయంగా ఆజ్మీర్ను పేర్కొనడం అతిశయోక్తి కాదు. అక్కడి అక్బర్ రాజప్రాసాదం తదితర ముఖ్యమైన చోట్లను స్వామీజీ సందర్శించారు. ఆజ్మీర్ మసీదుకు (దర్గా) ఒక విశిష్టత ఉంది. అది సుప్రసిద్ధ మహమ్మదీయ సాధువయిన మైనుద్దీన్ ఛిస్తీ సమాధి చెందిన చోటు. ఆ దర్గా హిందువులకూ, మహమ్మదీయు లకూ పవిత్ర స్థలంగా విరాజిల్లుతున్నది. ఈ మహాత్ముడు జీవించిన కాలంలో హిందువులూ, మహమ్మదీయులూ సరిసమానులుగా పరిగణింపబడ్డారు. మతసామరస్యానికి ఒక ఉదాహరణగా భాసిల్లుతున్న ఆ మహాత్ముని సమాధి ఈ రెండు మతాలవారికి ఇప్పటికీ ఉమ్మడి స్థలంగా ఉంది. సృష్టికర్తయైన బ్రహ్మ దేవుని ఆలయాలు బహు అరుదు. వాటిలో ఒకటి ఆజ్మీర్లో ఉంది. స్వామీజీ ఆ ఆలయాన్ని కూడా దర్శించుకొన్నారు.
మౌంట్ ఆబూలో
ఏప్రిల్ 14 వ తేదీన ఆజ్మీర్ నుండి బయలుదేరి, స్వామీజీ మౌంట్ ఆబూ వెళ్లారు. పశ్చిమ భారతదేశంలోని ఒక ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రం అది. అక్కడున్న జైన దేవాలయాలలో దిల్వారా ఆలయం ఒకటి. అందానికీ, గంభీరతకీ శిల్ప కళలకూ ఆలవాలమై ఆ ఆలయం విరాజిల్లుతున్నది. 13 వ శతాబ్దంలో ఇద్దరు రాజకుమారుల ప్రయత్న ఫలంగా ఆ ఆలయం నిర్మించబడింది. దానినిర్మాణానికి 14 సంవత్సరాలు పట్టింది. కొన్ని రోజులపాటు ఆ ఆలయాన్ని స్వామీజీ సునిశితంగా పరికించారు. అక్కడొక చెరుమా, దాని తీరంలో కొన్ని నిటారుగా నిలబడివున్న శిలలు ఉన్నాయి. ఆ శిలలు విచిత్ర ఆకృతిలో ఉన్నాయి; ఒకటి ఒక సన్న్యాసిని ప్రార్థన చేస్తున్నట్లుగా ఉంటుంది, మరొకటి నీళ్లలో దూకబోతున్న కప్ప ఆకృతిలోవుంది. వాటిని కూడా స్వామీజీ ఆనందంగా తిలకించారు.
శిలల మీద కూర్చుని పాడడం
అక్కడ కూడా స్వామీజీని కలుసుకొన్నవారికి కొరత లేదు. సాయం సమ యాలు వారితోపాటు దిగువ కనబడుతున్న అందమైన చెరువును మైమరచి చూస్తూ కొండ మీద స్వామీజీ నడవడం రివాజు. ఒక రోజు అందరూ కలసి నడుస్తున్నప్పుడు స్వామీజీ భక్తులతో ఆ కాలిబాట నుండి ప్రక్కకు నడిచి అక్కడున్న శిలల మీద కూర్చున్నారు. సాయం సమయమూ, ప్రకృతి సౌందర్యమూ కలిసి స్వామీజీ మనస్సును ఆహ్లాదపరిచాయి. మైమరచిన స్థితిలో ఆయన పాడనారంభించారు. అలా కొన్ని గంటల పాటు పాడారు. అక్కడ నడచిపోతున్న యావన్మందీ ఆయన పాటలను వింటూ మైమరచి ఉన్నచోటనే నిలబడిపోయారు. కొందరు ఆంగ్లేయులు కూడా ఆ పాటలు వింటూ, గాయకుణ్ణి చూడాలనే ఆతురతతో నిలబడిపోయారు. చివరికి స్వామీజీ పాడడం ఆపి రాగానే అందరూ ఆయనకు ప్రణమిల్లారు.
గుహ వాసం
మౌంట్ ఆబూలోని ఒక పాడుబడిన గుహలో ఉండి స్వామీజీ తపస్సు చేసుకోసాగారు. ఒక రోజు ప్రభుత్వ న్యాయవాదియైన ఒక మహమ్మదీయుడు అటువైపుగా వెళ్ళడం తటస్థించింది. స్వామీజీ వ్యక్తిత్వం ఎంతగానో ఆకట్టుకోవడంతో అతడు ఆయన వద్దకు వెళ్ళి మాట్లాడాడు. స్వామీజీ ఒక సాధారణ సన్న్యాసి కాదు; మేధస్సులోను, ఆధ్యాత్మికత లోను అత్యున్నతులని అతడు కాసేపట్లోనే గ్రహించాడు. ఈ సంఘటనానంతరం అతడు స్వామీజీను పలుమార్లు కలుసుకొన్నాడు. ఒక రోజు అతడు, “స్వామీజీ, నేను మీకు ఏ రకంగానైనా సహాయపడగలనా?” అని స్వామీజీని అడిగాడు. అందుకు స్వామీజీ, “వానాకాలం వస్తోంది. ఈ గుహకు తలుపులు లేవు. మీరు తలుపులు చేయిస్తే బాగుంటుంది” అన్నారు. అందుకు ఆ న్యాయవాది ఇలా అన్నాడు: “స్వామీజీ! ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యుణ్ణి. కాని నాదొక విన్నపం. నా కొక భవంతి ఉంది. నేను ఒంటరిగానే నివసిస్తున్నాను. మీకు సమ్మతమైతే అక్కడికి వచ్చి ఉండవచ్చు. కాని నేనొక మహమ్మదీయుణ్ణి. మీభోజనానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయిస్తాను.” స్వామీజీ భోజనం విషయంలో పట్టింపులు లేకుండా ఆ న్యాయవాదితో పాటు ఆతడి భవంతికి వెళ్లారు.
‘సర్వత్రా భగవంతుణ్ణి గాంచుచున్నాను’
ఇక్కడ స్వామీజీకి పలువురు పరిచయమయ్యారు. వారిలో ఒకరు ఖేత్రీ మహారాజు వ్యక్తిగత కార్యదర్శియైన మున్షీ జగ్మోహన్లాల్. జగ్మోహన్ వచ్చి నప్పుడు స్వామీజీ కౌపీనధారియై నిద్రిస్తున్నారు. ఆయనను చూసిన జగ్మోహన్, ‘ఓహ్! పదిమందిలో పదకొండవ వాడిలా ఉన్న సన్న్యాసి! దొంగల ముఠా, మోసగాళ్ళ గుంపుకు చెందిన మరొకడు!’ అని అనుకొన్నాడు. ఇంతలో స్వామీజీ మేల్కొన్నారు. వెంటనే ఆయనతో, “స్వామీ! మీరొక హైందవ సన్న్యాసి. ఒక మహమ్మదీయునితో బసచేసి ఉన్నారేమిటి? మీ ఆహారాన్ని అతడు తాకవలసివస్తుంది కదా!” అన్నారు. ఈ ప్రశ్న స్వామీజీలో ఒక రకమైన ఉద్వేగాన్ని రగిల్చింది. అగ్నిగోళం నుండి జ్వాలలు ఎగసిపడుతున్నట్లు ఆయన మాట్లాడారు: “మీరేమంటున్నారు? నే నొక సన్న్యాసిని. మీ సామాజిక కట్టుబాట్లనన్నింటినీ దాటివచ్చిన వ్యక్తిని. నేను మరుగుదొడ్లు శుభ్రం చేసే వ్యక్తితో కలసి భోజనం చేయవచ్చు. భగవంతుడంటే నాకు భయం లేదు; ఎందుకంటే దీనికి ఆయన ఆమోదముద్ర ఉంది కనుక. శాస్త్రాల పట్ల కూడా నాకు భయం లేదు, అవి కూడా దీనిని అనుమతిస్తున్నాయి. కాని నేను మీకు, ఆ ప్రజలకు, ఈ సమాజానికి భయపడుతున్నాను. మీకు భగవంతుణ్ణి గురించికాని, శాస్త్రాల గురించికాని ఏమీ తెలియదు. నేను సర్వత్రా భగవంతుణ్ణి దర్శిస్తున్నాను. అతిసామాన్యమైన ప్రాణిలో కూడా ఆయనే కొలువై ఉండడం చూస్తున్నాను. ఉన్నతమైనదీ, అధమమైనదీ అంటూ నాకు ఏదీ లేదు. శివ శివ!” జగ్మోహన్ దిగ్భ్రమ చెందాడు. ఆతడికి స్వామీజీ పట్ల అపారమైన భక్తిప్రపత్తులు కలిగాయి. ఖేత్రీ మహారాజు ఇటువంటి సన్న్యాసిని కలుసుకొంటే మంచిదని అతడు భావించి, స్వామీజీని రాజప్రాసాదానికి ఆహ్వానించాడు. రెండు రోజుల తరువాత వస్తానన్నారు స్వామీజీ.
‘జీవితమంటే ఏమిటి?’
అప్పుడు ఖేత్రీ మహారాజు రాజా అజిత్‌సింగ్. ఆయనతో స్వామీజీ గురించి జగ్మోహన్ తెలియజేశాడు. స్వయంగా తనే వెళ్ళి స్వామీజీని కలుసుకొంటాన న్నాడు మహారాజు. ఈ విషయం విన్న స్వామీజీ ఆలస్యం చేయకుండా తిన్నగా రాజప్రాసాదానికి వెళ్ళారు. ఆయనను ఆదరాభిమానాలతో మహారాజు ఆహ్వానించి, ఉపచర్యలు చేశాడు. పిదప మహారాజు, “స్వామీజీ, జీవితం అంటే ఏమిటి?” అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్వామీజీ అద్భుతమైన వ్యాఖ్యానం ఇచ్చారు: “తనను అణచివేయడానికి ఉన్ముఖమయ్యే పరిస్థితులలో సైతం ఒక జీవి తనను సువ్యక్తం చేసుకొని వికాసపరచుకోవడమే జీవితం.” ఈ వ్యాఖ్యానం మహారాజుకు బాగా నచ్చింది. మళ్ళీ, “స్వామీజీ, విద్య అంటే ఏమిటి?” అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్వామీజీ, “కొన్ని భావనలు మన నరనరాల్లో జీర్ణించుకుపోవడమే విద్య” అని జవాబిచ్చారు.
ఈ సమావేశం 1891 జూన్ 4 వ తేదీన జరిగింది. స్వామీజీకీ, ఖేత్రీ మహారాజుకూ మధ్య ఈ విధంగా ప్రారంభమయిన మైత్రి స్వామీజీ జీవితంలో ఖేత్రీ మహారాజు ఒక విడదీయలేని అంశంగా మారింది.
స్వామీజీ పట్ల అమితంగా ఆకర్షితుడైన మహారాజు ఒక రోజు, “స్వామీజీ! మీరు నాతో మా రాజధానికి వచ్చి నివసించాలి. నేను మనఃస్ఫూర్తిగా మీకు సేవచేస్తాను” అని స్వామీజీతో విన్నవించాడు. స్వామీజీ క్షణంసేపు యోచించి పిదప ఆ ప్రతిపాదనకు ఆమోదించారు. జూలై 24 వ తేదీన మహారాజుతో బయలుదేరి ఆగస్ట్ 7 వ తేదీన ఖేత్రీ చేరుకొన్నారు. దారిలో స్వామీజీతో అనేక విషయాల గురించి ముచ్చటించడానికి మహారాజుకు అవకాశం చిక్కింది.
ఖేత్రీలో వేదాంత ప్రసంగాలు, పాటలు, భజనలతో స్వామీజీ రోజులు గడి చాయి. ఆయన దేని గురించి మాట్లాడినా దాన్లో స్పష్టంగా ధ్వనించిన విషయాలు రెండు: మాతృదేశం పట్ల, హైందవ సంస్కృతి పట్ల ఆయనకున్న ప్రేమ, అభిమానం. ఖేత్రీలో నివసించినప్పుడు రాజప్రసాదంలో మాత్రమే స్వామీజీ తమ సమయమంతా వెచ్చించలేదు. రోజూ వెళ్ళి జనసామాన్యాన్ని కలుసుకొని వారితో కలిసి భోజనం కూడా చేశారు, వారి జీవనసరళిని సునిశితంగా పరికించారు.
సత్యమంటే ఏమిటి?
ఒక రోజు ఖేత్రీ మహారాజు, “స్వామీజీ, సత్యం అంటే ఏమిటి?” అని స్వామీజీని అడిగారు. అందుకు స్వామీజీ, “అద్వితీయమైనదే సత్యం. అవిచ్ఛిన్నంగా మనిషి దాని వైపుగానే పయనిస్తున్నాడు. అతడు సత్యం నుండి సత్యానికి పయనం చేస్తున్నాడు; అసత్యం నుండి సత్యానికి కాదు” అన్నారు. అంతేకాక దీని అర్థం చెప్పనారంభించారు: జ్ఞానం, అనుభవం, ఆరాధనా పద్ధతులు అన్నీ ఆ ఒకే సత్యం వైపుగా వెళ్ళే మార్గాలు. సన్న్యాసి అయినా, గృహస్థుడయినా, వారు సత్యసంధులయితే ఏ మార్గం గుండానయినా ఆ సత్యాన్ని చేరుకోవచ్చునని తేటతెల్లపరిచారు.
నర్తకి నేర్పిన పాఠం
ఒక రోజు రాజసభలో ఒక నర్తకి సంగీత కార్యక్రమం ఏర్పాటయింది. ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా స్వామీజీకి మహారాజు విన్నపం పంపించాడు. తానొక సన్న్యాసిననీ, అలాంటి కార్యక్రమంలో పాల్గొనరాదనీ స్వామీజీ ప్రత్యుత్తరం పంపారు. ఈ సంగతి ఎలాగో ఆ నర్తకి చెవినపడింది. ఒక మహాత్ముడుగా ఖేత్రీ అంతటా ఖ్యాతిగాంచిన స్వామీజీ తన సంగీత కార్యక్రమానికి రానని చెప్పడం ఆమెకు ఎంతో దుఃఖం కలిగించింది. కాని ఈ విషయంలో ఆమె ఏమీ చేయలేదు. అయినప్పటికీ తన మనోవేదనను స్వామీజీకి ఎలాగైనా తెలియజేయాలని మాత్రం నిర్ణయించుకొంది.
సంగీత కార్యక్రమం ప్రారంభమయింది. ఆమె అద్భుతమైన సూరదాస్ కీర్తన ఒకటి పాడింది.
ఓ ప్రభూ! నాలోని అవగుణాలను పరిగణించబోకు
నీ పేరు, ఓ ప్రభూ, సమదర్శి అన్నారు కదా!
ఒక ఇనుప ముక్క ఆలయంలోని విగ్రహంగా ఉంది
మరొక ముక్క కసాయివాని చేతిలో కత్తిగా రూపొందింది
కాని అవి పరుసవేదిని స్పృశించినప్పుడు
రెండూ ఒకే మాదిరి బంగారంగా మారిపోతాయి.
కనుక, ప్రభూ, నాలోని అవగుణాలను పరిగణించబోకు……*
సమీపంలోని గదిలోనే స్వామీజీ బసచేసి ఉన్నారు. ఈ పాటలోని భావం స్వామీజీని ప్రగాఢ చింతనలో ముంచివేసింది: “ఇదేనా నా సన్న్యాస స్థితి? నేను ఒక సన్న్యాసిని. వ్యత్యాసాన్ని చూపడం నాకు యుక్తమా? ఒక నర్తకి కాబట్టి ఆమెను చూడకపోవడం సబబా? సర్వత్రా నెలకొని ఉన్నది భగవంతుడే అయితే, ఆ అనుభూతి నాకు ఉండడం నిజమయితే నేను ఎవరినీ త్రోసిపుచ్చరాదు.” ఈ నిర్ధారణకు వచ్చిన స్వామీజీ వెంటనే వెళ్ళి సంగీత కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘సమస్తం నేర్చుకొన్నారు!’
ఖేత్రీ రాజప్రాసాదంలో స్వామీజీ ఉన్నప్పుడు రాజపుఠాణాలోని గొప్ప సంస్కృత పండితుడైన నారాయణదాస్‌ను కలుసుకొన్నారు. దీనిని ఒక అవకాశంగా తీసుకొని సంస్కృత వ్యాకరణ అధ్యయనం ప్రారంభించారు స్వామీజీ. పాణిని వ్యాకరణ సూత్రాలకు పతంజలి వ్రాసిన మహాభాష్యాన్ని స్వామీజీ నేర్చుకోసాగారు. కొన్ని రోజులు నేర్పగానే పండితుడికి స్వామీజీ మేధాశక్తి అవగతమయింది. కనుక ఆయన, “స్వామీజీ, మీలాంటి విద్యార్థి లభించడం అపూర్వం. నేను నేర్పి, మీరు నేర్చుకోవడానికి ఇంక ఏదీ లేదు. నాకు తెలిసినదంతా మీకు నేర్పించాను; మీరు కూడా దానిని చక్కగా గ్రహించారు” అన్నాడు స్వామీజీతో. స్వామీజీ ఆయనకు పలుమార్లు నమస్కరించి, ధన్యవాదాలు తెలిపి సెలవు పుచ్చుకొన్నారు.
‘నా వలన ఏ ప్రాణీ భీతిల్లకూడదు!’
మహారాజు, స్వామీజీ కలిసి ఎన్నోమార్లు గుర్రపుస్వారీ చేసుకొంటూ సమీపంలోని అడవులలోకి వెళ్ళడం కద్దు. ఒక రోజు అడవిలో ఒక సన్నని త్రోవ గుండా ఇద్దరూ వెళుతున్నారు. రెండు వైపులా దట్టంగా పెరిగిన ముళ్ళపొదలు స్వామీజీ మీద పడి గుచ్చుకోకూడదని మహారాజు తన చేతులతో వాటిని ప్రక్కకు నెట్టి పట్టు కొన్నాడు. అప్పుడు ముళ్లు గుచ్చుకొని మహారాజు చేతుల నుండి రక్తం స్రవించ సాగింది. అది చూసి స్వామీజీ హృదయం ద్రవించిపోయింది. స్వామీజీ ఉద్వేగాన్ని అవగతం చేసుకొన్న మహారాజు నవ్వుతూ, “ఫరవాలేదు స్వామీజీ! మేం క్షత్రి యులం కదా! ధర్మరక్షణ మా కర్తవ్యం కదా!” అని అన్నాడు.
మరొక రోజు స్వామీజీతో మహారాజు పరివారసమేతంగా వేటకు వెళ్లారు. అందరూ తుపాకులు ధరించి ఉన్నారు. స్వామీజీ వద్ద ఒక చేతికర్ర మాత్రమే ఉంది. దారిలో ఒక చోట అందరూ కూర్చుండిపోయారు. స్వామీజీ కాస్త దూరంలో ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. హఠాత్తుగా ఒక పులి ఆ చెట్టు వైపుగా దూసుకువెళ్లింది. ఆ హఠాత్పరిణామం నుండి తేరుకొన్న మహారాజు, తక్కినవారు స్వామీజీ వద్దకు పరుగుదీశారు. అంతలో ఆ పులి అదృశ్యమయింది. ఒక తుపా కీని తమ వద్ద ఉంచుకోమని అప్పుడు మహారాజు స్వామీజీతో చెప్పారు. అందుకు స్వామీజీ, “ఒక సన్న్యాసికి రక్షణార్థం తుపాకీ అవసరం లేదు. ఏ పులీ వారిని ఏమీ చేయదు. నా వలన ఏ ప్రాణీ భీతిల్లకూడదు”* అన్నారు.
ఖేత్రీ మహారాజుకు గురువుగా
మహారాజు విన్నపాన్ని మన్నించి స్వామీజీ ఆయనకు మంత్రదీక్ష ఒసగారు. స్వామీజీకి ఏ విధంగానైనా సేవచేయడం తన భాగ్యంగా మహారాజు పరిగణిం చాడు. ఆయన ముందు మోకరిల్లి సేవ చేయడానికి సిద్ధమయ్యాడు. తాను మహారాజుననే విషయం మరచిపోయి ఒక సామాన్యునిలా స్వామీజీకి ఉపచర్యలు చేశాడు. ఆయన నిద్రిస్తున్నప్పుడు కాళ్ళు ఒత్తాడు; ఆయనకు వీవన వీచాడు. రాత్రులలో స్వామీజీ నిద్రిస్తున్నప్పుడు మేల్కొని ఆయన కాళ్లను సుతిమెత్తగా ఒత్తాడు. ఇంకా ఎన్నో చిన్నచిన్న సేవలు కూడా చేశాడు. ఇతరుల సమక్షంలో కూడా ఇవన్నీ చేయడానికి సైతం ఆతడు సంకోచించలేదు. కాని స్వామీజీ అలా చేయవద్దని వారించారు; “ఏకాంతంలో మీరు సేవలందించండి. నేను కాదనను. కాని మీ ప్రజల ముందు నాకు ఇలా మీరు సేవలందిస్తే వారు మీ పట్ల కలిగివున్న మర్యాదా మన్ననలు తగ్గుతాయి” అన్నారాయన.
మహారాజు తమ పట్ల చూపుతున్న అక్కర చూసి స్వామీజీ ఆయనను అమితంగా ప్రేమించడంతోపాటు, ఆయన మూలంగా భారతదేశానికి గొప్ప మేలు ఒనగూరుతుందని కూడా ఆశించారు. విజ్ఞాన శాస్త్రంలో ఎంతో ఉత్సుకత చూపారు స్వామీజీ. ఆయన విన్నపం మేరకు రాజప్రాసాదం మీద దూరదర్శిని, సూక్ష్మదర్శిని లాంటి పరికరాలతో ఒక చిన్న పరిశోధనాశాలను ఏర్పరచాడు మహారాజు. ఇద్దరూ గంటల పర్యంతం అక్కడ గడిపేవారు. స్వామీజీ వద్ద భౌతిక రసాయన, ఖగోళశాస్త్రాలలోని ప్రాథమిక సూత్రాలను మహారాజు నేర్చుకొన్నాడు.
సంతాన వరం
మహారాజుకు సంతానం లేదు. ఆయన మనస్సులో అదొక పెద్ద లోటుగానే ఉంది. ఒక రోజు స్వామీజీతో ఈ విషయం ప్రస్తావించాడు; “స్వామీజీ, నా కొక కుమారుడు జన్మించాలని మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే నా ప్రార్థన తప్పకుండా ఈడేరుతుంది” అన్నాడు. స్వామీజీ మనఃస్ఫూర్తిగా మహారాజును ఆశీర్వదించారు.
రెండున్నర నెలలకు పైగా ఖేత్రీలో గడిపిన స్వామీజీ 1891 అక్టోబర్ 27 వ తేదీన అక్కడ నుండి బయలుదేరి వెళ్లి ఆజ్మీర్లో మూడు వారాలు గడిపారు. పిదప అప్పటి బొంబాయి – గుజరాత్ వైపుగా బయలుదేరారు.