అనికేతనుడవగుము
ఏ ఇల్లు, సభా, నిన్ను పట్టగలదు?
ఆకసమే నీ ఇంటి కప్పు, గడ్డి కుప్ప మంచం;
యాదృచ్ఛికంగా లభించేదే భోజనం,
అది రుచికరమో కాదో లక్షించకు
ధీరసన్న్యాసీ పలుకుమా
ఓం తత్ సత్ ఓం అని.
ఆత్మ ఒక్కటే తోడు — కాశీ — ‘ప్రతిఘటించి నిలబడు’ — భాస్కరానందతో — ఉత్తర భారతదేశంలో — ‘నాలోనూ కులతత్వమా?’ — బృందావనంలో — రాధాదేవి కారుణ్యం — రాధాదేవి పెట్టిన పరీక్ష — ప్రథమ శిష్యుడు — ‘నాకంటూ ఒక పని ఉన్నది’ — శిష్యుని భారం వహించిన గురువు — ‘నువ్వొక సంకెల’ — వరాహ నగరంలోనూ — దేనిని ఎన్నుకోవాలి? — కుటుంబ దైన్య స్థితి — యతి రాజు — పవహారీ బాబా — కర్మయోగ భావనలు — హఠయోగంలో ఉత్సుకత — భారతదేశానికి అవసరమైన సంస్కరణలు — పాశ్చాత్య దేశాలకు ప్రప్రథమ ఆహ్వానం — ‘హృదయంలేని సన్న్యాసిని కాను నేను’ — మళ్లీ మఠంలో
ఆత్మ ఒక్కటే తోడు
త ల్లితండ్రులు, చుట్టాలూ, పక్కాలూ, మిత్రులు అందరినీ వదలిపెట్టి ఒంటరిగా జీవించాలి; ఏ స్థలంలోనూ స్థిరంగా ఉండిపోకుండా సంచారం చేస్తూనే ఉండాలి; చేతకర్ర, కమండలం మాత్రమే తీసుకొని వెళ్లాలి. ఆత్మను మాత్రమే తోడుగా చేసుకోవాలి – ఒక సన్న్యాసి ఈ విధంగాజీవించాలని కోరుకొంటాడు. స్వామీజీ ఆశయం కూడా అదే. అలాంటి జీవితంకోసం ఆయన పరితపించారు. కాని ఆయన ఒంటరిగా పోవడం సోదర శిష్యులకు సుతరామూ ఇష్టం లేదు. అంతేకాదు; బయలుదేరాలని అనుకొన్నప్పుడల్లా ఏవేవో అవాంతరాలు వాటిల్లాయి. ఒకసారి బయలుదేరాలనుకొన్నప్పుడువిపరీతంగా జ్వరం వచ్చింది; నాడి కూడా బలహీనంగా కొట్టుకోసాగింది. ఆయనమృతి చెందుతారేమోనని భయపడి ప్రేమానందస్వామి భోరున విలపించారు.మాట్లాడే స్థితిలో లేనప్పటికీ, “ఏడవకు బాబూరాం! నేను చేయవలసిన పనిబోలెడంత ఉంది. దాని పరిణామం ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాను. ఆ కార్యం పూర్తయ్యేదాకా నేను మరణించను” అన్నారు స్వామీజీ. మందులతోను, సోదరసన్న్యాసుల అకుంఠిత సేవాశుశ్రూషలతోను ఆయన ఆరోగ్యం క్రమంగాకోలుకొంది. ఆ తరువాత సోదర శిష్యులతో పరిపరి విధాల చర్చించి చివరికివారి సమ్మతితో ఆయన పర్యటనకు సిద్ధమయ్యారు.
కాశీ
1888 వ సంవత్సరం మధ్య వరకు ఆంట్పూర్ లాంటి సమీప ప్రాంతాలకు ఒకటి రెండుసార్లు వెళ్లివచ్చారు. చాలా దూర ప్రదేశాలకు ఎక్కడికీ వెళ్లలేదు. 1887 శీతకాలంలో ఆయనకు మూత్రపిండాలకు సంబంధించిన సమస్య ఏర్పడింది. అప్పుడు సోదర సన్న్యాసుల విన్నపం మేరకు వైద్యనాథం లాంటి ప్రదేశాల్లో కొంతకాలం గడిపారు. ఆయన దూర ప్రయాణం చేసి వెళ్లినది వారణాసి (కాశీ) మాత్రమే. వారణ, అసి అనేనదుల మధ్య వెలసిన పుణ్యక్షేత్రం కాశీ. పరమేశ్వరుడు విశ్వనాథుడనే పేరిట అక్కడ కొలువై ఉన్నాడు. లోకాలను పరిరక్షించే ఉమాదేవి కాశీలో అన్నపూర్ణనామధేయంతో వెలసి, లోకానికి అన్నం ప్రసాదిస్తూ, పరిరక్షిస్తోంది. మహాశ్మశాన వాటికగా ఈ స్థలం పేర్కొనబడుచున్నది. ఈ క్షేత్రంలో మరణించే వారందరికీముక్తి లభిస్తుందని శాస్త్రాలు వచిస్తున్నాయి. ఇక్కడే నివాసం ఏర్పరచుకొని తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తే ఎనలేని ఫలం ప్రాప్తిస్తుందని హైందవులవిశ్వాసం. స్వామీజీ కూడా తమ పరివ్రాజక జీవితాన్ని కాశీక్షేత్రం నుండే ప్రారంభించారు.
ప్రేమానంద స్వామి, శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యుడైన ఫకీర్బాబు ప్రభృతులతో స్వామీజీ కాశీ వెళ్లారు. అక్కడ దాదాపు వారం రోజులు బసచేశారు. పావనగంగానది, బుద్ధుడూ శంకరుడూ బోధించిన స్థలాలు, అసంఖ్యాకమైన దేవాలయాలు, భగవంతుని కీర్తిని గానం చేస్తూ, జపధ్యానాలలో మునిగిఉన్న సన్న్యాసబృందాలూ స్వామీజీని పారవశ్యంలో ముంచెత్తాయి.
‘ప్రతిఘటించి నిలబడు’
కాశీలోని అందమైన దేవాలయాలలో దుర్గాదేవి ఆలయం ఒకటి. ఒకరోజు స్వామీజీ అక్కడకు వెళ్ళి దేవిని దర్శించుకొని, ఒక అడుగు వెడల్పు గల కాలిబాట గుండా తిరిగి వస్తున్నారు. ఆ బాటకు ఒక వైపు పెద్ద కొలను, మరొక వైపు ఎత్తైన ప్రహరీగోడ ఉన్నాయి. హఠాత్తుగా ఒక కోతుల గుంపు ఆయనకు ఎదురైంది. స్వామీజీ నడకవేగం తగ్గింది; ముందుకు వెళ్లడానికి సంశయించారు. ఆయనవెనుకంజ వేయడం గమనించిన ఆ కోతుల గుంపు ఆయన వైపు దూసుకురాసాగింది. స్వామీజీ వెనుదిరిగి పరుగెత్తసాగారు. కోతులు కూడా వదలిపెట్టకుండా ఆయనను తరుమసాగాయి. ఆయన వేగం పెరిగేకొద్దీ కోతుల వేగం కూడా అధికమై ఆయన మీద పడి కరవబోయాయి. ఇక సంబాళించుకోలేని నిస్సహాయస్థితికి స్వామీజీ గురయ్యారు. ఆ సమయంలో ఒక వృద్ధసన్న్యాసి కంఠస్వరం ఇలావినవచ్చింది: “ఆగు, ఆగి ఎదుర్కో, జంతువులను ప్రతిఘటించు.” ఈ మాటలువినగానే స్వామీజీలో నూతనోత్సాహం పెల్లుబికింది. పరుగెత్తడం ఆపారు.ధైర్యంగా నిలబడి కోతులవైపు తీక్షంగా తదేకంగా చూశారు. అంతే అవి వెనుకక్ణు తగ్గసాగాయి. పిదప స్వామీజీ ముందుకు సాగినప్పుడు అవి వెనక్కు తిరిగి పలాయనం చిత్తగించాయి.
జైపూర్, 1891
దర్శించిన కొన్ని పుణ్యక్షేత్రాలు
కాశీ
బృందావనం
కన్యాకుమారి
స్వామీజీ మూడు రోజులు తపమొనర్చిన దక్షిణాగ్ర శిలలు
కలుసుకొన్న కొందరు మహారాజులు
అజీత్ సింగ్
ఖేత్రీ
చామ రాజేంద్ర వడయార్
మైసూర్
భాస్కర సేతుపతి
రామనాథపురం
చైన్నై ఆప్తులు కొందరు
అలసింగ పెరుమాళ్
బిలిగిరి అయ్యంగార్
డాక్టర్ నంజుండరావు
రాజం అయ్యర్
సర్ సుబ్రహ్మణ్య అయ్యర్
న్యాయమూర్తి
మాతృమూర్తి శ్రీ శారదాదేవి
చెన్నై, 1897
ఈ సంఘటన స్వామీజీ మనస్సుపై చెదరని ముద్ర వేసింది. ప్రకృతి ఉద్ధృతాలను, సమస్యలను ప్రతిఘటించి నిలబడాలి, వాటికి ఎన్నడూ దాసోహం కాకూడదనే పాఠం ఈ సంఘటన నుండి స్వామీజీ నేర్చుకొన్నారు. ఆయన చేసిన పలు ప్రసంగాలలో ఈ సంఘటన నుండి తాను నేర్చుకొన్న పాఠం ప్రభావం ఉండడం చూడవచ్చు.
కాశీలో బసచేసిన రోజుల్లో స్వామీజీ పలువురు సన్న్యాసులను, సర్వజ్ఞులను కలుసుకొన్నారు. వారిలో త్రైలింగస్వామి, భాస్కరానంద ముఖ్యులు.
గొప్ప మహాత్మునిగా ఖ్యాతిగాంచారు త్రైలింగస్వామి. 1868 జనవరిలో శ్రీరామకృష్ణులు కాశీ సందర్శించినప్పుడు ఈయనను కలుసుకొని, “ఈయనలో నిజమైన పరమహంస లక్షణాలున్నాయి” అని వ్యాఖ్యానించారు. మణికర్ణికా ఘట్టంలో నివసిస్తున్న త్రైలింగస్వామిని స్వామీజీ దర్శించారు. “త్రైలింగస్వామి ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. అలాగని ఆయన ఉపదేశం ఏమీ చేయలేదని భావించరాదు. మౌనమే ఆయన ఉపదేశం” అంటూ కాలాంతరంలో ఆయన గురించి స్వామీజీ వ్యాఖ్యానించారు.
భాస్కరానందతో
తమ స్వాధ్యాయ, తపోమయ జీవితం వలన భాస్కరానంద ఎనలేని గౌరవ మర్యాదలను పొందారనడం అతిశయోక్తి కాదు. సామాన్యంగా ఆయన దిగంబరం గానే జీవించేవారు. ఈయనను కూడా స్వామీజీ కలుసు కొన్నారు. స్వామీజీ ముఖారవిందాన తాండవిస్తున్న దివ్య తేజస్సును చూసి భాస్కరానంద ఆయనను ఆదరాభిమానాలతో ఆహ్వానించారు. వారిద్దరూ అనేక విషయాల గురించి మాట్లాడుకొన్నారు. సంభాషణ మధ్యలో భాస్కరానంద, “కామినీ కాంచనాలను సమూలంగా ఎవరూ త్యజించలేరు” అన్నాడు. అందుకు స్వామీజీ, “స్వామీ, మీరేమంటున్నారు? వాటిని సంపూర్ణంగా త్యజించిన వ్యక్తులు ఎందరో ఉన్నారు! ఒక సన్న్యాసి జీవితమూ, లక్ష్యమూ అదే కదా! కామినీ కాంచనాలను కూకటి వేళ్లతో సహా పెకలించి వేసిన వ్యక్తిని నేను చూశాను” అన్నారు. ఆ మాటలు విని భాస్కరానంద చిన్నగా నవ్వి, “నువ్వు చిన్న వాడివి. నీకేం తెలుసు?” అన్నాడు. ఇది విన్నాక స్వామీజీ ఊరకే ఉండలేక పోయారు. కామినీకాంచనాలను జయించిన శ్రీరామకృష్ణుల మహోన్నత జీవితం స్వామీజీ మనస్సులో మెదలింది. దానిని వివరించి, ఉద్వేగంతో తమ భావనలను ప్రకటించారు. స్వామీజీ ఉద్వేగపు వెల్లువను గమనించిన భాస్కరానంద ప్రక్కన ఉన్నవారితో, “ఆహా! ఈయన నాలుక మీద సరస్వతీదేవి కొలువై ఉంది. ఈతడి మనస్సు మహోజ్జ్వల కాంతితో ప్రకాశిస్తున్నది” అన్నాడు.
దాదాపు వారం రోజులు కాశీక్షేత్రంలో గడిపి, హఠాత్తుగా స్వామీజీ వరాహ నగర మఠానికి తిరిగివచ్చేశారు. కొన్ని రోజులు సోదర సన్న్యాసులతో గడిపిన పిదప ఏకాంత జీవితం గడపడానికి బయలుదేరారు.
మళ్లీ స్వామీజీ కాశీ వెళ్లారు. తమ సోదర సన్న్యాసియైన అఖండానంద ద్వారా అక్కడ ప్రమదాదాస్ మిత్రా అనే సంస్కృత పండితునితో సన్నిహితంగా మెలగే అవకాశం స్వామీజీకి కలిగింది. వారిద్దరి మధ్య నెలకొన్న స్నేహం దీర్ఘ కాలం కొనసాగింది. శాస్త్రాలలో తమకు కలిగిన సంశయాలను స్వయంగానూ, కాలాంతరంలో లేఖల ద్వారానూ స్వామీజీ ఈయనకు తెలిపి నివృత్తి చేసు కొన్నారు.
ఉత్తర భారతదేశంలో
కాశీ నుండి అయోధ్య లక్నోల మీదుగా స్వామీజీ ఆగ్రా వెళ్లారు. మొగలా యీల కట్టడాలు, స్మారక చిహ్నాలు స్వామీజీని ఎంతగానో ఆకట్టుకొన్నాయి. ప్రత్యేకంగా తాజ్‌మహల్ అందచందాలను పలుమార్లు పలు కోణాలలో స్వామీజీ తనివితీరా తిలకించి ముగ్ధులయ్యారు. “అద్భుతమైన ఈ కళాఖండంలోని ఒక చదరపు అంగుళాన్ని ఓపికతో పరికించి అవగతం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది. కూలంకషంగా దీనిని అర్థం చేసుకోవడానికి కనీసం ఆరు నెలలు పడుతుంది” అని స్వామీజీ వ్యాఖ్యానించారు.
‘నాలోనూ కులతత్వమా?’
ఆగ్రా నుండి స్వామీజీ బృందావనం బయలుదేరారు. చివరి 30 మైళ్ల దూరం ఆయన కాలినడకనే వెళ్లాల్సివచ్చింది. బృందావనం ఇక రెండు మైళ్లు మాత్రమే ఉందనగా స్వామీజీని ఆకలి, అలసట ఆవహిం చాయి. దారిలో ఒక వ్యక్తి కూర్చుని తాపీగా హుక్కాతో పొగ త్రాగుతూ ఉండడం స్వామీజీ కంటపడింది. కాస్త పొగ పీలుస్తే ఉత్సాహం వస్తుందని స్వామీజీ అతణ్ణి సమీపించి తమ ఆకాంక్షను తెలియజేశారు. అందుకు ఆ వ్యక్తి, “అదెలా స్వామీ? నేను మరుగుదొడ్లు శుభ్రం చేసేవాణ్ణి. నా హుక్కా ఉపయోగించి మీరు పొగ త్రాగడమా?” అని అడిగాడు. ‘నిజమే కదా! ఇతగాడి హుక్కా ఉపయోగించి నేను పొగ త్రాగడమా?’ అనుకొని స్వామీజీ అక్కణ్ణుండి కదలి వెళ్లిపోసాగారు. అలా కాస్త దూరం వెళ్లగానే హఠాత్తుగా ఆయన మనస్సులో ఠక్కున ఈ ఆలోచన మెదలింది: ‘ఏమిటి! నేనొక సన్న్యాసిని. కులతత్వం, కులప్రతిష్ఠ లాంటి వాటన్నింటినీ త్యజించానని ప్రతిజ్ఞ చేశాను కదా! ఒక్క క్షణంలో ఇలా నన్ను నేను మరిచిపోయానే!’ ఈ ఆలోచన మెదలీమెదలగానే స్వామీజీ సిగ్గుతో బిక్కచచ్చిపోయారు. వెంటనే వెనుకకు తిరిగి అతడి వద్దకొచ్చి, “సోదరా! పొగ సిద్ధంచేయి” అన్నారు. ఆ వ్యక్తి మళ్లీ, “స్వామీ, మీరొక సన్న్యాసి, నేనో అస్పృశ్యుణ్ణి” అన్నాడు. ఇప్పుడు స్వామీజీలో ఎలాంటి సంశయమూ లేదు, అసందిగ్ధంగా ఉన్నారు. ఆ వ్యక్తి మాటలను పట్టించుకోకుండా ఆతడి హుక్కా ఉపయోగించి పొగ త్రాగిన తరువాతే అక్కణ్ణుండి బయలుదేరారు. తప్పు చేయడమో, పొరబడడమో నేరం కాదు; తప్పు అని తెలుసుకొని దానిని సరిదిద్దుకోవడమే పురోగమన మార్గం. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ మనం సమర్థంగా ఎదుర్కోవడం అసాధ్యం; కాని వాటన్నింటి నుండి గుణపాఠం నేర్చుకోవడం సాధ్యమే; గుణపాఠం నేర్చుకోవాలి. అప్పుడే జీవితంలో పురోగమించి లక్ష్యం సాధించగలుగుతాం.
బృందావనంలో
1888 ఆగస్ట్‌లో స్వామీజీ బృందావనం చేరుకొన్నారు. బలరాంబోసు బృందావనంలో నిర్మించిన ‘కాలాబాబు కుంజం’ అనే కృష్ణాలయంలో బసచేశారు. కృష్ణుడు తన దివ్యమయ లీలలను జరిపిందీ, కృష్ణుని తలంపులలో మునిగిపోయిన గోపికలు తమ జీవితాలు గడి పినదీ, చైతన్యునికీ ఆయన శిష్యులకూ భక్తిని పెంపొందినదీ ఈ గడ్డ మీదే. “నరేంద్రుడు బాహ్యంగా ఒక జ్ఞానిగా కనిపించినప్పటికీ ఆతడు ఆంతరంగికంగా గొప్ప భక్తుడు. అతడు కోమలమైన హృదయం గలవాడు” అనేవారు శ్రీరామ కృష్ణులు. భక్తి గుబాళించే బృందావనంలో స్వామీజీలో భక్తి భావనలు రగిలాయి. ఒక మామూలు భక్తుని మాదిరి అక్కడున్న పుణ్యతీర్థాలలో స్నానాలు, గిరి ప్రదక్షిణలు, జపతపాదులతో స్వామీజీ రోజులు గడపసాగారు.
రాధాదేవి కారుణ్యం
బృందావనం కృష్ణునికి చెందినదే అయినా అక్కడ రాజ్యపాలన చేస్తున్నది రాధాదేవి. కృష్ణునికై తన దేహాత్మలను అర్పించి కృష్ణమయంగా రూపొంది భక్తికి మారుపేరుగా విరాజిల్లింది రాధ. బృందావనంలోని భక్తులు సైతం కృష్ణుని పేరు చెప్పకుండా, “రాధే రాధే” అనే స్మరిస్తారు. ఒక రోజు స్వామీజీ గోవర్ధన గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఆహారం కోసం ఎవరినీ యాచించకూడదనీ, యాదృచ్ఛికంగా లభించేది మాత్రమే స్వీకరించాలనీ ఆయన సంకల్పించుకొన్నారు. మొదటి రోజు మధ్యాహ్నమయ్యేసరికి ఆయనకు బాగా ఆకలి వేయసాగింది. ఇంతలో హఠాత్తుగా పెద్దవాన కురిసింది. ఆకలీ, వాన ఉద్ధృతితో ఆయన స్పృహతప్పి క్రిందపడిపోయే స్థితికి చేరుకొన్నారు. అయినప్ప టికీ ఆహారం కోసం ఎవరినీ యాచించలేదు. వానను కూడా ఖాతరు చేయ కుండా ముందుకు నడవసాగారు. హఠాత్తుగా వెనుక నుండి ఎవరో పిలిచినట్ల యింది. కాని ఆ పిలుపును విననట్లే స్వామీజీ నడచిపోసాగారు. పిలిచిన కంఠం ఆయనను సమీపించింది. వచ్చిన వ్యక్తి ఒక భక్తుడు. “స్వామీజీ! మీకు ఆహారం తెచ్చాను, తినండి” అంటూ అతడు ఆయనను వెంబడించాడు. ఇది నిజంగానే రాధాదేవి కృపాకటాక్షమేనా అని తెలుసుకోగోరి స్వామీజీ తమ శక్తి మేరకు వేగంగా నడవసాగారు. అప్పటికీ భక్తుడు వదలలేదు. ఒక మైలు దూరం నడిచిన తరువాతే ఆ భక్తుడు స్వామీజీని సమీపించగలిగాడు. ఆయన ఎదుటకు వచ్చి ప్రణమిల్లిన ఆ భక్తుడు వారికి ఆహారం సమర్పించాడు. రాధాదేవి కారుణ్యాన్ని తలచుకొని కళ్లు చెమ్మగిల్లగా స్వామీజీ, “జై రాధే, జై కృష్ణా” అంటూ భక్తుడు సమర్పించిన ఆహారాన్ని స్వీకరించారు.
రాధాదేవి పెట్టిన పరీక్ష
ఒక రోజు స్వామీజీ రాధాకుండంలో* స్నానం చేయడానికి వెళ్లారు. ఆ రోజుల్లో ఆయన కేవలం ఒక కౌపీనం మాత్రమే ధరించేవారు; ఆయన వద్ద మారు గుడ్డ కూడా లేదు. ఆయన కౌపీనం ఉతికి ఆరవేసి, స్నానానికి నీళ్లలో దిగారు. స్నానం ముగించి గట్టు మీదకు వచ్చిచూస్తే కౌపీనం కనిపించలేదు. చుట్టుప్రక్కల వెతికి చూడగా చెట్టు మీద ఉన్న ఒక కోతి ఆ కౌపీనం చేతిలో ఉంచుకొని హాయిగా కూర్చుని ఉంది. ఆ కోతి వద్ద నుండి ఆ వస్త్రాన్ని రాబట్టుకోవడం అంత సులభమా? ఆయన వద్ద మరో వస్త్రం కూడా లేదు. ఇక ఊళ్లోకి వెళ్లడం ఎలా? స్వామీజీ కోపం రాధ మీదకు మళ్లింది; ‘తల్లీ! నేను ఊళ్లోకి వెళ్లలేను. కనుక అడవిలోకి పోతున్నాను. అక్కడే పడివుండి ఆకలితో, పస్తులతో అలమటించి చచ్చి పోతాను’ అని అనుకొని వడిగా అడవిలోకి నడిచిపోసాగారు. ఇక్కడ కూడా ఒక భక్తుడు వచ్చాడు. అతడి చేతిలో క్రొత్త కాషాయ వస్త్రం ఒకటి ఉంది. దానిని స్వామీజీకి సమర్పించాడతడు. కళ్ల వెంట నీరు ధారగా స్రవిస్తూ స్వామీజీ ఆ వస్త్రం పుచ్చుకొన్నారు. తిరిగి కొలను గట్టు వద్దకు వచ్చి చూస్తే, ఆశ్చర్యం! స్వామీజీ కౌపీనం ఆయన ఆరవేసిన చోటే ఉంది!
భగవంతుణ్ణే చేయూతగా చేసుకొని, మరో ఆసరా ఏదీ లేకుండా జీవించే వ్యక్తికి ఇలాంటి సంఘటనలు ఎంతో ప్రధానమైనవి. అవి ఆ వ్యక్తి విశ్వాసాన్ని పటిష్ఠంచేస్తాయి. అడవిలోను, సముద్రంలోను, గుట్టమీద, కొండమీద, గుహ లోను ఎక్కడ జీవించినప్పటికీ, ఎక్కడకు వెళ్లినప్పటికీ భగవదనుగ్రహం తనపై ఉంది, ఆ అనుగ్రహం తనను ఎటువంటి పరిస్థితులనుండైనా కాపాడుతుందనే విశ్వాసానికి ఈ సంఘటనలు అద్దం పడతాయి. మునుపటికన్నా తీవ్రంగా అతడు జపధ్యానాలు అనుష్ఠిస్తాడు.
ప్రథమ శిష్యుడు
బృందావనం నుండి స్వామీజీ హరిద్వార్ బయలుదేరారు. ఆకలి, అల సటలతో ఆయన హాత్రస్ రైలు నిలయంలో కూర్చుని ఉన్నారు. అక్కడ సహాయ స్టేషన్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి శరశ్చంద్ర గుప్తా. అతడు సజ్జనుడు; అతడు ప్రవర్తించే తీరు ఎంతో చక్కగా ఉండేది, దేహదార్యం గలవాడు. అతడు స్వామీజీని చూసీచూడగానే ఆయన పట్ల ఆకర్షితుడయ్యాడు. ఏదో తెలియని శక్తి తనను స్వామీజీ వైపు ఆకర్షిస్తోందని అతడు గ్రహించాడు. కనుక తిన్నగా ఆయన వద్దకు పోయి, “స్వామీజీ, ఆకలిగా ఉందా?” అని అడిగాడు. స్వామీజీ, “అవును” అని చెప్పగానే అతడు, “మా ఇంటికి రండి” అని సాదరంగా ఆహ్వానించాడు. “నేను వస్తే నువ్వు ఏమిస్తావు?” అని పిల్లవాడిలా ఉత్సాహంగా అడిగారు స్వామీజీ. “ఓ నా ఆప్తమిత్రమా! నా హృదయాన్నే పిండి మధుర భక్ష్యాలు చేసి సమర్పిస్తాను” అనే ఒక పారసీక గీతాన్ని జవాబుగా పాడి చెప్పాడు శరత్. ఈ జవాబు విని ముగ్ధులైన స్వామీజీ, శరత్ ఇంటికి వెళ్లారు. స్వామీజీకి చక్కని విందు చేశాడు శరత్.
ఆ రోజు విధి నిర్వహణ ముగిశాక శరత్ స్వామీజీ వద్దకు వచ్చి, “స్వామీజీ! నాకు ‘విద్యా’ కావాలి” అన్నాడు. అందుకు స్వామీజీ, “నీకు విద్యా కావాలంటే నీ అందమైన ముఖానికి బూడిద పూసుకోవాలి; లేకపోతే నన్ను వదలిపెట్టు” అన్నారు. శరత్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా తిన్నగా వంటగదిలోకి వెళ్లి పొయ్యి నుండి బూడిద తీసుకొని ముఖమంతా పులుముకొని వచ్చి స్వామీజీ ముందు నిలబడ్డాడు. శరత్ ముఖాన్ని చూసి స్వామీజీ పొట్టచెక్కలయ్యేలా నవ్వారు. అసలు విషయం ఇది: శరత్ అడిగింది ఆధ్యాత్మిక జ్ఞానం. దీనికి సరిపోలిన సంస్కృత పదం ‘విద్యా’. స్వామీజీ సూచించింది భరత్‌చంద్ర రే గుణాకర్ రచించిన ‘విద్యా–సుందరుడు’ అనే నాటకంలోని కథానాయికయైన విద్యా, కథానాయకుడైన సుందరుణ్ణి చూసి పలికిన వచనం. ఇది అర్థం చేసుకోకుండా, స్వామీజీ చెప్పింది అక్షరాలా పాటించాడు శరత్. నవ్వుకొన్నప్పటికీ శరత్ భక్తిప్రపత్తులు స్వామీజీని ఆశ్చర్యంలో ముంచెత్తకపోలేదు.
కొన్ని రోజులు అక్కడ గడిపిన పిదప అక్కణ్ణుండి బయలుదేరడానికి స్వామీజీ తయారయ్యారు. అప్పుడు శరత్ ఆయనతో, “స్వామీజీ, నన్ను మీ శిష్యు నిగా స్వీకరించండి” అని ప్రాథేయపడ్డాడు. అందుకు స్వామీజీ, “నాకు శిష్యుడి వైతే ఆధ్యాత్మిక జీవితంలో సమస్తమూ పొందవచ్చునని భావిస్తున్నావా? ఇది భగ వంతుని లోకమనే భావనతో నువ్వు ఏం నిర్వర్తించినా పురోగమించగలుగుతావు. నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి ఉంటాను. కాని ఇప్పుడు నేను హిమా లయాలకు వెళ్లి తీరాలి” అన్నారు.
శరత్ వదలిపెట్టలేదు; “మీరు ఎక్కడకు వెళ్లినా నేను మిమ్మల్ని అనుస రిస్తాను” అన్నాడు స్థిర నిశ్చయంతో. అతడి స్థిర నిశ్చయాన్ని గమనించిన స్వామీజీ, “అలాగా! నిజంగానే నీ వల్ల నన్ను అనుసరించడం సాధ్యమేనా? ఆ మనోనిశ్చయం నీలో ఉందా? అయితే చేత భిక్షాపాత్ర పుచ్చుకొని నువ్వు పని చేస్తున్న ఆ రైలు స్టేషన్‌కు పోయి అక్కడ బరువులు మోసే కూలీల వద్ద భిక్ష అర్థించి రా” అన్నారు. శరత్ క్షణం కూడా సంకోచించలేదు. తక్షణమే బయలు దేరాడు. స్వామీజీ చెప్పినట్లే భిక్ష అర్థించి తీసుకువచ్చాడు. ఆ తరువాత కూడా అతణ్ణి నిరాకరించడానికి స్వామీజీకి ఎలాంటి కారణమూ కనిపించలేదు. నాడు వారి మధ్య మొదలైన బాంధవ్యం, గురు – శిష్య బాంధవ్యానికి ఒక సరిక్రొత్త భాష్యం చెప్పింది.
‘నాకంటూ ఒక పని ఉన్నది’
ఒక రోజు స్వామీజీ కలతగా ఉన్నారు. అందుకు కారణం ఏమిటని శరత్ అడిగినప్పుడు కాసేపు అంతర్ముఖులై ఉండిపోయిన స్వామీజీ ఆ తరువాత ఇలా అన్నారు: “నాయనా! నేను నిర్వర్తించవలసిన మహాకార్యం ఒకటి ఉంది. కాని అందుకు తగిన సామర్థ్యంకాని, అర్హత కాని నాలో లేవని అనుకొన్నప్పుడు నా మనస్సు తల్లడిల్లి పోతుంది. పని అంటే మామూలు పని కాదు; మన మాతృదేశాన్ని పునర్నిర్మించ వలసిన మహాకార్యం అది. ఆధ్యాత్మికత ఇక్కడ అడుగంటిపోయింది. ఆకలి, పస్తులు దేశం అంతటా విలయతాండవం చేస్తున్నాయి. భారతం మళ్లీ మేల్కొనాలి; తన పారమార్థికతతో లోకాన్నే జయించాలి.” ఏదో మహోన్నత శక్తి ఆవేశించినట్లు స్వామీజీ మాట్లాడడం విన్న శరత్ ఆశ్చర్యచకితుడై కూర్చుండి పోయాడు. స్వామీజీ మాట్లాడడం ఆపగానే శరత్ ఆయనతో, “స్వామీజీ! ఇదిగో మీ శిష్యుణ్ణి నేను ఉన్నాను. మీరు తలపెట్టిన కార్యం నిమిత్తం నేను ఏం చేయాలో ఆదేశించండి” అంటూ తన హృదయాంతరాళం నుండి పలికాడు. వెంటనే స్వామీజీ, “ఒక భిక్షాపాత్ర, కమండలం పుచ్చుకొని ఇంటింటికి పోయి భిక్షాటన చేసిరాగలవా?” అని అడిగారు. అందుకు శరత్ “చేసిరాగలను” అని దృఢంగా జవాబిచ్చాడు. స్వామీజీ ఆ మాట విని ఎంతో సంతోషించారు.
శిష్యుని భారం వహించిన గురువు
శరత్ తన ఉద్యోగానికి తిలోదకాలిచ్చి స్వామీజీతో బయలుదేరాడు. ప్రప్రథ మంగా వారు హృషీకేశ్ వెళ్లారు. అప్పటి దాకా హాయిగా జీవితం గడుపుతున్న శరత్ సన్న్యాస జీవితంలోని యాతనలను ఎదుర్కొన లేకపోయాడు. చాలాదూరం నడవడం, ఆకలిదప్పులను భరించడం అతడికి మరీ క్రొత్త; అతడు ఎంతో కష్టపడ్డాడు. కాని స్వామీజీ మూర్తీభవించిన ప్రేమస్వరూపులై శిష్యుని బరువులను తామే స్వీక రించారు. బరువులను మాత్రమే కాదు, శిష్యుణ్ణే ఆయన మోశారు. కాలాంత రంలో శరత్ ఇలా అన్నాడు:
“ఒక పర్యాయం హిమాలయాల్లో మేమిద్దరం కాలినడకన వెళుతున్నప్పుడు ఆకలి దప్పులతో నాకు స్పృహతప్పింది. అప్పుడు నా మూటాముల్లెనేగాక నన్ను కూడా స్వామీజీ మోసుకెళ్లారు. మరొక సందర్భంలో మేం ఒక ఏరు దాటవలసివచ్చింది. ఆ ఏరు అమిత వేగంతో ప్రవహిస్తూన్నది. ఆ ప్రాంతం బాగా జారుడుగా ఉండడంతో నేను భయపడ్డాను. అప్పుడు స్వామీజీ నవ్వుతూ నన్ను ఒక గుర్రం మీద కూర్చోబెట్టి, తాము గుర్రం కళ్లాన్ని పుచ్చుకొని నడిచారు. గుర్రాన్ని నడిపిస్తూ నదిని దాటారు. ఆయన నా కోసం తమ ప్రాణాలనే పణంగా ఒడ్డారు. మిత్రులారా! ఆయనను గురించి నేను ఏం చెప్పను! ప్రేమ, ప్రేమ, ప్రేమ – ఈ ఒక్క మాట తప్ప ఇంకేమీ చెప్పలేను. నాకు బాగా అస్వస్థతగా ఉన్నప్పుడు నా సంచీ, నా కట్టుబట్టలు, ఇంకా చెప్పాలంటే నా పాదరక్షలను సైతం ఆయన మోశారు.”
కాలాంతరంలో ఒకసారి మనస్సు కాస్త చంచలమవగా, శరత్, “స్వామీజీ, నన్ను వదలిపెట్టేస్తారా?” అని స్వామీజీని అడిగాడు. “మూర్ఖుడా! నీ చెప్పులు కూడా నేను మోశానని మరచిపోయావా?” అంటూ స్వామీజీ అతణ్ణి సుతిమెత్తగా చీవాట్లుపెట్టారు.
ఒకసారి స్వామీజీ శరత్‌లు ఒక కీకారణ్యం గుండా వెళ్తున్నారు. దారిలో ఒక చోట (మనిషి) కొన్ని ఎముకలూ, ప్రక్కనే కాషాయవస్త్రాలు చెల్లాచెదరుగా పడివున్నాయి. “శరత్, అదిగో చూడు. పులో లేక మరేదో క్రూరమృగమో ఇక్కడ ఒక సన్న్యాసిని చంపి తినివుంటుంది” అంటూ స్వామీజీ ఆ ఎముకల గుట్టను శరత్‌కు చూపించారు. శరత్ అదంతాచూసి విస్తుబోయాడు వెంటనే స్వామీజీ, “ఏం నాయనా, భయంగా ఉందా?” అని అడిగారు. అందుకు శరత్, “లేదు, లేదు. ప్రక్కన మీరు ఉన్నప్పుడు నా కెందుకు భయం?” అని జవాబిచ్చాడు.
‘నువ్వొక సంకెల’
స్వామీజీ శరత్‌తోపాటు సాధారణ సన్న్యాసులలా సత్రాలలో బస చేస్తూ, స్వయంగా వండుకొని తిని ప్రయాణం చేస్తున్నారు. దారి పొడవునా ఎన్నో కథలు చెప్పి శిష్యుణ్ణి ఆయన ఆనందింపజేశారు. బునియన్ (Bunyun) రచించిన ‘యాత్రికుల పురోగతి’ (Pilgrim’s Progress) అనే పుస్తకం నుండి కొన్ని కథలు చెప్పారు. హిమాలయాల పరి సరాలు స్వామీజీని అమితంగా ఆకట్టుకొన్నాయి. ఎత్తైన పర్వతాలూ, మంచు శిఖరాలూ, గంగానదీ ఆయనకు ఏకాంత జీవితాన్నీ, ధ్యానాన్నీ జ్ఞప్తికి తెచ్చాయి. తనతో శరత్ ఉండడం అప్పుడు ఆయనకు భారంగా తోచింది.
ఒక రోజు శరత్ కిచ్చుడీ వండుతున్నాడు. స్వామీజీ అతడితో, “శరత్, నువ్వు ఒక సంకెలలా నా కాళ్లను కట్టి పడేశావు. నేను ఏకాకిగా పోతున్న వాణ్ణి. నువ్వు నా జీవితంలో ప్రవేశించి నాకు భారమయిపోయావు. ఇక నువ్వు నాతో రావడం సబబు కాదు. ఇదుగో నా దారిన నేను పోతున్నాను” అంటూ చేతికర్ర, కమండలం పుచ్చుకొని వడివడిగా అక్కడ నుండి కదలిపోయారు. శరత్ విచారంగా అలా కూర్చుండిపోయాడు.
మూడు నాలుగు గంటలసేపు గడిచాక హఠాత్తుగా స్వామీజీ కంఠ స్వరం వినపడింది: “శరత్, ఓ శరత్! ఆకలి మండిపోతోంది. తినడానికి ఏదైనా ఉందా?” “ఇప్పుడే ఇస్తాను” అంటూ మహదానందంతో గంతులేస్తూ ఆయనకు కిచ్చుడీ వడ్డించాడు శరత్. “నువ్వు తిన్నావా నాయనా?” అని ఆప్యాయంగా స్వామీజీ అతణ్ణి అడిగారు. “మీరు లేకుండా నేనెలా తినగలను?” అని జవాబిచ్చాడు శరత్. నిర్ఘాంతపోయారు స్వామీజీ. “నువ్వు నిజంగానే నా కాళ్లకు సంకెలవే అయిపోయావు. నేను చాలాదూరం వెళ్లిపోయాను. అప్పుడు మనస్సులో, ‘అయ్యో, అతడొక మూర్ఖుడు! ఏదీ అతడికి తెలియదు. అతణ్ణి ఒంటరిగా వదలి వచ్చేశానే!’ అనే ఆలోచన మెదిలింది. ఇక ఏం చేయను! తిరిగి వచ్చేశాను. చూడు, నీ కోసమే తిరిగి రావలసివచ్చింది” అన్నారు స్వామీజీ. తరువాత ఇద్దరూ కలిసి కిచ్చుడీ తిన్నారు.
వరాహ నగరంలోనూ
హిమాలయాలలో అత్యున్నతమైన ప్రదేశాలలో వెలసిన కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి పుణ్యక్షేత్రాలు దర్శించాలని స్వామీజీ కోరిక. కాని శరత్ అస్వస్థుడయ్యాడు. కనుక ముందుకు సాగలేకపోయారు. ఇద్దరూ మళ్లీ హాత్రస్ తిరిగివచ్చారు. అక్కడ స్వామీజీ మలేరియా వాతబడ్డారు. ఇలా ఇద్దరూ అస్వస్థులై మరీ బలహీనంగా తయారయ్యారు. ఆ సమయంలో తీర్థయాత్రలకై అక్కడకి వచ్చిన స్వామి శివానంద వారికి తారసపడి స్వామీజీని వరాహ నగర మఠానికి తోడ్కొని వచ్చాడు. అది 1888 సంవత్సరాంతం.
స్వామీజీ మఠానికి తిరిగి వచ్చిన సమయంలో సోదర సన్న్యాసులలో పలువురు తీర్థయాత్రలకు వెళ్ళారు. ఒక ఏడాది కాలం స్వామీజీ అక్కడే ఉండి పోయారు. ఆ రోజుల గురించి శరత్ ఇలా అభివర్ణించాడు:
“అవి ఉద్రిక్తభరితమైన రోజులు. క్షణం కూడా విశ్రాంతి ఉండేది కాదు. అనేకులు వచ్చేవారు, పోయేవారు; పండితులు వచ్చి గోష్ఠి జరిపేవారు. స్వామీజీ క్షణం కూడా బద్ధకంగా గడపలేదు. అప్పుడప్పుడు ఆయన ఏకాంతంగా ఉన్న ప్పుడు ‘హరిబోల్, హరిబోల్!* ఆయనను ఎలుగెత్తి పిలవండి’ ‘అమ్మా, అమ్మా’ అంటూ పచార్లు చేసేవారు. నేను దూరంగా నిలబడి ఇదంతా గమనించేవాణ్ణి. అలాంటి సమయాల్లో ఆయన వద్దకు వెళ్లి, ‘స్వామీజీ, ఏదైనా తింటారా?’ అని అడిగితే ఏదో తమాషాగా బదులు చెప్పేవారు. ఒక పిచ్చివాడిలా ఉద్వేగంతో ఉండేవారు! వేకువజామునే లేచి, ‘దివ్యామృతాన్ని గ్రోలేవారా, లేవండి! లేవండి! లేవండి!’ అని పాడుతూ తక్కిన వారిని లేపేవారు. పిదప అందరూ కలసి ధ్యానం చేసేవారు.”
1889 జనవరి మాసాంతాన మాతృమూర్తి శ్రీ శారదాదేవి, సోదర సన్న్యాసి ఒకరితో కలిసి శ్రీరామకృష్ణుల జన్మస్థలమయిన కామార్పుకూర్కు స్వామీజీ బయలుదేరారు. దారిలో ఆంట్పూర్లో వారు వారం రోజులు బసచేశారు. కామార్పుకూర్ వెళ్లే దారిలో జ్వరం వచ్చింది, వాంతులయ్యాయి. కనుక వారు కామార్పుకూర్ వెళ్ళకుండానే తిరిగి రావలసివచ్చింది.
దేనిని ఎన్నుకోవాలి?
వేదాంత అధ్యయనం, దైవచింతన, జపధ్యానాల లాంటి ఆధ్యాత్మిక సాధన లతో స్వామీజీ మఠంలో రోజులు వెళ్లబుచ్చసాగారు. అప్పుడు వేదాంత గ్రంథాలు కొనడానికి తగిన ఆర్థికస్తోమత లేదు. కాశీ వాస్తవ్యులయిన ప్రమదదాస మిత్రా వద్ద కొన్ని గ్రంథాలు తీసుకొని చదివారు. తమకు కలిగిన సంశయాలను ఆయ నకు ఉత్తరం ద్వారా తెలియజేసి, నివృత్తి చేసుకొన్నారు. పాణిని ‘అష్టాధ్యాయి’ లాంటి సంస్కృత వ్యాకరణ గ్రంథాలను అధ్యయనం చేయగోరారు. ఆ విషయం ప్రమదాదాస మిత్రకు తెలుపుతూ, “పాణిని విరచిత అష్టాధ్యాయి మాకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మీరు భావిస్తే (మీకు సాధ్యమయితే, ఇష్టమయితే) దానిని మాకు పంపించి, సహాయం చేయండి. ఆజన్మాంతం మేం మీకు ఋణపడి ఉంటాం. మఠంలో దీక్ష, ప్రజ్ఞ, సునిశితమైన మేధస్సు గల వారికి కొదవలేదు. గురుదేవుల అనుగ్రహంతో వారు సత్వరమే పాణిని అష్టాధ్యాయిని సమగ్రంగా అధ్యయనం చేసి, వంగదేశంలో వేద పునరుద్ధరణ చేస్తారని నా నమ్మకం”* అని ఆయనకు స్వామీజీ విన్నవించారు.
అయినప్పటికీ స్వామీజీ హృదయం సదా ఏకాంతవాసాన్నే అభిలషిం చింది. రెండుసార్లు చేసిన తీర్థయాత్రలు ఆయన మనస్సులో గాఢమైన ఆలోచన లను లేవనెత్తాయి. అధిక కాలం ఇటువంటి జీవితం గడపాలనే ఉత్సుకత ఆయనలో పెరుగసాగింది.
కాని గురుదేవులు అప్పగించిన బాధ్యత స్వామీజీ ఉత్సుకతకు అడ్డుకట్ట వేసింది. చరిత్రలోనే వినూత్న సన్న్యాస సంప్రదాయాన్ని రూపొందించి, దాని బాధ్యతను స్వామీజీకి అప్పగించారు శ్రీరామకృష్ణులు. తక్కిన యువ సన్న్యాసుల బాధ్యత కూడా స్వామీజీదేనన్న విషయం విడిగా చెప్పనక్కరలేదు. వారి సర్వతో ముఖమైన వికాసానికి స్వామీజీ బాధ్యత వహించారు. ఈ పరిస్థితిలో వారితోపాటు జీవించడం తప్పనిసరి అయింది. ఆసక్తి, బాధ్యతల మధ్య స్వామీజీ మనస్సు ఊగిసలాడింది.
అలాగే శ్రీరామకృష్ణులు తమకు అప్పగించిన మహత్కార్యంలోని మరో భాగమూ ఆయన మనస్సులో మెదలింది. ఇలా అనడం కన్నా అదే ఆయన మనస్సును ప్రధానంగా ఆక్రమించిందని చెప్పవచ్చు – శ్రీరామకృష్ణుల సందేశాన్ని లోకమంతటా ప్రచారం చేయడమే అది. చేప ఒకటే; కాని దానిని పిల్లల జీర్ణశక్తి ప్రకారం పులుసు, పచ్చడి, వేపుడులాగ పలు రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వండి పెడుతుంది తల్లి – ఇది శ్రీరామకృష్ణులు చెప్పే ఉదాహరణ. అదే రీతిలో శ్రీరామకృష్ణుల సందేశాన్ని లోకమంతటా చాటాలి. కాని అందరికీ ఒకే విధంగా దానిని అందించడం సబబు కాదు. ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకో కుండా దానిని ఎవరికి, ఎలా అందించాలో నిర్ణయించడం అసాధ్యం. కనుక వారిని తప్పనిసరిగా కలుసుకోవాలని స్వామీజీ నిశ్చయించుకొన్నారు.
కుటుంబ దైన్య స్థితి
వెళ్లాలని తీర్మానించుకొన్న స్వామీజీ వెంటనే అక్కడ నుండి బయలుదేర గోరారు. కుటుంబ దైన్యస్థితి కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ప్రమదా దాస్‌కు ఆయన ఇలా వ్రాశారు: “కలకత్తా పరిసరాల్లో జీవిస్తున్నంత దాకా ఏ దారీ ఉన్నట్లు తోచడం లేదు. నా తల్లీ, ఇద్దరు సోదరులూ కలకత్తాలోనే నివసిస్తున్నారు. నేనే పెద్దవాణ్ణి, తరువాత వాడు ఎఫ్.ఏ. పరీక్షలకు చదువుతున్నాడు. చివరివాడు పసివాడు. పూర్వం వాళ్ల స్థితి బాగుండేది. కాని మా తండ్రి మరణానంతరం పరిస్థితి దారుణంగా పరిణమిం చింది; పస్తులు ఉన్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ కొరత చాలదన్నట్లు కొందరు దాయాదులు వారిని పిత్రార్జితంగా వచ్చిన ఇంటి నుండి వెల్లగొట్టారు. ఉన్నత న్యాయస్థానంలో దావా వేయడంతో ఇంట్లో ఒక భాగం రాబట్టుకోగలి గారు; కాని అంతా పోయింది, వ్యాజ్యెం అంటే సమస్తం కోల్పోవడమే కదా!
“కలకత్తా పరిసరాల్లో నివసిస్తే వీరి దైన్య స్థితిని నేను చూడవవలసి వస్తుంది. అప్పుడు రజోగుణం ప్రకోపించి, అహంకారం చెలరేగి నన్ను కార్య రంగంలోకి దూకడానికి ఉబలాటపడేట్లు చేస్తోంది. ఇటువంటి సమయాలలో నా హృదయంలో దారుణమైన యుద్ధం చెలరేగుతుంది. అందుకే నా పరిస్థితి భయా వహంగా ఉందని వ్రాశారు. ఇప్పుడు వ్యాజ్యెం ముగిసింది. కనుక కొన్ని రోజులు ఇక్కడ ఉండి పరిస్థితులు చక్కబరచిన పిదప ఈ చోటికి స్వస్తి చెప్పి మళ్లీ ఇక్కడకు రాకుండా ఉండాలని నన్ను ఆశీర్వదించండి.”*
తమ దీర్ఘమైన పయనం గూర్చి స్వామీజీ సోదర సన్న్యాసులకు చెప్పారు. మొదట్లో వారు అందుకు సమ్మతించలేదు; ఎవరినైనా ఒక సోదర సన్న్యాసిని తోడుగా వెంటబెట్టుకొని వెళ్లమని వారు ఒత్తిడి చేశారు. కాని అటువంటిది ఏకాంత జీవితం అనిపించుకోదని స్వామీజీ వ్యాఖ్యానించారు. చిట్టచివరికి తమ అభిప్రాయంతో వారిని ఏకీభవింపజేయగలిగారు. కొన్ని రోజులు మఠంలో ఉండి 1889 డిసెంబర్లో మఠం నుండి బయలుదేరారు.
యతి రాజు
స్వామీజీ తమ వద్ద ఒక చేతికర్ర, ఒక కమండలం, గీత పుస్తకం ఒకటి, The Imitation of Christ (క్రీస్తు అనుకరణ) ప్రతి ఒకటి మాత్రమే ఉంచు కొన్నారు. తమకంటూ స్థిరమైన నామధేయం ఏదీ స్వీకరించ లేదు; ఎవరూ గుర్తించకుండా ఉండడానికి తమను విభిన్న నామధేయాలతో పేర్కొన్నారు. తమ ఆంగ్ల ప్రావీణ్యాన్నీ తమ బహుముఖ ప్రజ్ఞా పాటవాలనూ సాధ్యమయినంతవరకూ ఆయన చాటుకోలేదు. అనేక సమయాల్లో ఆహారం కోసం అన్వేషించకుండా యాదృచ్ఛికంగా లభించే ఆహారాన్నే స్వీకరిం చారు. కనుక కొన్ని సమయాల్లో వరుసగా ఐదు రోజులు సైతం నిరాహారంగా గడపడం జరిగిందని స్వామీజీ చెప్పడం కద్దు. అడవి, కొండ, చావడి, సత్రాలలో ఎక్కడ చోటు లభించినా అక్కడ ఆయన బసచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు తాకరాదని సంకల్పించుకొన్నారు. కాబట్టి అనేక ప్రదేశాలు ఆయన కాలినడకనే వెళ్లవలసివచ్చింది; ఎవరైనా మరీ బలవంతం చేస్తే రైలు టికెట్టు మాత్రం పుచ్చుకునేవారు. ఒక సన్న్యాసి ఎలా జీవించాలని శాస్త్రాలు నిర్దేశించాయో తు.చ. తప్పక అలాగే తమ జీవితాన్ని మలచుకొన్నారు ఆ యతి రాజు.
కాశీ రమ్మని ఆహ్వానిస్తూ ప్రమదా దాస్ అప్పుడప్పుడు స్వామీజీకి ఉత్త రాలు వ్రాశారు. ఆయన వద్ద కొన్ని రోజులు ఉండి శాస్త్రాలలో తమకు కలిగిన సంశయాలను ప్రత్యక్షంగా ఆయన ముఖతః నివృత్తి చేసుకోవచ్చుననే తలంపుతో స్వామీజీ కాశీకి బయలుదేరారు. వైద్యనాథం చేరుకొన్నప్పుడు అలహాబాద్‌లో యోగానందస్వామికి అమ్మవారు పోసినట్లు తెలిసింది. వెంటనే స్వామీజీ అలహాబాద్ వెళ్లారు. కాని అప్పటికే ఒకరిద్దరు సోదర సన్న్యాసులు యోగా నందకు సేవాశుశ్రూషలు చేస్తున్నారు. స్వామీజీ కూడా వారితో కలిశారు. యోగానంద కోలుకొన్నాడు. ఇంతలో స్వామీజీని గురించి అనేకులకు తెలిసి పోయింది. ప్రతి రోజూ సాయంత్రం వారు ఆయన వద్దకు రాసాగారు. స్వామీజీ ప్రసంగమూ, పాటల కార్యక్రమమూ ప్రతి రోజూ జరిగాయి. ఈ రోజుల్లోనే పవహారీ బాబా అనే మహాత్ముని గురించి స్వామీజీ విన్నారు. ఆయనను దర్శించు కోవాలని నిశ్చయించుకొని స్వామీజీ ఘాజీపూర్ వెళ్లారు.
పవహారీ బాబా
ఘాజీపూర్‌లో ఏకాంతంగా ఒక గుహలో జీవిస్తున్న యోగిపుంగవుడు పవహారీ బాబా. రోజుల తరబడి, నెలల తరబడి కూడా ధ్యానంలో మగ్నుడై ఉండగల తపోధనుడు ఆయన. చిన్నతనం నుండే క్రమంగా తక్కువ ఆహారం స్వీకరిస్తున్న ఆయన, చివరికి ఒక పిడికెడు వేపాకు లేక కొన్ని మిరియాలు మాత్రమే తింటూ జీవించసాగారు. గుహలోనే ధ్యానంలో మునిగి ఎన్నో రోజులూ, నెలలూ ఉండేవారు. ఆ సమయంలో ఆయన ఏం తిని జీవించారో ఎవరికీ తెలియదు. కనుక ఆయనను పవహారీ బాబా (గాలిని ఆహారంగా పుచ్చుకొనే ముని) అని ప్రజలు పేర్కొనేవారు. ధ్యానంలో లయించి ఉండని రోజుల్లో గుహ మీద నున్న గదిలో ఉండేవారు, తమను చూడడానికి వచ్చేవారికి ఉపచర్యలు చేసేవారు. శ్రీరాముని విగ్రహానికి పూజలు చేసేవారు, హోమాలు నిర్వహించేవారు. శ్రీరామకృష్ణుల గురించి అప్పటికే విని, ఆయన ఛాయాచిత్రాన్ని ఉంచుకొని పూజలు కూడా చేసేవారు.
కాస్త లావుగా, ఎత్తుగా ఉండేవారు ఆయన. ఆయనకు ఒక కంట్లో మాత్రమే చూపు ఉంది. తాను విన్నవారిలో అతి శ్రావ్యమైన కంఠస్వరం ఆయనదేనని స్వామీజీ వ్రాసివున్నారు. తమ జీవితంలో చివరి పదేళ్లు ఎవరి దృష్టిలోనూ పడకుండా ఆయన జీవించారు. “యోగశాస్త్రానికి ఒక ఉదాహరణ గాను, పవిత్రత, వినమ్రత, ప్రేమలకు సజీవ దృష్టాంతంగాను ప్రశాంతంగా ఆయన జీవితం గడచింది.”* తాను అభిమానించి, సేవలందించిన ఉన్నతమైన మహాత్ములలో పవహారీ బాబా ఒకరిని స్వామీజీ వ్యాఖ్యానించారు.
బాబాపట్ల స్వామీజీ ఎంతో ఆకర్షితులయ్యారు. బాబా కూడా స్వామీజీ పట్ల ఎంతో ఆప్యాయత చూపారు. ఒకసారి ఆయనను చూసి అక్కణ్ణుండి బయలుదేరి వెళ్లిపోవాలనుకొన్నారు స్వామీజీ. కాని బాబా ఆప్యాయతా, వినమ్రమైన విన్న పమూ ఆయన తన నిర్ణయాన్ని మార్చుకొనేలా చేశాయి.
కర్మయోగ భావనలు
ప్రతి రోజు బాబా వద్దకు వెళ్లి పగటిపూటను స్వామీజీ గడిపారు. “యావజ్జీవి తమూ నేను నేర్చుకొంటాను” అనేవారు శ్రీరామకృష్ణులు. ఆ విషయంలోనూ స్వామీజీ ఆయనకు నిజమైన శిష్యునిగానే నిలిచారు. పరిస్థితులు, వ్యక్తులు, సంఘటనలు – ఇలా అన్నింటినుండి ఆయన నేర్చుకొంటూనే ఉన్నారు. పవహారీ బాబా ఉన్నతోన్నత స్థితిని చూసిన స్వామీజీ ఆయన నుండి కూడా నేర్చుకోవాలని ఉవ్విళ్లూరారు. కాని ఉపదేశమనే ప్రసక్తి రాగానే బాబా తప్పుకొనేవారు. ఉపదేశాలు వింటూ ఎవరూ పురోగ మించలేరనీ, స్వప్రయత్నంతో పాటుబడితేనే పురోగతి సాధ్యమనీ ఆయన విశ్వాసం. కాని స్వామీజీ వదలిపెట్టలేదు. ఏవేవో ప్రశ్నలు అడిగి ఆయన అనుభవ పూర్వకమైన జవాబులు ఆసక్తిగా వినేవారు. బాబా వచించిన రెండు భావనలు స్వామీజీ కాలాంతరంలో బోధించిన కర్మయోగ భావనలకు ఆధారప్రాయమైనవిగా ఉండడం చూడవచ్చు.
స్వామీజీ : ప్రారంభ దశలోని సాధకులకు మాత్రమే హోమం, పూజ మొదలైనవి తగినవి. మీ రెందుకు వాటిని అనుష్ఠిస్తున్నారు?
బాబా : ఏమిటి, కర్మలంటే ఒక వ్యక్తి తన నిమిత్తమే ఆచరిస్తున్నాడని నువ్వెందుకు భావించాలి? ఇతరుల కోసమూ కర్మలు ఆచరించవచ్చు కదా!
పనులు విడిచిపెట్ట నక్కరలేదు, అన్ని పనులూ చేయవచ్చు. కాని తన కోసం కాదు, ఇతరుల కోసం. అలా చేసేటప్పుడు అది ఆధ్యాత్మిక పురోగతికి దారి తీస్తుంది. ఈ భావన కాలాంతరంలో స్వామీజీ బోధించిన కర్మయోగానికి ఒక ప్రధాన ప్రాతిపదికగా విరాజిల్లింది.
మరొకసారి స్వామీజీ అడిగారు.
స్వామీజీ : ఎలా పని చేయడం?
బాబా : లక్ష్యాన్నీ సాధననూ ఏకం చేయి.
దీనిని వివరిస్తున్నప్పుడు తమ కర్మయోగ ప్రసంగాలలో స్వామీజీ ఇలా ప్రస్తావించారు:
“పవహారీ బాబా ఒకసారి కర్మ రహస్యాన్ని గూర్చి నాతో ఇలా చెప్పారు: ‘లక్ష్యాన్నీ సాధనను ఏకం చేయి.’ మీరు ఏ పని చేసినా ఆ పని తప్ప మరేదీ యోచించకండి. ఆ పనిని ఒక ఆరాధనగా, ఉన్నతమైన ఆరాధనగా, ఆ సమయంలో మీ జీవితం యావత్తు దానికి అంకితం చేసి చేయండి.”
హఠయోగంలో ఉత్సుకత
బాబా ఒక హఠయోగి. దేహాన్ని పరిపూర్ణ ఆరోగ్య స్థితిలో ఉంచుకోవడానికి హఠయోగం తగిన శిక్షణ గరపుతుంది. బాబా వద్ద హఠయోగం నేర్చుకోవాలని స్వామీజీ అభిలషించారు. దానికోసం ఒక రోజు ఎన్ను కొన్నారు. దానిని గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ మంచం మీద పడుకొనివున్నారు. హఠాత్తుగా అప్పుడు శ్రీరామకృష్ణులు ఆయన ముందు కనిపించారు. ఏదో విచారంగా స్వామీజీకి కుడివైపు నిలబడి ఆయననే తదేకంగా చూడసాగారు. రెండు మూడు గంటలు గడిచాయి. సంపూర్ణంగా శ్రీరామకృష్ణులకు అర్పించుకొన్న తాను ఇప్పుడు మరొక గురువును ఆశ్రయించాలనుకోవడం తప్పేమోనని స్వామీజీకి స్ఫురించింది. ఏదో దోషం చేశాననే ఆవేదనతో ఆయన కూడా పడుకొని శ్రీరామకృష్ణులను చూస్తుండి పోయారు. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు అదృశ్యమయిపోయారు. హఠయోగం నేర్చుకోవాలనే అభిలాషను తాత్కాలికంగా స్వామీజీ విరమించుకొన్నారు.
అయినప్పటికీ హఠయోగం పట్ల స్వామీజీకి గల ఉత్సుకత తగ్గలేదు. ఒకటి రెండు రోజులు గడిచాక మళ్లీ ఉత్సుకత తలెత్తింది. వెంటనే శ్రీరామకృష్ణుల దర్శనమూ కలిగింది. ఈ విధంగా ఆయన అనుకొన్నప్పుడల్లా శ్రీరామకృష్ణుల దర్శనం కలుగసాగింది.* తాము హఠయోగం నేర్చుకోవడం శ్రీరామకృష్ణులు అంగీకరించడంలేదన్న విషయం స్వామీజీ అర్థం చేసుకొన్నారు. దీర్ఘంగా ఆలో చించిన స్వామీజీకి అంతా అర్థమయింది – శ్రీరామకృష్ణులు యుగపురుషుడు. ఈ యుగంలో ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనవి తీసుకుని వచ్చిన వారు. తనకు ఏది అవసరమో ఆయనకు బాగా తెలుసు; దానిని ఆయన అనుగ్రహించారు కూడా. కనుక ఇకమీదట మరొకరిని ఆశ్రయించి కొత్తగా ఏదీ నేర్చుకోవలసింది లేదు – ఈ దృఢ నిశ్చయానికి రాగానే స్వామీజీలోని మనోచాంచల్యం తొలగిపోయింది.
భారతదేశానికి అవసరమైన సంస్కరణలు
స్వామీజీ వ్యక్తిత్వం పట్ల ఆకర్షితులైనవారు అనేకులు రోజూ ఆయన వద్దకు రావడమూ, ఆయన పాటలు, మాటలు వినడమూ ఘాజీపూర్‌లో దినచర్యగా పరిణమించింది. కాని వచ్చేవారి పాశ్చాత్య వ్యామోహాన్ని స్వామీజీ గమనించకపోలేదు. వారి నడక, దుస్తులు, ప్రవర్తన అన్నీ పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టాయి. పాశ్చాత్యులను అనుకరించడమే అభ్యుదయమని వారు భావించినట్లుగా కనిపించింది. అక్కడ నుండి కాశీ వాస్తవ్యులైన ప్రమద దాస్‌కు, “విదేశీయులు ఇక్కడికి ఎటువంటి నాగరికతను కొనితెచ్చారు? ఆహా! వారు ఎటువంటి ఐహిక వ్యామోహాన్ని కల్పించారు! దుర్బల హృదయులైన వీరిని ఆ విశ్వనాథుడే సంరక్షించుగాక!”* అని ఒక లేఖలో వ్రాశారు. ఈ ప్రజలను పాశ్చాత్య వ్యామోహం నుండి ఎలా విడిపించాలో ఒక రోజు ఆయన మాటల్లో స్పష్టంగా ప్రస్తావించారు. భారతదేశానికి ఆవశ్యకమైన సంస్కరణలు ఏ మార్గంలో జరగాలో ఆయన మాటలు స్పష్టంగా తెలిపాయి:
“ఉన్నదంతా బలవంతంగా తీసి పారవేయడమో, మన సంస్కృతిలోని అంశాలనన్నింటిని నిష్పక్షపాతంగా తూలనాడడం వల్లనో కాదు మనం సంస్కరణ లను తీసుకురావలసింది. దానికి బదులు అపరిమితమైన ప్రేమను నాటాలి, ఎనలేని సహనం పాటించాలి.
“విద్యను వ్యాపింపచేయాలి. సహజంగా అభివృద్ధికి కారణమవుతుంది. ఈ అభివృద్ధి బాహ్యంగా ఉత్తేజితమైనది కాక, లోపల నుండే ఉద్భవించినదై ఉంటుంది. మనం అందించే విద్య కూడా ఈ దృక్పథంతో కూడిన విద్యగా ఉండాలి. హిందూమత మహత్యాన్ని ఎలుగెత్తి చాటాలి; అతిశయోక్తులకు పోకూడదు. హిందూమతంలోని ఆదర్శాలను ప్రజలు చైతన్యపూరితులై అవగతం చేసుకొనేలా చేయాలి.
“ఒక్క విషయం మరచిపోకూడదు – హిందూమతం నీతి విరుద్ధమైనది కాదు! దాన్లో లోతుగా మునగండి, దాని మహత్యాన్ని మీరు కొలవవచ్చు. కళ్లుమూసుకొని పాశ్చాత్య సంస్కృతికీ, ఆచారవ్యవహారాల అట్టహాసాలకూ, పైపై మెరుగులకూ బానిసలు కాకండి. మీ మాతృదేశం గురించి అధ్యయనం చేయండి. మీ జాతి, దాని జీవనాధార ప్రాతిపదిక ఉద్దేశం ఏమిటన్నది కనుగొనండి.
“భారతదేశ ఆదర్శాలూ, దృశ్యాలూ మహత్తరమైనవి కావని నేడు మనం భావిస్తున్నాం. మనం క్షణం మాత్రమే ఆలోచించవచ్చు, అయినప్పటికీ మనం అలా ఆలోచిస్తున్నాం, అలాంటి మానసిక దురాకర్షణకు లోనయ్యాం. ఇలాంటి వినా శనం కన్నా ఆవేదన కలిగించే స్థితి మన భారతదేశ చరిత్రలో సంభవించి ఉండదు. నిజానికి మన దేశంలో విలయతాండవం చేస్తున్న పేదరికం ఏదో తెలుసా? మన నాగరకత ఆధ్యాత్మిక కొలబద్దను మనం కనుగొనకపోవడమే. మనలను మనం అవగతం చేసుకొన్నప్పుడు, కనుగొన్నప్పుడు మన సమస్యలు తొలగిపోతాయి.”
పాశ్చాత్య దేశాలకు ప్రప్రథమ ఆహ్వానం
స్వామీజీని చూడడానికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరగసాగింది. రోస్, పెన్నింగ్టన్ లాంటి ఒకరిద్దరు ఆంగ్లేయులు సైతం స్వామీజీకి పరిచయమయ్యారు. సేనాధిపతియైన రివడ్ – కార్నక్ కూడా స్వామీజీని కలుసు కొన్నాడు. ఆతడికి వేదాంతం పట్ల ఎంతో ఆసక్తి ఉంది. కాని మన దేశం గురించీ, సంస్కృతిని గురించీ ఆ పాశ్చాత్యులు తెలుసుకొన్నదంతా క్రైస్తవ మిషనరీల ద్వారానే. వారు నిజాలను వక్రీకరించి, నిజాలకు వ్యతిరేకార్థాలే చెబుతూ వచ్చారు. పాశ్చాత్యులు ఈ కట్టుకథలనే భారతదేశమని నమ్ముతూవచ్చారు. దీనిని స్వామీజీ అర్థంచేసుకోకపోలేదు. అలాగేవారిలో కొందరికి నిజంగానే భారతీయ ఆధ్యాత్మిక సంపత్తి పొందాలనే ఉత్సుకత ఉండడం కూడా స్వామీజీ గ్రహించకపోలేదు. ఈ రోజుల్లోనే పెన్నింగ్టన్ దంపతులు, “స్వామీజీ, మీరు ఇంగ్లండుకు వెళ్లాలి. అక్కడ మీ భావనలను ప్రచారం చేయాలి” అని ఆయనను కోరారు. పాశ్చాత్య దేశాలకు రావలసిందిగా స్వామీజీ అందుకొన్న ప్రప్రథమ ఆహ్వానం ఇదే. కాని స్వామీజీ అప్పుడు వీటినన్నింటినీ ఆలోచించే స్థితిలో లేరు. కఠోరమైన తపోమయ జీవితమూ, సాధనలే ఆయన కళ్ల ముందు ద్యోతకమయ్యాయి.
మరో నెల రోజులు ఘాజీపూర్‌లోనే స్వామీజీ బసచేశారు. ఆ సమయంలో హృషీకేశ్‌లో అభేదానంద వ్యాధిగ్రస్థుడైనట్లు ఆయనకు కబురు వచ్చింది. అభేదా నందను కాశీకి తోడ్కొని రావడానికి ఏర్పాట్లు చేసి, తామూ కాశీకి వెంటనే బయలుదేరారు. కాశీలో అభేదానందకు చేదోడువాదోడుగా ఉంటూ ఆయనకు నయమయ్యేదాకా స్వామీజీ అక్కడే ఉండిపోయారు.
‘హృదయంలేని సన్న్యాసిని కాను నేను’
1890 ఏప్రెల్‌లో బలరాంబోసు కాలధర్మం చెందాడనే వార్త స్వామీజీకి అందింది. శ్రీరామకృష్ణుల భక్తులకీ, శిష్యులకీ తలలో నాలుకలా మెలగిన వ్యక్తి బలరాం. భక్తులలో ఆయనకు శ్రీరామకృష్ణులు ఒక విశిష్ట స్థానాన్ని కేటాయించారు. అటువంటి వ్యక్తి మరణవార్త స్వామీజీని అమితంగా క్రుంగదీసింది. ఈ విధంగా సోదర సన్న్యాసుల పట్ల స్వామీజీకి గల అనురాగం, భక్తుని మరణం పట్ల ఆయన పడ్డ ఆవేదన పండితుడయిన ప్రమదా దాస్‌కు ఆశ్చర్యం కలిగింది. “ఒక సన్న్యాసికి ఇంతటి అనురాగమూ, బంధమూ భావ్యమా?” అంటూ విస్మయం చెందారాయన. “మేం రసహీనులమైన సన్న్యాసులం కాము. ఒక వ్యక్తి సన్న్యాసి అయినంత మాత్రాన ఆతడు హృదయర్లేనివాడవుతాడా?” అని ఆయనకు స్వామీజీ జవాబిచ్చారు.
మళ్లీ మఠంలో
బలరాంను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగివున్న ఆ కుటుంబాన్ని సాంత్వన పరచడానికి స్వామీజీ కలకత్తా బయలుదేరారు. ఈసారి ఆయన మఠంలో మూడు నెలలు బసచేశారు. ఈ రోజులు మఠం లోని సన్న్యాసులకు వరప్రసాదంగా పరిణమించాయి. స్వామీజీ బహుముఖ ప్రజ్ఞాపాటవాలు ఎన్నో రీతుల్లో వ్యక్తమయ్యాయి. ఆయనతో గడపిన ప్రతి క్షణమూ మఠవాసులకు ఒక గుణపాఠమయింది. మఠాన్ని ఎంత గానో ఆదరిస్తూ వచ్చిన బలరాం, ఆయన తరువాత మే నెలలో సురేంద్రనాథ్ మిత్రా – ఇద్దరూ మృతి చెందడంతో ఆర్థికంగా మఠం క్లిష్ట పరిస్థితిని చవి చూసింది. తినడానికి ఏమి లేకుండా కొన్ని రోజులు వారు గడపవలసి వచ్చింది. శ్రీరామకృష్ణుల భక్తులైన గిరీశ్, ‘మ’ లాంటి వారిని స్వామీజీ కలుసుకోగానే వారు వెంటనే చేయూతనిచ్చారు. కాని వారు అంత ధనవంతులు కారు. వారు అందించిన మొత్తంతో ఖర్చులను ఏదో కొంత మేరకు సర్దుకొన్నారు ఆ యువ సన్న్యాసులు.
ఇలా మఠం పరిస్థితి చక్కదిద్దవలసివుండగా, స్వామీజీ మనస్సును మరో తలంపు అల్లకల్లోలపరచసాగింది. శ్రీరామకృష్ణుల అస్థికలను గంగాతీరంలో ఎక్క డైనా ఒక చోట ప్రతిష్ఠించి ఒక దేవాలయం నిర్మించాలని స్వామీజీ ఎంతగానో అభిలషించారు. కాని మఠం అభివృద్ధికి అయితేనేం, శ్రీరామకృష్ణుల దేవాలయ నిర్మాణానికి అయితేనేం నిధులు సేకరించడం సామాన్యమైన పనికాదు. సురేంద్రనాథ్ మిత్రా 1000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేశాడు. ప్రమదా దాస్ సహాయపడతాడని ఎంతో నమ్మకంగా ఉన్నారు స్వామీజీ. కాని ఆయన వద్ద నుండి పైకం రాకపోవడం స్వామీజీని విచారానికి గురిచేసింది.