సంవత్సరాలు అనేకం దొర్లిపోతాయి, అనేక తరాలు పుట్టి గిట్టుతాయి.వివేకానంద – ఆయన కాలమూ భూతకాలంలో కలసిపోతుంది.కాని ప్రజల మనోఫలకాలపై రూపుదిద్దుకొన్న వివేకానంద అనే ఆమహనీయుని చిత్తరువు ఎన్నటికీ చెరిగిపోదు.
ఇ.వి. చెలిషేవ్
[రష్యన్ చింతనాశీలి]
నాగరకతల నవీకరణ శక్తి — హిందూమతం — వేదాలు — నవీకరణమూ – పరిణామాలూ — హిందూమత స్తబ్ధతా స్థితి — పాశ్చాత్య సంస్కృతీ వెల్లువ — సంస్కర్తలు — కాలావశ్యకత — సామరస్య ప్రవక్త — రామకృష్ణులు — సమన్వయ ప్రవక్త స్వామి వివేకానంద — సత్య యుగం — వసుధైక సంస్కృతికి పూర్వం — ప్రపంచ చింతనా ధోరణిలో మార్పు
నాగరకతల నవీకరణ శక్తి
మ హారాజులు పరిపాలించారు, కాలగర్భంలో కలిసిపోయారు; సామ్రాజ్యాలు విల సిల్లాయి, అంతరించిపోయాయి; సంస్థలు వెలశాయి, కనుమరుగయ్యాయి; తత్త్వాలు ప్రతిపాదింపబడ్డాయి, తిరస్కరింపబడ్డాయి. వీటన్నింటినీ మించి ఆటంకాలను అధిగమించి, అవరోధాలను తొలగించుకొని, కఠిన పరీక్షలకు ఎదురొడ్డి నాగరకతలు వర్ధిల్లాయి. అవరోధా లను దాటుకొంటూ పోయేకొద్దీ వాటి శక్తి ఇనుమడించింది. కాలాన్ని నిర్జించి నాగరకతలు వికాసం పొందాయి. ఈ విజయానికి కారణం ఏది?
నవీకరణ శక్తే అందుకు కారణం. కాలగమనంతోపాటు నాగరకతలు నవీ కరణను సంతరించుకొంటాయి. అందుకు వలసిన శక్తి వాటికి ఉంది. ఎన్నడైనా నాగరకతల పురోగతికి ఆటంకం వాటిల్లితే, తక్షణమే ఆ శక్తి కార్యోన్ముఖమవుతుంది.
ఈ శక్తి ఎక్కణ్ణుంచి వస్తుంది?
చరిత్రను కూలంకషంగా అధ్యయనం చేస్తే ఈ శక్తి మతం నుండి లభిస్తూ వచ్చిన్నట్లు స్పష్టమవుతుంది. నాగరకతల, సంస్కృతుల పాలిట పరిరక్షక శక్తిగా మతం విరాజిల్లుతున్నది.
ఏదైనా కారణాల వలన ఈ నవీకరణ ప్రక్రియకు అవరోధం వాటిల్లితే సంస్కృతి క్షీణిస్తుంది, నాగరకత అంతరిస్తుంది. ప్రాచీన ఈజిప్టు, బాబిలోనియా, గ్రీకు, రోమ్ నాగరకతలు ఇట్లే అంతరించాయి. ఈ నాగరకతలు సజీవమై ఉండడానికి ఆవశ్యకమైన స్ఫూర్తినీ, జీవశక్తినీ మతాలు అందించలేకపోవడమే అందుకు కారణం. అందువల్లనే ఆ మహోన్నత నాగరకతలు అంతరించాయి!
కాని ఎన్నో శతాబ్దాల పర్యంతం అనేక విదేశీ దండయాత్రలనూ, సమాజంలో చొచ్చుకొనిపోయి విధ్వంసం చేసిన సంస్కృతులనూ చవిచూసి కూడా భారతీయ నాగరకత ఇంకా చెక్కుచెదరక సజీవంగా ఉంది. అందుకు కారణమేమిటి?
అందుకు కారణం హిందూమతం!
హిందూమతం
భారతీయ నాగరకతకు పునాదిగా హిందూమతం అలరారింది. భారతీయ నాగరకత సజీవమై ఉండడానికి జీవశక్తిని నిరంతరాయంగా అది సరఫరా చేస్తూ వస్తూన్నది. అందువల్లనే భారతీయ నాగరకత అంతరించి పోకుండా సజీవంగా ఉంటూవచ్చింది. హిందూమతానికి ఆ శక్తి ఎలా లభించింది? అది పదేపదే తనను నవీకరణం గావించుకోవడం నుండి. ఏ కాలఘట్టంలోనూ హిందూమతం స్తబ్ధత పొందింది లేదు. అది సదా తనను తాను నవీకరణం గావించుకొంటూనే ఉంది.
భారతదేశ రాజకీయ చరిత్ర ఇతర దేశాల చరిత్రల మాదిరే యుద్ధాలతోనూ, విప్లవాలతోను సతమతమయిందే! కాని దాని మత చరిత్ర విభిన్న దృశ్యాన్ని చూపు తున్నది. అది ప్రశాంతమయమైన దృశ్యం. పరాయి మతాలను ద్వేషించక వాటిని ప్రతిఘటించకుండా ఆదరించి స్వీకరించిన మహత్తర సభ్యతాసంస్కారాల సమా హార చిత్రం. పరాయి మతాలను ప్రతిఘటించడానికీ, రూపుమాపడానికీ హిందూ మతం ఎన్నడూ, కలలో సైతం ప్రయత్నించింది లేదు. పైగా తనను ప్రతిఘటిం చాలనే, నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో పైపైకి త్రోసుకు వచ్చిన శక్తులను కూడా అది ప్రత్యర్థిగా భావించింది లేదు. అందుకు మారుగా వాటిని తనలో ఇముడ్చుకొంది. అనేక మతాలు వెలిబుచ్చిన భావనలను హిందూమతం త్రోసిరాజనలేదు; స్వీకరించింది. తనలో లీనం చేసుకొంది. అందుమూలంగా ప్రతి ఘట్టంలోనూ తనను అది నవీకరణం చేసుకొంటూ తద్ద్వారా పెంపొందుతూ వచ్చింది.
వేదాలు
వేదకాలం నుండే ఈ విధమైన నవీకరణం జరుగుతూ రావడం మనం గమ నించవచ్చు. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారమనే దీర్ఘనిద్రలో మునిగి పోయి ఉన్నప్పుడు భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశంతో జాగృతంచెంది విరాజిల్లింది. తపోసంపన్నులైన భారతీయ ఋషులు, “సమస్తమైన అంధకారానికీ అతీతమైన సూర్యదీప్తితో జాజ్జ్వల్యమానమై ప్రకాశించే ఆ భగవంతుణ్ణి నేను సాక్షాత్కరించు కొన్నాను. ఆయనను ప్రత్యక్షం చేసుకోవడం వల్ల మాత్రమే మానవుడు మృత్యుం జయుడవుతాడు. మరో మార్గం ఏదీ లేదు.” ; “అమృత పుత్రులారా! ఆలకించండి” అంటూ బిగ్గరగా యావన్మందినీ ఆహ్వానించారు. “చాలాపూర్వం చరిత్ర రచనగానీ, సాంప్రదాయిక కథల మంద కాంతులుగానీ చొరని, పురాణకాలం నుండి” ఈ లోకాన్ని పునీతం గావించే రీతిలో జీవించిన ఆ ఋషిపుంగవుల దివ్యానుభూతులే వేదాలు.
నవీకరణమూ – పరిణామాలూ
ప్రకృతి సర్వత్రా ఒకే భగవంతుడు నెలకొని ఉన్నాడనే సిద్ధాంతాన్ని (Pantheism) వేదాలు ప్రబోధించాయి. క్రమేణా బుద్ధిని పదునుబెట్టి విచారణ చేసే చింతనా ధోరణులు బయలుదేరాయి. వేదాలు వాటిని ప్రతిఘటించలేదు. ఆ చింతనలను తనలో పొందుపరచు కొన్నాయి. తత్ఫలితంగా ఉపనిషత్తులు మనకు లభించాయి.
తదనంతర ఘట్టంగా చరిత్రలో భాగవత ధర్మం తలెత్తింది. శ్రీకృష్ణుడు అవత రించి దానిని ఉపనిషత్తులలో పొందుపరిచాడు. తత్ఫలితంగా భగవద్గీత లభ్యమైంది.
ఆ తరువాత బుద్ధుడు అవతరించాడు. ఆయన భారతీయ సంస్కృతీ వినువీథిలో అనేక వినూత్న చింతనలను లేవదీశాడు. దీని ఫలితంగా అనేక తాత్త్విక ధోరణులు బయలుదేరాయి.
తదనంతర కాలంలో అవతరించిన ఆదిశంకరుడు బౌద్ధమతంలోని మహత్తర అంశాలను హిందూమతంలో పొందుపరచాడు. దాని ఫలితంగా భారతీయ సంస్కృతి ఏకీకరణ చెందింది.
11 వ శతాబ్దంలో సంఘటించిన మహమ్మదీయ దండయాత్ర భారతీయ సమాజ, రాజకీయ స్థితిగతులలో గొప్ప మార్పు తీసుకువచ్చింది. ఈ మహోప ద్రవం వలన కూడా హిందూమతం చతికిలపడలేదు. ఆ ఆఘాతాన్ని తట్టుకొని నిలద్రొక్కుకోవడానికై రామానుజ, మధ్వ, రామానంద, కబీర్దాసు, తులసీదాసు, మీరాబాయి, చైతన్యులు, ఆళ్వార్లు, నాయన్మార్లు మొదలైన ఆచార్యవరేణ్యులు ఏతెంచారు. వారు ఇస్లాం మతంలోని కొన్ని అంశాలను స్వీకరించి భగవంతుణ్ణి శరణుజొచ్చి జీవించాలనే శరణాగతి మార్గాన్నీ, సౌభ్రాతృత్వ మహత్వాన్నీ ఉపదే శించారు. ఈ రీతిలో దేనినీ త్రోసిరాజనకుండా హిందూమతం క్రమక్రమంగా పరిపుష్టిని సంతరించుకొంటూ వచ్చింది.
హిందూమత స్తబ్ధతా స్థితి
కాని ఇస్లాం మతాంశాలను స్వీకరించి హిందూమతం ఆంతరికంగానే వృద్ధి చెందిందని చెప్పాలి. బాహ్యాభివృద్ధిపరంగా హిందూమతం వెనుకంజవేసి, ఒక విధంగా స్తబ్ధతా స్థితికి చేరింది. మహమ్మదీయ పాలకులు కత్తి ఝళిపించి ప్రజలను బలవంతంగా తమ మతంలోకి మార్చారు. వారు హిందూ దేవాలయాలను కొల్లగొట్టి ధ్వంసం చేశారు, భారతీయ సంస్కృతీ చిహ్నాలను విచ్ఛిన్నం చేశారు, హిందువుల విశ్వ విద్యాలయాలనూ, గ్రంథాలయాలనూ నేలమట్టం చేశారు. ఇంత జరుగుతున్నా హిందువులు ప్రతిఘటించలేకపోయారు. ఇలాంటి స్తబ్ధతా స్థితిలో మూఢ నమ్మ కాలూ, వామాచారాలూ హిందూమతంలో ప్రబలనారంభించాయి. కాలక్రమంలో అవి నిజమైన మతాన్ని కప్పివేసి మూఢనమ్మకాలతో, కొన్ని ఆచారాలతో కూడు కొన్నది మాత్రమే హిందూమతమన్న శోచనీయ స్థితికి దిగజార్చాయి.
పాశ్చాత్య సంస్కృతీ వెల్లువ
ఆ సమయంలో ఆంగ్లేయులు భారతదేశంలో కాలుమోపారు. మహమ్మదీయుల ప్రాబల్యంతో అప్పటికే అల్లల్లాడుతున్న భారతీయ సంస్కృతీ, హిందూ మతమూ ఆంగ్లేయులు భారతదేశాన్ని తమ బానిస దేశంగా మార్చుకొన్న తరువాత కూకటివ్రేళ్లతో సహా ఊగిపోసాగాయి. ఆంగ్లేయుల ప్రాబల్యం పెరిగేకొద్దీ భారతీయ వారసత్వం బలహీనపడసాగింది. తమ సంస్కృతి పట్ల, మతం పట్ల భారతీయుల విశ్వాసం సడలిపోసాగింది. పాశ్చాత్య సంస్కృతీ నాగరకతల తళుకుబెళుకులకు, హొయలుకు అనేకులు ముగ్ధులయ్యారు. అంతస్తూ, అధికారమూ పొందగోరితే పాశ్చాత్య సంస్కృతిని అలవరచుకోవడమే సబబని హిందు వులు భావించసాగారు. భారతీయుల ఈ దుర్బల మనఃస్థితిని ఆసరాగా తీసుకొని హిందువులలో అనేకులను ఆంగ్లేయులు క్రైస్తవ మతంలోకి మార్పిడి చేశారు.
పాశ్చాత్య సంస్కృతి హిందూ సమాజంలోకి నిరాటంకంగా చొచ్చుకొనిపోవ డమే భారతదేశం చవిచూసిన భయాందోళనల పరిణామాలలోకెల్లా శక్తిమంతమైన దని పేర్కొనాలి. ఎందుకంటే – ఈ చొరబాటు కారణంగానే భారతీయుడు తన వారసత్వ మహత్వంలోను, తన సంస్కృతిలోను, తన మతంలోను విశ్వాసం కోల్పోసాగాడు, ఆత్మవిశ్వాసం కోల్పోసాగాడు. ఎప్పుడైతే ఒక సంస్కృతి తన వారసత్వం పట్ల విశ్వాసం కోల్పోతుందో అప్పుడు దాని పతనం మొదలయిందని అర్థం. 19 వ శతాబ్దపు భారతదేశం ఇలాంటి పతనావస్థ త్రోవపట్టింది.
సంస్కర్తలు
ఈ తరుణంలో భారతీయ సంస్కృతిని నవీకరణం గావించే శక్తి పనిచేయ నారంభించింది. పాశ్చాత్య సంస్కృతి విసరిన సవాళ్లను ప్రతిఘటించడానికి పలువురు సంస్కర్తలు రంగప్రవేశం చేశారు. వీరిని రెండు కోవలుగా వర్గీకరించవచ్చు. మొదటి కోవకు చెందినవారు భారతీయ సంస్కృతిలోనూ, హిందూమతంలోనూ ప్రయోజనాత్మకమైన అంశాలు ఏవీ లేవనీ, అవన్నీ కేవలం మూఢనమ్మకాల కుప్ప కనుక వాటిని త్యజించి పాశ్చాత్య సంస్కృతిని స్వీకరించడమే ఉత్తమ మార్గమని భావించారు. మరో వర్గం వారు వేదకాలానికి మరలిపోవడమే ఏకైక మార్గమని అభిప్రాయపడ్డారు. వేదకాల ప్రజలు గడిపిన సామాన్య జీవన సరళిని మళ్లీ పునరుద్ధరించాలన్నదే వారి భావన. వేదకాలానంతరం కాలంలో మార్పు రావడమూ, ఆ మార్పు తెచ్చిన పురోభివృద్ధినీ వీరు పరిగణించలేదు.
ఈ రెండు రకాల సంస్కరణలూ సమాజానికి కొంతలో కొంత మేలును చేశాయనే చెప్పాలి. కాని అవి నిరంతరమైనవి కావు. ఎందుకంటే ఈ సంస్కరణలు ఏకపక్షమైనవి, ప్రయోజనాత్మకమైనవి కాకపోవడమే. “ఇల్లు పాడుబడింది. కనుక సొంత ఇంటిని వదలిపెట్టి మరో ఇంట్లో కాపురం పెట్టు” అన్నట్లుంది మొదటి రకం సంస్కరణ. ఇక రెండవ రకం, “కట్టడం అనవసరం. పునాదులే ఆధారం కనుక అందరూ అక్కడకు వెళ్లి నివసించండి” అన్నట్లుంది. పాడుబడ్డ ఇంటిని మరమ్మతు చేయాలని ఎవరూ ప్రయత్నించలేదు. సంస్కర్తలలో అనేకులు అప్పటి సమాజ దురవస్థకంతా కారణం హిందూమతమేనని తప్పుబట్టారు; మతాన్నే తృణీకరింప నారంభించారు.
కాని దేనినైనా నాశనం చేయడం వల్లనో, తృణీకరించడం వల్లనో సమాజం వికాసం చెందదు; స్వీకరించడం వల్లా, నవీకరించుకోవడం వల్లా అది అభ్యున్నతి పొందుతుంది. చరిత్ర నేర్పిన గుణపాఠం ఇదే! బౌద్ధ, ఇస్లాం ప్రభృత మతాలలోని ఉన్నతాంశాలను స్వీకరించి హిందూమతం నూత్నతేజంతో అభ్యున్నతిని పొందడం మనం చూస్తున్నాం. కనుక సవాలుగా తలెత్తిన పాశ్చాత్య సంస్కృతిని త్రోసిరాజన డమూ తప్పే, యథాతథంగా స్వీకరించడమూ తప్పే! వాటిలోని ఉదాత్తమైన అంశాలను స్వీకరించాలి. ఇది చరిత్రలో నిర్నిరోధాంశం.
కాలావశ్యకత
ముందుగా హిందూమతం మీద పేరుకుపోయిన మాలిన్యాన్ని తొలగించి నిజమైన హిందూమతాన్ని బయటకు తీసుకురావాలి. దానితోపాటు పాశ్చాత్య సంస్కృతిలోని ఉదాత్తమైన అంశాలను హిందూమతంలో చేర్చుకోవాలి. ఈ విధంగా తనలో వినూత్నతను సంతరింప జేసుకొన్న హిందూమతాన్ని లోకానికి సమర్పించాలి. దీనిని ఆచరణలో పాటించి చూపడమే కాలావశ్యకత. దీనిని నెరవేర్చి లోకానికి క్రొత్త బాటను వేసే నిమిత్తం అవతరించిన వారే శ్రీరామకృష్ణ – వివేకానందులు. సామరస్య ప్రవక్తగా శ్రీరామకృష్ణులూ, సమన్వయ ప్రవక్తగా స్వామి వివేకానందా అవతరించారు. ఈ రకంగా వీరిద్దరూ చరిత్రలో ఒక గొప్ప యుగసంధిలో ఉద్భవించారు.
సామరస్య ప్రవక్త శ్రీరామకృష్ణులు
పాతయుగం అస్తమించి కొత్త యుగ ఉషోదయం కాబోతున్నది. పాశ్చాత్య సంస్కృతి తీసుకువచ్చిన వైజ్ఞానిక, సామాజిక – రాజకీయ భావనలతో హిందూ మతం బలవత్తరమైన కొత్త సవాళ్లను ఎదుర్కొంటూవుంది; ఆధ్యాత్మికత బాగా దిగజారిన స్థితిలో ఉంది. ఆ సమయంలోనే శ్రీరామకృష్ణులు అవతరించారు. మానవాతీతమైన ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించి ఆయన హిందూమత సనాతన ఆధ్యాత్మిక సంప్రదాయాలను నవీకరణం చేశారు. ఆధ్యాత్మిక జీవితానికి ఒక ఉద్వేగాన్ని ప్రసాదించారు. లోకంలో పలు ప్రాంతాలను ఛిన్నాభిన్నం చేస్తున్న, విధ్వంసం చేస్తున్న వినాశకర శక్తులను ప్రతిఘటించడానికి సామరస్యమనే శక్తిమంతమైన పరికరాన్ని కనుగొన్నారు.
సమన్వయ ప్రవక్త స్వామి వివేకానంద
శ్రీరామకృష్ణులు భగవంతుని మానవత్వాన్ని చాటిచెప్పగా, వివేకానంద మానవుడి దివ్యత్వాన్ని వెల్లడి చేశారు. తమ గురుదేవులయిన శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక సందేశాన్నీ, మత సామరస్య సందేశాన్నీ ఆయన లోకమంతటా ప్రచారం చేశారు; ప్రజలు మనస్సులను జాగృతం గావించారు. వీటితోబాటు ఆచరణయుత వేదాం తాన్ని లోకానికి అందించారు. మతం, సంస్కృతి, సామాజిక జీవనం లాంటి వాటి నుండి నిరర్థకమైన, కాలం చెల్లిపోయిన వాదనలనూ, మూఢనమ్మకాలనూ తొలగించి, అనేక చక్కని అంశాలను చేర్చి, దానిని ఆధునికయుగ అవసరాలకు ఎలా వినియోగించుకోవాలో సూచించారు. ఇందుమూలంగా వ్యక్తి శ్రేయస్సుకూ, సర్వుల శ్రేయస్సుకూ ఆధ్యాత్మికతను ఎలా ఉపయోగించుకోవాలో తెలిపారు.
“స్వామి వివేకానంద ప్రయోజనాత్మకంగా సాధించిందేమిటి? అనేక అంశాల మధ్య సమతౌల్యం కనుగొని, వాటిని సమన్వయపరచారు – ఈ రెండు సాధనలే పై ప్రశ్నకు జవాబు” అంటున్నారు ఫ్రెంచి త్తాత్వికుడు రోమా రోలా.
సత్య యుగం
ఈ విధంగా ఆధునిక యుగానికి అవసరమైన సమగ్రత్వానికి ప్రవక్తగా స్వామి వివేకానంద విరాజిల్లారు. ఆయన ఒక ఆదర్శప్రాయ మైన సమాజాన్ని కలగన్నారు. ప్రాచీనకాలం – ఆధునిక కాలం, ప్రాచ్య దేశాలు – పాశ్చాత్య దేశాలు, ఆధ్యాత్మికత – ప్రాపంచికత, మతం – విజ్ఞానం, వ్యక్తి – సమాజంలోని అన్ని విశిష్టాంశాలు ఇమిడివున్న ఒక సమగ్ర మైన సంస్కృతిని లేదా పరిపూర్ణమైన సంస్కృతిని సంతరించుకొన్న సమాజమే అది.
వసుధైక సంస్కృతికి పూర్వం
భారతీయ ఆధ్యాత్మిక సంపత్తి ప్రపంచ చింతనా ధోరణులను, జీవన సరళిని పరివర్తిల్ల చేయగలదని 19 వ శతాబ్ద విశిష్ట చింతనాశీలురైన మాక్స్ ముల్లర్, ష్కోపనేర్ రూఢిగా నమ్మారు. భారతీయ చింతనా ధోరణులు వ్యాప్తిగాంచినప్పుడు అద్భుతమైన నవజాగృతి చోటుచేసు కొంటుంది. ఇంతదాకా లోకం చూడని నూతనత్వాన్ని సంత రించుకొన్న ఒక సంస్కృతి రూపొందుతుంది. గ్రీకు, రోమ్ నాగరకతల మిశ్రమం మూలంగా ఉద్భవించిన ప్రస్తుత పాశ్చాత్య సంస్కృతిని ఈ క్రొత్త సంస్కృతి మర పించి, ప్రాబల్యం వహిస్తుందని వారు భావించారు.
ఈ రకంగా వేదకాలం నుండే క్రమేణా వస్తూవున్న ఆధ్యాత్మిక సంపత్తియైన ఈ చింతనలు శ్రీరామకృష్ణుల వలన నూత్నశక్తిని సంతరించుకొని, స్వామి వివేకానంద ద్వారా కొత్త రూపంలో లోకానికి అందించబడ్డాయి. ఈ చింతనలు భారతదేశానికి మాత్రమే కాక, యావత్ప్రపంచానికి శ్రేయస్సును కలిగిస్తాయి. దీనిని ప్రాచీన, నేటి చింతనాశీలురు పలువురు అంగీకరించారు; పలువురు దానివైపుగా పయనం సాగిస్తున్నారు.
ప్రపంచ చింతనా ధోరణిలో మార్పు
ఈ రీతిలో ప్రపంచ చింతనా ధోరణిలో ఒక మార్పుకు వివేకానంద స్వామి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వసుధైక కుటుంబం, వసుధైక సంస్కృతి అని చెప్పుకోవడమూ, అట్టి చింతనాసరళి వైపుగా లోకం పయ నిస్తూ ఉండడమూ స్వామి వివేకానంద చింతనా ధోరణి చలువే! వసుధైక సంస్కృతికి ఆయన మార్గదర్శిగా విరా జిల్లారు. దానిని వివేకానంద స్వామి సాధించిన వైనమే ఆయన జీవిత చరిత్ర.
సాటిలేని వివేకానంద స్వామి జీవితం బహుముఖ పరిమాణాల సమాహారం. మతం, తత్త్వం మాత్రమే కాక విజ్ఞానం, సమాజం, కళలు, సంగీతం ఇత్యాది ప్రతి విషయాన్ని ఆయన ప్రభావితం చేశారని నేటి మేధావులు గ్రహించారు. ప్రస్తుతం దానిని గూర్చి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇలా కాలావశ్యకతకూ, ప్రపంచ ఆవశ్యకతకూ, ముఖ్యంగా భారతదేశ ఆవశ్యకతకూ ఒక సందేశంతో ఈ ఇలలో అవతరించిన వ్యక్తి స్వామి వివేకానంద. ఒక మహోన్నతుడైన చింతనాశీలుని, దీనజన బాంధవుని, మహనీయ జగద్గురువు, భగవత్సాక్షాత్కారం పొందిన మహిమాన్వితుని జీవిత చరిత్ర ఇది.
వివేకానంద స్వామి జీవిత చరిత్ర చదవడం మనలో నిద్రాణ స్థితిలో ఉన్న ఆధ్యాత్మిక ప్రేరణలను జాగృతం చేయడమనే ఒక ఆధ్యాత్మిక సాధన అంటే అతిశయోక్తి కాదు.
ఆ ఆధ్యాత్మిక సాధనానుష్ఠానం ఇక ప్రారంభిద్దాం…..