కారుణ్య పూర్ణ నయనాం శరదిందు వక్త్రామ్
చారుస్మితాం మృదుల మంజుల వాగ్విలాసాం ।
కామాదిషట్కరహితాం ప్రణయార్త్ర సిద్ధాం
శ్రీ శారదాం శ్రితజనార్తిహరాం నమామి ॥
కరుణయే నిండిన నేత్రాలు గలదీ, శరత్కాల పండు వెన్నెలలా ఆహ్లాదకర ముఖారవిందము గలదీ, చిరుదరహాసాలు వెదజల్లునదీ, మృదులభాషిణీ, కామాది అరిషడ్వర్గాలు లోపించినదీ, అనురాగ మనస్వినీ, ఆశ్రితుల దుఃఖాలను బాపునదీ అయిన శ్రీ శారదామాతకు ప్రణామాలర్పిస్తున్నాం.
– స్వామి అభేదానంద
1
ఓం శ్రీశ్రీభగవాన్
[అక్షయకుమార్సేన్]*
జయరాంబాటి
ఫిబ్రవరి / మార్చ్ 1895
శుభాశీస్సులు.
నాయనా! నీ ఉత్తరం అందింది. వివరాలు తెలుసుకొని ఎంతో సంతోషిం చాను. శ్రీశ్రీ గురుదేవుల జయంతి మహోత్సవంలో నువ్వు పాల్గొనడం నా కెంతో ఆనందం కలిగించింది. ఇక్కడ కామార్పుకూర్లో కూడా జయంత్యుత్సవం వైభవో పేతంగా జరిగింది. పుస్తక* ముద్రణ గురించి వ్రాశావు. నాయనా! భగవంతుని ప్రేరణ మేరకు వ్యవహరించు. నా వరకు అయితే ముద్రించమంటాను. ఆయన పట్ల నీకు అపార భక్తి ఉంది. అందువలన నీ లక్ష్యం తప్పక నెరవేరుతుంది.
నేను క్షేమంగా ఉన్నాను. నీ క్షేమం గురించి వ్రాయి.
మీ
అమ్మ
2
శ్రీశ్రీ కాళీశరణమ్
[అక్షయకుమార్సేన్]
జయరాంబాటి,
మే / జూన్, 1895
నాయనా!
…. నీ ఉత్తరం అందింది. వివరాలు తెలిశాయి. నా తలనొప్పి తగ్గింది, ఇప్పుడు ఎలాంటి బాధా లేదు. జయరాంబాటికి వచ్చే విషయం వ్రాశావా? కానీ నాకు ఆ విషయం ఏమీ తెలియదు. నా శరీరంలో ప్రాణం ఉన్నంతదాకా నువ్వు వచ్చిపోతూ ఉండవచ్చు.
నా వారూ, పరాయివారూ అనే తారతమ్యం నాకు లేనేలేదు. అంతా సమా నమే. కలకత్తా వాస్తవ్యులు నా వారే అనడం ఎలా? నువ్వు నాకు పరాయివాడివి ఎలా అయినావు? ఇటువంటి తారతమ్యాలు ఏవీ నా మనస్సులో లేవు. భగవంతుని శరణు జొచ్చిన క్షణంలోనే నువ్వు నా వాడివి అయిపోయావు. కలత చెందకు. ఎప్పుడు కావాలన్నా ఇక్కడకు రావచ్చు. నీ ఉత్తరం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏదీ మనస్సులో ఉంచుకోకు.
మీ
అమ్మ
గమనిక: నీకు నా ఆశీస్సులు. నీ చిరునామా నాకు సరిగా గుర్తులేదు. శ్రీశ్రీ గురుదేవుల అనుగ్రహంతో నేను బాగానే ఉన్నాను. అప్పుడప్పుడు ఉత్తరాలు వ్రాస్తూండు.
3
శ్రీశ్రీ కాళీశరణమ్
[ ‘మ’ ]
జయరాంబాటి,
జూన్ / జూలై, 1898
ప్రియ పుత్రునకు,
నువ్వు గురుదేవుల ముఖతా విన్న విషయాలన్నీ సత్యవచనాలు. వాటిని ప్రచురించడంలో కించిత్తు కూడా సంశయించ నక్కర్లేదు. ఒకప్పుడు ఈ కథామృతాన్ని* మీకు చెప్పింది ఆయనే! నేడు కాలావసరాన్నిబట్టి ఆయనే నీ మూలంగా దానిని ప్రచురింపజేస్తున్నారు. ఈ కథామృతాన్ని ప్రచురించకపోతే లోకులు జాగృతి పొందలేరని గ్రహించు. నీ వద్ద ఉన్న ఆయన కథామృతమంతా సత్యమైనది. నువ్వు ఒక రోజు దానిని నాకు చదివి వినిపించినప్పుడు గురుదేవులే ఆ వచనాలను మాట్లాడుతున్నట్లు అనిపించింది.
ఆశీస్సులతో
అమ్మ
4
శ్రీశ్రీ గురుపాదాలే శరణు
[సోదరి నివేదిత]
జయరాంబాటి,
4 ఏప్రిల్, 1900
నా ప్రియపుత్రిక నివేదితకు
ఈ ఉత్తరం నీకు సకల ఆశీర్వాదాలూ అందించుగాక! నా ప్రగాఢ ప్రేమను స్వీకరించు. నా ప్రశాంతతకై నువ్వు ప్రార్థించావని తెలిసి ఎంతో సంతోషించాను. ఆనంద స్వరూపిణియైన ఆదిపరాశక్తి రూపమే నువ్వు. నీ ఛాయాచిత్రం చూసి నప్పుడల్లా నువ్వు నా వద్దే ఉన్నట్లనిపిస్తుంది. నువ్వు ఇక్కడకు వచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నాను. నీ పావన మానసం నుండి నా కోసం వెలువడ్డ ప్రార్థన సఫలమగుగాక! నేను క్షేమంగా ఉన్నాను. సర్వశక్తిమంతుడైన భగవంతుడు నీ ఉదాత్త కార్యాలలో చేయూతనిస్తూ సదా నీకు శక్తిని, ఆనందాన్ని ప్రసాదిస్తూ రక్షించాలని సదా ప్రార్థిస్తూంటాను. నువ్వు సత్వరమే తిరిగి రావాలని ప్రార్థిస్తు న్నాను. ‘మహిళల వసతి గృహం’ గురించిన నీ ఆలోచనలు రూపుదాల్చుగాక! నిజమైన ధర్మమేదో దానిని సర్వులకూ చాటిచెప్పే కార్యంలో ఆ గృహం విజయ వంత మవుతుంది గాక!
ఈ లోకానికి జీవగర్రగా విరాజిల్లే భగవంతుడే స్వకీయ మహిమలను గానం చేస్తున్నాడు. ఆద్యంతాలులేని, సాటిలేని ఆ సంగీతాన్నే, నశ్వరమైన ఈ లోకం లోని ప్రతి వస్తువులోనూ నువ్వు వింటున్నావు. చెట్లూ, పర్వతాలూ, పక్షులూ ఆయన కీర్తినే గానం చేస్తున్నవి. దక్షిణేశ్వరంలో విస్తారంగా వ్యాపించిన మర్రిచెట్టు ఉంది కదా! అది కాళికాదేవి సర్వవ్యాపకత్వాన్ని శ్లాఘిస్తూన్నది. దానిని వినడానికి అనువైన చెవులు పొందిన వ్యక్తి ధన్యుడు.
మిసెస్ వాటర్మెన్ విశ్వాసం గురించి తెలిసి ఎంతో ఆనందించాను. తను ప్రేమించిన వ్యక్తి మరణానంతరమూ తాను ఆయనను కోల్పోలేదని తలచే ఆమె నిజంగా ఆధ్యాత్మిక వికాసం పొందిన వ్యక్తి. ఎందుకంటే శరీరం నశించినా ఆత్మకు మరణం లేదు కనుక. నా గురించి వినడం ఆమె కెంతో ధైర్యాన్ని ఇవ్వడం సంతోషించవలసిన విషయమే. ఆమె నీ కార్యకలాపాలలో ఎంతో దోహదపడు తుంది గాక! మిసెస్ మే రైట్ చవల్కు కూడా నా ఆశీస్సులు.
నీ ఆధ్యాత్మిక పురోగతికి సదా నా ఆశీస్సులు, ప్రార్థనలు. నిజానికి నువ్వు ఉదాత్తమైన సేవ చేస్తున్నావు. దయచేసి వంగభాష మరచిపోవద్దు. లేకుంటే నువ్వు తిరిగి వచ్చాక నీతో మాట్లాడలేకపోతాను. ధ్రువుడు, సావిత్రి, సీత, రాముడు మొదలైన వారి గురించి నీ దేశంలో ప్రసంగిస్తూవుండడం నా కెంతో ఆనందాన్ని కలిగించింది. లోకంలోని వ్యర్థ పదజాలాల కంటే ఇలాంటి పుణ్యపురుషుల జీవి తాలు ఎంతో ఉన్నతమైనవి. ఇది నిజం. ఆహా! భగవంతుని పావన నామమూ, ఆయన దివ్యలీలా ఎంత సుందరమైనవి! ఎంత మధురమైనవి.
మీ
అమ్మ
5
శ్రీశ్రీ గురవే నమః
[విమలానంద స్వామి]
జయరాంబాటి,
ఆగస్టు / సెప్టెంబరు, 1902
ఆశీర్వాదాలు!
నాయనా! మొదటి తేది వ్రాసిన ఉత్తరం అందింది. శ్రీశ్రీ స్వామీజీ* మహ రాజ్ మహాసమాధి కారణంగా నా మనస్సు పడుతున్న బాధ వర్ణనాతీతం. మన గురువు అద్వైతి. మీరు ఆయన శిష్యులు. అందువలన మీరు కూడా అద్వైతులే! మీరు అద్వైతులేనని నేను ముక్తకంఠంతో చెప్పగలను. మిసెస్ సేవియర్కు నా ప్రేమా ఆశీర్వాదాలూ తెలియజేయి. మీ అందరికీ నా ఆశీస్సులు. కాళీకృష్ణుడు అక్కడికి వెళుతున్నట్లు వ్రాసిన జవాబు అందింది. ఆతడికీ నా దీవెనలు అందించు. స్త్రీల మఠమది.* ప్రస్తుతం స్వామీజీ కూడా జీవించి లేరు. అందువలన జాగ్రత్తగా జీవితం గడపాలి. మేమందరం క్షేమం. మీ క్షేమం గురించిన వివరాలు తెలుపవల సింది.
మీ
ప్రియమైన అమ్మ
6
[ఒక భక్తురాలు]
కలకత్తా,
జూలై / ఆగస్టు, 1908
శుభాశీస్సులు.
అమ్మాయీ! నీ ఉత్తరం అందింది. సమయం దొరకనందున వెంటనే జవాబు వ్రాయలేకపోయాను. నీ కోసం ఎంతో వేదన పడుతున్నాను.
అమ్మాయీ! నీ మనస్సుకు నువ్వే నచ్చజెప్పుకోకపోతే మరెవరు చెప్పగలుగు తారు? లోకంలో అనేకులకు ఇలానే జరుగుతుంది. కానీ నీ ఏకైక శిశువు (అది చనిపోయింది) కనుక నీ బాధ ఎక్కువ అనడంలో సందేహం లేదు. ఏం చేస్తాం? గురుదేవులు నీకు మనశ్శాంతిని ప్రసాదిస్తారుగాక! ఆయన తప్పక ప్రశాంతతను అనుగ్రహిస్తారు. పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. ఆ వస్తువే నీ విషయంలో మాయకు కారణమైంది. ఇప్పుడు మనస్సును గురుదేవుల వైపు తిప్పుకో, ఆయనను ప్రార్థించు. మనశ్శాంతి లభిస్తుంది. చెప్పడానికి ఇంకేముంది అమ్మాయీ! ఆయన తీసుకుంటారు, ఆయనే ఏర్పాటు కూడా చేస్తారు. ఆయన ఎవరినీ ఒకే స్థితిలో ఉంచబోరు.
నా ఆశీస్సులను స్వీకరించు. ఇతరులకూ అందించు. నేను క్షేమం, ఇతరులూ క్షేమం.
నీ శ్రేయస్సు కోరే
మీ అమ్మ
7
జయ ఓం రామకృష్ణ
[ఒక భక్తుడు]
జనవరి / ఫిబ్రవరి, 1909
శుభాశీస్సులు.
అబ్బాయీ! కొన్ని రోజుల తరువాత నీ ఉత్తరం ఈ రోజే అందింది. చాలా సంతోషం. నువ్వు ఇంతగా కలత చెందకు. ఆయనొక్కరే నీకు గతి! మనఃస్ఫూర్తిగా ఆయనను ప్రార్థించు. ఆయన సదా నిన్ను కాపాడతారు.
నా ఆశీస్సులు స్వీకరించు. అందరికీ అందించు. నా ఆరోగ్యం బాగాలేదు. వాతంతో బాధపడుతున్నాను. ఈ విషయం గురించి యోచిస్తూ కలతపడకు. ఇంట్లో అందరూ క్షేమం.
మీ
అమ్మ
8
[మిసెస్ ఓల్బుల్]
12, గోపాల్ చ. నియోగి వీథి,
బాగ్ బజార్, కలకత్తా, 28.7.1910
అమ్మా!*
మీ ఆరోగ్యం బాగాలేదని విని ఎంతో బాధపడ్డాను. ఇప్పుడు కాస్త ఫరవాలేదని నివేదిత ద్వారా తెలుసుకొని కొంచెం ఊరట చెందాను. సత్వరమే మీరు పూర్తిగా ఆరోగ్యవంతులు కావాలని గురుదేవులను ప్రార్థిస్తాను. మీరు స్వస్థులైనప్పుడే నా మనస్సు కుదుటపడుతుంది.
నేను ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నాను. యోగిన్ తప్ప అందరూ బాగున్నారు. యోగిన్కు మాత్రం ఆరోగ్యం బాగాలేదు. అది మనస్సును ఎంతో బాధిస్తూవుంది. మీ కోసం నేను గురుదేవుల పాదపద్మాలకు తులసీ, బిల్వదళాలు సమర్పించాను. మూడు రోజులు వారి సమక్షంలో కూర్చొని మీ కోసం ప్రార్థించాను. జై అక్కడకు వస్తోందా? ఆమెకు నా ఆశీస్సులు అందించండి. (క్రిస్టైన్ వస్తే ఆమెకు కూడా నా ఆశీస్సులు అందించండి. ఆరోగ్యం బాగాలేని ఈ సమయంలో మీ అమ్మాయి మీతో ఉండడం లేదని తెలిసి ఎంతో బాధపడుతున్నాను.
మన గురుదేవుల పూజలో అర్పించబడిన పుష్పాలూ, చందనమూ పంపిస్తు న్నాను. నా ప్రగాఢ ప్రేమానురాగాలను, ఆశీస్సులను స్వీకరించండి. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. హృదయాంతరాళంలో నుండి పెల్లుబికివస్తున్న నా ప్రేమను కూడా తెలియబరుస్తున్నాను. మీకు సుదూరంలో ఉంటున్నాము. అయినా మీరు నాకు అతి సమీపంలో ఉన్నట్లు అనిపిస్తుంది.
మీ
అమ్మ
9
శ్రీశ్రీ దుర్గా సహాయం
[యతీంద్రనాథ్ ఘోష్]
27 జూలై 1911
శుభాశీస్సులు!
అబ్బాయీ! నువ్వు పంపిన టికెట్టు, పోస్టుకార్డు లాంటివి ఈ రోజు అందాయి. నువ్వు రచించిన పాటలు బాగున్నాయి. వాటిని విని ఎంతో ఆనందించాను. సమస్తం చేసేవారు గురుదేవులేనని జ్ఞాపకం ఉంచుకో. మీకు దీర్ఘాయుస్సును ఆయన ప్రసాదిస్తారుగాక! మీ జీవితం నిర్విఘ్నంగా కొనసాగుతుందిగాక!
ఇక్కడ అందరూ క్షేమం. మీ క్షేమాన్ని తెలియచేయండి.
మీ
అమ్మ
10
[నిషికాంత మజుందార్]
ఉద్బోధన్, కలకత్తా
18 డిసెంబరు, 1913
శుభాశీస్సులు!
అబ్బాయీ! నీ ఉత్తరం అందింది. నీ మానసిక స్థితి బాగాలేదు. మనస్సు మదపుటేనుగు లాంటిది. తరచి చూసి, బోధించి, దానిని మంచిదారిన నడిపించాలి. గురుదేవులను ప్రార్థించు. ఇలాంటి పరిస్థితి అందరికీ కలగడం సహజమే.
ఇక్కడ అందరూ క్షేమం. నా ఆరోగ్యం బాగాలేదు. అయినా ఏదో సాగిపోతూ వుంది. ఇంకేం వ్రాయను? నీకూ తదితరులకూ నా ఆశీస్సులు.
మీ
అమ్మ
11
శ్రీశ్రీ గురవే నమః
[నిషికాంత మజుందార్]
ఉద్బోధన్, కలకత్తా
11 ఫిబ్రవరి, 1914
శుభాశీస్సులు!
అబ్బాయీ! నీ ఉత్తరం ద్వారా అన్ని విషయాలూ తెలుసుకొన్నాను. గురు దేవులను ప్రార్థించు. ఆయన కృపాకటాక్షం వలన అంచెలంచెలుగా అన్నీ జరుగు తాయి. త్యాగస్థితిని చేరుకోవడానికి పూర్వకాలంలో ఋషులు యుగాలపర్యంతం తపస్సు చేశారు. వారి తపస్సుకు కూడా ఎన్నో విఘ్నాలు ఎదురైనాయి. కానీ ఇప్పుడంటే మన గురుదేవులు సజీవంగా వెలుగొందుతున్నారు. అందువల్లనే అనేకులు సత్వరమే త్యాగాన్ని సాధించి, సన్న్యాసం పుచ్చుకొంటున్నారు. కాని రెప్పపాటుకాలంలో అన్నీ జరగాలంటే అయ్యేపనేనా? నీకు నా ఆశీస్సులు. ఇక్కడ అంతా క్షేమం.
ఆశీస్సులతో,
మీ అమ్మ
12
[యతీంద్రనాథ్ ఘోష్]
జయరాంబాటి,
15 మార్చి, 1915
శుభాశీస్సులు!
నాయనా! నీ ఉత్తరం నుండి వివరాలన్నీ తెలుసుకున్నాను. గురువారం నుండి రాధూను ఒక ఆంగ్లేయ వైద్యుడు పరీక్షిస్తున్నాడు. ఆసుపత్రిలో పెద్ద డాక్టరు ఆయన.
వాతం కోసమైన తైలం కొని పంపగలిగితే పంపించు. తిథివారాలు చూసు కొంటూ కాలాన్ని వ్యర్థం చేయక మంచి పనులను సత్వరమే పూర్తిచేయి. నా కాలు నొప్పికి ఆ తైలం ఎంతో అవసరం.
నా ఆశీస్సులు.
అమ్మ
13
[నిరుపమాదేవి]
జయరాంబాటి,
23 జూన్, 1915
శుభాశీస్సులు!
అమ్మాయీ! నీ జాబు అందింది. నేను జవాబు వ్రాయడానికి నువ్వు పంపిన పోస్టుకార్డు (reply card) ఉపయోగించ లేనంతగా దెబ్బతినివుంది. నా ఆరోగ్యం ఫరవాలేదు. నళిని అలాగే ఉంది. నేను ఊరికి వెళ్లే విషయం గురించి అడిగావు. అది ఇంకా నిర్ణయించలేదు. నీ బిడ్డకు జ్వరం వచ్చిందని తెలిసి మనస్సు బాధపడింది. ఛాయాచిత్రం అడిగావు. అది ఇప్పుడు లభ్యమవడం లేదు. మీ అందరికీ నా ఆశీస్సులు. గురుదేవులు మీకు శ్రేయస్సు ప్రసాదిస్తారు గాక! ఇక్కడ అందరూ క్షేమం.
మీ అందరి
అమ్మ
14
[నిరుపమాదేవి]
జయరాంబాటి,
2 అక్టోబరు, 1915
శుభాశీస్సులు!
అమ్మాయీ! నీ ఉత్తరంలోని వివరాలనన్నిటినీ తెలుసుకున్నాను. నీ ఆరోగ్యం గురించి విని కలత చెందాను. ఈసారి మఠంలో దుర్గాపూజ సమయంలో దుర్గాదేవి విగ్రహం ప్రతిష్ఠించి పూజ జరుపబోతున్నారు. వచ్చే సోమవారం సాయంత్రం మఠానికి వెళ్లాలని అనుకుంటున్నాను. ఏకాదశి నాడు తిరిగి వస్తాను. వీలుంటే ఒక రోజు రా! మీకు నా ఆశీస్సులు.
హేమప్రభ వ్రాసిన ఉత్తరం అందింది. ఈ పూజ రోజులలో మఠంలో బాగా రద్దీగా ఉంటుంది. ఒంట్లో బాగాలేకపోతే రావద్దు. నా ఆరోగ్యం ఏదో ఉంటోంది. సురబాలా, రాధూ అందరూ క్షేమమే.
ఆశీస్సులతో,
మీ అమ్మ
15
శ్రీశ్రీ హరి
[నిరుపమాదేవి]
13 ఫిబ్రవరి, 1916
శుభాశీస్సులు!
అమ్మాయీ! నీ ఉత్తరం అందింది. ఇప్పట్లో నేను కలకత్తా వచ్చేటట్లు లేదు. నీ బిడ్డ స్వస్థత చెందాలి – ఇదే గురుదేవులకు నా ప్రార్థన. వ్రాయడానికి ఇక ఏమున్నది? ఇక్కడ అందరూ క్షేమం. మీ అందరికీ నా ఆశీస్సులు.
మీ
అమ్మ
16
[మానదా శంకరదాస్ గుప్తా]
మార్చి / ఏప్రిల్, 1916
శుభాశీస్సులు!
నాయనా! నీ ఉత్తరంలోని వివరాలన్నీ తెలుసుకున్నాను. నీ ఉత్తరం ద్వారా నువ్వు ఎవరో తెలుసుకున్నాను. నీ ఆరోగ్యం దెబ్బతినడం గురించి విని ఎంతో బాధ పడ్డాను. నీకు నచ్చితే దుర్గాప్రసాద్సేన్ వద్ద చికిత్స చేయించుకో. అతని చికిత్స రాధూకు సత్ఫలితాన్నిచ్చింది.
సదా విరాగాన్ని పాటించు. కొన్ని రోజులదాకా ధ్యాన ధారణలను ఆచరించడం తగ్గించుకో. కనీసం 108 సార్లు జపం చేయాలి. ఎంత ఎక్కువ వీలుపడితే అంత చేయడం శ్రేయస్కరం.
నన్ను ధ్యానించడం నీకు బాగా ఇష్టమయితే అలాగే చేయి. ఎందుకంటే నాకూ గురుదేవులకూ మధ్య ఎలాంటి తారతమ్యమూ లేదు; రూపం మాత్రమే భిన్నం. ఎవరు గురుదేవులో, వారే ఈ శరీరంలోనూ విరాజిల్లుతున్నారు…. వారి పాదపద్మాలపట్ల భక్తి విశ్వాసాలు చెల్లించు.
ఆశీస్సులతో
మీ అమ్మ
షరా: పిల్లలందరూ కలిసి గురుదేవుల మఠం ప్రారంభిస్తున్నారని విని ఎంతో ఆనందించాను. వారికి కూడా నా ఆశీస్సులను అందించు. కానీ ఒక్క విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉండండి. గురుదేవుల దివ్యనామం అత్యంత పవిత్రమైనది.ఆయన పేరిట ప్రారంభించే మఠంలో దుష్టులందరూ ఏకమై, ఆయన పావన నామా నికి భంగం వాటిల్లకుండా చూసుకోవాలి.
17
శ్రీశ్రీ గురుదేవ శరణం
[నిరుపమాదేవి]
జయరాంబాటి,
5 ఏప్రిల్, 1916
శుభాశీస్సులు!
అమ్మాయీ! నీ ప్రమాదం గురించి విని నేను పొందిన ఆవేదనను వివరించలేను. ఎందుకు ఈ ప్రమాదం జరిగిందో ఏం చెప్పగలను? గురుదేవులు మీకు శ్రేయస్సును కలిగిస్తారుగాక! బిడ్డకు నా దీవెన తెలియజేయి! ఆ బిడ్డ క్షేమం గురించి వ్రాయి! ఇక్కడ అందరమూ క్షేమం.
ఆశీస్సులతో
మాతృదేవి
షరా: నువ్వు పంపిన రెండు రూపాయలు అందాయి.
18
శ్రీశ్రీ గురుదేవ శరణం
[యతీంద్రనాథ్ ఘోష్]
జగదంబ ఆశ్రమం, కోల్పారా
ఏప్రిల్ / మే, 1916
శుభాశీస్సులు!
నాయనా! నీ ఉత్తరం అందింది. నేను క్షేమంగానే ఉన్నాను. రాధూ మామూలు గానే ఉంది. నువ్వు శ్రీచర్ మూలంగా పంపిన బిల్వఫలం అందింది. నేను బాగా తిన్నాను.
ఆశీస్సులు. మీ అందరి వివరాలూ వ్రాయండి.
అమ్మ
19
జై మా
[యతీంద్రనాథ్ ఘోష్]
జయరాంబాటి,
10 మే, 1917
శుభాశీస్సులు!
నాయనా! నువ్వు పంపిన రూ. 25 అందాయి. చెరువు కొనుగోలుకు రూ 225/– ఖర్చయింది. గురుదేవులు సంకల్పిస్తే దానిని త్వరలో పరిశుభ్రపరుస్తారు.
నేను క్షేమంగా ఉన్నాను. మీ అందరికీ నా ఆశీస్సులు.
మీ
అమ్మ
20
[స్వామి వీరేశ్వరానంద]
జయరాంబాటి
ఆనూరు, హుగ్లీ, జూన్ 4, 1917
ప్రియమైన ప్రభువుకు!
నీ ఉత్తరం అందింది. నువ్వు బాగా జ్ఞాపకమున్నావు. నువ్వు మఠంలో చేరి నా ప్రియ పుత్రుడు రాఖాల్ వద్ద బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నావని విని ఎంతో సంతో షించాను. ఇప్పుడు ఇక్కడికి రావద్దు. రాఖాల్ చెప్పినట్లు చేయి!
గురుదేవుల కృపాకటాక్షంతో నీ కష్టాలన్నీ తీరుతాయని ఆశిస్తున్నాను. ఆయ నను ప్రార్థించు. నీకు దారి చూపిస్తారు. ప్రతిరోజూ తప్పని సరిగా ధ్యానం చేయి. క్రమేణా పురోగతిని చవిచూస్తావు. నాయనా! ఏనాటికీ అలసత్వానికి చోటివ్వకు. (మద్రాసులో) కొత్త మఠం కోసం పనులు ప్రారంభమయ్యాయని విని సంతోషించాను. సముచిత కాలంలో అది పూర్తి అవుతుందని విశ్వసిస్తున్నాను.
నేను క్షేమం. నా ప్రేమపూర్వక ఆశీస్సులు నీకు సదా ఉంటాయి. కావాలను కున్నప్పుడు నాకు వ్రాయవచ్చు. వంగభాష రాదని కలత చెందకు.
నాయనా! నీకూ మఠంలో వుంటున్న ఇతర కుమారులకూ నా ఆశీస్సులు.
మీ
అమ్మ
షరా: నువ్వు ఆంగ్లంలో వ్రాయచ్చు; కానీ స్పష్టంగా వ్రాయి.
21
జై మా
[చంద్రమోహన్ దత్త]
జయరాంబాటి,
మార్చి / ఏప్రిల్
శుభాశీస్సులు!
నాయనా! నీ ఉత్తరం నుండి వివరాలన్నీ గ్రహించాను. నా ఆశీస్సులను స్వీక రించు. నీ తండ్రికి కూడా అందించు. కోర్టు వ్యవహారం గురించి కలతపడకు. గురు దేవులు ఏది చేసినా అది మీ శ్రేయస్సు కోసమే చేస్తారు. కానీ మీరు సత్య పథంలో వెళ్లాలి.
ఇంకా ఏం వ్రాయమంటావు? నేనూ, రాధూ క్షేమం. యోగిన్, గోలాప్ లాంటి వారికి కూడా నా ఆశీస్సులను అందించు.
ఆశీస్సులతో,
అమ్మ
22
శ్రీశ్రీ గురుదేవా
[ప్రబోధ్ చంద్ర ఛటోపాధ్యాయ్]
జయరాంబాటి
మార్చి / ఏప్రిల్, 1917
శుభాశీస్సులు!
నాయనా! మన ఇంటికి* నాలుగు రూపాయలు పన్ను వేయడం నీకు తెలిసిందే. ఇది చాలా ఎక్కువ. అందువలన శంభు బాబుకు* ఒక ఉత్తరం వ్రాసి గోపేశ్ మూలంగా నిన్న పంపించాను. ఉత్తరంలో ఇలా వ్రాశాను:
“ఈ ఇల్లు దేవి కోసం సమర్పింపబడింది.* ఇందులో నాకు ప్రత్యేకించి ఎలాంటి హక్కూ లేదు. నేను ఇక్కడే శాశ్వతంగా ఉండబోతున్న వ్యక్తిని కూడా కాను. ఇంటికి ఎలాంటి రాబడీ లేదు. అలా లభించేది కూడా, ఇక్కడ నివసించే సాధువులు, బ్రహ్మచారులకు వినియోగం కావడం లేదు. ఇటువంటి చోట నివసించడమూ, గురువు బాధ్యతన జీవించడమూ జరిగేపని కాదు. భగవంతుని సంకల్పానుసారం భక్తులు ఇచ్చే చిరు కానుకలతోనే నా జీవితం గడచిపోతూవుంది. ఇక ఏ రాబడీ నాకు లేదు.”
ఈ విషయంగా జిల్లా జడ్జికి ఒక అర్జీ ఇవ్వవలసిందిగా నీకు చెప్పినట్లు శంభుబాబు నాకు వ్రాసివున్నాడు. నువ్వు ఏదైనా చేశావో లేదో నాకు తెలియలేదు. ఈ ఉత్తరాన్ని శ్రద్ధగా చదివి నీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయి. ‘ఇది ఒక మత సంస్థ. దీనికంటూ ప్రత్యేకంగా ఎలాంటి ఆదాయమూ లేదు. ప్రజలు మనః స్ఫూర్తిగా ఇచ్చే కానుకలతోనే ఇది జరుగుతూవుంది’ అనే విషయాన్ని స్పష్టంగా వ్రాయమని శంభుబాబు చెప్పాడు.
ఇక్కడ అందరూ క్షేమం. అందరికీ నా ఆశీస్సులు.
మీ
అమ్మ
జాబుకు మరువైపు ఇలా వుంది:
ఉత్తరం వ్రాసి మాతృదేవికి చదివి వినిపించారు. అది విని మాతృదేవి, ‘ఇంటి పన్నును రద్దు చేయడానికి ఏం చేయాలో దానిని నువ్వు చేసి తీరాలి’ అని వ్రాయమన్నారు. – గోపేశ్
23
[స్వామి శాంతానంద]
జయరాంబాటి,
4 జూలై, 1917
శుభాశీస్సులు!
నాయనా యోగేన్! చాలా రోజుల తరువాత నీ ఉత్తరం అందింది. చాలా సంతోషము. అన్నిటినీ నువ్వు దర్శించావు అని విని ఎంతో సంతోషించాను. ఆయనను ప్రార్థించు. ఆయనే నీకు భక్తిని ప్రసాదిస్తారు, నిన్ను కాపాడుతారు.
నా ఆరోగ్యం ఫరవాలేదు. రాధూ వ్యాధిగ్రస్థురాలుగా ఉండేది. ఇప్పుడు ఆమె కూడా ఫరవాలేదు. అక్కడి భక్తుల కందరికీ నా ఆప్యాయతానురాగాలను అందించు. ఇక్కడ అందరూ క్షేమం. నీకు నా ఆశీస్సులు. అక్కడి వివరాలు అప్పు డప్పుడు వ్రాస్తూవుండు.
మీ
మాతృదేవి
24
[రాజ్ బాలాసేన్ గుప్తా]
జయరాంబాటి,
19 జూలై, 1917
శుభాశీస్సులు!
అమ్మాయీ! నీ ఉత్తరం అందింది. నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు రావాలని వ్రాశావు. కానీ ప్రస్తుతం ఇక్కడ మలేరియా వ్యాపించివుంది. దారంతా వాననీరూ, బురదమయంగా ఉన్నందున, ఇక్కడకు రావడం ఎంతో శ్రమతో కూడిన పని. అందు వలన ఇక్కడికి రావడానికి బదులు నేను కలకత్తాకు వచ్చేటప్పుడు అక్కడికి రా!
నా ఆశీస్సులు.
మీ
అమ్మ
25
[రాజ్బాలాసేన్ గుప్తా]
జయరాంబాటి,
23 జూలై, 1918
శుభాశీస్సులు!
అమ్మాయీ! నీ ఉత్తరం అందింది. రాధూ బిడ్డకు ఆరోగ్యం బాగాలేనందున నీకు జవాబు రాయడంలో ఆలస్యమయింది. అందుకోసం బాధపడకు. నా ఆరోగ్యం ఫరవాలేదు. కానీ మనస్సు ఏకంగా దుఃఖంలో మునిగివుంది. బాబూరాం పరిస్థితి రానురాను దిగజారిపోతున్నది.
నా ఆశీస్సులను స్వీకరించు, ఇతరులకూ అందించు. ఇంకేం వ్రాయను? తక్కినవన్నీ కొంతవరకు బాగానే జరుగుతున్నాయి.
మీ
మాతృదేవి
26
శ్రీ రామకృష్ణ శరణం
[రాధికా రంజన్ సర్కార్]
కలకత్తా,
11 సెప్టెంబరు, 1918
[రాధికా రంజన్ మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకున్నారు. మనస్సును అదుపు చేసుకోవడం గురించి ఆయన మాతృదేవికి ఒక పెద్ద ఉత్తరం వ్రాశాడు. దాని సారాంశం: 1. ఆధ్యాత్మిక విషయాలు వింటున్న సమయంలో మనస్సు అత్యున్నత స్థితిలో ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మిక అనురక్తి, మనోవ్యాకులత అన్నీ మాయమైపోతాయి. 2. జపం చేస్తున్నప్పుడు మనస్సు చంచలమవుతోంది. ఎంతో శ్రమ పడి దానిని అదుపులోకి తెచ్చినా ఒక్కక్షణం మాత్రమే అది ఏకాగ్రత పొందు తుంది. మనస్సును అదుపు చేసుకునేందుకు మార్గమేమిటి?
మాతృదేవి జవాబు క్రింద యివ్వబడింది.]
శుభాశీస్సులు.
నాయనా! మనస్సు స్వభావమే అలాంటిది. ఒక్క క్షణం నిలకడగా ఉంటుంది. మరుక్షణం చాంచల్యంతో అటు ఇటూ పరుగులు తీస్తుంది. అందువలన అభ్యాస యోగం* అనుష్ఠించాలి. సకలమూ సిద్ధిస్తుంది. భగవంతుని ప్రార్థించు. నా ఆశీస్సులు.
ఆశీస్సులతో,
మాతృదేవి
27
[తరళబాలా సేన్ గుప్తా]
కలకత్తా,
అక్టోబర్, నవంబర్
శుభాశీస్సులు.
అమ్మాయీ! నీ ఉత్తరం అందింది. నా విజయదశమి ఆశీస్సులు స్వీకరించు. నువ్వు పంపిన మిఠాయి అందింది. నళిని కాశీ నుండి అయోధ్యకు వెళ్లినట్లు విన్నాను. ఇక్కడికి రావడానికి ఆలస్యమవుతుందని భావిస్తాను. బేలూరు మఠంలో ప్రతిమను తీసుకురానేలేదు, ఛాయాచిత్రానికి పూజలు జరుగుతున్నాయి. కాశీలో ప్రతిమను ప్రతి ష్ఠించి పూజించారు. పూజ చక్కగా జరిగింది.
సంసార జీవితంలో కొద్దిగా సమస్యలు ఉండనే వుంటాయి. గురుదేవులను సదా సర్వవేళలా స్మరిస్తూవుండు.
ఆశీస్సులతో,
మీ, అమ్మ
28
[పూల్రాణిసేన్ మజుందార్]
కలకత్తా,
ఏప్రిల్ / మే
శుభాశీస్సులు!
అమ్మాయీ! నీ ఉత్తరం అంది అపరిమిత దుఃఖంలో మునిగిపోయాను. అతణ్ణి భగవంతుడే మీకు ఇచ్చాడు. ఆయనే వెనక్కు తీసుకున్నారు.* నా మనస్సులోని బాధను వ్యక్తం చేయలేను. మీ అందరికీ నా ఆశీస్సులు.
నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి జ్వరంతో బాధపడుతున్నాను. శరీరం చాలా బలహీనంగా వుంటున్నది. సదా పడుకునే ఉంటున్నాను. రోజూ జ్వరం వస్తూవుంది, వదలేటట్లు లేదు. డాక్టర్లు ఇస్తున్న మందులను మింగి నాలుక చవి చచ్చిపో యింది. ఏదీ తినబుద్ధి కావడం లేదు. మరేం వ్రాయను? మీ క్షేమం గురించి వ్రాయి!
ఆశీస్సులతో,
మాతృదేవి
29
[లావణ్య కుమార్ చక్రవర్తి]
జయరాంబాటి,
డిసెంబరు / జనవరి
శుభాశీస్సులు,
నాయనా! నీ జాబూ, ఐదు రూపాయలూ అందాయి. కోడలికి దీక్ష ఇవ్వడం గురించి వ్రాశావు. అది మంచిదే. కానీ ఇప్పుడు ఇక్కడ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. నా ఆరోగ్యం కూడా బాగాలేదు. రాధూ ఇప్పటిదాకా నిలబడడమో, నడవ డమో చేయలేకపోతూవుంది. ఇది కూడా నా మనస్సును బాధపెడుతూవుంది. అందువలన నేను కలకత్తాకు వచ్చినప్పుడు, అక్కడికి మీరు కూడా వస్తే వీలుగా వుంటుంది. కలకత్తాలో అప్పుడప్పుడు విచారించి వివరాలు తెలుసుకోండి.
జనవరి, ఫిబ్రవరిలో నేను కలకత్తాకు రానున్నాను. కానీ ఏది జరుగనున్నదో గురుదేవుల ఇచ్ఛ మేరకు అదే జరుగుతుంది.
ఆశీస్సులతో,
మీ అమ్మ
30
శ్రీశ్రీ గురు శరణం
[ఒక భక్తుడు]
జయరాంబాటి,
జూన్ / జూలై
శుభాశీస్సులు,
నాయనా! నువ్వు పంపిన ఉత్తరమూ, డబ్బూ అందాయి. సంతోషం. నీకూ నీ భార్యాపిల్లలకూ నా ఆశీస్సులు. నేనూ ఇంట్లో వారూ క్షేమం. దుర్గాపూజ తర్వాత బహుశా నేను కలకత్తాకు వెళ్లవచ్చు.
జపమాల తెగిపోతే దానిని జపం చేయడానికి వాడుకోలేం కదా! కనుక మనస్సులో లెక్కిస్తూ జపం చేయి.
మీరందరూ క్షేమమని తలుస్తాను.
ఆశీస్సులతో,
మీ
అమ్మ
31
[ఒక భక్తురాలు]
బాగ్బజార్, కలకత్తా
జూలై / ఆగస్టు
శుభాశీస్సులు.
అమ్మాయీ! నీ ఉత్తరం చూచి సంతోషపడ్డాను. దారి తప్పుతావా? అదెలా? ఇక్కడికి రావడం దారిని స్పష్టం చేసుకోవడానికే కదా! మనస్సు చంచలమైనప్పుడల్లా మనఃస్ఫూర్తిగా ప్రార్థించు. నా ఆశీస్సులు.
మీ
మాతృదేవి
32
[సోదరి దేవమాత]
ప్రియమైన దేవమాతా!*
గురుదేవుల పట్ల నువ్వు పెంపొందించుకున్న భక్తి నాకు చాలా ఆనందం కలిగిస్తోంది. భక్తి ప్రవాహంతో నీ హృదయం పొంగిపొరలాలని ఆశీర్వదిస్తున్నాను. గురుదేవులకు నా ప్రార్థన కూడా ఇదే! దీర్ఘాయుష్మాన్భవ! నా ఇతర సంతానంలా శాశ్వతమైన శాంతిని పొందుదువు గాక!
నేను క్షేమంగా ఉన్నాను.
మీ
ప్రియమైన అమ్మ
33
ప్రియమైన అమ్మాయీ!
నువ్వు ప్రేమతో వ్రాసిన ఉత్తరాలన్నీ అందాయి. వెంటనే జవాబు వ్రాయలేక పోవడాన్ని సహించు. నువ్వు మాట్లాడిన విషయాలన్నీ నా మనస్సులో ఇప్పటికీ ప్రతి ధ్వనిస్తున్నాయి. నువ్వు కూర్చుని ధ్యానం చేసే చోటును చూస్తున్నప్పుడల్లా నీ సుందర వదనం నా ముందు సాక్షాత్కరిస్తుంది. ఇక్కడ అందరూ తరచూ నీ గురించి ముచ్చ టించుకొంటారు. నీ చివరి ఉత్తరంలో రామకృష్ణానందస్వామి కులాసాగా ఉన్నారని వ్రాశావు. ఆ సమాచారం నన్నెంతో ఆనందపరిచింది.
ఇక్కడ అందరూ క్షేమం.
ఆశీస్సులతో,
ప్రియమైన అమ్మ
34
ప్రియమైన అమ్మాయీ!
నవంబరు మొదటి తేదీ నాటి ఉత్తరం అందింది. అది నాకిచ్చిన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి మాటలు చాలవు. నా ఆరోగ్యం మెరుగుపడడానికి (పూరీ) ఇక్కడికి వచ్చివున్నాను. ఒకటి రెండు నెలలు ఇక్కడే ఉంటాను. అప్పుడప్పుడు జాబులు వ్రాస్తూ వుంటావని ఆశిస్తున్నాను. మునుపటికంటే నా ఆరోగ్యం ఫరవాలేదు. బోష్టన్ మఠ స్థలం మార్చబడడమూ, గురుదేవుల సందేశం నానాటికీ బాగా ప్రచారమవుతున్న విషయమూ తెలిసి ఎంతో సంతోషించాను. నిన్ను ఎంతగానో తలచుకుంటున్నాను. నా ప్రియమైన ఆశీస్సులను స్వీకరించు.
ప్రియమైన
అమ్మ
35
సుందర్ నివాస్,
చెన్నై, ఇండియా
ప్రియమైన అమ్మాయీ!
జనవరి 17, ఫిబ్రవరి 9 తేదీల నీ ఉత్తరాలు రెండూ అందాయి. బోస్టన్లో జరుగుతున్న పనుల గురించీ, అక్కడి వారి క్షేమం గురించీ అడిగి తెలుసుకున్నాను. ఈ విషయాలను నువ్వు నాకు తెలియజేస్తూనే ఉండాలని కోరుకొంటున్నాను.
రెండు నెలలు కోఠారులో గడపిన తర్వాత ఇక్కడికి వచ్చాను. నువ్వు మద్రాసుకు వచ్చినప్పుడు బస చేసిన ఇంట్లోనే ప్రస్తుతం ఉంటున్నాను.* మధ్యలో రామేశ్వరం వెళ్లి వచ్చాను. అక్కడ నాలుగు రోజులు గడిపాను. బలరాంబాబు కుటుంబం వారు కూడా నాతో వచ్చారు. అందరూ క్షేమమే. వారి కుటుంబంలో ఒక స్త్రీకి మాత్రం బాగా జ్వరం వచ్చింది. ఆమె కోలుకోగానే కలకత్తాకు బయలుదేరా లని అనుకుంటున్నాను. రేపు బెంగుళూరు వెళుతున్నాను. అక్కడ ఒకటి రెండు రోజులుంటాను. మళ్లీ ఇక్కడికి తిరిగి వస్తాను.
స్వామి రామకృష్ణానంద ఆరోగ్యం ఇప్పుడు ఫరవాలేదు. తక్కిన సాధువు లందరూ క్షేమంగా వున్నారు.
నీకూ, తక్కిన అందరికీ నా ప్రియమైన ఆశీస్సులు.
మీ
ప్రియమైన అమ్మ
36
ప్రియమైన అమ్మాయీ దేవమాతా!
నీ జూలై 11 ఉత్తరం అందింది. పరమానంద ఇంత దాకా భారతదేశానికి తిరిగిరాలేదు. నీ ఆరోగ్యం ఫరవాలేదని తెలిసి సంతోషించాను. యోగీన్, గోలాప్ తదితరులు క్షేమం. అక్కడ కూడా మీరందరూ క్షేమమని భావిస్తాను.
ప్రియాతిప్రియమైన నా అనుంగుపుత్రుడు శశి (రామకృష్ణానంద స్వామి) చని పోయాడని తెలుపడానికి ఎంతో విచారిస్తున్నాను. ఆ లోటును భర్తీ చేయడం సాధ్యంకాదు. ఆగస్టులో అతడు పరమపదించాడు.
అందరికీ నా ప్రియమైన ఆశీస్సులు.
మీ
ప్రియమైన అమ్మ
37
శ్రీశ్రీ రామకృష్ణుల పాదాలే శరణ్యం
[నిరుపమాదేవి]
జయరాంబాటి,
5 డిసెంబరు, 1918
శుభాశీస్సులు.
అమ్మాయీ! నీ ఉత్తరం అందింది. పిల్లలు ఇంకా వెళ్లలేదు. నీ ఆరోగ్యం బాగా లేదని విని బాధపడ్డాను. తక్కిన అందరూ ఎలా ఉన్నారో వ్రాయి.
సంసార జీవితమంటే పిల్లాపాపలతో జీవించడమే కదా! మరేం చేయగలవు? సమయం దొరికినప్పుడు [జపం మొదలైనవి] చేయవచ్చు. అందువలన ఎలాంటి తప్పూ లేదు. మీ తప్పులను, లోటుపాట్లను నేను చూస్తానా ఏమిటి?
ఇక్కడ అందరూ క్షేమం.
ఆశీస్సులతో,
అమ్మ
38
[చంద్రమోహన్ దత్తా]
కోల్పారా,
30 మార్చి, 1919
శుభాశీస్సులు.
నాయనా చంద్రా! నళిని నుండి నీ ఉత్తరాన్ని తీసుకున్నాను. రాధూ కారణంగా నేను ఎంతో కలత చెందుతున్నాను. అందుకే వెంటనే ఉత్తరం వ్రాయలేకపోయాను. మరోలా భావించకు. నీ తండ్రి జబ్బు గురించి విన్నాను. భయమెందుకు? ఆయన మంచి చోటనే ఉంటున్నారు. గురుదేవులు ఆయనను కాపాడతారు.
నీకంటూ ఒక ఇల్లు ఏర్పడే వరకు వారితో అణకువగా వుండు. నువ్వు ఎలా ప్రవర్తిస్తే ఆ ఇంట్లో ఉండగలవో అలా ప్రవర్తించడానికి ప్రయత్నించు. నీ కంటూ ఒక ఇల్లు త్వరలో ఏర్పడాలని ఆశీర్వదిస్తున్నాను. నాకు ఎన్నో సహాయాలు చేశావు.
నీ భార్య ఊరికెళ్లింది కదా! ఏ బిడ్డ పుట్టిందో తెలియజేయి! నీ క్షేమం గురించి కూడా వ్రాయి. ఇక్కడ అందరూ క్షేమం.
మీ
అమ్మ
39
శ్రీశ్రీ గురుదేవ శరణం
[చంద్రమోహన్ దత్తా]
కోల్పారా
ఏప్రిల్ / మే, 1919
శుభాశీస్సులు.
నాయనా! నీ తండ్రి పరమపదించారని విని ఒక విధంగా సంతోషపడ్డాను. ఎందుకో తెలుసా? ఈ వృద్ధాప్యంలో కూడా, మీ అందరినీ వదలి గంగాతీరానికి వెళ్లి అక్కడ ప్రాణాలు వదిలారు కదా, అందుకోసమే!
నేను క్షేమం. నిన్నటి రాత్రి రాధూకు మగబిడ్డ పుట్టాడు. ఆమే, బిడ్డా క్షేమం. తక్కిన అందరూ క్షేమం.
ఆశీస్సులతో,
మీ అమ్మ
40
జై మా
[మానదా శంకరదాస్ గుప్తా]
జయరాంబాటి,
మార్చి / ఏప్రిల్, 1918
శుభాశీస్సులు.
నాయనా! నీ ఉత్తరం అందింది. మీ అందరికీ నా ఆశీస్సులు. సీతానాథ్ గురించి నువ్వు వ్రాసిన విషయం కూడా తెలుసుకున్నాను. ఆతనికి కూడా నా ఆశీస్సులను అందించి ఈ క్రింది విషయం కూడా తెలియజేయి!
నేను ఏ మంత్రాన్ని ఇచ్చానో ఆ మంత్రాన్ని జపం చేయడంతోనే సకలమూ సిద్ధిస్తుంది. ఇంతకంటే ఇంకేమీ చేయవలసింది లేదు. ఎందుకంటే ఎవరు గురుదేవులో వారే నేను!
రాఖాల్ అనే వ్యక్తి నాకు వ్రాసింది కూడా విన్నాను. అతనికి నా ఆశీస్సులను తెలుపుతూ, ఈ విషయం కూడా తెలియజేయి!
సాధువు కాగోరితే మొట్టమొదట భగవంతుని పొందడానికి ఏ మేరకు మనోవ్యాకులత ఉందో తెలుసుకోవాలి. భగవంతుడు తప్ప మరేదీ వద్దని మనస్సు దృఢంగా చెప్పగలిగితే సన్న్యాసం స్వీకరించవచ్చు. ఇలాంటి సుస్థిరతలేని వైరాగ్యం నిలకడగా ఉండదు.
ఇంకేం వ్రాయమంటావు? నేనూ రాధూ క్షేమం. మీ అందరికీ నా ఆశీస్సులు.
మీ
అమ్మ
41
[యతీంద్రనాథ్ ఘోష్]
జయరాంబాటి,
16 సెప్టెంబర్, 1919
శ్రేయస్సు కలుగుగాక!
నాయనా! నీ ఉత్తరం నుండి వివరాలు తెలుసుకున్నాను. మీ ప్రాంతంలో బియ్యం ధర ఎక్కువైందని విని ఆందోళన చెందాను. ఇక్కడ ఒక మణుగు* 6 లేక 7 రూపాయలు.
నా ఆరోగ్యం ఫరవాలేదు. తక్కిన వారందరూ క్షేమం. మీ అందరికీ నా ఆశీస్సులు. మీరందరూ క్షేమమేనని ఆశిస్తాను.
ఆశీస్సులతో,
మీ అమ్మ
42
[యతీంద్రనాథ్ ఘోష్]
కలకత్తా,
21, ఏప్రిల్, 1920
శుభాశీస్సులు.
నాయనా, నీ ఉత్తరం అందింది. నా ఆరోగ్యం బాగా క్షీణిస్తూంది. ఏ విధం గానూ జ్వరం తగ్గడం లేదు. శారీరక బలహీనత కారణంగా పడుకునే ఉంటున్నాను. లేచి కూర్చోవడానికి కూడా తగినంత శక్తి లేనప్పుడు ఎక్కడికైనా ఎలా వెళ్లడం?
నా ఆశీస్సులు.
మాతృదేవి