1904. జితేన్ మహరాజ్‌తో పాటు మేం కూడా అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వెళ్లేవారం. పంచవటిలోనో, గురుదేవుల గదిలోనో రాత్రి గడిపేవారం. రామ్‌లాల్ ప్రసాదం ఇచ్చేవారు.
ఒక రోజు రామ్‌లాల్ నాకు ఒక వస్తువునిచ్చి దానిని వరాహనగరంలోని మహేంద్ర వైద్యునికి ఇవ్వమన్నారు. మహేంద్రుడు గురుదేవులకు పరిచయమున్న వ్యక్తి. నేను ఆయనను కలుసుకున్నప్పుడు ఆయన నన్ను తన పూజగదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ గురుదేవులకు పక్కనున్న మాతృదేవి ఛాయాచిత్రం చూస్తూ, “వీ రెవరు?” అని అడిగాను. ఇంతకు మునుపు నేను మాతృదేవి ఛాయాచిత్రం చూసిందీలేదు, వారిని గురించి విన్నదీ లేదు. “ఈమె మన మాతృదేవి” అన్నాడు మహేంద్రుడు. “ఈమె బ్రతికే ఉన్నారా? అలా ఉన్నట్లయితే ఎక్కడ ఉంటున్నారు?” అని అడిగాను. “జయరాంబాటిలో” అన్నాడాయన.
క్రితంరోజు మాతృదేవిని కలలో చూశాను. కానీ ఆమె ఎవరన్నది అప్పుడు తెలియలేదు. కలలో చూసిన వ్యక్తీ, ఛాయాచిత్రంలో చూసిన వ్యక్తీ అచ్చం ఒకటిగా ఉండడంతో నేను ఎంతో ఆశ్చర్యపోయాను. దాంతో మాతృదేవిని ప్రత్యక్షంగా దర్శించాలనే అభిలాష నాలో తీవ్రతరమైంది.
చివరకు ఒక రోజు నేనూ, జితేన్ మహరాజూ జయరాంబాటికి బయలు దేరాం. రైలులో వర్ధమాన్, అక్కణ్ణుండి ఎడ్ల బండిలో ఉచాలన్ వెళ్లాం. అక్కడే రాత్రి బస చేసి, మర్నాడు సుమారు పదకొండు గంటలకు కామార్పుకూర్ చేరుకున్నాం. అక్కడ లక్ష్మి ఉన్నారు. దక్షిణేశ్వరంలోనే ఆమెతో మాకు పరిచయం ఉంది. మమ్మల్ని చూసి ఎంతో సంతోషించారు. సాయంత్రం గురుదేవుల గదిలో ఆమె తనను రాధాదేవి చెలికత్తె అయిన బృందాదేవిగా అలంకరించుకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని, శ్రీకృష్ణ లీలలో పలు ఫుట్టాలను నటించి చూపించారు. అది చూసి మాకు ఎంతో ఆనందం కలిగింది.
లక్ష్మి వద్ద సెలవు పుచ్చుకొని మర్నాడు ఉదయం దాదాపు తొమ్మిదింటికి జయరాంబాటి చేరుకున్నాం. ప్రసన్న ఇంటి వసారాలో మాతృదేవి వంట చేస్తున్నారు. ఒక్కొక్కరంగా వెళ్లి ప్రణమిల్లాం. చాలాకాలం తర్వాత తన కుమారుణ్ణి చూసిన తల్లిలా మాతృదేవి నాతో మాట్లాడారు. దారిలో అక్కడక్కడా తిన్నందువల్ల నా కడుపు చెడిపోయింది. దానికి కూడా మందు ఇప్పించారు.
జయరాంబాటిలో కొన్ని రోజులుండి మాతృదేవి నుండి మంత్రదీక్ష పుచ్చుకొని వెనక్కు వచ్చేశాను.
ఉద్బోధన్
ఒక రోజు వైష్ణవ భక్తుల బృందం ఒకటి ఉద్బోధన్కు వచ్చింది. వారు అక్కడ భజన చేయగోరారు. క్రింద శరత్ మహరాజ్ గదిలో భజన మొదలైంది. మాతృదేవి మేడ మీద వసారాలో తక్కిన స్త్రీలతో పాటు కూర్చొని పాటలు విన్నారు. భజన ఒకింత వేగం పుంజుకున్నప్పుడు పాడుతున్న వారిలో కొందరు పారవశ్యంతో నృత్యం చేశారు. శరత్ మహరాజ్‌ను తమతో లాగడానికి ప్రయత్నిం చారు. కానీ ఆయనలో ఎలాంటి చలనమూ లేదు. ఒక్కమాట కూడా మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. కొంతసేపటికి పారవశ్యం ఉపశమించాక భజన పూర్తయింది. నేను మాతృదేవితో, “అమ్మా! వారి ఈ పారవశ్య స్థితి నిజమేనా?” అని అడిగాను. మాతృదేవి ఈ ప్రశ్నను అంతగా పట్టించుకోలేదు. తరువాత ఇలా అన్నారు: “వారు సంసారులు, కించిత్తు ఉద్రేకాన్ని కూడా వారు అదుపులో పెట్టుకో లేరు. అందువల్లనే అలా పారవశ్యంతో నృత్యం చేశారు. ఇదంతా ఏమీ లేదు.”
నేను: అమ్మా! నేను ఎలా జీవితం గడపాలి?
మాతృదేవి: ఎలా జీవితం గడపుతున్నావో అలాగే గడుపు! వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించు. ఒక్క క్షణం కూడా ఆగకుండా, ఎల్లప్పుడూ ఆయనను స్మరించు.
నేను: అమ్మా! గొప్ప వ్యక్తులు సైతం జారిపడడం చూస్తూవుంటే మనస్సులో గుబులుగుబులుగా ఉంది.
మాతృదేవి: చుట్టూ భోగవస్తువుల మధ్య జీవించినప్పుడు వాటిని అనుభ వించడానికైన మార్గాలు కూడా ఉత్పన్నమవుతాయి, నాయనా! ఒక స్త్రీ బొమ్మను కూడా చూడవద్దు, అది ఉన్న వైపు వెళ్లకు!
నేను: ఒక వ్యక్తి తానుగా ఏం చేయగలడు? అంతా భగవంతుడే కదా చేయిస్తున్నాడు!
మాతృదేవి: భగవంతుడే చేయిస్తున్నాడన్నది నిజమే. కానీ ఆ ఆలోచన ఎప్పుడూ మెదలుతూ ఉండాలి కదా! అహంకారం తలకెక్కి ‘అన్నీ నేనే చేస్తున్నాను. నేను ఎవ్వరినీ ఆశ్రయించి ఉండాల్సిన పని లేదు’ అంటూ ఆర్భాటం చేస్తున్నాడుమనిషి. ఎవరు భగవంతుని మీదనే విశ్వాసముంచి జీవిస్తున్నారో వారిని ఆయనేకదా ఆపదల నుండి కాపాడుతున్నారు.
ఒక సాధువు గురించి మాతృదేవి ఇలా చెప్పారు:
“గురుదేవులు, ‘ఓ సాధూ! జాగ్రత్తగా ఉండు!’ అని చెప్పేవారు. సాధువులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. జారుడు మార్గంలో నడవాలంటే కాళ్లను గమనిస్తూ ఆనుకొని నడవాలి. కేవలం వాగ్ధాటితో సాధువు కావడం సాధ్యమా? సాధువు దృష్టి స్త్రీల మీద పడకూడదు. ఆతడు నడుస్తున్నప్పుడు చూపు కాలి బొటన వ్రేలు మీద కేంద్రీకరించి నడవాలి. మెడకు దట్టీ కట్టిన కుక్కను ఎవరూ విసిగించరు.ఎందుకంటే దానికి యజమాని ఉన్నాడని ఆ దట్టీ మూలంగా తెలుసుకోవచ్చు, అలాగే కాషాయం ఒక సాధువును రక్షిస్తుంది. సాధువు పయనించేది రాజబాట, అందులో ఇతరులు వెళ్లలేరు.
“మనస్సు ఎప్పుడూ చెడువాటినే ఆశిస్తుంది. ఒక మంచి పనిని చేయాలను కుంటే మనస్సు సహకరించదు. మునుపంతా నాకు రోజూ ఉదయం మూడు గంటలకు లేచి ధ్యానం చేయడం అలవాటు. ఒక రోజు ఒంట్లో నలతగా ఉండడంతోబద్ధకంతో లేవలేకపోయాను. తర్వాత చూస్తే మూడింటికి లేవడం పూర్తిగా ఆగిపోయింది. అందువల్ల ఏదైనా మంచి పనులు సాధించదలచుకుంటే ఎంతో ఉత్సాహంతోనూ, ప్రోత్సాహంతోనూ చేయాలి.
“నహబత్తులో నేను జీవించిన రోజులలో రాత్రిళ్లు బయట కూర్చొనేదానను.చలనంలేని గంగానది స్వచ్ఛమైన నీటిలో ఆకాశంలోని చంద్రుని ప్రతిబింబంకనబడేది. ‘భగవంతుడా! ఈ చంద్రునిలో కూడా కళంకముంది. నా మనస్సులో ఎలాంటి కళంకమూ లేకుండా అనుగ్రహించు’ అని విలపిస్తూ ప్రార్థించేదానను.నేను అక్కడ ఉంటున్నప్పుడు రామ్‌లాల్‌ను కూడా నా వద్దకు రానిచ్చేవారు కాదు గురుదేవులు. ఇంతకూ రామ్‌లాల్ నాకు కుమారుడి వరుస! ఇహ ఇప్పుడంటే నేను అందరితోనూ మాట్లాడుతున్నాను, కలివిడిగా ఉంటున్నాను.
“నువ్వు కలకత్తాకు చెందిన వాడవు. కోరుకునివుంటే పెళ్లి చేసుకుని కాపురంచేసివుండవచ్చుకదా! అది వద్దనుకొని వచ్చేశావు. ఇప్పుడు మళ్లీ అటువైపు ఎందుకు దృష్టి సారించాలి? ఎంగిలిని ఉమ్మిన తర్వాత మళ్లీ ఎవరైనా దానిపై ఆశపడతారా?”
నేను: అమ్మా! ఆసనం, ప్రాణాయామం ఇవన్నీ చేయడం మంచిదేనా?
మాతృదేవి: అవన్నీ ఆచరణలో పెడితే సిద్ధులు వచ్చి చేరుతాయి. సిద్ధులు మనిషిని అతడి దారి నుండి వైదొలగచేస్తాయి.
నేను: సాధువులు తీర్థయాత్రలు చేయడం మంచిదా?
మాతృదేవి: ఒక్క చోట ఉంటున్నప్పుడే మనస్సు ప్రశాంతంగా ఉండేటట్లయితే ఇక తీర్థ స్థలాలకు తిరగడమెందుకు?
నేను: అమ్మా! ధ్యానం చేయడం సాధ్యమవడం లేదు. మీరే నా కుండలినిని జాగృతి పొందేలా చేయండి.
మాతృదేవి: అది జాగృతి పొందుతుంది. కొద్దిగా జపధ్యానాలు ఆచరిస్తే అది జాగృతి పొందుతుంది. ఏమీ సాధన చేయకుండా దానంతట అదే జాగృతి పొందుతుందా ఏమిటి? ధ్యానం చేయి, జపం చేయి. ధ్యానం చేసేకొద్దీ మనస్సు ఏకాగ్రమై నిలకడ చెందుతుంది. అలాంటి స్థితికి తర్వాత ధ్యానాన్ని వదలుకోవడానికి మనస్సు ఇష్టపడదు. ధ్యానంలో మనస్సు లయించని రోజులలో మనస్సును బల వంత పెట్టవలసిన పనిలేదు. ఆ రోజు ఇష్టదైవానికి ప్రణమిల్లి వచ్చేసేయి. తగిన మనఃస్థితి కలిగినప్పుడు ధ్యానం దానంతట అదే సిద్ధిస్తుంది.
ఉద్బోధన్, జూన్ 19, 1912
నేను: అమ్మా! మనస్సు ఎందుకు ఒకచోట నిలకడగా ఉండనంటుంది? భగవంతుని స్మరించడం ప్రారంభించగానే అది ఎక్కడెక్కడికో వెళ్లిపోతుంది!
మాతృదేవి: ఎక్కడెక్కడికో అంటే డబ్బు, భార్యా, పిల్లలు, వీటి మీదనా? వీటి మీద అయితే అది మంచిది కాదు. కానీ దైనందిన పనుల గురించి మనస్సు ఆలోచించడం మామూలే. ధ్యానం చేకూరకపోతే జపం చేయి, ‘జపాత్ సిద్ధిః’ అంటే జపం ద్వారానే పరిపూర్ణ స్థితి కలుగుతుంది. ధ్యానం కుదిరితే మంచిదే, కుదరకపోతే బలవంతంగా మనస్సును అందులో పాల్గొనేలా చేయవలసిన పనిలేదు.
కాశీ, 1912
నేను: కాశీలో ఆధ్యాత్మిక సాధనలు చేయడానికి మఠంలో ఉండడం మంచిదా లేక ఏకాంత ప్రదేశాలకు వెళ్లడం మంచిదా?
మాతృదేవి: ముందుగా ఋషీకేశ్ లాంటి ఏకాంత స్థలానికి వెళ్లి సాధనలు చేయడం మంచిది. తద్వారా మనస్సు పక్వమైనప్పుడు ఎక్కడున్నా ఫరవాలేదు. ఎవరితో కలిసి మెలసి ఉన్నా ఫరవాలేదు, మనస్సు ఏ విధంగానూ బాధింపబడదు. చిన్న మొక్కగా ఉన్నప్పుడే చుట్టూ కంచె వేయాలి. ఆ మొక్క బాగా పెరిగిన తర్వాత మేకలు, గేదెలు కూడా దానిని ఏమీ చేయలేవు. ఏకాంతమైన చోట ఉంటూ సాధనలు చేయడం ఎంతో అవసరం. మనస్సులో లేనిపోని ఆలోచనలు తలెత్తినా, దేనినైనా మనస్సు కాంక్షించినా ఏకాంతంలో కన్నీటితో భగవంతుణ్ణి ప్రార్థించు. మనస్సులోని మాలిన్యమూ, దుఃఖమూ అన్నిటినీ ఆయన తుడిచేస్తారు, నిజాన్ని అర్థమయ్యేలా చేస్తారు.
నేను: సాధనలు చేయడానికి నాకు ఏం శక్తి ఉంది? నేను మీ పాద కమలాలను శరణు జొచ్చాను. చేయాల్సిందంతా మీరే చేయండి.
మాతృదేవి వెంటనే చేతులు జోడించి గురుదేవులను ప్రార్థించారు. తర్వాత నాతో ఇలా అన్నారు:
“గురుదేవులు నీ సన్న్యాస వ్రతాన్ని పరిరక్షిస్తారు. ఆయన నిన్ను చూసు కుంటూనే ఉన్నారు. భయమెందుకు? ఆయన కార్యం కొనసాగించు, సాధనలు చేయి, కొద్దిగానైనా పనులలో మునిగితే మనస్సులో పనికిమాలిన ఆలోచనలు తలెత్తవు. సోమరిగా కూర్చునివుంటే లేనిపోని ఆలోచనలన్నీ వస్తాయి!
కాశీ, డిసెంబరు / జనవరి 1912
నేను: అమ్మా! ఎక్కడ ఎలా సాధనలు చేయాలి?
మాతృదేవి: నీకు కాశీ మంచిచోటు. భగవంతుని పాదపద్మాలపై మనస్సు నుంచి ఎల్లప్పుడూ ఆయన స్మరణలో మునిగివుండడమే సాధన. నామజపం చేయి.
నేను: ప్రగాఢ ప్రేమ లేకుండా కేవలం నామజపం చేయడం వలన ప్రయోజన మేమిటి?
మాతృదేవి: నువ్వు కోరి నీళ్లలోకి దిగినా, ఎవరైనా నిన్ను పట్టుకుని నీళ్లలోకి తోసేసినా నీ గుడ్డలు తడవక తప్పదు కదా! రోజూ ధ్యానం చేయి. నీ మనస్సు ఇంకా పక్వం కాలేదు కదా! ధ్యానం చేస్తూవస్తే క్రమేణా మనసు నిలకడ చెందుతుంది. ఎల్లప్పుడూ విచారణ చేయి. నీ మనస్సు కోరుకునే లౌకిక వస్తువులన్నీ అనిత్యాలని ఎరిగి మనస్సును భగవంతునికి సమర్పించు. ఒకడు చేపలు పడుతూవున్నాడు. అటు వైపుగా మేళతాళాలతో పెద్ద ఊరేగింపు వెళ్లింది కానీ ఆతని మనస్సు గాలం మీదే లగ్నమై ఉంటుంది.
నేను: జీవిత లక్ష్యమేమిటి?
మాతృదేవి: భగవదనుభూతి పొందడం, సదా సర్వవేళలా ఆయన పాద పద్మాల మీద మనస్సును నిలపడం. మీరందరూ సాధువులు, గురుదేవులకు చెందినవారు. మీ ఇహపర జీవితాలను ఆయనే చూసుకుంటున్నారు. మీకెందుకు కలత? ఎల్లప్పుడూ భగవంతుని స్మరణలో లయించి ఉండడం సాధ్యమా? కొద్దిగా స్మరించు, కొద్దిగా విశ్రాంతి తీసుకో!
సన్న్యాసికి ఇష్టానిష్టాలు ఉండరాదు. అతడు అన్నిటిని సహించాలి. గురుదేవులు హృదయ్‌తో, ‘నా మాటలను నువ్వు సహించు, నీ మాటలను నేను సహిస్తాను. అప్పుడే సరిపోతుంది. లేకపోతే మనల్ని రాజీ చేయడానికి ఆలయ అధికార్లు కావాల్సి వస్తుంది’ అనేవారు.
నేను: అమ్మా! కొద్దిగా ప్రాణాయామం చేస్తున్నాను. చేస్తూరానా?
మాతృదేవి: కొద్ది కొద్దిగా చేయి, ఎక్కువగా చేసి మెదడును వేడెక్కించడం మంచిది కాదు. మనస్సు దానంతట అదే వశపడినప్పుడు ఇక ప్రాణాయామం ఎందుకు?
నేను: కుండలిని జాగృతి పొందకపోతే ఎలాంటి ప్రయోజనమూ లేదు.
మాతృదేవి: జాగృతి పొందుతుంది. భగవంతుని నామజపం చేసేకొద్దీ అన్నీ సిద్ధిస్తాయి. మనస్సు వశం కాకుండాపోయినా ఒకచోట కూర్చొని లక్ష లక్షలు జపం చేయవచ్చుకదా! కుండలిని జాగృతి పొందడానికి ముందుగా అనాహత ధ్వని వినిపిస్తుంది. జగజ్జనని అనుగ్రహం లేకుండా ఏదీ జరగదు.
ఇక విశ్వనాథుని దర్శనం అసంభవమని ఈ రోజు ఉదయం అనుకున్నాను. ఆ శివలింగం చాలా చిన్నది. పైగా ఎల్లప్పుడూ బిల్వదళాలతోను నీటితోను మూసుకొని ఉంటుంది. ఈ స్థితిలో ఆయన దర్శనం ఎలా సాధ్యమవుతుంది! ఇలా మనస్సులో ఆలోచనలు చెలరేగుతాయి. హఠాత్తుగా చూస్తే నా దగ్గర నల్లని ఒక శివలింగం – విశ్వనాథుడే. నటి తల్లి శివుని శిరస్సును స్పృశిస్తూండడం చూశాను. నేను కూడా త్వరగా వెళ్లి వారి శిరస్సును స్పృశించాను.
నేను: అమ్మా! రాతితో మలచబడిన శివలింగం నాకు నచ్చదు.
మాతృదేవి: ఇవేం మాటలు నాయనా! ఎందరో మహాపాపులు కాశీకి వస్తున్నారు, విశ్వనాథుని స్పృశించి ఉన్నతులవుతున్నారు. ఎలాంటి ఇష్టానిష్టాలూ లేకుండా విశ్వనాథుడు వారి పాపాలనన్నిటిని స్వీకరిస్తున్నాడు.
నేను: భగవంతుడే అందరి తల్లీ తండ్రీ అయినప్పుడు ఆయన ఎందుకు మనల్ని పాపాలు చేయనిస్తున్నాడు?
మాతృదేవి: ఆయనే ఈ జీవరాశులన్నిటిగా పరిణమించి ఉన్నారనడం సత్యమే. కానీ ప్రతి ఒక్కరూ తమ సంస్కారాలకు తగ్గట్లు, పనులకు తగ్గట్లు కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నారు. సూర్యుడు ఒక్కడే అయినా ఆతని కిరణాలు ప్రతిఫలిం చడం స్థలమూ, పదార్థమూ, స్వభావానికీ తగ్గట్లు మారుతుంది.
జనవరి 1, 1917
నేను: అమ్మా! నాకు ధ్యానం చక్కగా కుదరాలనీ, అందులోనే మగ్నమై ఉండాలనీ ఆశీర్వదించండి.
మాతృదేవి నా శిరస్సుపై తమ చేయి ఉంచి, “నిత్యానిత్యాలను గురించి ఎల్లప్పుడూ విచారణ చేస్తూవుండు” అంటూ ఆశీర్వదించారు.
నేను: అమ్మా! నేను ఒక్కచోట కూర్చొని విచారణ చేసుకోవచ్చు. కానీ కర్మ క్షేత్రంలో ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. పరిస్థితులు అలానే లాగుకుని వెళ్లిపోతాయి, కర్మ క్షేత్రంలో ఇలాంటి విచారణ ప్రయోజనపడేటట్లు నన్ను ఆశీర్వదించండి.
మాతృదేవి: నాయనా! గురుదేవులు నిన్ను కాపాడతారు. నీకు చైతన్యం కలుగుగాక! (మరొక సన్న్యాసితో) మీరందరూ సన్న్యాసులు. మీరు గృహస్ధులతో సాంగత్యం కలిగి ఉండడం మంచిది కాదు. లౌకిక వ్యక్తుల గాలి సోకడమే మంచిది కాదు!
కోల్పారా, మే 27, 1919
నేను: అమ్మా! ఇన్ని రోజులు గడిచిపోయాయి. నేను ఏమీ సాధించలేదే!
మాతృదేవి: గృహస్థ జీవితంలోని సమస్యల నుండి విడిపించి గురుదేవులు తమ పాదపద్మాల వద్ద మిమ్మల్ని ఉంచుకున్నారు. ఇదేం సామాన్యమైన భాగ్యమా? ‘జపధ్యానాలు అనుష్ఠిస్తాను, లేకపోతే అనుష్ఠించకుండా ఉంటాను. కానీ కుటుంబ పీకులాటల నుండి విడివడివున్నాను కదా!’ అనేవాడు యోగీన్. నన్ను చూడు! రాధూ కారణంగా ఈ మాయలో ఎన్ని అవస్థలు పడుతున్నాను!
నేను: ఏకాంతంగా ఎక్కడైనా తోటలో ఉండి సాధనలు చేయాలని అనుకొంటు న్నాను.
మాతృదేవి: ఇదే కదా తగిన తరుణం! ఈ సమయంలోనే చేయాలి. నువ్వు తప్పకుండా చేస్తావు. కానీ ఆహారం లాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండు. కఠోరమైన తపోజీవితం అవలంబించినందువల్లనే యోగీన్ అష్టకష్టాలుపడి చనిపోవలసి వచ్చింది.
కోల్పారా, మే 29, 1919
నేను: – బాబు ఇప్పుడల్లా మఠానికీ రావడంలేదు, మీ ఇంటికీ రావడం లేదు, ఎందుకిలా చేస్తున్నాడు?
మాతృదేవి: నిజమే. నేను కలకత్తాలో ఉన్నప్పుడు కూడా ఆతడు నన్ను చూడడానికి రాలేదు.
నేను: చాలా కాలం నుండి భక్తుడిగా ఉంటున్నాడు. ఎందుకిలా జరుగుతూ ఉంది?
మాతృదేవి: అంతా ప్రారబ్ధ కర్మ. ఎన్నో జన్మల కర్మఫలం బాకీ ఉంది. ఇప్పుడు వాటిని అనుభవించ వలసి ఉంది. అలలన్నీ అణగిపోతే ఈ జన్మలోనే ముక్తి లభిస్తుంది.
నేను: అంతా భగవంతుని ఇచ్ఛ అయినప్పుడు ఆయన ఎందుకు ఈ కర్మఫలం నుండి మనల్ని విడిపించకూడదు?
మాతృదేవి: ఆయన సంకల్పిస్తే తప్పకుండా విడిపించవచ్చు. కానీ గురుదేవులు కూడా కర్మఫలం అనుభవించాల్సి వచ్చింది కదా! ఆయన పెద్దన్నగారు సన్నిపాతంలో నీళ్లు తాగారు. అందువల్ల గురుదేవులు ఆ నీటిపాత్రను లాగుకున్నారు. దాంతో కోప గించుకొన్న ఆయన, ‘నేను నీళ్లు తాగడం అడ్డుకున్నావు కదా! నువ్వు కూడా అంతిమ కాలంలో ఏమీ తినలేక పోదువుగాక!’ అని శపించారు. గురుదేవులు కూడా దానిని అనుభవించ వలసి వచ్చింది. చివరి రోజుల్లో ఆయన ఏమీ తినలేక పోయారు. ఈతడు కూడా అలాగే. అనేక జన్మల కర్మఫలం వలన ఇలాంటి మార్పు వచ్చివుంది. అ– విషయం కూడా ఇలాంటిదే కదా! ఇవన్నీ ఎందుకు, ఎలా జరుగుతున్నాయని అర్థం చేసుకోవడం నిజంగా ఎంతో కష్టం.
కోల్పారా, జూన్ 4, 1919
నేను: అమ్మా! జపం చేసేటప్పుడు లెక్కించాలా?
మాతృదేవి: లెక్కిస్తూ జపం చేస్తే మనస్సు లెక్క మీదే ఉంటుంది. నువ్వు మామూలుగానే జపం చేయి.
నేను: జపం చేసేటప్పుడు మనస్సు ఎందుకు గాఢంగా లగ్నమవదు?
మాతృదేవి: అవన్నీ నిరంతర అభ్యాసం వల్లనే సాధ్యమవుతాయి. మనస్సు వశమవలేదని జపం చేయడం మానుకోవద్దు. నువ్వు అభ్యసిస్తున్న దానిని విడవకుండా అభ్యసించు. భగవంతుని పవిత్ర నామాన్ని జపిస్తూ వస్తే, గాలిలేనిచోట వెలుగుతున్న దీపశిఖలా నీ మనస్సు దానంతట అదే నీ వశమవుతుంది. గాలి వీచినప్పుడు దీపశిఖ నిలకడగా ఉండదు. అదేలా కల్పనలు, కోర్కెలు ఉన్నంతవరకు మనస్సు నిలకడగా ఉండదు.
మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించకపోతే కూడా విజయం సిద్ధించడానికి సమయం ఎక్కువ పడుతుంది. “రుక్మిణీనాథాయ” అనేది ఒక స్త్రీ కిచ్చిన మంత్రం. కానీ ఆమె రుక్కు రుక్కు అనే జపంచేసేది. ఆ కారణంవల్ల ఆమె పురోగమనానికి ఆటంకం వచ్చింది, తర్వాత భగవంతుని కృప వలన సరైన మంత్రం లభించింది.
కోల్పారా, జూన్ 12, 1919
నేను: దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని రోజులుగా యోగాసనాలు నేర్చుకుంటున్నాను. బాగా జీర్ణమవడానికి, బ్రహ్మచర్య పాలనకు ఇది సహాయపడు తుంది.
మాతృదేవి: వీటిని అధికంగా చేసేకొద్దీ మనస్సు శరీరం మీదికి ఎక్కువగా మరలుతుంది. మధ్యలో వదిలేస్తే శరీరానికి హాని వాటిల్లుతుంది, ఇవన్నీ చక్కగా గ్రహించి తర్వాత యోగాసనాలు అభ్యసించు.
నేను: బాగా జీర్ణమవడానికి నేను ఐదో, పదో నిమిషాలే వీటిని చేస్తున్నాను.
మాతృదేవి: అలా అయితే ఫరవాలేదు. ఎలాంటి శరీర వ్యాయామమైనా ప్రారంభించిన తర్వాత మధ్యలోనే ఆపితే అది ఆరోగ్యానికి హానికరమని నీకు సూచించడానికే ఇలా అన్నాను. నాయనా! నీకు చైతన్యం కలగాలని ఆశీర్వదిస్తున్నాను.
కాశీలో వేణీమాధవ ఆలయ పతాకాన్ని చూసి మాతృదేవి ఇలా అన్నారు: “ఇంతగా కృశించి పోయిన నన్ను ఇప్పుడు నువ్వు చూస్తున్నావు. కానీ గురుదేవుల నిర్యాణానంతరం కాశీకి వచ్చినప్పుడు, నేనే పైకెక్కి పతాకాన్ని కట్టాను. హరిద్వారంలో వున్న చండీ కొండలోనూ, పుష్కరంలోవున్న సావిత్రీ కొండ పైకెక్కి దర్శనం చేసు కున్నాను.
కాశీలో ఉంటున్న మణికర్ణికాఘట్టంలో ఒక సన్న్యాసి కఠోర తపోజీవితం చేపట్టాడు. నేను కలకత్తాకు వెళ్లేటప్పుడు ఆయన నాతో, “భగవంతుడు నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తాడో మాతృదేవిని అడిగిరా” అని చెప్పారు.
నేను ఈ విషయం మాతృదేవితో చెప్పినప్పుడు ఆమె ఒకింత గంభీరంగా ఇలా అన్నారు:
“తపస్సు చేయడం ద్వారా భగవంతుని కృప కలుగుతుందనే నియమం ఏదీ లేదు. ప్రాచీనకాలంలో ఋషులు క్రింద అగ్నిని ప్రజ్వలింపజేసి తలక్రిందులుగా వేళ్లాడుతూ ఎంతో తపస్సు చేశారు. అలాంటి వారిలో కూడా ఎప్పుడో ఎవరికో మాత్రమే భగవదనుగ్రహం లభించేది. ఇతరులకు అసలు లభించలేదు. ఒక వ్యక్తి కఠోర తపస్సు మొదలుపెడితే వెంటనే ఆతడికి భగవంతుని కృప లభిస్తుందని ఎలాంటి నియమమూ లేదు. ప్రేమతో మాత్రమే ఆయనను పొంద వచ్చు. ఈ విషయం ఆ సన్న్యాసికి వ్రాయి!”
ఒకసారి మాతృదేవితో, “అమ్మా! కొందరు ఒక గురువు వద్ద మంత్రోపదేశం తీసుకుంటారు! మరొక గురువు నుండి సన్న్యాసదీక్ష తీసుకుంటారు. ధ్యాన సమయంలో ఏ గురువును ధ్యానించాలి?” అని అడిగాను.
అందుకు మాతృదేవి, “మంత్రదీక్ష నిచ్చినవారే గురువు. ఆ మంత్రం నుండే అంచలంచెలుగా త్యాగమూ, వైరాగ్యమూ, సన్న్యాసమూ అన్నీ సిద్ధిస్తాయి. మంత్ర దీక్షను ప్రసాదించిన గురువునే ధ్యానించు” అన్నారు.