ఏడవ తరగతి చదువుకుంటున్నప్పుడు మొట్టమొదటిసారిగా మాతృదేవిని దర్శించాను. జ్ఞాన్, గోపేష్ ప్రభృతులతో కలసి వెళ్లాను. అది 1915 వ సం ॥. నిజం చెప్పాలంటే మాతృదేవిని చూసినప్పుడు కాస్త నిరాశే కలిగింది. నా రూపకల్పనలో మాతృదేవి ఇలా ఉన్నారు: చక్కగా అలంకరింపబడిన ఒక సింహాసనం, అందులో ఆసీనులైన మాతృదేవి. ఇరువైపులా చామరాలు వీస్తూ పరిచారికలు. కానీ ఇక్కడ రెల్లుగడ్డి మట్టిగుడిసె, అందులో చీపురుకట్టతో ఇంటిని ఊడుస్తూ కనిపించిన మాతృదేవి! నాతోపాటు వచ్చిన ఇద్దరితో నిరాశగా, “ఈ మామూలు పనికి సహాయపడడానికి కూడా ఎవరూ లేరా?” అని అడిగాను. అందుకు వాళ్లు, “అప్పుడప్పుడూ ఇక్కడకు వస్తూవుండు. క్రమంగా అన్నీ అర్థం చేసుకోగలవు” అన్నారు.
మమ్మల్ని చూసినప్పుడు మాతృదేవి, “కాస్త వేచివుండండి. ఇదిగో ఈ పని పూర్తిచేసి చేతులు కాళ్లు కడుగుకొని వచ్చేస్తాను. తరువాత నమస్కరించవచ్చు” అన్నారు. మేము వేచివున్నాం. చీపురుకట్టను యథాస్థానంలో పెట్టి చేతులు కడుక్కుని పరుపు మీద కూర్చున్నారు మాతృదేవి. మేము ఒకరి వెంట ఒకరుగా ప్రణమిల్లాం.
ప్రణమిల్లి నప్పుడు చూస్తే మాతృదేవి పరుపు మీద మరొక స్త్రీ నిద్రపోతూన్నారు. అది కూడా నాకు నచ్చలేదు. నాతో వచ్చిన వారితో, “ఈమె ఎవరు? ఎందుకు మాతృదేవి పరుపు మీద నిద్రించాలి? కింద చాప మీద పడుకోవచ్చు కదా?” అని అడిగాను. జ్ఞాన్ నన్ను వారిస్తూ, “మాట్లాడకుండా ఉండు! అంతా తరువాత నీకు అర్థమవుతుంది” అన్నారు. ఆమే రాధూ.
నేను ప్రణమిల్లినప్పుడు మాతృదేవి, “ఈ అబ్బాయి ఎవరు?” అని అడిగారు. అప్పుడు నాతో ఉన్నవారు, “పతన్ గంజ్ బడిలో చదువుతున్నాడు” అన్నారు. “ప్రబోధ్ విద్యార్థా?” అని అడిగారు మాతృదేవి. ప్రబోధ్ చంద్ర ఛటోపాధ్యాయ మా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. మాతృదేవికి ఆయన ఎలా తెలుసు? ఈ ప్రాంతంలోవుండే చదువుకున్న బుద్ధిమంతుడు ఆయన. అందువల్లనే మాతృదేవికి తెలిసివుంటుందని నేను అనుకున్నాను. కానీ ఆయన, ఆయన భార్య – ఇద్దరూ మాతృదేవి వద్ద మంత్రదీక్ష తీసుకున్నారని ఆ తరువాతే తెలిసింది.
ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు, “మళ్లీ రా నాయనా!” అన్నారు మాతృదేవి. అప్పటి నుండి జయరాంబాటికి రావటానికి, మాతృదేవిని దర్శించటానికి మనస్సు ఉవ్విళ్లూరేది. ప్రతి శనివారమూ బడికి వెళ్లేటప్పుడు ఒక గుడ్డ, తువ్వాలు, సోమవారం కోసం పుస్తకాలు అన్నిటినీ తీసుకొనే ఇంటి నుండి బయలుదేరేవాణ్ణి. శనివారం బడి వదలగానే మాతృదేవి దగ్గరికి వెళ్లిపోయేవాణ్ణి. ఒకటి రెండు సార్లు వెళ్లిన తర్వాత మాతృదేవికి బాగా సన్నిహితుడనైపోయాను.
మాతృదేవి అసాధారణమైన లజ్జగలవారు. స్వామీజీ, రాజా మహరాజ్, శరత్ మహరాజ్, మహాపురుష్ మహరాజ్ లాంటి వారందరినీ, “నాయనా!” అంటూనే సంబోధించేవారు. కానీ వారి సమక్షంలో కూడా మేలిముసుగు ధరించే ఉండేవారు. ముసుగు తీయకుండా హీనస్వరంలో మాట్లాడేవారు. అనేక సమయాల్లో ఆమె చెప్పిన దానిని యోగీన్ మా లేక గోలాప్ మా బిగ్గరగా చెప్పాల్సివుండేది. ఒక రోజు శరత్ మహారాజ్ మాతృదేవికి ప్రణమిల్లి బయటికి వచ్చి ఏదో ఫిర్యాదు చేసినట్లు, “నా ముందు మాతృదేవి మెలగడం చూస్తే ఆమె నన్ను తమ మామగారిలా భావిస్తున్నట్లున్నారు” అన్నారు.
నేను బాలుణ్ణి కావడంతో నా సమక్షంలో మాతృదేవి ముసుగు ధరించరు. అందువలన వారి ముఖాన్ని చక్కగా తిలకించగలిగే వాణ్ణి. వాతం కమ్ముకొన్న ఆమె పాదాలకు నూనె రాసే భాగ్యం నాకు కలిగింది. ఆమె పాదాలు ఎంతో మృదువుగా గులాబీ రంగులో ఉండేవి. కామార్పుకూరు, జయరాంబాటికి ఆమె కాలినడకనే వెళ్లేవారు. ఎప్పుడూ కాళ్లకు చెప్పులు ధరించేవారు కాదు. అయినా ఆ గులాబీ రంగు చెక్కుచెదరలేదు.
ఒక రోజు మాతృదేవి పాదాలకు నూనె రాస్తున్నప్పుడు, ‘మాతృదేవి కాళ్లకు పట్టిన వాతరోగం నా కాళ్లకు రాకూడదా! మాతృదేవి ఆరోగ్యంగా ఉంటారు కదా!’ అని నా మనస్సుకు తోచింది. అలా అనుకుంటూ మాతృదేవి పాదాలను తాకడానికి ప్రయత్నించినప్పుడు ఆమె నా చెంపను స్పృశిస్తూ, “ఛీ, ఛీ! ఏమిటా ఆలోచనలు?మీరందరూ బాగుండాలి. గురుదేవుల కార్యం ఎంతో చేయాల్సివుంది. నాకు వయస్సయిపోయింది! ఇంకా ఎన్ని రోజులు ఉండబోతాను?” అన్నారు.
నేను మాతృదేవితో పాటు కూరగాయలు తరిగేవాణ్ణి. పొయ్యిలో నిప్పు రాజేసేవాణ్ణి. గోధుమ పిండి, మైదాపిండి సిద్ధంచేసి చపాతీలు, లూచీలు తయారు చేసేవాణ్ణి. పువ్వులు, తులసీదళాలు, బిల్వదళాలు, దూర్వాగ్రాసం ఇత్యాదులు సేకరించి తెచ్చి, చందనం నూరి వాటిని పూజకు సిద్ధంచేసేవాణ్ణి. పళ్లు ఉంటే ముక్కలుగా కోసిపెట్టేవాణ్ణి. అప్పుడల్లా జయరాంబాటిలో పండ్లు దొరికేవి కావు. దోసకాయలు, బంగాళదుంపలు మాత్రమే దొరికేవి. ఒకే ఒక చిన్న దుకాణం ఉండేది. చిన్న దుకాణ మంటే – చిన్న దుకాణమే! ఒకసారి పావు కిలో గసగసాలు తెమ్మని ఒక వ్యక్తిని పంపాము. దుకాణదారుడు ఆ వ్యక్తితో, “నీ ఒక్కడికే పూర్తిగా పావు కిలో గసగసాలు అమ్మేస్తే ఎలా చిల్లర వ్యాపారం చేయగలుగుతాను? దుకాణంలో మొత్తం పావు కిలో గసగసాలే ఉన్నాయి” అన్నాడట. ఇప్పుడు ఎన్నో పెద్ద దుకాణాలు వచ్చేశాయి.
తమలపాకు చిలకలు ఇచ్చేటప్పుడు మాతృదేవి నాకు రెండు ఇచ్చేవారు. “రామ్మయ్ తమలపాకులు నమలడం చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. నల్లటి వ్యక్తి, పెదవులు మాత్రం ఎర్రన – బొగ్గులో నిప్పుకణికల్లా ఉంటుంది” అనేవారు మాతృదేవి.
మాతృదేవి వద్దకు మంత్రదీక్ష కోసం వస్తున్న అనేకులను చూస్తున్నప్పుడు నాకు కూడా మంత్రదీక్ష తీసుకోవాలని అనిపించింది. కానీ నేను పదహారు, పదిహేడేళ్ల బాలుణ్ణి. నాకు మంత్రదీక్ష ఇవ్వడానికి మాతృదేవి సమ్మతిస్తారా అనే సంశయం కూడా కలిగింది. మాతృదేవి శిష్యురాలొకరు వారి సేవ కోసం జయరాంబాటిలోనే ఉంటున్నారు. పెద్దవయస్కురాలైన ఆమెను సమీపించి, “నేను మంత్రదీక్ష తీసుకోగోరుతున్నాను. మీరెప్పుడూ మాతృదేవితోనే ఉంటారు కదా! నాకు మాతృదేవి మంత్రదీక్ష ఇస్తారని మీకు అనిపిస్తున్నదా?” అని అడిగాను. అందుకు ఆమె ఇలా అన్నారు:
“తమ్ముడూ! నీకు మంత్రదీక్ష ఇస్తారనే నాకు తోస్తోంది. ఎందుకంటే నువ్వు ఒక్క శనివారం రాకపోయినా కూడా మాతృదేవి నీ గురించి వెయ్యిసార్లు అడుగుతారు. ‘రామ్మయ్ ఎందుకు రాలేదు? వాడికేమైనా జ్వరం వచ్చిందా?’ అని అడుగుతారు. కాసేపటి తరువాత ‘చదువుకుంటున్న అబ్బాయి. బుద్ధిమంతుడు. బహుశా చదువులో ఎక్కువ శ్రద్ధ తీసుకొంటున్నాడేమో! పరీక్షలు దగ్గర పడుతున్నాయేమో! అందుకే అమ్మను కూడా మరచి పోయాడేమో!’ అని అంతా చెప్పేవారు. మరీ మరీ నీ గురించి చెబుతారు. ఇలా నిన్ను ప్రేమించే మాతృదేవి తప్పక నీకు మంత్రదీక్ష ఇస్తారు. నువ్వు చిన్న పిల్లవాడివి కావడం వలన ఇవ్వకపోవచ్చునేమో! అది వేరే విషయం.”
నేను నిజానికి పెద్దవాణ్ణి. పొట్టిగా ఉన్నందువల్ల చిన్నవాడిలా కనబడతాను, అంతే. ఎలాగో మాతృదేవిని సమీపించి ఈ విషయం చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించి, “మంచిది. మంత్రదీక్ష తీసుకుంటావా! ఆసనం పరచు! గురుదేవులకు ప్రణమిల్లి కూర్చో!” అన్నారు. మాతృదేవి ఆసనం కాక ఇంకా రెండు ఆసనాలు అక్కడున్నాయి. భార్యాభర్తలు కలిసి మంత్రదీక్ష తీసుకొనేటప్పుడు ఆ ఆసనాలు వాడడం రివాజు. వాటిలో ఒకటి పరచాను. గురుదేవులకు, మాతృదేవికి ప్రణమిల్లి కూర్చున్నాను.
మాతృదేవి కొద్దిగా తీర్థం తీసుకొని, “గత జన్మలలో చేసిన పాపాలన్నీ నశించుగాక! ఈ జన్మలో కూడా తెలిసో తెలియకో చేసిన పాపాలన్నీ నశించుగాక!” అని చెబుతూ నా మీద చల్లారు. తరువాత ఒక దేవత పేరు చెబుతూ, “వీరే కదా నీ ఇష్టదైవం?” అని అడిగారు. మాతృదేవి అడిగిన ప్రశ్న నాకు అర్థం కాలేదు. అందువలన వివరించారు:
“ఈ దేవత పట్లే కదా నీకు భక్తి శ్రద్ధలు ఎక్కువ! వీరినే కదా నువ్వు ఇతర దేవతల కంటే ఎక్కువగా ప్రేమిస్తావు? వీరి మంత్రాన్నే నీ కివ్వనా?”
నేను: అమ్మా! మీరు చెప్పింది నిజమే. ఇతర దైవాల కంటే వీరినే నేను ఎక్కువగా ప్రేమిస్తాను. కానీ ఇప్పుడు గురుదేవుల గురించి పుస్తకాలు చదివిన తరువాత అన్ని దైవాలూ ఒక్కటే అనిపిస్తుంది. ఏదైనా ప్రత్యేక మంత్రం కావాలంటే దానినే నాకు ప్రసాదిస్తారా?
మాతృదేవి: చెప్పు చూద్దాం!
నేను చెప్పాను.
మాతృదేవి: ఈ మంత్రం ఇస్తే నీకు సంతోషమేనా?
నేను: అవును.
మాతృదేవి ఆ మంత్రాన్నే నాకు ప్రసాదించారు. 108 సార్లు ఎలా జపం చేయాలో వివరించారు. కొన్ని ఉపదేశాలు కూడా చేసి చివరకు, “నాయనా! గురుమా ఇష్టదైవమూ ఒక్కరే అని తెలుసుకో. ఇద్దరి మధ్యా ఎప్పుడూ తారతమ్యం చూడకు!” అన్నారు.
మంత్రదీక్షానంతరం దక్షిణ ఇవ్వాలని నాకు తెలియదు. నా జేబులో ఆ రోజు ఒక్క పైసా కూడా లేదు. ఇంట్లో భోజనం చేసి పాఠశాలకూ, పాఠశాల నుండి జయరాంబాటీకి – అంతా కాలినడకనే! అందువలన డబ్బు అవసరం లేదు. దక్షిణ గురించి మాతృదేవి కూడా నాతో ఏమీ చెప్పలేదు.
మంత్రదీక్ష పూర్తయ్యాక మాతృదేవి పాదపద్మాల మీద చేతులుంచి ప్రణమిల్లాను. పాదాల మీద తలనుంచి ప్రణమిల్ల వద్దని మునుపు మాతృదేవి నాకు చెప్పివున్నారు. కానీ ఆ రోజు మాతృదేవి నాతో, “ఈ రోజు పాదాల మీద తల ఉంచి నమస్కరించాలి. ఎందుకంటే ఇంతవరకు తల్లిగా ఉంటున్న వారు గురువైనారు” అన్నారు. అన్నిటినీ మాతృదేవే నాకు నేర్పించారు. ఆమె సూచించినట్లే నేను ప్రణమిల్లాను, మాతృదేవి తమ రెండు చేతులను నా తల మీద వేసి నన్ను ఆశీర్వదించారు. తరువాత, “రా, నాయనా! కొద్దిగా ఆహారం తీసుకుందాం! ఆలస్యమయిపోయింది, ఆకలి కూడా వేస్తూన్నది” అన్నారు.
నేను బయటికి వచ్చిన తర్వాత జ్ఞాన్ నన్ను పిలిచి, “దక్షిణ ఇచ్చావా?” అని అడిగాడు. “ఇవ్వలేదు. ఎలా ఇవ్వను? నా జేబులో ఒక్క పైసా కూడా లేదు” అన్నాను. వెంటనే జ్ఞాన్ తన జేబులో నుండి చేతిరుమాలు తీసి అందులో ఒక రూపాయి, 50 పైసలు, 25 పైసలు, రెండణాలు అంటూ ఉన్నదంతా నాకు అందించాడు. అంతా కలిపి రెండున్నర లేక మూడు రూపాయలు ఉండవచ్చు. దానిని తీసుకెళ్లాను. ద్వారం వద్దకు వెళ్లేసరికి మాతృదేవి, “ఏం నాయనా?” అని అడిగారు. నేను డబ్బు చూపించాను. “నీకు డబ్బు ఎక్కడిది?” అని అడిగారు. “జ్ఞాన్ ఇచ్చాడు” అన్నాను. “సరే” అంటూ డబ్బు తీసుకున్నారు మాతృదేవి. వారి పాదాల మీద తలనుంచి మళ్లీ నమస్కరించాను. మాతృదేవి కూడా నా తల మీద చేతులుంచి ఆశీర్వదిస్తూ, “రా, ఇక భోజనానికి వెళదాం!” అన్నారు. కంచంలో మరమరాలు పట్టుకొచ్చారు. నాకూ ఇచ్చారు. ఇద్దరమూ కూర్చొని తిన్నాం. మధ్యలో తమ కంచం నుండి మరమరాలు తీసి నా కంచంలో వేసి, “తిను, నాయనా! తిను! పెద్దదాన్ని అయిపోయాను. దంతాలు కదులుతున్నాయి. నమలలేకపోతున్నాను” అన్నారు. ఆమె ప్రసాదం కావాలని అనుకున్నాను. మాతృదేవి ఇచ్చారు. నేను యాచించకుండానే ప్రసాదించారు – కరుణామయియైన మాతృదేవి!
తోట వేసి పెంచడం చిన్నతనం నుండే నాకు బాగా అలవాటు. ఇప్పుడల్లా ఎరుపు, తెలుపు, పసుపు, లేత ఎరుపు అంటూ గులాబిచెట్టులో ఒక్కొక్క కొమ్మలో ఒక్కొక్క రంగు పువ్వును పుష్పింపచేయవచ్చు. కానీ ఆ రోజుల్లో ఈ విధానం గురించి నాకు తెలియదు. జయరాంబాటిలో మాతృదేవి పూజకు ఒక పువ్వు కూడా లేకుండా పోయిన రోజులున్నాయి. అందువలన తులసీదళాలు, దూర్వాగ్రాసం, బిల్వదళాలు, చందనం ఇత్యాదులతో పూజ చేసేవారు మాతృదేవి. “భగవంతుడా! ఈ రోజు ఒక్క పువ్వు కూడా దొరకలేదు. అందువలన వీటితోనే మీరు తృప్తిపడాలి” అంటూ గురుదేవులతో చెప్పేవారు.
నేను మాతృదేవి ఇంటికి సమీపంలో పుణ్యపుకూర్ తీరంలో ఒక తోట వేశాను. మల్లె, మందారం లాంటి మొక్కలు నాటాను. అవి పుష్పించినప్పుడు మాతృదేవి ఎంతో సంతోషించారు. ఒక రోజు మధ్యాహ్నం భోజనానంతరం మాతృదేవి మల్లె మొక్క కింది మట్టిని కదుపుతున్నారు. అప్పుడు నేను వెళ్లి “అమ్మా! ఇవన్నీ నేను చేస్తాను, మీరు చేయకండి” అంటూ ఆమె చేతిలో వున్న పారను తీసుకోవడానికి ప్రయత్నించాను. అందుకు మాతృదేవి, “ఎందుకు? అన్ని పనులూ నువ్వే చేస్తున్నావు. మల్లె పువ్వులు నాకు చాలా ఇష్టం కదా! మల్లె చెట్లు పూచే తరుణం వచ్చేసింది. అందుకే వాటికి నీళ్లు పోయడానికి పాదులు తీస్తున్నాను” అన్నారు.
సంపెంగ చెట్టుకు మొట్టమొదటిసారిగా పువ్వులు పూశాయి. పూజ కోసం కూడా ఆ పువ్వులను కోయనివ్వలేదు మాతృదేవి. “రామ్మయ్ నాటిన చెట్టు. పూలు ఎలా వికసించాయో అతడు వచ్చి చూడనీ! అతడు తన చేతులతో వాటిని కోయనీ, తర్వాత వాటిని గురుదేవులకు సమర్పిస్తాను” అని చెప్పేశారట. ఎంతటి ప్రేమ! నేను శనివారం వెళ్లి ఆమెకు ప్రణమిల్లిన వెంటనే నా చేయి పట్టుకుని తిన్నగా సంపెంగ చెట్టు వద్దకు తీసుకెళ్లారు. “చూడు, నీ చెట్టు ఎంత చక్కగా పూసిందో! ఎంత చక్కని పరిమళం గుబాళిస్తూ ఉందో చూడు” అన్నారు. పూలబుట్టను నాకు అందించారు. నేను పువ్వులు సేకరించి ఇచ్చినప్పుడు వాటితో గురుదేవులను పూజించారు.
ఒక రోజు దబ్బ చెట్టును ఒక దానిని మాతృదేవి దగ్గరకు తీసుకెళ్లాను, అందులో ఏడెనిమిది పండ్లు కూడా ఉన్నాయి, మాతృదేవి దానిని చూసి ఎంతో సంతోషించారు. “వీడి వివేకం చూడు! అంటుకట్టాడు. ఇప్పటికే అందులో పండ్లు కూడా కాసాయి” అన్నారు.
ఒక రోజు కాయలతో నిండిన ఉసిరి కొమ్మను తుంచి మాతృదేవికిచ్చాను. కానీ కొమ్మను తుంచడం మాతృదేవికి ఎంతో బాధ కలిగించింది. అందులోనూ ఉసిరి కొమ్మను విరగగొట్టడం ఆమె ఇష్టపడలేదు. ఈ ఉసిరిచెట్టు ఆమోదర్ నదీ తీరంలో ఉంది. దీని క్రిందనే శరత్ మహరాజ్, యోగీన్ మా, గోలాప్ మా ప్రభృతులు ధ్యానం చేసేవారు. శరత్ మహరాజ్ గీతా పారాయణ కూడా చేసేవారు. మాతృదేవి ఇంకా ఇలా అన్నారు: “ఉసిరిచెట్టు క్రింద ముప్పై మూడు కోట్లమంది దేవతలు వాసం చేస్తారు. ఉసిరిచెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం ఎంతో ఫలదాయకం.” తరువాత నేను తీసుకెళ్లిన ఉసిరి కొమ్మ నుండి ఆకులను త్రుంచి, “బిల్వపత్రాలలా ఉసిరి ఆకులు కూడా పూజకు ఉపయోగపడతాయి” అన్నారు.
ఒక రోజు పుణ్యపుకూరు ఉత్తర తీరంలోని తోటలో నేనూ జ్ఞాన్ మహరాజూ అరటి చెట్లు నాటాం. ఉదయమే పని మొదలుపెట్టాం. ఆలస్యం కాగా మాతృదేవి కొలను తీరం దగ్గర నిలబడి మమ్మల్ని భోజనానికి పిలిచారు. “వస్తున్నాం” అని చెప్పి మేము పని కొనసాగించాం, ఇంకా ఆలస్యమవడం చూసి మాతృదేవి, “అన్నం తిని తర్వాత పని కొనసాగించండి” అంటూ మళ్లీ పిలిచారు. మాతృదేవి పిలుస్తున్నారని నేను తొందరపడ్డాను. కానీ జ్ఞాన్ మహరాజ్ నన్ను వెళ్లనివ్వలేదు. మాతృదేవి మూడవసారి పిలిచినప్పుడు నేను, జ్ఞాన్ మహరాజ్‌ను పట్టించుకోకుండా పారను విసరివేసి పరుగెత్తాను. “ఇంకా కొంత పని మాత్రమే మిగిలింది. పూర్తిచేసి ఇద్దరం కలిసి వెళదాం” అని ఆయన చెబుతున్నా నేను పట్టించుకోలేదు.
నేను రావడంతో మాతృదేవి ఎంతో సంతోషించారు. “జ్ఞాన్ బెంగాలీ, మొండిమనిషి. ఎవరి మాటా వినడు. నువ్వు కాళ్లూ చేతులు కడుగుకొనిరా! అన్నం తిందువుగాని” అన్నారు. అప్పుడు అక్కడికి వచ్చిన నళిని, “ఛీ ఛీ! తోటపని చేసి స్నానం చేయకుండా భోజనానికి కూర్చున్నావా?” అంటూ ఈసడించింది. మాతృదేవి ఆమెను చీవాట్లు పెట్టారు. “నువ్వు నోరు మూసుకో. వాళ్లు పసివాళ్లు. ఎప్పుడూ పవిత్రమయినవారు. దేనివలనా కళంకితులు కారు. నీ మనస్సు మలినమైవుంది. కనుకనే ఇలా అశుద్ధం అశుద్ధం అంటూ పాకులాడుతున్నావు.” నేను భోజనం చేశాను. మాతృదేవి చాలా సంతోషించారు.
ఆ రోజుల్లో జయరాంబాటిలో చదవడం, వ్రాయడం నేర్చిన వారు చాలా అరుదు. మొత్తం ఇద్దరు, ముగ్గురు స్త్రీలు మాత్రమే వారి పేర్లను వంగభాషలో వ్రాయ గలిగినంత చదువుకున్నారు. “బానర్జీ ఇంటి అమ్మాయి వచ్చింది. ఆమె కలకత్తా అమ్మాయి. గడియారానికి కీ ఇవ్వడం ఆమెకు తెలుసు” అంటూ ఆమెను పరిచయం చేసేవారు మాతృదేవి. ఆమె దృష్టిలో ఎంతో వివేకవంతులైతేనే గడియారానికి కీ ఇవ్వగలరు. బి.ఏ, ; ఎం.ఏ.; చదివిన స్త్రీలనో, చేతిలో గడియారం కట్టుకున్న స్త్రీలనో మాతృదేవి చూసింది లేదు.
లాంతరు దీపపు చిమ్నీని తీసి శుభ్రం చేయడం మాతృదేవికి తెలియదు. “అవన్నీ నువ్వు చేయి నాయనా! అందులో ఏవేవో ఉన్నాయి. వాటి నన్నిటినీ తీయడం నాకు రాదు” అని నాతో చెప్పేవారు.
మాతృదేవికి చదవడం, రాయడం అంతగా తెలియకపోయినా ఆధ్యాత్మిక విషయాలలో వారికున్న బుద్ధిసూక్ష్మత ఆశ్చర్యపరచేది. ఆధ్యాత్మిక విషయాలలో ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం ఇవ్వకుండా ఉన్నది లేదు: చదువుకొన్న సన్న్యాసులు అనేకులు మఠంలోవున్నారు. వారి నడిగి తెలుసుకోండి అని చెప్పింది కూడా లేదు. ప్రశ్న ఎలాంటిదైనా సమాధానం సూటిగా వచ్చేది. ఆ సమాధానంతో అక్కడున్న అందరి సందేహమూ నివృత్తి అయేది. కొన్ని సమయాల్లో మాతృదేవిని పలువురు అడిగే ప్రశ్నలు ఆ వయస్సులో నాకు అర్థమయ్యేదికాదు. అలాగే మాతృదేవి సమాధానాలు కూడా నాకు అర్థం అయ్యేవి కావు. కానీ ప్రశ్న అడిగినవారు మాతృదేవి సమాధానంతో ఎంతో తృప్తి చెందేవారు.
‘ఉద్బోధన్,’ ‘తత్త్వమసి’ లాంటి పత్రికలు మాతృదేవికి రావడం కద్దు. ఉద్బోధన్ రాగానే, “శరత్ రాసిందేమైనా అందులో వచ్చిందా?” అని అడిగేవారు. ఏదైనావుంటే దానిని చదవమని చెప్పి వినేవారు. ఒకసారి తత్త్వమంజరిలో ఒక సంస్కృత స్తోత్రం అచ్చయింది. దానిని చదివినప్పుడు అందుకు అర్థం ఏమిటని అడిగారు. ‘దేశికేంద్రం’ లాంటి పదాలకు అర్థం నాకు తెలియదు. పక్కన నిఘంటువు కూడా లేదు. అన్ని పదాలూ నాకు అర్థంకాలేదు. “ఎవరైనా పండితులను అడిగి చెబుతాను” అన్నాను నేను. కానీ మాతృదేవి, “ఫరవాలేదు. నీకు తెలిసింది చెప్పు అది చాలు” అనేవారు.
చిన్న చిన్న విషయాల్లో కూడా మాతృదేవి ఎంతో జాగ్రత్తపడేవారు. ఒక రోజు నేను విస్తళ్లు వేస్తున్నాను. విస్తళ్ల మీద కొద్దిగా నీళ్లు చల్లి, వాటిని విదిలించి విస్తళ్లు పరిచాను. అప్పుడు మాతృదేవి, “ఇవి పిల్లలు భోజనం చేసే విస్తళ్లుకదా! చక్కగా కడుగు! లేకపోతే దుమ్ము ఉంటుంది. నాకు శక్తి ఉన్నంత దాకా ఒక్కొక్క విస్తరినీ కడిగి తుడిచేదానను” అన్నారు.
ఒక రోజు ఆసనాలు పరుస్తున్నాను. తమ గది నుండి గమనిస్తున్న మాతృదేవి “తిన్నగా లేదు” అన్నారు. నేను అటూ ఇటూ కొద్దిగా మార్పులు చేశాను, “ఇప్పుడు కూడా తిన్నగా లేదు” అన్నారు. ఎక్కడ తప్పు చేస్తున్నానో నాకు తెలియలేదు. మాతృదేవి స్వయంగా ఒక్కటొక్కటిగా సరిదిద్దారు, ఆ తర్వాత ఒకచోట నుండి నిలబడి చూస్తే అవన్నీ ఒకే వరుసలో ఉన్నట్లు తెలుసుకున్నాను.
ఒక రోజు కాశీ నుండి ఒక సాధువు ఒక పెద్ద బిల్వఫలం తెచ్చాడు. మాతృదేవి దానిని తమ మంచం కింద ఉంచారు. నళిని ఇంటి వసారాలో కూర్చొని మాతృదేవితో కలిసి నేను కూడా కూరగాయలు తరుగుతున్నాను. తరిగిన తర్వాత మాతృదేవి నాతో మంచం క్రింద ఉంచిన బిల్వఫలాన్ని తెమ్మన్నారు. అంతపెద్ద బిల్వఫలాన్ని నేను చూసింది లేదు. అందువలన మంచానికి క్రింద ఉన్నది గుమ్మడికాయ అనుకొని “మీ మంచం క్రింద బిల్వఫలం లేదమ్మా!” అన్నాను. “నేనే ఉంచాను. అది ఎక్కడికి పోతుంది? బాగా వెతకి చూడు” అన్నారు. “అవునమ్మా! ఒక గుమ్మడికాయ ఉంది” అన్నాను. మాతృదేవి పెద్దగా నవ్వుతూ, “సరే! ఆ గుమ్మడికాయనే తీసుకురా!” అన్నారు. నేను చేతిలోకి తీసుకున్నప్పుడు అది బిల్వఫలం అని తెలుసుకున్నాను. అప్పుడు మాతృదేవి పడిపడి నవ్వసాగారు.
ఒక రోజు మాతృదేవి పెట్టెలో ఉన్న గుడ్డలను బయటికి తీసి ఎండలో ఆర వేశాను. చిరిగిపోయిన అస్సాం పట్టువస్త్ర మొకటి అందులో ఉంది. దానిని తీసి మాతృదేవికి చూపిస్తూ, “అమ్మా, ఇది చిరిగిపోయింది. దీనిని పారేయనా?” అని అడిగాను. మాతృదేవి నన్ను వారిస్తూ, “వద్దు నాయనా! చాలా ప్రేమతో నా కుమార్తె ఇచ్చింది. చాలా రోజులు దానిని ఉపయోగించాను కూడా” అన్నారు. ఆ అమ్మాయి సోదరి నివేదిత. ఆమెను మాతృదేవి ఎంతగానో ప్రేమించారు.
మొట్టమొదటిసారిగా నివేదితను మాతృదేవి వద్దకు పంపించినప్పుడు స్వామీజీ ఎంతో భయపడ్డారు. మాతృదేవి గ్రామీణ స్త్రీ. అందువలన నివేదితను మ్లేచ్ఛ స్త్రీ అంటూ దూరంగా ఉంచేస్తారేమో అని అనుకున్నారు. మాతృదేవికి ఆంగ్లభాష రాదు. నివేదితకు వంగభాష రాదు. అందువలన భాషానువాదం కోసం స్వరూపానందను వెంటపంపారు. ఆయన నివేదితను పరిచయం చేసిన వెంటనే మాతృదేవి ఎంతో ఆనందించారు. “నీ పేరేమిటి?” అని అడిగారు. “మార్గరెట్ ఎలిజబెత్ నోబల్” అంది నివేదిత. అప్పుడు మాతృదేవి, “అమ్మాయీ! ఇంత పెద్ద పేరును నేను జ్ఞాపకముంచుకోలేను. అందువలన ‘అమ్మాయీ!’ అంటూనే పిలుస్తాను” అన్నారు. “సరే! అది సరే! నేను మాతృదేవి అమ్మాయినే కదా!” అంది నివేదిత. “మాతృదేవి నా తలపై చేయిపెట్టి ఆశీర్వదించారు. పాదాలను తాకి ప్రణమిల్లడానికి అనుమతించారు. ‘అమ్మాయీ!’ అంటూ పిలుస్తానని అన్నారు” అని చెప్పి ఆనందించింది నివేదిత. మాతృదేవితో స్వయంగా మాట్లాడడం కోసమే వంగభాష నేర్చుకుంది నివేదిత.