ఉద్బోధన్ పూజగదిలో రాధాకృష్ణుడు, మాతృదేవి తెచ్చిన గోపాల్, జగద్ధాత్రి కవచం, యోగిన్ మా తెచ్చిన ఇద్దరు కృష్ణులు, బాణేశ్వరుడు, గోవర్ధనగిరి నుండి తెచ్చిన రెండు శిలలు, కపిల్ మహరాజ్ తెచ్చిన కాళి, గురుదేవుల ఛాయాచిత్రం మొదలైన దైవాలు చోటు చేసుకున్నాయి. ఎలా పూజచేయాలో తెలియక కలవరపడ్డాను. ఇంట్లో అనేక దైవాలకు చేసిన పూజనే ఇక్కడ కూడా చేశాను. అయినా మాతృదేవి జయరాంబాటి నుంచి వచ్చిన వెంటనే ఈ విషయమై ఆమెను ప్రశ్నించాను.
నేను: అమ్మా, ఈ దేవతల నందరినీ ఎలా పూజించాలి?
మాతృదేవి: ఇప్పుడు ఎలా పూజ చేస్తున్నావు?
మా అమ్మమ్మ పలుదేవతలకు సంబంధించిన మంత్రాలను నేర్పించారు. వాటిని మాతృదేవికి చెప్పాను.
మాతృదేవి: అన్ని పూజలకూ నీ ఇష్టదైవ మంత్రపు బీజమంత్రాన్నే ఉపయో గించు. సకల దైవాలుగా అలరారుతున్నది నీ ఇష్టదైవమే కదా!
తరువాత ఇష్టదైవ బీజమంత్రాన్ని ఇతర దేవతా నామంతో కలిపి ‘నమః’ అనే పదాన్ని చేర్చి పూజకు ఎలా ఉపయోగించాలో మాతృదేవి నాకు నేర్పించారు. పిదప ఇలా అన్నారు:
“ఏ దేవతనన్నా పూజించాలని అనిపిస్తే గురుదేవుల దివ్యరూపాన్ని పూజిస్తే చాలు, ఎందుకంటే ఇష్టదైవమూ ఆయనా ఒక్కరే. ఆయన సర్వదేవ దేవీ స్వరూపులు.”
ఉద్బోధన్లో ఒక రోజు చందనం నూరుతున్నాను, మాతృదేవి తమ గదిలో కూర్చొని జపమాలతో జపం చేసుకుంటున్నారు. మరెవరూ అక్కడ లేనందువలన మాతృదేవిని కొన్ని సందేహాల గురించి అడిగాను.
నేను: అమ్మా! కొన్ని సమయాల్లో మనస్సు బలహీనమైపోతుంది. ఎందువలన?
మాతృదేవి: దానిని గురించి ఆందోళనపడకు. ఒక్క గురుదేవులు తప్ప తక్కిన ఎవరి మనస్సుల్లో బలహీనత లేకుండాపోయింది! ఎప్పుడైనా ఒక్కసారి సైతం బలహీనత తలెత్తని మహాపురుషులు ఎవరైనా ఇప్పటి దాకా జన్మించారా? ‘నా మనస్సు బలహీనంగావుంది’ అని గ్రహింపగలిగితే, బలహీనత నుండి విడివడడానికి ప్రయత్నం జరిగివుంటే, అదే గొప్ప విషయం! ప్రయత్నం చేసేవాడి పట్ల మహామాయ ప్రసన్నమవుతుంది, దారి ఇస్తుంది. కొన్ని రోజులు మనస్సు ప్రసన్నంగా ఉన్నప్పుడు వెంటనే, ‘నాకు అంతా సరిపోయింది’ అని భావించుకుంటారు. ఇంకా ముందుకు సాగాలి అనే ప్రయత్నం మానుకుంటారు.
కానీ వివేకి మనస్సులో కూడా అప్పుడప్పుడు బలహీనత చోటుచేసుకోవడం కద్దు. ఆ బలహీనతను ప్రసాదించేది భగవంతుడే. ‘నీ సాధన ఇంకా పూర్తికాలేదు. జాగ్రత్తగావుండు. నలువైపులా భూతప్రేతాలు కాచుకొని ఉన్నాయి. సందర్భం దొరికితేచాలు, అవన్నీ వచ్చి నీ భుజాల మీద కూర్చుంటాయి. అందువలన ప్రయత్నం మానకు!’ అనే విషయాన్ని దీని మూలంగా వారు జ్ఞాపకం తెచ్చుకొంటారు.
ఇలా బలహీనత రావడం వలన అహంకారం నశిస్తుంది. సదా అప్రమత్తంగా మసలుకో. గురుదేవులను శరణుజొచ్చి జీవితం సాగించు. అహంకారం ఉన్నందు వలననే బలహీనత అదీ ఇదీ మనస్సులో తలెత్తుతాయి. చివరకు శరణాగతి పొంది జీవనం సాగించు. గురుదేవులకే ఒకసారి కామోద్రేకం తలెత్తింది, ఇక సామాన్య వ్యక్తుల గురించి చెప్పాలా? అందువలన అహంకారానికి చోటేలేదు.
ఉద్బోధన్లో ఒక సాయంత్రం గురుదేవులను నిద్రపుచ్చుతున్నాను. మాతృదేవి మంచం మీద కూర్చొనివున్నారు,
యోగీన్ మా: ఏం నాయనా! ఈ చోటు ఎలావుంది?
నేను: ఇక్కడ ఒకేలాంటి పని చేయాల్సివుంది. అందువలన మాతృదేవి ఇక్కడ ఉండని సమయాల్లో వట్టిపోయినట్లుగా కనిపిస్తుంది. శాస్త్రాధ్యయనం చేయ డానికి కూడా ఇక్కడ ఆస్కారం లేదు!
మాతృదేవి: గురుదేవుల సేవ కూడా వట్టిపోయినట్లుగా ఉందా? ఎందుకు అలా ఉందని మనస్సును పరిశోధించి చూడాలి. ఒకే పద్ధతిగా జీవనం సాగిస్తూ మనస్సు దానినే వదలకుండా అంటిపెట్టుకునివుంది. దాని నుండి కాస్త విభిన్నంగా జీవించ నాశించినా మనస్సు ఇష్టపడదు. శరీరమూ, మనస్సూ పాత దారిలోనే పోగోరతాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు గురుదేవులను ప్రార్థించాలి. వట్టి పోవడం నుండి విడివడి ఎలా నీ మనస్సుకు నూతనోత్సాహం కలిగిస్తారో అప్పుడు చూడగలవు.
సాధన తొలి దశలో రాత్రింబవళ్లు పరిశోధనలు చేయడం మంచిది కాదు. ఇలాంటి పరిశోధన మనస్సును వట్టిపోయేలా చేస్తుంది. గురుదేవుల దివ్యమయ జీవితం గురించి యోచించు. అప్పుడు మనస్సు మళ్లీ నూతనోత్సాహం పొందడం చూడగలవు. శరత్ ఎంత చక్కగా, ‘శీరామకృష్ణ పరమహంస’ గ్రంథం రచించాడు. ‘మ’ వ్రాసిన ‘శ్రీరామకృష్ణ కథామృతం’ వింటూవున్నప్పుడు ఎంత మనశ్శాంతి కలుగుతుంది! అక్షయమాస్టరు వ్రాసిన ‘పుంథీ’ గ్రంథం రోజూ కాస్త చదువు. సమయం దొరికినప్పుడు నేను కూడా రోజూ అందులో కొంత చదివించుకొని వినేదానను!’
ఉద్బోధన్లో క్రింద నుండి పెద్దగా శబ్దం వినబడింది. అది విన్న గోలాప్ మా మాతృదేవితో ఇలా అన్నారు:
“మీరు మీ శిష్యులను అదుపులో పెట్టుకోవడం లేదు. గురుదేవులు తమ శిష్యులను ఎంత అదుపులో ఉంచేవారు. ఒక్క అడుగు ఇటూ అటూ వేయడానికి ఎవరికైనా ధైర్యం ఉండేదా?”
మాతృదేవి: నాకేం తెలుసమ్మా! నేను ఎవరి లోటుపాట్లనూ చూడలేను. ఇక అదుపులో ఉంచుకోవడం ఎలా? నేను ఒక తల్లిని. నేను ఎలా అదుపులో పెట్టు కోగలను? ఎలాగో వారిని పరిశుద్ధులుగా చేసి స్వీకరిస్తాను. వారందరూ గురుదేవుల సంతానం, వారిని అదుపులో ఉండాలని నేనెలాచెప్పను? వారు సహజంగానే అంద రినీ క్రమబద్ధం చేశారు. వారి సరళ, సహజ ప్రేమ వలన అంతా చక్కబడింది, మన గురుదేవులు ప్రేమమయులు. ఆయన వద్ద కటుత్వమూ, మొరటుతనమూ ఏదీ లేదు. “ఇందుకు ప్రతిఫలం భగవంతుడు నీకు తప్పకుండా ఇస్తాడు” అంటూ ఎవరైనా మరొకరితో కటువుగా చెబితే నేను వెంటనే గురుదేవులను ప్రార్థిస్తాను, “ప్రభూ! మంచివారికీ, చెడ్డవారికీ కూడా మంచినే చేయండి” అని వేడుకొంటాను, నా సంతానంతో చెప్పేదిదే: ఎవరినీ బాధ పెట్టకండి! కీడు చేసిన వారిని దండించమని భగవంతుని ప్రార్థించకండి! బదులుగా కీడు చేసిన వానికి కూడా మంచి జరగాలని ప్రార్థించండి. భగవంతుని న్యాయత్రాసు సూచి ఎంతో కచ్చితమైనది. ఒక వీసం కూడా అటూ యిటూ పోదు. అదే సమయంలో ఆయన కరుణకు కూడా అంతులేదు.
ఒక భక్తుడు ఎప్పుడూ అలజడిగా ఉండేవాడు. కొంత ప్రశాంతంగా ఉంటూ జపధ్యానాలు అభ్యసించమని మాతృదేవి ఆతడితో ఇలా అన్నారు:
భక్తుడు: మనస్సు అదుపులో ఉండడం లేదు. ఏం చేయాలి?
మాతృదేవి: ధ్యానం కష్టమైనదే. స్త్రీలైన మేము ఎప్పుడూ జపమే చేస్తూంటాం. తన్మూలంగానే అన్నిటినీ పొందుతున్నాం. మీరు కూడా ఈ పద్ధతినే అనుసరించండి. కొద్దిగా ప్రశాంతంగా ఉంటూ జపం చేయాలి. పది, ఇరవైవేల జపం రోజూ చేసి చూడు. మనస్సు ఎలా అదుపులోకి వస్తుందో అప్పుడు నువ్వే చూస్తావు. అంతచేసీ ఏమీ జరగకపోతే నాకు వచ్చి చెప్పు. సాధుసన్న్యాసులను మినహాయించి తక్కిన వారికి ధ్యానం ఎంతో కష్టం. పురుషుడిగా ఉన్నంత మాత్రాన సరిపోదు, మనస్సులో దార్ఢ్యం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. కోర్కెలుడిగిన స్థితీ, భగవంతుని పట్ల ప్రేమా కలుగకపోతే ధ్యానం కుదరడం ఎంతో కష్టం.
‘ధ్యానసిద్ధులలో నాలుగు రకాల వారున్నారు–
- జన్మతః ధ్యానస్థితిని కరతలామలకం చేసుకున్నవారు.
- గురువు వద్ద ఉపదేశం పొంది, పలురకాల సాధనలు చేసి ఆ స్థితిని సంతరించుకొన్నవారు.
- కృపాసిద్ధుడు అని గురుదేవులు పేర్కొనేవారు కదా, అలాంటివారు!గురువు తన అహేతుక కృపతో వారి మనస్సును లౌకికత్వం నుండి విడివడజేస్తారు. నీళ్లలో తామర తేలుతున్నట్లు వారి మనస్సు కూడా తేలుతూవుంటుంది, వీరు కృపాసిద్ధులు.
- గురుదేవులు చెప్పే హఠాత్సిద్ధులు – ఎవరిదో ఆస్తి హఠాత్తుగా సంక్ర మించినట్లు. వీరు కూడా తొలిదశలో తపస్సు చేసినవారే. కానీ ఏదో మనో భ్రమకులోనై, అనేక రోజులు ప్రారబ్ధకర్మను అనుభవిస్తారు. ఈ కర్మ సమసి పోయిన వెంటనే హఠాత్తుగా వీరికి ధ్యానస్థితి కలుగుతుంది. రహదారిలో వెళుతున్నప్పుడు హఠాత్తుగా అమూల్యమైన వజ్రవైడూర్యాలు దొరికినట్లు!
‘గురుదేవులు ఈసారి అనుగ్రహించి లోకకల్యాణం కోసం కఠోర తపస్సు చేశారు. ఆయన వద్ద మిగిలింది ఎముకలూ, చర్మమూ మాత్రమే. వాటితోపాటు ఇతరుల పాపాలు స్వీకరించినందువలన రోగాలు కూడా! ఆయన పట్ల భక్తిశ్రద్ధలూ, విశ్వాసం అలవరచుకుంటే చాలు, ఆయన దివ్యనామం జపిస్తే చాలు, వారి లీలా ధ్యానం చేస్తే చాలు – కుండలినీశక్తి దానంతట అదే జాగృతి పొంది ఆనందంగా ఊర్ధ్వముఖంగా పయనిస్తుంది. ఆయన ఆచరించినట్లు కఠోరమైన తపస్సులు ఆచరించ వలసింది లేదు.
ఇది కలియుగం! సత్యయుగం, త్రేతాయుగం లాగా ఎంతమంది అంత తపస్సు చేయగలుగుతారు? ఇప్పుడు ప్రాణం శరీరాన్ని అంటి పట్టుకొనివుంది. గురుదేవుల దివ్యనామాన్ని జపించు. ఆహారమూ, గుడ్డలూ లాంటి అత్యవసరాలను కూడా ఆయనే ఈడేర్చడం చూస్తావు. గురుదేవుల దివ్యనామాన్ని ఉచ్చరించే ప్రతి వ్యక్తికీ ఎప్పుడూ తిండికి లోటుండదు. మామూలు ఆహారం, బట్టలకు తగిన ఏర్పాట్లు ఆయనే చేసివుంచారు.
గురువర్యుల కృపాకటాక్షమూ, భగవంతుని కృపాకటాక్షమూ లేకుండా ఎవరైనా తమంతట తామే బంధాల నుండి విడివడగలరా? అందువలననే గురుదేవులు కఠోర తపస్సులు ఆచరించి, వాటి ఫలాన్ని రాబోయే భక్తుల కందరికోసమూ సేకరించి ఉంచిపోయారు. వారు అనుగ్రహించి తలుపు వద్దే నిలబడివున్నారు. మీరు చేయాల్సిందల్లా తలుపును తెరవడం మాత్రమే!
భక్తుడు ఆలోచించసాగాడు!
ఈసారి గురుదేవులు వచ్చారు, కఠోర తపస్సు, వ్రతాలు, సాధనలన్నీ అనుష్ఠించి, భక్తుల కోసమూ, పారమార్థికతను అనుసరించే వారికీ సేకరించి ఉంచిపోయారు. వారి కథామృతమే ఇక్కడ మళ్లీ మారుమ్రోగుతూవుంది. ఆయన పట్ల విశ్వాసమున్న వారికి సరళసాధన, తపస్సు చాలు. రామకృష్ణ నామం విన్నమాత్రాన కుండలినీశక్తి ఆనందంగా, దానంతట అదే జాగృతి పొందుతుంది. తెల్లవారింది, లేవండి. తలుపులు తెరచిచూడండి, మీ ముందే ఉదయ సూర్యుడు కానవస్తాడు.
ఒకసారి నాకు బాగా జ్వరం (Influenza) వచ్చింది. ఆ సందర్భంలో మాతృదేవితో ఇలా అన్నాను:
నేను: అమ్మా! ఎలాగూ మనస్సు అదుపులోకి రాకుండా చంచలంగా తిరుగుతూ వుంటుంది, ఇప్పుడు శరీరం కూడా వ్యాధిగ్రస్థమవడంతో మనస్సు జపధ్యానాల జోలికే వెళ్లనంటూవుంది.
మాతృదేవి: ఇదిగోచూడు! మనస్సును రెండుగా విభజించాలి. దాన్లో ఒకటి వివేక మనస్సు. రెండవది ఆడుకునే బాలుని లాంటి వివేకహీనమైన మనస్సు. తల్లితండ్రులు ఆడుకుంటూవున్న పిల్లలను ఎలా పర్యవేక్షిస్తూవుంటారో, అలాగే వివేక మనస్సు, వివేకరహితమైన మనస్సును పర్యవేక్షిస్తూ ఉండేట్లు చేయాలి. కొద్దిగా మారాం చేసినా దానిని వెంటనే అదుపులోకి తేవాలి, కోప్పడాలి, గద్దించాలి! మొండికేసే పిల్లలను తల్లితండ్రులు తిట్టడం నువ్వు చూడలేదా? అదే విధంగా! ఇలా కొన్ని రోజులు అభ్యాసం చేస్తే మనస్సు గుణపాఠం నేర్చుకుని, దారికి వచ్చేస్తుంది.
కానీ ఏదో ఒక విషయాన్ని ఏకధాటిగా చేయడం వలన ఈ వివేకహీనమైన మనస్సులో ఒక గాఢమైన సంస్కారం రూపుదిద్దుకుంటే నువ్వు వేయిసార్లు కాదన్నా మనస్సు దారికి రాదు. అలాంటి సమయంలో ప్రార్థనను కూడా ఆశ్రయించాలి. బలహీనమైన ఆ మనస్సు కోసం గురుదేవులను ప్రార్థించాలి. మార్గాంతరం లేదు. ఆయన భగవంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఒక మూసను పగులగొట్టి మరొక మూసతో మనలను రూపొందించగల సమర్థుడు ఆయన. గురుదేవుల ఇచ్ఛకు మనుషుల మనస్సులు కేవలం బంకమట్టి ఉండలుగా అయిపోవడాన్ని, వారు ఎవరిని ఎలా తీర్చిదిద్దాలని అనుకుంటారో అలాగే తీర్చి దిద్దడాన్ని స్వయంగా నేను చూసివున్నాను.
రాసబిహారి మహరాజ్తో మాతృదేవి ఒకసారి ఇలా అన్నారు: “ఈ లోకం కల లాంటిది, పారవశ్యస్థితి, భగవంతుని లీల లాంటి వన్నీ కలే సుమా! నువ్వు నాతో మాట్లాడుతున్నావు – ఇది కూడా కలే! గురుదేవులు మాత్రమే యథార్థం.”
నేను: ఐదు కోశాలు* పోయిన పిదప గురుదేవులు భగవంతునిలో ఐక్యమ య్యారు, లీలాశరీరం (భక్తులతో గురుదేవులు వ్యవహరించే దివ్యశరీరం) గురించి చెప్పబడిందే, అదేమిటి?
మాతృదేవి: సచ్చిదానందమే ఆయన స్వరూపం. కానీ అప్పుడప్పుడు దివ్యశరీరాన్ని రూపొందించి భక్తులతో క్రీడిస్తారు.
1915. జగద్ధాత్రి పూజా సమయమది. బంకురాలో కరవు నివారణ కార్య కలాపాలలో మునిగివున్న నేను మాతృదేవి దర్శనానికి జయరాంబాటి వెళ్లాను.
ఒక రోజు మేము భోజనం చేస్తున్నప్పుడు మాతృదేవి పక్కన కూర్చున్నారు. ఎవరో వడ్డించారు. మాతృదేవి నవ్వుతూ ఇలా అన్నారు:
“ఇదిగో చూడు, గురుదేవులు వచ్చారు. ఆయన అనుగ్రహంతో బాలురకు కూడా ఆధ్యాత్మిక నేత్రం తెరచుకొంది. తల్లితండ్రులను వదలిపెట్టి వచ్చి గురుదేవుల సేవలు ఒనరిస్తున్నారు! గురుదేవుల కృపాకటాక్షం లేకుండా సంసార జీవితాన్ని త్యజించడం సాధ్యమా! ఇప్పుడు మేమే వారి బంధు బాంధవులం. వారి బంధు బాంధవులు అన్యులైపోయారు.”
ఒక రోజు కొందరు భక్తులతో మాతృదేవి ఇలా అన్నారు:
“గురుదేవులు రాకపోయి వుంటే, వారి అహేతుక కరుణాకటాక్షం లేకపోయి వుంటే మాయాబంధం నుండి బయటపడడం ఎవరికన్నా సాధ్యమయ్యేదా? ఆయన కఠోర తపస్సు చేశారు. మానవుల కర్మఫలాన్ని నశింపచేయడానికి ఆ తపోఫలాన్ని దానం చేశారు. ఎన్నో సంవత్సరాల తరువాత పుష్పించవలసిన చెట్లను రాత్రికి రాత్రే పుష్పింపజేయడం మీరు చూడలేదా! మనుషుల పాపాలను స్వీకరించి ఆయన ఎన్ని కష్టాలుపడాల్సి వచ్చింది! కంఠవ్రణంతో ఆయన అనుభవించిన బాధను చూసివుంటే మీకు అర్థమైవుండేది. అన్ని కష్టాలు అనుభవించినా ఆయన లోకకల్యాణాన్నే కోరారు. మాట్లాడడం ఆయన ఆపలేదు. ఎవరైనా తమ వద్దకు రాకపోతే కలత చెందేవారు.”
‘స్వర్గ ద్వారం’, ‘గుర్రపు నడక’* లాంటి ఆటల అట్టలను ఒకడు ఒక రోజు ఉద్బోధన్ వీథిలో నిలబడి విక్రయిస్తున్నాడు. రాధూ నాతో “వాణ్ణి పిలవండి, నాకు ఆ ఆటల అట్టలు కావాలి” అంది. ‘గుర్రపు నడక’ అనే ఆటను చూసిన మాతృదేవి “ఇదేమిటి కొత్తగా ఉందే” అన్నారు. రాధూ దానిని వివరించి “ఈ ఆటలో చివరి ఘట్టం చేరుకోవడం చాలా కష్టం” అని చెప్పింది. మాతృదేవి దానిని పరికించి చూసి కాసేపు గాఢంగా ఆలోచించారు, తరువాత చిరునవ్వుతో ఇలా అన్నారు:
“జీవితం కూడా ఇటువంటిదే! చిట్టచివరి ఘట్టమే చాలా కఠినమైనది. జీవితమంతా సాఫీగా సాగిపోతుంది, కాని చివరి రోజులలోనే వ్యాధులు, శోక తాపాలు, కలతలు, కన్నీళ్లు – అన్నీ! ఓహ్! ఎంతకష్టం! ప్రారబ్ధకర్మ తీరే తరుణం కదా! అందువల్లనే అన్ని దుఃఖాలు, కష్టాలు! గురుదేవుల అనుగ్రహంతో చివరి ఘట్టం చక్కగా జరుగుతుంది. ఆయనను శరణు జొచ్చేవారి ప్రారబ్ధ కర్మలను వారు తెంచేస్తారు. వారిది ఎలాంటి కరుణా! ఆయన కపాలమోచనులు* . కానీ కొందరి ప్రారబ్ధం చాలా శక్తివంతమైనదై ఉంటుంది. వాళ్లు కొద్దిగా అనుభవించే తీరాలి. ఆ తరువాతే అంతా చక్కబడుతుంది.”
ఒక భక్తురాలు ఆ ‘స్వర్గ ద్వారం’ ఆటను ఉత్సాహంతో చాలాసేపు చూసింది. తరువాత మాతృదేవితో, “అమ్మా! ఇలా చాలా లోకాలు నిజంగానే ఉన్నాయా?” అని అడిగింది.
మాతృదేవి: నిశ్చయంగా ఉన్నాయి! అజ్ఞానం ఉన్నంతదాకా ఈ మాయాజాల ఆట కూడా సాగుతూ ఉంటుంది. భగవత్సాక్షాత్కారం లభిస్తే ఈ లోకాలన్నీ నీడలా కనుమరుగైపోతాయి, అప్పుడు భగవంతుడొక్కడే యథార్థం, తక్కిన వేవీ కాదు.
భక్తురాలు: ఈ లోకాలకు ఎలా వెళతారు?
మాతృదేవి: స్థూలశరీరం పతనమయిన తరువాత ప్రారబ్ధానికి తగినట్లు సూక్ష్మశరీరం ఈ మంచి, చెడు లోకాలకు వెళుతుంది. అజ్ఞానంలోని వ్యక్తి ఈ సూక్ష్మశరీరపు పయనాన్ని తన పయనంగా భావిస్తాడు. చూడు, మనస్సు కలగంటుంది. అప్పుడు బయటవున్న ఈ యథార్థమైన లోకం మాయమైపోతుంది. స్వప్న ప్రపంచమే యథార్థంగా కనబడుతుంది.
భక్తురాలు: నిద్ర నుండి మేల్కొన్నప్పుడు మనం జాగృతి పొందుతాం. అజ్ఞాన మనే నిద్ర కూడా భంగమవుతుందా?
మాతృదేవి: సంస్కారాల కారణంగానే జాగ్రదావస్థ అనుభవిస్తున్నాం. స్వప్న లోకం కూడా సంస్కారాల పర్యవసానమే. ఇతర లోకాలు కూడా సంస్కారాల పర్యవసానమే. ఈ లోకంలో యావత్తూ అనిత్యం. ఒక రోజు కాకపోతే మరోరోజు అవి నశించే తీరతాయి. అప్పుడు అజ్ఞానమనే నిద్ర భంగమవుతుంది.
భక్తురాలు: సంస్కారం నశిస్తే మళ్లీ ఎందుకు జన్మ కలుగుతుంది?
మాతృదేవి: సంస్కార మనేది సామాన్య విషయమా ఏమిటి? అసంఖ్యాకమైన జన్మలలోని అసంఖ్యాకాలైన సంస్కారాలు మనస్సులో ఉన్నాయి. ఒక గుంపు నశిస్తే మరొక గుంపు వస్తుంది – రక్తబీజ దానవునిలా.
భక్తురాలు: అలా అయితే ఈ సంస్కారాల బారి నుండి తప్పించుకోవడం ఎలా?
మాతృదేవి: కోర్కెల నన్నిటినీ త్యజించి ఎవరైతే సచ్చిదానంద పరబ్రహ్మాన్ని మాత్రం ఆశ్రయిస్తారో వారే ముక్తులవుతారు. కోర్కెలే సంస్కారాలను తలెత్తనిస్తాయి!
భక్తురాలు: సచ్చిదానంద పరబ్రహ్మంలో మనస్సును లగ్నం చేయడం ఎలా?
మాతృదేవి: ఆయన ఎప్పుడు మనలను ఆకర్షిస్తారో అప్పుడే మనస్సు ఆయన పట్ల ఆకర్షితమవుతుంది.
భక్తురాలు: ఆయన మనలను ఎందుకు ఆకర్షించడం లేదు?
మాతృదేవి: ఆయన సర్వస్వతంత్రులు. ఆయన దివ్యలీల ఎలాంటి శాసనాలకూ లోబడింది కాదు. ఆయన ఇచ్ఛానుసారమే ప్రవర్తిస్తారు. ఆయన ఇచ్ఛ ఉంటే మాయ మనిషిని బంధించకుండా వదిలేస్తుంది. “శిశువు లాంటి స్వభావం గలవాడు భగవంతుడు” అనేవారు గురుదేవులు. శిశువు ఇష్టపడని వానికి ఇచ్చేస్తుంది, ఇష్టపడే వానికి ఇవ్వదు.
భక్తురాలు: అలా అయితే మన కర్తవ్యమేమిటి?
మాతృదేవి: ఆయన అనుగ్రహానికై ఎదురుచూస్తూ ఉండడమే! ఆయన ఆనతి ప్రకారం ప్రవర్తించడం. ఆయన ప్రతి యుగంలోనూ అవతరించి ఎన్నో ఉపదేశాలు చేస్తున్నారు కదా! కానీ ఆ ప్రకారం ఆచరించే వారెందరు? గురుదేవుల త్యాగం, వైరాగ్యం, సాధనలు, తపస్సు, ఉపదేశం అన్నీ నీ కళ్లముందే చూశావు, విన్నావు. ఇప్పుడు కర్తవ్యమేమిటో నీ చేతుల్లో ఉంది. “ఒక్క పాలు ఆచరిస్తేచాలు నీకు సద్గతి ప్రాప్తిస్తుంది”* అని గురుదేవులు చెప్పింది జ్ఞాపకం లేదా?
భక్తురాలు (మాతృదేవికి ప్రణమిల్లి) : అమ్మా! మీరు అనుగ్రహించక పోతే ఏమీ జరగదు.
మాతృదేవి (నవ్వుతూ) : మీకందరికీ శ్రేయస్సు కలుగుగాక!
1918. కపిల్ మహరాజ్ వ్యాధిగ్రస్థుడయినప్పుడు ఉద్బోధన్లో పూజ కోసం నన్ను పంపించారు. ఒక రోజు సాయంత్రం ఆరాత్రికం తరువాత ధ్యానం చేయడానికి కూర్చున్నాను. క్రింద ప్రపంచ యుద్ధం గురించి తీవ్రమైన చర్చ సాగుతూన్నది. మనస్సు ధ్యానంలో మగ్నం కాలేదు. కాస్త దూరంలో మాతృదేవి కూర్చొనివున్నారు. రాధూ మాతృదేవిని ఏదేదో అడగసాగింది. బేలూరు మఠంలో నెలకొనే ప్రశాంతతలో కించిత్తు కూడా ఇక్కడ లేదు. కళ్ల కెదురుగానే గురువు కూర్చుని ఉన్నా నా మనస్సు ప్రశాంతతలేక పరితపించింది. ‘నే నెక్కడ వచ్చి చేరుకున్నాను? ఎంత గందరగోళం మధ్య ఉంటున్నాను?’ అంటూ మనస్సు చలిం చింది. ఆ సమయంలో రాధూ, మాతృదేవితో, “అమ్మా! వెళ్లిపోదాం! జయరాంబాటికి వెళ్లిపోదాం” అంది. అందుకు మాతృదేవి, “చెప్పిన వెంటనే జరిగిపోతుందా? భగవంతుడు మనలను ఎక్కడ ఉంచితే అక్కడే ఉండాలి” అన్నారు. ఇది నన్ను ఉద్దేశించినట్లుగా అనిపించింది. నిజమే కదా! భగవంతుని ఇచ్ఛకు మనల్ని మనం అర్పించుకొని, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని ఉంచినా అన్నిటినీ సహించి పడివుండాలి.
గురుపూర్ణిమ రోజు. ఆ రోజుల్లో ఉద్బోధన్లో పూజారిగా ఉంటున్నాను. ఉదయం పది గంటలయివుంటుంది. గురుదేవులకు విసురుతున్నాను. పండ్లు, పూలు మొదలైనవి తీసుకుని బేలూరు మఠం నుండి సాధువులు, బ్రహ్మచారులు మాతృదేవి దర్శనార్థం వచ్చారు. వారందరూ మాతృదేవికి ప్రణమిల్లి వెళ్లిపోయిన పిదప ఆమె ఇలా అన్నారు:
“ఇదిగో చూడు, అంతా గురుదేవుల శక్తి. ఆయన ఆకర్షిస్తూవుండడం వలన అందరూ వస్తున్నారు. సూర్యుడు ఉదయించినప్పుడు చంద్రుడు కాంతి హీనమవు తాడు. పౌర్ణమిరోజు చంద్రకాంతిలో పెద్ద నక్షత్రాలు మాత్రమే కనబడతాయి, చంద్రుడు కాస్తా తప్పుకుంటే ఆకాశమంతటా నక్షత్రాలే కనబడతాయి.*
ఒక భక్తుడు: స్త్రీల పరిస్థితి ఏమవుతుంది? నివేదితతో అంతా ముగిసిపోయే టట్లుందే!
మాతృదేవి: అలా ఎందుకు జరగాలి? వాళ్లు కూడా ముక్తులవుతారు, గురుదేవులు కేవలం పురుషుల కోసం మాత్రమే అవతరించారా? స్త్రీల కోసం కూడా. కొందరు వారితో పాటు వచ్చారు, కొందరు వారి నుంచే వచ్చారు, కొందరు ముక్తి పొందడానికి వచ్చారు, ఇంకా అనేకులు రాబోతున్నారు. కొన్ని కోర్కెలు అంటుకొని ఉన్నాయి. లేకపోతే ఎందుకు జన్మించాలి? కొందరిని తమ పని కోసమే తమతో పాటు తీసుకువచ్చారు.
గోలాప్ మా: ఈ విషయం శరత్ను అడిగి తెలుసుకో. ఒక రోజు సుధీర ఒక కలగన్నది. అందులో గురుదేవులు ఒక సభా మధ్యాన కూర్చొనివున్నారు. స్త్రీలూ, పురుషులూ చాలామంది అక్కడ సమావేశమై ఉన్నారు. గురుదేవులు సుధీరను పిలిచి, ‘నా కోసం కొద్దిగా పని చేస్తావా?’ అని అడిగారు. సుధీర సమ్మతించడంతో ఆయన ‘అలా అయితే ఈ తలుపు తెరచి లోనికి వెళ్లు’ అన్నారు. సుధీర తలుపు తెరవగానే ఈ లోకాన్ని చూసిందట.
మాతృదేవి కొనసాగించారు:
“మనుషులు అనుభవించే దుఃఖాన్ని చూసి కొందరు దిగివస్తారు. అలాంటి వారి త్యాగం ఎంత మహత్త్వపూర్ణమయినది! వారిలో ఎక్కడో కొద్దిగా కోర్కె ఉంటుంది. అందువలననే జన్మించాల్సి వచ్చింది. ప్రాణులు అనుభవించే దుఃఖం చూసి జాలి కలిగితే వారి కర్మఫలాన్ని స్వీకరించాల్సి ఉంటుంది అందువలననే జన్మించాల్సి వస్తుంది. కానీ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి. సంసార జీవిత మనేది లోతు తెలియని సముద్రం వంటిది. ఎన్నో ఏనుగులు అందులో మునిగి పోయాయి. ఎంతో అప్రమత్తంగా మసలుకోవాలి.
“గురువు ఎవరు? ఒక వ్యక్తి వర్తమాన, భూత, భవిష్యత్తులను ఎరిగినవాడు. ఈసారి గురుదేవుల అనుగ్రహం వలన వారి కృపా పరిధిలోకి వచ్చిన వారందరికీ ఇదే ఆఖరి జన్మ. వారికి ఇక భయం అక్కరలేదు. వారి నందరినీ అద్భుతంగా మాయ నుండి ఆయనే విడిపిస్తారు. మట్టిగడ్డతోనే మట్టిగడ్డను పగలగొడతారు వారు.* ఆయన కృప వలన ముక్తుడైపోతే, మేఘాలులేని నీలాకాశంలో ఎగిరే పక్షిలా ఆనందంగా ఆయన మహత్త్వాన్ని గానంచేస్తూ సంచరించవచ్చు, శ్రీరామకృష్ణ లోకానికి వెళ్లిపోతే, అక్కడ విశ్రాంతి తీసుకోవడమే ధ్యానంగా అయిపోతుంది. సేవల, తీవ్రసాధనల శ్రమ విలువను నువ్వు అక్కడ గ్రహిస్తావు.
నవకాళిలో వరద నివారణ కార్యక్రమంలో ఉన్న సమయం. ఒక రోజు మాతృదేవితో, “అమ్మా! ఎక్కడెక్కడో తిరిగి రావాల్సివుంది! మీరు కూడా దగ్గరలో లేరు. సంశయమో, మనోచాంచల్యమో కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయించాలో తెలియడం లేదు, అట్టి సమయంలో ఏంచేయాలి?
మాతృదేవి: గురుదేవుల ఛాయా చిత్రాన్ని సదా నీ వద్ద ఉంచుకో! ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటున్నట్లూ, నిన్ను గమనిస్తూ ఉన్నట్లూ భావించు. ఏ సమస్య తలెత్తినా ఆయననే ప్రార్థించు! అందుకు పరిష్కారాన్ని నీ మనస్సుకు ఆయనే స్ఫురింపజేయడం నువ్వు చూస్తావు. ఆయన అంతర్యామిగా కదా ఉన్నారు. కానీ మనస్సు ఎప్పుడూ బాహ్యముఖంగా ఉండడం వలన అది అంతర్ముఖమవదు. అందువలన ఆయనను బాహ్యంగా వెదకుతూ తిరుగుతుంది. నువ్వు దేని కోసం ప్రార్థించినా, నిజానికది నీకు తప్పక కావలసినదైతే, అందుకు సమాధానం లోపల నుండి దానంతట అదే రావడాన్ని చూస్తావు. మనోవాక్కాయాలు ఒక్కటై ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తారు, కావలసింది చేస్తారు. మంచివారికి ఒక విషయాన్ని వందసార్లు చెప్పాలా ఏమిటి?
ఒక రోజు మాతృదేవి ఉద్బోధన్ వసారాలో కూర్చొని సుధీరతో పాఠశాల లోని ఎవరి గురించో మాట్లాడుతున్నారు. మాతృదేవి ఇలా అన్నారు:
“మనిషి తన మనస్సును గురించి తెలుసుకోగోరడు. ఇతరులలో తప్పులు పట్టడానికే ఇచ్చగిస్తాడు. తన తప్పులు తన దృష్టికి వస్తే, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇతరుల తప్పులను చూసే స్వభావం పోతుంది. ఈ స్వభావాన్ని మహామాయ స్వయంగా సృష్టించింది, తనలోవుంటున్న కించిత్తు మంచిని కొండంతగా చూస్తాడు. ఇతరులలోని కొండంత మంచిని కించిత్తుగా చూస్తాడు. తన గొప్పలను లెక్కపెట్టుకుంటూ దాన్లోనే మునిగివుంటాడు. ఇక ఇతరుల విషయం గురించి ఎలా ఆలోచిస్తాడు? ‘అందరూ గురుదేవులకు చెందినవారే’ అనే భావన మనస్సులో ఉంటే అందరినీ ప్రేమించాలని అనిపిస్తుంది. నైవేద్యంలో పడిన చీమలను కూడా వేరు చేయలేని ఒక స్థితి నాకు కలిగింది. “వాటి నోళ్ల ద్వారా గురుదేవులే కదా ఆహారం తీసుకుంటున్నారు’ అని నాకు అనిపించేది. అందరిలోనూ గురుదేవులను చూడలేనప్పుడే ఇలా ఇతరులను నిందించడమూ, ఇతరుల తప్పులు ఎన్నడమూ మనస్సుకు సరైనదిగా తోస్తుంది. తన స్వీయ పెరుగుదలకు ప్రయత్నించని వ్యక్తి ఇతరుల మంచి చెడ్డలను గురించి పరిశోధించే ప్రయత్నంలో ఉంటాడు.”
ఒక స్త్రీ తనకు పరిచయమున్న ఒక వ్యక్తి ఎంతో దుఃఖంతో బాధపడడం చూసి మాతృదేవితో, “ఈ కష్టాల నన్నిటినీ గురుదేవులు పట్టించుకోరా? వారెందుకు మార్గం చూపకున్నారు?” అని అడిగింది.
మాతృదేవి: భగవంతుని ఇచ్ఛ లేకుండా ఏమైనా జరుగుతుందా? చెట్టు ఆకు కూడా ఆయన ఇచ్ఛ లేకుండా రాలదు. జీవరాశులూ, లోకం సాగడమూ ఆయన ఇచ్ఛానుసారమే. వెనుక చైతన్య పదార్థం లేకపోతే ఏ జడపదార్థమైనా పనిచేయగలదా?
స్త్రీ: అలా అయితే ఈ కష్టాలన్నీ ఆయనకు తెలిసే వస్తున్నాయా?
మాతృదేవి: మనిషి చెడ్డపనులు చేసేటప్పుడు భగవదుపదేశాలు ఏవైనా ఆతడి మనస్సులో ఉంటాయా? ఫలానా పనికి ఫలానా పర్యవసానం అంటూ నిర్ణయింపబడింది. అందుకు తగ్గట్లే ఈ లోకాన్ని ఆయన నడిపిస్తున్నారు.
స్త్రీ: కర్మఫలం పట్టు నుండి వ్యక్తి ఎలా తప్పించుకోగలడు? ఇందుకు ప్రాయశ్చిత్తమే లేదా?
మాతృదేవి: ప్రాయశ్చిత్తం లేకపోతే నువ్వు జీవించగలవా? అసంఖ్యాక జన్మలలో ఏర్పడిన కర్మఫలాన్ని నువ్వు చూడగలవా? అది చేయగలిగివుంటే నువ్వు ఇలా మాట్లాడవు. అర్జునుడే తన పూర్వ జన్మల గురించి తెలుసుకోలేకపోయాడు. ఇక సామాన్య వ్యక్తుల మాట వేరే చెప్పాలా!
నియమాన్ని విధించినవాడు దాన్ని మార్చగలడు. అంతమాత్రమే కాకుండా మంచి పనులు చేయడానికి నీకు ప్రోత్సాహమిస్తున్నాడు కదా! మంచి పనులు ఎక్కువగా చేసేకొద్దీ చెడుపనులు తగ్గిపోతాయి కదా! మంచి లేక చెడు పనులను చేయడానికైన స్వాతంత్ర్యాన్ని ఆయన మనకిచ్చారు. లేకపోతే ఈ జీవితం ఎలా సాగుతుంది?
పగ్గం తన చేతులోవున్నా కొంత స్వతంత్రం కూడా ఇచ్చి ఉన్నారు – మంచీ, చెడ్డా రెండూ నీ ఎదుట ఉన్నాయి, నీకు కావాల్సిన దానిని తీసుకో. ఇందులోనే లోకక్రీడ జరుగుతున్నది. ఒకడు పాపం మాత్రం చేసుకుంటూ, మరొకడు పుణ్యం మాత్రం చేసుకుంటూపోతే లోకక్రీడ జరగదు. అమ్మమ్మను తాకగానే ఆట ఆగి పోతుంది. అందరూ తనను తాకడాన్ని అమ్మమ్మ ఇష్టపడదు. ఎవరూ తాకకుండా ఉండడమూ ఇష్టపడదు. రెండింటిలో ఏది జరిగినా ఆట ఆగిపోతుంది.
చెడుపనులకైన పరిహారాలు శాస్త్రాలలో పేర్కొనబడి ఉన్నది. శాంతి, స్వస్త్యయనం, యాగం, యజ్ఞం, దానం, తపస్సు లాంటి పరిహారాలను ఏర్పరచింది వారేకదా!
స్త్రీ: కానీ వీటివలన ఎల్లప్పుడూ పరిహారం జరగడం లేదు కదా!
మాతృదేవి: సరిగ్గా ఆచరిస్తే పరిహారం తప్పకుండా జరుగుతుంది. ప్రతి పనికీ ఫలిత మివ్వడానికి నియమిత కాలవ్యవధి ఉండాలి. మామిడిచెట్టు పూత పూయగానే పండ్లు కాస్తాయా? యజ్ఞయాగాలు చేసిన వెంటనే స్వర్గం నుండి రథం దిగివస్తుందా? కేవలం మాటలతో ఏమైనా జరుగుతుందా? పూలు పూస్తాయి. ఆ పువ్వు నుండి పండు రావడానికి, మంచిదో చెడ్డదో, నియమిత కాలవ్యవధి ఉండాలి.
కానీ ఒక్క విషయం చెబుతాను: మంచీ, చెడూ అంటూ అన్ని పనుల పట్టు నుండి నువ్వు విడివడగోరితే భగవంతుని పవిత్రనామాన్ని జపించు, పూజ చేయి. పారాయణ చేయి. మంచి చెడుల గురించి ఎల్లప్పుడూ పరిశోధన చేయి, మంచి పనుల ఆచరణ ద్వారా చెడు కర్మలను అదుపు చేయవచ్చు. కానీ వాటిని నిర్మూలించలేవు. భగవంతుని పవిత్ర నామం ఒక్కటి మాత్రమే మంచి చెడు కర్మల నన్నిటినీ నిర్మూలించి మనస్సును పవిత్రం చేయగలుగుతుంది. మనస్సు పరిశుద్ధమయినప్పుడు అంతర్గతంగా ఉన్న సత్య వస్తువును గ్రహించవచ్చు.