ఉద్బోధన్
17, బోసుపారా వీథిలోని సోదరి నివేదిత పాఠశాలలో చదువుకుంటున్నప్పుడే నేను మొట్టమొదటిసారిగా మాతృదేవిని దర్శించాను. ఒక రోజు పాఠశాల వదిలాక సోదరి సుధీర మాలో నలుగురైదుగురిని మాతృదేవి ఇంటికి తీసుకువెళ్లింది. అప్పుడు మాతృదేవి పూజగదిలో కూర్చొనివున్నారు. కుసుమ్ ఒక పుస్తకం చదువుతూ ఉంది.
మేం ప్రణమిల్లినప్పుడు మాతృదేవి, “కూర్చోండమ్మా!” అన్నారు. తర్వాత సుధీరతో, “అమ్మాయీ! బాగున్నావా? ఇప్పుడే పాఠశాల మూశారా? ఈ బాలికలు నీ వద్ద చదువుకుంటున్నారా?’ అంటూ అడిగారు.
సుధీర: అవునమ్మా! ఈ బాలికలు మా పాఠశాలలోనే చదువుకుంటున్నారు.
మాతృదేవి: మంచి బాలికలుగా కనబడుతున్నారు. (నన్ను చూపిస్తూ) ఈమె ఎవరి కుమార్తె? చాలా మంచిపిల్లగా కనిపిస్తూవుంది.
సుధీర: ఈమె బ్రాహ్మణ బాలిక. దగ్గరే ఇల్లు!
మాతృదేవి (కుసుమ్‌తో) : నువ్వు చదువు. వీరందరూ వింటారు.
కుసుమ్ చదవసాగింది. ఆమె చదివింది ‘కృష్ణచరితం’ అనుకుంటాను. కృష్ణుడు వెన్న, పాలు దొంగిలించడం గురించి చదివినప్పుడు మాతృదేవీ, తక్కినవారూ నవ్వారు. “ఆకతాయి బాలుడు” అన్నారు మాతృదేవి.
కొంత సేపటికి మమ్మల్ని తీసుకువెళ్లడానికి బండి వచ్చింది. “వెంటనే బయలు దేరుతున్నారా? ఇంకా కొంతసేపు ఉండవచ్చుకదా!’ అన్నారు. సుధీర బదులు చెప్పినప్పుడు, “అలా అయితే ఉదయం రండి” అన్నారు. మేం ప్రసాదం తీసుకొని, మాతృదేవికి ప్రణమిల్లి సెలవు తీసుకున్నాం. “మళ్లీ రండమ్మా” అన్నారు ఆప్యాయంగా మాతృదేవి.
మరొక రోజు సుధీర నన్ను మాతృదేవి వద్దకు తీసుకెళ్లింది. మంచం మీద చాప మాత్రం పరచి పడుకొనివున్నారు మాతృదేవి. మమ్మల్ని చూడగానే “కూర్చోం డమ్మా” అన్నారు. మేం ప్రణమిల్లి, కూర్చున్నాం.
మాతృదేవి: స్కూలు వదిలేశారా? ఇప్పుడు ఎన్ని గంటలయింది?
సుధీర: ఈ రోజు ఉదయమే వదిలేశారు. ఇప్పుడు మూడున్నర గంట లయింది. అందువలననే వీరిని తీసుకువచ్చాను.
మాతృదేవి: మంచిపని చేశావు.
ఒక ఫలానా స్త్రీని గురించిన ప్రస్తావన వచ్చి మాతృదేవి ఇలా అన్నారు:
“ఆమె సంగతి చూడమ్మా! అత్తగారి ఇంటికి వెళ్లదట! నా దగ్గరికొచ్చేసింది. భర్త నల్లగా ఉంటాడట! అందువలన ఆమెకు నచ్చలేదు. నలుపు అయినందువలన ఆతణ్ణి నిరాకరించడమా? ఏది ఏమయినా భర్త కదా! వీళ్లు ఎలాంటి స్త్రీలో నాకు అర్థం కాదు! అతడు మంచివాడు కాదని కూడా అంటున్నారు. ఈమె వెళ్లనని చెప్ప డానికి ఇదీ ఒక కారణం! మంచివాడు కాకపోయినా, ఈమెను ఇంటి నుండి తరిమి కొట్టలేదు కదా! ఏమయినా ఎవరతను? ఆమె భర్త! ఈ స్త్రీలను గురించి నాకు ఏమీ అర్థమవడం లేదమ్మా! వినేవాళ్లు ఏమనుకొంటారు? ఆమె ఇచ్ఛానుసారం చేయనీ.” ఇలా అంటూ మాతృదేవి బట్టలు ఉతకడానికి వెళ్లిపోయారు.
సెలవు పుచ్చుకొంటున్నప్పుడు మాతృదేవికి ప్రణమిల్లి, “వెళుతున్నామమ్మా” అన్నాం. అందుకు మాతృదేవి, “ ‘వెళుతున్నాం’ అనకూడదు, ‘వెళ్ళొస్తాం’ అని చెప్పాలి. తీరిక దొరికినప్పుడు మళ్లీ రండి” అన్నారు.
ఒక శనివారం. సుధీర మాలో కొందరిని దక్షిణేశ్వరానికి తీసుకెళ్లింది. తిరిగి వచ్చే దారిలో మాతృదేవి ఇంటికి వెళ్లాం. అప్పుడు మాతృదేవి మంచం మీద పడుకొని వున్నారు.
యోగీన్ మా: ఇంత రాత్రిపూట ఎక్కడి నుండి వస్తున్నారు?’
మాతృదేవి: ఎవరొచ్చారు?
యోగీన్ మా: సుధీర వచ్చింది.
అది విని మాతృదేవి లేచి కూర్చున్నారు. మేము ఆమెకు ప్రణమిల్లి కూర్చున్నాం.
మాతృదేవి: ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్లివస్తున్నావు?
సుధీర: దక్షిణేశ్వరం వెళ్లాం. ఆరాత్రికం దర్శించి వచ్చేటప్పటికి ఆలస్య మయింది. ఇంత దగ్గరగా వచ్చి మీ దర్శనం చేసుకోకుండా వెళ్లడానికి మనస్కరించ లేదు. అందుకే వచ్చాను.
మాతృదేవి: మంచిపని చేశావు.
ఇలా అంటూ మాతృదేవి పడుకున్నారు. సుధీర, మాతృదేవి పక్కన కూర్చుని ఆమె పాదాలు ఒత్తసాగింది. నేను పక్కన నిలబడి విసిరాను. సుధీర దక్షిణేశ్వరం గురించి మాట్లాడసాగింది.
మాతృదేవి: నహబత్తు చూశారా? ఆ నహబత్తులో కింది గదిలో నేను నివ సించాను. మెట్ల క్రింద వంట చేసేదానను.
సుధీర: అవును, చూశామమ్మా! ముందు భాగంలో తడిక, మెట్ల క్రింద పొయ్యి ఇప్పుడు కూడా ఉన్నాయి. మీరు ఉన్న ఆ వసారాలో ప్రస్తుతం బెస్తపడుచు గంపలు మొదలైనవి పడివున్నాయి. మీరక్కడ నివసించడం గురించి వీరికి వివరించాను. మీరాగదిలో ఎలా నివసించారో! మీకు ఎలాంటి కష్టమూ కలగలేదా?
మాతృదేవి: కాలకృత్యాలు తీర్చుకోవడానికీ, స్నానం చేయడానికీ కాస్త ఇబ్బందిపడ్డాను. పొట్టను ఆపుకొని ఆపుకొని కడుపునొప్పే వచ్చేది. ఈ బెస్త స్త్రీలే అప్పుడు నాకు చెలికత్తెలు. గంగలో స్నానం చేయడానికి వచ్చేవారు. వసారాలో గంపలు ఉంచి స్నానం కోసం వెళ్లేవారు. నాతో ఎంతో మాట్లాడేవారు. వెళ్లేటప్పుడు బుట్టలను తీసుకెళ్లేవారు. రాత్రి సమయాల్లో బెస్తవారు పాడుకుంటూనే చేపలు పట్టే వారు. నేను వింటూ ఉండేదానను. గురుదేవుల వద్దకు ఎందరో భక్తులు వచ్చేవారు. పాటలు, భజన అన్నీ సాగేవి. వాటిని వినేదానను. ‘ఆహా! నేను కూడా వీళ్లలో ఒకరిగా ఉండి వుండకూడదా! అలా అయితే నేను కూడా గురుదేవుల సమీపంలో ఉండేదానను కదా! ఎన్నో విషయాలు వినివుండేదానను!’ అని అనుకునేదానను. ఈ యోగీన్, గోలాప్ వీరికి ఇవన్నీ తెలుసు. వారు నా వద్దకు వచ్చేవారు, కొన్ని సమయాల్లో నాతోపాటే ఉండేవారు. (యోగీన్ మాను చూస్తూ) ఎలాంటి ఆనంద మయమైన రోజులో కదా అవి యోగీన్!’
ఇలా ప్రశ్నించిన మాతృదేవి ఏదో అన్యమనస్కంగా కొంతసేపు కూర్చుండి పోయారు.
యోగీన్ మా: ఆ ఆనందాన్ని మాటలలో వర్ణించగలమా అమ్మా! దానిని తలచుకుంటే ఇప్పుడు కూడా మనస్సు రెక్కలు కట్టుకుని పైకెగిరిపోతుంది!
మాతృదేవి (మమ్మల్ని చూస్తూ) : రాత్రి పొద్దుపోయింది కదా! ఇంట్లో కోప్పడరా?
సుధీర: ఈ రోజు కాస్త చీవాట్లు తప్పవు. ఇక్కడ ఉంటున్న వారిని గురించి వీళ్ల ఇంట్లోవారికి సదభిప్రాయం లేదు. ఈ అమ్మాయిలు ఇక్కడకు వచ్చారని తెలిస్తే వారి కోపం కట్టలు తెంచుకుంటుంది.
మాతృదేవి: అయ్యో, పాపం! ఈ అమ్మాయిలు చీవాట్లు తినాలా? మనుష్యు లలో ఎన్ని రకాలు! దానికేమైనా లెక్కవున్నదా ఏమిటి? సమాజంలో జీవించేవారికి భయమే మిగిలింది. పోనీలే, మీరు వెళ్లిరండమ్మా! అయ్యో! ఎంతగా తిడతారో!
సుధీర: ఈ మాత్రం కూడా సహించకపోతే వీళ్లు మరేం సహిస్తారు? మీ ఆశీస్సులు వీళ్ల భయాన్ని రూపుమాపేస్తాయి.
మాతృదేవి: గురుదేవుల అనుగ్రహంతో అన్నీ చక్కబడతాయి. వాళ్లు చీవాట్లు పెడుతూవుంటే మీరు ఎదురుతిరగకండి. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మనుష్యులు వుంటున్నారు! అన్నిటినీ సహించి జీవనం కొనసాగించాలి. “శ, ష, స…. మూడు ‘స’ లు. సహనం గల వ్యక్తే ఒద్దికగా జీవిస్తాడు” అనేవారు గురుదేవులు.*
చేతులు జోడించి గురుదేవులతో, “ప్రభూ, కాపాడండి” అంటూ మా కోసం ప్రార్థించారు మాతృదేవి. ఆ తరువాత మేం మాతృదేవికి ప్రణమిల్లి సెలవు తీసు కున్నాం.
ఒక సెలవు రోజు మధ్యాహ్నం సుధీరతో మేం ముగ్గురం మాతృదేవి దర్శ నార్థం వెళ్లాం. మమ్మల్ని చూసిన మాతృదేవి, “పూజగదిలో కూర్చోండి. నైవేద్యం అర్పించి వస్తాను” అన్నారు. కొంతసేపటి తర్వాత ఆమె వచ్చినప్పుడు మేం ప్రణమిల్లాం. మా క్షేమసమాచారాలు విచారించి “ఆ రోజు ఇంట్లో బాగా చీవాట్లు తిన్నారా?” అని అడిగారు. “పెద్దగా ఏమీ లేదు. వాళ్ల చీవాట్లు మేం ఖాతరు చేయ లేదు” అన్నాం.
భుజించాక మాతృదేవి సుధీరకు వండిన ప్రసాదం ఇచ్చారు. మాతో వచ్చిన ఇద్దరూ వితంతువులు. వారు ఆ ప్రసాదం తీసుకోవడానికి వెనుకాడారు.* వెంటనే మాతృదేవి, “ఇది ప్రసాదమే కదా! దీనిని మీరు తీసుకోవడంలో దోషం లేదు” అన్నారు.
తరువాత మాతృదేవి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. నేల మీద చాపలు పరచి మమ్మల్ని కూడా పడుకోమన్నారు. సాయంత్రం పూజగది తెరచి మాకు ప్రసాదం ఇచ్చారు. పిదప వసారాలో కూర్చొని సుధీరతో మాట్లాడసాగారు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి అల్లికతో కుట్టిన శ్రీకృష్ణుని చిత్రమున్న గుడ్డను ఒకదానిని మాతృదేవి కిచ్చి ప్రణమిల్లి కూర్చుంది. మాతృదేవి దానిని చూచి, “దీనిని నువ్వే తయారుచేశావా?” అని అడిగారు. ఆమె అవుననగానే “ఆహా! బాగున్నది! ముఖం కళగా ఉంది. ఎంత చక్కగా అల్లిందో చూడు” అంటూ దానిని అందరికీ చూపించారు. “బాగున్నది కదా!” అంటూ అందరినీ అడిగారు. మేము “అవును” అన్నాం. మాతృదేవి ఆ గుడ్డను తల మీద ఉంచుకొని తీశారు. తదనంతరం ఆమె క్షేమసమాచారాలు విచారించి, ప్రసాద మిచ్చారు.
అప్పుడు గోలాప్ మా అక్కడికి వచ్చారు. మాతృదేవి ఆమెకు ఆ గుడ్డను చూపిస్తూ “చూడు, దీన్ని ఈమె అల్లింది, బాగుంది కదా!” అన్నారు. గోలాప్ మా దానిని చూసి “అంతా బాగానే వుంది. కానీ కుడిచేయి మాత్రం లావుగావుంది” అంది. మేం నవ్వేశాం. మాతృదేవి కూడా నవ్వుతూ, “గోలాప్ వచ్చి లోపాన్ని చూపింది. ఆమె అభిరుచే ప్రత్యేకం! ఆమె ఎన్నో చూసుంటుంది, వినివుంటుంది. అందువలననే ఇది ఆమెకు నచ్చలేదు. ఆమె పనులన్నీ కచ్చితంగా ఉంటాయి. నానారకాల పనులు ఆమెకు తెలుసు. గురుదేవులు ఉపయోగించిన అనేక వస్తువులు ఆమె తయారుచేసినవే! భక్తుల కోసం కూడా దోమతెర, దిండు గలీబు మొదలైనవన్నీ తయారుచేస్తుంది. సోమరితనం అనేది ఆమె వద్ద లేదు” అన్నారు.
సాయంకాలానికి కాస్త ముందుగా ఆ స్త్రీ మాతృదేవికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకొంది. “మళ్లీ రామ్మా!” అన్నారు మాతృదేవి.
యోగీన్ మా వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి కూర్చుంది. కొంతసేపు ఆమెతో మాట్లాడి ఆమెకు కూడ అల్లిక బొమ్మ చూపించారు. “ఇది ఎంత బాగుందో చూడు! ముఖవైఖరి చక్కగా అమరింది” అన్నారు మాతృదేవి. యోగీన్ మా కూడా, “అవును, ఎవరు దీన్ని చేశారు? చాలా బాగుంది” అంది.
ఆ స్త్రీ గురించి చెప్పిన మాతృదేవి, “కానీ కుడిచేయి కాస్త లావుగా ఉందని గోలాప్ వ్యాఖ్యానించింది” అన్నారు. “ఆమె మాటలను పట్టించుకోకండి” అంది యోగీన్ మా.
సాయంత్రం అయింది. మాతృదేవి గురుదేవులకు ప్రణమిల్లి “హరి బోల్, హరి బోల్, గురుదేవా, గురువే శరణం” అంటూ ప్రార్థించారు. తరువాత గంగాభి ముఖంగా తిరిగి నమస్కరించారు. తదనంతరం గదిలో ఆసనం పరచి, కూర్చొని, చేత్తో కాసిని గంగాజలం తీసుకొని జపం చేయసాగారు. ఎలాంటి అద్భుత దృశ్యం!
అక్షయ తృతీయ నాడు నా స్నేహితురాండ్రు ఇద్దరు మంత్రదీక్ష పుచ్చుకొన్నారు. నేను ఆ రోజు కలకత్తాలో లేనందువలన మంత్రదీక్ష పుచ్చుకోలేకపోయాను. కొన్ని రోజుల తరువాత ఒక రోజు సాయంత్రం సుధీరతో మాతృదేవి దర్శనార్థం వెళ్లాను. మాతృదేవి జయరాంబాటికి వెళ్లాలనుకొన్నారు గాని ఎందుకో వెళ్లలేదు.
మేం వెళ్లి ప్రణమిల్లి కూర్చున్నప్పుడు మాతృదేవి, “రండమ్మా!” అన్నారు. తరు వాత సుధీర ప్రశ్నలకు బదులు చెప్పి మాతృదేవి ఇలా అన్నారు:
“నా చిన్న తమ్ముని భార్యకు మానసిక స్థితి బాగాలేదు. గ్రామానికి వెళితేనే ఆమె కోలుకొంటుంది. రాధూ పెళ్లి కూడా వుంది. వీటి కోసం నేను త్వరలో జయరాంబాటికి వెళ్లవలసివుంది. ఆ రోజే బయలుదేరాల్సింది. కానీ మంచి రోజు కాదని మానుకున్నాను.”
ఆరాత్రికం తర్వాత మాతృదేవి కాసేపు పడుకున్నారు. సుధీర ఆమె పాదాలను ఒత్తసాగింది. “బాగా ఒత్తు అమ్మాయి! రేపు పౌర్ణమి కదా! అందువల్లనే కాళ్లలో వాతం బాగా కమ్ముకొంది. ఈ వాతం నా కాళ్లను బాగా పట్టేసింది. వదిలే సూచనలే లేవు! దక్షిణేశ్వర రోజులలోనే వచ్చేసింది. ఇన్ని రోజులయినా కూడా అది నన్ను వదలడం లేదు.”
పాదాలను ఒత్తడంతో మాతృదేవి కాస్త నిద్రించారు. మా బండి వచ్చింది. మేం గురుదేవులకు ప్రణమిల్లి బయలుదేరాం. మాతృదేవి కూడా లేచారు. “ఓ! మీరు బయలుదేరుతున్నారా! మళ్లీ రండి!” అన్నారు. నా మంత్రదీక్షను గురించి యోగీన్ మా మాతృదేవితో చెప్పారు. “రేపు ఉదయం రా” అన్నారు మాతృదేవి.
మర్నాడు ఉదయం మాతృదేవి వద్దకు వెళ్లాను. మాతృదేవి పూజ ముగించి స్నానం చేయడానికి గంగకు బయలుదేరుతున్నారు. నన్ను చూడగానే, “రామ్మా, త్వరగా రా! నీకు మంత్ర దీక్ష యిచ్చిన తర్వాత నేను స్నానానికి వెళతాను” అన్నారు.
మంత్రదీక్ష పూర్తయ్యాక, “ఈ పువ్వులను నా పాదాలకు సమర్పించు” అన్నారు మాతృదేవి. ‘ఏం చెబుతూ పువ్వులు సమర్పించాలి?’ అనుకొన్నాను. మాతృదేవి నా చేతిలో పువ్వులనందిస్తూ, “ ‘నా సర్వస్వాన్ని నీకు సమర్పిస్తున్నాను’ అంటూ పువ్వులు అర్పించు” అన్నారు. నేను అలాగే చేశాను. మాతృదేవి గురుదేవులను చూపించి, “ఇదిగో, ఈయనే నీ సర్వస్వం, ఆయనను ప్రార్థించు. నీకు సకలమూ సిద్ధిస్తుంది” అన్నారు.
తమ పాదాలకు నూనె రాయమని మాతృదేవి అన్నారు. నేను అలాగే చేశాను. మాతృదేవి స్నానం చేసి వచ్చినప్పుడు, మేము బయలుదేరడం గురించి సుధీర చెప్పింది. అందుకు మాతృదేవి, “అదేమిటి? ప్రసాదం తీసుకొని వెళ్లండి” అన్నారు. అప్పుడు యోగీన్ మా పైకి వచ్చారు. ఆమెతో మాతృదేవి, “వీళ్లు బయలుదేరాలని అంటున్నారు” అన్నారు. వెంటనే యోగీన్ మా, “ఇప్పుడే బయలుదేరడమా? మంత్ర దీక్ష పుచ్చుకొన్నావు, ప్రసాదం తీసుకునే బయలుదేరు. మీరు భోజనం చేస్తారని వంటవాడికి కూడా చెప్పేశాను” అన్నారు. “సాయంత్రం వెళ్లమనే నేను కూడా చెబుతున్నాను” అన్నారు మాతృదేవి.
ఇంటికి తిరిగి వెళ్లడానికి యోగీన్ మా మాతృదేవికి ప్రణమిల్లింది. మాతృదేవి ఆమె శిరస్సును స్పృశించి ఆశీర్వదించారు.
మాతృదేవి: చాలా ఆలస్యమైపోయింది. నువ్వు కూడా ఇక్కడే భోజనం చేసివుండవచ్చు కదా! ఇక నువ్వు వెళ్లి వంటచేసి భోజనం చేయడం ఎంతో శ్రమ కదా!
యోగీన్ మా: లేదమ్మా! ఇంట్లో అమ్మ ఉంది. వంట కోసం అన్నిటినీ ఆమె సిద్ధంచేసి ఉంచుతుంది. నేను వెళ్లి వంట చేయడమే!
మాతృదేవి: అలా అయితే ఇక ఆలస్యం చేయకు! వెళ్లి రామ్మా! ఎండ వచ్చే సింది, చాలా దూరం వెళ్లాలి కదా!
అప్పుడు లలిత్‌బాబు భార్య వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి కూర్చుంది. ఒకరి వెంట ఒకరిగా పిల్లలందరినీ కోల్పోయిన అభాగ్యురాలామె. దుఃఖసాగరంలో మునిగి వుంది. మాతృదేవి ఆమెను పరిపరి విధాల అనునయిస్తున్నారు. “ఆహా! ముగ్గురు బిడ్డలూ చనిపోయారే! ఒక్కరైనా బ్రతికి ఉండరాదా! లలిత్‌కు కూడా ఆరోగ్యం బాగాలేదట కదా? గురుదేవుల అనుగ్రహంతో ఆతడు బ్రతికి బయటపడాలి. అప్పుడే కాస్త మనశ్శాంతి లభిస్తుంది” అన్నారు. పిదప ప్రసాదం అందిస్తూ, “తినమ్మా! ఎంత సన్నబడిపోయావు! శరీరంలో ఏమీ లేదే!” అన్నారు.
మేం సెలవు తీసుకునే సమయం వచ్చింది. సుధీర మాతృదేవితో, “ఇక మీ దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందో!” అన్నది. అందుకు మాతృదేవి, “త్వరలోనే తిరిగి వచ్చేస్తాను. రాధూ పెళ్లికి నువ్వు కూడా రావచ్చు కదా!” అన్నారు. సుధీర అందుకు ఏమీ జవాబు చెప్పలేదు. ఆ తరువాత, “బయలుదేరుతామమ్మా” అంది. మాతృదేవి కూడా ఆశీర్వదిస్తూ, “నేను వచ్చాక మళ్లీ రండి” అన్నారు.
గ్రామం నుండి మాతృదేవి తిరిగి వచ్చిన తర్వాత ఒక రోజు నేనూ, సుధీర మాతృదేవి దర్శనార్థం వెళ్లాం.
సుధీర: అమ్మా! మీరు బాగా నల్లబడిపోయారు. చిక్కిపోయారు కూడా!
మాతృదేవి: మా గ్రామం ఆరుబయలు ప్రదేశం కదా! అందువలన నల్లబడడం సహజమే. దాంతోపాటు నాకు పనులు కూడా ఎక్కువయినాయి.
అప్పుడు సోదరి నివేదిత అక్కడికి వచ్చి మాతృదేవికి ప్రణమిల్లింది, మాతృదేవి ఆమె క్షేమసమాచారాలు అడిగారు. పిదప కంబళితో చేసిన ఒక విసనకర్రను ఆమె కిస్తూ, “ఇది నీ కోసం నేను తయారుచేశాను” అన్నారు. నివేదిత పట్టరాని సంతో షంతో దానిని తీసుకుని, తలమీద, ఛాతీమీద ఉంచుకుని, “ఆహా! ఎంత అందంగా వుంది! ఎంత అద్భుతంగావుంది!” అంది. తర్వాత మా అందరికీ దానిని చూపిస్తూ, “చూడండి! మాతృదేవి ఎంత అందంగా తయారుచేశారో” అంటూ ఉత్సాహంతో చెప్పింది.
ఆ ఉత్సాహాన్ని చూసి మాతృదేవి ఇలా అన్నారు:
“అతి సామాన్యమైన వస్తువును ఆమె కిచ్చాను. దానికే అంతగా సంతోషిస్తూ వుంది చూడండి! ఆహా ఎంతటి సహజ విశ్వాసం! సాక్షాత్తూ దేవిలా కనబడుతోంది. నరేంద్రుని పట్ల ఆమెకు ఎంత భక్తి! ఆతడు ఈ దేశంలో జన్మించాడని తన దేశాన్నే వదలి వచ్చి, ఈ దేశం కోసం తన సర్వస్వాన్నీ అర్పించి పని చేస్తూవుంది. ఎంత గురుభక్తి! ఈ దేశాన్ని ఎంతగా ప్రేమిస్తున్నది!”
తాము డార్జిలింగ్ వెళుతున్న విషయం గురించి మాతృదేవితో చెబుతూవుంది నివేదిత. అక్కడికి రాధూ వచ్చినప్పుడు “ఈ సోదరీమణులకు నమస్కరించు” అన్నారు. వెంటనే సుధీర, “వద్దు, వద్దు, ఆమె ఎందుకు మాకు నమస్కరించాలి?” అని వారిం చింది. అందుకు మాతృదేవి, “మీరు వయస్సులో ఆమె కంటే పెద్దవారు. మీకు ఎందుకు నమస్కరించకూడదు?” అన్నారు.
భక్తులు మాతృదేవికి ప్రణమిల్లడానికి వేచివున్నారని ఒక బ్రహ్మచారి వచ్చి చెప్పాడు. “వాళ్లను రమ్మనిచెప్పు” అంటూ మాతృదేవి ఒక దుప్పటితో తమను పూర్తిగా కప్పుకొని కూర్చున్నారు. కొంతసేపటి తరువాత మాతృదేవి వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరాం.
ఒక రోజు సోదరి నివేదిత మాతో, “మాతృదేవి ఈ రోజు మన పాఠశాలకు వస్తున్నారు. మనం ఆ సందర్భాన్ని గొప్ప వేడుకగా చేసుకోవాలి” అన్నది. ఉదయం రానున్న మాతృదేవి సాయంత్రం నాలుగు గంటలకే రాగలిగారు. రాధూ, గోలాప్మా ప్రభృతులు కూడా వచ్చారు. బండి నుండి మాతృదేవి దిగగానే నివేదిత ఆమెకు సాష్టాంగనమస్కారం చేసి, ప్రార్థనా మందిరానికి తీసుకెళ్లింది. మాతృదేవి పాదపద్మా లకు అర్పించడానికి మా అందరికీ పువ్వులు ఇచ్చింది నివేదిత. మేం ఒక్కొక్కళ్లంగా వెళ్లి మాతృదేవికి ప్రణమిల్లినప్పుడు మమ్మల్ని ఒక్కొక్కరిగా మాతృదేవికి పరిచయం చేసింది. మాతృదేవి మమ్మల్ని పాడమన్నారు. మేం పాడాము, ఒక కవిత కూడా చదివాం. “కవిత బాగుంది” అన్నారు మాతృదేవి. తరువాత మాకందరికి తీపి ప్రసాదం ఇవ్వమన్నారు.
తర్వాత నివేదిత మాతృదేవికి పాఠశాల, విద్యార్థినుల పనులు మొదలైనవన్నీ చూపించింది. మాతృదేవి ఎంతో సంతోషించారు. “స్త్రీలు ఎంతో నేర్చుకుంటున్నారు” అన్నారు. తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి మాతృదేవిని తమ గదికి తీసుకెళ్లింది నివేదిత.
నివేదిత మహాసమాధి పొందినప్పుడు సుధీర వ్యాధిగ్రస్తురాలైవుంది. ఆమెను గురించి మాతృదేవికి ఎంత ఆందోళనో! “ప్రభూ, సుధీర వెళ్లిపోతుందా? ఆమె చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయి కదా!” అంటూ విలపిస్తూ మాతృదేవి గురుదేవులకు మొరపెట్టుకున్నారు.
శ్యామ్పుకూరు అత్తను పిలిచి, “సుధీర ఇప్పుడెలావుందో నువ్వు వెళ్లి చూసిరా! ఆమె తీవ్ర వ్యాధిగ్రస్థురాలై వుంది” అన్నారు. ఆమె వెళ్లడానికి సమ్మతించినప్పుడు. గురుదేవుల చరణామృతం, దానిమ్మపండు ఇత్యాదులు ఇచ్చి, “వీటిని ఆమెకు ఇవ్వు. ఆమె ఎలావుందో వచ్చి నాకు చెప్పు. ఆమె కోసం నేను గురుదేవులకు తులసీదళాలను సమర్పిస్తాను” అన్నారు మాతృదేవి.
తన ఆరోగ్యం బాగుపడిన తర్వాత సుధీర, నేను, సోదరి క్రస్టైన్ అందరూ కలిసి ఒక రోజు సాయంత్రం మాతృదేవి దర్శనార్థం వెళ్లాం. ఆరాత్రికం ముగిసిన తర్వాత మాతృదేవికి ప్రణమిల్లి కూర్చున్నాం. “అమ్మాయీ! నీ ఆరోగ్యం బావుందా!” అని సుధీరను అడిగారు మాతృదేవి. “వ్యాధి నయమయింది. కానీ జాగ్రత్తగా ఉండాల్సి వుంది” అంది సుధీర. అందుకు మాతృదేవి ఇలా అన్నారు:
“నీ గురించి ఆలోచించి ఎంతో ఆందోళన చెందాను. పోనీలే, గురుదేవుల అనుగ్రహం వలన అంతా సవ్యంగా జరిగింది. ఒక వైపు నివేదిత నిష్క్రమించింది. నీకు కూడా ఆరోగ్యం బాగాలేదు. అది విని నువ్వు కూడా నిష్క్రమిస్తే పాఠశాలను ఎవరు చూసుకుంటారని కలతచెందాను. (సోదరి క్రిస్టైన్ను సూచిస్తూ) ఆహా, ఇద్దరూ కలసి ఒకటిగా ఉండేవారు. ఇప్పుడు ఒకరిని కోల్పోయి ఒంటరిగా ఉండడం ఎంత దుర్భరమో! మా మనస్సులే ఇంతగా బాధపడుతున్నాయి. నీ పరిస్థితి ఇక ప్రత్యేకంగా చెప్పాలా? ఎటువంటి స్త్రీ ఆమె! ఆమె కోసం ఇప్పుడు ఎందరో కన్నీరు మున్నీరవు తున్నారు.” ఇలా అంటున్నప్పుడు మాతృదేవి కళ్లు కూడా చెమ్మగిల్లాయి! తరువాత సోదరి క్రిస్టైన్తో పాఠశాల విషయం మాట్లాడసాగారు.
ఆరోగ్యం మెరుగు పరచుకోవడానికి సుధీర నన్ను కూడా తీసుకొని కాశీలో కొన్నిరోజులు గడపాలనుకొంది. ఈ విషయం ప్రస్తావించినప్పుడు మాతృదేవి, “వెంటనే వెళ్లి రామ్మా! ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా!” అన్నారు.
చాలా రోజుల తర్వాతనే మళ్లీ మాతృదేవి దర్శనం సంప్రాప్తించింది. ఒక డాక్టరు భార్య కూడా నాతోపాటు వచ్చింది, సుధీర నాతో రాలేదు. మాతృదేవి నన్ను గుర్తుపడతారో లేదో అని సంశయించాను. మేం పూజగదికి వెళ్లినప్పుడు మాతృదేవి పూజ చేసేశారు. నన్ను చూడగానే, “ఏమమ్మా! వచ్చేశావా! చాలారోజులయిందే! నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావో అనుకొన్నాను చాలా రోజులు” అన్నారు. నేను ప్రణమిల్లిన వెంటనే నా శిరస్సును స్పృశించి ఆశీర్వదించారు. సుధీరను గురించి అడిగారు. “ఆమె కలకత్తాకు వచ్చింది. నేను కూడా ఆమె వెంటే వచ్చాను” అన్నాను. మాతృదేవి నన్ను గుర్తుపట్టడం నాకు ఎంతో సంతోషం కలిగించింది.
ఆ రోజు బలరాం బాబు ఇంట్లో విందు భోజనం, ఇక్కడ నుండి అందరూ వెళ్లేట్లు ఏర్పాటు. రాధూ ఆరోగ్యం బాగాలేదు. మాతృదేవి నన్ను సూచిస్తూ, “ఈమె రాదు. అందువలన రాధూ, ఈమే ఇక్కడే ఉంటారు” అన్నారు.
మాతృదేవిని తీసుకువెళ్లడానికి బండి వచ్చింది. బయలుదేరేటప్పుడు మాతృ దేవి, “మీరిద్దరూ ఆడుకుంటూ ఉండండి. నేను తొందరగా తిరిగొచ్చేస్తాను” అని చెప్పారు. రాధూతో, “అక్కయ్యతో ఆడుకో, నేను వస్తాను” అన్నారు.
నాలుగు దాటాక మాతృదేవి తిరిగి వచ్చారు. మేం అదే బండిలో బయలు దేరాలనుకొన్నాం. మాతృదేవి తొందరగా వచ్చి నాకు కొద్దిగా ప్రసాదమిస్తూ, “ఆహా మేము వచ్చాం, నువ్వు వెళ్లిపోతున్నావు. మరేం చేయగలవు? వారితో వచ్చావు, వారితోపాటు ఇక వెళ్లి తీరాలి కదా!” అన్నారు.
రాధూ: ఎందుకు, అక్కయ్యను ఇక్కడే ఉండమను!
మాతృదేవి: ఆమె ఇక్కడ ఎలా ఉండగలదు?
రాధూ: అక్కయ్య వెళ్లకూడదు. తక్కిన వారు వెళ్లనీ!
మాతృదేవి: అర్థంలేకుండా మాట్లాడుతున్నావు. ఈమెను వదిలి వారు ఎలా వెళతారు? (నాతో) నువ్వు బయలుదేరు తల్లీ! క్రింద పిలుస్తున్నారు!
నేను మాతృదేవికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకొన్నాను, మాతృదేవి నన్ను ఆశీర్వదిస్తూ, “ఎన్ని రోజులు ఇలా గడుస్తాయో గురుదేవులకే తెలియాలి! బయలుదేరు! మళ్లీ రామ్మా!” అన్నారు, మెట్లవరకు వచ్చి వీడ్కోలిచ్చారు. ఆ రోజు నేను పొందిన మాతృదేవి అనుగ్రహాన్ని మాటల్లో వర్ణించడం చేతకాదు. ‘అలా చేయి, ఇలా చేయి’ అంటూ ఎన్నో పనులు నాకు అర్థమయేలా చెప్పారు మాతృదేవి!
కాశీ 1912
సెప్టెంబర్ నెల సెలవు రోజుల్లో మాతృదేవి కాశీలో ఉన్నారు. ఆమెతో కొన్ని రోజులు గడపడానికి సుధీర వెళ్లి నప్పుడు మాలో కొందరిని కూడా తీసుకెళ్లింది. మాతృదేవి వద్దకు వెళ్లి నప్పుడు ఆమె అనేక విషయాల గురించి మాట్లాడారు. యోగీన్ మా గురించిన ప్రస్తావన వచ్చింది. “ఆహా! యోగీన్ మా రాలేకపోయింది. ఆరోగ్యం బాగాలేదు. గురుదేవులు, దేవీ మాత్రమే ఆమెను ఆదుకున్నారు. ఆమెను తలచుకుంటూ ఎంత ఆందోళపడ్డానో” అన్నారు. మేము బసచేయడానికి ఏర్పాటు చేసిన ఇల్లు చూడడానికి సుధీర తదితరులు వెళ్లారు.
మాతృదేవి కాసేపు నిద్రించారు. అంతా ప్రశాంతంగా ఉంది. అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు వసారా నుండి ఒక పాట వినవచ్చింది:
నువ్వు ఎక్కడికి వెళ్లావు నా తల్లీ!
ఇక్కడ నేను పరితపిస్తున్నాను ఇన్ని రోజులుగా!
ప్రేమతో ఆదుకో, లాలించి పాలించు
లేకపోతే నువ్వు ప్రాణులకు తల్లివా?
నిలబడివున్న కేవలం ఒక శిల మాత్రమేనా!
పసికందుగా విలపిస్తున్నాను!
కరుణాస్వరూపిణిగా దర్శన మివ్వు!
చాలా దూరం నుండి ఎవరిదో శోకపూరిత స్వరంలో మృదువుగా ఆ పాట వినవచ్చింది. తక్షణం మాతృదేవి లేచి, “అక్కడ ఎవరమ్మా పాడుతూన్నది? రా! వసారాలోకి వెళ్లి చూద్దాం!” అన్నారు. అక్కడికి వెళ్లి చూసినప్పుడు కనబడిన దృశ్యం మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ పాట పాడింది ఒక చిన్న అమ్మాయి! ఆమె కళ్ల వెంట ధారలు ధారలుగా నీళ్లు! మాతృదేవి అక్కడికి వెళ్లి కూర్చున్న వెంటనే ఆ అమ్మాయి వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి, “అమ్మా! అనేక రోజుల నా కోర్కె ఈనాటికి తీరింది. నా మనస్సులో పెల్లుబికే ఆనందాన్ని నేను మాటలలో వివరించ లేకున్నాను” అంది. మాతృదేవి ఆమెను ఆశీర్వదించి క్షేమసమాచారా లడిగారు.
చిన్నారి: అమ్మా! నేను బిచ్చగత్తె కుమార్తెను.
మాతృదేవి: నువ్వు ఎక్కడ ఉంటున్నావు?
చిన్నారి: అన్నపూర్ణాదేవి వాకిలి దగ్గర. దశాశ్వమేథ ఘట్టం తీరంలోవున్న బేహారీబాబా ఆలయం దగ్గర కూర్చొనివుంటాను.
మాతృదేవి: భిక్ష మెత్తుకోవడంతో నీ జీవితం సాఫీగా గడుస్తున్నదా?
చిన్నారి: తమ అనుగ్రహంతో అంతా సవ్యంగానే జరుగుతూవుంది. ఏ లోటూ లేకుండా రోజులు బాగానే సాగిపోతున్నాయి. అన్నపూర్ణ కృప వలన ఇక్కడ ఎవ్వరూ పస్తులు పడివుండరు. ఎలా కాస్త భక్తి కలుగుతుందన్నదే నా ఆరాటమంతా!’
మాతృదేవి: అది తప్పకుండా కలుగుతుంది. ఇలాంటి ఒక పుణ్యక్షేత్రంలో నువ్వు నివసిస్తున్నావు. ఇక్కడ విశ్వనాథుడు, అన్నపూర్ణాదేవి నిజంగానే వెలసివున్నారు. వారి కృపాకటాక్షంతో నీకు అన్నీ సమకూరుతాయి.
మళ్లీ ఒక పాట పాడమని మాతృదేవి కోరగా ఆ అమ్మాయి పాడింది:
అమ్మా నన్ను నీ ముద్దుబిడ్డగా
ఊరకే సుఖంగా ఉంచుకో
శిశువు అవస్థ తియ్యన, సరళం.
మానావమానా లెరుగని
దు:ఖము నిందా సిగ్గు ద్వేషం
ఏదీ లేని తియ్యని అవస్థ
ఆ రోజు అందాన్ని వీడక
ఎప్పుడూ చిన్నారిగా ఉండాలని అనుగ్రహించు.
మాతృదేవి: ఆహా! ఎంత అందమైన పాట!
చిన్నారి: మిమ్మల్ని చూడాలని చాలారోజులు పరితపించాను. మీరు ఇక్కడ ఉంటున్నారని విని చాలాసార్లు రావాలనుకొన్నాను కానీ ఎవరైనా అడ్డగిస్తారేమోనని భయపడి రాలేదు.
మాతృదేవి: ఎవరూ ఏమీ చెప్పరు! నువ్వు ఎప్పుడు రావాలనుకున్నా రావచ్చు.
ఆమెకు ప్రసాదం ఇవ్వమన్నారు మాతృదేవి. ప్రసాదం తీసుకుని ఆమె సెలవు తీసుకున్నప్పుడు, “మళ్లీ రా అమ్మాయీ!” అన్నారు మాతృదేవి. తరువాత మా అందరితో, “ఆ చిన్నారిలో అద్భుతమైన భక్తి కానవస్తున్నది” అన్నారు.
ఒక రోజు సాయంత్రం సుధీర, నేను మాతృదేవి వద్ద కూర్చొనివున్నాం. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“ఒకసారైనా గురుదేవులను ప్రార్థించిన వారికి భయం ఉండదు. ఆయన నామాన్ని జపించేకొద్దీ వారి అనుగ్రహం లభిస్తుంది. అనుగ్రహం దక్కితే ప్రేమభక్తి ఉదయిస్తుంది. ఈ ప్రేమ ఎంతో అపురూపమయినది! బృందావన గోపికలలో ప్రేమ భక్తి ఉండేది. కృష్ణుడు తప్ప మరిదేన్నీ వారు ఎరుగరు. ‘ప్రేమ అనే రత్నాన్ని ఎంతో పాటుపడి కాపాడాలి’ అని నీలకంఠుని పాటలోవుంది.”
మాతృదేవి ఆ పాట పాడారు. ఎంత మధురమైన కంఠస్వరం! ఇప్పటికీ అది నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూన్నది. పాట పూర్తయ్యాక మాతృదేవి ఇలా అన్నారు:
“నీలకంఠుని ఈ పాట అద్భుతమయినది. గురుదేవులకు ఈ పాట ఎంతో ఇష్టం. ఆయన దక్షిణేశ్వరంలో ఉంటున్నప్పుడు నీలకంఠుడు కొన్ని సమయాల్లో అక్కడికి వచ్చేవాడు. గురుదేవుల కోసం పాడేవాడు. ఎలాంటి ఆనందమయ జీవితం గడిపాను నేను! గురుదేవుల వద్దకు వచ్చే వారిలో ఎన్నో రకాలు! దక్షిణేశ్వరంలో ఒక ఆనంద సంత తెరచి ఉండేదనే చెప్పాలి.”
ఒక రోజు నేను వెళ్లినప్పుడు మాతృదేవి వసారాలో కూర్చొని ఇద్దరు స్త్రీలతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ పేద చిన్నారి వచ్చి మాతృదేవికి ప్రణమిల్లింది. ఆమె చేతిలో ఒక జామపండు ఉంది. ఆ పండును ఆమె మాతృదేవికిస్తూ, “అమ్మా! ఈ పండు ఈ రోజు నాకు భిక్షలో లభించింది. మీ కోసమని తీసుకొచ్చాను. అయినా మీకు ఇవ్వడానికి సంకోచంగా ఉంది” అంది. “సంకోచ మెందుకు? నువ్వు మంచిపని చేశావు. ఏదీ! ఆ పండును ఇలా ఇవ్వు” అంటూ ఆ పండును తీసుకున్నారు. దానిని తలకు స్పృశించి, “భిక్షాహారం ఎంతో పవిత్రమయినది. గురుదేవులు దానిని ఎంతగానో ఇష్టపడేవారు. ఆహా! ఎంత మంచి పండు! నేను ఇప్పుడే తింటాను” అన్నారు. మాతృదేవి మాటలతో తబ్బిబ్బయిన ఆ చిన్నారి “అమ్మా! మీ పేదకుమార్తెను. నా మీద మీకంత ప్రేమా?” అని అడిగింది. ఇలా అంటున్నప్పుడు ఆ చిన్నారి కళ్ల వెంట నీరు స్రవించింది.
“నీ పాట చాలా బాగున్నది, ఏదీ ఒక పాట పాడు చూద్దాం!” అని మాతృదేవి అనగానే ఆ చిన్నారి పాడసాగింది.
కృష్ణా నిన్ను అలంకరిస్తాను
కళ్లారా దర్శించుకుంటాను
కాళ్లు తిప్పుతూ ఆడతావు నువ్వు
క్రీడను చూసి ఆనందిస్తాను
ప్రియతమా నీ పాదాలకు
చక్కని గొలుసులు కడతాను
నువ్వు నృత్యం చేస్తున్నప్పుడు
అవి సంగీతంతోపాటు ధ్వనిస్తాయి
బంగారపు పట్టువస్త్రం కడతా
మంచి ఆహారం తినిపిస్తా
చేతికి కంకణం కడతా
చేతులు తడుతూ నువ్వు ఆనందిస్తావు.
పాట అవగానే “ఈ పాట పాడితే బేహారిబాబా కృష్ణునిలాగా నృత్యం చేయడం ప్రారంభిస్తారు. పసిబాలుని లాంటి మానసికస్థితి ఆయనది” అంది ఆ చిన్నారి.
“పాట బాగుంది. ఇంకొక పాట పాడకూడదూ!” అని అడిగారు మాతృదేవి. ఆ చిన్నారి పాడింది. తర్వాత ఆమెకు ప్రసాదం ఇవ్వమన్నారు మాతృదేవి. ఆమె ప్రసాదం తీసుకుని మాతృదేవికి ప్రణమిల్లి, “వెళ్లొస్తానమ్మా” అంటూ సెలవు తీసుకుంది. “మళ్లీ రా అమ్మాయీ! నీకు ఎప్పుడు చూడాలని అనిపించినా వెంటనే వచ్చెయ్యి” అన్నారు మాతృదేవి.
ఒకరోజు సాయంత్రం మూడు గుంటలయి ఉంటుంది. వృద్ధ స్త్రీల ఆశ్రమాన్ని చూడడానికి వెళుతున్న మాతృదేవి దారిలో మమ్మల్ని కూడా తమతో తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగానే ఒక స్త్రీ వచ్చి మాతృదేవిని మేడమీదికి తీసుకెళ్లింది. వృద్ధస్త్రీలు వచ్చి మాతృదేవి పాదాలకు పుష్పాలర్పించి వందనాలు చేశారు.
మాతృదేవి: ఇదేమిటమ్మా! వీరందరూ కాశీవాసులు కదా! మీరు నాకు నమస్కరించడమా?
స్త్రీ: ఎందుకు నమస్కరించకూడదు? మీ ప్రసాదం వలననే వీరి జీవనం సాగుతున్నది.
మాతృదేవి: విశ్వనాథస్వామి, అన్నపూర్ణాదేవి ఉన్నారు కదా! అవును, ఈ వృద్ధురాళ్లను నువ్వే చూసుకుంటున్నావా?
స్త్రీ: అవునమ్మా! అంతా తమ ఇచ్ఛానుసారమే!
మాతృదేవి: ఆహా, చాలా మంచిపని. వృద్ధులైన ఈ అనాథ స్త్రీలకు సేవ చేయడం సాక్షాత్తూ నారాయణునికే చేసినట్లవుతుంది, ఆహా! ఈ స్త్రీలు ఎంత అద్భుతంగా పని చేస్తున్నారు,
తరువాత మాతృదేవి ఆ స్త్రీల గురించి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు.వారు నివసిస్తున్న గదులను చూశారు.
సారనాథ్ దర్శించుకుని, ఆ సాయంత్రం మాతృదేవి వద్దకు వెళ్లాం. అప్పుడుమాతృదేవి పడుకునివున్నారు. ప్రక్కన రాధూ కూడా పడుకునివుంది. సారనాథ్గురించి అంతా విన్న తర్వాత “అమ్మా! ఒక రోజు వెళదామా?” అని అడిగింది.
మాతృదేవి: ఎలా వెళ్లడం? అక్కడ చుట్టూ తిరిగి రావడానికి నాకు కాళ్లు ఎక్కడ? విశ్వనాథుని దర్శించుకోవడానికే వెళ్లలేకపోతున్నాను. వీళ్లందరూవెళుతూంటే నాకు కూడా వెళ్లాలని అనిపించింది. కానీ కాళ్లు సహకరించకపోతే ఎలా వెళ్లడం? ఏమీ చెయ్యలేకపోతున్నాను. కాళ్లు స్వాధీనంలో ఉన్నప్పుడుజయరాంబాటి నుండి దక్షిణేశ్వరానికి కాలినడకనే వెళ్లేదానను. ఎంత నడిచాను!గురుదేవుల మహాసమాధి తదనంతరం బృందావనం వెళ్లాను. అక్కడ అన్ని చోట్లనూకాలినడకనే వెళ్లి దర్శించాను.
ఒక రోజు మాతృదేవి వద్దకు వెళ్లినప్పుడు ఒక నిరుపేద స్త్రీ, పది పదకొండేళ్ల ఆమె కుమార్తె మాతృదేవి వద్ద ఉన్నారు.
మాతృదేవి: నీ భర్త ఎక్కడ?
స్త్రీ: సన్న్యాసం తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయాడు. ఈ అమ్మాయి అప్పుడు చిన్న పాప.
మాతృదేవి: పనులేమీ చేయకుండా ఎలా జీవితం సాగిస్తున్నావు
స్త్రీ: పని చేశాను, దానితోనే రోజులు వెళ్లదీశాను. ఇక అది సాగదమ్మా! ఎంతో శ్రమగా ఉంది. మీరు మీ బిడ్డలతో చెప్పి ఏమైనా ఏర్పాటు చేయండి!
మాతృదేవి: చెప్పిచూస్తాను. వారందరూ కూడా యాచించే కదా ఇవన్నీ చేస్తున్నారు. ఎంతో మందికి సహాయపడుతున్నారు కదా! వారికి ‘మంచిది’ అనిపిస్తేనే చేస్తారు.
మాతృదేవి ఆమెకు ఒక రూపాయి, ఒక చీర యిస్తూ, “ఈ రోజు ఇక్కడేభోజనం చేయి” అన్నారు. అప్పుడు మాతృదేవి మేడ మీద కూర్చొని వున్నారు.కింద వంట చేస్తున్నారు. “కింద నుండి ఘమఘమ వాసన వస్తూవుందని మా అమ్మాయి అంటోంది” అంది ఆమె. అందుకు మాతృదేవి, “ఇలా అనవచ్చునా?అది గురుదేవుల నైవైద్యం కోసం చేస్తున్న వంట కదా!” అన్నారు.
ఆ స్త్రీకి కడుపార భోజనం పెట్టమని వంటవాడికి చెప్పారు మాతృదేవి.భుజించిన తరువాత ఆ స్త్రీ, “ఆహా! మంచి భోజనం, నా కూతురుకు లేవడానికేమనసొప్పడం లేదు” అంది. “మంచిది, భోజనం చేశారు, ఇక క్రిందికి వెళ్లిచేతులు కడుక్కోండి” అన్నారు మాతృదేవి. వారు క్రిందికి వెళ్లిన తర్వాత, “పేదరికం ఎంత ఘోరం! వచ్చినప్పటినుండి ఆ చిన్నారి భోజనం, భోజనం అంటూకలవరిస్తూవుంది. కొండంత ఆశ! ఇంతగా ఎదిగింది! కానీ బుద్ధి లేదు. వీరందరికీ ఏదీ అంటదు. లక్ష్మీదేవి కటాక్షం వీరి మీద ప్రసరించదు” అన్నారు మాతృదేవి.
వారు పైకి వచ్చినప్పుడు తమలపాకులిచ్చి పంపించేశారు. వారు వెళ్లిపోయిన తరువాత మంచం మీద పడుకుని మాతో మాట్లాడసాగారు:
“కాశీలో రకరకాల వ్యక్తులు జీవిస్తున్నారు, కొందరు నా వద్దకు వచ్చి, ‘మీబిడ్డలతో చెప్పి నాకు ఏమైనా సహాయం చేయమని చెప్పండి’ అని అడిగారు. ‘నేనేమి చెప్పనమ్మా! వారి దారిలోనే కదా వారు వెళతారు. హో! ఎందరు పేదలు ఇక్కడ నివసిస్తున్నారు. నా బిడ్డలు మాత్రం ఏం చేయగలరు? అనాథలైన వృద్ధు రాండ్రకు ఇప్పుడొక శరణాలయం ప్రారంభించారు. ఎంత సేవ చేస్తున్నారు! ఎంతశ్రమ పడుతున్నారు! రోగుల కోసం ఆసుపత్రి! బయట ఎంతమందికి సహాయంచేస్తున్నారో లెక్కించడం కష్టం. శ్రమ, శ్రమ అంటూ అంతగా శ్రమిస్తున్నారు.ఇవన్నీ ఆయన సంకల్పం తల్లీ! ఎక్కడవుంటూ ఏం చేస్తున్నారో అది వారికే ఎరుక!”
ఒక రోజు సాయంత్రం వెళ్లినప్పుడు మాతృదేవి కొందరు వితంతువులతోమాట్లాడుతున్నారు. వారిలో ఒకరు కాషాయం ధరించివున్నారు. ఆమె మాతృదేవి కోసం పాడుతున్నది.
వనంలో అందంగా వికసించి నిలుస్తూ
మనస్సును మైమరపింపజేసే మందారమా
ముదురు ఎరుపు రంగుతో శివుని వక్షస్థలంలో
చోటుచేసుకొన్న నీ అందచందాలు
ఉమాదేవి అందమైన పాదపద్మాలను
నాలో నెలకొనజేసి ఆనందాన్నిస్తున్నవే!
గోలాప్మా: ఆహా, ఎంత అందమైన పాట! ఇంకొక పాట పాడు! ఆమె ఇంకొక పాట పాడింది.
మాతృదేవి: మీరు సేవాశ్రమం చూశారా?
సుధీర: లేదు, చూడలేదు.
మాతృదేవి: అలా అయితే గోలాప్తో వెళ్లి చూసిరండి.
ఒక సాయంత్రం మాతృదేవి దర్శనార్థం వెళ్లాము. దేవవ్రత మహరాజ్, సచిన్ గురించి మాతృదేవి మాట్లాడుతున్నారు. వారు హఠాత్తుగా బదలీ చేసుకొని వెళ్లారు.
మాతృదేవి: “ఆహా, దేవవ్రతుడు ఈ రోజు వెళ్లిపోయాడు. సేవాశ్రమానికి సమీపంలోని స్థలాన్ని కేటాయించడంలో సహాయపడేటట్లు కంపెనీ* చెప్పింది. కానీ వారిద్దరూ ఇక్కడ ఉండకూడదనే ఆంక్షను కూడా జారీచేసింది. అందువల్లనే వారిని వెళ్లిపోమ్మని రాఖాల్ చెప్పేశాడు. మీకు తెలుసా అమ్మా? వీరు నిరపరాధులు.* కానీ గూఢచారి ఒకడు వీరి వెన్నంటే తిరుగుతున్నాడు. హా! బిడ్డలు భోజనం కూడా చేయకుండా వెళ్లిపోవాల్సి వచ్చింది!
సుధీర: అన్నయ్య* , సచిన్ మాతో పాటు భోంచేశారు.
మాతృదేవి: ఆహా! భోజనం చేసే వెళ్లారా! అది తలచుకునే కలత చెందాను. ఇప్పుడు మనస్సు స్థిమితపడింది.
సుధీర: అన్నయ్య ఎక్కడకు వెళ్లినా వీళ్లు ఆయనను వెంబడిస్తున్నారు, వీరిని చూడగానే అన్నయ్య, ‘మామగారి ఇంటి నుండి మనుషులు వచ్చేశారు. నేను వెళ్లి చూసొస్తా’ అనేవాడు.
మాతృదేవి: నిజమే. మామగారి ఇల్లే. ఎప్పుడో స్వదేశీ ఉద్యమ సంబంధంతో ఒకసారి ఇతణ్ణి పట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఆతణ్ణి వదలక వెంబడిస్తున్నారు. చూడు, పిల్ల లిద్దరూ భోజనం చేయకుండా వెళ్లిపోయారని విని ఈ రోజంతా కుమిలిపోయేదానను. ఏం చేయను? ఏదో నీ వద్దకు వచ్చి భోజనం చేసి వెళ్లారని విని మనస్సు కుదుటపడింది.
ఉద్బోధన్
ఈరోజు జగద్ధాత్రీ పూజ. ఉదయం నుండే భక్తులు రాసాగారు. యోగిన్ మా ఇంట్లో పూజ జరుగనున్నది. ఆమె ఉదయం వచ్చి మాతృదేవిని ఆహ్వానించి వెళ్లారు. అప్పుడు ఒక భక్తుడు వచ్చి తమ ఇంట్లో కూడా పూజ జరుపుకొంటున్నామని చెప్పి మాతృదేవిని ఆహ్వానించాడు. “సాయంత్రం వచ్చి చూడు! సాధ్యపడితే వస్తాను” అన్నారు మాతృదేవి.
మధ్యాహ్నం మాతృదేవితో పాటు అందరమూ యోగిన్ మా ఇంటికి వెళ్లాం. దేవిని దర్శించుకొని తిరిగి వచ్చేశాం. ఆ రోజు మాతృదేవి ఇంట్లో కూడా పూజ జరుగుతున్నందున రోజంతా మాతృదేవి ఉపవాసం ఉన్నారు. మధ్యాహ్నం నాలుగింటికి పూజ ముగిసిన తర్వాత ప్రసాదం స్వీకరించి, కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.
ఉదయం మాతృదేవిని ఆహ్వానించిన భక్తుడు వచ్చాడు. వివరం తెలుసుకుని మాతృదేవి, “ఉదయమే వచ్చి వేడుకొన్నాడు. ఒకసారి వెళ్లి చూసి వద్దాం” అన్నారు ఆ భక్తుని ఇల్లు దగ్గరలోనే ఉంది. మాతృదేవి బండి నుండి దిగిన వెంటనే ఇంటి వారు మాతృదేవి పాదాలను కడిగి, ఆ జలాన్ని తీర్థంగా పదిలపరచుకున్నారు.
ఆ ఇల్లు చిన్నది, పైగా శిథిలావస్థలో ఉంది! మేము వెళ్లి దేవికి ప్రణమిల్లి లోపలికి వెళ్లాం. మాతృదేవి కూర్చోవడానికి జంపఖానా పరిచారు. మాతృదేవి దానిని తలుపు దగ్గరగా వేసి “నేను ఇక్కడే కూర్చుంటాను” అన్నారు.
ఒక వృద్ధురాలు మాతృదేవితో మాట్లాడారు.
వృద్ధురాలు: అమ్మా! నా కుమారుణ్ణి ఆశీర్వదించండి. పూజ చేయాలని వాడికి ఎంతో అభిలాష. కానీ మాకు ఇల్లూ వాకిలీ లేదు, వేరే వసతులూ లేవు. కానీ ఎలాగో దేవీ పూజ జరిగిపోయింది. ఆతడే ఒంటరిగా అన్నీ సమకూర్చుకున్నాడు.
మాతృదేవి: ఆహా! చాలా మంచిది. ఆతడు మంచి పనిచేశాడు. దేవి వచ్చిం దంటే ఇల్లూ, వాకిలీ, వసతులూ అన్నీ సమకూరుతాయి! మీ కుమారుడు ఎంతో మంచివాడు. మంచి భక్తితత్పరుడు.
కాసేపటికి ప్రసాదం తీసుకొచ్చారు. అందులో కొద్దిగా నోట్లో వేసుకున్నారు మాతృదేవి. ఆ తరువాత లేచారు. దేవి సాన్నిధ్యంలో ఒక రూపాయి కానుకగా అర్పించి ప్రణమిల్లారు. “దేవి విగ్రహం చక్కగా, అందంగావుంది. ముఖ కవళికలు బాగా అమరివున్నాయి. భక్తుని పూజ కదా!” అన్నారు.
ఇంటికి వచ్చిన వెంటనే నళిని, “ఓహ్ ఏం ఇల్లమ్మా అది! కూర్చోవడానికి కూడా చోటు లేదు. ఎలా పూజచేస్తున్నారో!” అంది. అందుకు మాతృదేవి, “ఆతను ఇంకేం చేయగలడు? పాపం, బీదవాడు! ఎలాగో దేవిని ప్రతిష్ఠించాడు కదా! ఆతడు మంచివాడు! దేవి అనుగ్రహంతో ఆతడి ఇంట్లో వెలసింది” అన్నారు.
జయరాంబాటిలో పూజ చాలా బాగా జరిగింది, అనేకులు ప్రసాదం తీసుకున్నారని అక్కణ్ణుండి జాబు వచ్చింది. అది విన్న వెంటనే మాతృదేవి, “దేవి కృపాకటాక్షం వలన పూజ మంగళకరంగా పూర్తయింది. వారు ఎలా పూజ కొనసాగిస్తారోనని కలతచెందాను, జ్ఞాన్ అక్కడ ఉంటున్నాడు. అందువల్లనే అంతా సవ్యంగా జరిగింది” అన్నారు.
ఒక రోజు సాయంత్రం మాతృదేవి, రాధూ పక్కన కూర్చొని ఆమెకు కాపడం పెడుతున్నారు. ఆమెకు పక్కటెముకల కింద కొద్దిగా నొప్పి!
ఒక భక్తురాలు వచ్చి మాతృదేవిని ప్రణమిల్లింది.
మాతృదేవి: రా అమ్మాయీ! ఎలా ఉన్నావు?
భక్తురాలు: బాగున్నాను. రాధూకు ఏమయింది?
మాతృదేవి: అదే నొప్పి! పాపం బాగా అలసిపోయింది! ఈ పాపిష్టి నొప్పి ఎక్కడి నుంచి ఊడిపడిందో! ఎందరి వద్దో చికిత్స చేయించుకుంది! ఎన్నో దైవ ప్రార్థనలు కూడా చేసుకున్నాను, అయినా ప్రయోజనం లేదు!
భక్తురాలు: అంతా సరిపోతుంది! భయమెందుకు?
మాతృదేవి: అలానే మీరందరూ ఆశీర్వదించండమ్మా!
కొంతసేపటి తర్వాత ఆ భక్తురాలు ప్రసాదం తీసుకొని వెళ్లిపోయింది.
నేను: ఏం ఆశ్చర్యమమ్మా! ఆమెలో ఎంతమార్పు! అర్థం చేసుకోవడమే కష్టం!
మాతృదేవి: ఎలా అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది? పాపం ప్రవేశించిన వ్యక్తికి గతి ఉందా? నా దగ్గరకు రావడం కూడా నిషేధించాను. అందువల్లనే రాత్రిపూట ఎవరికీ తెలియకుండా వస్తున్నది!
నేను: మునుపు అమె మీతో ఉండడం నేను చూసి ఉన్నాను.
మాతృదేవి: అవును, పగటి వేళలలో ఉండేది, రాత్రిళ్లు ఇంటికి వెళ్లిపోయేది, విధి ఆమెతో కాస్త ఆడుకుంది, ఆమె ఇలా తయారయింది. నా వద్దకు రావడమే తగ్గిపోయింది. ఆమెకు ఈ జన్మలో కర్మఫలమేమీలేదు. అంతా పూర్వజన్మ కర్మఫలమే.
ఒక రోజు సాయంత్రం మాతృదేవి గదిలో కూర్చొని ఉన్నారు. గురుదేవుల శిష్యుడైన పూర్ణబాబు వ్యాధిగ్రస్థుడైవున్నాడు. బ్రతుకుతాడనే ఆశలేదు. ఆతడి తల్లి వచ్చింది. ఆమెను చూసిన వెంటనే మాతృదేవి, “ఇదుగో వచ్చేసింది. ఇలాగే రోజూ వచ్చి, ‘అమ్మా! ఆశీర్వదించండి. పూర్ణుని స్వస్థునిగా చేయండి’ అంటూ పట్టుబడు తుంది. ఆతను బ్రతకడని నాకు తెలుసు. అయినా వారికోసం, ‘బాగవుతుంది’ అని చెప్పాల్సి వస్తుంది” అన్నారు.
పూర్ణుని తల్లి వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి “అమ్మా! మీ బిడ్డను బాగుచేయండి” అంటూ విలపించసాగింది.
మాతృదేవి: నేనేమి చేయగలనమ్మా! గురుదేవులను ప్రార్థించండి, ఆయనే నయంచేస్తారు.
పూర్ణుని తల్లి: మీరు తలచుకున్నా కూడా సాధ్యమేనమ్మా!
మాతృదేవి: నేను గురుదేవులను ప్రార్థిస్తాను, అంత మాత్రమే.
తరువాత మాతృదేవి మాతో, “ఆతడికి పెళ్లి చేస్తే ఎక్కువ రోజులు జీవించడని గురుదేవులు చెప్పారు. ఆ మాటలు ఈమె పట్టించుకోలేదు. ఎక్కడ సన్న్యాసం పుచ్చు కొంటాడోనని భయపడి సత్వరమే పెళ్లి చేసేసింది” అన్నారు.
కొన్ని రోజుల తరువాత ఒక సాయంత్రం ఆరాత్రికం ముగిశాక మాతృదేవి, యోగీన్ మా ఇంకా మరికొందరు పడుకునివున్నారు. మాతృదేవి కాస్త కునుకు తీశారు. హఠాత్తుగా లేచి, “యోగిన్, పూర్ణ చనిపోయాడు కదా?” అని అడిగారు. ఈ ప్రశ్న యోగీన్ మాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఈ విషయం ఎవరూ మాతృదేవికి చెప్పలేదు. “మీకీ విషయం ఎవరు చెప్పారమ్మా?” అంటూ అడిగినప్పుడు మాతృదేవి, “కాస్త కునుకుతీశాను కదా! అప్పుడెవరో ‘పూర్ణ చనిపోయాడు’ అని చెప్పడం విన్నాను” అన్నారు. అందుకు యోగీన్ మా “నిజమే. సాయంత్రమే ఈ దుర్ఘటన జరిగింది, మీతో చెప్పలేదు” అంది. ఆ రాత్రి మాతృ దేవి పదేపదే పూర్ణుణ్ణి గురించి మాట్లాడారు. ఆతడి మరణం గురించి ఎంతో బాధపడ్డారు.
బేలూరు మఠంలో ప్రేమానందస్వామి దుర్గాపూజ నిర్వహించారు. మాతృదేవిని తోడ్కొని వెళ్లారు. మఠానికి ఉత్తరంలో ఉన్న ఉద్యానగృహంలో మాతృదేవి బసచేశారు. ఒక రోజు రాత్రి ఒక భక్తురాలు ఎవరికీ తెలియకుండా. అందరినీ దాటుకొని మాతృదేవి సమక్షంలో హఠాత్తుగా నిలబడింది. తమను చూడడానికి అంత ఉత్సాహంతో వచ్చిన ఆమెను చూసి మాతృదేవి, “ఇలాంటి వ్యాకులత లేకుండా భగవంతుని పొందగలమా ఏమిటి?” అని వ్యాఖ్యానించారు.
1918 లో గోలాప్మా తీవ్రంగా వ్యాధిగ్రస్థురాలయింది. ఆమె కోసం మాతృదేవి గురుదేవులను ప్రార్థించారు:
“ప్రభూ! గోలాప్ను బాగుచేయండి. గోలాప్, యోగీన్ లేకపోతే నేనిక్కడ ఉండలేను, వాళ్లు వెళ్లిపోతే నేను ఎలా జీవించను?”
ఆ తరువాత మాతృదేవి ఇలా అన్నారు:
“యోగీన్, గోలాప్ నా జీవితంలోని స్థితిగతుల నన్నిటిని ఎరిగినవారు. ఆహా, గోలాప్ ఎలాంటి లోపమూలేని వ్యక్తి. అహంకారమనేదే ఆమెకు లేదు. యోగీన్ కూడా అలాగే. కళ్లలో దోమలు వచ్చి కూర్చున్నా ఎరుక కూడా లేకుండా ధ్యానంలో లీనమయ్యేదామె. ఆహా! వారిని గూర్చి మాట్లాడేవారికి కూడా శ్రేయస్సు కలుగుతుంది.”
ఒకసారి మాతృదేవి నాకు ఒక పట్టువస్త్ర మిచ్చారు. దానిని చూసి ఒకరు, “ఆమెకు మాత్రం పట్టువస్త్రం ఎందుకు? ఇంకా చాలామంది ఉన్నారుకదా!” అంది. అందుకు మాతృదేవి, “ఈమెకు నేను ఇవ్వకపోతే మరెవరిస్తారు? ఆమెకు మరెవరున్నారు చెప్పండి చూద్దాం?” అన్నారు.
రాధూ జబ్బు కారణంగా మాతృదేవి ఆమెతో నివేదిత పాఠశాలలోని ఒక బాడుగ గదిలో నివసిస్తున్నారు. నేనక్కడ వారికి సేవ చేస్తున్నాను. ఒక రోజు మాతృదేవి నాతో గురుదేవులకు నైవేద్యం అర్పించమని చెప్పారు. కానీ నాకు నైవేద్యం మంత్రాలు తెలియవు. అందువలన మాతృదేవితో, “అమ్మా! ఎలా నైవేద్యం పెట్టాలో నాకు తెలియదు” అన్నాను. అందుకు మాతృదేవి ఇలా అన్నారు:
“ఇదిగో చూడు అమ్మాయీ! ముందు గురుదేవులను నీకు చెందినవారిగా భావించు. ఆ భావంతో వారితో, ‘రండి! కూర్చోండి! స్వీకరించండి! భోజనం చేయండి!’ అని చెప్పు. వారు వచ్చినట్లు, కూర్చొన్నట్లు, స్వీకరించినట్లు, ఆహారం తీసుకున్నట్లు భావించు, నీకు సొంతమైన ఒకరితో మంత్రమూ, తంత్రమూ కావాలా ఏమిటి? క్రియలూ ఉపచారాలూ ఇవన్నీ బంధువులకు చూపే విందు ఉపచారాలూ, మర్యాదలూ లాంటివి. నీకే సొంతమైన ఒకరికి అలాంటి ఉపచారాలూ మర్యాదలూ ఎందుకు? వారికి ఎలాంటి మానసిక స్థితిలో నువ్వు సమర్పిస్తావో ఆ మానసిక స్థితికి తగ్గట్లు ఆయన స్వీకరిస్తారు.”
కోల్పారా, 1919
దసరా పండుగ దినాలలో ఒక రోజు కొందరు భక్తులు వచ్చి మాతృదేవి పాదపద్మాలకు తామర పువ్వులు సమర్పించి ప్రణమిల్లారు. వారు వెళ్లిపోయిన తరువాత మాతృదేవి నాతో, “ఈ రోజు ఏమిటి విశేషం? పలువురు వచ్చి పువ్వులతో పూజిస్తున్నారే?” అని అడిగారు. “ఈ రోజు దసరా! అందువల్లనే!” అన్నాను నేను. మాతృదేవి మృదువుగా నవ్వుతూ, “భగవంతుడా! నేనేమి మానసాదేవినా?”* అన్నారు. తర్వాత చేతులు జోడించి గురుదేవులను చూస్తూ, “ఆయనే మానసాదేవి, ఆయనే గంగా, సర్వస్వమూ ఆయనే” అన్నారు.