1914 సెప్టెంబరు 19 వ తేదీ శనివారం. అమావాస్య. ఆ రోజే మొట్టమొదటి సారి మాతృదేవిని దర్శించే భాగ్యం కలిగింది. క్రితం రోజు మధ్యాహ్నం నేనూ, నా తమ్ముడు దామోదరమూ ఉంటున్న గదికి స్వామి నిర్మలానంద వచ్చి, “మాతృదేవిని దర్శించుకోవడానికి రేపు మంచిరోజు. ఉదయం స్నానంచేసి ఏమీ తినకుండా వెళదాం. కొన్ని పువ్వులు తీసుకోండి. బ్రహ్మచారి గోవిందజీ మీతో వస్తాడు. మీ మధ్యాహ్న భోజనం అక్కడే చేసి, దక్షిణేశ్వరం వెళ్లి చీకటి పడేలోపల తిరిగి వచ్చేసేయండి” అన్నారు.
మేము కూడా అలాగే తయారుగావున్నాం. గోవిందజీ రాగానే బయలుదేరాం. ఉద్బోధన్ సమీపించిన వెంటనే గోవిందజీ దాని ద్వారానికి ఎదురుగా రోడ్డు మీదనే సాష్టాంగంగా నమస్కరించారు. ఆయన భక్తికి ఆశ్చర్యపడి మేము కూడా అట్లే చేశాం.
లోపలికి వెళ్లి మొదట కుడివైపు గదిలో కూర్చొనివున్న స్వామి శారదా నందగారిని దర్శించి, ప్రణమిల్లాం. ఆయనతో కొంతసేపు మాట్లాడిన తర్వాత ఉద్బోధన్ కార్యాలయ మేనేజర్ స్వామిని చూశాం. ఆయన మాతో “కూర్చోండి. మాతృదేవి పూజ ముగించిన తర్వాత వారిని దర్శించుకోవచ్చు” అన్నారు. మేము వేచివున్నాం.
తొమ్మిది గంటలకు పూజ ముగిసింది. మమ్మల్ని పిలిచారు. మొట్టమొదట నన్ను పిలిచారు. నేను లోపలికి వెళ్లిన వెంటనే గురుదేవుల ఛాయాచిత్రం నా కళ్లబడింది. ఆయనకు ప్రణమిల్లి తర్వాత మాతృదేవికి ప్రణమిల్లాను. తమ ప్రక్కన నన్ను కూర్చోమన్నారు మాతృదేవి.
మొదట గురుదేవులను పూజించి తర్వాత నాకు తీర్థం ఇచ్చారు మాతృదేవి. దానిని సేవించ వచ్చునని నాకు తెలియదు. మా నాన్న శ్రాద్ధ సమయంలో ఇచ్చిన తీర్థాన్ని తలపై చల్లుకుని కళ్లకు ఒత్తుకున్నాను. అట్లే ఇప్పుడు కూడా చేశాను. ఆ తర్వాత మాతృదేవి తన ప్రక్కన ఉన్న పాత్ర నుండి కొద్దిగా తీర్థం తీసుకుని సేవించమన్నారు. ఒకటి రెండు దూర్వాగ్రాసాలు కలిపి కట్టబడి అదే ఉద్ధరిణిలా ఉపయోగింపబడింది. ఎన్నిసార్లు దానితో తీర్థం తీసినా ఒకటి రెండు చుక్కల తీర్థమే వచ్చింది. దానినే సేవించాను.
తర్వాత మాతృదేవి గురుదేవుల పవిత్రనామాన్ని నాకు ప్రసాదించారు. వేళ్లతో జపం ఎలా లెక్కించాలో నాకు మూడుసార్లు చేసి చూపారు. తర్వాత కాళీ మంత్రాన్ని కూడా ఉపదేశించి, జపించమన్నారు.*
దీక్ష కాగానే దక్షిణ ఇవ్వమని అడిగారు మాతృదేవి. పంచలో ముడివేసి ఉంచుకున్న డబ్బు బయటికితీశాను. డబ్బును తాకలేని పరిత్యాగమూర్తులైన శ్రీ రామకృష్ణ పరమహంస ధర్మపత్ని కదా వీరు! వీరి చేతుల్లో డబ్బు ఇవ్వడం ఉచితంగా ఉంటుందా అని ఆలోచించి, ఆ డబ్బును మాతృదేవి కుడి కాలుకు సమీపంలో ఉంచాను. నా ఆలోచన గ్రహించిన మాతృదేవి, మృదువుగా నవ్వుతూ ఆ డబ్బును తీసి మరొక చోట ఉంచారు. దాంతో నా దక్షిణను స్వీకరించినట్లు సూచించారు.
మాతృదేవి సమక్షంలో సాష్టాంగంగా నమస్కరించాను. ‘అమ్మా! దయచేసి మీ పాదపద్మాలను చాపితే వాటిని నా శిరస్సుపై ఉంచుకుని ధన్యుడినౌతాను’ అని తలచాను. నేను మనస్సులో ప్రార్థించింది అలాగే నెరవేర్చారు మాతృదేవి. వారు తమ పాదపద్మాలను జాపినప్పుడు వాటిని నా శిరస్సున ధరించి ధన్యుడినయ్యాను.
మాతృదేవికి సాష్టాంగపడి, “అమ్మా! నాకు భక్తీ, పరిశుద్ధతా అనుగ్రహించండి” అని ప్రార్థించాను. మాతృదేవిని ఏం అడగాలి అంటూ పరిపరివిధాల ఆలోచించి, తర్వాత వీటి కోసమే ప్రార్థించాలని క్రితంరోజే గట్టిగా తీర్మానించుకున్నాను. నేను ప్రార్థించిన వెంటనే మాతృదేవి ఒక పువ్వు తీసి నా తల మీద ఉంచి, “నువ్వు కోరింది శ్రీ గురుమహరాజ్ ప్రసాదిస్తారు” అన్నారు. మాతృదేవి అనురాగపూరిత పలుకులు నా మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్నిచ్చాయి. ఆ పువ్వును నా వద్దనే ఉంచుకొని ప్రతిరోజు కాస్తకాస్తగా రెండు మూడు రోజులలో తినేశాను.
తర్వాత కొంతసేపు జపం చెయ్యమని చెప్పారు మాతృదేవి. నేను మైమరచి మంత్రాన్ని బిగ్గరగా ఉచ్చరిస్తూ జపం మొదలుపెట్టాను. మాతృదేవి తమ వ్రేళ్లను పెదాల మీద ఉంచి సైగచేస్తూ, “మెల్లగా, మెల్లగా జపం చేయి” అన్నారు. ఆమె చెప్పినట్లు చేశాను. తర్వాత మాతృదేవికి ప్రణమిల్లాను. “ఇక నువ్వు బయటికి వెళ్లి నీ తమ్ముణ్ణి పంపించు” అన్నారు. నేను వెళ్లి నా తమ్ముణ్ణి పంపించాను.
నా తమ్ముడు కూడా తిరిగి వచ్చిన తర్వాత మేనేజరు స్వామి గదిలో కూర్చొని కొంతసేపు జపం చేశాం. తదనంతరం ప్రసాదం తీసుకుని తిరుగుముఖం పట్టాం.
ఒక రోజు సాయంత్రం నేనూ, నా తమ్ముడూ, ఇంకా కొందరు భక్తులూ కలిసి మాతృదేవి దర్శనానికి వెళ్లాం. ఆ రోజు మాతృదేవి మాతో మాట్లాడలేదు. నాకు కాస్త బాధ వేసింది. అది అర్థం చేసుకున్న మాతృదేవి నా వైపు కృపాదృక్కులు పరపారు. ప్రేమగా నవ్వారు.
మేము కాశీకి వెళ్లాలనుకొన్నాం. బయలుదేరడానికి ముందురోజు మాతృదేవికి ప్రణమిల్లడానికి వెళ్లాం. ఆ రోజు మాతృదేవి దాదాపు పదిహేను నిమిషాలు నాతో మాట్లాడారు. “నువ్వు ఇంతకు మునుపు కాశీకి వెళ్లావా? నీతో పాటు ఎవరు వెళుతున్నారు? ఎన్ని రోజులు ఉంటావు? తిరిగి ఇక్కడికి వస్తావా, లేకపోతే నీ ప్రాంతాలకు వెళ్లిపోతావా? యాత్రకు అవసరమైన డబ్బు ఉందా? లేకపోతే నేనిస్తాను. సంకోచించకుండా అడుగు. నీకు వీలున్నప్పుడు తిరిగి ఇవ్వవచ్చు. కాశీలో రాఖాల్ ఉన్నాడు. నా కోసం ఒక పని చేస్తావా? నా ఆశీస్సులను ఆతడికి అందజేయి. నువ్వు ఈ పని చేస్తే నేనెంతో సంతోషిస్తాను. బేలూరు మఠానికి తిరిగి వెళ్లిన తర్వాత ఆలస్యం చేయకుండా ఇక్కడికి రావాలి” అంటూ అనేక విషయాలు చెప్పారు. అంత ఆప్యాయంగా మాతృదేవి మాతో అన్ని విషయాలు మాట్లాడడం మాకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది. మాతృదేవి కురిపించిన ఆప్యాయతలో నేను మా అమ్మను కోల్పోయాననే విషయాన్నే మరచిపోయాను. మాతృదేవి బుగ్గలు కూడా మా అమ్మ బుగ్గలనే జ్ఞాపకం తెచ్చాయి. ప్రతి తల్లీ మాతృదేవిలా ఆప్యాయ తానురాగాలు చూపితే ఈ లోకమే ఒక ఆనంద బృందావనంగా మారిపోతుంది కదా!
కాశీకి వెళ్లి బ్రహ్మానంద స్వామిగారికి మాతృదేవి ఆశీస్సులను తెలియ జేసినప్పుడు ఆయన వాటిని స్వీకరించినట్లు వినమ్రతతో తల వంచారు. తర్వాత, “నువ్వు మాతృదేవిని కలిసినప్పుడు వారి ఆశీస్సులను పొంది నేను ధన్యుడనైనానని తెలియజేయి. నా కోసం మాతృదేవి పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామం కూడా చేయాలి” అన్నారు. మాతృదేవి కృపాకటాక్షం వలన బ్రహ్మానంద స్వామి ఆనతిని నేను నెరవేర్చ గలిగాను.
మాతృదేవి నుండి ఒక రుద్రాక్షమాల తీసుకోవాలని వెళ్లాను. అప్పుడు మాతృదేవి ఒంటరిగా ఉన్నారు. నేను అడిగిన వెంటనే ఒక మాల ఇచ్చారు. దానిని తీసుకొని నేను మలయాళంలో “అమ్మా! ఈ మాలను మీరు మెడలో ధరించి ఇవ్వాలి” అన్నాను. మాతృదేవి వెంటనే తమ తల వంచారు. నేను మాతృదేవి మెడలో రుద్రాక్షమాలను వేశాను. తర్వాత వారు దానిని తీయడానికి ప్రయత్నించి నప్పుడు నేను మళ్లీ మలయాళంలో “మరికొంతసేపు అది మీ మెడలోనే ఉంచండమ్మా” అన్నాను. ఈ ప్రార్థనను కూడా మన్నించారు మాతృదేవి. అప్పుడు నా తమ్ముడు జపం చేయడం గురించి అడిగాడు. అందుకు వివరంగా బదులు చెప్పేదాకా మాతృదేవి మెడలో ఆ రుద్రాక్షమాల అలాగే ఉంది.
ఆ తర్వాత రుద్రాక్షమాలను తీసి మాతృదేవి నా కిచ్చారు. అప్పుడు నేను, “అమ్మా! తమ పావనహస్తాలతో ఈ రుద్రాక్షమాలను ఉంచుకుని జపంచేయాలి” అని ప్రార్థించాను. అట్లే జపంచేసి మాతృదేవి ఆ రుద్రాక్షమాలను నా కిచ్చారు. ఆ మాలను నేను మెడలో వేసుకున్నాను. వెంటనే మాతృదేవి. “ఆ రుద్రాక్షమాలను తీసి దానితో కొంతసేపు జపం చేయి” అన్నారు. నేను గురుదేవుల దివ్యమంత్రాన్ని జపించసాగాను. పెదవులను కూడా కదల్చకుండా మనస్సులో జపించాను. కానీ ఇరవైసార్లు జపం చేయడానికి ముందే మాతృదేవి, “లేదు, లేదు, ఈ మంత్రం కాదు. మరొక మంత్రం జపంచేయి” అన్నారు. వారు ఈ మాటలను వంగభాషలో అన్నారు. వారు చెప్పింది నాకు అర్థమయింది అని తెలియజేయడానికి తలూపాను. కానీ శ్రీరామకృష్ణ మంత్రాన్నే జపించసాగాను. ఆ తర్వాత మాతృదేవి వారించలేదు. మాతృదేవి నా జపాన్ని ఆమోదించారనే అనుకున్నాను. శ్రీరామకృష్ణ మంత్రాన్ని ఒక మాల జపంచేసిన తర్వాత మాతృదేవి చెప్పించినట్లు బీజమంత్రంతో పాటు జపించాను. తర్వాత మాతృదేవికి ప్రణమిల్లాను. వారు నన్ను ఆశీర్వదిస్తున్నట్లు నా మనస్సు చెప్పింది. మనం ఏమీ చెప్పకుండానే అన్నిటినీ గ్రహించే సర్వశక్తి మంతురాలు మాతృదేవి అని నేను తెలుసుకొన్నాను.
మంత్రదీక్ష రోజు మాతృదేవి నా కిచ్చిన తీర్థం తాగకపోవడం పెద్దలోటుగా నా మనస్సును బాధ పెడుతోంది. నేను ఎంత దురదృష్టవంతుణ్ణి అనే ఆలోచన పదేపదే నన్ను కలతపెట్టసాగింది. మాతృదేవి పాదతీర్థమే యాచిస్తే ఏం అనే ఆలోచన మాతృదేవి కృప వలన నాకు కలిగింది. ఈ ప్రార్థనను మాత్రం మాతృదేవి స్వీకరిస్తే నా మనస్సులోని బాధ ఉపశమిస్తుంది. పలువురు భక్తులకు ఆ తీర్థాన్ని ప్రసాదంగా పంచిపెట్టి వారిని కూడా తరింప చేయవచ్చు కదా అనిపించింది.
గంగానది నుండి నీళ్లు తెచ్చాను. ఆ నీళ్లను చక్కగా వడకట్టి పరిశుద్ధంగా ఉండేటట్లు జాగ్రత్త తీసుకున్నాను. ఆ నీటిని ఒక పాత్రలో నింపుకొని తిన్నగా ఉద్బోధన్ వెళ్లాను. మేనేజరు స్వామిని కలిసి “పెద్ద కంచం ఒకటి కావాలి. ఎందుకు కావాలో తర్వాత చెప్తాను” అన్నాను. ఆయన కూడా ఆప్యాయతతో అలాంటి ఒక కంచం ఇచ్చారు. దానిని తీసుకుని మాతృదేవి వద్దకు వెళ్లాను. నా తమ్ముడూ, మేనేజరు స్వామీ కూడా నాతో పాటు వచ్చారు.
మాతృదేవి సమక్షంలోకి వెళ్లి, “అమ్మా! నాదొక కోరిక” అంటూ దానిని మాతృదేవికి వినిపించమని మేనేజరు స్వామిని అర్థించాను. ఆయన మాతృదేవితో వంగభాషలో తర్జుమాచేసి చెప్పడానికి ముందే తమ పాదపద్మాలను ముందుకు చాచారు మాతృదేవి. కంచం ఉంచిన వెంటనే దానిపై తమ పాదాలనుంచారు. గంగాజలం తీసుకుని పాదాలకు అభిషేకం చేశాను. ‘అమ్మా! నేను ఇంతకన్నా మరేమీ చేయలేను’ అనే ఆలోచన నా మనస్సులో చెలరేగుతూనే ఉంది.
మాతృదేవి ఆప్యాయంగా నా వైపు తిరిగి చూశారు. కొద్దిగా తీర్థం తమ చేతిలో తీసుకున్నారు. కొంతసేపు జపం చేశారు. ఆ తర్వాత తీర్థాన్ని తమ పాదాల మీదే చల్లుకొన్నారు. ఇలా మూడుసార్లు చేసిన తర్వాత తీర్థం తీసుకోమని నాతో చెప్పారు. ఎనలేని భాగ్యవంతుణ్ణి అయినట్లు గ్రహించాను.
తర్వాత నేను ఆ కంచం పక్కకు జరిపి, ఒక గులాబీరంగు గుడ్డతో మాతృదేవి పాదాలను తుడిచాను. తర్వాత వారికి ప్రణమిల్లాను. ఆమె ఆశీర్వదిస్తున్నట్లు గ్రహించాను.
నేను మాతృదేవి పాదపద్మాలను పూజిస్తున్నప్పుడు మాతృదేవి, మేనేజరు స్వామితో హీనస్వరంలో, “ఆహా! ఇతడు ఎంత భక్తిభావంతో ప్రతిదీ చేస్తున్నాడో చూడు” అన్నట్లు తర్వాత నా తమ్ముడు చెప్పాడు. అలా చేయగలిగానంటే అది కూడా మాతృదేవి కృపాకటాక్షం వల్లనే కదా! కొద్దిగా తీర్థం నా తమ్ముడికి ఇచ్చాను, నేనూ సేవించాను. సాయంత్రం మాతృదేవికి ప్రణమిల్లి మఠానికి తిరిగి వెళ్లాం. ఆ రోజు నుండి ఈ తీర్థ ప్రసాదాన్ని వేలాది భక్తులకు పంచిపెట్టాను. ఇదంతా మాతృదేవి కృపాకటాక్షమే కదా!
కలకత్తా నుండి ఇంటికి తిరిగి వెళ్లడానికి ఒక రోజును నిర్ణయించుకుని మాతృదేవి వద్ద సెలవు తీసుకోవడానికి వచ్చాను. “నన్ను చూడడానికి మళ్లీ వస్తావు కదా!” అని అడిగారు మాతృదేవి. ఈ ప్రశ్నకు నేనేమి బదులు చెప్పాలి? నేను పేదవాడిని. ఇప్పుడు కూడా ఎంతో శ్రమపడే రాగలిగాను. ఇలాంటి సందర్భం మరొకటి మళ్లీ నాకు కలుగుతుందా? ఈ ఆలోచనలు నా మనస్సులో మెదిలాయి. కొంతసేపటి తర్వాత చేతులు జోడించి మాతృదేవితో, “నేను వస్తాను” అన్నాను. నా ఆలోచనలను పసిగట్టిన మాతృదేవి నా బదులుతో తృప్తిపడ్డారని అనిపించింది.
మర్నాడు మామయ్య ఒకరి ఇంటికి ఆహ్వానితులమై వెళ్లాం. ఆయన గురుదేవులను దర్శించే భాగ్యం పొందాడు. బయలుదేరడానికి ఇంకా మూడు గంటలున్నందువలన మళ్లీ మాతృదేవిని దర్శించుకున్నాం. ఆమె ఎంతో సంతోషించారు. “మళ్లీ వస్తావా?” అని అప్పుడు వారు నన్ను అడగలేదు.
కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. రాసబిహారి మహరాజ్‌కు కొంత డబ్బు పంపించి, కలకండ కొని, మాతృదేవి పవిత్ర హస్తాలతో దానిని గురుదేవులకు నివేదనం చేసి కొద్దిగా ప్రసాదాన్ని నాకు పంపించమని చెప్పాలనే ఆలోచన నాకు కలిగింది. కానీ జీతం తీసుకునేటప్పుడు ఈ విషయం నాకు జ్ఞాపంకం లేదు. ఇలా ఆరు నెలలు గడిచిపోయాయి. హఠాత్తుగా ఒక మంచి రోజు మాతృదేవి పూజ ముగించుకుని నేను బయటికి వచ్చాను. అప్పుడు రెండు ఉత్తరాలు వచ్చాయి. ఒక ఉత్తరం శ్రీ విశుద్ధానంద స్వామి వారిదని ఆ చేతివ్రాతను బట్టి కనుగొన్నాను. రెండవ ఉత్తరం విప్పిచూస్తే అది ఒక చిన్న పొట్లాం, దానిమీద ‘మాతృదేవి ప్రసాదం’ అని వ్రాసివుంది. విప్పిచూస్తే కలకండ ప్రసాదం. నేను అనుకున్నాను, మాతృదేవి పంపించేశారు. నా ఆశ్చర్యానందాలు ఎల్లలు దాటాయి. భక్తుల నిజమైన కోరికలను మాతృదేవి గ్రహిస్తారు, వాటిని నెరవేరుస్తారు అనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ! మాతృదేవి అనుగ్రహానికి ఎల్లలు లేవు.
దక్షిణేశ్వర కాళికాలయం
చెన్నై శ్రీరామకృష్ణ మఠంలోని శ్రీరామకృష్ణుల దేవాలయం,
అక్కడ ఆరాధింపబడుతూన్న శ్రీ శారదాదేవి